Read more!

విశాఖ  ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేస్తున్న కేంద్రం! జగన్ రెడ్డి మౌనంపై మండిపడుతున్న జనం  

విశాఖ ఉక్కు ఇక అంధ్రుడికి గతమే.  జగన్ రెడ్డి సర్కార్ మొద్దు నిద్రతో ‘విశాఖ ఉక్కు...ఆంధ్రుల హక్కు’ అంటూ పోరాడి సాధించుకున్న కర్మాగారాన్ని అమ్మేస్తోంది  కేంద్ర ప్రభుత్వం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తోంది.  విశాఖ స్టీలు ప్లాంటును ప్రైవేటీకరిస్తున్నట్లు కేంద్ర డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే ట్వీట్ చేశారు. దీనికి గ‌త నెల‌లో జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదముద్ర వేసినట్లు చెప్పారు. 

విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో(రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌) పెట్టుబడులను ఉపసంహరించాలని కొన్నాళ్లుగా కేంద్రం భావిస్తోంది. ఇందు కోసం ముందుగా పోస్కోను రంగంలోకి దింపింది. దక్షిణ కొరియాకు చెందిన ఈ సంస్థ నాణ్యమైన స్టీల్‌ను తయారుచేస్తుందని, విశాఖ ఉక్కుకు చెందిన భూములు దానికి ఇవ్వడానికి ఒప్పందం చేసుకుంది. కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నా పట్టించుకోలేదు. చివరికి ఏకంగా 100 శాతం వాటా విక్రయించడానికి నిర్ణయం తీసుకుంది. ఇంత జరుగుతున్నా ఏపీ సర్కార్ లో కదలిక  ఆరోపణలు వస్తున్నాయి.  విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తున్నా వైసీపీ ప్రభుత్వం మౌనంగా ఉండటంపై ఆంధ్రా జనం మండిపోతున్నారు. ఆంధ్రుల హక్కుగా పోరాడి సాధించుకున్న కర్మాగారాన్ని కేంద్రం అమ్మేస్తున్నా స్పందించకపోవడం దారుణమంటున్నారు. 

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తున్నా వైసీపీ ప్ర‌భుత్వం క‌నీసం ప్ర‌శ్నించ‌లేక‌పోతోంద‌ని టీడీపీ ఆరోపిస్తోంది. 'వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుమతి ఇచ్చిన కేంద్రం. దీని పైన నోరు విప్పని వైసీపీ ప్రభుత్వం, వైఎస్ జ‌గ‌న్. ప్రైవేటీకరణ పేరుతో ఉక్కు పరిశ్రమను నొక్కిన కేంద్రం' అంటూ టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు. కార్మిక ఉక్కు సంకల్ప శక్తితో ఎదిగిన ఉక్కు కర్మాగారానికి కేంద్ర ప్ర‌భుత్వం చేయూతను ఇవ్వాల్సింది పోయి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కి ఇవ్వడం ఆక్షేపణీయం. ఇదేనా పరిపాలన..? ఇదేనా అచ్చే దిన్.. న‌రేంద్ర మోదీ?' అని గోరంట్ల బుచ్చయ్చ చౌద‌రి ప్ర‌శ్నించారు. 

ఆంధ్రుల పోరాటంతో  ఏర్పాటయిన విశాఖ ఉక్కులో నూటికి నూరుశాతం కేంద్రం పెట్టుబడులు ఉన్నాయి. ఏటా 6.3 మిలియన్‌ టన్నుల ఉత్పాదక సామర్థ్యం ఈ పరిశ్రమ సొంతం. విశాఖ ఉక్కులో 17 వేల మంది పర్మనెంట్‌ ఉద్యోగులతో పాటు మరో 15 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. ఉత్పత్తి సామర్థ్యం 63 లక్షల టన్నులు.  2017 నుంచి విశాఖ ఉక్కు భారీ నష్టాలతో నడుస్తోంది.  ఉత్పత్తి తగ్గించుకోవలసి వచ్చింది. విశాఖ ఉక్కుకు సొంత గనులు లేవు. ముడి ఇనుమును మార్కెట్‌ ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. దాంతో ఉత్పత్తి వ్యయం అధికంగా ఉంటోంది. ఇదే నష్టాలకు అసలు కారణమని గతంలోనే నిపుణులు నివేదికలు ఇచ్చారు. కరోనా నేపథ్యంలో ఇప్పుడు మరింత సంక్షోభంలో చిక్కుకుంది. 

విశాఖ ఉక్కులో 2017-18లో 16,618 కోట్ల అమ్మకాలు జరగ్గా... రూ.1,368 కోట్ల నష్టాన్ని నమోదుచేసింది. ఆ తరువాత ఏడాది 2018-19లో రూ.20,844 కోట్ల అమ్మకాలు జరగడంతో నష్టాలను రూ.97 కోట్లకు తగ్గించగలిగింది. 2019-20లో అమ్మకాలు భారీగా పడిపోయాయి. అమరావతిలో నిర్మాణాలు సహా పలు భారీ ప్రాజెక్టులు నిలిచిపోవడం, కరోనా, లాక్‌డౌన్‌ వంటి కారణాలతో రూ.15,920 కోట్ల దగ్గరే ఆగిపోయాయి. దాంతో రూ.3,910 కోట్లకు నష్టాలు పెరిగాయి. ఆ తరువాత ముడి ఇనుము, కోకింగ్‌ కోల్‌, డోలమైట్‌ వంటి ముడి సరకుల ధరలు పెరగడంతో ఉత్పత్తి వ్యయం పెరిగింది. అయితే గత డిసెంబరులో స్టీల్‌ రేట్లు పెరగడంతో మంచి అమ్మకాలు జరిగాయి. ఒక్క డిసెంబరులోనే రూ.2,200 కోట్లు విక్రయాలు చేసి, రూ.200 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇదే ధరలు కొనసాగితే రెండేళ్లలో లాభాల బాటలోకి వస్తుందని కార్మిక వర్గాలు చెబుతున్నాయి.

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విక్రయించకుండా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించడానికి అనేక మార్గాలు ఉన్నాయని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ప్రస్తుతం స్టీల్‌కు డిమాండ్‌ పెరిగింది. టన్ను టోకున రూ.50 వేలు చొప్పున విక్రయిస్తున్నారు. గత డిసెంబరులో రూ.2,200 కోట్ల విలువైన ఉత్పత్తులు విక్రయించగా, రూ.200 కోట్ల నికర లాభం వచ్చింది. సమీప భవిష్యత్తులోను ఇదే ఒరవడి కొనసాగుతుందని, అమ్మకాలు బాగుంటాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఒక్క రెండేళ్లు మార్కెట్‌ బాగుంటే నష్టాలను రికవరీ చేసి మళ్లీ లాభాల బాటలోకి వస్తామని, ప్రైవేటీకరణ చేయవద్దని, వాటాలు విక్రయించవద్దని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.  రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో పోరాడి ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం కాకుండా చూడాలని కోరుతున్నారు.