నిండు గర్భిణిగా జైలు నుండి మోనిత విడుదల! ఇప్పుడేం చేస్తుంది?

  'కార్తీక దీపం' సీరియల్‌లో కథ మరో కీలక మలుపు తీసుకుంది. కార్తీక్ అలియాస్ డాక్టర్ బాబు, దీప అలియాస్ వంటలక్క దంపతులను, వాళ్ళ కుటుంబాన్ని జైల్లో ఉండి ముప్పు తిప్పలు పెడుతున్న మోనితకు పెరోల్ లభించింది. దాంతో జైలు నుండి విడుదలకు రెడీ. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? అన్నది ఆసక్తికరంగా మారింది. మోనిత కారణంగా ఏర్పడుతున్న మానసిక క్షోభ నుండి దూరం కావాలని భార్యాపిల్లలతో అమెరికా వెళ్ళడానికి కార్తీక్ రెడీ అవుతాడు. విదేశీ ప్రయాణానికి అంతా సిద్ధమైంది. అయితే, ఈలోపు కార్తీక్ ఫ్యామిలీకి అనుకోని షాక్ తగిలింది. 'వింత ప్రేమికురాలు మోనిత విడుదల' శీర్షికతో మోనిత జైలు నుండి విడుదలువుతున్న వార్తను కార్తీక్ తల్లి సౌందర్య చూస్తుంది.  అదే వార్తను చూసిన దీప 'సరిగ్గా ఈ రోజే బయటకు రావాలా?' అని బాధ పడుతుంది. పిల్లలకు ఆ పేపర్ కనిపించకుండా దాచేద్దామని శ్రావ్య అంటే... పిల్లల్ని పిలిచి మరీ ఆ వార్తను చూపిస్తుంది దీప. అందరూ షాక్ అవుతారు. ఈ షాక్ గురించి కాకుండా... జైల్లో నుండి ఎన్నో చేసిన మోనిత, ఇప్పుడు బయటకు వస్తే ఇంకేం చేస్తుందోనని ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. త్వరలో మోనిత విడుదలయ్యే దృశ్యాలు సీరియల్ లో ప్రసారం కానున్నాయి.

మా లిరిక్ రైట‌ర్స్‌ను ఇండ‌స్ట్రీలో స‌రిగా గుర్తించ‌ట్లేదు.. రామ‌జోగ‌య్య శాస్త్రి ఆవేద‌న‌!

  తెలుగు చిత్ర‌సీమ‌లోని పాపుల‌ర్ లిరిక్ రైట‌ర్స్‌లో రామ‌జోగ‌య్య శాస్త్రి ఒక‌రు. సుప్ర‌సిద్ధ గేయ‌ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి శిష్యుడిగా పేరు తెచ్చుకొని, ఆ త‌ర్వాత గేయ ర‌చ‌యిత‌గా మంచి డిమాండ్ తెచ్చుకున్నారు రామ‌జోగ‌య్య‌. అయితే మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌కు వ‌చ్చినంత పేరు కానీ, వాళ్ల‌కు ఇండ‌స్ట్రీలో ఇచ్చేంత ప్రాధాన్యం కానీ గేయ ర‌చ‌యిత‌ల‌కు లేదు. ఈ విష‌యం రామ‌జోగ‌య్య శాస్త్రిని బాధ‌పెడుతున్న‌ట్లు 'ఆలీతో స‌ర‌దాగా' షోలో ఆయ‌న మాట్లాడిన మాట‌ల‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది.  ఆ షో లేటెస్ట్ ప్రోమోలో "మీరు సోష‌ల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటారు క‌దా.. రీజ‌న్ ఏంటి?" అని అలీ అడిగారు. అందుకు, "సోష‌ల్ మీడియాలో నేను ప‌నిక‌ట్టుకొని ఉంటా. నాక‌ది ఇష్టం. దాని వ‌ల్ల కొంత స‌మయం పోతుంది. కానీ ఓ కార‌ణం కోసం చేస్తా. కొన్నాళ్ల క్రితం వ‌ర‌కు లిరిక్ రైట‌ర్స్‌కు రావాల్సిన‌టువంటి ప్రాధాన్య‌త ఇండ‌స్ట్రీలో కానీ, ప‌బ్లిక్ నుంచి కానీ లేదు. మా పనిని ఎక్కువ‌గా గుర్తించ‌ట్లేదు అన్న ఆలోచ‌న నాకు క‌లిగింది." అని చెప్పారు రామ‌జోగ‌య్య‌. ఆడియో ఫంక్ష‌న్ల‌లోనూ త‌మ‌కు త‌గినంత ప్రాధాన్యం ఇవ్వ‌ట్లేద‌ని ఆయ‌న అన్నారు. "ఒక ఆడియో ఫంక్ష‌న్ తీసుకున్నా కానీ.. నిజానికి ఆ ఫంక్ష‌న్ మాకు సంబంధించిన‌ది అయిన‌ప్ప‌టికీ.. మాకంత ప్రామినెన్స్ ఉండ‌ట్లేదు అనిపించింది. 'న‌న్ను మీరు గౌర‌వించండి' అనే దానిక‌న్నా మ‌న ప‌నిని ముందుపెడితే, ఆ ప‌నే మ‌న‌కు కావాల్సిన గౌర‌వాన్ని తీసుకొచ్చి పెడుతుంది. సో, మ‌నం చేసే ప‌ని ప్ర‌మోట్ చేయ‌బ‌డాలి.. ఇది నా మ‌న‌సులో ప‌డ్డ బీజం. ఆరోజు నా ఆలోచ‌న‌కు అనుగుణంగా అందిపుచ్చుకున్న‌ట్లుగా సోష‌ల్ మీడియా విస్తృతంగా వ‌చ్చింది. 'నేను ఈరోజు ఈ పాట రాశాను, ఈ పాట లిరిక్ ఇది' అని అందులో పోస్ట్ చేస్తున్నాను. వాటికి యూత్ బాగా క‌నెక్ట‌వుతున్నారు." అని ఆయ‌న చెప్పుకువ‌చ్చారు. వ‌చ్చే సోమ‌వారం ఈ ఎపిసోడ్ ప్ర‌సారం కానున్న‌ది. అందులో రామ‌జోగ‌య్య ఇంకెన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు చెప్పారో!

ముక్కు అవినాశ్ ఇంట పెళ్లి బాజాలు.. హ‌ల్దీ వేడుక‌లో జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్‌!

  ముక్కు అవినాశ్‌ పెళ్లి పీట‌లు ఎక్కుతున్నాడు. 'జ‌బ‌ర్ద‌స్త్' షోలో త‌న కామెడీతో అంద‌ర్నీ న‌వ్వించి, ఆ త‌ర్వాత బిగ్ బాస్ 4లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి వీక్ష‌కుల‌కు మంచి వినోదాన్ని పంచిన అవినాశ్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆగ‌స్ట్ 31న అనూజ వాకిటి అనే అమ్మాయితో నిశ్చితార్ధం జ‌రుపుకున్న అత‌ను ఆమెను ఓ టీవీ షో ద్వారా ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం కూడా చేశాడు.  అప్పుడు, "అనూజ‌, అవినాష్‌కి ఎంగేజ్‌మెంట్ జరిగింది. కరెక్ట్ పర్సన్ మన జీవితంలోకి ప్రవేశించినప్పుడు ఆలస్యం చేయకూడదు. మా కుటుంబాలు కలిశాయి, మేము కలిశాము. చాలా నిరాడంబరంగా నిశ్చితార్థం జరిగిపోయింది.  మీరు ఎప్పుడూ అడుగుతూ ఉండేవారు.. 'పెళ్లి ఎప్పుడూ?' అని, అతి త్వరలో నా అనూజతో.. ఎప్పటికీ మీ ఆశీర్వాదాలు ఉంటాయని, మీ అవినాష్.. సారీ, అనూజా అవినాష్''.. అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు.   కాగా, పెళ్లి వేడుక‌కు ముందు త‌న ఇంట్లో జ‌రిగిన ప‌సుపు కుంకుమ వేడుక‌కు సంబంధించిన కొన్ని ఫొటోల‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా అవినాశ్ షేర్ చేశాడు.  ఆ ఫొటోల్లో అవినాశ్‌, అత‌ని త‌మ్ముడు అజ‌య్‌, ఇత‌ర కుటుంబ స‌భ్యులు ప‌సుపు బ‌ట్ట‌లు ధ‌రించి సెల‌బ్రేష‌న్స్ చేసుకుంటున్నారు. ప‌సుపు నీటిలో త‌డిసిన అవినాశ్ క‌ళ్ల‌కు బ్లూ గాగుల్స్ పెట్టుకొని ప్ర‌త్యేకంగా క‌నిపిస్తున్నాడు. అత‌డి ముఖంలో పెళ్లి క‌ళ ఉట్టిప‌డుతోంది. పెళ్లి ముహూర్తం ఎప్పుడ‌నేది అవినాశ్ వెల్ల‌డించ‌లేదు. వెడ్డింగ్ కార్డును షేర్ చేయ‌లేదు.

ప్రేమ‌పెళ్లి చేసుకుంద‌ని కూతుర్ని దూరంగా పెట్టిన తండ్రి.. ఆ ఇద్ద‌ర్నీ క‌లిపిన బిగ్ బీ!

  రీల్ లైఫ్‌లోనే కాదు, రియ‌ల్ లైఫ్‌లోనూ తాను బిగ్ బీనేన‌ని ప‌లుమార్లు నిరూపించుకున్న అమితాబ్ బ‌చ్చ‌న్ మ‌రోసారి త‌న గొప్ప మ‌న‌సును చాటుకున్నారు. కొంత కాలంగా మాట‌లు లేకుండా దూరంగా గ‌డుపుతున్న తండ్రీకూతుళ్ల‌ను క‌లిపారు. ఈ సంఘ‌ట‌న 'కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి' సీజ‌న్ 13 ఎపిసోడ్‌లో చోటు చేసుకుంది. సోమ‌వారం ప్ర‌సార‌మైన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న భాగ్య‌శ్రీ త‌యడే అనే యువ‌తి మాట‌ల సంద‌ర్భంగా త‌ను ల‌వ్ మ్యారేజ్ చేసుకోవ‌డంతో, త‌న‌తో మాట్లాడేందుకు తండ్రి నిరాక‌రిస్తూ వ‌స్తున్నాడ‌ని అమితాబ్‌తో చెప్పింది. అంతే కాదు, ఇటీవ‌ల త‌న‌కు పుట్టిన పాప‌ను చూడ్డానికి కూడా ఆయ‌న రాలేద‌ని బాధ‌ప‌డింది. ఆమె క‌థ విని చ‌లించిపోయిన అమితాబ్‌, కెమెరా వంక చూస్తూ తండ్రికి ఏదైనా చెప్ప‌మ‌ని, ఆయ‌న ఈ షో చూస్తుండి ఉండ‌వ‌చ్చ‌ని చెప్పారు. క‌ళ్ల వెంట నీళ్లు కారుతుండ‌గా, తండ్రికి క్ష‌మాప‌ణ‌లు చెప్పింది భాగ్య‌శ్రీ‌. వెంట‌నే ఆమెను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ, ఆమె తండ్రి ఫోన్‌లో లైన్‌లో ఉన్నాడ‌ని చెప్పారు అమితాబ్‌. అలా తండ్రీకూతుళ్లు ఫోన్‌లో మాట్లాడుకునేట్లు చేశారాయన‌. త‌మ మ‌ధ్య కొంత కాలంగా మాట‌లు లేక‌పోయినా, త‌న ఆశీస్సులు ఆమెకెప్పుడూ ఉంటాయ‌ని కూతురితో భాగ్య‌శ్రీ తండ్రి చెప్పారు. ఆమె భ‌ర్త గురించి ఆరా తీసి, అత‌నిని అడిగిన‌ట్లు చెప్ప‌మ‌న్నారు. ఎలాంటి టెన్ష‌న్ లేకుండా ప్ర‌శాంత‌మైన మ‌న‌సుతో గేమ్ ఆడ‌మ‌ని కూతురికి సూచించారు. ఫోన్‌లో తండ్రి త‌న‌తో మాట్లాడ‌టంతో ఆనంద బాష్పాలు రాల్చిన భాగ్య‌శ్రీ‌, 'కేబీసీ'లో పాల్గొన‌డం వ‌ల్లే తండ్రితో మ‌ళ్లీ మాట్లాడ‌గ‌లిగాన‌ని చెప్పింది. ఈ షో త‌న‌కు చాలా ఇంపార్టెంట్ అనీ, త‌ను తొమ్మిది నెల‌ల ప్రెగ్నెంట్‌గా ఉన్న‌ప్పుడు కేబీసీ కోసం ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఇచ్చాన‌నీ వెల్ల‌డించింది. ఈ షోలో రూ. 12.5 ల‌క్ష‌ల ప్రైజ్ మ‌నీ గెలుచుకుంది భాగ్య‌శ్రీ‌.

క‌త్తిలాంటి నువ్వుండ‌గా క‌త్తెందుకు చెప్పు?!

  ఈటీవీలో ప్ర‌సార‌మ‌వుతోన్న పాపుల‌ర్ షోస్‌లో 'శ్రీ‌దేవి డ్రామా కంపెనీ' ఒక‌టి. జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ల‌తో పాటు ప‌లువురు టీవీ సెల‌బ్రిటీలు కూడా పాల్గొంటూ ఉండే ఈ షోకు ఇంద్ర‌జ గెస్ట్ సెల‌బ్రిటీగా స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ అవుతున్నారు. ఈ నెల 24న ప్ర‌సార‌మ‌య్యే ఎపిసోడ్‌లో బిగ్ బాస్ సెల‌బ్రిటీలు సొహేల్ ర్యాన్‌, దేత్త‌డి హారిక డాన్స్ ప‌ర్ఫార్మెన్స్‌లు హైలైట్ కానున్నాయి. అలాగే దివ్యాంగుల, అనాథ బాల‌ల ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో ఈ ఎపిసోడ్ ప్ర‌త్యేకత‌ను సంత‌రించుకోనుంది. 'భీమ్లా నాయ‌క్' గెట‌ప్‌లో లుంగీ క‌ట్టుకొని వ‌చ్చిన సొహేల్‌, బైక్‌పై నిల్చొని చేసిన ప్ర‌ద‌ర్శ‌న‌కు అంతా స్ట‌న్న‌యిపోయారు. ఇంద్ర‌జ "ఏం స్టైలిష్ ప‌ర్ఫార్మెన్స్ అండీ మీది!" అని ప్ర‌శంసించారు. "దిగు దిగు దిగు నాగో" పాట‌కు దేత్త‌డి హారిక చేసిన డాన్సు మ‌తులు పోగొట్టింది. ఆ త‌ర్వాత సొహేల్‌, హారిక క‌లిసి 'సీటీమార్' మూవీలోని పాపుల‌ర్ డ్యూయెట్‌ "జ్వాలారెడ్డి.. జ్వాలారెడ్డి.. తెలంగాణ బిడ్డ‌రో కారాబూంది ల‌డ్డురో"కు ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చారు. వారిద్ద‌రి ఎన‌ర్జీకి అంతా ఫిదా అయిపోయారు. ఇదే వేదిక‌పై హారిక బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ జ‌రిపారు. టేబుల్ మీద కేక్‌ను చూస్తూ హారిక‌, "కేక్ ఉంది ఓకే. కానీ కేక్ కోయ‌నీకి క‌త్తేదీ?" అన‌డిగింది. "క‌త్తిలాంటి నువ్వుండ‌గా క‌త్తెందుకు చెప్పు!" అన్నాడు సొహేల్‌. "ఏ.. బిస్కేట్" అంటూ బ్యాగ్రౌండ్‌లో వినిపించింది. హారిక‌, "కానీ కేండిల్ ఏదిరా?" అని సొహేల్‌ను అడిగింది. ప‌క్క‌నే ఉన్న హైప‌ర్ ఆది, "నువ్వే కేండిల్ అంత ఉన్నావ్‌. మ‌ళ్లీ కొత్త‌గా కేండిల్ ఎందుకు?" అన‌డంతో అంద‌రూ ప‌డీప‌డీ న‌వ్వారు.

'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' షూటింగ్ కంప్లీట్ చేసిన తార‌క్‌!

  బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 1 హోస్ట్‌గా బుల్లితెర‌పై అడుగుపెట్టిన జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రెండోసారి 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' షోతో వ్యూయ‌ర్స్ ముందుకు వ‌చ్చాడు. త‌న‌దైన ఎన‌ర్జీతో హోస్ట్‌గా ఆక‌ట్టుకుంటున్నాడు. జెమిని టీవీలో ప్ర‌సార‌మ‌వుతోన్న ఈ షోకు సంబంధించిన షూటింగ్ మొత్తాన్ని తార‌క్ కంప్లీట్ చేశాడు. 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' షో అన్ని ఎపిసోడ్ల‌ను తార‌క్ పూర్తి చేశాడ‌నీ, వీటిలో మ‌హేశ్‌బాబు, దేవి శ్రీ‌ప్ర‌సాద్‌, త‌మ‌న్ గెస్ట్ కంటెస్టెంట్లుగా పాల్గొన్న ఎపిసోడ్స్ కూడా ఉన్నాయ‌నీ స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపాయి. జూనియ‌ర్ ఎన్టీఆర్ ఎంత‌గా త‌న స‌మ‌య‌స్ఫూర్తితో కంటెస్టెంట్ల‌ను ప్ర‌శ్న‌లు అడుగుతూ, స‌ర‌దాగా వారితో మాట్లాడుతూ ఆక‌ట్టుకుంటున్న‌ప్ప‌టికీ, అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లు 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' వీక్ష‌కాద‌ర‌ణ పొంద‌లేద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. రామ్‌చ‌ర‌ణ్‌తో చేసిన క‌ర్టెన్ రైజ‌ర్ ఎపిసోడ్‌, స‌మంత‌తో చేసిన ఎపిసోడ్‌ల‌కు వ‌చ్చిన ఆద‌ర‌ణ రెగ్యుల‌ర్ కంటెస్టెంట్ల‌తో చేసిన ఎపిసోడ్ల‌కు రాలేదు. ఏదేమైనా ఈ షోకు హోస్ట్‌గా చేయ‌డం ద్వారా భారీ పారితోషికాన్ని అందుకున్నాడు తార‌క్‌. వ‌చ్చే ఏడాది కూడా ఈ షో సీజ‌న్‌కు ఆయ‌న హోస్ట్‌గా కంటిన్యూ అవుతాడో, లేదో చూడాలి. సినిమాల విష‌యానికి వ‌స్తే, ఇప్ప‌టికే 'ఆర్ఆర్ఆర్' షూటింగ్‌ను కంప్లీట్ చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్‌, త‌దుప‌రి సినిమా కోసం మేకోవ‌ర్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. తార‌క్ న‌టించే ఈ 30వ సినిమాకు కొర‌టాల శివ ద‌ర్శ‌కుడు.

మంగ‌ళ‌సూత్రంతో సురేఖావాణి.. రెండో పెళ్లి చేసుకుందంటూ ప్ర‌చారం!!

  మొద‌ట బుల్లితెర‌పై, త‌ర్వాత వెండితెర‌పై రాణించిన తార సురేఖావాణి. త‌న‌దైన సొంత అస్తిత్వంతో, వ్య‌క్తిత్వంతో ముందుకు సాగుతూ, ముక్కుసూటిగా మాట్లాడే మ‌నిషిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. అంద‌చందాలు, అభిన‌య సామ‌ర్థ్యం క‌లిగిన ఆమె క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో స్థానం సంపాదించుకున్నారు. సోష‌ల్ మీడియాలోనూ ఆమె చాలా యాక్టివ్‌గా ఉంటార‌నే విష‌యం చాలామందికి తెలిసిందే.  2019లో సురేఖావాణి భ‌ర్త సురేశ్ తేజ అనారోగ్యంతో మృతి చెందారు. ఆ త‌ర్వాత కూడా ఆమె బోల్డ్‌గా క‌నిపిస్తూ రావ‌డంపై సోష‌ల్ మీడియాలో కొంత‌మంది ట్రోల్ చేయ‌డం, దానికి త‌న‌దైన శైలిలో ఆమె ధైర్యంగా స‌మాధానాలివ్వ‌డం కూడా మ‌న‌కు తెలుసు. కూతురు సుప్రీత‌తో క‌లిసి డాన్సులు చేస్తూ, వెకేష‌న్స్‌లో స‌ర‌దాగా గ‌డుపుతూ ఆమె చేసే పోస్టులు అభిమానుల‌ను అల‌రిస్తుంటాయి. కాగా ఇప్పుడు మెడ‌లో మంగ‌ళ‌సూత్రంతో ఉన్న ఫొటోను త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఆమె షేర్ చేయ‌డంతో నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఆమె ర‌హ‌స్యంగా రెండో పెళ్లి చేసుకుందేమోన‌ని కొంత‌మంది అనుమానం వ్య‌క్తం చేయ‌గా, ఏదైనా సినిమా షూటింగ్‌లో భాగంగా మంగ‌ళ‌సూత్రం ధ‌రించిందేమోన‌ని కొంత‌మంది భావించారు. అలాగే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్' లోని హిట్ సాంగ్ "లెహ‌రాయీ"కి చేసిన ప‌ర్ఫార్మెన్స్ వీడియోలోనూ ఆమె మంగ‌ళ‌సూత్రంతో క‌నిపించారు. దీనిని కూడా ఆమె షేర్ చేశారు. ఇదివ‌ర‌కు ఓసారి కూడా సురేఖావాణి సెకండ్ మ్యారేజ్ విష‌యం సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేసింది. అయితే త‌ను మ‌ళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాన‌నే విష‌యంలో నిజం లేద‌ని అప్ప‌ట్లో ఆమె తేల్చి చెప్పారు. కుమార్తె సుప్రీత‌తో క‌లిసి ఒంట‌రిగానే ఉంటున్నాన‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. జీవిత భాగ‌స్వామిని కోల్పోయి కూడా నిబ్బ‌రంగా ఉంటూ, హుషారుగా క‌నిపించే సురేఖావాణిపై ఆమె తోటి న‌టులు ప్ర‌శంస‌లు కురిపిస్తుంటారు.

'బిగ్ బాస్'లో ట్విస్ట్: సీక్రెట్ రూమ్‌లో లోబో!

  హౌస్‌లో మెంబ‌ర్స్‌కు బిగ్ బాస్ షాక్ ఇచ్చాడు. వాళ్ళ‌కు తెలియ‌కుండా ట్విస్ట్ ప్లే చేశాడు. కొంచెం తెలివిగా ఆలోచిస్తే... హౌస్ మెంబ‌ర్స్ క‌నిపెట్ట‌డం క‌ష్ట‌మేమీ కాదేమో! అయితే, ఎలిమినేషన్ విషయంలో చిన్న ట్రిక్ ప్లే చేశారు. ఆడియ‌న్స్‌కు ఇది కిక్ ఇచ్చే అంశ‌మే. మున్ముందు ఎపిసోడ్స్‌లో గేమ్ ఇంట్రెస్టింగ్‌గా ఉండ‌బోతుంద‌ని హింట్ ఇచ్చింది. అసలు, ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే...  ప్రతి వారం 'బిగ్ బాస్' నుండి ఒకరు ఎలిమినేట్ అవుతుంటారు. ఐదో వారం హమీదా ఎలిమినేట్ అయ్యింది. ఆరో వారం లోబోను ఎలిమినేట్ చేస్తున్నట్టు కలరింగ్ ఇచ్చారు. అతడిని నాగార్జున స్టేజి మీదకు పిలిచారు. అయితే, షో నుండి బయటకు పంపకుండా సీక్రెట్ రూమ్‌లోకి పంపించారు. ఇది లాస్ట్ వీక్ ట్విస్ట్. సాధారణంగా 'బిగ్ బాస్' నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల చేత ఇంటిలో సభ్యుల గురించి పాజిటివ్, నెగెటివ్ అభిప్రాయాలు తీసుకోవడం కామన్. అయితే, లోబోతో అవేవీ చెప్పించలేదు. ఈ యాంగిల్ నుండి ఆలోచిస్తే... లోబో ఎలిమినేట్ కాలేదనే సంగతి ఈజీగా అర్థమవుతుంది. మరి, ఎవరు ఆ విషయం ముందు పసిగడతారో చూడాలి. ఇక, బిగ్ బాస్ నుండి ఆరో వారం నటి శ్వేతా వర్మ ఎలిమినేట్ అయ్యింది. 

నాకే నీ బుగ్గ‌లు కొర‌కాల‌ని అనిపిస్తోందిరా!

  బుల్లితెరపై స్టార్ కమెడియన్ 'సుడిగాలి' సుధీర్‌, స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ మధ్య 'ఎక్స్ట్రా జబర్దస్త్', 'ఢీ' షోల్లో రన్ చేసే లవ్ ట్రాక్ గురించి అందరికీ తెలిసిందే. దాంతో పాటు సుధీర్ మీద అందరూ పంచ్ డైలాగ్స్ వేస్తుంటారు. అమ్మాయిల్ని ఈజీగా పడేస్తాడని. అక్కడితో ఆగకుండా తనను తీసుకువెళ్లడం లేదంటూ ఆది కామెడీ చేస్తుంటాడు.  రోజా కూడా సుధీర్‌పై అప్‌క‌మింగ్ ఎపిసోడ్‌లో సేమ్ టాపిక్ మీద సెటైర్స్ వేశారు. 'కెవ్వు' కార్తీక్ స్కిట్‌లో సుధీర్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చాడు. అందులో ఓ అమ్మాయితో డాన్స్ చేశాడు. వాళ్లిద్దరూ 'మురారి' సినిమాలో 'అలనాటి రామచంద్రుడికి అన్నింటా సాటి...' పాటకు పెర్ఫార్మన్స్ చేయడం చూస్తుంటే... పెళ్లి స్కిట్ టైపు ఉంది. ఆ పాట పూర్తయిన తర్వాత 'లాస్ట్ వీక్ వచ్చింది. అప్పుడే సెట్ చేసేశావా?' అని సుధీర్ మీద రోజా డైలాగ్ వేశారు. 'నేనేం చెయ్యలేదండీ బాబు' అంటూ సుధీర్ వివరణ ఇచ్చుకున్నాడు. 'బాబోయ్' అంటూ రోజా దణ్ణం పెట్టారు.  తర్వాత 'వీడిని ఎలా ప్రేమించావు?' అని ఆ అమ్మాయిని కార్తీక్ ప్రశ్నిస్తే... 'ఒక్కటే మాట చెప్పాడు' అన్నది. వెంటనే 'నేను ఏడిస్తే నువ్వు చచ్చిపోతావో లేదో గానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతా' - రష్మీకి సుధీర్ చెప్పిన డైలాగును రోజా చెప్పారు. స్టేజి మీద సుధీర్ నవ్వుతూ నిలబడ్డాడు. 'అదే డైలాగ్' అని అమ్మాయి అనడంతో 'ఇదే డైలాగ్ ఎంతమందికి చెబుతావురా?' అని సుధీర్ ను కార్తీక్ ప్రశ్నిస్తాడు. 'నాకు అదొక్కటే వచ్చు. ఇక్కడ వర్కవుట్ అయ్యింది' అన్నాడు సుధీర్.  ప్రతి వారం 'ఎక్స్ట్రా జబర్దస్త్' ప్రోగ్రామ్ ప్రారంభంలో ఒక పాటకు రష్మీ గౌతమ్ డాన్స్ చేస్తుంది. కొత్త ప్రోమోలో రష్మీని ఇమిటేట్ చేస్తూ నాటీ నరేష్ డాన్స్ చేయడం చూపించారు. సిగ్గుతో రష్మీ చీర కొంగును ముఖానికి అడ్డుపెట్టుకుంది. అయితే, రోజా మాత్రం 'ఒరేయ్! నాకే నీ బుగ్గలు కొరకాలని అనిపిస్తుందిరా. అంత క్యూట్ గా ఉన్నావ్' అని కాంప్లిమెంట్ ఇచ్చారు. దాంతో న‌రేశ్ తెగ సిగ్గుప‌డిపోయాడు.

స‌మంత గెలిచిన రూ. 25 ల‌క్ష‌ల‌కు తార‌క్ ఎవ‌రి పేరిట‌ చెక్కు రాశాడో తెలుసా?!

  జూనియ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' షోలో ద‌స‌రా పండ‌గ రోజు గెస్ట్ కంటెస్టెంట్‌గా అప్పీరెన్స్ ఇచ్చింది స‌మంత రూత్ ప్ర‌భు. నాగ‌చైత‌న్య‌తో విడిపోయిన‌ట్లు అనౌన్స్ చేశాక ఆమె క‌నిపించిన ఫ‌స్ట్ ప‌బ్లిక్ అప్పీరెన్స్ ఇదే. ఈ ఎపిసోడ్ అంతా ఫ‌న్ మోడ్‌తో జ‌ర‌గ‌గా, తార‌క్ అడిగిన స‌ర‌దా ప్ర‌శ్న‌ల‌కు అంతే స‌ర‌దాగా స‌మాధానం చెప్ప‌డానికి ట్రై చేసింది స‌మంత‌. అయితే ఇదివ‌ర‌క‌టి జోష్ ఆమెలో క‌నిపించ‌లేద‌నేది నిజం. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే తార‌క్ అడిగిన ప్ర‌శ్న‌ల్లో చాలావ‌ర‌కు ఏదో విధంగా స‌మంత జీవితానికి సంబంధించిన‌వే. వ‌ర్కవుట్స్‌, డాగ్స్‌, 'శాకుంత‌లం' మూవీతో అనుసంధాన‌మైన పురాణానికి సంబంధించిన ప్ర‌శ్న‌లు ఉన్నాయి. 'ఆర్ఆర్ఆర్' మూవీ టీజ‌ర్స్ గురించి మాట్లాడిన స‌మంత‌.. ఆ సినిమా క‌థానాయ‌కులు జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ ఇద్ద‌రినీ ప్ర‌శంసించింది. అమిత‌మైన టాలెంట్ ఉన్న‌వాళ్లుగా కీర్తించింది. ఆ వెంట‌నే తార‌క్‌, "అప్ప‌ట్లో సావిత్రిగారు మ‌హాన‌టి, నువ్వు ఈనాటి మ‌హాన‌టి. మ‌హాన‌టికి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ నీకున్నాయి" అని ప్ర‌స్తుతించాడు. గెస్ట్ కంటెస్టెంట్ గెలుచుకోవ‌డానికి అవ‌కాశ‌మున్న రూ. 25 ల‌క్ష‌ల‌ను స‌మంత గెలిచింది. ఈ షోలో గెలిచిన ప్రైజ్ మ‌నీని గెస్ట్‌లు చారిటీకి ఇవ్వ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. స‌మంత కూడా త‌ను న‌డుపుతోన్న ప్ర‌త్యూష స‌పోర్ట్‌కు ఈ ప్రైజ్ మ‌నీని ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. తార‌క్ కూడా ఆమె గెలుచుకున్న మ‌నీకి సంబంధించిన చెక్కుపై 'ప్ర‌త్యూష స‌పోర్ట్' పేరిటే రాశాడు. ఆ చెక్కు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

టార్గెట్ చేసిన హౌస్‌మేట్స్‌.. జైలులో కాజల్!

  'బిగ్ బాస్‌-5' హౌస్‌లో మెంబర్స్‌లో మెజార్టీ సెక్ష‌న్ ఆర్జే కాజ‌ల్‌ను టార్గెట్ చేశారా? ఎక్కువ మంది ఆమెను వ‌ర‌స్ట్ ప‌ర్ఫార్మ‌ర్‌గా పేర్కొనడం చూస్తుంటే... అదే సందేహం కలుగుతోంది. దీనికి యాంకర్ రవి వేసిన ప్లాన్ మెయిన్ రీజన్ అని చెప్పుకోవాలి.  శ్రీరామచంద్ర జైలుకు వెళ్లకుండా చూడడం కోసం కాజల్ మీద వరస్ట్ ప‌ర్ఫార్మ‌ర్‌ ముద్ర వేయాలని రవి తన టీమ్ సభ్యులతో డిస్కషన్ పెట్టాడు. వాళ్లంతా అదే విధంగా చేశారు. దాంతో కాజల్ జైలుకు వెళ్లక తప్పలేదు. కాజల్ సింపతీ కార్డ్ ప్లే చేస్తున్నదని రవి అభిప్రాయపడ్డాడు. వరస్ట్ ప‌ర్ఫార్మ‌ర్‌గా సెలెక్ట్ అవుతుందని తనకు కూడా తెలుసునని అతడు చెప్పాడు. ఎవరిని దోషిగా అనుకుంటున్నారో చెప్పమని హౌస్‌లోని సభ్యులను బిగ్ బాస్ అడిగాడు. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు జైలుకు వెళ్లాలి. కాజ‌ల్‌కు శ్వేత, హమీద, శ్రీరామచంద్ర, యానీ మాస్టర్, లోబో, రవి ఓటు వేయడంతో ఆమె జైలుకు వెళ్ళింది.  ఓటింగ్ ప్రక్రియలో రవి, కాజల్ మధ్య వాగ్వాదం జరిగింది. తనపై కాజల్ తప్పుడు ఆరోపణలు చేస్తుందని రవి అన్నాడు. 'ఎవరి మీద చెయ్యి ఎత్తకు. నొప్పి అయితది. పద్ధతి తెలుసుకో' అని రవి చెబుతుంటే... 'నువ్వు నాకు పద్ద్ధతులు నేర్పించాల్సిన అవసరం లేదు' అని కాజల్ కౌంటర్ ఇచ్చింది. అయినా రవి తగ్గలేదు. 'నీ పీరియడ్లు నీ క్లాసులో పెట్టుకో ఈడ కాద'ని అన్నాడు.

శ్రీ‌ముఖిని ఎత్త‌లేక చ‌తికిల‌ప‌డ్డ ష‌క‌ల‌క శంక‌ర్‌!

  యాంకర్‌, యాక్ట్సెస్‌ శ్రీముఖి ముద్దుగా, కొంచెం బొద్దుగా ఉంటుంది. ఓ విధంగా చెప్పాలంటే... భారీ పర్సనాలిటీ. రెగ్యులర్‌గా యాంకర్లు, హీరోయిన్లు మెయిన్‌టైన్‌ చేసే వెయిట్‌ కంటే శ్రీముఖి వెయిట్‌ ఎక్కువే. అయినా అందంగా ఉంటుంది. చ‌క్క‌గా యాంకరింగ్‌, యాక్టింగ్‌ చేస్తుంది. అందుకని, ఆమెకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. శ్రీముఖి వెయిట్‌ ఎంతనేది అంచనా వెయ్యకుండా ఎత్తుకోవాలని ‘షకలక’ శంకర్‌ ట్రై చేశాడు. అయితే, అతడి వల్ల కాలేదు. దాంతో అతడే కింద పడ్డాడు. ఆదివారం జీ తెలుగులో టెలికాస్ట్‌ కానున్న ‘దసరా దోస్తీ’లో నవ్వించే ఈ సంఘటన చోటు చేసుకుంది. శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా నటించిన ‘పెళ్లి సందడి’ విజయదశమికి విడుదల కానుంది. సినిమా ప్రమోషన్‌ కోసం ‘షకలక’ శంకర్‌తో కలిసి ‘దసరా దోస్తీ’కి వచ్చాడు. శ్రీముఖిని ఎత్తుకోవడానికి విఫల యత్నం చేశాక... ‘ఈ బొప్పాయి మామూలు బొప్పాయి కాదు అల్లుడు’ అని  ‘షకలక’ శంకర్‌ డైలాగ్‌ చెప్పాడు. మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌ కూడా ‘దసరా దోస్తీ’లో సందడి చేశాడు. అతడితో స్టెప్పులేసిన భానుశ్రీ.. శ్రీముఖిని ఆటపట్టించే ప్రయత్నం చేసింది. దాంతో ‘నాలోని సేతుపతిని నిద్రలేపకు’ అని శ్రీముఖి అంటే... ‘మీరు మీరు గొడవపడి సేతుపతి అంటే నా దగ్గరకు వస్తుందండీ’ అని వైష్ణవ్‌ అన్నాడు. మొత్తం మీద ‘ఉప్పెన’ ప్రస్తావన వస్తే... క్లైమాక్స్‌ టాపిక్‌ ఎక్కడ వస్తుందోనని అవాయిడ్‌ చేస్తున్నట్టు ఉన్నాడు.

నీకే ఒకడు డబ్బింగ్‌ చెప్పాలి.. నువ్వు ఇంకొకడికి డబ్బింగా?

  యాంగ్రీ స్టార్‌ రాజశేఖర్‌ మేనరిజమ్‌ను కాపీ కొట్టి కామెడీ చేసినోళ్లు వున్నారు. సినిమాల్లో అయితే ‘గబ్బర్‌ సింగ్‌’లో రాజశేఖర్‌ మీద చేసిన సీన్‌ హైలైట్‌ అయ్యింది. టీవీల్లో అయితే ‘జబర్దస్త్‌’ స్టేజి మీద కొంతమంది కామెడీ చేశారు. లేటెస్ట్‌గా రాజశేఖర్‌ను ఇమిటేట్‌ చేస్తూ... ‘చలాకి’ చంటి స్కిట్‌ చేశాడు. అందులో అతడితో పాటు టీమ్‌ మెంబర్స్‌ బాబీ, నూకరాజు కూడా రాజశేఖర్‌ ‘అల్లరి ప్రియుడు’, ‘శేషు’ సినిమాల్లో క్యారెక్టర్లను అదే స్కిట్‌లో ఇమిటేట్‌ చేశారు. ఇమిటేషన్లు కామనే. కానీ, ఓ డైలాగ్‌ మాత్రం అభ్యంతరకరంగా ఉంది. ‘ఎక్కడికి వెళ్లావురా? లేట్‌ అయ్యింది??’ అని ఒకరు అడిగితే... ‘నేను సినిమా ఆఫీసుకు వెళ్లి డబ్బింగ్‌ చెప్పి వచ్చినాను’ అని తమిళ యాసతో మిక్స్‌ చేసిన తెలుగులో బాబీ ఆన్సర్‌ ఇచ్చాడు. వెంటనే ‘నీకే ఒకడు డబ్బింగ్‌ చెప్పాలి. నువ్వు ఇంకొకడికి డబ్బింగా?’ అని చంటి అన్నాడు. రాజశేఖర్‌ చూస్తే ఆయన కొంచెం నొచ్చుకునే డైలాగ్‌ ఇది. రోజా అంత ఆలోచించారో? లేదంటే మనసులో ఉన్నది చెప్పారో? జడ్జ్‌మెంట్‌లో ఆవిడ చెప్పిన మాటలు వింటుంటే కవరింగ్‌లా ఉంది. ‘‘బావుంది చంటి. ఎన్టీఆర్‌గారిని, నాగేశ్వరరావు, నాగార్జునగారిని మనం మళ్లీ గుర్తు చేసుకుంటున్నాం. వాళ్లను ఇష్టపడుతున్నాం కాబట్టే. సో... ఆ విధంగా ఒక మంచి ఆర్టిస్టును అందరూ ఒకేలా చేయడం బావుంది’’ అని రోజా జడ్జ్‌మెంట్‌ ఇచ్చారు. రాజశేఖర్‌ మంచి ఆర్టిస్టు అని ఆవిడ చెప్పారు. అందులో సందేహం లేదు. అంతకు ముందు ‘నీకే ఇంకొకరు డబ్బింగ్‌ చెప్పాలి’ అని చంటి అన్నాడు. దానికి ఆవిడ జడ్జ్‌మెంట్‌ కవరింగ్‌లా ఉందనేది కొందరి అభిప్రాయం.

తారక్ షోకి గెస్ట్ గా సమంత!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యుల కోసం డిజైన్ చేసిన ఈ షోలో అప్పుడప్పుడు సెలబ్రిటీలు కూడా సందడి చేస్తున్నారు. త్వరలో ఈ షోలో సమంత సందడి చేయనుందని తెలుస్తోంది. ఎవరు మీలో కోటీశ్వరులు షోలో ఇప్పటికే రామ్ చరణ్, రాజమౌళి, కొరటాల శివ వంటి సెలబ్రిటీలు పాల్గొన్నారు. మహేష్ బాబు కూడా ఈ షోలో పాల్గొన్నారని.. త్వరలోనే ఆ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సమంత వంతు వచ్చింది. సమంత తన మేనేజర్ మహేంద్రతో కలిసి ఈ షోలో అందుకున్న చెక్ ను చూపిస్తూ ఓ ఫోటో దిగింది. ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో సమంత తారక్ షోలో పాల్గొన్నదని.. ఇప్పటికే ఎపిసోడ్ షూటింగ్ కూడా అయిపోయిందని అర్థమవుతోంది. 'ఎవరు మీలో కోటీశ్వరులు' లో సమంత పాల్గొన్నదన్న న్యూస్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే సమంత తన భర్త నాగ చైతన్యతో విడిపోతునట్లు ప్రకటించింది. విడాకుల ప్రకటన తర్వాత సమంత పాల్గొంటున్న ఫస్ట్ షో కావున.. మునుపటిలా సమంత యాక్టివ్ మాట్లాడుతుందా లేదా చూడాలన్న ఆసక్తి నెలకొంది. మరోవైపు ఎన్టీఆర్, సమంత కలిసి నాలుగు సినిమాల్లో కలిసి నటించారు. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. మరి షోలో సమంత వ్యక్తిగత విషయాల గురించి ఎన్టీఆర్ ఏమైనా అడుగుతారా? ఒకవేళ అడిగితే సమంత ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. 

'బిగ్ బాస్'లో అరుపులు దాటి కొట్లాట వరకూ...

'బిగ్ బాస్‌'లో కంటెస్టెంట్లు మ‌రీ మాస్‌గా ఉన్నార‌ని స్టార్టింగ్ డే కొంత‌మంది కామెంట్ చేశారు. అందుకు తగ్గట్టుగా ఎలిమినేట్ అయినవాళ్లు ఆగ్రహావేశాలు, మాటల తూటాలతో రెచ్చిపోయారు. హౌస్‌లో ఉన్న‌ మిగతావాళ్ళు కొంచెం బెటర్ అనుకుంటే, మొన్నటి వారం నామినేషన్స్‌లో ప్రియా మీద లోబో అరిచాడు. అయ్యిందేదో అయ్యిందనుకుంటే... ఇప్పుడు అంతకు మించి అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. అరుపులు, మాటల తూటాలు దాటుకుని కొట్లాటలు వరకూ వచ్చారు. 'బిగ్ బాస్' ఇచ్చిన టాస్క్‌లు కూడా కొట్లాటకు పనికొచ్చాయి. 'రాజ్యానికి ఒక్కడే రాజు' అని ఒక టాస్క్ ఇచ్చారు. అందులో రవి, సన్నీ రాకుమారులు. మిగతావాళ్ళు ప్రజలు. ఎవరికీ ఎక్కువ మద్దతు ఉంటే వారే రాజు. సోమ, మంగళ వరాలు టాస్క్ జరిగింది. అందులో భాగంగా 'మట్టిలో మహాయుద్ధం' అంటూ ఒక పోటీ పెట్టారు. అది కొంత వరకు పర్వాలేదు.  'రాజుగారి గోడ' అని మరో టాస్క్ ఇచ్చారు. అందులో రవి, సన్నీ పేరు మీద రెండు గోడలు ఉంటాయి. వాటిపై ఫోటోలు అతికించాలి. ఎవరి ఫోటోలు గోడ మీదకు ఎక్కువ వస్తే వారే విజేతలు. ఇందులో మానస్, విశ్వ కొట్టుకున్నట్టు చేశారు. శ్రీరామచంద్ర, జెస్సీ అయితే నిజంగా కొట్టుకున్నారు. ఇద్దరికీ చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. అరుపులు, గొడవల వరకూ ఓకే కానీ దెబ్బలు తగిలేలా కొట్టుకోవడం ఏంటో? అని కొందరు ఆడియన్స్ విస్తుపోయారు.

మళ్ళీ మల్లెమాల గూటికి శేఖర్ మాస్టర్!

డాన్స్ రియాలిటీ షో 'ఢీ'తో శేఖర్ మాస్టర్ వెలుగులోకి వచ్చారు. ఆ షోతో అతడికి ఎంతో పేరొచ్చింది. ఆ తర్వాత కొరియోగ్రాఫర్‌గా పేరొచ్చిన తర్వాత జడ్జ్‌గా పేరు తీసుకొచ్చినది కూడా 'ఢీ' షోనే. అటువంటి 'ఢీ' నుండి శేఖర్ మాస్టర్ బయటకు రావాల్సి వచ్చింది. స్టార్ మా ఛాన‌ల్‌లో 'కామెడీ స్టార్స్'లో జ‌డ్జ్‌గా చేస్తుండటంతో మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ 'ఢీ' నుండి అతడిని తప్పించింది. గణేష్ మాస్టర్‌ను జ‌డ్జ్‌గా తీసుకొచ్చింది. ఇప్పుడు చాలా రోజుల తర్వాత మల్లెమాల గూటిలో శేఖర్ మాస్టార్‌కు చోటు దక్కింది. 'జబర్దస్త్', 'ఎక్ట్రా జబర్దస్త్', 'ఢీ', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' వంటి షోలు ప్రొడ్యూస్ చేయడంతో పాటు ఫెస్టివల్ స్పెషల్ కింద పండగలకు ఈటీవీ కోసం మల్లెమాల ఈవెంట్లు చేస్తుంది. దసరా కోసం చేసిన ఈవెంట్‌లో శేఖర్ మాస్టర్ ఉన్నారు.  రోజా, శేఖర్ మాస్టర్ ఈవెంట్స్‌లో చేసే డాన్స్ పెర్ఫార్మన్స్‌లు హిట్ అయ్యాయి. అలాగే, గతంలో సదాతో కలిసి 'ఢీ' జ‌డ్జ్‌గా చేశారు శేఖర్. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోయిన్లతో కలిసి 'దసరా బుల్లోళ్ళు' కార్యక్రమంలో స్టెప్పులు వేశారు.

ఏంటీ సాగదీత... 'కార్తీక దీపం' ముందుకు కదలట్లేదుగా!

'కార్తీక దీపం' సీరియ‌ల్‌కు తిరుగులేదు. వీక్ష‌కాద‌ర‌ణ‌లో బుల్లితెర‌పై దాన్ని మించినది లేదు. అందులో ఎటువంటి సందేహాలు అవ‌స‌రం లేదు. సీరియ‌ల్‌కు వ‌స్తున్న టీఆర్పీ రేటింగ్‌లు చూస్తే ఆ సంగ‌తి తెలుస్తుంది. అయితే, గత కొన్ని రోజులుగా సీరియల్‌ను సాగదీస్తున్న ఫీలింగ్ కొంతమందికి కలుగుతోంది. మోనిత జైలుకు వెళ్లినప్పటి నుండి కథ పెద్దగా ముందుకు కదల్లేదు. మోనిత జైలుకు వెళ్లిన తర్వాత కార్తీక్, దీప ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారని ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్‌ చేశారు. జైలు నుండి మాయలేడి కొత్త పన్నాగాలు పన్నుతుండంతో ఏం చేస్తుందోననే క్యూరియాసిటీ కలిగింది. దానికి తగ్గట్టుగా కథనం, సన్నివేశాలు లేవని కొందరు కామెంట్ చేస్తున్నారు. కార్తీక్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని మోనిత తన కథను పేపర్‌లో వేయించింది. అక్కడి నుండి అది పిల్లలకు ఎక్కడ తెలుస్తుందోనని కార్తీక్, దీప, సౌందర్య కంగారు పడటం... ఎమోషనల్ సీన్లు చూపించడం మినహా పెద్దగా కథ ముందుకు కదలడం లేదు.  హార్ట్ ఎటాక్ అని జైలు నుండి నాటకం ఆడిన మోనిత, బయటకు రావడం ఆడియ‌న్స్‌కు షాక్‌, స‌ర్‌ప్రైజ్ వంటివి ఇవ్వలేదు. గతంలో చచ్చినట్టు నాటకం ఆడి, మారువేషంలో కార్తీక్ చుట్టూ తిరిగిన మోనిత... హార్ట్ ఎటాక్ వచ్చినట్టు నటించి కార్తీక్ ఆస్పత్రికి రావడం పెద్ద విశేషమా? వచ్చిన తర్వాత కూడా కార్తీక్ పిల్లల దగ్గర తండ్రిని దోషి కింద ప్రాజెక్ట్ చేసింది. దాంతో పిల్లలు మళ్లీ ఏడవడం, తండ్రికి దూరంగా ఉండటం, నానమ్మ సౌందర్య వాళ్లకు నచ్చజెప్పాలని చూడటం... సేమ్ సీన్లు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నట్టు ఉన్నాయని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా... సీరియల్ రేటింగ్ మాత్రం టాప్ లో ఉండటం గమనార్హం.

నాకు అలా ఎవ‌రైనా చూపిస్తే క‌ట్ చేసి పారేస్తా!

  ఆర్జే కాజల్ మీద యాంకర్ రవికి ఒక రేంజ్‌లో కోపం వచ్చింది. కానీ, కంట్రోల్ చేసుకున్నాడు. బహుశా... కోప్పడితే మహిళా ప్రేక్షకులకు దూరం అవుతానని అనుకున్నాడేమో! గతంలో లహరి, ప్రియ ఇష్యూలో తాను అన్న మాటలను అనలేదని అనడం, తర్వాత నాగార్జున ఆధారాలతో సహా చూపించడంతో చాలా బ్యాడ్ అయ్యాడు. అందుకు క్షమాపణలు కోరాడనుకోండి. ఇక, లేటెస్ట్ ఇష్యూకు వస్తే...  'బిగ్‌బాస్ 5' మంగళవారం ఎపిసోడ్‌లో రవి, లోబో దగ్గరకు వచ్చి 'ఈ రోజు డిన్నర్‌కు ఏం చేస్తున్నారు?' అని కాజల్ అడిగింది. వాళ్లు ఏదో చెప్పబోతుండగా... "నిన్న గొడవ జరిగింది దేనికంటే? రవి, లోబో వాష్‌రూమ్ నుండి డిన్న‌ర్‌కు రావ‌డానికి" అంటూ ఆట పట్టించాలని అనుకుంది. కానీ, అక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ఇన్‌డైరెక్ట్‌గా కాజ‌ల్‌కు లోబో మిడిల్ ఫింగ‌ర్ చూపించాడు. ఆ విషయం కాజల్ ఇతర సభ్యులతో చెప్పగా 'నాకు అలా ఎవరైనా చూపిస్తే కట్ చేసి పారేస్తా' అని ప్రియాంక చెప్పింది. ఈలోపు రవి, లోబో అక్కడికి వచ్చారు.  'నేను సరదాగా అన్నాను' అని కాజల్ సర్దిచెప్పుకోవడానికి ప్రయత్నించింది. 'నీకు సరదా ఏమో! అవతలి వ్యక్తికి కాదు. అది తెలుసుకోకుండా ఎలా వస్తారు? నా నోటి నుండి తప్పుడు మాటలు వస్తాయేమో అని కంట్రోల్ చేసుకున్నా' అని రవి సీరియస్ అయ్యాడు. తర్వాత కాజల్, రవి మధ్య మాట మాట పెరిగి ఒకరి మీద మరొకరు అరుచుకున్నారు. లోబో మిడిల్ ఫింగర్ చూపించడం ప్రాబ్లమ్ కాదా? అని రవిని కాజల్ ప్రశ్నించింది. దీన్ని శ్రీరామచంద్ర పరిష్కరించడానికి ప్రయత్నించాడు.   

'బిగ్ బాస్' గురించి 'క్యాష్'లో మాట్లాడితే ఎడిటింగే!

  ఎంటర్టైన్మెంట్ ఛానళ్ల మధ్య పోటీ ఎంతలా ఉందనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ. తమకు పోటీ ఛానల్‌లో ఒక షో పేరు మరొక ఛానల్‌లోని షోలో చెప్పడానికి వీల్లేని పరిస్థితి. అవునా? నిజమా? అని ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. నిజమే! 'క్యాష్' కొత్త ప్రోమో చూస్తే... ఆ సంగతి తెలుస్తుంది. అసలు వివరాల్లోకి వెళితే... దేత్తడి హారిక, మెహబూబ్‌, జోర్దార్ సుజాత, దర్శకుడు సూర్య కిరణ్... న‌లుగురూ గతంలో 'బిగ్ బాస్' హౌస్‌కు వెళ్లి వచ్చినవారే. "హౌస్‌లో ఆడి ఆడి గేమ్స్ అనగానే అలర్ట్ ఇంక" అని దేత్తడి హారిక అన్నది. సుమ వెంటనే అలర్ట్ అయ్యింది. "మీకు తెలుసుగా! అది వేరే హౌస్‌. ఇది వేరే హౌస్‌. వీలైనంతవరకూ అది చెప్పకుండా ఉంటేనే బెటర్. లేకపోతే అయ్యో.. అంతా ఎడిటింగ్ లో వెళ్ళిపోయింది. నేను ఇంత మాట్లాడానే? ఏం లేదే? అనుకోవాలి" అని సుమ  చెప్పారు. అదీ సంగతి! పక్క ఛానల్ లో షో పేరు తీయకూడదు కానీ... అక్కడి షోలను పేరడీ చేయొచ్చనుకుంట. 'ఇక నుండి ప్రశ్నలు మావి. సమాధానాలు మీవి. మా డబ్బులు మా దగ్గరే ఉంటాయి. మీ డబ్బులు మీ దగ్గరే ఉంటాయి. మీలో ఎవరు క్యాషాధికారి' అంటూ 'ఎవరు మీలో కోటీశ్వరులు'ను స్పూఫ్ చేశారు సుమ. అన్నట్టు... స్టార్‌మా ఛాన‌ల్‌లో 'బిగ్ బాస్' రియాలిటీ షో, ఈటీవీలో 'క్యాష్'  ప్రసారం అవుతాయి.