సాగులో ఆమె..

అన్ని రంగాల్లో దూసుకుపోతున్నట్టే మహిళలు వ్యవసాయరంగంలోనూ ముందంజలో ఉంటున్నారు. రైతు కూలీలుగానే కాదు రైతులుగా మారి లాభసాటి వ్యసాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా వ్యసాయరంగం పై ఆధారపడిన మనదేశంల్లో మహిళలు కొత్తపంథాలను అనుసరిస్తూ అధిక దిగుబడిని సాధించడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించేలా సేంద్రీయ వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారు. నేల చదును చేసి విత్తనాలు నాటి, పంటనుంచి ధాన్యాన్ని సేకరించి, ఇంటికి చేర్చి ఆహారంగా మార్చి ఇంటిల్లిపాదికి అందించడం వరకు మహిళల పాత్ర ఉంటుంది. మహిళా రైతుల సంఖ్య  భారతీయ వ్యవసాయ రంగంలో నానాటికీ పెరుగుతూనే ఉంది. జాతీయస్థాయిలో నిర్వహించిన సర్వే నివేదికలు పరిశీలిస్తే 75శాతం మహిళా శ్రామికులు వ్యవసాయక్షేత్రంలోనే ఉంటున్నారు. రెండున్నర ఎకరాల పొలంలో  సగటున మహిళలు 3,845గంటలు పనిచేస్తున్నారు. నాట్లు వేయడంలో 557 గంటలు, కలుపు తీయడంలో 640గంటలు, పంటకు నీరు పెట్టడంలో 384 గంటల సమయాన్ని గడుపుతున్నారు. వారసత్వంగా వచ్చిన వ్యవసాయాన్ని కొందరు తిరిగి ప్రారంభిస్తుంటే.. సాఫ్ట్ వేర్ రంగాలను వదిలి సాగుదిశగా అడుగులు వేస్తున్నారు. ఇలాంటి వారిలో కొందరి గురించి జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుసుకుందాం..   సురేఖ... పుట్టిపెరిగింది నగరం వాతావరణంలో.. కానీ మొక్కలంటే మక్కువ. ఉన్నతవిద్య పూర్తి చేసిన తర్వాత రెండు దశాబ్దాలపాటు ఆమె  మీడియా, అడ్వటైజింగ్, కార్పోరేట్ ట్రైనింగ్ ఫీడ్ లో ఉన్నారు. విదేశాల్లో ఉన్నతవిద్యకోసం వెళ్లేవారికి సంబంధిత యూనివర్సటీలా ప్రవేశపరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా కోచింగ్ ఇస్తూ మూడు కోర్సులు, ఆరు క్లాసులు గా బిజీబిజీగా ఉన్న లైఫ్ లో వ్యవసాయం పై మక్కువ మాత్రం తగ్గలేదు. కరోనా కారణంగా అన్నింటికీ బ్రేక్ పడగా.. ఇదే సరైన సమయం అనుకుంటూ గ్రామం వైపు పరుగుదీశారు. నగరానికి చేరువగా ఉన్న గ్రామంలో ఆరు ఎకరాల పొలం లీజుకు తీసుకున్నారు. వ్యసాయంపై తనకు ఉన్న ప్రేమను చాటుకుంటూ మట్టివాసనను ఆస్వాదిస్తున్నారు. వ్యసాయం లాభసాటిగా ఉండాలంటే అందుబాటులోకి వచ్చిన ఆధునిక పద్ధతుల గురించి అవగాహన ఉండాలి. రైతులకు ప్రభుత్వం సమాచారాన్ని అందించాలి అంటూ అగ్రికల్చర్ సిబ్బంది సహాయం తీసుకుంటున్నారు. నేల రకాన్ని పరీక్షించడంతో పాటు పంట పెరుగుదలలో తీసుకోవల్సిన సస్యరక్షణ చర్యలపై అవగాహన పెంచుకుంటున్నారు. ఎసీ గదుల్లో కోచింగ్ ఇచ్చిన తాను ప్రకృతి మధ్య కు వచ్చిన వ్యసాయపాఠాలు నేర్చుకుని మరికొందరికీ ఆధునిక, లాభసాటి వ్యవసాయం గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పేముందు నేను తెలుసుకోవాలి కదా అంటూ తానే స్వయంగా పొలం పనుల్లో దగారు. భూసారాన్ని పరీక్షించడం నుంచి నాట్లు వేసే వరకు తానే ముందున్నారు.   కృష్ణవేణి... వ్యవసాయ కుటుంబంలో పుట్టిపెరిగారు. మట్టి పరిమళం బాగా తెలుసు. పల్లె నుంచి పట్టణానికి పోయినా ఆ మట్టి పరిమళాన్ని మరిచిపోలేదు.  పెండ్లి, పిల్లలు, ఇంటి బాధ్యతలతో ఏ కాస్త సమయం దొరికిన సామాజిక సేవ చేస్తూ బిజీబిజీగా మారారు. పిల్లలు పెద్దవారై కాస్త తీరిక దొరకగానే ఆమె ఆలోచనలు తిరిగి వ్యవసాయం వైపు మళ్లాయి. ఊరిలో తమకు ఉన్న వ్యవసాయ భూములను కౌలుకు ఇవ్వకుండా తానే దగ్గర ఉండి సాగు చేయిస్తున్నారు. తాను చిన్నప్పుడు చూసిన సంప్రదాయ వ్యవసాయ పద్దతులను అనుసరిస్తూ సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. వ్యవసాయం అంటే ఇతరుల సాయంతో ఇతరులకు సాయంచే జీవనవిధానం అంటారు కృష్ణవేణి. పంట కోసిన తర్వాత తమ పశువులకు ఆహారం కోసం వెతికే గొర్రెకాపరులకు తమ పొలంలోకి అనుమతి ఇస్తారు. ఎండాకాలంలో దాదాపు రెండు నెలల పాటు గొర్రెలు,మేకలు, పశువులు  పొలంలో దొరికే చెట్టుచేమ తింటూ అక్కడ పేడ వేస్తాయి. ఈ పేడ పొలానికి మంచి ఎరువు అవుతుంది. పంటలేని కాలంలో పశువుల మేతకు అనుమతించడం వల్ల అవి వేసే పేడ ఎంతో మేలు చేస్తుందని ఇది తన చిన్నతనంలో చూసేదాన్ని అని ఆమ చెప్పారు. ఇప్పుడు పురుగు మందులతో వ్యసాయం చేస్తున్నారు. అప్పుడు పశుపక్ష్యాదులతో కలిసి వ్యవసాయం చేసేవారు అంటారు కృష్ణవేణి.   విశాల.. నగరాలను మార్కెటింగ్ చేసే కార్పొరేట్ వ్యక్తి విశాల. హైదరాాబాద్ ఐటీ క్యారిడార్ లో వీకెండ్స్  మార్నింగ్ టైమ్ లో స్టాఫ్ వేర్ పీపుల్  అంతా బయటకు వచ్చి మాస్  ప్రోగ్రామ్స్ చేసేలా రహ్ గిరి రూపకల్పన చేసిన వారిలో ఆమె ఒకరు. అంతర్జాతీయ స్థాయిలో ప్రోగ్రామ్స్ చేసినా తమ మూలాలు పల్లెలోనే అన్న విషయం ఆమెకు బాగా తెలుసు. అందుకే పల్లెవైపు అడుగువేశారు. రాయలసీమలోని తమ గ్రామంలో ఉన్న పొలంలో చిరుధాన్యాలు పండించడంతో పాటు డాటర్స్ ఆఫ్ సాయిల్ పేరుతో ఎప్ బీ పేజీని క్రియేట్ చేశారు. వ్యసాయరంగంలో మహిళ పాత్రను అంతర్జాతీయ వేదికపై తెలియజేసేందుకు కృషి చేస్తున్నారు. మిల్లెట్స్ బ్యాంక్ ను ఏర్పాటుచేసి చిరుధాన్యాలకు మార్కెంటింగ్ కల్పించే ప్రయత్నం చేస్తుననారు. దీనితో పాటు సనాతన వ్యవసాయ పద్ధతులను ఆధునిక తరానికి అందించేందుకు మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తున్నారు.   నిర్మల... విదేశాల్లో ఉద్యోగం. ఐదంకేల జీతం. కానీ, తాను పుట్టిపెరిగిన సమాజానికి ఎదో చేయాలన్న ఆరాటం. అంతే ఆమె అమెరికా నుంచి మారుమూల గ్రామానికి పయనం. మొదట సామాజిక అంశాలపై స్టడీ చేయాలనుకున్నారు. కానీ, వ్యవసాయం రంగంలో చిన్నసన్నకారు రైతులు, మహిళలు ఎదుర్కోంటున్న సమస్యలను చూసి తాను పనిచేయాల్సింది ఈ రంగంలోనే అనే నిర్ణయానికి వచ్చారు. వలసలకు మారుపేరు అయిన పాలమూరు జిల్లాకు అమెరికా నుంచి ఆమె వలస వచ్చారు. నారాయణపేట్, దామరగిద్ద ప్రాంతంలోని రైతులను కలుసుకుంటూ గత ఐదేండ్లుగా ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వద్దకు తీసుకువెళ్లుతూ పరిష్కారం దిశగా కృషి చేస్తున్నారు. ప్రభుత్వం పేదవారికి పంచిన గుట్టలు, బండరాళ్లతో ఉన్న భూమిని రైతుల శ్రమదానంతో సాగులోకి తీసుకువచ్చారు. సాగునీటి సౌకర్యం అంతగా లేని ప్రాంతంలో వర్షాధార పంటలైన చిరుధాన్యాలను పండించేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతు పండించిన పంట దళారీల ప్రమేయంలేకుండా నేరుగా వినియోగదారులకు చేరేలా కృషి చేస్తున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో మహిళా రైతులకు శిక్షణ ఇచ్చేప్రయత్నాలు చేస్తూ వ్యవసాయరంగాన్ని నమ్ముకున్నవారిని కష్టాల నుంచి గట్టెక్కించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.   రేణుక మనం తీసుకునే ఆహారం కడుపు నింపడమే కాదు అనారోగ్యాల నుంచి రక్షణ ఇచ్చేలా ఉండాలి అంటున్నారు మహిళా రైతు రేణుక. కాలగర్భంలో కలిసిపోయిన వరివంగడాలను సేకరించి తిరిగి వాటిని సాగులోకి తీసుకువస్తున్నారు. సేంద్రీయవ్యవసాయం తాను చేయడమే కాకుండా తమ ఇరుగుపొరుగు వారిని కూడా ప్రోత్సహిస్తున్నారు. రేణుక సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం క్యాన్సర్ కారణంగా ఆమె మామగారు చనిపోవడం. ఆహారం, జీవనశైలీ కారణంగానే దీర్ఘకాలిక సమస్యలైన క్యాన్సర్, మధుమేహం, కీళ్లనొప్పులు, గుండెజబ్బులు వస్తాయని డాక్టర్లు చెప్పడం ఆమెను ఆలోచింప చేసింది. మరి మన తాతముత్తాలు ఏం తినేవారు అన్నదిశగా సాగిన ఆలోచనలు ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయిన పురాతన వరి వంగడాలను సేకరించేలా చేశాయి. ఆమె భర్త తిరుపతి సహాకారంతో దాదాపు 51రకాల పాత వరి వంగడాలను సేకరించి వాటిని పండిస్తూ విత్తనాలను ఆసక్తి ఉన్న రైతులకు ఉచితంగా పంపిణి చేస్తున్నారు.   వ్యవసాయరంగంలో కూలీలుగానే కాదు ఆరోగ్యకరమైన సమాజం కోసం పాటుపడే మహిళలు ఎందరో ఉన్నారు అని నిరూపిస్తున్నారు ఈ ఐదుగురు మహిళలు. ఆరోగ్యానిచ్చే ఆహారాన్ని పండిస్తూ సమాజాన్ని ఆరోగ్యదాయకంగా చేసే ప్రయత్నం చేస్తూ వ్యవసాయరంగంలో ఉన్న ప్రతి మహిళకు జాతీయ మహిళా రైతు దినోత్సవం సందర్భంగా హాట్సాఫ్...

గులాబీకి గ్రేటర్ షాక్! కారుకు మూడో ప్లేసంటున్న సర్వే? 

గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ కు గ్రేటర్ షాక్ తగలబోతుందా? బల్దియా ఎన్నికల్లో అధికార పార్టీ ఆగమాగం కానుందా? రెండోసారి జెండా ఎగరేయాలనున్న కారు పార్టీ స్పీడుకు జీహెచ్ఎంసీలో బ్రేక్ పడనుందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది ప్రీపోల్ సర్వేల్లో. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలపై తీన్మార్ మలన్నకు చెందిన క్యూ న్యూస్ యూట్యూబ్ చానెల్ నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో గులాబీ పార్టీకి గుబులు రేపే ఫలితాలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో  రికార్డ్ స్థాయిలో 99 డివిజన్లు గెలిచిన టీఆర్ఎస్ కు ఈసారి అందులో పదో వంతు సీట్లు మాత్రమే వచ్చే అవకాశాలుఉన్నాయని సర్వే ఫలిచాలను బట్టి అర్ధమవుతోంది. ఇప్పటికిప్పుడు గ్రేటర్ లో ఎన్నికల్లో జరిగితే టీఆర్ఎస్ పార్టీకి మూడో స్థానం వస్తుందని ప్రీపోల్ సర్వే స్పష్టం చేస్తోంది. అది కూడా నాలుగో స్థానంలో ఉన్న టీడీపీ కంటే కొంచెం మెరుగ్గానే ఉంది గులాబీ పార్టీ పరిస్థితి   గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రెండు డివిజన్లు మాత్రమే గెలుచుకున్న ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఈసారి భారీగా పుంజుకున్నట్లు క్యూ న్సూస్ సర్వేలో తేలింది. గ్రేటర్ లో మెజార్టీ సీట్లు హస్తం కైవసం చేసుకోబోతుందని తెలుస్తోంది. బీజేపీ కూడా కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు గ్రేటర్ పరిధిలోని 40 డివిజన్లలో క్యూ న్యూస్ ప్రీపోల్ సర్వే పూర్తైంది. ఇందులో కాంగ్రెస్ 18 డివిజన్లలో ఆధిక్య సాధించి టాప్ లో నిలిచింది. బీజేపీ 13 డివిజన్లలో ముందంజలో ఉంది. ఇక అధికార టీఆర్ఎస్ మాత్రం కేవలం ఐదు డివిజన్లలోనే లీడ్ పొందింది. టీడీపీ నాలుగు డివిజన్లలో సత్తా చాటుతూ టీఆర్ఎస్ కు దరిదాపుల్లోనే నిలిచింది. గ్రేటర్ పరిధిలో 150 డివిజన్లు ఉండగా... అందులో పాతబస్తిలోనే 50 డివిజన్లున్నాయి. ఓల్డ్ సిటీలో ఎంఐఎందే పూర్తి ఆదిపత్యం కాబట్టి.. ఆ సీట్లపై మిగితా పార్టీలు ఆశలు పెట్టుకోవు. మిగితా 100 డివిజన్లలోనే పోటీ పడతాయి. ఈ వందలోనే 40 డివిజన్లలో సర్వే జరిపింది క్యూ న్యూస్ సంస్థ. సో... దాదాపుగా ఇవే ఫలితాలు మిగితా డివిజన్లలో ఉంటాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.   ప్రీపోల్ సర్వేను పక్కాగా నిర్వహించింది క్యూ న్యూస్ సంస్థ. ఎన్నికల్లో మాదిరే బ్యాలెట్ పేపర్లతోనే సర్వే చేస్తోంది. సర్వే నిర్వహించిన డివిజన్ లోనే బాక్సులు పెట్టగా.. ఆసక్తి గల ఓటర్లు బ్యాలెట్ పేపరులో పార్టీ సింబల్ పై టిక్ చేస్తూ పెట్టేలో వేశారు. తర్వాత అందరి సమక్షంలోనే వాటిని లెక్కిస్తున్నారు. అచ్చం పోలింగ్ జరుగుతున్నట్లుగా ఈ సర్వే నిర్వహిస్తున్నారు. ప్రతి డివిజన్ లోని  2 వందల మంది నుంచి ఓటు తీసుకుంటున్నారు. ఇందులో అన్ని వర్గాల వారు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు క్యూ న్యూస్ సర్వే నిర్వాహకులు. పారదదర్శకంగా సర్వే ఉండటంతో ఫలితాలపై ప్రజలు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.    క్యూ న్యూస్ ఇప్పటివరకు నిర్వహించిన 40 డివిజన్లలో గ్రేటర్ లోని అన్ని ప్రాంతాలు దాదాపుగా కవరయ్యాయి. అయితే ప్రీ పోల్ సర్వేల్లో అధికార పార్టీకి నగరంలోని ఏ ప్రాంతంలోనూ సానుకూలత లభించడం లేదు. టీఆర్ఎస్ కు లీడ్ వచ్చిన ఐదు డివిజన్లలోనూ.. ఆ పార్టీకి ఇతర అభ్యర్థుల నుంచి   పోటీ  తీవ్రంగానే ఉంది. చాలా డివిజన్లలో అధికార పార్టీ మూడో స్థానానికి పడిపోయింది. కాంగ్రెస్ ముందున్న స్థానాల్లో ఆ పార్టీకి భారీగా ఓట్లు వచ్చాయి. బీజేపీ కూడా మంచిగానే ఓట్లు సాధించింది. సరూర్ నగర్ లో అధికార పార్టీ ఏకంగా నాలుగో స్థానానికి దిగజారింది. సిటీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో ఆ పార్టీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గ్రేటర్ శివారు ప్రాంతాల్లో అధికార పార్టీకి తీవ్ర వ్యతిరేకత వస్తుండగా.. ఆ ఏరియాల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి జనాల నుంచి ఊహించని సపోర్ట్ లభిస్తోంది.    ఎంపీ రేవంత్ రెడ్డి ప్రాతినిద్యం వహిస్తున్న మేడ్చల్ మాల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలో గ్రేటర్ లోని 50 డివిజన్లు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఎంపీ పరిధిలోని డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ హవా కనిపిస్తోంది. మల్కాజ్ గిరి, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ , ఉప్పల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ స్వీప్ చేసేలా కనిపిస్తోంది. ఈ నాలుగు  నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా.. అధికార పార్టీ ప్రీపోల్ సర్వేల్లో బాగా వెనకబడి పోయింది. నాగోల్, కాప్రాలో  మాత్రమే కారుకు లీడ్ వచ్చింది. కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ లో చేరిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి షాకిచ్చేలా సర్వే ఫలితాలు వచ్చాయి. ఎల్బీనగర్ పరిధిలో 8 డివిజన్లు ఉండగా.. ఒక్క బీఎన్ రెడ్డి నగర్ లో మాత్రమే టీఆర్ఎస్ ముందుంది. మంత్రి సబితారెడ్డి నియోజకవర్గం మహేశ్వరం పరిధిలోని సరూర్ నగర్ డివిజన్ లో గులాబీ పార్టీ ఏకంగా నాలుగో స్థానానికి పడిపోవడం ఆశ్చర్యం కల్గిస్తోంది.                           గ్రేటర్ శివారు ప్రాంత డివిజన్లలో కాంగ్రెస్ ముందుండగా.. న్యూసిటీలో మాత్రం బీజేపీ జోరు కనిపించింది ప్రీపోల్ సర్వేలో. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిద్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ పూర్తి సత్తా చాటింది. ఈ నియోజకవర్గ పరిధిలోని డివిజన్లలో  క్యూ న్యూస్ ఇప్పటివరకు నిర్వహించిన ప్రీపోల్ సర్వే లో బీజేపీనే మెజార్టీ సీట్లలో ముందంజలో ఉంది. గత ఎన్నికల్లో ఘోరంగా చతికిలపడిన కాంగ్రెస్ కూడా అనూహ్యంగా  కొన్ని డివిజన్లలో లీడ్ సాధించింది.  హైదరాబాద్ లోక్ సభ పరిధిలోని గోషామహాల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజాసింగ్ పట్టు కనిపించింది. గోషామహాల్ పరిధిలోని అన్ని డివిజన్లలో బీజేపీ లీడ్ సాధించగా.. కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది.    ఇక గ్రేటర్ హైదరాబాద్ లో టీడీపీ కనుమరుగయ్యందని ప్రచారం చేసే వారి దిమ్మ తిరిగేలా క్యూ న్యూస్ సర్వే ఫలితాలు కనిపిస్తున్నాయి. కూకట్ పల్లి , కుత్బుల్లాపూర్ పరిధిలోని గ్రేటర్ డివిజన్లలో టీడీపీ బలంగానే ఉన్నట్లు తేలింది. కొన్ని డివిజన్లలో ముందుండగా.. మరికొన్ని డివిజన్లలో రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఇప్పటివరకు జరిగిన సర్వేలో ఓవరాల్ గా అధికార టీఆర్ఎస్  కంటే టీడీపీకే ఎక్కువ ఓట్లు రావడం ఆసక్తి కలిగిస్తోంది. ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజ్ గిరి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని డివిజన్లలోనూ టీడీపీకి మంచిగానే ఓట్లు పడ్డాయి. బలమైన అభ్యర్థులను బరిలోకి దింపితే టీడీపీకి గ్రేటర్ ఎన్నికల్లో మంచి ఫలితాలే వస్తాయని ప్రీ పోల్ సర్వేను విశ్లేషించిన పొలిటికల్ అలిస్టులు చెబుతున్నారు.

గ్రేటర్‌లో జోష్.. దుబ్బాకపై సైలెంట్! కేటీఆర్ కథ పెద్దదే!

తెలంగాణలో వరుస ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 3న జరగనున్న సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికకు ఇప్పటికే హోరాహోరీగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ లోపే బల్దియా కొత్త పాలకమండలి ఏర్పాటయ్యేలా ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. వచ్చే మార్చి-ఏప్రిల్ లో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు మంత్రి కేటీఆర్. అయితే ఆయన ఫోకసంతా గ్రేటర్ , మండలి ఎన్నికలపైనే పెడుతున్నట్లు కనిపిస్తోంది. డిసెంబర్ లో జరుగుతాయని భావిస్తున్న జీహెచ్ఎంసీ, మరో ఆరు నెలల తర్వాత జరగనున్న మండలి ఎన్నికలపై వరుస సమీక్షలు చేస్తున్న కేటీఆర్.. దుబ్బాక ఉప ఎన్నికను మాత్రం పట్టించుకోలేదు. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.  నిజానికి మరికొన్ని రోజుల్లోనే జరగనున్న దుబ్బాక ఉప ఎన్నికపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఎక్కువ దృష్టి సారించాలి. కాని కేటీఆర్ మాత్ర దుబ్బాక ఎన్నిక గురించి అసలు మాట్లాడటమే లేదు. దుబ్బాక నేతలతో ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. కనీసం వారితో వీడియో కాన్ఫరెన్స్ లోనూ మాట్లాడలేదు కేటీఆర్.  సమయం సందర్భం వచ్చినప్పుడల్లా గ్రేటర్ ,మండలి ఎన్నికల్లో తామే గెలుస్తామని చెబుతున్న కేటీఆర్.. దుబ్బాకపై మాత్రం ఎక్కడా మాట్లాడటం లేదు. కేటీఆర్ వైఖరిపై టీఆర్ఎస్ లోనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. దుబ్బాకలో పార్టీ పరిస్థితి బాగాలేదని  గ్రహించడం వల్లే కేటీఆర్ దానిపై ఫోకస్ చేయడం లేదని చెబుతున్నారు. పార్టీ సర్వేలోనూ అదే  తేలిందంటున్నారు. అందుకే దుబ్బాకలో పార్టీ ఓడిపోయినా  తన ఇమేజ్  డ్యామేజీ కాకుండా ఉండేలా కేటీఆర్ జాగ్రత పడుతున్నారనే ప్రచారం కూడా ఉంది.                  గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ పీఠం మళ్లీ కైవసం చేసుకుంటామనే భావనలో కేటీఆర్ ఉన్నారట. అందుకు కారణం కూడా ఉందంటున్నారు. గ్రేటర్ లో ఇప్పటికే 30కి పైగా ఎక్స్ అఫిషియో సభ్యులు టీఆర్ఎస్ కు ఉన్నారు. ఓల్డ్ సిటీలో ఎలాగూ ఎంఐఎం దాదాపు 50 వరకు డివిజన్లు గెలుచుకుంటుంది. దీంతో గతం కంటే చాలా సీట్లు తగ్గినా.. మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న పతంగి పార్టీతో కలిసి గ్రేటర్ లో మళ్లీ పవర్ దక్కించుకునే అవకాశం అధికార పార్టీకి ఉంది. అందుకే గ్రేటర్ పై కేటీఆర్ ధీమాగా ఉన్నారని చెబుతున్నారు. మండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేక ఫలితాలు వచ్చినా కేటీఆర్ కు పెద్ద  ఇబ్బంది ఉండదు. ఎందుకంటే గతంలోనూ మండలి ఎన్నికల్లో గులాబీ పార్టీకి చేదు ఫలితాలే వచ్చాయి. కాబట్టి ఈసారి అలాంటి ఫలితాలే వచ్చినా అది కేటీఆర్ కు అంత ఇబ్బందిగా ఉండదని చెబుతున్నారు. అందుకే తనకు మైనస్ కాకుండా ఉన్న గ్రేటర్ హైదరాబాద్, పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలపైనే ఫోకస్ చేస్తూ.. ఇబ్బందిగా  ఉందని భావిస్తున్న దుబ్బాకను కేటీఆర్ పట్టించుకోవడం లేదని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.  దుబ్బాక ఉపఎన్నికతో మంత్రి హరీష్ రావుపై మెడపై కత్తి పెట్టారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం దుబ్బాక బాధ్యతలన్ని హరీష్ రావే చూస్తున్నారు. అక్కడ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో  అక్కడ వ్యతిరేక ఫలితం వస్తే.. ఆ నెపమంతా హరీష్ రావుకు  అంటగట్టే కుట్ర జరుగుతుందనే వాదనలు కూడా కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ లో మొదటి నుంచి హరీష్ రావుకు ట్రబుల్ షూటర్ గా పేరుంది. ఆయనకు బాధ్యతలు అప్పగించిన ప్రతి ఎన్నికల్లోనూ  సక్సెస్ చేసి చూపించారని చెబుతారు. అలాంటి ట్రబుల్ షూటర్ కు ట్రబుల్స్ కలిగేలా టీఆర్ఎస్ లోని ఓ వర్గం ప్లాన్ చేసిందనే ప్రచారం జరుగుతోంది. అందుకే పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తెలుస్తున్నా.. దుబ్బాకకు కేటీఆర్ ఎందుకు వెళ్లడం లేదని కొందరుచెబుతున్నారు. హరీష్ రావును ఇరికించే ప్రయత్న దుబ్బాక ఉప ఎన్నిక సాక్షిగా జరుగుతుందని బలంగా వాదిస్తున్నారు. అయితే తమ నేతపై కుట్రలు జరుగుతున్నాయని అనుమానిస్తూనే... దుబ్బాక  పరీక్షలో హరీష్ రావే గెలుస్తారని ఆయన అభిమానులు నమ్మకంగా చెబుతున్నారట.

ఆంధ్రుల భవిత కోసం అలుపెరగని పోరాటం. అమరావతి రైతులకు వందనం!

కురుక్షేత్రం జరిగింది 5 ఊళ్ళ కోసం కాదు, దుష్ట శిక్షణ కోసం. అమరావతి పోరాటం 29 ఊళ్ళ కోసం కాదు, 5 కోట్ల ఆంధ్రుల భవిత కోసం. ఇది అమరావతి రైతులు, మహిళల నినాదం. ఇదే నినాదం సోషల్ మీడియాలో హోరెత్తింది. మహాభారతం స్పూర్తితో 3 వందల రోజులుగా అలు పెరగని పోరాటం చేస్తున్న అమరావతి రైతులకు ఆంధ్రా జనం జై కొట్టారు. ఐదు కోట్ల ఆంధ్రుల భవిత కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న పోరాటయోధులకు  వందనాలు అంటూ కిర్తించారు.    అమరావతి రాజధాని రైతుల ఉద్యమజ్వాల మూడొందల రోజులుగా ప్రజ్వరిల్లుతూనే ఉంది. పది నెలలుగా అకుంఠిత దీక్షతో పోరాటం చేస్తున్నారు రైతులు, మహిళలు.  అధికారపక్షానికి చుక్కలు చూపిస్తున్నారు. 3 వేల ఎకరాల భూములను రాజధాని కోసం ఇస్తే.. ఇప్పుడు మూడు రాజధానులంటూ తమను రోడ్డున పడేస్తున్నారన్న ఆక్రోశం వారిని నిత్యం పోరుకు పురికొల్పుతోంది. అందుకే అవమానాలు, నిర్బంధాలు ఎదురైనా వారు లెక్క చేయలేదు. పోలీసుల లాఠీ దెబ్బలకు వెనుకాడలేదు. అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపినా జంకలేదు. కరోనా పడగ విప్పుతున్నా.. జాగ్రత్తలు తీసుకుంటూనే కదన రంగం వీడలేదు.    నిరాహార దీక్షలు, ధర్నాలు, ఆందోళనలు, రహదారులపై బైఠాయింపు, అసెంబ్లీ ముట్టడి, మౌన ప్రదర్శనలు, ర్యాలీలు, ప్రార్థనలు, యాగాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నపాలు, వేడుకోళ్లు... ఇలా అన్ని మార్గాల్లోనూ ప్రయత్నిస్తూనే ఉన్నారు.ఏకైక రాజధానిగా అమరావతి.. అనే లక్ష్యంతో ఉద్యమం హోరెత్తుతోంది. అమరావతి నుంచి ఢిల్లీ వరకు తమ ఉద్యమ నినాదాన్ని వినిపిస్తూనే ఉన్నారు  రాజధాని రైతులు.      అమరావతి ఉద్యమం మొదలయ్యాకా ప్రభుత్వం తీవ్ర ఆంక్షలు విధించింది. రాజధాని గ్రామాల్లోకి  వేల సంఖ్యలో పోలీసు బలగాల్ని దించింది. దాదాపు గ్రామాలన్నింటినీ దిగ్బంధించింది. 144 సెక్షన్‌, పోలీసు చట్టంలోని 30 సెక్షన్లను ప్రయోగించి.. రైతులను భయాందోళనకు గురి చేసి ఉద్యమాన్ని కట్టడి చేయాలని చూసింది. 3 వేల మందికి పైగా అన్నదాతలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపింది. రాజధాని మొదలైన నాటి నుండి 80మంది రైతులు మనస్థాపానికి గురి అయి చనిపోయారు. అయినా ఉద్యమం ఆపలేదు అమరావతి రైతులు. కొందరి గుండెలు అలసి ఆగిపోయినా... భూదేవి అంతటి ఓర్పుతో శాంతియుతంగా పోరాడుతున్నారు ఈ భూమి పుత్రులు.    రాజధాని పరిరక్షణ ఉద్యమంలో  అతివలే ఆదిశక్తులయ్యారు.  మందడంలో నిరసన ర్యాలీ చేసినా, దుర్గమ్మకు మొక్కులు చెల్లించినా , అసెంబ్లీ ముట్టడైనా, జాతీయ రహదారి దిగ్బంధమైనా.. మహిళలే ముందుండి నడిచారు. పోలీసులు బూటు కాళ్లతో తన్నినా, లాఠీలతో కొట్టినా మౌనంగా భరించారు. శాంతియుతంగానే ఆందోళన కొనసాగిస్తున్నారు. అమరావతికి చెందిన మహిళా ప్రతినిధులు, వారి తరపున పోరాడుతున్న మహిళా నేతలు  ఢిల్లీ వెళ్లి... కేంద్ర మంత్రులను కలిసి తమ పోరాటానికి మద్దతివ్వాలని కోరారు.      అమరావతి రైతులు, మహిళల అలుపెరగని పోరాటానికి ఆంధ్ర జనం జైకొట్టింది. ఉద్యమానికి 300 రోజులు పూర్తైన సందర్భంగా వారికి సంఘీభావం తెలిపింది.  అమరావతి మహోద్యమం గురించి , రైతులు , మహిళామతల్లులు పడుతున్న కష్టాల గురించి దేశ ప్రజలకు , జాతీయ నాయకులకు సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు జనాలు. మన రాజధానిని మనం కాపాడుకుందామంటూ శపథం చేశారు.  అమరావతి హ్యాష్ టాగ్  ట్విట్టర్ లో  ట్రెండింగ్ లో నిలిచింది. రాజధానికి మద్దతుగా ట్విట్టర్ లో భారీగా పోస్టులు పెట్టారు. ఇతర అమరావతి అభిమానుల ట్వీట్లను రీట్వీట్ చేశారు.      జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించలేక మౌనంగా రోధిస్తున్న వారికి, అమరావతి మహిళల పోరాటం ఈ రాష్ట్రానికే స్పూర్తి అని కీర్తించారు. ఒక నియంతకు భయపడి వెనుకడుగు వేస్తున్నాం కానీ, తెగించి నిలబడతే, జగన్ అనే వాడు చాలా చిన్న వాడు అని చాటి చెప్పారు.. అమరావతి మహిళలు అంటూ ఆకాశానికెత్తారు. ఆ పోరాట స్పూర్తితోనే, ఇంత పెద్ద అధికార యంత్రాంగం చేతిలో ఉన్నా, 16 నెలలుగా అమరావతిని ఇంచ్ కూడా కదపలేక పోయాడని కొందరు పోస్టులు పెట్టారు.    నా రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునే స్థాయి నుంచి, నాకు రాజధాని లేదు అని చెప్పాల్సిన స్థాయికి దిగజారిపోయామని ఏపీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రం కోసం, మన హక్కుల కోసం, అమరావతి మహిళలు, రైతుల పోరాటాన్ని స్పూర్తిగా తీసుకుని పోరాడదాం రండి అంటూ పిలుపిచ్చారు. రైతన్నల కోసం  5 కోట్ల ఆంధ్రుల  బిడ్డల భవిష్యత్ కోసం.. ఆంధ్ర బిడ్డల చిరునామా కోసం.. మన బిడ్డలు వలస బతుకులు కాకుండా కాపాడు కోవటం కోసం కలిసి రావాలని కోరారు. ఆంధ్రుడా ఆలోచించు. రాజధాని అమరావతి ఒక్కటే అని గుర్తించు అని నినదించారు.  గమ్యంలేని గమనం, ముగింపులేని ప్రయాణం ఇంకా ఎన్నాళ్లు ఎన్నేళ్లు ?.. రండి కదలిరండి. మన రాజధాని అమరావతిని కాపాడుకొందాం, అమరావతి రైతులకు తోడుగా రా కదలిరా అంటూ కొందరు పోస్టు చేశారు.    రాజధాని కోసం భూమి త్యాగం చేసిన రైతులకు గత  ప్రభుత్వం కొత్త బట్టలు పెట్టి గౌరవం ఇచ్చింది ...ఇప్పుడు ప్రభుత్వం లాఠీ తో గౌరవం ఇచ్చిందని నెటిజన్లు ఆరోపించారు. 34,322 ఎకరాలను ప్రభుత్వం అడగగానే ఇచ్చేసిన తమ త్యాగానికి ఏనాడైనా అమరావతి రూపుదాల్చుతుందన్న నమ్మకం... ఆ నమ్మకంతోనే ఉద్యమాన్ని కొనసాగిస్తున్న ఉద్యమకారులారా... విజయోస్తు అంటూ కీర్తించారు నెటిజన్లు, ఆంధ్ర ప్రజలు.    రాజధాని ఉద్యమం 3 వందల రోజులు కావడంతో అమరావతి రైతులు కదం తొక్కారు. కరోనా భయం వెంటాడుతున్నా, వర్షం కురుస్తున్నా పోరు బాటలో ముందుకు సాగారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఆకుపచ్చ కండువాలు ధరించి జాతీయ జెండాలు, అమరావతి జేఏసీ జెండాలతో నినదించారు. తుళ్లూరు నుంచి మందడం వరకు 9 కిలోమీటర్ల మేర వేల మంది రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేవరకు పోరు ఆపబోమని స్పష్టం చేశారు. పరిరక్షణ సమితి ర్యాలీలో పాల్గొనేందుకు రాజధాని ప్రాంతంలోని ప్రతి పల్లె కదిలింది. గుంటూరు, మంగళగిరి, తాడికొండ, ప్రత్తిపాడు, పెదకూరపాడు, పొన్నూరు, తెనాలి, వేమూరు, నరసరావుపేట, వినుకొండ, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో  భారీగా నిరసనలు కొనసాగాయి. అమరావతికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు  జరిగాయి.

బతుకమ్మ చీరలు సరే.. మరి వారితో బతుకమ్మ ఆడిస్తారా?

మరి ముస్లిం తోఫా హిందువులకూ ఇస్తారా?   తెలంగాణ తెరపైకి కొత్త చర్చ   ప్రభుత్వాలనేవి సెక్యులర్‌గానే ఉంటాయి. ఉండాలి కూడా. పాలకులకు అన్ని కులాలు- అన్ని మతాలూ సమానమే. ఎవరి పట్ల పక్షపాతం ఉండకూడదు. అందరికీ సమాన హక్కులు కల్పించాలి. రాజ్యాంగం కూడా చెబుతోంది ఇదే. సరే.. కొందరు పాలకులు కొన్ని మతాల మెహర్బానీల కోసం, వారికోసమే ప్రత్యేక పథకాలు తీసుకువస్తున్న సంప్రదాయం దశాబ్దాల నుంచే మొదలయింది. గత ఐదేళ్ల కాలం నుంచీ అది కులాల వరకూ విస్తరించి, కులానికో కార్పొరేషన్ ఏర్పాటుచేసే సంప్రదాయానికి తెరలేపారు. అందుకు ఎవరూ అతీతులు కాదు. కానీ ఒక మతం చేసుకునే పండుగలప్పుడు, అన్ని మతాలకూ బహుమతులిస్తున్న పాలకులు.. మరి మిగిలిన మతాల పండగులప్పుడు ఇచ్చే బహుమతులు కూడా, అన్ని మతాలకూ ఇవ్వాలి కదా? మరి పాలకులు ఆ సమ న్యాయం పాటిస్తున్నారా? తెలంగాణలో మహిళలకు చేస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ.. ఇప్పుడు ఈ ప్రశ్ననే తెరపైకి తెచ్చింది.   తెలంగాణలో బతుకమ్మ పండుగకు విశిష్టతతోపాటు, చారిత్రక నేపథ్యం కూడా ఉంది. కొన్ని వందల ఏళ్ల నుంచి తెలంగాణ పల్లెలో, బతుకమ్మ ఆడే సంప్రదాయం ఉంది. అయితే అది పట్టణ ప్రాంతాలలో కొందరు మాత్రమే ఆచరించేవారు. తెలంగాణ ఉద్యమ సమయంలో, మర్చిపోయిన ఈ సంప్రదాయాన్ని కేసీఆర్ కుమార్తె కవిత మళ్లీ గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో తమకు రాష్ట్రం కావాలంటూ వివిధ సంస్థలు ఉద్యమాలు, ఆందోళనలు నిర్వహించారు. అయితే కవిత మాత్రం బతుకమ్మను ఇంటింటికీ చేర్చారు. ఒకరకంగా బతుకమ్మకు ఆమె బ్రాండ్ అంబాసిడర్‌లా మారారు. నిజానికి ఆమె కృషి వల్లనే, బతుకమ్మ పండుగకు ఇంత ప్రాధాన్యం వచ్చిందనేది నిజం. అసలు బతుకమ్మ గురించి తెలియని ఆంధ్రా మహిళలు సైతం.. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ ప్రాంగణంతోపాటు, బయట బతుకమ్మ ఆడారంటే, కవిత ఎంతమంది మహిళలపై ప్రభావితం చూపారో స్పష్టమవుతోంది. ఉద్యమ సమయంలో మహిళలు, బతుకమ్మ ఆడుతూ స్వరాష్ట్ర కాంక్షను వ్యక్తీకరించారు. బతుకమ్మ ఫక్తు హిందువుల పండుగ. నిజాం నవాబుల జమానాలో, రజాకార్లు మహిళలను బట్టలు ఊడదీసి, వారితో నగ్నంగా బతుకమ్మ ఆడించి పైశాచిక ఆనందం పొందినట్లు చరిత్ర చెబుతోంది.   సొంత రాష్ట్రం సిద్ధించిన తర్వాత, బతుకమ్మ పండుగకు కేసీఆర్ సర్కారు ఏటేటా కొంత నిధిని ఏర్పాటుచేసింది. తర్వాత మహిళలకు చీరలు ఉచితంగా పంపిణీ చేసే సంప్రదాయం ప్రవేశపెట్టింది. అయితే, ఆ చీరలు నాసిరకంగా ఉన్నాయని మహిళలు వాటిని రోడ్డుపైనే పడేసి పోయిన ఘటనలు మీడియాలో చూసినవే. చీరల కొనుగోలులో కుంభకోణం జరిగిందని, మహారాష్ట్ర నుంచి వాటిని తక్కువ రేటుకు తెచ్చి, ఇక్కడి కాంట్రాక్టర్లకు కట్టబెట్టారని అప్పట్లో కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న చీరలలో కూడా నాణ్యత లేదని, గత ఏడాది మిగిలిపోయిన చీరలను పంపిణీ చేస్తున్నారన్న మహిళల విమర్శలు మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఇదంతా రాజకీయ కోణం. రంజాన్ తోఫాకు సైతం ప్రభుత్వం నిధులిస్తున్న విషయం తెలిసిందే.   కానీ, బతుకమ్మ చీరలను, ముస్లిం మహిళలకూ పంపిణీ చేయడంపై.. తెలంగాణలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఫక్తు హిందువుల పండుగయిన బతుకమ్మ పండుగ చీరలు, ముస్లింలకు ఎలా ఇస్తారన్నది ఒక ప్రశ్న. రజాకార్లు హిందూ మహిళలతో నగ్నంగా బతుకమ్మ ఆడించి.. బతుకమ్మను అవమానిస్తే, అదే బతుకమ్మ చీరలను ముస్లింలకు ఎలా పంపిణీ చేస్తారన్న ప్రశ్నలు, హిందూ సంస్థల నుంచి వినిపిస్తున్నాయి. దీనిపై వినిపిస్తున్న ప్రశ్నలు, జరుగుతున్న చర్చ ఆసక్తికరంగా మారింది. బతుకమ్మ పండుగ రోజు ప్రభుత్వం ఇచ్చిన చీరలు కట్టుకున్న హిందూ మహిళలు, వాటికి కట్టుకుని బతుకమ్మ ఆడతారు. మరి ఆ చీరలు కట్టుకునే ముస్లిం మహిళలు, హిందూ మహిళల మాదిరిగా బతుకమ్మ ఆడతారా? అన్నది ఇప్పుడు హిందూ సంస్థల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. మరి ఏ ఉద్దేశ్యంతో ముస్లిం మహిళలకు, బతుకమ్మ చీరలను బహుమానంగా ఇచ్చారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.   అదేవిధంగా ప్రభుత్వం, ప్రతి ఏటా రంజాన్ తోఫా ఇస్తోంది. దీనికి కూడా బతుకమ్మ చీరల మాదిరిగానే కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతోంది. కానీ విచిత్రంగా.. రంజాన్ తోఫా కేవలం ముస్లింలకు మాత్రమే పరిమితం. ఆ బహుమతులు హిందువులకు ఇవ్వరని హిందూ సంస్థలు గుర్తు చేస్తున్నాయి. మరి హిందువులు నిర్వహించుకునే ప్రతి బతుకమ్మ పండుగకు ముస్లిం మహిళలకు సైతం చీరలు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం, మరి రంజాన్ తోఫా సమయంలో హిందువులకు ఎందుకు బహుమతులు ఇవ్వరని ప్రశ్నిస్తున్నాయి.   ‘ప్రభుత్వ సెక్యులర్ విధానం హాస్యాస్పదం, అసంబద్ధంగా ఉంది. బతుకమ్మ చీరలు తీసుకుంటున్న ముస్లిం మహిళలు, వాటిని కట్టుకుని హిందూ మహిళల మాదిరిగా బతుకమ్మ ఆడగలరా? అలా ఆడాలని ఈ ప్రభుత్వం చెప్పగలదా? మరి రంజాన్ తోఫా ముస్లింలకే ఎందుకు పరిమితం చేస్తున్నారు? ఇదేనా కేసీఆర్ చెప్పే సెక్యులర్ నీతి? అయినా రజాకార్ల చేతిలో.. అవమానాల పాలయిన హిందూ మహిళలను ఏ మతమయితే దారుణంగా వేధించిందో, అదే మతానికి చెందిన మహిళలకు బతుకమ్మ చీరలు ఇవ్వడమంటే, హిందూ మహిళలను అవమానించినట్టే’నని భాగ్యనగర్ విశ్వహిందూ పరిషత్, ప్రచార సహ ప్రముఖ పగుడాకుల బాలస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. -మార్తి సుబ్రహ్మణ్యం

నిమ్మగడ్డ నిర్ణయమే కరెక్ట్! అంగీకరించిన ఏపీ సర్కార్! రచ్చ సంగతేంటో? 

కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయం కరెక్టేనని తేలింది. జగన్ ప్రభుత్వంమే దీన్ని అంగీకరించింది. ఈ మేరకు ఏకంగా హైకోర్టులోనే అఫడవిట్ దాఖలు చేసింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ.. తాండవ యోగేష్ అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కష్టమని ఏపీ ప్రభుత్వం ధర్మాసనానికి తెలిపింది. కరోనా కాలంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని హైకోర్టుకు తెలిపింది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం‌ అభిప్రాయం తెలపాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఎస్‌ఈసీకి నోటీసులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను నవంబరు 2కి వాయిదా వేసింది.    స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ సర్కార్ తాజా వైఖరితో మార్చిలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని రుజవైంది. అయితే కరోనా ప్రభావం ఉన్నా స్థానిక ఎన్నికలు జరపాలని పట్టుబట్టిన జగన్ సర్కార్.. ఇప్పుడు మాట మార్చడం చర్చనీయాంశంగా మారింది. ఏపీ ప్రభుత్వ స్పందన రాజకీయ, న్యాయవర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.    కరోనా విజృంభిస్తున్న మొదటి రోజుల్లో.. దేశం మొత్తం లాక్ డౌన్ విధించేసినా స్థానిక ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందేనని పట్టుబట్టింది వైసీపీ సర్కార్. ఎన్నికలను వాయిదా వేసిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై ఫైరయ్యారు సీఎం జగన్. మంత్రులు, వైసీపీ నేతలైతే ఆయన్ను దారణంగా టార్గెట్ చేశారు. ఎన్నికల కమిషనర్ గా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నిమ్మగడ్డను వ్యక్తిగతంగా దూషించారు. ఎస్‌ఈసీని కూడా తొలగించి రచ్చ రచ్చ చేసింది ప్రభుత్వం. అయితే హైకోర్టు జోక్యంతో నిమ్మగడ్డ తన పదవిలో కొనసాగుతున్నారు. స్థానికల ఎన్నికల వ్యవహారం ఏపీలో అప్పట్లో పెద్ద  సంచలనమే అయింది. టీడీపీ, వైసీపీ మధ్య పెద్ద యుద్ధమే జరిగింది.    ప్రస్తుతం దేశం కరోనా భయం నుంచి బయటపడుతోంది. ఏపీలో కూడా లాక్ డౌన్ ఎత్తేశారు. బీహార్ సహా అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఈ అంశాలను పిటిషనర్ తరపు న్యాయవాది ప్రస్తావించారు. అయినప్పటికీ ప్రభుత్వం ఎన్నికలు ఇప్పుడు సాధ్యం కాదని తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికలను ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నంత కాలం నిర్వహించకూడదన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లుగా తెలుస్తోంది. వచ్చే మార్చి వరకూ.. ఎస్‌ఈసీ పదవీ కాలం ఉంది. అందుకే ఇప్పుడు సాధ్యం కాదని హైకోర్టుకు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయమే ఫైనల్. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో.. అన్నదానిపైనే…స్థానిక ఎన్నికల ప్రక్రియ ఆధారపడి ఉండే అవకాశం ఉంది. ఆయన ఎన్నికల నిర్వహణకు సిద్ధమైనా.. ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తుందా లేదా అన్నది ఆసక్తిగా మారుతోంది.    ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను మార్చిలో నిర్వహించాలని గతంలో నిర్ణయించారు. నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసింది. అయితే దేశంలో కరోనా కేసులు నమోదు కావడంతో అంతటా భయాందోళన నెలకొంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ మార్చి 15న ప్రకటన చేశారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న ప్రస్తుత సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే.. చాలా మందికి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని చెప్పారు. నిమ్మగడ్డ తీసుకున్న ఆ నిర్ణయాన్ని అప్పుడు ప్రభుత్వం తప్పుపట్టింది. ఆయన్ను పదవి నుంచి తొలగించేందుకు కొత్త చట్టమే తెచ్చింది. కొత్త ఎన్నికల కమిషనర్ ను కూడా హడావుడిగా నియమించింది. అయితే ప్రభుత్వ చర్యలపై హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు నిమ్మగడ్డ రమేశ్ కుమార్. నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయంపై నానా రభస చేసిన జగన్ సర్కార్.. ఇప్పుడు ఆయన చెప్పిన మాటనే హైకోర్టుకు చెప్పడంపై ప్రజల్లో చర్చ జరుగుతోంది.

ఇప్పటికీ తీరని వలస కార్మికుల వెతలు

వలస కార్మికులు ఎంత మంది? కోటి. కాదు నాలుగు కోట్లు. కాదు ఎనిమిది కోట్లట. ఒక దేశంలో ఈ ఎనిమిది కోట్ల మందిని అమాంతం మరిచిపోగలమా? మనం మరిచిపోయాం. వాళ్లకు రెండు పూటలా తిండి దొరుకుతోందా లేదా? మనకు తెలియదు. వారికి ఏదైనా పని దొరికిందో లేదో కూదా మనకు తెలియదు. వారు ఆకలికి ఎలా అలమటిస్తున్నారో కూడా మనకు తెలియదు. వాళ్లు రేషన్ షాపుకు వెళ్లి ఆహార ధాన్యాలు తెచ్చుకుంటున్నారో లేదో కూడా తెలియదు.    అంతే కాదు వారిలో ఎంత మంది మరణించారో ఎంత మంది ఆత్మహత్య చేసుకున్నారో కూడా తెలియదు. వాళ్లు ఎవరు? ఎక్కడికి వెళ్లారు? కేవలం ఆరునెలల వ్యవహారమే ఇది. ఈ అంశంపై దేశం దృష్టే కాదు, ప్రపంచమంతటి దృష్టి ఉండింది. ఎందుకంటే ప్రపంచ చరిత్రలోనే ఇంతమంది వలస కార్మికులు తరలి వెళ్లడం ఇదే మొదటి సారి. భారత్ లో జరిగిన ఈ వలస కార్మికుల యాత్ర భయంగొల్పేది. వీరి సమస్యను ఎదుర్కోవడానికి కావలసిన మౌలిక సదుపాయాలు లేవు. ఆరు నెలల కిందట ఈ అంశం గురించి అందరూ చర్చించుకునేవారు.    ఈ ఆరు నెలల కాలంలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. జనం వీటివెంట పరుగెత్తడం మొదలుపెట్టారు. మీడియా ఈ అంశం వెంట పరిగెత్తడం మొదలు పెట్టింది. అధికారపక్షం దీనిపై రాజకీయాలు చేయడం ఆరంభించింది. అనేక పక్షాలు ఈ అంశంపై తమ తమ స్వార్థ ప్రయోజనాలు అన్వేషించడం మొదలు పెట్టాయి. ఈ అంశంవల్ల ప్రభావితమైన వివిధ వర్గాల వారు వలస కార్మికుల సమస్య పెద్దదా, తమ సమస్యలు పెద్దవా అని ఆలోచించేడం మొదలు పెట్టారు. ఇది విచిత్రమైన దేశం. ఇక్కడ ప్రతి క్షణం ఒక కొత్త సమస్య ఉద్భవిస్తూ ఉంటుంది. దీనివల్ల మునుపటి సమస్యలను గుర్తుంచుకోవాలా? మరిచిపోవాలా అన్న సంశయం ఎదురవుతూ ఉంటుంది.    ఆరు నెలల కిందటి ఆ వలస కార్మికుల పరిస్థితిని పరిశీలిద్దాం. దానిలో వాస్తవం ఏమిటో చూద్దాం. ఆ సత్యం కనువిప్పు కలిగించేది అయి ఉంటుంది. అది చాలా దు:ఖ దాయకంగా ఉంటుంది. అయినా ఆ సత్యమేమిటో తెలుసుకోవాలి. ఎందుకంటే అధికారంలో ఉన్న వారు పదే పదే మనల్ని తప్పు దోవపట్టిస్తారు. మీడియా అదే పని చేస్తుంది. రంగురంగుల పరిస్థితిలో మనల్ని ముంచేయాలని చూస్తుంది మీడియా. మీడియా సాధారణంగా అనుగామి వార్తలు రాస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు దేశమంతటి దృష్టిలో ఉన్న అంశాల మీద ఇవాళ దృష్టే లేకుండా పోయింది. అంతా నిశ్శబ్దం, నైరాశ్యం ఆవహించి ఉంది. పార్లమెంటు వేదిక మీంచి నాలుగు కోట్ల మంది వివిధ నగరాల నుంచి తమ సొంత రాష్ట్రాలకు తరలి వెళ్లారని చెప్పారు. ఒక కాబినెట్ మంత్రి నాలుగు కోట్ల వలస కార్మికు సొంతూళ్లకు వెళ్లారని చెప్తే మరో కాబినెట్ మంత్రి కాదు ఎనిమిది కోట్ల మంది వలస కార్మికులు తరలి వెళ్లారని చెప్పారు. కానీ దేశంలోని వివిధ ప్రాంతాల సమాచారాన్ని కలిపితే కనీసం పదకొండు కోట్ల మంది తరలి వెళ్లినట్టు తేలుతోంది. కానీ ప్రభుత్వం చెప్పిన లెక్కలనే అంగీకరిద్దాం.    ఆరు నెలలకింద ఈ వలస కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేరాయా? ఒక్కొక్కరికి అయిదు కిలోల ఆహార ధాన్యాలు ఉచితంగా ఇస్తామన్న వాగ్దానం ఎంత మేరకు నెరవేరింది? రేషన్ కార్డులు ఇస్తామన్నారు. అవి అందుబాటులోకి వచ్చాయా? వలస కార్మికుల్లో ఎంత మంది ఆత్మహత్య చేసుకున్నారు? ఈ అంశంపై ఎవరూ దృష్టి సారించనే లేదు. రైళ్లల్లో వెళ్లిన వారిలో ఎంత మంది మరణించారు. రైళ్లల్లో వెళ్తూ మరణించినవారి సంఖ్య 110 కన్నా ఎక్కువ ఉంటుందంటున్నారు. నడిచి వెళ్తూ రోడ్డు మీద మరణించిన వారు, రైలు పట్టాల మీద ప్రాణాలు అర్పించిన వారు కూడా 200 కన్నా ఎక్కువే మంది. అయితే మాత్రం తేడా ఏముంటుంది? ఆ రెండుమూడు వందల కుటుంబాల్లో విషాదం అలముకుని ఉండి ఉంటుంది. అయినా దాని ప్రభావం ఏముంటుంది గనక?    గత ఆరు నెలల కాలంలో దేశంలో పేదల సంఖ్య కోటి ఇరవై లక్షలు పెరిగింది. తేడా ఏం ఉంటుంది. ఈ దేశంలో దారిద్ర్య రేఖకు దిగువ్న ఉన్న వారి అంటే బి.పి.ఎల్. కింద ఉన్న వారి సంఖ్య మూడున్నర కోట్లు పెరిగిపోయింది. ఈ దేశంలో ప్యాకేజీ రూపంలో 50, 000 కోట్ల రూపాయలు కేటాయించారు. జన ధన్ యోజన కింద నగదు బదిలీ కాలేదు. తేడా ఏముంటుంది? కిసాన్ సమ్మాన్ నిధి మొత్తం కూడా అందలేదు. ఏం తేడా ఉంటుంది? వేర్వేరు సంస్థలు ఈ అంశంపై సర్వే చేశాయి. ఎన్. జి ఓ..లు సర్వే చేశాయి. ఈ సమయంలోనే ప్రభుత్వ గణాంకాలు కూడా వెలువడ్డాయి. కృత్రిమ మేధస్సు ప్రకారం ఈ లెక్కలన్ని కలిపి సగటు చూస్తే అదే సత్యం అవుతందని అంటారు. ఆ సత్యమే భయపెడ్తోంది. ప్రపంచ బ్యాంకు, ఐ.ఎల్.ఓ నివేదికల్లో భారత్ లో పేదల సంఖ్య మరో కోటి 20 పెరుగుతుందని అంచనా వేశారు. అలాగే జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా 4 కోట్ల 30 లక్షల మంది పేదలై పోయారు. అందులో అత్యధిక సంఖ్యాకులు అంటే 27 శాతం మంది భారతీయులే.   కరోనా మహమ్మారి సోకక ముందు మొత్తం ప్రపంచంలో 13 లక్షల 50 వేల మంది పేదలు ఉండే వారు. వీరి సంఖ్య ఇప్పుడు 26.5 లక్షలకు పెరిగింది. భారత్ లో ఆహార భద్రత లేని వారి సంఖ్య ఇంతవరకు మూడున్నర కోట్లు ఉండేది. ఇప్పుడు అది పెరిగింది. అయినా తేడా ఏముంది? ఇప్పుడు అది ఏడు కోట్లు దాటింది. ఇదేం పరిస్థితి? కార్మిక, ఉపాధి శాఖల సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ 2011నాటి గణాంకాల ప్రకారం దేశంలో నాలుగు కోట్ల మంది వలస కార్మికులు ఉంటే అందులో కోటి మందికి పైగా తమ సొంత ఊళ్లకు వెల్లి పోయారని చెప్పారు. అందులో ఎక్కువ మంది ఉత్తర ప్రదేశ్ వారే. వీరి సంఖ్య 32 లక్షల మంది. బిహార్ కు తిరిగొచ్చిన వారి సంఖ్య 15 లక్షలు అయితే,  బెంగాల్ కు తిరిగి వచ్చిన వలస కార్మికుల సంఖ్య 13 లక్షలు. 7.94 లక్షల మంది మధ్య ప్రదేశ్ కు తిరిగి వచ్చారు. పార్లమెంటులో లిఖిత రూపంలో ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చినప్పుడు అందులో ఒరిస్సా, చత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్, గోవా, కర్నాటక, దిల్లీ, గోవా, జార్ఖండుకు తిరిగివచ్చిన వారి ప్రస్తావన లేదు. కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటులో చెప్పిన దాని ప్రకారం మొత్తం ఎనిమిది కోట్ల మంది వలస కార్మికులు ఉన్నారు. ఈ సమయంలో ప్రభుత్వం వలస కార్మికులకు సంబంధించి అనేక గణాంకాలు వెల్లడించింది. వారి మరణాలపై ఎక్కువ దృష్టి ఉండేది. వాస్తవం ఏమిటంటే పార్లమెంటులో రైతులకు సంబంధించిన మూడు అత్యవసరాదేశాలను, బిల్లులను ఆమోదిస్తున్న సందర్భంలోనే ఎక్కువ మంది రైతులు ఆత్మ హత్య చేసుకున్నారు. ఇందులో పంజాబ్ లో ఆత్మ హత్య చేసుకున్న రైతుల సంఖ్యే ఎక్కువ. పంజాబ్ లో 24 జూన్ నుంచి సెప్టెంబర్ ఒకటి దాకా 65 మంది రైతులు ఆత్మ హత్య చేసుకున్నారు. వివిధ గణాంకాల ఆధారంగా లెక్కలు తీసినప్పుడు జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఒక్క పంజాబ్ లోనే 165 మంది రైతులు ఆత్మ హత్య చేసుకున్నారు. మొత్తం దేశంలో చూస్తే 6, 500 మంది రైతులు ఆత్మ హత్య చేసుకున్నారు. ఈ ఆత్మ హత్యలన్ని రైతులకు సంబంధించిన బిల్లులను లోక సభలో చర్చించక ముందు జరిగినవే. ఈ ఆత్మ హత్యలు ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ ఒకటి మధ్య జరిగినవే. ఈ రైతులు ఎవరు? వీరు ఎలాంటి వారు? ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య నాలుగున్నర లక్షల మంది రైతులు ఆత్మ హత్య చేసుకున్నారు. ఈ రైతులకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని దొరికిందంటున్నారు. దీనిలో నిజమేమిటో చూద్దాం.    ఎక్కువ మంది వలస కార్మికులు ఎక్కడి నుంచి వచ్చారు అని చూస్తే దిల్లీలోని ఎన్.సి.ఆర్. ప్రాంతం, మహారాష్ట్రలోని ముంబై ప్రాంతం, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల నుంచి వచ్చిన వారే ఉన్నారు. ఉత్తర ప్రదేశ్, బిహార్, బెంగాల్, మధ్య ప్రదేశ్, ఒరిస్సా, జార్ఖండ్ ప్రాంతాలనుంచి సొంతూళ్లకు వలస వెళ్లిన కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు. వీరు పొలాల్లో, పరిశ్రమల్లో, ఇళ్లల్లో పని చేసే వారు. సెక్యురిటీ గర్డులుగా పని చేసే వారు. కొందరు భవన నిర్మాణ రంగంలో ఉండే వారు. కొందరు డ్రైవర్లుగా పని చేసే వారు. తిరిగి వెళ్లిన వీరిలో 82 శాతం మందికి పని లేదు. ఈ 82 మందిలో మళ్లీ 70 శాతం మందికి సొంతూరు వెళ్లిన తరవాత రెండు పూటలా తిండి దొరకడం లేదు. ఈ విషయం తెలిసీ మనం కళ్లు మూసుకున్నాం. ఇది ఎందుకు భాయనకమైన పరిస్థితి అంటే పంజాబ్ లో అనేక మంది రైతులు ఆత్మ హత్య చేసుకున్నారని అనుకున్నాం. కాని విదర్భలో ఎక్కువ మంది ఆత్మ హత్య చేసుకున్నారు. మరాఠ్వాడాలో. పశ్చిమ మహారాష్ట్రలో కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అమరావతి డివిజన్ లో అయిదు జిల్లాలు ఉంటాయి. వాషిం, యవత్మల్, అమరావతి, బుల్ధానా, కోలా జిల్లాలు ఉన్నాయి. ఈ గణాంకాలను చూసినప్పుడు వీరు ఎందుకు ఆత్మ హత్య చేసుకున్నారన్న ప్రశ్న తలెత్తుతుంది. వీళ్లు అప్పుల బాధవల్ల ఆత్మహత్య చేసుకున్నారా? లాక్ డౌన్ సమయంలో ఉపాధి దొరకక ఆత్మ హత్య చేసుకున్నారా?    సొంతూళ్లకు తిరిగి వెళ్లే కార్మికుల కోసం రూ. 50,000 కోట్ల సహాయక పథకం అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. 116 జిల్లాల్లో ఈ పథకం అమలు చేస్తామన్నారు. ఈ 116 జిల్లాల్లో పరిస్థితి చూస్తే కేవలం 25,000 కార్మికులకు మాత్రమే ప్రయోజనం కల్గింది. అంటే సగటున ఒక్కో జిల్లాలో 215 మంది కార్మికులకే మేలు జరిగింది. సొంతూళ్లకు తిరిగొచ్చిన కార్మికులు లక్షల సంఖ్యలో ఉన్నారు. ఎన్ని లక్షల మంది? తమ ఊరికి తిరిగి వచ్చిన వారు ఎంతమంది? సొంత రాష్ట్రానికి తిరిగి వచ్చిన వారు ఎంత మంది? ఇందులో చాలా మంది దగ్గర రేషన్ కార్డే లేదు. రేషన్ కార్డు లేని వారికి ఆహార పదార్థాలు అందజేస్తామన్నారు. మహారాష్ట్రలో 20 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు వచ్చాయి. కాని రేషన్ కార్డులు లేని వారి సంఖ్య 10 లక్షల 83 వేలు ఉంది. తిరిగొచ్చిన వీరు ఏం చేయాలి? ఎక్కడికెళ్లాలి? ఉత్తర ప్రదేశ్ లో 12 లక్షల మందికి రేషన్ కార్డులు వచ్చాయి. కానీ తిరిగొచ్చిన 32 లక్షల మంది దగ్గర రేషన్ కార్డులు లేవు. బిహార్ లో 24 లక్షల మందికి రేషన్ కార్డులు దక్కాయి. ఇందులో బి.పి.ఎల్. కార్డులూ ఉన్నాయి. ఎ.పి.ఎల్. కార్డులూ ఉన్నాయి. కానీ బిహార్ వెళ్లిన వారి సంఖ్య 70 లక్షలు. పశ్చిమ బెంగాల్ లో 66 లక్షల మందికి రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. కాని అక్కడి వివిధ జిల్లాలకు తిరిగొచ్చిన వలస కార్మిలు సంఖ్య కోటి ఇరవై లక్షలు. వారి పరిస్థితి దయనీయంగా ఉంది. సగటున ఎంతమందికి రేషన్ కార్డులు తయారయ్యాయో అంతకు అయిదు నుంచి ఎనిమిది రెట్ల మందికి ఆహారం అందడం లాదు. ఎవరికి ఆహార పదార్థాలు అందుతున్నాయో, ఎవరికి అందడం లేదో గణాంకాలు తయారయ్యాయి. ముందే రేషన్ కార్డులున్నవారిలో కూడా 71 శాతం మందికే ఆహార పదార్థాలు అందాయి. అంటే 29 శాతం మందికి అందనే లేదు. కానీ అందరికీ ఆహార పదార్థాలు అందజేశామని ప్రభుత్వం చెప్తోంది. ఈ దేశంలో 23 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులున్నాయి. ఇందులో 16 లక్షల మందికి ఆహార పదార్థాలు అందాయి. మిగతా ఏడు లక్షల మందికి అందలేదు. రేషన్ కార్డులు లేని కుటుంబాలు దాదాపు అయిదు కోట్లు ఉన్నాయి. రేషన్ కార్డులు లేని వారికి కూడా తలా అయిదు కిలోల ఆహార ధాన్యాలు అందజేసినట్టు ప్రభుత్వం చెప్తోంది. వీరిలో ఒక కోటి 35 లక్షల మందికి ఆహార పదార్థాలు అందాయి. మూడు కోట్ల పై చిలుకు మందికి అందలేదు. అయినా బెంగ లేదు. పంజాబ్ లో 74 శాతం మందికి రేషన్ కార్డులున్నా ఆహార పదార్థాలు అందలేదు. హిమాచల్ లో 51 శాతం మందికి, మధ్య ప్రదేశ్ లో 47 శాతం మందికి, హర్యానాలో 46 శాతం, ఒరిస్సాలో 41 శాతం మందికి, బిహార్ లో 25 నుంచి 27 శాతం మందికి, బెంగాల్ లో 35 శాతం మందికి, రాజస్థాన్ లో 23 శాతం మందికి, జార్ఖండ్ లో 24 శాతం మందికి ఆహార ధాన్యాలు అందలేదు. రేషన్ కార్డులు లేని వారి పరిస్థితి ఘోరంగా తయారైంది. వీరికి రేషన్ కార్డులు లేకపోయినా ఆహార ధాన్యాలు అందవలసి ఉన్నా అవీ అందలేదు.    ఉపాధి కల్పన పరిస్థితీ అలాగే ఉంది. 50,000 కోట్ల రూపాయలతో 116 జిల్లాల్లో ఉపాధి కల్పనకు పథకం రూపొందించామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ వీరిలోనూ బిహార్ లో 32 శాతానికి, ఉత్తర ప్రదేశ్ లో 31 శాతానికి, రాజస్థాన్ లో 22 శాతానికి, మధ్య ప్రదేశ్ లో 24 శాతానికి, ఒరిస్సాలో నాలుగు శాతానికి, జార్ఖండ్ లో 2 శాతానికి ఉపాధి అందనే లేదు. 36 శాతం మందికి బ్యాంకు ఖాతాలున్నా నగదు బదిలీ కాలేదు. 64 శాతం మంది తమకు అందాల్సిన మొత్తం నగదు బదిలీ కాలేదని, కొంతే అయిందని చెప్పారు. 18 శాతం మంది ఒక్క పైసా అందలేదన్నారు. డబ్బు అందలేదన్న 65 శాతం మందిలో ఒరిస్సా, కేరళ, హిమాచల్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలవారు ఉన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి 51 శాతం మందికే అందుబాటులోకి వచ్చింది. 49 శాతం మందికి ఎలాంటి సహాయమూ అందలేదు. 14 శాతం మందికి ఇప్పటికీ జనధన్ అకౌంట్లే లేవు.    గ్రామాల్లో కూడా కూరగాయల ధరలు మండి పోతున్నాయి. కూరగాయల ఉత్పత్తి గత ఐదారేళ్లకన్నా ఎక్కువే ఉన్నా గ్రామాల్లో కూరగాయల ధరలు మాత్రం అధికంగానే ఉన్నాయి. భారీ ఎత్తున చిల్లర వ్యాపారం చేసే బడా కంపెనీలు గ్రామీణుల దగ్గర ధాన్యం, కూరగాయాలు కొని భవిష్యత్తులో ధర పెంచి అమ్ముకోవడం కోసం నిలవ చేసి ఉంచుకుంటున్నాయి. అందువల్ల ధరలు తగ్గడం లేదు. తాజాగా పార్లమెంటు ఆమోదించన రైతు బిల్లుల్లో ఒకటి సరకు నిలవ చేయడానికి బాహాటంగానే అనుమతిస్తోంది. అంటే యదేచ్ఛగా చీకటి వ్యాపారం కొనసాగించవచ్చు. అందువల్ల ఇక ముందూ ధరలు తగ్గే అవకాశం లేదు. మొత్తం మీద ఎనిమిది కోట్ల మంది వలస కార్మికుల పరిస్థితి అధ్వానంగా ఉంది. జి.ఎస్.టి. కింద వసూలమైన మొత్తం కేంద్రం ఖాతాలో చేరుతుంది. కేంద్రం రాష్ట్రాలకు అందులోంచి వాటా ఇవ్వాలి. కాని కాళ్లీడుస్తోంది. అందువల్ల ప్రజలను ఆదుకోవాలన్న సంకల్పం ఉన్న రాష్ట్రాలు సైతం నిస్సహాయంగా ఉండిపోవలసి వస్తోంది. అనేక రాష్ట్రాలు బీజేపీ అధికారంలో ఉన్నవే కనక ఆ రాష్ట్రాలు జి.ఎస్.టి.లో తమకు రావలసిన వాటా కోసం ఒత్తిడి చేయడం లేదు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల వాదనను కేంద్రం వినిపించుకోవడం లేదు. వలస కార్మికులు నిరుపేదలు. ఇంతకు ముందు రైతులు అప్పుల బాధకు ఆత్మ హత్య చేసుకునే వారు. ఇప్పుడు జరుగుతున్న వలస కార్మికుల ఆత్మ హత్యలు అప్పుల బాధతో కాదు. అసలు ఉపాధే లేకపోవడంవల్లే. ఇది రాజ్య వ్యవస్థ వైఫల్యానికి కారణం. -ఆర్వీ రామారావ్  సీనియర్ జర్నలిస్ట్

అన్న అపాయింట్‌మెంటా?.. ఆశ.. దోశ.. అప్పడం!

ఫాఫం.. గజపతిరాజుల ఫ్యామిలీ   ఆశకయినా ఒక హద్దుండాలి. ఆశ మంచిదే. అత్యాశ పనికిరాదు. పూసపాటి ఆనంగజపతిరాజు సతీమణి, వారి కుటుంబ రత్నం,  జగనన్నయ్య అపాయింట్‌మెంట్ దొరకలేదని అమాకంగా చెప్పడంపై, వైసీపీ నేతలు పుసిక్కున నవ్వుకుంటున్నారట. మాన్సాస్ వ్యవహారంపై తాము జగన్ కలుద్దామని ఏడాది నుంచీ ప్రయత్నిస్తున్నా, ఆయన అపాయింట్‌మెంట్ దొరకడం లేదని ఆనందగజపతి రాజు భార్య సుధా ఆనంద గజపతిరాజు, కుమార్తె ఊర్మిళ గజపతి రాజు.. తెలుగు ఏడుపుగొట్టు సీరియల్‌లో బాధిత క్యారక్టర్ల మాదిరిగా తెగ వాపోవడం చూసి, వైసీపీలో ‘ట్వల్వ్ ఇయర్స్ ఇండస్ట్రీ’లు.. తుండుగుడ్డలు నోట్లో కుక్కుకుని, తలుపేసుకుని భోరున విలపిస్తున్నారట. జగనన్నయ్యతో ఓదార్పు యాత్ర నుంచి.. ఇప్పటివరకూ వెంట ఉన్న తమకే, ఆయన దర్శనభాగ్యం దొరక్క, టన్నుల కొద్దీ కన్నీరు కారుస్తుంటే.. అసలు పార్టీకి సంబంధమే లేని తల్లీకూతుళ్లు కొత్తగా వచ్చి, ఆయన అపాయింట్‌మెంట్ దొరకడం లేదని చెప్పడం.. తమ కష్టాల పుండుపై కారం చల్లినట్లేనంటున్నారు. ఏం చేస్తాం? సీత బాధ సీతది, పీత బాధ పీతది!   విజయనగరంలోని మహారాజా కళాశాలను, ప్రైవేటు పరం చేయాలన్న నిర్ణయంపై పాపం తల్లీకూతుళ్లు తెగ బాధపడ్డారు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ సంచయిత.. తమ తాత పీవీజీ రాజు, తండ్రి ఆనంద గజపతిరాజు ఆశయాలను తుంగలో తొక్కుతున్నారని జమిలిగా వాపోయారు. అసలు మాన్సాస్ ట్రస్టు వ్యవహారాలపై సీఎం జగనన్నతో మాట్లాడాలని ఏడాది నుంచీ ప్రయత్నిస్తున్నా, ఆయన అపాయింట్‌మెంట్ దొరకడం లేదని అసలు విషయం బయటపెట్టారు. అదీ సంగతి.   తాత-తండ్రి సంగతి చెబితే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ, తమ అభిమాన నాయకుడయిన జగనన్నయ్య అపాయింట్‌మెంట్ కోసం, ఏడాది నుంచీ ప్రయత్నిస్తున్నా కుదరడం లేదన్న తల్లీకూతుళ్ల మాటలే.. అన్నను అభిమానించే తమ్ముళ్లకు నచ్చడం లేదు. తాము ఎంతో ప్రేమించి, అభిమానించి, తమ గుండెలో ప్రతిష్ఠించుకున్న జగనన్నయ్యను కలవడం.. తమకే ఇంతవరకూ సాధ్యం కాక అల్లాడి ఆకులు మేస్తుంటే, మధ్యలో వచ్చిన ఈ తల్లీకూతుళ్ల గోలేమిటని జగనన్నయ్య అభిమానులు తెగ ఇదయిపోతున్నారట. అసలు జగనన్నయ్య సీఎం అయిన తర్వాత ఇప్పటివరకూ, ఆయనను ఓ పదిమంది మంత్రులు, ఓ అరడజను ఎంపీలే వన్‌టూ వన్ కలిశారట. అన్నను కలవాలని అధికారులను అడిగితే, ముందు తమకు కారణాలు చెప్పమని, సదరు అధికారులు కూపీలు తీస్తున్నారట. అంతపెద్ద ఎంపీ భీమవరం బుల్లోడు రఘురామకృష్ణంరాజుకే అపాయింట్‌మెంట్ ఇవ్వని జగనన్నయ్య..  గజపతిరాజు కుటుంబానికి ఇస్తారా? మరీ అత్యాశ కాకపోతే అని, అన్నయ్య అభిమానులు లాజిక్కు పాయింట్లు తీస్తున్నారట. నిజమే కదా మరి?   నిజానికి జగనన్నయ్య, మన పాత చంద్రన్నలా ఎవరినీ కలవరు. బాబన్న మాదిరిగా రోజుకు పది సమీక్షలు, రెండు పార్టీ సమీక్షలు చేయరు. సమీక్షల పేరిట సమయాన్ని సాగదీయరు. క్లారిటీ వచ్చే వరకూ ఎవరినీ సతాయించరు. అసలు జగనన్నయ్య స్టైలే వేరట. రోజుకు ఒక సమీక్ష. తర్వాత ఆయన కంప్యూటరూ, ఆ గోలనే వేరట! మంత్రయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంత లావు పార్టీ లీడరయినా సరే... ముందు నందీశ్వరులను కలవాల్సిందే. వారికి నచ్చి, మెచ్చితేనే అప్పుడు జగనన్నయ్య వద్దకు ప్రవేశపెడతారన్న ప్రచారం ఉంది. రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్పే సర్కారీ వే గులున్నారు. వారితోపాటు,  ప్రైవేటు నివేదికలిచ్చే తన సొంత మీడియా వేగులు ఉండనే ఉన్నారు. ఇక జగనన్నయ్య దేని గురించి ఆందోళన చెందాలి?   ఈ మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలు కలిస్తే.. ఆ పనులు చేయాలి, ఈ పనులు చేయాలంటూ టన్నుల కొద్దీ అర్జీలు తన ఎదుట కుమ్మరిస్తారు. అటు చూస్తే ఖజానా బాగా వీకాయె. చేస్తానని చెప్పి చేయకపోవడం తన ఇంటా వంటా లేదు. అందుకే అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే మేలన్నట్లు.. అసలు ఎవరినీ కలవకుండా ఉంటే ఈ సీత కష్టాలుండవు కదా? అదన్నమాట.. జగనన్నయ్య ఎవరికీ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడానికి వెనకున్న అసలు కథ! అర్ధమవుతోందా...? -మార్తి సుబ్రహ్మణ్యం

‘కమల’వనం.. కలుషితమవుతోందా?

ఇళ్ల నుంచి ఫైవ్‌స్టార్ హోటళ్ల వరకూ   పెరుగుతున్న అవినీతి, అనైతిక, పైరవీరాజ్   మారుతున్న బీజేపీ నేతల లైఫ్‌స్టైల్                  భారతీయ జనతా పార్టీ అంటే పులుకడిగిన ముత్యం. అంతా మేలిమి ముత్యాలే. బురద నుంచి వికసించిన పద్మం అది. గంగాజలం కంటే శుద్ధమైనది. అందులో నీతి నిజాయితీ అనేది, మడిబట్ట అంత పవిత్రమైనది. ఆ పార్టీలో అంతా సామాన్యులే. అత్యంత సాధారణ జీవనం గడిపే నేతలే. నేతల ఇళ్లలోనే అగ్రనేతల భేటీలు, బస. బస్సు, రైళ్లలో ప్రయాణం. గోడమీద రాతలు చేతిలో రాసే స్వయంసేవకులు. అవినీతి, అక్రమాలు, అనైతిక కార్యక్రమాలకు, పైరవీకారులకు అతీతమైన పార్టీ అది. గంగాజలమంత శుద్ధమయిన పార్టీకి, సిద్ధాంతమే మూలస్తంభం. దానికోసం ప్రాణాలర్పించిన నేతలు కోకొల్లలు. ఫిరాయింపులు-ఎమ్మెల్యేల కొనుగోళ్లు-క్యాంపు రాజకీయాలు- వెన్నుపోట్లు- పైరవీరాజ్ ఆ పార్టీకి నచ్చని, మెచ్చని విషయాలు.   అలాంటి పరిశుద్ధాత్మక పార్టీలో.. ఇప్పుడు అన్ని రకాల పైత్యాలూ, వికారాలు, విచిత్రాలూ కనిపిస్తుండటమే వింత. తాజాగా కరీంనగర్‌లో భాజపా జిల్లా అధ్యక్షుడు సాగించిన రాసలీల.. కలుషితమవుతున్న కమలాన్ని వెక్కిరించినట్టయింది. ఎవరయినా దొరికితేనే దొంగ. లేకపోతే దొరలే. పార్టీలో మహిళా కార్యకర్తతో సాగించిన రొమాన్సు, అంతకుముందు ఆమెతోనే చేసుకున్న డబ్బుల సెటిల్‌మెంట్లు,  సోషల్‌మీడియాలో అందరూ దర్శించినవే. ఆ తర్వాతనే సదరు నేతను పార్టీ నుంచి వెలివేశారు. ఒకవేళ  ఆ శుభవార్త మీడియాలో రాకపోతే, సదరు జిల్లా అధ్యక్షుడు తన కార్యకలాపాలు విజయవంతంగా కొనసాగించేవారన్న మాట! ఈ ఘటన సైద్ధాంతిక నిబద్ధత-నైతిక విలువలు- మానవ జీవనమనే... పడికట్టు పదాల మడి కట్టుకున్న, భాజపా వలువలు ఊడదేసేవే.   ఇదొక్కేనా? గత కొన్నేళ్ల నుంచి హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న నామినేటెడ్ పోస్టుల దందా, పోలీసుస్టేషన్లకు చేరుతూనే ఉన్నాయి. ఇందులో స్వయంగా పార్టీ జాతీయ నాయకుడిపైనే ఫిర్యాదులందటం ఆశ్చర్యం. కేంద్రంలో నామినేటెడ్ పోస్టులు ఇప్పిస్తామని, పలువురు మహిళా నేతల నుంచి లక్షలు వసూలు చేస్తున్న ప్రబుద్ధుల వైనం, పత్రికల్లో దర్శనమిస్తూనే ఉంది. తెలుగు రాష్ట్రం నుంచి, జాతీయ స్థాయికి ఎదిగిన మరో మహా పురుషుడిపైనా, లెక్కలేనన్ని ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. వీరంతా భారతీయతకు-భారతీయ జనతా పార్టీ ప్రవచించే నీతి-నిబద్ధత-నిరాడంబరత్వానికి ప్రతీకలే కాదు. నిలువెత్తు నిదర్శనాలు మరి!  ఇప్పుడు హైదరాబాద్‌కు ఎవరైనా కేంద్రమంత్రులొస్తే వారి చుట్టూ కనిపించేది పైరవీకారులే.   ఏపీలో టీడీపీ-బీజేపీ కలసి కాపురం చేసినప్పుడు, ఓ మంత్రి గారు- మరో నేత కలసి రాయలసీమ జిల్లాలో చేసిన, రియల్ ఎస్టేట్ వ్యాపారం అందరికీ తెలిసిందే. ఇక కార్పొరేషన్ ఎన్నికలు-అప్పట్లో జరిగిన అసెంబ్లీ టికెట్ల ఎంపిక యవ్వారం బహిరంగ రహస్యాలే. నియోజకవర్గ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయికి ఎదిగిన ఓ మహానేత ఆస్తులు, కుటుంబ వ్యాపారాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇతర రాష్ట్రాల్లో పవర్‌ప్రాజెక్టు వ్యాపారాలు చేస్తున్న వాళ్లకూ తక్కువేమీ లేదు. టీడీపీ సర్కారుతో మ్యాచ్‌ఫిక్సింగ్‌తో లాభపడిన నేతలు కొందయితే, ఇప్పుడు వైకాపా సర్కారుతో మ్యాచ్ ఫిక్సింగ్ వల్ల లబ్ధి పొందుతున్న నేతలు మరికొందరు.   ఇక తెలంగాణలో కూడా, ఇలాంటి తరహా నేతలకు కొదువ లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 5 సీట్ల కోసం, ఏకంగా అధికార పార్టీ ప్రతినిధితోనే తెరచాటు బంధం కొనసాగించిన కథ తెలిసిందే. ఇక ఎన్నికల్లో పార్టీ పంపిన నిధుల ఖర్చు, దానిపై జరిగిన చర్చ లాంటి రచ్చ గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. అంటే పార్టీ సంస్కృతి ఎక్కడి నుంచి ఎక్కడికి మారిందో, ఈ ఉదంతాలు చూసి చెప్పవచ్చన్నమాట.   ఒకప్పుడు కమలం పువ్వు పార్టీగా పేరున్న బీజేపీ.. నిరాడంబరత్వానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపించేది. అతి సామాన్యులు నేతలుగా ఉండేవారు. ఉదయమంతా పార్టీ పనిచేసి, సాయంత్రానికి ఇళ్లకు చేరేవారు. అప్పట్లో మీడియాకు భోజనాలు పెడితే గొప్ప. జాతీయ స్థాయి నేతలు వచ్చినా, వారికి స్థానిక నేతల ఇళ్లలోనే బస. సమావేశాలూ అక్కడే. పార్టీ ప్రచారం కూడా స్వయంసేవనే. నేతలే గోడలపై రంగులతో రాతలు రాసేవారు. కారున్న నేతలుంటే మహా గొప్ప. అంతా స్కూటరు- సైకిలిస్టులే. సరే ఇక ఏబీవీపీ సైనికుల శ్రమ సరేసరి.  ఎవరిపైనయినా ఆరోపణలు వస్తే ఆ నేతను వెంటనే తొలగించేవారు. మిగిలిన పార్టీలతో పోటీ పడలేని స్థాయి-డబ్బు లేకపోయినా, సమాజంలో గౌరవం ఉన్న నేతకు, పిలిచి మరీ టికెట్లు ఇచ్చేవారు. వారి ప్రచారం కూడా నిరాడంబరంగానే కనిపించేది.  మొత్తంగా ప్రజలు.. భాజపా నాయకులను ఒక మర్యాదస్తుల మాదిరి గౌరవించేవారు. ఇవన్నీ వాజపేయి-అద్వానీ శకం నాటి తీపి జ్ఞాపికలు. ఒక్క ఓటుతో అధికారం నిలబెట్టుకునే అవకాశం ఉన్నా, నైతిక విలువలు అనుసరించి,  అధికారాన్నే త్యజించిన మహానాయకుడయిన వాజపేయి శ్వాసించిన పార్టీ అది.   ఇప్పుడు ఏ స్థాయి నాయకుడు వచ్చినా ఫైవ్‌స్టార్ హోటళ్లలోనే బస. నేతల ఇళ్లలో దిగి, వారితో భోజనాలు చేసే పిచ్చిరోజులు ఎప్పుడో పోయాయి. విమానాల్లోనే ప్రయాణం. రాత్రిళ్లు పార్టీలు రొటీన్ విషయమే. పార్టీ ప్రచారం అంతా కాంట్రాక్టే. పార్టీ ఫిరాయింపులు ఒక నిరంతర ప్రక్రియ. హైదరాబాద్, విశాఖ, విజయవాడ, నెల్లూరు వంటి నగరాల్లో కొందరు బీజేపీ నేతల భవంతులు చూస్తే.. బీజేపీ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదిగిందనేది స్పష్టచమవుతుంది.   ఇప్పుడు ఎన్నికల్లో  టికెట్లకూ ధర పలుకుతోంది. వారికి సమాజంలో విలువ ఉందా లేదా? అన్నది అనవసరం. కేసులున్నాయా? లేవా అన్నది అప్రస్తుతం. ఆ విషయంలో మిగిలిన పార్టీల దారిలోనే ప్రయాణం! ఇప్పుడు హీనపక్షం 15 లక్షల రూపాయల కారు లేని నాయకుడు భూతద్దం వేసి కనిపించరు. ఇక అగ్రనేతలయితే  కార్ల ఖరీదు చెప్పాల్సిన పనిలేదు. డబ్బులున్న ఆసాములు, పారిశ్రామికవేత్తలు,  ఎన్నికల్లో పెట్టుబడి పెట్టగల వ్యాపారులు, జైళ్లకు వెళ్లొచ్చిన మహానుభావులు, కబ్జా కేసుల్లో కూరుకుపోయిన వాళ్లకే ఇప్పుడు తమ పార్టీలో పెద్దపీట అన్నది కమలదళాల ఆవేదన.  ఇక అంబానీ, అదానీల సహవాసానికి కొదువ లేదు. నత్వానీల వంటి వాణిజ్య రాయబారులకు కరువే లేదు.   నరేంద్రమోదీ-అమిత్‌షా ద్వయం చేతికి,  పార్టీ పగ్గాలు వచ్చిన తర్వాత పార్టీ మూల సిద్ధాంతమే కాదు. అన్నీ  సమూలంగా మారిపోయాయి. అసలు పార్టీ స్వరూపమే మారింది.  నిరాడంబరత్వం గాలికెగిరిపోయింది. ఇప్పుడు రాష్ట్రాల్లో పార్టీని నడిపించే సంఘటనా కార్యదర్శుల జీవన శైలి, రాజకీయ నిర్ణయాలపై లెక్కలేనన్ని ఆరోపణలు. వీటికి తెలుగు రాష్ట్రాలూ మినహాయింపు కాదు. గతంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఓ సంఘటనా కార్యదర్శి వ్యక్తిగత జీవనశైలిపై బోలెడు ఆరోపణ లొచ్చిన విషయం బహిరంగ రహస్యమే.   నిశితంగా పరిశీలిస్తే.. కొన్ని అంశాల్లో తప్ప కాంగ్రెసుకూ, భాజపాకూ పెద్ద వ్యత్యాసమే కనిపించదు. కాంగ్రెస్ కొందరు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తే, భాజపా మరికొందరిని చేరదీసింది. కాంగ్రెస్ కొన్ని రాష్ట్రాల్లో విపక్ష పార్టీల ప్రభుత్వాలను కూలగొడితే, అదే పని భాజపా కూడా చేస్తోంది. కాంగ్రెస్ కంటే భాజపానే ఎన్నికల్లో ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతోంది. భారతీయత, 370 ఆర్టికల్, త్రిపుల్ తలాక్, విదేశీ విరాళాలకు కళ్లెం, వామపక్షాలు కబ్జా చేసిన విద్యావిధానంలో సమూల ప్రక్షాళన వంటి కీలక అంశాల్లోనే ‘బీజేపీ జంట’ ఎక్కువ మందిని మెప్పించగలిగింది. ఇవి తప్ప కాంగ్రెస్ సంస్కృతే, ఇప్పుడు బీజేపీలోనూ కనిపిస్తోంది.  -మార్తి సుబ్రహ్మణ్యం

‘కాకినాడ సెజ్’లో బాబు తప్పులో కాలేశారా?

పాత తప్పిదాలతో వైసీపీ చేతికి చిక్కిన టీడీపీ   అధికారంలోకి వచ్చాక కాకినాడ్ సెజ్‌ను విస్మరించిన బాబు   హరిటేజ్- జీఎంఆర్ షేర్లకూ లింకు పెట్టిన మంత్రి కన్నబాబు   విపక్షంలో ఉన్నప్పుడు చేసిన ఆరోపణలను, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా తేల్చేస్తారు. వాటిపై కమిషన్లు, విజిలెన్స్ విచారణలు జరిపిస్తారు. కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దీనికి పూర్తి భిన్నం. విపక్షంలో చేసిన ఆరోపణలను అధికారంలోకి వచ్చిన వెంటనే మర్చిపోతారు. మర్చిపోవడమే కాదు. సదరు కంపెనీ అధినేతలతో కలసి తిరుగుతుంటారు. పారిశ్రామికవేత్తలతో అంటకాగడం ఆయనకు మహా ఇష్టం. పార్టీ నేతలు, మంత్రులయినా సరే.. సూటు-బూటు వేసుకున్న వాళ్లు బయకు వచ్చేంత వరకూ, బాబు చాంబరు బయట వేచి ఉండాల్సిందే. విపక్షంలో ఉన్నప్పుడు చేసిన ఆరోపణలు, జనం కూడా తన మాదిరిగానే మర్చిపోతారన్నది బాబు భ్రమ. అందుకే ముందు వెనుకా ఆలోచించకుండా, ఏదంటే అది మాట్లాడుతుంటారు. చివరకు ప్రత్యర్ధుల చేతిలో ఇరుక్కుపోతారు. ఇప్పుడు కాకినాడ సెజ్ కథలో కూడా బాబు ఆత్మరక్షణలో పడిపోయారు. ఫలితంగా హెరిటేజ్ షేర్ల అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చిన ట్టయింది.   చంద్రబాబు నాయుడు విపక్ష నేతగా ఉన్నప్పుడు, కాకినాడ సెజ్ భూముల కుంభకోణంపై ఆందోళన నిర్వహించారు. నాటి తూర్పు గోదావరి జిల్లా పార్టీ ఇన్చార్జి గరికపాటి మోహన్‌రావు, భారీ స్థాయిలో జిల్లా నేతలను సమీకరించి ధర్నా చేశారు. ఆ సందర్భంలో బాబు ట్రాక్టరు కూడా నడిపారు. ఏరువాక చేశారు. రైతుల వద్ద తీసుకున్న భూములను, వారికి తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే, రైతుల భూములు వాపసు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ ధర్నాలో యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప వంటి అగ్రనేతలంతా హాజరయ్యారు.   నిజానికి కెవి రావు అనే పారిశ్రామికవేత్త, అప్పట్లో రైతుల వద్ద నేరుగా భూములు కొనుగోలు చేశారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు, ఆయన ‘ఆత్మ’  కెవి రావు ద్వారా వ్యవహారం నడిపారన్నది ఒక ప్రచారం. ఎమ్మార్వోలు, సీఐల ఒత్తిళ్లతో రైతులు నేరుగా కెవి రావుకు భూములు ఇచ్చారు. ఆ తర్వాత దానిని సెజ్‌గా ప్రకటించారు. కాబట్టి ఆ వ్యవహారంతో సర్కారుకు నేరుగా ఎలాంటి సంబంధం లేదు. కానీ ధర్నా నిర్వహించిన చంద్రబాబు.. తాము అధికారంలోకి వస్తే ఆభూములను రైతులకు స్వాధీనం చేస్తామని హామీ ఇచ్చారు. మరి గెలిచిన త ర్వాత చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా? కానీ ఆ పనిచేయలేదు.   టీడీపీ విజయం సాధించిన తర్వాత.. విచిత్రంగా ఏ కెవి రావు భూములపై పోరాడారో, అదే కెవి రావు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చుట్టూ కనిపించేవారు. కాకినాడ్ సెజ్‌లో భూములిచి నష్టపోయిన రైతులకు తానిచ్చిన హామీలు కూడా బాబు అవలీలగా మర్చిపోయారు. అంతేనా? ఆయన కంపెనీకి పొడిగింపు ఇచ్చారు. నిజానికి బాబు తన మాట ప్రకారం సీఎం అయిన తర్వాత, ఆ భూములను రైతులకు స్వాధీనం చేయించాలి. కానీ అందుకు భిన్నంగా సదరు కంపెనీకి పొడిగింపు ఇవ్వడం, స్థానిక టీడీపీ నేతలను విస్మయపరిచింది. ఈ విషయంలో నానా యాగీ చేసిన, యనమల రామకృష్ణుడు కూడా మౌనం వహించటం మరో విశేషం.   టీడీపీ విపక్షంలో ఉన్న సమయంలో మెగా ఇంజనీరింగ్, కృష్ణపట్నం పోర్టు కంపెనీలపైనా ఇదేవిధంగా విరుచుకుపడింది. గాలి ముద్దుకృష్ణమనాయుడు-సోమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ప్రెస్‌మీట్లు పెట్టి, మెగా ఇంజనీరింగ్ కంపెనీ కెవిపి బినామీ అని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే దాన్ని బ్లాక్‌లిస్టులో పెడతామన్నారు. ఆ కంపెనీ చేసిన పనులపై విజిలెన్సుతో విచారణ జరిపిస్తామన్నారు. కానీ విచిత్రంగా బాబు సీఎం అయిన తర్వాత.. అదే మెగా కంపెనీకి, పోలవరం సహా పెద్ద ప్రాజెక్టులన్నీ కట్టబెట్టారు. తాను చేస్తే సంసారం.. ఎదుటివాడు చేస్తే వ్యభిచారం అన్నట్లు, టీడీపీ చే స్తున్న ఆరోపణలను జనం విశ్వసించకపోవడానికి ఇలాంటి ఘటనలే కారణం.   తాజాగా కాకినాడ్ సెజ్‌పై, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు చేసిన ఆరోపణలపై స్పందించిన మంత్రి కన్నబాబు.. టీడీపీ పరువు తీశారు. అధికారం రాకముందు ఏరువాక చేసిన చంద్రబాబు, అధికారం వచ్చిన తర్వాత ఆ భూములను రైతులకు ఎందుకు ఇవ్వలేదన్న ప్రశ్న, టీడీపీ నైతిక విలువలను నిలదీసినట్టయింది. హెరిటేజ్ కంపెనీ షేర్లు అమ్ముకుంటే లేని తప్ప, జీఎంఆర్ అమ్ముకుంటే తప్పేంటన్న కన్నబాబు ప్రశ్నకు జవాబు లేదు. ఎంతయినా బాబుకు పారిశ్రామికవేత్తలు, సూటు బూటు వేసుకున్నవాళ్లంటే మహాప్రేమ.  -మార్తి సుబ్రహ్మణ్యం

అంతర్వేది..ఓ అంతులేని కథ!

ప్రాపర్టీ రిజిస్టరుకు రెక్కలొచ్చాయట   రథ నిర్మాణంలో అగ్నికుల క్షత్రియులకు అన్యాయం   ఆలయ కమిటీలో కొప్పనాటి వంశీయులకు చోటేదీ?   చర్చిల పాలవుతున్న ఆలయ భూములు   టీడీపీ-వైసీపీ-బీజేపీ మూడుస్తంభాలాట   అంతులేని ‘అంతర్వేది’ రాజకీయాలు   ఓ జమిందారు గారు తన సొమ్ముతో ఆలయ నిర్మాణం చేసి, దాని బాగోగులకు వందల ఎకరాలు దానం చేశారనుకోండి. అప్పుడు ఆ ఆలయానికి ఆ జమిందారు.. ఆయన వారసులు వ్యవస్థాపకులవుతారు కదా? ఆ తర్వాత ప్రభుత్వాలు కూడా అలాంటి వంశ పారంపర్య హక్కును కొనసాగిస్తూ, అన్ని దేవాలయాలకూ భూములిచ్చి, సొంత నిధులతో గుడి నిర్మించిన వారి వారసులనే వ్యవస్థాపక అధ్యక్షులు, ట్రస్టీలుగా గుర్తిస్తోంది కదా? మరి ఈ నిబంధన.. ఒక్క అంతర్వేదిలోనే ఎందుకు అమలు కావడం లేదు? రాజకీయ ‘క్షత్రియుల’ చేతుల్లో ఆలయం ఎందుకు బందీగా మారింది? రక్షించాల్సిన క్షత్రియులు ఆలయ భూముల భక్షకులుగా ఎందుకు మారారు? ర థం తగులబడిపోతే దానిని తయారుచేయించి..  సంప్రదాయం ప్రకారం స్వామి వారికి ఇచ్చే అగ్నికుల క్షత్రియులకు కాకుండా, టెండర్లు కూడా లేకుండా ఇతరుల చేతికి ఎలా అప్పగిస్తారు? పది లక్షలకే తాము రథాన్ని తయారుచేసి ఇస్తామన్న అగ్నికుల క్షత్రియులకు కాకుండా, తెలంగాణలో ఉన్న ఆసామికి 14 లక్షలు పోసి ఆ కాంట్రాక్టు ఇవ్వడంలో మతలబేమిటి? ఆలయ భూముల్లో క్త్రైస్తవ ప్రార్ధనా మందిరాలు వెలుస్తున్నా, భూములు అన్యాక్రాంతమవుతున్నా,  అధికారులు ఎందుకు నిలువరించలేకపోతున్నారు? ఇవీ.. దుండగుల చేతిలో దహనమయిన, అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ‘అంతులేని కథ’!   ‘బ్రిటిషర్ల జమానాలో రాజులు శిస్తు కట్టకపోతే వారి భూములు వేలం వేశారు. దానిని అడ్డుకుని తానే సొమ్ము చెల్లించిన గొప్పవాడు కృష్ణమ్మ.  అంత వదాన్యుడు భూములిచ్చి, నిర్మించినదే ఈ అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయం’- ఇది ప్రతిఏటా జరిగే అంతుర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ఉత్సవాల్లో,  దేవదాయ శాఖ నిర్వహించే సాంస్కృతిక ప్రదర్శనలో కళాకారులు వినిపించే కథ. కానీ, అంత గొప్ప వదాన్యుడైన కొప్పనాటి కృష్ణమ్మ వారసులను.. ఇప్పుడు అక్కడ జరిగే ఉత్సవాలకు రానీయకుండా అడ్డుకుంటారు. లోపల స్థలం లేదు పొమ్మంటారు. అసలు ఆలయ కమిటీలో వారికే స్థానమే ఇవ్వరు. కృష్ణమ్మ వారసుడైన కొప్పనాటి శ్రీనివాసరావుకు ఇటీవల జరిగిన అవమానం. ఇదీ దాతల పట్ల దయచూపే పాలకుల తీరు. అది కాంగ్రెసయినా, తెలుగుదేశమయినా, బీజేపీ అయినా, వైసీపీ అయినా! అందరూ ఆ తాను ముక్కలే!!   అగ్నికుల క్షత్రియ కులానికి చెందిన,  కొప్పనాటి కృష్ణమ్మ అనే మహానుభావుడు బ్రిటీషు కాలంలోనే నౌకాయాన వ్యాపారి. రాజులు శిస్తు చెల్లించకపోతే వారి తరఫున ఆయనే డబ్బు చెల్లించేవారు. అలాంటాయన కష్టాల్లో ఉన్నప్పుడు.. లక్ష్మీనరసింహస్వామి కలలో కనిపించి, నీ బాధలు తీరతాయని అభయమిచ్చారట. దానితో కొట్టుకుపోయిన ఆయన ఓడలన్నీ ఒడ్డుకు చేరాయట. అందుకు ఆయన భక్తితో ఆలయానికి 1800 ఎకరాలు దానం చేసి, సొంత సొమ్ముతో ఆలయం, అందులో ఒక రథం నిర్మించారట. ఇదీ.. క్లుప్తంగా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయకథ. ఆ మేరకు శాసననాలు కూడా ఉన్నాయి. ప్రాపర్టీ రిజిస్టరులో వాటి వివరాలూ ఉన్నాయి అయినా, ఆ వంశానికి చెందిన వారసులకు ఇప్పటివరకూ ఏ ప్రభుత్వమూ ఆలయ కమిటీలో స్థానం కల్పించలేదు. కృష్ణమ్మ వారసులకు ఆలయ బాధ్యత అప్పగించాలని, దశాబ్దాల నుంచి పోరాడుతున్న అగ్నికుల క్షత్రియులకు ఇప్పటివరకూ మిగిలింది కంఠశేష మాత్రమే.   టీడీపీ అధికారంలో ఉన్నప్పడయితే.. అగ్నికుల క్షత్రియుల కొత్త తరం నేతలు, అంతర్వేది ఆలయ పరిరక్షణ సమితి పేరుతో ఆందోళనలు నిర్వహించారు. విజయవాడలో 48 గంటల దీక్ష నిర్వహించారు. దానికి ఇప్పటి ‘గుళ్ల మంత్రి’ వెల్లంపల్లి శ్రీనివాస్, ఇప్పటి ఎంపీ మోపిదేవి వెంకట రమణ హాజరయ్యారు. తాము అధికారంలోకి వస్తే, కృష్ణమ్మ కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలో ఉన్నది వారి పార్టీనే. నాడు ధర్నాలో పాల్గొన్న వెల్లంపల్లి ఇప్పుడు గుళ్లకు మంత్రయితే, మోపిదేవి రమణ ఎంపీ. అయినా ఫలితం శూన్యం.   అంతర్వేదిలో రథం తగులబడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాని స్థానంలో కొత్త రథం నిర్మిస్తామని వైసీపీ  సర్కారు చెప్పింది. దాని ఖరీదు 90 లక్షలుగా అధికారులు అంచనా వేశారు. రథాన్ని తయారుచేసి, స్వామికి సమర్పించడం అగ్నికుల క్షత్రియుల ఆచారం. కానీ పాలకులు హైదరాబాద్‌లో ఉన్న గణపతి ఆచారి అనే వ్యక్తికి ఆ కాంట్రాక్టు ఇచ్చారట. తాము కేవలం 10 లక్షలకే రథం తయారు చేసి ఇస్తామని ముందుకొచ్చినా..  హైదరాబాద్‌లో ఉన్న వ్యక్తికి 14 లక్షలు, కలపకు మరో 80 లక్షలు ఖర్చు చేస్తామంటున్న సర్కారు తీరుపై, అగ్ని కుల క్షత్రియులు అగ్గిరాముళ్లలవుతున్నారు.   ఇప్పుడు రథ నిర్మాణానికి కలప కూడా కొనేశారు. పనులు మాత్రం హైదరాబాద్‌లో ఉన్న కాంట్రాక్టరుతో చేయిస్తున్నారు. అగ్నికుల క్షత్రియుల ఆందోళనకు అదీ ఓ కారణమే. ఆ రథ నిర్మాణ బాధ్యత మాకే ఇవ్వాలని, తమలోనూ నిపుణులున్నారన్నది వారి వాదన. కానీ వారికి ఆ బాధ్యత అప్పగిస్తే, ‘కమిషన’్ల కథమేటి? అందుకే అధికారులు అందుకు ససేమిరా అంటున్నారు. అన్నట్లు.. విశాఖ సర్కారీ స్వామి వారు,  రథాన్ని కలపతో నిర్మించాలని ఉచిత సలహా కూడా ఇచ్చారు.   కృష్ణమ్మ కుటుంబానికి స్థానం కల్పించాలని... ఎంత ఒత్తిడి చేసినా పట్టించుకోని టీడీపీ సర్కారు, ఇప్పుడు రథనిర్మాణంపై గొంతెత్తడమే ఆశ్చర్యం. ఆ బాధ్యతను అగ్నికుల క్షత్రియులకే ఇవ్వాలని, టీడీపీ నేత లోకేష్ ట్వీట్ చేయడం వింత. తాము అధికారంలో ఉన్నప్పుడు గాలికొదిలిన అంతర్వేది సమస్యలపై, ఇప్పుడు విపక్షంలోకి వచ్చిన అదే టీడీపీ ఆగ్రహించడం వింతల్లోవింత. మొన్నామధ్య అంతర్వేదికి వెళ్లి, హడావిడి చేసిన బీజేపీ కూడా తక్కువ తినలేదు. కృష్ణమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని నాటి బీజేపీ మంత్రి మాణిక్యాలరావును కోరినా, పట్టించుకున్న పాపాన పోలేదు. హిందూకార్డుతో రాజకీయాలు చేస్తున్చ బీజేపీ, ఇప్పుడు చిలకపలుకులు పలకడమే ఆశ్చర్యం.   అసలు అంతర్వేది భూముల్లో ఎన్ని తమ అధీనంలో ఉన్నాయి? ఎన్ని పరాధీనంలో ఉన్నాయో ప్రభుత్వాలకే తెలియకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం. ఆలయ భూముల్లో క్రైస్తవ చర్చిలు కూడా నిర్మించారంటే, అధికారులు భూమల రక్షణ కోసం ఎంత బాగా పనిచేస్తున్నారో అర్ధమవుతుంది. ఇక స్థానికంగా ఓ ‘క్షత్రియ’ నాయకుడు..  నిర్వహకులను ముందుపెట్టి, ఆలయాన్ని శాసిస్తున్నారట. చాలావరకూ ఆలయ భూములన్నీ, సదరు క్షత్రియ నాయకుడి కుటుంబ బినామీల ఏలుబడిలోనే ఉన్నాయట. ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఆ పార్టీలో చేరే సదరు నేత.. ఆ అధికార ముసుగులో, ఆక్రమించుకున్న భూములను కాపాడుకుంటున్నారట. అంతర్వేది కథలో ఇదో రకం కుట్ర కోణం! ప్రస్తుతం అంతర్వేది ఆలయం రాజకీయుల చేతిలో బందీగా మారింది. ఆలయంలో నగలు, దాతలిచ్చిన వస్తువుల వివరాలను.. ప్రాపర్టీ రిజస్టరులో నమోదు చేస్తుంటారు. కానీ, ఇప్పుడా ప్రాపర్టీ రిజిస్టరుకు రెక్కలొచ్చాయంటున్నారు. దానిని చూపించాలని ఎంతమంది డిమాండ్ చేస్తున్నా, అదిగో ఇదిగో అంటూ అధికారులు తాత్సారం చేస్తున్నారు. దీన్నిబట్టి..  అసలు ప్రాపర్టీ రిజిస్టరు ఉందా? లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అంతేనా ఆలయంలో కృష్ణమ్మకు సంబంధించిన శిలాశాసనాలు కూడా, సమాధి  చేసే కుట్ర జరుగుతోందన్నది అగ్నికుల క్షత్రియుల ఆరోపణ. మరి లక్ష్మీపార్వతి చెప్పినట్లు.. పక్కా హిందువయిన జగన్మోహన్‌రెడ్డి, అంతర్వేదిలో జరుగుతున్న అంతులేని కథకు ముగింపు ఎందుకు పలకడం లేదన్నది ప్రశ్న. -మార్తి సుబ్రహ్మణ్యం

అవును.. ఢిల్లీలో వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు!

పురందీశ్వరిని తిట్టినా నోరు మెదపని కమలదళం   వైసీపీపై కమలదళాల మొహమాటం   'ఏపీ పొలిటిక్ గ్రౌండ్' లో ఇదో మ్యాచ్‌ఫిక్సింగ్                    ఆమె పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఆమె సేవలు గుర్తించినందుకే నాయకత్వం ఆ పదవి ఇచ్చింది. దానికి విపక్షాల సర్టిఫికెట్ అవసరం లేదు. మరి అలాంటి నాయకురాలిని, ఒక విపక్ష పార్టీ ఎంపీ దారుణంగా, కులం కోణంలో దూషించిన వైనం విస్మయపరిచింది. ఆ లెక్క ప్రకారమయితే రాష్ట్ర నేతలంతా, సదరు విపక్ష పార్టీ ఎంపీపై మూకుమ్మడి దాడి చేయాలి. అటో ఇటో తేల్చుకోవాలి. కానీ ఏపీలో ఆ లెక్క తిరగబడింది. విపక్ష పార్టీపై విరుచుకుపడాల్సిన జాతీయ పార్టీ రాష్ట్ర నేతలు, దుప్పటి ముసుగేసుకుని పడుకున్నారు. విమర్శకులకు గురైన నాయకురాలు, తమ పార్టీకి చెందిన వారు కాదనుకుంటున్నారు. అధికార పార్టీ అగ్రనేతలతో ఉన్న బాదరాయణ సంబంధంతో, తెగ మొహమాటంలో ఉన్నారు. ఇలాంటి మొహమాటం ఇప్పుడే కాదు. పూర్వ అధ్యక్షుడి విషయంలోనూ కనిపించింది. అధికారపార్టీ అంతగా ప్రభావం చూపిస్తున్న ఈ నాయకులు.. అదే టీడీపీలో, ఒక మాజీ మంత్రి తమపై ఏదైనా వ్యాఖ్యలు చేస్తే మాత్రం, అధ్యక్షుడు సహా అంతా గయ్యిన లేచి ఎదురుదాడి చేస్తున్నారు. ‘ఏపీ పొలిటికల్ గ్రౌండ్’లో జరుగుతున్న.. ఇలాంటి ‘మ్యాచ్ ఫిక్సింగ్ యవ్వారం’ యమా రంజుగా కనిపిస్తోంది.   బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయిన పురందీశ్వరిపై, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్య దుమారం రేపుతోంది. కేంద్రంలోని బీజేపీతో సత్సంబంధాలు నెరపుతున్న వైసీపీ నేతలు.. రాష్ట్రంలో మాత్రం అదే బీజేపీ అగ్రనేతలను, దారుణంగా అవమానిస్తున్నారు. అయినా ఢిల్లీ నాయకత్వం మౌనం వహిస్తున్న తీరు, బీజేపీ శ్రేణులలో గందరగోళానికి కారణమవుతోంది. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురదీశ్వరిని,  ‘ఆమె జాతీయ నాయకురాలు కాదు. జాతి నాయకురాలు’అంటూ,  విజయసాయి చేసిన విమర్శపై, బీజేపీ రాష్ట్ర నేతలెవరూ స్పందించకపోవడమే విచిత్రం. చివరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా, ఇప్పటిదాకా పెదవి విప్పకపోవడమే ఆశ్చర్యం. ఇది సహజంగా పార్టీ వర్గాల్లో అనుమానాలకు తావిచ్చింది. బహుశా ఆయనకు విజయసాయిని విమర్శించడం, వ్యక్తిగతంగా ఇబ్బందేమోనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు మీద ఒంటికాలితో లేచే సోము వీరత్వం, విజయసాయిపై ఏమయిందన్న ప్రశ్నలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇక చీమ చిటుక్కుమన్నా, వెంటనే సోషల్ మీడియాలో.. అందరికంటే ముందుగానే  కేక వేసే, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి కూడా, ఇంతవరకూ స్పందించకపోవడం మరో విచిత్రం. కరోనాతో ఆయన ఐసోలేషన్‌లో ఉన్నప్పటికీ, పోస్టింగులు వస్తూనే ఉన్నాయి. అయినా పురందీశ్వరిపై.. విజయసాయి చేసిన వ్యాఖ్యలపై ఆయన కూడా స్పందించకపోవడం ఆశ్చర్యమే.   నిజానికి వీరిద్దరూ టీడీపీపై నిరంతరం విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు. కానీ టీడీపీ నేతలెవరూ బీజేపీపై విమర్శలు చేయడం లేదు. అయినా టీడీపీ లక్ష్యంగానే ఈ ఇద్దరు నేతలు విరుచుకుపడుతున్నారు. కానీ, తమ పార్టీ నేతలపై మంత్రులు, వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నా, బీజేపీ నేతలెవరూ ఎదురుదాడి చేయకపోవడమే అనుమానాలకు కారణం.   ఇటీవల జగన్ తిరుమల వెళ్లినప్పుడు.. డిక్లరేషన్ అంశంపై పార్టీ నాయకులెవరూ ధర్నాలు చేయవద్దని, తిరుపతి పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు ఆదే శించారు. అయినా ఆయనను సస్పెండ్ చేయకపోవడం ఆశ్చర్యం. ఒకవేళ సోము అనుమతితోనే ఆయన అలా ఆదే శించి ఉంటే, అది కూడా తప్పేనంటున్నారు. డిక్లరేషన్‌పై బయట మీడియాలో హడావిడి చేసిన తాము.. జగన్ స్వయంగా తిరుమలకు వస్తే ఆయన పర్యటనను అడ్డుకోవద్దని చెప్పడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇది పార్టీ నాయకత్వమే తమ చేతులు కట్టివేసినట్టని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. గతంలో కన్నా లక్ష్మీనారాయణపై.. అదే విజయసాయి దారుణమైన ఆరోపణలు చేసినా, వీరెవరూ స్పందించలేదు. కన్నాపై విజయసాయి చేసిన ఆర్థికపరమైన ఆరోపణలను, ఇన్చార్జి సునీల్ దియోథర్ కూడా నేరుగా ఖండించలేదు. ఇప్పుడు ఇదే దియోథర్.. పార్టీ ప్రధాన కార్యదర్శి పురందీశ్వరిపై, విజయసాయి చేసిన ఆరోపణలను ఖండించడం విశేషం. సునీల్- పాతూరి నాగభూషణం- ఒంగోలు  పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు తప్ప.. రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులెవరూ విజయసాయి ఆరోపణలపై స్పందించకపోవడం ప్రస్తావనార్హం.   దీన్నిబట్టి..తమ పార్టీ నేతలను తిట్టే అధికారాన్ని, బీజేపీ నాయకత్వం  వైసీపీకి దఖలు చేసినట్లు స్పష్టమవుతోంది. రాజ్యసభలో వైసీపీ బలంపై బీజేపీ ఆధారపడింది. అందుకు ప్రతిఫలంగా, ఏపీలో తన పార్టీని బలి చేస్తున్నట్లు.. కన్నా నుంచి పురందీశ్వరి వరకూ జరుగుతున్న ఘటనలు రుజువుచేస్తూనే ఉన్నాయి. మామూలుగా అయితే, బీజేపీ జాతీయ నాయకత్వం దీనిని సీరియస్‌గా తీసుకోవలసి ఉంది. అంతకంటే ముందు.. రాష్ట్ర సంఘటనా కార్యదర్శి మధుకర్‌రెడ్డి, నేతలు సమన్వయ పరిచి, ఎదురుదాడికి మార్గనిర్దేశం చేయాల్సి ఉంది. ఆ అంశంలో ఆయన కూడా విఫలమయ్యారన్న వ్యాఖ్యలు పార్టీలో వినిపిస్తున్నాయి. ఆయన పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని సరైన రాజకీయ పంథాలో నడిపించలేకపోతున్నారన్న అసంతృప్తి పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది.  మొత్తానికి వైసీపీ-బీజేపీ మ్యాచ్‌ఫిక్సింగ్ రాజకీయ క్రీడ సారాంశం, మెడపై తల ఉన్న ఎవరికయినా పెద్ద కష్టపడకుండానే అర్ధమవుతోంది. అదీ అసలు సమస్య! -మార్తి సుబ్రహ్మణ్యం

మండలి పోరులో కమ్యూనిస్టులు.. కేసీఆర్ నయా ప్లాన్! 

రాజకీయ వ్యూహాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ దిట్ట అంటుంటారు. పరిస్థితులు బాగున్నప్పుడు ఒకలా,,, తనకు అనుకూలంగా లేనప్పుడు మరోలా ఆయన అడుగులు వేస్తుంటారు. అవసరమైతే పూర్తి భిన్నమైన వైఖరులు కూడా తీసుకుంటారు. ఎంతకైనా తెగిస్తారు. అందుకే కేసీఆర్ కు మాటమీద నిలబడరనే ఆరోపణలున్నాయి. అవేమి పట్టించుకోని కేసీఆర్.. తాను అనుకున్నది సాధించేందుకు వెనక్కి తగ్గరనే అభిప్రాయం ఉంది. తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లోనూ కేసీఆర్ ఇదే తరహా కొత్త ఎత్తులు వేస్తున్నారు.    కేసీఆర్ సర్కార్ పై ఉద్యోగులు, నిరుద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. టీఆర్ఎస్ నేతలే ఈ విషయాన్ని బహిరంగంగా చెబుతున్నారు. త్వరలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజార్టీ ఓటర్లు వీరే. అందుకే మండలి ఎన్నికలు కారు పార్టీని టెన్షన్ పెట్టిస్తున్నాయి. అధికార పార్టీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా ముందుకు రాని పరిస్థితి ఉంది. పార్టీ పరిస్థితిని అంచనా వేసిన గులాబీ బాస్ మండలి ఎన్నికల్లో గెలుపు కోసం మరో స్కెచ్ వేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒకవైపు వెళ్లకుండా, చీలిపోయేలా ఆయన ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. వీలైనంత ఎక్కువ మంది అభ్యర్థులు మండలి బరిలో ఉండేలా పావులు కదుపుతున్నారు. కేసీఆర్ ప్లాన్ లో భాగంగానే మండలి ఎన్నికల్లో కమ్యూనిస్టులు పోటీ చేయాలని నిర్ణయించారనే ప్రచారం జరుగుతోంది. అందుకే టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ కు వామపక్షాలు మద్దతు ఇవ్వడం లేదని తెలుస్తోంది.   గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ తో కలిసి కమ్యూనిస్టులు పోటీ చేశారు. ఎన్నికల తర్వాత కూడా కోదండరామ్ తో కలిసి పలు ఉద్యమాలు చేశారు. వామపక్ష పోరాట కార్యక్రమాలకు కోదండరామ్ తప్పనిసరిగా హాజరవుతూ వస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడే యూటర్న్ తీసుకుంటున్నారు కమ్యూనిస్టు నేతలు. టీజేఏసీ చైర్మెన్ గా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన, ఇంతకాలం తమ ఉద్యమాలకు మద్దతుగా  కోదండరామ్ ఎమ్మెల్సీ బరిలో ఉంటుంటే మాత్రం ఆయనకు సపోర్ట్ చేయడం లేదు. కోదండరామ్ కు మద్దతు ఇవ్వాలని టీజేఎస్ అధికారికంగా లేఖలు రాసినా కమ్యూనిస్టు పార్టీలు స్పందించలేదని సమాచారం.    శాసనమండలి ఎన్నికలో పోటీ చేయబోతున్న కోదండరామ్ కు వామపక్షాలు సపోర్ట్ చేయకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వామపక్షాల తీరుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. గత పట్టభద్రుల మండలి ఎన్నికల్లో కమ్యూనిస్టులు పోటీ చేయలేదు. అలాంటిది ఇప్పుడు ఎందుకు పోటీలో ఉంటున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. కేసీఆర్ చెప్పడం వల్లే మండలి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్, బీజేపీ, కోదండరామ్ తో పాటు వామపక్ష అభ్యర్థి, పోటీలో ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి పోతుందని, అంతిమంగా అది అధికార పార్టీకి లాభిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే కేసీఆర్ డైరెక్టుగా వారితో పొత్తు పెట్టుకోకుండా.. మండలి ఎన్నికల్లో మరో దారిలో వస్తున్నారని చెబుతున్నారు.    అసెంబ్లీ సమావేశం సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డితో కలిసి కేసీఆర్ లంచ్ చేశారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికతో పాటు మండలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై మాట్లాడటానికే చాడాను కేసీఆర్ పిలిపించినట్లు అప్పుడే ప్రచారం జరిగింది. కాని సీపీఐ నేతలు మాత్రం ఖండించారు. కొత్త రెవిన్యూ చట్టం గురించే చాడాతో ముఖ్యమంత్రి మాట్లాడారని వివరణ ఇచ్చారు. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలతో ఎన్నికల గురించే కేసీఆర్ సీపీఐ నేతతో మాట్లాడినట్లు అంతా అభిప్రాయపడుతున్నారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికపైనా కమ్యూనిస్టులు ఇంకా తమ వైఖరిని ప్రకటించకపోవడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. దుబ్బాకలోనూ అధికార పార్టీకి వామపక్ష పార్టీలు మద్దతు ఇవ్వొచ్చని చెబుతున్నారు.

సీనియర్ల దక్కని చోటు.. జీవీఎల్ కు అదే మైనసా! 

భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ కమిటిలో తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురికి చోటు దక్కగా.. గతంలో కమిటీలో పనిచేసిన ముగ్గురు సీనియర్లను తప్పించారు. ఇప్పటివరకు బీజేపీ ప్రధాన కార్యదర్శులుగా ఉన్న రాంమాధవ్‌, మురళీధర్‌రావులను తప్పించారు. జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న జీవీఎల్ నరసింహరావును ఈసారి జాతీయ కమిటీలోకి తీసుకోలేదు. ఈ ముగ్గురు సీనియర్ నేతలకు జేపీ నడ్డా టీమ్ వో  చోటు దక్కకపోవడంపై ఆసక్తి కర చర్చ జరుగుతోంది. బీజేపీలోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.                      రాజ్యసభ సభ్యుడిగా ఉన్న జీవీఎల్‌ నరసింహారావు ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల్లో తలదూర్చి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. అన్ని అంశాల్లోనూ జీవీఎల్ వైఖరి వైసీపీకి అనుకూలంగా, టీడీపీకి వ్యతిరేకంగా ఉంటుందనే గతంలోనే హైకమాండ్ కు కొందరు నేతలు ఫిర్యాదులు చేశారు. అమరావతి విషయంలోనూ రాష్ట్ర నేతల అభిప్రాయానికి భిన్నంగా జీవీఎల్ ప్రకటనలు ఇచ్చేవారనే విమర్శలు బీజేపీలోనే ఉన్నాయి. జగన్ ప్రభుత్వంపై వచ్చే అవినీతి ఆరోపణల విషయంలోనూ జీవీఎల్ ప్రకటనలు రాష్ట్ర పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో పోరాడాలని భావించిన రాష్ట్ర నేతలకు జీవీఎల్ ప్రకటనలు చాలా సార్లు అడ్డంకులు కల్పించాయి. దీంతో రాష్ట్ర నేతల నుంచి వచ్చిన అభిప్రాయాలు.. కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను పరిశీలించాకే జీవీఎల్ ను అధికార ప్రతినిధి బాధ్యతల నుంచి హైకమాండ్ తప్పించిందని  బీజేపీ వర్గాల్లో  ప్రచారం జరుగుతోంది.    జాతీయ కమిటీలో స్థానం కోల్పోయిన తెలంగాణకు చెందిన సీనియర్ నేత మురళీధర్‌రావుపైనా ఇదే రకమైన చర్చ జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మురళీధర్ సన్నిహితంగా ఉంటారనే ఆరోపణలున్నాయి. తెలంగాణ ప్రభుత్వంపై పోరాటంలో ఆయన ఎప్పడూ యాక్టివ్ గా లేరని తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ కారణంగానే ఆయనను తప్పించారని సమాచారం. కరీంనగర్ కు చెందిన బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నందున.. అదే జిల్లాకు చెందిన మురళీధర్ రావును జాతీయ కమిటి నుంచి తప్పించారనే చర్చ కూడా జరుగుతోంది. ఉత్తర తెలంగాణ వ్యక్తికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినందున..దక్షిణ తెలంగాణకు చెందిన డీకే అరుణకు వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ కట్టబెట్టారని భావిస్తున్నారు.    పార్టీ సినియర్ నేత రాంమాధవ్ ను జాతీయ కమిటి నుంచి తప్పిస్తారని చాలా  కాలంగా ప్రచారం జరుగుతోంది. రాంమాధవ్‌ను గత కొంతకాలంగా పార్టీ వివిధ బాధ్యతల నుంచి తప్పిస్తూ వస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ త్వరలో తన కేబినెట్‌ను విస్తరించనున్నట్లు, అందులో రాంమాధవ్ కు అవకాశం కల్పిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే రాంమాధవ్ కు జాతీయ కమిటీలో చోటు దక్కలేదంటున్నారు.    భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ కమిటీలో తెలుగు రాష్ట్రాలకు సముచిత ప్రాధాన్యత దక్కింది. ఏపీ నుంచి ఇద్దరు, తెలంగాణ నుంచి ఇద్దరు నేతలతు జేపీ నడ్డా టీమ్ లో చోటు దక్కింది. తెలంగాణకు చెందిన మాజీ మంత్రి డీకే అరుణకు వైస్ ప్రెసిడెంట్  ఏపీ నుంచి  దగ్గుబాటి పురందేశ్వరికి  జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్‌ను అదే పదవిలో కొనసాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ను ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నియమించారు.

ఎస్పీ బాలు మృతికి రామోజీరావుకు ముడిపెడుతూ చిల్లర రాతలు

సోషల్ మీడియా వేదికగా కొందరు సన్నాసులు రెచ్చిపోతున్నారు. అసత్యాలు ప్రచారం చేస్తూ పైశాచికానందం పొందుతున్నారు. చీప్ పబ్లిసిటి కోసం, సొంత ప్రయోజనాల కోసం ప్రముఖులను బద్నాం చేస్తున్నారు. ఏపీలో కొన్ని వర్గాలే టార్గెట్ గా ఈ కుట్రలు చేస్తున్నారు. కావాలని బురద చల్లుతూ సిగ్గు లేని వెధవలు సంతోష పడుతున్నారు. అనారోగ్యంతో చనిపోయిన గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం మరణంపైనా పిచ్చోళ్లలా పిచ్చి రాతలు రాస్తున్నారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుపై బురద చల్లుతూ వికృత చేష్టలకు దిగారు బుద్ది, జ్ఞానం లేని చిల్లరగాళ్లు. ఎస్పీ బాలు చావుకు రామోజీరావుకు ముడిపెడుతూ చిల్లర రాతలకు దిగారు. రామోజీ రావు బలవంతం మీదే ఈటీవీ ప్రోగ్రామ్ లో పాల్గొనేందుకు చెన్నై నుంచి బాలసుబ్రమణ్యం హైదారాబాద్ వచ్చారని.. రామోజీ ఫిల్మ్ సిటీకి రావడంతోనే బాలుకి కరోనా సోకిందని  ప్రచారం చేస్తున్నారు. ఈటీవీ ఈవెంట్ లో పాల్గొన్న చాలా మంది కళాకారులకు కరోనా సోకిందని.. బాలు తప్ప అందరూ కోలుకున్నారని ఫేస్ బుక్ పేజీల్లో, వెబ్ సైట్లలో ఇష్టమెచ్చినట్లుగా రాసుకొచ్చారు. రామోజీ ఫిల్మ్  సిటీకి వెళ్లడం వల్లే బాలు చావు తెచ్చుకొన్నాడని, ఈ పాపం రామోజీ రావుదే నంటూ పైశాచికత్వం ప్రదర్శించారు.    అయితే సోషల్ మీడియాలో సన్నాసులు  ప్రచారం చేస్తున్నదంతా పచ్చి బూటకమని తేలిపోయింది. ఇటీవల కాలంలో రామోజీ ఫిల్మ్ స్టూడియోలో ఈటీవీ ప్రోగ్రామ్స్ ఏమి జరగలేదు. కరోనా సమయంలో ఈటీవికి సంబంధించి ఎలాంటి ఈవెంట్లు జరగలేదు. ఎస్పీ బాల సుబ్రమణ్యం పాల్గొన్నది ఈటీవీ ప్రోగ్రామ్ కానే కాదు. జూలై 18న హైదరాబాద్ వచ్చిన ఎస్పీ బాలు, చరణ్ లు మౌనరాగం మురళీ 100వ ఎల్పీ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి ఈటీవికి  ఎలాంటి సంబంధం లేదు. కాని ఈ విషయంపై కావాలనే కుట్రపూరితంగా రాతలు రాస్తున్నారు కొందరు వెధవలు. ఈటీవీ ప్రోగ్రామ్ లో పాల్గొనేందుకు రామోజీరావు బలవంతం మీద.. బాల సుబ్రమణ్యం హైదరాబాద్ వచ్చారని  కొందరు సన్నాసులు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారు.    ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు ఎస్పీ బాల సుబ్రమణ్యం మీద ఎంతో అప్యాయత చూపేవారు. పాడుతా తీయగా కార్యక్రమంటే రామోజీ రావుకు అత్యంత ఇష్టం. అందుకే ఎస్పీ బాలుతో నిర్వహించేవారు. బాలూనే ఈ విషయాన్ని చాలా వేదికలపై చెప్పారు. రామోజీరావు తనకెంతో ఇచ్చారని, తానే ఆయనేమి ఇవ్వలేదని చెప్పుకునేవారు. పాడుతా తీయగా కార్యక్రమంతో తన గౌరవం మరింత పెరిగిందని తెలిపేవారు బాలు. ఈ కార్యక్రమంతో తన పేరు కూడా ఎస్పీ బాలు కాకుండా పాడుతా తీయగా బాలుగా మారిందని చెబుతూ నవ్వుకునేవారు. అంతేకాదు ఓ ఈవెంట్ లో వేదికపైనే రామోజీ రావుకి సాష్టాంగ నమస్కారం చేశారు బాలసుబ్రమణ్యం. రామోజీ కూడా బాలును ఎంతో అప్యాయతతో ఆలింగనం చేసుకుని ఆయన పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అందుకే ఎప్పుడు మీడియా ముందుకు రాని రామోజీ రావు.. బాలు మరణంపై మాత్రం మీడియా ముందుకు వచ్చి తమ సంతాపం తెలిపారు. తన జీవిత కాలంలో రామోజీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం ఇది కేవలం రెండోసారి మాత్రమే. మార్గదర్శి మీద అప్పటి వైఎస్సార్ సర్కార్ కుట్ర పూర్వక కేసు పెట్టినపుడు తమ ఖాతాదారులకు భరోసా కల్పించడానికి మెుదటి సారి రామోజీ మీడియా ముందుకు వచ్చారు. ఆయన చిన్న కొడుకు చనిపోయినపుడు కూడా మీడియా ముందుకు రాలేదు రామోజీ రావు. దీన్ని బట్టే చెప్పవచ్చు రామోజీకి, ఎస్పీ బాలు మీద ఉన్న గౌరవం, వారి మధ్య ఉన్న స్నేహం, ప్రేమ.    రామోజీ, ఎస్పీ బాలు మధ్య మంచి అనురాగ బంధాలుండగా.. కొందరు దుర్మార్గలు చావులోనూ చిల్లర చేష్టలకు దిగడం తెలుగు ప్రజలను విస్మయపరుస్తోంది. అయితే రామోజీరావుపై అసత్య ప్రచారం వెనుక పెద్ద కుట్రే ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వంలోని కొందరు పెద్దల డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతుందని సమాచారం. ఏపీలో కొంత కాలంగా కమ్మ నేతలు, కమ్మ వ్యాపారులు, కమ్మ సామాజిక వర్గంలోని ప్రముఖుల టార్గెట్ అయ్యారు. ఆ వర్గం వారిపైనే కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల ఆలయాలపైనా దాడులు జరుగుతున్నాయి. రోజూ ఏదో ఒక చోట ఆలయంపై దాడి జరుగుతూనే ఉంది. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. దీంతో ప్రజల దృష్టిని ఈ అంశంపై నుంచి మరల్చడానికే ఇలాంటి కుట్రలకు తెరలేపారని తెలుస్తోంది. బ్రహ్మణ, కమ్మ వర్గాల మధ్య చిచ్చు పెట్టాలన్నదే  చిల్లర కుట్రదారుల పన్నాగమని సమాచారం. ఎస్పీ బాలు బ్రహ్మణుడు కావడంతో అతని చావుకు రామోజీ రావు కారణమనే చిల్లర రాతలకు దిగారు. తమ ప్రచారంతో బ్రహ్మణులంతా కమ్మ వర్గాన్ని టార్గెట్ చేయాలన్నది వారి ప్లాన్ లో భాగమని భావిస్తున్నారు.   ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణాన్ని రామోజీ రావుకు అంటగడుతూ చేస్తున్న ప్రచారంపై ప్రజలు భగ్గుమంటున్నారు. ప్రచారం కోసం ఇంతగా దిగజారడమేంటని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రముఖులపై చిల్లర ప్రచారం చేసే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరగవచ్చనే ఆందోళన జనాల్లో వ్యక్తమవుతోంది.

జగన్ సర్కార్ కి కొడాలి గండం.. త్వరలో ఏపీలో ప్రభుత్వం మారనుందా?

రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన పార్టీ.. సొంత పార్టీ నేతల కుమ్ములాట వల్లనో, ప్రత్యర్థి పార్టీల ఎత్తుల వల్లనే అనూహ్యంగా అధికారం కోల్పోవచ్చు. లేదా ఇక ఈ పార్టీ పని పనైపోయింది అనుకున్న పార్టీ.. అనూహ్యంగా పుంజుకుని అధికారంలోకి రావొచ్చు. ఇలా రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. ఇలాంటి ఊహించని పరిణామం త్వరలో ఏపీలో చోటుచేసుకోనుందా అంటే.. ఒక సెంటిమెంట్ బట్టి చూస్తే అవుననే అనిపిస్తుంది.   గుడివాడ నుండి గెలిచి మినిస్ట్రీ లో ఎవరున్నా ఆ గవర్నమెంట్ పూర్తి కాలం ఎప్పుడూ లేదు. మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి అదే సెంటిమెంట్ కొనసాగుతూ వస్తుంది. ఆ సెంటిమెంట్ నుండి ఎన్టీఆర్ కూడా తప్పించుకోలేకపోయారు. 1955 లో గుడివాడ నుండి గెలిచిన దళిత ఎమ్మెల్యే వేముల కూర్మయ్యకి ప్రకాశం పంతులు కేబినెట్ లో స్థానం కల్పించారు. కానీ, ఆ గవర్నమెంట్ పూర్తి కాలం లేదు. ఎన్టీఆర్ కూడా 1983 లో గెలిచి ముఖ్యమంత్రి అయినా 1984 లో నాదెండ్ల భాస్కరరావు కారణంగా ముఖ్యమంత్రి పీఠానికి దూరమయ్యారు. ఇక, 1985 లో హిందూపురం, గుడివాడ నుండి పోటీ చేసి రెండు చోట్లా గెలిచిన ఎన్టీఆర్.. సెంటిమెట్ తో గుడివాడని వదిలేసుకున్నారు. 1989 లో గుడివాడ నుండి గెలిచిన కటారి ఈశ్వర్ కుమార్ ని చెన్నారెడ్డి కేబినెట్ లోకి తీసుకున్నారు. అయితే ఆయన ప్రభుత్వం కూడా పూర్తికాలం లేదు. ఇలా గుడివాడ నుండి గెలిచి మినిస్ట్రీ లో ఎవరున్నా ఆ గవర్నమెంట్ పూర్తి కాలం లేదు. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.   గుడివాడ నుండి ప్రస్తుతం కొడాలి నాని ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన జగన్ మంత్రివర్గంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే, 151 ఎమ్మెల్యేలతో మాకు తిరుగులేదు అనుకుంటున్న అధికార పార్టీని ఇప్పుడు గుడివాడ సెంటిమెంట్ వెంటాడుతోంది. ముఖ్యంగా ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఆ సెంటిమెంట్ ని మరింత బలపరుస్తున్నాయి. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి హిందూ దేవాలయంపై దాడులు, హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రచారాలు పెరిగిపోయాయి. దీంతో హిందువుల్లో అసంతృప్తి మొదలైంది. దీనికి తోడు అగ్నికి ఆజ్యం పోసినట్టు.. తిరుమలలో అన్యమతస్తులకు డిక్లరేషన్ అవసరం లేదని అధికార పార్టీ చెప్పటం హిందువుల ఆగ్రహానికి కారణమైంది. ఇది చాలదు అన్నట్టు కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హిందువుల ఆగ్రహాన్ని పదింతలు పెంచారు. ఎక్కడా లేని రూల్ తిరుమలలో ఎందుకు?, దేవుడి బొమ్మ చెయ్యి విరిగితే ఏమన్నా నష్టమా?, రథం కాలిపోతే ఏమైంది ఇంకొకటి చేపిస్తున్నాంగా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారాన్ని రేపాయి. ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని హిందూ సంఘాల నుండి పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ నిరసన సెగలు కొడాలి నాని మంత్రి సీటుకే కాదు, అసలు పార్టీ అధికారానికే ఎసరు పెట్టినా ఆశ్చర్యంలేదు. ఎందుకంటే కొడాలి నాని వ్యాఖ్యల మూలంగా ఆ స్థాయిలో ఆగ్రహావేశాలు భగ్గుమన్నాయి.   తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పటికీ వైసీపీని కొన్ని విషయాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అసలే సీఎం జగన్ మెడకి కేసులు కత్తి వేలాడుతూ ఉంటుంది. ఇప్పటికే అవినీతి ఆరోపణల కేసులో 16 నెలలు జైలులో ఉన్న ఆయన.. మరోసారి జైలుకి పోయే అవకాశం లేకపోలేదు. మరోవైపు, ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ.. తెలుగు రాష్ట్రాలలో అధికారంపై కన్నేసింది. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియాని ఆకర్షించి అధికారం చేపట్టిన బీజేపీ.. ఏపీలోనూ అలాంటి ఎత్తులు వేసే అవకాశం లేకపోలేదు. దానికితోడు బీజేపీపై హిందూ పార్టీగా ముద్ర ఉంది. ఇప్పుడు వైసీపీ హయాంలో హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులు బీజేపీకి ఎంతోకొంత కలిసొచ్చే అవకాశముంది. ఇప్పటికిప్పుడు బీజేపీ ఏపీలో ఏదైనా ఎత్తు వేసినా.. జగన్ ఎదిరించి నిలబడే సాహసం చేయకపోవొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తలచుకుంటే ఆయనను మళ్ళీ  కృష్ణ జన్మ స్థానానికి పంపడం చిటికెలో పని. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, వైసీపీని వెంటాడుతున్న కేసులు, బీజేపీకి ఉన్న అవకాశాలు.. వీటిని బట్టి చూస్తుంటే ఏపీలో అధికారం మారడం సాధ్యమే అనిపిస్తోంది. మరి ఈ గుడివాడ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి ఏపీలో అనూహ్య పరిణామాలు ఏమన్నా జరుగుతాయేమో చూడాలి. హిందూ దేవాలయాలపై దాడులు, హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలతో అధికార పార్టీపైనా, కొడాలి నానిపైనా తీవ్ర ఆగ్రహంతో ఉన్న భక్తులు, హిందూ సంఘాలు మాత్రం.. గుడివాడ సెంటిమెంట్ వెంటనే వర్కౌట్ అయితే బాగుండు దేవుడా అని కోరుకుంటున్నారు.

బెంజ్ కారు ఎంతపని చేసింది?.. ఇప్పుడు జగన్ సర్కారు ఏం చేస్తుందో మరి!!

గత ప్రభుత్వ హయాంలో వేలు, లక్షల కోట్లు అవినీతి జరిగిందని ఆరోపించిన వైసీపీ సర్కార్.. చివరికి ఈఎస్ఐ స్కామ్ ను తెరమీదకు తీసుకొచ్చి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసింది. మొదట 150 కోట్ల అవినీతి జరిగింది అన్నారు. తరువాత మూడు కోట్లు అన్నారు. చివరికి అసలు అచ్చెన్నకు డబ్బు అందినట్టు ఎలాంటి ఆధారాలు లేవు అన్నారు. అంటే ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారు. కేవలం ఆయన ఒక కంపెనీని పరిశీలించండని ఇచ్చిన లేఖ ఆధారంగా.. అర్థరాత్రి గోడలు దూకి మరీ అరెస్ట్ చేశారు. శస్త్రచికిత్స జరిగిందని చెప్పినా వినకుండా వందల కిలోమీటర్లు కారులో తిప్పారు. దీంతో అచ్చెన్నకు రెండోసారి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన కరోనా బారిన కూడా పడ్డారు. దాదాపు 80 రోజుల తరువాత అచ్చెన్న బెయిల్ పై విడుదల అయ్యారు. ప్రతిపక్షంలోని బలమైన గొంతుని నొక్కాలన్న ఉద్దేశంతోనే అచ్చెన్నను అక్రమంగా అరెస్ట్ చేసి కక్ష సాధింపులకు దిగుతున్నారని టీడీపీ ఆరోపించింది. ఇదిలా ఉంటే.. అసలు ఆధారాలు లేకుండానే ఈఎస్ఐ స్కామ్ పేరుతో అచ్చెన్నను 80 రోజులు నిర్బంధించిన జగన్ సర్కార్.. ఇప్పుడు సాక్షాత్తు కార్మిక శాఖా మంత్రి మీదే ఆరోపణలు వస్తున్నాయి. మరి ఇప్పుడేం చేస్తుంది జగన్ సర్కార్?.   ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కుమారుడు ఈశ్వర్‌కు.. పుట్టినరోజు సందర్భంగా ఈఎస్ఐ స్కాములో అరెస్ట్ అయిన ఏ-14 కార్తీక్ ఖరీదైన బెంజ్ కారు గిఫ్ట్ గా ఇచ్చారు. అయితే, ఇది గిఫ్ట్ కాదని మంత్రికి ఇచ్చిన లంచం అని టీడీపీ ఆరోపిస్తోంది. మంత్రి మాత్రం అబ్బే తన కుమారుడు కారుతో ఫోటో మాత్రమే దిగాడని, తన కుమారుడు చేతుల మీదుగా వాళ్ళు కారు తీసుకున్నారని, ఆ కారు తనదని రుజువు చేస్తే రాజీనామా చేస్తానని సవాల్ చేశారు.    అయితే మంత్రి ఆ కారు తమ పేరు మీద లేదని చెప్తున్నప్పటికీ.. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కారు మంత్రి కుమారుడిది కాకపోతే ఆయన ఆ కారులో ఎందుకు తిరుగుతున్నట్టు?. మంత్రి కుమారుడు ఈశ్వర్ ఆ కారులో తిరుగుతున్న ఫోటోలు, వీడియోలు చాలా సోషల్ మీడియాలో ఉన్నాయి. ఎవరైనా ఒకటి రెండు సార్లు ఫొటోస్ దిగుతారు. అంతేకాని, ఏడాది పొడవునా తమ దగ్గరే కారు ఉంచుకొని ఫొటోస్, వీడియో తీస్తూ తిరుగుతుంటారా. అంటే ఆ కారు ఎవరు పేరు మీదున్నా.. ఆ కారు మాత్రం మంత్రి కుమారుడిదే అని అర్థమవుతుంది.   అసలు ఈఎస్ఐ స్కాములో ఏ-14 ఉన్న కార్తీక్ మంత్రి కుమారుడుకి అంత ఖరీదైన కారు ఎందుకు ఇచ్చాడు. కోట్ల విలువైన గిఫ్ట్ లు ఇచ్చే అంత రిలేషన్ ఏంటి వాళ్ళకి?. అతను ఏ లబ్ది పొందకుండానే అంత ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చాడా?. ఒకసారి మంత్రి ఈ కార్తీక్ ని దత్త పుత్రుడిగా ప్రకటించారట. అంతేకాదు, ఈఎస్ఐ స్కాములో అరెస్ట్ అయిన అచ్చెన్నకు బెయిల్ రావడానికి 80 రోజులు పట్టింది. కానీ, ఏ-14 కార్తీక్ కి మాత్రం వెంటనే బెయిల్ వచ్చింది. అదెలా సాద్యమైంది? మంత్రి అండదండలు లేకుండానే ఇదంతా జరుగుతుందా?.   ఇంకో విషయం ఏంటనే..మంత్రి కుమారుడు వీడియోస్ లో మరి కొన్ని ఖరీదైన కార్లు కూడా కనిపిస్తున్నాయి. అంతంత ఖరీదైన కార్లు ఎక్కడి నుండి వచ్చాయి?. అంతేకాదు మంత్రి కుమారుడి వివాహ వేడుక సినీస్టార్స్ వెడ్డింగ్ అంత రిచ్ గా జరిగింది. ఇన్నిన్ని డబ్బులు ఎక్కడివి?. గత ఎన్నికల అఫిడవిట్ లో మంత్రి ఇచ్చిన ఆస్తుల విలువ ఎంతో తెలుసా?. చరాస్తులు స్థిరాస్తులు మొత్తం కలిపి 80 లక్షలు. కేవలం 80 లక్షల ఆస్తి కలిగిన కుటుంబం అంత ఖర్చు ఎలా పెడుతుంది? కోట్ల ఖరీదైన కార్లు ఎలా వాడుతుంది. అయితే కొని ఉండాలి లేదా ఎవరైనా ఇచ్చి ఉండాలి. ఒకవేళ కొని ఉంటే.. మంత్రి అఫిడవిట్ లో తప్పుడు వివరాలు ఇచ్చినట్టు లెక్క. అంటే అసలు ఆయన ఎన్నికే చెల్లదు. పోనీ గిఫ్ట్ ఇచ్చారనుకుందాం. ఏ లబ్ది పొందకుండా ఎవరైనా ఎందుకు గిఫ్ట్ ఇస్తారు. అది కూడా ఈఎస్ఐ స్కాములో ఏ-14 ఉన్న వ్యక్తి గిఫ్ట్ ఇవ్వడం వెనక ఉద్దేశం ఏంటి?. దీని వెనుకున్న నిజాలు బయటపడాలి. సీఎం అయిన దగ్గర నుండి అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యం అని చెప్తున్న జగన్.. మంత్రిపై చర్యలు తీసుకుంటారా? లేక మా పార్టీలో ఉన్నోళ్లు అంతా కడిగిన ముత్యాలు అంటూ అవినీతి మరకలతోనే ముందుకు సాగుతారో చూడాలి.   మంత్రి జయరాం మీద ఆరోపణలు కొత్తకాదు. ఈ ఏడాది కాలంలోనే ఆయనపైనా, ఆయన సన్నిహితులపైనా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఆయన సమీప బంధువు పేకాట స్థావరాలు నిర్వహిస్తూ పట్టుబడ్డారు. ఆయన అనుచరులు అక్రమంగా ఇసుక, మద్యం రవాణా చేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ఆయనపై భూకబ్జా ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా బెంజ్ కార్ల లంచం ఆరోపణలు. అసలు ఒక మంత్రి పై ఇన్ని ఆరోపణలా. కారు తమ పేరు మీద ఉంటే రాజీనామా చేస్తానంటున్న మంత్రి.. తనపై వచ్చిన ఈ ఆరోపణలన్నీ అబద్దమని నిరూపిస్తారా?. నిరూపించలేకపోతే రాజీనామా చేస్తారా?.

అధ్య‌క్షా.. నాకు సెల‌వు కావాలి!

పార్ల‌మెంటు మొద‌లై ప‌ట్టుమ‌ని మూడు రోజులు కూడా కాలేదు. ఆదిలోనే హంస‌పాదు ఎదుర‌వుతున్న‌ది. ఎంపీల్లో చాలామంది పార్ల‌మెంటుకి హాజ‌ర‌య్యేందుకు బొత్తిగా ఇష్ట‌ప‌డ‌టం లేదు. క‌రోనా వైర‌స్ ఏమాత్రం జాలి లేకుండా త‌న మానాన తాను దూకుడుగా ఎగిరి గంతేస్తున్న ఈ త‌రుణంలో ఎవ‌రికి వారు మేక‌పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తూ పార్ల‌మెంటుకి వ‌స్తున్న‌ట్టు అనిపిస్తున్న‌ది. బుధ‌వారం మాజీ ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్, మాజీ ఆర్ధిక మంత్రి చిదంబ‌రంతో స‌హా డ‌జ‌నుకు పైగా ఎంపీలు సెల‌వు చీటీలు స‌మ‌ర్పించారు. వ‌యోభారం వ‌ల్ల స‌మావేశాల‌కు రాలేక‌పోతున్నారా అంటే అదేమీ కాదు. క‌రోనా కార‌ణంగా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల‌తోనే వారీ నిర్ణ‌యానికొచ్చారు. మ‌న్మోహ‌న్ సింగ్ వ‌య‌స్సు 87 ఏళ్లు. అందువ‌ల్ల ఆయ‌న అవ‌స్ధ‌ని అర్ధం చేసుకోవ‌చ్చు. ఎక్కువ వ‌య‌స్సున్న వాళ్ల‌ని క‌రోనా అతి సునాయాసంగా ఆక‌ర్షిస్తున్న‌ద‌న్న వైద్యుల అప్ర‌మ‌త్త‌త నేప‌థ్యంలో మ‌న్మోహ‌న్ సింగ్ సెల‌వు పెట్ట‌డాన్ని పెద్ద‌గా అభ్యంత‌ర‌పెట్ట‌లేము. ఇక చిదంబ‌రం. ఆయ‌నకు 75 ఏళ్లు. కాబ‌ట్టి చిదంబ‌రానికీ మిన‌హాయింపు ఇవ్వొచ్చు. ఇలాంటి పెద్ద‌లు ఈ స‌మావేశాల చివ‌రి దాకా సెల‌వు అడిగారు. వీళ్లే కాదు. వైకాపా త‌ర‌పున రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన పిర‌మ‌ల్ న‌త్వానీ కూడా సెల‌వు పెట్టారు. ఇలా మొత్తంమీద ప‌ద‌మూడు మంది దాకా సెల‌వు బాట‌లో ఉన్నారు. రాజ్య‌స‌భ చైర్మ‌న్ వెంక‌య్య నాయుడు వీరంద‌రికీ సెల‌వు మంజూరు చేశారు. మ‌రి రేప‌ట్నుంచి ఇంకా ఎంత‌మంది ఇదే బాట‌లో ప‌య‌నిస్తారో తెలీదు.    ఇటు రాజ్య‌స‌భ‌, అటు లోక్‌స‌భ ఇలా సెల‌వుల ప‌ర్వంలో ఉంటే స‌మావేశాలు స‌జావుగా సాగుతాయా అన్న సందేహాలున్నాయి. అయితే ప్ర‌స్తుతం ఉభ‌య స‌భ‌లు అటు సంఖ్యాప‌రంగానే కుదించుకున్నాయి. పూర్తి స్ధాయిలో స‌భ్యులు హాజ‌రు కావ‌డం లేదు. అలాగే ప్ర‌శ్నోత్త‌రాలు ఎత్తేశారు. ఇలా కీల‌క‌మైన స‌భా కార్య‌క్ర‌మాల‌నే కుదించాల్సి వ‌చ్చింది. మ‌రి రాజ్యాంగ నియ‌మాల ప్ర‌కారం పార్ల‌మెంటు జ‌ర‌పాలి. పెండింగ్ బిల్లులు ఉంటాయి. వాటిని ఆమోదించి చ‌ట్ట‌రూపం తేవాలి. అవి నిజానికి చాలా ముఖ్యమైన‌విగా ఉంటాయి. కాని అవ‌త‌ల క‌రోనా ప‌రిస్థితి అలా ఉన్న‌ప్పుడు ప్ర‌భుత్వం కూడా మ‌మ అనే ప‌ద్ద‌తిలోనే స‌భ‌ను సాగిస్తున్న‌ది. అందువ‌ల్ల ఎంత‌మంది స‌భ్యులు సెల‌వులు పెట్టినా స‌భ‌లో పూర్తి చేయాల్సిన ప్ర‌భుత్వ‌ప‌ర‌మైన కార్య‌క్ర‌మాలు పూర్తి చేయ‌డానికి పెద్ద‌గా అడ్డంకులు ఏవీ ఉండ‌క‌పోవ‌చ్చు. ఎటొచ్చీ స‌మావేశాల చివ‌రిదాకా ఎంత‌మంది స‌భ‌లో నిలుస్తార‌న్న‌దే ప్ర‌శ్న‌. తామెవ్వ‌రం లేకుండా బిల్లులు ఆమోదించ‌డానికి వీల్లేద‌ని ఎంత‌మంది అడ‌గ‌గ‌ల‌రు? అడిగితే ప్ర‌భుత్వం మిన్న‌కుంటుందా? అవ్వా కావాలి..బువ్వా కావాలి అంటే కుద‌ర‌దు..అవ‌త‌ల క‌రోనాకి లీవూ మీరే అడుగుతారు..మ‌ళ్లీ బిల్లుల మీద చ‌ర్చ‌లో మీరే ఉండాల‌ని అడుగుతారా అంటూ ఎదురుదాడి చెయ్య‌దా? -రాజా రామ్మోహ‌న్ రాయ్‌

జ‌యా బ‌చ్చ‌న్‌ అగ్గిమీద‌ గుగ్గిలం!

జ‌యాబ‌చ్చ‌న్‌..డెబ్బ‌య్ రెండేళ్ల రాజ్య‌స‌భ స‌భ్యురాలు..అంటే పెద్ద‌ల స‌భ‌లో స‌భ్యురాల‌న్న మాట‌. అంటే ఆమె ఏమి చెప్పినా పెద్ద‌రికంతో చెప్పిన‌ట్ట‌న్న‌మాట‌! పెద్ద‌రికంతో చెప్పాలి కాబ‌ట్టి..క‌నీసం అలా చెప్పిన‌ట్ట‌యినా అనిపించాలి కాబ‌ట్టేమో ఆమె ఆచితూచి మాట్లాడుతుంటారు. ఆమాట‌కొస్తే ఆచితూచే స‌భ‌కూ వ‌స్తుంటారు. ఇంకా స్ప‌ష్టంగా చెప్పాలంటే ఏదైనా చెప్పాల‌నుకున్న‌ప్పుడే స‌భ‌కు వ‌స్తుంటార‌ని అనుకునేవాళ్లూ ఉన్నారు! అలానే మంగ‌ళ‌వారం నాడు స‌భ‌కి వ‌చ్చారు. ఆమె వ‌చ్చారంటే ఏదో పెద్ద విష‌య‌మే ఆమె మాట్లాడ‌తార‌ని అనుకోవ‌చ్చు. అలాగే ఒక పెద్ద విష‌య‌మే లేవ‌నెత్తారు. ఏదో కొంద‌రి కార‌ణంగా సినిమా ప‌రిశ్ర‌మ మొత్తాన్ని భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నార‌ని ఆమె ఆక్రోశించారు. ముఖ్యంగా బీజేపీ ఎంపీ,భోజ్‌పురి న‌టుడు ర‌వి కిష‌న్ మీద అగ్గిగుగ్గిల‌మే అయ్యారు. సినీ ప‌రిశ్ర‌మ అన‌గానే సోష‌ల్ మీడియా ఒంటికాలికి మీదికి లేస్తుంద‌ని, ప్ర‌భుత్వం సినీ ప‌రిశ్ర‌మ‌కు వీస‌మెత్తు మ‌ద్ద‌తుగా నిల‌వ‌డం లేద‌ని ఆమె దుయ్య‌బ‌ట్టారు.   బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం చెల‌రేగి సంచ‌ల‌నంగా మారిన నేప‌థ్యంలో ఆమె ఆవేశం క‌ట్ట‌లు తెంచుకుంటున్న‌ది. మాద‌క ద్ర‌వ్యాల‌ను ఎవ‌రో కొంద‌రు వాడుతున్నంత మాత్రాన మొత్తం ప‌రిశ్ర‌మ‌నే వేలెత్తి చూపుతారా అన్న‌ది ఆమె ప్ర‌శ్న‌. అంత సీనియ‌ర్ స‌భ్యురాలు స‌భ‌లో ఈ అంశాన్ని ఈ కోణంలో ప్ర‌స్తావించ‌డాన్ని సినీ అభిమానులు ఏమాత్రం జీర్ణం చేసుకోలేక‌పోతున్నారు. సినీ ప‌రిశ్ర‌మ‌లోని డ్ర‌గ్స్ మాఫియా భ‌ర‌తం ప‌ట్టాల‌ని ఆమె డిమాండ్ చేసి ఉంటే యావ‌త్ ప్ర‌జానీకం సంతోషించి ఉండేవారు. సుశాంత్ లాంటి యువ‌త‌రాన్ని బ‌ల‌గొంటున్న డ్ర‌గ్స్ మాఫియా ఊసెత్త‌కుండా దాన్ని ఎవ‌రో కొంద‌రికే ప‌రిమిత‌మైన అంశంగా ఆమె భావించ‌డం రాజ్య‌స‌భ స‌భ్యురాలిగా ఆమె స్ధాయికి త‌గిన‌ట్టుగా లేద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతున్న‌ది. మ‌రో న‌టి కంగ‌నా ర‌నౌత్ ఇప్ప‌టికే కొంద‌రి పేర్లు ప్ర‌స్తావించి, వారు ర‌క్త‌ప‌రీక్ష‌లు చేయించుకుని అంద‌రికీ ఆద‌ర్శంగా ఉండాల‌ని ఇచ్చిన పిలుపికి జ‌యాబ‌చ్చ‌న్ ఏమాత్రం స్పందించ‌క‌పోవ‌డం ఇక్క‌డ గుర్తించాల్సిన అంశం. కంగ‌నా ర‌నౌత్ బ‌హిరంగంగా పేర్లు ప్ర‌స్తావించిన‌ప్పుడు యావ‌త్ బాలీవుడ్ మౌన‌మే వ‌హించింది. అంటే దాన‌ర్ధం ఏమిటి? ఆ పెద్ద‌వాళ్ల గొడ‌వ‌లో వేలు పెట్ట‌డం ఇష్టం లేద‌నా? లేక కంగ‌నా లేవ‌నెత్తిన అంశంలో వాస్త‌వం ఉంద‌నా? ఇంకా చెప్పాలంటే సినీప‌రిశ్ర‌మ‌లో డ్ర‌గ్స్ మాఫియా గురించి కంగ‌నాయే ధైర్యంగా నోరెత్తింది. ఆమెకి త‌గినంత మ‌ద్ద‌తు రాలేదు.    ఇంక మ‌రో విష‌యం. కంగ‌నా ర‌నౌత్ ముంబాయి ఆఫీసు వివాదాస్ప‌ద‌మై ఇర‌వై నాలుగ్గంట‌ల్లో ముంబాయ్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు ఆమె ఆఫీసు భ‌వ‌నంలో కొంత భాగాన్ని ఆగ‌మేఘాల మీద కూల్చివేసిన‌ప్పుడూ జ‌యాబ‌చ్చ‌న్ నోరు మెద‌ప‌లేదు. మ‌రి కంగ‌నా ర‌నౌత్ కూడా సినీ ప‌రిశ్ర‌మ‌లోని ప్ర‌ముఖ న‌టి, ద‌ర్శ‌కురాలు, నిర్మాత‌గా ఎదిగింది. త‌న‌కంటూ సొంత వ్య‌క్తిత్వంతో బాలీవుడ్‌లో నిల‌బ‌డింది. అటువంటి న‌టికి సంఘీభావంగా నిల‌బ‌డాల్సిన స్ధాయిలో ఉండి కూడా జ‌యాబ‌చ్చ‌న్ అస‌లా అంశం త‌న‌కు సంబంధించ‌నిదిగానే వ్య‌వ‌హ‌రించారు. కంగ‌నా ర‌నౌత్ మ‌హ‌రాష్ట్ర ప్ర‌భుత్వంతోనే యుద్దానికి త‌ల‌ప‌డ్డారు. ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ థాక్రే కుమారడు ఆదిత్య థాక్రేకు మాద‌క ద్ర‌వ్యాల మాఫియాతో లింకులు న్నాయ‌ని ఆమె నేరుగా ఆరోపించారు. అయితే అది ప్ర‌భుత్వంతో ముడిప‌డి ఉన్న అంశం అయినందున జ‌యాబ‌చ్చ‌న్ ఆ విష‌యం జోలికి వెళ్ల‌లేదు. నిజానికి రాజ్య‌స‌భ‌లో ఆమె ఈ అంశాన్ని కూడా ప్ర‌స్తావించి ఉండాల్సింది. ద‌ర్యాప్తుకి డిమాండ్ చేసి ఉండొచ్చు. కంగ‌నా ర‌నౌత్ మీద రాజ‌కీయ ప్ర‌తీకార చ‌ర్య‌ల్ని నిలువ‌రించాల‌ని గొంతెత్తి ఉండాల్సింది. కాని ఇవేమీ జ‌ర‌గ‌లేదు. సినీ ప‌రిశ్ర‌మ గురించి ఒక సినీ న‌టుడే అలా మాట్లాడ‌టం శోచ‌నీయం అంటూ ర‌వి కిష‌న్ వ్యాఖ్య‌ల గురించి ప్ర‌స్తావించారు. బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ తీవ్ర‌త గురించి ఎప్ప‌టిక‌ప్పుడు జ‌రుగుతున్న ప‌రిణామాల గురించి ప్ర‌సారం చేస్తున్న ప్ర‌సార మాధ్య‌మాల‌ను ఆమె త‌ప్పుబ‌డుతున్నారు.    జ‌రుగుతున్న వాస్త‌వాల‌ను అర‌చెయ్యి అడ్డుపెట్టా ఆపాల‌ని ఆమె భావిస్తున్న‌ట్టు అనిపిస్తున్న‌ది. సుశాంత్ మ‌ర‌ణం కేసు ఎన్నెన్ని మ‌లుపులు తిరుగుతున్న‌దో ఆమెకి తెలీద‌ని అనుకోలేము. అలా మ‌లుపులు తిర‌గ‌డంలోని ఉచితానుచితాల గురించీ ఆమెకు ప్రాథ‌మిక స‌మాచారమైనా తెలీద‌నీ భావించ‌లేము. సుశాంత్ కేసులో అది హ‌త్యా? ఆత్మ‌హ‌త్యా? అని తేల్చాల్సిన త‌రుణంలో కేసు ఆ ప‌రిధిని ఎప్పుడో దాటిపోయిన‌ట్టు అనిపిస్తున్న‌ది. ఎందుక‌లా జ‌రిగిందో ఎవ్వ‌రూ అడ‌గ‌డం లేదు. ఇప్పుడ‌ది మాద‌క ద్ర‌వ్యాల వాడ‌కం ద‌గ్గ‌ర‌కొచ్చి రియాను, ఆమె సోద‌రుణ్ని అరెస్టు ఘ‌ట్టం ద‌గ్గ‌ర‌కి తీసుకెళ్లి ఆపింది. ఇన్ని మ‌లుపుల నేప‌థ్యంలో జ‌యాబ‌చ్చ‌న్ సినీప‌రిశ్ర‌మ ద‌య‌నీయ‌ప‌రిస్థితి గురించి ఆందోళ‌న ప‌డ‌టం క‌న్నా, నిజానిజాల వెలికితీత‌కు ప‌ట్టుబ‌ట్టి ఉండాల్సింది! -రాజా రామ్మోహ‌న్ రాయ్‌