జగన్ గారి కొత్త 'స్వరూపం'!
posted on Aug 17, 2016 @ 2:43PM
అపజయం అన్నిటికంటే పెద్ద గురువు! ఈ సత్యం ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ కు బాగానే బోధపడింది! జగన్ ఈ మధ్య ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి 'ప్రత్యేక' హోదా సాధించేందు కోసం జాతీయ నేతలు చాలా మందినే కలిశారు. కాని, తరువాత ఎందుకోగాని 'ప్రత్యేక' శ్రద్ధతో అటు నుంచి అటు రిషీకేష్ వెళ్లి 'ప్రత్యేక' పూజల్లో పాల్గొన్నారు! పైగా ఆ 'ప్రత్యేక' పూజలు జరిపింది మరెవరో కాదు... అడపాదడపా చంద్రబాబుపై విమర్శలు కురిపించే విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి వారు! ఇదీ జగన్ ప్రత్యేక పూజల్లోని అసలు ప్రత్యేకత!
ప్రత్యేక హోదా కోసమని జగన్ ఢిల్లీకి వెళ్లి అక్కడ ప్రత్యేక క్రతువుల్లో పాల్గొనటం వెనుక చాలా వ్యవహారమే వుందంటున్నారు రాజకీయ పండితులు. అందరికీ తెలిసిన సంగతేంటంటే జగన్ ఎంతో భక్తి విశ్వాసాలు కలిగిన క్రిస్టియన్. వాళ్లమ్మ విజయమ్మ అయితే ఏకంగా బైబిల్ పట్టుకునే బహిరంగ సభలకు కూడా హాజరయ్యేవారు. ఇక దేవుని పేరున వర్షం ఆపటం లాంటి లీలలు ప్రదర్శించే బ్రదర్ అనీల్ కుమార్ సంగతైతే చెప్పే పనేలేదు!
జగన్ క్రిస్టియన్ అవ్వటం అన్నది మన ప్రజాస్వామ్య దేశంలో తప్పేం కాదుగాని ఆయన హఠాత్తుగా హిందూ పుణ్యక్షేత్రం రిషీకేష్ లో ప్రత్యక్షమై స్వరూపానందేంద్ర స్వామి వారి ఆశీస్సులతో యజ్ఞ, యాగాలు చేయటమే... పెద్ద ఆశ్చర్యం! 2014 ఎన్నికల ముందు జగన్ ఎక్కడా హిందూ మతానికి సంబంధించిన పూజా, పునస్కారాల్లో పాల్గొన్నట్టు దాఖలాలు లేవు. కాని, ఒక్కసారి జనం గత సార్వత్రిక ఎన్నికల్లో షాక్ ఇవ్వటంతో యువనేతలో 'మెజార్టీ' ప్రజలు మతం పట్ల భక్తి జాగృతం అయినట్టు కనిపిస్తోంది!
గోదావరి పుష్కరాల సమయంలో తండ్రి వైఎస్ కు శ్రాద్ధ కర్మ కూడా చేసిన జగన్ ఈ సారి ప్రత్యేక పూజల్లో పాల్గొని తాను హిందూ మతానికి వ్యతిరేకం కాదనే సంకేతం ఇస్తున్నాడంటున్నారు విశ్లేషకులు. ఇంత వరకూ కృష్ణ పుష్కరాల్లో మాత్రం వైఎస్ ఆర్సీ నేత మునకలు వేయలేదుగాని పోయిన ఎన్నికల వేళ ఎదురైన ఆపజయం చాలా పాఠాలే నేర్పినట్టుంది. ముఖ్యంగా జనంలో వుండే రాజకీయ నేతలు మెజార్జీ ప్రజల మత విశ్వాసాలు క్యాష్ చేసుకోకుండా సీఎం కుర్చీ ఎక్కలేరన్నది ఆయనకు బోధపడి వుంటుంది.
పూజలు, హోమాలు చేసి జగన్ క్రీస్తు అనుగ్రహంతో హిందు దేవుళ్లు, స్వామీజీల అనుగ్రహానికి కూడా పాత్రుడవుతాడో లేదో తెలియదుగాని ఆయన తపస్సు, తపన అంతా వేరే దాని కోసం అంటున్నారు పొలిటికల్ గాసిపర్స్! అదేంటంటే, విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర చాలా మంది అరెస్సెస్ పెద్దలకు బాగా క్లోజట. అంతే కాదు, అస్సొం, జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రాల్లో బీజేపి కమలాన్ని వికసింపజేసి మంచి ఊపు మీదున్న రామ్ మాధవ్ స్వామీ వారి శిష్యుడంటారు. మరో ఫైర్ బ్రాండ్ బీజేపి ఎంపీ సుబ్రమనియమ్ స్వామీ కూడా ఈ స్వామి వారికి దగ్గరేనట.
ఇన్ని కారణాలు వల్లె వేసుకున్నాక ఇక దాపరికం ఏముంది? జగన్ వచ్చే ఎన్నికల్లో బీజేపితో పొత్తు కోసం, పనిలో పనిగా తనపై వున్న కేసుల గోల తగ్గించుకునేందు కోసం హిందూ పూజా, పునస్కారాలు చేస్తూ కొత్త 'స్వరూపం' దాలుస్తున్నాడంటున్నారు అబ్జర్వర్స్! మరి ఆల్రెడీ బీజీపీతో పొత్తులో వున్న టీడీపీ , యువనేత వారి ఈ 'కొత్త' తపస్సుకి ఎలా భంగం కలిగిస్తుందో... చూడాలి!