Read more!

పంచాయతీలకు ఆన్ లైన్ నామినేషన్లు? జగన్ కు నిమ్మగడ్డ షాక్ ఇవ్వబోతున్నారా? 

ఏపీ సర్కార్, రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య తీవ్ర వివాదంగా మారిన పంచాయతీ ఎన్నికల వ్యవహారం సుప్రీంకోర్టు తీర్పుతో కొలిక్కి వచ్చింది. జగన్ సర్కార్ ఎన్ని ఎత్తులు వేసినా పంచాయతీ ఎన్నికల విషయంలో వెనక్కి తగ్గని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఎన్నికల నిర్వహణలోనూ దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా నామినేషన్ల అంశంలోనూ నిమ్మగడ్డ అధికార పార్టీకి షాకిస్తూ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. 

పంచాయతీ పోరులో వీలైనన్ని ఎక్కువ గ్రామాలను ఏకగ్రీవంగా గెలుచుకోవాలని అధికార వైసీపీ ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలను భారీగా పెంచేసింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే ప్రభుత్వం ప్రకటన విడుదల చేయడంపై  ప్రతి పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  నజరానాలను ఎరగా చూపి ఏకగ్రీవాలు చేసుకోవాలని, అవసరమైతే ఇతర పార్టీ నేతలను భయపెట్టి, బెదిరించి నామినేషన్లు వేయకుండా చూడాలని వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బలవంతపు ఏకగ్రీవాలు జరుగుతున్నాయని.., ప్రతిపక్షాలు బలపర్చే అభ్యర్థులను పోటీ చేయనీయకుండా బెదిరిస్తున్నారని బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు ఆరోపిస్తున్నాయి. అధికార పార్టీ అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆన్ లైన్ నామినేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

బీజేపీ, జనసేన నేతలు  గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.  ఏకగ్రీవాల విషయంలో ప్రభుత్వం వైఖరిని వారు గవర్నర్ కు వివరించారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగేలా చూడాలని కోరారు. బీజేపీ నుంచి  సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, మధుకర్ జీ.. జనసేన తరఫున నాదేండ్ల మనోహర్, శ్రీనివాస్ యాదవ్  రాజ్ భవన్ వెళ్లారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా చోట్ల ఏకగ్రీవం చేసేందుకు, విపక్ష పార్టీల అభ్యర్థులు పోటీలో లేకుండా చేయడం, నామినేషన్లు వేసిన వారిని కూడా భయపెట్టి వారు విత్ డ్రా చేసుకునేలా చేసిన ఘటనలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు బీజేపీ, జనసేన నేతలు.  

 పంచాయతీ ఎన్నికల్లో బెదిరింపుల పర్వానికి అడ్డుకట్ట వేయాలంటే ఆన్ లైన్ నామినేషన్లు ఒక్కటే మార్గమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఏకగ్రీవాల పేరుతో ప్రతిపక్ష అభ్యర్థులను అధికార పార్టీ భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. గత ఏడాది స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలను పునరావృతం కాకుండా ఉంటే ఆన్ లైన్ నామినేషన్ ఒక్కటే మార్గమని.. అలాగే అభ్యర్థులు ధైర్యంగా నామినేషన్ వేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు సోము వీర్రాజు. అధికార పార్టీ దాడులను అరికట్టాలని ఎస్ఈసీని కోరారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా వైసీపీ బలవంతపు ఏకగ్రీవాలకు యత్నిస్తోందని.. ఎస్ఈసీ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తోంది. అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని టీడీపీ చీఫ్ చంద్రబాబు మండిపడ్డారు. ప్రజల ఆమోదం లేని ఈ తరహా ఏకగ్రీవాలు ఉపేక్షించేది లేదు ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. . 

ప్రతిపక్షాల నుంచి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.., ఏకగ్రీవాలపైనే దృష్టి పెట్టాలని స్పష్టమైన ఆదేశాలిచ్చేరు. బలవంతపు ఏకగ్రీవాలు ఎక్కడ జరిగినా అడ్డుకోవాలన్నారు. గతంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదని ఆదేశించారు. ఏకగ్రీవాల సంఖ్య అపరిమితంగా పెరిగితే ఖచ్చితంగా జోక్యం చేసుకుంటామన్నారు నిమ్మగడ్డ.  తాజా పరిణామాల నేపథ్యంలో ఆన్ లైన్ లో నామినేషన్ల స్వీకరణపై అధికారులతో నిమ్మగడ్డ చర్చిస్తున్నారని తెలుస్తోంది. సాఫ్ట్ వేర్ సమస్యలపై చర్చించాకా.. ఆయన ఆన్ లైన్ నామినేషన్ల దిశగా చర్యలు తీసుకోవచ్చని చెబుతున్నారు. అదే జరిగితే ఏకగ్రీవాల కోసం ప్రయత్నిస్తున్న అధికార పార్టీ ప్రయత్నాలకు చెక్ పడినట్లే.