ఈ నెల 14న తెలంగాణ బంద్...ఎందుకంటే?
posted on Oct 11, 2025 4:15PM

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేకు నిరసనగా ఈనెల 14న తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు బీసీ సంఘాల నాయకుడు ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. అన్ని బీసీ సంఘాల మద్దతుతో బంద్ నిర్వహిస్తామని ఈ బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కృష్ణయ్య కోరారు.బంద్‌కు బీజేపీ మద్దతు ఇవ్వాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరినట్లు ఆయన పేర్కొన్నారు.
నామినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే సమయంలో హైకోర్టు స్టే విధించడం సరి అయిన పద్దతి కాదని తెలిపింది. బహుజనుల నోటికాడి కూడును లాక్కుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు శాసన సభలో బీజేపీతో సహా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని గుర్తు చేశారు. ఇది బీసీల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని ఆయన అన్నారు. వ్యవస్థల మీద, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికే ఈ బంద్ అని స్పష్టం చేశారు. బీసీలను చిన్నచూపు చూస్తున్నారని, అందుకే తమ సత్తా ఏమిటో చూపిస్తామని ఆయన అన్నారు.