మన పెద్దనోట్ల సెగ దుబాయ్‌కీ తప్పలేదు

పెద్ద నోట్ల రద్దు వల్ల లాభపడింది..నష్టపోయింది ఎవరంటే బంగారు వ్యాపారులే. పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నిర్ణయం తీసుకున్న కాసేపటికే..బడాబాబులు, నల్లకుబేరులు నగల దుకాణాలకు క్యూకట్టారు. దాచుకున్న కోట్లాది రూపాయల నల్లధనాన్ని బంగారం రూపంలో మార్చుకున్నారు. నవంబర్ 8వ తేదీ రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము వరకు వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగినట్లు ఆదాయపు పన్ను శాఖ నిర్థారించింది. కోట్లలో ఉన్న పెద్ద నోట్లతో పాటు నల్లధనాన్ని డిపాజిట్ చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన వీరంతా ప్రత్యామ్నాయంగా బంగారాన్ని ఎంచుకున్నారు.   దీంతో కొద్ది రోజుల పాటు బంగారం వ్యాపారులు పండుగ చేసుకున్నారు. అయితే బంగారం కొనుగోళ్లతో పాటు గతంలో ఇళ్లలో దాచి ఉంచిన బంగారంపైనా కేంద్రప్రభుత్వం ఆంక్షలు విధించడంతో పాటు నల్లకుబేరులతో పాటు నగల దుకాణాల యజమానుల నోటిలో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. దానికి తోడు ఐటీ నిఘా ఎక్కువకావడంతో నల్లబాబులకు ఏం పాలుపోలేదు. ఈ దెబ్బతో బంగారం వైపు కన్నెత్తి చూడటానికే వణికిపోయారు. దీని ప్రభావంతో బులియన్ మార్కెట్ షట్ డౌన్ అయ్యింది. కొనుగోళ్లు, అమ్మకాలు లేక మూడు పువ్వులు..ఆరు కాయలుగా సాగే గోల్డ్ బిజినెస్ తీవ్ర నష్టాలను చవిచూస్తోంది.   ఈ సంగతి పక్కన బెడితే ఏంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు..భారత్‌లో పెద్దనోట్ల రద్దు ఏడారి దేశం దుబాయ్‌పై పడింది. పెద్ద నోట్ల రద్దు తర్వాతి నుంచి భారతీయ పర్యాటకులు దుబాయ్‌లోని జ్యూయలర్స్‌లోకి అడుగుపెట్టడం లేదట.. దీంతో అక్కడి చిన్న, పెద్ద దుకాణాల వ్యాపారం బాగానే తగ్గిపోయిందట. భారత్ కంటే దుబాయ్‌లో పసిడి ధర కాస్త తక్కువగా ఉండటమే కాకుండా కొత్త కొత్త డిజైన్లు దొరుకుతుండటంతో పర్యాటకులు, అక్కడ నివసిస్తున్న వారు ఖచ్చితంగా ఆభరణాలు కొంటూ ఉంటారు.   దుబాయ్‌కి వచ్చే పర్యాటకులు ఇక్కడ భారత కరెన్సీని ఎక్చేంజ్ చేసుకుని దానితో బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. అయితే భారత్‌లో తీవ్ర కరెన్సీ కొరతను ఎదుర్కొంటుండటంతో ఎవరి పర్సుల్లోనూ నోట్ల కట్టలు కనిపించడం లేదు. ఈ ప్రభావం దుబాయ్ బులియన్ మార్కెట్‌ను దెబ్బ తీసింది. ముఖ్యంగా బంగారం వ్యాపారానికి పేరుగాంచిన గోల్డ్ సోక్, బుర్ దుబాయ్‌లో కస్టమర్ల సంఖ్య బాగా తగ్గిపోయిందని వ్యాపారులు అంటున్నారు. వీలైనంత త్వరలో భారత్‌లో సంక్షోభం సద్దుమణగాలని వారు కోరుకుంటున్నారు.

50రోజుల కరెన్సీ తుఫాను... 

  నవంబర్ 8 - డిసెంబర్ 28... ఈ మధ్య కాలంలో గడిచిపోయిన రోజులు ఎన్ని? యాబై రోజులు! మామూలుగా అయితే ఈ ఫిఫ్టీ డేస్ కి నో ఇంపార్టెన్స్. కాని, మోదీ తీసుకున్న డీమానిటైజేషన్ నిర్ణయం వల్ల గత యాభై రోజులు యాభై యుగాలుగా గడిచాయి. జనం రోడ్లపైకి వచ్చేస్తే ... ప్రతి పక్షాలు రోడ్లపైకి రాలేక, లోపల వుండలేక ఇబ్బంది పడ్డాయి. ఇంకా పడుతూనే వున్నాయి. మరో వైపు ఇంచుమించూ మూడేళ్లు పూర్తి కావస్తోన్న మోదీ పాలనలో తొలిసారి ప్రధాని జనం మూడ్ ని బలంగా దెబ్బ తీశారు! ఇప్పటికీ మోదీ పట్ల జనం నమ్మకంతోనే వున్నా చాలా మందికి ఆయన పట్ల వ్యతిరేకత మొదలైంది. ఇది చెప్పక తప్పుకోని సత్యం...  నవంబర్ 8న నోట్ల రద్దు చేసిన మోదీ రెండు రోజుల్లో అంతా నార్మల్ అయిపోతుందని చెప్పుకొచ్చారు. 48గంటల్లో 2వేల నోట్లు మార్కెట్లో కళకళలాడతాయని భావించారు. బహుశా ఆయనకి సలహా ఇచ్చిన అధికారులు కూడా అలాగే చెప్పి వుంటారు. కాని, మోదీకి తెలిసో లేదో కాని భారీ ఆర్దిక తుఫానే చెలరేగింది నోట్ బ్యాన్ తో! కోట్లాది జనం ఏటీఎంలు, బ్యాంక్ ల ముందు పడిగాపులు పడ్డారు. ఇప్పటికీ పరిస్థితి ఏం సంతోషకరంగా లేకున్నా మొదటి పది , ఇరవై రోజుల కన్నా చాలా నయం. అంతే తప్ప 50 రోజుల్లో ఎలాంటి అద్భుతాలు ఆవిష్కృతం కాలేదు. కాని, మోదీ డీమానిటైజేషన్ తరువాత తన సభల్లో జనాన్ని 50రోజులు ఓపిక పట్టమన్నారు. అందరూ నోట్ల కటకటని సహించారు కూడా. కాని, తీరా ఇప్పుడు చూస్తే ఒరిగింది ఏం లేదన్నట్టు వుంది పరిస్థితి! మోదీ చెప్పిన మొదటి 50రోజులు కాదు మరో 50రోజులు కూడా ఒత్తిడి తగ్గేలా లేదు. బ్లాక్ మనీ, ఉగ్రవాద కార్యకలాపాల నోరోధం, ఎన్జీవోల అక్రమ దందా, దొంగ నోట్ల కట్టడి, క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ ... ఇవన్నీ విపరీతంగా చర్చింపబడ్డాయి. కాని, వీటితో దేనితోనూ సంబంధం లేని అతి సామన్య ప్రజలు మాత్రం కరెన్సీ కటకటతో అల్లాడిపోయారు. ఇంకా కూడా తేరుకోలేకపోతున్నారు. అయితే, తాము పడుతున్న ఇబ్బందులకి జనం మోదీని బాధ్యుడ్ని చేయకపోవటమే ఇక్కడ ఆశ్చర్యం. రోడ్డ మీదకొచ్చి వీరంగం వేసిన రాహుల్, మమత, అరవింద్ కేజ్రీవాల్ వెంట జనం నిలవాల్సినంతగా నిలవలేదు. తమ అవస్థలకి కారణమైన మోదీ వెంటే వారు వున్నారు. ఇందుకు కారణం, బ్లాక్ మనీ భూతం తరిమేస్తాడనే ఆశే. ఉగ్రవాదం, మత మార్పిళ్లు, దేశ వ్యతిరేక కార్యకలాపాలు అన్నీ ఆగిపోతాయన్న భరోసానే. ఇవాళ్ల మనం కొన్ని రోజులు ఇబ్బంది పడ్డా తరువాతి తరం చక్కగా బతుకుతారని భావించటమే. మోదీ చేసిన నోట్ల రద్దు ఎవ్వరూ ఊహించని పరిణామం. ప్రజలు కూడా అందుకే షాకవుతూనే మద్దతిచ్చారు. కాని, ఈ యాభై రోజుల్లో డీమానిటైజేషన్ ఫలాలేవీ ప్రజలకి నేరుగా అందలేదు. శేఖర్ రెడ్డి లాంటి పెద్ద పెద్ద బ్లాక్ హోల్స్ బయటపడ్డాయి. కాని, ఐటీ దాడులు ఇప్పటికిప్పుడు సామాన్యులకి ఉపయోగపడేవి కావు. అందుకే, మోదీ తాను అభ్యర్థించిన 50రోజులు పూర్తయ్యాయి కాబట్టి ఇక మీదట కామన్ పీపుల్ చిల్లర కష్టాలు అస్సలు లేకుండా చేయటంపై దృష్టి పెట్టాలి. ధరలు తగ్గిస్తూ, బ్యాంక్ లోన్లు అందిస్తూ, ఉద్యోగాలు కల్పిస్తూ నిజమైన అచ్చే దిన్ వచ్చేలాగా చూడాలి. అప్పుడే ప్రధాని తీసుకున్న రిస్క్ , జనం భరించిన బాధలు అన్నీ ఫలవంతం అవుతాయి...   

కుక్క బిర్యానీ విషయంలో... కాకి గోల! 

నాలెడ్జ్ వేరు... టెక్నాలజీ వేరు! టెక్నాలజీ అంటే పువ్వులోంచి నూనె తీయటం. కాని, నాలెడ్జ్ అంటే మనకు ఎంత నూనె కావాలో అంతే తీసుకుని.. సున్నితమైన, అందమైన పూలని అనవసరంగా పాడు చేయకపోవటం! ఇప్పుడు జనాలకి టెక్నాలజీ విపరీతంగా అందుబాటులోకి వచ్చింది కాని నాలెడ్జ్ అందుకు తగ్గట్టుగా పెరగటం లేదు. ఆ కారణంగానే మంచికి వాడాల్సిన సీక్రెట్ కెమెరాల్ని, సెల్ కెమెరాల్ని ట్రయల్ రూమ్స్ లో, బాతూరూముల్లో అమరుస్తుంటారు. తాజాగా హైద్రాబాద్ లో జరిగిన కుక్క బిర్యానీ గోల అలాంటి టెక్నాలజీ పైత్యమే! వున్నట్టుండీ ఒక వాట్సప్ మెసేజ్ చక్కర్లు కొట్టడం మొదలైంది. ఓల్డ్ సిటీలో ఫేమస్ అయిన షా ఘౌస్ బిర్యానీ సెంటర్లో మటన్, చికెన్ బదులు కుక్క మాంసం కలుపుతున్నారని. నిజంగా కూడా హైద్రాబాద్ లాంటి మహానగరాల్లో హోటల్ ఫుడ్ చాలా దారుణంగా వుంటుంది. అందులో ఏం కలుస్తుందో, ఎవరు కలుపుతారో అర్థం కాని పరిస్థితి. అందుకే, బిర్యానీలో కుక్క మాంసం అనే సరికి అంతా షేర్ లు , ఫార్వడ్ లు చేసేశారు. అలా అలా ఆ వార్త మెయిన్ స్ట్రీమ్ మీడియా నోటిలో పడింది. ఒక వాట్సప్ సమాచారాన్నిపట్టుకుని మన ఛానల్స్ నానా హడావిడి చేసేశాయి. ఎంతగా అంటే, పోలీసులు రంగ ప్రవేశం చేసి హోటల్ యజమానిని అరెస్ట్ చేసేంతగా! వాట్సప్ అనే సాంకేతిక సౌకర్యం అందుబాటులో వుండటంతో ఒక 22ఏళ్ల యువకుడు ఆవేశపడ్డాడట! ఎందుకు షా ఘౌస్ హోటల్ పై కోపమొచ్చిందో తెలియదు కాని... అక్కడ కుక్క మాంసంతో బిర్యానీ చేస్తున్నారంటూ వాట్సప్ మెసేజ్ సిద్ధం చేశాడు. దాన్ని గ్రూప్స్ లో షేర్ చేశాడు. అక్కడ్నుంచీ యాగీ మొత్తం మొదలైంది. అయితే, ఏదో సోషల్ మీడియా గడబిడలే అనుకుని వదిలేయకుండా పెద్ద పెద్ద ఛానల్సు ఈ న్యూస్ పై కన్నేయటంతో రాత్రికి రాత్రి పెద్ద బ్రేకింగ్ న్యూస్ గా మారిపోయింది. చివరకు, అధికారులు దర్యాప్తు చేస్తే కుక్క మాంసం గోలంతా ఒట్టిదేనని తేలింది. కాని, అప్పటికే హోటల్ యజమానికి పేరు మొత్తం పాడైపోయింది. గిరాకీ తగ్గిపోయింది. పూడ్చలేని నష్టం జరిగిపోయింది.  వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్ చేతుల్లో వున్నంత మాత్రాన అబద్ధాలు చెప్పే హక్కు ఎవ్వరికీ లేదు. అలాగే, మన ముందుకొచ్చిన సోషల్ మీడియా న్యూస్ నిజమవ్వాలని గ్యారెంటీ లేదు. ఇది అందరూ గుర్తుంచుకోవాలి. అలాగే, పెద్ద పెద్ద ఛానల్స్, పేపర్స్ ఒక వార్త అందిస్తున్నప్పుడు వాట్సప్ , ఫేస్బుక్ పోస్టుల ఆధారంగా నానా యాగీ చేయటం పద్ధతి కాదు. సరైన ఇన్వెస్టిగేషన్ చేసి నిజానిజాలు తేల్చుకోవాలి. ఇవేవీ జరగటం లేదు. టెక్నాలజీ ఆధారంగా సమాచారం వచ్చి పడిపోతుండటంతో దాంట్లో వివేకం కోల్పోయి కొట్టుకుపోతున్నారు జనం...   

ఆఫ్టర్ నజీబ్ జంగ్... మోదీ, కేజ్రీ మధ్య నయా జంగ్?  

  మేయర్ స్థాయిలో పవర్స్ వుండే సీఎం... అయినా నేరుగా పీఎంతో పోరుకి దిగే... విచిత్రమైన ముఖ్యమంత్రి కేజ్రీవాల్! దేశంలోని అన్ని నగరాల కంటే పెద్దది కేజ్రీవాల్ పాలనలోని ఢిల్లీ! అందుకే దాన్ని కేంద్రపాలిత ప్రాంతం, ఆ తరువాత రాష్ట్రం చేశారు. కాని, పేరుకి ఒక ముఖ్యమంత్రి వున్నా హస్తినాపురం పూర్తి స్థాయి రాజ్యం కాదు. కేవలం రాజధాని మాత్రమే. కీలకమైన పవర్స్ అన్నీ కేంద్రం ఆధీనంలో పని చేసే లెఫ్టనెంట్ గవర్నర్ దగ్గరే వుంటాయి. అదే అరవింద్ కేజ్రీవాల్ కి ఆది నుంచీ పరమ చిరాగ్గా అనిపిస్తూ వస్తోంది! కేజ్రీవాల్, మోదీల మధ్య వార్ కొత్తదేం కాదు. ఇప్పటి వరకూ ఏకే మోదీని తిట్టకుండా గడిపిన రోజంటూ లేదు. ఆయన ఇలా ఎందుకు ప్రవర్తిస్తాడో ఎంత లాజిక్ ఉపయోగించినా అర్థం కాదు. ఎందుకంటే, పెద్ద పెద్ద రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మోదీతో అవసరమైతేనే యుద్ధానికి దిగుతారు. మిగతా సమయాల్లో సర్దుకుపోతారు. కాని, భారతదేశంలోని ఒకానొక నగరానికి ప్రజల చేత ఎన్నుకోబడ్డ మేయర్ లాంటి సీఎం అయిన కేజ్రీవాల్ తన స్థాయికి, సత్తాకి మించి ప్రధానిని ఢీకొంటూ వుంటాడు. తాజాగా లెఫ్టనెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అనూహ్య రాజీనామా తరువాత మోదీ, కేజ్రీ జంగ్ సరికొత్త మలుపు తిరగనుంది! డిల్లీ ఎల్జీ నజీబ్ జంగ్ రాజీనామా చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు. కేజ్రీవాల్ కూడా అవాక్కైనట్టే కనిపిస్తోంది. నిజానికి అరవింద్ తాను సీఎం అయినప్పటి నుంచీ జంగ్ తో జగడాలు పెట్టుకుంటూనే వచ్చాడు. అయినా ఆయన హఠాత్తుగా రెసిగ్నేషన్ ఇచ్చేసరికి షాకయ్యాడు. ఆయన స్టేట్మెంట్లో కూడా ఆశ్చర్యంగా వుందనే చెప్పుకొచ్చాడు. ఈ ఆశ్చర్యానికి కారణం మోదీ మనిషిగా వుంటూ వచ్చిన నజీబ్ జంగ్ అమాంతం పదవి నుంచి తొలగటం ఎందుకు అన్న ప్రశ్నే! కమలదళం ఆల్రెడీ ఎల్జీని చక్కగా ఉపయోగించుకుని అరవింద్ ని అష్టకష్టాలు పెడుతూనే వుంది. ఎల్జీ కంట్రోల్ లోని ఢిల్లీ పోలీస్ కేజ్రీవాల్ క్యాబినేట్ లోని సగం మంది మంత్రుల్ని, అసెంబ్లీలోని సగం మంది ఆప్ ఎమ్మేల్యేల్నీ కేసుల్లో ఇరికించింది. ఇందులో అన్నీ నిజమైన కేసులు కాకపోయినా ఆమ్ ఆద్మీ పార్టీని దీర్థకాలంలో దెబ్బ తీసేవి చాలానే వున్నాయి...  మోదీ సర్కార్, ఆప్ సర్కార్ ల మధ్య అగ్గికి బోలెడంత ఆజ్యం పోసిన జంగ్ వున్నట్టుండీ రాజీనామా మాట మాట్లాడటం నమో కొత్త స్కెచ్ పై అందరి దృష్టి పడేలా చేసింది. ఈ మధ్య జరిగిన నోట్ల రద్దు విషయంలో ఏ సీఎం చేయనంత సీన్ క్రియేట్ చేశాడు కేజ్రీవాల్. మమతతో కలిసి మండిపోయాడు. ఇక అంతకు ముందు జరుగుతూ వచ్చిన రచ్చ కూడా మనకు తెలిసిందే. అందుకే, ఇప్పుడు కొత్త లెఫ్టనెంట్ గవర్నర్ ఎవరు వస్తారని అందరిలోనూ ఆసక్తి మొదలైంది. ఆప్ వర్గాల్లో అయితే ఆందోళన కలిగి అవకాశాలు పుష్కలంగా వున్నాయి. త్వరలో జరగనున్న ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ లాంటి రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపి గెలిస్తే తాము తెచ్చి పెట్టుకున్న కొత్త ఎల్జీతో చక్రం తిప్పే మార్గాలు బోలెడు తెరుచుకుంటాయి. ఉత్తర్ ప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రం తమ వశమైతే అతి చిన్న రాష్ట్రం ఢిల్లీలో ఎలాంటి రాజకీయం చేసిన వ్యతిరేకత ఎదురయ్యే ఛాన్స్ వుండదు. ఇప్పుడు అరవింద్ ఆందోళనకు ఇదే పెద్ద కారణం...   

అధికారం దక్కినా ఏదో వెలితి..!

ఆంధ్రప్రదేశ్‌ను విభజించి కాంగ్రెస్ పార్టీ చేసిన ఘోర తప్పిదానికి బలైన వారి జాబితా చాలా పెద్దదే. ఆ నిర్ణయం తరతరాలుగా హస్తాన్నే నమ్ముకుని..ఆ పార్టీకే జీవితాన్ని అంకితం చేసిన ఎంతోమందిని రాజకీయంగా సమాధి చేసింది. అయితే రాష్ట్ర విభజన జరిగిన వెంటనే కొందరు కరడుగట్టిన కాంగ్రెస్ వాదులు సైతం ప్రత్యామ్నాయాలు వెతుక్కొగా..మరికొందరు ఆ పార్టీతోనే ప్రయాణం సాగిస్తున్నారు. ఏదో వెళ్ళాలి కాబట్టి వేరే పార్టీలోకి వెళ్లారు కానీ వీరిలో కొందరికి అలా వెళ్లడం సుతరాము ఇష్టం లేదు. పాత వాసనలు మరచిపోలేక..కొత్త పార్టీలో ఇమడలేక వీరు నరకయాతన అనుభవిస్తున్నారు. అయినా ఆ విషయం బయటకు రాకుండా కవరు చేస్తుంటారు.   కానీ జేసీ దివాకర్ రెడ్డి మాత్రం అందుకు విరుద్దం..ఎంత పచ్చకండువా కప్పుకున్నా ఆయన కరడుగట్టిన కాంగ్రెస్ వాది..ఎదుటివారు ఏమనుకున్నా సరే తన మనసులో ఉన్నది కుండబద్దలు కొట్టి చెప్పడం ఆయనకు అలవాటు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అద్భుతంగా పనిచేస్తున్నారని చెప్పినా..బాబు మాకు అన్యాయం చేస్తున్నారని బాంబు పేల్చినా ఆయనకే చెల్లింది. తాజాగా ముగిసిపోయిందని భావిస్తున్న రాయల తెలంగాణ అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకువచ్చారు. ఏపీ విభజన‌కే కాంగ్రెస్ పార్టీ మొగ్గుచూపినప్పుడు జేసీ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని..అలా కుదరని పక్షంలో అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలనే వాదనను తెరపైకి తీసుకువచ్చారు జేసీ. అయితే దీనికి తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ హైకమాండ్ అంగీకరించకపోవడంతో ఆచరణ సాధ్యం కాలేదు.   అప్పట్లోనే ఆగిపోయిన రాయల తెలంగాణ ప్రతిపాదనను ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు తిరిగి తవ్వడం మొదలుపెట్టారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీకి వచ్చిన జేసీ తనకు ఎదురుపడిన తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్‌తో సంభాసిస్తూ..మమ్మల్ని అడవుల పాలు చేశారు. విభజన వల్ల కర్నూల్, అనంతపురం జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. మమ్మల్ని కలుపుకుంటే కనీసం మాకు నీళ్లు, బువ్వ అయినా దొరికేవి అన్నారు. రాయల తెలంగాణ ఏర్పడి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. మేం తెలంగాణ వాళ్లం కాదా..? మాకు నీళ్లివ్వవా అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించేవాళ్లం అన్నారు. ఇక్కడే కులం ప్రస్తావన తెచ్చారు జేసీ..ఎవరినో అని లాభం లేదని..మా రెడ్లే రాయల తెలంగాణను అడ్డుకున్నారని బాంబు పేల్చారు.   ఆయన ఆవేదన వెనుక కారణం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెడ్డి సామాజిక వర్గానిదే పైచేయి. సమైక్యాంధ్రను ముఖ్యమంత్రులుగా ఎక్కువకాలం పాలించింది రెడ్లే. విభజన తర్వాత వీరు రెండు రాష్ట్రాల్లోనూ ద్వితీయ శ్రేణిగా పరిగణింపబడుతున్నారు. రెడ్ల ప్రాధాన్యత తగ్గిపోయింది. జేసీ టీడీపీలో ఎంపీగా గెలుపొందినా అనంతపురం జిల్లాలో హవా మొత్తం పరిటాల వర్గానిదే. మేము వాళ్ల కింద పనిచేయాల్సి వస్తోందని జేసీ చాలాసార్లు వాపోయారు. కాంగ్రెస్ పరిస్థితి తన సామాజిక వర్గం పరిస్థితి ఒక్కసారిగా తలచుకోని ఆయనకు పాత రోజులు గుర్తొచ్చినట్లున్నాయి. అందుకే తన బాధనంతా వెల్లగక్కారు. అయినా గతం గత: అన్నట్లు అందరితో కలుపుకుని పోతే ఏ గొడవ లేదు..జేసీ తొందర్లోనే దీనిని తెలుసుకుంటారో లేక ఇలాగే ముందుకు వెళతారో వేచి చూడాల్సిందే..!

మురుగునీటికి మోక్షం..!

ప్రస్తుతం ప్రపంచదేశాలను ముంచెత్తుతున్న ప్రధాన సమస్య నగరీకరణ . అభివృద్ధికి మార్గంగా, ఒక పర్యాయపరంగా ఇది మారిపోయింది. అలాగే అవకాశాల మెరుగుదలకు, ఆర్థికాభివృద్ధి నగరాల్లో ఉండాలని ప్రజలు నమ్మే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు నగరాలకు చేరుకుంటున్నారు. వీరి రాకతో నగరాలు, పట్టణాల్లో మౌలిక వసతుల కొరత తీవ్రమవుతోంది..చివరకు నగర జీవితం అంతుచిక్కని, అర్థంకాని సమస్యల వలయంలోకి ప్రజలను తీసుకువెళుతోంది. ఇవ్వాళ..దేశంలో ప్రధాన నగరాలన్నీ మురికివాడల సమస్యతో సతమతమవుతున్నాయి. ఇరుకు సందులు, ప్రణాళిక లేని కట్టడాలతో గాలి, వెలుతురు కూడా సరిగా ప్రసరించని పరిస్థితుల్లో మురికివాడలన్నీ దుర్భరమైన జీవన పరిస్థితులకు సాక్షి భూతాలుగా నిలుస్తున్నాయి.   ఇది పక్కనబెడితే అస్థవ్యస్థమైన డ్రైనేజ్ వ్యవస్థ నగరజీవికి ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తోంది. ఇటీవల చెన్నై, హైదరాబాద్‌లలో వచ్చిన వరదలు దీనికి ఉదాహరణ. నీళ్లమధ్య ద్వీపాలుగా మారిన అసంఖ్యాక అపార్ట్‌మెంట్లు గమనిస్తే చాలు..అంతులేని నిర్లక్ష్యం మాటున కబ్జాలు..కాసుల వేటలు కనిపిస్తాయి. చెరువులు, నాలాలు, నదీతీరాలు కబ్జాలకు గురైన తీరు కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది.  ఇదంతా ఒక ఎత్తైతే సగటు మనిషి తాగడానికి కూడా నీరు లభించని స్థితిలో ఉన్నది..గుక్కెడు నీరు కోసం గంటల తరబడి పడిగాపులు కాసే పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. సమస్య తీవ్రతను గుర్తించిన కేంద్రప్రభుత్వం పరిష్కారం దిశగా చర్యలు ప్రారంభించింది. మురుగు సమస్యను తీర్చడంతో పాటు వాటిని రీసైక్లింగ్ చేసి తాగునీరుగా మార్చే ప్రణాళికలో భాగంగా అమృత్ పథకాన్ని తీసుకువచ్చారు ప్రధాని మోడీ. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా 500 పట్టణాలను అభివృద్ధి చేస్తారు.   ఎంపిక చేసిన నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పన, మురుగు కాల్వల నిర్వహణ, రవాణా, మొక్కల పెంపకం, పార్కుల అభివృద్ధి వంటి వాటికి నిధులను కేటాయిస్తారు. కేంద్ర పథకాలను అన్ని రాష్ట్రాల కంటే బాగా వినియోగించుకుంటున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలోనూ ముందే ఉన్నారు. కేంద్రం సహకారంతో రాష్ట్రంలో మురుగునీటి శుద్ధి కార్యక్రమం చేపట్టనున్నారు. మురుగు రూపంలో వృథాగా పోతున్న1.08 కోట్ల లీటర్ల నీటిని శుద్ధి చేసి వాడుకుంటే భూగర్భ జలాల రక్షణతో పాటు, వ్యవసాయ అవసరాలకు ప్రతిసారి ఆకాశం వైపు చూడాల్సిన అవసరం ఉండదు.   తొలి దశలో రాష్ట్రంలోని 12 నగరాలు, పురపాలక సంఘాల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. అవి శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ, ఒంగోలు కార్పోరేషన్లు, తెనాలి, మచిలీపట్నం, చిలకలూరిపేట, కావలి, మదనపల్లి, కడప, ధర్మవరం, గుంతకల్ పురపాలక సంఘాలున్నాయి. ఇప్పటికే ఈ 12 ప్రాంతాల నుంచి సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించడం, వాటికి కేంద్రం నిధులు మంజూరు చేయడం కూడా పూర్తయ్యింది. మిగిలిన సాంకేతికపరమైన పనులు ముగించి, వచ్చే ఏడాదిలోపు టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మిగులు విద్యుత్తు రాష్ట్రంగా అవతరించిన ఏపీ ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసి నీటి కరువును నివారించాలని చూస్తోంది. ఏదేమైనా నీటిబొట్టును సద్వినియోగం చేసుకుని దిశగా ముందడుగు వేయడం శుభపరిణామం.

వంగవీటి తరువాత వర్మ... బెజవాడలో కాలుపెట్టగలడా? 

  వంగవీటి... వర్మ ఆడియన్స్ మీదకి వదులుతున్న లెటెస్ట్ మూవీ ఇది! ఇలాంటి సినిమాలు గతంలో ఆయన చేయలేదా? బోలెడు చేశాడు. శివ నుంచీ వీరప్పన్ వరకూ అన్నీ వయోలెంట్ మూవీసే. అలాగని వర్మ సినిమాల్లో కమర్షియల్ డిష్యుం డిష్యుం వుండదు. రియల్ బ్రెత్ టేకింగ్ వయోలెంట్ సీన్స్ వుంటాయి. కాని, ఇప్పుడు వస్తోన్న వంగవీటి అలాంటి సినిమాల్లో మరొకటి కాదు. ఎందుకంటారా? ఈ సినిమా రియల్ క్రైమ్ అండ్ పొలిటికల్ స్టోరీ కాబట్టి...  వర్మ సత్య, కంపెనీ, రక్త చరిత్ర లాంటి చాలా సినిమాలు రియల్ లైఫ్ ఇన్ స్పిరేషన్ తో తీశాడు. కాని, వంగవీటిలో ఫస్ట్ టైం నేరుగా రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ని తెరపై చూపబోతున్నాడు. ఇంతకు ముందెప్పుడు ఆయన నిజ జీవిత మనుషులపై, నాయకులపై సినిమాలు తీయలేదు. తీసినా సినిమాలో వేరే పేర్లు, కొంచెం డిఫరెంట్ బ్యాక్ గ్రౌండ్ ఎంచుకునేవాడు. కాని, వంగవీటితో గతంలో ఎప్పుడూ చేయని సాహసం చేస్తున్నాడు. ఒకవైపు వంగవీటి కుటుంబాన్ని, మరో వైపు దేవినేని ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలి. అలాగే, రెండు వర్గాల అభిమానుల్ని కూడా గమనించుకుంటూ ముందుకు సాగాలి. ఎక్కడ తేడా వచ్చిన గందరగోళమే...  విజయవాడ రాజకీయాలు, గతంలో అక్కడి రాజకీయాలు తెలిసిన వారందరికీ వంగవీటి, దేవినేని ఫ్యామిలీల రిలేషన్ కూడా తెలిసే వుంటుంది. వాళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అప్పుడు, ఇప్పుడు కూడా. కాకపోతే, ఒకప్పుడు పరిస్థితులు దారుణంగా, హింసాత్మకంగా వుండేవి. ఆనాటి పరిస్థితుల్నే ఆర్జీవీ ఇప్పుడు తెరపై చూపించబోతున్నాడు. అదీ ఎగ్జాక్ట్ పేర్లు కూడా వాడుతున్నాడు సినిమాలో. గతంలో ఎప్పుడూ ఆయన ఇలా చేయలేదు. రియల్ లైఫ్ స్టోరీ  అయినా వేరు పేర్లతో చెప్పేవాడు. మరి వంగవీటి సినిమాలో రియల్ నేమ్స్ అండ్ క్యారెక్టర్స్ వాడితే , దేవినేని, వంగవీటి అభిమానుల్ని ఎలా బ్యాలెన్స్ చేస్తాడు? ఎవ్వరికీ కోపాలు రాకుండా ఎలా చూపిస్తాడు? నిజ జీవిత నేపథ్యాన్ని ఎంచుకున్నప్పుడు ఎవరో ఒకరిది తప్పని చూపక తప్పదు కదా? ఇలాంటి బోలెడు ప్రశ్నలు ఇప్పుడు ఆడియన్స్ ని వేధిస్తున్నాయి. వంగవీటి సినిమా తెర మీద కనిపిస్తేనే మనకు ఈ ప్రశ్నలకు జవాబులు దొరికేది! అలాగే, రామూ భవిష్యత్ లో తాను పుట్టిన ఊరైన విజయవాడకి హ్యాపీగా వచ్చిపోగలడా అని కూడా క్లారిటీ వస్తోంది!  

పొలిటికల్ పార్టీలకు... మోదీ సర్కార్ పోటు?

  నోట్ల రద్దు కేవలం మొదటి అడుగు మాత్రమే అని మోదీ పదే పదే చెబుతున్నారు. దేశాన్ని అన్ని విధాల విప్లవాత్మక మార్పులకి లోను చేయాలన్నదే ప్రధాని ఆలోచన. అందులో ఆయన ఎంత వరకూ సక్సెస్ అవుతారో మనం ఇప్పుడే చెప్పలేం కాని...  నోట్ల రద్దు లాంటిదే మరో గొప్ప ముందడుగు పదే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. పైగా ఇది పార్టీలకు, ఎన్నికలకు, ఎలక్షన్స్ టైంలో పొంగిపొర్లే బ్లాక్ మనీకి సంబంధించింది కావటం మరింత విశేషం! ఈ ఒక్క అడుగు పడితే మన ఎన్నికల్లో భారీ మార్పులే జరగొచ్చు!   ఎన్నికల టైంలో ఓట్లు పడే రోజు కంటే ముందు దాకా నోట్లు ఎలా ఎగిరెగిరిపడతాయో మనకు తెలిసిందే! బీరు, బిర్యానీ మొదలు రోజు వారి జీతమిచ్చి జెండాలు మోయించుకోవటం వరకూ అన్నీ డబ్బుతోనే జరుగుతాయి. అంతే కాదు, పోలింగ్ ముందు రోజైతే నల్లధనం పల్లె, పట్నం తేడా లేకుండా దేశం మొత్తాన్ని ముంచెత్తేస్తుంది! ఇదంతా ఎక్కడ్నుంచి వస్తోంది? మామూలుగా పోటీ చేస్తున్న అభ్యర్థి ఖర్చు చేస్తాడని భావిస్తాం. అది కరెక్టే. కాని, చాలా సార్లు పార్టీలు కూడా తమ కోట్లాది రూపాయల నిధుల్లోంచి ఇష్టానుసారం ఖర్చు చేస్తూ ఎన్నికల్ని అవినీతిమయం చేస్తాయి. డబ్బున్న పార్టీ అభ్యర్థి అర్హత లేకున్నా గెలిచే ప్రమాదకర స్థితిని తీసుకొస్తాయి. కాని, ఇక  మీదట పార్టీల ఆటలు చెల్లకపోవచ్చు!     1960లలో చేసిన చట్టాల ప్రకారం నడుస్తోన్న మన పొలిటికల్ పార్టీలు లొసుగుల్ని వాడుకుని ఎప్పటికప్పుడు కోట్లాది రూపాయల్ని బ్లాక్ నుంచి వైట్ చేసుకుంటున్నాయి. ఇంత వరకూ 20వేల కన్నా ఎక్కువ విరాళాలు వస్తేనే దాతల పేర్లు లెక్క  చెప్పాల్సి వుండేది.అందుకే, 20 కన్నా తక్కువ విరాళాలు ఇచ్చారంటూ చాలా మంది  చందాదారుల పేర్లు హాయిగా దాచేసేవి. కాని, దేశంలోని అన్ని పార్టీలు చేస్తోన్న ఈ అరాచకానికి ఈసీ అంతం పలకాలని భావిస్తోంది. 20వేలకి బదులు 2వేలే లిమిట్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది! 2వేల కంటే ఎక్కువ విరాళం ఎవ్వరు ఇచ్చినా వివరాలు తెలపాల్సిందేనన్నమాట!   పార్టీ పెట్టి బ్లాక్ మనీ సంపాదించే వారు కాదు మన దేశంలో బ్లాక్ మనీని వైట్ గా మార్చుకోటానికే పార్టీలు పెట్టిన మహానుభావులు కూడా వున్నారు. ఇంకా పెరుగుతున్నారు కూడా! ఏదో ఒక చిన్నా చితక పొలిటికల్ పార్టీ పెట్టేయటం, దాని ద్వారా వచ్చే ఆదాయ పన్ను మినహాయింపులు వాడుకోవటం, తమ బ్లాక్ మనీని వైట్ గా మార్చేసుకోటం చేస్తున్నారు. కాని, ఎన్నికల కమీషన్ తాజా సిఫారసుల ప్రకారం ఇలాంటి పప్పులు  ఉడకవు. పార్టీ ఏదైనా సరే గెలిస్తేనే ఇన్ కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వాలని ఈసీ అంటోంది. అంటే నిజంగా జనం మద్దతు పొందితే తప్ప మినహాయింపులు దక్కవన్న మాట. అంతే కాదు, పార్టీలు విరాళాల కోసం అచ్చేసి వదిలే కూపన్ల గురించి కూడా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమీషన్ కోరింది. లెక్కా, పత్రం లేకుండా పార్టీలు అమ్ముకునే 10, 20 రూపాయల విలువ గల కూపన్ల గురించి తప్పకుండా పార్టీలు వివరాలు చెప్పేలా నిబంధనలు చేయాలని గవర్నమెంట్ ను కోరింది!   ఎలక్షన్ కమీషన్ కోరిన అన్ని చర్యల్ని మోదీ సర్కార్  తీసుకోవాలన్నరూలేం లేదు. కాని, ప్రస్తుతం అధికారంలో వున్న ప్రభుత్వానికి తెలియకుండా కేంద్ర ఎన్నికల కమీష్ ఈ సిఫారసులు చేస్తుందా? అస్సలు అవకాశం లేదు. అంటే నల్లధనం పై యుద్ధం ప్రకటించిన మోదీ ఎన్నికల కమీషన్ ద్వారా ఉద్దేశ్యపూర్వకంగా ఈ సూచనలు చేయించారని భావించాలి. ముందు ముందు ఈ మార్పులన్నీ కఠినంగా అమల్లోకి వస్తే మాత్రమే ఎన్నికల ప్రక్రియలో భారీ ప్రక్షాళనే జరిగే అవకాశం వుంది. ఎన్నికల్లో డబ్బుల ప్రమేయం ఎంత తగ్గితే అంతగా నిజాయితీ పరులు గెలిచే అవకాశం వుంటుంది. ఈసీ సలహా్ల్ని, సూచనల్ని మోదీ సర్కార్ చిత్త శుద్దితో అమలు చేయాలని మనమూ కోరుకుందాం...

వారణాసిలో వాయువు పీలిస్తే... 'కైలాసా'నికేనట!

  కాశీ... ఈ పేరు చెప్పగానే ప్రతీ హిందువూ పులికించిపోతాడు. జీవితంలో కనీసం ఒక్కసారైనా అక్కడి మణికర్ణికలో మునగాలనీ, విశ్వేశ్వరుని కరుణాకటాక్షాలతో తడిసిపోవాలని తపిస్తాడు. కాని, ఇప్పుడు అదే కాశీ .. శివ శివా అనిపించేలా తయారైపోతోంది! అదీ స్వయంగా ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అయ్యి వుండి కూడా దారుణంగా వుంటోంది. తప్పు రాష్ట్ర ప్రభుత్వానిదో, కేంద్ర ప్రభుత్వానిదో తెలియదు కాని హిందువుల అత్యంత పురాతన క్షేత్రం పవిత్రత ఇప్పుడు గంగపాలు అవుతోంది! భక్తితో భూ కైలాసానికి వెళితే ఆరోగ్యం పాడై రోగాలు అంటుకునేలా తయారైంది పరిస్థితి!   కాశీ అనగానే మనకు గంగా కాలుష్యం గుర్తొస్తుంది. గత కొన్ని ఏళ్లుగా గంగా బచావ్ నినాదాలు వింటూనే వున్నాం. మోదీ ప్రధాని అయ్యాక ఏకంగా ఉమాభారతి లాంటి సీనియర్ మంత్రినే ఆ విషయం చూడమన్నారు. అయినా గంగ బాగుపడ్డది లేదు. కాని, ఇప్పుడు ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. వారణాసిలోని నీళ్లే కాదు వాయువు కూడా విషతుల్యం అవుతోందట! భూమ్మీద ప్రతీ జీవీ ఊపిరి పీల్చటానికి కారణమైన ఆ శివుడి పట్టణమే ఊపిరి ఆడనివ్వని కాసారంగా మారిపోతోంది. ఇందుకు కారణం మానవ స్వార్థం అరాచకత్వాలే...   కాశీ అంటే మహా పుణ్యక్షేత్రం అని మాత్రమే మనకు తెలుసు. కాని, అక్కడి దాకా వెళితే అసలు విషయం బోధపడుతుంది. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఇష్టానుసారం నిర్మాణాలు జరుపుతున్నారు.రోడ్లపై తిరిగే డీజిల్ వాహనాలు, విపరీతమైన పొగ వదిలే బండ్ల వల్ల దారుణమైన దుమ్ము, ధూళీ రేగుతుంటుంది. ఇక లెక్కా పత్రం లేని ఫ్యాక్టరీలు,  ఇటుక బట్టీల వల్ల కూడా కాలుష్యం కట్టలు తెంచుకుంటోంది. ఇవన్నీ ఒక  ఎత్తైతే రోజూ వచ్చే లక్షలాది మంది భక్తుల ఒత్తిడి అక్కడి వాతావరణంపై ఎలాగూ వుంటుంది. ఇవన్నీ కలిసి వారణాసిని దారుణంగా మార్చేస్తున్నాయి.      కాశీలో కాలుష్యం ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడుకోవటానికి కారణం తాజా అధ్యయనాలే. అక్కడి గాలి ఢిల్లీ లాంటి అత్యంత విషతుల్యమైన నగరాన్ని కూడా మించిపోయిందట! దేశంలోనే బనారస్ లో వున్నంత ప్రమాదకరమైన గాలి మరెక్కడా లేదట! వాయు కాలుష్యానికి కారణమైన పీఎం 2.5 కణాలు ఒక్క క్యూబిక్ మీటర్ గాలిలో 25 మైక్రో గ్రాములు మాత్రమే వుండాలి.కాని, కాశీలో 60 మైక్రో గ్రాములు వుంటోందట. దీన్ని బట్టి అక్కడి గాలి పీలిస్తే ఎంత డేంజరో అర్థం చేసుకోవచ్చు. ఈ విషాదకరమైన పరిస్థితిని ఇటు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం , అటు ప్రధాని మోదీ ఇద్దరూ గుర్తించాలి. గంగతో పాటూ గంగలో కలుస్తోన్న వాయువును కూడా యుద్ధ ప్రాతిపదికన కాపాడాలి. ఎందుకంటే, కాశీ కేవలం ఒక నగరం మాత్రమే కాదు.. హిందువుల అత్యంత పురాతనమైన దివ్య క్షేత్రం. అది మన సంస్కృతి. వారసత్వ సంపద.

సిటీ ఆఫ్ హా(రర్)రన్స్!

  శబ్దం జోష్ ని ఇస్తుందేమోగాని... నిశ్శబ్దం పీస్ ఆఫ్ మైండ్ ని ఇస్తుంది! అందుకే, గుడిలోనో, లైబ్రెరీలోనో, పచ్చటి పార్కుల్లోనో జనం పొందే తృప్తి పబ్బుల్లో, క్లబ్బుల్లో పొందలేరు! కాని, ఇప్పుడు ఈ మాటెందుకు చెప్పాల్సి వచ్చిందంటే దేశంలోనే ఆరో అతి పెద్ద నగరమైన మన భాగ్యనగరం నిశ్భద్ధం తెలియని రణగొణ నరకంలా మారిపోతోంది! దాని ఫలితంగా హైద్రాబాదీలు ప్రశాంతత కోల్పోతున్నారు. ఇంకా చాలా చాలా నష్టపోతున్నారు...  రోజూ సిటీలో వుండే వారికి ఇరవై నాలుగు గంటలూ హారన్ల మోత చాలా మామూలు విషయం. అసలు మన సిటీలోని కొన్ని బస్తీల్లో అయితే అర్థ రాత్రి, అప రాత్రి అన్న తేడా లేకుండా వాహనల చప్పుళ్లు జీవితంలో భాగమైపోయాయి. నిద్రలో వున్నప్పుడు కూడా ఇంటి ముందు రోడ్డు మీద నుంచి హారన్లు మోగిస్తూ వెహికల్స్ దూసుకెళుతుంటాయి. అవ్వి నిజమైన శబ్దాలో , కలలోని కలతలో అర్థం కాని విచిత్ర స్థితి!  పైకి పెద్ద సమస్యగా కనిపించని నగరాల్లోని శబ్ద కాలుష్యం మనం భావించినంత చిన్నది కాదు. అసలు తాజా సర్వేల ప్రకారం హైద్రాబాద్ లోని చాలా ప్రాంతాలు చెవులు చిల్లులు పడే లాంటి ధ్వని కాలుష్యంతో సతమతం అవుతున్నాయట! మరీ ముఖ్యంగా, పంజాగుట్ట, అబిడ్స్, ప్యారడైజ్, కూకట్ పల్లి, తార్నాక లాంటి ప్రాంతాలు భీభత్సమైన శబ్దాలతో జనాన్ని నిర్వీర్యం చేసేస్తున్నాయి. విపరీతమైన శబ్దాలు ఎక్కువ సేపు వింటూ వుంటే మనిషి వినికిడి శక్తి కోల్పోతాడు. అంతే కాదు, ప్రశాంతత లోపిస్తుంది. మానసిక ఒత్తిడి పెరిగిపోయి ఏకాగ్రత వుండదు. మెయిన్ రోడ్లపై మరీ శబ్దాలు మరీ ఎక్కువైపోతే యాక్సిడెంట్లు, గొడవలు అయ్యే ప్రమాదం కూడా వుంది! నిజానికి ఇలాంటి పరిణామాలన్నీ హైద్రాబాదీలకు ఇప్పటికే తెలుసు. కాని, వాట్ని నగర జీవనంలో తప్పనిసరి నరకంగా భావించి భరిస్తున్నారు! శాస్త్రీయమైన లెక్కల ప్రకారం మన చుట్టూ వుండే శబ్ద తీవ్రత 50 నుంచి 60 డెసిబెల్స్ దాటకూడదు. మరీ సున్నిత ప్రాంతాలైతే 40 నుంచి 50 డెసీబెల్సే వుండాలి. రాత్రి వేళ మరింత తక్కువగా శబ్దాలుండాలి. కాని, హైద్రాబాద్ లో పొద్దస్తమానం ట్రాఫిక్ వుంటూనే వుంది. రాత్రి కూడా రోడ్లన్నీ నిర్మానుష్యం అవ్వటం ఎప్పుడో మానేశాయి. అందుకే, నిద్దుర ఎరుగక పరుగులు పెడుతోన్న భాగ్యనగరిలో గరిష్ఠంగా 80 డెసిబెల్స్ కూడా దాటిపోతోందట శబ్ద కాలుష్యం. దీని జనం ఎన్నో అనారోగ్యాలకి గురవుతున్నారు. ప్రపంచ స్థాయి నగరం అంటూ స్పీచుల్లో హైద్రాబాద్ ను పొగిడే పాలకులు భయంకరమైన ధ్వని కాలుష్యంపై దృష్టి పెట్టాలి. ఓ పెద్ద కర్మాగారంలా కణకణ మండుతూ, రణగొణ ధ్వనులతో, ఎటు చూసినా దుమ్ము దూళితో మట్టి కొట్టుకుపోయే సిటీ... విశ్వ నగరం ఎలా అనిపించుకుంటుంది? అలాగే, జనం కూడా సాధ్యమైనంత తక్కువ కాలుష్యానికి పాల్పుడుతూ మన అందరి సుందర నగరాన్ని భద్రంగా వుంచుకోవాలి!   

నగదు రహితం ఎంతవరకు సాధ్యం!

  ‘ముందు 100 శాతం అక్షరాస్యతని సాధించలేనప్పుడు 100 శాతం డిజిటలైజేషన్‌ ఎంతవరకూ సాధ్యం!’ ఓ ప్రతిపక్ష ఎమ్మెల్యే ఆరోపణ. ‘సెల్‌ఫోనుని ఆపరేట్ చేయడం నాకే రాదు. అలాంటి దేశమంతటా నగదురహిత లావాదేవీలను ఎలా నిర్వహిస్తారు?’ ఓ మాజీ ప్రధాని ఆవేదన.   ఎవరేమన్నా జాతీయ ప్రభుత్వం మాత్రం నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించే దిశగానే అడుగులు వేస్తోంది. పెద్దనోట్ల రద్దు తరువాత తిరిగి ఆ ధనాన్ని చాలా నిదానంగా భర్తీ చేయడం వెనుక కారణం కూడా... ప్రజలను నగదురహితం వైపు మళ్లించేందుకే అన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. మున్ముందు నగదుతో కూడుకున్న లావాదేవీల మీద కూడా రకరకాల పరిమితులను విధించే అవకాశలూ కనిపిస్తున్నాయి.   పెద్దనోట్ల రద్దు సమాజానికి ఓ కుదుపు అన్న విషయాన్ని ఎవరూ కాదనలేరు. నిర్ణయం అమలులో లోపాలు ఉన్నాయన్నదాని మీదా తీవ్రమైన విమర్శలు చెలరేగుతున్నాయి. అయితే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం అసాధ్యం కాబట్టి, ఇక మీదట ఏం చేయాలన్నదే ప్రశ్న! మోదీ చేసిన పనిలో తప్పొప్పుల సంగతి పక్కనపెడితే ఇప్పుడు మన ముందు ఉన్న దారిలో ప్రయాణించడం ఎలా అన్నదే ముఖ్యం. బహుశా ఈ విషయాన్ని గ్రహించబట్టో ఏమో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ కూడా గమ్మున ఆన్‌లైన్ లావాదేవీల గురించే మాట్లాడుతున్నారు.   నగదురహిత సమాజం ఊహించడానికి బాగానే ఉంటుంది. ఇలాంటి లావాదేవీల వల్ల ప్రతి పైసాకీ లెక్క ఉండటం, లావాదేవీలు సులువుగా సాగిపోవడం, అక్రమ సంపాదనకు అడ్డుకట్టపడటం, పన్ను ఎగవేతలని నివారించడం వంటి లక్షణాలు ఊరిస్తుంటాయి. రియల్‌ ఎస్టేట్ వంటి రంగాలలో అనూహ్యమైన ధరలు పలకడం తగ్గుతుంది. కానీ అసలు అడ్డంకల్లా... ఇలాంటి లావాదేవీలను నిర్వహించేందుకు జనంలో తగిన సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడమే! ఇందుకోసం ఇప్పటికిప్పుడు లక్షలాది ఫోన్లను దిగుమతి చేసి ఉచితంగా పంచిపెడితే సరిపోదు. ఎందుకంటే ఆ ఫోన్లలో ఉన్న యాప్స్ అన్నీ కూడా ఇంగ్లీషులోనే ఉంటున్నాయి. వాటిని గ్రామీణులు ఉపయోగించలేరన్నది నిర్వివాదం.   ఇక ఆన్‌లైన్లలో పెరుగుతున్న లావాదేవీలకు అనుగుణంగా వాటిలో భద్రత పెరగడం లేదన్నది మరో ఆరోపణ. స్వైపింగ్‌ చేసేటప్పుడు ఒక చిన్నపాటి లోపం వచ్చి డబ్బు అనవసరంగా చెల్లింపుకి గురైతేనే మనం బెంబేలెత్తిపోతాము. అలాంటిది ఆన్‌లైన్ చెల్లింపులకి సంబంధించిన మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం, బ్యాంకులు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తోచడం లేదు. పేటీఎం వంటి సంస్థలు విచ్చలవిడిగా ఆన్‌లైన్ లావాదేవీలను నిర్వహించేస్తున్నాయి. కానీ ఇలాంటి సంస్థల లావాదేవీలకి సంబంధించి భద్రతాపరమైన లోపాలు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ప్రభుత్వమూ, బ్యాంకులూ ఏవో కొన్ని ప్రకటనలు జారీ చేస్తే సరిపోదు. ఆన్‌లైన్‌ లావాదేవీలు నిర్వహించే సంస్థల పనితీరుకి సంబంధించి కఠినమైన మార్గదర్శకాలు కూడా ఉండాల్సిందే!   ఒక ముప్ఫై ఏళ్ల క్రితం మనకి కంప్యూటర్ గురించి అవగాహన లేదు, ఒక ఇరవై ఏళ్ల క్రితం ఏటీఎం వాడకమూ పెద్దగా తెలియదు. కానీ అసలంటూ మొదలుపెడితే సాంకేతికతని అందిపుచ్చుకోవడంలో భారతీయులకు ఎవ్వరూ సాటిరాదన్నది జగమెరిగిన సత్యమే! మనం ఇప్పుడు విచ్చలవిడిగా వాడేస్తున్న సెల్‌ఫోన్లే అందుకు ఉదాహరణ. కాబట్టి ఆన్‌లైన్లో భద్రత, సులువు ఉన్నాయని తెలిస్తే... నగదురహిత లావాదేవీల వైపుగా భారతీయులు మరింత మొగ్గుచూపి తీరుతారు. కానీ అటువైపుగా పయనించలేని గ్రామీణులని బలవంతపెట్టకపోవడమే మేలు. మరికొంత కాలం పాటు గ్రామీణ భారతంలో నగదు లావాదేవీలకు అవకాశాన్ని కల్పించడంలోనే అటు గ్రామీణ భారతీయులకు, ఇటు ప్రభుత్వానికీ మంచిది. ఈలోగా ఓ తరం మారిపోతుంది. లావాదేవీలు జరిగే తీరూ మారిపోతుంది. సమాజంలో ఒక సమూలమైన మార్పు రావాలంటే ఆమాత్రం వేచిచూడక తప్పదు.

మోదీ హ్యాకింగ్ అస్త్రం ప్రయోగిస్తున్నారా?  

మన పురాణాలు తిరగేస్తే బోలెడు వింతలు కనిపిస్తాయి. అందులో ఒకటి దివ్య దృష్టి. కొందరు కూర్చున్న దగ్గరే కూర్చుంటూ ఎక్కడ ఏం జరిగినా అన్నీ చూసేసే వారు అప్పట్లో! కాని, నిజంగా అది సాధ్యమా? ఇప్పటి వారు చాలా మంది కాదనే అంటారు. కాని, పురాణాల కాలం మాట ఏమోగాని... ఇప్పుడు కూడా దివ్య దృష్టి వున్న వాళ్లు తయారైపోయారు. వీళ్లు కూడా కఠోర తపస్సు చేస్తారు. కాకపోతే, వీళ్లది దేవుడి కోసం తపస్సు కాదు. టెక్నాలజీ కోసం తపస్సు! హ్యాకర్స్ అనగానే సాధారణంగా ప్రతీ ఒక్కరూ అలెర్ట్ అవుతారు! తమ కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు ఎవరు హ్యాక్ చేస్తారో అన్న భయం ఇప్పుడు కామనైపోయింది. కాని, హ్యాకర్స్ బెడద మామూలు వారికంటే సెలబ్రిటీలకు ఎక్కువ. మన రహస్యాలు ఎన్ని లీకైనా పెద్దగా నష్టం వుండదు. మహా అయితే డబ్బులు కాజేయవచ్చు హ్యాకర్లు. కాని, సెలబ్రిటీల అకౌంట్లు ఈ సైబర్ కేటుగాళ్ల చేతికి చిక్కితే అంతే సంగతులు. వాళ్లు ఎలాంటి రహస్యాలైనా బయటపెట్టి ఆటాడుకోవచ్చు. ఇప్పుడు అదే పరిస్థితిలో వున్నారు కొందరు ఇండియన్ సెలబ్స్! కంప్యూటర్ , ఇంటర్నెట్, సాఫ్ట్ వేర్లు, నెట్ వర్క్ లు... ఇలాంటి వాటిపై పట్టు వుంటే ప్రపంచంలో ఎక్కడ కూర్చునైనా ఎక్కడి కంప్యూటర్ నైనా హ్యాక్ చేయవచ్చు. ఇప్పుడు అధునిక కాలంలో ఇదే దివ్య దృష్టిగా మారిపోయింది. అలా చేస్తున్న తాజా సంస్థే... లిజియన్ గ్రూప్. ఈ హ్యాకర్ల బ్యాచి మన దేశంలోని పెద్ద పెద్ద ప్రముఖుల ట్విట్టర్ అకౌంట్లు వరుసగా హ్యాక్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికార ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేయటంతో పాటూ రాహుల్ గాంధీ అధికారిక హ్యాండిల్ కూడా హ్యాక్ చేశారు. ఆ సంచలనం చల్లబడ్డక ముందే ప్రముఖ జాతీయ మీడియా జర్నలిస్టులు బర్ఖాదత్, రవిష్ కుమార్ ల అకౌంట్లు కూడా ఈ లిజియన్ గ్రూప్ బారిన పడ్డాయి.  లిజియన్ హ్యాకర్లు వాషింగ్ టన్ పోస్ట్ పత్రికతో మొబైల్ ఛాటింగ్ లో మాట్లాడుతూ అన్నిటికంటే పెద్ద బాంబు పేల్చారు. తమ వద్ద జయలలిత చికిత్స జరిగిన అపో అసుపత్రి సర్వర్ వివరాలు కూడా వున్నాయన్నారు. ఆమెకు చేసిన వైద్యంపై తమ వద్ద వున్న హ్యాక్ చేసిన ఆధారాలు బయటపెడితే దేశం గందరగోళం అవుతుందని వారు చెప్పారట! అంతగా కల్లోలం రేపే సీక్రెట్స్ అందులో ఏమున్నాయో ఇప్పటికైతే తెలియదు. కాని, ముందు ముందు లిజియన్ గ్రూప్ ఆ వివరాలు బయట పెడుతుందా? దీనికి వారు సూటిగా సమాధానం చెప్పలేదు. తమ వద్ద అపోలో సర్వర్ రహస్యాలు వున్నాయని మాత్రమే చెప్పారు. బయటపెడతారో లేదో తెలియదు...  లిజియన్ హ్యాకర్లు ఇంత దాకా చేసిందే కాదు ఇక ముందు చేయబోయేది కూడా చెప్పారు. ఐపీఎల్ కమిషనర్ గా నానా రచ్చ చేసిన లలిత్ మోదీ అకౌంట్లు, కంప్యూటర్లు తమ నెక్ట్స్ టార్గెట్ అన్నారు. ఆయన గురించి ఎలాంటి సీక్రెట్స్ బయటపెడతారో మరి! కాకపోతే, ప్రస్తుతానికి లిజియన్ ఎవ్వరి గురించీ పెద్దగా సంచలన వివరాలేం బయటపెట్టలేదు. అంతకంటే ముఖ్యంగా, ఈ హ్యాకర్స్ బ్యాచ్ బీజేపి నేతలు, వారికి అనుకూలంగా వుండే సెలబ్రిటీల గురించి ఒక్క మాటా మాట్లాడకపోవటం అనుమానాలకు తావిస్తోంది. ఇదంతా మోదీ సైబర్ టీమే చేస్తోందని ఆరోపణలు అప్పుడే మొదలైపోయాయి కూడా...        

నల్ల కోటు లాయర్ కాదు... నల్ల నోట్ల లాయర్!

  కోర్టులో వాదించే వార్ని ఇంగ్లీషులో అయితే లాయర్ అంటారు. తెలుగులో ఏమంటారు? న్యాయవాది! అంటే... న్యాయం వైపున నిల్చి, గెలిపించేవాడు అని అర్థం! కాని, ప్రతీ కేసులోనూ  న్యాయం వైపున ఒక లాయర్ వున్నట్టే అన్యాయం వైపున కూడా మరో లాయర్ వుంటాడు. ఈ లెక్కన సగం మంది లాయర్లు అన్యాయవాదులన్నమాట! ఇలాంటి లాజిక్ పక్కన పెట్టేసి ఆలోచించినా కూడా ఢిల్లీలోని ఓ లాయర్ నిర్వాకం చూస్తే మనకు దిమ్మతిరిగిపోతుంది. అసలు అలాంటి పనులు చేస్తూ నల్ల కోటు వేసుకున్న వార్ని న్యాయవాదులు అనవచ్చా అన్న అనుమానం కలుగుతుంది. అన్యాయవాదులు అన్న పదమే వాళ్లకి కరెక్ట్...  అనగనగా రోహిత్ టాండన్ అని ఓ ఢిల్లీ లాయర్. ఈయనెవరో రాం జెఠ్మలానీ లాంటి ప్రముఖ, ప్రసిద్ధ న్యాయవాది అనుకోకండి! ఓ మామూలు చిన్న చిన్న కేసులు టేకప్ చేసే సాదాసీదా లాయర్. కాని, అంతా అలా అనుకుంటున్న సమయంలోనే రోహిత్ టాండన్ ఎంతటి ప్రబుద్దుడో అందరికీ తెలిసిపోయింది. గత అక్టోబర్ లో తొలి సారి మనోడి ఇళ్లు, ఆఫీసు లాంటి వాటిపై ఐటీ శాఖ దాడులు చేసింది. గట్టి నిఘా పెట్టి టాండన్ గారి నల్ల వ్యవహారం పసిగట్టిన ఐటీ అదే రేంజ్లో ఎటాక్ చేసింది. ఫలితంగా ఒకేసారి 125కోట్లు దొరికాయి! తరువాత ఈ మధ్య కాలంలో రెండు వారాల కిందట ఆదాయ పన్ను శాఖ రెండో సారి దాడులు చేసింది. అప్పుడు 19కోట్లు లభించాయి దొరగారి దగ్గర నుంచి.  తాజాగా... ముచ్చటగా మూడోసారి దాడి చేసిన ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ కి మళ్లీ భీభత్సంగా బ్లాక్ మనీ దొరికింది. పాత 500, 1000 నోట్లు కాదు కొత్త 2వేల నోట్లు కూడా భారీగా దొరికాయి! ఎంత అనుకుంటున్నారు? సామాన్య జనానికి ఒక్క రెండు వేల నోటు కూడా దొరకని కరువు కాలంలో మనోడి వద్ద ఏకంగా 2కోట్ల 61లక్షల విలువైన నోట్లు వున్నాయట! ఇంత అక్రమ సంపాదన కలిగిన ఈ రోహిత్ టాండన్ సుప్రీమ్ కోర్టులో హై ప్రొఫైల్ కేసులు వాదించే వాడేమీ కాదట! అయినా ఇంత నల్ల సొమ్ము ఈ నల్ల కోటు శాల్తీ వద్ద ఎలా వచ్చిందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు! అయినా... డబ్బు సంపాదించటం అనే టాలెంట్ వున్న వాడికి మరో స్పెషల్ టాలెంట్ అవసరమా చెప్పండి?   

భగవద్గీత వయస్సు 5,153 ఏళ్లని మీకు తెలుసా?  

మార్గశిర శుద్ధ ఏకాదశి మామూలు ఏకాదశి కాదు. ఎందుకంటే, 5వేల ఏళ్ల క్రితం ఇదే రోజు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతను బోధించాడు! అందుకే, మార్గశీర్ష మొదటి ఏకాధశిని గీతా జయంతి అంటారు. అంటే, ఆ రోజున గీత జన్మించిందన్నమాట! బహుశా ఈ కారణం చేతనే కృష్ణుడు ''మాసానాం మార్గశీర్షోహం'' అన్నాడు. మాసాలలో తాను మార్గశీర్ష మాసం అని భగవానుడు ప్రత్యేకంగా చెప్పాడు. అంతటి విశిష్ఠత ఈ గీతా జయంతి కారణంగానే వచ్చిందనుకోవచ్చు....  మామూలుగా భగవద్గీత కృష్ణార్జునుల సంవాదం అని మనకు తెలుసు. కాని, మనకు తెలియని ఇంకా బోలెడన్ని విషయాలు, విశేషాలు గీతలోనూ, గీత గురించి వున్నాయి. అందులో ముఖ్యమైన అయిదు సంగతులు ఇప్పుడు తెలుసుకుందాం!  1. భగవద్గీత పార్థుడికి, పార్థ సారథికి మధ్య చర్చ అయితే... గీత అని ఎందుకు అన్నారు? గీత అంటే పాట. భగవద్గీత పాట రూపంలో అనుష్టుప్ ఛందస్సులో వుంటుంది. ప్రతీ శ్లోకంలోని ప్రతీ పాదానికీ 32అక్షరాలు వుంటాయి. కొన్ని చోట్ల కొన్ని కొన్ని ప్రత్యేకమైన శ్లోకాలకి త్రిష్టుప్ ఛందస్సు కూడా ఉపయోగించటం జరిగింది. అందులో నాలుగు పాదాలు, పాదానికి 11అక్షరాలు వుంటాయి. 2, 8, 11 అధ్యాయాల్లో మనం ఇలాంటి చూడవచ్చు...  2. భగవద్గీత పరిమాణం ఎంత? భగవద్గీత మొత్తం 18అధ్యాయాల్లో విస్తరించి వుంది. అందులో మొత్తం 7వందల శ్లోకలు వున్నాయి.  3. భగవద్గీత ఎన్ని వేల సంవత్సరాల క్రితం, ఎప్పుడు భగవానుడు ప్రబోధించాడు? మహాభారతంలో పేర్కొన్న వివిధ ఖగోళ విశేషాలు, గ్రహాణాల ఆధారంగా లెక్కగడితే క్రీస్తు పూర్వం 3102వ సంవత్సరంలో కలియుగం ప్రారంభమైంది! అంతకు 35ఏళ్లు ముందు కురుక్షేత్రంలో గీతా బోధ జరిగింది! అంటే... భగవద్గీత క్రీస్తు పూర్వం 3137వ సంవత్సరం నాటిదన్నమాట! 4. భగవద్గీత ఇంగ్లీష్ లోకి ఏ సంవత్సరంలో అనువాదించారు? 1785లో! చాల్స్ వికిన్స్ లండన్లో ఈ తొలి అనువాదం చేశాడు. అంతకు కేవలం 174ఏళ్లే ముందే ఇంగ్లీష్ లోకి బైబిల్ ను అనువదించారు!  5. భగవద్గీత ఇప్పటి వరకూ మొత్తం ఎన్ని భాషల్లోకి తర్జుమా అయింది? గీతాచార్యుడు సంస్కృతంలో చేసిన బోధనని ఇప్పటి వరకూ 175భాషల్లోకి అనువదించారు!      

ఎంబీఏలు, బీటెక్ లు చదివారు! డ్రైనేజీలు కడుగుతామంటున్నారు!

గవర్నమెంట్ గొప్పా... గవర్నమెంట్ జాబ్ గొప్పా అంటే... సగటు భారతీయుడు ఏం సమాధానమిస్తాడు? ప్రభుత్వం కంటే ప్రభుత్వ ఉద్యోగమే సేఫ్ అంటాడు! ఎందుకంటే, కష్టపడి గవర్నమెంట్ ఏర్పాటు చేసినా 5ఏళ్లే! కాని, ఒక్కసారి గవర్నమెంట్ డ్యూటీ కొట్టామా... లైఫ్ లాంగ్ సేఫ్! అందుకే, గవర్నమెంట్ జాబ్ కి మన దేశంలో క్రేజ్ అంతా ఇంతా కాదు! అసలు ఒకప్పుడు ఏ మాత్రం ప్రైవేటీకరణ లేనప్పుడు జాబ్ అంటే ... గవర్నమెంట్ జాబే! ఇప్పుడైతే దొరికిందేదో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నారు. అయినా కూడా అందరికీ లోలోన సర్కారీ కొలువుపై ఎనలేని ఆశ వుంటూనే వుంటుంది! ఇక అసలు ఉద్యోగమే లేని నిరుద్యోగుల పరిస్థితి ఆలోచించండి? గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అంటే, వారికి ఎడారిలో థమ్సప్పే!  దేశంలోని చాలా రాష్ట్రాలు 1990 తరువాత ప్రైవేట్ రంగంలో చాలా ఎదిగాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో అనేక రంగాల్లో ప్రైవేట్ జాబ్స్ విపరీతంగా అందుబాటులోకి వచ్చాయి. అవ్వి చేజిక్కించుకుంటున్న యూత్ గవర్నమెంట్ ఉద్యోగాల మీద ఆశలు వదిలేశారు. ప్రయత్నాలు మానేశారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తే బావుంటుందని మనసులో వున్నా అది అయ్యే పని కాదని డిసైడైపోతున్నారు అత్యధిక శాతం గ్రాడ్యుయేట్లు. ఇతర ఉన్నత చదువులు చదివిన వారైతే అస్సలే ఆలోచించటం లేదు. కాని, ఈ మొత్తం పరిస్థితికి ఉత్తర్ ప్రదేశ్ పూర్తిగా విరుద్ధం...  దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన యూపీ వెనుకబాటులోనూ పెద్దదే! ఇప్పటికీ అక్కడ 1980ల నాటి పరిస్థితుల్ని జాగ్రత్తగా కాపాడుతున్నారు రాజకీయ నేతలు. ప్రైవేట్ రంగం చాలా రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఏ మాత్రం ఎదగటం లేదు. బీహార్ లాంటి ఇతర వెనుకబడిన రాష్ట్రాల్లాగే ఉత్తర్ ప్రదేశ్ లో కూడా నిరుద్యోగం చాలా ఎక్కువ. అందుకే, ముంబైలో శివసేన, ఎంఎన్ఎస్ ఎప్పుడు దాడులు చేసినా ముందుగా బలయ్యేది యూపీ వారే. అక్కడ్నుంచి వెళ్లిన వారు వలసకు పోని ప్రాంతం దేశంలోనే లేదు. ముంబై, ఢిల్లీ, బెంగుళురు, హైద్రాబాద్ లాంటి నగరాలు మొదలు చిన్న చిన్న టౌన్ల దాకా మనకు ఎక్కడకు పోయినా యూపీ వలస కార్మికులు, ఉద్యోగులు కనిపిస్తారు! దేశంలోనే ఇలాంటి కఠిక నిరుద్యోగ పరిస్థితులున్న రాష్ట్రం మరొకటి లేదు...  మరి కొన్ని నెలల్లో ఎన్నికలకి వెళ్లబోతోన్న ఉత్తర్ ప్రదేశ్ లో నిరుద్యోగం ఏ స్థాయిలో వుందో కళ్లకు కట్టే ఉదాహరణ తాజాగా చోటు చేసుకుంది. అలహాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ వాళ్లు స్వీపర్ పోస్టులకు నోటిఫికేషన్ వేశారట. 250 కాంట్రాక్ట్ ఉద్యోగాలకు ఒక లక్ష పదివేల అప్లికేషన్లు వచ్చాయట! ఈ సంఖ్య చూస్తే చాలు మనకు ప్రభుత్వ ఉద్యోగం పట్ల భారతీయుల ఆతృత ఎంత వుందో తెలిసిపోతుంది! అంతే కాదు, అప్లై చేసిన వారిలో చాలా మంది ఎంబీఏ, బీటెక్, పీజీ కోర్స్ లు చేసిన వారు వున్నారట! కాని, వీళ్లలో ఎవరికైనా నిజంగానే స్వీపర్ పోస్ట్ వస్తే ఏం చేయాల్సి వుంటుందో తెలుసా? డ్రైనేజీలు క్లీన్ చేయటం, రోడ్లు ఉడ్వటం! అవును... ఎంబీఏ, బీటెక్ చేసిన వారు ఈ పనులు చేయటానికి సిద్ధపడుతున్నారు! కారణం గవర్నమెంట్ ఉద్యోగంలో వుండే భద్రత! ఎంత చిన్న పోస్టైనా సరే ఏదోలా లభించే ఎక్స్ ట్రా ఇన్ కమ్! ఇవ్వే ఇప్పుడు అందర్నీ గవర్నమెంట్ జాబ్ కోసం తహతహలాడిస్తున్నాయి. ఇక ఏ ఉద్యోగమూ లేని నిరుద్యోగుల సంగతి చెప్పేదేముంది?  ఒక రోడ్లు ఉడ్చే పోస్ట్ కు వేల సంఖ్యలో అప్లికేషన్లు రావటం దేశ స్థితిగతుల్ని సూచిస్తుంది. అంతే కాదు, మరీ ముఖ్యంగా, ప్రవేటీకరణ ఫలితాల్ని అందుకోకుండా వుండిపోతన్న కొన్ని ఉత్తరాది రాష్ట్రాల దీన స్థితిని స్పష్టం చేస్తుంది! అలాగే, మన దేశంలో జనంలో వున్న గవర్నెమెంట్ జాబ్ కలను కూడా పట్టి చూపుతుంది! ఈ పరిస్థితి త్వరగా మారేలా నేతలు వ్యవహరించాలి. చదువుకు తగ్గ ఉద్యోగం అందరికీ లభించేలా అభివృద్ధి జరగాలి. లేదంటే, బాగా చదువుకున్న వాడూ, చదువుకోని వాడూ ఇద్దరూ అర్థాకలితో అలమటిస్తూనే వుండాల్సి వస్తుంది!           

దేశం రోడ్డున పడి నెలైంది... మోదీ సాధించిందేంటి? 

  ఇవాళ్ల డిసెంబర్ 8. సరిగ్గా నెల రోజుల కిందట, అంటే, నవంబర్ 8న ఈ సమయంలో మీరేం చేస్తున్నారు? బహుశా మీకు గర్తు కూడా వుండకపోవచ్చు. కాని, నవంబర్ 8 రాత్రి 8గంటల తరువాత నుంచీ దేశ మొత్తం ఒకే ఒక్క పని కామన్ గా చేస్తోంది! అదే క్యూలో నిలబడటం! నెల రోజులుగా జనం బ్యాంకులు, ఏటీఎంల ముందు పడిగాపులు పడుతూనే వున్నారు. ఇంకా చిల్లర కష్టాలు తీరేలా కనిపించటం లేదు. డిసెంబర్ 30 వరకూ ఈ ప్రెషర్ ఇలాగే వుండేలా వుంది. కాని, నెల రోజుల కిందటి మోదీ పెద్ద నోట్ల రద్దు సంచలనం... ఇప్పటి దాకా సాధించింది ఏంటి? బ్లాక్ మనీ లేని వైట్ మనీ పేదోళ్లని, మిడిల్ క్లాస్ వాళ్లని రోడ్డున వేయటమేనా? దీనిపై క్లారిటీ రావాలంటే నోట్ల రద్దుతో ముడిపడ్డ మూడు ప్రధాన అంశాలు మనకు తెలియాలి...  నవంబర్ 8న మోదీ నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే, అందులో ఆయన స్పష్టంగా పాత నోట్ల మాయం వల్ల కలిగే లాభాలు చెప్పేశారు. వాట్ని మూడు భాగాలుగా మనం విభజించుకోవచ్చు. మొదటి లాభం... నల్లధనం వెలికితీత! దీనిపై ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వచ్చేశాయి. నల్లధనం ఏ మాత్రం బయటకు రాలేదనీ, అంతా వైట్ గా మారిపోయిందని అంటున్నారు ప్రతిపక్షాల వాళ్లు. ఇందులో నిజం లేకపోలేదు. ఎక్కడికక్కడ పట్టుబడుతున్న కొత్త రెండు వేల నోట్లు చూస్తుంటే ఇంకా ఎంత మొత్తంలో పెద్దోళ్ల బ్లాక్ హోల్స్ లోకి వెళ్లిపోయాయో అంచనా వేయవచ్చు! కాబట్టి, మొత్తానికి మొత్తంగా డిసెంబర్ 30నాటికి నల్లధనం అంతా బయటకొస్తుందని ఆశించలేం. ప్రభుత్వం నోట్ల రద్దుతో నల్ల నక్కలపై జూలు విదిలిస్తే వాళ్లు అంతే తెలివిగా కొత్తవి పోగేసుకున్నారు. మధ్యలో గవర్నమెంట్ అధికారులు, బ్యాంక్ మ్యానేజర్లు కమీషన్ రూపంలో లాభపడ్డారు. తాజాగా వెలుగు చూసిన గాలి జనార్దన్ రెడ్డి వంద కోట్ల ఎక్స్ ఛేంజ్ వ్యవహారం... దేశంలో అరాచకంగా నడిచిన నోట్ల మార్పిడికి చిన్న ఉదాహరణ లాంటిది మాత్రమే!  నల్లదనం విషయంలో నోట్ల రద్దు పెద్దగా సక్సెస్ కాలేదు. అలాగని నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, నల్ల డబ్బు ఇంతకు ముందు వుంది. ఇప్పుడు కూడా వుంటుంది. దీని వల్ల దేశానికి కొత్త కష్టం ఏం వచ్చిపడదు. అయితే, ఆల్రెడీ ఐటీ, ఈడీ శాఖలు దాడులు మొదలు పెట్టాయి కాబట్టి కొందరైనా బ్లాక్ డాగ్స్ పట్టుబడతారని నమ్మకం పెట్టుకోవచ్చు. కాని, డీమానిటైజేషన్ వల్ల ఇంకా రెండు లాభాలు కూడా వున్నాయి. అవే మోదీ చేసిన ఈ సాహసానికి కొంతైనా స్వాంతన మిగిలేలా చేస్తున్నాయి! పాత నోట్ల స్థానంలో కొత్త నోట్లు రావటం నల్లధనాన్ని నియంత్రించ లేకున్నా దొంగ నోట్లని అరికడుతుందంటున్నారు. నవంబర్ 8న తన స్పీచ్ లో మోదీ కూడా ఇదే చెప్పారు. పాకిస్తాన్ నుంచి వెల్లువెత్తిన పైరసీ నోట్లు దేశ ఆర్దిక వ్యవస్థకి తీరని లోటు చేస్తున్నాయి. అందుకే, కాశ్మీర్ అల్లరి మూకల నుంచీ మొదలు పెడితే బెంగాల్ దొంగ నోట్ల మాఫియా వరకూ అందరికీ ఈ ఫేక్ నోట్లే ఆధారంగా వుంటూ వచ్చాయి ఇంతకాలం. కాని, ఇప్పుడు డీమానిటైజేషన్ వల్ల అవ్వి చెల్లకుండా పోయాయి. కొంత మేర దొంగ నోట్లు కూడా బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యి వుండవచ్చు. అయినా కూడా బయట మార్కెట్లో వుండీ ఎందుకూ పనికి రాకుండా పోయిన ఫేక్ నోట్స్ చాలానే వున్నాయి. పాకిస్తాన్ లో అచ్చు వేసి రెడీగా వుంచినవి కూడా ఇప్పుడు చెత్త పేపర్లే! నల్లధనం, ఫేక్ నోట్స్ కన్నా అత్యంత లాభదాయకమైన విషయం మూడోది! ఇందులో మనకు ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అసలు విషయం ఏంటంటే... ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లోకి చేరాయి. నిన్న మొన్నటి వరకూ అవ్వి జనాల పర్సుల్లో, లాకర్లలో మూలిగేవి. కాని, వాట్ని త్వరలో బ్యాంకులు లోన్ల రూపంలో తిరిగి సర్క్యులేషన్లో పెడతాయి. అంతే కాదు, బ్యాంకుల వద్ద ధన రాశి పెరగటంతో వడ్డీలు కూడా తగ్గే ఛాన్స్ వుంది. అంటే, రాబోయే కాలంలో స్వంతంగా వ్యాపారాలు చేద్దామనుకునే వారికి , ఇళ్లు కట్టుకుందామనుకునే వారికి మంచి కాలం అన్నమాట! బ్యాంక్ లే కాదు గవర్నమెంట్ వద్ద కూడా భారీగా సొమ్ము చేరే అవకాశాలు వున్నాయి. నల్లధనం రాబట్టినా రాబట్టలేకపోయినా డిజిటల్ లావాదేవీలు పెరిగటం వల్ల ట్యాక్స్ లు పెరిగే అవకాశం వుంది. దీని వల్ల ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ఎంతగా వైట్ మనీ ట్రాన్సాక్షన్స్, ఎంత బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ పెరిగితే ఆర్దిక వ్యవస్థకి అంత మంచిదన్నది సింపుల్ లాజిక్...  మొత్తంగా నెల రోజుల డీమానిటైజేషన్ పీరియడ్ తరువాత ఒక్కటి మాత్రం మనం గట్టిగా చెప్పుకోవచ్చు. ఈ నిర్ణయం మోదీ మరింత పకడ్బందీగా తీసుకుని వుంటే బావుండేది. అయినా కూడా ఇప్పుడు సామాన్యులు క్యూలైన్లలో పడుతోన్న ఇబ్బందులు త్వరలోనే ఒక గొప్ప మార్పుకు శ్రీకారం చుడతాయి. అది నల్ల డబ్బుపై విజయం కాకపోవచ్చు. కాని, ఇంకా ఇతర మార్గాల్లో ఎన్నో లాభాల రూపంలో మనకు ఎదురు కావచ్చు...     

జయ ఇక లేరు. కానీ...

నిండైన విగ్రహం. ఆకుపచ్చని ఆహార్యం! ఆమె అడుగుపెట్టగానే పాదాభివందనం చేసే మంత్రులు. అమ్మ అంటూ గుండె గుడిలో ఆమెను ఆరాధించే జనం. ఈ రెండు వాక్యాలూ చాలు... అవి ఎవరో తెలిసిపోవడానికి. తమిళనాట ‘పురట్చి తలైవి’ (విప్లవ నాయకురాలు)గా పేరొందిన ఆ ధీశాలి ఇక లేరని తెలిశాక తమిళనాడు ఒక్క క్షణం స్తంభించిపోయింది. జీవితానికి తనదైన అరుదైన నిర్వచనం ఇచ్చిన ఆ మూర్తి మృత్యువుతో ఒక శకం ముగిసిపోయింది.   ఈ రోజున జయలలిత కోసం కోట్ల మంది కన్నీరు విడుస్తుండవచ్చు, రాచమర్యాదలకు తీసిపోని ప్రభుత్వ లాంఛనాలు ఆమె చుట్టూ ఉండవచ్చు. కానీ ఇంతదూరం వచ్చేందుకు ఆమె ఎదుర్కొన్న ఆటుపోట్లు సామాన్యమైనవి కావు. జయలలిత పేరుకి మాత్రమే ఒక ఉన్నత కుటుంబంలోనే పుట్టారు. కానీ ఆమె తండ్రి జయరాం వ్యసనాలకు లోనుకావడంతో, కొండంత ఆస్తి కాస్తా హారతి కర్పూరంలా హరించుకుపోయింది. జయలలితకు రెండేళ్ల వయసు ఉండగానే, జయరాం చనిపోవడంతో ఉన్న ఆ అరకొర ఆసరా కూడా ఆ కుటుంబానికి దూరమైంది.   భర్త దూరం కావడంతో జయలలిత తల్లి వేదవల్లికి ఏం చేయాలో పాలుపోలేదు. తన ఇద్దరు పిల్లలను సంరక్షించుకునేందుకు ఆమె బెంగళూరులో చిన్నాచితకా పనులు చేయడం మొదలుపెట్టింది. ఆ తరువాత కాలంలో మద్రాసులో పనిచేస్తున్న అంబుజవల్లి దగ్గరకి చేరుకోవడంతో జయలలిత కుటుంబానికి ఒక స్థిరత్వం వచ్చినట్లయ్యింది. అంబుజవల్లి ద్వారానే వేదవల్లి తన పేరుని సంధ్యగా మార్చుకుని సినిమాలలో చిన్నచిన్న పాత్రలు ధరించడం మొదలుపెట్టింది.   తల్లి సినిమాలలో నటిస్తున్నప్పటికీ జయలలితకు ఆ రంగం మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. శివాజీ గణేశన్ అంతటివాడు ఆమె అందాన్నీ, నాట్యాన్నీ చూసి ‘గొప్ప నటి అవుతుందని’ ప్రశంసించినా.... ఒక న్యాయవాదిగా స్థిరపడాలన్నదే జయలలిత లక్ష్యంగా ఉండేది. కానీ విధితీరు మరోలా సాగింది. జయలలితకు 15 ఏళ్లు ఉండగా ఆమెను బి.ఆర్.పంతులు ఆనే కన్నడ దర్శకుడు గమనించాడు. ఎలాగూ కాలేజిలో చేరేందుకు రెండు నెలల సమయం ఉంది కాబట్టి, ఆ విరామసమయంలో తన రాబోయే చిత్రంలో నటించమని అడిగాడు. అలా జయలలిత ‘చిన్నడ గొంబె’ అనే కన్నడచిత్రంలో నటించింది. ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించడంతో ఇక ఆమె వెనక్కి తిరిగిచూసుకోలేదు.   జయ జీవితంలోని తరువాత భాగమంతా ఇక చరిత్రే! ఎం.జి.ఆర్ స్ఫూర్తితో అన్నాడీఎంకేలోకి ప్రవేశించిన జయ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది. ఆంగ్లంలో ఆమె వాగ్ధాటిని గమనించిన ఎం.జి.ఆర్ ఆమెను రాజ్యసభకు నామినేట్ చేశారు. అయితే 1987లో ఎం.జి.ఆర్ మరణించడంతో ఆయన వారసురాలిగా నిరూపించుకునేందుకు జయ తనదైన రాజకీయాలు మొదలుపెట్టారు. తమిళనాట రాజకీయాలు ఏమంత సులువు కావు! అక్కడి ప్రజల్లో భావోద్వేగాలు, నేతలలో వ్యూహప్రతివ్యూహాలు తారస్థాయిలో సాగుతుంటాయి. జాతీయ పార్టీలతో పాటుగా స్థానిక పార్టీల జోరూ అప్రతిహతంగానే ఉంటుంది.   1989లో జయలలిత ప్రతిపక్ష నేతగా అడుగుపెట్టిన సంవత్సరంలో అక్కడి రాజకీయాలు ఎంత కఠినంగా ఉంటాయో తెలిసొచ్చింది. ఆ ఏడాది ఆమెను నిండు శాసనసభలో ఆమె చీరను చింపి అవమానించారు. ఒక ఆడది, అందులోనూ ఎం.జి.ఆర్తో సహజీవనం చేసి ఆయన వారసురాలిగా అడుగుపెట్టిన మనిషి... తమను ఏం చేయలేదన్న ధీమాతో కరుణానిధి ఆ పర్వాన్ని చిరునవ్వుతో పరికించారని అంటారు. కానీ రెండేళ్లు తిరిగేసరికి అదే శాసనసభలో ముఖ్యమంత్రిగా అడుగుపెట్టడంతో ఆమెకంటూ ఒక వ్యక్తిత్వం ఉందనీ... దానికి ఎదుర్కోవడం అంత సులభం కాదనీ తెలిసొచ్చింది.   ముఖ్యమంత్రిగానూ జయలలితకు ఒక శైలి ఉంది. పేదలకి మేలు చేసేందుకో, ప్రజల అభిమానాన్ని సంపాదించుకునేందుకో... కారణం ఏదైనాగానీ విరివిగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టేవారు. పసిపిల్లలు, పేదవారు, స్త్రీల కోసం ఆమె ప్రవేశపెట్టిన పథకాలు బడుగువర్గాలలో ఆమెకు మంచి ఆదరణని కలిగించాయి. ఇప్పటికీ చెన్నైలోని మురికివాడల పక్క నుంచి వెళ్లేవారికి అక్కడి గుడిసెలలో ఆమె ఫొటోలు కనిపిస్తాయి. ఇదే సమయంలో కొన్ని దూకుడు నిర్ణయాల వల్ల ఆమె కఠినమైన అధినేత్రిగా కూడా పేరొందారు. 2003లో ప్రభుత్వోద్యోగులు మెరుపుసమ్మెకు దిగినప్పుడు, 1.7 లక్షలమంది ఉద్యోగులను డిస్మిస్ చేసిపారేసిన జయ చర్యకు జనం ముక్కున వేలేసుకున్నారు.   తన చిరకాల ప్రత్యర్థి కరుణానిధిని అరెస్టు చేయించడం, కంచి పీఠీధిపతి జయేంద్ర సరస్వతిని కటకటాల వెనక్కి నెట్టడం వంటి చర్యలతో ఆమె దూకుడుకి అడ్డులేదని తేలిపోయింది. కానీ జయ నివాసంలో లెక్కకు మిక్కిలిగా ఆస్తులు బయటపడటం, టాన్సీ భూముల కుంభకోణం, ప్లజంట్ స్టే హోటల్ కేసు, కలర్ టీవీల కుంభకోణం.. ఇలా నానారకాల కుంభకోణాలలో జయ పీకల్లోతు మునిగిపోయారు. ఈ కేసుల కారణంగానే పదవి నుంచి దిగాల్సి వచ్చిన తొలి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు. వీటికి తోడు విలాసవంతమైన ఆమె జీవితం, పార్టీలో నియంతృత్వ పోకడలు కూడా జయ వ్యక్తిత్వంలో భాగమైపోయాయి.   మంచిచెడులు ఎలా ఉన్నా ప్రస్తుతం తమిళనాట జయలలితే అత్యంత ప్రజాదరణ కలిగిన నేత అనడంలో అనుమానం లేదు. అందుకే 32 ఏళ్ల తరువాత వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే అవకాశాన్ని తమిళతంబిలు ఆమెకు కల్పించారు. మరో పక్క ఆమె మీద ఉన్న కేసులు ఒకొక్కటిగా విడిపోతున్నాయి. ఈ ఏడాది మే నెలలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన జయ- అమ్మ క్యాంటీన్, అమ్మ ఉప్పు, అమ్మ మందులు అంటూ తనదైన శైలిలో సంక్షేమానికి దారితీశారు. ఈలోపులే ఆమె ఆసుపత్రి పాలయ్యారు. ఇదేదో తాత్కాలికమైన ఆరోగ్య సమస్యే అని సరిపెట్టుకున్ని తమిళ ప్రజలు, నెలలు గడిచినా కూడా జయ ఆసుపత్రికే పరిమితం కావడం చూసి విపరీతమైన ఉద్వేగానికి లోనయ్యారు. ఎలాగొలా తిరిగి జయ ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటూ యజ్ఞయాగాలు నిర్వహించారు.   ప్రజల ఆకాంక్షలు ఫలించాయా అన్నట్లుగా నవంబరునాటికి జయ కోలుకుంటున్న వార్తలు వచ్చాయి. త్వరలోనే ఆమె చిరునవ్వుని తిరిగి చూస్తామని ఆశించిన తమిళ ప్రజలకి శరాఘాతంగా ఆమెకి గుండెపోటు వచ్చిందన్న వార్త వినిపించింది. ఒక పక్క జయ ప్రత్యర్థి కరుణానిధి వయసు మీరిపోవడంతో... జయ తప్ప అన్యమెరుగని తమిళప్రజలకు ఆమె ఇక లేదన్న వార్త నిజంగా పిడుగుపాటే! కేవలం తమిళ ప్రజలకే కాదు యావద్భారతానికీ కూడా జయ లేని లోటు ఒక వేటుగానే మిగిలిపోనుంది. రాజకీయాలలో ఆరితేరిన నాయకురాలిగా, విపత్కరమైన పరిస్థితులలో తనదైన అభిప్రాయాన్ని కుండబద్దలుకొట్టినట్లు వినిపించే ధీశాలిగా, జాతీయ కూటములలో భాగంగా తన పంతాన్ని నెగ్గించుకునే  సహచరిగా... జయ లేని దేశరాజకీయాలను సైతం ఊహించడం కష్టం.  

'టైమ్స్' ఆఫ్ మోదీ!

నరేంద్ర మోదీ... ఈ పేరు ఇండియాలో ఫుల్ పాప్యులర్. ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేని విశేషణం. కాని, ఇప్పుడు ప్రపంచం కూడా నమోకి నమోన్నమః అనేస్తోంది! అందుకు తాజా ఉదాహరణ టైమ్స్ మ్యాగజైన్ ఆన్ లైన్ సర్వేనే! టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గురించి అందరికీ తెలిసిందే. ప్రతీ యేటా ప్రకటించే ఈ అవార్డ్ చాలా ఫేమస్. వెస్టన్ మీడియాలో కూడా చాలా మంది దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అంతే కాదు, టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ ఊరికే పాప్యులారిటీని బట్టీ ఇచ్చేయరు. గడిచిన సంవత్సర కాలంలో ఒక వ్యక్తి ప్రపంచం మీద ఎంత ప్రభావం చూపారో అంచనా వేసి .... అప్పుడు పోల్ నిర్వహిస్తారు. అంటే... టైమ్స్ పోటీదారుల జాబితాలోకి రావటమే పెద్ద సక్సెస్ అనుకోవచ్చు. అందుకే, వైట్ హౌజ్ లోకి కాలుపెడుతోన్న ట్రంప్, వైట్ హౌజ్ నుంచి బయటకి వచ్చేస్తోన్న ఒబామా, వైట్ హౌజ్ లోకి వెళ్లలేకపోయిన హిల్లరీ... ఇలాంటి మోస్ట్ పవర్ ఫుల్ పర్సన్స్ టైమ్స్ లిస్ట్ లో చోటు సంపాదిస్తారు. అమెరికన్సే కాదు వాల్డ్ వైడ్ గా విపరీత ప్రభావం చూపిన ప్రతీ ఒక్కరూ టైమ్స్ జాబితాలోకి వస్తారు. అలానే మన మోదీ కూడా టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ కోసం బరిలోకి దిగారు...  అమెరికన్ పత్రిక అయిన టైమ్స్ ఆన్ లైన్ పోల్ లో అమెరికన్ ప్రెసిడెంట్స్, ప్రెసిడెంట్ పోస్టుకి పోటీ పడిన వారితో కాంపిటీషన్లో వుండటమే కాక భారీ తేడాతో విజయం సాధించటం మామూలు విషయం కాదు. కాని, ఆశ్చర్యకరంగా మోదీ అమెరికన్ సెలబ్రిటీల్ని అమెరికన్ పత్రిక నిర్వహించిన పోల్ లోనే ఓడించారు. ఏకంగా 18శాతం ఓట్లు సంపాదించారు. ఆయన తరువాతి స్థానాల్లో వున్న ట్రంప్, ఒబామా లాంటి వారు 7శాతం దగ్గరే ఆగిపోయారు! అంటే డబుల్ ఓట్లు మోదీకి అనుకూలంగా పోలయ్యాయన్నమాట! నెటిజన్స్ ఓట్ల ద్వారా ఎంపిక చేసే టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ విషయంలో ఆ పత్రిక ఎడిటర్స్ ది ఫైనల్ డిసిషన్. ఈ సంవత్సరం మోదీని విజేతగా వారు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి వుంది. అయితే ఆయన సక్సెస్ కి కారణం ఇండియాలోని మోదీ ఫాలోవర్స్ వేసిన ఓట్లే కాక అమెరికాలోని నమో బ్రిగేడ్ కూడా అంటున్నారు. అంతే కాదు, టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ డీమానిటైజేషన్ నెగటివ్ ఎఫెక్ట్ కూడా ఒట్టిదేనని తేల్చేసిదంటున్నారు మోదీ భక్తులు! సామాన్య జనం క్యూలలో నిలబడాల్సి వచ్చినా కూడా మోదీ క్రేజ్ ఏం తగ్గలేదంటున్నారు. అది చెప్పటం కష్టమే అయినా మన ప్రధాని ప్రతిష్ఠాత్మక టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా నిలవటం మాత్రం గర్వకారణమే!  

'టైమ్స్' ఆఫ్ మోదీ!

నరేంద్ర మోదీ... ఈ పేరు ఇండియాలో ఫుల్ పాప్యులర్. ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేని విశేషణం. కాని, ఇప్పుడు ప్రపంచం కూడా నమోకి నమోన్నమః అనేస్తోంది! అందుకు తాజా ఉదాహరణ టైమ్స్ మ్యాగజైన్ ఆన్ లైన్ సర్వేనే! టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గురించి అందరికీ తెలిసిందే. ప్రతీ యేటా ప్రకటించే ఈ అవార్డ్ చాలా ఫేమస్. వెస్టన్ మీడియాలో కూడా చాలా మంది దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అంతే కాదు, టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ ఊరికే పాప్యులారిటీని బట్టీ ఇచ్చేయరు. గడిచిన సంవత్సర కాలంలో ఒక వ్యక్తి ప్రపంచం మీద ఎంత ప్రభావం చూపారో అంచనా వేసి .... అప్పుడు పోల్ నిర్వహిస్తారు. అంటే... టైమ్స్ పోటీదారుల జాబితాలోకి రావటమే పెద్ద సక్సెస్ అనుకోవచ్చు. అందుకే, వైట్ హౌజ్ లోకి కాలుపెడుతోన్న ట్రంప్, వైట్ హౌజ్ నుంచి బయటకి వచ్చేస్తోన్న ఒబామా, వైట్ హౌజ్ లోకి వెళ్లలేకపోయిన హిల్లరీ... ఇలాంటి మోస్ట్ పవర్ ఫుల్ పర్సన్స్ టైమ్స్ లిస్ట్ లో చోటు సంపాదిస్తారు. అమెరికన్సే కాదు వాల్డ్ వైడ్ గా విపరీత ప్రభావం చూపిన ప్రతీ ఒక్కరూ టైమ్స్ జాబితాలోకి వస్తారు. అలానే మన మోదీ కూడా టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ కోసం బరిలోకి దిగారు...  అమెరికన్ పత్రిక అయిన టైమ్స్ ఆన్ లైన్ పోల్ లో అమెరికన్ ప్రెసిడెంట్స్, ప్రెసిడెంట్ పోస్టుకి పోటీ పడిన వారితో కాంపిటీషన్లో వుండటమే కాక భారీ తేడాతో విజయం సాధించటం మామూలు విషయం కాదు. కాని, ఆశ్చర్యకరంగా మోదీ అమెరికన్ సెలబ్రిటీల్ని అమెరికన్ పత్రిక నిర్వహించిన పోల్ లోనే ఓడించారు. ఏకంగా 18శాతం ఓట్లు సంపాదించారు. ఆయన తరువాతి స్థానాల్లో వున్న ట్రంప్, ఒబామా లాంటి వారు 7శాతం దగ్గరే ఆగిపోయారు! అంటే డబుల్ ఓట్లు మోదీకి అనుకూలంగా పోలయ్యాయన్నమాట! నెటిజన్స్ ఓట్ల ద్వారా ఎంపిక చేసే టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ విషయంలో ఆ పత్రిక ఎడిటర్స్ ది ఫైనల్ డిసిషన్. ఈ సంవత్సరం మోదీని విజేతగా వారు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి వుంది. అయితే ఆయన సక్సెస్ కి కారణం ఇండియాలోని మోదీ ఫాలోవర్స్ వేసిన ఓట్లే కాక అమెరికాలోని నమో బ్రిగేడ్ కూడా అంటున్నారు. అంతే కాదు, టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ డీమానిటైజేషన్ నెగటివ్ ఎఫెక్ట్ కూడా ఒట్టిదేనని తేల్చేసిదంటున్నారు మోదీ భక్తులు! సామాన్య జనం క్యూలలో నిలబడాల్సి వచ్చినా కూడా మోదీ క్రేజ్ ఏం తగ్గలేదంటున్నారు. అది చెప్పటం కష్టమే అయినా మన ప్రధాని ప్రతిష్ఠాత్మక టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా నిలవటం మాత్రం గర్వకారణమే!