Read more!

ఒకే దెబ్బకు రెండు పిట్టలు! కేసీఆర్ డైరెక్షన్ లోనే షర్మిల పార్టీ? 

తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామాలు జరుగుతున్నాయి. కొంత కాలంగా జరుగుతున్న ప్రచారమే నిజమైంది. దివంగత వైఎస్సార్ కూతురు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి, వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది.  హైదరాబాద్ లోని లోటస్‌పాండ్‌లో ఆమె  ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వైఎస్ అభిమానులు, అనుచరులు, తెలంగాణకు చెందిన వైసీపీ కార్యకర్తలు, పలువురు నేతలు హాజరయ్యారు. కొత్త పార్టీ ఏర్పాటులో భాగంగానే జగనన్న బాణం ఈ  సమావేశం నిర్వహించారని తెలుస్తోంది.  

తెలంగాణలో  షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తన అన్న జగన్ తీరుపై కొంత కాలంగా  షర్మిల ఆగ్రహంగా ఉన్నారని... ఆయనకు షాకిచ్చేందుకే ఆమె కొత్త పార్టీ పెట్టబోతుందని కొందరు చెబుతున్నారు. అయితే  వైఎస్ షర్మిల కొత్త పార్టీ వెనక సంచలన విషయాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో దూకుడు మీదున్న బీజేపీకి బ్రేకులు వేయడంతో పాటు  తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ లీడర్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి టార్గెట్ గానే కొత్త పార్టీకి ప్లాన్ చేశారని తెలుస్తోంది. వైఎస్  షర్మిల పెట్టబోయే పార్టీకి కర్త, కర్మ, క్రియ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరేనని సమాచారం. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా కేసీఆర్ రూపొందించిన  డైరెక్షన్ లోనే షర్మిల పార్టీ వస్తుందని చెబుతున్నారు. సీఎం అయ్యేవరకు లోటస్ పాండ్ నుంచే పార్టీని నడిపించారు జగన్. ఇప్పుడు షర్మిల కూడా లోటస్ పాండ్ నుంచే రాజకీయాలు చేస్తుండటంతో.. జగన్ డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతుందని భావిస్తున్నారు. 

తెలంగాణలో ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. కేసీఆర్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత భారీగా పెరిగింది. సీఎం సొంత గడ్డ సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో సిట్టింగ్ సీటును కోల్పోవడం, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ అనుకున్న ఫలితాలను సాధించలేకపోవడంతో ఇది రుజువైంది. వరుస ఓటములతో టీఆర్ఎస్ కేడర్ ఢీలా పడగా.. ఇదే అదనగా విపక్షాలు దూకుడు పెంచాయి. ముఖ్యంగా  ఎంపీ రేవంత్ రెడ్డి జనాల్లోకి దూసుకుపోతున్నారు. గత ఏడేండ్లుగా కేసీఆర్ కుటుంబంపై పోరాడుతున్నారు రేవంత్ రెడ్డి. ఆయన పోరాటానికి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో  రోజురోజుకు ఆయన గ్రాఫ్ పెరిగిపోతోంది.  రేవంత్ రెడ్డి ఇంకా బలపడితే తమకు  మరిన్ని కష్టాలు తప్పవని టీఆర్ఎస్ పెద్దలు ఆందోళనగా ఉన్నారట. అందుకే రేవంత్ రెడ్డి బలం పెరగకుండా చూసేందుకే షర్మిలను రంగంలోకి దింపుతున్నారని చెబుతున్నారు.

తెలంగాణలోని  రెడ్డి సామాజికవర్గమంతా ఇప్పుడు అధికారం కోసం తహతహలాడుతోంది. వాళ్లందరికి రేవంత్ రెడ్డి ఆశాకిరణంలా మారిపోయారు. రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు.ఈ నేపథ్యంలోనే వైఎస్ షర్మిలతో కొత్త పార్టీ పెట్టిస్తున్నారని తెలుస్తోంది. దివంగత వైఎస్సార్ కు తెలంగాణలో భారీగా అభిమానులున్నాయి. ముఖ్యంగా రెడ్డి సామాజికవర్గంలో వైఎస్సార్ అంటే ఇప్పటికి క్రేజ్ ఉంది. షర్మిల పార్టీ పెడితే.. రెడ్డి సామాజిక వర్గం నుంచి కొత్త మద్దతు ఆమెకు లభిస్తుందని అంచనా. దీంతో రేవంత్ రెడ్డిని కొంత బలహీనం చేయవచ్చన్నది గులాబీ బాస్ వ్యూహమని చెబుతున్నారు. అందుకే తన మిత్రుడైన జగన్ తో మాట్లాడి.. అతని డైరెక్షన్ లోనే షర్మిల పార్టీకి ఏర్పాట్లు చేస్తున్నారని, తెలంగాణలో రాబోయే కొత్త పార్టీకి ఫండింగ్ కూడా కేసీఆరే సమకూర్చనున్నారని  సమాచారం.  

ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ ఫుల్ జోష్ లో ఉంది. సంజయ్ టీమ్ దూకుడుతో ప్రభుత్వ వ్యతిరేకత ఓటు అంతా అటు వైపు వెళుతోంది. ఈ కారణంగానే దుబ్బాక, గ్రేటర్ లో ఓడిపోయామని గులాబీ పార్టీ అంచనా వేసింది. షర్మిల పార్టీ పెడితే... ప్రభుత్వ వ్యతిరేకత ఓటు కూడా కొంత చీలే అవకాశం ఉంది. ఇది అధికార టీఆర్ఎస్ పార్టీకి కలిసి రానుంది. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలో వైసీపీ గతంలో బలంగా ఉండేది. 2014 ఎన్నికల్లో ఖమ్మం ఎంపీతో పాటు మూడూ అసెంబ్లీ సీట్లను వైసీపీ గెలుచుకుంది. వైసీపీ ఓటు బ్యాంకు కూడా షర్మిల పార్టీకి టర్న్ కావొచ్చని భావిస్తున్నారు. షర్మిల పార్టీ ఎన్ని సీట్లు గెలిచినా తమకు ఇబ్బంది ఉండదని.. వచ్చే ఎన్నికల్లో తమకు మెజార్టీ తగ్గినా ఆ  పార్టీ మద్దతు తీసుకోవచ్చనే యోచనలో కేసీఆర్ ఉన్నారంటున్నారు. అందుకే అన్ని పక్కాగా ఆలోచించాకే  వైఎస్ షర్మిలను రంగంలోకి దించుతున్నారని చెబుతున్నారు.  

మరోవైపు షర్మిల ఇంటిదగ్గర పెట్టిన ఫ్లెక్సీల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ షర్మిల ఫొటోలు మాత్రమే కనిపిస్తున్నాయి. జగన్ ఫొటో మాత్రం ఎక్కడా లేదు. అయితే ఇది కూడా ప్లాన్ ప్రకారమే జరిగిందంటున్నారు. జగన్ తో సంబంధం లేకుండా సొంతంగానే షర్మిల పార్టీ పెడుతున్నారనే సిగ్నల్ జనంలోకి వెళ్లేందుకే ఇలా చేశారంటున్నారు. మొత్తంగా  మొదటి నుంచి తమకు కొరకరాని కొయ్యలా మారిన రేవంత్ రెడ్డికి బలం పెరగకుండా చూసేందుకే కేసీఆర్, జగన్ కలిసి ఈ కొత్త వ్యూహం పన్నాయని తెలుస్తోంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా రేవంత్ రెడ్డిని దెబ్బకొట్టడంతో పాటు బీజేపీ స్పీడును అడ్డుకోవచ్చనే ఎత్తులో భాగంగానే వైఎస్ షర్మిల పార్టీ తెలంగాణలో వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేసీఆర్ పక్కా స్కెచ్ తో ఇదంతా జరుగుతుందని స్పష్టం చేస్తున్నారు.