Read more!

ఆలయాల పేరుతో డేంజర్ గేమ్! ఏపీని కాపాడుకున్న చంద్రబాబు 

ఆలయాలపై  దాడుల వెనక రాజకీయ కుట్ర ఉందా? ఒక పార్టీని బలహీనం చేయాలనే వ్యూహం ఉందా?  ఏపీలో  కొంత కాలంగా  జరిగిన వరుస పరిణామాలతో ఇవే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలతో ఆ అనుమానాలు నిజమేనని భావించాల్సి  వస్తోంది. వైసీపీ సర్కార్ వచ్చాకా ఆలయాలపై వరుసగా దాడులు జరిగాయి. వందలాది ఆలయాలను దండుగులు టార్గెట్ చేశారు. అంతర్వేది రథం దగ్ధం, కనకదుర్గ అమ్మవారి వెండి రథం సింహాలు మాయం వంటి ఘటనలు జరిగాయి. రామతీర్థంలోని కోదండ రామాలయంలో రాముడి విగ్రహాన్ని ముక్కలు చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆలయాలపై దాడులతో జనాల్లో కూడా అలజడి వచ్చింది. ఆ సమయంలోనే దీనివెనుక రాజకీయ కోణం ఉందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. రామతీర్థం ఘటనపై సీరియస్ గా స్పందించింది టీడీపీ. చంద్రబాబు రామతీర్థం వెళ్లి ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించారు. ఆ తర్వాత రాష్ట్రంలో ఆలయాలపై దాడులు ఒక్కసారిగా ఆగిపోయాయి. అంతకు ముందు రోజూ ఏదో ఒక చోట ఆలయాలపై దాడులు జరగగా.. చంద్రబాబు  రామతీర్థం వెళ్లిన తర్వాత ఆగిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

ఆలయాలపై జరిగిన దాడుల ఘటనలపై జగన్ సర్కార్ స్పందించిన తీరు అనుమానాలకు తావిచ్చింది. రథాలు తగలబడితే తేనేటీగలు కారణమని, ఆలయాలపై దాడులు జరిగితే పిచ్చోడి చర్య అని, విగ్రహాల విధ్వంసం గుప్తనిధుల వేటగాళ్ల పనేనని వైసీపీ ప్రభుత్వం వివరణ ఇస్తూ వచ్చింది.  ఆంజనేయ స్వామి చెయ్యి విరిగితే రక్తం వస్తుందా? రాముడి విగ్రహం తల తెగిపడితే ప్రాణం పోతుందా? అని  మంత్రి కొడాలి నాని లాంటి వారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీంతో విభజించు.. ఓట్లు పట్టు అనే సిద్ధాంతంతో టీడీపీ టార్గెట్ గా బీజేపీ, వైసీపీ గేమ్ ఆడుతున్నాయనే చర్చ వచ్చింది. ఆలయాలపై దాడులు జరుగుతుండటంతో హిందువుల్లో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇదే అదనుగా  హిందుత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీ.. హిందువులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోందనే  అనుమానాలు వచ్చాయి. మతాలుగా ఓట్లను చీల్చి, వాటిని రెండు పార్టీలు పంచుకొని  ఏపీలో టీడీపీని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడ్డారు. 

తెలంగాణలోని గ్రేటర్ ఎన్నికల్లో మత రాజకీయాలే రాజ్యమేలాయి. బీజేపీ, ఎంఐఎం పార్టీలు హిందూ, ముస్లిం అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాయి. మత పరమైన విమర్శలతో గ్రేటర్ ఎన్నికల్లో రెండు పార్టీలు లబ్దిపొందాయి. ఎప్పటిలానే మెజారిటీ ముస్లిం ఓట్లు ఎంఐఎంకు పడగా.. బీజేపీ అనూహ్యంగా  35 శాతానికి పైగా ఓట్లు సాధించింది. మత పరమైన వ్యాఖ్యలతో ఇతర పార్టీలకు వెళ్లాల్సిన హిందూ ఓట్లను రాబట్టడంలో బీజేపీ సక్సెస్ అయింది. అదే సమయంలో గ్రేటర్ లో గతంలో బలంగా ఉన్న కాంగ్రెస్, టీడీపీ లు పూర్తిగా వెనకబడి పోయాయి. ఓటర్లు మత పరంగా చీలడం వల్లే కాంగ్రెస్, టీడీపీకి భారీగా నష్టం జరిగిందని ఫలితాల తర్వాత తేలింది. గ్రేటర్ ఎన్నికల వ్యూహాన్నే ఏపీలో వైసీపీతో కలిసి బీజేపీ అమలు చేస్తుందని అంటున్నారు. గ్రేటర్ లో ఎలాగైతే మెజారిటీ ముస్లిం ఓటర్లు ఎంఐఎం వైపు ఉంటారో.. అలాగే ఏపీలో మెజారిటీ క్రిస్టియన్, ముస్లిం ఓటర్లు వైసీపీ వైపు ఉంటారు. ఇక్కడ కూడా బీజేపీ బలపడాలంటే హిందూ ఓట్లను తన వైపు తిప్పుకోవాలి. అదే జరిగితే ఏపీలో టీడీపీ భవిష్యత్ ప్రశ్నార్థకమే. ఈ ప్రయత్నమే  ఏపీలో జరిగిందని అంటున్నారు.  

ఏపీలో జరుగుతున్న రాజకీయ కుట్రలను గమనించడం వల్లే కరోనాతో 9 నెలలుగా క్షేత్రస్థాయిలో పర్యటించని చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారంటున్నారు. చంద్రబాబు రామతీర్థం వెళ్లడమే కాదు..  అక్కడ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. హిందూ నినాదం బలంగా వినిపించారు. హిందూ భక్తులమని చెప్పుకునే బీజేపీ నేతల కంటే తీవ్రంగా మాట్లాడారు టీడీపీ అధినేత. జగన్ రెడ్డి పాలనలో హిందూ ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించిన చంద్రబాబు.. హిందూ ఆలయాల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రామ తీర్థంలో చంద్రబాబు ప్రసంగం విన్న తర్వాత బీజేపీ నేతలే షాకయ్యారని చెబుతున్నారు. చంద్రబాబు హిందూ వాదం గట్టిగా వినిపించడంతో కమలనాధులు కలవరపడ్డారని తెలుస్తోంది. హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులను అస్త్రంగా మలుచుకుని బలపడాలని చూసిన తమకు చంద్రబాబు దెబ్బ కొట్టారనే చర్చ బీజేపీ నేతల్లో జరిగిందంటున్నారు. తమ కంటే హిందూ సమాజంలో చంద్రబాబే హీరోగా నిలిచారనే అభిప్రాయానికి వచ్చారట. అంతేకాదు చంద్రబాబు రామతీర్థం వెళ్లి రాగానే  ఆలయాలపై దాడులు ఆగిపోయాయి. దీంతో దాడుల వెనక రాజకీయ కుట్ర ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది.   

 ఏపీలో  ఆలయాలపై జరుగుతున్న దాడులు, రాజకీయ పరిణామాలు ప్రమాదకరంగా ఉన్నాయని గ్రహించడం వల్లే   పీఠాధిపతులు, ఉత్తరాధికారులు సాధుసంతులు ఏకమయ్యారని తెలుస్తోంది.  ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులోని పొన్పాడి గ్రామం శివారులోని కంచిపీఠానికి చెందిన ఓ ఆశ్రమంలో సనాతన ధర్మ పరిరక్షణ పేరిట బుధవారం సదస్సు జరిగింది. ఏపీ, తమిళనాడుకు చెందిన పీఠాధిపతులు, ఉత్తరాధికారులు సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. కంచికామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి, దక్షిణామ్నాయ శృంగేరి జగద్గురు పీఠాధిపతి భారతీతీర్థ మహాస్వామి ప్రతినిధి గౌరీశంకర్‌, హంపీ విద్యారణ్య మహాసంస్థాన పీఠాధిపతి విద్యారణ్య భారతి, పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి, తుని సచ్చిదానం తపోవన పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి, అహోబిల మఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ స్వామి, ముముక్షుజన మహాపీఠాధిపతి ముత్తీవి సీతారాం,  తదితరులు పాల్గొన్నారు. ఏపీలో హిందూ సమాజంపై జరుగుతున్న దాడుల గురించి విస్తృతంగా చర్చించారు. కంచికామకోటి శంకర పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో తిరుపతి వేదికగా త్వరలోనే మహాసభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 
  
 మొత్తంగా ఏపీలో ఆలయాలపై వరుసగా జరిగిన దాడుల వెనక రాజకీయ కుట్ర ఉందనే విషయం తాజా పరిమాణాలతో స్పష్టమవుతోంది. టీడీపీని టార్గెట్ చేయడానికి ఆలయాల పేరుతో ప్రమాదకరమైన గేమ్ ఆడారని తెలుస్తోంది. ఇప్పుడు అన్ని నిజాలు తెలుస్తుండటంతో ఏపీ ప్రజలు షాకవుతున్నారు. ఓట్ల రాజకీయం కోసం ఇంత నీచానికి దిగజారుతారా, ప్రజల మధ్య చిచ్చు పెడతారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. మరోవైపు చంద్రబాబు సీరియస్ గా స్పందించడం వల్లే రాష్ట్రంలో శాంతి నెలకొందనే చర్చ కూడా జరుగుతోంది. చంద్రబాబు రామ తీర్థం వెళ్లి ఘాటుగా మాట్లాడకపోతే... రాష్ట్రం అత్యంత ప్రమాదకరస్థితికి వెళ్లేదనే అభిప్రాయం రాజకీయ నిపుణుల నుంచి వస్తోంది.