గ్రేటర్ కమ్యూనిటీలో దొంగల బీభత్సం
posted on Oct 13, 2025 10:06AM

గ్రేటర్ కమ్యూనిటీ లో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రేటర్ కమ్యూనిటీ అంటేనే పూర్తి భద్రత, మెరుగైన సౌకర్యాలు ఉంటాయి. ఎటువంటి భయానికీ తావులేకుండా ప్రశాంతంగా ఉండొచ్చనే ఎవరైనా గ్రేటర్ కమ్యూనిటీలో ఇళ్లు తీసుకోవాలని భావిస్తారు. ఖర్చు ఎక్కువైనా భద్రతకు సంబంధించిన భరోసా ఉంటుందన్న భావనతో గ్రేటర్ కమ్యూనిటీలకే మొగ్గు చూపుతారు.
అయితే అటువంటి గ్రేటర్ కమ్యూనిటీలోనే ఆదివారం (అక్టోబర్ 12) అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఇళ్లల్లోకి చొరబడి భారీగా దోచుకున్నారు. ఈ ఘటన హిమాయత్ నగర్ పీఎస్ పరిధిలోని సదాశివ గ్రేటర్ కమ్యూనిటీలో జరిగింది. ఈ కమ్యూనిటీలోని రెండు విల్లాలలో దొంగలు భారీ ఎత్తున నగదు, బంగారం దోచుకున్నారు. గ్రేటర్ కమ్యూనిటిలో తాళం వెసి ఉన్న రెండు విల్లాలను లక్ష్యంగా చేసుకుని దొంగలు ఈ చోరీకి పాల్పడ్డారు. చొరీకి ముందు ఆ ప్రాంతంలోని సీసీ కెమేరాలను ఆపి వేసి, సెంట్రల్ లాక్ ఉన్న డోర్లను పగులగొట్టి లోపలికి ప్రవేశించారు.
ముఖానికి మాస్క్ వేసుకున్న దొంగలు ఆ రెండు ఇళ్లల్లోనూ కలిపి 60 వేల రూపాయలకు పైగా నగదు, 35 గ్రాముల బంగారం, ఐదు కేసీల వెండి, విలువైన చీరలు దోచుకున్నారు. ఫుల్ సెక్యూరిటీ ఉన్నా కూడా గ్రేటర్ కమ్యూనిటీలో చోరీ జరగడంతో అక్కడి వారు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.