మారాల్సింది అమెరికానా..? ఇండియానా..?
posted on Aug 13, 2016 @ 5:11PM
గ్లోబలైజేషన్ పుణ్యమా అని ప్రపంచం ఒక కుగ్రామంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు వ్యక్తిగత అవసరాల కోసమో, వృత్తిగత పనుల కోసమో వివిధ దేశాలకు వెళుతూ ఉంటారు. అయితే సుదూర ప్రాంతాల నుంచి వేరే దేశంలో అడుగుపెట్టే వారిని విమానాశ్రయంలో తనిఖీలు చేయడం కామన్. అయితే ఒక దేశంలో పేరు ప్రఖ్యాతులు కలిగిఉండి..దేశంలో ఎక్కడకెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పట్టే సదరు వ్యక్తులకు పరాయిదేశంలో తనిఖీలు ఎదురైతే..అచ్చం ఇప్పుడు అలాగే ఉంది భారతీయ ప్రముఖుల పరిస్థితి. తన అసమాన నటనతో హిందీ చిత్రపరిశ్రమలో అగ్రకథానాయకుడిగా..అభిమానుల చేత బాలీవుడ్ బాద్‌షాగా జేజేలు అందుకుంటున్న షారూఖ్‌ఖాన్‌కు అగ్రరాజ్యంలో అవమానాలు తప్పడం లేదు. ఇప్పటికే పలుమార్లు ఆ దేశానికి వెళ్లిన షారూఖ్‌ను అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు ఎయిర్‌పోర్టులో తనిఖీల పేరిట అదుపులోకి తీసుకున్నారు.
తాజాగా నిన్న ఉదయం అమెరికాలో ల్యాండైన షారూఖ్‌ను అక్కడి భద్రతాధికారులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. తన పిల్లలు సుహానా, ఆర్యన్‌లతో కలిసి అమెరికాలో దిగిన వెంటనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా షారూఖ్ ఖాన్ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ విషయం తెలిసిన వెంటనే భారత్ రగిలిపోయింది. దీంతో ఆగమేఘాలపై స్పందించిన అమెరికా ప్రభుత్వం బాలీవుడ్ బాద్‌షాకి క్షమాపణలు చెప్పింది. ఎయిర్‌పోర్టులో జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. అమెరికన్ పౌరులపై సైతం నిఘాను అధికారికంగా పెట్టాల్సిన పరిస్థితి ఉంది అని దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాలను పర్యవేక్షిస్తుండే యూఎస్ అసిస్టెంట్ సెక్రటరీ నిషా బిస్వాల్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. షారూఖ్ వస్తున్నారన్న సమాచారం ముందుగా ఇచ్చి ఉంటే, ఈ పరిస్థితి రాకుండా చూసేవాళ్లమని ఆయన తెలిపారు.
ఇది ఒక్కసారి కాదు...షారూఖ్ ఒక్కరికే ఇది పరిమితం కాలేదు. భారత మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా దివంగత అబ్దుల్ కలాం విషయంలోనూ అమెరికా ఇలాగే ప్రవర్తించింది. అబ్దుల్ కలాం న్యూయార్క్‌లోని జెఎఫ్‌కె విమానాశ్రయంలో ఎయిరిండియా విమానం ఎక్కి, తన సీట్లో కూర్చున్న తర్వాత సోదా చేశారు ఇమ్మిగ్రేషన్ అధికారులు. కలాం వద్దకు వచ్చి, పేలుడు పదార్ధాలున్నాయేమోనని ఆయన బూట్లు, జాకెట్ అందరిముందు విప్పించారు. సోదా చేసిన తర్వాత ఆయన వస్తువులు ఆయనకు తిరిగి ఇచ్చేశారు. అయితే ఇలాంటి వాటి విషయంలో చూసిచూడనట్టుగా వదిలివేసే కలాం..ఈసారి మాత్రం కాస్త మనస్థాపం చెందారు. ఈ చర్య భారత్‌లో తీవ్ర ప్రకంపనల్ని సృష్టించింది. ప్రతీకార చర్య తీసుకుంటానని ఇండియా ప్రకటించింది. దీంతో దిగివచ్చిన అమెరికా కలాంకు, భారత ప్రభుత్వానికి లిఖిత పూర్వకంగా క్షమాపణలు చెప్పింది. నిజానికి భారతదేశంలోని "బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ చెక్స్" నుంచి మినహాయింపు పొందినవారి జాబితాలో కలాం పేరు ఉన్నా ఆయన్ను తనిఖీ చేయకుండా వదల్లేదు.
భారతీయ ప్రముఖుల్ని అవమానించడం అమెరికాకు కొత్త కాదు. భారత మాజీ ఉపప్రధాని ఎల్‌కే అద్వానీ, జార్జ్ ఫెర్నాండెజ్, కమల్ హాసన్, ఇర్ఫాన్‌ఖాన్, ముమ్ముట్టి ఇలా భారతీయ ప్రముఖులంతా తనిఖీలకు గురైనవారే. ఇలాంటివి గతంలో జరిగాయి..ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అగ్రరాజ్యానికి ఇదొక అలవాటుగా మారింది. భారతీయ ప్రముఖుల్ని సోదాపేరుతో అవమానించడం, ఆతర్వాత క్షమాపణ చెప్పడం అమెరికాకు మామూలైపోయింది. అలాగే, అలాంటి సంఘటనలు జరిగినప్పుడు తీవ్రంగా స్పందించి అమెరికాపై కారాలు, మిరియాలు నూరడం, గట్టి చర్య తీసుకుంటాననడం, తర్వాత కొద్ది రోజులకు మరిచిపోవడం మనదేశానికి అలవాటైపోయింది. దీనిని ఇలాగే వదిలేస్తే షారూఖ్‌ఖాన్‌కే మళ్లీ ఇలాంటి అవమానం జరగవచ్చు.