పద్మ అవార్డుల్లో ఎన్నికల రాజకీయం

రిపబ్లిక్ డే వచ్చిందంటే చాలు పద్మ అవార్డుల హడావిడి మొదలవుతుంది. ఈ సారి ఎవరికి ఈ అవార్డులు దక్కాయోనని సగటు భారతీయుడు ఉత్కంఠగా ఎదురుచూస్తాడు. ఎంతగా ప్రతిభకు పట్టం కట్టినప్పటికీ ఎన్నో సార్లు ఈ విశిష్ట పురస్కారాల ఎంపిక విమర్శలకు దారితీసింది. ఈ సారి కూడా కేంద్రప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలపై విమర్శలు వస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలకు, త్వరలో ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలకు అవార్డుల్లో పెద్దపీట వేసిందన్న విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి.   ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు ఈసారి అన్యాయం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. ఉభయ రాష్ట్రాల నుంచి కేవలం ఒక్కరికి మాత్రమే పద్మ పురస్కారం దక్కింది. ఏపీ నుంచి కిదాంబి శ్రీకాంత్ పేరు పద్మశ్రీకి ఎంపికైంది. అది కూడా క్రీడాకారుల కోటాలో.. మరోవైపు బీజేపీ పాలిత రాష్ట్రాలల్లో మహారాష్ట్రకు అత్యధికంగా 11 అవార్డులు దక్కగా.. మధ్యప్రదేశ్‌కు 4, గుజరాత్‌కు 3 పద్మ అవార్డులు లభించాయి. త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకకు 9, తమిళనాడుకు 5, పశ్చిమబెంగాల్‌కు 5, కేరళకు 4, ఒడిషాకు 4 అవార్డులను ప్రకటించింది.   తెలుగు రాష్ట్రాల నుంచి పలువురి పేర్లను పద్మ అవార్డుల కోసం సిఫారసు చేయగా వారిలో ఏ ఒక్కరి పేరును కేంద్రం పరిగణలోనికి తీసుకోలేదు. ముఖ్యంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరును దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నకు.. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ పేరును పద్మవిభూషణ్‌కు పంపినట్లు సమాచారం.. అలాగే పద్మవిభూషణ్ పురస్కారం కోసం చెన్నమనేని హనుమంతరావు.. నవలా రచయిత ప్రొఫెసర్ శివ్.కె.కుమార్. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు పేరును.. పద్మశ్రీ కోసం ప్రజా గాయకుడు గోరటి వెంకన్న, అందెశ్రీ, చుక్కా రామయ్య, సుద్దాల అశోక్ తేజ పేర్లను తెలంగాణ ప్రభుత్వం పంపినట్లుగా తెలుస్తోంది. అయితే వీరిలో ఏ ఒక్కరిని పరిగణనలోనికి తీసుకోవడంపై పలువురు తప్పుబడుతున్నారు.   ఇదే అంశంపై జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్‌ కూడా స్పందించాడు. పద్మ అవార్డులు అందుకున్న వారిలో తెలుగువారు ఇంకా ఉండి ఉంటే బాగుండేదని అనిపించిందని వ్యాఖ్యానించి తెలుగువారికి పద్మ అవార్డుల విషయంలో అన్యాయం జరుగుతోందని చెప్పకనే చెప్పినట్లు. మరి బయటి నుంచి వస్తున్న ప్రశ్నలకు కేంద్రప్రభుత్వం ఏ విధంగా సర్ది చెబుతుందో వేచి చూడాలి.

పవన్ సాబ్.. పూలే కాదు.. చెప్పుదెబ్బలు ఉంటాయ్

  సినీనటుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ చలోరే చల్ యాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా నల్లేరుపై నడకలా సాగిపోతోంది. తెలంగాణవాదుల నుంచి కానీ.. టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ.. లేక మరొకరి నుంచో ఆయనకు ఎలాంటి వ్యతిరేకత రావడం లేదు. పవన్ అభిమానులు, పోలీసులు ఊపిరి పీల్చుకుంటున్న వేళ జనసేనానిపై చెప్పుల దాడి జరగింది. ఖమ్మం పర్యటనలో ఉన్న పవన్‌కళ్యాణ్ ఓపెన్‌టాప్ వెహికల్‌లో అభిమానులకు అభివాదం చేస్తూ ర్యాలీగా తల్లాడ సెంటర్‌ వద్దకు చేరుకోగానే అభిమానులు, కార్యకర్తలు పవన్‌ని చూసేందుకు భారీగా గుమిగూడారు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి పవన్‌ పైకి చెప్పు విసిరాడు. అయితే అది కారు బ్యానెట్‌పై పడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తమ అభిమాన హీరోపై చెప్పు పడటంతో అక్కడున్న పవన్ ఫ్యాన్స్ పూనకంతో ఊగిపోయారు.   ఇది జరిగిన కాసేపటికీ కార్యకర్తలతో మాట్లాడిన పవన్.. నాపై దాడులు చేసినా ఎదురుదాడి చేయను.. ప్రజల కోసం ఏమైనా భరిస్తా.. ప్రేమించే వాళ్లకు తప్ప.. ద్వేషించేవాళ్లకు సమయం ఇవ్వను అంటూ రాజకీయాలను పూర్తిగా చదివేసిన వ్యక్తిలా మాట్లాడాడు. అయితే ఇంతకాలం తెలుగు సినీ వినీలాకాశంలో.. అభిమానుల చేత జేజేలు కొట్టించుకున్న పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఒక రకంగా అగ్నిపరీక్షను ఎదుర్కొనబోతున్నారు. తన కారుపై విసరబడిన చెప్పు పవన్ నమ్మకాన్ని వమ్ము చేయగలిగేది కాదు..? ఆకతాయిల అల్లరికి.. గిట్టనివారి చేతలకి జడిసే స్థితిలో పవన్ లేరన్నది వాస్తవం. అదే సమయంలో తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కత్తి మహేశ్‌ లాంటి వారు రాజకీయాల్లో అడుగడుగునా కనిపిస్తారు.   పరిపూర్ణమైన రాజకీయ నాయకుడిగా ఎదగాలంటే ఇలాంటి ఎత్తుపల్లాలు అధిగమించాల్సి ఉంది. ఇప్పటికే పవన్ వైఖరిపై పలువురు రాజకీయ కురువృద్ధులు.. మేధావులు పెదవి విరుస్తున్నారు. నాడు తెలంగాణ రాకను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్‌కు నేడు అదే తెలంగాణపై ఉన్నట్లుండి అంత ప్రేమ ఎందుకు పుట్టుకు వచ్చిందనేది అంతుచిక్కని ప్రశ్న. జనసేన ఎందుకు స్థాపించారో పవన్‌కే క్లారిటీ లేదని మాజీ ఎంపీ ఉండవల్లి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే జనసేన గురించి కానీ.. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురించి కానీ మాట్లాడి.. తన స్థాయినీ తగ్గించుకోలేనని కోదండరాం లాంటి వ్యక్తి అన్నాడంటే పవన్ ఎలాంటి స్థితిలో ఉన్నాడో చెప్పుకోవచ్చు.   అంతేందుకు ఆరు నెలలకు ఒకసారి బయటకు వచ్చి ఒక్క మీటింగ్ పెడితేనో.. ఓ యాత్ర చేస్తేనో ప్రజా సమస్యలపై పోరాడినట్లు కాదని.. నిరంతరం ప్రజా క్షేత్రంలో ఉండి ప్రజల గొంతును ప్రభుత్వాలకు వినిపించేలా పోరాడితేనే పోరాడినట్లు అన్నా.. అంటూ పవన్ వీరాభిమాని ఒకరు చురక వేయడం చాలా మందిని ఆలోచింప చేస్తోంది. చూస్తుంటే సినిమాలు వేరు.. రాజకీయాలు వేరని.. సినీ పరిశ్రమలో నడిచినట్లు రాజకీయ చదరంగంలో నడవలేమని పవన్ తెలుసుకునే రోజు అతి తొందరలోనే ఉందంటున్నారు విశ్లేషకులు.

ఆ 40 శాతమే మోడీ- చంద్రబాబుల మధ్య దూరం పెంచిందా..?

  దేశంలోనే సీనియర్ రాజకీయ వేత్తగా.. నాలుగు దశాబ్ధాల రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను చూసి.. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు నాయుడుకు తన కంటే ఎంతో జూనియర్ అయిన ప్రధాని మోడీ దగ్గర పదే పదే అవమానం జరుగుతూనే ఉందన్నది సగటు తెలుగుదేశం కార్యకర్త అభిప్రాయం. సినీనటుడు మోహన్‌బాబు కుటుంబానికి అపాయింట్‌మెంట్ ఇచ్చిన మోడీ.. ముఖ్యమంత్రి హోదాలోని వ్యక్తితో మాట్లాడటానికి రెండేళ్లుగా ఎందుకు ససేమీరా అన్నాడు. ఆంధ్రుల జీవనాడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న పోలవరానికి ప్రధాని ఎందుకు అడ్డుపడుతున్నారు అన్నది జనానికి అంతు చిక్కని ప్రశ్నలుగా మారాయి. అయితే ఇందుకు సవాలక్ష కారణాలు చెబుతున్నారు విశ్లేషకులు.   2014లో చంద్రబాబు నాయుడు అధికారాన్ని చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ప్రజలు ఏమనుకుంటున్నారు.. జగన్ ప్రతిపక్షనేతగా ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొంటున్నాడా.. బీజేపీ పరిస్థితి మెరుగయ్యిందా..? మరింత దిగజారిపోయిందా..? తదితర విషయాల మీద ప్రధాని నరేంద్రమోడీ ఇంటెలిజెన్స్ ద్వారా సర్వే చేయించారట. ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్లిన ఇంటెలిజెన్స్ తను సేకరించిన సమాచారాన్ని కాసి వడపోసి తుది నివేదికను ప్రధాని మోడీకి అందజేసిందట. ఈ సర్వేలో అధికార తెలుగుదేశం పార్టీ గత ఎన్నికలతో పోలిస్తే 20 శాతం ఓట్లను కోల్పోతోందని తేలింది. ఇచ్చిన హామీల్లో కొన్ని నిలబెట్టుకుంటున్నప్పటికీ.. స్థానిక నేతలు, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడటం అధికారపక్షం పట్ల ప్రజల్లో కాస్త వ్యతిరేకతను తీసుకొచ్చిందట. అదే ఓట్లపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుందని అంచనా వేశారు.   మరి టీడీపీ వీక్ అయ్యిందంటే.. ప్రధాన ప్రతిపక్షం వైపు జనాలు మొగ్గు చూపాలి కదా.? కానీ అలా జరగలేదు.. వైఎస్సార్ కాంగ్రెస్ 2014 ఎన్నికలలో పొందిన ఓట్లశాతంలో 19 శాతానికి పైగా పొగొట్టుకుంటుందని సర్వే నిగ్గు తేల్చింది సర్వే. ప్రతిపక్షనేతగా ప్రభుత్వాన్ని ఎదుర్కోవడంలో జగన్ పూర్తిగా విఫలమయ్యారని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడ్డారట. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఎమ్మెల్యేలు ఫిరాయించకుండా అడ్డుకోవడంలో వైసీపీ అధినేత సమర్థవంతంగా పని చేయలేదని తేలిందట. దానికి తోడు ఆయనపై ఎప్పటి నుంచో వేలాడుతున్న అవినీతి కేసుల కత్తి ప్రజలను ఆలోచింపచేస్తోందట. మరి టీడీపీ కోల్పోయే 20 శాతం, వైసీపీ పొగొట్టుకునే 19 శాతం ఏమవుతుంది.. ఎటు పోతుంది.?   పడితే టీడీపీకి పడాలి లేకపోతే వైసీపీకి పడాలి.. ఈ రెండు కాకుండా ఏపీలో వేరే రాజకీయ పార్టీ లేదు. ఇప్పుడు ఈ రాజకీయ శూన్యతను సొమ్ము చేసుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. స్పెషల్ స్టేటస్ ఇస్తే బీజేపీతో పొత్తుకు సిద్ధమేనని జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడు. ఈ ప్రపోజల్‌ను పరిగణనలోనికి తీసుకోవడంతో పాటు మరో సేఫ్ గేమ్ మొదలుపెట్టింది కమలం. కేంద్రం నిధుల ద్వారా జరిగే అభివృద్ధి తాలుకూ క్రెడిట్‌ను చంద్రబాబు ఖాతాలో పడకుండా అడ్డుకుని దానిని మోడీ అకౌంట్‌కి మళ్లించాలన్నది కాషాయం స్కెచ్. టీడీపీ-వైసీపీలు కోల్పోయే 40 శాతం ఓట్లకు తోడు.. జగన్‌ని కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది బీజేపీ ప్లాన్.. ఒకవేళ అప్పుడు జగన్ ఎదురు తిరగాలని చూస్తే.. ఏం మంత్రం వేయాలన్నది మోడీ-అమిత్‌షాలకు బాగా తెలుసు అంటున్నారు విశ్లేషకులు.

పవన్ రాగం.. కేసీఆర్ తాళం..?

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నట్లుండి తెలంగాణ రాగం ఎందుకు ఎత్తుకున్నాడా అని సగటు అభిమానులతో పాటు రాజకీయ విశ్లేషకులకు సైతం అంతుబట్టడం లేదు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అంటకాగుతూ వస్తుండటం.. అక్కడికే ఓటు హక్కు మార్పించుకోవడం.. సీమాంధ్రలోనే యాత్రలు చేయడాన్ని చూస్తే.. పవన్ ఏపీకే పరిమితమవుతాడని చెప్పకనే చెబుతున్నాయి. 2019 ఎన్నికలకు సమయం ఎంతో దూరం లేదు. ఇలాంటి పరిణామాల మధ్య జనసేనాని తెలంగాణలో యాత్ర ఎందుకు చేపట్టినట్లు..? కోదండరాంను గదుల్లోంచి బయటకు లాక్కొచ్చి అరెస్ట్ చేయించిన ప్రభుత్వం.. పవన్ యాత్రకు ఎలాంటి ఇబ్బందులు పెట్టకపోవడం ఏంటీ..? వీటన్నింటికి ఒకటే సమాధానం కేసీఆర్.   నాలుగేళ్ల క్రితం తెలంగాణ వచ్చినప్పటితో పోలిస్తే ఇప్పుడు కేసీఆర్‌కు ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. అభివృద్ధి జరిగిపోతోందన్న ప్రచారం తప్ప నాడు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలైన దాఖలాలు లేవు. తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలంటే ప్రజా వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకోవాలి.. అంతకంతకూ పుంజుకుంటున్న రెడ్లను కొట్టాలంటే.. రాజధాని ఏరియాలో.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఆంధ్రా సెటిలర్ల అండ కావాలి.. టీడీపీలోని మెజార్టీ నాయకుల్ని ఇప్పటికే లాగిపడేసిన కేసీఆర్‌కు... రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడా ఉన్న సీమాంధ్రుల బలం కావాలి. అది దక్కాలంటే సెటిలర్లతో పాటు తెలంగాణలోనూ ఫేమస్ అయిన వ్యక్తి అండ తనకు కావాలి. ఈ క్రమంలో కేసీఆర్‌కు కనిపించిన వ్యక్తి పవన్‌కళ్యాణ్.   అందుకే 2014 నాటి విభేదాలను పక్కనబెట్టి మరీ రాజ్‌భవన్ సాక్షిగా ఆయనతో చేయి కలిపారు. ఇది జరిగిన కొద్దిరోజుల్లోనే పవన్‌ కళ్యాణ్ ప్రగతి భవన్‌లో ప్రత్యక్షమవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. లేదంటే కోదండరామ్‌ను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన కేసీఆర్ సర్కార్.. నేడు పవన్ కళ్యాణ్‌కు రెడ్‌ కార్పెట్ పరచడమేంటీ. లేకపోతే చిన్న చిన్న నిరసనలకే అనుమతులు ఇవ్వని గులాబీ బాస్.. జనసేన అధినేతకు అనుమతి ఇచ్చేస్తాడా..? జగన్‌ను సీమాంధ్ర పెట్టుబడిదారుగా ముద్రవేసి నాడు మానుకోటలో ఆయన్ను రాళ్లతో ఎదుర్కొన్న కేసీఆర్‌.. ఇప్పుడు పవన్ యాత్రకు అవరోధాలు లేకుండా చేయడమేంటీ.. జనసేన కార్యాలయం దగ్గర ప్రారంభమైన పవన్ కాన్వాయ్‌కి ఏ టీఆర్ఎస్ కార్యకర్తా అడ్డుపడలేదు..   అంతెందుకు తొలి రోజు యాత్రలో పవన్ బస చేసిన హోటల్ కూడా ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యేది కావడం విశేషం. కేసీఆర్‌కు మద్దతుగా పవన్ తెలంగాణలో ప్రచారం చేస్తున్నారన్న వార్తలకు ఇది మరింత బలాన్ని చేకూరుస్తోంది అంటూ రాజకీయ వర్గాల్లో హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఇదంతా గిట్టని వారు చేస్తోన్ ప్రచారమా..? లేక పవన్- కేసీఆర్‌ల మధ్య ఏదైనా లోపాయికారి ఒప్పందం కుదిరిందా అన్నది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

బరాత్‌లు ఇక బందేనట..?

  మేళ తాళాలతో.. తప్పిట్లతో.. బాణాసంచా పేలుళ్లతో గుర్రం మీద కూర్చొన్న పెళ్లికుమారుడిని పెళ్లి పందిరి వద్దకు అట్టహాసంగా తీసుకువచ్చే వేడుకే బరాత్‌. బంధువులు, సన్నిహితులు, తెలిసినోళ్లు డ్యాన్సులు చేస్తూ ఉంటే.. దానిని చూస్తోన్న వారు కూడా పూనకంతో ఊగిపోతూ కాలు కదిపే సంబరంలో ఉన్న మజానే వేరు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ బరాత్‌లకు పెట్టింది పేరు. మొదట్లో ముస్లింలు మాత్రమే జరుపుకునే ఈ సంబరాన్ని రాను రాను అన్ని మతాలు, కులాలు తమ సంస్కృతిలో భాగంగా చేసుకున్నాయి. ఏదీ ఏమైనా అసలైన బరాత్‌లు చూడాలి అంటే ముస్లింల పెళ్లిళ్లలోనే చూడాలి. అయితే ఇక మీదట హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ముస్లింల పెళ్లిళ్లలో బరాత్‌లు కనిపించవు. తెల్లవారిందాకా బరాత్‌లు సాగడంతో పాటు అర్ధరాత్రి వేళ మేలతాళాలు మోగిస్తూ.. బాణాసంచా కాలుస్తూ.. నృత్యాలు చేస్తూ నింపాదిగా పెళ్లి కొడుకు రోడ్ల మీద వెళుతూ ఉంటే.. పబ్లిక్ డిస్ట్రబ్ అవుతుండటంతో పాటు ఈ మధ్యకాలంలో కొన్ని అనివార్య సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక బరాత్‌లో కాల్పులు.. మరో బరాత్‌లో తల్వార్ ఆట కారణంగా ఒకరు మరణించగా పలువురు గాయపడ్డారు. దీంతో వీటిని కట్టడి చేసేందుకు తెలంగాణ వక్ఫ్‌బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ముస్లింల వివాహా వేడుకల్లో బరాత్‌లు బ్యాన్ చేయడంతో పాటు మరికొన్ని ఆంక్షలు విధించే దిశగా కసరత్తులు చేస్తోంది. నిఖా ప్రక్రియ రాత్రి తొమ్మిది గంటలలోపు పూర్తి చేయాలని.. రాత్రి 12 గంటలు దాటితే ఫంక్షన్ హాల్స్ మూసే విధంగా చర్యలు చేపట్టనుంది.   అలాగే పెళ్లి విందులో గొప్పలకు పోకుండా పరిమితితో సాగే విధంగా కట్టడి చేయాలని వక్ఫ్ బోర్డ్ భావిస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా 23వ తేదిన పోలీసులు, ఖాజీలు, మత పెద్దలతో తెలంగాణ వక్ఫ్‌బోర్డు పాలక మండలి సమావేశం కానుంది. అయితే ఎన్నో ఏళ్లుగా వస్తోన్న ఆచారాన్ని నిషేధిస్తే ఒప్పుకునేది లేదని కొందరు .. సాంప్రదాయం అనేది మనుషుల్లో ఆనందాన్ని నింపాలి కానీ.. మనుషుల ప్రాణాలు తీయడం.. సమాజాన్ని ఆటంకపరచరాదని మరికొందరు వాదిస్తున్నారు. మరి ఇలాంటి పరిణామాల మధ్య వక్ఫ్‌బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే 23 వరకు వేచి చూడాల్సిందే.

రిపబ్లిక్ టీవీ సర్వే వెనుక మోడీ మైండ్ గేమ్..?

  అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల్లో వస్తున్న ఆదరణతో ఈ సారి కూడా అధికారం తమదేనని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్న వేళ.. అలా జరిగితే తమ పార్టీ మనుగడ కష్టమని.. ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని జగన్ కాళ్లకు బలపాలు కట్టుకుని తిరుగుతున్న సమయంలో వెలువడిన ఒక సర్వే రిజల్ట్.. టీడీపీకి షాక్‌ని.. వైసీపీకి మంచి బూస్ట్‌ని అందించింది. 2019 సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంట్ స్థానాల్లో రిపబ్లికన్ టీవీ, సీ ఓటర్ సర్వే నిర్వహించాయి. దీని ప్రకారం 2019లో మళ్లీ ఎన్‌డీఏ అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. ఇక ఏపీలో వైసీపీకి, తెలంగాణలో టీఆర్ఎస్‌కి, తమిళనాడులో రజనీకి ఆధిక్యం ఉన్నట్లుగా తెలిపింది.   ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-బీజేపీ కూటమికి 12 పార్లమెంట్ స్థానాలు దక్కుతాయట.. అంటే గత ఎన్నికలతో పోలిస్తే 5 స్థానాలు తగ్గుతాయని అభిప్రాయపడింది. అదే సమయంలో ఇతరులకు అంటే.. ఏపీలో మరో పార్టీ లేదు కాబట్టి వైసీపీకి 13 స్థానాలు వస్తాయని తేల్చింది. రిపబ్లిక్ టీవీ వెలువరించిన కథనంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ మైండ్ గేమ్‌కు చిత్తవుతున్న వేళ.. తమ పార్టీకే ప్రజాదరణ దక్కుతుందని కథనం రావడం పెద్ద బూస్టప్ ఇచ్చినట్లే. ఎన్నికలకు ఇంకా ఏడాది గడువున్న టైంలో ఇలాంటి వార్తలు రావడం వెనుక ఏదో ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.   సర్వే నిర్వహించిన రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి బీజేపీ పక్షపాతి అన్నది ఓపెన్ టాక్. సీట్‌లో ఎంతటి వారున్నా సరే తన వాగ్ధాటితో ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించే అర్నాబ్‌... 2014 ఎన్నికల సమయంలో మోడీని చేసిన ఇంటర్వ్యూతో తాను ప్రధానికి పరమ భక్తుడిని అని చెప్పకనే చెప్పాడు. తాజా సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎన్డీఏ 335 సీట్లు సాధిస్తుందని చెప్పి బీజేపీ భజన చేసిన అర్నాబ్‌‌.. మరి అదే ఎన్డీఏ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీని తక్కువ చేసి చూపడం అనుమానాలకు తావిస్తోంది. పోలవరం స్పిల్ వే టెండర్లను నిలిపివేయాల్సిందిగా ఏపీ సర్కార్‌ను కేంద్రప్రభుత్వం ఎప్పుడైతే ఆదేశించిందో అప్పటి నుంచి బీజేపీ-మోడీ‌ బంధం తెగిపోవడానికి కౌంట్‌డౌన్ స్టార్టయ్యిందని అందరూ భావించారు.   అందుకు తగ్గట్టుగానే నిధులివ్వమంటే ఇవ్వరు.. మా బాధలు మేం పడి పనులు పూర్తి చేసుకుంటుంటే మీకు ఎందుకు అంత నొప్పి అంటూ కొంతమంది టీడీపీ నేతలు బీజేపీని ఓపెన్‌గానే కార్నర్ చేస్తున్నారు. మరి వాళ్లు తక్కువ తింటారా..? టీడీపీకి బలంగానే కౌంటర్ వేస్తున్నారు. చంద్రబాబు కూడా మోడీతో తాడో పేడో తేల్చుకుంటారని.. ఢిల్లీ టూర్‌లో మొత్తం తేలిపోతుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. తీరా సీఎం.. పీఎంలు గంటపాటు రాష్ట్ర సమస్యల గురించి చర్చించుకున్నారు.. నవ్వుతూ బయటకు వచ్చారు. తాము ఎంతగా ప్రయత్నిస్తున్నటికీ బాబును ఆపడం సాధ్యం కాకపోవడంతో బీజేపీ పెద్దలు అర్నాబ్‌ను రంగంలోకి దించారట. తద్వారా ఎన్నికలు దగ్గరపడే లోగా చంద్రబాబు నైతిక స్థైర్యాన్నీ దెబ్బ తీయాలన్నది కమల నాథుల మైండ్‌గేమ్‌గా చెబుతున్నారు విశ్లేషకులు. ఈ గేమ్‌లో ఫస్ట్ స్టెప్‌‌లో భాగంగానే సర్వే చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

చాన్సొచ్చిందా..? విసుగొచ్చిందా..?

మళ్లీ పూర్వవైభవాన్ని తీసుకొస్తాడనుకున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడంతో తెలంగాణ తెలుగుదేశం శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయాయి. అయినప్పటికీ సీనియర్లు మోత్కుపల్లి, రావుల, ఎల్ రమణ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ వర్థంతి వేళ మోత్కుపల్లి నర్సింహులు అన్న మాటలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.   తెలంగాణ ప్రాంతంలో టీడీపీ రోజు రోజుకి ప్రాభవం కోల్పోతోందని.. అలాంటి మాటలు వింటుంటే మనసుకి బాధనిపిస్తోందని.. పార్టీని భుజాన వేసుకుని నడుపుదామన్నా.. అందుకు సహకరించేవారు లేరని.. ఇలాంటి పరిస్థితుల్లో కార్యకర్తలు.. ఓటర్ల మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పాటు మంత్రులు, మెజారిటీ నేతలు అందరూ టీడీపీ నుంచి వెళ్లినవారే. ఇలాంటి పరిస్థితుల్లో టీటీడీపీని టీఆర్ఎస్‌లో విలీనం చేయగలిగితే బాగుంటుందని నా అభిప్రాయం అంటూ మోత్కుపల్లి వ్యాఖ్యానించడంతో అక్కడున్న కార్యకర్తలు, నేతలు అవాక్కయ్యారు.   ఎంతగా ప్రజల్లోకి వెళుతున్నా వారి నుంచి సరైన స్పందన లేకపోవడానికి తోడు.. ఎన్నో ఏళ్లుగా ఆశిస్తున్న గవర్నర్ గిరి ఇక దక్కే అవకాశం లేదు..? కనీసం రాజ్యసభకైనా పంపిస్తారా అన్న గ్యారెంటీ చంద్రబాబు నుంచి లేకపోవడంతో ఆయనలో కాస్త అసహనం పెరిగిందంటున్నారు. అందుకే తన దారి తాను చూసుకోవాలని మోత్కుపల్లి భావిస్తున్నారని.. దీనిలో భాగంగానే పార్టీ మారతానని చెప్పకుండా.. పార్టీని టీఆర్ఎస్‌లో వీలినం చేయాలంటూ కొత్తరాగం అందుకున్నారు అంటూ పొలిటికల్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మూడు దశాబ్ధాల సుధీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు అప్పట్లో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా నర్సింహులను టీఆర్ఎస్‌లో చేర్చుకునేందుకు కేసీఆర్ సిద్దంగానే ఉన్నప్పటికీ ఆయన వైపు నుంచి స్పందన రాలేదు. అయితే నర్సింహులు నోటి వెంట విలీనం మాట రావడంతో తెర వెనుక ఏదో జరిగిందన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.   టీఆర్ఎస్ నుంచి ఆఫరైనా వచ్చి ఉండాలని లేదంటే.. ఎంత కష్టపడినా పార్టీ బండి నడవటం కష్టమేనని భావించి ఆ మాటలు అన్నారా అంటూ శ్రేణుల్లో ఒకింత అయోమయం నెలకొంది. ఈ విషయంపై అధినేత చంద్రబాబు నాయుడు ఇంకా స్పందించాల్సి ఉంది.. ఉదయం అమరావతిలో కలెక్టర్ల సమావేశంలో ఉన్న ఆయనకు పార్టీ నాయకులు మోత్కుపల్లి మ్యాటర్‌ను చెప్పారట. ఆ మాట విన్న వెంటనే సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారట. అయితే నర్సింహులు వంటి సీనియర్ నేతే విలీనం పాట పాడటం వల్ల పార్టీ పరిస్థితిపై శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళతాయి అని.. ఈ విధమైన ప్రకటన చేయడం ద్వారా పార్టీకి నష్టం కలుగుతుందని తెలంగాణకు చెందిన కొందరు నేతలు ఓపెన్‌గానే అంటున్నారు. మరి నర్సింహులుపై అధినేత ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో.. శ్రేణులకు ఏం సమాధానం చెబుతారో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

చంద్రబాబు ముందుచూపు అదిరిందిగా...!

  ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ఇక వచ్చే ఏడాది ఎన్నికలు కూడా ఉండటంతో నేతలందరూ తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇప్పటినుండే కసరత్తులు చేస్తున్నారు. ఇక చంద్రబాబు కూడా తమ పార్టీ గురించి తగు జాగ్రత్తలే తీసుకుంటున్నారు. ఇప్పటికే మిత్రపక్షమైనప్పటికీ టీడీపీ-బీజేపీల మధ్య విబేధాలు ఉన్నాయి. అప్పుడప్పుడు బహిరంగానే అవి బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు పొత్తుపై కూడా అనుమానాలు ఉన్నాయి. అయితే ఈ విషయంలో మాత్రం చంద్రబాబు మే నెల వరకూ గడువు తీసుకున్నట్టు తెలుస్తోంది   నిజానికి అవ్వడానికి మిత్రపక్షమైనా మోడీ ఏపీకి చేసింది పెద్దగా ఏం లేదనే చెప్పొచ్చు. చంద్రబాబు కేంద్రం చుట్టూ తిరగి.. తిరిగి... వాళ్లని అడిగి అడిగి సాయం చేయండయ్యా బాబు అంటే ఆ మాత్రం నిధులన్నా ఇచ్చారు. నిజానికి కేంద్రం విషయంలో చంద్రబాబు చాలా ఓపికగా ఉన్నట్టే. నాలుగేళ్ల సమయం ఇవ్వడం అనేది చిన్న విషయం ఏం కాదు. నాలుగేళ్లే ఇచ్చారు.. ఇంకా ఈ నాలుగు నెలలు ఇవ్వడం పెద్ద మేటర్ ఏంకాదు. అంతకన్నా ఎక్కువ టైం ఇచ్చినా టీడీపీకే నష్టం. ఎందుకంటే ఇంకా ఎదురుచూపులు చూస్తే జనం టీడీపీని అపార్ధం చేసుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ చంద్రబాబు కూడా కావాలనే టైం తీసుకున్నట్టు తెలుస్తోంది. దానికి కారణం లేకపోతే..   అసలు సంగతేంటంటే.. ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నాయి. అయితే మే నెలలోపు  కర్ణాటకతో పాటు మరో మూడు ఈశాన్య రాష్ట్రాలకు ఎన్నికలు జరగుతున్నాయి. ఈ ఎన్నికల్లో దక్షిణాదిన బీజేపీకి ఉన్న సామర్ధ్యం ఏంటో.. బీజేపీ భవితవ్యం ఏంటో తెలుస్తుంది. కాబట్టి మే నెలలో ఒక డెసిషన్ తీసుకోవచ్చు అని చంద్రబాబు ఆలోచన అని రాజకీయ విశ్లేషకుల మాట. బీజేపీతో ఇప్పుడే తెగతెంపులు చేసుకుంటే.. ఒకవేళ ఎన్నికల్లో పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా ఉంటే.. రాష్ట్రానికి అందుతున్న ఈ పాటి సాయం కూడా అందదని చంద్రబాబు ఆలోచిస్తున్నారట. ఫలితాలు అటూ ఇటూ అయి.. బీజేపీకి ఎదురుదెబ్బ తగిలితే.. టీడీపీ బయటకు వస్తుంది. మరి టీడీపీని కాదని.. బీజేపీ వైసీపీ తో చేయి కలిపి... ఇప్పుడు చెప్పిన సోది... హామీలు ఇచ్చినా నమ్మే పరిస్థితిలో అయితే జనం లేరు. అందుకే చంద్రబాబు ముందు చూపుతో ఆలోచించి మే వరకూ టైం తీసుకున్నట్టు వినికిడి. మరి అందుకేనేమో చంద్రబాబును రాజకీయ చాణక్యుడు అన్నది. అంత ముందు చూపుతో ఆలోచిస్తారు కాబట్టే ఆయనకు ఆపేరు వచ్చింది.

మోడీ గారు మర్చిపోయారా.. కావాలనే చేశారా..?

  ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంక్రాంతి పండుగ ఎంత వైభవంగా జరుపుకుంటారో చెప్పాల్సిన పని లేదు... మనకి ఇదే పెద్ద పండుగ... ఉద్యోగరిత్యా ఎక్కడ ఉన్నా, అన్నీ వదిలిపెట్టి, సొంత ఊరు వచ్చేసి, ఈ మూడు రోజులు అన్నీ మర్చిపోయి సంక్రాంతి పండుగ జరుపుకుంటాం... అంతగా మనం ఈ పండుగకు కనెక్ట్ అయిపోయాము.. అలాగే తెలంగాణాలో మనంత జరుపుకోకపోయినా, అక్కడ కూడా పండుగ జరుపుకుంటారు... దేశ వ్యాప్తంగా, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, ఇలా వివిధ రాష్ట్రాల్లో పొంగల్ అని, లోహ్రి అని, ఉత్తరాయణ్ అని, ఇలా వివిధ రకాల పేర్లతో సంక్రాంతి పండుగ జరుపుకుంటారు...   యాదృశ్చికమో.. లేక అనుకోకుండా జరిగిపోయిందో తెలియదు కానీ మరోసారి మోడీకి ఏపీపై ఉన్న చిన్నచూపు బయటపడింది. ఇప్పటికే మోడీకి ఏపీపై ఉన్న చిన్నచూపు ఏంటో చాలా సార్లు బయటపడింది. ఇప్పుడు సంక్రాంతి పండుగ సాక్షిగా ఏపీపై ఉన్న చిన్న చూపు బయటపడింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంక్రాంతి పండుగ ఎంత వైభవంగా జరుపుకుంటారో చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు పండుగల్లో.. కొత్త ఏడాది ప్రారంభంలో వచ్చే సంక్రాంతి పండుగ మనకి పెద్ద పండుగ. ఈ పండక్కి ఎక్కడెక్కడ ఉన్న వాళ్లందరూ సొంతఊరుకు వచ్చి  ఈ మూడు రోజులు అన్నీ మర్చిపోయి సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. ఇక మనం సంక్రాంతి ఎలా జరుపుకుంటామో.. తెలంగాణాలో గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్ వివిధ రాష్ట్రాల్లో పలు రకాల పేర్లతో జరుపుకుంటారు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా ఇక్కడే అసలు విషయం ఉంది. నరేంద్ర మోడీ గారు, నిన్న తమిళనాడు,గుజరాత్, మరాఠీ, పంజాబ్, నార్త్ ఇండియన్ సోదరుల అందరికి పండుగ శుభాకాంక్షలు చెప్పారు. తమిళ్, కన్నడ, పంజాబీ వారి వారి భాషల్లో  వేరు వేరు భాషల్లో ట్వీట్ చేశారు. అలాగే మన ఏపీ ప్రజలకు కూడా చెబుతారు అని అనుకున్నారు. కానీ మోడీ గారు మాత్రం మనల్ని మరిచిపోయారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో, వివిధ రాష్ట్రాల్లో, దేశాల్లో ఉన్న తెలుగువారికి, వారి తెలుగు భాషలో కాని, ఇంగ్లీష్ లో కాని, పండుగ శుభాకాంక్షలు చెప్పలేదు ప్రధాని. అంతే మరోసారి మోడీకి ఏపీ అంటే ఎంత గౌరవం... ఏపీ ప్రజలంటే ఎంత మర్యాద.. అని అనుకుంటున్నారు. ప్రధాని మోడీకి ఇవాళ మన తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి అని తెలీదా ? గుర్తు రాలేదా? లేక వచ్చినా, అవసరం లేదు అనుకున్నారా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే..రాహుల్ గాంధీ అయితే, కేవలం కర్ణాటక రాష్ట్రానికి మాత్రమే విషెస్ చెప్పారు. ఎందుకో తెలుసా... కర్ణాటకలో త్వరలో ఎన్నికలు ఉన్నాయి కదా... మొత్తానికి రాజకీయ నాయకుల బుద్ది మరోసారి బయటపెట్టారు. అంతేకాదు మోడీకి కూడా ఏపీ ప్రజలపై ఉన్న చిన్నచూపు మరోసారి బయటపెట్టాడు. అంతేకాదు తెలియకపోతే,పెద్ద ఇబ్బంది ఏమి లేదు.. అదే కావాలి అని చేస్తే, మాత్రం ఇప్పుడు ఇప్పుడే అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న, అయిదు కోట్ల ఆంధ్రులు ఆలోచించుకొని, జాగ్రత్తపడవలసిన అవసరం ఉంది మరి.

సంక్షోభంలో "సుప్రీం"

  సుప్రీంకోర్టు.. దశాబ్దాలుగా భారతదేశ న్యాయవ్యవస్థను భుజాలపై మోస్తూ.. సంచలన తీర్పులతో.. ఎందరో దోషులను శిక్షించి ధర్మాన్ని నిలబెట్టి.. ప్రపంచం చేత జేజేలు కొట్టించుకున్న సర్వోన్నత న్యాయస్థానం. కింది కోర్టులలో న్యాయం జరగని వారికి మనకు సుప్రీంకోర్టు ఉందన్న భరోసాని అందించింది అంటే సుప్రీంకోర్టు గొప్పదనాన్ని అర్థం చేసుకోవచ్చు. అటువంటి గొప్ప సంస్థ ఇప్పుడు సంక్షోభంలో చిక్కుకుంది. స్వతంత్ర్య భారత చరిత్రలోనే మునుపెన్నడూ జరగని పరిణామం ఇవాళ జరిగింది. న్యాయం చేయాలంటూ సుప్రీం జడ్జీల ముందు మనం నిలబడితే.. మీరే సుప్రీంను కాపాడాలంటూ అత్యున్నత న్యాయస్థానాన్ని నడిపిస్తున్న న్యాయమూర్తులు దేశ ప్రజల ముందుకొచ్చారు.   ఒకేసారి నలుగురు జడ్జీలు ప్రెస్ మీట్ పెట్టి మరి సుప్రీంలో జరుగుతున్న అవతవకలను జాతికి తెలియజేశారు. జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లు మీడియా ముందుకు వచ్చి.. "భారత చరిత్రలో తొలిసారిగా జరుగుతున్న సమావేశం ఇది.. స్వేచ్ఛాయుత న్యాయవ్యవస్థ లేకపోతే ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదు. సుప్రీంలో పాలనా వ్యవస్థ సరైన క్రమంలో లేదు.. గత కొద్ది రోజులుగా అవాంఛిత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిణామాలపై మేం నలుగురుం చర్చించి.. పాలనా వ్యవస్థను సరిదిద్దాల్సిందిగా కోరుతూ కొన్ని నెలల క్రితం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాం. అయితే ఆయనను ఒప్పించడంలో మేం విఫలమయ్యాం.. జరుగుతున్న పరిణామాలను ప్రజలకు చెప్పడం తప్ప మా ముందు మరో మార్గం లేదు. అందుకే మీడియా ముందుకు వచ్చాం.. న్యాయమూర్తులుగా ఇలాంటి సమావేశం పెట్టడం బాధాకరమే అయినా.. సుప్రీంకోర్టు వ్యవస్థకు, దేశానికి మేం బాధ్యత వహిస్తున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు అంటూ" చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాకు పంపిన లేఖను మీడియాకు చూపారు.   ఇప్పుడు ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చీఫ్ జస్టిస్ వ్యవహార శైలి సవ్యంగా లేదంటూ.. ఏకంగా నలుగురు సీనియర్ జడ్జిలు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపించడం.. న్యాయవ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరింత తగ్గిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిణామాలు తెర వెనుక ఏదో జరుగుతున్నదనే అనుమానం సామాన్యులకు కలిగేలా చేసిందని భావిస్తున్నారు. మరోవైపు న్యాయమూర్తుల మీడియా సమావేశం కేంద్రప్రభుత్వ వర్గాల్లో సంచలనం కలిగించింది. వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రధాని నరేంద్రమోడీ.. న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో అత్యవసరంగా సమావేశమై చర్చించారు. కేంద్రప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి ఈ సంక్షోభాన్ని చక్కదిద్దకపోతే.. దేశ ప్రజాస్వామ్య మౌలిక వ్యవస్థ సవ్యంగా పరిఢవిల్లేలా చేస్తున్న మూడు స్తంభాల్లో ఒకటిగా.. ప్రపంచం చేత జేజేలు పలికించుకుంటున్న భారత సర్వోన్నత న్యాయస్థానానికి కలంకాన్ని తీసుకువస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.  

రజనీ వల్ల మాటపడ్డ ఏడుకొండలవాడు...

  రాజకీయాలు మరీ ఎంత దారుణంగా తయారయ్యాయి అంటే.. ఆఖరికి తమ రాజకీయ ప్రయోజనాల కోసం దేవుళ్లను కూడా.. రాజకీయాల్లోకి లాగుతున్నారు. ఎప్పటినుండో అభిమానులతో పాటు అందరినీ సస్పెన్స్ లో పెట్టి ఎట్టకేలకు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఇక ఆయన రాజకీయాల్లోకి వచ్చారో... లేదో..?అప్పుడే ఆయనపై విమర్శల దాడి పెరిగింది. పాపం ఆయన వల్ల దేవుడు మాటలు పడాల్సి  వచ్చింది. రజనీకాంత్ వల్ల దేవుడు మాటలుపడటం ఏంటని అనుకుంటున్నారా..? ఆ స్టోరీ ఏంటో చూద్దాం..   ఆద్యాత్మికత పేరుతో రజనీ రాజకీయాల్లోకి రావాలని చూస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక్కడే డీఎంకే పార్టీ రివర్స్ లో వస్తుంది. రజనీ ఆద్యాత్మికత పేరుతో ప్రజల్లోకి రావాలని చూస్తుంటే... డీఎంకే పార్టీ ఇంకోసారి ద్రవిడ ఉద్యమ స్ఫూర్తి రగిలించేందుకు ప్రయత్నిస్తోంది. ఒకప్పుడు డీఎంకే ద్రవిడ ఉద్యమ పునాదుల మీద నడిచేది. అయితే కాలనుగుణంగా మారుతూ.. కొన్ని పరిస్థితుల వల్ల ద్రవిడ ఉద్యమాన్ని పక్కన పెట్టింది. ఇక ఇప్పుడు...  ఇక ఇప్పుడు ఆధ్యాత్మిక రాజకీయం అని రజని రేసులోకి రాగానే.. మళ్లీ ద్రవిడ ఉద్యమం అంటూ నాస్తికతను తెరపైకి తెచ్చారు.   ఆ క్రమంలోనే ఇకపై తమిళనాడులో నాస్తిక సభలు విరివిగా జరిగేలా చూడాలని ఆ పార్టీ అనుకుంటోంది. అంతేకాదు ఇటీవల  తిరుచ్చి లో నాస్తిక సమాజ మహానాడు జరగగా... అందులో డీఎంకే ఎంపీ , కరుణ కుమార్తె , స్టాలిన్ సోదరి కనిమొళి పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న కనిమొళి.. ఏకంగా తిరుమల ఏడుకొండలవాడి మీదే విమర్శలు గుప్పించింది. “ తిరుమల ఏడుకొండలవాడు డబ్బున్న వాళ్ళకే దేవుడు. సామాన్యుడు ఆయన్ని దర్శించుకోవాలంటే పడిగాపులు కాయాల్సిందే. పేద‌వాడిని కాపాడ‌లేని దేవుడు మ‌న‌కెందుక‌ని.. సొంత హుండీని కాపాడుకోలేని ఆయన ఇక భక్తులని ఏమి కాపాడతాడు. ఏడుకొండలవాడు దేవుడై,ఆయనకు శక్తులు ఉంటే ఇక ఆయనకు భద్రత ఎందుకు ? అని సంచలన వ్యాఖ్యలు చేసింది. అక్కడితో ఆగకుండా.... అసలు మతాలు ప్రపంచంలో వున్న మనుషుల్ని విడగొడుతున్నాయని, వారిని ఒక్క తాటి మీదకు తెచ్చే శక్తి నాస్తికత్వానికే వుంది. ప్రపంచ యుద్ధాల కన్నా మతాల వల్లే ఎక్కువ రక్తం చిందింది. ఈ జాతి ,మత ఘర్షణలు ఆగిపోవాలంటే నాస్తికవాదంతో పాటు మానవతావాదం వ్యాప్తి చెందాలి “ అని కనిమొళి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కనిమొళి చేసిన వ్యాఖ్యలు ఒక్క తమిళనాట మాత్రమే కాకుండా.. దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నారు. ఏది ఏమైనా.. ఎంతో మంది భక్తులు.. ఎన్నో ప్రాంతాల నుండి ఏడుకొండలవాడి దర్శనానికి వచ్చి.. శ్రీవారిని ఒక్క‌సారి ద‌ర్శిస్తే చాలు స‌క‌ల పాపాలూ హ‌రించుకుపోతాయ‌ని నమ్ముకునే వారు ఎంతో మంది ఉంటే.. రాజకీయాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. మరి ఈ వ్యాఖ్యలు ఎంత దుమారం రేపుతాయో చూద్దాం...

నిజమైన కార్యకర్తలకు చంద్రబాబు నిరాశను మిగిల్చారా..?

  దేశవ్యాప్తంగా మరోసారి రాజ్యసభ ఎన్నికల నగారా మోగింది. ఏప్రిల్ మొదటి వారంలో పలువురు రాజ్యసభ సభ్యుల సభ్యత్వం ముగియనుండటంతో ఆయా స్థానాలను భర్తీ చేసేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న బలాన్ని బట్టి టీడీపీకి రెండు రాజ్యసభ స్థానాలు ఖాయంగా లభిస్తాయి. మరోవైపు అభ్యర్థుల ఎంపిక టీడీపీ అధినేతకు కత్తిమీద సాములా తయారైంది. ఆశావహుల జాబితా చాంతాడంత ఉండటంతో పాటు.. ఒకరికి ఛాన్స్ ఇస్తే.. రెండో వారి నుంచి ఎలాంటి నిరసన వస్తుందోనని ఆయన భయపడుతున్నారు. అయితే రెండు రాజ్యసభ స్థానాల్లో ఒకదానికి అభ్యర్థి ఎప్పుడో ఖరారైపోయాడంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.   విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రముఖ పారిశ్రామిక వేత్త మెగా కనస్ట్రక్షన్స్ అధినేత మెగా కృష్ణారెడ్డికి రాజ్యసభ టికెట్ దక్కబోతుందంటూ జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భారీ ప్రాజెక్ట్‌లన్నీ ఈయనవే. మీరే మా పని చేసి పెట్టాలంటూ అటు ఏపీ, ఇటు తెలంగాణ ప్రభుత్వాలు మెగా కృష్ణారెడ్డికి రెడ్‌ కార్పెట్ పరుస్తున్నాయి. నిజానికి మెగా కృష్ణారెడ్డి వైఎస్‌కు అత్యంత సన్నిహితుడు.. అలాగే కేవీపీ రామచంద్రరావుకు పార్ట్‌నర్‌‌గా పేరుంది. వైఎస్ జమానాలో ఆయన పెద్ద ఎత్తున కాంట్రాక్టులు చేపట్టారు. అప్పట్లో ఈ సంస్థ అవినీతిపై ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు.   అలాంటిది తెరవెనుక ఏం జరిగిందో తెలియదు కానీ.. ఇప్పుడు మాత్రం పిలిచి మరీ ప్రాజెక్ట్‌లు కట్టబెడుతున్నారు. నిన్నటి వరకు కాంట్రాక్టర్‌.. ముఖ్యమంత్రిగా ఉన్న వీరి బంధం.. ఇప్పుడు పార్టీ కార్యకర్త.. పార్టీ అధినేతగా మారింది. మెగా కృష్ణారెడ్డిని స్వయంగా సీఎం రమేశే ముఖ్యమంత్రికి పరిచయం చేశాడట. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మాంచి సాన్నిహిత్యం కుదిరిందట. అదే ఇప్పుడు కృష్ణారెడ్డిని రాజ్యసభకు ఎంపిక చేసేలా చేసిందంటూ టీడీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దానికి తోడు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు సమర్థవంతమైన పాలనను అందిస్తున్నా.. ఎన్నికల రణరంగంలోకి దిగాలంటే డబ్బు కావాల్సిందే. ఎన్నికల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయిన ప్రస్తుత రోజుల్లో ఆర్థికంగా పుష్టి కలిగిన వారికే పార్టీ అధిష్టానాలు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి.   దశాబ్ధాలుగా పార్టీ జెండా మోస్తూ.. ప్రత్యర్థుల దాడుల్ని తట్టుకుంటూ నిలబడిన వారికి అధినేతలు మొండి చేయి చూపించక తప్పడం లేదు. ఇది వారు కావాలని చేస్తున్నది కాదు.. పార్టీ మనుగడ కోసం ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పని పరిస్థితి. ఇప్పుడు ఇదే దారిలో మెగా కృష్ణారెడ్డికి ఛాన్స్‌ దక్కబోతుందా అంటున్నారు విశ్లేషకులు. అర్థబలం, అంగ బలం మెండుగా ఉండటంతో పాటు సామాజిక వర్గ లెక్కల ప్రకారం మెగా కృష్ణారెడ్డికి చంద్రబాబు పట్టం కట్టబోతున్నారని.. మరికొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడుతుందని ప్రచారం జరుగుతోంది. కానీ గత ఎన్నికల్లో అవకాశం రాని ఎంతోమంది రాజ్యసభ టికెట్ మీద గంపెడు ఆశ పెట్టుకున్నారు. అధినేత తమను కనికరించకపోతారా అన్న నమ్మకంతో ఉన్నారు.. ఇలాంటి వారందరికి చంద్రబాబు నిర్ణయం శరాఘాతంలా తాగిలింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక తాను పరిచయం చేసిన "మెగా".. ఇప్పుడు తన పదవికే ఎసరు పెడతాడా అని సీఎం రమేశ్ లోలోపల భయపడుతున్నారట. మరి వీరికి టీడీపీ అధినేత ఎలాంటి సమాధానం చెబుతారో వేచి చూడాలి.

ఇంతలోనే ఎంత మార్పు...

  కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు.... ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతుంటాయి. ప్రధాని నరేంద్ర  మోడీ పరిస్థితి చూస్తుంటే అలానే ఉంది ఇప్పుడు. గతంలో కనీసం చంద్రబాబుకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వని మోడీ గారు.. ఇప్పుడు ఏకంగా చంద్రబాబుతో తానే భేటీ అవుతానని చెప్పడం చూస్తుంటే.. అదే అనిపిస్తుంది. నాలుగేళ్లలో ఎంత మార్పు వచ్చింది.. ముందున్న మోడీకి ఇప్పుడున్న మోడీ వైఖరిలో చాలా మార్పే వచ్చింది. దీనికి కారణం ఏదో  ఆయనకు సడెన్ గా ఏపీ మీద ప్రేమ పుట్టుకొచ్చిందో.. లేక చంద్రబాబు మీద ప్రేమ పుట్టుకొచ్చిందో అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే.   నాలుగేళ్ల క్రితం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం..ఇప్పటివరకూ అచ్చంగా ఆకాశంలో విహ‌రిస్తూ వచ్చింది. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా.. ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీకే పట్టంకట్టడంతో పార్టీకి రెక్కలు వచ్చినంత పనైంది. అందుకే మోడీ, షా ద్వయం వారికి నచ్చినట్టు నిర్ణయాలు తీసుకొని కావాల్సినంత వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. నోట్ల రద్దు అయితేనేం.. జీఎస్టీ అయితేనేం.. ఇంకా దళితులపై దాడులు ఇలా అనేక అంశాలపై బీజేపీ తీరును చూసి ప్రజలు మండిపడ్డారు. అందుకే రాను రాను బీజేపీపై, ముఖ్యంగా మోడీపై ఉన్న విశ్వాసం సన్నగిల్లింది. ఫైనల్ గా తన సొంత రాష్ట్రమైన గుజరాత్ ఎన్నికలు చెంప మీద కొట్టినట్టు సమాధానం చెప్పాయి.   ఇక ఏపీ రాజకీయాల్లోకి వస్తే... మొన్నటివరకూ అసలు ఏపీ అంటేనే చాలా చిన్నచూపు చూశారన్న విషయం ఏ ఒక్కరిని అడిగినా చెబుతారు. ప్రత్యేక హోదా విషయంలో కానీ, నిధుల సాయంలో కానీ, ప్రాజెక్టులను పెండింగ్ లో పెట్టడం కానీ ఇలా ఏపీని ఎప్పుడూ చిన్న చూపు చూస్తునే వచ్చారు మోడీ. అవ్వడానికి టీడీపీ, బీజేపీ మిత్రపక్షమైనా... ప్రతిపక్షంలాగా ఎప్పుడూ బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపైన ఏదో ఒకటి విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఎంతైనా మిత్రపక్షమే అని చంద్రబాబు సైలెంట్ గా ఉంటే విమర్శల తీవ్రత మరీ పెరిగింది. అంతేనా ఒకానొక సందర్బంలో వైసీపీతో జట్టుకడతారన్న వార్తలు కూడా వచ్చాయి. చంద్రబాబుకు అపాయింట్ మెంట్ ఇవ్వకుండా... జగన్ అండ్ బ్యాచ్ కు అపాయింట్ మెంట్ ఇవ్వడంతో ఈ వార్తలు నిజమే అని అనుకున్నారు అందరూ. కానీ నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలతో రాష్ట్రంలో వాస్తవ పరిస్థితి మోడీకి అర్ధమైంది ఇక గుజరాత్ ఎన్నికలైతే మోడీకి పెద్ద గుణపాఠమే నేర్చించాయని చెప్పొచ్చు. ఇదే ఆయనలో మార్పుకు కారణం. మోడీని టీడీపీ,బీజేపీ ఎంపీలు కలిసిన నేపథ్యంలో... తాను ఈ విషయాలపై చంద్రబాబుతో మాట్లాడుతానని చెప్పారట. అంతేకాదు… ఎంపీలతో ఏపీకి సంబంధించిన ఎన్నో విష‌యాల‌పై మోడీ అత్యంత సానుకూలంగా మాట్లాడరట. తాను, చంద్ర‌బాబు క‌లిసిన‌ప్పుడు పెండింగ్ అంశాల‌న్నింటిని చ‌ర్చించి ఏపీకి అన్ని విధాలా న్యాయం చేస్తామ‌ని హామీ కూడా ఇచ్చారట. మొత్తానికి గుజరాత్ ఎన్నికలు మోడీలో మంచి మార్పునే తీసుకొచ్చాయి అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. అంతేకాదు మిత్ర‌ప‌క్షాల‌ను దూరం చేసుకోకూడ‌ద‌న్న పాఠం కూడా నేర్పాయి అంటున్నారు. ఏదిఏమైనా మోడీగారిలో మార్పు రావడం ఆనందించాల్సిన విషయమే.

మోడీనే దిగొచ్చారు. ఎవరిని బెదిరిస్తున్నారు మేడమ్...

  టీడీపీ, బీజేపీ మిత్రపక్షం అని అందరికీ తెలుసు. పైకి మిత్రపక్షంగా ఉన్నా... రెండు పార్టీల మధ్య లోలోపల ఉన్న అంతర్గతాలు కూడా అందరికీ తెలిసినవే. దేశంలో తమ పార్టీనే అధికారంలో ఉందని...ఇక ఉత్తర భారతదేశంలో కూడా తమ పార్టీదే హవా అని ఇక్కడ ఏపీలో ఉన్న కొంత మంది బీజేపీ నేతలు రెచ్చిపోయి టీడీపీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. మరి ఏదో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఏపీలో ఆ నాలుగు సీట్లయినా వచ్చినయి అని నమ్మే టీడీపీ బీజేపీ చేస్తున్న కామెంట్లు విని తట్టుకుంటుందా.. అందుకే అప్పుడప్పుడు ఆ పార్టీ నేతలు కూడా రివర్స్ కౌంటర్లు ఇస్తున్నారు. ఇక సోము వీర్రాజు లాంటి వాళ్లయితే ఒక మెట్టు పైకి ఎక్కి...అదెంటో తమ పార్టీ సపోర్ట్ లేకపోతే టీడీపీ పార్టీయే లేదు అన్నరేంజ్ లో కోతలు కోస్తూ మాట్లాడుతుంటారు. ఇప్పుడు కేంద్ర మాజీ మంత్రి, బిజెపి మహిళా మోర్చా అద్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఆ పాటే పాడటం విచిత్రంగా ఉంది.   పురందేశ్వరి టీడీపీపై, ముఖ్యంగా చంద్రబాబుపై విమర్శలు చేయడం కొత్తేమి కాదు. గతంలో ఎన్నోసార్లు చంద్రబాబుపై, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై సీరియస్ అవుతూనే ఉంటారు. అలాగే ఇప్పుడు తాజాగా.. తెలుగు దేశంపై విమర్శలు గుప్పించారు. ఓ రకంగా చెప్పాలంటే బెదిరింపు వ్యాఖ్యలే చేశారు. కేంద్రం ఇస్తున్న నిదులతోనే రాష్ట్ర ప్రభుత్వం వివిధ పధకాలను అమలు చేస్తోందని.. కాని ప్రభుత్వపరంగా తమకు ఈ పదకాలు అందించడం లేదని చెబుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఆమె చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే తప్పులను కేంద్రంపై నెట్టే యత్నం చేస్తున్నారని ఆమె విమర్శించారు. అంతేనా... మిత్రపక్షం వైఖరి మార్చుకోకుంటే తమ సామర్ద్యం బట్టి అన్ని స్థానాలలో పోటీచేస్తామని హెచ్చరించారు. అయితే ఇక్కడే పురందేశ్వరి మాటలు చాలా కామెడీగా ఉన్నాయి అంటున్నారు.   ఎందుకంటే.. ఏపీలో బీజేపీ పరిస్థితి ఏంతో అందరికీ తెలుసు. ఏదో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఆ నాలుగు సీట్లు వచ్చాయి. లేకపోతే ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో... బీజేపీ పరిస్థితి కూడా అంతే. ఏదో కాలం బావుండి..యూపీఏ ప్రభుత్వ తీరుపై విసిగిపోయిన జనాలు.. ఎన్డీఏ ప్రభుత్వానికి పట్టం గట్టారు. ఇక ఆ తరువాత నార్త్ ఇండియాలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీనే అధికారం చేపట్టింది. కానీ రాను రాను పరిస్థితులు మారాయి. నాలుగేళ్లలో ఎన్నో మార్పులు వచ్చాయి. బీజేపీపై, ముఖ్యంగా మోడీపై వ్యతిరేకత పెరిగింది. దానికి నిదర్శనం గుజరాత్ ఎన్నికల ఫలితాలే కారణం. ఇక మోడీ కూడా ముందున్న జోష్ మీద లేరు. మొదట్లో మిత్రపక్షమైన టీడీపీపైన, చంద్రబాబుపైన మోడీ చిన్నచూపు ఉండేది. అంతేకాదు వైసీపీతో పొత్తుకు కూడా రెడీ అయినట్టు వార్తలు వచ్చాయి. కానీ నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో వైసీపీ పరిస్థితి, టీడీపీ సత్తా ఎంటో అర్ధమైంది. అందుకే మోడీ కాస్త వెనక్కి తగ్గారు. ఇక గుజరాత్ ఎన్నికల తరువాత మోడీకు ఉన్న క్రేజ్ మరింత తగ్గింది అని చెప్పుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మోడీనే ఆలోచించి మాట్లాడుతున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. విభ‌జ‌న చ‌ట్టంలోని హామీలు నెర‌వేర్చాల‌ని కోరుతూ ఏపీ టీడీపీ, బీజేపీ ఎంపీలు ప్ర‌ధాని మోడీని కలిశారు. ఈ సమయంలో..అసలు ఒకప్పుడు చంద్రబాబుకు అపాయింట్ మెంటే ఇవ్వని మోడీ..  రెండు, మూడు రోజుల్లో తాను, చంద్ర‌బాబు భేటీ అవుతామ‌ని టీడీపీ ఎంపీలకు స్వ‌యంగా తానే చెప్పి షాక్ ఇచ్చారు. దీన్ని బట్టి పరిస్థితి ఏంటో అర్ధమయ్యే ఉంటది. మోడీ అంతటి వారే దిగొచ్చారు.   కానీ పురందరేశ్వరి మాత్రం ఏదో టీడీపీకి బీజేపీయే దిక్కు అన్నట్టు మాట్లాడుతున్నారు. దీంతో.. పురందరేశ్వరి గారు ఎవరిని బెదిరిస్తున్నారు అని అనుకుంటున్నారు. గట్టిగా 20 స్థానాల్లో కుడా ఆ పార్టీకి అభ్యర్థులు లేరు... ఇదే పురందేశ్వరి గారు రాజంపేట పార్లమెంట్ కు పోటీ చేసి డిపాజిట్ కోల్పోయిన సంగతి ఎవరు మర్చిపోలేరుగా. ఇప్పుడు ఎవరిని బెదిరిస్తున్నట్టు? బెదిరిస్తే మాత్రం బెదిరే పరిస్థితి ఉందా? ఇలాంటి అర్ధం పర్ధంలేని బెదిరింపులు మానేస్తే పార్టీకి చాలా మంచిది అని అంటున్నారు.

రజనీ పార్టీ సింబల్ వెనుక సీక్రెట్ ఇదే...

  ఊరిస్తూ.. ఊరిస్తూ.. ఎలాగో తాను రాజకీయాల్లోకి వస్తున్నా అని తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పేశారు. ఎప్పటినుండో ఎదురుచూస్తున్న అభిమానుల కోరికను ఎట్టకేలకు రజనీకాంత్ నిజం చేశారు. ఇక అందరిలాగానే... దేశ రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయని.. వాటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని.. డబ్బు, పదవి మీద ఆశతో మాత్రం రాజకీయాల్లోకి రావడం లేదని చెప్పుకొచ్చారు. ఇక్కడివరకూ బాగానే ఉంది. ఇప్పటివరకూ రజనీ ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారబ్బా అని చర్చలు జరిగేవి. ఇప్పుడు ఎలాగూ క్లారిటీ వచ్చేసింది కాబట్టి.. ఆ ఎపిసోట్ అయిపోయింది.   ఇప్పుడు పార్టీ సింబల్ పై చర్చలు మొదలయ్యాయి. ముందు చాలా స్టైల్ గా పిడికిలి బిగించి చూపుడు వేలు..చిటికెన వేలు మాత్రమే పైకి లేపిఉంచి బాబా అనే సింబల్ ను పార్టీ గుర్తుగా పెట్టారు. ఈ గుర్తు అయితే ఆధ్యాత్మిక భావన కలుగ చేస్తుంది.. అంతేకాదు తమిళ ప్రజలకి ఈ గుర్తు ఎంతో ప్రాచుర్యం పొందింది కూడా.. అందులో తామరపువ్వు కూడా ఉంది. అయితే రజనీ రాజకీయ ప్రవేశం వెనుక బీజేపీ హస్తం ఉందని కొందరు ప్రచారం చేస్తుండటంతో తామరపువ్వును తొలగించి బాబా ముద్ర చుట్టూ ఒక పామును చేర్చిన బొమ్మ తాజాగా ప్రచారంలోకి వచ్చింది. అయితే పార్టీ పేరును, చిహ్నాన్ని ఎప్పుడు ప్రకటిస్తారన్నది మాత్రం ఇంకా తెలీదు.   ఇప్పుడు ఇంకో అంశంపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. అసలు రజనీ ఆ సింబల్ ను ఎందుకు ఎంచుకున్నారు.. దాని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటీ అని. అయితే ఈ చర్చల్లో కొన్ని ఆసక్తికర విషయాలే బయటపడ్డాయి. మధ్య వేలు, ఉంగరం వేలు ని మడిచి బొటన వేలు కింద నొక్కి ఉంచి, చూపుడు వేలు , చిటికెన వేలు పైకి లేపి ఉంచడమే ఆపాన ముద్ర. ఈ ముద్ర మనిషిలోని కల్మషాన్ని భౌతికంగా, శారీరకంగా తొలిగించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. పిత్త,అగ్ని సంబంధం అయిన అనారోగ్యం దరి చేరకుండా ఈ ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుందట. శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపించడంతో పాటు గ్యాస్ , కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు, పైల్స్, గుండె పోటు నుంచి మనిషిని రక్షించడానికి ఈ ముద్ర ఎంతగానో సాయపడుతుందట. ఉదరం లో మొదలై గుండె దాకా వెళ్లే ఆరోగ్య సమస్యలపై ఈ ముద్ర తిరుగులేని అస్త్రమట. ఒకప్పుడు ఈ తరహా సమస్యలు ఎదుర్కొన్న రజని వాటి నుంచి బయటపడేందుకు ఈ ముద్ర ఎంతో ఉపయోగపడిందట. అందుకే సమయం తప్ప ఏ ఖర్చు లేని ఈ ముద్రకి ప్రచారం కల్పించే ఉద్దేశంతోటే దాన్ని పార్టీ సింబల్ గా ఎంచుకోవచ్చని తెలుస్తోంది. దీంతో రజనీ ముద్ర వెనుక ఇన్ని సీక్రెట్స్ ఉన్నాయా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

చంద్రబాబు టార్చర్.. భువనేశ్వరికి అధికారుల మొర....

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పని రాక్షసుడు అని అందరికీ తెలుసు. రాష్ట్రం విడిపోక ముందు సంగతేమో కానీ.. రాష్ట్రం విడిపోయిన తరువాత మాత్రం.. రాష్ట్రాభివృద్ది కోసం ఆయన చాలా కష్టపడుతున్నారు. టెలీకాన్పరెన్స్ లు, పలు కార్యక్రమాల్లో పాల్గొనడాలు, సమీక్షలు, పరిశ్రమలు రప్పిండానికి విదేశీ పర్యటనలు.. వాళ్లతో సమావేశాలు ఇలా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇక ముఖ్యమంత్రిగారు కష్టపడటమే కాదు.. ఆయనతో పాటు అధికారులను కూడా ఉరుకులు పెట్టిస్తున్నారనడంలో సందేహం లేదు. రివ్యూలంటూ వారిని రాత్రి 11 గంటలైనా వదిలిపెట్టడం లేదు. దీంతో అధికారులు కక్కలేక మింగలేక అన్నసామెత ప్రకారం.. చంద్రబాబుతో చెప్పలేక.. ఇటు ఏం చేయలో తెలియక.. పులుసు కారిపోతుంది.   అయితే ఈ విషయాన్ని ఎలాగూ చంద్రబాబు దగ్గర చెప్పే ధైర్యం అధికారులకు లేదు... అందుకే ఆయన సతీమణి భువనేశ్వరి దగ్గర మొర పెట్టుకున్నారట. డిసెంబర్ 31న ఐఏఎస్ లతో, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి ఆయన భార్య, నూతన సంవత్సరం వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కొంతమంది అధికారులు....ఆమె దగ్గరకు వచ్చి... మీరు ప్రతి శనివారం అమరావతికి రావాలని అడిగారట.  హెరిటేజ్ ఛైర్మన్ గా హైదరాబాద్ లో ఉంటున్న ఆమె, ప్రతి ఆదివారం మాత్రమే చంద్రబాబు వద్దకు వస్తారు. అయితే ఇప్పుడు శనివారం కూడా అమరావతికి రావాలని విజ్ఞప్తి చేశారట. మేడమ్ నిత్యమూ సమీక్షలు, సమావేశాలు అని సీఎం చాలా బిజీగా ఉంటున్నారు. మీరేమో ఆదివారం మాత్రమే వస్తున్నారు. ఆ ఒక్కరోజే ఆయనకు కాస్తంత విశ్రాంతి దొరుకుతోంది. మీరు శనివారమే అమరావతికి వస్తే, ఆయనకు కొంత ఉపశమనం ఉంటుంది. మీరు అలా చేస్తే, మేము కనీసం రెండు రోజులైనా సమయానికి ఇంట్లో కుటుంబంతో కలసి డిన్నర్ చేయగలుగుతాం" అని వేడుకున్నారట.  24గంటలూ పనిచేసినా ఆయన హుషారుగానే ఉంటున్నారు. మాకు మాత్రం కష్టమవుతోంది. ఆదివారం ఎలాగూ విశ్రాంతి కదా... అన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి శనివారం రాత్రి పొద్దుపోయే వరకు సమావేశాలు పెట్టేస్తున్నారు.  మీరు శనివారం కూడా వస్తే మాకు కొంత ఉపశమనంగా ఉంటుందని అన్నారట. అయితే ఇదంతా జరిగింది సీరియస్ గా కాదులెండి.. అధికారులు.. సరదాగా.. భువనేశ్వరి దగ్గర జోక్ చేస్తూనే.. తమ బాధను వెల్లడించారట.   మరి భువనేశ్వరి గారు ఈ విషయాన్ని బాబుగారికి చెబుతారో లేదో.. అధికారులు కోరినట్టు శనివారం కూడా ఆమె వస్తారో లేదో.. చూద్దాం. అసలు ఆదివారం కూడా వేస్ట్ అయిపోతుంది అని బాధపడుతూ ఉండే బాబు, శనివారం వదులుతారా.. మేడం మాట వింటారా..? చూద్దాం..

కేసీఆర్, పవన్ టార్గెట్ చంద్రబాబే!

  రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత స్నేహితులు వుండరన్నది నూటికి నూరు శాతం వాస్తవం. రెండేళ్ళ క్రితం వరకూ పవన్ కళ్యాణ్ పేరు కూడా గుర్తులేని తెలంగాణ సీఎం కేసీఆర్‌కి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మంచి మిత్రుడు ఎందుకయ్యాడూ అంటే.. దానికి కారణం కేవలం రాజకీయమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడేన్నర ఏళ్ళు దాటింది. అప్పటి నుంచి తెలంగాణకు చెందిన ఎంతోమంది సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో వీరోచితంగా పోరాడిన వాళ్ళు కూడా అందులో వున్నారు. అయితే వారెవరికీ రాని అపాయింట్‌మెంట్ ఇప్పుడు అకస్మాత్తుగా పవన్ కళ్యాణ్‌కి వచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం తన మనసుకు ఎంతో బాధ కలిగించిందని పబ్లిగ్గా చెప్పిన పవన్ కళ్యాణ్‌ని మొన్న జనవరి ఒకటిన కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. ఇద్దరూ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పుకుని చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ అంటే ఎవరో తెలియనట్టు వ్యవహరించిన కేసీఆర్ ఇప్పుడు ఆయనతో చిన్నప్పటి స్నేహితుడి మాదిరిగా మెలిగారు. గతంలో కేసీఆర్ అండ్ టీమ్ తనను దారుణంగా తిట్టిన విషయాలన్నీ మరచిపోయిన పవన్ కళ్యాణ్ కూడా కేసీఆర్‌తో ఎంతో ఆప్యాయంగా మెలిగారు. వీరిద్దరి మధ్య ఆకస్మాత్తుగా ఏర్పడిన సఖ్యతను చూసి తెలంగాణలోని రాజకీయ వర్గాలతోపాటు ఏపీలోని రాజకీయ వర్గాలు కూడా ఆశ్చర్యపోయాయి. ఊరకే కలవరు మహానుభావులు అన్నట్టుగా వీరిని ఆసక్తిగా గమనించాయి.   ఇంతకీ ఉరుములేని పిడుగులా వీరిద్దరూ ఎందుకు మీటయ్యారనేది కాస్తంత రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా ఈజీగా అర్థమయ్యే విషయం. వీరిద్దరి మీటింగ్‌ వెనుక వున్నది ఇద్దరి మధ్య కొత్తగా ఏర్పడిన స్నేహం కాదు... చంద్రబాబు మీద ఇద్దరికీ వున్న శత్రుత్వం. కేసీఆర్‌కి సహజంగానే చంద్రబాబు మీద శత్రుత్వం వుంటుంది. రాష్ట్రాన్ని నిలువునా చీల్చి ఆదాయం లేని ముక్కని చంద్రబాబుకు ఇచ్చినా ఆయన నిబ్బరంగా నెట్టుకొస్తున్నారు. బోలెడంత ఆదాయం వున్న హైదరాబాద్ తన చేతుల్లో వున్నా కేసీఆర్‌ వాగ్దానాలు చేయడం తప్ప మరేమీ ప్రగతి లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ అడపా దడపా చేస్తున్న విమర్శలను కూడా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. పవన్ కళ్యాణ్‌ని లైట్‌గా తీసుకుంటున్నారు. అలాగే 2019 ఎన్నికలలో అధికారం సంపాదించేయాలని కూడా పవన్ కళ్యాణ్ తహతహలాడుతున్నారు. అలా సంపాదించాలంటే చంద్రబాబును తగ్గించాలి. దానికున్న ఎన్నో మార్గాల్లో కేసీఆర్‌తో స్నేహంగా మెలగడం ఒకటి. చంద్రబాబును డౌన్ చేయాలంటే కేసీఆర్‌కి, పవన్ కళ్యాణ్‌కి ఒకరి అవసరం మరొకరికి వుంది. అందుకే ఇద్దరూ కొత్త సంవత్సర ప్రారంభ  శుభవేళల్లో ఒక్కటయ్యారు. అగ్నికి ఆజ్యం పోసినట్టుగా పవన్ కళ్యాణ్ ఆ సందర్భంలో మంచి డైలాగులే కొట్టారు. తెలంగాణలో కేసీఆర్ పాలన అద్భుతంగా వుందని, తెలంగాణ ప్రభుత్వం తరహాలోనే ఏపీలో ప్రభుత్వం కూడా పనిచేయాల్సిన అవసరం వుందని అన్నారు. ఇలా కేసీఆర్‌ని పొగిడి చంద్రబాబు ప్రభుత్వాన్ని తగ్గించడం పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహంలో భాగమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. సరే... వీరిద్దరి భేటీ వల్ల ఏయే ఉపయోగాలుంటాయో... వీరిద్దరి స్నేహం ఎంతకాలం కొనసాగుతుందో వేచి చూద్దాం.

చంద్రబాబు చెప్పిందొకటి... చేసిందొకటి!

  ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు వున్నాయి అని మహానుభావుడు ఆచార్య ఆత్రేయ ఏనాడో చెప్పాడు. ఈ మాటను నిజం చేయడానికి ఈ ప్రపంచంలో కోట్లాదిమంది నిరంతరం ప్రయత్నిస్తూనే వుంటారు. అలాంటి వారి లిస్టులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి చేరారు. అసలేం జరిగిందంటే, ఆంగ్ల నూతన సంవత్సరం వచ్చిందంటే చాలు... పార్టీలు చేసుకునేవారు కొంతమంది అయితే, ఆరోజున దేవాలయాలకి వెళ్ళేవాళ్లు మరికొంతమంది. నూతన సంవత్సరం ప్రారంభం రోజున దేవాలయానికి వెళ్తే బోలెడంత పుణ్యం రావడంతోపాటు సంవత్సరం అంతా సంతోషంగా వుంటామన్నది చాలామంది నమ్మకం. అందుకే కొత్త సంవత్సరం రోజున చాలామంది సమీపంలోని దేవాలయాల్లో క్యూలు కడుతూ వుంటారు. మరికొంతమంది అయితే చాలా దూరమైనా సరే ప్రముఖ దేవాలయాలకు వెళ్తూ వుంటారు. అయితే ఈ ధోరణి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నచ్చలేదు. మనం తెలుగు వాళ్ళం.. ఆంగ్ల సంవత్సరాది మన సంప్రదాయం కాదు అని ఫీలయింది. అలా ఫీలయిన వెంటనే ఒక ప్రకటన విడుదల చేసింది. నూతన సంవత్సరం ప్రారంభం రోజున దేవాలయాల్లో ప్రత్యేక పూజల్లాంటివి నిర్వహించడానికి వీల్లేదని సదరు ప్రకటనలో పేర్కొంది. ప్రకటన చూసి కొంతమంది అచ్చ తెలుగువారు చాలా సంతోషించారు. మరికొంతమంది మాత్రం ఏమిటీ చాదస్తం అనుకున్నారు. కొత్త సంవత్సరం రోజున ఎవరి ఇష్టం వారిది... ప్రభుత్వం అనవసరంగా జోక్యం చేసుకుంది అనుకున్నారు.   నూతన సంవత్సరం రోజున దేవాలయాల్లో ప్రత్యేక పూజల్లాంటివి నిర్వహించొద్దు అని మాత్రమే ప్రభుత్వం పేర్కొంది. దేవాలయాలకు వెళ్ళొద్దని మాత్రం అనలేదు కాబట్టి ప్రభుత్వాన్ని మనం ఏమీ అనడానికి లేదు. అయితే నూతన సంవత్సరం మొదటి రోజున జరిగిన తంతు చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధినేత చంద్రబాబు చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి అని అనకుండా వుండలేని పరిస్థితి. జనవరి ఒకటో తేదీన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లోని పూజారులు ఉదయాన్నే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళారు. వేద మంత్రోచ్ఛాటనలతో ప్రభుత్వాన్ని, ప్రభుత్వాధినేత చంద్రబాబును ఆశీర్వదించారు. ఈ తతంగమే చాలామందికి కడుపులో మండేలా చేసింది. జనవరి ఒకటిన దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయకూడదన్న చంద్రబాబు... తన ఇంటికి మాత్రం పూజారులను పిలిపించుకుని ఆశీస్సులు అందుకోవడం పట్ల జనం వెటకారంగా మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన గుడికి వెళ్ళా్ల్సిన అవసరం లేదు. గుడే ఆయన దగ్గరకి వచ్చింది. ప్రత్యేక ఆశీస్సులు అందించింది. మరి సామాన్య జనానికి మాత్రం ఆరోజున ప్రత్యేక పూజలు చేయించుకునే అవకాశం లేదు. రాజకీయాల్లో పండిపోయిన చంద్రబాబు ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో పప్పులో కాలు వేస్తూ వుంటాడెందుకో మరి!

ఆధార్ ఉంటేనే ఫేస్‌బుక్ లాగిన్..?

ఆధార్ అంటూ మన దేశంలోకి ప్రవేశించిన ఓ పన్నెండు అంకెల నంబర్ ఇప్పుడు మన జీవితాలతో విడదీయరాని అనుబంధం వేసుకుంటోంది. బ్యాంక్ అకౌంట్, మొబైల్ నంబర్లు, పాన్‌కార్డు ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో ఇప్పుడు ఎలాంటి పని జరగాలన్నా ఆధార్ కార్డ్ ఉండాల్సింది.. ఈ జాబితాలోకి ఎన్నో సేవలు వస్తూ.. ఆధార్‌ మిమ్మల్ని వదలదు అనే సంకేతాలను ఇస్తోంది. అయితే ప్రపంచంలోని మారుమూల ప్రాంతంలోని మనుషులను కలుపుతున్న ఫేస్‌బుక్ వాడాలన్నా ఇక మీదట ఆధార్ ఉండాల్సిందేనట.   ఫేస్‌బుక్ అనేది ఒక మహా సముద్రం.. వ్యక్తిగత అవసరాలకో.. లేక మరేదైనా కారణం చేతనో.. ప్రతి ఒక్కరికి ఒకటి కన్నా ఎక్కువ సంఖ్యలోనే ఫేక్ అకౌంట్లు ఉన్నాయి. ఒక్క మనదేశంలోనే దాదాపుగా 24.1 కోట్ల నకిలీ ఖాతాలు ఉన్నట్లు ఫేస్‌బుక్ గుర్తించింది.   వీటిని కట్టడి చేసే చర్యల్లో భాగంగా ఫేస్‌బుక్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అకౌంట్లను వాడేవారందరూ తమ అసలైన పేర్లనే వాడేందుకు వీలుగా ఫేస్‌బుక్ ఓ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. అదే.. నేమ్ యాజ్ పర్ ఆధార్.. ఫేస్‌బుక్ వాడుతున్నవారు.. కొత్తగా ఫేస్‌బుక్ అకౌంట్ తెరవాలనుకునేవారు లాగిన్ అయ్యే సమయంలో ఒక కాలమ్ కనిపిస్తుంది.. ఇక్కడ ఆధార్‌ కార్డ్‌లో ఉన్న విధంగా పేరు ఇవ్వాలి.. తద్వారా నకిలీల బెడద తగ్గడంతో పాటు మీ స్నేహితులు మిమ్మల్ని సులభంగా గుర్తించగలుగుతారు. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ను మొబైల్ ద్వారా ఫేస్‌బుక్ ఉపయోగిస్తున్న కొంతమంది యూజర్ల ద్వారా పరీక్షిస్తున్నారు. అయితే ఈ ఆప్షన్‌ను పాటించాల‌నుకున్న వారు పాటించుకోవ‌చ్చు.. లేదంటే మామూలుగా ఇష్టం వ‌చ్చిన పేరుతో ఖాతాను ఓపెన్‌ చేసుకోవచ్చని ఫేస్‌బుక్ తెలిపింది.