సాగర్ కుడికాలువకు గండి
posted on Nov 21, 2025 9:12AM

నాగార్జునసాగర్ కుడికాలువ కట్టకు గురువారం (నవంబర్ 20)అర్ధరాత్రి గండి పడింది. ఎస్కేప్ ఛానల్ వద్ద కట్టకు గండి పడి నాగులేటి వాగుకు ఒక్కసారిగా ప్రవాహం పెరిగింది. దీంతో వాగు పరీవాహక ప్రాంతాల ప్రజలలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. పల్నాటి వీరుల తిరునాళ్ల నేపథ్యంలో నాగులేటి వాగుకు ఆనుకుని ఉన్న ప్రాంతంలో వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న దుకాణాలలోకి నీరు చేరింది.
మరో వైపు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోన్న ఆందోళనలో జనం ఉన్నారు. కాగా గండి విషయం తెలుసుకున్న ఎన్నెస్పీ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని గండి పూడ్చే పనులు చేపట్టారు.ఇలా ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే కట్టను ధ్వసం చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇలా ఉండగా.. సాగర్ కుడికాలువకు గండిపై స్పందించిన మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను అప్రమత్తం చేశారు. అలాగే ఆందోళన వద్దంటూ ప్రజలకు సూచించారు. యుద్ధ ప్రాతిపదికన గండి పూడ్చివేత పనులు చేపట్టామనీ, మధ్యాహ్నానికల్లా గండిని పూడ్చేస్తామనీ హామీ ఇచ్చారు. అలాగే గ్రామాలలోకి నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదే సమయంలో.. గండి పడటానికి గల కారణాలను నివేదిక రూపంలో అందించాలని మంత్రి నిమ్మల ఆదేశించారు.