తెలంగాణ బడ్జెట్ : అప్పుడే పుట్టిన బిడ్డలకు డైపర్లు ఫ్రీ!

బడ్జెట్ రాగానే అందరూ ఏ రంగానికి ఎంత కేటాయించారు అంటూ ఆరా తీస్తారు.ఇక షరా మామూలుగా అధికార పక్షం మా ఆర్దిక మంత్రి బడ్జెట్ పాఠం సుప్రభాతంలా ఇంపుగా, విన సొంపుగా వుందంటూ దబాయిస్తుంది! అందుకు విరుగుడుగా ప్రతిపక్షం ఇలాంటి బడ్జెట్ గతంలో ఎప్పుడూ చూడలేదంటూ గతంలో చెప్పిన డైలాగే చెప్పి చెప్పి జనాన్ని విసిగిస్తుంది. అందుకే, రాను రాను బడ్జెట్ ల మీద ప్రజల దృష్టి తగ్గిపోతోంది. కేంద్ర బడ్జెట్ అయితే కాస్త హడావిడి వుంటుంది కాని రాష్ట్ర బడ్జెట్ లకు అంత మాత్రం కూడా వుండటం లేదు. న్యూస్ ఛానల్స్ లో మంత్రి వల్లె వేసినంత సేపు లైవ్ పెట్టడం, తరువాత ప్రతిపక్షాల పసలేని విమర్శలు వినిపించటం, ఒకరిద్దరు ఆస్థాన విద్వాంసులతో కలిసి సీనియర్ జర్నలిస్టులు బడ్జెట్ కు పోస్ట్ మార్టం నిర్వహించటం... ఇంతే! మర్నాడు మరేదైనా బ్రేకింగ్ న్యూస్ బడ్జెట్ అంటూ ఒకటి వచ్చిందనే అంతా మరిచిపోతున్నారు!    తెలంగాణ బడ్జెట్ ఇవాళ్ల అసెంబ్లీ ముందుకు వచ్చింది. ఒకవైపు అయిదు రాష్ట్రాల్లో బీజేపి విజయాల కలకలం, అక్కడి ముఖ్యమంత్రుల ఎంపిక, మరో వైపు ఏపీలో భూమా నాగిరెడ్డి హఠాన్మరణం... ఇలాంటి పరిణామాల మధ్య ఈటెల చిట్టాపద్దుల్ని ఎవ్వరూ సరిగ్గా కాన్సన్ ట్రేట్ చేయలేదు. చేసినా కూడా బడ్జెట్ లో మరీ సంచలనాత్మకమైన నిర్ణయాలు లేకపోవటంతో సాదాసీదాగా వ్యవహారం నడిచిపోయింది! జాగ్రత్తగా వడ్డింపులు చేసిన బడ్జెట్ లో ఈటెల అన్ని రంగాలకి కేటాయింపుల రుచి చూపించారు. అయితే, ఏ ఒక్క రంగంలో రాబోయే సంవత్సర కాలంలో అద్బుతాలు చేయబోతున్నామని మాత్రం చెప్పలేదు. ఎన్నికలు మరీ దగ్గర్లో లేవు కాబట్టి విపరీత వరాలు కూడా కురిపించలేదు!   తెలంగాణ బడ్జెట్ 2017-18లో రొటీన్ కి భిన్నంగా ఆకట్టుకున్న ప్రతిపాదన కేసీఆర్ కిట్! ఈ కిట్  అప్పుడే పుట్టిన కిడ్ కు... అంటే బిడ్డకు అందిస్తారు! ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవించిన తల్లులకు మూడు దఫాల్లో నాలుగేసి వేల చొప్పున పన్నెండు వేలు ఇస్తారు. గర్భీణీ స్త్రీ హాస్పిటల్లో చేరిన వెంటనే, డిశ్చార్జ్ సమయంలో, పోలీయో టీకా వేయించుకోవటానికి వచ్చినప్పుడూ ఈ డబ్బులిస్తారు. అంతేకాదు, కేసీఆర్ కిట్ పేరున సబ్బులు, బేబీ అయిల్, చిన్న పిల్లల పరుపు, దోమతెర, డ్రస్సులు, చీరలు, హ్యాండ్ బ్యాగ్, టవళ్లు, నాప్కిన్స్, పౌడర్, డైపర్లు.... ఇలా పుట్టిన బిడ్డ ఆడుకోటానికి కావాల్సిన ఆట వస్తువులు కూడా ప్రభుత్వమే ఇవ్వనుంది! ఇందుకోసం 605కోట్లు కేటాయించారు బడ్జెట్ లో!    పేద తల్లులు ప్రసవించినప్పుడు వారికి ఎంతగానో ఉపయోగపడే ఇలాంటి కిట్ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వటం మెచ్చుకోదగ్గదే. కాని, పేరే... కేసీఆర్ కిట్ గా ప్రచారం చేసుకోటం కాస్త ఇబ్బందికరం! తమిళనాడులో అమ్మ క్యాంటీన్ అన్నట్టుగా సంప్రదాయం మొదలయ్యే ప్రమాదం లేకపోలేదు! 

ఆ కోరిక తీరకుండానే అకాల మరణం

నాటకీయ పరిణామాల నేపథ్యంలో రాజకీయాల్లోకి వచ్చిన భూమా నాగిరెడ్డి...1964 జనవరి 8న కర్నూలు జిల్లా దొర్నిపాడు మండలం కొత్తపల్లెలో జన్మించారు. కర్నూలు జిల్లాలో ఉన్న ఫ్యాక్షన్  రాజకీయాల కారణంగా భూమాను..... ఆయన తండ్రి బాలిరెడ్డి  ఆ ప్రాంతానికి దూరంగా ఉంచి చదివించారు. ప్లస్ 2 వరకు చెన్నైలో చదువుకున్న నాగిరెడ్డి..తర్వాత బెంగళూరులో ఎంబీబీఎస్‌లో చేరారు. అయితే తండ్రి హత్యతో భూమా నాగిరెడ్డి చదువు మానేసి స్వగ్రామానికి వచ్చేశారు.   1986లో నాటి రాష్ట్ర మంత్రి.. మేనమామ ఎస్వీ సుబ్బారెడ్డి కుమార్తె శోభానాగిరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత నాగిరెడ్డి సోదరుడు శేఖర్‌ రెడ్డి అకస్మిక మృతితో రాజకీయాల్లోకి అడుగు పెట్టాల్సి వచ్చింది. 1992లో ఆళ్లగడ్డకు జరిగిన మధ్యంతర ఎన్నికలలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1996లో నంద్యాల లోకసభ నియోజకవర్గానికి జరిగిన మధ్యంతర ఎన్నికల్లో నాటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావుపై పోటీ చేసేందుకు టీడీపీ ఆయనను ఎంపిక చేయడంతో ఫ్యామస్‌ అయ్యారు. ఆ తర్వాత నాగిరెడ్డి మూడు సార్లు ఎంపీగా పనిచేశారు.   2004 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన భూమా.. గంగుల ప్రతాప్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. రాజకీయంగా ఆయనకు అదే తొలి ఓటమి. 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరి...నంద్యాల ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత వైసీపీలో చేరి నంద్యాల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 ఏప్రిల్‌ 24 న రోడ్డు ప్రమాదంలో భూమా సతీమణి శోభ మృతి చెందడంతో మానసికంగా కుంగిపోయారు. 20016లో భూమా నాగిరెడ్డి తన కుమార్తె, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు.   ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి దక్కలేదు. ఎప్పటికైనా మంత్రి అవ్వాలనేది ఆయన కోరికని సన్నిహితులు చెబుతారు. ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ విస్తరణలో భూమాకు కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ మధ్యకాలంలో చంద్రబాబుతో ఆయన పలుమార్లు భేటీ కావడం కూడా ఈ వార్తలకు ఊతమిచ్చింది. కానీ మంత్రి కావాలన్న కోరిక నెరవేరకుండానే మృతిచెందారు. క్షేత్రస్థాయి నేతలు.. కార్యకర్తలతో నేరుగా పరిచయం ఉన్న నాగిరెడ్డి.. తన వారి కోసం.. తన వర్గం కోసం ఎంతవరకైనా పోరాడుతారన్న పేరుంది.

లక్నోలో బీజేపి సక్సెస్ కి ... ముస్లిమ్ లేడీసే కారణమా?

  అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఒకేసారి విడుదలవుతున్నా అందరి దృష్టీ ఆకర్షిస్తోంది మాత్రం ఉత్తర్ ప్రదేశ్! పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్, నాలుగు కలిస్తే ఎంత ప్రభావం చూపిస్తాయో అంతకన్నా ఎక్కువ ప్రభావం యూపీ చూపించగలగటమే ఇందుకు కారణం! ఉత్తర్ ప్రదేశ్ లో కేవలం మెజార్జీ సీట్లు కాకుండా మూడొంతుల ఎమ్మెల్యే స్థానాల్ని కమలం కైవసం చేసుకోటం నిజంగా పెద్ద సంచలనమే! అయితే, మోదీ సేన ఇతర పక్షాలపై చేసిన ఈ ఊచకోత వెనుక కొన్ని ఆశ్చర్యకర, ఆసక్తికర అంశాలున్నాయి...   యూపీలో బీజేపి గెలుపుకు మత రాజకీయాలు కారణమని కొందరు రొటీన్ గా చెప్పొచ్చు. కాని, నమో విభిన్నమైన మత పాచిక విసిరారు! ఎప్పటిలా ఈ సారి బీజేపి ముస్లిమ్ వ్యతిరేకత మీద ఆధారపడ లేదు. రివర్స్ లో వచ్చింది. ముస్లిమ్ మహిళల్ని తీవ్రంగా దెబ్బ తీస్తోన్న ట్రిపుల్ తలాఖ్ పై ఎప్పట్నుంచో యుద్ధం ప్రకటించింది. అసలు దేశంలో ముస్లిమ్ పురుషులు కొందరు దుర్వినియోగం చేస్తోన్న ట్రిపుల్ తలాఖ్ గురించి మాట్లాడే పార్టీయే మరేది లేదు. కేవలం కాషాయదళమే గళం విప్పుతూ వస్తోంది. మిగతా పార్టీలన్నీ ముస్లిమ్ సమాజంలోని మహిళల దుస్థితిని పట్టించుకోకుండా ఓటు బ్యాంక్ కాపాడుకునే వ్యూహంలో ఇరుక్కుపోయాయి. అక్కడే మోదీ, అమిత్ షాల ఆలోచన ఫలించింది. కోర్టు బయటా, లోపలా కేంద్రంలోని మోదీ సర్కార్ ట్రిపుల్ తలాఖ్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతూ వచ్చింది. ఇది యూపీలోని ముస్లిమ్ మహిళల ఓట్లను సంపాదించి పెట్టిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు!   ఏదో ముక్కుతూ మూలుగుతూ మ్యాజిక్ ఫిగర్ దాటటం కాకుండా ఏకంగా మూడు వందల మార్క్ కూడా దాటాలంటే అందుకు ముస్లిమ్ ల నుంచి ఎంతో కొంత మద్దతు బీజేపికి అవసరం. ఆ సపోర్ట్ మైనార్టీ మహిళల రూపంలో అందివచ్చిందంటున్నారు! అలాగే, మాయవతి పార్టీ అత్యంత దారుణంగా పర్ఫామెన్స్ చూపటం కూడా దళితుల విషయంలో అన్ని పార్టీలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది! దళితుల ఓట్లపై తమకు గుత్త హక్కు వుందని భావించిన బీఎస్పీ బొక్కా బోర్లా పడింది. ఎస్పీల నుంచీ బీజేపికి మద్దతు లభించకుంటే యూపీలోని అన్ని ప్రాంతాల్లో సీట్లు గెలవటం అసాధ్యం. ఇదే న్యాయం ఎస్పీ కూడా అవగతం చేసుకోవాలి. ఎప్పుడూ బీసీలకు, ముస్లిమ్ లకు తామే పెద్ద దిక్కని భావించే సమాజ్ వాది ఇక మీదట నిజంగా ఆయా వర్గాల కోసం పోరాటాలు చేయాలి. లేదంటే, వారు తిరిగి కమలం గూటి నుంచి వెనక్కి రావటానికి చాలా సమయమే పడుతుంది!  

లక్నోని ఏలే... లక్కీ బీజేపి సీఎం ఎవరు? వీళ్లలో ఒకరే!

మరి కొన్ని గంటల్లో అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. పేరుకే అయిదు రాష్ట్రాలు అంటున్నాం కాని అసలు దృష్టి, చర్చ అంతా యూపీపైనే! నాలుగు వందల సీట్ల అతి పెద్ద అసెంబ్లీ లక్నోలోనే వుంది. అక్కడి సీఎం పీఠం బీజేపికి దక్కితే ఇక దేశంలో కాషాయ విప్లవాన్ని ఎవ్వరూ ఆపలేరని విశ్లేషకుల అంచనా! అందుకు తగ్గట్టే ఎగ్జిట్ పోల్స్ ఉత్తర్ ప్రదేశ్ లో కమలం వికసిస్తుందనే చెబుతున్నాయి. ఒకట్రెండు సర్వేలైతే స్వంతంగా బంపర్ మెజార్టీ దక్కుతుందని తేల్చేశాయి! ఫైనల్ సీన్ ఏంటో మార్చ్ పదకొండున మాత్రమే తెలుస్తుంది. కాని, అప్పుడే అవసరం అయితే మాయవతితో కలిసైనా ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అని అఖిలేష్ అన్నాడంటే... ఎవరు గెలవబోతున్నారో మనమూ చెప్పేయవచ్చు! ఒకవేళ బీజేపీదే ఉత్తర్ ప్రదేశ్ పీఠం అయితే దాని మీద కూర్చోబోయేది ఎవరు?   ఉత్తర్ ప్రదేశ్ లో కమలదళానికి ఉత్తమ నాయకత్వం కొదవలేదు. ఇప్పుడు అదే పెద్ద సస్పెన్స్ కి కారణమైంది! స్వంతంగా మెజార్టీ వచ్చి బీజేపి ప్రభ్వుతం ఏర్పాటు చేస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? చాలా మందే రేస్ లో వున్నారు. మొదటగా చెప్పుకోవాల్సింది యూపీ బీజేపి చీఫ్ కేశవ్ ప్రసాద్ మౌర్య. ఇంతవరకూ సైలెంట్ గా రాష్ట్ర బీజేపీని క్షేత్రస్థాయిలో బలంగా మార్చిన ఈయన బీసీ వర్గం వాడు కావటం మరోక ప్లస్! యూపీలో యాదవులు కాని బీసీలందరూ ఈయన్ని సీఎంని చేస్తే కమలం వెంట చాలా కాలం నిలిచే అవకాశం వుంది. అయితే, చాలా సింపుల్ మనిషైన మౌర్య ఇప్పటి వరకూ పాలన అనుభవం వున్నవాడు మాత్రం కాదు.    కేశవ్ ప్రసాద్ మౌర్య తరువాత బలంగా వినిపిస్తోన్న పేరు రాజ్ నాథ్ సింగ్! ఈయనకు లక్నో అంసెబ్లీ, సెక్రటేరియట్ కొత్త కాదు. 2002లో కూడా ఆయన యూపీ సీఎంగా వున్నాడు. తరువాత అధికారం కోల్పోయిన బీజేపి 15ఏళ్ల తరువాత అధికారం చేపడితే మళ్లీ పాత కాపునే తెచ్చి పెడుతుందా? చెప్పే అవకాశాలు ఇప్పుడే లేవు. ఎందుకంటే, కేంద్ర హోం మంత్రిగా కూడా రాజ్ నాథ్ మోదీ వద్ద మంచి మార్కులే వేయించుకున్నారు. ఢిల్లీ నుంచి లక్నో పంపుతారో లేదో చూడాలి! దేశంలో ఎక్కడా లేనంత బలం బ్రాహ్మణులకు వుండేది యూపీలోనే! వాళ్లు అక్కడ దాదాపు ఇరవై అయిదు శాతం ఓటు బ్యాంకు. అందుకే, అగ్రవర్ణాల అభిమాన పార్టీ అయినా బీజేపీ బ్రాహ్మణుడ్ని సీఎం చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. అదే జరిగితే మనోజ్ సిన్హా ముఖ్యమంత్రి అవ్వొచ్చు.     ఈయన ఇప్పుడు యూపీ నుంచే ఎంపీ. కేంద్ర  క్యాబినేట్లో మంత్రి కూడా. బనారస్ హిందూ విశ్వవిద్యాలయ ఐఐటీలో చదువుకున్న సిన్హా మంచి కార్య దక్షుడు. తూర్పు యూపీలో భారీగా పాలోయింగ్ వుంది. బీజేపికి మొదట్నుంచీ వరంగా వుంటూ వస్తోన్న హిందూత్వ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుంటే గోరఖ్ పూర్ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ సీఎం అవకాశాలు కనిపిస్తున్నాయి. కాని, కరుడుగట్టిన హిందూత్వ వాదిగా పేరుపడ్డ ఈ సీనియర్ నేత సీఎం అయితే ముందు ముందు వివాదాలు భారీగా చెలరేగే సూచనలున్నాయి. అలాంటి రిస్క్ బీజేపి ఎంత వరకూ చేస్తుందనేది డౌటే. ప్రతిపక్షాలు ప్రతీ చిన్నదాన్ని ఆదిత్యనాథ్ ఇమేజ్ ను అడ్డు పెట్టుకుని రాద్ధాంతం చేసే అవకాశాలున్నాయి.    ఎలాగైనా యూపీ పైన పట్టు సాధిద్ధామని ప్రయత్నించి ఓడిన గాంధీ రాహుల్. అయితే, బీజేపి గెలిస్తే కూడా గాంధీ సీఎం అయ్యే ఛాన్స్ వుంది. కాని, ఆయన మేనకా గాంధీ కొడుకు వరూణ్! మంచి ఫైర్ బ్రాండ్ యువనేతగా పేరున్న ఆయన సీఎం అవ్వటం పెద్ద ఆశ్చర్యమేం కాదు. కాని, 2016లో ఆయన అనుచరులు వరూణే ముఖ్యమంత్రి అంటూ పోస్టర్లు వేసి నానా హంగామా చేశారు. అప్పట్నుంచీ బీజేపి అతడ్ని పక్కన పెడుతూ వస్తోంది. మరి ఈ కాషాయ గాంధీకి సీఎం కుర్చీ దక్కుతుందా? తుది ఫలితాలు వచ్చాకే తెలిసేది!

కోర్టుల్నే బోనులో నిలబెడుతున్నారు కోందరు!

గత రెండు, మూడు రోజుల్లో రెండు కీలకమైన కోర్టు తీర్పులు వచ్చాయి. ఒకటి ఎన్ఐఏ కోర్టు వెలువరించిన అజ్మీర్ దర్గా పేలుళ్ల కేస తీర్పు. రెండు, గడ్చీరోలీ కోర్టు నుంచి వచ్చిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబా శిక్ష తీర్పు. ఈ రెండూ మీడియాలో ప్రధానంగా ప్రసారం అయ్యాయి. పేపర్లో చర్చింపబడ్డాయి. కాని, దాదాపు ఒకేసారి వచ్చిన ఈ రెండూ తీర్పుల్ని కలిసి చూసినప్పుడు మన దేశంలో కొనసాగుతున్న ఒక ట్రెండ్ మనకు కనిపిస్తుంది. అదే ఆందోళనకరమైంది...   మన దేశంలో నెహ్రు కాలం నుంచీ అభ్యుదయ భావాలు, సెక్యులర్ భావాలు రాజ్యమేలుతూ వస్తున్నాయి. అది నిజానికి మంచిదే. మైనార్టీలు మన దేశంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో మాదిరిగా కాకుండా భద్రంగా వుంటున్నారు. అభివృద్ధి చెందుతున్నారు. కాని, అదే సమయంలో రాజకీయాల్లో, మీడియాలో, యూనివర్సిటీల్లో ఇలా ప్రతీ చోటా హిందూ అన్న పదం వినబడగానే ముఖం చిట్లించే సంస్కృతి కూడా వుంటోంది. అసలు హిందూత్వ గురించి మాట్లాడిన వాడు ఆటోమేటిక్ గా మతోన్మాది అయిపోతాడనే బలమైన రూల్ అమల్లో వుంది. దానికి ప్రధాన కారణం ఓటు బ్యాంక్ పాలిటిక్స్. మైనార్టీ ఓట్ల కోసం రాజకీయ నేతలు ఒక వర్గాన్ని ఎంతదాకా అయినా వెళ్లి వెనకేసురావటం మొదలుపెట్టారు ఎప్పుట్నుంచో. అది ఇప్పటికీ కొనసాగుతోంది. ఇక రెండో రకం వారు కమ్యూనిస్ట్, లిబరల్ మేధావులు. వీరు కూడా మెజార్టీలైన హిందువుల్ని పెద్దగా పట్టించుకోరు. హిందూ సమాజాన్ని కులాల వారిగానే చూస్తారు వామపక్ష ఆలోచనపరులు. అదే సమయంలో ముస్లిమ్ లని అణిచివేయబడ్డవారిగా చూస్తారు. అది నిజమే అయినా మైనార్టీల్లో వుండే అతివాదుల్ని, ఉగ్రవాద సమర్థకుల్ని వీరు ఏ మాత్రం ఖండించిన దాఖలాలు వుండవు. ఇదే ఇంతకాలంగా కొనసాగుతోంది.   దేశంలో చాలా చోట్ల జరిగిన ఉగ్ర దాడుల నేపథ్యంలో కొందరు కరుడుగట్టిపోయిన హిందువులు అభినవ్ భారత్ పేరుతో ఒక సంస్థ స్థాపించి బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఇంత వరకూ ఇది కోర్టుల్లో నిరూపితం కాలేదు. కాని, కాంగ్రెస్ నేత దిగ్విజయ్ లాంటి వారు మాత్రం హిందు ఉగ్రవాదం అంటూ ఆరెస్సస్, బీజేపిల్ని కార్నర్ చేయటానికి వాడుకుంటూ వచ్చారు. ఎట్టకేలకు ఎన్ఐఏ కోర్టు ఈ మధ్య వెలువరించిన తీర్పులో అజ్మీర్ దర్గా వద్ద బాంబు పేలుడు హిందూ ఉగ్రవాదుల పనేనని తేల్చింది. కాని, అదే సమయంలో ఛార్జ్ షిట్ లో పేర్కొన్న స్వామీ అసీమానంద్ , ఇంకా కొందర్ని నిర్దోషులుగా విడుదల చేసింది. ఈ తీర్పుపై దేశంలో చాలా మంది పెదవి విరుస్తున్నారు. కోర్టు ముగ్గురు దోషులకు శిక్ష విధించిన దాన్ని స్వాగతిస్తూ హిందు ఉగ్రవాదం కూడా వుందని వారు అంటున్నారు. కాని, అదే సమయంలో సరైన ఆధారాలు లేక స్వామీ అసీమానంద్ ని విడుదల చేస్తే మాత్రం తప్పుబడుతున్నారు. ఇది ఆందోళనకరమైన పద్ధతి. ఎందుకంటే, కోర్టులు ఇచ్చే తీర్పుల్ని అందరూ గౌరవించాలి. పైకోర్టులో అప్పీల్ చేసుకునే వీలుంటే ఆ అవకాశాన్ని ఎలాగూ ఉపయోగించుకంటాం కాబట్టి కోర్టు తీర్పుల్ని అనవసరంగా విమర్శిస్తూ వ్యవస్థపై గౌరవం పోయేలా చేయకూడదు!   స్వామీ అసీమానంద్ ను నిర్దోషి అని తీర్పునిస్తే తప్పుబడుతోన్న వారే ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాను దోషిగా తేల్చితే కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ జర్నలిస్టులు, మేధావుల వంటి వారు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాల్ని కుండబద్ధలు కొడుతున్నారు. పైగా ప్రొఫెసర్ సాయిబాబా వీల్ చెయిర్ కు పరిమితమైన వికలాంగుడని గుర్తుకు చేస్తున్నారు. ఆయన్ను కోర్టు వికలాంగుడని శిక్షించలేదు. నిషేధిత మావోయిస్టు పార్టీతో ఆయన సంబంధాలు పెట్టుకున్నారు. అంతే కాదు, విద్యార్థుల్ని తీర్చిదిద్దే బాధ్యతగల ప్రొఫెసర్  స్థానంలో వుంటూ హింసని నమ్మే నక్సలైట్స్ పట్ల సానుభూతి చూపుతున్నారు. ఆయన వల్ల ఎంత మంది విద్యార్థులు హింసాత్మక ఉద్యమం వైపు వెళ్లారన్నది ఎవరూ తేల్చలేని విషయం! ఇప్పటికే ఆయనతో పాటూ యావజ్జీవ శిక్ష పడ్డ వ్యక్తుల్లో ఒక విద్యార్థి కూడా వున్నాడు!   ప్రొఫెసర్ సాయిబాబాకు పై కోర్టుకు వెళ్లి అప్పీల్ చేసుకునే అవకాశం వుంటుంది. దాన్ని ఎవరూ కాదనరు. కాని, ఒక కోర్టు తీర్పు ఇవ్వగానే దానికి వ్యతిరేకంగా గళం విప్పటం.. వామపక్ష హింసకు మద్దతు పలికితే అదేదో గొప్ప ఘనకార్యం అన్నట్టు మాట్లాడటం చాలా తప్పుడు సంకేతాలు ఇస్తుంది సమాజంలో. ఈ ధోరణి కొంత మంది మేధావులు, జర్నలిస్టులు, రాజకీయ నేతలు మానుకోవాలి. హింస హిందూత్వవాదం నుంచి పుట్టినా, ఇస్లామిక్ ఉగ్రవాదం నుంచి పుట్టినా, వామపక్ష భావజాలం నుంచి పుట్టినా సమానంగా ఖండించాలి. కోర్టులు తీర్పునిస్తే మన సైద్ధాంతిక నేపథ్యలు, భావజాలాలు పక్కన పెట్టి అందరం గౌరవించాలి.

వర్మని మార్చాలనుకోవడం మన ఖర్మ

ఎపుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఆఖరికి మహిళా దినోత్సవాన్ని కూడా వదలకుండా తనదైన శైలిలో ట్విట్టర్లో ట్వీట్స్ చేశాడు. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా స్పందించిన వర్మ..   ‘‘ఏడాదిలో అన్నీ రోజులు పురుషులవేనని.. ఈ ఒక్కరోజు మహిళకు ఇచ్చారు. ఉమెన్స్‌ డే’ని ‘మెన్స్‌ డే’ అనాలి. మహిళలను పురుషులు సంతోష పెట్టినంతగా.. పురుషులను మహిళలు సంతోషపెట్టలేరు. కనీసం పురుషుల దినోత్సవం రోజైనా మహిళలు వారిపై అరుపులు, కేకలు వేయకూడదు. వారికి కొంచెం స్వేచ్ఛనివ్వాలి. పురుషుల అందరి తరఫు నుంచి నేను మహిళలకు పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నాను. ఆ రోజు పురుషులు మహిళలకు ఏం చేయాలో నాకు తెలియదు.. కానీ ఏడాదిలో ఒక రోజు మాత్రం పురుషులు మహిళల దినోత్సవంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను.’’అని అన్నారు.      అక్కడితో ఆగకుండా.. "ప్రపంచంలోని ఆడవాళ్లంతా, మగవారికి సన్నీలియాన్ ఇచ్చినటువంటి సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా" అని అన్నారు. పురుషులందరి తరఫునా మహిళలకు శుభాకాంక్షలు చెబుతున్నానని, ఏదో ఒకరోజు పురుషులకూ స్వాతంత్ర్యం లభిస్తుందని, 'మెన్స్ డే' జరుపుకునే రోజు వస్తుందని అన్నాడు.     కుటుంబం, ప్రేమలు, ఆప్యాయతలు, భక్తి, తదితర అంశాలకి దూరంగా ఉండే వర్మ, దేశంలో జరిగే ప్రతి సంఘటనకి తనదైన శైలిలో రియాక్ట్ అవుతారు. మన ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి భావ స్వేచ్ఛ ఉంది. కానీ, అది ఇంకొకరికి ఇబ్బంది పెట్టనంతవరకు మాత్రమే అనే విషయం వర్మ తెలుసుకోవాలి. ఒకప్పుడు మహిళలకి ప్రాధాన్యం ఉన్న సినిమాలు తీసిన వర్మ, ఇంతలా దిగజారి మహిళలపై వ్యాఖ్యలు చేయడం అయన స్థాయిని తగ్గిస్తుంది.     ట్విట్టర్ లో సన్నీ లియోన్ పైన చేసిన వ్యాఖ్యానాలకి కొందరు వ్యతిరేకంగా మాట్లాడితే, వర్మ మాత్రం తాను చేసింది అక్షరాల కరెక్ట్ అని సంజాయిషీ ఇచ్చుకున్నాడు. వాస్తవానికి సన్నీలియోన్ అంత నిజాయితీ, స్వీయ గౌరవం ఉన్న ఆడవాళ్లు ఉండరని చెప్పుకొచ్చారు.     అయినా, వర్మ ఇంతేలే అని ఊరుకోవడం తప్ప మనం మాత్రం చేసేదేముంది. సెంటిమెంట్స్ ఉన్నవాడిని మార్చే ప్రయత్నం చేయొచ్చు. కానీ, వర్మ లాంటి విపరీత భావాలున్న వ్యక్తికి ఎంత చెప్పినా దండగే. అసలు ఈయనకి తన తల్లి, భార్య, కూతురు ఆడవాళ్లే అనే విషయం గుర్తుందంటారా!

సుచీలీక్స్... సినీ రంగంలో సెక్స్ ఒక సైలెంట్ రూలా?

  సుచీ లీక్స్ ... ఇప్పుడు ఈ పదాలు వినిపిస్తే చాలు సౌతిండియన్ సినిమా సెలబ్రిటీలు బెదిరి కళ్లు తేలేస్తున్నారు. నిజానికి ట్విట్టర్ లో సింగర్ సుచిత్రా బయటపెట్టిన ఫోటోలు అలాంటివి మరి! నెక్స్ట్ నెంబర్ ప్రియమణిదంటూ చెప్పిన సుచీలీక్స్ .... ఇండస్ట్రీ వారితో భయానక రాగాలు పాడిస్తోంది! ఇంతకీ సుచీ లీక్స్ ఎవరు చేస్తున్నారు? సింగర్ సుచిత్రనే అంత సాహసం చేస్తోందా? లేక మరెవరైనా ఆమె అకౌంట్ హ్యాక్ చేశారా? హ్యాక్ చేస్తే అధికారికంగా సుచిత్రా తన అకౌంట్ ని బ్లాక్ చేయించవచ్చు కదా? పోలీసుల్ని ఆశ్రయించవచ్చు కదా? ఆమెకేమైనా మానసిక రుగ్మత వుందా? ఇలా బోలెడు ప్రశ్నలు! కాని, అవ్వనికంటే ప్రధానమైన ప్రశ్న మరొకటి వుంది...   సుచిత్రా అనే సింగర్ సినిమా సెలబ్రిటీల ప్రైవేట్ ఫోటోలు బయట పెట్టి సాధించింది ఏమిటి? ఒకటి అరా వీడియోలు జనంలోకి వదిలి చెప్పదలుచుకుంది ఏంటి? ఈ కొశన్స్ చాలా ఇంపార్టెంట్! నిజంగా సుచిత్రా అనే గాయని నటీ, నటులు, గాయనీ, గాయకులు, సంగీత దర్శకుల బండారాలు బయటపెడుతుందో లేదో పెద్ద ముఖ్యం కాదు. కాని, జనాలు అభిమానించే పేరున్న సినిమా వాళ్లు అడ్డంగా బుక్కైపోయారు. ఇది నిజం. ఇంకా మరికొందరి ఫోటోలు , వీడియోలు కూడా రాబోతున్నాయి. అవ్వి కూడా వచ్చినా పెద్దగా నష్టం జరుగుతుందని భావించటానికి ఏం లేదు. ఎందుకంటే, ఇలాంటి ఫోటోలు , వీడియోలు వల్ల కెరీర్స్ పాడైపోయే దశ మన దేశం ఏనాడో దాటిపోయింది! ఉదాహరణకి సుచీ లీక్స్ త్రిషా రెండు ఫోటోల్లో కనిపించింది. రానాతో, ధనుష్ తో ఆమె క్లోజ్ గా వున్న ఇమేజెస్ అవ్వి. కాకపోతే, ఇదే త్రిషా గతంలో ఒక న్యూడ్ వీడియో న్యూసెన్స్ ఎదుర్కొంది! అది ఆమెదో కాదో ఇప్పటికీ ఎవరూ అధికారికంగా చెప్పలేకపోతున్నారు. కాని, అలా ఒక న్యూడ్ వీడియో వచ్చినా కూడా త్రిషని ఆదరించటం మానలేదు జనం. అదే ఒకప్పుడైతే సదరు హీరోయిన్ పరువు పోయి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చేది!     సుచీలీక్స్ వ్యవహారం కూడా కొన్నాళ్లకు చల్లబడిపోతుంది. లీక్ చేసింది స్వయంగా సుచిత్రే అయినా కాకున్నా, ఆమె ట్విట్టర్ అకౌంట్ ఎవరైనా హ్యాక్ చేసినా, చేయకున్నా... జనం సినిమా వాళ్ల రొమాంటిక్ వ్యవహారాల్ని సీరియస్ గా తీసుకోరు. ఎందుకంటే, వారు మతంతో సంబంధం వున్న సన్యాసులు కారు. జనం వద్దకి ఓట్లు అడిగేందుకు వచ్చే రాజకీయ నాయకులు కూడా కాదు. అన్నిటికీ మించి సినిమా రంగంలో అడ్జెస్ట్ మెంట్ లు మామూలేనని అందరికీ తెలుసు. గ్లామర్ ప్రపంచంలో డబ్బులాగే, శృంగారం కూడా ఇచ్చిపుచ్చుకుంటారనేది పబ్లిక్ సీక్రెట్! అందుకే,నాలుగు రోజులు ధనుష్, త్రిషా, హన్సిక, ప్రియమణి లాంటి వారి గురించి మాట్లాడుకుంటారేమోగాని జనం వాళ్లపై ఆగ్రహించే ఛాన్స్ అస్సలు లేదు. అయితే గియితే మరి కాస్త ఫ్రీ పబ్లిసిటీ వచ్చిపడుతుంది!   సినిమా రంగంలో జరిగే చీకటి వ్యవహారాలపై సినిమా వాళ్లు సరైన విధంగా దృష్టి పెట్టరు. లేదంటే కావాలనే ఆ కోణాన్ని ఆవిష్కరించరు. దేశ ప్రధాని, అమెరికా అధ్యక్షుడ్ని కూడా వదలకుండా సినిమాల్లో చూపించే మనోళ్లు తమ స్వంత రంగంలో ఎంతగా లైంగిక వేధింపులు, క్రైమ్ వుంటాయో కళ్లకు కట్టినట్టు చూపించరు. ఎప్పుడో ఒకటి రెండు సినిమా రంగం నేపథ్యంలో నడిచే సినిమాలు వచ్చినా అసలు పరిస్థితి ఏ భారతీయ దర్శకుడూ చూపించలేదు. అందుకే, కొంత వరకూ సినిమా రంగం విషయంలో సామాన్య జనానికి అవగాహన తక్కువ. అయినా కూడా అప్పుడుడప్పుడూ జరిగే ఈ సుచీలీక్స్ , భావన కిడ్నాప్ వ్యవహారం లాంటివి మొత్తం అంతా బయటపెట్టేస్తుంటాయి! రాజకీయాల్లో, క్రీడల్లో, కార్పోరేట్ రంగంలో... ఇలా అన్నింటిలో వున్నట్టే సినిమా ఫీల్డ్ లోనూ దోపిడీ వుంది. అదే సమయంలో పేరు, డబ్బు, మజా కోసం కాంప్రమైజ్ అయ్యే సంప్రదాయం కూడా వుంది. ఇదంతా ఎప్పటికప్పుడు అప్పుడే తొలిసారి వెలుగు చూసినట్లు అందరూ నటించే బహిరంగ రహస్యం!

ఇండియా కొవ్వెక్కిపోతోంది....

  చిన్న పిల్లలు బొద్దుగా వుంటే ముద్దొస్తారు! పెద్ద వాళ్లు బుద్దిగా వుంటే మెప్పిస్తారు! ఇది అందరికీ తెలిసిందే! కాని, మన దేశంలో గత పదేళ్లలో పెద్దవాళ్లు బుద్దిగా అస్సలు వుండటం లేదు. అందుకే, బొద్దుగా తయారవుతున్నారు! ఇదేంటి అంటారా? తాజాగా విడుదలైన ఓ సర్వే ఫలితాలు చూస్తే దేశం ఎంతగా బరువెక్కిపోతోందో మనకు అర్థమవుతుంది!   మనిషి తక్కువ బరువు వుండటం ఎంత ప్రమాదమో... అంకన్నా ఎక్కువే ప్రమాదం, అధిక బరువు! ఈ మధ్య లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల చూస్తుంటే జనం లావెక్కిపోతున్నారు. కిలో నుంచి మొదలై పది, ఇరవై, ముప్పై కిలోలు అధిక బరువు తూగేస్తున్నారు. దీని వల్ల ఆగకుండా చెమటలు పోయటం లాంటి చిన్న సమస్య మొదలు గుండె ఆగిపోవటం వరకూ బోలెడు ఇబ్బందులు, ప్రమాదాలు వున్నాయి. అయితే, ఆందోళనకరంగా ఇండియాలో అధిక బరువు రోజు రోజుకూ అధికమవుతోంది! మగవాళ్లలో ఉధృతంగా బరువు పెరిగే ట్రెండ్ కనిపిస్తోందంటున్నారు! 2005-06 సంవత్సరంలో భారతీయ పురుషులు 9.3 శాతం మంది ఓవర్ వెయిట్ వుండేవారట! పదేళ్ల తరువాత, అంటే, 201-16 కల్లా ఆ శాతం ఎంత పెరిగిందో తెలుసా? 18.6 శాతం! అంటే, నూటికి నూరు శాతం మంది పురుషులు బరువు పెరిగిపోయారట! పైగా ఈ ఓవర్ వెయిట్ ప్రాబ్లం ఓవర్ గా  వుంటోంది సిటీల్లోనే. నగరా జనాభాలో 26.3 శాతం మంది మగవారు భారీకాయాలతో బాధపడుతుంటే ఊళ్లలో 14.3 శాతం మంది మాత్రమే కొవ్వెక్కిపోయారట!   ఆడవారి పరిస్థితి కూడా బెటర్ గా ఏం లేదంటోంది సర్వే! 2005-06లో 12.6 శాతం మంది భారతీయ మహిళలు బొద్దుగా వుంటే ఇప్పుడు వారి సంఖ్య 20.7 శాతానికి చేరుకుంది! పదేళ్లలో నిండైన మహిళలు సంఖ్య తీవ్రంగా పెరిగినట్టే లెక్క! స్త్రీలు కూడా నగరాల్లో 31.3 శాతం మంది లావుగా వుంటే గ్రామాల్లో కేవలం 15 శాతం మంది మాత్రమే కదలటానికి ఆయసపడుతున్నారట!   గుండెల్ని బరువెక్కించేలా కేంద్ర ప్రభుత్వ అధికారిక కుటుంబ ఆరోగ్య సర్వేలో తేలిన ఈ బరువైన సత్యాలు ఒక్క విషయం స్పష్టం చేస్తున్నాయి. దేశం మొత్తం ఆడ, మగా తేడా లేకుండా అందరూ బరువు పెరుగుతోన్నా... సిటీల్లో కంటే ఊళ్లలో అధిక బరువు సమస్య తక్కువగా వుంది. నగరాల్లోనే అధిక బరువు అధికంగా వుంటోంది. దీని అర్థం ఏంటి? సిటీ లైఫ్ స్టైల్, లేదా ఊళ్లలో వున్నా  శారీరిక శ్రమకి దూరంగా వుంచే నగరాన్ని జీవితాన్ని పాటించటం... ఇదే మన కొంపలు ముంచుతోంది! మనసుకు మత్తెక్కి తక్కువ శరీర శ్రమ చే్స్తే ఒళ్లు కొవ్వెక్కటం ఖాయం. అనారోగ్యంతో మనసు బరువెక్కటమూ ఖాయం! అందుకే, లావు తగ్గటానికి, లేదంటే లావు పెరగకుండా వుండటానికి... వెంటనే నడుం బిగించాలి. కాదు కాదు, నడుం వంచి శ్రమించాలి!

కేరళ ఆరెస్సెస్ హత్యలు మీడియాకు ఎందుకు పట్టవు?

మన ఇండియన్ మీడియా తీరే విచిత్రం! నిజంగా ప్రపంచానికి ఏది పెద్ద సమస్యో దాన్ని మన మీడియా నెత్తికెత్తుకోదు. తనకు ఏది పెద్ద సమస్యో దాన్నే జనం నెత్తిన రుద్దుతుంది. మరీ ముఖ్యంగా, జాతీయ మీడియాగా చెప్పుకుని తిరిగే ఇంగ్లీష్ మీడియా తన ఇష్టానుసారం అంశాల్ని హైలైట్ చేస్తుంది! ఏ ఈశాన్య భారతంలోనో, దక్షిణ భారతంలోనో మర్డర్ జరిగినా వారికి పట్టదు. కాని, ఢిల్లీలో, ముంబైలో ఇంకు దాడి జరిగినా, చెప్పులు విసిరేసినా... రోజంతా పండగే! ఇప్పుడు మరోసారి అదే తత్వం నిరూపించుకుంటోంది మన మీడియా...    కేవలం కొన్ని గంటల క్రితం మధ్యప్రదేశ్ లో ఒక ఆరెస్సెస్ నాయకుడు ఏమన్నాడో తెలుసా? ఇంగ్లీష్ మీడియా అదే పనిగా ఆయన మాటల్ని ఉదరగొట్టింది. ఎవరైనా కేరళ సీఎం విజయన్ తల నరికి తెస్తే తాను వారికి కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించాడు! ఆ ఉన్మాదపు మాటలు ఊరికే ఆవేశంగా అన్నవేనని ప్రత్యేకంగా చెప్పాలా? అందులో సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం ఏమైనా వుందా? ఆయన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఏం లేడు. ఆయన చేతిలో ఆర్మీనో, పోలీస్ వ్యవస్థో లేదు. కనీసం ఆరెస్సెస్ కి కూడా ఆయన సుప్రీమ్ బాస్ ఏం కాదు. అలాంటి ఎవరో ఒక ఆరెస్సెస్ నేత కేరళ సీఎం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే... మన ఛానల్స్ గోలగోల చేశాయి!    మీడియాని తప్పుబడుతున్నాం అంటే ఆరెస్సెస్ నేత కోటి రూపాయలు ఇస్తాననటం కరెక్ట్ అని చెప్పటం కాదు. అది తప్పే. కాని, ఆయన ఎందుకు అలా అనాల్సి వచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం వెదికితే మన మీడియా నిర్లక్ష్యం స్పస్టంగా బయటపడుతుంది! కేరళలో గత కొన్ని సంవత్సరాలుగా ఆరెస్సెస్, బీజేపి నేతల హత్యలు నిరాటంకంగా , నిర్లజ్జగా జరిగిపోతున్నాయి. కేరళ సీఎం విజయన్ జిల్లాలోనే పదుల సంఖ్యలో కాషాయ కార్యకర్తలు దారుణ హత్యలకి గురయ్యారు. ఎంతో మంది చేతులు, కాళ్లు నరికేస్తున్నారు. ఎవరు? ఇంకెవరు, అక్కడి సీపీఎం శ్రేణులే! ఇది అక్కడ పబ్లిక్ సీక్రెట్! అందరికీ తెలిసినా ఎవ్వరూ పట్టించుకోని విషయం...    సంవత్సరాల తరబడి తన ఆధీనంలో వున్న శాంతిభద్రతల అంశాన్ని కేరళ ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా కొత్త సీఎం విజయన్ వచ్చాక మరింత పెరిగాయి రాజకీయ హత్యలు. ఇదంతా జరుగుతోంటే మన మీడియా పట్టించుకున్న పాపాన పోలేదు. ఎంత సేపూ ఢిల్లీలో గుర్ మెహర్ కౌర్ పై ట్విట్టర్ లో దాడి చేయటం తప్పని చెప్పటంలోనే మన ఛానల్స్ బిజీ! ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్, బీఫ్ తినటం, అసహనం, అవార్డ్ వాప్సీ... ఇవే ఇంగ్లీషు మీడియాకు పల్లీబఠాన! అంతే తప్ప కేరళలో, బెంగాల్ లో ఆరెస్సెస్, బీజేపి నేతల హత్యలు పట్టించుకునే టైం వుండటం లేదు! కాని, అదే సమయంలో ఒక ఆరెస్సెస్ నేత విజయన్ తల నరకమని ఆవేశంగా అంటే మాత్రం అందరూ అలెర్ట్ అయిపోతారు! ఈ వివక్ష ధోరణి అత్యంత ప్రమాదకరం... నిజంగా కేరళలో జరగుతున్నవి రాజకీయ హత్యలేనా? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు అర్జెంట్ గా తెలుసుకోవాలి. ఆ బాధ్యత కేరళ రాష్ట్ర ప్రభుత్వానిది. 

అల్ బాగ్ధాదీ ఖేల్ ఖతమ్! ఐఎస్ఎస్ దుకాణం బంద్!

  ఒక హింసాత్మక శకం ముగిసిందా? ఒక వికృత రక్తపు క్రీడ ముగింపుకొచ్చిందా? ఒక రాక్షస రాజ్యం కుప్పకూలిపోయిందా? పరిస్థితులు చూస్తుంటే అలాగే కనిపిస్తోంది! జరిగిన దాన్ని తలుచుకుంటే ఇదేం పెద్ద శుభవార్త కాదు! అయినా కూడా ఉగ్రవాదాన్ని వ్యతిరేకించే ప్రతీ ఒక్కరూ ఎంతో కొంత ఊరట పొందే సమాచరమే! ఐఎస్ఐఎస్ అధినేత, అరాచకానికి నిలువెత్తు రూపం, అబు బక్ర్ అల్ బాగ్ధాదీ తన ఓటమిని అంగీకరించాడట! ఐసిస్ కథ ముగిసినట్టేనని తన పైశాచిక గణాలకి 'వీడ్కోలు ఉపన్యాసం' పంపాడట!   'ఫేర్ వెల్ స్పీచ్'... ఇప్పుడు ఇరాక్ లో ఇంకా మిగిలిన అతి తక్కువ మంది ఐసిస్ రాక్షసుల చర్చల్లో వినిపిస్తోన్న పదం! ఈ ఫేర్ వెల్ స్పీచ్ పంపింది ఇస్లామిక్ స్టేట్ టాప్ లీడర్ అల్ బాగ్ధాదీ. ఎక్కడున్నాడో ఇప్పటికీ ఇంకా తెలియకపోయినా అతడు తన మిగిలిన సైనిక శేషానికి లాస్ట్ మెసేజ్ ఇచ్చాడట. అందులో తమ ఐసిస్ పని అయిపోయినట్టే అని చెప్పేశాడు! ఇరాకీ సేనలు అంతర్జాతీయ సైన్యం, అమెరికన్ సైన్యం మద్దతుతో అష్టదిగ్భంధనం చేయటంతో ఐఎస్ఐఎస్ కు ది ఎండ్ కార్డ్ పడింది. ఇంకా ఇరాక్ లోని మోసుల్ నగరంలో కొన్ని చోట్ల ఐసిస్ సైన్యం వున్నా అత్యధిక శాతం ఇరాకీ ప్రభుత్వం చేతికి చిక్కింది. మిగిలిన వారు సిరియాలోకి పారిపోతున్నారు.   మొదట్నుంచీ ఆత్మాహుతి చేసుకుంటే స్వర్గం దక్కుతుంది, అక్కడ 72మంది కన్యలు జిహాదీలకు స్వాగతం పలుకుతారని చెబుతోన్న ఐసిస్ ఈ చివరి సందేశంలో కూడా అదే రిపీట్ చేసింది. అల్ బాగ్ధాదీ ఇంకా బతికి వున్న ఐసిస్ సేనల్ని ఎవరి దారిన వార్ని పారిపొమ్మన్నాడు. అరబ్బీ వారు కాకుండా ఇతర దేశాల నుంచీ వచ్చిన ఉన్మాద ఉగ్రవాదులైతే తమని తాము పేల్చేసుకొమ్మని చెప్పాడట. అలా చేస్తే స్వర్గంలో 72మంది గ్యారెంటీ అంటూ మరోసారి సెలవిచ్చాడట! ఇదంతా ఎక్కడున్నాడో తెలియని అల్ బాగ్ధాదీ నుంచి మోసుల్ లోని ఐసిస్ మత ప్రబోధకుల వద్దకి చేరిందట. వారు ఐసిస్ సైన్యానికి మసీదుల్లో, మదర్సాల్లో అంతిమ సందేశం వివరిస్తున్నారట!   అల్ బాగ్ధాదీ మాట విని ఎంత మంది ఆత్మాహుతులకు పాల్పడతారో అనుమానమే. అయితే , దేశ దేశాల నుంచీ వచ్చిన మతోన్మాద జిహాదీలకు ఇప్పుడు ముందు నుయ్యి , వెనుక గొయ్యిలా తయారైంది! వారు చావలంటే ఆత్మాహుతి చేసుకోవాలి. లేదంటే ఇరాకీ సైన్యం చంపుతుంది. లేదంటే నిర్భంధించి నరకం చూపుతుంది. ఎటు చూసినా జిహాదీల జీవితాల దాదాపూ నాశనం అయిపోయినట్టే! కాకపోతే, ప్రపంచాన్ని వణికించి, కోట్లాది మంది జీవితాలు దుర్భరం చేసిన అల్ బాగ్ధాదీ ఐసిస్ ఓటమి అంగీకరించాడు కాని తాను ఎక్కడున్నది ఇంకా బయట పెట్టలేదు. అతడ్ని ఇరాకీ సేనలు స్వర్గానికి పంపి... 72మంది కన్యలు నిజంగా అక్కడ వుంటారో లేదో స్పష్టంగా తెలుసుకునే ఏర్పాట్లు చేస్తేనే యుద్ధం సంపూర్ణంగా ముగిసినట్టు!

నోట్ల రద్దు... భయపెట్టినంత భయంకరమైంది కాదా

  నవంబర్ , డిసెంబర్ నెలల్లోదేశాన్ని కుదిపేసిన న్యూస్ ఏదైనా వుందంటే... అది డీమానిటైజేషనే! ప్రధాని మోదీ అమాంతం వెయ్యి, అయిదు వందల నోట్లు రద్దు చేయటంతో కలకలం రేగింది. నవంబర్ 8న మొదలైన చిల్లర కష్టాలు డిసెంబర్ 30దాకా కొనసాగాయి. జనవరిలో కాస్త చల్లబడ్డాయి. ఫిబ్రవరీలో అయితే ఇంచుమించూ లేవనే చెప్పాలి. కాని, ఒకవైపు మీడియా, మరో వైపు మేధావులు, ఇంకో రాహుల్, కేజ్రీవాల్, మమత లాంటి రాజకీయ నాయకులు నానా హంగామా చేసేశారు. నోట్ల రద్దు ఆర్దిక ప్రళయం అంటూ, మనం కొట్టుకుపోతాం అంటూ జనాల్ని బెంబేలెత్తించారు. అయినా కూడా ఎందుకోగాని మోదీ మీద రావాల్సినంత అసహనం రాలేదు. జనం అక్కడక్కడా, అడపాదడపా తిట్టుకున్నా తిరుగుబాటు మాత్రం రాలేదు. రేపో, మాపో యూపీ ఎన్నికల్లో కమలం బాగా వికసిస్తే సామాన్య జనం డీమానిటైజేషన్ కు ఒక విధంగా మద్దతు తెలిపారని కూడా భావించవచ్చు!   నోట్ల రద్దుతో మోదీ చేసిన భారీ ప్రయోగం కోట్లాది మందిని రోడ్లపైకి తెచ్చింది. సదుద్దేశంతోనో, దురుద్ధేశంతో మన్మోహన్ మొదలు మమత వరకూ అందరూ తిట్టిపోశారు. కాని, తాజాగా విడుదలైన ఆర్దిక గణాంకాలు మాత్రం మరో రకం సత్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి! నోట్ల రద్దు వల్ల లాభం జరిగినా, జరక్కపోయినా నష్టం అవ్వలేదని తెలుపుతున్నాయి. ఎట్ లీస్ట్, ప్రచార మాధ్యమాల్లో రాత్రి, పగలు ఉదరగొట్టినంత ఉపద్రవం ఏ విధంగానూ సంభవించలేదు. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ విడుదల చేసిన తాజా అధికారిక జీడీపీ రేటే!   జీడీపీ... అంటే, స్థూలదేశీయోత్పత్తి... ప్రతీ సంవత్సరానికిగానూ నాలుగు భాగాలుగా లెక్కకడతారు. అలా 2016-17 సంవత్సరానికిగానూ మూడో త్రైమాసికంలో మన దేశం ఏడు శాతం వృద్ధి సాధించింది. ఇంత వేగంగా ఆర్దిక అభివృద్ధి సాధిస్తోన్న దేశం మరొకటి లేదు ప్రపంచంలో. చైనాతో సహా అన్ని దేశాలు మనకంటే వెనుకబడే వున్నాయి. అయితే, నవంబర్లో నోట్ల రద్దు వ్యవహారంతో ఈ వృద్ధి రేటు సాధ్యం కాదని ఆర్దిక పండితులు జ్యతిష్యాలు చెప్పారు. ఆరు శాతమే కష్టమని బెదిరించారు. కాని, మోదీ సాహసాన్ని దుస్సాహసం కాకుండా భారతదేశ సామాన్య జనం అండగా నిలబడ్డట్టే కనిపిస్తోంది. వ్యవసాయం, ఉత్పత్తి, ప్రభుత్వ వ్యయం వంటి అంశాల్లో జరిగిన లావాదేవీల వల్లే ఏడు శాతం వృద్ధి రేటు భారత్ సాధించగలిగిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు!   పెద్ద నోట్ల రద్దు వల్ల నల్లధనం అరికట్టడం, ఉగ్రవాదానికి చెక్ పెట్టడం, ఎన్జీవోల ఆటలు కట్టడి చేయటం ఇలాంటి బోలెడు లాభాలు ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పటి వరకూ అలాంటి విషయాల్లో పెద్దగా లబ్ది చేకూరినట్టు కనిపించటం లేదు. కాని, బ్యాంకుల్లో భారీగా డబ్బు జమైంది. పారదర్శకమైన ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా ఎక్కువయ్యాయి. వీటన్నటికంటే ముఖ్యంగా గత త్రైమాసికంలో ఇండియా జీడీపీ ఏడు శాతం వృద్ధితో బలంగా నిలబడి... మన ఆర్దిక వ్యవస్థ పటుత్వాన్ని నిరూపించింది. ప్రధాని వ్యతిరేక వర్గం భయపెట్టినంత విషాదం చోటు చేసుకోలేదనే చెప్పాలి! మరి ఇప్పటికైతే ఆర్దికంగా డీమానిటైజేషన్ దుష్పలితాల నుంచి బయటపడ్డాం. రాజకీయంగా మోదీ నోట్ల రద్దు ఫలితం ఎలా అనుభవించనున్నారో... చూడాలి!

అమెరికన్ పెళ్లికి ఇండియన్ గోల!

  ఆస్కార్స్... ఈ పదం సంవత్సరానికి ఒకసారి ఇండియాని, ఇండియన్స్ ని ఉర్రూతలూగిస్తుంటుంది! మన సెలబ్రిటీలు తెలిసినంత మాట్లాడేస్తారు!  మీడియా అంతా తెలుసన్నట్టు చెప్పేస్తుంది! అసలు ఆస్కార్స్ జరిగే అమెరికాలో ఇంత హంగామా వుందా అని అనుమానం కలిగేలా గోల మొదలైపోతుంది! కాని, ఇదంతా నాణానికి ఒకవైపు. ఆస్కార్స్ పట్ల భారతీయులు చూపే క్రేజ్ వెనుక చాలా లోతైన భావజాలం వుంది. తెల్లవాళ్ల నుంచీ మనం ఇంకా సాంస్కృతిక స్వాతంత్ర్యం పొందలేదనే దానికి అదో గొప్ప సంకేతం!   ఎప్పటిలాగే ఈ యేడు కూడా ఆస్కార్స్ ఆసాంతం అయిపోయాయి. ఏఏ సినిమాలు నామినేషన్స్ పొందవచ్చు అన్న అంశం మొదలు ఏవి ఫైనల్ లిస్ట్ కి చేరుకున్నాయి, అవార్డ్ సెర్మనీ ఎలా జరిగింది, ఎవరొచ్చారు, ఏమన్నారు వగైరా వగైరా అన్నీ మీడియా అందించేసింది. గంటల తరబడి కవరేజ్ దక్కింది. కాని, అసలు విషయం ఎవ్వరూ మాట్లాడుకోలేదు. ఆస్కార్స్ అంటే అంతర్జాతీయ అవార్డులు కావు. కనీసం అమెరికాలో అమెరికన్ ప్రభుత్వం ఇచ్చే అధికారిక అవార్డులు కూడా కావు. అక్కడున్న ఒక ప్రైవేట్ అకాడమీ ప్రకటించే ప్రతిష్ఠాత్మక అవార్డులు. పైగా అవ్వి ఒక్కటి అరా విభాగాల్లో తప్ప అమెరికా బయట రూపొందిన చిత్రాలకు ఇవ్వరు. అన్ని సెగ్మెంట్లలో హాలీవుడ్ ఇండస్ట్రీలో తయారైన సినిమాలే అనుమతిస్తారు. అంటే ఆస్కార్స్ కి ప్రపంచంలోని వివిధ దేశాల్లో తెరకెక్కే వేలాది సృజనాత్మక చిత్రాలకి ఎలాంటి సంబంధం లేదన్నమాట! నిజంగా దేశదేశాల్లో హాలీవుడ్ సినిమాల కన్నా బెటర్ సినిమాలు ఎవరన్నా రూపొందించినా ఆస్కార్స్ లో పట్టించుకోరు.   పట్టించుకునే ఉద్దేశం, బాధ్యత కూడా వారికి లేదు! బాలీవుడ్ సినిమాల్ని సత్కరించటానికి ఫిల్మ్ ఫేర్ ఎలాగో... అమెరికన్ సినిమాల్ని ఎంకరేజ్ చేయటానికి ఈ అకాడమీ అవార్డ్స్ కూడా అంతే! కాని, మన దేశంలో, మన దేశం లాంటి మరిన్ని మూడో ప్రపంచ దేశాల్లో ఆస్కార్స్ అంటే వేలం వెర్రి! ఎప్పుడో దక్కే చిన్నా చితక ఆవార్డుల కోసం, రెహమాన్ లాంటి ఆస్కార్స్ విన్నర్స్ కోసం సంవత్సరాల తరబడి నాన్ అమెరికన్స్ తహతహలాడిపోతుంటారు! ఇండియాతో సహా చాలా దేశాల్లో సినీ సెలబ్రిటీస్ కి ఆస్కార్ ఒక స్వప్నం! ఆశయం! ఆరాటం! కాని, హాలీవుడ్ లో పని చేయని వారు ఎంత గొప్ప సినిమా తీసినా అది దక్కే అవకాశం వుండదన్నది పచ్చి నిజం!   ప్రపంచం మొత్తం అమెరికా అంటే ఎలాంటి క్రేజో.. అమెరికన్ సినిమాలన్నా అంతే క్రేజ్! అందుకే, హాలీవుడ్ వాళ్లు తమకు తాము చేసుకునే అంతర్గత ఆస్కార్స్ సంబరంలో ఇతర దేశాల మీడియాలు, ప్రముఖులు వేలు పెడుతుంటారు. తమ దేశాల్లో ఆస్కార్స్ స్థాయి అవార్డ్స్ సంబరం ఏర్పాటు చేసుకోకుండా అమెరికాలో జరిగే పేరంటానికి పిలవకున్నా వెళ్లిపోతుంటారు. పైగా అదే గొప్పదన్నట్టు, అక్కడ అవార్డ్ రావటంతోనే జన్మధన్యం అన్నట్టు సామాన్య జనాన్ని తప్పుదోవ పట్టిస్తుంటారు. ఈ కారణంగానే కాస్త చదువుకున్న ఇండియన్స్ చాలా మంది ఆస్కార్స్ గురించి గంటల తరబడి చర్చించుకుని మురిసిపోతుంటారు! భారత ప్రభుత్వం మన సినిమాలకిచ్చే అధికారిక అవార్డ్స్ గురించి ఏ మాత్రం పట్టించుకోని వారు కూడా ఆస్కార్స్ గురించి ఆరాటపడిపోతుంటారు! దీని వల్ల అమాంతం జరిగిపోయే నష్టమేం వుండకపోవచ్చు. కాని, ఇలా మరో దేశపు అంతర్గత అవార్డుల పండగని నోరెళ్ల బెట్టి చూస్తూ వుంటే మన స్వంత సినిమా ఏనాటికీ ఎదగదు. మహా అయితే హాలీవుడ్ సినిమాల్ని కాపీ చేస్తూ, ఇమిటేట్ చేస్తూ తృప్తి పొందాల్సిందే తప్ప మనకంటూ ప్రత్యేకత ఏనాటికీ రాదు. అందుకోసమన్నా భారతీయులు ఆస్కార్స్ పిచ్చి తగ్గించుకోవాలి.   మనకు ఆస్కార్స్ రేంజ్లో ప్రతిష్ఠాత్మకమైన అవార్డ్ సెరిమనీ ఎందుకు లేదో ఆలోచించుకోవాలి. ఏం చేస్తే హిందీతో పాటూ అనేక భారతీయ భాషల్లో రూపొందే వందలాది చిత్రాలు ఘనంగా సత్కరించుకోవచ్చో గ్రహించాలి. అప్పుడు అమెరికన్స్ కు ఆస్కార్స్ వున్నట్టే మనకూ మన స్వంత ఆస్కార్స్ లభించే ఆస్కారం వుంటుంది! ఇంకా సూటిగా చెప్పుకోవాలంటే... అమెరికాకు నాసా వుంటే మనం ఇస్రో ఏర్పాటు చేసుకున్నాం. అలాంటిది ఆస్కార్స్ తో సరితూగే ఒక ప్రైవేట్ ఫంక్షన్ ప్రతీ యేటా చేసుకోలేమా? కాకపోతే, మీడియా, మేధావులు ఆస్కార్స్ లో ప్రియాంక ఏం డ్రస్ వేసుకుంది లాంటి డిస్కషన్ కాక మరింత ఉపయోగకరమైన చర్చ చేస్తే అన్నీ సాధ్యమే!  

ఆనం బ్రదర్స్ 'సైకిల్' మీద కూర్చోలేకపోతున్నారా?

  రన్నింగ్ బస్ ఎక్కటం వచ్చిన వారు ఏం చేస్తుంటారు? ఎదురుగా ఏ బస్ కనిపిస్తే దాంట్లో అమాంతం ఎక్కేస్తుంటారు. మళ్లీ అందులోంచి దూకి ఇంకో దాంట్లో ఎక్కేస్తుంటారు! రాను రాను రాజకీయ నాయకుల పరిస్థితి కూడా రన్నింగ్ బస్ ఎక్కే ఫుట్ బోర్డ్ బాపతు ప్రయాణికుల్లా తయారవుతోంది! మరీ ముఖ్యంగా, రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాక ఏ నేతని చూసినా అధికారం పక్షం అనే బస్సు వైపే దృష్టి పెడుతున్నారు. పరుగెత్తికెళ్లి రన్నింగ్ బస్ ఎక్కేసినట్టు ఎక్కేస్తున్నారు. ఆనం సోదరులు కూడా ఈ కోవలోకే వస్తారు...   వైఎస్ హయాంలో మొదలు కిరణ్ కుమార్ రెడ్డి వరకూ పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక వెలుగు వెలిగారు ఆనం బ్రదర్స్. సమైక్య రాష్ట్రంలో నెల్లూరు అంటే ఆనం వారిదేనన్న ఫీలింగ్ కలిగింది అందరికీ. అయితే, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ ఆంధ్రాలో కాంగ్రెస్ ను మళ్లీ పుట్టగతులు లేకుండా పూడ్చి పెట్టేసుకుంది. ఆ ఎఫెక్ట్ ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి మీద కూడా పడింది! ఎన్నికల్లో గెలుపు లేక, చేతిలో పదవుల్లేక, ఏం చేయాలన్నా అధికారం లేక... అసలు ఏపీలో తమ కాంగ్రెస్ పార్టీయే లేక ఆనం వారు ఆగమాగం అయిపోయారు. చివరకు, అనేక తర్జనభర్జనల తరువాత టీడీపీలోకి జంప్ కొట్టారు. వీళ్లలా చాలా మందే అధికార పక్షంలోకి వచ్చారు నవ్యాంధ్రలో. కాని, కాంగ్రెస్ లో నెల్లూరు మారాజుల్లా బతికిన ఆనం సోదరులకి టీడీపీలో అడ్జెస్ట్ అవ్వటం కష్టంగానే వుందట! ఎంతగా అంటే, వివేకానంద రెడ్డి కంటతడి పెట్టుకునేంతగా!   అధికారంలో వున్న టీడీపీ పుల్ స్పీడ్ తో పరుగెడుతుంటే రన్నింగ్ బస్ ఎక్కేసిన ఆనం బ్రదర్స్ ఇప్పుడు ఎలాంటి పవర్స్ లేక తల్లడిల్లిపోతున్నారని టాక్. చంద్రబాబు ఆనం వార్ని పార్టీలోకి అయితే తీసుకున్నారుగాని వారికి కీలకమైన బాధ్యతలు అప్పజెప్పిందీ ఏమీ లేదు. చివరకు, వివేకానంద రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆయన గతంలో ఇచ్చిన మాట కూడా నిజమయ్యే పరిస్థితి లేదట. గత ప్రభుత్వాల కాలంలో క్యాబినేట్లో సత్తా చాటిన వారికి ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా అందీ అందక ఊరించటం... నిజంగానే నిస్పృహకు కారణం అవుతుంది. అది అర్థం చేసుకోవచ్చు!   ఎమ్మెల్సీ రానందుకు వివేకానంద రెడ్డి తన వారి వద్ద కంటతడి పెట్టుకున్నా పెట్టుకోకపోయినా... పార్టీలు చకచకా మారిపోయే లీడర్లందరూ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. కొత్త పార్టీలో చేరటం అంత ఈజీ కాదు అక్కడ అప్పటికే వున్న వారితో అడ్జెస్ట్ కావటం!

అక్కడ మినిస్టర్ కంటే టెర్రరిస్ట్ లీడరే పవర్ ఫుల్!

పాకిస్తాన్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వం వుంది. కాకపోతే, అది నేతి బీరకాయలో నేతిలాగా ఉండీ లేనట్టుగానే వుంటుంది! అదే... ఆ దేశానికీ, పక్క దేశాలకీ కూడా అతి పెద్ద ప్రమాదం. మరీ ముఖ్యంగా, భారతదేశానికి. అక్కడ ఉగ్రవాదులు వుంటారనేది పెద్ద ఆశ్చర్యకర విషయమూ, ఆందోళనకర విషయమూ కాదు. ఇండియా నుంచీ అమెరికా దాకా అన్ని దేశాలకూ తెలిసిన సత్యమే. కాని, పాక్ లో ఒక ఉగ్రవాద నాయకుడికి ఎంత బలము, గౌరవము, పట్టు వుంటాయో తాజాగా తెలిసిపోయింది. ఆ దేశంలో వారి రక్షణ మంత్రి కంటే కూడా ఒక కరుడుగట్టిన ఉగ్రవాదికి ఎక్కువ విలువ!     ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్ ఉగ్రవాదానికి ప్రధాన కేంద్రం పాకిస్తాన్. సిరియా, ఇరాక్ లాంటి దేశాలలో ఐసిస్ వికృతమైన హింసకు పాల్పడుతుండవచ్చు. కాని, పాకిస్తాన్ లో జరుగుతున్నంత కుట్ర మాత్రం మరెక్కడా జరగటం లేదు. దేశదేశాల్లో ఉగ్రవాదానికి మూలాలన్నీ పాక్ లో వుంటాయి. ఎందుకంటే,అక్కడ అధికారికంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వమే ఉగ్రవాద నేతలకి దాసోహం అంటుంది. సకల సౌకర్యాలు కల్పించి ప్రపంచాన్ని అస్థిరపరిచే కుట్రలు చేసుకోనిస్తుంది. ఇందుకు ఆల్ ఖైదా అధినేత ఉసామా బిన్ లాడెన్ మరణమే తార్కాణం. ఆ దేశంలో లాడెన్ అమెరికా సేనల చేతిలో హతమయ్యాడు. అయినా అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ పాక్ ఉగ్రవాదం విషయంలో తనకేం తెలియదనే బుకాయిస్తుంటుంది. ఇండియాకి మోస్ట్ వాంటెడ్ అయిన మసూద్ అజర్, దావూద్ లాంటి వార్ని కూడా పాక్ భద్రంగా కాపాడుతూ వుంటుంది. ఇది పబ్లిక్ సీక్రెట్టే...      పాక్ లో ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరుగుతారని తెలిసినప్పటికీ అక్కడ వారికి ఎలాంటి గౌరవ మర్యాదలు దక్కుతాయో తాజాగా తేలిపోయింది. ముంబై నగరంపై దాడులకి స్కెచ్ వేసి వందల మందిని పొట్టన పెట్టుకున్న హఫీజ్ సయీద్ పాకిస్తానీయే. అక్కడ జమాత్ ఉల్ దవా అనే పేరుతో ఒక రాకాసి సంస్థని నడుపుతూ అరాచకం సృష్టిస్తుంటాడు. అయితే, ఈ మధ్యే ట్రంప్ దెబ్బకు గజగజ వణికిన ఇస్లామాబాద్ హఫీజ్ ను హౌజ్ అరెస్ట్ చేసింది. ఉగ్రవాదుల జాబితాలో కూడా చేర్చింది. ఇది అమెరికన్ ప్రెసిడెంట్ ని ప్రసన్నం చేసుకోటానికే. ఇప్పటికే కొన్ని దేశాల పౌరులు అమెరికాలో కాలుపెట్టొద్దన్న ట్రంప్ పాక్ ను కూడా టార్గెట్ చేస్తాడని పాకిస్తాన్ పాలకుల భయం. అందుకే, కనీసం డ్రామా కోసమైన హఫీజ్ ను ఇంట్లోనే బంధించి వుంచారు. కాని, వాళ్ల స్వంత రక్షణ మంత్రే హఫీజ్ ను ఉగ్రవాది అని, ప్రపంచానికి ప్రమాదకరమైన వ్యక్తి అని అంటే తట్టుకోలేకపోయారు.      పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా అసిఫ్ హఫీజ్ సయీద్ సమాజానికి అత్యంత ప్రమాదకరమని వ్యాఖ్యానించాడు. దీన్ని భారతదేశం సహజంగానే స్వాగతించింది. కాని, తమ దేశ రక్షణ మంత్రైనా కరుడుగట్టిన హఫీజ్ సయీద్ ను కించపరచటం పాక్ లోని చాలా మంది తట్టుకోలేకపోయారు. వివిధ పార్టీల నాయకులు నిస్సిగ్గుగా ఆయన మాటల్ని ఖండించారు. హఫీజ్ చాలా గోప్ప మహానుభావుడని కీర్తించారు. దేశ వ్యాప్త నిరసనలు కూడా మొదలు పెట్టారు పాక్ లోని శాంతి కాముకులు! ఇలాంటి బరితెగించిన మద్దతు ఉగ్రవాద నేతలకు అ దేశంలో దొరుకుతుండటం వల్లే రక్త పిశాచాలు అక్కడ హాయిగా తిష్ఠవేశాయి. మొన్నటికి మొన్న మసీదులో బాంబులు పేల్చి స్వంత పాకిస్తానీల్నే వంద మందిని పొట్టన పెట్టుకున్నారు హఫీజ్ లాంటి ఉగ్ర నేతలే. అయినా అక్కడి నాయకులకి బుద్ది రావటం లేదు!

ప్రజాస్వామ్యానికి... చిన్నమ్మ నేర్పిన (గుణ)పాఠాలేంటి?

  తమిళనాడు హై డ్రామాకు తెరపడింది! శశికళ పన్నీర్ సెల్వం చేత రాజీనామా చేయించటంతో మొదలైన రాజకీయ జల్లికట్టు పళని స్వామి బలనిరూపణతో, స్టాలిన్ చిరిగిన చొక్కాతో ముగింపుకొ్చ్చింది. తమిళనాడులో పరిస్థితులు ఇప్పుడప్పుడే చక్కబడే అవకాశం లేకున్నా మిగతా రాష్ట్రాల వారికి మాత్రం బ్రేకింగ్ న్యూస్ ల వరద ఇకపై తగ్గిపోతుంది. పన్నీర్ అమ్మాడీఎంకే, శశికళ తమిళనాడు జైలుకి వచ్చే ప్రయత్నాలు, డీఎంకే జనాందోళనలు.... ఇలా ఇక రొటీన్ గా కథ సాగిపోతుంది. కాని, ఈ మొత్తం వ్యవహారం నిరూపించింది ఏంటి? చాలానే వుంది...   తమిళనాడే కాదు... మన దేశంలో చాలా చోట్ల, చాలా పార్టీలు అన్నాడీఎంకే లాంటి దుస్థితిలోనే వున్నాయి. ఎవరో ఒక సినీ, రాజకీయ హీరో ఓ పార్టీ పెడతాడు. ఆయన మొత్తం దళాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని రాజ్యమేలుతాడు. ప్రజాస్వామ్య పార్టీలైనప్పటికీ వీటిలో ఎలాంటి అంతర్గత ప్రజాస్వామ్యం వుండదు. ఒక వ్యక్తి ఇమేజో, ఒక కుటుంబమో మొత్తమంతా వ్యవహారం నడుపుతుంది. కాశ్మీర్ లోని నేషనల్ కాన్ఫరెన్స్ , పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీలు మొదలు తమిళనాడు డీఎంకే, అన్నాడీఎంకేల వరకూ అన్నీ ఇదే కోవలోకి వస్తాయి. విషాదంగా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కూడా ఒక కుటుంబానికే స్వంత ఆస్తిగా మారిపోయింది. దాని ఫలితమే... విపరీత సంక్షోభాలు. బీజేపి, కమ్యూనిస్ట్ పార్టీల తరహాలో నాయకత్వం లభించకపోవటం ఈ పార్టీల కష్టాలకి, వాట్ని ఆదరించిన రాష్ట్రాల నష్టాలకి కారణం! ఇప్పుడు జయలలిత మరణం తరువాత ఏఐఏడీఎంకే పరిస్థితి లాంటిదే మాయావతి బీఎస్పీ పార్టీకి, మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ కి రాదని గ్యారెంటీ ఏముంది? అయితే, మన తెలుగు రాష్ట్రాల్లోని టీడీపీ, టీఆర్ఎస్, మహారాష్ట్రాలోని శివసేన లాంటి పార్టీలు కొంత బెటర్! ఇలాంటి పార్టీల్లో కొడుకులే తండ్రుల ఆస్తికి వారసులైనట్టు పార్టీలకీ వారసులైపోతున్నారు. కాని, నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది విరుద్ధమే...   తమిళనాడు సంక్షోభం వెనుక కేవలం జయలలిత మరణం, ఆమెకు తగిన వారసులు లేకపోవటం మాత్రమే లేవు. అంతకన్నా లోతైన వ్యవస్థాగత లోపం దాగుంది. అదేంటంటే, మన దేశంలో కులం, మతం, భాషా, ప్రాంతం లాంటి అంశాలు తీసుకున్నంత సీరియస్ గా అవినీతిని జనం పట్టించుకోవటం లేదు! అవినీతి రహిత పాలన , అభివృద్ధి వంటి నినాదాలు అన్ని వేళలా, అన్ని చోట్లా పని చేయటం లేదు. కొన్ని పార్టీలు , కొందరు నేతలు డెవలప్మెంట్ పాలిటిక్స్ చేస్తున్నప్పటికీ చాలా వరకూ కులం, మతం, సెంటిమెంట్ల మ్యాథమెటిక్సే నడుస్తోంది! అందుకే, ఇండియాని మోడిఫై చేస్తానన్న మోదీ కూడా ఎన్నికల బరిలో జై శ్రీరామ్ అనాల్సి వస్తుంటుంది. లేకపోతే రేసులో కులతత్వ, మతతత్వ పార్టీలతో ఓడిపోవాల్సి వస్తుంది. నిజానికి అవినీతి కేసులో ఆర్నెల్లు జైలుకి వెళ్లొచ్చిన అమ్మ తమిళనాడుకి వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి అవ్వటం అంగీకరించాల్సిన విషయం కాదు. అయినా ఆమె పథకాలు, ఛరిష్మా నచ్చి జనం ఓటు వేశారు. పోనీ అలా కాదని జయలలితని అవినీతి విషయంలో శిక్షిద్దామనుకున్నా... 2జీ లాంటి మహాకుంభకోణాల పార్టీ డీఎంకే. వారికి ఓటు వేయటం కంటే అన్నాడీఎంకేనే బెటర్ అని భావించారు తమిళులు! అదే ఇప్పుడు ఇంతటి సంక్షోభానికి దారి తీసింది! జయలలిత వెనుక శశికళ మార్కు మన్నార్ గుడి మాపియా చేతుల్లోకి రాష్ట్రం జారిపోయింది!   పార్టీలు, వాటి గుర్తులు, అవ్వి ఇచ్చే దురుద్దేశపూరితమైన వాగ్ధానాలకు మురిసిపోయి జనం ఓట్లు వేసినంత కాలం తమిళనాడు తరహా రాజకీయ జల్లికట్లు తప్పకపోవచ్చు. ఎందుకంటే, ఎమ్మెల్యే పదవికి పోటీపడుతోన్న అభ్యర్థి అర్హతను కనీసం పట్టించుకోకుండా ఎన్నుకుంటారు మన దేశంలో. అందుకే అవకాశం వచ్చినప్పుడు వారు కూడా రిసార్ట్ సర్కసుల్లో తమ తమ పార్టీలకి, శశికళ లాంటి నేతలకి నిస్సిగ్గుగా విధేయత ప్రదర్శించుకుంటారు! తమని ఎన్నుకున్న జనం చిన్నమ్మ వద్దన్నా... శశికళే ముద్దంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తారు! మార్పు రావాల్సింది మనలో...

యూపీలో... దత్తపుత్రుడి దండయాత్రను ప్రియాంక అడ్డుకోగలదా?

  ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో గెలుపు ఎవరిది? ఈ సంగతి చెప్పటం కష్టమే. ఎందుకంటే, బీజేపి మొదలు బీఎస్పీ దాకా అందరికీ గెలుపు పై ఆశలున్నాయి. అదే సమయంలో అనుమానాలు కూడా వున్నాయి. ఎస్పీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని బరిలోకి దిగినా నమ్మకం మాత్రం కుదరటం లేదు. అయిదేళ్ల సమాజ్ వాది అరాచక పాలన, పదేళ్ల కాంగ్రెస్ మార్కు యూపీఏ అవినీతి పాలన జనం మరిచిపోయే స్థితిలో లేరు! ఇక బీఎస్పీ కూడా మాయవతి తనకు తాను పెట్టుకున్న విగ్రహాల వల్ల జనాగ్రహానికి గురవుతూనే వుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ హవాకీ, మోదీ మ్యాజిక్ కి చావు దెబ్బ తిన్నది ఎవరైనా వుందంటే కేవలం మాయవతే! ఆమెకు ఇంచుమించూ సున్నా వచ్చేసింది ఎంపీ ఎలక్షన్స్ లో! ఇక ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా స్వంత మెజార్టీ అంత సీన్ లేదు అంటున్నారు!   ఉత్తర్ ప్రదేశ్ ను ఒకప్పుడు ఏలిన జాతీయ పార్టీ బీజేపి. అయోధ్య రామ మందిర ఉద్యమంతో అక్కడి జనంలో ఎన్నో ఆశలు రేకెత్తించింది. అంతే స్థాయిలో వారిని నిరాశపరిచింది కూడా. మత కలహాలు మిగిలాయి గాని మందిరం కళ్ల ముందు కనిపించలేదు. పోనీ అభివృద్ది చవి చూసింది లేదు. అందుకే, దశాబ్దాల పాటూ బీజీపికి ఓటు వేయకుండా ఊరుకున్నారు యూపీ వాసులు. కాని, వాళ్లు నమ్ముకున్న ములాయం, మాయవతి కూడా ఒరగబెట్టిందేం లేదు. చివరకు, ఎస్పీ, బీఎస్పీల పాలన అంతకు ముందటి కాంగ్రెస్, బీజేపీల నిర్వాకమే బెటర్ అనిపించేలా చేసింది! అందుకే, ఇప్పుడు అభివృద్ధి నినాదం ఎత్తుకున్న మోదీని యూపీ జనం నమ్ముతున్నారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. వాటిలో నిజం ఏంటో చివరి ఫలితాలు వస్తేనేగాని తెలియదు!   బీజేపి, బీఎస్పీ, ఎస్పీ, కాంగ్రెస్ ల త్రిముఖ పోటీలో విజయం ఎవరిదో తెలియదుగాని కాంగ్రెస్ మాత్రం తన సర్వశక్తులు ఒడ్డుతోంది నమోని నిరోధించటానికి. లక్నోలో కాషాయ ముఖ్యమంత్రి తిష్టవేస్తే ఢిల్లీలో మోదీకి అస్సలు తిరుగుండదని వారికి తెలుసు. అలాగని కాంగ్రెస్ ముఖ్యమంత్రిని యూపీలో తెచ్చుకునే సత్తా కూడా తమకు లేదని గాంధీలకు అర్థమైంది. అందుకే, తనని తాను ప్రధాని స్థాయి నేతగా భావించుకునే రాహుల్ కూడా అఖిలేష్ లాంటి ప్రాంతీయ నాయకుడి దగ్గరకు పోయి ఎన్నికల సభల్లో తిరుగుతున్నాడు. తమది గంగ, యమున సంగమం అంటూ డైలాగ్స్ చెబతున్నాడు. కేవలం వంద సీట్లకు ఒప్పుకుని ఎస్పీతో పొత్తు పెట్టుకుంది కాంగ్రెస్. అంతే కాదు, సోనియా అనారోగ్యం వల్ల ప్రియాంక కూడా ప్రచారంలో ప్రసంగాలు సంధిస్తూ అన్నకి అండగా చెలరేగిపోతోంది. నేరుగా మోదీని టార్గెట్ చేస్తూ ఆయన లాంటి దత్త పుత్రుడు మనకు అవసరం లేదని సెటైర్ వేసింది. గుజరాతీ అయిన నమో తనని యూపీ దత్తత తీసుకుందని కామెంట్ చేశాడు. అందుకే, అలాంటి దత్త పుత్రుడు అఖిలేష్, రాహుల్ లాంటి యూపీ కుర్రాళ్ల ముందు దిగదుడుపేనని ప్రియాంక చెప్పుకొచ్చింది!   ప్రియాంక గాంధీ కామెంట్ పైకి తెలివిగానే కనిపిస్తోన్నా దేశ ప్రధాని కాబట్టి మోదీ అందరివాడే తప్ప యూపీ వారికి కాని వాడేం కాదు. పైగా నరేంద్ర మోదీ దత్తపుత్రుడ్ని అంటూ బంధుత్వం కలిపితే ప్రియాంక ఆ పదానికి అనవసర ప్రాముఖ్యత ఇచ్చి ఆయనకి మేలు చేసినట్టే కనిపిస్తోంది. ఆ మధ్య రాహుల్ యూపీలోనే మోదీని ఖున్ కీ దలాల్ అన్నాడు. ఇప్పుడు దత్తపుత్రుడు అక్కర్లేదని ప్రియాంక అనటమూ అంతే. వారణాసి లాంటి ప్రతిష్ఠాత్మక నియోజకవర్గానికి ఎంపీ,దేశ ప్రధాని అయిన మోదీని వద్దనుకుంటే ఉత్తర్ ప్రదేశ్ కి మేలు చేసేది ఎవరు?   నరేంద్ర మోదీ ఆడవాళ్లను సోదరీ, తల్లి అనటం కూడా తప్పేనంది ప్రియాంక! ఆమె ఉద్దేశం ఏదైనా ఇది కూడా  బెడిసికొట్టే ప్రతి దాడే! భారతదేశంలో ఎవరైనా మగవారు తమని తల్లి అనో, చెల్లి అనో అంటే ఆడవాళ్లు ఉప్పొంగి పోతారు! అటువంటిది ప్రధాని అలా సంబోధిస్తే అందులో తప్పేం కనిపిస్తుంది? ప్రియాంక... మోదీ అలా సంబోధించటం తప్పు అనటం... జనంలోకి మంచి సంకేతాలు ఏం పంపకపోవచ్చు! మోదీని ఎలాగైనా టార్గెట్ చేయాలనే తొందర్లో ప్రియాంక కూడా సోనియా, రాహుల్ లాగే నోరు జారటం... ముందు ముందు ఆలోచించుకోవాల్సిన విషయం! జాగ్రత్తపడాల్సిన అంశం...  

కేసీఆర్... సునామీలా కనిపించే వాటర్ ఫౌంటేన్!

  మనుషులు మూడు రకాలు. కొందరు భయంతో, బద్ధకంతో ఏ పనీ మొదలే పెట్టరు. మరి కొందరు ఉత్సాహంగా ప్రారంభించినా మధ్యలో అడ్డంకులు చూసి బెదిరిపోయి ఆపేస్తారు. ఇక మూడో రకం వారు భూమ్యాకాశాలు ఏకమైనా అనుకున్నది తుద వరకూ చేసి చూపిస్తారు! ఇది ఎప్పుడో ఒక కవి తన పద్యంలో చెప్పిన భావం! తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ సమయంలో కూడా చాలా సార్లు ఈ మాటే చెప్పేవారు. పద్యం కూడా పాడి వినిపించే వారు! ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు సాహిత్యంలో ఆయన ఎంఏ చేశారు. ఆ మాత్రం పాండిత్యం సహజమే!   ప్రత్యేక తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్రపై ఎవరికీ ఎలాంటి సందేహాలు వుండవు. ఆయన లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని అందరూ అంగీకరిస్తారు. తెలంగాణ వారు ఆనందంగా తెలంగాణ ఆయన వల్ల సాధ్యమైందంటే, ఆంధ్రాలో కొందరు ఇప్పటికీ ఆగ్రహంగానే వుంటూ వుంటారు. కాకపోతే, ఏ కోణం నుంచి చూసినా ప్రత్యేక తెలంగాణకు పర్యాయపదం కేసీఆర్! అంతలా తాను పెట్టుకున్న లక్ష్యాన్ని చివరికంటా చేరుకునే వరకూ బరిలో నిలిచి పోరాడిన నేత కేసీఆర్! అందుకే, ఫిబ్రవరీ 17 ఆయన జన్మదినం అంటే యావత్ తెలంగాణలో కోలాహలం కనిపిస్తోంది...   కేసీఆర్ భాష, యాస, భావం, భావజాలం... ఇవన్నీ మనకు నచ్చినా నచ్చకపోయినా ఆయన ఒక కాదనలేని చారిత్రక సత్యం. ఆయన వల్లే తెలుగు ప్రజలు ప్రాంతాల వారీగా విభేదాలకు లోనయ్యారని అనే వారు కొందరైతే... అసలు అంతకు ముందే తెలంగాణ, ఆంధ్రా విభజన సుస్పష్టంగా వుందని చెప్పేవారు కొందరు. అప్పటికే వున్న అభిప్రాయ భేదాల్ని భేదాభిప్రాయాలుగా మార్చి కేసీఆర్ సక్సెస్ అయ్యారు. అది ఆయన రాజకీయ చాతుర్యం. ఒక పొలిటికల్ లీడర్ గా అది తప్పని కూడా అనలేం!   మన దేశంలో చాలా చోట్ల ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు వున్నాయి. వాటన్నిటికీ ప్రధాన నేతలున్నారు. కాని, కేవలం కేసీఆర్ మాత్రమే విజయవంతమయ్యారు. అందుక్కారణం ఆయన ఉద్యమ సమయంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మాత్రమే కారణం కాదు. వాటి వెనుక ఆయన అమలు పరిచిన వ్యూహం వుంది. ఎంతగా వ్యతిరేకత వచ్చినా దాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు కేసీఆర్. ఈ విషయంలో ఆయన మోదీ, ట్రంప్ లాంటి నేతల కోవలోకే వస్తారు. వారికి కూడా విపరీతమైన ప్రతికూలతలు ఎదురయ్యాయి. అయినా కూడా వారు తమపై దాడులన్నీ తమ మద్దతుదారుల అభిమానంగా మార్చుకోగలిగారు. కేసీఆర్ ది కూడా అదే బాట. ఆయనపై ఆంధ్రా పాలకులు, తెలంగాణ ప్రత్యర్థులు, ఆంధ్రా జనం, మీడియా ఇలా ఎన్ని కోణాల్లోంచి దాడి జరిగినా క్రమక్రమంగా తెలంగాణ సామాన్య జనం గుండెల్లోకి చేరుకోగలిగారు. మరీ ముఖ్యంగా, ఆమరణ నిరాహార దీక్ష అంటూ ఆయన పంతం పట్టాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అదంతా ఆయన సక్సెసా... లేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వున్న ఆనాటి కాంగ్రెస్ వారి వైఫల్యమా అంటే... ఏదైనా కావచ్చు! కాని, కేసీఆర్ పట్టుదలగా ఉద్యమించారు. తెలివిగా ఫలితాల్ని తనకు అనుకూలంగా వాడుకోగలిగారు. రాజకీయ నేతగా ఆయన అది చేయటం తప్పు కాదు. చేయకపోతేనే , చేయలేకపోతేనే తప్పు!   కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాక ఇంత సాఫీగా పరిపాలించగలుగుతారని ఎవ్వరూ భావించలేదు. ఇక సమర్థంగా ఏలుతారనైతే ఊహించలేదు. కాని, నిన్న మొన్నటి హైద్రాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కి ఆంధ్రా సెటిలర్ల ఓట్లు సంపాదించటం వరకూ ఆయన ప్రతీ అడుగు అనూహ్యంగా వేశారు. ఉద్యమకారుడిగా చూపిన ఆవేశం పరిపాలకుడిగా చూపటం మానేశారు. అక్కడే విజయాన్ని ఒడిసిపట్టుకోగలిగారు. తెలంగాణ జనానికి ఆయన చేసిన మంచిపై ఎన్ని విమర్శలైనా చేయవచ్చు. కాని, ఆయన ఎక్కడా ఆంధ్రుల మీద కక్ష సాధింపు, కవ్వింపు చర్యలకి తావు ఇవ్వలేదు. అక్కడే ఆయన అందరికీ ఆమోదయోగ్యమైన వాడిగా మారిపోయారు! సోషల్ మీడియాలో కొందరు ఆంధ్రులు తమకూ ఇలాంటి ముఖ్యమంత్రి వుంటే బావుండునని అనేదాకా పరిస్థితి వచ్చిందంటే కేసీఆర్ చాకచాక్యం, చాణక్యం అర్థం చేసుకోవచ్చు!   చివరగా ఒక్క మాటలో చెప్పాలంటే, ఇవాళ్ల జన్మదినం జరుపుకుంటోన్న తెలంగాణ రథ సారథి ... '' సునామీలా ఎప్పుడు ఉప్పొంగాలో బాగా తెలిసిన అద్బుతమైన వాటర్ ఫౌంటేన్! '' మెచ్చుకునే వారే కాదు... తిట్టేవారు కూడా పట్టించుకోకుండా వుండలేని ఆశ్చర్యకర రాజకీయం!

పెళ్లి ఖర్చులకు అడ్డుకట్ట పడనుందా!

  ఉత్తరాదిలో ఓ సామెత ఉంది- ‘పెళ్లనేది ఓ లడ్డూలాంటిది! దానిని తిననివారేమో ఎప్పుడెప్పుడు తిందామా అని మధనపడుతూ ఉంటారు. తిన్నవారేమో ఎందుకు తిన్నామురా బాబూ అని పశ్చాత్తాపపడుతూ ఉంటారు’. పెళ్లి చేసుకున్నవారి సంగతేమో కానీ ఆడపిల్లల తల్లిదండ్రుల పరిస్థితి మాత్రం ఇప్పుడు ఇలానే ఉంది. వయసు వచ్చిన ఆడపిల్లకి పెళ్లిచేయాలనే కంగారు ఎలాగూ ఉంటుంది. తీరా సంబంధం కుదిరిన తరువాత ఆ పెళ్లిని ధూంధాంగా చేసేందుకు తలప్రాణం తోకలోకి వస్తోంది.   ఆడపిల్లలు చదువుకోవడం, వారు కూడా సంపాదించడం, మగపిల్లలతో పోలిస్తే ఆడపిల్లల నిష్పత్తి తగ్గిపోవడంతో... వరకట్నపు సమస్య కొంతవరకు తగ్గినట్లు కనిపిస్తోంది. కానీ వివాహపు ఖర్చులు మాత్రం అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గార్డెన్స్లో పెళ్లి, చాట్తో సహా అన్ని రకాల వంటకాలు, డిజిటల్ ఫొటోగ్రఫీ, మండపం సెట్టింగులూ... అబ్బో ఈ జాబితా చాలా పెద్దగానే కనిపిస్తోంది. ఇవి కాకుండా సంగీత్, బారాత్, డీజే సంగీతం, వెడ్డింగ్ కేక్... అంటూ వివాహాన్ని వీలైనంత ఆడంబరంగా మార్చివేసేందుకు మనవి కాని అలవాట్లను కూడా చే(నే)ర్చుకుంటున్నారు.   కట్నం వద్దనే పెద్దమనుషులు కూడా ఇప్పుడు ‘పెళ్లి ఏర్పాట్లలో ఏమాత్రం లోటు లేకుండా చూడండి. అది చాలు!’ అని సింపుల్గా చెప్పేస్తున్నారు. కానీ ఆ ఒక్క కోరికనూ తీర్చేందుకు మధ్యతరగతి తండ్రులు నలిగిపోతున్నారు. మంచి సంబంధం దొరికింది కదా, పెళ్లి ఘనంగా చేసేద్దాం అనే తపనలో చేసే అప్పులతో వారి జీవితాలు వెల్లమారిపోతున్నాయి. ఆ ఒక్క రాత్రి ‘ఫలానా సుబ్బారావు తన కూతురి పెళ్లి బాగా చేశాడు,’ అనిపించుకునేందుకు వారి జీవితాన్నే పణంగా పెడుతున్నారు. ఇక ఈ పెళ్లిల్ల సందర్భంగా వందలమందికి సరిపోయే ఆహారాన్ని వృధా చేస్తున్నారన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి.   ఈ తతంగమంతా ఇప్పుడు ఎందుకు గుర్తుకు తెచ్చుకుంటున్నాం అంటే.... బీహారుకి చెందిన రంజీత్ రంజన్ అనే ఎంపీ పెళ్లి ఖర్చులను నియంత్రించేందుకు "The Marriages (Compulsory Registration and Prevention of Wasteful Expenditure) Bill, 2016," అనే ప్రైవేటు బిల్లుని తేవడానికి ప్రయత్నిస్తున్నారు. పెళ్లికి విచ్చేసే అతిథుల సంఖ్యకీ, వారికి అందించే భోజన పదార్థాల సంఖ్యకీ ఓ పరిమితి విధించాలని రంజీత్ తన బిల్లులో కోరుతున్నారు. పెళ్లి ఖర్చు మీద కఠినమైన నియంత్రణ ఉండేలా కూడా ఈ బిల్లుని రూపొందించారు. పెళ్లి ఖర్చులు 5 లక్షలకు మించితే, అందులో పదిశాతం రాష్ట్ర సంక్షేమశాఖకు పన్నుగా కట్టాలని పేర్కొన్నారు. అలా పోగైన మొత్తంతో ప్రభుత్వం నిరుపేదల వివాహాలను జరిపించాలని సూచిస్తున్నారు. ఇక పెళ్లి జరిగిన రెండునెలలలో సదరు వివాహాన్ని రిజిస్టర్ చేయించి తీరాలన్న నిబంధన కూడా ఈ బిల్లులో పొందుపరిచారు. రంజీత్ భర్త పప్పు యాదవ్ అంటే బీహార్ వాసులకు అంత సదభిప్రాయం లేదు. కానీ రంజీత్ చేసిన ఈ పనికి మాత్రం దేశమంతటా హర్షిస్తోంది.   రంజీత్ రంజన్ బిల్లు ఇప్పటికే రాష్ట్రపతి ఆమోదం పొందింది. ఇక దీనిని పార్లమెంటు ఆమోదించడమే తరువాయి. ఒకవేళ ఈ బిల్లు కనుక సాకారం అయితే పెళ్లి ఖర్చుల మీద నియంత్రణ ఏర్పడి తీరుతుందని ఆశిస్తున్నారు. ‘ఆరుగురు అక్కచెల్లెళ్లు ఉన్న కుటుంబం నుంచి వచ్చిన మనిషిగా నాకు ఆడపిల్ల పెళ్లి ఎంత ఒత్తిడితో కూడుకున్నదో నాకు తెలుసు. ప్రతిష్ట కోసం పోటీ పడి మరీ చేసే మన భారతీయ పెళ్లిళ్లలో ఉన్న ఆడంబరాన్ని గమనించబట్టే ఈ బిల్లుని తీసుకువస్తున్నాను,’ అంటున్నారు రంజీత్. రంజీత్ మాటల్లో వాస్తవం లేకపోలేదు. ఆమె తెస్తున్న బిల్లులో సదుద్దేశమూ లేకపోలేదు. కానీ దీనిని పార్లమెంటు ఏమేరకు ఆమోదిస్తుందో చూడాలి. ఎందుకంటే ఆడంబరంగా పెళ్లి చేయడంలో మన రాజకీయ నేతలకు సాటి ఎవ్వరూ రారు. జయలలిత దగ్గర నుంచీ నితిన్ గడ్కరీ వరకూ తమ ఇంట్లో పెళ్లి చేసేందుకు చూపిన ఆడంబరంతో దేశం యావత్తూ లెక్కలేనన్ని సార్లు ముక్కున వేలేసుకుంది.   ఇక రాజకీయ నేతలతో కుమ్మక్కయిన వ్యాపారస్తుల సంగతీ చెప్పనక్కర్లేదు. పెద్ద నోట్ల రద్దుతో దేశం మొత్తం ఏటీఎంల దగ్గర నిలబడితే గాలి జనార్ధనరెడ్డివారింట జరిగిన పెళ్లే ఇందుకు ఉదాహరణ. మరి ఇలాంటి ఆడంబరాలకు అడ్డుకట్ట పడుతుందా! కడుపు మాడ్చుకుని పైసా పైసా సంపాదించిన వారి నుంచీ, కడుపులు కొట్టి పైశాచికంగా బలపడినవారి వరకూ తమ సొమ్ములను పెళ్లిల మీద పారేసుకోకుండా ఉంటారా! వేచి చూడండి!!!  

పీఎస్ఎల్వీసీ-37 ఉపగ్రహాల ఉపయోగాలు...

  అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకూ రష్యా గతంలో 2014లో ఒకేసారి 37 ఉపగ్రహాలను ప్రయోగించి రికార్డ్ సాధించగా.. ఇప్పుడు ఇస్రో దానిని తలదన్నే ప్రయోగాన్ని చేసి చరిత్ర సృష్టించింది. ఒకేసారి 104 ఉపగ్రహాలను  పీఎస్ఎల్వీసీ-37 ద్వారా నింగిలోకి ప్రవేశపెట్టారు.   ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాలివి: మొత్తం 104 ఉపగ్రహాల్లో 101 విదేశాలకు చెందినవి కాగా మూడు ఉపగ్రహాలు భారత్‌కు చెందినవి. భారత్ ఉపగ్రహాల్లో 714 కిలోల బరువు గల కార్టోశాట్ - 2, ఒక్కొక్కటి 15 కిలోల బరువు గల ఐఎన్‌ఎస్ - 1ఏ, ఐఎన్‌ఎస్ - 1బీ నానో ఉపగ్రహాలు ఉన్నాయి. ఇక అమెరికాకు చెందిన 96 (ఇందులో డవు ఉపగ్రహాలు 88, లెమర్‌ ఉపగ్రహాలు 8). ఇజ్రాయెల్, కజకిస్థాన్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఒక్కో నానో ఉపగ్రహం ఉన్నాయి. మొత్తం నానో ఉపగ్రహాల బరువు 664 కిలోలు.   భారత్ ఉపగ్రహాల ఉపయోగం.....   భూ ఉపరితల పరిస్థితుల అధ్యయనానికి కార్టోశాట్ - 2 ఉపయోగపడుతుంది. కార్టోశాట్ - 2 ఉపగ్రహం భూ ఉపరితలం పరిస్థితులను అధ్యయనం చేస్తుంది. ఇది కోస్తా తీరం వెంబడి వినియోగానికి అనువైన భూమి, నియంత్రణతోపాటు రోడ్ నెట్‌వర్క్ పర్యవేక్షణ, జలాల పంపిణీ తదితర అంశాలపై అధ్యయనం చేస్తుంది. ముఖ్యంగా అందులో అమర్చిన ఫ్రాంక్రోమాటిక్‌ మల్టీ స్ప్రెక్ట్రల్‌ కెమెరా భూమిని పరిశోధిస్తూ అత్యంత నాణ్యమైన చాయాచిత్రాలను అందిస్తుంది. పట్టణ, గ్రామీణాభివృద్ధి, తీర ప్రాంతపు భూములు, మ్యాప్‌లు తయారు చేయడం, వ్యవసాయ సంబంధితమైన సమాచారం, సాగునీటి పంపిణీ, రోడ్లు గురించిన సమాచారాన్ని క్షుణ్ణంగా అందిస్తుంది. ఈ ఉప గ్రహ చిత్రాలు ఆధారంగా పట్టణాభివృద్దిని చేసుకోవడానికి వీలుకలుగుతుంది. భూమి మీద జరిగే మార్పులను ఎప్పటికప్పుడు ఛాయా చిత్రాలు తీసి పంపుతుంది. దీని జీవిత కాలం ఐదేండ్లు.   నానో ఉపగ్రహాల ప్రయోగ లక్ష్యం   ప్రధాన ఉపగ్రహం కార్టోశాట్ - 2 కు అనుబంధంగా సేవలందించేందుకు వీలుగా ఇస్రో.. ఐఎన్‌ఎస్ - 1ఏ, ఐఎన్‌ఎస్ - 1బీ ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నది. అహ్మదాబాద్‌లోని స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ వారు ఈ రెండు చిన్న తరహా ఉపగ్రహాలను తయారు చేశారు. ఇస్రో పేలోడ్స్ టెక్నాలజీ ప్రదర్శనకు గల అవకాశాలు సృష్టించడంతోపాటు డిమాండ్ మేరకు ఉపగ్రహాల ప్రయోగానికి అవకాశాలు కల్పించడమే ఇస్రో నానో ఉపగ్రహాల (ఐఎన్‌ఎస్) ప్రాథమిక లక్ష్యం. పేలోడ్స్‌గా సర్ఫేస్ బై డైరెక్షనల్ రిఫ్లెక్టెన్స్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ రేడియో మీటర్‌ను ఐఎన్‌ఎస్ 1ఏ.. ఎర్త్ ఎక్సోస్పియర్ లైమా అల్ఫా అనలైజర్‌ను ఐఎన్‌ఎస్ - 1 బీ తీసుకెళ్తాయి.   ఇది కూడా రిమోట్‌ సెన్సింగ్‌ శాటిలైట్‌ కావడం విశేషం. ఈ పేలోడ్‌తో భూమిమీద పడే సూర్య ప్రతాపాన్ని తెలియజేస్తుంది. భూమి మీద రేడియేషన్‌ ఎనర్జీని మధింపు చేస్తుంది. ఇది కేవలం ఆరు నెలలు మాత్రమే పనిచేస్తుంది.   అమెరికా ఉపగ్రహాల ఉపయోగం   ఈ ప్రయోగం ద్వారా అమెరికాకు చెందిన 96 ఉపగ్రహాలు క్షక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ 96 లో డవు ఉపగ్రహాలు 88, లెమర్‌ ఉపగ్రహాలు 8 ఉన్నాయి. డౌవ్‌ ఫ్లోక్‌–3పీ శాటిలైట్స్‌లో 88 చిన్న తరహా ఉపగ్రహాలుంటాయి. ఇవన్నీ ఒక బాక్స్‌లో అమర్చి ఉంచారు. ఈ బాక్స్‌ స్పేస్‌లోకి వెళ్లగానే అమెరికా అంతరిక్ష సంస్థ భూకేంద్రం వారు దీన్ని గ్రౌండ్‌ స్టేషన్‌ నుంచి ఓపెన్‌ చేయడంతో అందులో వున్న 88 ఉపగ్రహాలు స్పేస్‌లోకి వస్తాయి. వీటి ద్వారా వాణిజ్యపరమైన, వాతావరణ సంబంధమైన సమాచారాన్ని ప్రతి రోజు తెలియజేస్తాయి.   ఇక లీమూర్‌ ఉపగ్రహాల వ్యవస్థలో మొత్తం 8 ఉపగ్రహాలుంటాయి. వీటిని కూడా ఓపెన్‌ చేసిన తరువాత పనిచేయడం ప్రారంభిస్తాయి. ఇవి కూడా భూమికి సంబంధించిన సమాచారాన్నే అందిస్తాయి.     విదేశీ ఉపగ్రహాల ఉపయోగం..   ఇజ్రాయెల్, కజకిస్థాన్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఒక్కో నానో ఉపగ్రహం కూడా ఈ ప్రయోగం ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. నెదర్లాండ్‌కు చెందిన 3 కేజీల బరువైన  పీయాస్, స్విట్జర్లాండ్‌కు చెందిన 4.2 కేజీల డిడో–2, ఇజ్రాయెల్‌కు చెందిన 4.3 బీజీయూ శాట్, కజికిస్తాన్‌కు చెందిన 1.7 కేజీల ఆల్‌–ఫరాబి–1, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన 1.1 కేజీల బరువు కలిగిన నాయిప్‌ అనే ఉపగ్రహాలు కూడా టెక్నాలజీ డిమానుస్ట్రేషన్‌కు ఉపయోగించారు. చిన్న చిన్న అప్లికేషన్స్‌ తయారు చేసేందుకు ఈ చిన్న తరహా ఉపగ్రహాలను వినియోగించారు.