Read more!

ప్రధాని మోడీ డేంజర్ గేమ్ ఆడుతున్నారా? ఎర్రకోట ఘటనతో జనాల్లో భయాందోళన?

ప్రధాని నరేంద్ర మోడీ నిప్పుతో చెలగాటమాడుతున్నారా? గత అనుభవాలు కమలనాధులను  భయపెడుతున్నాయా? దేశం ఎటు వైపు వెళుతుందోనన్న ఆందోళన ప్రజల్లో కనిపిస్తోందా?  దేశంలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో ఇవే అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండు నెలలుగా శాంతియుతంగా రైతులు చేస్తున్న ఉద్యమం గణ తంత్ర దినోత్సవం రోజున హస్తినలో నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీతో గతి తప్పింది. దేశ రాజధానిలో హింసకు కారణమైంది. దేశ చరిత్రలోనే ఎప్పుడు జరగని విధంగా కొందరు వ్యక్తులు  ఎర్రకోటలోకి చొరబడటం..  ప్రతి ఏటా ప్రధానమంత్రి  జాతీయ జెండా ఎగరేసే చారిత్రక కట్టడంపై రైతన్న జెండా ఎగరవేయడం  తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీలో మంగళవారం జరిగిన పరిణామాలు దేశ ప్రజలను భయాందోళనకు గురి చేశాయి. ఎర్రకోట ఘటన తర్వాత వెలుగుచూస్తున్న విషయాలు మరింత విస్మయపరుస్తున్నాయి. 
     
ఎర్రకోటను మట్టడించింది తమ పని కాదని, విద్రోహ శక్తులు తమ ర్యాలీలో చేరి అల్లర్లు సృష్టించారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.  ఖలీస్తాన్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారు ర్యాలీలో చొరబడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి. ట్రాక్టర్ల పరేడ్ సందర్భంగా కొందరు తల్వార్లతో రోడ్లపై తిరగడం, పోలీసులపై దాడి చేయడం వంటి ఘటనలు జరగడంతో.. ఢిల్లీ అల్లర్ల వెనక సంఘ విద్రోహ శక్తుల ప్రమేయం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఖలీస్తాన్ ఉగ్రవాదుల పేరుతో ఒక సామాజిక వర్గాన్ని కొందరు టార్గెట్ చేస్తున్నారు. సిక్కులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదీ దేశానికి ప్రమాదకరమని కొందరు మేధావులు చెబుతున్నారు. ఇందుకు గతంలో జరిగిన పరిణామాలను వారు వివరిస్తున్నారు. గతంలో సిక్కులకు వ్యతిరేకంగా పలు నిర్ణయాలు తీసుకుని.. ఐరన్ లేడీగా పేరొందిన ఇందీరా గాంధీనే రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేస్తున్నారు. 

మన దేశ రక్షణలో సిక్కులు, పంజాబీల పాత్రే గొప్పది. దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఎక్కువగా అసువులు బాసింది పంజాబీలే. దేశ స్వాతంత్రం కోసం ఉరి తీసిన 121 మందిలో 93 మంది పంజాబీలే ఉన్నారు. జీవిత ఖైదు విధించిన 2 వేల 626 మందిలో 2 వేల 147 మంది పంజాబీలేనని లెక్కలు చెబుతున్నాయి.  ఇండియా ఆర్మీలో ఎక్కువ మందే వారే ఉంటారు. దేశం కోసం ఏటా వందలాది ప్రాణాలు అర్పిస్తుంటారు. దేశ భక్తిలో సిక్కులతో ఎవరూ పోటీపడలేరని చెబుతారు. అలాంటి సిక్కుల గురించి కొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటం అందరిని కలవరపరుస్తోంది. రైతుల ఉద్యమంపై  మొదటి నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు కొందరు బీజేపీ నేతలు. రైతులకు ఖలిస్తానీయులు, మావోయిస్టులతోను లింక్ ఉందన్నారు. కేవలం పంజాబ్ రైతులే వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నారని మరికొందరు ఆరోపించారు. బీజేపీ నేతల కామెంట్లపై సిక్కు వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దేశ రక్షణలో ముందుండే సిక్కులతో విభేదాలు తెచ్చుకోవడం మంచిది కాదనే అభిప్రాయం బీజేపీ సీనియర్ల నుంచి కూడా వస్తుందట. 
 
 ఢిల్లీ హింసాత్మక ఘటనల తర్వాత కొత్త వాదనలు తెరపైకి వస్తున్నాయి.  కేంద్ర సర్కార్ సమస్య పరిష్కారానికి సీరియస్ గా స్పందించలేదనే ఆరోపణలే ఎక్కువ మంది నుంచి వినిపిస్తున్నాయి. రైతులను ఒప్పంచి ఆందోళన విరమించేలా చేస్తే.. ప్రపంచం ముందు భారత్ పరువు పోయేది కాదనే  అభిప్రాయం  వస్తోంది. రైతుల చేస్తున్న పోరాటాన్ని గౌరవించి వారితో కేంద్ర సర్కార్ చర్చలు జరిపితేనే బెటరనే చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా రైతుల దగ్గరకు వెళ్లి చర్చలు జరిపితే సమస్య త్వరగా పరిష్కారం అవుతుందంటున్నారు. రైతుల దగ్గరకే మోడీ వెళితే.. ఆయన కూడా హీరోగా నిలుస్తారని  చెబుతున్నారు. ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టాకా దేశాన్ని దశాబ్దాలుగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం దొరికింది. అయోధ్య రామాలయం, త్రిపుల్ తలాక్, జమ్మూ కశ్మీర్ సమస్యలు కొలిక్కి వచ్చాయి. ఇప్పుడు రైతుల ఆందోళన విరమించేలా ప్రధాని మోడీ చొరవ తీసుకుని.. వారితో చర్చించి సమస్య పరిష్కరిస్తే.. ఇది కూడా ఆయన చరిత్రాత్మక విజయాల్లో ఒకటిగా నిలిచిపోతుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి కూడా వినిపిస్తోంది. 

అంతేకాదు తమిళనాడు రాజకీయాల్లోనూ ప్రస్తుతం బీజేపీ డేంజర్ రోల్ పోషిస్తోంది. కరుణానిధి, జయలలిత మరణాల తర్వాత తమిళనాడులో పాగా కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం అన్నాడీఎంకేను పావుగా వాడుకుంటోంది. సినిమా స్టార్ రజనీకాంత్ తో కొత్త పార్టీకి ప్లాన్ చేసింది. కమల్ హాసన్ ను రెచ్చగొడుతోంది. శశికళ అరెస్టు వెనుక బీజేపీ హస్తం ఉందని తమిళనాడు ప్రజల్లో వాదన ఉంది. మొత్తంగా తమిళనాడులో కొంత కాలంగా బీజేపీ చేస్తున్న రాజకీయాలతో తమిళులు ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు. గతంలో తమిళులకు వ్యతిరేకించిన కొన్ని నిర్ణయాలు తీసుకున్న రాజీవ్ గాంధీకి ఏం జరిగిందో దేశ ప్రజలందరికి తెలుసు. అందుకే రైతుల ఆందోళన, సిక్కులపై వస్తున్న విమర్శలు, తమిళ రాజకీయాలు.. ఇవన్ని తమకు ఆందోళన కలిగించేవే అన్న ఆందోళన బీజేపీలో కనిపిస్తుందని తెలుస్తోంది.

 మొత్తంగా  కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో దేశం ఎటు వైపు దారి తీస్తుందోనన్న భయం జనాల్లో ఉందని తెలుస్తోంది. బీజేపీ సర్కార్ ఇప్పటికైనా మేల్కొని.. సమస్యలను పరిష్కరించాలని వారంతా కోరుతున్నారు. లేకపోతే  గతంలో కాంగ్రెస్ కు జరిగినట్లే బీజేపీ తగిన మూల్యం చెల్లించుకునే పరిస్థితి రావచ్చని కూడా కొందరు పొలిటికల్ అనలిస్టులు స్పష్టం చేస్తున్నారు.