మైనారిటీలను లాగేసుకున్న మోడీ..?

బీజేపీ అంటే హిందూమతం..హిందూమతం అంటే బీజేపీ అన్నంతగా ఆ పార్టీ జనాల్లో ముద్ర వేసుకుందంటే అతిశయోక్తి కాదు. పార్టీ స్థాపన నుంచి నేటి వరకు ఆ పార్టీ ని ఇంతవరకు నెట్టుకొచ్చింది మతం కార్డే. మతతత్వంతో కొన్ని పరిస్థితుల్లో అధికారం లభిస్తే లభించవచ్చు గానీ అది ధీర్ఘకాలం కొనసాగదని బీజేపీ అధినాయకత్వం గుర్తించినట్లుంది. ఈ బాటలో ఇప్పటి వరకు సంఘ్ పరివార్, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ వంటి సంస్థలను రాజకీయ సాధనాలుగా ఉపయోగించుకుని ఢిల్లీ పీఠాన్ని బీజేపీ అధిరోహించిందన్నది జగమెరిగిన సత్యం. ఇంతటి సువిశాల దేశంలో హిందువులే అత్యధిక సంఖ్యాకులైనా..మూడున్నర దశాబ్దాల కాలంలో బీజేపీ ఒకటి రెండు సార్లే రాజ్యాధికారాన్ని ఎందుకు దక్కించుకుంది. వాజ్‌పేయ్ ఏర్పాటు చేసిన మొదటి మైనారిటీ ప్రభుత్వాన్ని లోక్‌సభలో ఏ ఒక్క పార్టీ గానీ, ఒక్క ఇండిపెండెంట్ గాని బలపరచక ఆ ప్రభుత్వం రెండు వారాలు తిరక్కుండానే ఎందుకు పతనమైంది. ఇలాంటి జవాబులేని ప్రశ్నలకు సమాధానాన్ని వెతికే పనిలో పడింది మోడీ-అమిత్‌షా ద్వయం.   ఎల్లప్పుడూ మతం కార్డునే ఉపయోగిస్తే ఫలితం ఉండదని..అందుకు భిన్నమైన పరిస్థితులను సృష్టించుకోవాలని ఈ జంట గుర్తించింది. తొలి నుంచి ముస్లిం సమాజంలో భారతీయ జనతా పార్టీ అంటే కాస్తంత ఏవగింపు..దానికి తోడు బాబ్రీ మసీదు విధ్వంసం భారతీయ ముసల్మాను‌లో కమలం పట్ల కఠిన వైఖరికి కారణమైంది. ఇకపోతే 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీఫ్, అసహనం అంటూ జరిగిన దాడులు, ఒత్తిడుల్లో ఎక్కువశాతం ముస్లిం వర్గాలపైనే అని ఓ అంచనా. అది హిందుత్వ వాదులు చేశారా..? లేక గిట్టని వారు చేశారా..? అన్న సంగతి పక్కనబెడితే గాయం మాత్రం బీజేపీకే అయ్యింది.   ఇక ఆ సంగతి పక్కనబెడితే ట్రిపుల్ తలాక్‌పై సుప్రీంకోర్టు వెలువరించిన సంచలనాత్మక తీర్పుతో ముస్లిం మహిళలల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 14 వందల సంవత్సరాలుగా ముస్లిం మహిళల జీవితాలకు శాపంగా మారిన ట్రిపుల్ తలాక్ విధానాన్ని పోయేలా చేసిన బీజేపీని వారు అభినందిస్తున్నారు. సెక్యులర్ జపం చేస్తూ..ఎన్నికల్లో హామీలు గుప్పించే మిగతా పార్టీలన్నింటికన్నా భిన్నంగా ఆలోచించిన మోడీ..ముస్లిం మహిళలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లయ్యింది.   ఈ పరిణామాల నేపథ్యంలో..ఈ సంవత్సరం చివరిలో, 2018లో జరగనున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2019లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మైనారిటీ ఓట్లు తమకే పడతాయని బీజేపీ నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రతిపక్షాలను ఆత్మరక్షణలో పడేసి మైనారిటీలకు తామే అండగా ఉంటామన్న భరోసాని కలిగించేందుకు తగిన తంత్రాన్ని మోడీ, షాలు రూపొందిస్తున్నారు. ఏది ఏమైనా ట్రిపుల్ తలాక్‌ విషయంలో మోడీ ముస్లిం మహిళల మనసు గెలుచుకున్నారన్నది మాత్రం నిజం.

3 తలాఖ్ లను మట్టికరిపించేందుకు కారణమైన…. 10 మంది!

ట్రిపుల్ తలాఖ్ … శతాబ్దాలుగా ముస్లిమ్ స్త్రీలని గజగజ వణికిస్తోన్న సంప్రదాయం. దశాబ్దాలుగా భారతదేశంలో వివాదాస్పదంగా నిలుస్తోన్న అంశం! ఎట్టకేలకు సుప్రీమ్ కోర్ట్ ట్రిపుల్ తలాఖ్ చట్ట వ్యతిరేకమని తేల్చేసింది. అంతే కాదు, పార్లమెంట్ దీనిపై తగిన చట్టం కూడా చేయాలని ఆదేశించింది. అప్పటి వరకూ కోర్టే ట్రిపుల్ తలాఖ్ ను నిషేధించింది! అయితే, ఈ చారిత్రక తీర్పు వెలువడిన సందర్భరంలో మనం పది మంది గురించి తెలుసుకోవాలి! వారెవరో తెలుసా?   ట్రిపుల్ తలాఖ్ ఈ రోజు రద్దైందంటే… కోట్లాది మంది ముస్లిమ్ మహిళల జీవితాలకు భరోసా కలిగిందంటే… అందుక్కారణం అయిదుగురు ధీర వనితలు! వాళ్లు ప్రాణాలకి తెగించి చేసిన న్యాయ పోరాటమే ఇవాళ్టి అంతిమ తీర్పుకి కారణం. ఉత్తరాఖండ్ కు చెందిన షయరా బానో ట్రిపుల్ తలాఖ్ పై కత్తి దూసిన తొలి మహిళ. కాశీపూర్ అనే ప్రాంతంలో వుండే ఆమెకు పదిహేనేళ్ల వైవాహిక జీవితం తరువాత, ఇద్దరు పిల్లలు పుట్టాక భర్త ఏకపక్షంగా ట్రిపుల్ తలాఖ్ చెప్పాడు. 2015నుంచీ ఆమె అలసట చెందకుండా దురాచారంపై పోరాడి విజయం సాధించింది!   రాజస్థాన్ లోని జైపూర్ కి చెందిన అఫ్రీన్ రెహ్మాన్ 2014లో వివాహం చేసుకుంది. ఓ మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా ఆమెకు పెళ్లి జరిగింది. కాని, కొంత కాలానికే ఆమెను అత్తింటి వారు అదనపు కట్నం కోసం వేధించారు. ఆ బాధలు తాళలేక పుట్టింటికి వచ్చిన అఫ్రీన్ రెహ్మాన్ భర్త పోస్టు ద్వారా ట్రిపుల్ తలాఖ్ చెప్పేశాడు!   ఉత్తర్ ప్రదేశ్ లోని రామ్ పూర్ కు చెందిన గుల్షన్ పర్వీన్ కూడా అత్తింటి అదనపు కట్నపు వేధింపులు తాళలేకే పుట్టింటికి చేరింది. 2013లో ఆమె పెళ్లికాగా 2015లో భర్త ఆమెకు ట్రిపుల్ తలాఖ్ చెప్పాడు. బెంగాల్ లోని హౌరాకు చెందిన ఇష్రత్ జహాన్ కూడా ట్రిపుల్ తలాఖ్ బాధితురాలు. 4పిల్లల తల్లి అయిన ఆమె పదిహేనేళ్ల వైవాహిక జీవితం తరువాత 2015లో ట్రిపుల్ తలాఖ్ బారిన పడాల్సి వచ్చింది. ఆమె భర్త దుబాయ్ నుంచి ఫోన్ లో ట్రిపుల్ తలాఖ్ చెప్పేశాడు! ఇద్దరు పిల్లల తల్లైన ఉత్తర్ ప్రదేశ్ షహ్రాన్ పూర్ కు చెందిన అతియా సబ్రి కూడా వరకట్న వేధింపుల తరువాత ట్రిపుల్ తలాఖ్ హింసకు గురైంది! 2012లో ఆమె పెళ్లి కాగా 2015లో ఆమెను ట్రిపుల్ తలాఖ్ కబళించింది!   షాయరా బానో, అఫ్రీన్ రెహ్మాన్, గుల్షన్ పర్వీన్, ఇష్రత్ జహాన్, అతియ సబ్రి…. వీళ్లు అయిదుగురు ట్రిపుల్ తలాఖ్ పై పోరాటం చేసిన వారైతే మరో అయిదుగురు కూడా చారిత్రక ట్రిపుల్ తలాఖ్ కేసుతో ముడిపడి వున్నారు! వారే ట్రిపుల్ తలాఖ్ చెల్లదని తీర్పునిచ్చిన అయిదుగురు సుప్రీ్మ్ కోర్టు జడ్జ్ లు!   ట్రిపుల్ తలాఖ్ కేసుని విచారించిన అయిదుగురు న్యాయమూర్తులు అయిదు భిన్న విశ్వాసాలకు చెందిన వారు కావటం మరింత విశేషం! ప్రస్తుత సుప్రీమ్ ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖెహర్ జన్మతహ సిక్కు మతస్థుడు. ఆయనే కాక ట్రిపుల్ తలాఖ్ కేసుని విచారించిన మరో జడ్జ్… జస్టిస్ కురియన్ జోసెఫ్. ఈయన క్రిస్టియన్! ఇక అయిదుగురిలో మరో న్యాయమూర్తి జస్టిస్ నారీమన్. ఇతని మతం… పార్సీ! ట్రిపుల్ తలాఖ్ చారిత్రక తీర్పునిచ్చిన నాలుగో జస్టిస్… యూయూ లలిత్! ఈయన హిందూ మతానికి చెందిన వారు. ఇక ట్రిపుల్ తలాఖ్ ప్రధానంగా ముస్లిమ్ మతస్థుల సమస్య కాబట్టి… అయిదుగురు సుప్రీమ్ జడ్జ్ లలో ఒక ముస్లిమ్ న్యాయమూర్తి కూడా వున్నారు! ఆయనే అబ్దుల్ నజీర్!   మొత్తం అయిదుగురు జడ్జీల్లో ఇద్దరు ట్రిపుల్ తలాఖ్ కు వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. కాని, హిందూ, క్రిస్టియన్, పార్సీ న్యాయమూర్తుల మెజార్జీ అభిప్రాయంతో ట్రిపుల్ తలాఖ్ చట్ట వ్యతిరేకంగా ప్రకటితమైంది! ఏది ఏమైనా అయిదుగురు పట్టువదలని ముస్లిమ్ మహిళల పోరాటానికి అయిదుగురు భిన్న మతస్థులైన జడ్జీలు తగిన విదమైన తీర్పునిచ్చారు! ఇదే అసలు సిసతైన ఇండియా!

జగన్… నంద్యాల నష్టాన్ని దిల్లీలో పూడ్చుకోవాలనుకుంటున్నారా?

ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయా? పరిస్థితి చూస్తుంటే అలానే కనిపిస్తోంది! అందుక్కారణం… ఇవాళ్టితో ప్రచారం ముగిసి త్వరలోనే ఫలితం తేలనున్న నంద్యాల ఉప ఎన్నిక ఒక్కటే కాదు. మరో కారణమూ వుంది! దిల్లీ నుంచి వైసీపీకి వస్తోన్న గ్రీన్ సిగ్నల్స్! జాతీయ మీడియాలో జగన్ ఎన్డీఏలోకి వచ్చేస్తున్నాడని ఒకటే హడావిడి జరుగుతోంది. ఇటు నంద్యాలలోనూ టీడీపీ, వైసీపీ ఫుల్ లెంగ్త్ వార్ లో తలమునకలయ్యాయి. ఈ రెండూ … 2019 ఎన్నికల నాటికి నెలకొనబోయే పరిస్థితులకి కారణం అవ్వనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు…   ముందుగా మాట్లాడాల్సింది నంద్యాల ఉప ఎన్నిక. సాధారణంగా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏ హడావిడి వుండదు. చనిపోయిన నాయకుడి కుటుంబం వారే మళ్లీ ఎన్నికైపోతుంటారు. కాని, నంద్యాలలో మాత్రం జగన్ సీన్ మొత్తం మార్చేశారు. ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని 2019 ఎన్నికలకు సెమీఫైనల్ అంటూ అనవసర బిల్డప్ తీసుకొచ్చారు. దాంతో టీడీపీ కూడా సీటు తమ చేయి జారిపోకుండా వుండేందుకు సీఎంతో సహా పెద్ద పెద్ద నేతలందర్నీ మోహరించింది! అయితే, ఇప్పుడు అధికార పక్షం కన్నా ప్రతిపక్షానికే నంద్యాల టెన్షన్ ఎక్కువగా పట్టుకుంది…   నంద్యాలని ప్రెస్టేజ్ ఇష్యుగా తీసుకున్న జగన్ తన అభ్యర్థిని గెలిపించుకుంటే రానున్న ఎన్నికలకి ఉత్సాహంగా ప్రిపేర్ అవ్వొచ్చు. కాని, ఒకవేళ ఓడిపోతే? ఇప్పుడు ఇదే వైసీపీ నాయకుల్ని భయపెట్టెస్తోంది. ఇప్పుడిప్పుడే రానున్న ఎన్నికల మీద ఆశలు పెరుగుతోంటే… ఈ ఉప ఎన్నిక ఓటమి అనవసర నెగిటివ్ ఫీలింగ్ క్రియేట్ చేస్తుందోమోనని ఆందోళన చెందుతున్నారు! ఇక అధికార పక్షం కాబట్టి… టీడీపీకి గెలిస్తే లాభమే తప్ప ఓడితే మరీ దారుణమైన నష్టమంటూ ఏం లేదనే చెప్పాలి!   రాష్ట్రంలోని నంద్యాలలో ఒక యుద్ధం జరుగుతోంటే… దేశ రాజధాని దిల్లీలోనూ పావులు కదుపుతున్నారు జగన్! ఆయన గాలి జనార్దన్ రెడ్డి సాయంతో ఎన్డీఏలో చేరేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారని ఆర్నాబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీ చెప్పింది. అంతకు ముందే బీజేపి నేత ఒకాయన 2019లో తమకు ఎక్కువ సీట్లు ఎవరిస్తే వారితో ముందుకు పోతామని కుండ బద్ధలు కొట్టారు! అంటే… నంద్యాల ఉప ఎన్నికలో ఓటమి ఎదురై వ్యతిరేక పవనాలు వీచినా… ప్లాన్ బీతో రెడీ అవుతోందన్నమాట వైసీపీ!   నంద్యాలలో ఓటమి, తరువాత 2019లోనూ జగన్ సీఎం అవ్వటం సాధ్యం కాదని సంకేతాలు వెలువడితే… ఎన్డీఏలో చేరటం ద్వారా దిల్లీలోనన్నా గిట్టుబాటు అయ్యేలా చూసుకోవటం జగన్ ప్లాన్ లా కనిపిస్తోంది. కమలదళానికి ఏపీలో ఎక్కువ సీట్లు ముట్టజెప్పి 2019లోనూ మోదీ సర్కార్ లో భాగం అయితే ఆంధ్రాలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయినా కొంత వరకూ డ్యామేజ్ కంట్రోల్ అవుతుంది. ఇప్పటికే అయిదేళ్లు ప్రతిపక్షంలో వుండాల్సి వచ్చిన జగన్ పార్టీ నేతలు ఇంకా మరిన్ని సంవత్సరాలు స్టేట్ లో, సెంట్రల్ లో ప్రభుత్వానికి, అధికారానికి బయట వుండటం దుర్భరంగా ఫీలవుతూ వుండవచ్చు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం బీజేపిని ఏపీలో బలపర్చి… దిల్లీలో వైసీపీ గిట్టుబాటు చూసుకోటం!   జగన్ ఎన్డీఏ ఎంట్రీ, 2019నాటికి బీజేపి ఎవరితో వుంటుంది… ఇలాంటి అనేక కీలక పరిణామాలకి సమాధానం నంద్యాల ఉప ఎన్నిక ఫలితం వెలువడడంతోనే దొరకవచ్చు!

చైనాపైన… ఇండియా యుద్ధం కాని యుద్ధం!

భారత్ పై చైనా యుద్ధం ప్రకటించింది! ఇది అందరికీ తెలిసిందే. కావాలనే ఆ దేశం కవ్విస్తోంది. ఒకవైపు డోక్లామ్ లో నెలల తరబడి తిష్టవేసి కయ్యానికి కాలుదువ్వుతోంది. మరో వైపు తాజాగా లద్ధాఖ్ లో కూడా లడాయికి దిగింది. కాని, బీజింగ్ లోని పాలకులు మాత్రం తమకేం తెలియదంటూ దొంగ నాటకాలు ఆడుతున్నారు. మొత్తం మీద డ్రాగన్ ఎలాగైనా ఇండియాని కాల్పుల దాకా తీసుకొచ్చి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాలని తాపత్రయపడుతోంది. కాని, ఇండియా మాత్రం కూల్ గానే కనిపిస్తోంది. అయితే, మరో మూల నుంచి మోదీ సర్కార్ సైలెంట్ గా చైనాపై యుద్ధానికి దిగుతోందని నిపుణులు అంటున్నారు!   చైనాపై నిశ్శబ్ధ యుద్దామా అంటారా? అవును… నిశ్శబ్ద యుద్ధమే! పైగా ఇది చైనా మాదిరిగా ఆర్మీని ఉపయోగించి, రెచ్చగొట్టి, రాళ్లు రువ్వి, తోసుకుని, తిట్టుకునే కవ్వింపు కూడా కాదు. మరి ఏంటి అంటారా? ఇన్ డైరెక్ట్ వార్! డ్రాగ్ న్ను ఎక్కడ గిల్లితే ఆ దేశానికి బాగా మంట పుడుతుందో అక్కడ మెలిపెట్టాలని ఇండియా నిర్ణయించుకుంది. ఆల్రెడీ చర్యలు కూడా మొదలు పెట్టింది!   చైనాకు ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది మన సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ( సీఈఏ ). ముందు ముందు భారతీయ పవర్ స్టేషన్లు, గ్రిడ్లు భద్రంగా వుండేందుకు, సైబర్ దాడులు జరక్కుండా వుండేందుకు తగిన చర్యలు తీసుకోవాలనుకుంటోంది. అందుకోసం తగిన రోడ్ మ్యాప్ కూడా తయారవుతోందని స్వయంగా విద్యుత్ శాఖా మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఇక మీదట కాంట్రాక్టులు ఇచ్చేప్పుడు ఇండియన్స్ కి , ఇండియన్ కంపెనీలకి తొలి ప్రాధాన్యత వుంటుందని ఆయన అన్నారు. త్వరలోనే చైనీస్ కంపెనీలకు రకరకాల రూల్స్ తో చెక్ పెట్టనున్నారు. పదేళ్ల నుంచీ సదరు కంపెనీ ఇండియాలో కొనసాగుతూ వుండాలి, కంపెనీ టాప్ పొజీషన్లలో భారతీయ పౌరులు వుండి వుండాలి, ఇలాంటివే నిబంధనలే కాక మరికొన్ని టెక్నికల్ రూల్స్ కూడా చైనా కంపెనీలకు చుక్కలు చూపించే అవకాశాలున్నాయి…   విద్యుత్ రంగంలోనే కాదు టెలికామ్ రంగంలోనూ కామ్ గా తన పని తాను చేసుకుపోతోంది ఇండియా. కొద్ది రోజుల క్రితమే స్మార్ట్ ఫోన్ల తయారీలో ప్రస్తుతం పాటిస్తోన్న భద్రతా పరమైన చర్యలు తెలపాల్సిందిగా… ఎలక్ట్రానిక్స్ , ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 21 కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది! సహజంగానే వీటిలో అత్యధిక కంపెనీలు చైనీస్! జియోమీ, లెనోవో, ఓప్పో, వివో, జియోనీ లాంటి కోట్లాది రూపాయలు గడిస్తోన్నవి అన్నీ వున్నాయి…   విద్యుత్, టెలికామ్ తో మొదలైన ఈ ఇన్ డైరెక్ట్ వార్ ముందు ముందు ఇతర రంగాలకు కూడా విస్తరించవచ్చని నిపుణులు అంటున్నారు. చైనాకు ఇండియాలో లక్షల కోట్ల మార్కెట్ వున్నా తెంపరితనంతో కయ్యానికి కాలు దువ్వుతోంది. అలాగే, మరో వైపు పాకిస్తాన్ తో కలిసి దుర్మార్గ రాజకీయం చేస్తోంది. ఇన్ని చేస్తూ కూడా అప్పన్నంగా ఇండియా నుంచి కోట్లు డండుకోవాలని నిర్ణయించుకుంది. ఇది జరక్కుండా వుండేలా కఠిన చర్యలు మొదలు పెట్టింది భారత్. ఇది మన లోకల్ కంపెనీల సంక్షేమం దృష్ట్యా కూడా తక్షణ అవసరం అంటున్నారు జాతీయవాదులు.   ఇప్పటికే జపాన్ లాంటి దేశాలు స్పష్టంగా తమ మద్దతు ఇండియాకు ప్రకటించాయి. అమెరికా కూడా మన వైపునే మాట్లాడుతోంది. ఈ రాజకీయ వ్యూహం కాకుండా ఆర్దికంగా కూడా చైనాను కట్టడి చేయటం తప్పనిసరిగా అభినందించాల్సిన విషయమే!

బాబునే కాదు… బాలయ్య బాబునీ టార్గెట్ చేస్తోన్న వైసీపీ! లాభమా? నష్టమా?

  నంద్యాల సంగ్రామం భారీ యుద్ధంగానే పరిణమించింది! ఏదో సాదాసీదా ఉప ఎన్నికగా ముగుస్తుందనుకున్న పోరు కాస్తా ఇప్పుడు సాధారణ ఎన్నికల రేంజ్లో కాక రేపుతోంది! అయితే, ఇందుకు కారణం టీడీపీనా? వైసీపీనా? రెండూ అనే చెప్పాలి! అధికార పక్షం ప్రిస్టేజ్ గా తీసుకుంటే… ప్రతిపక్షం రానున్న ఎలక్షన్స్ కి ప్రిపరేషన్ గా తీసుకుంటోంది! అందుకే, కేవలం ఒకే ఒక్క సీటు కోసం ఓ భారీ యుద్ధమే కొనసాగిస్తున్నారు బాబు, జగన్ వర్గంలోని వారంతా!   నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ దాడుల సెగ బాలయ్య బాబుకి కూడా తప్పటం లేదు. ఇన్ని రోజులు చంద్రబాబును టార్గెట్ చేసిన వైసీపీ మద్దతుదారులు తాజాగా సోషల్ మీడియాలో బాలయ్య బాబును ఆడిపోసుకుంటున్నారు. వారు వైరల్ చేస్తోన్న వీడియో బాలకృష్ణ ఓ అభిమానిని కొట్టింది! ఆయన ఎందుకు అసహనానికి గురయ్యారు? అలా ఎవరో ఒక ఫ్యాన్ మీద చేయి చేసుకుంటే హిందూపురం ఎమ్మెల్యేకి వచ్చే లాభం ఏంటి? ఇలాంటివేవీ ఆలోచించకుండా బాలయ్య దురుసు ప్రవర్తన అంటూ వైసీపీ అల్లరి చేస్తోంది! అంతే కాదు, ఫ్యాన్ పార్టీ నంద్యాల అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి, బాలకృష్ణ ఫ్యాన్స్ హర్ట్ అయ్యేలా కామెంట్స్ చేశారు! ఆయన కోపమొస్తే ఎవర్ని పడితే వార్ని కొడతారంటు ఎద్దేవ చేశారు!   బాలకృష్ణ నంద్యాల ప్రచారంలో వైసీపీని రాజకీయంగానే టార్గెట్ చేశారు. ఆయన జగన్ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేయమని మాత్రమే అన్నారు. ఎక్కడా ఎవర్నీ పర్సనల్ గా విమర్శించలేదు. అయినా, వైసీపీ వారు ఆయన ఓ వ్యక్తిపై చేయి చేసుకుంటే దాన్ని గురించి రాద్ధాంతం చేస్తున్నారు. కనీసం అలా జరగటానికి కారణం కూడా చెప్పకుండా విచ్చలవిడి కామెంట్లు, షేరింగ్ లకు తెగబడుతున్నారు. కాని, జనం ఓటు వేయటానికి బూతుకి వచ్చేటప్పుడు సోషల్ మీడియా హంగామాలు ప్రభావం చూపుతాయా? అదీ బాలకృష్ణ లాంటి ఓ ఇమేజ్ వున్న అగ్ర నటుడు, నందమూరి తారకరామారావు కొడుకు…. ఆయన పై జనం ఓ వైరల్ వీడియో చూసి సీరియస్ అయిపోతారా? ఇది వైసీపీ ఆలోచించుకోవాలి! రాజకీయ నాయకుల్ని పర్సనల్ గా టార్గెట్ చేయటమే తప్పు… అటువంటిది సినీ గ్లామర్ , కోట్లాది మంది అభిమానులున్న బాలకృష్ణ లాంటి హీరో వ్యక్తిత్వాన్ని కించపరటం మరింత తప్పు. దీని వల్ల పెద్దగా లాభం వస్తుందనైతే ఆశించటం దండగ! ఇప్పటికే జగన్ చంద్రబాబుని, రోజా మంత్రి అఖిలప్రియని పర్సనల్ గా టార్గెట్ చేశారు. ఇప్పుడు బాలకృష్ణను కూడా వైసీపీ వారు వ్యక్తిగత దూషణలతో టార్గెట్ చేస్తున్నారు. దీని ఫలితం ఎన్నికల కౌంటింగ్ నాడు మాత్రమే తెలుస్తుంది!   ఒకవైపు జగన్ శిబిరం వ్యక్తిగత దాడులతో రచ్చ చేస్తుంటే… జగన్ పుట్టక ముందు నుంచే పాలిటిక్స్ లో వున్న చంద్రబాబు తన అనుభవంతో కూల్ గా పని చేసుకుపోతున్నారు. కర్నూల్ లో బలమైన నేతగా వున్న వైసీపీ నాయకుడు గంగుల ప్రతాప్ రెడ్డిని టీడీపీలోకి ఆకర్షించగలిగారు! శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా చక్రఫాణి రెడ్డీల్ని తమ వైపుకు లాగిన వైసీపీకి ఇది నిజంగా నష్టమే! గంగుల ప్రతాప్ రెడ్డి మద్దతు దారులు కర్నూల్ లో చెప్పుకోదగ్గ స్థాయిలో వుంటారు. వారి ప్రభావం కేవలం నంద్యాల ఉప ఎన్నికకే కాదు రానున్న సాధారణ ఎన్నికపై కూడా తప్పక పడుతుంది!

తప్పులు పలుకుతోన్న రాహుల్… తిప్పలు తప్పని కాంగ్రెస్!

  కాంగ్రెస్ ముక్త్ భారత్… ఈ నినాదం మోదీ నోట వచ్చింది మొదలు బ్యాడ్ టైం నడుస్తూనే వుంది హస్తం పార్టీకి! అయితే, అందుక్కారణం నిజంగా మోదీనో, మరో ఇతర పార్టీనో కాదు! స్వయంగా కాంగ్రెస్ హై కమాండే! ఇంకా స్పష్టంగా చెప్పాలంటే… కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ! ఈ మధ్య చాలా రోజులుగా సోనియా యాక్టివ్ గా వుండటం లేదు. ఆమె పాల్గొనే మీటింగ్ లు, ఇస్తోన్న స్పీచ్ లు బాగా తగ్గిపోయాయి. ఆమె బాధ్యత తాను తీసుకోవాల్సిన రాహుల్ గాంధీ ఎప్పుడు ఇంట్లో వుంటాడో, ఎప్పుడు విదేశాలకు, ఎందుకు వెళాతాడో అర్థం కాని పరిస్థితి! దీనికి తోడు ఈ మధ్య కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నోరు తెరిస్తే చాలు వివాదాలు, వినోదాలు దొర్లిపొతున్నాయి. ఆయన మాట్లాడే తప్పులు పదే పదే సుబ్రమణ్యం స్వామి ముద్దుగా పిలిచిన పప్పు అన్న పదాన్నే గుర్తుకు తెస్తున్నాయి…   అతి త్వరలో కాంగ్రెస్ పార్టీ డూ ఆర్ డై ఎన్నికలు ఎదుర్కోబోతోన్న రాష్ట్రం కర్ణాటక. గుజరాత్ లాంటి రాష్ట్రంలోనూ ఎన్నికలున్నా అక్కడ గెలుపు అవకాశాలు దాదాపు శూన్యం! ఇక మిగిలింది దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటక. అయితే, అక్కడ సిద్ధరామయ్య సర్కార్ హడావిడి నిర్ణయాలు చూస్తుంటే కాంగ్రెస్ టెన్షన్ లో వున్నట్టు ఈజీగానే అర్థమైపోతోంది. తాజాగా ఇందిరా క్యాంటీన్స్ అంటూ ఓ కాపీ పథకం ప్రవేశపెట్టారు కన్నడ సీఎం. అందులో ప్రత్యేకతేం లేదు… తమిళనాడులో జయలలిత అమ్మ క్యాంటీన్ల పేరుతో చేసిన పనే సిద్ధారామయ్య చేస్తున్నారు. అయితే, 5రూపాయలకు టిఫిన్, తక్కువ ధరకు భోజనం ఆల్రెడీ ఇంకా అనేక రాష్ట్రాల్లో అమల్లో వుంది. ఏపీలో , తెలంగాణలో, ఉత్తర్ ప్రదేశ్ లో ఇలాంటి చీప్ అండ్ బెస్ట్ క్యాంటీన్స్ విజయవంతంగా నడుస్తున్నాయి.   ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని అయినా సరే… సిద్ధరామయ్య ఇంత ఆలస్యంగా బెంగుళూరులో ఇందిర క్యాంటీన్స్ ప్రారంభించటం ఆనందించాల్సిన విషయమే! కాని, తమాషా అంతా ఈ క్యాంటీన్ల ప్రారంభోత్సవానికి వచ్చిన రాహుల్ స్పీచ్ తోనే జరిగింది. తన నాన్నమ్మ ఇందిరా గాంధీ పేరున కన్నడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరా క్యాంటీన్స్ మొదలు పెడితే రాహుల్ అమ్మ క్యాంటీన్స్ అన్నాడు! మళ్లీ వెంటనే సర్దుకుని ఇందిర క్యాంటీన్స్ అన్నాడు. ఆ తరువాత, త్వరలోనే బెంగుళూరులోని అన్ని నగరాల్లో ఇందిర క్యాంటీన్లు మొదలవుతాయని అన్నాడు! బెంగుళూరు సిటీలో మళ్లీ వివిధ నగరాలు వుండటం ఏంటో ఎవరికీ అర్థం కాలేదు! కేవలం 5నిమిషాలు సాగిన రాహుల్ స్పీచ్ లో ఒకట్రెండు సార్లు క్యాంటీన్ అనకుండా క్యాంపైన్ అన్నాడట కూడా!   ఉపన్యాసం ఇస్తున్నప్పుడు పొరపాట్లు జరగటం సహజం. దాన్ని సరదాగా తీసుకొని ఊరుకోవచ్చు. కాని, రాహుల్ భారతదేశ అతి పురాతన పార్టీకి ఉపాధ్యక్షుడుగా వుంటూ ఇలాంటి చిన్న చిన్న తప్పులు పదే పదే చేయటం… అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది! ఆ మధ్య ఓ సారి గాంధీల వారసుడు ఆలూ కి ఫ్యాక్టరీ అన్నాడు! ఆలుగడ్డల కర్మాగారం అంటే అర్థం ఏంటో స్పీచ్ విన్న వారికి ఎవరికి అర్థం కాలేదు!   రాహుల్ గాంధీ పదాలు సరిగ్గా పలికినా పలక్కపోయినా కర్ణాటక కాంగ్రెస్ కు వచ్చే లాభం, నష్టం పెద్దగా వుండకపోవచ్చు. కాకపోతే, ఒక వైపు ఇందిర క్యాంటీన్ల ప్రారంభోత్సవ హడావిడిలో సీఎం తలమునకలైతే… మరో వైపు బెంగుళూరు నగరం మొత్తం గత శతాబ్దంలో ఎప్పుడూ లేని విధంగా భీభత్సమైన వర్షాన్ని ఎదుర్కొంది. ఆ వర్షం నుంచి ఇంకా తేరుకోక ముందే రాహుల్ వచ్చి క్యాంటీన్లు ప్రారంభించాడు. ఆయన రాక కోసం గంటల తరబడి రోడ్లు మూసి వేయటంతో జనం విపరీతమైన అసహనానికి లోనయ్యారట! అలాగే చాలా చోట్ల ఈ సరికొత్త ఇందిరా క్యాంటీన్ల ఏర్పాటు స్థానికులు వ్యతిరేకిస్తున్నారట. క్యాంటిన్ల నిర్వహణ వల్ల వచ్చి పడే చెత్తా, చెదారం గురించి ఆందోళన చెందుతున్నారట!   ఇందిరా క్యాంటీన్ల పథకం కన్నడ కాంగ్రెస్ కు ఎన్ని ఓట్లు తెచ్చి పెడుతుందో చూడాలి …

ఈ నెంబర్స్ ఇండియా, పాకిస్తాన్ లకు ఎంతో ఇంపార్టెంట్! ఎందుకు?

  ఆగస్ట్ 14…. మనకు పెద్ద ప్రత్యేకం ఏం కాదు! కాని, ఆగస్ట్ 15 మనకు చాలా స్పెషల్! ఆ రోజే మనకు స్వాతంత్ర్యం సిద్ధించింది. అయితే, ఆగస్ట్ 14 మన పక్క దేశానికి వెరీ వెరీ స్పెషల్! పాకిస్తాన్ పుట్టింది ఆ రోజే! మనకన్నా ఒక్క రోజు ముందు పాకిస్తాన్ కు స్వేచ్ఛ లభించింది. అయితే, అఖండ భారత్ నుంచి పాకిస్తాన్, నేటి బంగ్లాదేశ్ లు విడిపోయిన రోజుగా.. ఆగస్ట్ 14 మనకు మాత్రం ఓ విషాద దినం! మరి మన 70ఏళ్లు పూర్తైన మన స్వతంత్ర ప్రస్థానం వేళ… ఓ సారి కొన్ని ముఖ్యమైన సంఖ్యలపై దృష్టి సారిద్దామా! ఈ కీలకమైన నెంబర్లు మనకే కాదు, పాకిస్తానీలకు, బంగ్లాదేశీలకు కూడా ఎంతో ముఖ్యమే!   190… అవును… 190సంవత్సరాల సుదీర్ఘ కాలం మన దేశాన్ని బ్రిటీషర్లు ఆక్రమించారు. పరిపాలించారు. దోపిడీ చేశారు. వెళుతూ వెళుతూ ఇండియా, పాకిస్తాన్ గా అఖండ భారత్ ని విడదీసి వెళ్లారు.   400మిలియన్లు… అంటే 40కోట్లు! ఈ సంఖ్య డెబ్బై ఏళ్ల కిందటి భారత దేశ జనాభ! మనల్ని బ్రిటీష్ వాళ్లు వదిలి వెళ్లేటప్పుడు ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ భూభాగాలు మొత్తంలో కలిపి వున్న జనం సంఖ్య!   40రోజులు… ఈ సంఖ్య ఏంటో తెలుసా? బ్రిటీష్ జడ్జ్ సిరిల్ రాడ్ క్లిఫ్ కు విధించిన కాల పరిమితి! కేవలం 40రోజుల్లో కోట్లాది మంది భారతీయుల బతుకుల్ని, చావుల్ని నిర్దేశించే దేశ విభజన చిత్రపటాన్ని గీసేశాడు ఆ తెల్ల న్యాయాధికారి! అతను చేసిన విభజన తరువాత విపరీతమైన ప్రాణ నష్టం సంభవించింది…   3800మైళ్లు… అంటే 6100కిలో మీటర్లు! ఇంత సుదీర్థ సరిహద్దులు ఇండియా , పాకిస్తాన్ ల మధ్య ఏర్పడ్డాయి. ఆనాటి తూర్పు పాకిస్తాన్… అంటే నేటి బంగ్లాదేశ్ … పశ్చిమ పాకిస్తాన్ కు 1000మైళ్ల దూరంలో వుండేది! మధ్యలో భారత భూభాగం వుండగా తూర్పున, పశ్చిమాన పాకిస్తాన్ వుండేలా విభజన జరిగింది.   0… అవును సున్నా సార్లు పాకిస్తాన్ అన్న పేరు ఉచ్ఛరించారు అప్పటి బ్రిటీష్ ప్రధాని అట్లీ, భారత వైస్రాయ్ మౌంట్ బ్యాటన్! దేశ విభజన ప్రకటన చేస్తూ, జూన్ 3, 1947న… బ్రిటీష్ ప్రధాని, వైస్రాయ్ ఒక్కసారి కూడా పాకిస్తాన్ అన్న పదం వాడలేదు!   48గంటలు… ఇండియాకి ఫ్రీడమ్ డిక్లేర్ చేయటానికి 48గంటల ముందు నుంచీ బ్రిటీష్ సేనలు తమ స్వదేశానికి బయలుదేరటం ప్రారంభించాయి. కాని, పూర్తిగా తెల్ల వారి సైన్యం ఇంటి ముఖం పట్టటానికి 1948 ఫిబ్రవరీ వరకూ సమయం పట్టింది!   1మిలియన్… అంటే 10లక్షలు! ఈ ఒళ్లు గగుర్పొడిచే సంఖ్య భారత్ , పాకిస్తాన్ విభజన కారణంగా చనిపోయిన అభాగ్యులది! ఇది తప్పని వాదించే వారు చాలా మంది వున్నారు. 20లక్షల మందికి పైగానే ప్రాణాలు కోల్పోయి వుంటారని అంచన!   83వేలు! మీ గుండె రాయి చేసుకోండి! ఈ సంఖ్య దేశ విభజన కాలంలో అత్యాచారాలకి, కిడ్నాప్ లకి గురైన అమ్మాయిలు, స్త్రీల సంఖ్య! సహజంగానే… ఇది కూడా ఖచ్చితమైన లెక్క కాదు! ఇంకా ఎక్కువ సంఖ్యలోనే అభాగిణులు తమ మానాలు, ప్రాణాలు కోల్పోయి వుండవచ్చు!   15మిలియన్లు… అంటే ఒక కోటీ యాభై లక్షలు! ఇంత మంది భారత్ , పాకిస్తాన్ ల మధ్య వలస వెళ్లారు! అత్యధికులు హిందూ, సిక్కు మతస్థులు పాకిస్తాన్ నుంచి భారత్ వచ్చేశారు!   4లక్షలు… అవును… నాలుగు లక్షల మంది పాకిస్తాన్ నుంచి కాలి నడకన ఎర్రటి ఎండలో భారతదేశం వలసొచ్చారు! వారంతా ఒకే క్రమ వరుసలో క్యూ కట్టినట్టు స్వంత దేశంలో శరణార్థలై నడిచొచ్చారు!   2లక్షల మైళ్లు… శరణార్థుల్ని మోసుకుని వచ్చిన ట్రైన్లు అప్పట్లో తిరిగిన మొత్తం దూరం సంఖ్య ఇది!   3…. ఇప్పటికి మూడు సార్లు మనకు , పాకిస్తాన్ కు మధ్య యుద్ధం జరిగింది! మూడు సార్లు మనమే గెలిచాం. ఒకసారైతే విభజన సమయంలో తూర్పు పాకిస్తాన్ గా ఏర్పడ్డ భూభాగం బంగ్లాదేశ్ గా ఆవిర్భవించింది! ఇందిరా గాంధీ సమయంలో జరిగిన ఈ పరిణామం భారతదేశానికి ఎంతో మేలు చేసిందని చెప్పాలి! ఇరువైపుల పాకిస్తాన్ వుంటే… ఇప్పటి మన పరిస్థితి మరింత దారుణంగా వుండేది!

కొరియా రెచ్చగొడుతోంది! యూఎస్ రెచ్చిపోతోంది! చైనా చిరాకుపడుతోంది!

  ఇప్పుడు ప్రపంచం దృష్టి మొత్తం కేంద్రీకృతమైన చోటు ఉత్తర కొరియా. అక్కడ ఏ క్షణమైనా అమెరికా నిప్పుల వర్షం కురిపించవచ్చని చాలా మంది భావిస్తున్నారు. యుద్ధం వచ్చేది కాదు, అన్నీ ఒట్టి బెదిరింపులే అనేవారు ఇంకా వున్నారు. కాని, పైకి ఎవరు ఎన్ని మాటలు చెబుతున్నా లోలోన యుద్దం జరగదని నమ్మకమున్న వారు చాలా తక్కువ! చివరకు, ఇంత కాలం హాయిగా తమాషా చూస్తూ వచ్చిన చైనా కూడా ఇప్పుడు అమెరికా, కొరియాల మధ్య ఏం జరుగుతుందోనని బెంగ పడుతోన్నట్టు కనిపిస్తోంది!   ఒకవైపు మనతో డోక్లామ్ లో కోరి కొరివితో తల గొక్కుంటున్న చైనా ఉత్తర కొరియాను మాత్రం ఆ పని చేయొద్దని హెచ్చరిస్తోంది. అధికారికంగా కాకున్నా అక్కడి ప్రధాన పత్రికల సంపాదకీయాల్లో ఆ భావం వచ్చేలా రాయిస్తోంది. తాజాగా ఓ పత్రిక ఉత్తర కొరియాను సీరియస్ గా హెచ్చరించింది. యుద్ధం అమెరికా మొదలు పెడితే చైనా అడ్డుకుంటుంది తప్ప నార్త్ కొరియా బలుపుతో అడుగు ముందుకు వేస్తే తాము ఏం చేయమని అంటోంది! ఇది చైనా పాలకుల మాట కాదు. కాని, కమ్యూనిస్టు చైనాలో పత్రికలు తమ స్వంత అభిప్రాయాలు రాయవనేది అందరికీ తెలిసిందే. అక్కడి రూలింగ్ పార్టీ అభ్రిపాయమే మీడియా చెబుతుంది!   గత వారం రోజుల్లో ట్రంప్ , కిమ్ ఇద్దరూ రెచ్చిపోయారు. పదే పదే తమని తట్టి లేపుతోన్న కొరియాపై అమెరికా గట్టి మాటలతో దాడి చేసింది. ప్రపంచం కనీవినీ ఎరుగని రీతిలో నిప్పుల వర్షం కురిపిస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. దానికి కౌంటర్ గా ఉత్తర కొరియా నియంతృత్వ పాలకులు అమెరికా భూభాగమైన గువామ్ పై అణు దాడి చేస్తామంటూ బాధ్యతా రహితంగా మాట్లాడారు. దీంతో యుద్ధం తప్పదని అంతా భావించటం మొదలు పెట్టారు. మరో వైపు ఆస్ట్రేలియా లాంటి దేశాలు యుద్ధం వస్తే తాము అమెరికా వైపే అంటూ ప్రకటనలు కూడా చేసేస్తున్నాయి. జపాన్, దక్షిణ కొరియాలైతే ఎప్పట్నుంచో ఉత్తర కొరియా పని పట్టాలని కసిగా వున్నాయి!   ఇరు కొరియాలు విడిపోయి వుంటే ఎక్కువగా లాభపడేది చైనానే! అందుకే, నియంతృత్వంలో మగ్గుతోన్న ఉత్తర కొరియాకి ఎల్లప్పుడూ డ్రాగన్ సాయం అందుతూ వుంటుంది. అక్కడ కూడా ప్రజాస్వామ్యం వచ్చేస్తే ఇరు కొరియాలు అమెరికా పంచన చేరటం అనివార్యం. అది చైనాకి ఎంత మాత్రం ఇష్టం లేదు. అందుకే, ఎప్పుడూ ఉతర్త, దక్షిణ కొరియాల నడుమ ఉద్రిక్తలు వుండాలనే కొరుకుంటుంది. కాని, ఇప్పుడు తీరా ట్రంప్ యుద్ధం చేసే ఆలోచనకు వచ్చే సరికి చైనా టెన్షన్ లో మునిగిపోయింది. ఎందుకంటే, మార్కెట్ అవసరాల దృష్ట్యా చైనా అమెరికాను ఎదుర్కొనే స్థితి ఇప్పడు లేదు. ఏక పక్షంగా అగ్ర రాజ్యం ఉత్తర కొరియా మీద దాడి చేసినా చైనా చేయగలిగింది చాలా తక్కువే! అందుకే, నార్త్ కొరియా రెచ్చగొట్టి అమెరికా కొరివితో తల గొక్కోవద్దని చైనా చెబుతోంది. ఒకవేళ యుద్ధమే మొదలైతే ఉత్తర కొరియాలో నియంతృత్వం కొనసాగటం అసాధ్యం. ఆ తరువాత చైనాకు మిగిలే లాభమూ శూన్యం!

బాలయ్య, పవన్ రంగంలోకి దిగితే జగన్ తట్టుకోగలరా..?

నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. 2019 ఎన్నికలకు ముందు ఎవరి స్టామినా ఏంటో..మూడేళ్ల టీడీపీ పాలనపై ప్రజల మనసులో ఏముందో..ప్రతిపక్షంపై అసలు జనం ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలంటే సర్వేలతో అయ్యే పనికాదు. అందుకే నంద్యాలపై పాలక, ప్రతిపక్షాలు అంతగా ఫోకస్ చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఓటు నిర్ణయాత్మకమే..అందుకే ఇరు పార్టీల అధినేతలు వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తున్నారు. తమ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా రాష్ట్ర నలుమూలల నుంచి నాయకులును నంద్యాలకు తరలించి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి ఇరు వర్గాలు. వైసీపీ అధినేత జగన్ ప్రచార పర్వంలోకి దిగడంతో ప్రచారానికి ఊపు వచ్చింది. దీంతో తాము వెనుకబడ్డామని భావించారో ఏమో తెలియదు కానీ అపర చాణుక్యుడు చంద్రబాబు కొత్త ఎత్తు వేశారు.   రాయలసీమ ప్రాంతంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ప్రచారంలోకి తీసుకురావాలని టీడీపీ భావిస్తోంది. ఇందుకు బాలయ్య కూడా అంగీకరించినట్లు సమాచారం. ఇక బాలయ్యకు తోడుగా జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌ని కూడా రంగంలోకి దించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అయితే టీడీపీకి మద్దతు ఇచ్చే విషయంపై పవన్ ఇంకా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నట్లు జనసేన వర్గాలు అంటున్నాయి. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జనసేనను మరింత పటిష్టం చేసుకునే దిశలో ముందుకు సాగుతున్నారు పవన్. ఇలాంటి పరిస్ధితుల్లో టీడీపీకి మద్దతిస్తే జనసేనకు ప్లస్సా..? మైనస్సా  అన్న విషయంలో ఆయన ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.   ఈ మూడేళ్లలో ఉద్దానం కిడ్నీ బాధితులు , ప్రత్యేక హోదా వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసినా మిత్రపక్షం నుంచి బయటికి రాలేదు. పలుసార్లు సీఎం చంద్రబాబును కలిసి సమస్యలు వివరించారే తప్ప.. అధికార పక్షానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. దీంతో నంద్యాల ఉప ఎన్నికకు పవన్ తమకే మద్దతు ప్రకటిస్తారని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ పవన్ కనుక సైకిల్‌కే సై అంటే మాత్రం జగన్‌కు నష్టమే..2 లక్షల 9 వేల 612 మంది ఓటర్లు ఉన్న నంద్యాలలో బలిజ ఓటర్లు దాదాపు 42 వేలు ఉంటారని అంచనా..పవర్ స్టార్ టీడీపీ తరపున ప్రచారంలోకి దిగితే అది బలిజ ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.   మరో వైపు మెగా కుటుంబంతో భూమా కుటుంబానికి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. భూమా దంపతులు పీఆర్‌పీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2009లో ఆళ్లగడ్డ నుంచి శోభా నాగిరెడ్డి ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు కూడా. ఈ నేపథ్యంలో పవన్ మద్దతు తమకే ఉంటుందని మంత్రి భూమా అఖిల ప్రియ బలంగా విశ్వసిస్తున్నారు. నంద్యాలలో విజయం తమదేనని భావిస్తున్న వైసీపీ నేతలు పవన్, బాలయ్య ప్రచారంలోకి వస్తే వారిని తమ అధినేత ఏ విధంగా నిలువరిస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అర్హత..అనర్హతల సంగతి ఇప్పుడు అవసరమా..?

పార్టీ అధినేత్రిగా, ముఖ్యమంత్రిగా జయలలిత ఉన్నంత కాలం నల్లేరుపై నడకలా సాగిన అన్నాడీఎంకేకు ఆమె మరణం శరాఘాతంలా తగిలింది. అమ్మ మరణానంతరం పార్టీని, ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకునేందుకు చిన్నమ్మ వేసిన ఎత్తులు ఫలించకపోవడం..సుప్రీంకోర్టు తీర్పుతో శశికళ జైలు పాలవ్వడం వెంట వెంటనే జరిగిపోయాయి. తనకు దక్కకపోయినా పర్లేదు కానీ..పన్నీరుకు మాత్రం సీఎం కుర్చీ దక్కడానికి వీల్లేదని భావించిన చిన్నమ్మ జైలుకు వెళుతూ..వెళుతూ ఎడప్పాడి పళనిసామిని ముఖ్యమంత్రిగా నియమించారు. అప్పటికే పళనిసామిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని..అందువల్ల అలాంటి వ్యక్తి కంటే..అమ్మకు విశ్వాసపాత్రుడైన పన్నీరు సెల్వమే రాష్ట్రాధినేత కావాలని కొందరు ఎమ్మెల్యేలు బయటకు వచ్చేశారు. దీంతో అన్నాడీఎంకే పన్నీరు వర్గంగా..పళనిస్వామి వర్గంగా చిలీపోయింది.   ప్రజల మద్దతు లేని పళనిస్వామి కంటే పన్నీరుకే మద్దతు ఉంటుందని, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలంతా ఎప్పటికైనా ఓపీఎస్ చెంతకు చేరుతారని అందరూ భావించారు. అయితే అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి..సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పార్టీలో అసంతృప్తులను చల్లార్చుకుంటూ..అందరినీ కలుపుకుంటూ పోతున్నారు పళనిస్వామి. కానీ మాజీ ముఖ్యమంత్రి, జయ నమ్మిన బంటు పన్నీరు సెల్వం మాత్రం అన్నాడీఎంకే పురచ్చి తలైవి అమ్మ వర్గం పేరుతో రాష్ట్రంలోని సమస్యలపై ఆందోళన కొనసాగిస్తున్నారు. సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తుంటే డీఎంకేకు కోపమొస్తోందని, దీన్ని బట్టి చూస్తే స్టాలిన్‌తో పళని ప్రభుత్వం పొత్తు పెట్టుకుందని స్పష్టమవుతుందన్నారు పన్నీరు.   అన్నాడీఎంకే వర్గాలు ఏకమవుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి తెరదించాలనుకున్నారో లేక మరొకటో కానీ ఎంజీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తమిళనాట సంచలనం సృష్టిస్తున్నాయి. అధికార పార్టీ చురుకుగా లేకపోవడంతో రాష్ట్రంలో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదంటూ ఆరోపించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జల్లికట్టు సమస్య, చెన్నై తాగునీటి కోసం ఏపీ సీఎంను కలిసి 2.5 టీఎంసీల నీటిని పొందడం వంటి కఠినతరమైన సమస్యలను చక్కగా పరిష్కరించానని గుర్తు చేశారు. తాను అమ్మ అడుగు జాడల్లో రాజకీయంగా ఎదిగానని..తాను రెండుసార్లు పెరియకుళం నుంచి, రెండుసార్లు బోడి నియోజకవర్గం నుంచి గెలిచానని ప్రజల మద్దతు తనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. తాము ప్రారంభించిన ధర్మయుద్ధం కొనసాగుతుందని..ఈ పోరాటంలో విజయం సాధించడానికి అందరు సహకరించాలని పిలుపునిచ్చారు. భారత ఎన్నికల సంఘం శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా అంగీకరించలేదని...అందువల్ల ఆమె ద్వారా నియమితులైన ఇతరులు పార్టీకి, ప్రభుత్వానికి నేతృత్వం వహించడానికి అనర్హులని..అమ్మ ద్వారా నియమించబడిన తమకు మాత్రమే పార్టీకి నాయకత్వం వహించే అర్హత ఉందని స్పష్టం చేశారు.   ఇదిలాఉండగా ఈ అసమ్మతి సెగలను తనకు అనుకూలంగా మార్చకునేందుకు అన్నాడీఎంకే ఉపప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌‌ పావులు కదుపుతున్నారు. పార్టీపై పట్టు కోసం 64 మంది అనుయాయులకు పదవులు కట్టబెట్టారు. ఎవ్వరినీ పదవులు నుంచి తొలగించకుండా, ఖాళీగా ఉన్న పదవులను మాత్రమే తన అనచరులతో భర్తీ చేశారు. దీంతో పళని, పన్నీర్ వర్గాలు ఖంగుతిన్నాయి. ఈ అర్హత, అనర్హతలకు అర్థాలు వెతకడం మాని పార్టీని ముందు చేజిక్కించుకోవాలని లేదంటే పార్టీ అంతిమంగా ప్రభుత్వం కూడా మన్నార్‌గుడి మాఫియా చెప్పు చేతల్లోకి వెళ్లిపోతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. శశికళ-ఆమె బంధువు దినకరన్‌ను పార్టీ నుంచి బహిష్కరించామని ప్రకటనలు వస్తున్నా..వారిద్దరూ సాంకేతికంగా ఇంకా పార్టీ సభ్యులే..కాబట్టి ఎడప్పాడి, ఓపీఎస్ గ్రూపులు రాష్ట్రంలో, పార్టీలో నెలకొన్న అనిశ్చితిని తొలగించడంపై దృష్టి సారిస్తే మంచిది.

కింగ్ ఆఫ్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌ ..!

ప్రపంచ క్రీడా చరిత్రలో తమ తమ రంగాల్లో తిరుగులేని ప్రతిభా పాటవాలను చూపించినవారు, రికార్డులను నెలకొల్పినవారు ఎంతో మంది ఉన్నారు. కానీ, సదరు క్రీడ వల్ల వ్యక్తికి కాకుండా, ఆ వ్యక్తివల్లే ఆ ఆటకు గుర్తింపు రావడం అరుదు. బాక్సింగ్‌లో మహ్మద్ అలీ, క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్, ఫుట్‌బాల్‌లో మారడోనా ఇలా ఎంతో మంది క్రీడాకారులు ప్రపంచం చేత జేజేలు పలికించుకున్నారు. అలాంటి వారి జాబితాలో ఉసేన్ బోల్ట్ కూడా ఒకరు. 100. మీ పరుగుపందెంలో దశాబ్ధకాలం పాటు స్ప్రింట్‌కింగ్‌గా ప్రపంచాన్ని ఏలాడు ఉసేన్. ప్రాణ ప్రదమైన కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలికాలని ప్రతీ ఒక్క ఆటగాడికి ఉంటుంది. అయితే అలా జరగడం కొందరికి మాత్రమే చెల్లింది.   ప్రాణంగా ప్రేమించిన కెరీర్‌ను వీడుతున్నానే బాధో అభిమానులను ఇక అలరించలేను అనుకున్నాడో కానీ తన ఆఖరి పరుగు పందెంలో ఈ జమైకా చిరుత అడుగు తడబడింది. స్వర్ణంతో గ్రాండ్‌గా కెరీర్‌కు బై..బై చెబుదామనుకున్న బోల్ట్‌ ఆశ నెరవేరలేదు. ఐఏఏఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో భాగంగా ఈ ఆదివారం జరిగిన 100 మీ ఫైనల్లో బోల్ట్‌కు షాకిచ్చాడు ఆయన చిరకాల ప్రత్యర్థి గాట్లిన్. ఈ వార్త యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎందుకంటే ఉసేన్ రేస్‌లో ఉన్నాడంటే...ప్రత్యర్థులతో పాటు అభిమానులు కూడా సెకండ్ ప్లేస్‌ ఎవరిదా అని బెట్టింగులు వేసుకునేవారు. ఎందుకంటే ఫస్ట్ ప్లేస్ ఎలాగూ బోల్ట్‌దేనని ఫిక్స్‌ గనుక.‌   అటువంటి ఆటగాడి చివరి పరుగు కోసం ప్రపంచం మొత్తం ఊపిరిబిగబట్టి ఎదురుచూసిన వేళ..స్వర్ణం పక్కా అనుకుంటే..కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గాట్లిన్ 9.92 సెకన్లలో గమ్యానికి చేరగా, అమెరికాకు చెందిన క్రిస్టియన్ కోల్‌మన్ 9.94 సెకన్ల టైమింగ్‌తో రజతాన్ని సాధించగా..బోల్ట్ 9.96 టైమింగ్‌తో కాంస్యాన్ని సొంతం చేసుకున్నాడు. క్రీడల్లో ఎంతటి వారైనా పరాజయం పాలుకాక తప్పదు కానీ రెండుసార్లు డోపీగా పట్టుబడిన గాట్లిన్ చేతిలో బోల్ట్ ఓడిపోవడం అతని అభిమానులను జీర్ణించుకోలేకుండా చేస్తోంది.   ఆ అక్కసుతో వారు స్టేడియంలో గాట్లిన్‌ను హేళన చేశారు. అవేవి నేను పట్టించుకోనని బోల్ట్‌ను ఓడించడానికి అతడినే స్పూర్తిగా తీసుకున్నానని..ట్రాక్‌పై ఉన్నంత సేపే ఉసేన్‌ తనకు ప్రత్యర్థని..బయట మాత్రం తాము మంచి మిత్రులమని చెప్పి విజయం సాధించిన అనంతరం బోల్ట్ ముందు మోకరిల్లాడు గాట్లిన్. వెళ్లిపోతూ..వెళ్లిపోతూ నన్ను క్షమించండి, విజయంతో కెరీర్‌ను ముగించలేకపోయాను..కానీ మీ అభిమానానికి మాత్రం కృతజ్ఞతలని చెబుతూ తనదైన డ్యాన్స్‌ చేసి వాళ్లని హుషారెత్తించాడు. కానీ ఒక్కటి మాత్రం నిజం..ఫైనల్లో బోల్ట్ ఓడిపోయి ఉండవచ్చు..అతని అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయి ఉండవచ్చు. కానీ ట్రాంక్ అండ్ ఫీల్డ్‌లో అతడిదో శకం. తన సృష్టించిన రికార్డుల ద్వారా ఎవరూ అందుకోలేనంత ఎత్తుకెదిగాడు బోల్ట్.   

పతంజలి..పైకి అంతా మాయేనా..?

పతంజలి..ఈ పేరు చెబితే వెంటనే గుర్తొచ్చేది యోగా గురు రాందేవ్ బాబానే.. మరుగును పడిపోతున్న యోగాకు మళ్లీ పునర్వైభవాన్ని తీసుకురావడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. అదే బాటలో..అంతే శక్తివంతమైన భారతీయ ప్రాచీన ఆయుర్వేద విజ్ఞానాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు గాను నడుం బిగించారు. పతంజలి బ్రాండ్‌ పేరుతో కంపెనీని స్థాపించి ఆయుర్వేద ఉత్పత్తులను మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చారు రాందేవ్..వచ్చీ రావడంతోనే కార్పోరేట్ కంపెనీలకు దడ పుట్టించింది. తొలుత ఆయుర్వేద ఔషధాలనే తయారు చేయాలని రాందేవ్ భావించారు. అయితే ప్రజల నుంచి వస్తున్న ఆదరణతో క్రమంగా ఆహారోత్పత్తులు, సౌందర్య ఉత్పత్తుల తయారీని ఆయన ప్రారంభించి 500 రకాల ఉత్పత్తులను అందించే స్థాయికి ఎదిగింది పతంజలి..   ఈ సంస్థ దూకుడుతో ఎన్నో ఏళ్లుగా భారతీయ ఎఫ్ఎంసీజీ మార్కెట్‌ను శాసిస్తున్న ఐటీసీ, డాబర్, హిందూస్థాన్ యూనిలీవర్. కోల్గేట్, పీ&జీ వంటి సంస్థలకు ముచ్చెమటలు పట్టాయి. 2016 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 146 శాతం పెరుగుదలను నమోదుచేసి..769 మిలియన్ డాలర్ల నికర లాభాన్ని సాధించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అలా భారతీయతకు..భారతీయ వారసత్వానికి జవసత్వాలు అందజేసిన వ్యవస్థగా పతంజలికి గుర్తింపు వస్తున్న తరుణంలో ఆ సంస్థ మాజీ సీఈవో ఎస్‌కే.పాత్రా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. పతంజలి 10,500 కోట్ల టర్నోవర్ సాధించడంలో ముఖ్యభూమిక పోషించడంలో నిజమైన శ్రామికులు కంపెనీ ఉద్యోగులేనని కానీ వారికి నేటి వరకు సరైన వేతనం అందడం లేదన్నది పాత్రా ప్రధాన ఆరోపణ.   సేవ పేరుతో వారి శ్రమను దోపిడి చేస్తున్నారని ఆయన అన్నారు. రెండు ఉద్యోగాలకు విడి విడిగా వేతనం చెల్లిస్తామని మొదట హామీ ఇచ్చారని కానీ అలా జరగలేదని.. తాను సీఈవోగా ఉన్నప్పుడు పతంజలి ఆయుర్వేద, పతంజలి ఫుడ్‌పార్క్‌లో ఒకేసారి రెండు విధులు నిర్వర్తించానని పేర్కొన్నారు. తనకు వేతనం ఆపడంపై పాత్రా పలుమార్లు బాబా రాందేవ్‌తో వాగ్వివాదానికి దిగారు. నాకు వేతనం కావాలి..నా కోసం కాదు..నాకో కుటుంబం ఉంది. వారిని చూసుకోవాల్సిన బాధ్యత నాదే. అందుకోసమైనా నాకు జీతం కావాలి అంటూ బాబాను వేడుకున్నానని దీంతో తనకు జీతం చెల్లించారని..అది కూడా ముందు హామీ ఇచ్చినట్లు కాకుండా ఒక ఉద్యోగానికి వేతనం ఇచ్చారని ఆరోపించారు.   రాందేవ్‌ పతంజలిని స్థాపించిన తర్వాత ఆ సంస్థపై ఈ స్థాయిలో ఆరోపణలు వచ్చింది లేదు..మొదట్లో నూడిల్స్‌లో పురుగులు వచ్చినట్లు తేలడం..పతంజలి నూడిల్స్‌కి లైసెన్స్‌ లేదంటూ ఆహార భద్రత (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే అప్పటికే నెస్లే వంటి అంతర్జాతీయ దిగ్గజానికి నోటీసులు అందడంతో పతంజలిని ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అలా కాదు..ఆరోపణలు చేసిన వ్యక్తి సంస్థలో ఒక మాజీ ఉద్యోగి..అది కూడా సీఈవో స్థాయి వ్యక్తి కావడంతో ఈ వ్యాఖ్యలకు కార్పోరేట్ ప్రపంచంలో హాట్ చర్చకు దారి తీసింది. మరి పాత్రా ఆరోపణలపై బాబా రాందేవ్ ఎలా స్పందిస్తారో..?

బెంగళూరులో ఐటీ దాడులు ఎవరిపని..?

రెండు రోజుల క్రితం కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డాక్టర్ శివకుమార్, ఆయన సోదరుడితో పాటు బెంగళూరులోని ఓ రిసార్టుపైనా దాడులు నిర్వహించారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. ఈ సోదాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. శివకుమార్‌కు చెందిన మొత్తం 39 ప్రాంతాలపై దాదాపు 300 మంది సిబ్బంది నేటీకి నిర్విరామంగా సోదాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు మొత్తం రూ.11.43 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నాట్లు ప్రకటించారు. శివకుమార్, ఆయన సోదరుడి ఇంటిపై దాడులు జరిగి ఉంటే ఎవరూ అంతగా పట్టించుకునే వారు కాదేమో..కానీ ఓ రిసార్టులో సోదాలు నిర్వహించడం హాట్ టాపిక్‌గా మారింది. గుజరాత్‌లో రాజ్యసభ ఎన్నికలను బీజేపీ సీరియస్‌గా తీసుకుని సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకునే వ్యూహాలను రచిస్తోంది.   ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా..వారిలో ముగ్గురు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ మిగిలిన 44 మందిని కాపాడుకునేందుకు తమ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకకు తరలించింది. ఇక్కడే కమలనాథులు వ్యూహాత్మకంగా వ్యవహారించింది. తమకునన అధికారాలతో ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్‌పై ఐటీ దాడి చేయించింది. డైరెక్ట్‌గా దాడులు నిర్వహిస్తే లేని పోని చిక్కుల్లో పడతామని ఊహించారో ఏమో కానీ..ఈ ఎమ్మెల్యేల బస ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రి శివకుమార్ ఆయన కుటుంబసభ్యుల ఇళ్లపై దాడి చేయించింది. తమ ఎమ్మెల్యేలను భయపెట్టేందుకే బీజేపీ ఐటీ దాడులు చేయించిందని కాంగ్రెస్ పార్లమెంట్ సాక్షిగా నిలదీసింది. అయితే రాజ్యసభ ఎన్నికల్లో తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద మొత్తంలో ముడుపులు ఇచ్చిందన్న ఆధారాలతోనే తాము సోదాలు నిర్వహించినట్లు ఐటీ అధికారులు చెబుతున్నారు.   అమిత్‌షా, ప్రధాని నరేంద్రమోడీలే ఈ దాడుల వెనుక ఉన్నారని అంతా భావిస్తున్న వేళ..శివకుమార్ తల్లి బాంబు పేల్చారు. నా కొడుకు ఇంటీపై ఐటీ అధికారులు సోదాలు చేయడం వెనుక కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హస్తం ఉందంటూ ఆయన తల్లి గౌరమ్మ ఆరోపించారు. నా కుమారుడికి రాజకీయంగా ఎంతోమంది శత్రువులు ఉన్నారు..వారిలో కాంగ్రెస్‌కు చెందిన కొందరు నేతలు కూడా ఉన్నారని...ముఖ్యంగా సీఎం నా బిడ్డ పట్ల ముందు నుంచి వ్యతిరేకంగా ఉంటున్నారు. నా కొడుకు ఎదుగుదలను చూసి ఓర్వేలేక ఐటీ దాడులు చేయించారన్నారు. ఎన్నో పనులకు శివను ఉపయోగించుకున్న ముఖ్యమంత్రి..ఆ తర్వాత నమ్మక ద్రోహం చేశారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు బెంగళూరుతో పాటు ఢిల్లీలోనూ కలకలం రేపాయి.   సొంత పార్టీ వ్యక్తి మీద దాడులు చేయించాల్సిన అవసరం సిద్ధూకి ఏముంటుందని..అయినా ఆదాయపు పన్ను శాఖ ప్రధాని అజమాయిషీలో పని చేస్తుంది కానీ ముఖ్యమంత్రుల మాట అది వింటుందా అని కాంగ్రెస్ మద్ధతుదారులు అంటున్నారు. అయితే శివకుమార్ తల్లిని, ఆయన కుటుంబాన్ని ఎవరో బెదిరించి ఉంటారని..వారి బెదిరింపులకు భయపడే మంత్రి కుటుంబం అలాంటి వ్యాఖ్యలు చేస్తోందని కన్నడ నాట పుకార్లు షికారు చేస్తున్నాయి. గుజరాత్ ఎమ్మెల్యేలను తీసుకొచ్చి కన్నడ నాట కుంపట్లు రాజేశారని కొందరు అంటున్నారు. ఈ మొత్తం డ్రామాకి తెరపడాలంటే రాజ్యసభ ఎన్నికల వరకు ఆగాల్సిందే.

పాక్‌ మీద ప్రేమా..? భారత్‌ మీద ద్వేషమా..?

ఆసియా పెద్దన్నగా ఎదిగేందుకు భారత్, చైనాలు నువ్వా నేనా అన్న స్థాయిలో పోటీ పడుతున్నాయి. ఎన్నో అంశాల్లో మన ఎదుగుదలను చూసి ఓర్వలేని చైనా..భారత్‌ను అదను చూసి దెబ్బ కొట్టడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. పొరుగునే ఉంటూ పక్కలో బల్లెంలా మారిపోయింది చైనా..శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్లు మన దాయాదీ పాక్‌కు అన్ని రకాలుగా చేయూతనిస్తూ మన మీదకు ఉసిగొల్పుతోంది. చైనా అండతో రెచ్చిపోతున్న పాక్‌లోని ఉగ్రవాద సంస్థలు భారత్‌లో విధ్వంసానికి కాలుదువ్వుతున్నాయి. అలా జరిగిన వాటిలో ఒకటే పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి. నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న రోజుల్లో దేశ రక్షణ వ్యవస్థకు కీలకమైన పఠాన్‌కోట్‌పై దాడికి దిగింది జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ.   చీమ చిటుక్కుమన్నా అప్రమత్తమయ్యేంత అత్యాధునిక భద్రతా వ్యవస్థ ఉన్న ఆ స్థావరంలోకి దర్జాగా ప్రవేశించిన ఆరుగురు ముష్కరులు వచ్చి రావడంతోనే ఐదుగురు అధికారుల్ని కాల్చి చంపారు. ఎయిర్‌బేస్‌లో నక్కిన ముష్కర మూకను ఏరిపారేయడానికి మన భద్రతా దళాలకు మూడు రోజులు పట్టింది. ఈ దాడితో అప్రమత్తమైన భారత ప్రభుత్వం నిందితులేవరో వారి వెనుక ఎవరున్నారో తేల్చేపనిలో పడింది. పక్కా ఆధారాలతో పాక్‌ ప్రేరేపిత జైషే మహ్మద్ సంస్థ ఈ దాడికి పాల్పడినట్లు తేల్చింది. దాని అధినేత మసూద్ అజర్‌ను నిందితుడిగా చేరుస్తూ అతన్ని తమకు అప్పగించాల్సిందిగా పాకిస్థాన్‌ను కోరింది. కాని పాక్ ఎప్పటిలాగే తమకు సంబంధం లేదని పేర్కొంది. దీంతో మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని కోరుతూ ఐక్యరాజ్యసమితిని కోరింది భారత్. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఐరాస మండలికి చెందిన 1267 కమిటీ ముందు పెట్టింది.   ఈ తీర్మానాన్ని అమెరికా, ఫ్రాన్స్, యూకే సహా 14 దేశాలు బలపరిచాయి..అయితే ఒక్క చైనా మాత్రం తన వక్రబుద్దిని బయటపెట్టుకుంది. సాంకేతిక కారణాలు చూపిస్తూ..అందుకు మూడు నెలలు గడువు కావాలంటూ తన వద్ద ఉన్న వీటో పవర్‌తో అడ్డుకుంది. తన చిరకాల మిత్రుడు పాకిస్థాన్‌కు అనుకూలంగానే చైనా ఇలా అడ్డుకుందని ప్రపంచం కోడై కూసింది. తాజాగా ఇదే అంశంపై మరోసారి భారత్‌ ఐక్యరాజ్యసమతిని సంప్రదించగా మళ్లీ డ్రాగన్ అడ్డుతగిలింది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడానికి మరో మూడు నెలలు గడువు పొడిగించాలని కోరింది. ఒకవేళ చైనా గనుక గడువు పొడిగింపు కోసం కోరకపోతే మసూద్ అజర్‌ ఆటోమేటిగ్గా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటింపబడి ఉండేవాడు.   చైనా ఇలాంటి వ్యూహాన్ని అమలు చేసేందుకు బలమైన కారణాలు ఉన్నాయి. పాక్‌తో డ్రాగన్ పెద్ద ఎత్తున వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తోంది. పాక్ తీరంలో అభివృద్ధి చేస్తోన్న ఒక ఓడరేవు నుంచి తమ దేశానికి చమురు తరలించేందుకు, ఇతర పనుల కోసం చూనా ఒక పైపు లైను వేస్తోంది.. దీనికి తోడు భారత్‌తో యుద్ధం గనుక వస్తే నాలుగు వైపుల నుంచి చుట్టుముట్టేందుకు వీలుగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో సైనికులను మోహరిస్తోంది. ఇన్ని ప్రయోజనాలను కాపాడుకునేందుకే చైనా పాకిస్థాన్‌కు మద్ధతు ఇస్తోంది. అయినా పాక్‌తో స్నేహం ఎంత ప్రమాదకారమో చైనా ఇంకా రుచి చూడలేదు. అమెరికా సారథ్యంలోని పాశ్చాత్య దేశాలకు ఐఎస్ఐఎస్ రూపంలో జరిగిన నష్టం ప్రపంచానికి తెలుసు. కాబట్టి చైనా ఎంత త్వరగా కళ్లు తెరిస్తే అంత మంచిది. లేదంటే ఇస్లామిక్ ఉగ్రవాదుల బీజింగ్‌ వీధుల్లో స్వైర విహారం చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.

డ్రగ్స్‌ కేసులో పార్ట్‌-2 ఉంటుందా?... సెకండ్‌ లిస్ట్‌లో ప్రముఖులు ఎవరు?

12 రోజులు... 12మంది టాలీవుడ్‌ ప్రముఖులు... సుమారు 92 గంటలు... సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసులో ఫస్ట్‌ పార్ట్‌ ముగిసింది... రోజుకొకరు చొప్పున సిట్‌ విచారణ కంప్లీట్‌ చేసింది. డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌తో మొదలైన సిట్‌ ఎంక్వైరీ.... యువ నటుడు నందుతో ముగిసింది. మొదటిరోజు పూరీ జగన్నాథ్‌ను సుమారు 11గంటలపాటు విచారించిన సిట్‌... మిగతా వారిలో వణుకు పుట్టించింది.  ఉదయం 10 గంటలకు మొదలైన ప్రశ్నల వర్షం రాత్రివరకూ కంటిన్యూ అయ్యింది. దాంతో పూరీ జగన్నాథ్‌ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దాంతో డ్రగ్స్‌ కేసులో రోజురోజుకీ ఉత్కంఠ పెరుగుతూ వచ్చింది.    ఆ తర్వాత కెమెరామెన్‌ శ్యామ్‌ కే నాయుడుని 6 గంటలు, కేరెక్టర్ ఆర్టిస్ట్‌ సుబ్బరాజుని 13 గంటలు, ఆర్ట్ డైరెక్టర్  చిన్నా 4 గంటలు, హీరో నవదీప్‌ని 11 గంటలు, తరుణ్‌ను 13 గంటలు, హీరోయిన్ ఛార్మిని హైకోర్టు ఆదేశాలతో ఉదయం 10నుంచి ఐదు గంటల వరకు విచారించింది. ముమైత్ ఖాన్‌ని 6 గంటలు, రవితేజను 9 గంటలు, రవితేజ డ్రైవర్ శ్రీనివాసరావు, తనీష్‌‌లను 4 గంటలు, నందుని మూడున్నర గంటల చొప్పున ఇంటరాగేట్‌ చేసింది. విచారణ మొత్తం వీడియో చిత్రీకరించింది. కొందరు బ్లడ్‌ శాంపిల్స్‌ ఇస్తే... మరికొందరు నిరాకరించారు. అయితే పూరీ జగన్నాథ్‌, ఛార్మి, రవితేజ, తరుణ్ విషయంలో మీడియా భారీ హైప్‌ ఇచ్చింది.   డ్రగ్స్‌ తీసుకుంటారా? డ్రగ్స్‌ ఎప్పట్నుంచి అలవాటు ఉంది? కెల్విన్‌, జీశాన్‌తో ఎలా పరిచయం? డ్రగ్స్ తీసుకోవడమేనా...సప్లై కూడా చేస్తారా? పబ్‌ల్లో డ్రగ్స్‌ సరఫరా చేస్తారా? డ్రగ్స్‌ను ఎవరికైనా అలవాటు చేశారా? సినీ పరిశ్రమలో ఇంకా ఎవరు డ్రగ్స్‌ తీసుకుంటారు? ఇలా సాగింది సిట్‌ ఇంటరాగేషన్‌. అయితే తొలి విడత విచారణ కంప్లీట్‌ కావడంతో... పార్ట్‌-2 ఉంటుందనే టాక్‌ వినిపిస్తోంది. తొలి విచారణలో సేకరించిన ఇన్ఫర్మేషన్‌ ఆధారంగా ప్రముఖులకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే సెకండ్‌ లిస్ట్‌లో సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో డ్రగ్స్‌ కేసులో పార్ట్‌-2 ఉండకపోవచ్చని అంటున్నారు. అయితే సాఫ్ట్‌‌వేర్‌ ఉద్యోగులు డ్రగ్స్‌ తీసుకుంటున్నారని గుర్తించిన సిట్‌ అధికారులు... సెకండ్‌ లిస్ట్‌లో వీళ్లను మాత్రమే పిలిచి మమ అనిపిస్తారనే టాక్‌ వినిపిస్తోంది.   

2019… జగన్ కు ఓ PK! చంద్రబాబుకు ఓ PK!

మన పురాణ కథల్లో చాలా సార్లు వచ్చే అంశం… బ్రహ్మాస్త్రం! బ్రహ్మాస్త్రం తిరుగులేనిది. దానికి విరుగుడు బ్రహ్మాస్త్రమే! ఇప్పుడు సీఎం చంద్రబాబు అదే ఫార్ములానే ఆచరణలో పెడుతున్నారా? అవుననే అనిపిస్తోంది తాజా పరిణామాల నేపథ్యంలో…   ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్య దశాబ్దాల పాతది. దాని పరిష్కారానికి ప్రయత్నాలు అడపాదడపా జరిగాయి. కాని, ఎప్పుడూ పెద్దగా వార్తల్లోకి ఎక్కలేదు. కాని, వున్నట్టుండీ పవర్ స్టార్ రంగంలోకి దిగటంతో మీడియా మొత్తం ఉద్ధానం వైపు కదిలింది. హార్వర్డ్ నుంచి నిపుణులు కూడా రావటంతో మరింత చర్చ జరిగింది. అయితే, పవర్ స్టార్ పీకే కిడ్నీ బాధితుల గురించి స్పందించటం ఒక ఎత్తైతే … ఆయనతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కావటం మరో ఎత్తు! అలాగే, పవన్ కళ్యాణ్ ప్రయత్నాన్ని సీఎం మెచ్చుకోవటం, అనేక విషయాలు పీకే, సీబీఎన్ చర్చించుకోటం… కొంత మేర భవిష్యత్తును మనకు చూపిస్తోందనే చెప్పాలి!   పవన్ కళ్యాణ్ అక్టోబర్ నుంచి పూర్తి స్థాయి రాజకీయాల్లో వుంటారని టాక్ బయలుదేరింది. అందుకు తగ్గట్టే పవన్ కళ్యాణ్ పాదయాత్రపై కూడా స్పందించారు. అంటే… మరో రెండు, మూడు నెలల తరువాత కీలక పరిణామాలే జరగనున్నాయన్నమాట. అయితే, పీకే అధికారంలో వున్న టీడీపీని ఏకపక్షంగా టార్గెట్ చేస్తాడా? లేదా 2014లో లాగానే చంద్రబాబుకి మద్దతిస్తాడా? ఈ రెండూ కాక మరేదైనా స్ట్రాటజీ వుంటుందా? ఇలాంటి ప్రశ్నలకు ప్రస్తుతానికి సమాధానాలు లేవు. కాని, ఉద్ధానం ఎపిసోడ్ నేపథ్యంలో సీఎంతో పవన్ కళ్యాణ్ మూవ్ అయిన తీరు… జగన్ కు ఆందోళన కలిగించేదే! టాలీవుడ్ పీకే టీడీపీ అధినేతకి క్లోజ్ గా వున్నట్టే ప్రస్తుతానికి సంకేతాలు అందుతున్నాయి…   ఒకవేళ పవర్ స్టార్ చంద్రబాబు తరుఫున వచ్చే ఎన్నికల్లో బరిలో వుంటే… అది ఆయనకు పెద్ద బలమే! ఎందుకంటే, ఎలాగైనా సీఎం అవ్వాలని కసితో వున్న జగన్ వ్యూహాల కోసం ఉత్తరాది పీకేను మోహరించారు! పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఉధృతంగా వైసీపిని మార్పులు, చేర్పులకి గురి చేస్తున్నారు. సర్వేలు, సమావేశాలతో హడావిడి చేస్తున్నారు. ఈ సమయంలో జగన్ నమ్ముకున్న పీకేకి విరుగుడు మన టాలీవుడ్ పీకేనే అయ్యేలా వున్నారు. అపర చాణుక్యుడైన చంద్రబాబు పవర్ స్టార్ ని తమ తరుఫున మోహరించగలిగితే అది జగన్ కు ఆందోళక కలిగించే పరిణామమే!   ఇప్పటికైతే పవన్ కళ్యాణ్ తన జనసేన టీడీపీకి మద్దతుగా వుండబోతోందని చెప్పలేదు. ఎన్నికల దగ్గర పడ్డ కొద్దీ పొత్తులు అనివార్యం అవుతాయి. మరి దశాబ్దాలుగా అద్భుతమైన క్యాడర్ బలమున్న టీడీపీతో పీకే కలుస్తారా? జగన్ గారి పీకేకి విరుగుడుగా నిలుస్తారా? రానున్న ఎన్నికల్లో ఉత్తరాది పీకే ప్లానింగ్ వర్సెస్ దక్షిణాది పీకే ఫాలోయింగ్… మనం చూడొచ్చా? వి హ్యావ్ టూ వెయిట్!

జగన్ గురించి వైసీపీ క్యాడర్ ఇలా అనుకుంటోందట!

  ఏపీ రాజకీయాల్లో మొన్నటి వరకూ ఒకే పీకే వుండేవాడు. అతనే పవన్ కళ్యాణ్. కాని, ఇప్పుడు జగన్ శిబిరంలోనూ ఓ పీకే చేరాడు. అతనే ప్రశాంత్ కిషోర్! 2014లో మోదీని, తరువాత బీహార్ లో నితీష్ ని గెలిపించాడని ఈ పీకేకి బోలెడు పేరు! అయితే, అదే ప్రశాంత్ కిషోర్ నిన్న మొన్నటి యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను కాపాడలేకపోయాడు. గెలిపించటం మాట అటుంచీ … కనీసం ఇండిపెండెంట్లు గెలిచినన్నీ సీట్లు కూడా రాహుల్ గాంధీకి సంపాదించి పెట్టలేకపోయాడు. ఇక ఇప్పుడు ఆంధ్రాలో కాలుమోపిన ఈ ఉత్తరాది పీకే జగన్ కోసం సర్వేలు చేస్తే హడావిడి చేస్తున్నారు!   వైసీపీని ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో గెలిపించి తీరాలని ప్రశాంత్ అవిశ్రాంతంగా కృషి చే్స్తున్నాడు. అందుకు కోసమే ఏపీలో ఊరూరూ, వాడ వాడా తిరుగుతున్నాడు. స్వయంగా వైసీపీ కార్యకర్తల్ని కూడా కలుసుకుని క్షేత్ర స్థాయి స్థితిగతుల్ని అంచనవేస్తున్నాడు. ఇదంతా చక్కటి ఎక్సైజే! మంచి అవగాహన కలుగుతుంది పార్టీ పొజీషన్ మీద. కాని, సర్వేకు వెళ్లిన పీకే టీమ్ కి ఓ షాక్ ఎదురైందట కార్యకర్తల వద్ద!   సర్వేలో భాగంగా సహజంగానే చంద్రబాబు గురించి ప్రశ్నించాడు పీకే. వైసీపీ కార్యకర్తలు ఆయన బాగానే కష్టపడుతున్నాడని చెప్పారట. మరి జగన్ సంగతేంటని అడిగితే… వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే పెదవి విరిచారట. ఆయన టీడీపీపై ప్రజల్లో వున్న అసంతృప్తిని సరిగ్గా వాడుకోలేకపోతున్నారని అన్నారట! ఇందుకు కారణం జగన్ వ్యవహార శైలేనని చెప్పారట. ఆయన వచ్చే ఎన్నికల్లో ఏదైనా అద్బుతం చేయదలుచుకుంటే మరింతగా జనంలో వుండాలని వారు అంటున్నారట. అంతేకాక పార్టీ కోసం పని చేసే కార్యకర్తల మనోభావాలు తెలుసుకోవాలని అన్నారట. వారికి అందుబాటులో వుండాలని కూడా కోరుకున్నారట!   ఏ పార్టీకైనా డబ్బు సంచులు తీసుకొచ్చే స్పాన్సర్లు, బడా నాయకులే ప్రధానం. కాని, వాళ్లతో బాటూ కార్యకర్తలు రాత్రింబవళ్లు నమ్మకంతో కష్టపడకపోతే ఏ పార్టీ కూడా నిలవదు. ఇది చరిత్ర చెప్పే సత్యం. మరి జగన్ ప్రశాంత్ కిషోర్ ద్వారా ఈ సత్యం తెలుసుకుంటాడో లేదో చూడాలి! కాని, ఒక్కటి మాత్రం నిజం… ఇదే ప్రశాంత్ కిషోర్ ఆ మధ్య బీహార్లో నితీష్, లాలూ జోడీని సూపర్ గా గెలిపించాడు. కాని, ఇవాళ్ల ఆ పొత్తు పెటాకులైపోయింది. కాబట్టి పీకే ఎన్నికల వరకే వెంట వుంటాడు. జగన్ కు నిరంతరం కావాల్సింది స్వంత రాజకీయ వ్యూహం, కార్యకర్తల్లో విశ్వాసం. మరి జెండా మోసే సైనికుల్లో వున్నట్టుగా వినిపిస్తున్న అసంతృప్తిని జగన్ ఎలా శాంతిపజేస్తాడో చూడాలి…

మోడ్రన్ డ్రగ్ మాఫియా… ఇంటర్నెట్ నుంచీ ఇంటికే డ్రగ్స్!

  డ్రగ్స్ దందా అనగానే ఇప్పుడు అందరి కళ్ల ముందూ సినిమా సెలబ్రిటీలు కదులుతున్నారు. నిజంగా పూరీ టూ రవితేజ … డ్రగ్స్ వాడారో, కొన్నారో, అమ్మారో మనకు తెలియదు కాని.. కాన్సన్ ట్రేషన్ అంతా వారి మీదకి మళ్లిపోయింది! డ్రగ్స్ కంటే సినిమా గ్లామరే ఎక్కువ కిక్ ఇస్తోంది మీడియాకి, జనానికి! కాని, హైద్రాబాద్ డ్రగ్స్ సప్లైకి, అంతర్జాతీయ మాఫియాకి సంబంధాలు వుండటం మనం నిజంగా ఆందోళన చెందాల్సిన విషయం…   తెలంగాణ ప్రభుత్వం తాజాగా డార్క్ నెట్ వెబ్ సర్వర్లను నిషేధించాలని అమెరికాను కోరింది. ఎంబసీ ద్వారా, ఇంటర్ పోల్ ద్వారా కూడా యూఎస్ గవర్నమెంట్ కి ఈ విషయంలో వినతి చేసింది. ఇంతకీ డార్క్ నెట్ వెబ్ సర్వర్లు అంటే ఏంటి? ఇప్పుడు హైద్రాబాద్ లో చేతులు మారుతున్న డ్రగ్స్ కి కారణం ఈ సర్వర్లే! ఎక్కడో అమెరికా, లండన్లలో ఈ వెబ్ సైట్లు తమ సర్వర్లు ఏర్పాటు చేసుకుంటాయి. అక్కడ నుంచీ ప్రపంచ వ్యాప్తంగా దందా చేస్తుంటాయి. డ్రగ్స్ కు సంబంధించి బుకింగ్స్ తీసుకోవటం, డబ్బులు తీసుకోవటం, డ్రగ్స్ ఫలానా అడ్రస్ కు పంపటం అంతా అన్ లైనే అన్నమాట!   వివిధ పేర్లతో నడిచే డార్క్ నెట్ వెబ్ సైట్ల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే… అవ్వి డ్రగ్స్ వాడే వారికి, కొనే వారికి అమేజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి ఈ కామర్స్ సైట్స్ లాంటివన్నమాట! హ్యాపీగా డ్రగ్స్ ఇంటికే తెప్పించేసుకుంటున్నారు డ్రగ్స్ దందాలో మునిగితేలేవారు. అందుకే, ఎక్కడా పోలీసులకి పెద్దగా పట్టుబడకుండా చాలా కాలం వ్యవహారం నడిచిపోతోంది. ఇప్పుడు స్కూలు పిల్లలు మొదలు సినిమా వాళ్ల దాకా చాలా మంది దీనికి బలైపోతున్నారని తెలిసి ప్రభుత్వం అమెరికాను రిక్వెస్ట్ చేసేదాకా వెళ్లింది!   తెలంగాణ ప్రభుత్వం నిలిపేయాలని కోరిన డార్క్ నెట్ సర్వర్లని అమెరికా క్లోజ్ చేస్తుందో లేదోగాని… ఇక్కడి స్థానిక యంత్రాంగమైతే మరింత సీరియస్ గా వుండాలి. ఇప్పుడంటే రోజుకో సినిమా సెలబ్రిటీ సిట్ విచారణతో కాలం గడిచిపోతుంది కాని… దీర్ఘ కాలంలో డ్రగ్స్ దుష్ప్రభావం హైద్రాబాద్ మీదా, తెలుగు రాష్ట్రాల మీద పడకూడదంటే పోలీసులు, ఎక్పైజ్ శాఖా అత్యంత అప్రమత్తంగా వుండాలి. ఆన్ లైన్ నుంచి ఆన్ రోడ్ దాకా డ్రగ్స్ ఎక్కడ వున్నా పసిగట్టి పట్టుకోవాలి. లేదంటే పంజాబ్ లో మాదిరిగా పరిస్థితులు చేజాదాటిపోయే ప్రమాదం వుంది.   డ్రగ్స్ సమస్య పైకి కనిపిస్తున్నంత చిన్నదేం కాదు. ప్రపంచంలోని కొన్ని దేశాల ఆర్దిక వ్యవస్థలే డ్రగ్స్ దెబ్బకి కుప్పకూలిపోయిన దాఖలాలు వున్నాయి. అమెరికా లాంటి అగ్రరాజ్యం కూడా నిరంతరం అలెర్ట్ గా వుంటూ డ్రగ్స్ పై పోరు సాగిస్తూనే వుంటుంది. అలా ఆగిపోని యుద్దం చేయటమొక్కటే మార్గం…

ఏపీలో వేలు పెట్టిన కేసీఆర్‌..!

  తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సర్వేల టైమ్‌ నడుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు ప్రతిపక్ష నేతలు కూడా సర్వేలపై ఆధారపడుతున్నారు. మళ్లీ అధికారం తమదేనంటూ అటు ఏపీలో చంద్రబాబు, ఇటు తెలంగాణలో కేసీఆర్‌ చెబుతుంటే... కాదుకాదు ఈసారి తామే పవర్‌‌లోకి వస్తామని వైసీపీ, కాంగ్రెస్‌ చెబుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్‌కి 110 సీట్లు వస్తాయని కేసీఆర్‌ అనేకసార్లు చెప్పుకొచ్చారు. అయితే టీకాంగ్రెస్‌ కూడా తమకు 79 సీట్లు వస్తాయని సర్వేల్లో తేలిందని చెబుతోంది. ఇక ఏపీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మళ్లీ అధికారంలోకి వస్తామని చంద్రబాబు ధీమాగా ఉంటే, ఈసారి ఎలాగైనా పవర్‌లోకి రావాలని జగన్‌ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు 2019 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ని కూడా రంగంలోకి దింపారు. అయితే ఏపీలో అధికారం తెలుగుదేశం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీల మధ్య దోబూచులాడుతోందని తాజా సర్వేల్లో తేలింది. రెండు పార్టీల మధ్య ఓట్ల శాతం అతి స్వల్పంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవల వీడీపీ అసోసియేట్స్‌ జరిపిన సర్వేలో టీడీపీ, బీజేపీకి 47శాతం ఓట్లు వస్తాయని తేలితే... వైసీపీకి 40శాతం ఓట్లు మాత్రమే వస్తాయని చెప్పింది. అంతేకాదు టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తే... మళ్లీ తెలుగుదేశానిదే అధికారమని వీడీపీ అసోసియేట్స్‌ అంచనా వేసింది. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌... ఏపీ రాజకీయాలపై తాజాగా చేసిన వ్యాఖ్యలు... టీడీపీకి షాకిచ్చేలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌‌లో వైసీపీకే ఎడ్జ్‌ ఉందన్న కామెంట్స్‌ సంచలనంగా మారాయి. మీడియాతో ఆఫ్‌ ది రికార్డ్ మాట్లాడిన కేసీఆర్‌... ఓ సర్వే మిత్రుడు తనకు ఈ విషయాలు చెప్పారన్నారు. వైసీపీకి 45శాతం, టీడీపీకి 43శాతం, అలాగే బీజేపీకి 2.6శాతం ఓట్లు వస్తాయని ఆ సర్వేలో తేలిందన్నారు.   అయితే ఎన్నికలకు ఇంకా దాదాపు రెండేళ్ల సమయం ఉండటంతో ఈలోపు ఏమైనా జరగొచ్చని అంటున్నారు. 2014 ఎన్నికల్లోనూ అదే జరిగిందని గుర్తు చేస్తున్నారు. అప్పటివరకూ వైసీపీకి అనుకూలంగా ఉన్న పరిస్థితులు... ఒక్కసారిగా మారిపోయాయని, ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందని విశ్లేషిస్తున్నారు. అపర రాజకీయ చాణిక్యుడైన చంద్రబాబు... 2019 నాటికి పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవడం ఖాయమంటున్నారు.