కమలానికి ఉక్కు సంకెళ్లు...

భారతీయ జనతా పార్టీ కి లోక్ సభలో 303 మంది సభ్యులున్నారు, మిత్ర పక్షాలను కలుపుకుంటే ఆ సంఖ్య 350 దాటుతుంది. రాజ్య సభలో సెంచరీకి చేరువలో ఉంది.అన్ని రాష్టాలలో కలిపి దేశం మొత్తంలో కమలం గుర్తుమీద గెలిచిన  ఎమ్మెల్ల్యేలు1374 మంది ఉన్నారు. దేశం మొత్తంలో ఉన్న రాష్ట్రాలు 29 అయితే అందులో 12 రాష్ట్రాలలో బీజేపీ సొంత ప్రభుత్వాలున్నాయి. మరో ఆరు రాష్ట్రాలలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాలలో భాగస్వామ్య పక్షంగా ఉంది. దేశంలోనే కాదు మొత్తం ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ బీజేపీ ... అంతే కాదు, పార్టీ సభ్యత్వం లేకుండా ఐడియాలజికల్ కమిట్మెంట్’తో పనిచేసే అదృశ్య కార్యకర్తలు దేశ విదేశాల్లో లక్షల్లో ఉన్నారు.  అయితే, ఇంత బలం, బలగం ఉన్న బీజేపీ, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో మాత్రం ఆటలో అరటి పండుగానే మిగిలిపోతోంది. గత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు రాలేదు. కనీసం కాసింత గౌరవప్రదమైన ఓట్లయినావచ్చాయా,అంటే అదీలేదు.నిండా ఒక శాతం ఓట్లు రాలేదు.  చివరకు ‘నోటా’ కు వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదు.  అలాగని, రాష్ట్రంలో పార్టీకి పునాదులు లేవా ... అంటే రాష్ట్ర విభజనకు ముందు, ఒంటరిగా పోటీచేసిన సందర్భాలలో కూడా బీజేపీకి ఓట్లే కాదు సీట్లు కూడా వచ్చాయి. 1999 లోక్ సభ ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్’లో బీజేపీ ఏడు సీట్లు గెలిస్తే అందులో మూడు (రాజమండ్రి, నరసాపురం, తిరుపతి) స్థానాలు ఆంధ్రాలోనే ఉన్నాయి. అప్పట్లో ఆంధ్ర ప్రాంతంలో బీజేపీకి 18 శాతానికి పైగానే ఓట్లు వచ్చాయి. అలాంటి పార్టీ 2019 ఎన్నికల్లో ఎందుకు అలా తుడిచి పెట్టుకు పోయింది. ఎందుకు తిరిగి  పుంజుకోలేక పోతోంది ? అందుకు రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల పునాదులు పటిష్టంగా ఉండడం ఒక ప్రధాన కారణం అయితే, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కమల దళం ఎదగకుండా చేస్తున్నాయని, పార్టీ నాయకులే వాపోతున్నారు.రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రానికి ఇస్తామన్న ప్రత్యేక హోదాను ఇవ్వలేదు. చివరకు అందుకు ప్రత్యాన్మాయంగా ఇస్తామని వాగ్దానం చేసిన ప్రత్యేక ప్యాకేజికి కేంద్రం పంగనామాలు పెట్టింది. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా శంఖుస్థాపన చేసిన రాజధాని నిర్మాణానికి గానీ,లోటు బడ్జెట్ భర్తీకి  వెనక బడిన ప్రాంతాల అభివృద్ధికి ఇలా ఇస్తామన్న నిధులేవీ తొలి ఐదేళ్ళలో ఇవ్వలేదు. ఆకారణంగానే తెలుగు దేశం పార్టీ, కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చింది. బీజేపీతో పొత్తును తెగతెంపులు చేసుకుంది. దీంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో,రాష్ట్ర ప్రజల్లో కూడా బీజేపీ పట్ల విశ్వాసం పూర్తిగా సన్నగిల్లింది. ఫలితంగా 2019 ఎన్నికల్లో బీజీపీ ‘నోటా’ తో పోటీపడి ఓడిపోయింది. ఒకప్పుడు ఒంటరిగా ఒంటరిగా పోటీ చేసి 18 శాతం వరకు ఓట్లు, మూడు లోక్ సభ స్థానాలు గెలుచుకున్న బీజేపీ 0.8 శాతం ఓట్లకు పడిపోయింది.  అందుకే, రాష్ట్రంలో రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు ఉండడం, కార్యకర్తలు, స్థానిక నాయకుల అభీష్టానికి వ్యతిరేకంగా  సుదీర్ఘ కాలం పాటు తెలుగు దేశం పార్టీతో పొత్తు కొనసాగించడం,సమర్ధ నాయకత్వం లేక పోవడం ఇలా ఇంకా అనేక ఇతర  కారణాలున్నా  కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, పార్టీ ఎదుగుదలకు ప్రతిబంధకంగా నిలుస్తున్నాయని పార్టీ నాయకులు కూడా అంగీకరిస్తున్నారు.   ప్రస్తుత విషయాన్నే తీసుకుంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, అన్యమత ప్రచారం, మత మార్పిడులు, క్రైస్తవీకరణ ఆగడాలు పెరిగిపోవడంతో రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా వంటి పాత గాయాలను మరిచి పోయి బీజేపీ వైపు కొంత మొగ్గు చూపారు. అయితే, ఇంతలోనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదన తెర మీదకు రావడంతో కథ మళ్ళీ కథ మొదటికి వచ్చింది. అందుకే రాష్ట్ర బీజేపీ నాయకులు,విశాఖ ఉక్క ప్రైవేటీకరణ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని కేంద్ర నాయకత్వం వద్ద మొర పెట్టుకున్నారు. పార్టీ రాష్ట్ర్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నాయకత్వంలో ఢిల్లీ వెళ్ళిన ప్రతినిధి బృదం కేంద్ర ఉక్కు మంత్రి  ధర్మేంద్ర  ప్రధాన్ ‘ను కలిసి వినప్తి పత్రం సంర్పించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.  అయితే అప్పటికే జరగవలసిన నష్టం జరిగి పోయింది. ప్రధాన ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశాన్ని, ఇందుకు సంబంధించి ప్రజల సెంటిమెంట్’ను కార్మికులు ఆందోళనను చాల చాకచక్యంగా తమకు అనుకూలంగా మలచుకుంది. ముందుగా స్థానిక ఎమ్మెల్ల్యే, మాజీ మంత్రి   మాజీ మంత్రి, ఎమ్మెల్ల్యే గంటా శ్రీనివాస రావు ఎమ్మెల్ల్యే పదవికి రాజీనామా  చేశారు. మరో వంక టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్ల్యే పల్లా శ్రీనివాస ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.  ఆయన దీక్షను పోలీసులు భగ్నం చేసినా, పార్టీ జాతీయ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగారు. విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తే చేస్తే...ప్రతిపక్షంగా తాము కూడా ఒక్క నిమిషంలో రాజీనామా చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఉక్కు పరిరక్షణ కోసం ముందుండి ఉద్యమాన్ని నడిపించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందనడంతో పాటుగా ముఖ్యమంత్రి నాయకత్వంలో పనిచేసేందుకు కుడా సిద్దమని ప్రకటించడం ద్వారా చంద్రబాబు నాయుడు, బంతిని వైసీపీ కోర్టులోకి డ్రైవ్ చేశారు. అంతే కాకుండా స్టీల్‌ప్లాంట్‌ లేకపోతే విశాఖపట్నం ఉనికే లేదని, అటువంటి కర్మాగారాన్ని అమ్మేస్తుంటే...ముఖ్యమంత్రి తాడేపల్లిలో కూర్చొని పబ్జీ ఆడుకుంటున్నారా?...అంటూ ముఖ్యమంత్రి జగన్‌పై మరో సెంటిమెంటల్ బాణాన్ని సందించారు.అలాగే, స్టీల్ ప్లాంట్ బేరం వెనక జగన్ రెడ్డి, విజయసాయి రెడ్డి స్టీల్ ప్లాంట్ ను అమ్మేయడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యమాన్ని రాష్ట్ర్ర వయ్పితం చేసే లక్ష్యంతో ఈనెల 18న స్టీల్‌ప్లాంట్‌ ఆవిర్భావ దినోత్సవం రోజున రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చామన్నారు.  ఈ నేపధ్యంలోనే అధికార వైసీపీలోనూ కదలిక వచ్చింది. పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈ నెల 20 న స్టీల్ ప్లాంట్ పరిరక్షన యాత్ర చేస్తానని ప్రకటించారు. అలాగే ముఖ్యంత్రి కార్మిక నాయకులతో సమావేసమవుతారని, ఇదే విషయాన్ని చర్చించేందుకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రధాని అప్పాయింట్మెంట్ కోరరాని కూడా విజయసాయి చెప్పారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు కూడా ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని అంటున్నారు. .సో .. విశాఖ ఉక్కు ఉద్యమం వేడెక్కుతోంది. ఈ దశలో కేంద్రం సానుకూలంగా స్పదించి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా .. బీజేపీకివచ్చే ప్రయోజనం శూన్యంగానీ కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలే ఆంధ్ర ప్రదేశ్’లో పార్టీ ఎదుగుదలకు ప్రతిబంధకం అవుతున్నాయని.. రాష్ట్ర బీజేపీ నాయకులు అంతరంగిక సంభాషణల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.     

కాంగ్రెస్ లో పాదయాత్రల పోటీ! నేతల తీరుతో కేడర్ లో అనిశ్చితి 

అంతా బాగున్న రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీలో ఎవరి దారి వారిది ..ఎవరి గ్రూపు వారిది అన్నట్లుగా కథ నడిచింది.అంతర్గత కుమ్ములాటలు,జుట్టూ జుట్టూ పట్టుకోవడాలు,ఒకరిపై ఒకరు దుమ్మెతి పోసుకోవడాలు,ఒకటని కాదు అలాంటి లక్షణాలన్నీ కాంగ్రెస్ కల్చర్’గా, కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పేటెంట్ ఉన్న ‘సుగుణాలు’గా ముద్ర పడిపోయింది.అదే మంటే, ‘మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కొంచెం ఎక్కువండీ’ అంటూ కాంగ్రెస్ నాయకులు తప్పించుకోవడం,అందరికీ తెలిసిన గతం.  అయినా అప్పట్లో పార్టీ అధిష్టానం బలంగా ఉండేది కాబట్టి పార్టీలో ఎన్ని గ్రూపులున్నా, నాయకుల మధ్య ఎన్ని విబేధాలున్నా, కొట్టుకున్నా, తిట్టుకున్నా చివరకు అధిష్టానం మాటే వేదంగా చెలామణి అయింది.నిజానికి,అప్పట్లో బలమైన ప్రాతీయ నాయకులను తమ గుప్పిట్లో ఉంచుకునేందుకు పార్టీ అధిష్టానమే రాష్ట్రాల్లో గ్రూపులను ప్రోత్సహించేదని కూడా ఆనాటి మాటగా అంటారు.  సరే  అదంతా గతం. ప్రస్తుతం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటో, పార్టీ అధినాయకత్వం ఎంత బలహీనంగా వుందో వేరే చెప్పనక్కర లేదు. కేంద్రంలో అధికారం లేదు. లోక్ సభలో కనీసం ప్రతిపక్ష హోదా లేదు. చివరకు సుమారు, రెండు సంవత్సరాలుగా పార్టీకి పూర్తి స్థాయి అధ్యక్షుడు లేరు. పార్టీ సీనియర్ నాయకులు ‘తిరుగుబాటు బావుటా’ ఎగరేశారు. ఏకంగా 21 మంది అధిష్టానానికి అసమ్మతి లేఖ  రాశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని,తక్షణమే పూర్తి  స్థాయి అధ్యక్షుని ఎన్నుకోవాలని వత్తిడి తెచ్చారు. అయినా, తూతూమంత్రంగా సీడబ్ల్యూ సమావేశం నిర్వహించి, అధ్యక్షుని ఎన్నిక క్రతువును జూన్’ వరకు వాయిదా వేశారు. ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ.   దేశంలోనే కాదు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి డిటో డిటోగా ఇంచుమించుగా అంతే అధ్వాన్నంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన పార్టీ ఎమ్మెల్ల్యేలలో ఇంచుమించుగా సగం మంది అధికార తెరాసలోకి వెళ్లి పోయారు.దుబ్బాక,జీహెచ్ఎంసీ పరాభవం తర్వాత టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి, రాహుల్ గాంధీ అడుగుజాడల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవికి రాజీనామా చేశారు. కొత్త అధ్యక్షుని ఎన్నికకు పార్టీ రాష్ట్ర వ్యవహారల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్’ కొంత కసరత్తు చేశారు. కొన్ని పేర్లను పైకి తీసారు. రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట రెడ్డి,మల్లు భట్టి విక్రమార్క ... మరి కొని పేర్లు ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చాయి. మాణిక్ ఠాగూర్ జాబితాలో పేరు లేని జగ్గా రెడ్డి లాంటి వారు నొచ్చుకున్నారు. ‘మా సేవలకు గుర్తింపు ఏదని వాపోయారు. ఇంతమంది పార్టీలో పుట్టి,పార్టీలో పెరిగిన సీనియర్లు ఉండగా, నిన్నగాక మొన్న వచ్చిన రేవంత్ రెడ్డి’ని ఎలా అధ్యక్షుని చేస్తారని వీహెచ్ లాంటి కొందరు సీనియర్లు చిందులేశారు... అయినా మాణిక్ ఠాగూర్ ఎంపిక చేసిన జాబితా సోనియా గాంధీ టేబుల్ మీదకు చేరింది. ఆమె టిక్’  కూడా పెట్టేశారుయ  ఏ క్షణంలో అయినా కొత్త అధ్యక్షుని నియామక ప్రకటన వెలువడుతుందని అనుకున్నారు. ఇంతలో నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక తెర మీదకు వచ్చింది. ఆ స్థానం నుంచి పోటీ చేసే పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డి అభ్యర్ధన మేరకు, ఉప ఎన్నికల వరకు పార్టీలో  ఐక్యతను కాపాడేందుకు పీసీసీ అధ్యక్షుని ఎన్నిక వాయిదా పడింది.ఉత్తమ కుమార్ రెడ్డి అందాకా తాత్కాలిక అధ్యక్షునిగా కొనసాగుతారు. అంటే,ఎంతో ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ, రాష్ట్ర స్థాయిలలో తల లేని మొండెం లాగా అధ్యక్షుడు లేని పార్టీగా మిగిలింది. అదొకటి అలా ఉంటే, పార్టీలో ఐక్యత ఆశించి అధ్యక్ష ఎంపికను వాయిదావేస్తే, అధ్యక్ష పదవి పోటీలో ఉన్న వారు ఎవరికీ వారు పోటాపోటీగా పాదయాత్రల బాట పట్టారు. ఇప్పటికే, రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క ఎవరి దారిన వారు పాదయాత్రల సాగిస్తున్నారు.ఈ నెల 20 నుంచి కోమటి రెడ్డి తమ స్వగ్రామం నల్గొండ జిల్లా బ్రహ్మనవెళ్ళం ఎస్ఎల్బీసీ ప్రాజెక్టున పూర్తి చేయాలన్న డిమాండ్’తో పాద యాత్ర ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.అలాగే సిద్ధిపేట ఎమ్మల్యే జగ్గ రెడ్డి కూడా ఈ నెల 22 నుంచి పాదయాత్రకు సిద్దమయ్యారు.   అయితే కాంగ్రెస్ నాయకుల పాద యాత్రలు విమర్శలు ఎదుర్కుంటున్నాయి. ప్రత్యర్ధి పార్టీలు, తెరాస, బీజేపీ టీపీసీసీ అధ్యక్ష పదవి కోసమే కాంగ్రెస్ నాయకులు పాదయత్రాలు  చేస్తున్నారని ఆరోపిస్తుంటే, సొంత పార్టీ కార్యకర్తలు క్రింది స్థాయి నాయకులు ఇలా పార్టీ సీనియర్ నాయకులు ఎవరి దారిన వారు పాదయాత్రలు చేయడం వలన పార్టీకి మేలుకంటే కీడే ఎక్కువ జరుగుతుందని  ఆవేదనతో కూడిన ఆగ్రహాన్ని వ్యక్త చేస్తున్నారు. ఓ వంక తెరాస, బీజేపీ ఎమ్మెల్సీ, ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అదే విధంగా  నాగార్జున సాగర్ ఉపఎన్నికకు సిద్డంవుతుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం పార్టీ అధ్యక్ష పదవి కోసం పోటీ పాదయాత్రలు చేస్తున్నారని అంటున్నారు. ఇలా ఎవరికి  వారు కాకుండా అందరూ కలిసి కార్యకరమాలు నిర్వహిస్తే కార్యకర్తలు ప్రజల్లో విశ్వాసం ఏర్పడుతుందని, అలా కాకుండా ఇలా ఎవరి దారినవారు పొతే ప్రయోజనం ఉండదని అంటున్నారు. అయితే పార్టీ నాయకులు మాత్రం యాత్రలు వేరైనా అందరి గమ్యం,లక్ష్యం ఒక్కటే అని, రాష్ట్రంలో తెరాస ప్రభుత్వాన్ని, కేంద్రంలో బీజీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ లక్ష్యమని పేర్కొంటున్నారు. మరో వంక ఈ పాద యాత్రలు చివరకు కాంగ్రెస్ పార్టీని ఈ గమ్యం చేరుస్తాయో ... కాలమే నిర్ణయిస్తుంది అనుకోవడమే కాంగ్రెస్ కార్యకర్తల విధి ...  దట్స్ ఇట్ .

హైదరాబాద్ ను  యూటీ చేస్తారా ? కేసీఆర్ కొత్త డ్రామానా? 

ఇప్పుడే కాదు  గతంలో కూడా ఇలాంటి పుకార్లు చాలానే షికారు చేశాయి. రాష్ట్ర విభజనకు ముందు అప్పటి కేంద్ర మంత్రి, సినిమా హీరో చిరంజీవి, హైదరాబాద్’ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే ప్రతిపాదన తెర మీదకు తెచ్చారు. ఇదే విధయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళారు. అయితే, కాంగ్రెస్ అధిష్టానం చిరంజీవి ప్రతిపాదనను పట్టించుకోలేదు. అలాగే, ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్ నాయకులు కూడా ‘తాము  పట్టిన కుందేటికి మూడే కాళ్ళు’అన్నట్లుగా సమైక్యాంధ్ర రాష్ట్రం డిమాండ్ నుంచి ఒక్క అంగుళం అయినా కదిలేదని భీష్మించుకు కూర్చున్నారు.మరో వంక తెలంగాణ ప్రాంత నాయకత్వం సహజంగానే ఆ ప్రతిపాదనను నిర్ద్విధంగా తిరస్కరించారు.ఆ విధంగా, చిరంజీవి  ప్రతిపాదన రిలీజ్’కు నోచుకోని సినిమాలా తెరచాటుకు వెళ్లి పోయింది.  ఆ తర్వాత కూడా అడపాతడపా హైదరాబాద్’ను కేంద్రపాలిత ప్రాంతం (యూటీ) చేయాలనే డిమాండ్, ఆకాంక్ష అక్కడా ఇక్కడా వినవస్తూనే ఉంది. అలాగే, ఇందుకు సంబంధించి మీడియాలో ఉహాగానాలు, వ్యూహాగానాలు,  కూడా అప్పడప్పుడు వినవస్తున్నాయి. ఇప్పుడు ఇదే క్రమంలో, అధికార తెరాస మిత్ర పక్షం ఎంఐఎం అధ్యక్షుడు, హైదరబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నిన్న లోక్ సభలో, కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్’ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించే ప్రమాదం ఉందని, ఒక పాసింగ్ కామెంట్ చేశారు. అలాంటి ఆలోచన ఏదీ లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్’లో స్పష్టం చేశారు. అయితే అంత సీరియస్ కామెంట్ లేదా ఆరోపణ చేసిన అసదుద్దీన్’ ప్రభుత్వం సమాధానం చెప్పేవరకు ఆగకుండా సభలోంచి వెళ్ళిపోయారు. అంటే, అసదుద్దీన్ ప్రభుత్వం నుంచి సమాధానం ఆశించి యూటీ అంశాన్ని ప్రస్తావించే లేదనే విషయం తేలిపోయింది. మరి ఎందుకు ఈ అసందర్భ ప్రస్తావన చేశారు, అని చూస్తే, కొత్తగా మళ్ళీ పెళ్లి పీటలు ఎక్కిన తెరాస, ఎంఐఎం కలిసి ఆడుతున్న డ్రామాలో భాగంగానే అసదుద్దీన్ ఈ అంశాన్ని తెరమీదకు తెచ్చారని అనుకోవచ్చునని రాజకీయ వర్గాల్లో వినవస్తోంది.   రాష్ట్రంలో దినదిన ప్రవర్థమానంగా దిగజారిపోతున్న పార్టీ, ప్రభుత్వ ప్రతిష్టను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా అధికార తెరాస నాయకత్వం తెలంగాణా సెంటిమెంట్’ను మరో మారు నిద్ర లేపే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల పలు సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇతర నాయకులు, మంత్రులు, తరిమి కొడతాం, ఆప్టి పెడతాం, ఆంధ్రా పాలకులు అవీఇవీ అనే   సెంటిమెంటును రగిల్చే ఉద్యమకాలం నాటి బాషను వాడుతున్నారు. ఇందులో భాగంగానే వరసగా నిలిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నిక,అదే విధంగా ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సెంటిమెంట్’ ప్రయత్నాలను అధికార పార్టీ ముమ్మరం చేసింది. ఆ వ్యూహంలో భాగంగానే అసదుద్దీన్ అసందర్భ ప్రస్తావన చేశారని అంటున్నారు. అయితే రాష్ట్రం ఏర్పడి ఏడేళ్ళు అయిన తర్వాత ఇంకా  సెంటిమెంట్  ఏ మేరకు పనిచేస్తుంది .. అనేది చూడవలసి ఉంది..

పార్టీపై కేసీఆర్ పట్టు తప్పుతోందా? అసహనం అందుకేనా? 

తెలంగాణలో తెరాసకు తిరుగులేదు.. ఇది నిన్నటి మాట. తెరాస’లో కేసీఆర్’కు ఎదురు లేదు ఇది కూడా అంతే.. పార్టీ అంతర్గత వ్యవహారాలు, కేసీఆర్ అంతరంగం అంతో ఇంతో తెలిసిన వారిని ఎవరిని కదిల్చినా ఇదే మాట అంటున్నారు. నిజానికి ఎవరూ చెప్పవలసిన అవసరం లేకుండానే, వాస్తవ పరిస్థితి ఏమిటో ప్రతి ఒక్కరికీ కారులో కల్లోలం బుల్లి తెరపై బొమ్మలా అందరికీ కనిపిస్తూనే వుంది. అందుకే  రాజకీయ విశ్లేషకులు మొదలు సామాన్య ప్రజల వరకు అందరిలో తెరాసలో ఏమి జరుగుతోంది అనే చర్చ జరుగుతోంది. అధికార పార్టీలో  ‘ఆల్ ఈజ్ నాట్ వెల్’, ‘అంతా ఏమంత బాగోలేదు’ అన్న నిజం అందరికి అర్థమైపోయింది. ఇప్పుడదో బహిరంగ రహస్యం. దాచేస్తే దాగని సత్యంగా అందిరి నోళ్ళలో నలుగుతోంది.     ఓ వంక కుటుంబంలో అంతర్గత విబేధాలు, వారసత్వం కుమ్ములాటలు, మరో వంక పార్టీలో,ప్రభుత్వంలో లుకలుకలు పార్టీ మీద కేసీఆర్ పట్టు సడలుతున్న వైనాన్ని స్పష్టం చేస్తోందని రాజకీయ వర్గాల్లో, మీడియాలో వార్తలు  గుప్పుమంటున్నాయి. అందుకు తగ్గట్టుగానే, అంతర్గత కుమ్ములాటలు బహిరంగ హెచ్చరికల స్థాయికి చేరాయి. అది కూడా వారో వీరో కాదు, స్వయంగా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్’ పార్టీ వేదిక నుంచి పార్టీ నాయకులను తాట తీస్తా, తోలు వలుస్తా అని హెచ్చరించడం గమనిస్తే ఆయనలో అసహనం ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా  రెండు రోజుల క్రితం నాగార్జున సాగర్ లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి, ప్రతిపక్షాలను స్థాయి మరిచి దుర్భాషలు ఆడడమే కాకుండా, తమకు వినతి పత్రాలు ఇచ్చేందుకు వచ్చినగిరిజన మహిళలను ‘కుక్కలు’ అంటూ దూషించడం ఆయనలో పెరుగతున్న అసహనానికి నిదర్శనంగా రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ మాత్రమే కాదు కేటీఆర్ కూడా అదే ధోరణిలో మాట్లాడుతున్నారు. అదే విధంగా పార్టీలో మొదటినుంచి ఉన్న కీలక నేతలు చాపకింద నీరుల అసమ్మతిని రాజేసే ప్రయత్నంలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. అలాగే ముఖ్య నేతల మధ్య కూడా కీలక నిర్ణయాల  విషయంలో విబేధాలు తీవ్ర స్థాయికి చేరిన సంకేతాలు స్పష్టమవుతున్నాయి.    అయితే  ముఖ్యమంత్రిలో ప్రతి ముఖ్య నేతలో ఇంతటి అసహనానికి కారణం ఏమిటని అలోచిస్తే, ప్రధానంగా ఇంటి పోరు కారణంగానే కేసీఆర్’లో రోజురోజుకు అసహనం పెరిగిపోతోందని తెలుస్తోంది. దానికి తోడు రెండుమూడు నెలల క్రితం దుబ్భాక అసెంబ్లీ స్థానికి జరిగిన ఉపన్నికలో, ఆ తర్వాత హైదరాబాద్ నగర పాలక సంస్థ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవం ఇప్పటికీ ఆయనకు మింగుడు పడడంలేదని రాజకీయ వర్గాల్లో వినపిస్తోంది. అలాగే త్వరలో జరగనున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లోనూ గెలుపు విషయంలోనూ,ఇంటల్జెన్సీ నివేదికలు హెచ్చరికలు చేస్తున్నాయని చెబుతున్నారు. అందుకే మొన్నటి సాగర్ సభలో ముఖ్యమంత్రి గిరిజన మహిళలను ‘కుక్కలు’ అనే వరకు వెళ్ళారని, పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కాదు కాలు జారితే తీసుకోవచ్చు కానీ.. నోరు జారితే వెనక్కి తీసుకోలేమని, ముఖ్యంగా రాజకీయాల్లో నోరు జారితే అందుకు మూల్యం చేల్లిచుకోవలసి వస్తుందని, పార్టీ స్థానిక నాయకులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలోని గుర్రంపోడు తండాలో తమ భూములు  కబ్జాకు గురయ్యాయంటూ గత కొంతకాలంగా గిరిజనులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపధ్యంలో గిరిజన మహిళలను ‘కుక్కలు’లతో పోలుస్తూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లినట్లేనని స్థానిక తెరాస నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ గిరిజనుల పక్షాన ఆందోళన చేపట్టింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇటీవల పార్టీలో చేరిన విజయ శాంతి ఇతర నాయకులు గుర్రంపోడు తండాలో పర్యటించారు. ఈ సందర్భంగా బీజీపీ, తెరాస కార్యకర్తల మధ్య తోపులాటలు. పోలీసుల లాఠీ ఛార్జ్ వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. వారం పది  రోజులుగా  ఉద్రిక్త వాతావరణ నెలకొని ఉంది. ఆ నేపధ్యంలో ముఖ్యమంత్రి  జిల్లా పర్యటన  సందర్భంగా బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడం, గృహ నిర్భందంలో ఉంచడంతో  పరిస్థితి మరింత వేడెక్కింది. ఇలాంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు రేపటి నాగార్జున సాగర ఎన్నికల్లో పార్టీకి మేలు కంటే కీడే ఎక్కవ చేస్తాయని ఇటు పార్టీ నాయకులు, అటు రాజకీయ విశ్లేషకులు కూడా పేర్కొంటున్నారు.  ఇటీవల పార్టీ ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి ఎస్సీ, ఎస్టీలను చులకన చేస్తూ వారికీ అక్షరం ముక్క రాదని అవహేళన చేయడం రచ్చ రచ్చైంది. తర్వాత ఆయన క్షమాపణలు చెప్పి,చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. త్వరలో ఉప ఎన్నికల జరగనున్న నాగార్జున సాగర్ నియోజక వర్గంలో దళిత, గిరిజన, ఎస్సీ,ఎస్టీ ఓట్లు కీలకం కానున్న నేపధ్యంలో ఆయా కులాలను కించపరిచే విధంగా ఎవరు వ్యాఖ్యలు చేసినా, అందుకు మూల్యం చెల్లించక తప్పదని, అందుకు అధికార పార్టీ, ముఖ్యమంత్రి మినహాయింపు కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.  నాగార్జున సాగర్, హాలియా బహిరంగ సభలో ముఖ్యమంత్రి కురిపించిన వరాల జల్లుపై కూడా ప్రజలు పెదవి విరుస్తున్నారు.ఈ వరాలు ప్రజలపై అంతగా ప్రభావం చూపదని, లోపాయికారి చర్చల్లో అధికార పార్టీ నాయకులు సైతం అంగీకరిస్తున్నారు. అదే ఉమ్మడి నల్గొండ జిల్లాలో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన సందర్భంలో కూడా ముఖ్యమంత్రి ఇదే విధమైన వాగ్దానాలు చేసారని, అయితే, అందులో ఏ ఒక్క వాగ్దానం కూడా అమలుకాలేదని  విపక్షాలు విమర్శిస్తున్నాయి. మరో వంక సోషల్ మీడియాలో అప్పటి, ఇప్పటి క్లిప్పింగులతో ప్రచారం అవుతున్న వార్తలు వాగ్దానాల డొల్లతనాన్ని చూపుతోంది. దీంతో అప్పటి వాగ్దానాలను  మరిచి పోయినట్లుగానే ఈ వాగ్దానాలను మరిచి పోతారని సామాన్య ప్రజలు కూడా భావిస్తున్నారు. అలాగే  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, నాగార్జున సాగర్ నియోజక వర్గం మాజీ ఎమ్మెల్యే  జానారెడ్డి అయితే  ఎన్నికల సమయంలో ఉత్తుత్తి వాగ్దానాలు చేయడం తెరాస పార్టీకి, ముఖ్యమంత్రి కేసీఆర్’కు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. అయితే అన్నిసందర్భాలలో అందరినీ మోసం చేయడం ఎవరికీ సాధ్యం కాదని కూడా జానా పేర్కొన్నారు... అది నిజం కూడా.. 

తూర్పు తీరంలో ఉక్కు రాజ'కీ'యం

విశాఖ ఉక్కు ఉత్తరాంధ్ర రాజకీయాలను అమాంతం మార్చేయబోతోందా? ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పొలిటికల్ ఈక్వేషన్స్ తారుమారు కాబోతున్నాయా? కార్మికులు, స్థానికుల ఉక్కు పిడికిలితో అధికార పార్టీకి ఇక పాతరేనా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఉక్కు ఉద్యమంతో ప్రతిపక్ష టీడీపీ అనూహ్యంగా బలపడుతోంది. తెలుగు తమ్ముళ్ల చిత్తశుద్ధికి ప్రజల నుంచి విశేష ఆదరణ వస్తోంది.  టీడీపీ ఉక్కు పిడికిలి.. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయంతో బీజేపీ, వైసీపీలు ఒక్కసారిగా డిఫెన్స్ లో పడిపోయాయి. పైకి పాజిటివ్ ప్రకటనలు చేస్తున్నా.. ఆ పాపమంతా ఆ రెండు పార్టీలదేనని ప్రజలంతా నమ్ముతున్నారు. అందుకే.. కార్మికుల దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఎంపీ విజయసాయిరెడ్డికి నిరసన సెగ తగిలింది. మరోవైపు.. ప్రజాభిప్రాయానికి, ప్రజాపోరాటానికి టీడీపీ మద్దతుగా నిలుస్తోంది. ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కు కోసం.. చంద్రబాబు ఆదేశాలతో తెలుగు తమ్ముళ్లంతా పోరుబాట పట్టారు. కేంద్ర నిర్ణయం వెలువడిన వెంటనే మొదట రంగంలోకి దిగింది టీడీపీ నేతలే. ఎమ్మెల్యే వెలగపూడి రామక్రుష్ణ కార్మికుల పక్షాన బలంగా నిలిచారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఇక, మరో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఏకంగా తన పదవికే రాజీనామా చేశారు. టీడీపీ ప్రజాప్రతినిధుల కమిట్ మెంట్ తో.. ప్రజల్లో ఆ పార్టీపై నమ్మకం, ఆదరణ మరింత పెరిగింది. ప్రజాపక్షాన నిలిచే పార్టీ.. కేవలం తెలుగుదేశమేనని మరోసారి తెలిసొచ్చింది.  ముందునుంచీ విశాఖ వాసులు టీడీపీని ఆదరిస్తూనే ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో.. విశాఖ తూరు, ఉత్తర, పశ్చిమ, దక్షిణ నాలుగు దిక్కులా.. నాలుగు అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశమే గెలుచుకుంది. క్షేత్ర స్థాయిలో బలమైన కేడర్. ఒక్క విశాఖ మాత్రమే కాదు.. ఉత్తరాంధ్ర యావత్తూ టీడీపీకి కంచుకోటే. అచ్చెంనాయుడు, అయ్యన్నపాత్రుడు, కళా వెంకట్రావు, రామ్మోహన్ నాయుడు లాంటి హేమాహేమీ లీడర్లు టీడీపీకి సొంతం. చంద్రబాబు నాయకత్వంలో వాళ్లంతా ప్రజల కోసం నిత్యం అందుబాటులో ఉంటున్నారు. కేసులకు బెదరకుండా ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు. విశాఖ ఉక్కు విషయంలోనూ అదే చిత్తశుద్ధితో పోరాడుతున్నారు. ఆందోళనలతో ఢిల్లీ దిగొచ్చేలా ఉద్యమం చేస్తున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ముందు టీడీపీ జెండాలే రెపరెపలాడుతున్నాయి. పసుపు జెండా నీడనే.. కార్మికులు, స్థానికులు ఉక్కు పిడికిలి బిగించి.. మోదీకి వినిపించేలా బిగ్గరగా నినదిస్తున్నారు.  ఉత్తరాంధ్ర ఊపిరి పీల్చుకో.. ఉక్కు ఉద్యమ ప్రభావం ఒక్క విశాఖ మీదే కాకుండా ఉత్తరాంధ్ర మొత్తం ఉంటుంది. మూడు జిల్లాలతో ఉక్కు కర్మాగారానికి విడదీయరాని అనుబంధం. యావత్ ఆంధ్రప్రదేశ్ కు మానసిక బంధం. లక్షలాది మంది ఉద్యోగులు, కార్మికులు, వ్యాపారులు.. ప్రత్యక్షంగా, పరోక్షంగా విశాఖ ఉక్కు పరిశ్రమపై ఆధారపడుతున్నారు. అందుకే, విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు. ఈ సెంటిమెంట్ ను పాలకులు మరిచినా.. ప్రతిపక్ష పార్టీ మాత్రం ఫాలో అవుతోంది. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో గతంలో కాస్త సందిగ్థంలో పడిన టీడీపీ.. ఇప్పుడు విశాఖ ఉక్కు విషయంలో మాత్రం ఫుల్ క్లారిటీతో ఉంది. రాజధాని పేరుతో అధికార పార్టీ నేతలు చేస్తున్న అరాచకాలతో ప్రజలు విసిగిపోయారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఆ పార్టీ ఉదాసీన వైఖరితో ప్రజలు వైఎస్సార్ సీపీని అసహ్యించుకుంటున్నారు. పాలకులపై తిరగబడే పరిస్థితులు వచ్చాయని అంటున్నారు. ఒకవైపు అధికార పార్టీపై వ్యతిరేకత పెరుగుతుంటే.. అదే సమయంలో ప్రతిపక్షానికి ప్రజాదరణ పెరుగుతోంది.  సరైనోడు.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే వాడే సరైన నాయకుడు. ఈ విషయంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా. సమయానికి తగ్గట్టు సరిగ్గా వ్యవహరించేవారే నెగ్గుకురాగలరు. ప్రస్తుతం చంద్రబాబు ఇలాంటి వ్యూహమే ఫాలో అవుతున్నారు. కరోనా, లాక్ డౌన్ టైమ్ లో కాస్త వెనక్కి తగ్గినట్టు కనిపించినా.. అది సరైన సమయం కోసం వేచి చూసే ధోరణి అని చాలా తక్కువ మందికే తెలుసు. జూమ్ మీటింగులంటూ వైసీపీ నేతలు ఎద్దేవా చేసినా పెద్దాయన పట్టించుకోలేదు. ఎప్పుడైతే దళితులపై దాడులు, ఆలయాల విధ్వంస ఘటనలు, టీడీపీ నేతలపై కేసులు, దాడులు జరిగాయో అప్పటి నుంచీ మళ్లీ ప్రజాక్షేత్రంలోకి దిగిపోయారు. జూలు విదిల్చిన సింహంలా వేటకు రెడీ అయ్యారు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగిరాకపోతే.. ముందుముందు ఉక్కు ఉద్యమాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారు. గతంలో ఏపీకి జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా ధర్మ పోరాట దీక్షలతో మోదీ సర్కారుపై దండెత్తిన చరిత్ర ఆయనది. అక్రమాలకు ఎదురొడ్డి పోరాడే తెగువే ఆయన సొంతం. తాజాగా.. ఆంధ్ర ప్రజల పక్షాన ఉక్కు పోరాటంపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా టీడీపీ అధినేత ఆలోచిస్తున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. అదేంటో.. ఆయన మదిలో ఉన్న వ్యూహమేంటో త్వరలోనే తెలుస్తుంది. విశాఖ కేంద్రంగా ఉక్కు ఉద్యమంతో.. ఇక తూర్పు తీరంలో తెలుగుదేశానికి తిరుగుండదు. పూర్వ వైభవం తిరిగిరావడం ఖాయం.. 

పోస్కో.. ఎవరికెంతో తెలుసుకో! విశాఖ ఉక్కుకు పెద్దల తుప్పు? 

మీ ఇంట్లో మీకో ఐరన్ షాప్ ఉందనుకోండి. ఆ షాపులో సగ భాగం మీకు పోటీగా ఇంకొకరు ఐరన్ షాప్ పెట్టుకునేందుకు మీరు పర్మిషన్ ఇస్తారా? ఇవ్వనే ఇవ్వరు కదా. మీరే కాదు ప్రపంచంలో ఎవరూ ఆ పని చేయరు. కానీ, కేంద్రం, రాష్ట్రం, విశాఖ ఉక్కు కర్మాగారం కలిసి ఆ పిచ్చి పని చేసేశాయి. ఆ తెలివి తక్కువ నిర్ణయం వెనుక కొందరు తెలివైన పెద్దలకు బోలెడు లాభముందని అంటున్నారు. కేంద్రం, రాష్ట్ర పాలకుల కనుసన్నల్లో.. విశాఖ ఉక్కును మొత్తానికి మొత్తంగా కాజేసే కుట్ర దాగుందని అనుమానిస్తున్నారు. 2 లక్షల కోట్ల విలువైన భూములను అప్పనంగా కొట్టేసే కుతంత్రమంటూ ప్రచారం. కొన్ని వేల కుటుంబాలను రోడ్డున పడేసే ఆ పాపం వెనుక మహా మంత్రాంగమే నడిచిందని చెబుతున్నారు. కొన్ని ఒప్పందాలు, అవి జరిగిన తేదీలు చూస్తుంటే ఈ అనుమానం మరింత బలపడుతోంది. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటైజేషన్ విషయం ముఖ్యమంత్రి జగన్ కు ముందే తెలుసని.. ఆయన కనుసన్నల్లోనే అంతా జరుగుతోందనేందుకు అనేక ఆధారాలు చూపిస్తున్నారు. రాజ్యసభలో కేంద్ర ఉక్కు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇచ్చిన లిఖిత పూర్వక వివరణతో మరింత క్లారిటీ వచ్చేసింది.  పోస్కో వెనక పక్కా ప్లాన్ ! ఉక్కు కర్మాగారానికి విశాఖలో 22వేల ఎకరాల భూములున్నాయి. ఈ భూముల్లో సగం మేర కర్మాగార నిర్మాణం ఉంది. మిగతా సగం ఖాళీ భూముల్లో విశాఖ ఉక్కు కంపెనీకి పోటీగా మరో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టేందుకు దక్షిణ కొరియాకు  చెందిన పోస్కో కంపెనీ ముందుకొచ్చింది. భూమండలం మీద ఇంకెక్కడా స్థలమే లేదన్నట్టు.. అప్పటికే ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారానికి పోటీగా.. ఆ సంస్థ భూముల్లోనే పాగా వేసేందుకు రెడీ అయింది. అందుకు, కేంద్రం సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విడ్డూరం. 2019 అక్టోబర్ లో పోస్కో- రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఆ సమయానికి జగన్ సీఎంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి తెలీకుండా ఈ ఒప్పందం జరిగే అవకాశమే లేదు. అంటే, జగన్ కు తెలిసే.. పోస్కో వైజాగ్ లో ఎంట్రీ ఇచ్చిందనేగా అర్థం? అందుకు తగిన ఆధారాలు కూడా చూపుతున్నారు.  అంతా ఆయనే చేశారా? 2019 మే 30న జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019 జూన్ 21న సీఎం జగన్మోహన్ రెడ్డిని పోస్కో ప్రతినిధులు కలిసినట్టు నేషనల్ మీడియాలో వార్తలొచ్చాయి. అదే నిజమైతే.. ఈ తేదీలను కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే.. 2019 జూన్ 21న జగన్ తో పోస్కో ప్రతినిధుల సమావేశం.. ఆ తర్వాత నాలుగు నెలలకే.. 2019 అక్టోబర్ లో పోస్కో- రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ మధ్య అగ్రిమెంట్. ఆశ్చర్యకరంగా లేదూ ఈ డీల్. అంటే.. జగన్ కు తెలిసే.. జగన్ ను కలిసే.. జగన్ తో చర్చించాకే.. విశాఖలో పోస్కో పునాది రాయి వేసిందంటున్నారు విశ్లేషకులు. ఇదంతా.. తమకు తెలీదని ప్రభుత్వం తప్పించుకోడానికి లేదు. ఎందుకంటే.. 2020 అక్టోబరు 29న జగన్‌ ను క్యాంప్ కార్యాలయంలో.. పోస్కో సీఎండీ పోస్కో ఇండియా గ్రూపు ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంగ్‌ లై చున్, చీఫ్‌ ఫైనాన్సింగ్‌ ఆఫీసర్‌ గూ యంగ్‌ అన్, సీనియర్‌ జనరల్‌ మేనేజర్‌ జంగ్‌ లే పార్క్‌ తదితరులు అధికారికంగా కలిశారు. పోస్కో ప్రతినిధులతో సమావేశం తర్వాత ప్రభుత్వం వివరణ కూడా ఇచ్చింది. ఏపీలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు  పోస్కో ముందుకు వచ్చిందని ప్రకటించింది. అంటే, పోస్కో మీద రాష్ట్ర ప్రభుత్వానికి విపరీతమైన ప్రేమ ఉన్నట్టేగా..? పోస్కో జ‌గ‌న్‌రెడ్డిని కలిసిన రెండు రోజుల తరువాత 2020 అక్టోబర్ 31న.. పోస్కో కోసం సీఎం జగన్ విశాఖ ఉక్కు ఉద్యోగుల సంఘ నాయకులతో మాట్లాడారని చెబుతున్నారు. పోస్కోకు సహకరించాలని ముఖ్యమంత్రి కోర‌గా అందుకు కార్మికులు తిరస్కరించారు.  నష్టాల సాకు.. భూములపై సోకు! సీఎం జగన్ డైరెక్షన్ లోనే ఢిల్లీ స్థాయిలో పావులు కదిలాయని అంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను వదిలించుకోవాలని ఎప్పటి నుంచో చూస్తోంది కేంద్రం. కుక్కను చంపాలంటే ముందుగా దాని మీద పిచ్చి కుక్క అనే ముద్ర వేయాలంటారు. అప్పుడిక పని మరింత సులువవుతుంది. విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలోనూ అదే జరుగుతోంది. 2019 నాటికి 95 కోట్ల లాభంతో నడుస్తోంది RINL. కరోనా దెబ్బతో ప్రపంచ వ్యాప్తంగా ఉక్కుకు డిమాండ్ తగ్గింది. ఆ ప్రభావం విశాఖ స్టీల్ మీదా పడింది. అన్ని కంపెనీల మాదిరే దీనికీ నష్టాలు తప్పలేదు. ఇది సాకుగా చూపించి మొత్తానికి మొత్తం గంప గుత్తగా అమ్మేయాలని.. రాష్ట్ర ప్రభుత్వ డైరెక్షన్ లో కేంద్రం వంద శాతం ప్రైవేటీకరణకు నిర్ణయం తీసుకుందని అంటున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంతంగా ఇనుప గనులు కేటాయిస్తే.. మంచి లాభాల్లో నడవడం ఖాయం. పక్కనే ఒడిషా, చత్తీస్ గఢ్ లో ఐరన్ ఓర్ ఉన్నా వాటిని కేటాయించడానికి అదృశ్య శక్తులు అడ్డుపడుతున్నాయని చెబుతున్నారు. ఆ అదృశ్య శక్తులు ఇంకెవరు..?  విశాఖ ఉక్కు కర్మాగారం ఖాళీ భూములను పోస్కోకు కేటాయించడంపైనే విమర్శలు వెల్లువెత్తుతుంటే.. ఇక RINLను పూర్తి స్థాయిలో ప్రైవేటీకరించడం మరింత వివాదాస్పదంగా మారింది. పక్కనే ఇంటర్నేషనల్ కంపెనీ పోస్కోను పెట్టుకొని.. దానికి పోటీగా RINLలో వాటాలు ఎవరు కొంటారు? రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ సైతం పోస్కో పరం కావాల్సిందేగా? అంటే.. ముందుగా పోస్కోను రంగంలోకి దించి.. ఉక్కు కంపెనీ పక్కలో బల్లంలా ఉంచి.. విశాఖ ఉక్కు కంపెనీని పూర్తిగా కబ్జా చేసేలా ముందస్తు ప్రణాళికలో భాగంగానే ఇదంతా జరిగిందనేది కార్మికుల అనుమానం. విలువైన భూములను కొట్టేసేందుకే ఇంతటి స్కెచ్ వేశారని అరోపిస్తున్నారు. 22వేల ఎకరాల్లో విశాఖ ఉక్కు కర్మాగారం విస్తరించి ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం దీని విలువ కేవలం 2వేల కోట్లు మాత్రమే. కానీ, బహిరంగ మార్కెట్లో ఈ భూముల విలువ 2 లక్షల కోట్లకు పైనే. ఇంత ఖరీదైన భూములను, ప్రైవేటీకరణ పేరుతో అతితక్కువ ధరకు కాజేసే ప్రయత్నం జరుగుతోందనేది విపక్షాల మాట. ఈ డీల్ వెనుక జగన్ రెడ్డి, పోస్కో మధ్య పెద్ద ఎత్తున క్విడ్ ప్రోకో నడిచిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇప్పటికే ఆరోపించారు. మరి, ఇందులో నిజమెంతో ఆ జగన్ కే ఎరుక..! 

షర్మిలతో చాణక్యం! ఎవరికి ఎసరు ?

తెలంగాణలో కొత్త పార్టీ.. అందులోనూ తెలంగాణేతర వ్యక్తి.. ఇదేమీ మామూలు విషయం కాదు. పెను సంచలనమే. ఇది షర్మిల చేత వేయిస్తున్న రాజకీయ ఎత్తుగడ అనే వారు అనేకులు.. పార్టీ వెనుక అంచనాలకు అందని పొలిటికల్ స్ట్రాటజీ ఉందనేది విశ్లేషకుల మాట.. అదేంటనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. షర్మిల పార్టీతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు అమాంతం మారిపోతాయా? రాత్రికి రాత్రి పరిస్థితులు తారుమారు అవుతాయా? అంటే కానేకాదు. ఆమెకు అంత సీన్ లేదనేది అందరికీ తెలిసిన విషయమే. ఇంత చిన్న లాజిక్ షర్మిలకు తెలియంది కాదు. మరెందుకు కొత్త పార్టీ పెట్టే సాహసం చేశారు? ఇంతకు షర్మిల టార్గెట్ ఎవరు? కేసీఆరా? రేవంత్ రెడ్డా? కాంగ్రెస్సా? బీజేపీనా?  షర్మిల జెండా, ఎజెండా ఏంటి? జగనన్న లానే తాను కూడా తెలంగాణకు సీఎం అయిపోదామనా? ఇప్పుడు కాకపోయినా భవిష్యత్ లోనైనా షర్మిల తెలంగాణ గడ్డపై నిలదొక్కుకోగలరా? ఇక్కడ ఆమెకు అంత స్పేస్ ఉందా? ఆమె వెంట నడిచేది ఎవరు? ఆమెకు సపోర్ట్ గా నిలిచేది ఇంకెవరు? ప్రాంతీయ అభిమానం మెండుగా ఉండే తెలంగాణలో.. పక్క రాష్ట్ర నేతను ఆదరిస్తారా? అక్కున చేర్చుకుంటారా? అంటే కష్టమేనంటున్నారు తెలంగాణ వాదులు. మరెందుకు? ఇంకెందుకు? షర్మిల.. ఏపీని దాటొచ్చి.. తెలంగాణలో పార్టీ స్థాపించి.. ఏం సాధిద్దామని? ఎవరిని ఉద్దరిద్దామని? పాదయాత్ర తర్వాత ఇంటికే పరిమితమైన వైఎస్ యువరాణి.. సడెన్ గా తెలంగాణ రాజ్యాన్ని ఏలుదామని ఎందుకు ముందుకొచ్చారు? ఆమెను ముందుంచి నడిపిస్తున్న వెనుకున్న పెద్దలెవరు? తెలంగాణలో షర్మిల పార్టీ ప్రభావం ఏ మేరకు ఉంటుంది? ఏ వర్గాలను ప్రభావితం చేస్తుంది? కలిసొచ్చేది ఎవరికి? కాల గర్భంలో కలిసిపోయేది ఎవరు? ఇలా అనేక ఆసక్తికర ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వెతికే ప్రయత్నం చేసింది తెలుగు వన్ న్యూస్. ఆ రాజకీయ విశ్లేషణలో ఇంట్రెస్టింగ్ యాంగిల్స్ వెలుగు చూశాయి. వన్ పర్సన్.. మెనీ టార్గెట్స్.. ఏ రాజకీయ పార్టీ లక్ష్యమైనా అధికార పీఠమే. షర్మిల సైతం రాజన్న రాజ్యం తీసుకురావడానికే పార్టీ స్థాపించినట్టు ఇప్పటికే స్పష్టం చేశారు. అంటే.. ప్రస్తుతం పవర్ లో ఉన్న టీఆర్ఎస్ ను గద్దె దింపడమే కొత్త పార్టీ లక్ష్యం. అయితే.. ఉద్యమ నేత, రాజకీయ దురందుడైన కేసీఆర్ నుంచి కిరీటం లాక్కోవడం అంత ఈజీ కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో షర్మిలకు అది అసాధ్యం కూడా. అందుకే.. తాత్కాలికంగా ముఖ్యమంత్రి పీఠాన్ని టార్గెట్ చేయకుండా.. గులాబీ బాస్ ను సాధ్యమైనంత బలహీనం చేయడమే షర్మిల చేయగలిగింది. కొత్త పార్టీ ఏర్పాటుతో తెలంగాణలో ఓటు బ్యాంక్ ఎలా ప్రభావితం అవుతుందో.. షర్మిల బలం, బలగం, ఆశ, అత్యాశ అంతా.. కొన్ని వర్గాలే. అవి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్ అభిమానులు, హైదరాబాద్ లోని జగన్ ఫ్యాన్స్.. వీరితో పాటు రెడ్డు, క్రిష్టియన్లు, ముస్లింలు. వీళ్లే షర్మిల వెంట ముందుండి నడిచే అవకాశం ఉన్న వర్గాలు. ఎంత కాదన్నా.. ఈ వర్గాలను నమ్ముకునే షర్మిల పార్టీ పెడుతున్నారనేది కాదనలేని వాస్తవం.  వైఎస్ ఫ్యాన్స్...  వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణలో ఆయనకు బలమైన కేడర్ ఉండేది. వైఎస్ మరణం.. రాష్ట్ర విభజనతో.. ఆ కేడర్ అంతా తలో దిక్కులో సెటిల్ అయ్యారు. కొందరు కాంగ్రెస్ లోనే కంటిన్యూ అవుతుంటే.. మరికొంత మంది కారు పార్టీలో సెటిల్ అయ్యారు. వైఎస్సార్ కూతురుగా షర్మిల పార్టీ పెడితే.. ఆమె తండ్రి మీద ఉన్న అభిమానంతో కూతురు వెనుక నిలిచేది ఎంతమంది అనేది తేలాల్సి ఉంది. జగనన్నను చూసి.. చెల్లితో చేయి కలుపుతారా? లేదా? అనేది కీలకాంశం. ఒకవేళ వారిలో కొందరైనా షర్మిల పార్టీలో చేరితే.. ఆ మేరకు కాంగ్రెస్ కు, టీఆర్ఎస్ కు మైనసే.. ఇప్పటికే నిండా మునిగిన కాంగ్రెస్ ఫుట్టి.. టైటానిక్ షిప్ లా రాజకీయ సముద్రంలో చెల్లాచెదురు కావడం ఖాయం. గులాబీ దండుపైనా ఆ ప్రభావం ఎంతోకొంత పడక మానదు.  రెడ్ల దారెటు? వైఎస్ అభిమానుల తర్వాత.. తెలంగాణలో బలమైన వర్గంగా ఉన్న రెడ్డి లీడర్లపైనే షర్మిలకు బోలెడు ఆశ. స్వతహాగా రెడ్డకు బ్రాండ్ అంబాసిడర్ గా చెలమణి అవుతున్న వైఎస్ ఫ్యామిలీ ఆడబిడ్డకు తెలంగాణ రెడ్ల నుంచి ఏ మేరకు సహాయ సహకారాలు అందుతాయనేది ఆసక్తికరం. ఇప్పటికే ఏళ్లుగా నల్గొండ రెడ్లంతా కాంగ్రెస్ లో పాతుకుపోయారు. సీనియర్లు మినహా మిగతా రెడ్డీ బ్యాచ్ అంతా రేవంత్ రెడ్డికి జై కొడుతున్నారు. తెలంగాణ రెడ్డలకు రేవంత్ రెడ్డి ఒక్కడే ఆశాకిరణం. ఎప్పటికైనా తెలంగాణ సీఎంగా ఎమర్జ్ అయ్యే సత్తా.. సత్తువ.. ఒక్క రేవంత్ రెడ్డికే ఉంది. రెడ్ల వర్గంలో ప్రస్తుతం ఆయనంత మొనగాడు ఇంకెవరూ లేరు. రేవంత్ అంటే రెడ్లు అందరికీ విపరీత అభిమానం ఉన్న.. కాంగ్రెస్ లో ఆయనను అణగదొక్కేయాలని చూసే సీనియర్లు అనేకులు. ఫైర్ బ్రాండ్ లీడర్ రేవంత్ ఒక్క అడుగు ముందుకేస్తే.. మూడు అడుగులు వెనక్కి లాగుతున్నారు సో కాల్డ్ సీనియర్స్. అంత కాంపిటీషన్ లోనూ రేవంత్ రెడ్డి తనదైన స్టైల్ లో దూసుకుపోతున్నారు. ఇప్పటికే రైతు భరోసా పాదయాత్రతో జోరు మీదున్నారు. ఆయనకు పోటీగా.. షర్మిల నిలబడగలరా? రెడ్లను తనవైపు తిప్పుకోగలరా? అనేదే మెయిన్ పాయింట్.  ఇక, పదవిలో ఉన్న రెడ్లు ఇష్టంగానో.. కష్టంగానో.. కేసీఆర్ వెంట ఉన్నారు. పైకి ఎంత గంభీరంగా కనిపిస్తున్నా.. వెలమ దొర కింద పని చేయడానికి రెడ్లు ఒకింత అసంతృప్తితోనే ఉన్నారని అంటున్నారు. సరైన, బలమైన.. రెడ్డి లీడర్ కోసం ఎదురు చూస్తున్నారు? ఆ రెడ్డి.. వైఎస్ షర్మిలరెడ్డి అవుతారా? లేక, రేవంత్ రెడ్డిని ఎంచుకుంటారా? అనేది కాలమే డిసైడ్ చేస్తుంది. అయితే.. రెడ్ల పునరేకీకరణతో అధికార టీఆర్ఎస్ కు గడ్డు కాలమే? షర్మిల ఎంట్రీతో ఈ రెడ్ల సమీకరణం ఎలా మారుతుందనేది ఆసక్తికరం. ఇదే భవిష్యత్ రాజకీయాలను శాసించే కీలక పరిణామం. కొత్త పార్టీతో రెడ్డి వర్గంలో చీలిక వస్తుందా? లేక, రెడ్లందరూ ఏకీక్రుతం అవుతారా? అనే దానిపైనే షర్మిల పార్టీ మనుగడ ఆధారపడి ఉంటుంది.  మైనార్టీలు ఎటువైపు?  దళితులు, క్రిష్టియన్ మైనార్టీలు ఇందిరా కాలం నుంచీ కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా ఉన్నారు. వైఎస్ హయాంలో వారంతా ఆ ఫ్యామిలీ చెంతన.. ఆ తర్వాత టీఆర్ఎస్ పంచన చేరారు. షర్మిల పొలిటికల్ ఎంట్రీతో క్రిష్టియన్లు గంపగుత్తగా ఆ పార్టీ వైపు మళ్లీ అవకాశాలు ఎక్కువే. ఎలాగూ.. షర్మిల భర్త.. బ్రదర్ అనిల్ కుమార్ ఉండనే ఉన్నారుగ. ఆయన్ను, బైబిల్ చేతపట్టిన షర్మిల ఫోటోలను చూసి.. క్రీస్తు ఫాలోయర్స్ అంతా పోలోమంటూ షర్మిల పార్టీ వైపు మళ్లడం ఖాయం. అదే జరిగితే.. ఇప్పటి వరకూ టీఆర్ఎస్ కు హోల్ సేల్ ఓటర్లుగా ఉన్న ఆ వర్గమంతా దూరమవుతుంది. కేసీఆర్ ఓటు బ్యాంక్ దెబ్బతింటుంది. ఇక, మూడు ఎకరాల భూమి ఇస్తానంటూ అరచేతిలో స్వర్గం చూపించి.. చేతులెత్తేసిన ముఖ్యమంత్రిపై దళితులంతా గుర్రుగా ఉన్నారు. వాళ్లు అదను కోసం ఎదురు చూస్తున్నారు. వారికి, షర్మిల ఆశాదీపంగా కనిపించనుంది.  ముస్లింలే కీలకమా? ముస్లింలు సైతం మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి సపోర్టర్స్ గా ఉన్నారు. ఓవైసీ సైతం జగన్ తన ఫ్రెండ్ అంటూ పలుమార్లు ఓపెన్ గానే స్టేట్ మెంట్స్ చేశారు. ఇప్పుడు జగన్ సోదరి షర్మిల పార్టీ పెడుతుండటంతో.. ముస్లిం ఓటర్లు అటు వైపు షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. తెలంగాణలో 12శాతానికి పైగా ఉన్న ఓటర్లు పార్టీల గెలుపు ఓటమిలపై విశేష ప్రభావం చూపగలరు. ప్రస్తుతం టీఆర్ఎస్, ఎమ్.ఐ.ఎమ్. దోస్తీ నడుస్తోంది. అయితే, ఎమ్.ఐ.ఎమ్. కేవలం హైదరాబాద్ కే పరిమితమైన పార్టీ. కాస్తో కూస్తో నిజామాబాద్, ఆదిలాబాద్ లోనూ బలం ఉంది. మిగతా జిల్లాల్లోని ముస్లింలు మాత్రం ఎమ్.ఐ.ఎమ్. వెంట లేరు. వారంతా ఇన్నాళ్లూ టీఆర్ఎస్ కు ఓటేస్తూ వచ్చారు. ఇప్పుడు షర్మిల పార్టీ పెడితే.. ఆమె వైపు ఆసక్తి చూపే అవకాశం లేకపోలేదు. ఆ లెక్కన.. మళ్లీ కారు పార్టీకే మైనస్.  బీసీల ఓట్లు ఎవరికి? టీసీలంటే టీడీపీ.. టీడీపీ అంటే బీసీలు. ఇది ఒకప్పటి మాట. తెలంగాణ ఏర్పాటుతో ఇక్కడ టీడీపీ దాదాపు ఖతం అయింది. బీసీలంతా చెల్లాచెదురయ్యారు. ఎక్కువ శాతం అధికార పార్టీ వైపే షిఫ్ట్ అయ్యారు. వాళ్లంతా చంద్రబాబుకు విరోధి అయిన.. వైఎస్ షర్మిల వైపు ఉండే అవకాశమే లేదు. సో, మెజార్టీ ఓటర్లైన బీసీల మద్దతు కొత్త పార్టీకి దక్కకపోవచ్చు.  నెగ్గుతారా? నెగ్గనిస్తారా? పైపైన చూస్తే.. షర్మిలకు తెలంగాణలో పొలిటికల్ స్కోప్ తక్కువే. కానీ, డెప్త్ గా అనలైజ్ చేస్తే.. రాజకీయ సమీకరణాలను ఎంతోకొంత మార్చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. రెడ్లు, ముస్లింలు, క్రిష్టియన్లు, దళితులు, వైఎస్ అభిమానుల ఓటు బ్యాంకు లెక్కలన్నీ ప్రభావితం అవుతాయి. ఒకవైపు కాంగ్రెస్ బలహీన పడుతుండటం.. అదే సమయంలో రేవంత్ రెడ్డి కీలక నేతగా ఎదుగుతుండటం.. ఇదే టైమ్ లో షర్మిల ఎంట్రీతో తెలంగాణ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంటున్నాయి. ఈ పొలిటికల్ జంక్షన్ లో లీడర్లు, ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనే దానిపై భవిష్యత్ రాజకీయం రంజుగా మారబోతోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ అసంత్రుప్తులంతా రేవంత్ రెడ్డి వైపు మళ్లుతారా? ఆయన వైపు షిఫ్ట్ అవకుండా షర్మిలను రంగంలోకి దించారా? అనే టాక్ కూడా నడుస్తోంది.  షర్మిల.. బీజేపీ వదిలిన బాణమా? షర్మిల కొత్త పార్టీ వెనుక బీజేపీ గేమ్ ప్లాన్ ఉందనే చర్చ జోరుగా నడుస్తోంది. టీఆర్ఎస్ ను, కాంగ్రెస్ ను సాధ్యమైనంత బలహీన పరిచి.. షర్మిలతో నియోజకవర్గాల వారీగా ఎంతో కొంత ఓట్లు చీల్చి.. ఆ మేరకు కమలం పార్టీ ప్రయోజనం పొందనుందని కొందరు విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే హస్తం పార్టీ చతికిల పడింది. బీజేపీ స్పీడు ముందు అధికార టీఆర్ఎస్సే బేజార్ అవుతోంది. ఇక కాంగ్రెస్ ఎంత? ఆ పార్టీ ఉనికి కోసమే తాపత్రయ పడాల్సిన దుస్థితి. దేశ వ్యాప్తంగా బీజేపీకి కాంగ్రెస్సే ప్రధాన శత్రువు కాబట్టి.. తెలంగాణలో హస్తం పార్టీని కోలుకోకుండా దెబ్బతీసి.. శాశ్వతంగా బొంద పెట్టాలనేది కాషాయం స్కెచ్ అనే టాక్. అందుకు.. షర్మిలే కరెక్ట్ అని.. ఆమెను రంగంలోకి దింపారని అంటున్నారు. కాంగ్రెస్ ను చీల్చడానికి.. కుదిరితే షర్మిల.. లేదంటే రేవంత్ రెడ్డిని వాడుకోవాలనేది బీజేపీ గేమ్ ప్లాన్ అని చెబుతున్నారు. మొదట కాంగ్రెస్ ఖతం అయ్యాక.. ఇక సెకండ్ ఎనిమీ కేసీఆర్ ను సైతం షర్మిల + రేవంత్ కాంబినేషన్ తో దెబ్బ కొట్టాలనేది కమలవ్యూహంలా కనిపిస్తోంది.  ఇటు.. షర్మిల బలపడినా.. అటు, రేవంత్ రెడ్డి ఎమర్జ్ అయినా.. చివరాఖరికి.. నదులన్నీ సముద్రంలో కలిసినట్టుగా.. వారంతా బీజేపీలో మెర్జ్ అవుతారని అంటున్నారు. జగన్ తో బీజేపీ ఢిల్లీ పెద్దలు డీల్ కుదుర్చుకొని.. ఆయన డైరెక్షన్ లోనే తెలంగాణపై షర్మిల బాణం వదిలారని పొలిటికల్ సర్కిల్స్ లో డిస్కషన్ నడుస్తోంది. లేదంటే.. గెలిచే సత్తా లేని.. తెలంగాణ ప్రాంతమూ కానీ.. షర్మిల.. సడెన్ గా పార్టీ పెట్టడమేంటి? ఇదంతా.. కాంగ్రెస్, కేసీఆర్ కు చెక్ పెట్టడానికి.. కమలనాథుల కనుసన్నల్లో.. నడుస్తున్న మాస్టర్ ప్లాన్ అనే అంచనాకు వచ్చేశారు. మరి, షర్మిల రూపంలో.. తెలంగాణ పొద్దుపై పొడిచిన కొత్త పార్టీ.. ఏ మేరకు సక్సెస్ అవుతుందో? ఏ మేరకు.. హస్తాన్ని డ్యామేజ్ చేసి.. గులాబీ దళాన్ని ఢీ కొడుతుందో కాలమే డిసైడ్ చేస్తుంది.. అందాకా.. పోరుగడ్డపై పొలిటికల్ ఫైట్ యమ రంజుగా సాగనుంది....

ఒకే దెబ్బకు రెండు పిట్టలు! కేసీఆర్ డైరెక్షన్ లోనే షర్మిల పార్టీ? 

తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామాలు జరుగుతున్నాయి. కొంత కాలంగా జరుగుతున్న ప్రచారమే నిజమైంది. దివంగత వైఎస్సార్ కూతురు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి, వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది.  హైదరాబాద్ లోని లోటస్‌పాండ్‌లో ఆమె  ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వైఎస్ అభిమానులు, అనుచరులు, తెలంగాణకు చెందిన వైసీపీ కార్యకర్తలు, పలువురు నేతలు హాజరయ్యారు. కొత్త పార్టీ ఏర్పాటులో భాగంగానే జగనన్న బాణం ఈ  సమావేశం నిర్వహించారని తెలుస్తోంది.   తెలంగాణలో  షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తన అన్న జగన్ తీరుపై కొంత కాలంగా  షర్మిల ఆగ్రహంగా ఉన్నారని... ఆయనకు షాకిచ్చేందుకే ఆమె కొత్త పార్టీ పెట్టబోతుందని కొందరు చెబుతున్నారు. అయితే  వైఎస్ షర్మిల కొత్త పార్టీ వెనక సంచలన విషయాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో దూకుడు మీదున్న బీజేపీకి బ్రేకులు వేయడంతో పాటు  తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ లీడర్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి టార్గెట్ గానే కొత్త పార్టీకి ప్లాన్ చేశారని తెలుస్తోంది. వైఎస్  షర్మిల పెట్టబోయే పార్టీకి కర్త, కర్మ, క్రియ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరేనని సమాచారం. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా కేసీఆర్ రూపొందించిన  డైరెక్షన్ లోనే షర్మిల పార్టీ వస్తుందని చెబుతున్నారు. సీఎం అయ్యేవరకు లోటస్ పాండ్ నుంచే పార్టీని నడిపించారు జగన్. ఇప్పుడు షర్మిల కూడా లోటస్ పాండ్ నుంచే రాజకీయాలు చేస్తుండటంతో.. జగన్ డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతుందని భావిస్తున్నారు.  తెలంగాణలో ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. కేసీఆర్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత భారీగా పెరిగింది. సీఎం సొంత గడ్డ సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో సిట్టింగ్ సీటును కోల్పోవడం, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ అనుకున్న ఫలితాలను సాధించలేకపోవడంతో ఇది రుజువైంది. వరుస ఓటములతో టీఆర్ఎస్ కేడర్ ఢీలా పడగా.. ఇదే అదనగా విపక్షాలు దూకుడు పెంచాయి. ముఖ్యంగా  ఎంపీ రేవంత్ రెడ్డి జనాల్లోకి దూసుకుపోతున్నారు. గత ఏడేండ్లుగా కేసీఆర్ కుటుంబంపై పోరాడుతున్నారు రేవంత్ రెడ్డి. ఆయన పోరాటానికి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో  రోజురోజుకు ఆయన గ్రాఫ్ పెరిగిపోతోంది.  రేవంత్ రెడ్డి ఇంకా బలపడితే తమకు  మరిన్ని కష్టాలు తప్పవని టీఆర్ఎస్ పెద్దలు ఆందోళనగా ఉన్నారట. అందుకే రేవంత్ రెడ్డి బలం పెరగకుండా చూసేందుకే షర్మిలను రంగంలోకి దింపుతున్నారని చెబుతున్నారు. తెలంగాణలోని  రెడ్డి సామాజికవర్గమంతా ఇప్పుడు అధికారం కోసం తహతహలాడుతోంది. వాళ్లందరికి రేవంత్ రెడ్డి ఆశాకిరణంలా మారిపోయారు. రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు.ఈ నేపథ్యంలోనే వైఎస్ షర్మిలతో కొత్త పార్టీ పెట్టిస్తున్నారని తెలుస్తోంది. దివంగత వైఎస్సార్ కు తెలంగాణలో భారీగా అభిమానులున్నాయి. ముఖ్యంగా రెడ్డి సామాజికవర్గంలో వైఎస్సార్ అంటే ఇప్పటికి క్రేజ్ ఉంది. షర్మిల పార్టీ పెడితే.. రెడ్డి సామాజిక వర్గం నుంచి కొత్త మద్దతు ఆమెకు లభిస్తుందని అంచనా. దీంతో రేవంత్ రెడ్డిని కొంత బలహీనం చేయవచ్చన్నది గులాబీ బాస్ వ్యూహమని చెబుతున్నారు. అందుకే తన మిత్రుడైన జగన్ తో మాట్లాడి.. అతని డైరెక్షన్ లోనే షర్మిల పార్టీకి ఏర్పాట్లు చేస్తున్నారని, తెలంగాణలో రాబోయే కొత్త పార్టీకి ఫండింగ్ కూడా కేసీఆరే సమకూర్చనున్నారని  సమాచారం.   ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ ఫుల్ జోష్ లో ఉంది. సంజయ్ టీమ్ దూకుడుతో ప్రభుత్వ వ్యతిరేకత ఓటు అంతా అటు వైపు వెళుతోంది. ఈ కారణంగానే దుబ్బాక, గ్రేటర్ లో ఓడిపోయామని గులాబీ పార్టీ అంచనా వేసింది. షర్మిల పార్టీ పెడితే... ప్రభుత్వ వ్యతిరేకత ఓటు కూడా కొంత చీలే అవకాశం ఉంది. ఇది అధికార టీఆర్ఎస్ పార్టీకి కలిసి రానుంది. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలో వైసీపీ గతంలో బలంగా ఉండేది. 2014 ఎన్నికల్లో ఖమ్మం ఎంపీతో పాటు మూడూ అసెంబ్లీ సీట్లను వైసీపీ గెలుచుకుంది. వైసీపీ ఓటు బ్యాంకు కూడా షర్మిల పార్టీకి టర్న్ కావొచ్చని భావిస్తున్నారు. షర్మిల పార్టీ ఎన్ని సీట్లు గెలిచినా తమకు ఇబ్బంది ఉండదని.. వచ్చే ఎన్నికల్లో తమకు మెజార్టీ తగ్గినా ఆ  పార్టీ మద్దతు తీసుకోవచ్చనే యోచనలో కేసీఆర్ ఉన్నారంటున్నారు. అందుకే అన్ని పక్కాగా ఆలోచించాకే  వైఎస్ షర్మిలను రంగంలోకి దించుతున్నారని చెబుతున్నారు.   మరోవైపు షర్మిల ఇంటిదగ్గర పెట్టిన ఫ్లెక్సీల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ షర్మిల ఫొటోలు మాత్రమే కనిపిస్తున్నాయి. జగన్ ఫొటో మాత్రం ఎక్కడా లేదు. అయితే ఇది కూడా ప్లాన్ ప్రకారమే జరిగిందంటున్నారు. జగన్ తో సంబంధం లేకుండా సొంతంగానే షర్మిల పార్టీ పెడుతున్నారనే సిగ్నల్ జనంలోకి వెళ్లేందుకే ఇలా చేశారంటున్నారు. మొత్తంగా  మొదటి నుంచి తమకు కొరకరాని కొయ్యలా మారిన రేవంత్ రెడ్డికి బలం పెరగకుండా చూసేందుకే కేసీఆర్, జగన్ కలిసి ఈ కొత్త వ్యూహం పన్నాయని తెలుస్తోంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా రేవంత్ రెడ్డిని దెబ్బకొట్టడంతో పాటు బీజేపీ స్పీడును అడ్డుకోవచ్చనే ఎత్తులో భాగంగానే వైఎస్ షర్మిల పార్టీ తెలంగాణలో వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేసీఆర్ పక్కా స్కెచ్ తో ఇదంతా జరుగుతుందని స్పష్టం చేస్తున్నారు.

గంటా గేమ్ ప్లాన్ ! పైపైకి రాజీనామా.. మ‌రి లోలోనా..?

పైపైకి రాజీనామా.. మ‌రి లోలోనా..? ఏపీలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావుది నిజ‌మైన రాజీనామానా? ల‌ేక‌, 'రాజీ'..'డ్రామా'నా? అనే సందేహం అంద‌రిలోనూ.  విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీ ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు గంటా. ఆయ‌న చిత్త‌శుద్ధిని, రాజీనామాను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎవ‌రూ న‌మ్మ‌డం లేదు. ఇటు స్వ‌ప‌క్షం టీడీపీతో పాటు.. అధికార వైసీపీ సైతం ఆ.. అంతా ఉత్తుత్తి రాజీనామానే అంటూ తేల్చేస్తున్నారు. ఇంత త్యాగం చేసి.. అంత క‌స్ట‌ప‌డి గెలిచిన‌ ప‌ద‌విని తృణ‌ప్రాయంగా వ‌దిలేస్తే.. చివ‌రికి మిగిలింది ఇంతేనా..? ఫ‌లిత‌మేమీ లేదా..? గంటా మ‌దిని తొలిచివేస్తున్న ఆవేద‌న ఇది. అందుకు కార‌ణాలు అనేకం... రాంగ్ ఫార్మాట్‌లో రాజీనామా!  గంటా శ్రీనివాస‌రావు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన తీరే సందేహాల‌కు అసలు కార‌ణం. స్పీక‌ర్‌కు రిజైన్ లెట‌ర్ ఇవ్వాలంటే దానికో ప‌ద్ద‌తి, ఫార్మాట్ ఉంటుంది. రాజీనామాకు కార‌ణాలు చెప్ప‌కుండా.. ప‌ద‌వి వ‌దులుకుంటున్న‌ట్టు సింపుల్‌గా, సూటిగా లేఖ‌లో రాయాల్సి ఉంటుంది. ఆ ఫార్మాట్ ఏమాత్రం అటూ ఇటూగా ఉండ‌కూడ‌దు. రాజీనామా లెట‌ర్ స్పీక‌ర్ ఫార్మాట్‌లో లేకుంటే.. స‌భాధ్య‌క్షుడిదే ఫైన‌ల్ డిసిషన్‌. రూల్స్ ఇంత సూటిగా, సుస్ప‌స్టంగా ఉంటే... గంటా శ్రీనివాస‌రావు మాత్రం ఏకంగా స్పీక‌ర్‌కే కండీషన్స్ పెట్టినట్టు రాజీనామా లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ పరిరక్షణ కోసం రాజీనామా చేస్తున్నానని, ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయాలన్న నిర్ణయం అమలులోకి వచ్చిన తర్వాత రాజీనామాను ఆమోదించాలని కోరారు. ఇలా చేసిన రాజీనామా సాంకేతికంగా చెల్లుబాటు కాదనేది నిపుణుల మాట‌. ఇంత చిన్న విషయం.. సుదీర్ఘకాలం ప్ర‌జాప్ర‌తినిధిగా ఉన్న గంటా శ్రీనివాస‌రావుకు తెలియంది కాద‌నేది అంద‌రికీ తెలిసిందే. అందుకే.. ఆయ‌న చేసిన రాజీనామాను.. రాజీ..డ్రామా అంటున్నారు విశాఖ‌వాసులు. 'రాజీ'.. 'డ్రామా'.. ఏంటంటే..? ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీలో గంట మోగుతుంటుంది. గంటా శ్రీనివాస‌రావు రాజ‌కీయ చ‌రిత్ర అలాంటిది మ‌రి. 2009లో పీఆర్పీ నుంచి గెలిచిన గంటా.. ఆ ఉద‌యిస్తున్న సూర్యుడు హ‌స్తం పార్టీలో అస్త‌మ‌యం అయ్యాక‌.. శ్రీనివాస‌రావుకు మంత్రి ప‌ద‌వి రావ‌డం అనూహ్య‌మే. కిర‌ణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లో గంట గ‌ట్టిగానే మోగింది. ఆ త‌ర్వాత‌ 2014 నాటికి టీడీపీ ప్ర‌భంజ‌నం చూసి.. పార్టీ మార్చి.. సైకిల్ గంట‌గా మారిపోయారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో కీల‌క మంత్రిగా హ‌వా కొన‌సాగించారు. 2019లోనూ గంటాకు ఎమ్మెల్యేగా మ‌రో అవ‌కాశం ఇచ్చారు విశాఖ ఉత్త‌ర ఓట‌ర్లు. అయితే.. తాను గెలిచినా.. టీడీపీ అధికారం కోల్పోవ‌డంతో.. 20 నెల‌లుగా గంట మూగ‌బోయింది. ఇప్పుడు అనూహ్యంగా.. విశాఖ ఉక్కు కోస‌మంటూ.. గంట మ‌రోసారి మారుమోగుతోంది. ఇన్నాళ్లూ ప్రజాస‌మ‌స్య‌ల‌పై మౌనంగా ఉన్న శ్రీనివాస‌రావు.. స‌డెన్‌గా రాజీనామా చేసేంత యాక్టివ్‌గా ఎందుకు మారార‌నేదే ప్ర‌శ్న‌. విశాఖ ఉక్కు క‌ర్మాగారం ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా సొంతంగా ఉద్య‌మానికి సన్నాహాలు చేస్తూ.. దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌డం వెనుక రాజ‌కీయ ఎత్తుగ‌డ దాగుంద‌నేది వైజాగ్‌లో ఓపెన్ టాక్‌. టీడీపీని వీడేందుకే.. వైసీపీలో చేరేందుకే.. రాజీనామా డ్రామా అంటూ అంతటా చర్చ. గోడ మీద గంటా..! రాజ‌కీయాల్లో నేత‌లు గోడ మీద పిల్లిలా పార్టీలు మార‌డం కామ‌న్‌. అందులో గంటా శ్రీనివాస‌రావు మ‌రింత ఎక్స్‌ప‌ర్ట్. ప‌వ‌ర్‌లో ఉన్న పార్టీలోనే ఆయ‌న ఉంటార‌నే టాక్‌. ఏడాదిన్న‌ర‌గా ఆ ప‌వ‌ర్ లేకుండా‌.. గంటా ఉండ‌లేక‌పోతున్నార‌ట‌. అందుకే.. ఎప్పుడెప్పుడు అధికార పార్టీలోకి జంప్ చేద్దామా అని తెగ ఇదైపోతున్నార‌ట‌. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఎపిసోడ్‌తో.. అనుకోకుండా అందివ‌చ్చిన అవ‌కాశాన్ని గంటా స‌రిగ్గా క్యాచ్ చేశార‌ని అంటున్నారు. ఇదే స‌రైన స‌మ‌య‌మంటూ.. ఆల‌సించినా ఆశాభంగ‌మంటూ.. రాజీనామా అస్త్రాన్ని సంధించార‌ని చెబుతున్నారు. ఇదంతా ఉక్కు క‌ర్మాగారంపై ప్రేమ‌తోనో.. విశాఖ వాసుల‌పై అభిమానంతో చేసింది కాదంటూ... కేవ‌లం వైసీపీలోకి చేరేందుకే రాజీనామా డ్రామా అంటూ అన్ని పార్టీల నేత‌లూ ఆరోపిస్తున్నారు. అధికార పార్టీతో అంట‌కాగ‌డం కోసం ముందస్తు స‌న్నాహాల్లో భాగంగా.. ఉక్కు కోసం ఉత్తుత్తి ఉద్య‌మం ఊసెత్తుతున్నార‌ని లైట్ తీసుకుంటున్నారు. గంటా క‌మిట్‌మెంట్‌పై ఎవ‌రికీ పెద్ద‌గా గురి లేదు. విశాఖ కేంద్రంగా వైసీపీ నేత‌లు ఎన్ని అరాచ‌కాల‌కు పాల్ప‌డుతున్నా.. ప‌ట్టించుకోకుండా.. ఇన్నాళ్లూ మౌన‌రాగం ఆల‌పించి.. ఇప్పుడు ఒక్క‌సారిగా నిద్ర లేచి.. నేను సైత‌మంటూ ఉక్కు పిడికిలి బిగించ‌డం.. ఫ్యాన్ గాలి కోస‌మేన‌నేది విశ్లేషకుల మాట‌.  గంటాకు గ్రాండ్ వెల్‌క‌మ్! విశాఖ‌లో రాజ‌ధాని అంటూ ప్ర‌భుత్వం ఎంత బిల్డ‌ప్ కొడుతున్నా.. స్థానిక ప్ర‌జానీకంలో మాత్రం చెప్ప‌లేని భ‌యాందోళ‌న‌లు. కేపిట‌ల్ పేరుతో ల్యాండ్ మాఫియా పెరుగుతుంద‌ని.. వైసీపీ నేత‌ల‌ రౌడీయిజం రెచ్చిపోతుంద‌ని.. ప్ర‌శాంత సాగ‌ర తీరంలో క‌ల్లోలం చెల‌రేగుతుంద‌ని.. ఇలా ప్ర‌జ‌ల్లో అనేక అనుమానాలు. అందుకే.. ప్ర‌భుత్వంపైనా.. స్థానిక వైసీపీ నేత‌ల‌పై.. తీవ్ర స్థాయిలో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదే స‌మ‌యంలో విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ వెనుక ప్ర‌భుత్వ హ‌స్తం ఉంద‌నే ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది. జ‌గ‌న్ క‌నుస‌న్న‌ల్లోనే పోస్కో ఎంట్రీ ఇస్తోందని.. అదంతా క్విడ్ ప్రొకోలో భాగ‌మంటూ అంతా చర్చించుకుంటున్నారు.  విశాఖ ఉక్కు- ఆంధ్రుల హ‌క్కు. ఉత్త‌రాంధ్ర వాసుల సెంటిమెంట్‌. ద‌శాబ్దాల వెనుక‌బాటును త‌రిమేసి.. ఆర్థిక స్థిర‌త్వాన్ని ఇచ్చిన స్టీల్ ఫ్యాక్ట‌రీ ఇక మీద త‌మ‌ది కాకుండా పోతుంద‌నే ఆలోచనను వారు ఏమాత్రం జీర్ణించుకోలేక‌పోతున్నారు. ప్ర‌త్యక్షంగా, ప‌రోక్షంగా... ల‌క్షలాది మంది ప్ర‌జ‌లకు అదే జీవ‌నాధారం. అందుకే.. విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌ను స్థానికులంతా తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. అటు కేంద్రం.. ఇటు రాస్ట్ర ప్ర‌భుత్వ తీరుకు నిర‌స‌న‌గా.. ఆందోళ‌న‌ల‌తో తూర్పు తీరం ఎరుపెక్కుతోంది. ఆ ప్ర‌జాగ్నికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం మాడిమ‌సి కావ‌డం త‌థ్యం.   గంటా.. వైసీపీ గేమ్ ప్లానా? ప్ర‌జాక్షేత్రంలో వ‌స్తున్న వ్య‌తిరేక‌త‌ను తప్పించుకోడానికి ప్రెష్ ఫేస్ కోసం ప్ర‌య‌త్నం చేస్తోంది వైఎస్సార్ సీపీ. ప్లాన్‌-బీ లో భాగంగా.. టీడీపీకి చెందిన స్ట్రాంగ్ లీడ‌ర్ గంటా శ్రీనివాస‌రావుకు గాలం వేసింది. ఆయ‌న సైతం ఎప్పుడెప్పుడు గోడ దూకుదామా అన్న‌ట్టూ రెడీగా ఉన్నారు. పార్టీ అధినేత చంద్ర‌బాబుకు సైతం చెప్ప‌కుండా, చ‌ర్చింకుండా.. రాజీనామా చేసేయ‌డం వ్యూహాత్మ‌క‌మే అంటున్నారు. త్వ‌ర‌లోనే విశాఖ కార్పొరేషన్‌కు ఎన్నిక‌లు జ‌ర‌గొచ్చు. ప్రస్తుత ప‌రిస్థితుల్లో ఎల‌క్షన్ వ‌స్తే.. వైసీపీకి ఘోర ప‌రాభవం ఖాయం. టీడీపీకి ప్ర‌జాబ‌లం రోజురోజుకూ పెరుగుతోంది. అందుకే.. గంటాను సైకిల్ మీద నుంచి దించేసి.. ఆయ‌న‌తో ఫ్యాన్‌కి రిపేర్ చేయించాల‌నేది వైసీపీ ఎత్తుగ‌డ అంటున్నారు. లోలోన‌.. ఇప్ప‌టికే గంటాకు, వైసీపీ అధిష్టానానికి మ‌ధ్య డీల్ కుదిరింద‌ని చెబుతున్నారు. పైకి మాత్రం అధికార పార్టీ నేత‌ల నుంచి గంటా శ్రీనివాస‌రావుకు కౌంట‌ర్లు ప‌డుతున్నాయి. ఆయ‌న చేసిన రాజీనామాను డ్రామ అంటూ వైఎస్సార్‌సీపీ లీడ‌ర్లే త‌ప్పుబ‌డుతున్నారు. అవంతి శ్రీనివాస్‌, అంబ‌టి రాంబాబు లాంటి లీడ‌ర్లు రాజీనామాపై సెటైర్లు వేయ‌డం.. అధికార పార్టీ మీడియాలో నెగ‌టివ్ వార్త‌లు రావ‌డం.. అంతా పొలిటిక‌ల్ ‌గేమ్‌లో భాగమే..న‌ట‌. పైపైకి గంటాను విమ‌ర్శిస్తున్న‌ట్టు న‌టిస్తూ.. ఆయ‌న ఇమేజ్‌ను ఇంకాస్త పెంచేసి.. ఆ త‌ర్వాత పార్టీ కండువా క‌ప్పేసి.. ప‌బ్లిక్‌ను క‌న్ఫూజ్ చేసేసి.. ఎన్నిక‌ల్లో లాభ‌ప‌డాల‌నేది వైసీపీ మాస్ట‌ర్ ప్లాన్! ఇందులో నిజ‌మెంత అనేది.. వైజాగ్‌లో ఎవ‌రిన‌డిగినా చెబుతారు. ఇంకేమైనా డౌట్ ఉంటే.. కేంద్రానికి జ‌గ‌న్ లేఖ రాయ‌డం.. ఆ వెంట‌నే గంటా శ్రీనివాస‌రావు ముఖ్య‌మంత్రికి థ్యాంక్స్ చెప్ప‌డం గుర్తు చేసుకుంటే చాలు.. లోలోన ఏం జ‌రుగుతోందో ఇట్టే  అర్థ‌‌మైపోతుంది..!

ఆలయాల పేరుతో డేంజర్ గేమ్! ఏపీని కాపాడుకున్న చంద్రబాబు 

ఆలయాలపై  దాడుల వెనక రాజకీయ కుట్ర ఉందా? ఒక పార్టీని బలహీనం చేయాలనే వ్యూహం ఉందా?  ఏపీలో  కొంత కాలంగా  జరిగిన వరుస పరిణామాలతో ఇవే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలతో ఆ అనుమానాలు నిజమేనని భావించాల్సి  వస్తోంది. వైసీపీ సర్కార్ వచ్చాకా ఆలయాలపై వరుసగా దాడులు జరిగాయి. వందలాది ఆలయాలను దండుగులు టార్గెట్ చేశారు. అంతర్వేది రథం దగ్ధం, కనకదుర్గ అమ్మవారి వెండి రథం సింహాలు మాయం వంటి ఘటనలు జరిగాయి. రామతీర్థంలోని కోదండ రామాలయంలో రాముడి విగ్రహాన్ని ముక్కలు చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆలయాలపై దాడులతో జనాల్లో కూడా అలజడి వచ్చింది. ఆ సమయంలోనే దీనివెనుక రాజకీయ కోణం ఉందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. రామతీర్థం ఘటనపై సీరియస్ గా స్పందించింది టీడీపీ. చంద్రబాబు రామతీర్థం వెళ్లి ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించారు. ఆ తర్వాత రాష్ట్రంలో ఆలయాలపై దాడులు ఒక్కసారిగా ఆగిపోయాయి. అంతకు ముందు రోజూ ఏదో ఒక చోట ఆలయాలపై దాడులు జరగగా.. చంద్రబాబు  రామతీర్థం వెళ్లిన తర్వాత ఆగిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.  ఆలయాలపై జరిగిన దాడుల ఘటనలపై జగన్ సర్కార్ స్పందించిన తీరు అనుమానాలకు తావిచ్చింది. రథాలు తగలబడితే తేనేటీగలు కారణమని, ఆలయాలపై దాడులు జరిగితే పిచ్చోడి చర్య అని, విగ్రహాల విధ్వంసం గుప్తనిధుల వేటగాళ్ల పనేనని వైసీపీ ప్రభుత్వం వివరణ ఇస్తూ వచ్చింది.  ఆంజనేయ స్వామి చెయ్యి విరిగితే రక్తం వస్తుందా? రాముడి విగ్రహం తల తెగిపడితే ప్రాణం పోతుందా? అని  మంత్రి కొడాలి నాని లాంటి వారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీంతో విభజించు.. ఓట్లు పట్టు అనే సిద్ధాంతంతో టీడీపీ టార్గెట్ గా బీజేపీ, వైసీపీ గేమ్ ఆడుతున్నాయనే చర్చ వచ్చింది. ఆలయాలపై దాడులు జరుగుతుండటంతో హిందువుల్లో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇదే అదనుగా  హిందుత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీ.. హిందువులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోందనే  అనుమానాలు వచ్చాయి. మతాలుగా ఓట్లను చీల్చి, వాటిని రెండు పార్టీలు పంచుకొని  ఏపీలో టీడీపీని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడ్డారు.  తెలంగాణలోని గ్రేటర్ ఎన్నికల్లో మత రాజకీయాలే రాజ్యమేలాయి. బీజేపీ, ఎంఐఎం పార్టీలు హిందూ, ముస్లిం అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాయి. మత పరమైన విమర్శలతో గ్రేటర్ ఎన్నికల్లో రెండు పార్టీలు లబ్దిపొందాయి. ఎప్పటిలానే మెజారిటీ ముస్లిం ఓట్లు ఎంఐఎంకు పడగా.. బీజేపీ అనూహ్యంగా  35 శాతానికి పైగా ఓట్లు సాధించింది. మత పరమైన వ్యాఖ్యలతో ఇతర పార్టీలకు వెళ్లాల్సిన హిందూ ఓట్లను రాబట్టడంలో బీజేపీ సక్సెస్ అయింది. అదే సమయంలో గ్రేటర్ లో గతంలో బలంగా ఉన్న కాంగ్రెస్, టీడీపీ లు పూర్తిగా వెనకబడి పోయాయి. ఓటర్లు మత పరంగా చీలడం వల్లే కాంగ్రెస్, టీడీపీకి భారీగా నష్టం జరిగిందని ఫలితాల తర్వాత తేలింది. గ్రేటర్ ఎన్నికల వ్యూహాన్నే ఏపీలో వైసీపీతో కలిసి బీజేపీ అమలు చేస్తుందని అంటున్నారు. గ్రేటర్ లో ఎలాగైతే మెజారిటీ ముస్లిం ఓటర్లు ఎంఐఎం వైపు ఉంటారో.. అలాగే ఏపీలో మెజారిటీ క్రిస్టియన్, ముస్లిం ఓటర్లు వైసీపీ వైపు ఉంటారు. ఇక్కడ కూడా బీజేపీ బలపడాలంటే హిందూ ఓట్లను తన వైపు తిప్పుకోవాలి. అదే జరిగితే ఏపీలో టీడీపీ భవిష్యత్ ప్రశ్నార్థకమే. ఈ ప్రయత్నమే  ఏపీలో జరిగిందని అంటున్నారు.   ఏపీలో జరుగుతున్న రాజకీయ కుట్రలను గమనించడం వల్లే కరోనాతో 9 నెలలుగా క్షేత్రస్థాయిలో పర్యటించని చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారంటున్నారు. చంద్రబాబు రామతీర్థం వెళ్లడమే కాదు..  అక్కడ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. హిందూ నినాదం బలంగా వినిపించారు. హిందూ భక్తులమని చెప్పుకునే బీజేపీ నేతల కంటే తీవ్రంగా మాట్లాడారు టీడీపీ అధినేత. జగన్ రెడ్డి పాలనలో హిందూ ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించిన చంద్రబాబు.. హిందూ ఆలయాల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రామ తీర్థంలో చంద్రబాబు ప్రసంగం విన్న తర్వాత బీజేపీ నేతలే షాకయ్యారని చెబుతున్నారు. చంద్రబాబు హిందూ వాదం గట్టిగా వినిపించడంతో కమలనాధులు కలవరపడ్డారని తెలుస్తోంది. హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులను అస్త్రంగా మలుచుకుని బలపడాలని చూసిన తమకు చంద్రబాబు దెబ్బ కొట్టారనే చర్చ బీజేపీ నేతల్లో జరిగిందంటున్నారు. తమ కంటే హిందూ సమాజంలో చంద్రబాబే హీరోగా నిలిచారనే అభిప్రాయానికి వచ్చారట. అంతేకాదు చంద్రబాబు రామతీర్థం వెళ్లి రాగానే  ఆలయాలపై దాడులు ఆగిపోయాయి. దీంతో దాడుల వెనక రాజకీయ కుట్ర ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది.     ఏపీలో  ఆలయాలపై జరుగుతున్న దాడులు, రాజకీయ పరిణామాలు ప్రమాదకరంగా ఉన్నాయని గ్రహించడం వల్లే   పీఠాధిపతులు, ఉత్తరాధికారులు సాధుసంతులు ఏకమయ్యారని తెలుస్తోంది.  ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులోని పొన్పాడి గ్రామం శివారులోని కంచిపీఠానికి చెందిన ఓ ఆశ్రమంలో సనాతన ధర్మ పరిరక్షణ పేరిట బుధవారం సదస్సు జరిగింది. ఏపీ, తమిళనాడుకు చెందిన పీఠాధిపతులు, ఉత్తరాధికారులు సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. కంచికామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి, దక్షిణామ్నాయ శృంగేరి జగద్గురు పీఠాధిపతి భారతీతీర్థ మహాస్వామి ప్రతినిధి గౌరీశంకర్‌, హంపీ విద్యారణ్య మహాసంస్థాన పీఠాధిపతి విద్యారణ్య భారతి, పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి, తుని సచ్చిదానం తపోవన పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి, అహోబిల మఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ స్వామి, ముముక్షుజన మహాపీఠాధిపతి ముత్తీవి సీతారాం,  తదితరులు పాల్గొన్నారు. ఏపీలో హిందూ సమాజంపై జరుగుతున్న దాడుల గురించి విస్తృతంగా చర్చించారు. కంచికామకోటి శంకర పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో తిరుపతి వేదికగా త్వరలోనే మహాసభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.      మొత్తంగా ఏపీలో ఆలయాలపై వరుసగా జరిగిన దాడుల వెనక రాజకీయ కుట్ర ఉందనే విషయం తాజా పరిమాణాలతో స్పష్టమవుతోంది. టీడీపీని టార్గెట్ చేయడానికి ఆలయాల పేరుతో ప్రమాదకరమైన గేమ్ ఆడారని తెలుస్తోంది. ఇప్పుడు అన్ని నిజాలు తెలుస్తుండటంతో ఏపీ ప్రజలు షాకవుతున్నారు. ఓట్ల రాజకీయం కోసం ఇంత నీచానికి దిగజారుతారా, ప్రజల మధ్య చిచ్చు పెడతారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. మరోవైపు చంద్రబాబు సీరియస్ గా స్పందించడం వల్లే రాష్ట్రంలో శాంతి నెలకొందనే చర్చ కూడా జరుగుతోంది. చంద్రబాబు రామ తీర్థం వెళ్లి ఘాటుగా మాట్లాడకపోతే... రాష్ట్రం అత్యంత ప్రమాదకరస్థితికి వెళ్లేదనే అభిప్రాయం రాజకీయ నిపుణుల నుంచి వస్తోంది.

విశాఖ  ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేస్తున్న కేంద్రం! జగన్ రెడ్డి మౌనంపై మండిపడుతున్న జనం  

విశాఖ ఉక్కు ఇక అంధ్రుడికి గతమే.  జగన్ రెడ్డి సర్కార్ మొద్దు నిద్రతో ‘విశాఖ ఉక్కు...ఆంధ్రుల హక్కు’ అంటూ పోరాడి సాధించుకున్న కర్మాగారాన్ని అమ్మేస్తోంది  కేంద్ర ప్రభుత్వం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తోంది.  విశాఖ స్టీలు ప్లాంటును ప్రైవేటీకరిస్తున్నట్లు కేంద్ర డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే ట్వీట్ చేశారు. దీనికి గ‌త నెల‌లో జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదముద్ర వేసినట్లు చెప్పారు.  విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో(రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌) పెట్టుబడులను ఉపసంహరించాలని కొన్నాళ్లుగా కేంద్రం భావిస్తోంది. ఇందు కోసం ముందుగా పోస్కోను రంగంలోకి దింపింది. దక్షిణ కొరియాకు చెందిన ఈ సంస్థ నాణ్యమైన స్టీల్‌ను తయారుచేస్తుందని, విశాఖ ఉక్కుకు చెందిన భూములు దానికి ఇవ్వడానికి ఒప్పందం చేసుకుంది. కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నా పట్టించుకోలేదు. చివరికి ఏకంగా 100 శాతం వాటా విక్రయించడానికి నిర్ణయం తీసుకుంది. ఇంత జరుగుతున్నా ఏపీ సర్కార్ లో కదలిక  ఆరోపణలు వస్తున్నాయి.  విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తున్నా వైసీపీ ప్రభుత్వం మౌనంగా ఉండటంపై ఆంధ్రా జనం మండిపోతున్నారు. ఆంధ్రుల హక్కుగా పోరాడి సాధించుకున్న కర్మాగారాన్ని కేంద్రం అమ్మేస్తున్నా స్పందించకపోవడం దారుణమంటున్నారు.  విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తున్నా వైసీపీ ప్ర‌భుత్వం క‌నీసం ప్ర‌శ్నించ‌లేక‌పోతోంద‌ని టీడీపీ ఆరోపిస్తోంది. 'వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుమతి ఇచ్చిన కేంద్రం. దీని పైన నోరు విప్పని వైసీపీ ప్రభుత్వం, వైఎస్ జ‌గ‌న్. ప్రైవేటీకరణ పేరుతో ఉక్కు పరిశ్రమను నొక్కిన కేంద్రం' అంటూ టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు. కార్మిక ఉక్కు సంకల్ప శక్తితో ఎదిగిన ఉక్కు కర్మాగారానికి కేంద్ర ప్ర‌భుత్వం చేయూతను ఇవ్వాల్సింది పోయి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కి ఇవ్వడం ఆక్షేపణీయం. ఇదేనా పరిపాలన..? ఇదేనా అచ్చే దిన్.. న‌రేంద్ర మోదీ?' అని గోరంట్ల బుచ్చయ్చ చౌద‌రి ప్ర‌శ్నించారు.  ఆంధ్రుల పోరాటంతో  ఏర్పాటయిన విశాఖ ఉక్కులో నూటికి నూరుశాతం కేంద్రం పెట్టుబడులు ఉన్నాయి. ఏటా 6.3 మిలియన్‌ టన్నుల ఉత్పాదక సామర్థ్యం ఈ పరిశ్రమ సొంతం. విశాఖ ఉక్కులో 17 వేల మంది పర్మనెంట్‌ ఉద్యోగులతో పాటు మరో 15 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. ఉత్పత్తి సామర్థ్యం 63 లక్షల టన్నులు.  2017 నుంచి విశాఖ ఉక్కు భారీ నష్టాలతో నడుస్తోంది.  ఉత్పత్తి తగ్గించుకోవలసి వచ్చింది. విశాఖ ఉక్కుకు సొంత గనులు లేవు. ముడి ఇనుమును మార్కెట్‌ ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. దాంతో ఉత్పత్తి వ్యయం అధికంగా ఉంటోంది. ఇదే నష్టాలకు అసలు కారణమని గతంలోనే నిపుణులు నివేదికలు ఇచ్చారు. కరోనా నేపథ్యంలో ఇప్పుడు మరింత సంక్షోభంలో చిక్కుకుంది.  విశాఖ ఉక్కులో 2017-18లో 16,618 కోట్ల అమ్మకాలు జరగ్గా... రూ.1,368 కోట్ల నష్టాన్ని నమోదుచేసింది. ఆ తరువాత ఏడాది 2018-19లో రూ.20,844 కోట్ల అమ్మకాలు జరగడంతో నష్టాలను రూ.97 కోట్లకు తగ్గించగలిగింది. 2019-20లో అమ్మకాలు భారీగా పడిపోయాయి. అమరావతిలో నిర్మాణాలు సహా పలు భారీ ప్రాజెక్టులు నిలిచిపోవడం, కరోనా, లాక్‌డౌన్‌ వంటి కారణాలతో రూ.15,920 కోట్ల దగ్గరే ఆగిపోయాయి. దాంతో రూ.3,910 కోట్లకు నష్టాలు పెరిగాయి. ఆ తరువాత ముడి ఇనుము, కోకింగ్‌ కోల్‌, డోలమైట్‌ వంటి ముడి సరకుల ధరలు పెరగడంతో ఉత్పత్తి వ్యయం పెరిగింది. అయితే గత డిసెంబరులో స్టీల్‌ రేట్లు పెరగడంతో మంచి అమ్మకాలు జరిగాయి. ఒక్క డిసెంబరులోనే రూ.2,200 కోట్లు విక్రయాలు చేసి, రూ.200 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇదే ధరలు కొనసాగితే రెండేళ్లలో లాభాల బాటలోకి వస్తుందని కార్మిక వర్గాలు చెబుతున్నాయి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విక్రయించకుండా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించడానికి అనేక మార్గాలు ఉన్నాయని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ప్రస్తుతం స్టీల్‌కు డిమాండ్‌ పెరిగింది. టన్ను టోకున రూ.50 వేలు చొప్పున విక్రయిస్తున్నారు. గత డిసెంబరులో రూ.2,200 కోట్ల విలువైన ఉత్పత్తులు విక్రయించగా, రూ.200 కోట్ల నికర లాభం వచ్చింది. సమీప భవిష్యత్తులోను ఇదే ఒరవడి కొనసాగుతుందని, అమ్మకాలు బాగుంటాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఒక్క రెండేళ్లు మార్కెట్‌ బాగుంటే నష్టాలను రికవరీ చేసి మళ్లీ లాభాల బాటలోకి వస్తామని, ప్రైవేటీకరణ చేయవద్దని, వాటాలు విక్రయించవద్దని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.  రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో పోరాడి ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం కాకుండా చూడాలని కోరుతున్నారు.  

జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమే! ఎస్ఈసీ నిమ్మగడ్డ మనోగతం

ఆంధ్రప్రదేశ్ లో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, జగన్ సర్కార్ మధ్య వార్ ముదురుతోంది.  నిమ్మగడ్డపై చర్యలకు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సిద్దమవుతుందనే ప్రచారం జరుగుతోంది. రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న ఎస్ఈసీ నిమ్మగడ్డకు.. మరో రాజ్యాంగ బద్ద కమిటితోనే చెక్ పెట్టే స్కెచ్ సీఎం జగన్ టీమ్  వేసిందని తెలుస్తోంది. అయితే ఏపీ సర్కార్ తాజా పరిణామాలపై తన అనుచరుల దగ్గర స్పందించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్..  కీలక, ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ, జగన్ సర్కార్ తీరుపై ఆయన తన మనోగతం స్పష్టం చేశారు.    ఎస్ఈసీగా తాను ఎన్నికల వ్యవస్థను కాపాడుతున్నానని చెప్పారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. గతంలో సహేతుక కారణాలతోనే ఎన్నికలను వాయిదా వేశానని తెలిపారు. పార్టీల పట్ల తనకు పక్షపాతం లేదన్న నిమ్మగడ్డ... తనకు ఎవరితోనూ వ్యక్తిగత వైర్యం లేదన్నారు. వ్యక్తులతో రాజకీయం చేయాల్సిన అవసరం తనకు అంతకంటే లేదన్నారు. ఎన్నికల వ్యవస్థను కాపాడం కోసం రాజ్యాంగ విధి నిర్వహణలో కమిషనర్ అధికారులను , బాధ్యతను కాపాడం కోసమే  కోర్టులకు వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు నిమ్మగడ్డ. ఒక వ్యవస్థ, మరో వ్యవస్థలోకి చొరబడటం ప్రజాస్వామ్య వ్సవస్థకు మంచిది కాదన్నారు ఎస్ఈసీ.  భారత రాజ్యాంగ ప్రకారం మూడు వ్యవస్థలు స్వతంత్ర ప్రతిపత్తి, స్వయం ప్రతిపత్తి, సాకారం, సమన్వయంతో  పని చేయాల్సి ఉందన్నారు. కార్యనిర్వహణ వ్యవస్థతో తలపడాలని తానెప్పుడు  కోరుకోలేదన్నారు.  రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్నందున.. ఆ విధి నిర్వహణలో భాగంగా  ప్రభుత్వ సహకారంతోనే గత ఏడాది ఎన్నికల షెడ్యూల్ విడుల చేశామని నిమ్మగడ్డ అన్నారు. కరోనా తదితర కారణాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చిందిన్నారు.ఇప్పుడు దేశమంతా పరిస్థితులు మారిపోయాయని,  అనేక చోట్ల స్థానిక ఎన్నికలు, అసెంబ్లీ, పార్లమెంట్  ఉప ఎన్నికలు జరుగుతున్నాయని నిమ్మగడ్డ చెప్పారు. మనకు కూడా గ్రామీణ వ్యవస్థ పటిష్టంగా ఉండటం కోసమే పంచాయతీ ఎన్నికల నిర్వహిస్తున్నామన్నారు.  రాజ్యాంగ పరిధికి లోబడి.. న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని తన సన్నిహితులతో చెప్పారు నిమ్మగడ్డ రమేష్ కుమార్.           తాను గవర్నర్ కు రాసిన లేఖలన్ని అధికారకమైనవి, అత్యంత రహ్యస ప్రధానమైనవని చెప్పారు ఎస్ఈసీ నిమ్మగడ్డ. ఆ లేఖల అంశాల ఆధారంగా కొన్ని  వ్యూహాత్మక కథనాలను ఆధారంగా చేసుకుని... మంత్రులు హక్కుల తీర్మానం పెడితే భయపడటానికి తానేమి పిరికివాడిని కానని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో గాని, రాజ్యాంగ పరిరక్షణలో గాని ఎలాంటి  విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి తాని సిద్దమని,  అవసరమైతే జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ . తాను ఎవరి హక్కులు హరించలేదని, తన హక్కులను ఎవరైనా  హరించాలనుకుంటే మాత్రం తగిన మూల్సం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వృత్తి పరంగా తప్పు చేయనంత కాలం.. వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించనంత కాలం తాను నిప్పులాంటి మనిషేనని చెప్పారు నిమ్మగడ్డ. 40 సంవత్సరాల వృత్తి జీవితంలో ఏ తప్పు చేయలేదని తన అనుచరులతో ఆయన స్పష్టం చేశారు.. వ్యక్తిగతంగా తానెవరిని దూషించడం లేదని, ఒకవేళ ఎవరైనా తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నస్తే మాత్రం భయపడేది లేదని చెప్పారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.

నిర్మలమ్మ బడ్జెట్లో  ఎన్నికల తాళింపులు 

పిండి కొద్దీ రొట్టె ... ఇది అందరికీ తెలిసిన సామెత. ఇప్పుడు ఈ సామెతను ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందో వేరే చెప్పనక్కర లేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంట్ ‘లో ప్రవేశ పెట్టిన 2021-22 వార్షిక బడ్జెట్’ ఈ సామెతను గుర్తుకు తెచ్చింది.  ఆర్థిక మంత్రి తొలి సరిగా బడ్జెట్’ను డిజిటల్ రూపంలో ప్రవేశ పెట్టారు.అయితే ఇదేదో సాంకేతికంగా సాధించిన విజయానికి సంకేతం కాదు .. . తగ్గుముఖమ పట్టినా ఇంకా వెంటాడుతున్న కరోనా భయంతోనే కాగితాన్ని పక్కన పెట్టి డిజిటల్ మార్గం పట్టారు. ఇలా కాగితం ముక్క లేకుండా బడ్జెట్ ప్రవేశ పెట్టడం, బడ్జెట్ నేపధ్యాన్ని భవిష్యత్’ను కళ్ళముందు నిలబెడుతోంది.పదినెలలకు పైగా,దేశ ఆర్థిక వ్యవస్థనే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చావుదెబ్బ తీసిన కొవిడ్ మహమ్మారి నేపధ్యంగా,ఇంకా తొలగని, కొవిడ్ ప్రభావం నుంచి ఆర్ధిక వ్యవస్థ ఎదుర్కుంటున్న భయంకర సవాళ్ళను ముందుంచుకుని, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్,బడ్జెట్’ను రూపొందించారు.  ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగాన్ని జాగ్రత్తగా గమనిస్తే, ఎక్కడాకూడా నెల విడిచి సాము చేసే ప్రయత్నం అయితే చేయలేదు. ప్రస్తుత (2020-21)ఆర్థిక సంవత్సరంలో మూడు మినీ బడ్జెట్లను ప్రవేశ పెట్టామని మని ఆర్థిక మంత్రి తమప్రసంగంలో పేర్కొన్నారు. అంటే, నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థకు ఒక దిశా నిర్దేశం లేకుండా పోయిందని,  కొవిడ్ కారణంగా అవసరాలకు అనుగుణంగా  బడ్జెట్ అంచనాలను మార్చుకోవలసిన అగత్యం ఏర్పడిందని ఆమె చెప్పకనే చెప్పారు. అలాగే, నడుస్తున్న ప్రస్తుత బడ్జెట్ అంచనాలకు, సవరించిన అంచనాలకు మధ్య అగాధమంత వ్యత్యాసం ఉంది. ఆ వివరాలను ఆర్థిక మంత్రి వివరించారు. ఈ పరిస్థితికి ఇంకా ఇతర కారణాలు, ప్రభుత్వ విధానాలు, వైఫల్యాలు కారణం అయితే కావచ్చును గానీ, ప్రధాన కారణం మాత్రం కరోనా... కొవిడ్ మహమ్మారి ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసింది.  ఇది కాదనలేని నిజం. ఈ కోణంలో చూసినప్పుడు, ఇది సాధారణ బడ్జెట్ కాదు, అసాధారణ బడ్జెట్ అనే విషయం అర్థమవుతుంది. అలాగే, ప్రస్తుత విపత్కర పరిస్థితులలో ప్రవేశ పెట్టిన  బడ్జెట్’ను ప్రత్యేక కోణంలో విశ్లేషించవలసి ఉంటుంది.   అయితే రాజకీయ కోణంలో చూసినప్పుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అధికార కూటమి, సహజంగానే, ఆర్థిక మంత్రి నిర్మలమ్మను అభినందనలతో ముంచెత్తారు. ఆహా వోహో అంటూ అభినందించారు. నిర్మలమ్మ బడ్జెట్ ఆత్మ నిర్భర్ భారత్’కు అడ్డం పడుతోందని కితాబు నిచ్చారు. నిజమే, ఆత్మ నిర్భర్ భారత్’ చాలా అందమైన నినాదం. కానీ, వాస్తవంలో ఆత్మ నిర్భర భారత్ ‘ లస్ఖ్యలను చేరుకోవడం అంట సులభం కాదు. ముఖ్యంగా, కొవిడ్ పుణ్యాన కోట్లాదిమంది కొలువులు కోల్పోయి, పూట గడవడమే కనాకష్టంగా ఉన్న ప్రస్తుత పరిస్తితులో ఆత్మ నిర్బర్ భారత్ సాకరమవుతుందో లేక ఒకప్పుడు ఇందిరమ్మ ఇచ్చిన ‘గరీబీ హఠావో’  నినడంలాగా మిగిలిపోతుందో  చూడవలసి ఉంది.   మరో వంక అంతే సహజంగా ప్రతిపక్షం పెదవి విరిచింది. ఇదేమి బడ్జెట్ సామాన్య మానవుడి నడ్డి విరిచింది అని, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల గాంధీ సహా విపక్ష నేతలు విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ, చాలా కాలంగా చేస్తున్న క్రోనీ క్యాపిటలిజం ఆరోపణను మరో మారు చేశారు. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థలు  సహా వివిధ సంస్థలలో ప్రభుత్వవాటాల విక్రయం ద్వారా రూ. 1.75 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో చేసిన ప్రతిపాదనను రాహుల్ గాంధీ తమ వాదనకు ఆధారంగా చూపించారు. అలాగే,కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఆర్థికమంత్రి, చిదంబరం ఆర్థికమంత్రి నిర్మలా సీతరామన్ పెట్రోల్, దేజిల్ సహా వివిధ వస్తువులపై సుంకం /సెస్ విధించడం ద్వారా   ప్రజలను మోసం చేశారని అన్నారు.  అయితే అధికార, విపక్షాల పొగడ్తలు, విమర్శలు ఎలా ఉన్నా, ఇంతటి వత్తిళ్ళ నడుమ బడ్జెట్ రూపొందించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజకీయ అవసరాలను మాత్రం ఉపేక్షించలేదు. ఈ మరో రెండు మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాలకు నిర్మలమ్మ నిధులను బానే వడ్డించారు.ముఖ్యంగా, మొత్తం బడ్జెట్లోనే వ్యవసాయమ తర్వాత పెద్దపీట వేసిన మౌలిక సదుపాయల రంగానికి కేటాయించిన నిధులలో సింహ భాగం ఆ నాలుగు రాష్ట్రాలకు కేటాయించారు. తమిళనాడుకు రూ.1:03 లక్షల కోట్ల విలువచేసే జాతీయ రహదారుల ప్రాజెక్టును ప్రకటించారు. ముంబై – కన్యాకుమారి కారిడార్ సహా కేరళలో జాతీయ రహదారుల నిర్మాణానికి ఏకంగా రూ.65,000 కోట్లు, పశ్చిమ బెంగాల్’కు రూ.25,000 కోట్లు జాతీయ రహదారుల నిర్మాణానికి కేటాయించారు. అదే విధంగా ఈ సంవత్సరం ఎన్నికలు జరిగే మరో కీలక రాష్ట్రం అస్సాంలో ఇప్పటికే రూ.19,000 కోట్ల విలువ చేసే రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని నిర్మలా సీతారామన్ తమ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఇలా మొత్తం ఎన్నికలు జరిగే నాలుగు రాష్టాలకు కలిపి మొత్తంగా రూ.2.27 కోట్లను  ఎన్నికల కానుకగా ప్రకటించారు. సో ... తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే’ అన్నట్లుగా నిర్మలా సీతారామన్, కొవిడ్ కొవిడే.. ఎన్నికల రాజకీయం ఎన్నికల రాజకీయమే అన్నట్లుగా రాజకీయ అవసరాలను నెరవేర్చారు.  అయితే, ఇల్లలకగానే పండగ రాదు, అలాగే, బడ్జెట్లో కేటాయింపులు చేసినంతమాత్రాన ఓట్లు వర్షం కురవదు. నిజానికి ఎన్నికల్లో గెలుపు ఓటములను,నిర్ణయించే అంశాలలో బడ్జెట్ మంచి చెడుల ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది, నిర్దిష్టంగా చెప్పడం అయ్యే పని కాదు. కేంద్రంలో లేదా రాష్ట్రాలలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఎన్నికల సంవత్సరంలో వరాల జల్లు కురుపిస్తుంది. షడ్రుచుల బడ్జెట్’నే వడ్డిస్తుంది. అయినా, అధికార పార్టీలు ఓడిపోతూనే ఉన్నాయి.సో .. బడ్జెట్ ఎన్నికల పై విశేష ప్రభావం చుపుతుందనేది కొన్ని సందర్భాల్లో నిజం కావచ్చును కానీ,అన్ని సందర్భాలలో నిజం కావాలనే నిబంధన అయితే లేదు.  ముఖ్యంగా కేంద్ర బడ్జెట్, అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని, కమల దళానికి ఓట్లేత్తి  పోస్తుందని, ఎవరైనా అనుకుంటే అది పొరపాటే అవుతుంది, అదే విధంగా బడ్జెట్ సామాన్యుడి నడ్డి విరించిందనే అభిప్రాయంతో  ఉన్న ప్రతిపక్షాలు, ఆ కారణంగా, విపక్షాలనే విజయం వరిస్తుందని అనుకున్నా,అదీ అంతే. ముఖ్యంగా మరో రెండుమూడు నెలలలో ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాలలో రాజకీయ పరిస్థితులు, ఎన్నికల చరిత్రను గమనిస్తే,కేంద్ర బడ్జెట్ కంటే ఇంతర అంశాలే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయి, ఇది చరిత్ర చెపుతున్నసత్యం.ఇక చివరకి ఓటరు దేవుడు ఏమి చేస్తాడు అనేది ... ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న.

మూఢ నమ్మకాలతో బలి దానాలు, హత్యలు!  దేశంలో పెరిగిపోతున్న తాంత్రిక ఘోరాలు 

మనదేశంలో మాయ మాటలు చెప్పే బాబాలు, తాంత్రికులకు  ఉన్న  క్రేజీ.. తమ పరిశోధనలతో కొత్త ఆవిష్కరణలు అందించే సైంటిస్టులకు ఉండదు. మ్యాజిక్ ను నమ్మే జనం లాజిక్ ను అస్సలు పట్టించుకోరు. మూఢనమ్మకాలతో పచ్చిగా ప్రవరిస్తూ కొందరు ప్రాణాలు తీసుకున్నారు. మరికొందరు తమ కుటుంబ సభ్యులనే చంపుకున్నారు. ఉన్మాదుల్లా మారి ఇతరులను కిరాతకంగా హతమార్చిన వారున్నారు. బలి ఇస్తే మేలు జరుగుతుందనీ, తాంత్రిక శక్తులు ఉన్నాయనీ, చనిపోయి మళ్లీ బతుకుతామని నమ్మి...  మూఢనమ్మకాలు, క్షుద్రపూజలతో కుటుంబాలే కనుమరుగైన ఘటనలు ఉన్నాయి. మదనపల్లిలో క్షుద్ర పిచ్చితో  కన్నబిడ్డలను చంపుకున్న తల్లిదండ్రుల ఉదంతంలో  పిచ్చి పరాకాష్టగా చేరినట్లుగా ఉంది.  దేశవ్యాప్తంగా ప్రస్తుతం మదనపల్లి ఘటన కలకలం రేపుతోంది. అయితే రెండేళ్ల క్రిందట ఢిల్లీలోనూ ఇలా జరిగింది. 2018లో ఢిల్లీలోని బురారీలో  ఓ కుటుంబంలోని మొత్తం 11 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబంలోని పది మందిని ఇంట్లో దూలానికి ఉరి వేసి, ఆ తర్వాత 77ఏళ్ల నారాయణ్ దేవీ ఓ గదిలో విషం తీసుకుని మరణించింది. మళ్లీ బతుకుతామని నమ్మే వీరంతా ఈ దారుణానికి పాల్పడ్డారని విచారణలో తేలింది. ఈ ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం స్పష్టించింది.  2015లో జూన్ నెలలో కలకత్తాలోనూ మూఢనమ్మకాలతో ఓ కుటుంబం బలి తీసుకుంది. రాబిన్సన్ వీధిలో పార్థో డే అనే వ్యక్తి తండ్రి మృతదేహాన్ని అందజేయడానికి పోలీసులు వెళ్లారు. ఆ ఇంట్లో పోలీసులకు అతడి సోదరి, ఓ కుక్క అస్తిపంజరాలు పోలీసులకు కనిపించాయి. చనిపోయిన తల్లి తిరిగి లేస్తుందన్న నమ్మకంతో కొన్ని నెలలుగా ఉపవాసం ఉండి ఆరు నెలల క్రితం ఆమె చనిపోయింది. శునకం కూడా మరణించింది. అయినా వాటితోనే పార్థో డే సహజీవనం చేశాడు. ఇంటిని పరిశీలించిన పోలీసులు అవాక్కయ్యారు.  2018 సెప్టెంబర్ లో అహ్మదాబాద్ లో  ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. 45 ఏళ్ల వ్యక్తి తన భార్యకు, 16ఏళ్ల కూతురికి విషం ఇచ్చి చంపి, ఆ తర్వాత తాను కూడా ఉరేసుకుని చనిపోయాడు. ఇంట్లో దొరికిన లేఖలో మాజీ ప్రేయసి ఆత్మ తమను చనిపొమ్మని చెప్పిందని రాసి ఉంది. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో గతేడాది  దీపావళి  రోజున ఓ యువకుడు పక్కింట్లో ఉన్న ఏడేళ్ల బాలికను అపహరించి ఉరేసి చంపాడు. ఆ తర్వాత ఆమె కాలేయం, ఇతర శరీరభాగాలను కోసి తన బంధువులకు ఇచ్చి కూర వండుకుని తినమని చెప్పాడు. అలా చేస్తే పిల్లలు పుడతారని తాంత్రికులు చెప్పింది నమ్మి ఆ యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. తన బంధువులు పిల్లలు లేకపోవడంతో బాధపడుతున్నారని ఆ యువకుడు ఇంతటి అమానుషానికి ఒడిగట్టాడుయ     2018లో హైదరాబాద్ లోనూ ఇలాంటి ఘటన జరిగింది. నింజు పౌర్ణమిరోజు ఓ బాలికను బలి ఇస్తే మంచి జరుగుతుందని మంత్రగాళ్లు చెప్పింది నమ్మి.. 2018వ సంవత్సరం జనవరి 31న హైదరాబాద్ లో ఓ నెలలు నిండని బాలికను క్షుద్రపూజలు చేసి చంపేశారు. హైదరాబాద్ లోని కేరుకొండ రాజశేఖర్, తన భార్య శ్రీలతతో కలిసి ఓ తాంత్రికుడు చెప్పింది నమ్మి, ఫుట్ పాత్ పై తల్లి ఒడిలో నిద్రపోతున్న బాలికను ఎత్తుకొచ్చి ఈ దారుణానికి ఒడిగట్టారు.  

సలహాదారులా.. సీఎం భజనపరులా? రాజ్యాంగ పదవికే కళంకం తెస్తారా ? 

ఆంధ్రప్రదేశ్ లో 20 నెలలుగా వైసీపీ సర్కార్ పాలన నడుస్తోంది. అయితే జగన్ రెడ్డి పాలన మూడు నిర్ణయాలు- ఆరు కొట్టివేతలు- తొమ్మిది చివాట్లుగా సాగుతుందనే చర్చ జనాల్లో జరుగుతోంది. ప్రభుత్వం తీసుకున్న చాలా నిర్ణయాలు వివాదాస్పదం కావడం, కోర్టులు కొట్టివేయడం, న్యాయమూర్తులు పాలకులకు చివాట్లు పెట్టడం పరిపాటిగా మారింది. అందుకే ఏపీ సర్కార్ ను జనాలంతా చివాట్ల సర్కార్ గా పిలుస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. సీఎం జగన్ అనాలోచిత, అస్తవ్యస్థ, ఏకపక్ష నిర్ణయాలతో  రాష్ట్రం పరువు పోతుందనే ఆందోళన కూడా కొన్ని వర్గాల నుంచి వ్యక్తమైంది.  అంతేకాదు ప్రస్తుతం ఏపీలో కీలక పదవులన్ని ఒక సామాజిక వర్గానికే దక్కాయనే ఆరోపణలు ఉన్నాయి. జగన్ రెడ్డి  కార్యాలయం మొత్తం ఆ వర్గంతోనే నిండిపోయింది. ముఖ్యమంత్రి సలహాదారులుగా అంతా వాళ్లే ఉన్నారు. దీనిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండగా.. తాజాగా ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డిని తొలగించాలంటూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాయడం కలకలం రేపుతోంది. రాజ్యాంగస్ఫూర్తికి వ్యతిరేకంగా సజ్జల రాజకీయ ప్రకటనలు చేస్తున్నారని తన లేఖలో పేర్కొన్నారు నిమ్మగడ్డ. ఎస్ఈసీ తాజా లేఖాస్త్రంతో ప్రభుత్వ సలహాదారు అంటే ఎలా ఉండాలి, ఆయన విధులేంటీ, రాజకీయాలు చేయవచ్చా అన్న చర్చ జరుగుతోంది.  ప్రభుత్వ సలహాదారు అంటే కేబినెట్ హోదా కలిగిన పదవి. ప్రభుత్వ సలహాదారు ప్రతినెలా ప్రజాధనాన్ని జీతభత్యాల కింద తీసుకుంటారు. ముఖ్యమంత్రికి ఆంతరంగిక సలహాదారుగా ఉన్నప్పుడు సీఎంకు సలహాలు ఇవ్వాలే తప్ప రాజకీయ ప్రకటనలు, విమర్శలు చేయడం సరికాదు. కాని ఇప్పుడు ఏపీలో మాత్రం అంతా రివర్స్ గా ఉంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక చాలామంది సలహాదారుల్లో ఒకరిగా సజ్జల రామకృష్ణా రెడ్డి నియమితులయ్యారు. ఇప్పుడు ఆయన కీలకమైన ప్రజా సంబంధాలు-ప్రజా వ్యవహారాల పోస్టులోఉంటూ కేబినెట్‌ హోదా అనుభవిస్తున్నారు. ఆయనకు సెక్రటేరియేట్‌లో గదిని కేటాయించారు. కేబినెట్‌ హోదాలో జీతభత్యాలు తీసుకుంటున్నందున ప్రస్తుతం ఆయన ప్రభుత్వోద్యోగి కిందే లెక్కే.  కేబినెట్ హోదా కలిగి ప్రభుత్వ ఉద్యోగి కిందకు వచ్చే సజ్జల రామకృష్ణా రెడ్డి.. రాజ్యాంగ బద్ద సంస్థ అయిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ పై ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత కూడా ఎస్ఈసీపై విమర్శలు చేయడంపై రాజకీయ వర్గాలు  విస్మయం వ్యక్తం  చేస్తున్నాయి. సజ్జల క్యాబినెట్ హోదాలో ఉంటూ ఎస్ఈసీపై విమర్శలు చేయడం తప్పని. రాజ్యాంగ వ్యవస్థను కించపరచేలా ఆయన ఎలా మాట్లాడతారని రాజ్యాంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగ వ్యవస్థలో భాగమైన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌పై సజ్జల రామకృష్ణారెడ్డి వ్యక్తిగతంగా దూషణలు చేయడం దారుణమంటున్నారు. సజ్జలపై  గవర్నర్ చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.    సజ్జల రామకృష్ణారెడ్డి జర్నలిస్టు బ్యాక్ గ్రౌండ్ కలిగిన వారు. పలు పత్రికల్లో ఆయన పనిచేశారు. సాక్షి ఎడిటోరియల్ లో కీలకంగా వ్యవహరించారు. జర్నలిస్టుగా పని చేసిన సజ్జల.. కొన్ని మీడియా సంస్థలను టార్గెట్ చేయడంపైనా విమర్శలు వస్తున్నాయి.  ప్రభుత్వ సలహాదారు సజ్జలే కాదు మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని,  అనిల్ కుమార్ యాదవ్ కూడా ఎస్ఈసీ నిమ్మగడ్డపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఇది రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమంటున్నారు రాజ్యాంగ నిపుణులు. ఎస్ఈసీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న మంత్రులపైనా చర్యలు తీసుకునే అధికారం గవర్నర్ కు ఉందంటున్నారు. ఏపీలో జరుగుతున్న తాజా పరిణామాలతో పనికిమాలిన వారందరినీ సలహాదారులుగా నియమించుకోవడమేంటి? వాళ్లకు కేబినెట్‌ ర్యాంకులు ఇవ్వడమేంటి? అనే చర్చ జనాల్లో జరుగుతోంది.  ఎవరైనా హైకోర్టును ఆశ్రయిస్తే రాజ్యాంగ స్పూర్తికి విరుద్దంగా వ్యవహరిస్తున్న సజ్జలకు ఇచ్చిన హోదా తొలగిపోతుందని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు చెబుతున్నారు.      

ప్రధాని మోడీ డేంజర్ గేమ్ ఆడుతున్నారా? ఎర్రకోట ఘటనతో జనాల్లో భయాందోళన?

ప్రధాని నరేంద్ర మోడీ నిప్పుతో చెలగాటమాడుతున్నారా? గత అనుభవాలు కమలనాధులను  భయపెడుతున్నాయా? దేశం ఎటు వైపు వెళుతుందోనన్న ఆందోళన ప్రజల్లో కనిపిస్తోందా?  దేశంలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో ఇవే అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండు నెలలుగా శాంతియుతంగా రైతులు చేస్తున్న ఉద్యమం గణ తంత్ర దినోత్సవం రోజున హస్తినలో నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీతో గతి తప్పింది. దేశ రాజధానిలో హింసకు కారణమైంది. దేశ చరిత్రలోనే ఎప్పుడు జరగని విధంగా కొందరు వ్యక్తులు  ఎర్రకోటలోకి చొరబడటం..  ప్రతి ఏటా ప్రధానమంత్రి  జాతీయ జెండా ఎగరేసే చారిత్రక కట్టడంపై రైతన్న జెండా ఎగరవేయడం  తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీలో మంగళవారం జరిగిన పరిణామాలు దేశ ప్రజలను భయాందోళనకు గురి చేశాయి. ఎర్రకోట ఘటన తర్వాత వెలుగుచూస్తున్న విషయాలు మరింత విస్మయపరుస్తున్నాయి.        ఎర్రకోటను మట్టడించింది తమ పని కాదని, విద్రోహ శక్తులు తమ ర్యాలీలో చేరి అల్లర్లు సృష్టించారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.  ఖలీస్తాన్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారు ర్యాలీలో చొరబడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి. ట్రాక్టర్ల పరేడ్ సందర్భంగా కొందరు తల్వార్లతో రోడ్లపై తిరగడం, పోలీసులపై దాడి చేయడం వంటి ఘటనలు జరగడంతో.. ఢిల్లీ అల్లర్ల వెనక సంఘ విద్రోహ శక్తుల ప్రమేయం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఖలీస్తాన్ ఉగ్రవాదుల పేరుతో ఒక సామాజిక వర్గాన్ని కొందరు టార్గెట్ చేస్తున్నారు. సిక్కులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదీ దేశానికి ప్రమాదకరమని కొందరు మేధావులు చెబుతున్నారు. ఇందుకు గతంలో జరిగిన పరిణామాలను వారు వివరిస్తున్నారు. గతంలో సిక్కులకు వ్యతిరేకంగా పలు నిర్ణయాలు తీసుకుని.. ఐరన్ లేడీగా పేరొందిన ఇందీరా గాంధీనే రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేస్తున్నారు.  మన దేశ రక్షణలో సిక్కులు, పంజాబీల పాత్రే గొప్పది. దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఎక్కువగా అసువులు బాసింది పంజాబీలే. దేశ స్వాతంత్రం కోసం ఉరి తీసిన 121 మందిలో 93 మంది పంజాబీలే ఉన్నారు. జీవిత ఖైదు విధించిన 2 వేల 626 మందిలో 2 వేల 147 మంది పంజాబీలేనని లెక్కలు చెబుతున్నాయి.  ఇండియా ఆర్మీలో ఎక్కువ మందే వారే ఉంటారు. దేశం కోసం ఏటా వందలాది ప్రాణాలు అర్పిస్తుంటారు. దేశ భక్తిలో సిక్కులతో ఎవరూ పోటీపడలేరని చెబుతారు. అలాంటి సిక్కుల గురించి కొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటం అందరిని కలవరపరుస్తోంది. రైతుల ఉద్యమంపై  మొదటి నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు కొందరు బీజేపీ నేతలు. రైతులకు ఖలిస్తానీయులు, మావోయిస్టులతోను లింక్ ఉందన్నారు. కేవలం పంజాబ్ రైతులే వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నారని మరికొందరు ఆరోపించారు. బీజేపీ నేతల కామెంట్లపై సిక్కు వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దేశ రక్షణలో ముందుండే సిక్కులతో విభేదాలు తెచ్చుకోవడం మంచిది కాదనే అభిప్రాయం బీజేపీ సీనియర్ల నుంచి కూడా వస్తుందట.     ఢిల్లీ హింసాత్మక ఘటనల తర్వాత కొత్త వాదనలు తెరపైకి వస్తున్నాయి.  కేంద్ర సర్కార్ సమస్య పరిష్కారానికి సీరియస్ గా స్పందించలేదనే ఆరోపణలే ఎక్కువ మంది నుంచి వినిపిస్తున్నాయి. రైతులను ఒప్పంచి ఆందోళన విరమించేలా చేస్తే.. ప్రపంచం ముందు భారత్ పరువు పోయేది కాదనే  అభిప్రాయం  వస్తోంది. రైతుల చేస్తున్న పోరాటాన్ని గౌరవించి వారితో కేంద్ర సర్కార్ చర్చలు జరిపితేనే బెటరనే చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా రైతుల దగ్గరకు వెళ్లి చర్చలు జరిపితే సమస్య త్వరగా పరిష్కారం అవుతుందంటున్నారు. రైతుల దగ్గరకే మోడీ వెళితే.. ఆయన కూడా హీరోగా నిలుస్తారని  చెబుతున్నారు. ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టాకా దేశాన్ని దశాబ్దాలుగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం దొరికింది. అయోధ్య రామాలయం, త్రిపుల్ తలాక్, జమ్మూ కశ్మీర్ సమస్యలు కొలిక్కి వచ్చాయి. ఇప్పుడు రైతుల ఆందోళన విరమించేలా ప్రధాని మోడీ చొరవ తీసుకుని.. వారితో చర్చించి సమస్య పరిష్కరిస్తే.. ఇది కూడా ఆయన చరిత్రాత్మక విజయాల్లో ఒకటిగా నిలిచిపోతుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి కూడా వినిపిస్తోంది.  అంతేకాదు తమిళనాడు రాజకీయాల్లోనూ ప్రస్తుతం బీజేపీ డేంజర్ రోల్ పోషిస్తోంది. కరుణానిధి, జయలలిత మరణాల తర్వాత తమిళనాడులో పాగా కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం అన్నాడీఎంకేను పావుగా వాడుకుంటోంది. సినిమా స్టార్ రజనీకాంత్ తో కొత్త పార్టీకి ప్లాన్ చేసింది. కమల్ హాసన్ ను రెచ్చగొడుతోంది. శశికళ అరెస్టు వెనుక బీజేపీ హస్తం ఉందని తమిళనాడు ప్రజల్లో వాదన ఉంది. మొత్తంగా తమిళనాడులో కొంత కాలంగా బీజేపీ చేస్తున్న రాజకీయాలతో తమిళులు ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు. గతంలో తమిళులకు వ్యతిరేకించిన కొన్ని నిర్ణయాలు తీసుకున్న రాజీవ్ గాంధీకి ఏం జరిగిందో దేశ ప్రజలందరికి తెలుసు. అందుకే రైతుల ఆందోళన, సిక్కులపై వస్తున్న విమర్శలు, తమిళ రాజకీయాలు.. ఇవన్ని తమకు ఆందోళన కలిగించేవే అన్న ఆందోళన బీజేపీలో కనిపిస్తుందని తెలుస్తోంది.  మొత్తంగా  కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో దేశం ఎటు వైపు దారి తీస్తుందోనన్న భయం జనాల్లో ఉందని తెలుస్తోంది. బీజేపీ సర్కార్ ఇప్పటికైనా మేల్కొని.. సమస్యలను పరిష్కరించాలని వారంతా కోరుతున్నారు. లేకపోతే  గతంలో కాంగ్రెస్ కు జరిగినట్లే బీజేపీ తగిన మూల్యం చెల్లించుకునే పరిస్థితి రావచ్చని కూడా కొందరు పొలిటికల్ అనలిస్టులు స్పష్టం చేస్తున్నారు.   

పంచాయతీలకు ఆన్ లైన్ నామినేషన్లు? జగన్ కు నిమ్మగడ్డ షాక్ ఇవ్వబోతున్నారా? 

ఏపీ సర్కార్, రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య తీవ్ర వివాదంగా మారిన పంచాయతీ ఎన్నికల వ్యవహారం సుప్రీంకోర్టు తీర్పుతో కొలిక్కి వచ్చింది. జగన్ సర్కార్ ఎన్ని ఎత్తులు వేసినా పంచాయతీ ఎన్నికల విషయంలో వెనక్కి తగ్గని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఎన్నికల నిర్వహణలోనూ దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా నామినేషన్ల అంశంలోనూ నిమ్మగడ్డ అధికార పార్టీకి షాకిస్తూ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.  పంచాయతీ పోరులో వీలైనన్ని ఎక్కువ గ్రామాలను ఏకగ్రీవంగా గెలుచుకోవాలని అధికార వైసీపీ ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలను భారీగా పెంచేసింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే ప్రభుత్వం ప్రకటన విడుదల చేయడంపై  ప్రతి పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  నజరానాలను ఎరగా చూపి ఏకగ్రీవాలు చేసుకోవాలని, అవసరమైతే ఇతర పార్టీ నేతలను భయపెట్టి, బెదిరించి నామినేషన్లు వేయకుండా చూడాలని వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బలవంతపు ఏకగ్రీవాలు జరుగుతున్నాయని.., ప్రతిపక్షాలు బలపర్చే అభ్యర్థులను పోటీ చేయనీయకుండా బెదిరిస్తున్నారని బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు ఆరోపిస్తున్నాయి. అధికార పార్టీ అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆన్ లైన్ నామినేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.  బీజేపీ, జనసేన నేతలు  గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.  ఏకగ్రీవాల విషయంలో ప్రభుత్వం వైఖరిని వారు గవర్నర్ కు వివరించారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగేలా చూడాలని కోరారు. బీజేపీ నుంచి  సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, మధుకర్ జీ.. జనసేన తరఫున నాదేండ్ల మనోహర్, శ్రీనివాస్ యాదవ్  రాజ్ భవన్ వెళ్లారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా చోట్ల ఏకగ్రీవం చేసేందుకు, విపక్ష పార్టీల అభ్యర్థులు పోటీలో లేకుండా చేయడం, నామినేషన్లు వేసిన వారిని కూడా భయపెట్టి వారు విత్ డ్రా చేసుకునేలా చేసిన ఘటనలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు బీజేపీ, జనసేన నేతలు.    పంచాయతీ ఎన్నికల్లో బెదిరింపుల పర్వానికి అడ్డుకట్ట వేయాలంటే ఆన్ లైన్ నామినేషన్లు ఒక్కటే మార్గమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఏకగ్రీవాల పేరుతో ప్రతిపక్ష అభ్యర్థులను అధికార పార్టీ భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. గత ఏడాది స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలను పునరావృతం కాకుండా ఉంటే ఆన్ లైన్ నామినేషన్ ఒక్కటే మార్గమని.. అలాగే అభ్యర్థులు ధైర్యంగా నామినేషన్ వేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు సోము వీర్రాజు. అధికార పార్టీ దాడులను అరికట్టాలని ఎస్ఈసీని కోరారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా వైసీపీ బలవంతపు ఏకగ్రీవాలకు యత్నిస్తోందని.. ఎస్ఈసీ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తోంది. అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని టీడీపీ చీఫ్ చంద్రబాబు మండిపడ్డారు. ప్రజల ఆమోదం లేని ఈ తరహా ఏకగ్రీవాలు ఉపేక్షించేది లేదు ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. .  ప్రతిపక్షాల నుంచి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.., ఏకగ్రీవాలపైనే దృష్టి పెట్టాలని స్పష్టమైన ఆదేశాలిచ్చేరు. బలవంతపు ఏకగ్రీవాలు ఎక్కడ జరిగినా అడ్డుకోవాలన్నారు. గతంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదని ఆదేశించారు. ఏకగ్రీవాల సంఖ్య అపరిమితంగా పెరిగితే ఖచ్చితంగా జోక్యం చేసుకుంటామన్నారు నిమ్మగడ్డ.  తాజా పరిణామాల నేపథ్యంలో ఆన్ లైన్ లో నామినేషన్ల స్వీకరణపై అధికారులతో నిమ్మగడ్డ చర్చిస్తున్నారని తెలుస్తోంది. సాఫ్ట్ వేర్ సమస్యలపై చర్చించాకా.. ఆయన ఆన్ లైన్ నామినేషన్ల దిశగా చర్యలు తీసుకోవచ్చని చెబుతున్నారు. అదే జరిగితే ఏకగ్రీవాల కోసం ప్రయత్నిస్తున్న అధికార పార్టీ ప్రయత్నాలకు చెక్ పడినట్లే.  

చిరంజీవి మళ్లీ పొలిటికల్ ఎంట్రీ! నాదెండ్ల కామెంట్ల అర్ధమేంటీ? 

ఏపీ రాజకీయాల్లోకి మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇవ్వనున్నారా..? తమ్ముడు వెంటే అనయ్య నడవబోతున్నారా..? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది.  పంచాయితీ ఎన్నిక‌ల‌ వేళ  త‌న వ్యాఖ్య‌ల‌తో పొలిటిక‌ల్ హీట్ పెంచారు జ‌న‌సేన నేత నాదెండ్ల మ‌నోహార్.  విజయవాడలో  జరిగిన జనసేన క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో  మెగాస్టార్ పొలిటికల్ రీ ఎంట్రీపై మనోహర్ కీలక కామెంట్స్ చేశారు. త్వరలో పవన్ కల్యాణ్ వెంట చిరంజీవి రాబోతున్నారని ప్రకటించారు. పవన్ కు అండగా ఉంటామని చిరంజీవి హామీ ఇచ్చారని తెలిపారు.  అంతేకాదు  పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి కారణం చిరంజీవేనని చెప్పారు నాదేండ్ల మనోహర్. రెండు మూడేళ్లు సినిమాలు చేసిన తర్వాత రాజకీయాలు చేసుకోవాలని  తర్వాత నీ రాజకీయ ప్రస్థానంలో  నేను కూడా నీకు అండగా నిలబడతానని.. నీతో కలిసి నడుస్తానంటూ చిరంజీవి పవన్ కు హామీ ఇచ్చారని మనోహర్ తెలిపారు. చిరంజీవి పెరు నాదెండ్ల చెప్పగానే.. జనసేన కార్యకర్తలు, కేరింతలు కొట్టారు. నాదెండ్ల మనోహర్  తాజా కామెంట్స్  ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారాయి.   ప‌వ‌న్ క‌ళ్యాణ్ జనసేన పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి చిరంజీవి ఏం చేస్తారన్నదానిపై  చర్చ జరుగుతూనే ఉంది.  చిరంజీవి జనసేనకు దూరంగా ఉన్నా ఆయన కుటుంబ సభ్యులు మాత్రం పవన్ కు బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. నాగబాబు జనసేనలో క్రియాశీలకంగా ఉన్నారు. నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్.., సోషల్ మీడియాలో జనసేనకు మద్దతు పలకగా.. వరుణ్ తేజ్, నిహారికా నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అల్లు అర్జున్ కూడా జనసేనకు మద్దతుగా ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. చిరంజీవి బహిరంగంగా మద్దతు పలకకపోయినా.., తమ్ముడికి నైతికి మద్దతు ఇస్తూనే ఉన్నారు. జనసేన వైపు ఉండాలని అభిమాన సంఘాలకు సూచించారు. మెగాస్టార్ కు  రాజకీయాలు కొత్త కాదు. గతంలో ఆయన ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. కేంద్రమంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి రాజకీయాలకు దూరమయ్యారు చిరంజీవి. పవ‌న్ పార్టీ ప్ర‌క‌టించిన‌ప్పుడు కూడా..  ఎన్ని ఒత్తిళ్లు, విమ‌ర్శ‌లు వ‌చ్చినా ఆయ‌న  త‌న పొలిటిక‌ల్ రీఎంట్రీకి సంబంధించి నోరెత్త‌లేదు.  అయితే నాదెండ్ల మ‌నోహార్ తాజా వ్యాఖ్య‌ల‌తో  పవన్ పార్టీకి చిరంజీవి మద్దతుపై  మెగా అభిమానుల‌కు  ఫుల్ క్లారిటీ వ‌చ్చిందని చెబుతున్నారు.  ఇక్క‌డ తోడుగా రావ‌డం అంటే ప‌వ‌న్ కు మ‌ద్ద‌తుగా చిరంజీవి జ‌న‌సేన‌లో చేర‌టం ఖాయమేనని చెబుతున్నారు. కాస్త లేట్ అయిన చిరు మ‌ళ్లీ పొలిటిక్స్ లో రీ ఎంట్రీ ఇస్తారని భావిస్తున్నారు.   మరోవైపు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు, త్వరలో జరగనున్న తిరుపతి ఉపఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీల్లో ఉన్న మెగా అభిమానులను జనసేన వైపు తిప్పడానికి మనోహర్ ఇలా మాట్లాడి ఉంటారా అనే చర్చ  కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.    

ఆ ఐదు రాష్ట్రాలకే 34 పద్మలు ! అవార్డుల్లోనూ ఓట్ల రాజకీయమేనా?

భారత దేశంలో అత్యున్నత పురస్కారాలు పద్మ అవార్డులు. వివిధ రంగాల్లోని ప్రముఖులను గుర్తించి ప్రతి ఏటా గణతంత్రం దినోత్సవం ముందు రోజు ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. అయితే ప్రతిభ ఆధారంగా ఇవ్వాల్సిన ఈ దేశ అత్యున్నత పురస్కారాలపైనా రాజకీయ ముద్ర పడిందనే ఆరోపణలు ఎప్పటి నుంచే ఉన్నాయి. అధికారంలో ఉన్న పార్టీ.. తమకు అనుకూలంగా ఉన్నవారికే పురస్కారాలను అంద చేస్తుందనే విమర్శలు ఉన్నాయి. అందుకే కొందరు విమర్శకులు వీటిని "రాజకీయ పద్మాలు" అని చెబుతుంటారు. తాజాగా   2021 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులపైనా  రాజకీయ దుమారం రేగుతోంది.    2021 సంవత్సరానికి గాను  మొత్తం 119 మందికి పద్మ అవార్డులు ప్రకటించింది కేంద్రం. అయితే  పద్మ అవార్డు  గ్రహీతల్లో అత్యధికులు కేవలం 5 రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. తమిళనాడు, కేరళ, బెంగాల్, అస్సోం, పుదుచ్చేరిలకు అత్యధికంగా 34 పద్మ అవార్డులు దక్కాయి. తమిళనాడుకు 11 పద్మ అవార్డులు దక్కగా, అస్సోంకు 9, పశ్చిమ బెంగాల్ కు 7, కేరళా కోటాలో 6, పుదుచ్చేరి కోటాలో ఒక పద్మ అవార్డును కేంద్రం ప్రకటించింది.  అంటే మొత్తం ప్రకటించిన పద్మాల్లో  29శాతం పద్మ అవార్డులు ఈ 5 రాష్ట్రాలకే దక్కాయన్న మాట. ఏప్రిల్ నుంచి మే మధ్యలో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటమే ఇందుకు  ప్రధాన కారణమనే విమర్శలు వస్తున్నాయి.  గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు  మరణానంతరం తమిళనాడు కోటాలో ప్రకటించారు. తమిళనాడులో తెలుగు ఓటర్లు భారీగా ఉన్నారు. అందుకే తెలుగు ఓటర్లను మచ్చిక చేసుకోవడం కోసమే ఆయనకు తమిళనాడు కోటాలో అవార్డు ఇచ్చారనే విమర్శలు వస్తున్నాయి. కేరళలోని వేనాడ్ నియోజకవర్గానికి రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తుండగా వేనాడుకే చెందిన ధనంజయ్ దివాకర్ సగ్డో అనే వైద్యుడికి పద్మా అవార్డు దక్కింది. స్వామి వివేకానంద మెడికల్ మిషన్ ను నెలకొల్పి, దీని ద్వారా ట్రైబల్స్ కు 1980 నుంచి వైద్య సదుపాయాలు కల్పిస్తున్న డాక్టర్ ధనంజయ్ కి ఆర్ఎస్ఎస్ తో మంచి సంబంధాలున్నాయని చెబుతారు.  ఢిల్లీకి చెందిన ఆర్కియాలజిస్టు బీ.బీ.లాల్‌కు ఈ ఏడాది పద్మ విభూషణ్ అవార్డు దక్కింది. బాబ్రీ మసీదు వద్ద జరిపిన తవ్వకాల్లో దేవాలయానికి సంబంధించిన అవశేషాలు కనుగొన్నట్టు లాల్ 1992లో ప్రకటించారు. కాంగ్రెస్ హయాంలో మాత్రం ఈయనకు పద్మ అవార్డు దక్కలేదు. వామపక్ష సిద్ధాంతాలను అనుసరించేవారికే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించిందని అప్పట్లో బీజేపీ నేతలు విమర్శించారు. తాజాగా ఈయనకు పద్మ అవార్డు దక్కటంతో.. రైట్ వింగ్ సిద్ధాంతాలపై విశ్వాసమున్న లాల్‌కు పురస్కారం దక్కిందంటూ విమర్శలు మొదలయ్యాయి.  పద్మ అవార్డుల ఎంపికలో  రాజకీయ కోణాలు ఉండటం అనేది దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వాల విధానంగా మారుతోంది. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకే ఈ పద్మ పురస్కారాలను ఎక్కువగా ప్రకటించటం  వస్తోంది. ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలపై ఫోకస్ పెట్టిన మోడీ ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అనుసరించినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  పద్మ అవార్డుల జాబితా తమను నిరాశకు గురిచేసిందని, ఎన్నికలున్న రాష్ట్రాలకే అగ్రతాంబూలం ఇచ్చారంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శలకు దిగింది. అయితే ఈ ఆరోపణలకు కేంద్రం ఖండించింది. ఐతే ఈ ఐదు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జనాభా అత్యధికంగా ఉండటంతో ఎక్కువ అవార్డులు దక్కాయని... విపక్షాలు దీన్ని రాజకీయ కోణంలో మాత్రమే చూస్తున్నారంటూ కమలనాథులు కౌంటరిస్తున్నారు.