ఒలంపిక్స్ లో సగర్వంగా 'మెడల్' ఎత్తుకున్న భారత్!
posted on Aug 18, 2016 @ 12:28PM
రియో క్రీడా సమరం మొదలై ఇన్ని రోజులైనా ఒలంపిక్స్ లో ఒక్క మెడలూ రాలేదు! ఇక ఇలా భావించుకుంటూ మెడల్ రాలేదని మెడలు దించుకుని... నేల చూపులు చూస్తూ... అవమాన పడాల్సిన పని లేదు! ఎందుకంటే, నూటా ఇరవై అయిదు కోట్ల అభిలాశల సాక్షిగా మన సాక్షి మాలిక్ ఒలంపిక్ మెడల్ తన మెడలో వేయించుకుంది! అదీ ఇప్పటి వరకూ దక్కని ఫీమేల్ రెస్లింగ్ విభాగంలో!
హర్యాణాకు చెందిన సాక్షి మాలిక్ ఒలంపిక్స్ లో పతకం సాధించిన తొలి మహిళా రెజ్లర్! 24ఏళ్ల ఆమె పన్నెండేళ్లుగా ఈ అద్భుత అంతర్జాతీయ విజయం కోసం తనతో తాను కుస్తీ పడుతూనే వుంది! తన గ్రామంలో మొదలైన ఆమె పోరాటం అంచెలంచెలుగా ముందుకు సాగుతూ ఇప్పుడు రియో దాకా వెళ్లింది. అదీ ఆటలంటే .... ఏ పట్టింపూ లేని ఓ ఆటైపోయిన మన భారతదేశంలో! ఆమె విజయం నిజంగా గొప్ప ప్రేరణే! అసలు ఇక్కడ చాలా మంది ప్రభుత్వ పెద్దలకి క్రికెట్ తప్ప మరో క్రీడ వుంటుందనే తెలియదు.బిసీసీఐ పగ్గాలు పట్టుకుని భీమ పరాక్రమం చూపుదుమాని తప్ప ఇంకో ఆలోచన వుండదు!
మన దేశంలో సామాన్యుల పరిస్థితి కూడా అంతే.... ఒక సానియా, ఒక సైనా, ఒక మేరీ కామ్ ఎప్పుడైతే ఛమక్కున మెరుస్తారో అప్పుడే టెన్నిస్, బ్యాడ్మింటన్, బాక్సింగ్ లాంటి ఇతర క్రీడలు గుర్తుకు వస్తాయి. తరువాత యథా ప్రకారం జనం క్రికెట్ పిచ్ పై పిచ్చెక్కిపోయి పరుగులు తీస్తారు. నాలుగేళ్లకోసారి ఒలంపిక్స్ రాగానే ఇండియా యథా ప్రకారం రన్ అవుట్ అవుతూ వుంటుంది! . 12ఏళ్ల ప్రాయం నుంచీ ఒక పుష్కర కాలం కష్టాలతో కుస్తీ పట్టిన సాక్షి చివరకు ఈ సారి ఇండియాకు తొలి పతకం, తొలి మహిళా రెజ్లింగ్ పతకం రెండూ అందించింది! అయితే, చిన్నప్పుడు ఆమెతో కుస్తీ పట్టడానికి మరో అమ్మాయి ఎవ్వరూ లేకపోవటంతో అబ్బాయిలనే మట్టికరిపిస్తూ వచ్చిన ఆమెని రియోలో అదృష్టం బాగానే వరించింది. క్వార్టర్ ఫైనల్ లో ఓడిపోయి కూడా రెపిఛేజ్ పద్దతి ప్రకారం మరోసారి పోటీలో పాల్గొనే అవకాశం వచ్చింది. కాంస్య పతకం కోసం జరిగిన రౌండ్స్ లో సాక్షి కొత్త చరిత్రకు సాక్షిగా నిలుస్తూ వరుస విజయాలు సాధించి కాపర్ మెడల్ కొట్టింది!
సాక్షి భారత్ ఖాతాలో వేసిన ఈ మొదటి పతకం సాక్షిగా మనం ఒలంపిక్స్ కి ముందు జరిగిన శోభా డే రచ్చని గుర్తుకు తెచ్చుకోవాలి. ఆమె తన ట్వీట్ లో భారత్ నుంచి వందకు పైగా అథ్లెట్లు రియోకు వెళ్లటం డబ్బులు, సమయం దండగా అన్నారు! ఆమె ఉద్దేశ్యం నిజంగా ఏంటో మనకు తెలియదుగాని సాక్షి మొదటి పతకం సాధించి భారత్ పరువు నిలబెట్టింది. అంతే కాదు, శోభా డే లాంటి సీనియర్ జర్నలిస్టులు, క్రిటిక్స్, ఇంటలెక్చువల్స్ అథ్లెట్ల నైతిక స్థైర్యం దెబ్బతిసే మాటలు కాకుండా ప్రాక్టికల్ గా ఏమైనా చెబితే బాగుంటుంది. పతకాలు రావటం లేదనీ, రావనీ మనల్ని మనం తిట్టుకుంటే సరిపోదు. బోధ కాలు వ్యవహారంలా క్రికెట్ మాత్రమే ఎందుకు మన దేశంలో పెరిగిపోతోంది? మిగతా క్రీడలు ఎందుకని పోలియో కాళ్లలా మిగిలిపోతున్నాయి? ఇవీ... సాక్షి మాలిక్ అందించిన తొలి రియో ఒలంపిక్ మెడల్ సాక్షిగా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు! కుస్తీలో ఓ పతకం దక్కిందని సంతోషిస్తూనే... మనతో మనం కుస్తీ పట్టాల్సిన అంశాలు!