Read more!

షర్మిలతో చాణక్యం! ఎవరికి ఎసరు ?

తెలంగాణలో కొత్త పార్టీ.. అందులోనూ తెలంగాణేతర వ్యక్తి.. ఇదేమీ మామూలు విషయం కాదు. పెను సంచలనమే. ఇది షర్మిల చేత వేయిస్తున్న రాజకీయ ఎత్తుగడ అనే వారు అనేకులు.. పార్టీ వెనుక అంచనాలకు అందని పొలిటికల్ స్ట్రాటజీ ఉందనేది విశ్లేషకుల మాట.. అదేంటనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్.

షర్మిల పార్టీతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు అమాంతం మారిపోతాయా? రాత్రికి రాత్రి పరిస్థితులు తారుమారు అవుతాయా? అంటే కానేకాదు. ఆమెకు అంత సీన్ లేదనేది అందరికీ తెలిసిన విషయమే. ఇంత చిన్న లాజిక్ షర్మిలకు తెలియంది కాదు. మరెందుకు కొత్త పార్టీ పెట్టే సాహసం చేశారు? ఇంతకు షర్మిల టార్గెట్ ఎవరు? కేసీఆరా? రేవంత్ రెడ్డా? కాంగ్రెస్సా? బీజేపీనా? 

షర్మిల జెండా, ఎజెండా ఏంటి? జగనన్న లానే తాను కూడా తెలంగాణకు సీఎం అయిపోదామనా? ఇప్పుడు కాకపోయినా భవిష్యత్ లోనైనా షర్మిల తెలంగాణ గడ్డపై నిలదొక్కుకోగలరా? ఇక్కడ ఆమెకు అంత స్పేస్ ఉందా? ఆమె వెంట నడిచేది ఎవరు? ఆమెకు సపోర్ట్ గా నిలిచేది ఇంకెవరు? ప్రాంతీయ అభిమానం మెండుగా ఉండే తెలంగాణలో.. పక్క రాష్ట్ర నేతను ఆదరిస్తారా? అక్కున చేర్చుకుంటారా? అంటే కష్టమేనంటున్నారు తెలంగాణ వాదులు. మరెందుకు? ఇంకెందుకు? షర్మిల.. ఏపీని దాటొచ్చి.. తెలంగాణలో పార్టీ స్థాపించి.. ఏం సాధిద్దామని? ఎవరిని ఉద్దరిద్దామని? పాదయాత్ర తర్వాత ఇంటికే పరిమితమైన వైఎస్ యువరాణి.. సడెన్ గా తెలంగాణ రాజ్యాన్ని ఏలుదామని ఎందుకు ముందుకొచ్చారు? ఆమెను ముందుంచి నడిపిస్తున్న వెనుకున్న పెద్దలెవరు? తెలంగాణలో షర్మిల పార్టీ ప్రభావం ఏ మేరకు ఉంటుంది? ఏ వర్గాలను ప్రభావితం చేస్తుంది? కలిసొచ్చేది ఎవరికి? కాల గర్భంలో కలిసిపోయేది ఎవరు? ఇలా అనేక ఆసక్తికర ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వెతికే ప్రయత్నం చేసింది తెలుగు వన్ న్యూస్. ఆ రాజకీయ విశ్లేషణలో ఇంట్రెస్టింగ్ యాంగిల్స్ వెలుగు చూశాయి.

వన్ పర్సన్.. మెనీ టార్గెట్స్..
ఏ రాజకీయ పార్టీ లక్ష్యమైనా అధికార పీఠమే. షర్మిల సైతం రాజన్న రాజ్యం తీసుకురావడానికే పార్టీ స్థాపించినట్టు ఇప్పటికే స్పష్టం చేశారు. అంటే.. ప్రస్తుతం పవర్ లో ఉన్న టీఆర్ఎస్ ను గద్దె దింపడమే కొత్త పార్టీ లక్ష్యం. అయితే.. ఉద్యమ నేత, రాజకీయ దురందుడైన కేసీఆర్ నుంచి కిరీటం లాక్కోవడం అంత ఈజీ కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో షర్మిలకు అది అసాధ్యం కూడా. అందుకే.. తాత్కాలికంగా ముఖ్యమంత్రి పీఠాన్ని టార్గెట్ చేయకుండా.. గులాబీ బాస్ ను సాధ్యమైనంత బలహీనం చేయడమే షర్మిల చేయగలిగింది. కొత్త పార్టీ ఏర్పాటుతో తెలంగాణలో ఓటు బ్యాంక్ ఎలా ప్రభావితం అవుతుందో..
షర్మిల బలం, బలగం, ఆశ, అత్యాశ అంతా.. కొన్ని వర్గాలే. అవి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్ అభిమానులు, హైదరాబాద్ లోని జగన్ ఫ్యాన్స్.. వీరితో పాటు రెడ్డు, క్రిష్టియన్లు, ముస్లింలు. వీళ్లే షర్మిల వెంట ముందుండి నడిచే అవకాశం ఉన్న వర్గాలు. ఎంత కాదన్నా.. ఈ వర్గాలను నమ్ముకునే షర్మిల పార్టీ పెడుతున్నారనేది కాదనలేని వాస్తవం. 

వైఎస్ ఫ్యాన్స్... 
వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణలో ఆయనకు బలమైన కేడర్ ఉండేది. వైఎస్ మరణం.. రాష్ట్ర విభజనతో.. ఆ కేడర్ అంతా తలో దిక్కులో సెటిల్ అయ్యారు. కొందరు కాంగ్రెస్ లోనే కంటిన్యూ అవుతుంటే.. మరికొంత మంది కారు పార్టీలో సెటిల్ అయ్యారు. వైఎస్సార్ కూతురుగా షర్మిల పార్టీ పెడితే.. ఆమె తండ్రి మీద ఉన్న అభిమానంతో కూతురు వెనుక నిలిచేది ఎంతమంది అనేది తేలాల్సి ఉంది. జగనన్నను చూసి.. చెల్లితో చేయి కలుపుతారా? లేదా? అనేది కీలకాంశం. ఒకవేళ వారిలో కొందరైనా షర్మిల పార్టీలో చేరితే.. ఆ మేరకు కాంగ్రెస్ కు, టీఆర్ఎస్ కు మైనసే.. ఇప్పటికే నిండా మునిగిన కాంగ్రెస్ ఫుట్టి.. టైటానిక్ షిప్ లా రాజకీయ సముద్రంలో చెల్లాచెదురు కావడం ఖాయం. గులాబీ దండుపైనా ఆ ప్రభావం ఎంతోకొంత పడక మానదు. 

రెడ్ల దారెటు?
వైఎస్ అభిమానుల తర్వాత.. తెలంగాణలో బలమైన వర్గంగా ఉన్న రెడ్డి లీడర్లపైనే షర్మిలకు బోలెడు ఆశ. స్వతహాగా రెడ్డకు బ్రాండ్ అంబాసిడర్ గా చెలమణి అవుతున్న వైఎస్ ఫ్యామిలీ ఆడబిడ్డకు తెలంగాణ రెడ్ల నుంచి ఏ మేరకు సహాయ సహకారాలు అందుతాయనేది ఆసక్తికరం. ఇప్పటికే ఏళ్లుగా నల్గొండ రెడ్లంతా కాంగ్రెస్ లో పాతుకుపోయారు. సీనియర్లు మినహా మిగతా రెడ్డీ బ్యాచ్ అంతా రేవంత్ రెడ్డికి జై కొడుతున్నారు. తెలంగాణ రెడ్డలకు రేవంత్ రెడ్డి ఒక్కడే ఆశాకిరణం. ఎప్పటికైనా తెలంగాణ సీఎంగా ఎమర్జ్ అయ్యే సత్తా.. సత్తువ.. ఒక్క రేవంత్ రెడ్డికే ఉంది. రెడ్ల వర్గంలో ప్రస్తుతం ఆయనంత మొనగాడు ఇంకెవరూ లేరు. రేవంత్ అంటే రెడ్లు అందరికీ విపరీత అభిమానం ఉన్న.. కాంగ్రెస్ లో ఆయనను అణగదొక్కేయాలని చూసే సీనియర్లు అనేకులు. ఫైర్ బ్రాండ్ లీడర్ రేవంత్ ఒక్క అడుగు ముందుకేస్తే.. మూడు అడుగులు వెనక్కి లాగుతున్నారు సో కాల్డ్ సీనియర్స్. అంత కాంపిటీషన్ లోనూ రేవంత్ రెడ్డి తనదైన స్టైల్ లో దూసుకుపోతున్నారు. ఇప్పటికే రైతు భరోసా పాదయాత్రతో జోరు మీదున్నారు. ఆయనకు పోటీగా.. షర్మిల నిలబడగలరా? రెడ్లను తనవైపు తిప్పుకోగలరా? అనేదే మెయిన్ పాయింట్. 

ఇక, పదవిలో ఉన్న రెడ్లు ఇష్టంగానో.. కష్టంగానో.. కేసీఆర్ వెంట ఉన్నారు. పైకి ఎంత గంభీరంగా కనిపిస్తున్నా.. వెలమ దొర కింద పని చేయడానికి రెడ్లు ఒకింత అసంతృప్తితోనే ఉన్నారని అంటున్నారు. సరైన, బలమైన.. రెడ్డి లీడర్ కోసం ఎదురు చూస్తున్నారు? ఆ రెడ్డి.. వైఎస్ షర్మిలరెడ్డి అవుతారా? లేక, రేవంత్ రెడ్డిని ఎంచుకుంటారా? అనేది కాలమే డిసైడ్ చేస్తుంది. అయితే.. రెడ్ల పునరేకీకరణతో అధికార టీఆర్ఎస్ కు గడ్డు కాలమే? షర్మిల ఎంట్రీతో ఈ రెడ్ల సమీకరణం ఎలా మారుతుందనేది ఆసక్తికరం. ఇదే భవిష్యత్ రాజకీయాలను శాసించే కీలక పరిణామం. కొత్త పార్టీతో రెడ్డి వర్గంలో చీలిక వస్తుందా? లేక, రెడ్లందరూ ఏకీక్రుతం అవుతారా? అనే దానిపైనే షర్మిల పార్టీ మనుగడ ఆధారపడి ఉంటుంది. 

మైనార్టీలు ఎటువైపు? 
దళితులు, క్రిష్టియన్ మైనార్టీలు ఇందిరా కాలం నుంచీ కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా ఉన్నారు. వైఎస్ హయాంలో వారంతా ఆ ఫ్యామిలీ చెంతన.. ఆ తర్వాత టీఆర్ఎస్ పంచన చేరారు. షర్మిల పొలిటికల్ ఎంట్రీతో క్రిష్టియన్లు గంపగుత్తగా ఆ పార్టీ వైపు మళ్లీ అవకాశాలు ఎక్కువే. ఎలాగూ.. షర్మిల భర్త.. బ్రదర్ అనిల్ కుమార్ ఉండనే ఉన్నారుగ. ఆయన్ను, బైబిల్ చేతపట్టిన షర్మిల ఫోటోలను చూసి.. క్రీస్తు ఫాలోయర్స్ అంతా పోలోమంటూ షర్మిల పార్టీ వైపు మళ్లడం ఖాయం. అదే జరిగితే.. ఇప్పటి వరకూ టీఆర్ఎస్ కు హోల్ సేల్ ఓటర్లుగా ఉన్న ఆ వర్గమంతా దూరమవుతుంది. కేసీఆర్ ఓటు బ్యాంక్ దెబ్బతింటుంది. ఇక, మూడు ఎకరాల భూమి ఇస్తానంటూ అరచేతిలో స్వర్గం చూపించి.. చేతులెత్తేసిన ముఖ్యమంత్రిపై దళితులంతా గుర్రుగా ఉన్నారు. వాళ్లు అదను కోసం ఎదురు చూస్తున్నారు. వారికి, షర్మిల ఆశాదీపంగా కనిపించనుంది. 

ముస్లింలే కీలకమా?
ముస్లింలు సైతం మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి సపోర్టర్స్ గా ఉన్నారు. ఓవైసీ సైతం జగన్ తన ఫ్రెండ్ అంటూ పలుమార్లు ఓపెన్ గానే స్టేట్ మెంట్స్ చేశారు. ఇప్పుడు జగన్ సోదరి షర్మిల పార్టీ పెడుతుండటంతో.. ముస్లిం ఓటర్లు అటు వైపు షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. తెలంగాణలో 12శాతానికి పైగా ఉన్న ఓటర్లు పార్టీల గెలుపు ఓటమిలపై విశేష ప్రభావం చూపగలరు. ప్రస్తుతం టీఆర్ఎస్, ఎమ్.ఐ.ఎమ్. దోస్తీ నడుస్తోంది. అయితే, ఎమ్.ఐ.ఎమ్. కేవలం హైదరాబాద్ కే పరిమితమైన పార్టీ. కాస్తో కూస్తో నిజామాబాద్, ఆదిలాబాద్ లోనూ బలం ఉంది. మిగతా జిల్లాల్లోని ముస్లింలు మాత్రం ఎమ్.ఐ.ఎమ్. వెంట లేరు. వారంతా ఇన్నాళ్లూ టీఆర్ఎస్ కు ఓటేస్తూ వచ్చారు. ఇప్పుడు షర్మిల పార్టీ పెడితే.. ఆమె వైపు ఆసక్తి చూపే అవకాశం లేకపోలేదు. ఆ లెక్కన.. మళ్లీ కారు పార్టీకే మైనస్. 

బీసీల ఓట్లు ఎవరికి?
టీసీలంటే టీడీపీ.. టీడీపీ అంటే బీసీలు. ఇది ఒకప్పటి మాట. తెలంగాణ ఏర్పాటుతో ఇక్కడ టీడీపీ దాదాపు ఖతం అయింది. బీసీలంతా చెల్లాచెదురయ్యారు. ఎక్కువ శాతం అధికార పార్టీ వైపే షిఫ్ట్ అయ్యారు. వాళ్లంతా చంద్రబాబుకు విరోధి అయిన.. వైఎస్ షర్మిల వైపు ఉండే అవకాశమే లేదు. సో, మెజార్టీ ఓటర్లైన బీసీల మద్దతు కొత్త పార్టీకి దక్కకపోవచ్చు. 

నెగ్గుతారా? నెగ్గనిస్తారా?
పైపైన చూస్తే.. షర్మిలకు తెలంగాణలో పొలిటికల్ స్కోప్ తక్కువే. కానీ, డెప్త్ గా అనలైజ్ చేస్తే.. రాజకీయ సమీకరణాలను ఎంతోకొంత మార్చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. రెడ్లు, ముస్లింలు, క్రిష్టియన్లు, దళితులు, వైఎస్ అభిమానుల ఓటు బ్యాంకు లెక్కలన్నీ ప్రభావితం అవుతాయి. ఒకవైపు కాంగ్రెస్ బలహీన పడుతుండటం.. అదే సమయంలో రేవంత్ రెడ్డి కీలక నేతగా ఎదుగుతుండటం.. ఇదే టైమ్ లో షర్మిల ఎంట్రీతో తెలంగాణ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంటున్నాయి. ఈ పొలిటికల్ జంక్షన్ లో లీడర్లు, ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనే దానిపై భవిష్యత్ రాజకీయం రంజుగా మారబోతోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ అసంత్రుప్తులంతా రేవంత్ రెడ్డి వైపు మళ్లుతారా? ఆయన వైపు షిఫ్ట్ అవకుండా షర్మిలను రంగంలోకి దించారా? అనే టాక్ కూడా నడుస్తోంది. 

షర్మిల.. బీజేపీ వదిలిన బాణమా?
షర్మిల కొత్త పార్టీ వెనుక బీజేపీ గేమ్ ప్లాన్ ఉందనే చర్చ జోరుగా నడుస్తోంది. టీఆర్ఎస్ ను, కాంగ్రెస్ ను సాధ్యమైనంత బలహీన పరిచి.. షర్మిలతో నియోజకవర్గాల వారీగా ఎంతో కొంత ఓట్లు చీల్చి.. ఆ మేరకు కమలం పార్టీ ప్రయోజనం పొందనుందని కొందరు విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే హస్తం పార్టీ చతికిల పడింది. బీజేపీ స్పీడు ముందు అధికార టీఆర్ఎస్సే బేజార్ అవుతోంది. ఇక కాంగ్రెస్ ఎంత? ఆ పార్టీ ఉనికి కోసమే తాపత్రయ పడాల్సిన దుస్థితి. దేశ వ్యాప్తంగా బీజేపీకి కాంగ్రెస్సే ప్రధాన శత్రువు కాబట్టి.. తెలంగాణలో హస్తం పార్టీని కోలుకోకుండా దెబ్బతీసి.. శాశ్వతంగా బొంద పెట్టాలనేది కాషాయం స్కెచ్ అనే టాక్. అందుకు.. షర్మిలే కరెక్ట్ అని.. ఆమెను రంగంలోకి దింపారని అంటున్నారు. కాంగ్రెస్ ను చీల్చడానికి.. కుదిరితే షర్మిల.. లేదంటే రేవంత్ రెడ్డిని వాడుకోవాలనేది బీజేపీ గేమ్ ప్లాన్ అని చెబుతున్నారు. మొదట కాంగ్రెస్ ఖతం అయ్యాక.. ఇక సెకండ్ ఎనిమీ కేసీఆర్ ను సైతం షర్మిల + రేవంత్ కాంబినేషన్ తో దెబ్బ కొట్టాలనేది కమలవ్యూహంలా కనిపిస్తోంది. 

ఇటు.. షర్మిల బలపడినా.. అటు, రేవంత్ రెడ్డి ఎమర్జ్ అయినా.. చివరాఖరికి.. నదులన్నీ సముద్రంలో కలిసినట్టుగా.. వారంతా బీజేపీలో మెర్జ్ అవుతారని అంటున్నారు. జగన్ తో బీజేపీ ఢిల్లీ పెద్దలు డీల్ కుదుర్చుకొని.. ఆయన డైరెక్షన్ లోనే తెలంగాణపై షర్మిల బాణం వదిలారని పొలిటికల్ సర్కిల్స్ లో డిస్కషన్ నడుస్తోంది. లేదంటే.. గెలిచే సత్తా లేని.. తెలంగాణ ప్రాంతమూ కానీ.. షర్మిల.. సడెన్ గా పార్టీ పెట్టడమేంటి? ఇదంతా.. కాంగ్రెస్, కేసీఆర్ కు చెక్ పెట్టడానికి.. కమలనాథుల కనుసన్నల్లో.. నడుస్తున్న మాస్టర్ ప్లాన్ అనే అంచనాకు వచ్చేశారు. మరి, షర్మిల రూపంలో.. తెలంగాణ పొద్దుపై పొడిచిన కొత్త పార్టీ.. ఏ మేరకు సక్సెస్ అవుతుందో? ఏ మేరకు.. హస్తాన్ని డ్యామేజ్ చేసి.. గులాబీ దళాన్ని ఢీ కొడుతుందో కాలమే డిసైడ్ చేస్తుంది.. అందాకా.. పోరుగడ్డపై పొలిటికల్ ఫైట్ యమ రంజుగా సాగనుంది....