Read more!

కమలానికి ఉక్కు సంకెళ్లు...

భారతీయ జనతా పార్టీ కి లోక్ సభలో 303 మంది సభ్యులున్నారు, మిత్ర పక్షాలను కలుపుకుంటే ఆ సంఖ్య 350 దాటుతుంది. రాజ్య సభలో సెంచరీకి చేరువలో ఉంది.అన్ని రాష్టాలలో కలిపి దేశం మొత్తంలో కమలం గుర్తుమీద గెలిచిన  ఎమ్మెల్ల్యేలు1374 మంది ఉన్నారు. దేశం మొత్తంలో ఉన్న రాష్ట్రాలు 29 అయితే అందులో 12 రాష్ట్రాలలో బీజేపీ సొంత ప్రభుత్వాలున్నాయి. మరో ఆరు రాష్ట్రాలలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాలలో భాగస్వామ్య పక్షంగా ఉంది. దేశంలోనే కాదు మొత్తం ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ బీజేపీ ... అంతే కాదు, పార్టీ సభ్యత్వం లేకుండా ఐడియాలజికల్ కమిట్మెంట్’తో పనిచేసే అదృశ్య కార్యకర్తలు దేశ విదేశాల్లో లక్షల్లో ఉన్నారు. 
అయితే, ఇంత బలం, బలగం ఉన్న బీజేపీ, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో మాత్రం ఆటలో అరటి పండుగానే మిగిలిపోతోంది. గత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు రాలేదు. కనీసం కాసింత గౌరవప్రదమైన ఓట్లయినావచ్చాయా,అంటే అదీలేదు.నిండా ఒక శాతం ఓట్లు రాలేదు.  చివరకు ‘నోటా’ కు వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదు. 


అలాగని, రాష్ట్రంలో పార్టీకి పునాదులు లేవా ... అంటే రాష్ట్ర విభజనకు ముందు, ఒంటరిగా పోటీచేసిన సందర్భాలలో కూడా బీజేపీకి ఓట్లే కాదు సీట్లు కూడా వచ్చాయి. 1999 లోక్ సభ ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్’లో బీజేపీ ఏడు సీట్లు గెలిస్తే అందులో మూడు (రాజమండ్రి, నరసాపురం, తిరుపతి) స్థానాలు ఆంధ్రాలోనే ఉన్నాయి. అప్పట్లో ఆంధ్ర ప్రాంతంలో బీజేపీకి 18 శాతానికి పైగానే ఓట్లు వచ్చాయి. అలాంటి పార్టీ 2019 ఎన్నికల్లో ఎందుకు అలా తుడిచి పెట్టుకు పోయింది. ఎందుకు తిరిగి  పుంజుకోలేక పోతోంది ? అందుకు రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల పునాదులు పటిష్టంగా ఉండడం ఒక ప్రధాన కారణం అయితే, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కమల దళం ఎదగకుండా చేస్తున్నాయని, పార్టీ నాయకులే వాపోతున్నారు.రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రానికి ఇస్తామన్న ప్రత్యేక హోదాను ఇవ్వలేదు. చివరకు అందుకు ప్రత్యాన్మాయంగా ఇస్తామని వాగ్దానం చేసిన ప్రత్యేక ప్యాకేజికి కేంద్రం పంగనామాలు పెట్టింది. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా శంఖుస్థాపన చేసిన రాజధాని నిర్మాణానికి గానీ,లోటు బడ్జెట్ భర్తీకి  వెనక బడిన ప్రాంతాల అభివృద్ధికి ఇలా ఇస్తామన్న నిధులేవీ తొలి ఐదేళ్ళలో ఇవ్వలేదు. ఆకారణంగానే తెలుగు దేశం పార్టీ, కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చింది. బీజేపీతో పొత్తును తెగతెంపులు చేసుకుంది. దీంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో,రాష్ట్ర ప్రజల్లో కూడా బీజేపీ పట్ల విశ్వాసం పూర్తిగా సన్నగిల్లింది. ఫలితంగా 2019 ఎన్నికల్లో బీజీపీ ‘నోటా’ తో పోటీపడి ఓడిపోయింది. ఒకప్పుడు ఒంటరిగా ఒంటరిగా పోటీ చేసి 18 శాతం వరకు ఓట్లు, మూడు లోక్ సభ స్థానాలు గెలుచుకున్న బీజేపీ 0.8 శాతం ఓట్లకు పడిపోయింది. 


అందుకే, రాష్ట్రంలో రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు ఉండడం, కార్యకర్తలు, స్థానిక నాయకుల అభీష్టానికి వ్యతిరేకంగా  సుదీర్ఘ కాలం పాటు తెలుగు దేశం పార్టీతో పొత్తు కొనసాగించడం,సమర్ధ నాయకత్వం లేక పోవడం ఇలా ఇంకా అనేక ఇతర  కారణాలున్నా  కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, పార్టీ ఎదుగుదలకు ప్రతిబంధకంగా నిలుస్తున్నాయని పార్టీ నాయకులు కూడా అంగీకరిస్తున్నారు.  
ప్రస్తుత విషయాన్నే తీసుకుంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, అన్యమత ప్రచారం, మత మార్పిడులు, క్రైస్తవీకరణ ఆగడాలు పెరిగిపోవడంతో రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా వంటి పాత గాయాలను మరిచి పోయి బీజేపీ వైపు కొంత మొగ్గు చూపారు. అయితే, ఇంతలోనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదన తెర మీదకు రావడంతో కథ మళ్ళీ కథ మొదటికి వచ్చింది. అందుకే రాష్ట్ర బీజేపీ నాయకులు,విశాఖ ఉక్క ప్రైవేటీకరణ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని కేంద్ర నాయకత్వం వద్ద మొర పెట్టుకున్నారు. పార్టీ రాష్ట్ర్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నాయకత్వంలో ఢిల్లీ వెళ్ళిన ప్రతినిధి బృదం కేంద్ర ఉక్కు మంత్రి  ధర్మేంద్ర  ప్రధాన్ ‘ను కలిసి వినప్తి పత్రం సంర్పించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. 
అయితే అప్పటికే జరగవలసిన నష్టం జరిగి పోయింది. ప్రధాన ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశాన్ని, ఇందుకు సంబంధించి ప్రజల సెంటిమెంట్’ను కార్మికులు ఆందోళనను చాల చాకచక్యంగా తమకు అనుకూలంగా మలచుకుంది. ముందుగా స్థానిక ఎమ్మెల్ల్యే, మాజీ మంత్రి   మాజీ మంత్రి, ఎమ్మెల్ల్యే గంటా శ్రీనివాస రావు ఎమ్మెల్ల్యే పదవికి రాజీనామా  చేశారు. మరో వంక టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్ల్యే పల్లా శ్రీనివాస ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. 

ఆయన దీక్షను పోలీసులు భగ్నం చేసినా, పార్టీ జాతీయ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగారు. విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తే చేస్తే...ప్రతిపక్షంగా తాము కూడా ఒక్క నిమిషంలో రాజీనామా చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఉక్కు పరిరక్షణ కోసం ముందుండి ఉద్యమాన్ని నడిపించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందనడంతో పాటుగా ముఖ్యమంత్రి నాయకత్వంలో పనిచేసేందుకు కుడా సిద్దమని ప్రకటించడం ద్వారా చంద్రబాబు నాయుడు, బంతిని వైసీపీ కోర్టులోకి డ్రైవ్ చేశారు. అంతే కాకుండా స్టీల్‌ప్లాంట్‌ లేకపోతే విశాఖపట్నం ఉనికే లేదని, అటువంటి కర్మాగారాన్ని అమ్మేస్తుంటే...ముఖ్యమంత్రి తాడేపల్లిలో కూర్చొని పబ్జీ ఆడుకుంటున్నారా?...అంటూ ముఖ్యమంత్రి జగన్‌పై మరో సెంటిమెంటల్ బాణాన్ని సందించారు.అలాగే, స్టీల్ ప్లాంట్ బేరం వెనక జగన్ రెడ్డి, విజయసాయి రెడ్డి స్టీల్ ప్లాంట్ ను అమ్మేయడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యమాన్ని రాష్ట్ర్ర వయ్పితం చేసే లక్ష్యంతో ఈనెల 18న స్టీల్‌ప్లాంట్‌ ఆవిర్భావ దినోత్సవం రోజున రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చామన్నారు. 
ఈ నేపధ్యంలోనే అధికార వైసీపీలోనూ కదలిక వచ్చింది. పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈ నెల 20 న స్టీల్ ప్లాంట్ పరిరక్షన యాత్ర చేస్తానని ప్రకటించారు. అలాగే ముఖ్యంత్రి కార్మిక నాయకులతో సమావేసమవుతారని, ఇదే విషయాన్ని చర్చించేందుకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రధాని అప్పాయింట్మెంట్ కోరరాని కూడా విజయసాయి చెప్పారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు కూడా ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని అంటున్నారు. .సో .. విశాఖ ఉక్కు ఉద్యమం వేడెక్కుతోంది. ఈ దశలో కేంద్రం సానుకూలంగా స్పదించి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా .. బీజేపీకివచ్చే ప్రయోజనం శూన్యంగానీ కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలే ఆంధ్ర ప్రదేశ్’లో పార్టీ ఎదుగుదలకు ప్రతిబంధకం అవుతున్నాయని.. రాష్ట్ర బీజేపీ నాయకులు అంతరంగిక సంభాషణల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.