మోనిత భ‌ర్త‌గా కార్తీక్ సంత‌కం చేసేశాడు.. దీప‌కు మ‌రోసారి అన్యాయం చేశాడా?

  బిడ్డ మెడకు పేగు చుట్టుకుని ఆసుపత్రిలో పురిటినొప్పులు పడుతున్న మోనిత, త‌ను ఆప‌రేష‌న్ చేయించుకోవాలంటే కార్తీక్ వచ్చి సంతకం చేయాల‌ని మొండిపట్టు పట్టిన సంగతి తెలిసిందే. ఆసుపత్రికి వెళ్లిన కార్తీక్ అలియాస్ డాక్టర్ బాబుతో తనది కృతిమ గర్భం కాదని, సహజంగా తల్లి అయ్యానని చెప్పిన సంగతి కూడా తెలిసిందే. ఇవేవీ కార్తీక్ నమ్మడు. కానీ, అతడి తల్లి సౌందర్య నమ్ముతుంది. మోనిత మాటల్లో నిజాయతీ కనిపిస్తోంద‌ని కొడుకు చేత సంతకం పెట్టిస్తుంది. అయితే, ఈ విషయం దీపకు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకుండా చూడాలని తల్లీకొడుకులు అనుకుంటారు. కానీ, తెలుస్తుంది. ఎలా? అనేది నేటి (గురువారం) ఎపిసోడ్. ఈ రోజు ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళితే... కార్తీక్ కారణంగా సహజంగా తల్లి అయ్యానని చెప్పిన మోనిత చివరకు స్పృహ కోల్పోతుంది. అయినా కార్తీక్ కరగడు. తల్లితో కలిసి బయటకు రావడానికి ప్రయత్నిస్తాడు. ‌మోనిత చనిపోతుందని భారతి బ్రతిమాలినా వినిపించుకోడు. 'నువ్వు ఒక డాక్టరే కార్తీక్! ఆ విషయం మర్చిపోకు. ఏం చేస్తావో నీ ఇష్టం... నేను వెళ్తున్నా' అని భారతి అక్కడి నుండి బయటకు వెళ్లబోతుంటే... 'పేపర్స్ తీసుకునిరా కార్తీక్ సంతకం చేస్తాడు' అని సౌందర్య చెబుతుంది. 'నావల్ల కాదు మమ్మీ' అని కార్తీక్ అన్నా ఆమె వినిపించుకోలేదు. తల్లి బలవంతం చేయడంతో కార్తీక్ సంతకం చేస్తాడు. ఆ సమయంలో మోనితను భారతి లేపుతుంది. కార్తీక్ సంతకం చేయడం చూసి మోనిత కళ్ళల్లో ఆనందం ఉప్పొంగింది. ఆపరేషన్ చేయాలని కార్తీక్, సౌందర్యను భారతి బయటకు పంపించేస్తుంది. 'మమ్మీ... నాకేం అర్థం కావడం లేదు' అని కార్తీక్ తల పట్టుకుంటాడు. 'మౌనిత ఇన్నాళ్లు అబద్ధాలు చెప్పి ఉండవచ్చు. కానీ, ఈరోజు తన మాటల్లో నిజాయితీ కనిపించింది' అని సౌందర్య నిస్సహాయంగా చెబుతుంది.‌ 'అంటే ఏంటి మమ్మీ' అని కార్తీక్ అడుగుతాడు. తాను తప్పు చేశానని తన తల్లి నమ్ముతుందా? అనే భావం అందులో వ్యక్తమయింది. 'ఏమోరా?! ఎలా స్పందించాలో ఊహించడానికి భయంగా ఉంది.‌ దీప... పిల్లలు... ఇరుగుపొరుగు... వీళ్ళ అందరితో రేపు' అని సౌందర్య చెప్పబోతుంటే... తల్లి మాటలకు కార్తీక్ అడ్డుతగులుతూ 'నాకేం అర్థం కావడం లేదు' అని గట్టిగా అరుస్తాడు.‌ ఈలోపు భారతి వచ్చి పండంటి మగబిడ్డ పుట్టాడని చెబుతోంది.  ఆసుపత్రి నుంచి ఇంటికి బయలుదేరిన కార్తీక్, సౌందర్య ఎట్టి పరిస్థితుల్లోనూ విషయం దీపకు తెలియకూడదని అనుకుంటారు. 'దీపకు తెలిస్తే ఎలా మమ్మీ? అసలే ఆత్మాభిమానం ఎక్కువ. నేను ఏం చేసినా... ఎన్ని చెప్పినా... నన్ను క్షమించదు. ప్రస్తుతానికి ఈ విషయం దీపకు తెలియడానికి వీల్లేదు. దీపకు విషయం చెప్పవద్దని భారతికి కూడా గట్టిగానే చెప్పాను' అని కార్తీక్ తల్లితో చెబుతాడు.  మరోవైపు ఇంటిలో ల్యాబ్ దగ్గర పల్లవి చెప్పిన మాటలను తలుచుకుంటూ దీప ఆలోచనల్లో పడుతుంది. అదే సమయానికి ప్రియమణి అక్కడికి చేరుకుంటుంది. 'దీపమ్మా... నీకు అదిరిపోయే న్యూస్ చెబుతా. అది విన్నాక లబోదిబోమని ఏడుస్తావో, మూర్ఛ‌పోతావో చూడాలి' అని మనసులో అనుకుంటూ... పైకి 'దేవుడా నువ్వు కార్తీక్ అయ్య రూపంలో ఉన్నావ్. మా మోనితమ్మకి సాయం చేసేలా చేసావ్' అని దీపకు వినిపించేలా అంటుంది. ఏమైందని ప్రియమణి దగ్గరకు వెళ్లి దీప ఆడగ్గా.... ఆస్పత్రిలో జరిగిన విషయం అంతా చెబుతుంది. తాను చెప్పినట్టు ఎవరికీ చెప్పొద్దని అంటూనే.. కార్తీక్ సంతకం చేసిన విషయం బయట పెడుతుంది. దాంతో దీప షాక్ లో అలా ఉండిపోతుంది. ఆ త‌ర్వాత దీప ఏం చేసింద‌న్న‌ది వెరీ ఇంట్రెస్టింగ్.

దీప్తితో పెళ్లికి షణ్ముఖ్ తల్లి గ్రీన్ సిగ్నల్!

  యూట్యూబ్ జోడీల్లో షణ్ముఖ్ జస్వంత్, దీప్తీ సునైనలకు అభిమానులున్నారు. పాటల్లో వీళ్ళిద్దరి రొమాన్స్, కెమిస్ట్రీ బాగుంటుంది. దాంతో పెయిర్ హిట్ అయ్యింది. వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని చాలామంది ఫీలింగ్. షణ్ముఖ్ 'బిగ్ బాస్'కు వెళ్ళిన తర్వాత అతడిపై ప్రేమను దీప్తీ సునైన పలు విధాలుగా బయట పెడుతోంది. షణ్ముఖ్ పుట్టినరోజున 'బిగ్ బాస్' హౌస్ బయట ఉన్న బిల్డింగ్ మీదకు వెళ్లి గట్టిగా 'ఐ లవ్యూ' అని అరిచింది. ప్రపోజల్ వీడియో 'బిగ్ బాస్' ఇంటిలో ఉన్న షణ్ణుకు పంపింది.  షణ్ముఖ్ జస్వంత్, దీప్తీ సునైన ప్రేమలో ఉన్నారని చెప్పడానికి బోలెడు సంఘటనలు కనపడతాయి. బహుశా... అవేవీ షణ్ముఖ్ తల్లి ఉమారాణికి కనిపించలేదేమో! దీప్తి, షణ్ణు ప్రేమలో ఉన్నట్టు తనకు తెలియదని చెప్పారు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు మాత్రమేనని వివరించారు. ఒకవేళ వాళ్ళిద్దరికి ఒకరంటే మరొకరికి ఇష్టమైతే పెళ్ళి చేయడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, దీప్తి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి చర్చించాలని చెప్పుకొచ్చారు. ప్రేమ, పెళ్లి విషయాల గురించి ఇంట్లో ఎప్పుడూ షణ్ణు డిస్కస్ చేయలేదని ఉమారాణి వెల్లడించారు.  షణ్ముఖ్, దీప్తి నిజంగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటే... షణ్ణు ఇంట్లో గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇక దీప్తి ఇంట్లోవాళ్ళు తమ అభిప్రాయం చెప్పడమే తరువాయి. వాళ్ళు కూడా ఓకే చెబుతారని ఇద్దరి అభిమానులు ఆశిస్తున్నారు. 

"సై అంటే సై.. నై అంటే నై".. బాలకృష్ణ మీసం మెలేశారు!

  ''నీకు చిత్తశుద్ధి ఉన్నప్పుడు... నీకు లక్ష్యశుద్ధి ఉన్నప్పుడు... నీకు సంకల్ప శుద్ధి ఉన్నప్పుడు... నిన్ను పంచభూతాలు కూడా ఆపలేవు" అని నటసింహం నందమూరి బాలకృష్ణ అంటున్నారు. 'ఆహా' ఓటీటీ వేదిక కోసం స‌అన్‌స్టాపబుల్' పేరుతో ఆయన ఒక టాక్ షో హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు దాని ప్రోమో రిలీజయింది. అందులో బాలకృష్ణ బైక్ రైడ్ చేస్తూ... హై ఎండ్ స్పోర్ట్స్ కార్ డ్రైవ్ చేస్తూ... గుర్రపు స్వారీ చేస్తూ స్టయిలిష్ గా కనిపించారు.  "మాటల్లో ఫిల్టర్ ఉండదు. సరదాలో స్టాప్ ఉండదు. సై అంటే సై... నై అంటే నై" అంటూ బాలకృష్ణ మీసం మెలేశారు. షో మీద అంచనాలు పెంచేశారు. 'వన్ ఐ స్టెప్ ఇన్...' అంటూ డైలాగ్ చెప్పారు. హిస్టరీ రిపీట్ అని ప్రత్యేకంగా ముగించాల్సిన అవసరం లేదనుకుంట! 'దెబ్బకు థింకింగ్ మారిపోవాలా... కలుద్దాం... ఆహాలో' అని ప్రోమో ముగించారు.  బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్' ఫస్ట్ ఎపిసోడ్ లో మంచు ఫ్యామిలీ సందడి చేయనుంది. మోహన్ బాబు, ఆయన తనయుడు విష్ణు, కుమార్తె లక్ష్మీ మంచు పాల్గొనగా ఇటీవల ఎపిసోడ్ షూటింగ్ చేశారు. మనోజ్ కూడా వచ్చినట్టు టాక్. త్వరలో టాక్ షో స్టార్ట్ కానుంది. 

బిగ్ బాస్ 5.. ప్రియ సంపాదన‌ ఎంతో తెలుసా?

  టాలీవుడ్‌లోని అంద‌మైన క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల్లో ప్రియ ఒక‌రు. న‌టిగా ఫ‌ర్వాలేద‌నిపించే అవ‌కాశాలు ఉన్న‌ ఆమె.. బిగ్ బాస్ సీజ‌న్ 5లో కంటెస్టెంట్‌గా పాల్గొని ఇండ‌స్ట్రీలోని ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేశారు. హౌస్‌లో త‌న ప్ర‌వ‌ర్త‌న‌తో తోటి కంటెస్టెంట్ల మ‌న‌సుల్నే కాకుండా, ఆడియెన్స్‌నూ ఆక‌ట్టుకున్నారు. అయిన‌ప్ప‌టికీ ఏడ‌వ వారంలో ఆమె ఎలిమినేష‌న్‌కు గురై, హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఏదేమైనా ఈ షోతో ప్రియ పాపులారిటీ మ‌రింత‌గా పెరిగింద‌నేది వాస్త‌వం. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ల‌డానికి ఆమెను ప్రేరేపించింది ఏమిటి?  చాలావ‌ర‌కు దాని ద్వారా వ‌చ్చే డ‌బ్బేన‌ని చెప్పాలి. ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నది నిజ‌మే అయితే ఈ షోలో పాల్గొన్నందుకు వారానికి ఆమెకు రూ. 3.2 ల‌క్ష‌లు అందాయంట‌. ఈ లెక్క‌న‌ ఏడు వారాల పాటు ఉన్న ఆమెకు సుమారు రూ. 23 ల‌క్ష‌లు అందుతున్న‌ట్లే. ఇది కాకుండా ఈ షోలో పాల్గొన్నందుకు గ్యారంటీ మ‌నీ కింద మ‌రికొంత కూడా వ‌స్తుంద‌ని చెప్పుకుంటున్నారు. చాలా త‌క్కువ స‌మ‌యంలోనే ఆమె ఎక్కువ సంపాదించిన‌ట్లు లెక్క‌. అదే సినిమాల్లో అయితే ఆమె ఇంత సంపాదించి వుండ‌ద‌ని అనుకుంటున్నారు. ఏదేమైనా డ‌బ్బుకు డ‌బ్బు, పేరుకు పేరు.. రెండూ ప్రియ ఖాతాలోకి వ‌చ్చాయి. ఆమె స్కిల్స్ ఏమిటో తెలిశాయి కాబ‌ట్టి, సినిమాల్లో ఇక‌నైనా ఆమె ప్ర‌తిభ‌కు త‌గ్గ అవ‌కాశాలు వ‌స్తాయేమో చూడాలి. 

హౌస్‌లో సభ్యుల మధ్య చిచ్చు పెట్టిన 'బిగ్ బాస్'!

  ఎనిమిదో వారం నామినేషన్ ప్రక్రియకు బిగ్ బాస్ కొత్త దారి ఎంచుకున్నాడు. పవర్ రూమ్‌లోకి ఇద్ద‌రు స‌భ్యులను పంపించాడు. అక్క‌డ వాళ్ల‌కు రెండు లెట‌ర్లు ఉంటాయి. ఆ లెట‌ర్లు ఎవ‌రికి వ‌చ్చాయో.. వారి పేర్లు కూడా ఆ లెట‌ర్స్ మీద ఉంటాయి. ఒక‌రికి లెట‌ర్ ఇవ్వాలి. మ‌రొక‌రి లెట‌ర్ చించేయాలి. ఎవ‌రి లెట‌ర్ చించేస్తే... వారు నామినేట్ అయిన‌ట్టు. దీని వల్ల హౌస్‌లో సభ్యుల మధ్య కొంత గ్యాప్ ఏర్పడటానికి ఛాన్స్ ఇచ్చినట్టు అయ్యింది. గ్యాప్ ఏర్పడటం కాదు... నిజంగా ఏర్పడిందని చెప్పాలి.  ఉదాహరణకు... షణ్ముఖ్-రవి పవర్ రూమ్‌లోకి వెళ్లినప్పుడు విశ్వ-సిరికి లెటర్స్ వచ్చాయి. బయటకు వచ్చిన తర్వాత తనకు లెటర్ ఇవ్వమని ఏడుస్తూ సిరిని రిక్వెస్ట్ చేశాడు విశ్వ‌. అప్పుడు 'తీస్కో' అని సిరి ఎమోషనల్ అయ్యింది. అది సోమవారం ఎపిసోడ్ సంగతి. మంగళవారం ఎపిసోడ్ కి వస్తే... సిరితో 'విశ్వ చాలా సెల్ఫిష్' అని షణ్ముఖ్ అన్నాడు. లెటర్ టాస్క్ విషయంలో విశ్వ ప్రవర్తన తనకు నచ్చలేదని అన్నాడు. అప్పుడు సిరి మాట్లాడుతూ "విశ్వకు నామినేషన్స్ అంటే భయం. లెటర్ మీద 'నా సిరి' అని చూసిన తర్వాత వదులుకున్నాను. కొడుకు పేరు చెప్పడంతో వదిలేశా" అని చెప్పింది.  నామినేషన్స్ సమయంలో సిరి, షణ్ముఖ్ లెటర్స్ అందుకోలేదు. కానీ, వాళ్లకు ఏం లెటర్స్ సెండ్ చేశామనేది... హౌస్ బయట ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో లెటర్స్ లో ఏముందనేది ప్రేక్షకులకు తెలిసింది. 

నీకు నిజం చెప్పాలి కార్తీక్.. ఇది కృత్రిమ గర్భం కాదు, నీ వల్లే సహజంగా తల్లిన‌య్యాను!

  'కార్తీక దీపం' సీరియల్ అభిమానులకు ఈ రోజు ఫ్యూజులు ఎగిరిపోయే మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇచ్చారు. మోనిత గర్భానికి కారణం కృత్రిమ పద్ధతిలు కాదని... తాగిన మత్తులో ఆమెతో కార్తీక్ కలవడం వల్లనే గర్భం వచ్చిందని వెల్లడించారు.‌ మరో వైపు కార్తీక్ వీర్యాన్ని ల్యాబ్ నుంచి మోనిత తీసుకోలేదని నిజం కూడా దీపకు తెలుస్తుంది.‌ దాంతో కథ ఎటువంటి మలుపులు తిరుగుతుందో అని ప్రేక్షకుల్లో నరాలు తెగే ఉత్కంఠ ఏర్పడడం ఖాయం. బుధవారం ఎపిసోడ్ లో ఎటువంటి ట్విస్టులు ఉన్నాయనే వివరాల్లోకి వెళితే... హిమ బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడానికి దీప ఆస్పత్రికి వెళ్తుంది. మార్గ మధ్యంలో మన దగ్గర అత్తయ్య, ఆయన ఏదో విషయం దాచడానికి ప్రయత్నిస్తున్నారని ఆలోచిస్తూనే ఉంటుంది. ఆస్పత్రికి వెళ్లి హిమ బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్ తీసుకుంటుంది.‌ అక్కడ ఇచ్చిన అమ్మాయి పేరు పల్లవి. అప్పుడు గతంలో పల్లవి అనే అమ్మాయి కార్తీక్ స్పెర్మ్ శాంపిల్స్ మోనితకు ఇచ్చి డబ్బులు తీసుకుని అనే విషయం గుర్తుకు వస్తుంది. దాంతో పల్లవిని చెడామడా తిట్టేస్తుంది. కేసు పెడతానని ఆవేశంతో ఊగిపోతుంది. కార్తీక్ శాంపిల్స్ ఇచ్చిన మాట వాస్తవమేనని, అయితే రిపోర్టులు కూడా తీసుకోలేదని... అసలు ఆ మోనిత ఎవరనేది తమకు తెలియదని పల్లవి చెబుతోంది.  కట్ చేస్తే... పురిటి నొప్పులతో బాధపడుతున్న మోనిత దగ్గరకు కార్తీక్, సౌందర్య వెళ్తారు. అప్పటికి మోనిత స్పృహ కోల్పోయి ఉంటుంది. తిరిగి రావడంతో ఆమెను భారతి లేపుతుంది. 'ఏంటి డ్రామానా?' అని కార్తీక్ అంటాడు.‌ కళ్ళు తెరిచిన మోనిత... "నీకు నిజం చెప్పాలి కార్తీక్. ఇది కృత్రిమ గర్భం కాదు, నీ వల్లే నేను సహజంగా తల్లిని అయ్యాను" అని అంటుంది. డ్రామాలు ఆపమని కార్తీక్ కోప్పడతాడు. "ఇన్నాళ్లు ఎన్నో అబద్ధాలు చెప్పాను. ఇప్పుడు చావు బతుకుల మధ్య ఎందుకు చెబుతా? నా మీద ఒట్టు... నేను ఇష్టపడే నీ మీద ఒట్టు... పుట్టబోయే బిడ్డ మీద ఒట్టు... నీవల్లే తల్లినయ్యా" అని మోనిత ఏడుస్తుంది. కోర్టులో కూడా ఇలాగే ఒట్లు వేశావని,‌‌ ఈ కుట్ర ఏంటి అని కార్తీక్ ఆవేశంతో ఊగిపోతాడు. ఇన్నాళ్ళు కృత్రిమ గర్భం అని ఎందుకు ప్రచారం చేశావని ప్రశ్నిస్తాడు. "కట్టుకున్న భార్యను పదకొండేళ్ల దూరం పెట్టావ్. ఇక నన్ను దగ్గరకు తీసుకోవడానికి ఎన్నేళ్లు పడుతుందో అని భయంతో ఇన్నాళ్ళు దాచాను. నా వ్యక్తిత్వం కాపాడుకోవడానికి దాచాను. పెళ్లి కాకుండా గర్భవతి అయిందని తెలిస్తే సమాజం దృష్టిలో నేను ఒక పతిత అవుతాను. అందరూ నన్ను ఛీ కొడతారు. చెడిపోయింది అంటారు. పుట్టబోయే బిడ్డను రకరకాల పేర్లతో పిలుస్తారు. అందుకని దాచాను" అని మోనిత చెబుతుంది. అయినా కార్తీక్ కరగలేదు. "మనకీ దరిద్రం ఏంటి మమ్మీ? పోదాం!' అని ఆవేశంగా స్పందిస్తాడు. మోనిత చచ్చిపోతే చచ్చిపోనివ్వమని భారతితో చెబుతాడు.  "నేను చస్తే నువ్వు నమ్ముతావంటే చచ్చిపోతా. కానీ నా బిడ్డను అనాధగా వదిలేయకు. వాడు నీ రక్తం" కార్తీక్ తో మోనిత చాలా స్పష్టంగా చెబుతుంది. ఏ టెస్టులు అయినా చేయించుకోమని శీల పరీక్షకు సిద్ధం అవుతుంది. తరువాత స్పృహ కోల్పోతుంది. ఎక్కువ సేపు వదిలేస్తే ప్రాణానికే ప్రమాదమని సౌందర్య, భారతి నచ్చజెప్పడంతో కార్తీక్ సంతకం పెడతాడు. అది నేటి ఎపిసోడ్ లో జరిగింది. పండంటి మగబిడ్డ జన్మించినట్లు...‌. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు ఆఖరులో చూపిస్తారు. బహుశా రేపటి ఎపిసోడ్ లో అది ఉండొచ్చు. కార్తీక్ సంతకం చేసిన సంగతి కూడా దీపకు తెలుస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.

ఎనిమిదో వారంలో ఎలిమినేట్ అయ్యేది ఆ ఇద్ద‌రిలో ఒక‌రేనా?

  ప్రస్తుతం 'బిగ్ బాస్'లో ఆరుగురు సభ్యులు డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఎనిమిదో వారం ఎలిమినేషన్ కోసం సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో... యాంకర్ రవి, సింగర్ శ్రీరామచంద్ర, యాక్టర్ మానస్, యూట్యూబర్లు సిరి హనుమంతు, షణ్ముఖ్ జస్వంత్, నటుడు లోబో నామినేట్ అయ్యారు. సో... ఈ ఆరుగురిలో ఎవరో ఒకరు ఈ వారం బయటకు వెళతారన్నమాట! పందొమ్మిది మందితో అట్టహాసంగా ప్రారంభమైన 'బిగ్ బాస్' హౌస్‌లో ప్రస్తుతం పదమూడు మంది మాత్రమే ఉన్నాయి. గడచిన ఏడు వారాల్లో ఏడుగురు సభ్యులు బయటకు వెళ్లారు. ఇప్పటికి షో మొదలై యాభై రోజులు గడిచింది. ఇప్పటినుండి మరింత ఆసక్తిగా ఉండబోతుందని సోమవారం ఎపిసోడ్ చూస్తే అర్థం అవుతోంది.  యాంకర్ రవి గత కొన్ని వారాలుగా నామినేట్ అవుతూ వస్తున్నాడు. కానీ, అతడు షో నుండి బయటకు రావడం లేదు. అలాగే, శ్రీరామ చంద్ర కూడా. వాళ్ళిద్దరికీ బయట ఫ్యాన్ బేస్ బలంగా ఉండటంతో ఓట్లతో గట్టెక్కుతున్నారు. షణ్ముఖ్, సిరి యూట్యూబర్లు కావడంతో వాళ్ళకి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఓట్లు వేస్తున్నారు. ఈ వారం మానస్ లేదా లోబోలో ఎవరో ఒకరు ఎలిమినేట్ కావచ్చని విశ్లేషకుల అభిప్రాయం.

మోనిత భ‌ర్త‌గా హాస్పిట‌ల్‌లో కార్తీక్‌ని సంత‌కం పెట్ట‌మ‌న్న‌ సౌంద‌ర్య‌!

  దీపకు కార్తీక్ అన్యాయం చేస్తాడా? ఆస్పత్రిలో మోనిత డెలివరీ ఫామ్ మీద భర్తగా సంతకం పెడతాడా? 'కార్తీక దీపం' సీరియల్ అభిమానుల మదిని తొలిచివేస్తున్న ప్రశ్నలివి. కార్తీక్ వీర్యం ద్వారా మోనిత కృత్రిమ గర్భం దాల్చిన సంగతి తెలిసిందే. తొలుత కార్తీక్ తన భర్త అని, తన కడుపులో బిడ్డకు తండ్రి అని వాదించింది. అసలు నిజాలు బయటపడటంతో జైలుకు వెళ్లింది. గర్భవతి కావడంతో పెరోల్ మీద బయటకు వచ్చింది.  మోనితకు డెలివరీ టైమ్ దగ్గరపడటంతో నొప్పులు రావడంతో ఆస్పత్రికి తీసుకు వెళతారు. అయితే, తన భర్తగా కార్తీక్ సంతకం పెడితే తప్ప ఆపరేషన్ చేయించుకొనని మోనిత మొండిపట్టు పడుతుంది. దాంతో కార్తీక్ కి డాక్టర్ భారతి ఫోన్ చేస్తుంది. 'నేనేం చేయాలి. నాకెందుకు చెబుతున్నావ్?' అని కార్తీక్ కోప్పడతాడు. 'నువ్వు వస్తే కానీ ఆపరేషన్ చేయించుకోనని అంటోంది' అని భారతి చెబుతుంది. 'మోనితకు సీరియస్ గా ఉంటే నాకేంటి? బిడ్డ మెడకు పేగు చుట్టుకుంటే నాకేంటి సంబంధం?' అని కార్తీక్ తిడతాడు. కార్తిక్ ఫోనులో మాట్లాడటం విన్న తల్లి సౌందర్య... 'కడుపులో పసిబిడ్డ చేసిన తప్పేంటి? చూస్తూ చూస్తూ ఆ పసి ప్రాణాన్ని కళ్ల ముందే అలా ఎలా వదిలేస్తాం' అంటుంది. ఈలోపు దీప వస్తే టాపిక్ మారుస్తారు. దాంతో తన దగ్గర ఏదో దాస్తున్నారని దీపకు అర్థమవుతుంది.  మళ్లీ భారతి ఫోన్ చేయడంతో సౌందర్య లిఫ్ట్ చేస్తుంది. భారతి పరిస్థితి మొత్తం వివరించడంతో కొడుకును తీసుకుని ఆస్పత్రికి తీసుకు వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. దీపకు తెలియకుండా వెళ్లాలని ఇద్దరూ ప్రయాణం అవుతారు. ఆస్పత్రికి వెళ్తారు. అప్పటికే ఒకసారి 'మోనిత డెలివరీ ఫామ్ మీద సంతకం పెడితే దీపకు అన్యాయం చేసినవాడిని అవుతా' అని కార్తీక్ చెబుతాడు. తల్లి బలవంతం చేయడంతో సంతకం పెడతాడా? భార్యకు అన్యాయం చేస్తాడా? అనేది చూడాలి. 

నా కాలు విరిగింది.. నాన్న‌కు హార్ట్ ఎటాక్ వ‌చ్చింది!

  శృంగార తార షకీలా 'క్యాష్' షోకి వచ్చారు. స్టేజి మీదకు వచ్చీ రావడంతో యాంకర్ సుమకు ఓ షాక్ ఇచ్చారు. 'ఒక్క స్టెప్ వేయండి. చిన్న డాన్స్ మూమెంట్' అని సుమ అడిగారు. అందుకు 'నేను చేయను. నాకు ముందు ఇవన్నీ చెప్పలేదు' అని సీరియస్ అయ్యారు. కాసేపటికి అది సీరియస్ కాదు... సరదాగా చేస్తున్నారని తెలిసింది. 'నేను చేయను. నా కొడుకు చేస్తాడు' అని చెప్పగా... సంపూర్ణేష్ బాబు వేదిక మీదకు వచ్చారు. సంపూర్ణేష్ బాబు, జ్యోతి, అభినయతో కలిసి షకీలా సందడి చేశారు.  'క్యాష్' అంటే సెలబ్రిటీలతో సుమ చేసే ఎంటర్టైన్మెంట్ హైలైట్. కానీ, ఈసారి కామెడీతో పాటు కన్నీళ్లు కూడా ఉన్నాయని ప్రోమోలో చెప్పారు. షకీలా తల్లితండ్రుల ఫొటోలను 'క్యాష్'లో చూపించారు. తనకు తన తండ్రి అంటే చాలా ఇష్టమని షకీలా చెప్పారు. "మా నాన్నంటే నాకు చాలా ఇష్టం. సినిమాల్లో నేను పడిన కష్టాలు మా నాన్న చూశారు. ఒక షాట్ లో పైనుండి నేను దూకాలి. డూప్ ఎవరూ లేకపోవడంతో నేను దూకేశాను. కాలు విరిగింది. నాన్నకు ఆ రోజు హార్ట్ ఎటాక్ వచ్చింది. అప్పుడు సినిమాలు చేయవద్దని చెప్పారు" అంటూ షకీలా కన్నీటిపర్యంతం అయ్యారు.  ఈ 'క్యాష్' ఎపిసోడ్ శుక్రవారం టెలికాస్ట్ కానుంది.

ప్రియాను బయటకు పంపేసిన 'బిగ్ బాస్'

స్పెషల్ ట్రీట్మెంట్లు గట్రా ఏమీ లేవు. తప్పు తప్పే! ఓటింగ్ ఓటింగే!! ఆర్టిస్ట్ ప్రియాను 'బిగ్ బాస్' బయటకు పంపేశాడు. నిజం చెప్పాలంటే... బిగ్ బాస్ పంపలేదు. ప్రేక్షకులు తనను బయటకు పంపేలా ప్రియా ప్రవర్తించింది. ఇప్పటివరకూ 'బిగ్ బాస్' ఎలిమినేషన్స్ గమనిస్తే... ఎవరికైనా ఈ విషయం ఈజీగా అర్థం అవుతుంది. హైస్‌లో హద్దుమీరి మాట్లాడినా... ఇతరుల పట్ల అనుచితంగా ప్రవర్తించినా... ప్రేక్షకులు ఏమాత్రం క్షమించడం లేదు. వాళ్లు గనుక డేంజర్ జోన్ లోకి వస్తే... ఓటింగ్ వేయడంతో లేదు. దాంతో ఎలిమినేట్ అవుతున్నారు.  ప్రియా విషయానికి వస్తే... లాస్ట్ వీక్ ఆమె ప్రవర్తన ఏమంత బాగోలేదు. సన్నీని గడ్డిపోచతో పోల్చింది. అటువంటి చర్యలు టీఆర్పీలకు పనికొస్తాయి గానీ, ఆర్టిస్టులకు మంచి ఇమేజ్ తీసుకురావు. అదే ఎలిమినేషన్ కి కారణం అయ్యిందని చెప్పవచ్చు.  ప్రియా హౌస్ నుండి బయటకు రావడం కొంతమంది అభిమానులకు నచ్చలేదు. ప్రియా కోసం షో చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. టెలికాస్ట్ చేసే ఫుటేజ్ లో ఆమె ఎక్కువసేపు కనిపిస్తుంది కూడా! ఇప్పుడు షోకి కొంత అట్రాక్షన్ తగ్గిందని చెప్పాలి.

'ఈఎంకే' షో చేయలేనని చెప్పిన తారక్.. షాక్ లో నిర్వాహకులు!

'బిగ్ బాస్' షోతో బుల్లితెర ప్రేక్షకులను మెప్పించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోతో మరోసారి ప్రేక్షకులను అలరిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ మొదటి సీజన్ కు హోస్ట్ గా చేసిన తారక్.. ఆ తర్వాత సీజన్లకు హోస్ట్ చేయలేదు. ఇప్పుడు 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో విషయంలోనూ తారక్ అదే రిపీట్ చేయబోతున్నారని న్యూస్ వినిపిస్తోంది. 'బిగ్ బాస్' షో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వడానికి ప్రధాన కారణం తారక్ అనే చెప్పొచ్చు. తన టాకింగ్ పవర్, కామెడీ టైమింగ్ తో షోని గ్రాండ్ సక్సెస్ చేశారు. అయితే ఊహించని విధంగా తర్వాత సీజన్లకు తారక్ హోస్ట్ గా వ్యవహరించలేదు. దీంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. ఇక ఇప్పుడు 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో విషయంలోనూ తారక్ అదే రిపీట్ చేయనున్నారని తెలుస్తోంది. 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోతో హోస్ట్ గా రీఎంట్రీ ఇచ్చిన తారక్ మరోసారి తనదైన శైలిలో అలరిస్తున్నారు. అయితే హోస్ట్ గా తారక్ కి మరోసారి ఫుల్ మార్క్స్ పడినా.. షోకి ఆశించినస్థాయిలో రేటింగ్స్ రావడంలేదని అంటున్నారు. అసలే రేటింగ్ విషయంలో కాస్త నిరాశలో ఉన్న షో నిర్వాహకులకు తారక్ ఊహించని షాక్ ఇచ్చారని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో ఈ సీజన్ కి సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేసిన తారక్.. ఇక మీదట ఈ షోని తాను చేయలేనని చెప్పారట. దీంతో నిర్వాహకులు తారక్ ని ఒప్పించే పనిలో ఉన్నారని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది.

"నా ల‌వ‌ర్‌కి పెళ్లయిపోతంది".. "ఎప్పుడో ఐపోయింది క‌దా".. సుధీర్‌కు ర‌ష్మి పంచ్‌!

  సుడిగాలి సుధీర్‌, ర‌ష్మి గౌత‌మ్ కాంబినేష‌న్ అంటే ఆడియెన్స్‌కు ఎంత క్రేజో చెప్పాల్సిన ప‌నిలేదు క‌దా.. తొమ్మిదేళ్లుగా ఆ ఇద్ద‌రూ జంట‌గా బుల్లితెర‌పై ఎన్నిసార్లు క‌నిపించి అల‌రించారో! ఆడియెన్స్‌లో వాళ్ల‌కున్న ఇమేజ్‌ను చాన‌ల్స్‌, షోల నిర్వాహ‌కులు బాగా క్యాష్ చేసుకుంటూ ఉంటారు. అలా ఇద్ద‌రికీ ఓ షోలో పెళ్లి కూడా జ‌రిపించేశారు. లేటెస్ట్ ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ షోలో సుధీర్‌కు ర‌ష్మి ఇచ్చిన పంచ్ అంద‌ర్నీ తెగ న‌వ్విస్తోంది. ఈ ఎపిసోడ్‌కు హీరో నిఖిల్ గెస్ట్‌గా అటెండ్ అయ్యాడు. చేతిలో ఖాళీ మందు బాటిల్ ప‌ట్టుకొని, "ఐపోయింది రోజా గారూ.. నా ల‌వ‌ర్‌కి పెళ్ల‌యిపోతంది" అని బాధ‌ప‌డ్డాడు సుధీర్‌. "ఎప్పుడో ఐపోయింది క‌దా!" అని యాంక‌ర్ ప్లేస్‌లో ఉన్న‌ ర‌ష్మి అన‌డంతో షాక‌వుతూ ఆమె వంక చూశాడు. దాంతో రోజా స‌హా అంద‌రూ విర‌గ‌బ‌డి న‌వ్వేశారు. నిఖిల్‌ను ఉద్దేశించి, "మీకేముంది.. హ్యాపీగా గాళ్ ఫ్రెండ్స్‌, లైఫ్‌లో అమ్మాయిలు.. బావున్నారు. నా ల‌వ‌ర్‌కి.. పెళ్లి.." అని సుధీర్ బాధ‌ప‌డుతుంటే, 'నాకా?' అన్న‌ట్లు ప్ర‌శ్నార్థ‌కంగా చూశాడు నిఖిల్‌. అంత‌లో రామ్‌ప్ర‌సాద్ ఎంట్రీ ఇచ్చాడు. అత‌డ్ని చూడ‌గానే, "రేయ్‌.. రాంప్ర‌సాద్‌..  ఐపోయిందిరా.. మొత్తం ఐపోయిందిరా" అని బాటిల్‌ను కింద పెట్టాడు సుధీర్‌. "ఐపోతే కొత్త బాటిల్ కొనుక్కుంటాం కానీ ఏడుస్తారేంట్రా!" కూల్‌గా అన్నాడు రాంప్ర‌సాద్‌, ఆ ఖాళీ బాటిల్‌ను ప‌ట్టుకుంటూ. అంతా న‌వ్వులే న‌వ్వులు. "మందు ఐపోవ‌డం కాదురా.. నేను చ‌చ్చిపోతాను. నేనిక బ్ర‌త‌క‌ను. చ‌చ్చిపోతాను" అని సుధీర్ ఎమోష‌న‌ల్ అవుతుంటే, సీరియ‌స్‌గా "స‌రే అవ‌గానే ఫోన్ చెయ్" అని వెళ్ల‌బోయాడు రాంప్ర‌సాద్‌. ఈ హిలేరియ‌స్ ఎపిసోడ్ వ‌చ్చే శుక్ర‌వారం రాత్రి 9:30 గంట‌ల‌కు ప్ర‌సారం కానున్న‌ది.

జీ తెలుగు కుటుంబం అవార్డ్స్.. శ్రియ‌-ఆంద్రీ లిప్ లాక్‌!

  టీవీ సెల‌బ్రిటీల‌ను ఒక‌చోట‌కు చేర్చే కార్య‌క్ర‌మాల్లో జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ ఒక‌టి. జీ తెలుగు చాన‌ల్‌లో ప్ర‌సార‌మ‌య్యే షోల‌కు సంబంధించి ఇచ్చే ఉత్త‌మ అవార్డుల‌కు వేదిక ఈ వేడుక‌. సీరియ‌ల్స్‌లో, షోల‌లో క‌నిపించే తార‌లంతా ఈ అవార్డుల వేడుక‌లో మెరుపులు మెరిపిస్తుంటారు. అలాగే జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2021 వేడుక‌లోనూ వారంతా జిగేల్‌మ‌నిపించ‌న్నారు. టీవీ తార‌లే అలా ఉంటే, ఇక సినీ సెల‌బ్రిటీల సంగ‌తి చెప్పేదేముంది! ఈ వేడుక‌లో ఎవ‌ర్‌గ్రీన్ హీరోయిన్ శ్రియ‌, ఆమె భ‌ర్త ఆంద్రీ కొశ్చేవ్ స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ కానున్నారు.  హోస్ట్ ప్ర‌దీప్ మాచిరాజు ఎనౌన్స్ చేయ‌గానే, "చిన్ని చిన్ని చిన్ని ఆశ‌లు నాలో రేగెనే" పాట బ్యాగ్రౌండ్‌లో వినిపిస్తుండ‌గా ప్ర‌త్య‌క్ష‌మైన శ్రియ‌-ఆంద్రీ జంట‌ను చూడ‌గానే టీవీ తార‌లంతా సర్‌ప్రైజ్ అవుతూ చూసి, సంతోషంతో కేరింత‌లు కొట్టారు. ర‌ష్య‌న్ అయిన ఆంద్రీ "అంద‌రికీ న‌మ‌స్కారం" అని తెలుగులో చెప్ప‌గానే అంద‌రూ ఉత్సాహంగా ఈలలు వేశారు.  "ఇప్ప‌టివ‌ర‌కూ ఆవిడ (శ్రియ) అకౌంట్‌లో పిక్చ‌ర్స్ చూస్తే ఏ పిక్చ‌రూ ఇలా ఉండ‌దు" అని ప్ర‌దీప్ అన‌గా, శ్రియ‌-ఆంద్రీ పోజిచ్చారు. త‌న‌ వీపుపై ఆంద్రీ చేయివేసి ప‌ట్టుకోగా, వెన‌క్కి వాలింది శ్రియ‌. ఆమె మెడ మీద చుంబించాడు ఆంద్రీ. శ్రియ‌ న‌వ్వుతూ ఆంద్రీకి లిప్ టు లిప్ కిస్ ఇచ్చింది. ఆ త‌ర్వాత ఇద్ద‌రూ ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుతూ గ‌ట్టిగా కౌగ‌లించుకున్నారు. వారి దాంప‌త్య జీవితం ఎంత ఆనందంగా, సుంద‌రంగా ఉందో వారి బాడీ లాంగ్వేజ్ తెలియ‌జేసింది. ఆ ఇద్ద‌రి అన్యోన్య‌త‌ను మ‌రో గెస్ట్ త‌మ‌న్నా కూడా ఎంజాయ్ చేసింది. ఈ స‌ర‌దాల సంబ‌రం ఈ రోజు సాయంత్రం 6 గంట‌ల‌కు జీ తెలుగు చాన‌ల్‌లో ప్ర‌సార‌మ‌వుతోంది. 

ఈ పెన్నుతో స‌న్నీది పొడుస్తావా, నాది పొడుస్తావా?.. కాజ‌ల్‌కు ర‌వి ప్ర‌శ్న‌!

  బిగ్ బాస్‌లో త‌దుప‌రి కెప్టెన్ టాస్క్ సంద‌ర్భంగా హౌస్‌లో నానా గొడ‌వ జ‌రిగింది. ముఖ్యంగా విశ్వ‌, ప్రియాంక మ‌ధ్య పెద్ద ర‌గ‌డే జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. "ఏ ఒక్క పోటీదారుని బెలూన్ అయితే ప‌గ‌ల‌కుండా ఉంటుందో వారే బిగ్ బాస్ ఇంటి తదుప‌రి కెప్టెన్ అవుతారు." అని పేప‌ర్‌పై ఉన్న విష‌యాన్ని చ‌దివి వినిపించాడు శ్రీ‌రామ‌చంద్ర‌. "నేన‌వుతా ర‌వీ.. కెప్టెన్" అని యాంక‌ర్ ర‌వితో త‌న మ‌న‌సులో మాట చెప్పింది కాజ‌ల్‌. "సంపాదించు.. అడుక్కోకు" అని సూటిగా చెప్పేశాడు ర‌వి. సైర‌న్ మోగ‌గానే అక్క‌డ చిన్న రౌండ్ స్టూల్ మీద పెట్టిన వ‌స్తువును అంద‌రికంటే ముందుగా తామే తీసుకోవాల‌ని అంద‌రూ ప‌రుగ‌లు తీశారు. దాన్ని ప‌ట్టేసుకున్నాడు విశ్వ‌. ఈ క్ర‌మంలో ప్రియాంక‌, లోబో కింద‌ప‌డిపోయారు. దీంతో విశ్వ‌తో గొడ‌వ పెట్టేసుకుంది ప్రియాంక‌. "ప్ర‌తి దానికీ నీకు కండ‌బ‌లం ఉంది.. అంద‌రికీ కండ‌బ‌లం లేదు క‌దా".. అని ప్రియాకం ఆర్గ్యూ చేయ‌డంతో, "ఏంటీ.. ఊరికే కండ‌బ‌లం అంటున్నావమ్మా" అని కోపంగా ప్ర‌శ్నించాడు విశ్వ‌. "నీకు కండ‌బ‌లం లేదా? మ‌గోడికి ఒక‌ర‌కంగా ఉంటుంది, ఆడ‌దానికి ఇంకోర‌కంగా ఉంటుంది" అంది ప్రియాంక డిఫెండ్ చేసుకుంటూ. "మ‌గోడు, గిగోడు అని మాట్లాడ‌కు. నేను కంటెస్టెంట్." అని గ‌ట్టిగా వాదించాడు విశ్వ‌.  ఆ త‌ర్వాత కాజ‌ల్‌తో త‌న చేతిలోని పెన్నును చూపిస్తూ, "ఈ పెన్ను నీ చేతిలోకి వ‌స్తే, బెలూన్‌ది స‌న్నీది పొడుస్తావా, నాది పొడుస్తావా?" అన‌డిగాడు ర‌వి. అత‌డివైపే వెళ్లింది కాజ‌ల్‌.  "స‌రైన కార‌ణం చెప్పి క‌ట్ చేసేసెయ్. నో ప్రాబ్లెమ్‌" అని కాజ‌ల్‌తో అన్నాడు విశ్వ‌. "నువ్వు రెండు సార్లు కెప్టెన్‌గా చేశావ్ అంది" కాజ‌ల్‌. "టూ టైమ్స్ అనేది వ‌దిలేసేయ్‌. అది క‌ష్ట‌ప‌డినా" అన్నాడు విశ్వ‌. ర‌వితో మాన‌స్ "చెప్పు రీజ‌న్ చెప్పు. సుగ‌ర్ కోటింగ్ వ‌ద్దు నాకు" అన్నాడు. "ఇదే రీజ‌న్‌.. డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్ దాకా నేనెందుకు తెచ్చుకుంటా".. అని ర‌వి ఇంకేదో అంటుంటే, త‌న బెలూన్‌ను త‌నే ప‌గ‌ల‌గొట్టేసుకున్నాడు మాన‌స్‌. ఆ త‌ర్వాత కాజ‌ల్ ఎందుకో ఏడుస్తుంటే, ప్రియ కౌగ‌లించుకొని ఓదార్చింది. బెలూన్ టాస్క్‌లో ఎవరు గెలిచి కెప్టెన్ అయ్యారో.. ఆ రోజు రాత్రి ఎపిసోడ్‌లో మ‌న‌కు తెలియ‌నుంది.

ఓటీటీ సినిమాకు రివ్యూ ఇచ్చిన‌ నిహారిక, చైతన్య!

  యూట్యూబ్ ఫిల్మ్స్‌తో పాపుల‌ర్ అయిన సందీప్ రాజ్‌, `క‌ల‌ర్ ఫొటో` సినిమాతో ద‌ర్శ‌కుడిగా ఇంట్ర‌డ్యూస్ అయ్యాడు. తొలి సినిమాతో త‌న‌లో సత్తాను బ‌య‌ట‌పెట్టాడు. అయితే, ఆ సినిమా థియేటర్లలో విడుదల కావడంతో కొంచెం నిరాశ చెందినా... హిట్ టాక్ రావడంతో ఫైనల్లీ హ్యాపీగా ఫీలయ్యాడు. ఇప్పుడు సందీప్ రాజ్ నెక్స్ట్ సినిమా 'హెడ్స్ అండ్ టేల్స్' కూడా ఓటీటీలో  విడుదలకు సిద్ధమైంది. అయితే, ఈ సినిమాకు సందీప్ దర్శకుడు కాదు. కేవలం కథను మాత్రమే అందించాడు.  'కలర్ ఫొటో'కి పని చేసిన చాలామంది 'హెడ్స్ అండ్ టేల్స్'కి పని చేశారు. అందువల్ల, 'జీ 5'లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి మంచి బజ్ ఏర్పడింది. ఈ నెల 22న (శుక్రవారం) సినిమా రిలీజ్ కానుంది. అయితే, ఆడియన్స్ కంటే కొంచెం ముందుగా మెగా డాటర్ నిహారికా కొణిదెల, '30 వెడ్స్ 21' వెబ్ సిరీస్ ఫేమ్ చైతన్య 'హెడ్స్ అండ్ టేల్స్' చూశారు. ఇద్దరూ సోషల్ మీడియాలో మంచి రివ్యూలు ఇచ్చారు.  "యూనిక్ స్టోరీ, సూపర్బ్ పెర్ఫార్మన్స్, సున్నితమైన హాస్యం. కొత్తగా... ఆసక్తికరంగా ఉన్నవి చూడాలని ఆశించే ప్రేక్షకులకు ఇది పర్ఫెక్ట్" అని 'హెడ్స్ అండ్ టేల్స్' టీమ్ అందరినీ నిహారికా కొణిదెల ప్రశంసించారు. ఈ సినిమా అందంగా, కొత్తగా, సింపుల్ గా ఉందని '30 వెడ్స్ 21' ఫేమ్ చైతన్య చెప్పాడు. ముఖ్యంగా సందీప్ రాజ్ డైలాగుల గురించి ప్రస్తావించాడు.  

ప్రియకు నాగ్‌ స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడా?

  'బిగ్ బాస్ 5' హౌస్‌లో ఎవరైనా తప్పు చేస్తే... వీకెండ్ కింగ్ నాగార్జున క్లాస్ పీకడం ఖాయం. ఒకవేళ క్లాస్ పీకుతున్న టైమ్‌లో తాము అలా చేయలేదని ఎవరైనా చెబితే... వీడియో ప్రూఫ్ చూపించి మరీ క్లాస్ కంటిన్యూ చేస్తున్నారు. మరి... నాగార్జునకు, 'బిగ్ బాస్'కు ప్రియ చేస్తున్నవి కనిపించడం లేదా? అనేది షోను రెగ్యులర్‌గా ఫాలో అవుతున్న వాళ్లకు కలిగే సందేహం. 'బిగ్ బాస్ 5' మొదలైన రెండు మూడు వారాలకు ప్రియ, సన్నీ మధ్య గొడవలు మొదలయ్యాయి. కయ్యానికి కాలు దువ్వింది ఎవరనేది తెలియకపోయినా నివురు గప్పిన నిప్పులా ఇద్దరి మధ్య అడపా దడపా చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. ఒకసారి నాగార్జున సైతం ప్రతి చిన్న విషయానికి సన్నీ ఓవర్ రియాక్ట్ అవుతున్నాడని చెప్పారు. ప్రియను మాత్రం ఏమీ అనలేదు. ఈసారి ఏమైనా అంటారో, లేదో? చూడాలి.  ప్రియ, సన్నీ మధ్య ఈవారం కూడా గొడవ జరిగింది. కోడిగుడ్ల టాస్క్ లో సన్నీ బుట్టలో గుడ్లను ప్రియ కొట్టేయడంతో గొడవ మొదలైంది. సన్నీ పరోక్షంగా డే విషయాన్ని ప్రస్తావిస్తే... 'బారాబర్ కొట్టేస్తా' అని ఆన్సర్ ఇచ్చింది. అక్కడితో ఆగకుండా గడ్డిపోచతో సన్నీని పోల్చింది. పైగా, గాల్లోకి గడ్డిపోచను ఊది... సన్నీ గడ్డిపోచతో సమానం అన్నట్టు ప్రవర్తించింది. దీనిపై నాగార్జున, 'బిగ్ బాస్' ఏమీ అనకపోతే... ప్రియకు వాళ్లిద్దరూ స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారని అనుకోవాలని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. 

సిగ్గుండాలి మనకు! ఎంబీఏ ఫైనాన్స్ ఎందుకు?

  'సిగ్గుండాలి మనకు! ఎంబీఏ ఫైనాన్స్ ఎందుకు?' అని 'ఎవరు మీలో కోటీశ్వరుడు' కార్యక్రమంలో హాట్  సీటులో కూర్చున్న కంటెస్టెంట్‌తో హోస్ట్ సీట్‌లో కూర్చున్న జూనియ‌ర్‌ ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. అందుకో కారణం ఉంది. అదేమిటంటే... ఓ ప్రశ్నకు కంటెస్టెంట్‌కే కాదు, తారక్‌కు కూడా ఆన్సర్ తెలియలేదు.  అయితే, హాట్ సీటులో కూర్చున్న వ్య‌క్తి కుమార్తె కూడా ఆ షోకు వచ్చింది. ఆ చిన్నారికి ఆన్సర్ తెలిసింది. 'గుర్రం జాషువా' అని చెప్పింది. దాంతో జూనియ‌ర్ ఎన్టీఆర్ ఆశ్చర్యపోయారు. మనకి సిగ్గుండాలని చెప్పారు. చిన్నారి స్కూల్ టీచర్ రాజ్యలక్ష్మిగారిని కూడా తార‌క్‌ అభినందించారు. అయితే, ఆ ప్రశ్న ఏంటనేది తెలియడానికి షో చూడాలి. తార‌క్‌ క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న సంగతి తెలిసిందే. 'ఎవరు మీలో కోటీశ్వరుడు'లో తనకు క్లాసికల్ డాన్స్ నేర్పించినది సుధాకర్ అని, ప్రస్తుతం ఆయన ఆస్ట్రేలియాలో ఉంటున్నారని చెప్పారు. ఈమధ్య పెద్దగా కలవలేదని తెలిపారు. 

నిండు గర్భిణిగా జైలు నుండి మోనిత విడుదల! ఇప్పుడేం చేస్తుంది?

  'కార్తీక దీపం' సీరియల్‌లో కథ మరో కీలక మలుపు తీసుకుంది. కార్తీక్ అలియాస్ డాక్టర్ బాబు, దీప అలియాస్ వంటలక్క దంపతులను, వాళ్ళ కుటుంబాన్ని జైల్లో ఉండి ముప్పు తిప్పలు పెడుతున్న మోనితకు పెరోల్ లభించింది. దాంతో జైలు నుండి విడుదలకు రెడీ. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? అన్నది ఆసక్తికరంగా మారింది. మోనిత కారణంగా ఏర్పడుతున్న మానసిక క్షోభ నుండి దూరం కావాలని భార్యాపిల్లలతో అమెరికా వెళ్ళడానికి కార్తీక్ రెడీ అవుతాడు. విదేశీ ప్రయాణానికి అంతా సిద్ధమైంది. అయితే, ఈలోపు కార్తీక్ ఫ్యామిలీకి అనుకోని షాక్ తగిలింది. 'వింత ప్రేమికురాలు మోనిత విడుదల' శీర్షికతో మోనిత జైలు నుండి విడుదలువుతున్న వార్తను కార్తీక్ తల్లి సౌందర్య చూస్తుంది.  అదే వార్తను చూసిన దీప 'సరిగ్గా ఈ రోజే బయటకు రావాలా?' అని బాధ పడుతుంది. పిల్లలకు ఆ పేపర్ కనిపించకుండా దాచేద్దామని శ్రావ్య అంటే... పిల్లల్ని పిలిచి మరీ ఆ వార్తను చూపిస్తుంది దీప. అందరూ షాక్ అవుతారు. ఈ షాక్ గురించి కాకుండా... జైల్లో నుండి ఎన్నో చేసిన మోనిత, ఇప్పుడు బయటకు వస్తే ఇంకేం చేస్తుందోనని ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. త్వరలో మోనిత విడుదలయ్యే దృశ్యాలు సీరియల్ లో ప్రసారం కానున్నాయి.

మా లిరిక్ రైట‌ర్స్‌ను ఇండ‌స్ట్రీలో స‌రిగా గుర్తించ‌ట్లేదు.. రామ‌జోగ‌య్య శాస్త్రి ఆవేద‌న‌!

  తెలుగు చిత్ర‌సీమ‌లోని పాపుల‌ర్ లిరిక్ రైట‌ర్స్‌లో రామ‌జోగ‌య్య శాస్త్రి ఒక‌రు. సుప్ర‌సిద్ధ గేయ‌ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి శిష్యుడిగా పేరు తెచ్చుకొని, ఆ త‌ర్వాత గేయ ర‌చ‌యిత‌గా మంచి డిమాండ్ తెచ్చుకున్నారు రామ‌జోగ‌య్య‌. అయితే మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌కు వ‌చ్చినంత పేరు కానీ, వాళ్ల‌కు ఇండ‌స్ట్రీలో ఇచ్చేంత ప్రాధాన్యం కానీ గేయ ర‌చ‌యిత‌ల‌కు లేదు. ఈ విష‌యం రామ‌జోగ‌య్య శాస్త్రిని బాధ‌పెడుతున్న‌ట్లు 'ఆలీతో స‌ర‌దాగా' షోలో ఆయ‌న మాట్లాడిన మాట‌ల‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది.  ఆ షో లేటెస్ట్ ప్రోమోలో "మీరు సోష‌ల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటారు క‌దా.. రీజ‌న్ ఏంటి?" అని అలీ అడిగారు. అందుకు, "సోష‌ల్ మీడియాలో నేను ప‌నిక‌ట్టుకొని ఉంటా. నాక‌ది ఇష్టం. దాని వ‌ల్ల కొంత స‌మయం పోతుంది. కానీ ఓ కార‌ణం కోసం చేస్తా. కొన్నాళ్ల క్రితం వ‌ర‌కు లిరిక్ రైట‌ర్స్‌కు రావాల్సిన‌టువంటి ప్రాధాన్య‌త ఇండ‌స్ట్రీలో కానీ, ప‌బ్లిక్ నుంచి కానీ లేదు. మా పనిని ఎక్కువ‌గా గుర్తించ‌ట్లేదు అన్న ఆలోచ‌న నాకు క‌లిగింది." అని చెప్పారు రామ‌జోగ‌య్య‌. ఆడియో ఫంక్ష‌న్ల‌లోనూ త‌మ‌కు త‌గినంత ప్రాధాన్యం ఇవ్వ‌ట్లేద‌ని ఆయ‌న అన్నారు. "ఒక ఆడియో ఫంక్ష‌న్ తీసుకున్నా కానీ.. నిజానికి ఆ ఫంక్ష‌న్ మాకు సంబంధించిన‌ది అయిన‌ప్ప‌టికీ.. మాకంత ప్రామినెన్స్ ఉండ‌ట్లేదు అనిపించింది. 'న‌న్ను మీరు గౌర‌వించండి' అనే దానిక‌న్నా మ‌న ప‌నిని ముందుపెడితే, ఆ ప‌నే మ‌న‌కు కావాల్సిన గౌర‌వాన్ని తీసుకొచ్చి పెడుతుంది. సో, మ‌నం చేసే ప‌ని ప్ర‌మోట్ చేయ‌బ‌డాలి.. ఇది నా మ‌న‌సులో ప‌డ్డ బీజం. ఆరోజు నా ఆలోచ‌న‌కు అనుగుణంగా అందిపుచ్చుకున్న‌ట్లుగా సోష‌ల్ మీడియా విస్తృతంగా వ‌చ్చింది. 'నేను ఈరోజు ఈ పాట రాశాను, ఈ పాట లిరిక్ ఇది' అని అందులో పోస్ట్ చేస్తున్నాను. వాటికి యూత్ బాగా క‌నెక్ట‌వుతున్నారు." అని ఆయ‌న చెప్పుకువ‌చ్చారు. వ‌చ్చే సోమ‌వారం ఈ ఎపిసోడ్ ప్ర‌సారం కానున్న‌ది. అందులో రామ‌జోగ‌య్య ఇంకెన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు చెప్పారో!