భారత్ (ప్రధాని) స్వరం మారింది...
posted on Aug 16, 2016 @ 12:50PM
పాక్ ఆక్రమిత కాశ్మీర్..భౌగోళికంగా ఆ ప్రాంతం భారత భూభాగంలోనిది. దశాబ్ధాలుగా ఈ భూతల స్వర్గం గురించి రెండు దేశాలకు మధ్య వివాదాలు రేగుతూనే ఉన్నాయి. వేర్పాటువాదులు తమ స్వాతంత్ర్య కోసం రావణ కాష్టాన్ని రగిలిస్తూనే ఉన్నారు. ప్రతి ఏడాది స్వాతంత్ర్య దినోత్సవాలు వస్తూనే ఉన్నాయి..పోతూనే ఉన్నాయి. ప్రధానులంతా ఎర్రకోట వద్ద జాతీయ జెండాను ఎగురవేసి..ఉపన్యాసించారు. ఆ ప్రసంగంలో కాశ్మీర్ అంశంపై ప్రస్తావన ఉండేది కాదు..ఒకవేళ ఆ ప్రస్తావన వచ్చినా కంటితుడుపు మాటగా నాలుగు ముక్కలు మాట్లాడేవారు. కానీ తొలిసారిగా భారత ప్రధాని ఒకరు పీవోకే మాదేనన్న హెచ్చరికను పాక్‌కు..కాశ్మీర్ మనదేనన్న నమ్మకాన్ని భారతీయులలో కలిగించారు.
భారత 70వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. వాడవాడలా త్రివర్ణపతాకాన్ని ఎగురవేసి దేశ ప్రజలు జెండాకు సెల్యూట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాని నరేంద్రమోడీ జాతీయ పతాకాన్ని ఎగురవేసి అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. దాదాపు గంటన్నరపాటు సాగిన సుధీర్ఘ ప్రసంగంలో ఉగ్రవాదం-మానవత్వం, స్వరాజ్యం-సురాజ్యం, పేదరికం-అభివృద్ధి, సంక్షేమం-సంస్కరణలు సహా అంశాలపై ఉపన్యాసం ఇచ్చారు. భారత్-పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొంటున్న పరిస్థితుల్లో కశ్మీర్ విషయంలో అనవసర జోక్యం చేసుకుంటున్న పాకిస్థాన్‌కు ఎర్రకోట సాక్షిగా ప్రధాని గట్టిగా హెచ్చరించారు. ఉగ్రవాదంపై పాక్ రెండు నాలుకల ధోరణిని ఎండగట్టారు. బెలూచిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశాలను ప్రస్తావించారు.
పొరుగున ఉన్న దేశానికి ఒక్కటే చెప్పదలుచుకున్నా..మనమిద్దరం ఒకరితో ఒకరు పోరాడటం కన్నా..ఇద్దరికి సహజ సమస్య అయిన పేదరికంపై కలసి పోరాడుదాం..అప్పుడే రెండు దేశాలు సంపన్నమవుతాయి. పేదరికం నుంచి విముక్తి పొందే స్వాతంత్ర్యం కంటే ప్రపంచంలో గొప్ప స్వాతంత్ర్యం ఏమీ లేదు. అలాగే బలూచిస్తాన్, జిల్‌జిత్, పీవోకే ప్రజలు నాకు కృతజ్ఞతలు చెప్పారు. నేను ఎప్పుడూ ఈ భూమిని చూడలేదు. వారు ఎప్పుడూ నన్ను కలవలేదు. కానీ అక్కడి ప్రజలు నన్ను గుర్తించి గౌరవించడం 125 కోట్లమంది భారతీయులకు దక్కిన గౌరవం. అందుకే బలూచిస్తాన్, గిల్‌జిత్, పీవోకే ప్రజలకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా..పాకిస్థాన్‌లోని పెషావర్‌లోని ఒక పాఠశాలలో అమాయకులైన చిన్నారులను ఉగ్రవాదులు క్రూరంగా హతమార్చారు. విద్యాలయం రక్తసిక్తమయ్యింది, దాన్ని చూసి భారత్‌లో ప్రతి ఒక్కరు కంటతడిపెట్టారు, ఇదీ మన మానవత్వం.
కానీ అటువైపు చూడండి ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులను వారు కీర్తిస్తున్నారు. ముష్కరుల చేతుల్లో అమాయకులు చనిపోతే అక్కడ ఉత్సవం జరుపుకుంటున్నారు. అంటూ ఇటీవల భారత సైన్యం చేతుల్లో హతమైన మోస్ట్ వాంటెడ్ హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వానిని పాక్ అమరవీరుడుగా కీర్తిస్తున్న విషయాన్ని మోడీ ప్రస్తావించారు. భారతదేశం ఉగ్రవాదానికి, హింసకు ఎన్నటికీ తలవంచబోదని ఉద్ఘాటించారు. పాక్ ఎన్నిసార్లు కవ్వించినా భారత్ హద్దు దాటలేదు.. కానీ తొలిసారిగా భారత్ ఈ విషయంపై ఎదురుదాడికి దిగింది. అయితే బుర్హాన్ వానీ ఎన్‌కౌంటర్ తర్వాత జరిగిన పరిణామాలతో కశ్మీర్ వేర్పాటువాదులకు పాక్ బహిరంగంగా మద్ధతు ప్రకటించడంతో పాటు బెలూచిస్తాన్ తిరుగుబాటుకు భారత్ తోడ్పాటునందిస్తోందంటూ పాకిస్థాన్ అంతర్జాతీయ సమాజం ముందు ఇరుకునపెట్టే వ్యూహం పన్నింది.
అయితే మేం భారత్‌లో కలుస్తాం అంటూ పీవోకే ప్రజలు ఉద్యమానికి దిగాలని నిర్ణయించుకోవడంతో పాక్ ఆత్మరక్షణలో పడింది. సరిగ్గా అవకాశం కోసం ఎదురుచూస్తోన్న మోడీ గురి చూసి పాక్‌ను కొట్టాలనుకున్నారు. అందుకు స్వాతంత్ర్య దినోత్సవ ఉపన్యాసంలో ఈ అంశానికి అధిక ప్రాధాన్యతనిచ్చారు. మామూలుగా ప్రెస్ మీట్ పెట్టి పాక్‌పై విమర్శలు చేస్తే ఆ సందేశం సరిగ్గా వెళ్లదు. భారత స్వాతంత్ర్య దినోత్సవం అంటే ప్రపంచం మొత్తం ఆ రోజు ఇటే చూస్తుంది కాబట్టి ఆ సమయాన్ని..ఆ రోజుని ప్రధాని వేదికగా చేసుకుని పాక్‌పై చెలరేగిపోయారు. "సహనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దు"..అని ఘాటైన హెచ్చరికలు పాక్‌కు పంపారు మోడీ. అదోక్కటే కాదు కశ్మీర్ అంటే కేవలం తమ భూభాగంలో ఉన్న కశ్మీర్ మాత్రమే కాదని..పాక్ ఆక్రమణలో ఉన్న కశ్మీర్‌ను కూడా కలుపుకుని మాట్లాడతామని మోడీ స్పష్టం చేసినట్లైంది.