టీఆర్ఎస్ ఎప్పుడూ వీకే! విపక్షాల బలహీనతే కేసీఆర్ బలం 

తెలంగాణలో మరో మూడు టర్మ్ లు టీఆర్ఎస్ దే అధికారం. తెలంగాణ ప్రజలు కారును తప్ప మరో పార్టీని గెలిపించరు.. ఇదీ టీఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎప్పుడూ చెప్పే మాటలు. కేసీఆర్, కేటీఆర్ ప్రకటనలు వినేవారు నిజంగానే తెలంగాణలో టీఆర్ఎస్ చాలా బలంగా ఉందని నమ్ముతుంటారు. పాలనలో కేసీఆర్ నిర్ణయాలు కూడా అలానే ఉంటాయి, రాష్ట్ర్ర భవిష్యత్ కు సంబంధించిన కీలక అంశాలపైనా సొంతంగానే నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతిపక్షాలను కనీసం లెక్కలోకి తీసుకోరు. తెలంగాణ మొత్తం తన సొంతమనే తీరుగా ఆయన పోకడలు ఉంటాయనే ఆరోపణలున్నాయి. అయితే తాజాగా జరిగిన దుబ్బాక ఉప ఎన్నికతో టీఆర్ఎస్ బలమెంతో తెలిసొచ్చింది. అధికార పార్టీగా ఉండి తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది టీఆర్ఎస్, ఎమ్మెల్యే చనిపోవడంతో ఆయన భార్యే పోటీ చేసినా.. ఆ సెంటిమెంట్ ఉన్నా దుబ్బాకలో గట్టెక్కలేకపోయింది గులాబీ పార్టీ.    దుబ్బాక బైపోల్ ఫలితంతో తెలంగాణ రాజకీయాల్లో సమూల మార్పులు జరిగే అవకాశాలున్నాయి. తమకు తిరుగేలేదనే భ్రమలో ఉన్న టీఆర్ఎస్ కు కౌంట్ డౌన్ మొదలైందనే చర్చ జరుగుతోంది. నిజానికి తెలంగాణలో ఎప్పుడూ టీఆర్ఎస్ బలంగా లేదు. రెండు సార్లు అధికారంలోకి వచ్చినా.. ఆ పార్టీకి వచ్చిన ఓట్లు గొప్పగా ఏమి లేవు, గత ఎన్నికల ఫలితాలను చూస్తేనే ఇది అర్ధమవుతుంది. బోగస్ ఓట్లు, బోటాబోటీ మెజార్టీలు, ఈవీఎం మిషన్లు, కౌంటింగులో అవకతవకలు.. ఇలాంటి అంశాలు కలిసి రావడం వల్లే టీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చిందని, ఎన్నికల లెక్కలు చూస్తే ఆ పార్టీ బలమేంటో  తెలుస్తుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. దుబ్బాక ఫలితంలో ఇది రుజువైందని చెబుతున్నారు.    2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. కేసీఆర్ వల్లే తెలంగాణ సాధ్యమైందని ప్రజలంతా భావించారు. ఆ సమయంలోనే 2014లో జరిగిన తెలంగాణ తొలి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 63 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. మేజిక్ ఫిగర్ కు మూడు సీట్లే ఎక్కువొచ్చాయి ఆ పార్టీకి. ఇక ఓట్ల పరంగా చూస్తే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వచ్చిన ఓట్లు 33. 2 శాతమే. అంటే దాదాపు 67 శాతం మంది తెలంగాణ ఓటర్లు కేసీఆర్ కు , టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓట్లు వేశారన్నమాట. ఇక గెలిచిన 63 సీట్లలోనూ 10 నియోజకవర్గాల్లో మెజార్టీ 2 వేల లోపే ఉంది. అక్కడ కొంచెం తారుమారైనా గులాబీకి పవర్ దక్కేది కాదు. ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన ఉద్యమపార్టీ నేతగా వెలుగొందిన కేసీఆర్ కు.. తెలంగాణ తొలి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 33 శాతం ఓట్లే రావడం నిజంగా అశ్చర్యమే. లెక్కలు ఇలా ఉంటే కేసీఆర్ మాత్రం తెలంగాణ ప్రజలంతా తనవెంటే ఉన్నారంటూ గొప్పలు చెప్పుకుంటూ వస్తున్నారు.    2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధించింది టీఆర్ఎస్. అయితే అందుకు సవాలక్ష కారణాలు, ప్రభుత్వ కుట్రలు కనిపిస్తున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలిచింది గులాబీ పార్టీ. 46.9 శాతం ఓట్లు సాధించింది. గెలిచిన 88లో దాదాపు 15 నియోజకవర్గాల్లో బోటాబోటీ మెజార్టీతో చివరి రౌండ్లలో బయటపడ్డారు టీఆర్ఎస్ అభ్యర్థులు. ఇబ్రహీంపట్నం, కొప్పుల ఈశ్వర్ ధర్మపురిలో మెజార్టీ వందల్లోనే ఉంది. తుంగతుర్తి, వికారాబాద్, కోదాడలో టీఆర్ఎస్ అభ్యర్థులు చివరి రౌండులో గెలిచారు. స్వల్ప మెజార్టీతో టీఆర్ఎస్ గెలిచిన నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపుపై  చాలా ఆరోపణలున్నాయి. ఇబ్రహీంపట్నం, ధర్మపురిలో ఎంతగా మెత్తుకున్నా రీకౌంటింగ్ కూడా చేయలేదని కాంగ్రెస్ అభ్యర్థులు ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ఎన్నికల రిటర్నింగ్ అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. ఎన్నికల కౌంటింగ్ లో అక్రమాలు జరిగాయని, ఈవీఎంలు మార్చారనే ఆరోపణలు వచ్చాయి. ఓడిపోయిన కొందరు అభ్యర్థులు కోర్టుకు కూడా వెళ్లారు. ఇంకా ఆ కేసులు నడుస్తూనే ఉన్నాయి.   2018 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మరో కీలక అంశం ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో దాదాపు 28 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి.   కొన్ని లక్షల కొత్త ఓట్లు రాత్రికి రాత్రే వచ్చి చేరాయి. అధికార పార్టీ కనుసన్నలోనే ఇదంతా జరిగిందని, తమకు ఇబ్బంది కాకుండా ఓటర్ లిస్టులతో మార్పులు చేర్పులు చేసిందనే విపక్షాలు ఆరోపించాయి. కోర్టుకు కూడా వెళ్లాయి. అయితే ఓట్ల తొలగింపునకు సంబంధించిన అప్పటి ఎన్నికల ప్రధానాధికారి కూడా కోర్టులో ఈ విషయాన్నిఅంగీకరించారు. 28 లక్షల ఓట్లు గల్లంతైందని నిజమేనని, కాని ఇప్పుడు చేసేదేమి లేదని, లోక్ సభ ఎన్నికల నాటికి ఓటర్ లిస్టులను సరి చేస్తామని అప్పటి ఎన్నికల అధికారి రజత్ కుమారే స్వయంగా చెప్పారు. 2018లో మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి ఇది కూడా ముఖ్య కారణమని విపక్షాలు ఇప్పటికి ఆరోపిస్తూనే ఉన్నాయి.   ఓటర్ లిస్టులు సరిచేశాక జరిగిన 2019 లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అసలు బలమేంటో తెలిసొచ్చింది. రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆరు నెలల్లోపే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కారు పార్టీ ఏకంగా ఏడు సీట్లు కోల్పోయింది. నిజానికి లోక్ సభ ఎన్నికల సమయానికి టీఆర్ఎస్ కార్యకర్తలు అసెంబ్లీ గెలుపు జోష్ లోనే ఉన్నారు. విపక్షాలు ఓటమి నిరాశలోనే ఉన్నాయి. అయినా లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏడు సీట్లు కోల్పోవడం., సీఎం కేసీఆర్ కూతురే నిజామాబాద్ లో ఓడిపోవడం సంచలనమైంది. 2018 డిసెంబర్ లో 88 అసెంబ్లీ సీట్లు గెలిచి రెండోసారి పవర్ చేపట్టిన టీఆర్ఎస్.. ఆరు నెలల్లోనే దాదాపు 55 నియోజకవర్గాల్లో వెనకబడిపోవడం అందరిని అశ్చర్యపరిచింది. బోగస్ ఓట్లు లేకుండా, లక్షలాది ఓట్లను తొలగించకుండా 2018 అసెంబ్లీ ఎన్నికలు పారదర్శకంగా జరిగితే లోక్ సభకు వచ్చిన ఫలితాలే అప్పుడు కూడా వచ్చేవేమోననే అనే అభిప్రాయం కొన్ని వర్గాలు, రాజకీయ అనలిస్టుల నుంచి వినిపించాయి.    మొత్తంగా దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంతో తెలంగాణలో టీఆర్ఎస్ అందరూ అనుకున్నట్లుగా బలంగా లేదని, విపక్షాలు బలహీనంగా ఉండటమే కేసీఆర్ బలమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దుబ్బాకలో బీజేపీ గట్టి పోరాటం చేయడంతో ప్రజలు ఆ పార్టీని అదరించారని చెబుతున్నారు. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఉంటామని ఏ పార్టీ నిరూపించుకున్నా.. ఆ పార్టీకి తెలంగాణ ప్రజల మద్దతు దొరికే అవకాశం ఉందంటున్నారు. దుబ్బాక ఫలితం విపక్షాలకు టానిక్ లా మారే అవకాశం ఉందని, రానున్న రోజుల్లో కారు పార్టీకి కష్టాలు తప్పకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

గులాబీకి గుబులేనా! కమలం ఖాయమేనా! కాంగ్రెస్ కథేంటో?

కారుకు కౌంట్ డౌన్ మొదలైనట్టేనా? తెలంగాణలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోనున్నాయా? కాంగ్రెస్ ఫ్యూచరేంటీ? దుబ్బాక ఉప ఎన్నిక ఫలిత తర్వాత తెలంగాణ ప్రజల్లో జరుగుతున్న చర్చ ఇది. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడిన దుబ్బాక ఉప ఎన్నికలో కమలం పార్టీ కత్తిలాంటి  విజయం సాధించింది. తెలంగాణలో తమకు తిరుగులేదని భావిస్తున్న కేసీఆర్ పార్టీకి చుక్కలు చూపించింది బీజేపీ. ఉప ఎన్నికలో అధికార పార్టీని ఓడించి సత్తా చాటింది. దుబ్బాక విజయంతో టీఆర్ఎస్ కు బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా మారింది బీజేపీ. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మరింత బలపడే అవకాశం ఉంది. అదే జరిగితే కేసీఆర్ పార్టీకి కష్టాలు వచ్చినట్లేనని భావిస్తున్నారు. దుబ్బాక ఫలితంతో తెలంగాణ రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోనున్నాయని భావిస్తున్నారు.    తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్ అధికారంలో ఉంది. దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్న సీనియర్ నేత సోలిపేట రాంచంద్రారెడ్డి చనిపోయారు. సోలిపేట చనిపోవడంతో జరిగిన ఉప ఎన్నిక కాబట్టి సెంటిమెంట్ కూడా ఉంది. అంటే అధికారంతో పాటు సెంటిమెంట్ ఉన్నా ఉప ఎన్నికలో ఓడిపోవడం టీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాకే. అంతేకాదు సీఎం కేసీఆర్ సొంత జిల్లాలో ఉంది దుబ్బాక నియోజకవర్గం. ప్రస్తుతం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ కు పక్క నియోజకవర్గమే. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల, సిద్ధిపేట నియోజకవర్గాలు దుబ్బాకకు పక్కనే ఉన్నాయి. ఈ లెక్కన దుబ్బాక టీఆర్ఎస్ ముఖ్యనేతల సొంత గడ్డ. అయినా దుబ్బాక ఉప ఎన్నికలో ఓడిపోవడంతో  టీఆర్ఎస్ కు గడ్డు కాలం వచ్చిందనే సంకేతమిస్తోంది.    గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఎక్కువ సార్లు టీఆర్ఎసే విజయం సాధించింది. ఉద్యమ సమయంలోనూ, అధికారంలోకి వచ్చాకా కూడా జరిగిన ఎన్నికల్లో అది సత్తా చాటింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చనిపోవడంతో ఉప ఎన్నిక జరిగిన నారాయణ్ ఖేడ్, పాలేరులోనూ సెంటిమెంట్ ను అధిగమించి ఘన విజయాలు సాధించింది టీఆర్ఎస్. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కంచుకోటగా చెప్పుకునే హుజూర్ నగర్ ఉప ఎన్నికలోనూ సూపర్ విక్టరి కొట్టింది. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పోల్ మేనేజ్ మెంట్ అద్భుతంగా ఉంటుందని చెబుతుంటారు. కేసీఆర్ రచించే ప్రణాళికలు విపక్షాలకు అందవని, అందుకే ఎక్కువగా గెలుస్తుంటారనే చర్చ కూడా ఉంది. అయితే అన్ని అనుకూలతలు ఉన్నా, అధికార పార్టీగా ఉండి కూడా దుబ్బాకలో ఓడిపోవడం టీఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.    2018 అసెంబ్లీ ఎన్నికల్లో సోలిపేట రామలింగారెడ్డి 62 వేల 5 వందల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సోలిపేటకు 54.36 శాతం ఓట్లు రాగా.. కాంగ్రెస్ కు 16 శాతం ఓట్లు వచ్చాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘునందన రావుకు కేవలం  22,595 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. కాని 20 నెలల్లోనే సీన్ పూర్తిగా మారిపోయింది. దుబ్బాక ఉప ఎన్నికలో దాదాపు 45 శాతం ఓట్లు సాధించారు రఘునందన్ రావు. అంటే గతంతో పోలిస్తే 32 శాతం ఓట్లు ఎక్కువ సాధించారు. అంటే అధికార పార్టీపై ప్రజా వ్యతిరేకత ఏ రేంజ్ లోఉందో  ఊహించవచ్చు. 20 నెలల్లోనే టీఆర్ఎస్ పార్టీ 15 శాతానికి పైగాఓట్లు కోల్పోవడం సామన్య విషయం కాదంటున్నారు అనలిస్టులు. అది కూడా అధికార పార్టీలో ఉపఎన్నికను ఎదుర్కొంటూ.. ఈ స్థాయిలో పతనం కావడం అంటే ఆ పార్టికి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనే విషయం స్పష్టం అవుతుందంటున్నారు.    ఇక దుబ్బాక ఉప ఎన్నిక  ఫలితం కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కు గొడ్డలి పెట్టుగా మారే అవకాశం ఉంది. ఇంతకాలం టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ దుబ్బాక ఫలితంతో షేకవుతోంది. దుబ్బాక జోష్ తో బీజేపీ దూకుడు పెంచి మరింత బలపడితే కాంగ్రెస్ మనుగడకే కష్టమని కొందరు కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. నిజానికి దుబ్బాకను కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. పీసీసీ ముఖ్య నేతలంతా ప్రచారం చేశారు. నియోజకవర్గంలోని 145 గ్రామాలకు 145 మంది నేతలను ఇంచార్జులుగా నియమించింది. వారంతా పార్టీ గెలుపు కోసం కష్టపడ్డారు. అయినా  గతంలో కంటే ఓట్లు తగ్గడం ఆ పార్టీ నేతలను కలవరపెడుతోంది. గెలవకపోయినా రెండో స్థానంలో నిలిచినా సరిపోయేదని,, ఇలా మూడో స్థానానికి పడిపోవడం తమకు తీరని నష్టమంటున్నారు. దీని ప్రభావం పార్టీపై ముందు ముందు ఎలా ఉంటుందో చెప్పలేమని కొందరు కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   మొత్తంగా దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ విజయంతో తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు జరగబోతున్నాయనే చర్చే ఎక్కువగా జరుగుతోంది. అధికార టీఆర్ఎస్ కు కౌంట్ డౌన్ మొదలయినట్టేనని బీజేపీ నేతలు చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాకలో పాగా వేయడం ఖాయమంటున్నారు. చూడాలి మరీ తెలంగాణ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో...

కేటీఆర్ కామెంట్ల అర్ధమేంటీ! దుబ్బాక కారుకు కష్టమేనా?

తెలంగాణ రాజకీయాలను హీటెక్కించిన దుబ్బాక ఉపఎన్నిక ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాయి. మెజార్టీ సర్వే సంస్థలు అధికార టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని అంచనా వేశాయి. అయినా అధికార పార్టీ నేతల్లో మాత్రం టెన్షన్ కనిపిస్తోంది. దుబ్బాక ఎన్నికలో అంతా తానే వ్యవహరించిన ట్రబుల్ షూటర్ మంత్రి హరీష్ రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెన్షన్ పడుతున్నట్లుగా ఉందని చెబుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి టీఆర్ఎస్ ముఖ్య నేతల ముఖాల్లో ఆందోళన కనిపిస్తోందని తెలంగాణ భవన్ లోనే చర్చ జరుగుతుందట. తాజాగా మంత్రి కేటీఆర్ చేసిన ఓ ప్రకటన కూడా గులాబీ పార్టీలో దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం గుబులు రేపుతుందనే సంకేతమిస్తోంది.    గ్రేటర్ వరద సాయంపై విపక్షాల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చిన కేటీఆర్.. దుబ్బాక ఉప ఎన్నికపైనా మాట్లాడారు. దుబ్బాకలో కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రాదన్నారు. అయితే కేంద్ర సర్కార్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ దుబ్బాకలో బీజేపీ పరిస్థితి ఏంటో మాత్రం కేటీఆర్ చెప్పలేదు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దుబ్బాకలో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే హోరాహోరీ పోరు జరిగిందని పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు డిపాజిట్ రాదని చెప్పిన కేటీఆర్.. బీజేపీ గురించి మాట్లాడకపోవడం టీఆర్ఎస్ నేతలను గందరగోళానికి గురి చేస్తోంది. దుబ్బాక ప్రచారంలో తమకు లక్ష ఓట్ల మెజార్టీ వస్తుందని టీఆర్ఎస్ నేతలు చెప్పారు. ఈ లెక్కన టీఆర్ఎస్ కు లక్ష ఓట్ల మెజార్టీ వస్తే ఇతర పార్టీలకు డిపాజిట్లు గల్లంతు కావాలి. అయితే కాంగ్రెస్ కు డిపాజిట్ రాదని చెప్పిన కేటీఆర్.. బీజేపీ గురించి మాట్లాడకపోవడం ద్వారా దుబ్బాకలో తమకు గట్టిపోటీ ఎదురైందని చెప్పకనే చెప్పినట్లైందని  రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.    దుబ్బాక ఉప ఎన్నికపై వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కూడా గులాబీ నేతలను కలవరపెడుతున్నాయని అంటున్నారు. తాజాగా ఎగ్జిట్ పోల్ సర్వే వివరాలు ప్రకటించిన మిషన్ చాణక్య .. బీజేపీకి ఏకంగా  51.82 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. టీఆర్ఎస్ కు 35.67 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని వెల్లడించింది. మిషన్ చాణక్య సర్వే ప్రకారం బీజేపీ 16 శాతానికి పైగా ఓట్లతో కారు కంటే ముందుంది. అంటే దాదాపు 30 వేల ఓట్లకు ఎక్కువే. ఇదే ఇప్పుడు కారు పార్టీ నేతలకు నిద్ర లేకుండా చేస్తుందంటున్నారు. దుబ్బాక పోలింగ్ ముగియగానే తమ సర్వే వివరాలు ప్రకటించిన పొలిటికల్ లేబొరేటరీ సంస్థ కూడా బీజేపీకి 47 శాతం ఓట్లు, కారుకు 38 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. అయితే పొలిటికల్ లేబొరేటరీ సంస్థ సర్వే ఫలితాలను కొట్టిపారేసిన కారు పార్టీ నేతలు.. మిషన్ చాణక్య  అంచనాలతో మాత్రం ఆందోళన పడుతున్నారని తెలుస్తోంది.    తాజాగా వచ్చిన ఆరా సంస్థ ఎగ్జిట్ ఫలితాలు టీఆర్ఎస్ ను మరింత షేక్ చేస్తున్నాయని చెబుతున్నారు. నిజానికి ఆరా సంస్థ అంచనాల్లో కారుకే లీడ్ ఉంది. అయితే అది స్వలంగా ఉంది. టీఆర్ఎస్ కు 47.72 శాతం, బీజేపీకి 44.6 శాతం ఓట్లు వస్తాయని ఆరా తెలిపింది. ఇందులో మూడు శాతం అటు ఇటుగా జరగవచ్చని కూడా సంస్థ వెల్లడించింది. అంటే ఆరా సంస్థ అంచనా ప్రకారం దుబ్బాక బైపోల్ లో ఎవరైనా గెలవొచ్చు. ఇదే ఇప్పుడు కారులో కంగారు పెంచుతోందంటున్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 100 సీట్లు వస్తాయని ఆరా సంస్థ ఎగ్జిట్ పోల్స్ ఇవ్వగా ముందు అంతా అశ్చర్యపోయారు. అసంభవమని భావించారు. అయితే గ్రేటర్ ఫలితాల్లో ఆరా సంస్థ అంచనాలే నిజమయ్యాయి. అప్పటి నుంచి ఆరా సంస్థ కేటీఆర్ కు సర్వేల్లో అత్యంత నమ్మకంగా మారిందంటున్నారు. టీఆర్ఎస్ తరపున కేటీఆర్ నిర్వహించే సర్వేలన్ని ఆరాకే ఇస్తారని తెలుస్తోంది.    తమకు నమ్మకమైన ఆరా సంస్థ కూడా హోరాహోరీ పోరు జరిగిందనే అంచనాలు ఇవ్వడంతో కేటీఆర్ దుబ్బాక ఫలితంపై టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది. దుబ్బాక పోలింగ్ తర్వాత మంత్రి హరీష్ రావు కామెంట్లు కూడా.. టీఆర్ఎస్ కు అనుకున్నట్లు పోలింగ్ జరగలేదనే సంకేతమిచ్చింది. బీజేపీ సోషల్ మీడియా ద్వారా ఫేక్ ప్రచారం చేసిందని, కాంగ్రెస్ అభ్యర్థి టీఆర్ఎస్ లో చేరుతున్నారంటూ దుర్మార్గ ప్రచారం చేసిందని హరీష్ రావు ఆరోపించారు. హరీష్ మాటలను బట్టి దుబ్బాకలో టీఆర్ఎస్ కు తీవ్ర పోటీ ఎదురైందని చెప్పక తప్పదు. అంతేకాదు పోలింగ్ రోజు తర్వాత నుంచి హరీష్ రావు ఎక్కడా కనిపించడం లేదు. దుబ్బాక ఫలితం గురించి కూడా ఆయన మాట్లాడటం లేదు. ఇవి కూడా టీఆర్ఎస్ నేతల్లో పలు అనుమానాలను కల్గిస్తున్నాయి. దుబ్బాకలో ఏదైనా జరగవచ్చని వారంతా భయపడుతున్నట్లు తెలుస్తోంది.    దుబ్బాక ఉప ఎన్నికపై ఇప్పటివరకు వచ్చిన ఎగ్టిజ్ పోల్స్ లో ఒక్క నాగన్న సర్వేలో మాత్రమే టీఆర్ఎస్ కు 50 శాతానికి పైగా ఓట్లు వస్తాయని తేలింది.  మొత్తంగా కేటీఆర్ తాజా కామెంట్లు, హరీష్ రావు సైలెంట్ ను బట్టి దుబ్బాక ఉప ఎన్నిక టీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దుబ్బాక ఫలితం గులాబీకి వ్యతిరేకంగా వచ్చినా అశ్చర్యం లేదంటున్నారు.

ఖజానా నిల్.. ఉద్యోగుల డీఏ చెల్లింపులు బంద్! ఏపీ ఫ్యూచరేంటో? 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. రాష్ట్ర ఖజానాలో పైసా కూడా లేని పరిస్థితి వచ్చింది. కనీసం ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏను కూడా చెల్లించలేని హీన దుస్థితికి చేరుకుంది ఆంధ్రప్రదేశ్. రెండు రోజుల క్రితమే ఉద్యోగులకు డీఏ ప్రకటించింది జగన్ సర్కార్. 2018 జులైలో పెంచిన 3.144 శాతం కరువు భత్యం మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే కొన్ని గంటల్లోనే యూటర్న్ తీసుకుంది. జనవరి 1, 2020 నుంచి ఉద్యోగులకు ఇవ్వాల్సిన  డీఏ అదనపు వాయిదా చెల్లింపులూ ఆపేసింది. జనవరి 1, 2020 నుంచి జూన్‌ 30, 2021 వరకు చెల్లించాల్సిన బకాయిలు కూడా చెల్లించే పరిస్థితి లేదని తేల్చేసింది ఏపీ ప్రభుత్వం.                                     ఉద్యోగుల డీఏ చెల్లింపులు వాయిదా వేసిన ఏపీ ప్రభుత్వం.. తమపై విమర్శలు రాకుండా తెలివిగా వ్యవహరించింది. ఆ నెపాన్ని కేంద్రంపై వేసి తప్పించుకునే ప్రయత్నం చేసింది. కోవిడ్ , లాక్‌డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా ఆదాయం పడిపోవడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం జూలై 2021 వరకు డీఏ చెల్లింపు నిలిపేసింది. ఇదే కారణం చూపుతూ జగన్ సర్కార్ కూడా ఉద్యోగుల చెల్లింపుల నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. చెల్లింపులు వాయిదా వేస్తూ తాజాగా ఇచ్చిన జీవోలో కేంద్రం నిర్ణయాన్ని కూడా పొందుపరిచింది. రాష్ట్రం కూడా అదే  పరిస్థితుల్లో ఉండటంతో కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా ఈనిర్ణయం తీసుకున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.   ఏపీ ఉద్యోగులకు 3.144 శాతం కరువు భత్యం మంజూరు చేస్తూ ప్రభుత్వం ఈనెల 4న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మొత్తం డీఏ  27. 248 నుంచి 30.392కు పెరిగింది. 2021 జనవరి జీతాలతో కలిపి క్యాష్ రూపంలో చెల్లింపులు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 2018 జులై 1 నుంచి 2020 డిసెంబర్ 31 వరకు మొత్తం 30 నెలల బకాయిల్ని  3 సమభాగాల్లో పీఎఫ్‌ ఖాతాల్లో జమ చేస్తామని జీవోలోనే పేర్కొంది. సీపీఎస్ వారికైతే 30 నెలల ఎరియర్స్ 90 శాతం నగదుతో పాటు 10 శాతం పాన్ అక్కౌంట్ కు జనవరి జీతాల చెల్లింపు అనంతరం అంటే 3 సమాన భాగాల్లో జమ చేస్తామని వివరించింది. ప్రభుత్వ ప్రకటనతో సంతోషించిన ఉద్యోగులకు కొన్నిగంటల్లోనే నిరాశ మిగిల్చింది జగన్ సర్కార్.     డీఏ చెల్లింపులు వాయిదా వేస్తూ సర్కార్ ఇచ్చిన తాజా జీవోపై ఏపీ ఉద్యోగులు భగ్గుమంటున్నారు. రెండేళ్లుగా పెండింగ్ ఉన్న బకాయిలను మళ్లీ వాయిదా వేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులకు డీఏ ఇవ్వలేని పరిస్థితికి ఏపీ దిగజారిపోయిందా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. రెండు రోజుల క్రితం జీవో ఇచ్చినప్పుడు  కేంద్రం నిర్ణయం తెలియదా అని ప్రశ్నిస్తున్నారు ఉద్యోగులు, ఉద్యోగులకు ప్రకటించిన జీవో 3.114 శాతం. డీఏగా ప్రభుత్వం అదనంగా ఇచ్చే డబ్బులు వందల కోట్లలోనే ఉంటాయని చెబుతున్నారు. అలాంటి వందల కోట్ల రూపాయలు కూడా చెల్లంచలేక సర్కార్ చేతులెత్తేస్తే.. రాష్ట్ర భవిష్యత్ ఎలా ఉంటుందో అర్ధం కావడం లేదనే ఆందోళన ఉద్యోగులు, జనాల్లో వ్యక్తమవుతోంది.    మరోవైపు నవంబర్ నెలలో వారం రోజులు గడిచినా.. ఏపీలోని ఇంకా  40 శాతం ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్‌ ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు అందలేదని తెలుస్తోంది.  రాష్ట్ర ఖజానాలో నికధులు లేకపోవడంతో  ఆర్థికశాఖ ఏం చేయలేని పరిసత్థిలో ఉంది. కొవిడ్‌ విధుల కోసం నాలుగు నెలల క్రితం కొత్తగా భర్తీ చేసుకున్న వైద్యులు ఇప్పటి వరకు  నెల జీతమూ కూడా తీసుకోలేదట. రాష్ట్రానికి అప్పుల సమీకరణకు ఉన్న అవకాశాలన్నీ మూసుకుపోవడంతో ఈ గండం తలెత్తిందని ఉన్నతాధికారులు చెబుతున్నారు.    ఆర్థిక గండం నుంచి గట్టెక్కేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అప్పుల కోసం బ్యాంకులతో ప్రభుత్వం వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. గురువారం సచివాలయంలో ఐదు బ్యాంకులతో ఆర్థికశాఖ అధికారులు అప్పుల కోసం చర్చలు జరిపారు. తక్షణమే రూ. 6,000 వేల కోట్లు అప్పు కావాలని బ్యాంకర్లను కోరగా..  ప్రస్తుతం ప్రభుత్వానికి గ్యారంటీ స్పేస్‌ రూ. 6000 కోట్లు మాత్రమే ఉండడంతో .. ఆ ఐదు  బ్యాంకులు కలిసి ఆ మొత్తం ఇచ్చేందుకు అంగీకరించినట్టు తెలిసింది.  ఖజానాలో ఆ నిధులు జమ కాగానే పెన్షనర్లకు, మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు ఇవ్వలాని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో సోమవారం వరకూ ఇది జరిగే అవకాశం ఉందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.    జగన్ సర్కార్ అస్తవ్యస్థ విధానాల వల్లే ఏపీ ఖజానా ఖాశీ అయిందని జనాలు ఆరోపిస్తున్నారు. ఆర్థిక నియంత్రణ లేకుండా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం వల్లే గడ్డు పరిస్థితులు వచ్చాయంటున్నారు ఆర్థిక శాఖ నిపుణులు. జగన్ ప్రభుత్వం జవాబుదారి తనం లేకుండా ముందుకు వెళుతుందని, అడ్డగోలుగా నిధులు ఖర్చు చేస్తుందనే ఆరోపణలు మొదటి నుంచి వస్తున్నాయి. తమ సొంత ఇమేజ్ పెంచుకోవడానికి, ప్రజల్లో క్రేజీ పొందాలనే ఉద్దేశ్యంతో అవసరం లేని వాటికి భారీగా నిధులు ఖర్చు  చేస్తూ.. అత్యంత కీలకమైన వాటిని విస్మరిస్తున్నారని చెబుతున్నారు. ఖజానా ఖాళీ అయిందంటే రాష్ట్రం దివాళా తీసినట్టేనని వారు  చెందుతున్నారు. ఏ ప్రభుత్వానికికైనా ఆర్థిక నిర్వహణే అతి ముఖ్యమైన,, అది గాడి తప్పిదే తలెత్త పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఉద్యోగులకు జీతాలు సమయానికి ఇవ్వలేని పరిస్థితి రావడం కలవరం కల్గించే విషయమని చెబుతున్నారు.

‘కమలం’ కోర్ కమిటీపై కిరికిరి!

సునీల్-మధుకర్ ఏం చేస్తున్నట్లు?   సస్పెన్షన్లు, సమావేశాలపై చర్చించరేం?   సొంత నిర్ణయాలపై నేతల సీరియస్   క్రమశిక్షణ ఆరోప్రాణంగా చెప్పబడే భారతీయ జనతా పార్టీలో.. ఇప్పుడు అదే లోపించిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సమిష్ఠి నిర్ణయాల స్ధానంలో,  ఒకరిద్దరు తీసుకుంటున్న నిర్ణయాలపై సీనియర్లతోపాటు, కొత్తగా పార్టీలో చేరిన నేతలు భగ్గుమంటున్నారు. పార్టీపరంగా ప్రజల్లోకి వెళ్లలేకపోతున్న నాయకత్వం, వివాదాల్లో మాత్రం శరవేగంగా దూసుకుపోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా.. కోర్ కమిటీ రూపకల్పన, ఆ పేరుతో పిలుస్తున్న ఆహ్వానితుల జాబితాపై పార్టీ ఎంపీలు సైతం రుసరుస లాడుతున్నారు.   ఏపీ బీజేపీలో లుకలుకలు పెరుగుతున్నాయి. సస్పెన్షన్లు, మీడియా చర్చలకు వెళ్లే ప్రతినిధుల జాబితా కూర్పుపై.. రాష్ట్ర అధ్యక్షుడు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై, వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సోము వీర్రాజు అధ్యక్షడయి చాలాకాలమయింది. అయినా ఇప్పటివరకూ, కోర్ కమిటీ కూర్పుపై.. సీనియర్లతో సమావేశం నిర్వహించకపోవడంపై, అగ్రనేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కోర్ కమిటీ ఏర్పాటుచేస్తే, అందులో కీలక నిర్ణయాలపై చర్చించే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏకపక్ష నిర్ణయాలకు అవకాశం తక్కువగా ఉంటుంది. అందువల్లనే, కోర్ కమిటీ ఏర్పాటుచేయకుండా, కేవలం ఒకరిద్దరే స్వంత నిర్ణయాలు తీసుకుంటున్నారని చెబుతున్నారు.   కోర్ కమిటీ ఏర్పాటుచేస్తే, అందులో తమ నిర్ణయాలను ప్రతిఘటన ఉండే ప్రమాదం ఉన్నందున, సాధ్యమయినంత వరకూ ఆలస్యం చేసి, ఈలోగా కావలసిన నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ముగ్గురు ఎంపీలు రాష్ట్ర నాయకత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తున్నందున, వారిని కోర్ కమిటీలో లేకుండా చూసేందుకే ఆలస్యం చేస్తున్నారంటున్నారు.   ఇటీవల విశాఖలో ఏర్పాటుచేసిన కోర్ కమిటీ సమావేశానికి.. యుపి ఎంపి జీవీఎల్ నరసింహారావును మాత్రమే పిలిచి, రాష్ట్ర ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను ఆహ్వానించకపోవడం వివాదానికి దారితీసింది. అసలు సాంకేతికంగా ఏపీతో ఏమాత్రం సంబంధం లేని జీవీఎల్, కోర్‌మిటీలో ఎలా సభ్యుడవుతారన్న ప్రశ్నలు వినిపించాయి. ఇన్చార్జి సునీల్ దియోధర్, సంఘటనా కార్యదర్శి నూకల మధుకర్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. కేవలం జీవీఎల్ సూచనల ప్రకారం పనిచేస్తున్నారని, ప్రస్తుతం పార్టీని జీవీఎల్లే నడిపిస్తున్నారన్న  వ్యాఖ్యలు, పార్టీ నేతల అంతర్గత సమావేశాల్లో వినిపిస్తూనే ఉన్నాయి. కొత్త కమిటీ వేయనందున, గతంలో వేసిన కోర్ కమిటీ ఇప్పుడు పనిచేస్తుందా? లేదా? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. కోర్‌కమిటీలో సబ్ కమిటీ వేసి, మళ్లీ దానిపై ఇంకో మినీ కోర్ కమిటీ వేసినట్లున్నారన్న వ్యంగ్య వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.   ఇటీవలి విశాఖ భేటీలో.. కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ వ్యాఖ్యలు చర్చకు వచ్చాయట. ఆమెను ఓ ప్రధాన కార్యదర్శి విమర్శించడం మంచిదికాదని, మహిళలకు గౌరవం ఇవ్వాలని, భేటీలో పాల్గొన్న పురందీశ్వరి మందలించారట. అయితే అక్కడే ఉన్న రాష్ర్ట ఇన్చార్జి సునీల్ దియోధర్ మాత్రం, అందుకు భిన్నంగా.. ప్రధానిని వాడు, వీడు అని సంబోధించినా ఎవరూ స్పందించలేదని, ఒక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాత్రమే స్పందించారని మెచ్చుకున్నారట. అయితే అసలు సుంకరపద్మశ్రీ ప్రధానిని దూషిస్తూ, ఏ పత్రికలు, చానెళ్లలో వచ్చిందో తాము చూడలేదని, ఆ పేరుతో ప్రధాన కార్యదర్శి మహిళను దూషిస్తే, ఆయనను సునీల్ సమర్థించడంపై నేతలు విస్మయం వ్యక్తం చేశారట.   ఇక పార్టీ వాణి బలంగా వినిపించే ఓవి రమణ, వెలగపూడి గోపాలకృష్ణ, తాజాగా లంకాదినకర్‌ను సస్పెండ్ చేసిన సందర్భంలో.. నాయకత్వం తమను సంప్రదించకపోవడంపై సీనియర్లు, ఎంపీలు ఆగ్రహంతో ఉన్నారు. ఆ ముగ్గురు చేసిన తప్పేమిటో చెప్పకుండా, నిబంధనల ప్రకారం షోకాజ్ నోటీసు ఇవ్వకుండా.. ఏకంగా సస్పెండ్ చేయడంపై నిరసన వ్యక్తమవుతోంది. వీరిలో రమణ,అమరావతిపై పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలనే పత్రికలో వ్యాసం రాయగా, ఆయనపై వేటు వేశారు. ఇక పార్టీ ఆఫీసుకు వెయ్యి గజాల స్థలం ఇచ్చి, ఆఫీసు కూడా నిర్మించేందుకు సిద్ధమయిన వెలగపూడి గోపాలకృష్ణ,  తనను తాను చెప్పుతో కొట్టుకుంటే..  ఆయనపైనా వేటు వేశారు.అయితే.. ఆయనను వెంటనే జాతీయ హిందూమహాసభకు, రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడంతో బీజేపీ నేతలు ఖంగుతినాల్సి వచ్చింది.   జాతీయ మీడియాలో పార్టీ వాణిని,  సమర్థవంతంగా వినిపిస్తున్న లంకా దినకర్‌పై వేటు వ్యవహారమయితే.. ఢిల్లీ వరకూ వెళ్లింది. జాతీయ నాయకులు సైతం ఆయనపై వేటు వార్త విని ఆశ్చర్యం వ్యక్తం చేశారట. ఇద్దరు ఎంపీలు కూడా.. దీనిపై అధ్యక్షుడు నద్దా, పార్టీ  సంఘటనా జాతీయ ప్రధాన కార్యదర్శి, సంయుక్త ప్రధాన కార్యదర్శికీ  ఫిర్యాదు చేశారట. స్వయంగా నద్దా సమక్షంలోనే పార్టీలో చేరిన లంకాదినకర్ వంటి వారికే దిక్కు లేకపోతే, ఇక తమ పరిస్థితి ఏమిటని,  ఇతర పార్టీల నుంచి చేరిన నేతలు బిక్కుబిక్కుమంటున్నారట. నిజానికి జాతీయ మీడియాలో కనిపించే జీవీఎల్ కంటే, దినకర్ వాదనలోనే ఎక్కువ రుజువులు, ఆధారాలుంటాయన్న ప్రశంసలు వినిపిస్తుంటాయి. బహుశా దినకర్‌కు అదే శాపంగా మారిందన్న వ్యాఖ్యలు కూడా వినిపించకపోలేదు.  ప్రధానంగా.. టీడీపీ నుంచి చేరిన కమ్మ వర్గానికి చెందిన నేతలను,  ఒక వ్యూహం ప్రకారం వెళ్లగొడుతున్నారన్న ప్రచారం పార్టీవర్గాల్లో వినిపిస్తోంది.   ఇక వివిధ చానెళ్ల చర్చలకు వెళ్లే ప్రతినిధుల జాబితాపైనా,  పార్టీ వర్గాల్లో వెటకారపు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సోమనాధ్ ఆలయం ఎక్కడుందో కూడా చెప్పలేని వారిని, టీవీ చర్చలకు ప్రతినిధులుగా ఎంపిక చేసిన, పార్టీ మేధావులను మెచ్చుకోవాల్సిందేనంటున్నారు. అసలు ఆ జాబితాలో ముప్పావుశాతం మందికి, ఇప్పటిదాకా చానెళ్లలో చర్చలకు వెళ్లిన అనుభవమే లేదని గుర్తు చేస్తున్నారు. మంత్రిగా పనిచేసిన రావెల కిశోర్‌బాబు, ఆదినారాయణరెడ్డి వారితో నిత్యం మీడియా ప్రతినిధులు మట్లాడుతుంటారు. కానీ వారికి ఇప్పుడు గొంతు విప్పే అవకాశం లేకుండా పోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. రాయలసీమలో ఒకస్థాయిలో ఇమేజ్ ఉన్న ఆదినారాయణరెడ్డి, బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి స్థానం లేకుండా పోవడం ఏమిటంటున్నారు. టీడీపీ-బీజేపీ సంకీర్ణ సర్కారు కాలం నుంచీ, పార్టీ వాణిని సమర్ధవంతంగా వినిపిస్తున్న పురిఘళ్ల రఘురాం వంటి.. సీనియర్ నాయకుడినే జాబితా నుంచి తప్పించడంపై,  పార్టీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.   సునీల్ దియోధర్ ఆయనకు, ప్రాధాన్యం తగ్గించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  జాతీయ నాయకత్వంతో సన్నిహితంగా ఉండటంతోపాటు, ఏపీ-తెలంగాణకు చెందిన పార్టీ నేతలకు ఢిల్లీలో ఏళ్లతరబడి.. సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న రఘురాం లాంటి వంటి కార్యదక్షులనే పక్కకుపెడితే, ఇక మామూలు నేతల సంగతేమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.   పార్టీని చక్కదిద్దాల్సిన రాష్ట్ర పార్టీ సంఘటనా కార్యదర్శి మధుకర్‌రెడ్డిజీ, ఆ విషయంలో విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన తన విచక్షణ వినియోగించడం మానే సి, కేవలం ఇద్దరు ముగ్గురు నేతల ఆలోచన ప్రకారమే, నిర్ణయాలు తీసుకుంటున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆర్‌డి విల్సన్, పురిఘళ్ల రఘురాం, లంకా దినకర్‌పై సస్పెన్షన్- నోటీసులివ్వాలని సునీల్ దియోధర్ చే సిన ఒత్తిళకు, మధుకర్‌రెడ్డి గట్టిగా సమాధానం ఇవ్వలేకపోయారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. -మార్తి సుబ్రహ్మణ్యం

మూడు రోజుల్లోనే వందల కేసులు! కరోనా హాట్ స్పాట్లుగా స్కూళ్లు?

జగన్ సర్కార్ మెండి వైఖరి ఏపీని మళ్లీ ప్రమాదంలోకి నెడుతుందా? రాష్ట్రంలో కరోనా మళ్లీ పంజా విసరనుందా? అంటే అవుననే అనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహంగా స్కూళ్లను తెరవడంతో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. బడులు తెరిచిన మూడు రోజుల్లోనే దాదాపు 3 వందల వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇంకా కొన్ని ఫలితాలు రావాల్సి ఉంది. అన్ని జిల్లాల్లోనూ స్కూళ్లకు వస్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు వైరస్ భారీన పడుతున్నారని తెలుస్తోంది. అన్ లైన్ క్లాసుల నిర్వహణ సమయంలోనూ చాలా మంది టీచర్లు, సందేహాల నివృత్తి కోసం స్కూళ్లకు వచ్చిన విద్యార్థులకు కరోనా సోకింది. వారి ద్వారా కుటుంబ సభ్యులకు వైరస్ అంటుకుంటోంది. ఇప్పుడు స్కూళ్లు తెరవడంతో వైరస్ వేగంగా విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఏపీ ప్రజల్లోఆందోళన వ్యక్తమవుతోంది. విద్యార్థులు, టీచర్ల ప్రాణాలతో జగన్ ప్రభుత్వం ఆటలాడుతుందనే ఆరోపణలు వస్తున్నాయి.    ఏపీలో బడి తలుపులు తెరిచి మూడు రోజులైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్కూళ్లలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుండగా.. బుధవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 239 మంది ఉపాధ్యాయులు, 44 మంది విద్యార్థులకు వైరస్‌ సోకినట్టు గుర్తించారు. మరిన్ని పరీక్షల ఫలితాలు అందాల్సి ఉంది. గుంటూరు జిల్లాలో ఏకంగా 25 మంది ఉపాధ్యాయులకు కరోనా సోకినట్టు గుర్తించారు. వారిలో వైరస్‌ లక్షణాలు పెద్దగా లేకపోయినప్పటికీ స్ర్కీనింగ్‌ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది.పశ్చిమ గోదావరి జిల్లాలో గడిచిన 10 రోజుల్లో 172 మంది ఉపాధ్యాయులకు, 262మంది విద్యార్థులకు కరోనా సోకింది. వీరంతా తొమ్మిది,  పదో తరగతి విద్యార్థులే. ఆన్‌లైన్ పాఠాల్లో సందేహాల నివృత్తి కోసం స్కూళ్ళకు వెళ్ళిన సమయంలో విద్యార్థులు కరోనా బారిన పడ్డారు.    ప్రకాశం జిల్లాలోని స్కూళ్లల్లో కరోనా కలకలం కొనసాగుతోంది. తాజాగా ఏడుగురు విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులతో పాటు, ఓ హెచ్ఎంకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.  విశాఖ జిల్లా విద్యా శాఖలో కరోనా కలకలం రేపుతోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 52 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వారిలో 46 మంది ఉపాధ్యాయులు, నలుగురు సిబ్బంది, ఇద్దరు విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది 500 మంది ఉపాధ్యాయులకు ఇటీవల కరోనా స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించగా 5 శాతం మంది కొవిడ్‌ బారిన పడినట్లు వెల్లడైంది.   కర్నూలు జిల్లాలో పాఠశాలలు తెరుచుకున్న మూడు రోజులకే ముగ్గురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయురాలికి వైరస్‌ సోకినట్టు అధికారులు గుర్తించారు. అక్టోబరు నుంచి ఇప్పటివరకు జిల్లాలో 38 మంది టీచర్లు, 125 మంది విద్యార్థులకు కరోనా సోకింది. చిత్తూరు జిల్లాలో  ఇప్పటికే ఏకంగా 187 మంది ఉపాధ్యాయులకు, 13 మంది విద్యార్థులకు వైరస్‌ సోకినట్లు తేలింది.                      ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. చాలా దేశాల్లో  వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. అమెరికాలో రోజూ లక్ష కొత్త కేసులు వస్తున్నాయి. యూరప్ లోనూ సేకండ్ వేవ్ భయంకరంగా విస్తరిస్తోంది. లండన్, పారిస్ సహా పలు ప్రాంతాల్లో మళ్లీ లాక్ డౌన్ విధించారు. వచ్చే మూడు నెలలు అత్యంత కీలకమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. మనదేశంలోనూ కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో సేకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉంది. ధర్డ్ వేవ్ కు సిద్ధంగా ఉండాలని ప్రజలను అలర్ట్ చేశారు సీఎం కేజ్రీవాల్. వింటర్ సీజన్ లో వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశముందని, మూడు నెలల వరకు జాగ్రత్తగా ఉండాలని ఐసీఎంఆర్ సహా దేశంలోని ఆరోగ్య సంస్థలు హెచ్చరిస్తున్నాయి.    కరోనా సేకండ్ వేవ్ పై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కొనసాగుతుండగా.. మన దేశంలోని ఢిల్లీ, కేరళలో ఇప్పటికే కనిపిస్తుండగా ఏపీ సర్కార్ మాత్రం మెండిగా వ్యవహరిస్తోంది. తాము అనుకున్నది జరగాలన్నట్లుగా స్కూళ్లను నడిపిస్తోంది. దీంతో ఏపీలో తగ్గిందనుకున్న కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఏపీలో గతంలో రోజుకు 10 వేలకు పైగా కేసులు రాగా.. ప్రస్తుతం మూడు వేలకు లోపుగానే వస్తున్నాయి. ఈ సమయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన జగన్ సర్కార్.. పట్టుదలకు పోతూ ప్రజల ప్రాణాలకు గండం తెస్తుందనే ఆరోపణలు అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. స్కూళ్లను కొనసాగిస్తే ఏపీలో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశాలున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.    స్కూళ్లు తెరిచినా మూడు రోజుల్లోనే టీచర్లు, విద్యార్థుల్లో దాదాపు 3 వందల మందికి కరోనా పాజిటివ్ రావడం భవిష్యత్ అనర్ధాలకు సంకేతమిస్తోంది. దీంతో తమ పిల్లలను స్కూళ్లకు పంపడానికి పేరెంట్స్ ఇష్టపడటం లేదు. దీంతో మొదటి రోజు దాదాపు 20 శాతం మంది విద్యార్థులు స్కూళ్లకు రాగా.. మూడో రోజుకి అది ఐదు శాతానికి పడిపోయిందంటున్నారు. ఇక విద్యాశాఖలోనూ కరోనా కలవరం రేపుతోంది. కేసులు పెరిగితే స్కూళ్ళకు సెలవులు ప్రకటించాలని జిల్లాల డీఈవోలు భావిస్తున్నారని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో స్కూళ్లు నడిపించినా పిల్లలు రారని, ప్రభుత్వమే ఆలోచించి స్కూళ్లను నిలిపివేయాలనే డిమాండ్లు జనాల నుంచి వస్తున్నాయి.

పెరిగిన నేరాలు, ఘోరాలు! క్రైమాంధ్రగా మార్చేశారా? 

మూడు మర్డర్లు.. ఆరు అత్యాచారాలు.. పన్నెండు కిడ్నాపులు.. 24 దోపిడీలు. ఇదీ ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిస్థితి. కొన్ని నెలలుగా ఏపీలో క్రైమ్ రేట్ భారీగా పెరిగిపోయింది. మహిళల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. కామంతో  కొందరు, ప్రేమ పేరుతో మరికొందరు మహిళలపై దాడులు చేస్తున్నారు. కిరాతకంగా చంపేస్తున్నారు. పసి పిల్లలను కూడా వదలడం లేదు కిరాతకులు. కిడ్నాపులకైతే అంతే లేకుండా పోతోంది. చోరీలు, దొమ్మీల గురించి ఇక చెప్పనవరమే లేదు. మొత్తంగా  దేశ వ్యాప్తంగా నమోదవుతున్న ఐపీసీ కేసుల్లో టాప్ లో నిలుస్తోంది ఆంధ్రప్రదేశ్. ఇదే ఇప్పుడు ఏపీ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. నవ్యాంధ్ర కాస్త క్రైమాంధ్రగా మారిపోయిందని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.                 విశాఖ గాజువాకలో వరలక్ష్మి అనే విద్యార్థినిని ఇటీవలే దారుణ హత్యకు గురైంది. నగరం నడిరోడ్డుపై యువతి గొంతు ను కత్తితో కోసి దారుణానికి ఒడిగట్టాడు కిరాతకుడు. దానికి కొన్ని రోజుల ముందే విజయవాడలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిని ఓ ఉన్మాది కత్తితో దాడి చేసి చంపేశాడు.  గత నెల9న కర్నూలు జిల్లా నంద్యాలలో వైఎస్సార్‌సీపీ  నేత సుబ్బారాయుడు దారుణ హత్యకు గురయ్యారు. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన సుబ్బరాయుడిని.. కర్రలతో దాడి చేసి కొట్టి చంపారు దుండగులు.  జూన్ 29న మచిలిపట్నంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకుడు మోకా భాస్కరారావు హత్య జరిగింది.మునిసిపల్ చేపల మార్కెట్లో  ఇద్దరు గుర్తు తెలియని దుండగులు అతన్ని పొడిచి చంపారు.ఇవీ ఇటీవల జరిగిన దారుణాలు. ఇలాంటి ఘటనలు గత ఏడాదిగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతూనే ఉన్నాయి. రోజు ఏదో ఒక చోట దారుణం జరుగుతూనే ఉంది. గతంలో కంటే మహిళలపై క్రైమే రేట్ పెరగడం మరింత ఆందోళన కల్గిస్తోంది.    2020  మొదటి ఆరు నెలల్లో ఏపీలో 18 వేల 438 ఐపీసీ కేసులు నమోదయ్యాయి. ఏపీలో నమోదవుతున్న క్రైమ్ కేసుల్లో మహిళలపై వేధింపులు మొదటి స్థానంలో ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా.. జూన్ వరకే 584 రేప్ కేసులు వచ్చాయంటే ఏపీలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు.  359 హత్య కేసులు రాగా, 289 అల్లర్ల కేసులు రికార్డయయ్యాయి. 325 కిడ్నాప్ మరియు అపహరణ కేసులు, 584 అత్యాచార కేసులు నమోదయ్యాయి.  డబ్బుల కోసం 14 హత్యలు జరిగినట్లు పోలీసుల రికార్డుల్లో ఉంది. ఈ సంవత్సరం తొలి ఆరు నెలల్లోనే 14 దోపిడీలు, 103 దొంగతనాలు జరిగాయి. 1,483 చోరీలు, 3,935 సాధారణ దొంగతనాలు, గృహ విచ్ఛిన్నం కేసులు నమోదయ్యాయి. 8,057 హర్ట్ కేసులు, చిన్న కేసులు, 2,873 మోసం కేసులు, 394 క్రిమినల్ ఉల్లంఘన కేసులు మరియు ఎనిమిది నకిలీ కరెన్సీ నోట్లు పోలీసుల క్రైమ్ రికార్డుల్లో ఉన్నాయి.    మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించిన ఘటనలు దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లోనే జరుగుతున్నాయని నేషనల్ క్రైమ్ బ్యూరో ఇచ్చిన నివేదికలో ఉంది. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించిన ఘటనలు దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగాయని నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా ఈ తరహా ఘటనలు 6,454 చోటుచేసుకోగా అందులో 1,892 ఏపీలోనే జరిగాయని పేర్కొంది. పనిప్రదేశాల్లో, ప్రజారవాణాలో ఈ ఘటనలు ఎక్కువ జరుగుతున్నాయని నివేదికలో చెప్పింది. మానవ అక్రమ రవాణా కేసుల్లోనూ మహారాష్ట్ర తర్వాత ఏపీ రెండో స్థానంలో ఉంది. అయితే లాక్డౌన్ సమయంలో మహిళలపై నేరాలు మరియు హత్యలు ఎక్కువగా పెరిగాయి. కోవిడ్ -19 లాక్ డౌన్ అమలు చేయడానికి భారీ పోలీసు బలగాలను మోహరించడం. లాక్డౌన్ సమయంలో పోలీసు స్టేషన్లు సాధారణ ఫిర్యాదులను అంగీకరించలేదని అందుకే మహిళలపై దాడులు పెరిగిపోయాయని పోలీసులు చెబుతున్నారు.                   అంధ్రప్రదేశ్ లో దళితులపై నేరాలు గణనీయంగా పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ తరహా నేరాల రేటు జాతీయ స్థాయిలో కంటే ఏపీలోనే అత్యధికంగా ఉందని ఎన్‌సీఆర్‌బీ నివేదిక ఇచ్చింది.  ఎస్సీలపై నేరాలకు సంబంధించి 2018లో 1,836 కేసులు నమోదుకాగా 2019లో ఆ సంఖ్య 2,071కు చేరింది. 12.79శాతం మేర పెరిగినట్టు స్పష్టం చేసింది.. ఆంధ్రప్రదేశ్‌లో 84.5 లక్షల మంది ఎస్సీ జనాభా ఉండగా..లక్ష మంది జనాభాకు 24.5 నేరాలు జరిగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎస్సీలపై జరిగిన నేరాల్లో 4.5శాతం ఏపీలోనే జరుగుతున్నాయి అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజకీయ కక్షలు నేపథ్యంలోనో.. ఇతర పార్టీల సానుభూతిపరులనే కారణంతోనో.. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తున్నారనే అక్కసుతోనో.. ఇలా వివిధ కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు పెరుగుతున్నాయి.    దళితులపై దాడులు పెరగడమే కాదు తర్వాత వారికి న్యాయం చేయడంలోనూ నిర్లక్ష్యం కనిపిస్తోంది. న్యాయం కోసం వెళ్లిన బాధిత దళితులకు పోలీస్ స్టేషన్లలో వేధింపులు వస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దళితులపై పోలీసులు దాడులు పెరిగిపోయినట్లు కనిపిస్తోంది. జూలై 22న ముసుగు ధరించలేదని, మద్యం తాగి వాహనం నడుపుతున్నాడని ప్రకాశం జిల్లా చీరాలలో  ఒక దళిత యువకుడిని పోలీసులు కొట్టారు. కొన్ని రోజులకు ఆ యువకుడు చనిపోయారు. పోలీసుల కొట్టిన దెబ్బల వల్లే యువకుడు చనిపోయాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దళిత యువకుడికి పోలీసులు శిరోముండనం  చేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దళితుడైన జడ్జీ రామకృష్ణ కుటుంబ సభ్యులపై అనంతపురం జిల్లాలో ఇటీవల  దాడి జరిగింది. ఒక జడ్జీ కుటుంబ సభ్యుల పరిస్థితి ఇలా ఉంటే.. మిగితా దళితుల భద్రత ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.దళితులపై దాడుల అంశమే కాదు.. ఆర్థిక, సైబర్‌ నేరాలు, వృద్ధులు, మహిళలపై నేరాల్లోనూ గతంతో పోలిస్తే గణనీయ వృద్ధి పెరిగింది.     తెలంగాణలో జరిగిన దిశ ఘటన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చింది. దిశ యాక్ట్  ప్రకారం 21 రోజుల్లోనే నిందితులను పట్టుకొని విచారించి తగిన శిక్ష వేయాలి. ఈ దిశగా ప్రభుత్వం యాక్ట్ ను తీసుకొచ్చింది. దిశ బిల్లుతో పాటు దిశ మొబైల్‌ అప్లికేషన్, దిశ పోలీస్‌ స్టేషన్లు, దిశ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు, ప్రత్యేక పోలీస్‌ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించుకుంది.  స్పందన, మహిళా మిత్ర, సైబర్‌ మిత్ర, మహిళా పోలీస్‌ వంటి కార్యక్రమాలను మహిళలు, బాలికలపై నేరాలకు చెక్‌ పెట్టేందుకు తీసుకొచ్చామని గొప్పగా చెప్పుకుంది. దీంతో క్రైమ్ రేట్ తగ్గిపోతుందని అనుకున్నారు. కానీ తగ్గకపోగా ఈ విషయంలో పెరిగిపోయింది.  ఈ సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నది.  ఐదు నెలల్లో ఏడువేలకు పైగా మహిళలపై వేధింపులు, అత్యాచారాల కేసులు నమోదవుతున్నాయి అంటే రాష్ట్రంలో క్రైమ్ హిస్టరీ ఎలా ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు.   ఆంధ్రప్రదేశ్‌లో క్రైమ్‌ రేట్‌ ఊహించని స్థాయిలో పెరదడం జనాల్లో ఆందోళన పెంచుతోంది. జగన్ సర్కార్ గొప్పగా చెప్పుకుంటున్న దిశా చట్టం చట్టబండలైందా అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. దిశా పోలీస్ స్టేషన్లు దిక్కు లేకుండా పోయాయని మండిపడుతున్నారు. ఈ నేరాలు, ఘోరాలను భరించాల్సిందేనా అని ప్రభుత్వాన్ని , పోలీసులను నిలదీస్తున్నారు ప్రజలు.దిశ చట్టం చేశాం, దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశాం అని ప్రకటనలు చేసి ప్రచారం చేసుకున్న పాలకులు రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న దాడులకు ఏం సమాధానం చెబుతారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.  చట్టాలు చేశామని చేతులు దులుపుకుంటే ఏమిటి ప్రయోజనం అని పేర్కొన్నారు. దిశ చట్టం ఇప్పటికీ అమల్లోకి రాకపోవడానికి కారణం ఏంటో ప్రజలకు వివరించాలని స్పష్టం చేశారు. దిశ చట్టం అమలులోకి  తెచ్చామని చెబుతున్న వైసీపీ ప్రభుత్వ పెద్దలు.. వరుసగా జరుగుతున్న ఘటనలకు బాధ్యతగా  సిగ్గుతో తలదించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరీ ఇప్పటికైనా జగన్ సర్కార్ మెల్కోని నేరాలు, ఘోరాలను నివారించడానికి చర్యలు తీసుకోవాలని కోరుకుందాం..

రాజు గారు బయటపెట్టిన ‘గజపతికోట రహస్యం’

సంచయత తండ్రి పేరు మరోమారు తెరపైకి   కథ పాతదే. కాకపోతే ఇప్పటి తరానికి తెలియదు. ఇప్పటి తరమంటే.. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ బ్యాచ్చన్న మాట. అందుకే నర్సాపురం యుశ్రారైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు కాస్తంత కొత్తగా పాతకథ చెప్పారు. మీడియాలో రచ్చగా మారిన, ‘గజపతుల కోట రహస్యం’ తెలియని వారికి,  ఎంపీ రాజుగారు చెప్పిన ‘పాతదయిన కొత్త కథ’ ఏమిటో  తెలియనివారికి, ఆసక్తి కలిగించేదే. అదొక్కటే కాదు. హిందూ వారసత్వం, సంస్కృతి సంప్రదాయాలపై ఏ మాత్రం గౌరవాభిమానాలున్న ఎవరికయినా, సంచయత అనే ఆధునిక మహిళ, గజపతులకు వారసులు కాదనిపించక మానదు. ఇప్పుడు నర్సాపురం రాజు గారు చెప్పిన కథ కూడా అదే!     మాన్సాస్ ట్రస్ట్ పేరు విన్నారు కదా? అదేనండీ.. మొన్నటివరకూ, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు కుటుంబం ఏలుబడిలో ఉన్నదే.. ఆ ట్రస్టే ఈ ట్రస్టు! జగనన్న సర్కారు వచ్చిన తర్వాత ఆయనను తొలగించేసి.. గజపతుల వారసురాలని తెరపైకి తెచ్చి, సంచయత అనే మహిళకు ఆ మాన్సాస్ ట్రస్టు  అప్పగించింది. సరే..అది ఆమెపై అభిమానంతో ఆ పదవి ఇచ్చారా? లేక ఆ ట్రస్టు అధీనంలో ఉన్న వేలాది ఎకరాలపై ఉన్న, ప్రేమతో ఇచ్చారా అన్నది వేరే కథ.   పైగా సంచయత బీజేపీ సభ్యురాలట. మరి బీజేపీ వ్యక్తికి అంత పెద్ద ట్రస్టు ఎలా ఇచ్చారు? అంత విశాల హృదయం, ఒక్క మాన్సాస్‌కే ఎందుకు? మిగిలిన వాటికీ వర్తింపచేయవచ్చు కదా అని ప్రశ్నిస్తే, వైసీపీ-బీజేపీ మధ్య ఉన్న బాదరాయణ సంబంధాల గురించి చెప్పాల్సివస్తుంది. పైగా ఇప్పుడు ఏపీ బీజేపీలో ‘అతి పెద్ద’ పోస్టులో ఉన్న ఒకాయనే ఈ పుణ్యం కట్టుకుని, యుశ్రారైకాపా కీలకనేత దగ్గర పైరవీ చేశారన్నది తెరవెనుక కథ. సదరు బీజేపీ-యుశ్రారైకాపా నాయకులను, విశాఖ సాములోరు.. టీడీపీ-బీజేపీ కలసి కాపురం చేస్తున్న రోజుల్లోనే జతకలిపారట. అది మరో బహిరంగ రహస్యం.   ఇక ఇప్పుడు మళ్లీ గజపతుల కోటలోకి వెళదాం. నర్సాపురం రాజు గారు, ఇప్పుడు సదరు సంచయత పుట్టుపూర్వోత్తరాల విప్పిన గుట్టు, యమా ఇంట్రస్టింగుగా ఉంది. ఆనందగజపతి రాజు భార్య పేరు ఉమాగజపతిరాజు. ఆ తర్వాత ఆనంద గజపతి రాజు నుంచి విడాకులు తీసుకున్న సదరు ఉమా.. ఢిల్లీలో రమేష్ శర్మ అనే జర్నలిస్టును పెళ్లిచేసుకున్నారు. ఆ వెంటనే ఆనందగజపతి రాజుల వారు కూడా, సుధా రాజును పెళ్లిచేసుకున్నారు. అంటే చట్ట ప్రకారం ఆనందగజపతి నుంచి వేరు పడి, మారు మనువు చేసుకున్న ఉమాకు.. భర్త-కులం రెండూ మారాయన్నమాట. ఆ తర్వాతనే ఇప్పటి మాన్సాస్ ట్రస్టు చైర్మన్ సంచయత జన్మించిదట.   ఆ ప్రకారం తన స్కూలు రికార్డులలో కూడా, సంచయత తండ్రి రమేష్ శర్మ అనే రాశారట. ఇవన్నీ ఒక ఎక ఎత్తయితే, సంచయత  2013లో రాసిన ఓ ఆర్టికల్‌లో కూడా, తన నేపథ్యం ఏమిటో వివరించారట. అంటే ఇది కూడా చట్టప్రకారం.. సంచయత అనే మహిళ రమేష్ శర్మ కూతురనే నిర్ధారిస్తుందని, మెడ మీద తల ఉన్న ఎవరికయినా అర్ధమవుతుందన్నమాట. మరి పాలకులకు అర్ధం కాలేదా అని మాత్రం అడక్కండి. ఎందుకంటే.. ఇది మెడమీద తల ఉన్న వారికి సంబంధించిన ప్రశ్నలు కాబట్టి!   మరి గజపతుల కుటుంబం నుంచి వేరు పడి, రమేష్ శర్మ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత పుట్టిన సంచయత.. గజపతుల కుటుంబానికి, ఎలా వారసురాలవుతారన్నది ప్రశ్న. చట్ట ప్రకారం రెండోపెళ్లి చేసుకున్న, సుధారాజు కుమార్తెలే కదా నిజమైన వారసులయ్యేది? మరి రమేష్ శర్మ కూతురుగా  రికార్డుల్లో ఉన్న సంచయత, గజపతుల కుటుంబానికి ఎలా వారసురాలవుతుంది? ఆ కుటుంబం నుంచి ట్రస్టుకు ఎలా ప్రాతినిధ్యం వహిస్తుందని, ఎంపీ రాజుగారు తీసిన లాపాయింటు రైటే కదా మరి? అయినా.. ఎంపీ రాజు గారి పిచ్చికాకపోతే... ఎవరి ట్రాప్‌లో పడవద్దని చెబితే, సంచయత వింటారనుకోవడం ఏమిటి? ఆల్రెడీ అది ముగిసిన కథే కదా? రాజు గారూ.. ఆశ మంచిదే. అత్యాశే పనికిరాదండీ.. ఆయ్! -మార్తి సుబ్రహ్మణ్యం

నిధులు లేని నిరుపేద టీడీపీ!

ఎన్నికల నిధులు ఇంకా సర్దుబాటు చేయలేదట   అటకెక్కిన మీడియా బకాయిలు   అప్పుల్లో కూరుకున్న అభ్యర్ధులు   అభ్యర్ధుల చుట్టూ తిరుగుతున్న అప్పులోళ్లు   తెలుగుదేశం.. 17 నెలల క్రితం వరకూ, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన పార్టీ. కార్పొరేట్‌కు చొక్కా ఫ్యాంటూ వేస్తే దాని పేరే తెలుగుదేశం. కార్పొరేట్లు, రియల్టర్లు, పారిశ్రామికవేత్తలు, ఎన్‌ఆర్‌ఐ దాతల జాబితాకు, వదాన్యుల ప్రవాహానికీ లెక్కలేదు. పార్టీని సొంతం చేసుకునే ఆసాముల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. పార్టీకి కష్టం వస్తే దన్నుగా నిలిచే పారిశ్రామికవేత్తలు బోలెడు. ఇన్ని అర్హతలతో అలరారుతున్న తెలుగుదేశం పార్టీ,  ఇప్పుడు నయాపైసా నిధులు లేని నిరుపేద. ఇది నిజంగా నిఝం! కావాలంటే మీరే చూడండి..   భారత రాజకీయాల్లో, ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన తెలుగుదేశం పార్టీకి దేశ విదేశాల్లో లక్షల సంఖ్యలోనే అభిమానులున్నారు. వారిలో పారిశ్రామికవేత్తలతోపాటు, నిధులిచ్చి ఆదుకునే ఇన్‌ఫ్రా కంపెనీలు, వ్యక్తులు-శక్తులు బోలెడుమంది. వీరిలో కులాభిమానంతో నిధులు ఇచ్చే వ్యక్తులు, నిధులు సేకరించే శక్తుల జాబితా వేరు. అందుకే టీడీపీ ఇన్నేళ్లు రాజకీయాల్లో ధైర్యంగా నిలబడింది. దేశంలోనే కార్యకర్తలను ఆదుకునే ఏకైక పార్టీగా,  టీడీపీ మొన్నటి వరకూ అగ్రస్థానంలో నిలిచింది. అధికారం లేకపోయినా, రోజుకు కనీసం 50 మంది బాధితులకు వివిధ రూపాల్లో సాయం చేసిన ఘనత దానిది. వందలమంది రోగులకు  ఆసుపత్రులలో ఉచితంగా వైద్యఖర్చులను భరించారు. ఎన్టీఆర్ ట్రస్టు నుంచి వేలమంది లబ్థి పొందిన రోజులున్నాయి.   అధినేత చంద్రబాబు నాయుడు గురించి బయట ఎన్ని ప్రచారాలున్నప్పటికీ.. తన వద్దకు వచ్చిన వారికి లేదనకుండా సాయం చేయడంలో,  వైఎస్ కంటే ముందే ఉంటారన్నది నిజం. కానీ,  దురదృష్టవశాత్తూ ఆ విషయంలో ఏ కారణం వల్లనో, వైఎస్ పేరు ఒక్కటే ఇప్పటికీ ప్రచారంలో ఉంది. పార్టీ కార్యక్రమాలు కూడా నాణ్యత తగ్గకుండా.. అవసరాన్ని మించి ఖర్చు చేయడానికి, బాబు వెనుకంజ వేసిన సందర్భాలు లేవు.   ఎన్నికల్లో అభ్యర్ధులకు టీడీపీ ఇచ్చే ఆర్ధిక దన్ను, మరే పార్టీ ఇవ్వదు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లో.. కాంగ్రెస్ కంటే, టీడీపీనే ఆర్ధికంగా దూసుకుపోయింది. దాన్ని చూసి కలవరపడిన వైఎస్, రెండో దశ ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇవన్నీ.. చంద్రబాబు నాయుడు స్వయంగా ఆర్ధిక వ్యవహారాలు పర్యవేక్షించి, సొంతంగా తీసుకున్న నిర్ణయాలు. కానీ ఇప్పుడు ఆ అజమాయిషీ ఆయన చేయడం లేదని, ఈ పరిస్థితికి అదే కారణమన్నది తమ్ముళ్ల మాట. ఆర్ధిక అంశాల్లో.. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీనే దశాబ్దాలపాటు ఖఃగుతినిపించిన టీడీపీ,   ఇప్పుడు ఇలా కడు నిరుపేదగా మారిందట.   గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధులకు.. వివిధ కారణాల వల్ల ఆలస్యంగా నిధులు వెళ్లినా, అవి తగినంత ఇవ్వలేదట. అటు వైసీపీ నాయకత్వం, నెల ముందుగానే అభ్యర్ధులకు నిధులు సర్దుబాటు చేసింది. ఎంపీ అభ్యర్ధులు కూడా 15 కోట్లు అసెంబ్లీ అభ్యర్ధులకు ఇచ్చారు, దానితో ఒక్కో వైసీపీ అసెంబ్లీ అభ్యర్ధి,  25 కోట్లకు తగ్గకుండా ఖర్చు చేశారన్నది ఒక అంచనా. మరోవైపు టీడీపీకి ఆర్ధికంగా దన్నుగా నిలిచే వర్గాలపై ఐటి, ఈడీలు మెరుపుదాడులు చేసి, పార్టీ ఆర్ధికమూలాలు దెబ్బతీసింది. ఆ సమయంలో నిధులు సర్దుబాటు కాక, టీడీపీ నాయకత్వం చేతులెత్తేసింది.   అయినా..  స్ధానికంగా మీరు సర్దుబాటు చేసుకుంటే, ఎన్నికల తర్వాత ఇస్తామన్న హామీతో టీడీపీ అభ్యర్ధులు,  అప్పులు చేసి ఎన్నికలు పూర్తి చేశారు. కానీ పార్టీ ఓడిపోయింది. అప్పటినుంచి ఇప్పటివరకూ, ఎన్నికల అప్పుపై హామీ ఇచ్చిన వారెవరూ స్పందించడం లేదట. అసెంబ్లీకి పోటీ చేసి అప్పులపాలయిన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్.. ఈ బాధ పడలేక, వారిని నేరుగా నాయకత్వం వద్దకే తీసుకువెళ్లారట. అప్పులవాళ్లకు ఏదో ఒక హామీ ఇచ్చి,  తనను గండం నుంచి గట్టెక్కించమని వేడుకున్నా ఎవరూ స్పందించలేదట.   ఇటు చూస్తే.. ఎన్నికల సమయంలో వాడిన  మైకులు, షామియానాలు, కుర్చీలు, క్యాటరింగు, ట్రావెల్స్, స్థానికంగా పత్రికలకు ఇచ్చిన ప్రకటన  తాలూకు బకాయిలివ్వమని రోజూ ఇంటి చుట్టూ తిరుగుతుండటం, అభ్యర్ధులకు పరువు తక్కువ వ్యవహారంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమ్మెల్యేగా ఉంటూ, హటాత్తుగా ఎంపీ అభ్యర్ధి అవతారమెత్తిన  ఓ రాజు గారు.. తన జమానాలో ఊరంతా అప్పులు చేసి, హైదరాబాద్ చెక్కేశారట. అప్పులవాళ్లు ఆయన ఇంటి చుట్టూ తిరుగుతున్నా ఫలితం శూన్యం. ఇలాంటి అభ్యర్ధులు చాలామంద ఉన్నారట. అదొక విషాదం!   ఇక గత ఎన్నికల ముందు టీడీపీ.. పత్రికలు- చానెళ్లకు ఇచ్చిన ప్రకటనల బకాయిలు కూడా ఇప్పటికీ చెల్లించలేదు. అవి కూడా కోట్ల రూపాయల పైమాటేనంటున్నారు. ఫలితాల నుంచి ఇప్పటివరకూ బకాయిల కోసం,  పార్టీ చుట్టూ తిరుగుతున్న పత్రికా ప్రతినిధులకు.. చెప్పులు అరిగిపోవడం తప్ప, ఇప్పటివరకూ స్పందించిన వారు లేరు. దీనితో ప్రధానంగా చిన్న పత్రికలు విలవిల్లాడుతున్నాయి. బకాయిలపై ఎవరూ నోరెత్తకపోవడంతో ఆ బకాయిలు ఎప్పుడిస్తారో? ఎవరిస్తారో తెలియక తలపట్టుకుంటున్న పరిస్థితి. చివరకు అసెంబ్లీ అభ్యర్ధులు కూడా బకాయిలు ఎగొట్టి, తప్పించుకు తిరుగుతుంటే యాజమాన్యాలకు జవాబు చెప్పలేక స్థానిక విలేకరులు సతమతమవుతున్నారట. ఇదీ.. నిధులు లేక నిరుపేదగా మారిన  తెలుగుదేశం పార్టీ ఆర్ధిక దుస్థితి. -మార్తి సుబ్రహ్మణ్యం

జగన్ పరువు తీస్తున్న పోలీసులు!

రైతన్న చేతికి బేడీలా? సిగ్గుచేటు   యాక్షన్ చేయమంటే ఓవరాక్షన్ చేస్తున్నారా?   వైసీపీ నేతల సీరియస్   జగన్‌కు విపక్షం నుంచి ఇప్పట్లో ప్రమాదం లేదు. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, ఇప్పుడు జూమ్‌లో జీవిస్తోంది. మిగిలిన పక్షాలు ప్రకటనలతో జీవించేస్తున్నాయి. అయినా.. జగన్ పాలనపై జనంలో వ్యతిరేకత పెరగడం ఆశ్చర్యమే కదా? మరి విపక్షాలన్నీ బలహీనంగా ఉంటే, జగన్‌కు ఇక సమస్య ఏమిటి? అన్నదే కదా సందేహం. యస్. జగన్ సర్కారు పాలిట అధికారులే విపక్షాలు. వారే ఇప్పుడు ఆయనకు ఓ పెద్ద సమస్య.   జగన్ సీఎం అయిన తర్వాత, పోలీసు ‘పవరు’ పెరిగింది. ఒకప్పుడు సోషల్ మీడియాలో పోస్టింగు పెట్టిన వారిపై, టీడీపీ సర్కారు కేసులు పెడితే, విపక్ష నేతగా ఉన్న జగన్, విజయసాయిరెడ్డి దానిని ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే స్వేచ్ఛ కూడా లేదా అని వాపోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక, సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్న వారిని, భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. సీఐడీని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారన్న భావన కల్పించడంలో, పోలీసులు విజయం సాధించారు.   గ్రామాల్లో విపక్షాలకు చెందిన కార్యకర్తలు, గ్రామం విడిచిపోయేలా చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక అధికార పార్టీ నేతల మెహర్బానీ కోసం పోలీసుస్టేషన్లే వేదికగా, శిరోముండనాలు చేస్తున్న దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్-టీడీపీ పాలించినా.. పోలీసులు, ఈ స్థాయి ఓవరాక్షన్ చేసిన దాఖలాలు లేవు. అధికార పార్టీకి 60 శాతం సానుకూలంగా పనిచేస్తే, ప్రతిపక్షాలకు 40 శాతం సానుకూలంగా ఉండేవారు. గ్రామస్థాయిలో కక్షలు, ముఠా తగాదాల నేపథ్యంలో హత్యాకాండలు మాత్రమే చూశాం.   కానీ, గత 17 నెలల నుంచి ఇవన్నీ మారిపోయాయి.. జర్నలిస్టులను కూడా కేసులు, సీఐడీ విచారణ పేరిట వేధించడం చూస్తున్నాం. టీవీ5 జర్నలిస్టు మూర్తి, తెలుగువన్ అధినేత రవిశంకర్‌ను వేధించిన సందర్భాల్లో, వారికి కోర్టులే దిక్కయ్యాయి. ఇక అమరావతి ఉద్యమాన్ని కవర్ చేస్తున్న విలేకరులపై కులం పేరుతో దూషించిన కేసులు పెట్టి, కోర్టులో అభాసుపాలయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోలీసుల స్థాయి చిన్నదయిపోతుంది. అది వారి గౌరవానికే భంగకరం.   ఇప్పుడు పోలీసుల ఓవరాక్షన్.. రైతుల చేతికి బేడీలు వేసేవరకూ వెళ్లడం ద్వారా, నిరంకుశత్వం పరాకాష్టకు చేరినట్లే లెక్క. దేశానికి పట్టెడన్నం పెట్టే రైతు చేతికి, బేడీలు వేసిన చిత్రాలు చూసిన రైతన్న గుండె కాలిపోయింది. ఆత్మగౌరవరం దెబ్బతింది. రైతులలో రాజకీయ పార్టీలకు అభిమానులు ఉండవచ్చు. కానీ రైతు ఎక్కడైనా రైతే. రైతు ఆత్మగౌరవానికి మాత్రం పార్టీలుండవు.   సాటి రైతు చేతికి బేడీలు వేసిన పోలీసు చర్యతో, నిజమైన రైతు ఆత్మాభిమానం ఎందుకు దెబ్బతినకుండా ఉంటుంది? దేశద్రోహులకు జైళ్లలో బిర్యానీలు పెట్టి, తెగమేపుతున్న ఈ కాలంలో.. బ్యాంకులకు వందలు, వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి, కాలరెగరేసిన వారికి రెడ్‌కార్పెట్ వేస్తున్న ఈ రోజుల్లో..చట్టంలో లొసుగులను ఆసరా చేసుకుని, వైట్‌కాలర్ నేరగాళ్లు, హంతకులు దర్జాగా తిరుగుతున్న ఈ రోజుల్లో.. సేద్యం చేసుకునే తోటి రైతు చేతులకు బేడీలు వేస్తే, రైతాంగం మనసు మండకుండా, నవరంధ్రాలు మూసుకుంటాయని భావించడమే వెర్రితనం.   అసలు నిందితుల చేతికి బేడీలు ఏ దశలో వేయాలి? ఏ రకమైన నేరస్తుల చేతికి మాత్రమే అవి ఉండాలి? అసలు మానవహక్కుల గురించి జ్ఞానం లేని పోలీసులు చేసిన ఓవరాక్షన్‌కు, జగన్ సర్కారు పరువుపోయిందన్నది వైసీపీ నేతల ఆందోళన. సాధారణ రైతు చేతికి బేడీలు వేసిన ఫొటోలు, సోషల్ మీడియాలో వస్తే.. సర్కారు పరువు గంగలో కలసిపోతుందని తెలియని వారి చేతిలో, పోలీసు వ్యవస్థ ఉండటం దారుణమని వైసీపీ నేతలు మొత్తుకుంటున్నారు.   పోలీసులను యాక్షన్ చేయమంటే, ఓవర్ యాక్షన్ చేస్తున్నారని.. వారివల్లనే తమ ప్రభుత్వం పరువుపోతోందని, వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. పోలీసు ఓవరాక్షన్ వల్ల డీజీపీ, స్వయంగా రెండుసార్లు హైకోర్టు గడప తొక్కాల్సిన దుస్థితి కూడా, కిందిస్థాయి పోలీసులలో మార్పు తీసుకురాకపోవడమే విచిత్రం. ఇప్పుడు రైతులకు బేడీలు వేసిన పోలీసు ఓవరాక్షన్‌తో జగన్ ప్రభుత్వం, రైతుల ముందు ముద్దాయిగా నిలబడాల్సిన దుస్థితి వచ్చిందంటున్నారు. ఈ పరిణామం టీడీపీకి రాజకీయంగా కొత్త అస్త్రం ఇచ్చినట్టయిందని వాపోతున్నారు.   ‘రైతుల చేతికి సంకెళ్లు వేయమని జగన్ ఎందుకు చెబుతారు? మొన్న సర్వే రాళ్లకు, జగన్ ఫొటో వేసిన విషయం ఎవరికీ తెలియదు. అధికారులే ఓవరాక్షన్ చేశారు. అది తెలిసి మందలించడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. అంటే అది జగన్‌కు తెలియకుండానే జరిగిందని తేలింది కదా? తన ప్రభుత్వానికి చెడ్డపేరు రావాలని ఏ సీఎం అయినా కోరుకుంటారా? ప్రభుత్వం దగ్గర మార్కులు కొట్టేయాలన్న ఓవరాక్షన్‌తోనే ఇవన్నీ చేస్తున్నారు. ఇలాంటి వాటి వల్లనే, హైకోర్టు దృష్టిలో మేం చులకన అవుతున్నాం. ఇప్పుడు ఆ పోలీసులను సస్పెండ్ చేయవచ్చు. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది కదా? ఆ నష్టాన్ని పోలీసులు మళ్లీ భర్తీ చేయగలరా?’ అని ఓ వైసీపీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. నిజమే కదా?.. తన ప్రభుత్వం అప్రతిష్ఠ పాలవాలని, ఏ పాలకుడు మాత్రం కోరుకుంటారు? -మార్తి సుబ్రహ్మణ్యం

దుబ్బాకలో కేంద్ర బలగాలు!  బైపోల్ పై ఢిల్లీ నిఘా 

తెలంగాణ రాజకీయలను షేక్ చేస్తున్న దుబ్బాక ఉప ఎన్నిక ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఉప ఎన్నిక సందర్భంగా దుబ్బాక, సిద్దిపేటలో జరిగిన, జరుగుతున్న పరిణామాలపై కేంద్రం  సీరియస్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. లోకల్ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఫిర్యాదుల మీద ఫిర్యాదులు రావడం, బీజేపీ హైకమాండ్ కూడా ఫోకస్ చేయడంతో  దుబ్బాక ఉప ఎన్నిక విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దుబ్బాక నియోజకవర్గానికి కేంద్ర బలగాలను పంపించింది. ఉప ఎన్నిక కోసం వచ్చిన కేంద్ర బలగాలు దుబ్బాక నియోజకవర్గ వీధుల్లో  ఇప్పుడు కవాతు చేస్తున్నాయి. ఉప ఎన్నికను పర్యవేక్షించేందుకు  ప్రత్యేక పరిశీలకుడిని కూడా నియమించింది సీఈసీ.  ఒక రాష్ట్రంలో జరుగుతున్న ఒక అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం కేంద్ర బలగాలను మోహరించాల్సి వచ్చిందంటే దుబ్బాకలో పరిస్థితి ఏ రెేంజ్ లో ఉందో ఊహించవచ్చు. గతంలో తెలుగు రాష్ట్రాల్లో , తెలంగాణలో కూడా చాలా ఉప ఎన్నికలు జరిగాయి. కాని ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి తలెత్తలేదు. దుబ్బాక ఉప ఎన్నిక మాత్రం పొలిటికల్ హీట్ పెంచుతోంది. అన్ని పార్టీలు ఎన్నికలను సవాల్ గా తీసుకోవడం, ఎలాగైనా గెలిచేందుకు వ్యూహాలు రచిస్తుండటంతో రోజు రోజుకు నియోజకవర్గంలో సమీకరణలు మారిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న ప్రచారం అధికార పార్టీని కలవరపెడుతున్నట్లు కనిపిస్తోంది. ఉప ఎన్నికలో ఓడితే పరువు పోతుందన్న భయంతో టీఆర్ఎస్ పార్టీ దుబ్బాకలో అక్రమాలకు పాల్పడుతుందని విపక్షాలు చేస్తున్న ఆందోళనలు నియోజకవర్గంలో కాక రేపుతున్నాయి.  దుబ్బాక ఉప ఎన్నికలో ఎలాగైనా గెలిచేందుకు టీఆర్ఎస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతుందని బీజేపీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. తమ పార్టీ నేతలపై పోలీసులతో నిఘా పెట్టించిందని, భయబ్రాంతులకు గురి చేస్తోందని చెబుతోంది. ఈ నేపథ్యంలోనే రఘునందన్ రావు బంధువుల ఇండ్లలో పోలీసులు సోదాలు చేయడం తీవ్ర దుమారం రేపింది. మంత్రి హరీష్ రావు డైరెక్షన్ లో పోలీసులే  రఘునందన్ రావు ఇంట్లో డబ్బులు పెట్టారని బీజేపీ ఆరోపించగా.. ఆ ఇంట్లోనే డబ్బులు దొరికాయంటూ సిద్ధిపేట సీపీ వీడియో ఫూటేజీని విడుదల చేశారు. ఇక సిద్ధిపేట సోదాల ఘటనపై బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమించింది. సిద్ధిపేటకు వస్తున్న పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేయడం ఉద్రిక్తతను మరింత పెంచింది. తనపై సిద్ధిపేట పోలీసులు దాడి చేశారని ఆరోపించిన సంజయ్.. ఆయన్ను సస్పెండ్ చేయాలంటూ ఏకంగా దీక్షకే దిగారు.  బీజేపీ అభ్యర్ది రఘునందన్ రావు మామ, బంధువుల ఇంటిపై పోలీసుల సోదాలు, బంజి సంజయ్ పై పోలీసుల దురుసు ప్రవర్తనను బీజేపీ హైకమాండ్ సీరియస్ గా తీసుకుందని తెలుస్తోంది. దుబ్బాక లో జరుగుతున్న పరిణామాలపై బీజేపీ పెద్దలు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని సమాచారం.  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, దుబ్బాక పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు కు ఫోన్ చేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరాలు తీసుకుంటున్నారని తెలుస్తోంది సిద్ధిపేట, దుబ్బాక ఘటనలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు.. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులను అడ్డం పెట్టుకొని టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని చెప్పారు. స్థానిక పోలీస్ అధికారులపై తమకు నమ్మకం లేదన్నారు.  సిద్ధిపేట్ ఘటనపై సీబీఐ విచారణ జరపాలని, కేంద్ర బలగాలతో మాత్రమే దుబ్బాక ఉప ఎన్నికలు జరపాలని కోరారు. బీజేపీ నాయకులను పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తోన్న విషయాన్ని ఎన్నికల ప్రధానాధికారి దృష్టికి తీసుకెళ్ళారు కమలం నేతలు.  దుబ్బాకకు  ప్రత్యేక పరిశీలకుడిని నియమించాలని బీజేపీ ఈసీకి విన్నవించింది. రాష్ట్ర ప్రభుత్వంపై వస్తున్న ఫిర్యాదుల మీద  ఫిర్యాదులు, బీజేపీ పెద్దల జోక్యంతోనే  సరోజ్‌ కుమార్‌ ఠాకూర్‌ను ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం నియమించినట్లు తెలుస్తోంది.  తమిళనాడు కేడర్‌కు చెందిన సరోజ్‌ కుమార్‌.. ప్రస్తుతం చెన్నై సైబర్‌క్రైం విభాగ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. గత ఏడాది పశ్చిమబెంగాల్‌ ఉప ఎన్నికల పరిశీలకుడిగా పనిచేసిన సరోజ్‌కుమార్‌.. సమర్థంగా ఎన్నికలను నిర్వహించినందుకుగాను అవార్డు కూడా తీసుకున్నారు. ఉప ఎన్నికకు శాంతి భద్రతల పరిశీలకుడిగా సరోజ్‌ కుమార్‌ ఠాగూర్‌ను నియమించడాన్ని  బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ  బండి సంజయ్‌ కుమార్‌ స్వాగతించారు. ఉప ఎన్నికలో గెలుపు కోసం లోకల్ పోలీసులను అడ్డు పెట్టుకుని అడ్డదారులు తొక్కుతున్న కారు పార్టీ ఆగడాలు ఇకపై సాగవన్నారు సంజయ్. ఎన్నికల నిర్వహణలో సమర్థుడిగా పేరున్న సరోజ్ కుమార్ నియామకంలో దుబ్బాకలో అధికార పార్టీ అక్రమాలకు చెక్ పడుతుందని కమలం నేతలు చెబుతున్నారు.  దుబ్బాక ఉప ఎన్నిక ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో  గొడవలు జరిగే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. పోలింగ్ రోజున ఉద్రిక్తతలు తలెత్తవచ్చని భావిస్తున్నారు. అందుకే నియోజకవర్గంలో సమస్యాత్మక గ్రామాల్లో మరిన్ని బలగాలను మోహరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. మొత్తంగా  ఉపఎన్నిక పర్యవేక్షణకు ప్రత్యేక పరిశీలకుడిని నియమించడం,  కేంద్ర బలగాలను దించడంతో  దుబ్బాక నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన ప్రజల్లో కనిపిస్తోంది. గతంలో ఎప్పుడు లేనంతగా హీటెక్కిస్తున్న దుబ్బాకలో ఏం జరగబోతుందన్న దానిపై రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.

ఎన్నికలంటే భయమా? నిమ్మగడ్డే అడ్డమా? 

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామాలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. గుర్తింపు పొందిన అన్ని పార్టీలకు ఎన్నికల సంఘం ఆహ్వానం పంపింది. ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణపై అన్ని పార్టీల అభిప్రాయాలు, సూచనలను ఎన్నికల సంఘం తీసుకోనుంది. అయితే ఈ సమావేశానికి హాజరు కావడం లేదని అధికార వైసీపీ ప్రకటించింది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేసినప్పుడు ఎస్ఈసీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన వైసీపీ.. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నా సహకరించకపోవడం విమర్శలకు తావిస్తోంది.    కరోనా ప్రభావం ఉన్నా గతంలో స్థానిక ఎన్నికలు జరపాలని పట్టుబట్టిన జగన్ సర్కార్.. ఇప్పుడు మాట మార్చడం చర్చనీయాంశంగా మారింది. ఏపీ ప్రభుత్వ స్పందన రాజకీయ, న్యాయవర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కరోనాతో దేశం మొత్తం లాక్ డౌన్ విధించేసినా స్థానిక ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందేనని పట్టుబట్టింది వైసీపీ సర్కార్. ఎన్నికలను వాయిదా వేసిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై ఫైరయ్యారు సీఎం జగన్. మంత్రులు, వైసీపీ నేతలైతే ఆయన్ను దారణంగా టార్గెట్ చేశారు. ఎన్నికల కమిషనర్ గా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నిమ్మగడ్డను వ్యక్తిగతంగా దూషించారు. ఎస్‌ఈసీని కూడా తొలగించి రచ్చ రచ్చ చేసింది ప్రభుత్వం. కొత్త ఎన్నికల కమిషనర్ ను కూడా హడావుడిగా నియమించింది. అయితే ప్రభుత్వ చర్యలపై హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు నిమ్మగడ్డ రమేశ్ కుమార్. నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయంపై నానా రభస చేసిన జగన్ సర్కార్.. ఇప్పుడు ఎన్నికలు నిర్వహణకు వ్యతిరేకిస్తుండటంపై ప్రజల్లో చర్చ జరుగుతోంది.   ప్రస్తుతం దేశం కరోనా భయం నుంచి బయటపడుతోంది. ఏపీలో కూడా లాక్ డౌన్ ఎత్తేశారు. బీహార్ సహా అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. అయినా స్థానిక ఎన్నికలకు అధికార పార్టీ ఆసక్తి చూపడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలను ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నంత కాలం నిర్వహించకూడదన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లుగా తెలుస్తోంది. వచ్చే మార్చి వరకూ.. ఎస్‌ఈసీ పదవీ కాలం ఉంది. ఆ తర్వాత లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించి.. అ దిశగానే జగన్ సర్కార్ కార్యాకరణ రూపొందించిందని తెలుస్తోంది.   మరోవైపు విపక్షాలు మాత్రం స్థానిక ఎన్నికలకు వైసీపీ భయపడుతుందని ఆరోపిస్తున్నాయి. మూడు రాజధానుల పేరుతో ప్రభుత్వం చేస్తున్న తతంగంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని టీడీపీ ఆరోపిస్తోంది. జగన్ సర్కార్ నిర్ణయాలతో రాష్ట్రానికి పెట్టుబడులు ఆగిపోయాయని, గతంలో వచ్చిన కంపెనీలు వెనక్కి వెళ్లాయని, అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని చెబుతోంది. ఇటీవల వచ్చిన వరదల్లో నష్టపోయిన బాధితులకు సాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి. సర్కార్ నిర్లక్ష్యం వల్లే కరోనా కేసుల్లో దేశంలోనే ఏపీ రెండో స్థానంలో నిలిచిందనే విమర్శలు కొన్ని వర్గాల నుంచి వస్తున్నాయి. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడం వల్లే స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార పార్టీ భయపడుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.    ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను మార్చిలో నిర్వహించాలని గతంలో నిర్ణయించారు. నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసింది. అయితే దేశంలో కరోనా కేసులు నమోదు కావడంతో అంతటా భయాందోళన నెలకొంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. అయితే ఒక్కసారి ఎన్నికల ప్రక్రియ ఆగిపోతే.. తిరిగి ఈ ప్రక్రియను ప్రారంభించాలంటే రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాలను తీసుకుని ఆ ప్రకారం ముందుకు వెళ్లాలని గతంలో సుప్రీంకోర్టు చెప్పిందని వైసీపీ చెబుతోంది. ఎస్‌ఈసీ మాత్రం ఎన్నికల నిర్వహణపై చీఫ్‌ సెక్రటరీ గాని, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సెక్రటరీ గాని సంప్రదించలేదని ఆరోపిస్తోంది. ప్రభుత్వ అభిప్రాయంతో సంబంధం లేకుండా  రాజకీయపార్టీలను పిలవటంలోనే... ఎస్‌ఈసీకి వేరే ఉద్దేశాలు ఉన్నాయని స్పష్టమవుతుందని చెబుతోంది వైసీపీ. ఎన్నికల నిర్వహణను ఒక పవిత్ర మైన రాజ్యాంగ కర్తవ్యంగా కాకుండా ఒక డ్రామాగా నిమ్మగడ్డ భావిస్తున్నారని ఆరోపిస్తోంది వైసీపీ   మరోవైపు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కీలక  వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. ఎన్నికలు నిర్వహించేలా ఈసీకి సహకరించాలని ప్రభుత్వానికి సూచించింది. ఎన్నికల నిర్వహణపై తమను ఎన్నికల కమిషన్ సంప్రదించాలన్న ప్రభుత్వ వాదనలను హైకోర్టు తప్పుపట్టింది. ప్రభుత్వం దగ్గరకు వచ్చి ఓ రాజ్యాంగ సంస్థ అడగాలా? అని ప్రశ్నించింది.ఏయే చోట్ల ప్రభుత్వం సరిగ్గా సహకరించడం లేదో.. అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది హైకోర్టు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న దానిపై ప్రజ్లలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

నిమ్మగడ్డయితే... ప్రవీణుడికంటే ఎక్కువా ఏంటీ?

ఎల్వీ-ఏబీవీకే దిక్కులేదు   ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ను.. తన సముఖానికి రమ్మని సీఎంఓ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్  హుకుం జారీచేశారట. దానిపై నిమ్మగడ్డ వారు ఆగ్రహోదగ్రుడయి.. నా అంత ప్రముఖుడినే భేటీకి రమ్మంటారా? మీ సంగతి కోర్టులో తేలుస్తానని అగ్గిరాముడయ్యారట. ఇది ఇప్పుడు మీడియాకు పెద్ద వార్త. దానిపై బోలెడన్ని విశ్లేషణలు!   ఐఏఎస్ చదివిన నిమ్మగడ్డ వారు కూడా, మామూలు పామరుల మాదిరిగా ఆలోచించడమే హాశ్చర్యం. నిమ్మగడ్డ రమేషుల వారు రాష్ట్ర ఎన్నికల కమిషనరే  కావచ్చు. పూర్వాశ్రమంలో పెద్ద పెద్ద హోదాల్లో పనిచేసి ఉండవచ్చు. గవర్నర్‌కే సలహా ఇచ్చేంత మేధావి కావచ్చు. కానీ అవన్నీ మా ప్రవీణ్ ప్రకాష్ ముందు జాన్తానై! సారు చిన్నప్పటి నుంచీ అంతే! ఆయన దగ్గర ఉత్తరాది పప్పులు తప్ప, మరెవరి పప్పులూ ఉడకవు. అందుకే ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు పోస్టింగు పోయిన సతీష్ చంద్ర మాత్రమే మళ్లీ పోస్టింగు తెచ్చుకోగలిగారు మరి. అందుకే ఆయన దగ్గర తెలుగువాళ్ల పప్పులుడకవు. జగన్ ఉండగనే, జగన్ అంశలో పుట్టిన మరో జగన్ ఆయన! కాబట్టి.. నిమ్మగడ్డే కాదు.. ఏ గడ్డయినా ప్రవీణుల వారి కచేరీకి,  కాకితో కబురంపితే, రెక్కలు కట్టుకుని వాలిపోవాల్సిందే. దట్సాల్!   నిమ్మగడ్డదేముంది? బూతుల మంత్రి కొడాలి నాని చెప్పినట్లు, వచ్చే ఏడాది రిటైరయి, హైదరాబాద్ వెళ్లిపోతారు. కానీ ప్రవీణ్ ప్రకాష్ మాత్రం లోకల్. ఐదేళ్లూ ‘జగన్నా’ధుడి ఆలయంలోనే కొలువయి ఉంటారు. అయినా పెద్ద పెద్ద ఐఏఎస్, ఐపిఎస్సులే ప్రకాష్ ప్రావీణ్యానికి సలాములు కొట్టి గులాములవుతుంటే, వచ్చే ఏడాది రిటైరయ్యే నిమ్మగడ్డ గోడు వినిపించుకునేదెవరు? ప్రవీణేదో ముచ్చటపడి, ఆ ఎలక్షన్ వ్యవహారాలపై మాట్లాడాలి రమ్మని పిలిచారనుకోండి. వెళ్లి కాసేపు సారు చెప్పింది విని, ఇస్తే.. టీ తాగి రెండు బిస్కట్లు తిని, జీ హుజూరని వచ్చేస్తే పోయేది.   అలాకాకుండా..  అంత పెద్ద మనిషిని, అంతలావు అధికారాలున్న అధికారిని, సీఎంనే ఖాతరు చేయనవసరం లేని రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నన్నే రమ్మంటారా? హమ్మా? మీకెన్ని గుండెలు.. అసలు మీది గుండెనా? పోలవరం ప్రాజెక్టా అని,  సత్తెకాలపు చాదస్తాలకు వెళ్లి, ఆ విషయాన్ని ‘మిత్రమీడియా’కు లీకు చేయడం పిచ్చితనం కాక మరేమిటి? ఈ 17 నెలల కాలంలో,  జగనన్న తత్వం అర్ధం చేసుకోకపోవడమే నిమ్మగడ్డ తప్పు. బహుశా చాలా పథకాలకు జగనన్న పేరు పెట్టిన సర్కారు.. కేవలం ప్రభుత్వ ఉద్యోగుల కోసమే ‘జగనన్న తత్వం’ అనే పథకం పెట్టి ఉంటే, అధికారులకు ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో?!   నిమ్మగడ్డ వారి ఆవేదన అర్ధం చేసుకోదగ్గదే. ఆఫ్టరాల్ సీఎం ముఖ్య కార్యదర్శి నన్ను పిలవటమేమిటన్నది, ఆయన అంతరంగం పడుతున్న ఆవేద న కావచ్చు. కానీ, నిమ్మగడ్డ వారు కొలువు చేస్తోంది ఏపీలో అని  గుర్తుంచుకోవాలి. క్రికెట్ గ్రౌండ్‌లో కబడ్డీ ఆడకూడదు. కాదని కబడ్డీ ఆడితే ఫలితాలు ఇలాగే ఉంటాయి. అయినా.. ‘నన్నే పిలుస్తారా’ అని తెగ ఇదయిపోతున్న నిమ్మగడ్డను చూస్తే జాలి వేస్తుంది. తాను చెప్పింది చేయకుండా తల అడ్డంగా ఆడించిన, అంత పెద్ద చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యాన్నే శంకరిగిమాన్యాలు పట్టించారు. కోర్టుకెక్కి, తన ఉద్యోగం తనకివ్వాలని ఆదేశాలు తెచ్చుకున్న, డిజిపి స్థాయి సీనియర్ ఐపిఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకే ఇప్పటిదాకా, పోస్టింగు ఇవ్వకుండా చుక్కలు చూపిస్తున్నారు. కోర్టుకెళ్లిన తర్వాత ఇస్తున్న సగం జీతానికీ కత్తెర వేశారు.  మొన్నామధ్య ఓ సీనియర్ ఐఎఫ్‌ఎస్ అధికారి వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటే, అంతకంటే ముందే అదే వేధింపులకు గురయి..  మరో మహిళా అధికారి చనిపోతేనే,  ఇదేమిటని అడిగే దిక్కు-దమ్ము లేదు. నిజాయితీ గల అధికారిగా పేరుండి, పెద్దాయన వైఎస్ దగ్గర కార్యదర్శిగా పనిచేసిన మాదిరెడ్డి ప్రతాప్‌ను వెళ్లగొట్టినా ఇదేం అన్యాయమని అడిగే నాధుడు లేడు.  పేరుకు ఐఏఎస్-ఐపిఎస్ అసోసియేషన్లు ఉన్నా, అవి లెటర్‌హెడ్ సంఘాలే.   మరి అంతలావు సీనియర్లే..   ప్రకాష్  ప్రావీణ్యంతో విలవిల్లాడుతుంటే, మరికొద్ది నెలల్లో రిటైరయ్యే ఈ నిమ్మగడ్డేమిటి? తన ముందు తోకాడిస్తున్నారని పెద్ద సారుకు కోపం రాదూ? మిగిలిన అధికారుల మాదిరిగా..  ఏదో వచ్చామా?.. విన్నామా?.. చెప్పిన చోట చెప్పినట్లు సంతకం చేశామా?.. వెళ్లామా?.. నెల జీతం తీసుకుంటున్నామా? అని వచ్చిన పని చూసుకుని వెళ్లకుండా,  ఇలా ఎదురు ప్రశ్నలు వేస్తే.. ‘జగన్నా’ధ ఆలయంలోని ప్రధానార్చాకులు, అర్చకులకు ఒళ్లు మండిపోదూ?.. హేమిటో ఈ అధికారులు ఎప్పుడు నేర్చుకుంటారో? ఏమో?! -మార్తి సుబ్రహ్మణ్యం 

‘అమరావతి పాపం’ ఎవరిది..?

‘అమరావతి అవమానం’ మోదీదా? బీజేపీదా?   బీజేపీ-టీడీపీ భాగస్వాములే   బాబు జాగే కొంప ముంచింది   కులం కోణంలో జగన్ నిర్ణయాలు   అనాధగా మారిన అమరావతి   కడకు దిక్కయిన కోర్టులు   విభజన నుంచి ఇప్పటివరకూ.. దేశంలో  రాజధాని నగరం లేని, ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధిలో పురోగమిస్తుంటే, ఏపీ మాత్రం అనాధగా దిక్కులు చూస్తున్న విషాదం. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ,  అక్కడి రైతులు చేస్తున్న ఉద్యమానికి మూడొందల రోజులు దాటిపోయాయి. నాటి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు, సుప్రీంకోర్టు-హైకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో.. అమరావతిలో భూమి పూజ చేసిన ప్రాంతం ఇప్పుడు శ్మశానాన్ని తలపిస్తోంది.  సీఎం జగన్మోహన్‌రెడ్డి అమరావతిని కులం కోణంలో చూసి, ‘మూడు ముక్కలాట’కు తెరలేపడమే.. ఈ విషాదానికి అసలు కారణమన్నది బహిరంగ రహస్యం. ఒక్క జగన్మోహన్‌రెడ్డి మాత్రమే కాదు.. అటు బీజేపీ, ఇటు టీడీపీ.. అంతా కలసి, అమరావతిని అనాధను చేశారన్నది ఇప్పుడు వినిపిస్తున్న ఆరోపణ.   విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. శివరామకృష్ణన్ కమిటీ, దాని పర్యటనలు, ప్రజాభిప్రాయసేకరణ, దొనకొండలో రాజధానిని పెట్టాలని కొందరు, నూజివీడు అయితే బాగుంటుందని మరికొందరి సూచనల తర్వాత.. నాటి సీఎం చంద్రబాబు నాయుడు ‘నారాయణ కమిటీ’ని తెరపైకి తీసుకువచ్చారు. కసరత్తులన్నీ పూర్తయ్యాక, అమరావతిని రాజధానిగా తేల్చారు. దానికోసం 32 వేల ఎకరాలు ఇచ్చేందుకు రైతులు ముందుకొచ్చారు. వారిచ్చిన భూమునే పెట్టుబడిగా పెట్టి, మరికొంత కేంద్రసాయంతో రాజధాని నగరాన్ని నిర్మిస్తామని బాబు ప్రకటించారు. ఆ మేరకు రైతులకు కౌలుతోపాటు, కమర్షియల్ ప్లాట్లను కూడా ఇచ్చారు. కేంద్రం కూడా 7 వేల కోట్ల నిధులిచ్చిందని, ఆ డబ్బెక్కడికి పోయిందని సోము వీర్రాజు కొంతకాలం నుంచీ ప్రశ్నిస్తున్నారు. కానీ, అప్పటి సర్కారులో బీజేపీ కూడా భాగస్వామి అన్న వాస్తవాన్ని వీర్రాజు విస్మరించడం ఆశ్చర్యం.   జగన్మోహన్‌రెడ్డి సీఎం అయిన తర్వాత, మూడు రాజధానులకు తెరలేపడంతో,  అమరావతి కథ అర్ధంతరంగా ఆగిపోయింది. అక్కడ కమ్మ వర్గానికి చెందిన వారి భూములే.. ఎక్కువగా ఉన్నాయన్న అనుమానంతోనే, జగన్మోహన్‌రెడ్డి చూపు.. అమరావతి నుంచి విశాఖకు మళ్లింది. నాడు అక్కడ శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ, ఇప్పుడు మౌనమునిగా మారారు. అమరావతిపై మీడియాలో మాట్లాడవద్దని బీజేపీ నాయకత్వం, నేతలకు లక్ష్మణరేఖ గీసింది. అధికారంలో ఉన్నప్పుడు మీనమేషాలు, తాత్కాలిక కట్టడాలతో పేరుతో పబ్లిసీటీ చేసుకున్న చంద్రబాబు..  చేతులుకాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు.. ఇప్పుడు అమరావతి జపం చేస్తున్నారు. ఆ రకంగా అంతా కలసి, అమరావతిని అనాధను చేశారు. అందుకే ఈ పాపం అందరిన్నది ఆంధ్రుల ఆరోపణ.   పాపం అమరావతి! నిలువెత్తు బుద్దవిగ్రహం సాక్షిగా, ఇప్పుడు అమరావతికి భూములిచ్చిన రైతులు.. మంత్రులతో అమ్మనాబూతులు తిట్టించుకుంటున్నారు. ధర్మాన కృష్ణదాస్‌అనే మంత్రి, రైతులను లం.. కొడుకులంటారు. మరికొందరు మంత్రులు పెయిడ్ ఆర్టిస్టులంటారు. ఇంకొందరు మంత్రులు, టీ షర్టులేసుకుని ఉద్యమాలు చేస్తున్నారంటారు.  మరికొందరు అది ‘కమ్మ’రావతి అని వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తారు. స్పీకర్ లాంటి వ్యక్తి దానిని ఎడారి, శ్మశానంతో పోలుస్తారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు, వాటిని భరిస్తూ, సహిస్తూ, జైళ్లకు వెళ్లినా.. తమ ఉద్యమాన్ని 300 రోజులు దాటించారు. ప్రస్తుతం రాజకీయ పార్టీల పాపం పుణ్యాన, అనాధగా మారిన అమరావతి.. న్యాయం కోసం న్యాయస్థానం వైపు రోడ్డుకు మోకాళ్లు ఆనించి, దీనంగా చూస్తోంది.   మోదీ ప్రధాని హోదాలో వచ్చి శంకుస్థాపన చేశారు. ఢిల్లీని మించిన రాజధానిగా మారాలన్నారు. ఢిల్లీ కూడా చిన్నబోయేలా కొత్త నగరం ఉండాలన్నారు. ప్రపంచంలో అత్యుత్తమ రాజధాని నగరాలను, సందర్శించమని సలహా కూడా ఇచ్చారు. మేం మీ వెంట ఉన్నామని భరోసా ఇచ్చారు.  కాబట్టి బీజేపీ అమరావతి నగరాన్ని,  వాయువేగంతో నిర్మిస్తుందని భావించారు. ఆ తర్వాత అక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలకు భూములు కూడా కేటాయించారు. దానితో ఇంకేముంది? అమరావతి నగర నిర్మాణం, పంచకల్యాణి గుర్రంలా పరుగులు పెడుతుందనుకున్నారు.  కానీ చంద్రబాబుతో దొస్తీ చెడటంతో, బీజేపీ తీరు కూడా మారింది. దానికితోడు నిర్మాణాల తాలూకు డీపీఆర్ కూడా కేంద్రానికి ఇవ్వలేదు. అప్పటికీ కన్నా లక్ష్మీనారాయణ హయాంలో అమరావతికి అనుకూలంగానే తీర్మానించారు. ఆయన కూడా రైతులతో కలసి ధర్నా నిర్వహించారు. మౌనదీక్ష నిర్వహించారు. ఇప్పుడు పరిస్థితి అందుకు రివర్సు. బీజేపీలో అమరావతి గురించి ఎవరు మాట్లాడితే, వారిపై వేటు వేస్తున్నారు.   ఈలోగా.. ఒక జీవీఎల్, ఇంకో సోము, ఇప్పుడు విష్ణువర్దన్‌రెడ్డి రూపంలో వెలువడిన అపశకునాల బట్టి, అమరావతికి కమలం పార్టీ కూడా శల్యసారథ్యం వహిస్తోందని స్పష్టమయింది. పైగా రాజధాని వ్యవహారంలో కేంద్ర ప్రమేయం ఏమీ లేదని, అఫిడవిట్ ఇచ్చింది. దీన్నిబట్టి.. మెడ మీద తల ఉన్న ఎవరైనా, అమరావతి అంశంలో జగన్ దారిలోనే.. బీజేపీ వెళుతోందన్న విషయం అర్ధమయి తీరాలి. అందుకే అమరావతి రైతులు ఢిల్లీలో కాళ్లకు బలపాలు కట్టుకుని తిరిగినా, అక్కడే ఉన్న మోదీ నుంచి ఒక్కమాట కూడా రాలేదంటే.. ఈ వ్యవహారంలో బీజేపీ పాత్ర ఏమిటన్నది సుస్పష్టం.   ఇక అమరావతి పాపంలో, చంద్రబాబుదే సింహభాగమన్నది.. ఈ పరిస్థితి-దుస్థితి అనుభవిస్తున్న వారి మాట. అధికారంలో ఉన్నప్పుడు గెజిట్‌లో అమరావతిని చేర్చకుండా.. డిజైన్లు, అత్యుత్తమ రాజధానుల సందర్శనల పేరిట చేసిన,  ప్రచారంతో కూడిన కాలయాపనే ఈ పరిస్థితికి మూలం అన్నది,  మెజారిటీ వర్గాల అభిప్రాయం. తాత్కాలిక నిర్మాణాలతో కాంట్రాక్టర్లకు దోచిపెట్టే యోచన, పూర్తి స్థాయి నిర్మాణాలకు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అసలు జగన్ దానిపై దృష్టి సారించే అవకాశం కూడా ఉండేది కాదన్నది వారి వాదన. నిజమే కదా మరి? తాత్కాలిక సచివాలయం పేరుతో బాబు, బడా కాంట్రాక్టరుకు సర్కారు భూమి ఇచ్చి మరీ, వందల కోట్లు సమర్పించుకున్నారు. సదరు కంపెనీ నిర్మించిన సచివాలయం ఖరీదు, హైదరాబాద్‌లో నిర్మించే భవనాలతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ ఖర్చు.   నెల్లూరు నారాయణ సారథ్యంలో జరిగిన ఈ వ్యవహారంలో.. కాంట్రాక్టర్లు, వారిచ్చే కమిషన్లతో  టీడీపీ లాభపడితే, పూర్తిగా నష్టపోయింది మాత్రం రైతులేనంటున్నారు. విభజన జరిగిన వెంటనే చంద్రబాబు మేల్కొని, బెజవాడకు వచ్చి పూర్తి స్థాయి నిర్మాణాలు చేయని పాపమే.. ఇప్పుడు రైతులకు శాపమైంది. అదే  జగన్ మూడురాజధానుల ఆలోచనకు, ఊపిరిపోసిందనేది మెజారిటీ వర్గాల నిశ్చితాభిప్రాయం. అటు.. అమరావతిని ‘కమ్మ’రావతిగా ప్రచారం చేసిన వైసీపీ నేతలు, ఇప్పటివరకూ దానిని నిరూపించలేకపోయారు. అటు టీడీపీ కూడా, దానిని అబద్ధమని నిరూపించే ప్రయత్నం చేయకుండా.. నారాయణ, పుల్లారావు వంటి భూములు కొన్న  నేతలను కాపాడేందుకే ప్రాధాన్యమిచ్చింది. అమరావతి నిర్మాణ సమయంలో, నానా హడావిడి చేసిన ‘నారాయణ మాస్టారు’ ఇప్పుడు,  ఏ కలుగులో దాగున్నారో ఎవరికీ తెలియదు.   నగర నిర్మాణం అవుతుందో లేదో తెలియని అయోమయం.. మూడు పంటలు పండే భూములిచ్చి.. ఇప్పుడు నెత్తిన చేయి పట్టుకున్న రైతులే, అమరావతిని కాపాడుకునే పనిలో ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సర్కారుకు.. ఎదురొడ్డి పోరాడుతున్న వేలాది మంది రైతులు, వారి పక్షాన పోరాడుతున్న ఒక సుంకర పద్మశ్రీ, మరో వెగలపూడి గోపాలకృష్ణ ప్రసాద్, పువ్వాడ సుధాకర్, ఇంకో మార్టిన్, కంభంపాటి శిరీష, దుర్గాభవానీ, అక్కినేని వనజ వంటి జేఏసీ నేతలే, ఇప్పుడు అమరావతి కథలో హీరోలు. మరి వారంతా హీరోలయితే.. మోదీ-చంద్రబాబు-జగన్‌తోపాటు, అమరావతి గ్రామాలలో వీరవిహారం చేసి.. ఆడబిడ్డ తెచ్చుకున్న టిఫిన్ బాక్సులో ఉప్మా తిని, చివరాఖరకు కమలంతో చేతులు కలిపి.. ఇప్పుడు ఉద్యమాన్ని కాడికిందపడేసిన,  జనసేన వీరుడు పవన్ సంగతేమిటన్న సందేహం రావచ్చు.  ప్లీజ్.. ఆ ఒక్కటీ అడక్కు! అది మీ ఇష్టం!! -మార్తి సుబ్రహ్మణ్యం

కిడ్నాపర్లను గుర్తించడానికి ఐదు రోజులా! టెక్నాలజీ  తుస్సేనా! 

శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శం.. సాంకేతిక టెక్నాలజీ వినియోగిస్తూ కేసులు చేధించడంలో తెలంగాణ పోలీసులే టాప్.. రాష్ట్రంలో ఎక్కడ చీమ చిట్టుకుమన్నా గుర్తించే పరిజ్ఞానం మన పోలీసుల సొంతం.. ఇవి గత ఐదేండ్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్న మాటలు.  గొప్పగా చేసుకుంటున్న ప్రచారాలు. గత ఆరేండ్లలో పోలీస్ శాఖకు భారీగా నిధులిచ్చామని, హైటెక్ సౌకర్యాలు కల్పించామని, రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఆయన చెబుతుంటారు. కాని ఒక్క ఘటన తెలంగాణ పోలీసుల సత్తాకు సవాల్ గా నిలిచింది. మహబూబా బాద్ కిడ్నాప్ కేసు తెలంగాణ పోలీసుల పనితీరును ప్రశ్నించేలా మారింది. తెలంగాణ కాప్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిహసించేలా చేస్తోంది.    మహబూబా బాద్ లో జరిగిన బాలుడి కిడ్నాప్ కేసులో పోలీసుల తీరుపై చాలా ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయి. హైటెక్ టెక్నాలజీ ఉన్న రోజుల్లోనూ కిడ్నాపర్లను గుర్తించడానికి ఐదు రోజులు తీసుకోవడం ఏంటనే ఆరోపణలు వస్తున్నాయి. అది కూడా కిడ్నాపర్లు డబ్బుల కోసం బాలుడి పేరెంట్స్ తో మాట్లాడుతూనే ఉన్నారు. బాలుడి పేరెంట్స్ చుట్టే  పోలీసులు తిరిగారు. కిడ్నాపర్ల ఫోన్లను పోలీసులు కూడా విన్నారు. అయినా వారెవరో, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారో , కిడ్నాపర్లు ఫోన్ మాట్లాడుతున్న లొకేషన్ ఏంటో వెంటనే కనిపెట్టలేకపోయారు. ఎక్కడో అమెరికాలో ఉన్న వ్యక్తి లొకేషన్ ను మినిట్ టు మినిట్ ట్రేస్ చేసే టెక్నాలజీ ఉన్న ప్రస్తుత సమయంలో ... మహబూబా బాద్  పోలీసులకు కిడ్నాపర్లను గుర్తించడానికి ఇంత సమయం ఎందుకు పట్టిందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ప్రజల్లో కూడా ఇవే అనుమానాలు వస్తున్నాయి. ప్రభుత్వం చెబుతున్న గొప్ప టెక్నాలజీ ఎక్కడ పోయిందని వారు ప్రశ్నిస్తున్నారు.    ఆదివారం సాయంత్రం దీక్షిత్ రెడ్డి కనిపించకుండా పోయారు. అదే రోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పోలీసుల దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. డబ్బుల కోసం కిడ్నాపర్ సోమవారం బాలుడి పేరెంట్స్ కు 11 సార్లు ఫోన్ చేశారని చెబుతున్నారు. మంగళవారం సైలెంట్ గా ఉన్న అగంతకులు బుధవారం మళ్లీ బాలుడి పేరెంట్స్ తో టచ్ లోకి వచ్చారు. డబ్బులు ఇవ్వాలని, ఇక్కడికి రావాలని, డబ్బును అక్కడ పెట్టి వెళ్లండని ఫోన్ కాల్స్ చేస్తూనే ఉన్నారు. అయినా ఐదు రోజులుగా బాలుడి కోసం వెతుకుతున్న పోలీసులు మాత్రం కిడ్నాపర్ల జాడ కనిపెట్టలేకపోయారు. దీంతో పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ఈ కాలంలో కూడా కిడ్నాపర్లు ఫోన్ లో మాట్లాడుతున్నా గుర్తించకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీక్షిత్ రెడ్డి కేసులో మహబూబా బాద్ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి.   అయితే మహబూబా బాద్ ఎస్పీ కోటిరెడ్డి మాత్రం కేసులో తామెక్కడ నిర్లక్ష్యం వహించలేదని చెప్పారు. కిడ్నాపర్ చాలా తెలివిగా వ్యవహరించాడని, తనను ట్రేస్ చేయకుండా ఉండటానికి ఫోన్ వాడలేదని తెలిపారు. బాలుడి పేరెంట్స్ కు ఇంటర్ నెట్ కాల్స్ చేశారని ఎస్పీ వెల్లడించారు. యాప్ ద్వారా ఇంటర్ నెట్ కాల్స్ చేయడం వల్లే కిడ్నాపర్ ను గుర్తించడం వెంటనే సాధ్యం కాలేదన్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ సాయంతో కిడ్నాపర్ వాడిన యాప్ ను గుర్తించి.. అతని మార్గంలోనే యాప్ సాయంతోనే గుర్తించామని చెప్పుకొచ్చారు. కిడ్నాపర్ యాప్ వాడటం వల్లే గుర్తించడానికి ఎక్కువ సమయం పట్టిందని ఎస్పీ తెలిపారు. అయితే ఎస్పీ ప్రకటనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం సాధారణ జనాలే హైటెక్ టెక్నాలజీని  ఉపయోగిస్తూ డిజిటల్ వండర్స్ చేస్తున్నారు. పోలీసుల దగ్గర మరింత అత్యాధునిక పరిజ్ఞానం అందుబాటులో ఉంటుంది. అయినా యాప్ ద్వారా మాట్లాడుతున్న కిడ్నాపర్ ను వెంటనే గుర్తించే టెక్నాలజీ లేకపోవడం ఏంటనే విమర్శలు జనాల నుంచి వస్తున్నాయి. టెక్నాలజీ వినియోగంలో  పూర్ గా ఉన్న ఈ పోలీసులనే .. దేశానికే ఆదర్శమని సీఎం కేసీఆర్ చెబుతున్నారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.    మహబూబా బాద్ జిల్లా కేంద్రంలోనే దీక్షిత్ రెడ్డి కిడ్నాప్ జరిగింది. బాలుడిని బైక్ పై తీసుకుని దర్జాగా వెళ్లాడు కిడ్నాపర్. కాని ఎక్కడా సీసీ టీవీలో అవి రికార్డు కాలేదు. అంటే మహబూబా బాద్ జిల్లా కేంద్రంలో సీసీ కెెమెరాలు కొన్ని ప్రాంతాల్లోనే ఉన్నాయని దీన్ని బట్టి అర్ధమవుతోంది. అందుకే కిడ్నాపర్ విజువల్స్ ఎక్కడా చిక్కలేదని, పట్టణ శివారులోని ఒక ప్రాంతంలోనే అతడి విజువల్ రికార్డైందని తెలుస్తోంది. జిల్లా ఎస్పీ కూడా ఇదే విషయం చెప్పాడు. అయితే జిల్లా కేంద్రంలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు సరిగ్గా లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కెమెరాలు ఎక్కడ అమర్చారనే ప్రశ్నలు వస్తున్నాయి. జిల్లా కేంద్రంలోనే పరిస్థితి ఇలా ఉంటే గ్రాామాలు, పల్లెల్లో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.    ఐదేండ్ల క్రితం ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో మిస్సైన బాలుడిని ఇటీవలే అసోంలోని గోలపారాలో గుర్తించి త‌ల్లిదండ్రుల చెంత‌కు చేర్చారు. తెలంగాణ స్టేట్ పోలీసులు అభివృద్ధి చేసిన ఫేస్ రికగ్నిషన్ యాప్ ద‌ర్ప‌న్ ద్వారా ఇది సాకార‌మైందని డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు. ద‌ర్ప‌న్ ద్వారా తెలంగాణ పోలీసులు బాలుడిని గుర్తించి ఆచూకీని క‌నుగొన్నారని ఆయన తెలిపారు. ఇంతటి టెక్నాలజీ ఉన్న తెలంగాణ పోలీసులు.. ఫోన్ లో మాట్లాడుతున్న కిడ్నాపర్లను గుర్తించడానికి ఐదు రోజులు తీసుకోవడం చర్చనీయాశంగా మారింది. మొత్తంగా మహబూబా బాద్ ఘటన తెలంగాణ పోలీసుల ప్రతిష్టకు మచ్చగా, సీఎం కేసీఆర్ గొప్పగా చేసుకుంటున్న ప్రచారానికి గండి కొట్టేదిగా మారిందనే చర్చే జనాల్లో ఎక్కువగా జరుగుతోంది.

సకుటుంబ సపరివార సమేత!

అచ్చెన్నాయుడికే దక్కిన అధ్యక్ష పదవి   నారా-నందమూరి ఫ్యామిలీకి చెరో రెండు   బాబాయ్-అబ్బాయ్, తల్లీ కొడుకులకు చోటు   కళాకు ఒక న్యాయం, రమణకు మరో న్యాయం   కొత్త వారికి పదవులతో పార్టీ పరుగులు   టీడీపీ జాతీయ-రాష్ట్ర కమిటీల తీరిది   ఎట్టకేలకు చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ-రాష్ట్ర కమిటీలు ప్రకటించారు. ఇందులో నారా-నందమూరి కుటుంబాలకు చెరో రెండు పదవులు దక్కగా, బాబాయ్-అబ్ణాయ్, తల్లీ-కొడుకులకు రెండేసి పదవులు లభించాయి. అయితే ఏపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావును తొలగించిన నాయకత్వం, తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా మాత్రం ఎల్.రమణను కొనసాగించటం ఆశ్చర్యం. పైగా ఇతర కమిటీల్లో ఉన్న వారికి మరో కమిటీలో కూడా స్థానం కల్పించటం పార్టీ శ్రేణులకు విస్మయం కలిగించింది.   చంద్రబాబు ప్రకటించిన పార్టీ జాతీయ-రాష్ట్రాల కమిటీలలో కొత్త వారికి స్థానం కల్పించడం, ముఖ్యంగా యువతకు, బడుగు వర్గాలకు చోటివ్వడం ద్వారా, పార్టీని పరుగులు పెట్టించే వ్యూహం కనిపిస్తోంది. అయితే ఈ కమిటీలో అగ్ర కులానికి సంబంధించి వైశ్య కులానికి ఒకరికి చోటివ్వగా, బ్రాహ్మణ వర్గానికి ప్రాతినిధ్యం కనిపించలేదు. తెలంగాణ నుంచి ఒక మహిళా నేతకు బ్రాహ్మణ కోటా నుంచి ఇచ్చారని చెబుతున్నప్పటికీ, ఆమె ఆ సామాజికవర్గానికి చెందిన వారు కాదని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. గతంలో శిద్దా రాఘవరావుకు కోశాధికారి ఇవ్వగా, ఇప్పుడు అదే వైశ్య వర్గానికి చెందిన శ్రీరాం తాతయ్యకు ఆ పదవి ఇచ్చారు. రాష్ట్రంలో వైశ్య జనాభా ఎక్కువగానే ఉన్నా, ఒక్కటే ఇచ్చారు. నిజానికి అధ్యక్ష పదవి దక్కించుకున్న అచ్చెన్నాయుడు పోలినాటి వెలమ కంటే, వైశ్య వర్గం నాలుగింతల సంఖ్య ఎక్కువగా ఉండటం ప్రస్తావనార్హం. అయితే, రాష్ట్రంలో ప్రాబల్యం ఉన్న రెడ్డి వర్గానికి కేవలం మూడు పదవులే దక్కడం ప్రస్తావనార్హం. సోమిరెడ్డి, కోట్ల, రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డికి మాత్రమే స్థానం లభించింది. కడప-కర్నూలు-నెల్లూరు-అనంతపురం-చిత్తూరులో రెడ్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆ వర్గం నుంచి ఈసారి పెద్దగా చోటు లభించలేదు. బహుశా రెడ్లు వైసీపీ వైపు ఉంటారన్న భావనతో, సంఖ్య తగ్గించి ఉండవచ్చంటున్నారు. జెసి కుటుంబానికి పదవి ఇస్తామని చెప్పినప్పటికీ, దివాకర్‌రెడ్డి వద్దని తిరస్కరించినట్లు చెబుతున్నారు. మొత్తంగా కమిటీలో, కమ్మ వర్గానికి 9 పదవులు లభించాయి. కేంద్ర కమిటీలోని 27 మందిలో ఓసీలకు 51, మిగిలిన వర్గాలకు 49 శాతం పదవులు దక్కాయి.   ఇక అంతా అనుకున్నట్లే, అచ్చెన్నాయుడుకు ఏపీ అధ్యక్ష పదవి దక్కింది. ఈఎస్‌ఐ అక్రమాల కేసులో ఆయన ఇటీవలే జైలుకు వెళ్లి వచ్చారు. బహుశా ఆ అర్హతతోనే ఆయనకు ఆ పదవి లభించి ఉండవచ్చు. అంటే పార్టీ కోసం జైలుకెళ్లిన వారికి, పార్టీ అండగా ఉంటుందన్న సంకేతాలిచ్చేందుకే, ఆయనకు అధ్యక్ష పదవి ఇచ్చి ఉండవచ్చు. జైలుకు వెళ్లి వచ్చిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రకూ పొలిట్‌బ్యూరో దక్కినందున, ఆవిధంగానే భావించాల్సి ఉంది. ఇక చంద్రబాబు ఎలాగూ జాతీయ అధ్యక్షుడు. లోకేష్‌కు మళ్లీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి లభించింది. అయితే, బాబు వియ్యంకుడయిన నందమూరి బాలకృష్ణకు పొలిట్‌బ్యూరో, నందమూరి హరికృష్ణ కమార్తె సుహాసినీకి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవులు దక్కడం ద్వారా, నారా-నందమూరి కోటాలు భర్తీ చేసినట్టయింది.   అయితే, జాతీయ ప్రధాన కార్యదర్శుల్లో నరా లోకేష్, వర్ల రామయ్య, రామ్మోహన్‌నాయుడు, నిమ్మల రామానాయుడు, బీద రవిచంద్ర, కొత్తకోట దయాకర్‌రెడ్డిలలో.. ఒక్క నారా లోకేష్‌కు మాత్రమే, సెంట్రల్ కమిటీ నుంచి పొలిట్‌బ్యూరో ఎక్స్‌అఫిషియో సభ్యుడి అయ్యే అవకాశం లభించింది. జాతీయ ప్రధాన కార్యదర్శుల్లో ఒకరైన రామయ్యకు పొలిట్‌బ్యూరోలో స్థానం కల్పించి, మళ్లీ అదే పోలిట్‌బ్యూరోలో లోకేష్‌కు ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా అవకాశం లభించడం ప్రస్తావనార్హం. గల్లా అరుణకు జాతీయ ఉపాధ్యక్ష పదవి, ఆమె కుమారుడు గల్లా జయదేవ్‌కు పొలిట్‌బ్యూరో పదవి లభించింది.   ఇక ఈసారి కొత్తగా రాజకీయ కార్యదర్శి పదవి సృష్టించి, దానిని టిడి జనార్దన్‌కు ఇవ్వగా, కార్యాలయ కార్యదర్శి పదవి అశోక్‌బాబుకు లభించింది. దానిని గతంలో ఏవి రమణ నిర్వహించేవారు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డికి జాతీయ ఉపాధ్యక్షుడు, సీనియర్ నేత బుచ్చయ్యచౌదరికి పొలిట్‌బ్యూరో, ఇటీవలి కాలంలో దూకుడుగా వెళతూ సర్కారుకు చెమటలు పట్టిస్తున్న పట్టాభికి జాతీయ అధికార ప్రతినిధి పదవులు దక్కడం విశేషం. కొత్త కమిటీలో ప్రధానంగా పట్టాభికి కీలక స్థానం ఇవ్వడంపై హర్షం వ్యక్తమవుతోంది. అయితే ఇప్పటికే తెలంగాణ మహిళా అధ్యక్షురాలిగా ఉన్న జోత్స్నకు మళ్లీ జాతీయ అధికార ప్రతినిధి, ఏపీ మహిళా అధ్యక్షురాలిగా ఉన్న అనితకు పొలిట్‌బ్యూరోలో, జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వర్ల రామయ్యకు మళ్లీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా అవకాశం లభించడం ప్రస్తావనార్హం. ఇది జాబితా కూర్పులో పొరపాటు జరిగిందా లేక, జాబితానే ఆవిధంగా రూపొందించారో తెలియదని నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.     ఇక తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా ఎల్.రమణను మళ్లీ  కొనసాగించడం చర్చనీయాంశమయింది. విఫల నాయకుడిగా పార్టీలో ఇబ్బంది పడుతున్న ఆయనను కొనసాగించడంపై పార్టీ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. రమణ స్థాయిలో చెప్పింది వినే నాయకుడు లేకపోవడమే బహుశా ఆయన కొనసాగింపునకు కారణం కావచ్చంటున్నారు. మరి ఏపీలో కళా వెంకట్రావును ఏ ప్రాతిపదిక తొలగించి, తెలంగాణలో ఏ ప్రాతిపదికన రమణను కొనసాగించారో అర్ధం కావడం లేదంటున్నారు. ఇంకా కనీసం వెంకట్రావు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. టీడీపీకి 23 స్థానాలయినా వచ్చాయని, కానీ రమణ సారథ్యంలో పార్టీ మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని గుర్తు చేస్తున్నారు. పైగా రమణపై తెలంగాణ పార్టీ  నేతలంతా తిరుగుబాటు చేసినా, బాబు ఆయననే కొనసాగించడంపై విస్మయం వ్యక్తమవుతోంది.   అయితే, తెలంగాణ నుంచి సీనియర్ నేత అరవిందకుమార్ గౌడ్‌కు పొలిట్‌బ్యూరో, జాతీయ అధికార ప్రతినిధిగా నర్శిరెడ్డి, కొత్తకోట దయాకర్‌రెడ్డి- బక్కని నర్శింహులుకు జాతీయ ప్రధాన కార్యదర్శి, మెచ్చా నాగేశ్వరరావుకు జాతీయ ఉపాధ్యక్ష పదవులివ్వడం ద్వారా, తెలంగాణకు పెద్దపీట వేసినట్టయింది. ఎలాగూ రావుల పోలిట్‌బ్యూరోలోనే కొనసాగుతున్నారు. కానీ, రమణను అధ్యక్ష పదవి తొలగించకుండా, కొసాగించడం ద్వారా.. తెలంగాణలో పార్టీకి ఆయన తప్ప మరో దిక్కు, సమర్ధులు లేరన్న సంకేతం పంపినట్టయింది.   అయితే ఏపీలో అచ్చెన్నాయుడు, తెలంగాణలో రమణ అధ్యక్షులుగా ఉన్నప్పటికీ.. వారికెవరికీ సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదన్నది బహిరంగ రహస్యమే. కాబట్టి అధ్యక్షులుగా ఎవరున్నా పెద్దగా ఒరిగేదేమీ లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు-లోకేష్ దిశానిర్దేశంలోనే పనిచేయాలి కాబట్టి.. ఎవరికి ఏ పదవి ఇచ్చినా ఒకటేనని స్పష్టం చేస్తున్నారు. ఈసారి పితాని, కొల్లు రవీంద్ర, బీద రవిచంద్ర, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, బచ్చుల అర్జునుడు, శ్రీరాం రాజగోపాల్ తాతయ్య, నక్కా ఆనందబాబు వంటి వారికి స్ధానం కల్పించడం అభినందనీయమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కానీ, దూకుడుగా వెళ్లే ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్‌కు ఎక్కడా చోటు లభించకపోవడం చర్చనీయాంశమయింది. ఒకవేళ పయ్యావుల కేశవ్‌కు పీఏసీ చైర్మన్ ఇచ్చినందున ఆయనకు పదవి ఇవ్వలేదనుకున్నా.. మరి టీడీఎల్పీ ఉపనేతగా ఉన్న అచ్చెన్నాయుడికి, అధ్యక్ష పదవి ఎలా ఇచ్చారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.  -మార్తి సుబ్రహ్మణ్యం

ల‌క్ష మందికైనా స‌రే సాయం చేస్తాం- కేసీఆర్ 

హైద‌రాబాద్ వరద ముంపు బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సాయం ప్రకటించారు. నగరంలో వరద ప్రభావానికి గురైన ప్రతి ఇంటికీ రూ.10 వేల సాయం చేయనున్నట్లు తెలిపారు. మంగళవారం ఉదయం నుంచే ఆర్థిక సాయం అందజేయనున్నట్లు చెప్పారు. పేద‌ల‌కు సాయం అందించ‌డం కోసం మున్సిప‌ల్ శాఖ‌కు ప్ర‌భుత్వం రూ. 550 కోట్లు త‌క్ష‌ణం విడుద‌ల చేస్తుంద‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల వ‌ల్ల ఇల్లు పూర్తిగా కూలిపోయిన వారికి రూ. ల‌క్ష చొప్పున, పాక్షికంగా దెబ్బ‌తిన్న ఇండ్ల‌కు రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించ‌నున్న‌ట్లు కేసీఆర్ తెలిపారు.    భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల వ‌ల్ల హైద‌రాబాద్ న‌గ‌రంలోని లోత‌ట్టు ప్రాంతాల్లోని ప్ర‌జలు ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల‌కు గుర‌య్యార‌ని, వారిని ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. వ‌ర‌ద నీటిలో మునిగిన ప్రాంతాల్లోని ఇళ్ల‌ల్లో నివ‌సిస్తున్న వారు ఎంతో న‌ష్ట‌పోయార‌ని, ఇళ్ల‌లోకి నీళ్లు రావ‌డం వ‌ల్ల బియ్యం స‌హా ఇత‌ర ఆహార ప‌దార్థాలు త‌డిసిపోయాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దెబ్బ‌తిన్న ర‌హ‌దారులు, ఇత‌ర మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు యుద్ధ‌ప్రాతిప‌దిక‌న మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టి, మ‌ళ్లీ మ‌మూలు జీవ‌న ప‌రిస్థితులు నెల‌కొనేలా చూడాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు.    గ‌డిచిన వందేళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షం హైదరాబాద్ నగరంలో కురిసిందన్నారు కేసీఆర్. ప్రజలు అనేక కష్ట, నష్టాలకు గురయ్యారు.. ముఖ్యంగా నిరుపేదలు, బస్తీలలో ఉండే వారు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు ఎక్కువ కష్టాల పాలయ్యారు.వారిని ఆదుకోవడం ప్రభుత్వ ప్రాథమిక విధి అని చెప్పారు. కష్టాల్లో ఉన్న పేదలకు సాయం అందించడం కన్నా ముఖ్యమైన భాద్యత ప్రభుత్వానికి మరొకటి లేదన్నారు. అందుకే ప్రభావిత ప్రాంతాల్లోని పేదలకు ఇంటికి 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించామ‌ని సీఎం కేసీఆర్ తెలిపారు.    నగరంలో 200-250 బృందాలను ఏర్పాటు చేసి, అన్ని చోట్లా ఆర్థిక సాయం అందించే కార్యక్రమం పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు. హైదరాబాద్ నగర పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల కలెక్టర్లు, వారి బృందాలు వెంటనే రంగంలోకి దిగి మంగళవారం ఉదయం నుంచే ఆర్థిక సాయం అందించే కార్యక్రమం చేపట్టాలని సీఎం ఆదేశించారు. పేదలకు సాయం అందించడం అతి ముఖ్యమైన బాధ్యతగా స్వీకరించి హైదరాబాద్ నగరానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ అంతా భాగస్వాములు కావాలని సూచించారు. నష్టపోయిన ప్రజలు ఎంతమంది ఉన్నా సరే, లక్షల మందికైనా సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.    హైదరాబాద్ లో మళ్లీ మామూలు జీవన పరిస్థితులు నెలకొనేలా చూడాలని అధికారులకు కేసీఆర్ ఆదేశించారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. సీఎంఆర్‌ఎఫ్‌కు విరివిగా విరాళాలు అందించాలని కోరారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.

హోమ్ క్వారంటైన్ లో ఏపీ బీజేపీ!

అంతన్నారు.. ఇంతన్నారు.. రాష్ట్ర సర్కార్ అంతు తేలుస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యమన్నారు. కాని ఇప్పుడు మాత్రం తుస్సుమంటున్నారు. 2024లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న బీజేపీ ఉనికే..  ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కనిపించడం లేదనే చర్చ జరుగుతోంది. పార్టీ కొత్త బాస్ సోము వీర్రాజు పూర్తిగా సైలెంట్ అయిపోయినట్లు కనిపిస్తోంది. ఆయన ఎక్కడున్నారో పార్టీ నేతలకే తెలియడం లేదట. సోము తీరుపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ కేడర్ లో ఆందోళన నెలకొంది. పార్టీ భవిష్యత్ పై కమలం నేతల్లో కలకరం కనిపిస్తోంది.     ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం చాలా సమస్యలున్నాయి. భారీ వర్షాలు, వరదలతో జనాలు అల్లాడిపోతున్నారు. లక్షలాది ఎకరాల్లో పంటలు నీట మునగడంతో అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తడంతో వేలాది మంది రోడ్డున పడ్డారు. జగన్ సర్కార్ తమను పట్టించుకోవడం లేదని, కనీసా సాయం కూడా చేయడం లేదని వరద బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే  ప్రతిపక్ష పార్టీగా ప్రజలు సమస్యలపై పోరాడాల్సిన బీజేపీ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. బీజేపీ ముఖ్య నేతలెవరు మాట్లాడటం లేదు. వరద బాధితులకు బాసటగా సర్కార్ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించడం లేదు. కొన్ని రోజులుగా సోము వీర్రాజు ముఖమే కనిపించడం లేదు. బీజేపీ ముఖ్య నేతల తీరుపై జనాలు ఫైరవుతున్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అందుబాటులో లేకుండా పోవడమేంటనీ ప్రశ్నిస్తున్నారు.    సోము వీర్రాజు మొదటి నుంచి వైసీపీకి ఫేవర్ గానే ఉన్నారు. వరదల విషయంలో జగన్ సర్కార్ విఫలమైందని జనాలు ఆరోపిస్తున్నారు. దీంతో వరదలపై మాట్లాడితే జగన్ ప్రభుత్వాన్ని విమర్శించాల్సి వస్తుందనే ఆయన సైలెంట్ గా ఉంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వీర్రాజుపై సొంత పార్టీ నేతలు గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. రాష్ట్రమంతా సమస్యల్లో ఉంటే మాట్లాడకపోవడం ఏంటనీ కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారట. కన్నా లక్ష్మినారాయణ పార్టీ చీఫ్ గా ఉండగా... ఆయన అన్ని అంశాలపై వెంటనే స్పందించేవారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేవారు. ప్రజలకు అండగా ప్రభుత్వంపై ఘాటు ప్రకటనలు చేసేవారు. కాని కొన్ని రోజులుగా బీజేపీలో అలాంటి సీన్ కనిపించడం లేదు. దీనిపైనే ఏపీ బీజేపీలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కన్నాతో పోలుస్తూ వీర్రాజు తీరుపై చాలా మంది నేతలు గుర్రుగా ఉన్నారని చెబుతున్నారు.    తిరుమల విషయంలోనూ జగన్ సర్కార్ వరుసగా వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటోంది. టీటీడీ నిర్ణయాలపై భక్తులు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాని హిందూ పార్టీగా చెప్పుకునే బీజేపీ మాత్రం టీటీడీ నిర్ణయాలపై మాట్లాడటం లేదు. టీటీడీ డిక్లరేషన్ విషయంలోనూ సోము వీర్రాజు స్పందించలేదు. రాష్ట్రమంతా బీజేపీ కార్యకర్తలు ఆందోళనలు చేసిన పార్టీ చీఫ్ మాత్రం సైలెంట్ గానే ఉన్నారు. టీటీడీ వివాదాస్పద నిర్ణయాలపై బీజేపీ అధ్యక్షుడు మాట్లాడకపోవడంపై  హిందూ సంఘాలు విస్మయ వ్యక్తం చేస్తున్నాయి. సోము వీర్రాజు సహా కొత్త కార్యవర్గం తీరు బీజేపీలోనూ చర్చనీయాంశంగా మారిందని తెలుస్తోంది.   ఇక బీజేపీ అధికార ప్రతినిధి విష్ణువర్దన్ రెడ్డి బహిరంగంగానే వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. కొన్ని రోజులుగా విష్ణువర్దన్ రెడ్డి చేస్తున్న ప్రసంగాలతో ఆయన బీజేపీ లీడరా.. వైసీపీ నాయకుడో అర్ధం కావడం లేదని కొందరు కమలం నేతలు అసహనం చేస్తున్నారు. అయినా తీరు మార్చుకోని విష్ణువర్దన్ రెడ్డి.. ప్రధాని మోడీని తీవ్రంగా వ్యతిరేకించే సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషన్ ను సమర్ధించడం కమలనాధుల్లోనే కలకలం రేపుతోంది. అది కూడా దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై ఆరోపణలు చేస్తూ జగన్ రాసిన లేఖకు మద్దతుగా ఆయన మాట్లాడటం బీజేపీకి ఇబ్బందిగా మారుతోంది. ప్రధాని మోడీకి, బీజేపీకి వ్యతిరేకంగా నిత్యం వాదించే, కోర్టుల్లో పిటిషన్లు వేసే న్యాయవాదిని.. వైసీపీ కోసం సమర్ధించడంపై కొందరు బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.      సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డిల వైఖరితో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఉందా లేక అధికార పార్టీలో కలిసిపోయిందా అన్న అనుమానాలు కొందరిలో వ్యక్తమవుతున్నాయి. బీజేపీ విపక్ష పార్టీగా పని చేస్తోందో లేక వైసీపీకి బీ టీమ్ గా మారిందో తెలియడం లేదని కొందరు కమలం నేతలు ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి నేతలతో పార్టీ బలోపేతం కావడం కలేనని.. రోజు రోజుకు బలహీన పడి ఉనికి కోల్పోయే పరిస్థితి వస్తుందని మరికొందరు తేల్చి చెబుతున్నారు. కేంద్రంలో అధికారం ఉండటంతో.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం ఈజీ. కాని ఏపీ బీజేపీ ముఖ్యనేతలు మాత్రం అధికార పార్టీ మోజుతో పార్టీని నాశనం చేస్తున్నారనే ఆరోపణలు కార్యకర్తల నుంచి వస్తున్నాయి. సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డిల తీరుతో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ హోం క్వారంటైన్ లో ఉందనే చర్చ ఏపీ జనాల్లోనూ జోరుగా సాగుతోంది. మరీ హోం క్వారంటైన్ నుంచి త్వరగా బయటికి వస్తారో లేక వైసీపీ సేవలో తరిస్తూ బీజేపీని బొంద పెడతారో చూడాలని కొందకు బీజేపీ నేతలు కామంట్ చేస్తున్నారు.

టీడీపీ బీసీ ఓటు బ్యాంకుకు జగన్ బీటలు

స్కూలు పిల్లలకు మతం-కులం లేదు   పాఠశాలలో కుల-మత నమోదుకు పాతర   139 కులాలకు 56 కార్పొరేషన్ల ఏర్పాటు   వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. మొండితనానికి, గుండెధైర్యానికి నిలువెత్తు చిరునామా. ఆయనొక సంచలనం. విజయమయినా, వివాదమయినా ఆయన దారే వేరు. ఏదయినా అనుకున్నారంటే చేసేయడమే. జగన్ తీసుకున్న అనేక నిర్ణయాలు.. జనరంజకమన్న ప్రశంసలు, మెజారిటీ వర్గాల నుంచి వినిపిస్తుంటే.. ప్రజావ్యతిరేకమని ఇంకొన్ని వర్గాల్లో ఇప్పటికీ వినిపిస్తుంటాయి. న్యాయవ్యవస్థతో పోరాటానికి తెరలేపిన జగన్.. ఆయనను అభిమానించే వారి దృష్టిలో మాత్రమే కాకుండా, న్యాయవ్యవస్థ లోపాలపై అసంతృప్తితో ఉన్న అనేకమంది దృష్టిలో.. ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ అనిపించుకుంటున్నారు. మరికొన్ని వర్గాలు మాత్రం సహజంగానే జగన్ నిర్ణయాన్ని విమర్శిస్తున్నాయి. ఇన్ని వైరుధ్యాలు ఉన్నందుకే, దేశం ఇప్పుడు  జగన్మోహన్‌రెడ్డిని ఆసక్తిగా చూస్తోంది. అది సానుకూల కోణమా? వ్యతిరేక కోణమా అన్నది వేరే విషయం!   ఇన్ని సంచలనాలకు కేంద్ర బిందువయిన జగన్మోహన్‌రెడ్డి.. తాజాగా తీసుకున్న రెండు విప్లవాత్మక నిర్ణయాలు, జనం దృష్టిలో ఆయనను హీరోను చేశాయి. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్ధులకు, రిజిస్టర్‌లో కులం-మతం ప్రస్తావన ఉండకూడదన్న నిర్ణయం... మెజారిటీ ప్రజలనే కాదు, విద్యావంతులు, సమాజహితం కోరుకునే వారిని సైతం మెప్పిస్తోంది. ఇప్పటివరకూ స్కూలు దశ నుంచే కుల-మత భావనలు మొదలయ్యేవి. విద్యార్ధి కులం-మతాన్ని విధిగా ప్రస్తావించాల్సి వచ్చేది. జగన్ సర్కారు తాజాగా ఈ నిబంధనకు పాతరేసింది. రిజిస్టరులో విద్యార్ధి కులం-మతాన్ని పేర్కొనకూడదని ఆదేశించింది.     ఈ నిర్ణయం వల్ల.. పాఠశాల స్థాయి నుంచే మొదలవుతున్న, కుల-మత భావనకు పాతర వేయవచ్చన్న అభిప్రాయం మేధావి వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఆంధ్రాలో ఇప్పటికే కులభావన తీవ్రస్థాయి నుంచి, ఉన్మాద దశకు చేరుకుంది. విజయవాడ న గరం పరిసర ప్రాంతాల్లో, ఏడాది పాటు ఉండి వచ్చిన ఎవరికయినా.. కుల వ్యవస్థపైనే అసహ్యం పుట్టడం ఖాయం. ఇప్పటికీ అక్కడ కులాల వారీగా ఫంక్షన్లు, స్నేహాలతోపాటు.. కుల ఘర్షణలూ జరుగుతున్న అరాచక సంప్రదాయం కనిపిస్తోంది. వాహనాలపై తమ కులాలను సగర్వంగా ప్రకటించుకునే సంస్కృతి దేశంలో ఒక్క బెజవాడలోనే కనిపిస్తుంటుంది. ఫలానా కులం వారికే ఇల్లు అద్దెకు ఇస్తామన్న దిక్కుమాలిన కులతత్వం దర్శనమిస్తుంటుంది.   నిజానికి ఇలాంటి కుల భావన ప్రారంభం కావడానికి.. పాఠ శాల స్థాయి నుంచి ప్రభుత్వమే, కుల ప్రస్తావన తీసురావడమే కారణం. అందుకే ఆ విధానాన్ని తొలగించాలని గతంలో వామపక్ష ప్రముఖులు, సంఘాలు డిమాండ్ చేసేవి. అయినా ఏ ప్రభుత్వమూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు జగన్ ఆ మార్పు తీసుకురావడాన్ని సాహసోపేత నిర్ణయంగానే భావిస్తున్నారు.   ఇక 139 కులాలకు 56 కార్పొరేషన్లు  ఏర్పాటు చేయడం కూడా, సాహసోపేత నిర్ణయంగానే భావిస్తున్నారు. గత ఎన్నికల ముందు అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు కూడా, 28 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. అయితే, వాటిని ఎన్నికల నోటిఫికేషన్ నెల-రెండు నెలల ముందు ఏర్పాటు చేయడంతో, అవి కార్యాచరణకు నోచుకోలేకపోయాయి. ఎన్నికల కోడ్ కారణంగా,  చివరకు చాలామంది పదవీ బాధ్యతలు కూడా తీసుకోలేకపోయారు. మరికొందరు మాకొద్దని రాజీనామా చేశారు. ఇప్పుడు జగన్ ఏకంగా... 139 కులాలకు 56 కార్పోరేషన్లు ఏర్పాటుచేసి, బడుగుల పెదవులపై చిరునవ్వులు పూయించారు. చంద్రబాబులా ఎన్నికల ముందు కాకుండా.. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల ముందు ఏర్పాటుచేయడంతో, అది జగన్ చిత్తశుద్ధిని చాటినట్టయింది.   సహజంగా అరడజను కార్పోరేషన్లు.. అవి కూడా విడతల వారీగా ఏర్పాటుచేసే సంప్రదాయం ఉంది. ఆ సందర్భంగా ఆయా కులాల వారీతో సన్మానాలు చేయించుకోవడం, మళ్లీ కొంత గడువు తర్వాత మరికొన్ని కార్పొరేషన్లు ఏర్పాటుచేసేవారు. కానీ ఇప్పుడు ఏకంగా.. 56 కార్పొరేషన్లు ఏర్పాటుచేయడమంటే, అది అసాధారణ అంశమే కాదు. సాహసోపేతం కూడా! ఎందుకంటే వీటి పాలకవర్గాల్లో సగం మంది మహిళలకు కేటాయించడం అభినందనీయమే. ఇందులో ఉప కులాలకూ స్థానం కల్పిస్తామని జగన్ సర్కారు ప్రకటించింది. ఇప్పటివరకూ దాదాపు అన్ని ప్రభుత్వాలూ యాదవ, శెట్టిబలిజ, తూర్పు కాపు వంటి ప్రధాన బీసీ కులాలకే అన్నింటా ప్రాధాన్యం ఇచ్చేవి. అసలు ఉప కులాల గురించి పట్టించుకున్న పాలకులెవరూ ఇప్పటిదాకా కనిపించలేదు. ఇప్పుడు ఆ లోటును కూడా జగన్మోహన్‌రెడ్డి సర్కారు భర్తీ చేసినట్టయింది. గత 16 నెలల కాలంలో.. 2,71,37,253 మంది బీసీలకు, 33,500 కోట్ల లబ్థి చేకూర్చినట్లు ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది.   కాగా జగన్మోహన్‌రెడ్డి...  బడుగులకు సంబంధించి తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం, టీడీపీ బీసీ ఓటు బ్యాంకుపై ‘పిడుగుపాటు’గానే కనిపిస్తోంది. బీసీల పార్టీగా పేరున్న టీడీపీ.. గత ఐదేళ్లు అధికారంలో ఉన్న కాలంలో,  తన బీసీ మూల సిద్ధాంతాన్ని విస్మరించింది. కాపుల ఓట్ల కోసం, పార్టీకి సంప్రదాయ మద్దతుదారైన బడుగులను పక్కకుపెట్టింది. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు-బీసీలకు శత్రుత్వం ఉందని తెలిసినా.. కాపులు ముద్రగడ వైపే ఉన్నారని తెలిసినా, పార్టీలోని కొందరు కాపు నేతల ఒత్తిళ్లకు లొంగి, కాపులను బీసీ రిజర్వేషన్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. దానితో ఆగ్రహించిన బీసీలు టీడీపీకి వ్యతిరేకంగా మారారు. పోనీ అలాగని రిజర్వేషన్ ప్రకటన సాధించిన కాపులేమైనా, టీడీపీకి ఓటు వేశారా అంటే అదీలేదు. కాపులు కూడా వైసీపీకే జైకొట్టడంతో టీడీపీ పరాజయం పాలవ్వాల్సి వచ్చింది.   దీనితో దిద్దుబాటుకు దిగిన బాబు.. ఈసారి బలమైన బీసీ వర్గానికి పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చేపనిలో ఉన్నారు. పోయిన బీసీ ఓటు బ్యాంకును, తిరిగి సాధించే ప్రణాళిక రూపొందిస్తున్న దశలో... జగన్ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం, టీడీపీ బీసీ ఓటు బ్యాంకును, వైసీపీ కొల్లగొట్టేదిగానే కనిపిస్తోంది. ఎందుకంటే, 10 లక్షల జనాభా ఉన్న కులాలకు ఏ కేటగిరి, లక్ష నుంచి పది లక్షల వరకూ బి, లక్షలోపు జనాభా ఉన్న కులాలను సి కేటగిరిలో చేర్చారు. అంటే ప్రస్తుతం ప్రతీ బీసీకి ఒక కార్పోరేషన్ ఏర్పాటుచేసినట్టయింది.   ఇప్పటివరకూ ఇవన్నీ బీసీ కార్పొరేషన్ కిందనే ఉండేవి. జగన్ తాజా నిర్ణయంతో, అన్ని బీసీ కులాలకు సొంత కార్పొరేషన్ సమకూరినందున, సహజంగా ఆయా కులాలలో ఇది, జగన్‌పై సానుకూలత పెంచే అంశంగానే భావించక తప్పదు. అయితే... వీటికి బడ్జెట్, లబ్ధిదారులకు ఇచ్చే రుణాలు, పాలకమండలికి కార్యాలయాలు, వాహనాల ఏర్పాటు వంటి అంశాలపై కూడా ఇంతే దూకుడు ప్రదర్శించకపోతే, కొత్త కార్పోరేషన్ల ఏర్పాటు కంటితుడుపుగానే మిగిలిపోక తప్పదు.  -మార్తి సుబ్రహ్మణ్యం