ఉప్పీ వీళ్లు గుర్తున్నారా..?

సినిమాల్లో అవకాశాలు రాకపోకడమో.. వయసు మీద పడటమో.. కారణం ఏదైనా కానీ సినీతారల అంతిమ మజిలీ రాజకీయాలు అని ప్రస్తుతం రుజువవుతోంది. అప్పట్లో ఎన్టీఆర్, ఎమ్జీఆర్‌లు రాజకీయ బాట నడిచారంటే అది ఒక చారిత్రక అవసరం.. కానీ నేడు రాజకీయాల్లోకి వస్తున్న వారికి.. రావాలనుకుంటున్న వారికి స్పష్టమైన కారణం అంటూ ఏది ఉండటం లేదు. సరే ఆ సంగతి పక్కనబెడదాం.. తమిళ తలైవా, సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లో రావాలనుకుంటున్నారని ప్రకటించడం ఆ రాష్ట్ర రాజకీయ వర్గాలను ఒక కుదుపు కుదిపింది.   దానికి తోడు వరుసపెట్టి అభిమాన సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు.. సరిగ్గా ఇదే సమయంలో రజినీ సమాకాలీకుడు మరో సూపర్‌స్టార్ కమల్ హాసన్ కూడా తాను పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించడంతో తమిళనాట ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అయితే ఇద్దరి రాజకీయ అరంగేట్రం గురించి వార్తలు వస్తున్నాయి తప్ప పార్టీ ప్రకటించబోతున్నట్లు గానీ.. ప్రస్తుతమున్న ఏదో ఒక రాజకీయ పార్టీకి మద్ధతు ఇస్తున్నట్లు గానీ చెప్పిన దాఖలాలు మాత్రం లేవు. అయితే ఈ విషయంలో రజనీకాంత్‌తో పోలిస్తే లోక నాయకుడు కాస్తలో కాస్త బెటర్. వీరిద్దరిలానే తాను కూడా రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించాడు కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర. నటనతో పాటు.. తన సినిమాల ద్వారా సమాజంలోని కుళ్లునీ.. సమస్యలను ఎత్తిచూపుతూ కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈయనకు ఒక్క కర్ణాటకలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.   మరి అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తున్నాడంటే సహజంగానే భారీ అంచనాలుంటాయి. ఇందుకు తగినట్లుగానే సోషల్ మీడియా వేదికగా జనాన్ని తనవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు ఉప్పీ దాదా. ముందుగా చెప్పినట్లుగానే ఇవాళ బెంగళూరులో తన పార్టీని ప్రకటించాడు. తాను జన నాయకుడిని.. జన సేవకుడిని కాదని.. జన కార్మికుడిననే అర్థం వచ్చేలా ఖాకీ చొక్కా వేసుకొచ్చిన ఆయన పార్టీ పేరుగా కర్ణాటక ప్రజ్ఞావంత జనతాపక్ష పార్టీ అని నామకరణం చేశారు. అందరికీ విద్య, ఆరోగ్య భీమా, మౌళిక సదుపాయాలు, చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం తదితరాలు పార్టీ ఎజెండాలోని ముఖ్యాంశాలు. ఇది తన పార్టీ కాదని.. ప్రజల పార్టీ అని తెలిపారు. ప్రజల కోసం తాను ఒక వేదికను మాత్రమే సిద్ధం చేశానని.. తన లక్ష్యాలు నచ్చిన వారంతా దీనిలో భాగస్వాములు కావొచ్చని చెప్పారు.   కానీ ఉపేంద్ర ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాల్లోకి వచ్చిన సినీనటులు అందరూ సక్సెస్ కాలేదన్నది వాస్తవం. చిరంజీవి అట్టహాసంగా ప్రజారాజ్యం పార్టీని స్థాపించి.. సరిగా నడపలేక పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశారు. ఆ తర్వాత అంతటి ప్రజాదరణ ఉన్న పవన్‌కళ్యాణ్‌ జనసేన పార్టీని స్థాపించారు. ఎప్పుడో మూడేళ్ల క్రితం ఏర్పడిన ఈ పార్టీకి సిద్ధాంతాలు ఏంటో పవన్‌ కళ్యాణ్‌కి తప్ప మరేవ్వరికీ తెలియవు.. ఇంతవరకు వ్యవస్థాగత నిర్మాణం గానీ జరగలేదు.. అలాగే తమిళనాట కెప్టెన్ విజయ్‌కాంత్ పార్టీ ఏమైందో అందరికీ తెలిసిందే. కాబట్టి వీటిని గుణపాఠాలుగా తీసుకొని.. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పార్టీని నడిపిస్తే ఏనాటికైనా విజయం తథ్యం.. అలా కాకుండా సమస్యలకు లొంగిపోతే.. అసలుకే మోసం వస్తుంది. సో బీ కేర్ ఫుల్.. అండ్ ఆల్‌ ది బెస్ట్.

ఈ మౌనం ఎందుకో..?

దాదాపు పది రోజుల ఉత్కంఠకు తెరపడింది.. విమర్శకుల ప్రశ్నలకు జవాబు దొరికింది.. అందరికి షాకిస్తూ తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేశారు. అయితే ఏ నేతైనా పార్టీని వదిలి వెళ్లిన తర్వాత సదరు పార్టీలోని చోటా, మొటా నేతలంతా వెళ్లిపోయిన నేతపై మూకుమ్మడిగా ఎటాక్ చేస్తారు. వరుస ప్రెస్ మీట్లు, ఎక్కడ మైక్ దొరికితే అక్కడ పూనకం వచ్చినట్లు ఊగిపోతూ విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుంటారు. మరి అలాంటిది పార్టీ నుంచి వెళ్లిపోయింది గాక వెళుతూ.. యనమల రామకృష్ణుడు, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ వంటి వారు తెలంగాణ ముఖ్యమంత్రితో సన్నిహితంగా మెలుగుతూ ఆయన్నుంచి వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు పొందుతున్నారంటూ.. వెళుతూ, వెళుతూ సొంతవాళ్లని టార్గెట్ చేసి సంచలన విమర్శలు చేశారు.   అయితే ఏపీ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ ఆ వ్యాఖ్యలను ఒక్కరంటే ఒక్కరు కూడా తిప్పికొట్టడానికి ముందుకు వస్తే ఒట్టు. కానీ రెండు, మూడు రోజుల తర్వాత పయ్యావుల మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతున్న వేళ.. మీ స్నేహితుడైన రేవంత్ రెడ్డిగారు మీరు కేసీఆర్‌తో స్నేహంగా మెలిగి వేలకోట్ల రూపాయల కాంట్రాక్టులు పొందారట కదా అని ఓ విలేఖరి అడగ్గా.. అందుకు సమాధానంగా కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ కవితతో రేవంత్‌కు వ్యాపార సంబంధాలున్నాయని ఆరోపించారు. అయితే రాజీనామా తర్వాత రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి ఆరోపణలు చేస్తారని అందరూ.. భావించగా ఆశ్చర్యకరంగా ఒక్కరు కూడా కిక్కురుమనడం లేదు.   తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న ఈ వ్యూహాత్మక మౌనం వెనుక అసలు కారణం ఏమిటో అర్థం కాక రాజకీయ విశ్లేషకులు జుట్టు పీక్కుంటున్నారు. అయితే పార్టీ అధినేతతో పాటు టీడీపీని తీవ్ర ఇబ్బందులు పెట్టిన ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ప్రమేయం బాగా ఉండటం వల్లే పచ్చ నేతలు సైలెంట్ అయ్యారంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. రేవంత్‌ను ఏమన్నా అంటే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉండటంతో కాస్తంత మెతకగానే ఉండాలని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్లు పొలిటికల్ టాక్.   అందువల్లే రేవంత్‌ను విమర్శించేందుకు ఏ ఒక్క నేత ముందుకు రావడం లేదని అంటూ ఇతర పార్టీల నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. శనివారం నాడు చంద్రబాబుతో భేటీ అయిన టీటీడీపీ నేతలు ఆ సమావేశం తర్వాత బయటకి వస్తూ రేవంత్‌ను విమర్శించే ఉద్దేశం తమకు లేదని మీడియాకు సెలవిచ్చారు. పైగా రేవంత్ లాంటి ఫైర్ బ్రాండ్‌ను కోల్పోవడం పార్టీకి తీరని నష్టమే అన్నారు. మొత్తానికి సైకిల్ నేతలు రేవంత్‌పై తమ ప్రతాపం చూపకుండా ఎన్ని రోజలు మౌనంగా ఉంటారో వేచి చూద్దాం.

ఇకనైనా ఆపండి ప్లీజ్!

ఎన్టీయార్ బయోపిక్స్ అంటూ.. జరుగుతున్న పరిణామాలు నిజంగా బాధాకరం. నిజమైన అన్నగారి అభిమానులను ఈ పరిణామాలు వేదనకు గురి చేస్తున్న మాట నిజం. కారణజన్మునిగా జనం చేత జేజేలు అందుకున్న మహానుభావుడు జీవితం కొందరు స్వార్థపరులకు ఆట వస్తువుగా మారడం శోచనీయం.    ఏ నక్షత్రంలో జన్మించాడో కానీ.. పుట్టినప్పటి నుంచి ఎన్టీయార్ చేతిని ఆ భగవంతుడు విడచిపెట్టలేదు. తనతోటే ఆయన్ను నడిపించాడు. తనంతవాడ్ని చేసి... చివరి రోజుల్లో చేయి వదిలేశాడు. అక్కడ్నుంచి ఆయన జీవితం విషాదకరమే. ఇవి అందరికీ తెలిసిన నిజాలే. ఆమాటకొస్తే.. నేటితరానికి కూడా తెలుసు. ప్రత్యేకించి మళ్లీ చర్చించాల్సిన అవసరం లేదు. నిజానికి ఆ వ్యవహారం పూర్తిగా తెలిసిన మనుషులు ఇద్దరు. వారే చంద్రబాబు, లక్ష్మీపార్వతి. నిజానికి వాళ్లు కూడా నిజాలను నిర్భయంగా చెప్పలేని పరిస్థితి. అలాంటప్పుడు సినిమాలు తీసి ఉపయోగం ఏంటి? ఎన్టీయార్ ఆత్మను క్షోభింపజేయడం తప్ప.    కర్ణుడికి మరణానికి ఎన్నో కారణాలు. ఎన్టీయార్ విషయంలో కూడా అంతే. కొందరి స్వార్థానికి ఆయన బలైపోయారు. అలాగే... ఆయన స్వయంకృతాపరాధాలు కూడా కొన్ని ఉన్నాయ్. అవి కూడా ఆయన్ను బలితీసుకున్నాయ్. సో.. వాటిని మళ్లీ తెలుసుకున్నంతమాత్రాన ఎవరికీ ఒరిగేది లేదు. చివరకు ఈ వ్యవహారాలను కూడా అడ్డుపెట్టుకొని బావుకుందాం అని చూడడం.. నీచమైన చర్యే. క్షమించకూడని చర్య.    బాలకృష్ణ తన తండ్రి కథను సినిమాగా తీయాలనుకున్నాడు. నిజానికి ఎన్టీయార్ లాంటి మహనీయుని జీవితం నేటి తరానికి ఆదర్శం. దాన్ని సినిమాగా తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే... సమాజానికి కావాల్సింది అన్నగారి పోరాటం మాత్రమే. నిమ్మకూరులో ఓ సాధారణ కుటుంబంలో పుట్టిన ఓ కుర్రాడు... ఇంతింతై వటుడింతై అన్న చందాన... మహాశక్తిగా ఎదగడం.. తెలుగు సినిమాను 35 ఏళ్లపాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలడం.. ఎదురులేని సూపర్ స్టార్గ్ గా నిలవడం.. నటనకు కొత్త భాష్యం చెప్పడం. తెలుగు ప్రజలందరూ తమ తల్లిదండ్రుల తర్వాత అంతగా ఆరాధించే వ్యక్తిగా ఎదగడం.. ఇది నేటి తరానికి తెలియాల్సింది. 9 నెలల్లో పార్టీ పెట్టి.. ఏ విధంగా దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీని మట్టి కరిపించాడో నేటి తరానికి తెలియాలి. మదరాసీలు అని పిలవబడుతున్న తెలుగువాళ్లకు ఏ విధంగా ఓ గుర్తింపునిచ్చాడో తెలియాలి. ఇవి ఎన్టీయార్ బయోపిక్ ద్వారా నేటి సమాజానికి తెలియాల్సింది. అంతేకానీ... చివరి రోజుల్లో ఆయన ఎదుర్కొన్న పరిణామాలు నేటి సమాజానికి అనవసరం.   నిజానికి రామ్ గోపాల్ వర్మ.. ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ ప్రకటించిన వెంటనే... లక్ష్మీపార్వతి దాన్ని ఖండించి ఉండాల్సింది. కానీ.. ఆమె సపోర్ట్ చేసింది. తన భర్త చివరి రోజుల్లో జరిగింది అందరికీ తెలియాలి... అని మీడియా సాక్షిగా అంది. ఇప్పుడు ఆమె కథనే సినిమాగా తీయడానికి కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి సిద్ధపడేసరికి... ‘ఇది అన్యాయం..’ అంటూ ఎన్టీయార్ ఘాట్ వద్ద నిరసనకు దిగింది. తీస్తే తీవ్ర పరిణామాలుంటాయ్ అని హెచ్చరించించింది కూడా. అంటే.. నీళ్లు తన కిందకొస్తే కానీ... అర్థం కాకపోతే ఎలా?    ‘భారతరత్న’ అందుకోదగ్గ మహనీయుడు ఎన్టీయార్. తెలుగువారి అద్భుత జ్ఙాపకం ఆయన. ఎన్టీయార్ అంటే... తెలుగోడి ఆస్తి.  భౌతికంగా మనకు దూరమైన ఆ గొప్పవ్యక్తిని బయోపిక్ ల పేరుతో మళ్లీ మళ్లీ చంపడం నిజంగా దారుణం. ఈ దురాదగతాలకు ఇకనైనా స్వస్తి పలకండి.. ప్లీజ్.     మళ్లీ మళ్లీ చెబుతున్నాను... పూజనీయుల జీవితాల్లో కూడా చిన్న చిన్న లోపాలు సహజం. వారి గొప్పతనం భావితరాలకు కావాలి తప్ప..  వారి లోపాలు అనవసరం. వారి జీవితాలపై రంధ్రాణ్వేషణ చేస్తే... రంధ్రాలే మనకు మిగులుతాయ్. వారి గొప్పతనాన్ని ప్రభోదిస్తే.. అది భావితరాలకు ఆదర్శం అవుతుంది. ఇకనైనా.. ఈ బయోపిక్ ల రచ్చ ఆపండి! please

అన్నగారి బయోపిక్... అంగట్లో బఠాణీనా..!

  ఆరడుగుల ఆజానుబాహువుడు.. ఏ పాత్ర వేసినా సరే ఆ పాత్రకే అసూయపుట్టేలా నటించగలిగిన నటుడు.. తెలుగుప్రజలు అన్నగారు అని పిలుచుకునే ఒకే ఒక వ్యక్తి నందమూరి తారకరామారావు.  అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించడమేగాక, రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా,ఆరాధ్య దైవంగా నిలచిపోయాడు. నిజం చెప్పాలంటే రాముడు పాత్ర కానీ, కృష్ణుడు పాత్ర కానీ వేస్తే నిజంగా వాళ్లు ఇలానే ఉంటారేమో అన్నట్టు ఉండేవాడు. పౌరాణిక పాత్రలకు ప్రాణం పోసినవాడు. తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. అందుకే విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా బిరుదను సొంత చేసుకున్నాడు. ఇక సినిమాలకు దూరమైన తరువాత రాజకీయాల్లో కూడా తన చక్రం తిప్పాడు. మరి అలాంటి వ్యక్తి బయోపిక్ తీయాలంటే మామూలు విషయమా. చాలా కష్టమైన పనే. కానీ మన దర్శక, నిర్మాతలు మాత్రం అదేదో రెగ్యులర్ మూవీ అన్నట్టు ఎన్టీఆర్ బయోపిక్ మేం తీస్తున్నాం అంటే మే తీస్తున్నామని పోటీ పడుతున్నారు.   ఈ వరుసలో ముందున్న పేరు ఎవరిదంటే వివాదాల వర్మ రామ్ గోపాల్ వర్మే. తాను ఎన్టీఆర్ బయోపిక్ ను తీస్తున్నానని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలసిందే. దానికి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అని కూడా పేరు ఫిక్స్ చేసేశాడు. అయితే సినిమా షూటింగ్ సంగతి ఏమో తెలియదు కానీ.. సినిమా ప్రారంభించకముందే జరగాల్సిన రచ్చ మొత్తం జరుగుతుంది. ఇప్పటికే టీడీపీ వర్సెస్ వర్మ అన్నట్టు తయారైంది పరిస్థితి. వర్మ కంటే ముందే.. నందమూరి బాలకృష్ణ నిర్మాతగా , దర్శకుడు తేజ మరో చిత్రానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో వ్యక్తి తాను కూడా ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నానని ప్రకటించేశాడు. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తాను కూడా ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తీయనున్నట్టు ప్రకటించారు. అంతేకాదు... తన చిత్రంలో సీనియర్ నటి వాణీ విశ్వనాథ్ ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తుందని.. ఈ సినిమా నిర్మాణ బాధ్యతల్లో వాణి విశ్వనాథ్ కూడా భాగస్వామ్యమైనట్టు తెలిపారు.   మరి ఓ గొప్ప వ్యక్తి జీవిత చరిత్రను తీయాలంటే చాలా గట్స్ ఉండాలి. ఎవరిని నొప్పించకూడదు.. పర్ ఫెక్ట్ స్ర్కిప్ట్.. ఇన్ఫర్మేషన్ ఉండాలి.. కాస్త అటూ ఇటూ తేడా ఏమన్న జరిగిందంటే పరిస్థితి మామూలుగా ఉండదు.. అలాంటిది.. ఒకరి తరువాత ఒకరు చాలా సింపుల్ గా ఎన్టీఆర్ బయోపిక్ కు తీస్తున్నామని ప్రకటించేసుకుంటున్నారు. చూద్దాం ఇంకెంతమంది అన్నగారి జీవిత చరిత్రను తీస్తామని ముందుకొస్తారో..!

పెళ్లి తెచ్చిన తిప్పలు..

ఎక్కడైనా సరే.. ఎప్పుడైనా సరే శుభకార్యాలకు వెళ్లినప్పుడు మనుషులకు కొత్త బంధుత్వాలు, పరిచయాలు ఏర్పడతాయని.. మనసుల మధ్య దూరం తగ్గుతుందని మన పెద్దలు అంటూ ఉంటారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఒక పెళ్లి.. ఒక పార్టీకి.. ఒక స్ట్రాంగ్‌ లీడర్‌ దూరమయ్యే పరిస్థితి వచ్చింది. ప్రత్యర్థులను తిట్టినట్లుగానే సొంతవాళ్లని తిట్టేలా చేసింది. ఆ పెళ్లి ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్‌ది.. ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ.. ఆ బలమైన నాయకుడు రేవంత్ రెడ్డి. పరిటాల శ్రీరామ్ పెళ్లి టీడీపీకి, రేవంత్‌కు రెడ్డి మధ్య ఉన్న బంధాన్ని తెంచేసింది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.   తన కుమారుడి పెళ్లికి బంధువులు, సన్నిహితులు, పార్టీ పెద్దలు అందరినీ ఆహ్వానించిన సునీత.. ఒకప్పటి తమ పార్టీ నేత, తన భర్తకు ఆప్తుడు అయిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను స్వయంగా కలిసి వివాహానికి హజరవ్వాల్సిందిగా శుభలేఖ అందజేశారు. దీనికి ఎంతో సంతోషించిన సీఎం తప్పకుండా వస్తానని మాట ఇచ్చారు. అన్నట్లుగానే పెళ్లిరోజు హైదరాబాద్ నుంచి వెంకటాపురం వెళ్లి వధూవరులను ఆశీర్వదించారు.. బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హీరో కమ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఉన్నా ఈ వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్ చంద్రశేఖర్ రావే.   సీమ గడ్డ మీదకు వచ్చి రాగానే ఇక్కడి ప్రజలు ఆయన్ను ఆహ్వానించిన తీరు నిజంగానే అద్భుతం.. ఇక్కడి వారు కూడా కేసీఆర్‌ను ఇంతగా అభిమానిస్తున్నారా అన్నది కళ్యాణ మంటపంలోనే జై కొట్టడంతో అర్థమైపోయింది. ప్రజాభిమానం సరే.. ఆంధ్రా టీడీపీ నాయకులు చేసిన హడావిడి, అత్యుత్సాహం తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ రేవంత్ రెడ్డికి ఆగ్రహం తెప్పించింది. తనను జైలులో పెట్టించిన కేసీఆర్‌కు సొంతపార్టీ నేతలు సాష్టాంగ నమస్కారాలు చేయడం ఆయన తట్టుకోలేకపోయారు. తెలంగాణ ముఖ్యమంత్రి పట్ల అంత అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శించారని ప్రశ్నించారు. అందుకే ఆయన పార్టీ మారబోతున్నట్లు జోరుగా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. దానికి తోడు రేవంత్ వరుస ఢిల్లీ పర్యటనలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. నిజానికి రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రిగా.. పార్టీ జాతీయాధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు.   దీంతో రెండు రాష్ట్రాలకు కమిటీలను ప్రకటించారు. తెలంగాణ కమిటీకి ఎల్‌.రమణను అధ్యక్షుడిగానూ.. రేవంత్‌రెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్‌గానూ నియమించారు. తెలంగాణ వ్యవహారాలను దగ్గరుండి చూసుకొని, చక్కదిద్దే సమయం చంద్రబాబు లేకపోవడంతో ఈ వ్యవహారాలను రమణ, రేవంత్‌ భుజాలపై వేశారు టీడీపీ అధినేత. వివిధ స్వప్రయోజనాలను ఆశించి ఎంతో మంది పార్టీని వీడి వెళ్లిపోతున్నా వీరిద్దరూ మాత్రం.. పార్టీని ఎలాగొలా లాక్కొస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సొంతంగా లీడ్ తీసుకొని అనేక సందర్భాల్లో కేసీఆర్ పాలనను ఎండగట్టారు. ఓటుకు నోటు కేసులో దొరికినప్పటికీ కేసీఆర్‌కు భయపడకుండా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. బాబు కూడా రేవంత్ రెడ్డికి అమితమైన ప్రాధాన్యతనిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నప్పుడు.. రేవంత్ కూమార్తె పెళ్లి సందర్భంగా కుటుంబంతో సహా హాజరయ్యారు.   బాబు పదవిలో ఉన్నా.. లేకున్నా ఇంత ప్రయారిటీ మరే నేతకు ఇవ్వలేదని పచ్చ కండువాలు చెప్పుకుంటున్నాయి. మరి అంతటి ప్రాధాన్యతను రేవంత్ కోల్పోతారా..? నిజానికి తెలంగాణలో కేసీఆర్ తర్వాత అంతటి వాగ్దాటి, ఛరిష్మా రేవంత్ సొంతం. అందుకు తగ్గట్టుగానే రేవంత్ రెడ్డే కేసీఆర్‌కు సరైన ప్రత్యామ్నాయమని ఎన్నో సర్వేలు తేటతెల్లం చేశాయి కూడా. అందుకే కాబోయే ముఖ్యమంత్రి అంటూ పార్టీ శ్రేణులు రేవంత్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. మరి ఇంతటి ఆదరణను ఆయన చేజేతులా వదులుకుంటారా..? మరో వైపు తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని. తమ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత అన్నీ వివరిస్తానని రేవంత్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికైతే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పటికీ ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. చంద్రబాబు వచ్చిన తర్వాత కానీ రేవంత్ నిర్ణయం ఏంటనేది తెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

జనసేనలోకి ఎన్టీఆర్ వస్తే..?

  ఇప్పటికే వరుస విజయాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం కూడా ముగిసింది. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా... ఈ పూజా కార్యక్రమంలో అసలైన స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది మాత్రం పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినిమా ఘనవిజయం సాధించాలని, అంతా మంచి జరగాలని పవన్ కోరుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ను పవన్ కళ్యాణ్ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఆతరువాత ఎన్టీఆర్ పవన్ చాలా సరదాగా... క్లోజ్ గా మాట్లాడుకున్నారు. ఒకప్పుడు రెండేళ్ల కిందట ఎన్టీఆర్ , పవన్ కళ్యాణ్ ఫాన్స్ మధ్య గొడవ ఓ హత్యకి దారితీసిన ఘటన ఎంత సంచలనం రేపిందో చూసాం. అప్పుడు ఇద్దరు హీరోలు సంయమనం పాటించాలని సూచించారు. ఇప్పుడు ఇద్దరూ కలిసిపోయి అభిమానులకు.. ఎలా మెలగాలి అన్న సందేశం ఇచ్చారు. ఇక ఇదే పవన్ కు ప్లస్ పాయింట్ అవ్వనున్నట్టు భావిస్తున్నారు.   ఇక ఇదంతా చూస్తుంటే ఇదేదో పొలిటికల్ గా పవన్ కు బాగానే ఉపయోగపడేట్టు కనిపిస్తోంది. పవన్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రానున్న సంగతి తెలిసిందే. దానికి ఇప్పటినుండే ఆయన స్కెచ్ వేస్తున్నారు. పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ రెడీ చేస్తున్నారు. పార్టీ ప్లీనరీ, తన పాదయాత్ర , ఎప్పుడు, ఎక్కడి నుంచి దీన్ని  చేపట్టాలన్న దానిపై త్వరలో పవన్ నిర్ణయం తీసుకోనున్నారు.   మరోవైపు టీడీపీ అధినాయకత్వం ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా ఉంది. తాత పోలికలు, మంచి వాగ్దాటి, మాస్ ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ తన వారసుడి రాజకీయ భవిష్యత్తుకు ఎక్కడ అడ్డువస్తాడో అని చంద్రబాబు నాయుడు 2009 తరువాత ఎన్టీఆర్ ను దూరం పెడుతూ వచ్చారు. దీనికి తోడు హరికృష్ణ, వల్లభనేని వంశీ, కొడాలి నాని కలిసి ఎన్టీఆర్ కు ప్రాధాన్యత ఇవ్వాలని 2014 సమయంలో గట్టిగా పోరాడారు. అయితే అపర చాణుక్యుడు ముందు వారి ఆటలు సాగలేదు. పార్టీ శ్రేణులతో పాటు అన్నగారి కుటుంబం నుండి ఎన్టీఆర్ ను విడదీసేందుకు బాలయ్యను రంగంలోకి దించారని రాజకీయవర్గాల్లో చర్చ నడిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చాడు జూనియర్. అయితే జనసేనను వచ్చే ఎన్నికల నాటికి సంస్థాగతంగా పటిష్టపరచాలని చూస్తున్న ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దీనిలో భాగంగా ఎన్టీఆర్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. తన గేమ్ ప్లాన్ లో భాగంగా.. తన ప్రియమిత్రుడు త్రివిక్రమ్ తో సినిమా చేయించి.. ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ కు గాలం వేయాలని భావిస్తున్నట్టు జనసేన కాంపౌండ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కనుక పవన్ తో చేరితే అది వెయ్యి ఏనుగుల బలంతో సమానం అవుతుంది. ఎందుకంటే జనసేనలో పవన్ ఒక్కడే స్టార్ క్యాంపెయినర్. 2019 నాటికి మెగా ఫ్యామిలీ పవర్ స్టార్ వెంట నడుస్తుందో లేదో తెలియదు..? కాబట్టి ఈ పరిస్థితుల్లో పార్టీ ప్రజల్లోకి వెళ్లాలంటే.. అది పవన్ ఒక్కడి వల్ల అయ్యే పని కాదు. సో.. ఎన్టీఆర్ లాంటి స్టార్ డమ్ ఉన్న వ్యక్తి జనసేనలో చేరితే పార్టీని జనాల్లోకి బలంగా వెళుతుంది.   మరో వెర్షన్ చూస్తే.. తొలి నుండి నందమూరి, కొణిదల కాంపౌండ్ ల మధ్య ఆధిపత్య పోరు నడిచింది. ఇద్దరి సామాజిక వర్గాలు వేరు. ఎన్టీఆర్ ఆ సామాజిక వర్గానికి దగ్గర అయితే.. సొంత సామాజిక వర్గానికి దూరమవుతాడు. అప్పుడు ఎన్టీఆర్ ను దూరం పెట్టడానికి చంద్రబాబుకు మరో అవకాశం దొరికినట్టు అవుతుంది. కాబట్టి ఎన్టీఆర్ పవన్ గాలానికి చిక్కుతాడా...?లేక...? ఇవన్నీ పుకార్లా..? అన్నది త్వరలోనే తేలిపోతుంది.

రేవంత్ వెళ్తున్నాడంటే.. టీడీపీ సైలెంట్ ఎందుకయ్యింది..?

ఇప్పుడు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ ఒకటే.. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారనే.. ఏ రెండు ఖద్దరు చొక్కాలు కలిసినా దీని పైనే చర్చ.. ఇంతకూ రేవంత్ పార్టీ మారతారా..? తెలంగాణ తెలుగుదేశంలో కేసీఆర్‌ను ఢీకొట్టగల మొనగాడు.. ముఖ్యమంత్రి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్న రేవంత్‌ అలాంటి గోల్డెన్ ఛాన్స్‌ని మిస్ చేసుకొని టీడీపీకి వీడ్కోలు పలుకుతాడా..? ఇవే అందరి మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్నలు.   సరే ఈ సంగతి పక్కనబెడితే.. ఏ పార్టీలోనైనా ఒక సాధారణ నేత వేరే పార్టీలోకి జంప్ అవుతున్నాడని తెలిస్తేనే ఆ పార్టీ మొత్తం అలర్ట్ అవుతుంది. బుజ్జగించో.. లాలించో ఆ నాయకుడిని పార్టీ మారకుండా చూస్తారు. అంతెందుకు తెలుగు రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆకర్ష్ ఉధృతంగా సాగిన కాలంలో తమ నేతలు పక్క పార్టీల్లోకి వెళ్లకుండా ఉండేందుకు అధినేతలు చాలా ప్రయత్నించారు. కానీ రేవంత్ వంటి కీలకనేత బయటకు వెళ్తున్నట్లు వార్తలు వస్తుంటే తెలుగుదేశం నేతలకు కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదు. ఏపీ టీడీపీ కానీ.. టీటీడీపీ కానీ పిన్‌డ్రాఫ్ సైలెంట్.. ఒక్కరంటే ఒక్కరు కిక్కురుమంటే ఒట్టు.   సరే అది పోతే పోని.. ప్రెస్ మీట్ పెట్టి యనమలకు 2వేల కోట్ల కాంట్రాక్టు.. పరిటాల, పయ్యావుల కుటుంబానికి బీర్ల ఫ్యాక్టరీ అంటూ సొంతపార్టీ నేతలపై అవాకులు, చవాకులు పేలితే కీలకనేతలెవరూ స్పందించలేదు. నిన్నటికి నిన్న రేవంత్ ఆరోపణలపై స్పందించాల్సిందిగా మీడియా ప్రతినిధులు మంత్రి దేవినేని ఉమాను కోరినా ఆయన సమాధానాన్ని దాటవేశారు. ఒక్క పరిటాల శ్రీరామ్‌ మాత్రం కాస్త ఫైరయ్యాడు. తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలన్నదే రేవంత్ లక్ష్యమని.. ఆ ఉద్దేశ్యంతోనే ఇన్నాళ్లు టీడీపీలో కొనసాగారని చెప్పారు. అయితే ఆ లక్ష్యసాధనలో భాగంగానే రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నారని శ్రీరామ్ ఆరోపించారు. ఏదో తెలిసో తెలియకో కుర్రతనంతో పరిటాల శ్రీరామ్ ఏదో కౌంటర్ అన్నట్లుగా మాట్లాడాడే తప్ప ఎవరి నోటా మాట లేదు. టీడీపీ అధినాయకత్వం పాటిస్తున్న ఈ వ్యూహాత్మక మౌనం వెనుక మతలబు ఏంటో అర్థంకాక తలలు పండిన రాజకీయ వేత్తలు సైతం జుట్టుపీక్కుంటున్నారు.

ఢిల్లీ పరువు గంగలో కలిసింది

ఢిల్లీ.. భారతదేశ రాజధాని.. చరిత్రలో ఎన్నో గొప్ప రాజవంశాల పాలనకు సజీవ సాక్ష్యం.. ఏ మూలకు వెళ్లినా ఏదో ఒక చారిత్రక కట్టడం ఇక్కడ మనకు దర్శనమిస్తుంది. అందుకే భారతీయులు తన జీవితకాలంలో ఒక్కసారైనా రాజధానిని చూడాలనుకుంటారు. ఇంతటి ఘన వారసత్వానికి కేరాఫ్‌గా నిలిచే ఢిల్లీ ఇప్పుడు ఒక చెడ్డపేరు మూటకట్టుకుంది. మహిళలకు ఏమాత్రం భద్రత లేని నగరాల్లో హస్తినాపురం అగ్రస్థానంలో నిల్చుంది. లండన్‌కు చెందిన థామ్సన్ రాయిటర్స్ అనే సంస్థ ప్రపంచంలోని 19 మహా నగరాల్లో నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.   ఈ ఏడాది జూన్- జూలై నెలల్లో నిర్వహించిన ఈ సర్వేలో ఒక్కో నగరం నుంచి 20 మంది చొప్పున మొత్తంగా 380 మంది పాల్గొన్నారు. వారి నుంచి సేకరించిన వివరాల ఫలితాలను తాజాగా ఈ సంస్థ ప్రకటించింది. దీని ప్రకారం మహిళలపై లైంగిక దాడులు ఎక్కువగా జరుగుతున్న నగరాల జాబితాలో ఢిల్లీ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఢిల్లీ, సావోపౌలో ( ఢిల్లీ ) నగరాల్లో మగువలపై నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపింది. అత్యాచారాలతో పాటు లైంగిక హింస, వేధింపులు, భౌతిక దాడులు ఇలా మొత్తంగా చూస్తే అత్యంత ప్రమాదకరమైన నగరాల జాబితాతో ఈజిప్ట్ రాజధాని కైరో అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో మెక్సీకో సిటీ, తరువాతి స్థానంలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నిలిచాయి.   ఇక మన రాజధాని నగరం ఢిల్లీ ఈ జాబితాలో నాలుగో స్ధానంలో నిలిచింది. ఢిల్లీ కంటే కూడా పాక్ వాణిజ్య నగరం కరాచీ మెరుగైన స్థానంలో నిలవడం గమనార్హం. 2012 డిసెంబర్‌లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బస్సులో వెళుతున్న 23 ఏళ్ల యువతిపై ఆరుగురు కామాంధులు దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన ఆ యువతి 11 రోజుల పాటు మృత్యువుతో పోరాడి సింగపూర్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది.   దీనిపై దేశవ్యాప్తంగా మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు రావాలని ప్రజలు పోరాటాలు చేశారు. అత్యాచార నిందితులకు కఠిన శిక్ష విధించేందుకు గానూ నిర్భయ చట్టాన్ని తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో అత్యాచారాలు తగ్గాల్సిందిపోయి అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది ఒక్క జనవరి నెలలోనే 140 అత్యాచార ఘటనలు, 238 మంది మహిళలపై వేధింపుల కేసులు నమోదయ్యాయి. వీటిలో 43 రేప్ కేసులు.. 133 మంది మహిళలపై వేధింపుల ఘటనలు పరిష్కారానికి నోచుకోలేదు. జనాభాకు సరిపడా పోలీసు సిబ్బంది లేకపోవడంతోనే నేరాలు అంతకంతకూ పెరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఏదీ ఏమైనప్పటికీ మహిళలపై అత్యాచారాల ఘటనల్లో ఢిల్లీ అగ్రస్థానంలో నిలవడం సగటు భారతీయుడిని.. ముఖ్యంగా ఢిల్లీ వాసుల్ని ఆందోళనకు గురిచేస్తోంది.

పన్నీర్.. పళనిలు ఒకరిని ఒకరు నమ్మడం లేదా..?

ఎలాంటి బంధానికైనా నమ్మకం ప్రధానం.. అది భార్యభర్తలు కావొచ్చు, వ్యాపారంలో భాగస్వాములు కావొచ్చు.. స్నేహితులు కావొచ్చు.. అన్నాదమ్ములు కావొచ్చు.. ఇలా ఎలాంటి రిలేషనైనా నమ్మకం అనే అనే పునాదులపైనే అది నిలబడుతుంది. తమిళనాడుతో పాటు దేశ రాజకీయాల్లో నమ్మకానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పన్నీర్ సెల్వం అని ఎవరిని అడిగినా చెబుతారు. దివంగత ముఖ్యమంత్రి జయ నమ్మిన బంటుగా ఎన్నో సంక్షోభాల్లో ఆమెను కాపాడారు. తానే ముఖ్యమంత్రి అయినప్పటికీ అమ్మ కూర్చీలో కూర్చోకుండా ఆమె ఫోటోను అక్కడ ఉంచి తన స్వామి భక్తిని ప్రపంచానికి చాటి చెప్పారు.   అలాంటి పన్నీర్ సెల్వంపై ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిస్వామికి నమ్మకం సన్నగిల్లుతుందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. గతేడాది డిసెంబర్‌లో జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో పొడచూపిన విభేదాలు, వివాదాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అమ్మ తర్వాత చిన్నమ్మకే పన్నీర్‌ సీఎం పీఠాన్ని అప్పగిస్తారని అంతా అనుకొన్నారు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ రాత్రికి రాత్రి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, అనంతరం అమ్మ సమాధి సాక్షిగా దీక్షకు దిగడం, శశికళపై తిరుగుబాటు చేయడం చకచకా జరిగిపోయాయి.   దీంతో శశికళ వర్గం ఖంగుతింది. అప్పటి నుంచి తమిళనాట రాజకీయాల్లో అనేక కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లడం, పళనిస్వామి సీఎం కావడం.. పన్నీర్ సెల్వంతో ఏకమవడం.. అదే సమయంలో దినకరన్ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేయడం ఇలా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఎప్పటికీ కలవరని అనుకొన్న పన్నీర్ - పళని వర్గాలు ఒకటయ్యాయని ఆనందపడిన పార్టీ శ్రేణులకు ఆ సంతోషం ఎక్కువ రోజులు మిగలేలా కనిపించడం లేదు. దీనింతటికి కారణం పన్నీర్ సెల్వం ఢిల్లీ వెళ్లడమే. పన్నీర్ వెంట రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి తంగమణిని సీఎం పళనిస్వామి ఢిల్లీకి పంపారు.   ప్రధానితో సమావేశానికి మైత్రేయన్‌ను మాత్రమే తీసుకెళ్లిన పన్నీర్ .. తంగమణిని బయటే వదిలేశారని.. రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్‌కు వ్యతిరేకంగా మోడీకి పలు విషయాలు చెప్పారని.. తంగమణి సహా ఇతర నాయకులు పళనిస్వామి చెవిలో ఊదినట్లు చెన్నై టాక్. దీనికి బలాన్ని చేకూర్చేలా.. రాష్ట్రానికి కేంద్ర బృందం వస్తుందని ప్రకటన రావడం, ఆర్కేనగర్ ఉప ఎన్నిక నిర్వహిస్తామని ఈసీ ప్రకటించడం జరిగిపోయాయి. ఈ పరిణామాలన్నింటిని ఒక కంట కనిపెడుతున్న సీఎం పళనిస్వామి ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంపై నిఘా పెట్టారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మెరీనా బీచ్‌లోని అమ్మ సమాధిని వేదికగా చేసుకొని పన్నీర్ మరోసారి ధర్మయుద్ధానికి దిగుతారన్న అనుమానాలను వారు వ్యక్తం చేశారు.

హుధుద్ విలయానికి మూడేళ్లు

12.10.2014 ఈ రోజు విశాఖప్రజలే కాదు ఏపీ వాసులకు జీవితాంతం గుర్తుంటుంది. సరిగ్గా ఇదే రోజున ప్రకృతి సాగర నగరం విశాఖ మీద కన్నెర్ర చేసి విలయతాండవం చేసింది. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు ఎక్కడ చూసినా కూలిన చెట్లు, నేలకొరిగిన విద్యుత్, సెల్‌ఫోన్ టవర్లు, హోర్డింగ్‌లే దర్శనమిచ్చాయి. ప్రచండ గాలులు, వర్షపు తాకిడికి ఐదుగురు మరణించారు. తీర ప్రాంతం వెంట పలుచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకురావడంతో వందలాది గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. తుఫానుకు ముందు పచ్చని చెట్లతో కళకళలాడిన విశాఖ కొద్దిగంటల్లోనే ఏడారిలా మారిపోయింది.   తిరిగి విశాఖ కోలుకోవాలంటే కనీసం పదేళ్లు పడుతుందని అంచనాలు.. ప్రభుత్వం పూర్తిగా సంసిద్ధంగా లేదంటూ ప్రతిపక్షం నుంచి వ్యంగ్యాస్త్రాలు. అయినా సవాళ్ల మీద స్వారీ చేయడాన్ని ఇష్టంగా మలుచుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మొక్కవోని దీక్షకు కాలం సైతం తలవంచింది. అంతటి భారీ తుఫాను పూర్తిగా తగ్గకముందే హైదరాబాద్ నుంచి విశాఖ బయలుదేరి.. రోజుల తరబడి బస్సునే తన ఇల్లు, ఆఫీసుగా చేసుకొని ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించారు. దీంతో రికార్డు సమయంలోనే విశాఖ నిలదొక్కుకుంది.   ఎన్ని రోజులకు వస్తుందో అనుకొన్న విద్యుత్‌ కొన్ని గంటల్లోనే వచ్చింది. నిత్యావసర వస్తువులకు కొరత లేకుండా చూసుకున్నారు. కూలిన ప్రతి చెట్టు స్థానంలో మొక్కలు నాటుకుంటూ వచ్చారు. హుధుద్ ఆనవాళ్లను చెరిపివేసేలా నగరం మొత్తం పచ్చదనం పరుచుకుంది.. దీని తర్వాత సీఎం విశాఖ అభివృద్ధి మీద దృష్టిపెట్టారు. పెద్ద పెద్ద సదస్సులను విశాఖలో ఏర్పాటు చేసి.. దానికి దేశవ్యాప్తంగా పేరొందిన పారిశ్రామిక దిగ్గజాలను రప్పించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్లు, బెస్ట్ బిజినెస్ పాలసీల ద్వారా ఐటీ కంపెనీలను ఉక్కు నగరం ముంగిట నిలబెట్టారు.   నాడు హుధుద్ వల్ల కూలిన చెట్ల వల్ల ప్రమాదం జరిగే అవకాశాలున్నాయని భావించిన సీఎం దీపావళి పండుగ జరుపుకొవద్దు అని పిలుపునిచ్చారు. నేడు హుధుద్ దెబ్బ నుంచి కోలుకోని దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా విశాఖ పరుగులు పెడుతుండటంతో మూడేళ్ల తర్వాత అదే దీపావళీని చేసుకోనున్నారు చంద్రబాబు. ఆర్కే బీచ్‌లో జరిగే వేడుకల్లో వీధి బాలలు, అనాధ ఆశ్రమాల్లో ఆశ్రయం పొందుతున్న చిన్నారులతో కలిసి సీఎం పండుగ జరుపుకుంటారు. 

భారత్ పై దాడి లక్ష్యంగా భూగర్భ సొరంగాలు నిర్మిస్తున్న పాక్

  పాకిస్తాన్ అణు ఆయుధాలను నిల్వ చేయడానికి భూగర్భ సొరంగాలను నిర్మిస్తోంది. ఒక నివేదిక ప్రకారం, అమృత్సర్ నుండి 350 కిలోమీటర్లు, భారత రాజధాని న్యూఢిల్లీ నుండి 750 కిలోమీటర్ల దూరంలో ఉన్న మయన్వాలీలో పాకిస్తాన్ భూగర్భ సొరంగాలను తవ్విస్తుంది. ఈ అనుసంధానిత సొరంగాల ఎత్తు 10 మీటర్లు మరియు వెడల్పు 10 మీటర్లు అని సమాచారం. ప్రతి సొరంగానికి ప్రత్యేక ప్రవేశ మరియు నిష్క్రమణ ద్వారములు ఉన్నాయట.   వైయాన్ అనే వార్తా సంస్థ నివేదిక ప్రకారం, అణు క్షిపణులను ప్రయోగించే ప్రదేశానికి సులువయిన రవాణా కోసం, పాకిస్తాన్ యొక్క భూగర్భ సొరంగాలు విస్తృత రహదారులకు అనుసంధించారట. అయితే, ఈ సొరంగ మార్గాలు నిర్మిస్తున్న ప్రదేశంలో ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆ ప్రదేశం చుట్టూ భారీ కంచెలు నిర్మిస్తున్నారు. ప్రతి సొరంగం 12 నుండి 24 అణ్వాయుధాలను నిల్వ చేయగల సామర్ధ్యం కలిగి ఉంటాయని తెలిసింది.   పాక్ అణు శాస్త్రవేత్త ఏక్యూ ఖాన్ తమ దేశం ఢిల్లీలో 5 నిమిషాల్లో అణు దాడిని ప్రారంభించగలదు అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.   ఇదిలా ఉంటే,  సెప్టెంబరులో జమ్మూ - కాశ్మీర్లోని ఆర్నీయా విభాగంలోకి, పాకిస్థాన్ వైపు నుండి వస్తున్న భూగర్భ సరిహద్దు సొరంగం బయటపడింది. అంతర్జాతీయ సరిహద్దుల వెంట శాంతి నెలకొల్పేందుకు సుచేట్గర్ వద్ద బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్) మరియు పాకిస్తానీ రేంజర్స్ చర్చలు జరిపిన ఒక రోజు తర్వాత ఈ సొరంగం బయట పాడడం విశేషం.   గత సంవత్సరం ఒక అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ నివేదిక ప్రకారం, పాకిస్తాన్ తన అణు ఆయుధాల నిల్వలను మరియు క్షిపణి సరఫరా సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తుంది. పాకిస్తాన్ 140 అణ్వాయుధాల నిల్వలు కలిగి ఉందని ఆ సంస్థ నివేదించింది.   అయితే, పాకిస్తాన్ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా భారత్ ముందు తన పప్పులు ఉడకవని. 1947, 1965, 1971, మరియు 1999 ల్లో జరిగిన యుద్దాల్ని, అప్పుడు తగిలిన గాయాల్ని అప్పుడే మరచిపోయినట్టున్నారుగా!

బాలయ్య.. కొట్టేది పొగరుతో కాదు!

  బాలయ్య చెంపదెబ్బల వ్యవహారం ఓ ప్రహసనంగా మారింది. అంతేకాదు... ప్రతిసారీ ఎవరో ఒకరిపై బాలయ్య చేయి చేసుకోవడం ప్రజల్లోనే కాదు రాజకీయ నేతల్లో కూడా చర్చనీయాంశమే అయ్యింది. కొందరు నెటిజన్లయితే... ఒకడుగు ముందుకేసి... రేపు రాబోతున్న ఎన్నికల్లో సిట్టింగ్ సీట్ బాలయ్యకు ఇవ్వడానికి చంద్రబాబు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు. హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఈ దఫా సీఎం కుమారుడు లోకేష్ నిలబడనున్నట్లు వార్తలు కూడా రాసేశారు. బాలయ్యకు ఈ సారి రాజ్యసభే నట. అప్పుడే జోస్యం కూడా చెప్పేస్తున్నారు.  ఈ విషయంపై బాలయ్య అంతరంగికులు.. పూర్తి క్లారిటీ ఇచ్చారు. ‘బాలయ్య కొట్టారు.. కొట్టారూ.. అంటారు. అసలు ఎందుకు ఆయన చేయ్ చేసుకోవాల్సొస్తోందో ఎవరూ పట్టించుకోవడం లేదు. కేవలం అభిమానుల కోసమే బాలయ్య మార్షల్స్ ని పెట్టుకోరు. అభిమానుల విషయంలో మార్షల్స్ దుకుడుగా ప్రవర్తించిన సందర్భాలున్నాయ్. అందుకే... వాళ్లను దూరంగా పెడతారు. అంతపెద్ద స్టార్ అయ్యుండి నేరుగా జనాల్లోకి వెళ్లిపోతారు. వారేమో... బాలయ్యను చూడగానే.. అంతులేని ఆనందంతో కిందామీదా చూసుకోకుండా మీద పడిపోతుంటారు.   అలాంటి సందర్భాల్లో సహనం నశించి కొడతారే తప్ప.. అదేదో కావాలనో.. పోగరుతోనే కొట్టడం కాదు. హిందూపురంలో ఓ కార్యకర్తను బాలయ్య చేయ్ చేసుకున్న విషయానికే వస్తే.. ఆ కుర్రాడు నేరుగా బాలయ్య గన్ మేన్ మీదే పడ్డాడు. లోడెడ్ గన్ చేతిలో ఉంది. పొరపాటున మిస్ ఫైరింగ్ అయితే.. పరిస్థితి మరోలా ఉండేది. అందుకే.. ఆ కోపంలో ఓ దెబ్బ వేశారు. మరో విషయం ఏంటంటే.. ఆయన గట్టిగా కొట్టరు. ఏదో బెదిరించడానికి అన్నట్లు.. లైట్ గా చరుస్తారు... అంతే. దానికి ఎందుకీ రాద్ధాంతం. బాలయ్యగారి తోటి స్టార్లందరూ మార్షల్స్ తో జనాల మధ్యకొస్తారు. కానీ.. ఒక్క బాలయ్యే ఎలాంటి సెక్యూరిటీ లేకుండా జనాల్లోకొస్తాడు. అలా రావడానికి గట్స్ ఉండాలి’ అని చెప్పారు.   ‘సింహా’ చిత్రం ఆడియో వేడుకలో మార్షల్స్ కీ, బాలయ్య అభిమానులకీ మధ్య పెద్ద గొడవే జరిగింది. హైదరాబాద్ రాక్ హైట్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో జరిగిన గొడవను అదుపు చేయడం పోలీసుల వల్లే కాలేదు. అప్పట్నుంచే మార్షల్స్ ని దూరంగా ఉంచడం మొదలుపెట్టాడట బాలయ్య. పాపం.. ఆ వివరాలేం తేలీకుండా... బాలయ్యను టార్గెట్ చేయడం నిజంగా బాధాకరమే. అభిమానులు కూడా ఈ విషయంలో కాస్త సంయమనం పాటిస్తే మంచిది కదా. 

సర్జరీలో సీక్రెట్..!

అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ భర్త ఎం నటరాజన్‌కు కొంతకాలం క్రితం ఆరోగ్యం విషమించింది. కిడ్నీ, లివర్ సంబంధిత సమస్యలతో ఆయన గత కొద్దిరోజులుగా చెన్నైలోని గ్లెనీగ్లెస్ గ్లోబల్ హెల్త్ సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇప్పటికిప్పుడు అవయవాలు మార్పిడి చేయాలని లేకపోతే మనిషి దక్కడం కష్టమని వైద్యులు సూచించడంతో కుటుంబసభ్యులు అందుకు అంగీకరించారు. దీంతో 74 ఏళ్ల నటరాజన్‌కు ఆ వయసులో ఎంతో క్లిష్టమైన కిడ్నీ, లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీని వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. అయితే, ఇక్కడే కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. 20 ఏళ్లు కూడా నిండని ఓ కుర్రాడు అనుమానాస్పద స్థితిలో ఆసుపత్రికి రావడం, బ్రెయిన్‌డెడ్ అయిన అతన్నుంచి ఆర్గాన్స్‌ సేకరించి..నటరాజన్‌కు అమర్చడంపై వివాదం రేగింది. ఈ క్రమంలో అందరి వేళ్లు మన్నార్ గుడి మాఫియా మీదకే వెళ్తున్నాయి.   శశికళ స్వగ్రామం మన్నార్ గుడి. ముగ్గురు సోదరులతో కలసి నివసించే చిన్నమ్మది ఉమ్మడి కుటుంబం.. ఆ వూళ్లోనే పెద్ద కుటుంబం. ఎప్పుడైతే శశి.. జయలలితకు దగ్గరైందో మన్నార్‌గుడిలో ఉండే ఆమె కుటుంబసభ్యులతో పాటు సమీప బంధువులంతా కట్టకట్టుకొని పోయెస్ గార్డెన్‌లో వాలిపోయారు. అమ్మ అధికారాన్ని అడ్డుపెట్టుకొని వీరంతా పార్టీలో, ప్రభుత్వంలో పట్టు సంపాదించారు. బదిలీలు, పైరవీలు, లైసెన్సులు ఇలా ఏం కావాలన్నా ఈ మాఫీయా చేసి పెట్టగలదు. అంతేందుకు ఏకంగా ఐఏఎస్‌లను సైతం బదిలీ చేయగల పవర్ వీరికి ఉండేదట.   ఈ మాఫియా కమాండర్ శశికళ భర్త ఎం. నటరాజన్. అయితే మన్నార్‌గుడి మాఫియా ఆగడాలు రోజు రోజుకి పెరుగుతుండటంతో జయలలిత కన్నెర్ర చేశారు. వీరిలో కొంతమందిని జైలుకు సైతం పంపించారు. మధ్యలో మళ్లీ రాజీ కుదిరినా, మన్నార్ గుడి మాఫియాను పూర్తిగా ఆమె క్షమించలేక పోయారు.  2011లో శశికళ మంది మార్బలాన్ని మొత్తం తరిమేశారు. అయితే, కొంతకాలం తర్వాత శశికళను తిరిగి దగ్గరికి చేర్చుకున్నారు. అయితే అనారోగ్య కారణాలతో జయ అపోలో ఆస్పత్రిలో చేరడం.. 74 రోజుల పాటు చికిత్స జరిగినా.. ఆ సమయంలో శశికళ తప్ప మరో వ్యక్తికి అమ్మ దగ్గరికి అనుమతి లభించకపోవడం తావివ్వడం... తర్వాత అమ్మ మరణించడం ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం లేదు.. ఈ వ్యవహారంలో తెర వెనుక మన్నార్ గుడి మాఫియా ఉందనేది ఎంతో మంది వాదన. జయ మరణం తర్వాత పార్టీని, ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకునేందుకు మన్నార్ గుడి గ్యాంగ్ చేయని ప్రయత్నం లేదు. వీరి కుట్రలను త్వరగానే అర్థం చేసుకున్న అన్నాడీఎంకే నేతలు ఈ గ్యాంగ్‌ను బయటకు పంపేశారు.   సరే ఈ సంగతి పక్కనబెట్టి నటరాజన్ సర్జరీ విషయానికి వస్తే. కీరమంగళం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్తీక్ అనే యువకుడిని చికిత్స నిమిత్తం తంజావూరు నుంచి ఎయిర్ అంబులెన్స్‌లో చెన్నైలో నటరాజన్ చికిత్స పొందుతున్న గ్లోబల్ హెల్త్ సిటీ ఆసుపత్రికి తరలించారు. అయితే కార్తీక్ అప్పటికే బ్రెయిన్ డెడ్‌ అయినట్లు ప్రకటించిన వైద్యులు అనంతరం అవయవ దానం గురించి తెలుపగా... అందుకు కుటుంబసభ్యులు అంగీకారం తెలిపారు. దీనిలో భాగంగా అతని గుండె, కిడ్నీలు, లివర్, ఉపిరితిత్తులను సేకరించిన వైద్యులు లివర్, కిడ్నీలను 74 ఏళ్ల వ్యక్తికి, గుండెను 43 ఏళ్ల వ్యక్తికి, ఉపిరితిత్తులను 62 ఏళ్ల వ్యక్తికి కేటాయించారు.   వీరిలో 74 ఏళ్ల వ్యక్తి నటరాజనే అనేది అందరి అభిప్రాయం. అయితే కార్తీక్‌ను గ్లెనెగిల్స్ గ్లోబల్ హెల్త్ సిటీ ఆసుపత్రికి తరలించిన తీరుపైనే పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఓ పేద యువకుడి కుటుంబం ఎయిర్ అంబులెన్స్‌ను ఏర్పాటు చేసుకుని, గ్లెనెగిల్స్ ఆసుపత్రికే ఎందుకు తీసుకువెళ్లాలని భావించింది..? ఎయిర్ అంబులెన్స్‌కు ఖర్చులను ఎవరు భరించారు..? ఆర్గాన్ షేరింగ్ నెట్‌వర్క్‌ నిబంధనల ప్రకారం ఆర్గాన్ షేరింగ్ రిజిస్ట్రీలో అందరికన్నా పైన నటరాజన్ పేరు ఎలా వచ్చింది..? ఇలాంటి సమాధానం లేని ప్రశ్నలకు.. సమాధానం ఒక్క మన్నార్ గుడి మాఫియానే అని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. లేదంటే ఈ సర్జరీ కూడా జయకు జరిగిన రహస్య చికిత్సలాగానే ఇది కూడా ఒక మిస్టరీలాగా మిగిలిపోతుందా అనేది కాలమే నిర్ణయించాలి.

కామెడీ సినిమా మాదిరి.. తమిళ రాజకీయం!

తమిళనాట రాజకీయాలు రోజుకో తీరుగా మారుతున్నాయ్. నటులుగా కలిసి ఎదిగిన కమల్ హాసన్, రజనీకాంత్... ‘రాజకీయం’ అనేసరికి ఎవరి కుంపటి వాళ్లు పెట్టుకుంటున్నారు. దాంతో అధికార, ప్రతిపక్ష పార్టీల్లో చాలామంది నాయకులు రంగులు మార్చుకోడానికి రెడీగా ఉన్నారని సమాచారం. అయితే రజనీ... అభిమానులతో మీటింగులూ.. గట్రా పెట్టుకుంటూ బిజీగా ఉన్నారు కానీ... తన రాజకీయ పార్టీకి సంబంధించిన వివరాలు మాత్రం బయటకు చెప్పడంలేదు. అంతేకాదు... అసలు తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ఇప్పటివరకూ మీడియా ముందు ఆయన చెప్పకపోవడం గమనార్హం. రజనీ వేస్తున్న అడుగులు మాత్రం రాజకీయం వైపే అని చెప్పకనే చెబుతున్నాయ్. అయితే... తాను సొంత పార్టీ పెడతాడా? లేక బీజేపీ తీర్థం పుచ్చుకొని ఆ పార్టీ తరఫున సీఎం కేండిడేట్ గా నిలబడతాడా? అనేది తెలియాల్సి వుంది.    ఇక కమల్ హాసన్.. ఇప్పటికే తన రాజకీయ అరంగేట్రం గురించి క్లారిటీ ఇచ్చేశాడు. తాను సొంత పార్టీ పెట్టబోతున్నట్టు కూడా ప్రకటించాడు. నవంబర్ లో పార్టీ ఆవిర్భావ సభ ఉంటుందని తేల్చిచెప్పాడు. అంతేకాదు... అప్పుడే ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలు గుప్పించడం కూడా మొదలుపెట్టేశాడు. మొదట్నుంచి కమల్‌ది కాస్త దుందుడుకు స్వభావం. వామపక్ష భావజాలం ఆయనలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆ దూకుడు.. కమల్ స్టేట్మెంట్లలో కనిపిస్తుంది కూడా.    వీరిద్దరి నిర్ణయంపై అభిమానులు ఆనందంగా ఉన్నా... విశ్లేషకులు మాత్రం దీనిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే సంస్థాగతంగా బలమైన డీఎంకే, అన్నాడిఎంకే పార్టీలను ఎదిరించి నిలవడం తేలికైన విషయం కాదు. అయితే... వీరిద్దరి అభిమాన గణం కూడా తక్కువది కాదు. అంతేకాదు... వయసుతో నిమిత్తం లేకుండా అందరి అభిమానాన్నీ పొందిన నటులు ఇద్దరూ. వీరు విడివిడిగా పోటీ చేస్తే... కేవలం కింగ్ మేకర్లుగానే నిలిచిపోతారు. అదే... ఇద్దరూ కలిసి పార్టీ స్థాపించి... ఒకే పార్టీతో జనాల్లోకెళ్తే.. ప్రస్తుత అధికార, ప్రతిపక్ష పార్టీలు మట్టికరవడం ఖాయం అని విశ్లేషకుల అంచనా. అయితే... రజనీ, కమల్ అభిప్రాయాలు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాయ్.    ఇదిలావుంటే... ఉన్న వేడి చాలదన్నట్లు... నటి సుహాసిని కూడా రాజకీయాల గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేసి.. ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపారు. ‘జయలలితకు ఓ అద్భుతమైన అవకాశం ఇచ్చారు. ఆమె నిలబెట్టుకున్నారు కూడా. అలాగే మాకూ ఇవ్వండి. మేం రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగానే ఉన్నాం. మగవాళ్లే రాజకీయాల్లోకి రావాలా? ఆడవారు రాకూడదా? హీరోలే పార్టీలు స్థాపించాలా? హీరోయిన్లు కొత్త పార్టీని స్థాపించకూడదా?’ అని సుహాసిని మాట్లాడిన తీరు ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశమైంది. ఇప్పటికే కథానాయికల్లో ఖుష్బూ... కాంగ్రెస్ నాయకురాలిగా బిజీ బిజీగా ఉంది. మరోవైపు రాధిక, రేవతి, నదియా తదితర హీరోయిన్లు కూడా రాజకీయాలపై ఆసక్తి కనపరుస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సుహాసిని వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయ్. ఈ సీనియర్ నటీమణులకు కూడా పార్టీ పెట్టే ఉద్దేశం ఉందా? లేక ఉన్న పార్టీల్లోనే చేరి.. ప్రజాక్షేత్రంలోకి అడుగుపెడతారా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.    మొత్తానికి తమిళ రాజకీయాలు కామెడీ సినిమాను తలపిస్తున్నాయ్. ఇప్పుడు అక్కడ సినిమా వాళ్లందరూ రాజకీయ నాయకులే. బహుశా ఈ వాతావరణమే.. 40 ఏళ్ల క్రితం ఉంటే... ఎన్టీయార్, ఎమ్జీయార్ రాజకీయాల్లోకే వచ్చేవారు కాదేమో!

వెళ్లి రావమ్మా... మళ్లీ రావమ్మా అంటూ

ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డల ఆటాపాటలు, కోలాటాలు, ఎక్కడికక్కడి నుంచో వచ్చిన అక్కాచెల్లెళ్ల సందడితో తెలంగాణ పరవశించింది.  తొమ్మిది రోజుల పాటు నీరాజనాలందుకున్న శివుడి ముద్దుల గుమ్మకు.. నిద్రపో గౌరమ్మ... నిద్రపోవమ్మా... నిద్రకు నూరేండ్లు.... నీకు వెయ్యేండ్లు... నినుగన్న తల్లికి నిండు నూరేళ్లు...  వెళ్లి రావమ్మా... మళ్లీ రావమ్మా అంటూ  వీడ్కోలు పలికింది తెలంగాణ. మహాలయ అమావాస్య నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద బతుకమ్మ నమూనాలను తీర్చిదిద్ది పండుగను మరింత శోభాయమానంగా చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో ఎక్కడ చూసినా పూలవనాలను తలపించింది. ఎనిమిది రోజుల పాటు సాగిన వేడుక అంతా ఒక ఎత్తయితే తొమ్మిదోరోజు, అష్టమినాడు జరిగే సద్దుల బతుకమ్మ సంబరాలు ఒక ఎత్తు.   రాజధాని సహా రాష్ట్రమంతటా సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. బంతి, తంగేడు, గునుగు, కట్లాయి, పట్టుకుచ్చు, చామంతి, గుమ్మడి పూలతో బతుకమ్మలను పేర్చిన ఆడబిడ్డలు ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్ వరకు శోభాయాత్ర నిర్వహించారు. జోరున వర్షం కురుస్తున్నప్పటికీ మహిళలు తండోపతండాలుగా కదిలివచ్చారు. ఉయ్యాల, చందమామ, కోలాటాల పాటలతో ఎల్బీ స్టేడియం, ట్యాంక్‌బండ్‌లు కోలాహలంగా మారిపోయాయి. బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో పదిహేను రాష్ట్రాల నుంచి 150 మంది కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకొన్నాయి. రంగురంగుల విద్యుదీపాల నడుమ ట్యాంక్‌బండ్ కొత్త శోభను సంతరించుకుంది. సాగరం మధ్య నుంచి తారాజువ్వల్లా ఆకాశానికి దూసుకెళ్లిన బాణాసంచా హుషారునింపింది.   

పోయిరా బతుకమ్మా..!

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక..మహిళల అభ్యున్నతి కోసం చేసే పండుగ..పూలను, ప్రకృతిని పూజించే బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటు తెలంగాణ అక్కాచెల్లెమ్మలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో శ్రీకారం చుట్టి..సద్దుల బతుకమ్మతో..బతుకమ్మకు వీడ్కోలు పలికే సంబరానికి సమయం ఆసన్నమైంది. ఇవాళ సాయంత్రం జరగనున్న సద్దుల బతుకమ్మ నగరం ముస్తాబైంది. ఈ వేడుకల కోసం ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న బతుకమ్మ ఘాట్ అంగరంగ వైభవంగా ముస్తాబు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎల్బీ స్టేడియం నుంచి సాయంత్రం ఐదు గంటలకు బతుకమ్మ శోభాయాత్ర ప్రారంభమై ఆరున్నర ప్రాంతంలో ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటుంది.   వేడుకలు ఎలా జరుగుతాయంటే: సద్దలు బతుకమ్మనే పెద్ద బతుకమ్మ అని పిలుస్తారు. అసలు బతుకమ్మ వైభవాన్ని చూడాలంటే సద్దుల బతుకమ్మ రోజే చూడాలి. తీరొక్కపూలతో పేర్చే బతుకమ్మలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తంగేడు, గానుగ, బంతి పూలను పేర్చి తీర్చిదిద్దిన బతుకమ్మను ముగ్గుపెట్టి, పీట వేసి దానిపై పెడతారు. పులుసు కలిపిన సద్ది, పెరుగు కలిపిన సద్దితో పాటు పెసర, కొబ్బరి, పుట్నాలు, నువ్వులు, పల్లీలు, బియ్యం పొడులు కలిపి తయారు చేసిన తొమ్మిది రకాల సద్దులు బతుకమ్మకు నైవేద్యంగా పెడతారు.   కొత్త చీరలు కట్టుకున్న ఆడపడుచులు సోపతోళ్లతో కలిసి సాయంత్రానికి చెరువు గట్టుకు చేరుకొని..బృందాలుగా వీడిపోయి..మధ్యలో బతుకమ్మలను పెట్టి దాని చుట్టూ వలయాకారంలో లయబద్ధంగా పోయిరా బతుకమ్మా..పోయిరావమ్మా.మల్లొచ్చె ఏడాది తిరిగి రావమ్మా.. అంటూ చప్పట్లు కొడుతూ ఆడి పాడతారు. అనంతరం తమ వెంట తెచ్చిన సద్దులను అందరికీ పంచుతారు. వాయినాలు ఇచ్చిపుచ్చుకొని తమ ఐదవతనం కలకాలం నిలపాలని బతుకమ్మను కోరుకుంటారు.   ఎనిమిదవ రోజు బతుకమ్మ వేడుకల హైలెట్స్: తెలంగాణ ప్రభుత్వ భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న బతుకమ్మ వేడుకలు ఎనిమిదవ రోజు ఘనంగా జరిగాయి. రవీంద్రభారతి ప్రధాన వేదికలో బ్రహ్మాకుమారీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ జాతీయ సాంస్కృతికోత్సవం కన్నుల పండువగా సాగింది. ఈ వేడుకలో వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు తమ సంప్రదాయ సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు.

పూల హరివిల్లు

తీరొక్క పూలతో రంగురంగుల బతుకమ్మలు..సంప్రదాయ వస్త్రాలు ధరించిన వేలాది ఆడపడుచుల ఆటా పాటా..19 రాష్ట్రాల కళాకారుల నృత్యరీతులతో..పూలవాన కురిసినట్లుగా..వసంతం శోభిల్లినట్లుగా..31 జిల్లాల నుంచి తరలివచ్చిన తెలంగాణ అక్కాచెళ్లెల సంతోషతరంగాలతో ఎల్బీ స్టేడియం మార్మోగింది. దేశంలోనే మరెక్కడా లేని విశిష్ట పండుగను ప్రపంచానికి చాటి చెప్పేందుకు కేసీఆర్ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది.   తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా లాల్‌ బహదూర్ స్టేడియంలో నిర్వహించిన మహా బతుకమ్మ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. గిన్నిస్ రికార్డు లక్ష్యంగా తెలంగాణ భాషా, సాంస్కృతికశాఖ, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 25 అడుగుల ఎత్తయిన మహా బతుకమ్మ చుట్టూ భారతీయ కాలమానంలోని 60 సంవత్సరాలకు ప్రతిరూపంగా 60 బతుకమ్మలను పేర్చారు. సరిగ్గా సాయంత్రం 4.40 గంటలకు నిజామాబాద్ ఎంపీ కవిత శాస్త్రోక్తంగా గౌరవమ్మకు హారతి ఇచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించారు.   ఆ వెంటనే రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన 28 వేల మంది మహిళలతో కలిసి కవిత బతుకమ్మ ఆడారు.  స్టేడియం మధ్యలో ఏర్పాటు చేసిన అతిపెద్ద బతుకమ్మ చుట్టూ చేరిన మహిళలు పలు వరుసల్లో వలయాకారంలో తిరుగుతూ "బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..శ్రీలక్ష్మీ నీ మహిమలు గౌరమ్మ..చిత్రమై తోచునమ్మ గౌరమ్మ..చిత్తు చిత్తుల బొమ్మ..శివుడీ ముద్దుల గుమ్మ" అంటూ పాటకు తగ్గట్టు చేతులు ఆడిస్తూ పులకించిపోయారు. అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ..మహా బతుకమ్మ ద్వారా తెలంగాణ సంస్కృతి గొప్పదనం ప్రపంచానికి తెలిసిందన్నారు..   ఆటా..పాట..ఉత్సాహం..కలగలిపిన వేడుకే బతుకమ్మ అని.. గతంలో బతుకమ్మ ఆడుకునేందుకు కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చేదన్నారు.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతే ఇంత సంతోషంగా, సంబరంగా పండుగ చేసుకోగలుగుతున్నామని..తెలంగాణ ఘనవారసత్వ సాంస్కృతిక సంపదకు చిరునామాగా నిలిచిన బతుకమ్మను పరిరక్షించుకుందామన్నారు. అన్ని జాతులు కలిస్తేనే మానవజాతి..అన్ని పూలు కలిస్తేనే బతుకమ్మ అని అన్నారు. కార్యక్రమంలో ప్రదర్శించిన కథాకళి, కథక్, ఒడిస్సీ, భరతనాట్యం, కూచిపూడి కళారీతులు అందరినీ ఆకట్టుకొన్నాయి.      రవీంద్ర భారతి వేడుకలు: తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకలు ఎనిమిదవ రోజుకు చేరుకున్నాయి. వేడుకల్లో భాగంగా ఇవాళ రవీంద్ర భారతి ప్రధాన వేదికలో బ్రహ్మాకుమారీస్ ఆధ్వర్యంలో బతుకమ్మ జాతీయ సాంస్కృతికోత్సవం జరుగనుంది. అలాగే బతుకమ్మ ఫిల్మోత్సవాన్ని పురస్కరించుకొని రవీంధ్రభారతి ప్రివ్యూ ధియేటర్‌లో 207 బతుకమ్మ వీడియో పాటల ప్రదర్శన జరుగుతుంది.  

ఏ ఎమ్మెల్యే అయినా ఇలా చేస్తాడా..?

ప్రజల కోసం..ప్రజల చేత..ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు తప ఐదేళ్ల పదవికాలంలో ప్రజల కోసం పనిచేసిన క్షణాలు చాలా తక్కువ..అయితే అందరూ ఇలా ఉంటారని మా ఉద్దేశ్యం కాదు..రాజకీయం వ్యాపారత్మకంగా మారిన ప్రస్తుత కాలంలో మెజారిటీ రాజకీయ నాయకులు తమ స్వలాభాలు చూసుకుంటున్నారు తప్ప ప్రజల బాగోగులు పట్టించుకోవడం లేదన్నది ఎన్నో సర్వేలు రుజువు చేసిన అంశం. అయితే ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చిన వారు కొందరుంటారు..వారిలో ఒకరు ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సునీల్ దత్‌ ద్వివేది..ఇప్పుడు ఆయన దేశంలో హాట్ టాపిక్. ఫరూఖాబాద్-ఫతేగఢ్ రహదారిపై భీంసేన్ మార్కెట్ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి..   ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు తీవ్ర గాయాలపాలై రక్తపు మడుగులో ఉన్నారు..రోడ్డు మీద జనం అలా చోద్యం చూస్తూ ఉండిపోయారు తప్ప ఎవ్వరూ వారిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ముందుకు రాలేదు. సరిగ్గా అదే సమయంలో అటుగా వెళ్తున్న ఫరూఖాబాద్ ఎమ్మెల్యే సునీల్ దత్ వారిని చూసి వెంటనే కారు ఆపి..తన కారులోనే ఆస్పత్రికి తీసుకెళ్లారు.   తీరా అక్కడికి వెళ్లాకా..బాధితులను ఆస్పత్రికి లోపలికి తీసుకెళ్లేందుకు సరిపడా స్ట్రెచర్లు లేవు. అందుబాటులో ఉన్న వాటి ద్వారా ఇద్దరు క్షతగాత్రులను లోపలికి తీసుకెళ్లగా..మరొకరికి స్ట్రెచర్ లేదు. దీంతో ఆలస్యం చేయకుండా ఎమ్మెల్యే ద్వివేది సదరు బాధితుడిని తన భుజాలపైకి ఎక్కించుకొని ఎమెర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్లారు. తన భుజాలపై క్షతగాత్రుడిని మోసుకొచ్చిన ఎమ్మెల్యేను చూసిన ఆసుపత్రి సిబ్బంది, రోగులు, ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ తతంగాన్నంతా కొందరు యువకులు వీడియో తీసి సోషల్ మీడియా పెట్టడంతో అది వైరల్‌గా మారింది. అందరూ సునీల్‌దత్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలంటూ ఆకాశానికెత్తేస్తున్నారు.

ఇరాన్ మరో ఉత్తరకొరియా అవుతుందా..?

అమెరికాతో సహా ప్రపంచదేశాలు చేస్తోన్న హెచ్చరికలను బేఖాతరు చేస్తూ వరుస పెట్టి అణు, క్షిపణి పరీక్షల ప్రయోగాలను నిర్వహిస్తోంది ఉత్తర కొరియా..ఏకంగా జపాన్ భూభాగం మీదుగా క్షిపణిని ప్రయోగించి ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేలా చేసింది. ముఖ్యంగా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్..అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌లు ఎప్పటికప్పుడు కవ్వించే మాటలతో యుద్ధానికి సిద్ధమంటూ ప్రకటనలు చేస్తున్నారు.   ఆ వేడి చల్లారకపోగా..మధ్యలో ఇప్పుడు ఇరాన్ తయారైంది. అమెరికా హెచ్చరికలను, ఆంక్షలను ఏమాత్రం పట్టించుకోకుండా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. మధ్యంతర శ్రేణికి చెందిన మిస్సైల్‌ను తాము ప్రయోగించినట్లు ఇరాన్ తెలిపింది. ది కొర్రామార్ష్ శ్రేణికి చెందిన ఈ క్షిపని సుమారు 2000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఒకటి కంటే ఎక్కువ వార్‌హెడ్స్‌ను ఇది మోసుకెళ్లగలదు..ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, చైనా, రష్యా, యూరప్‌, ఆఫ్రికా, భారత్‌లోని పలు ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తాయని రక్షణ నిపుణులు తెలిపారు.   ఈ క్షిపణిని గత శుక్రవారం జరిగిన సైనిక పేరేడ్‌లో ప్రదర్శించారు. అయితే తమ దేశం క్షిపణి ప్రయోగాలకు దిగుతుందని ఇరాన్ అధ్యక్షుడు రౌహానీ ముందే క్లూ ఇచ్చారు. ఇరాన్‌ అవసరమైన ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటుందని జాతినుద్దేశించి మాట్లాడుతూ అన్నారు. ఈ ప్రకటన చేసిన మర్నాడే క్షిపణిని పరీక్షించడం గమనార్హం. మరోవైపు ఇరాన్ చర్యలపై అమెరికా తీవ్ర స్థాయిలో మండిపడింది. ఫ్రాన్స్ కూడా ఇరాన్ తీరును నిరసించింది. ఇరాన్ కూడా మరో ఉత్తరకొరియాలా తయారవుతుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ అన్నారు.