Read more!

సలహాదారులా.. సీఎం భజనపరులా? రాజ్యాంగ పదవికే కళంకం తెస్తారా ? 

ఆంధ్రప్రదేశ్ లో 20 నెలలుగా వైసీపీ సర్కార్ పాలన నడుస్తోంది. అయితే జగన్ రెడ్డి పాలన మూడు నిర్ణయాలు- ఆరు కొట్టివేతలు- తొమ్మిది చివాట్లుగా సాగుతుందనే చర్చ జనాల్లో జరుగుతోంది. ప్రభుత్వం తీసుకున్న చాలా నిర్ణయాలు వివాదాస్పదం కావడం, కోర్టులు కొట్టివేయడం, న్యాయమూర్తులు పాలకులకు చివాట్లు పెట్టడం పరిపాటిగా మారింది. అందుకే ఏపీ సర్కార్ ను జనాలంతా చివాట్ల సర్కార్ గా పిలుస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. సీఎం జగన్ అనాలోచిత, అస్తవ్యస్థ, ఏకపక్ష నిర్ణయాలతో  రాష్ట్రం పరువు పోతుందనే ఆందోళన కూడా కొన్ని వర్గాల నుంచి వ్యక్తమైంది. 

అంతేకాదు ప్రస్తుతం ఏపీలో కీలక పదవులన్ని ఒక సామాజిక వర్గానికే దక్కాయనే ఆరోపణలు ఉన్నాయి. జగన్ రెడ్డి  కార్యాలయం మొత్తం ఆ వర్గంతోనే నిండిపోయింది. ముఖ్యమంత్రి సలహాదారులుగా అంతా వాళ్లే ఉన్నారు. దీనిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండగా.. తాజాగా ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డిని తొలగించాలంటూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాయడం కలకలం రేపుతోంది. రాజ్యాంగస్ఫూర్తికి వ్యతిరేకంగా సజ్జల రాజకీయ ప్రకటనలు చేస్తున్నారని తన లేఖలో పేర్కొన్నారు నిమ్మగడ్డ. ఎస్ఈసీ తాజా లేఖాస్త్రంతో ప్రభుత్వ సలహాదారు అంటే ఎలా ఉండాలి, ఆయన విధులేంటీ, రాజకీయాలు చేయవచ్చా అన్న చర్చ జరుగుతోంది. 

ప్రభుత్వ సలహాదారు అంటే కేబినెట్ హోదా కలిగిన పదవి. ప్రభుత్వ సలహాదారు ప్రతినెలా ప్రజాధనాన్ని జీతభత్యాల కింద తీసుకుంటారు. ముఖ్యమంత్రికి ఆంతరంగిక సలహాదారుగా ఉన్నప్పుడు సీఎంకు సలహాలు ఇవ్వాలే తప్ప రాజకీయ ప్రకటనలు, విమర్శలు చేయడం సరికాదు. కాని ఇప్పుడు ఏపీలో మాత్రం అంతా రివర్స్ గా ఉంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక చాలామంది సలహాదారుల్లో ఒకరిగా సజ్జల రామకృష్ణా రెడ్డి నియమితులయ్యారు. ఇప్పుడు ఆయన కీలకమైన ప్రజా సంబంధాలు-ప్రజా వ్యవహారాల పోస్టులోఉంటూ కేబినెట్‌ హోదా అనుభవిస్తున్నారు. ఆయనకు సెక్రటేరియేట్‌లో గదిని కేటాయించారు. కేబినెట్‌ హోదాలో జీతభత్యాలు తీసుకుంటున్నందున ప్రస్తుతం ఆయన ప్రభుత్వోద్యోగి కిందే లెక్కే. 

కేబినెట్ హోదా కలిగి ప్రభుత్వ ఉద్యోగి కిందకు వచ్చే సజ్జల రామకృష్ణా రెడ్డి.. రాజ్యాంగ బద్ద సంస్థ అయిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ పై ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత కూడా ఎస్ఈసీపై విమర్శలు చేయడంపై రాజకీయ వర్గాలు  విస్మయం వ్యక్తం  చేస్తున్నాయి. సజ్జల క్యాబినెట్ హోదాలో ఉంటూ ఎస్ఈసీపై విమర్శలు చేయడం తప్పని. రాజ్యాంగ వ్యవస్థను కించపరచేలా ఆయన ఎలా మాట్లాడతారని రాజ్యాంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగ వ్యవస్థలో భాగమైన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌పై సజ్జల రామకృష్ణారెడ్డి వ్యక్తిగతంగా దూషణలు చేయడం దారుణమంటున్నారు. సజ్జలపై  గవర్నర్ చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.  

 సజ్జల రామకృష్ణారెడ్డి జర్నలిస్టు బ్యాక్ గ్రౌండ్ కలిగిన వారు. పలు పత్రికల్లో ఆయన పనిచేశారు. సాక్షి ఎడిటోరియల్ లో కీలకంగా వ్యవహరించారు. జర్నలిస్టుగా పని చేసిన సజ్జల.. కొన్ని మీడియా సంస్థలను టార్గెట్ చేయడంపైనా విమర్శలు వస్తున్నాయి.  ప్రభుత్వ సలహాదారు సజ్జలే కాదు మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని,  అనిల్ కుమార్ యాదవ్ కూడా ఎస్ఈసీ నిమ్మగడ్డపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఇది రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమంటున్నారు రాజ్యాంగ నిపుణులు. ఎస్ఈసీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న మంత్రులపైనా చర్యలు తీసుకునే అధికారం గవర్నర్ కు ఉందంటున్నారు. ఏపీలో జరుగుతున్న తాజా పరిణామాలతో పనికిమాలిన వారందరినీ సలహాదారులుగా నియమించుకోవడమేంటి? వాళ్లకు కేబినెట్‌ ర్యాంకులు ఇవ్వడమేంటి? అనే చర్చ జనాల్లో జరుగుతోంది.  ఎవరైనా హైకోర్టును ఆశ్రయిస్తే రాజ్యాంగ స్పూర్తికి విరుద్దంగా వ్యవహరిస్తున్న సజ్జలకు ఇచ్చిన హోదా తొలగిపోతుందని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు చెబుతున్నారు.