జూన్ 30 అర్థరాత్రి… పార్లమెంట్లో ఏం జరగబోతోంది?

జూలై ఒకటిన ఏం జరగనుంది? ఖచ్చితంగా మాట్లాడుకుంటే ఎవ్వరికీ ఏం అర్థం కావటం లేదు! జీఎస్టీ అమలు మొదలు కావటంతో ఏ ధరలు తగ్గుతాయి, ఏ ధరలు పెరుగుతాయి, మార్కెట్ ఏమవుతుంది… ఎవ్వరికీ అంతు చిక్కటం లేదు! కానీ, జూలై ఒకటవ తారీఖు ఉదయం ఏం జరిగినా, జరక్కపోయినా… జూన్ 30 పూర్తై ఒకటవ తేదీ మొదలవుతుంటే… అర్థ రాత్రి 12గంటల వేళ… దేశ పార్లమెంట్లో సూపర్ సందడి నెలకొననుంది! మరెందుకో కాదు, దేశ చరిత్రలోనే అతి కీలక ఆర్దిక మార్పుగా నిలవనున్న జీఎస్టీ కారణంగానే!   గతంలో రెండు సార్లు మాత్రమే భారత పార్లమెంట్ అర్థరాత్రి పూట సమావేశమైంది. ఒకసారి క్విట్ ఇండియా ఉద్యమానికి 50ఏళ్లు పూర్తైన సందర్భంగా సమావేశమైతే…  రెండో సారి మనకు స్వతంత్రం వచ్చి 50ఏళ్లు పూర్తైన తరుణంలో చోటు చేసుకుంది. అలాంటి చారిత్రక నేపథ్యం లేకున్నా మోదీ సర్కార్ జీఎస్టీ లాంఛ్ ఈవెంట్ ను అర్థ రాత్రి పూట గ్రాండ్ గా చేయటానికి నిర్ణయించింది! దాదాపు 6వందల మంది పొలిటీషన్స్, సెలబ్రిటీలు, బిజినెస్ మెన్, వివిధ రంగాలు నిపుణులు శుక్రవారం రాత్రి పార్లమెంట్ చేరుకోనున్నారు! ఇందులో అమితాబ్, లతా మంగేష్కర్, రతన్ టాటా లాంటి వారు చాలా మంది వున్నారు!   జీఎస్టీ లాంఛింగ్ సమయంలో వేదికపైన రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీ, ఆర్దిక మంత్రి జైట్లీతో పాటూ మాజీ ప్రధానులు మన్మోహన్, దేవెగౌడ కూడా వుండనున్నారు. దాదాపు గంట సేపు జరిగే ఈ స్పెషల్ జాయింట్ సెషన్లో ప్రధాని, రాష్ట్రపతి ప్రసంగాలు వుంటాయి. అలాగే జీఎస్టీ అధికారిక ప్రారంభం తరువాత రెండు చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్స్ ప్లే చేస్తారు.   పార్లమెంట్లో ప్రాతినిధ్యం వున్న అన్ని పార్టీలకు ఆహ్వానం అందినపప్పటికీ మమతా బెనర్జీ ఎప్పటిలాగే మోదీ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. తమ పార్టీ అర్థరాత్రి సమావేశం బహిష్కరిస్తుందని చెప్పేసింది. ఇక కమ్యూనిస్టులు ఆచారం ప్రచారం బీజేపి అనవసర హడావిడి చేస్తోందంటూ విమర్శించారు. వారు హాజరవుతారో లేదో గాని కాంగ్రెస్ మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతోంది. జీఎస్టీ ఆలోచన మొట్ట మొదట చేసింది కాంగ్రెస్సే. కాబట్టి ఇప్పుడు జీఎస్టీ లాంచ్ ఈవెంట్ కి వెళ్లకపోతే ఇంత వరకూ పడ్డ మార్కులు కూడా పోతాయని భయపడుతోంది హస్తం పార్టీ!   ఎవరు హాజరైనా, కాకున్నా ఎన్డీఏ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జీఎస్టీ బిల్లు వచ్చే ఎన్నికల్లో చక్కటి ప్రచార అస్త్రంగా ఉపయోగపడనుంది. అందుకే, మోదీ టీమ్ ఈ ఈవెంట్ ని ఇంత భారీగా ప్లాన్ చేస్తూ జనంలోకి తీసుకెళుతోంది…

జగన్ పార్టీలో ఆ ‘రెడ్డి’గారికి ఎందుకంత ఇంపార్టెన్స్?

  జగన్ తన రాజకీయ చదరంగంలో ఎవ్వర్నీ నమ్మడని ఒక వాదన వుంది! పార్టీలో ప్రతీ నిర్ణయం తనే స్వయంగా తీసుకుంటాడు. ఎంతటి దగ్గరి బంధువులైనా, సీనియర్ నేతలైనా జగన్ కు సలహాలు, సూచనలు మాత్రమే ఇవ్వగలరు. అంతిమ నిర్ణయం ఆయనే తీసుకుంటాడు. ఎవ్వర్నీ అంత తేలిగ్గా నమ్మడు. ఇది ఒట్టి మాట కాదు… చాలా వరకూ నిజమే!   జగన్ తన వైసీపీలో ఇప్పటి వరకూ నెంబర్ టూ అంటూ ఎవరూ లేకుండా చూసుకున్నాడు. బోలెడు మంది సీనియర్లు వున్నా, ఇంట్లోంచి తల్లి విజయమ్మా, చెల్లెలు షర్మిలా కూడా పార్టీలో వున్నా… ఎవ్వర్నీ తనంత స్థాయిలో వుంచలేదు. కాని, తాజాగా జగన్ ఒక వ్యక్తికి విపరీతమైన ప్రాధాన్యత ఇస్తూ, అతడికి ఎక్కడలేని పవర్ ఇచ్చేస్తున్నాడని వైసీపీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఆయనే వైసీపీ లో నెంబర్ టూగా కూడా మారిపోయారని అంటున్నారు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా? జగన్ ఆర్దిక రహస్యాలన్నీ తెలిసిన ఆడిటర్ విజయసాయి రెడ్డి!   విజయసాయి రెడ్డి అంటే కొన్నాళ్ల కిందటి వరకూ జగన్ ఆర్దిక వ్యవహారాలు చూసే సీఏ అనుకునేవారు. కాని, ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ఆయన జగన్ రాజకీయ వ్యవహారాల్లో కూడా చక్రం తిప్పుతున్నారు. వైసీపీ ఎంపీగా వున్న విజయసాయి రెడ్డి దిల్లీలో జగన్ కోసం బాగానే కష్టపడుతున్నారు. తెర వెనుక రాచకార్యలు చక్కబెడుతూ మోదీతో మీటింగ్ కూడా ఏర్పాటు చేయించారు ఆ మధ్య! తరువాతే , జగన్ ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి బేషరతుగా మద్దతు పలికారు.   జగన్ తరుఫున దిల్లీలో పరిస్థితులు చక్కబెడుతున్న విజయసాయి రెడ్డి ఏపీలో కూడా ఖాళీగా వుండటం లేదు. జగన్ కు ఈ మధ్య కాలంలో సర్వం తానే అయిపోయాడంటున్నారు. ఒకప్పుడు వైసీపీలో యాక్టివ్ గా వున్న రాజశేఖర్ రెడ్డి భార్యా, జగన్ తల్లి విజయమ్మ ఇప్పుడు ఇళ్లు దాటి బయటకి రావటం లేదు. జగనన్న వదిలిన బాణాన్ని అన్న షర్మిల కూడా యుద్ధ రంగం నుంచి తప్పుకుంది. ఇక జగన్ బంధువులుగా ఫ్యాను పార్టీలో కీలకంగా మెలిగిన వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా తమ జిల్లా వదిలి రావటం లేదు.   జగన్ దీక్షలు, ధర్నాలు దగ్గరుండి చూసుకున్న సజ్జల రామకృష్ణా రెడ్డి, మైసూరా రెడ్డి, సోమయాజులు లాంటి సీనియర్లు కూడా ఈ మధ్య జగన్ పరిసరాల్లో కనిపించటం లేదు. అంతా విజయసాయి రెడ్డే హ్యాండిల్ చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం! మరి సడన్ గా విజయసాయి రెడ్డి హవా మొదలవటానికి కారణం ఏంటి? ఆయనకు ఆర్దిక వ్యవహారాల్లో వున్న జ్ఞానం, రాజకీయాలపై వున్న అవగాహన, ఇవి కాకుండా దిల్లీ పెద్దల్ని సైతం హ్యాండిల్ చేసే నేర్పు ఇప్పుడు బాగా పనికి వస్తున్నాయని అంటున్నారు. కేవలం విజయ సాయి రెడ్డి మాత్రమే తనకు విజయం చేకూర్చి పెట్టగలరని జగన్ భావిస్తున్నాడట! ఇది ఎంత వరకూ నిజమో మనకు తెలియదు కాని… గతంలో కంటే విజయసాయి రెడ్డి హంగామా మాత్రం వైసీపీలో ఖచ్చితంగా పెరిగింది!

పాకిస్తాన్… బోర్లా పడిపోయి పేలటానికి సిద్ధంగా వున్న అయిల్ ట్యాంకర్!

ప్రపంచంలో పాకిస్తాన్ కంటే అత్యంత ప్రమాదకర దేశం మరేదైనా వుందా? ఖచ్చితంగా లేదనే చెప్పొచ్చు! పాక్ కంటే పేద దేశాలు ఆఫ్రికాలో వుండవచ్చు. పాక్ కంటే చదువుకున్న వాళ్లు తక్కువగా వున్న దేశాలు కూడా బోలెడు వుండవచ్చు. కాని, అక్కడెక్కడా లేని ఉన్మాదం, అజ్ఞానం పాకిస్తాన్ లో రాజ్యమేలుతున్నాయి. అందుకు తాజా ఉదాహరణ, 50వేల లీటర్ల పెట్రోల్ ట్యాంకర్ పేలిపోవటం! అటుఇటుగా 2వందల మంది నెత్తుటి ముద్దలై అగ్నికి బలికావటం!   పాక్ లో ప్రమాదం అనగానే అదేదో ఉగ్రవాద చర్య అయి వుంటుంది అని అనుకోవటం సహజం! గతంలో అలాంటి విచక్షణా రహితమైన ఉగ్ర చర్యలు బోలెడు జరిగాయి కూడా. చిన్న చిన్న పిల్లలు స్కూల్లో చదువుకోటానికి వెళితే వార్ని కూడా వదల లేదు జిహాదీలు. మానవబాంబులుగా మారి తమని తాము చంపుకుని, అభం శుభం తెలియని పసికందుల్ని చిదిమేశారు. పెషావర్ లో జరిగిన అత్యంత దారుణమైన ఆర్మీ స్కూలు బాంబు పేలుడు ఎవ్వరూ మరిచిపోలేరు. కాని, రంజాన్ కు సరిగ్గా ఒక్క రోజు ముందు పంజాబ్ ప్రావిన్స్ లో జరిగింది పూర్తిగా భిన్నమైంది! వందల మందిని హతం చేసిన ఒక విషాదం… ఎలాంటి మతం, ఎలాంటి ఉగ్రవాదంతో సంబంధం లేకుండానే జరిగిపోయింది! కేవలం పాకిస్తాన్ ప్రస్తుతం వున్ అత్యంత దారుణమైన స్థితి వల్ల చోటు చేసుకుంది!   కరాచీ నుంచీ లాహోర్ వెళుతోన్న ఒక అయిల్ ట్యాంకర్ బోర్లా పడింది. ఫలితంగా వేల లీటర్ల పెట్రోల్ హైవేపై ప్రవహించింది. చుట్టుపక్కల జనం ఆత్రంగా ఇంధనం తీసుకుపోవటానికి పరుగెత్తుకొచ్చారు. అదీ ఆడవాళ్లు, చిన్న పిల్లలు ఎక్కువగా వచ్చారు. ఇది మానవ సహజమైన ప్రవర్తనే! ఎక్కడైనా పెట్రోల్ రోడ్డు మీద పొంగి ప్రవహిస్తుంటే జనం ఆశతోనో, కక్కుర్తితోనో అక్కడికి వస్తారు. కాని, అత్యంత ప్రమాదకరమైన ఇంధనం రోడ్డుపై ఉప్పొంగుతోంటే… పోలీసులు ఏం చేస్తున్నారు? వేల మంది జనం పెట్రోల్ కోసం ఎగబడే దాకా వార్ని అనుమతించింది ఎవరు? ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటే పాక్ దయనీయ స్థితి ఇట్టే అర్థమైపోతుంది!   రోడ్డు మీద అయిల్ ప్రవహిస్తూ వుంటే , జనం అక్కడ గుమిగూడుతుంటే... అమెరికా లాంటి దేశాలు కాదు ఆఫ్రికా దేశాల్లో సైతం పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని  అగ్ని ప్రమాదం సంభవించకుండా చూస్తారు. కాని, పక్క దేశాల్లో అరాచకం సృష్టించేందుకు వేల కోట్లు ఖర్చు చేసే ఉగ్రవాద దేశమైన పాక్ లో మాత్రం అలాంటిదేం జరగలేదు. పోలీసులు వచ్చి జనాన్ని పక్కకు తప్పించే లోపే పెట్రోల్ భగ్గుమంది! ఎవడో అమాయకుడో, పిచ్చివాడో, ఉన్మాదో సిగరెట్ కాల్లాడట! అంతే… విలయం క్షణాల్లో జరిగిపోయింది!   పెట్రోల్ కోసం ఎగబటంలో పాక్ జనంలోని అజ్ఞానం, వాళ్లని కంట్రోల్ చేయని పోలీస్ వ్యవస్థలో వున్న బలహీనత, అసలు అక్కడ దేశం ఏమైపోయినా పట్టించుకోని రాజకీయ నాయకుల దగుల్బాజీతనం… అన్నీ మనకు ఈ ఒక్క విషాదంలో కనిపిస్తాయి. ఒక్క పెట్రోల్ ట్యాంకర్ ప్రమాదాన్నే సరిగ్గా అరికట్టలేని అక్కడి వ్యవస్థ వందల అణుబాంబుల్ని ఉగ్రవాదుల చేతుల్లో పడకుండా ఎంత కాలం కాపాడుతుంది? ఇది ఇప్పుడు ప్రపంచం వేసుకోవాల్సిన ప్రశ్న! అయిల్ ట్యాంకర్ ప్రమాదం కేవలం ఒక దుర్ఘటన మాత్రమే కాదు. పాక్ లోని అరాచక పరిస్థితులకు ప్రత్యక్ష సాక్ష్యం! ప్రధానంగా పక్కనే వున్న పాకిస్తానీల బద్ధ శత్రువైన భారత్ తేరుకోవటానికి అంది వచ్చిన సంకేతం! పాక్ మన మీదకి పంపే ఉగ్రవాదులు కాదు… ఆ దేశాన్ని సర్వనాశనం చేసే ఉన్మాద శక్తులు కూడా మనకు ప్రమాదమే!   పాకిస్తాన్ ఇప్పుడు వున్న స్థితిలో యధాతథంగా వుంటే ఇండియా సహా అనేక దేశాలకు ప్రమాదమే. అందుకే, మోదీ సర్కార్ పాక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాలి. లేదంటే… పాకిస్తాన్ కే శాశ్వత పరిష్కారం వెదకాలి! దాన్ని చిన్న చిన్న ముక్కలు చేయటమే చాలా మంది పండితులు సూచించే మార్గం…

అమిత్‌షా సైలెంట్‌ స్కెచ్‌... తెలంగాణ బీజేపీలో కలకలం...

  తెలంగాణ బీజేపీ నేతలకు ఇప్పుడు అమిత్‌షా భయం పట్టుకుంది. తొలకరి వర్షాలు పడి వెదర్ కూల్ గా మారినా.... తెలంగాణ బీజేపీ నేతలకు చెమటలు పట్టేస్తున్నాయి. ఇన్నాళ్లూ ఎంత చెట్టుకు అంత గాలి అనుకుంటూ కమలం ఒడిలో కాలం గడిపేసిన రాష్ట్ర లీడర్లకు అమిత్‌షా చుక్కలు చూపెడుతున్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న అమిత్‌షా... పార్టీని పునాదుల నుంచి ప్రక్షాళన చేయాలని డిసైనట్లు తెలుస్తోంది. అందుకే రాష్ట్ర నేతల పనితీరుపై అమిత్‌షా సర్వేలు నిర్వహిస్తున్నారని, ఫలితాల ఆధారంగా యాక్షన్‌ ప్లాన్‌ రూపొందిస్తారని చెప్పుకుంటున్నారు.    జనంలో బలమున్న నేతలకు పెద్దపీట వేసి... షో పుటప్ లీడర్లను ఏరిపారేయాలని అమిత్ షా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకే తెలంగాణలో అసలు కమల బలం ఎంత? ఎక్కడెక్కడ అవకాశాలున్నాయి..ఏ నేత సత్తా ఎంతన్నది తేల్చేయడానికి సొంతంగా సర్వేలు జరిపిస్తున్నారు. దాంతో రాష్ట్ర నేతలకు చెమటలు పడుతున్నాయి. నియోజకవర్గాల వారీగా సర్వేలు జరిపి నివేదికలు తెప్పించుకుంటుండంతో ఇన్నాళ్లూ ధీమాగా ఉన్న నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గతంలో ఎవరు పోటీ చేశారు? వాళ్లకి వచ్చిన ఓట్లెన్ని? వచ్చే ఎన్నికల్లో ఏ అభ్యర్ధి అయితే బెటర్ ఛాయిస్ అవుతుందన్న దిశగా అమిత్ షా సర్వే సాగుతోంది. ఈ సీక్రెట్ సర్వేలతో రాష్ట్ర స్థాయి, లోకల్‌ లీడర్ల గుండెల్లో గుబులు రేగుతోంది. ప్రస్తుతం పోటీ చేయాలనుకున్న వారితో పాటూ సెకండ్ కేడర్ లో ఉన్న వారి పేర్లు కూడా సర్వేలోప్రస్తావిస్తుండడంతో తమకు సీటు ఉంటుందా...లేదా అనే అనుమానం నేతలను పట్టి పీడిస్తోంది. జీవితాంతం తమకు బీజేపీలో టిక్కెట్టు ఖాయమనుకున్న నేతలకు సైతం ఇప్పుడు గద్దె కదిలే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది.    తెలంగాణ బీజేపీకి తానే కీలకం... తాను లేకపోతే తెలంగాణలో పార్టీ మనుగడే లేదనుకునే నేతలకు కూడా అమిత్‌షా ముచ్చెమటలు పట్టిస్తున్నారట. సర్వేల్లో ప్రతికూల ఫలితాలు కనిపిస్తే... ఎవరైనా ఒకటేనన్న ధోరణితో కమల దళపతి ఉండటంతో ఈసారి తమకు టికెట్‌ వస్తుందో లేదోనన్న టెన్షన్‌ పట్టుకుందట. గతంలో మూడుసార్లు పోటీచేసి తక్కువ ఓట్లు తెచ్చుకున్నవారిని కూడా పక్కనపెట్టనున్నారు. ఇలా మూడుసార్లు వరుసగా ఓడిపోయినవారి స్థానాల్లో సెకండ్‌ కేడర్‌ లీడర్లకు అవకాశమివ్వనున్నట్లు తెలుస్తోంది. అమిత్‌షా సర్వేల గురించి తెలుసుకుని ద్వితీయ శ్రేణి నేతల్లో జోష్‌ పెరిగిందని, తమకూ మంచి రోజులు వచ్చినట్లేనని చెప్పుకుంటున్నారు. వడపోత కారణంగా పార్టీ బాగుపడుతుందని, తమకు కూడా అవకాశాలు వస్తాయని సెకండ్‌ గ్రేడ్‌ లీడర్లు భావిస్తున్నారు. అయితే అమిత్‌షా సర్వేల ఉద్దేశం బలమైన అభ్యర్ధిని గుర్తించడం... ఒకవేళ మరో పార్టీ నేత బలంగా ఉంటే... అతడ్ని పార్టీలోకి రప్పించడమే లక్ష్యమంటున్నారు. మరి అమిత్‌షా స్కెచ్‌ ఎవరికి ఎర్త్‌ పెడుతుందో? ఎవరిని అందలం ఎక్కిస్తుందో చూడాలి.

రామ్ నాథ్ ఫ్రమ్ రామ్ జన్మ భూమి!

రామ్‌నాథ్ కోవింద్ … కొన్ని గంటల కింది దాకా ఈయనెవరో మనకు కాదు… కనీసం చాలా మంది యూపీ వారికి, బీహార్ వారికి కూడా తెలియదనుకుంటా! కాని, అమిత్ షా నోటి నుంచీ ఆయన పేరు బాంబులా పేలగానే దేశమంతా రామ్ నాథ్ , రామ్ నాథ్ అంటూ రామ నామం జపించింది! ఆయన బీహార్ గవర్నర్, యూపీ బీజేపిలోని దళిత నేత అని మీడియా తనకు తెలిసింది చెబుతూ వచ్చింది! కాని, అంతకంటే పెద్దగా చెప్పటానికి ఛానల్స్ వద్ద కూడా ఏం లేదు. నిజానికి… అలాంటి లో ప్రొఫైల్ నాయకుడు కాబట్టే మోదీషా ద్వయం ఆయన్ని రైసినా హిల్స్ రేసులో నిలిపింది! ఎప్పటిలాగే అందర్నీ ఆశ్చర్యపరిచింది!   మొన్నీ మధ్యే ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల తరువాత యోగి ఆదిత్యనాథ్ సెలక్షన్ జరిగింది. అప్పుడు కూడా బోలెడు పేర్లు బలంగా వినిపించాయి. ఏ మాత్రం గట్టిగా చెప్పుకోని పేరు ఆదిత్యనాథ్! కాని, అనూహ్యంగా ఆయన్నే లక్నో పీఠంపై ప్రతిష్ఠించారు మోదీ అండ్ షా! వెంటనే యోగుల్ని, సన్యాసుల్ని సీఎంలని చేస్తారా అంటూ మీడియా వారు కొందరు, మేధావులు అర్థం పర్థం లేకుండా ప్రశ్నించారు. కాని, యూపీలో యోగి రాజ్యం నిరాటంకంగా నడుస్తోంది! అదే ఫార్ములా ఇప్పుడు రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ విషయంలోనూ ప్రధాని, బీజేపి అధ్యక్షుడు ప్రయోగించారు! ఎవ్వరూ ఊహించని వ్యక్తిని ముందుకు తీసుకొచ్చారు. దళితుడు అంటూ అపోజిషన్ ను ఇరుకున పెట్టారు. అరెస్సెస్ బ్యాక్ గ్రౌండ్ వున్న బలమైన హిందూత్వవాదిని ప్రథమ పౌరుడ్ని చేయబోతూ పంతం నెగ్గించుకుంటున్నారు. ఇది ప్రతిపక్షాలకి తీవ్రమైన ఓటమి కిందే లెక్కా!   అడ్వాణీ మొదలు సుష్మా స్వరాజ్, ద్రౌపతీ ముర్ము వరకూ మీడియా చాలా మంది పేర్లు చెప్పింది. చాలా మంది కరుడుగట్టిన బీజేపి అభిమానులు కూడా ఇంకా అడ్వాణీ రాష్ట్రపతి అవ్వటం లేదనే సత్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మోదీని అభిమానించే వారే రామ్ నాథ్ కోవింద్ ఎంపిక తట్టుకోలేకపోతుంటే ఇతర పార్టీలు, పార్టీల నేతల సంగతి చెప్పేదేముంది? సోనియా, ఏచూరీ మొదలు ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన శివసేన బాస్ ఉద్ధవ్ దాకా ఎవ్వరూ ఈ ఎత్తును ఎదుర్కోవటం ఎలాగో అర్థం కాక సతమతం అవుతున్నారు. ఇప్పటి వరకూ కేవలం మమత బెనర్జీ మాత్రమే ఘాటుగా వ్యతిరేకించింది రామ్ నాథ్ ఎంపికని. అతను దళితుడు అయినా సరే బీజేపి అభ్యర్థి కాబట్టి మేం సమర్థించమని కుండబద్ధలు కొట్టింది. కాని, మిగతా పార్టీల సంకటం వేరుగా వుంది!   కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఇంత కాలం దళితుల సంక్షేమం అంటూ ఉదరగొట్టారు. బీజేపి బనియాల పార్టీ అంటూ కార్నర్ చేశారు. కాని, ఇప్పుడు అదే అగ్రకులాల బీజేపి దళితుడ్ని ప్రెసిడెంట్ చేస్తానంటోంది. కాని, ఇతర పార్టీలకు ఇది నచ్చటం లేదు. దళిత రాష్ట్రపతి నినాదంతో మోదీ అన్ని పార్టీల దళిత ఓటు బ్యాంక్ గండికొడతారని భయపడుతోంది. కమలదళం కాన్సెప్ట్ కూడా అదే…   బీజేపికి, ఇతర మిత్రపక్షాలకి వున్న ఓట్లే కాక టీఆర్ఎస్, వైసీపీ, బీజేడీ లాంటి పార్టీల మద్దతుతో రామ్ నాథ్ తాపీగా ఎన్నికలో గెలిచేస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. కాబట్టి కాంగ్రెస్, కమ్యూనిస్టులు పోటీగా దళితుడ్నో, దళిత స్త్రీనో రాష్ట్రపతి పదవికి పోటీ పెట్టినా .. ఉత్కంఠ రేగే సూచనలు కనిపించటం లేదు. ఇప్పుడు ఎటూ తేల్చకుండా వున్న శివసేన, జేడీయూ, బీఎస్పీ, ఎస్పీ, ఏఐఏడీఎంకే లాంటి పార్టీలకు కూడా అంతిమంగా రామ్ నాథ్ వైపే మొగ్గు చూపాల్సి రావచ్చు. ఎందుకంటే, ఎలాగూ ఓడే ప్రతిపక్షాల అభ్యర్థికి ఓటు వేసి… దళితుల ముందు వ్యతిరేకులుగా ముద్ర పడాలని ఎవరూ కోరుకోరు! మమతా బెనర్జీ, కమ్యూనిస్టుల్లాంటి వారు తప్పా! విచిత్రంగా ఈ సారి మోదీ ప్రకటించిన అభ్యర్థిని వ్యతిరేకించటానికి కనీసం కేజ్రీవాల్ కూడా మీడియా ముందుకు రాలేదంటే పరస్థితి అర్థం చేసుకోవచ్చు! ప్రతిపక్షాల ఓటమి దాదాపు అప్రకటిత సత్యం!   రాష్ట్రపతి ఎన్నిక సమయంలో రాజకీయం ఎలా వున్నా రామ్ నాథ్ కోవింద్ ఎంపిక ఖచ్చితంగా చరిత్రాత్మకం! ఇప్పటికే మోదీ ద్వారా ప్రధాని పీఠాన్ని కైవసం చేసుకున్న ఆరెస్సెస్ ఇప్పుడు రామ్ నాథ్ రూపంలో తమ స్వయం సేవకుడ్ని రాష్ట్రపతి భవన్ లో ప్రవేశపెట్టబోతోంది! ఇది కొందరికి నచ్చినా, కొందరికి నచ్చకపోయినా భారతదేశ భవిష్యత్ ని తనదైన రీతిలో ప్రభావితం చేసే పరిణామమే!

పాక్ గెలిచింది! ‘కొందరు’ ఇండియన్స్ సంతోషించారు! ‘వాళ్లే’ అసలు డేంజర్!

  సినిమాని సినిమాలానే చూడాలి! ఆటను ఆటలానే ఆడాలి! ఈ డైలాగ్స్ చెప్పినంత తేలిక కాదు ఆచరించటం! ఎందుకంటే, సినిమాను మన దగ్గర బొమ్మల గారడీగా చూడరు. రియల్ లైఫ్ లా ఫీలవుతారు. అందుకే, సినిమా హీరోలు మన దగ్గర ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు అయ్యారు. అవుతున్నారు. ఇక సినిమా తరువాత ఆ రేంజ్లో, అంతకంటే ఎక్కువ క్రేజ్ వున్నది కిక్రెట్ కి. ఇండియాలో క్రికెట్ గేమ్ కాదు… మతం అనటం మనకు తెలిసిందే! అందులో ఒప్పుకోకపోవటానికి ఏం లేదు. నిజంగానే క్రికెటొక మతం… క్రికెటర్ల దేవుళ్లు! కాని, సమస్యల్లా మతంలోంచి మతోన్మాదం పుట్టడమే!   క్రికెట్ మతమైతే ఫర్వాలేదు. కాని, క్రికెట్ తో అసలు సిసలు మతాలు ముడిపడితే? అప్పుడు క్రికెట్ మ్యాచ్ లు యుద్ధాలైపోతాయి. టీవీలు బద్ధలైపోతాయి. పాకిస్తాన్ లో వుండేంత పిచ్చి, ఉన్మాదం మన దగ్గర వుండకపోవచ్చు. కాని, ఇండియన్స్ కూడా పాక్ తో క్రికెట్ అనగానే తొడలు కొట్టి , జబ్బలు చరిచి టీవీల ముందు కూర్చుంటారు. గెలిస్తే టపాసులు పేలుతాయి. కాని, పాక్ చేతిలో భారత్ ఓడితే? అటు క్రికెట్ లవర్స్, ఇటు దేశభక్తులు… ఇద్దరి గుండెలూ టపాసుల్లానే పేలతాయి. చెప్పలేని, చెప్పుకోలేని బాధ నిలువునా దహించేస్తుంది! కాని, అసలు ఈ క్రికెటోన్మాదానికి కారణం ఏంటి?   ఇండియాలో మన కిక్రెట్ టీమ్ పాకీల చేతిలో ఓడిపోతే బాధ, అవమానం మాత్రమే వుంటాయి. కాని, పాకిస్తాన్లో తమ ప్లేయర్లు ఇండియా చేతిలో ఓడితే ఉక్రోశం, ఉన్మాదం, పైశాచికత్వం స్వైర విహారం చేస్తాయి. ఇండియా చేతిలో పాక్ ఓడినందుకు టీవీలు పగలగొట్టిన వారి దగ్గర నుంచీ పిల్లల్ని చంపుకున్న వారి దాకా అనేక రకాల క్రికెట్ ఉన్మాదులు వున్నారు పక్క దేశంలో! దీనికంతటికీ కారణం క్రికెట్ అనే మతానికి అసలు మతాలు జోడీ కావటమే. ప్రధానంగా పాకిస్తానీలు ఇండియాను , ఇండియన్ టీమ్ ను హిందూ సైన్యంగా చూస్తారు. అందుకే, వారికి ఓడిన ప్రతీసారీ రక్తం మరిగిపోతుంది. ఇక కాశ్మీర్ సమస్య వుండనే వుంది. దాని వల్ల మూడుసార్లు యుద్ధాలు చేసుకోవాల్సి వచ్చింది ఇండియా, పాక్. ఆ యుద్ధాల్లోలాగే పదే పదే పాక్ ఓడుతూ వస్తోంది క్రికెట్లోనూ! అందుకే, ఆదివారం నాటి ఛాంపియన్స్ ట్రోఫి ఫైనల్ లాగా ఎప్పుడైనా తమ దేశం గిలిస్తే పాకిస్తానీల ఆవేశానికి, అరాచకాలకి హద్దే వుండదు! కాశ్మీర్ తో సహా భారత్ మొత్తం తమ వశమైపోయినట్టు ఊగిపోతారు మీడియాలో, సోషల్ మీడియాల్లో!   ఇండియాను ఓడించిన పాక్ టీమ్ ను చూసి పాకిస్తానీలు చెలరేగటం… అర్థం చేసుకోవచ్చు. కాని, మన దేశంలో వుంటూ లోలోపల పాకిస్తాన్ గెలవాలని కోరుకునే నక్కలతోని చాలా పెద్ద ప్రమాదం వుంది. ఇంకా బోలెడు మంది పాకిస్తాన్ సానుభూతిపరులు మన మధ్యనే వున్నా… కాశ్మీర్ వేర్పాటు వాద నాయకులు మాత్రం మరీ అమానుషంగా ప్రవర్తిస్తుంటారు. అడిగేది కాశ్మీర్ స్వాతంత్రం… కాని, నిస్సిగ్గుగా పాకిస్తాన్ కు మద్దతు పలుకుతుంటారు వీరు. క్రికెట్ విషయంలోనూ అంతే! ఛాంపియన్స్ ట్రోఫి గెలుపు తరువాత ఇండియాలో వుంటూ, ఇక్కడి వనరులు వాడుకుంటున్న ఒక కాశ్మీర్ వేర్పాటు నేత దిక్కుమాలిన ట్వీట్ చేశాడు. పాకిస్తాన్ గెలుపును అభినందిస్తూ మురిసిపోయాడు. గౌతం గంభీర్ అదే పాకిస్తాన్ కు పోయి సంబరాలు చేసుకో అంటూ ఘాటుగా స్పందించాడు! కాని, ఇక్కడ మనం ఆందోళన చెందాల్సింది ట్వీట్ల గురించి కాదు. ఆ ట్వీట్ల వెనుక వున్న దేశ ద్రోహకరమైన ఆలోచనల గురించి…   కాశ్మీర్ లో తమకు ప్రత్యేక దేశం కావాలని రాళ్లు రువ్వే ఉన్మాదుల్ని పక్కన పెట్టినా … కేరళ నుంచి బెంగాల్ దాకా దేశంలోని చాలా చోట్లా పాక్ క్రికెట్ టీమ్ గెలవాలనుకునే దొంగలు వున్నారు. వీళ్లంతా భారతీయుల ముసుగులో వున్న జాతి శత్రువులు. వీరికి హిందూ, ముస్లిమ్ అన్న మతాలతో కూడా సంబంధం లేదు. కేవలం కసి, ఉగ్రవాదంపై మోజు మాత్రమే! ఇలాంటి వారి ఆటకట్టించాల్సిన అవసరం ఎంతైనా వుంది. భవిష్యత్లో భారత్ ఎప్పుడైనా పాకిస్తాన్ ను మూడు, నాలుగు ముక్కలు చేసి కాశ్మీర్ సమస్యే లేకుండా చేసినా… దేశం అంతర్భాగంలోని జాతి వ్యతిరేకుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరాదు. ఎందుకంటే వారితో ఓడటమంటే ఏదో ఓ చిన్నా చితకా క్రికెట్ మ్యాచ్ ఓడిపోవటం కాదు. దేశ సంక్షేమమే పణంగా పెట్టడం…

ఒక వివాహేతర సంబంధం… రెండు విషాదంతాలు!

  ఒక వివాహేతర సంబంధం… రెండు ఆత్మహత్యలు… రెండు రాష్ట్రాల్ని సంచలనంలో ముంచేశాయి! బ్యూటీషన్ శిరీష ఆత్మహత్య రెగ్యులర్ గా టీవీల్లో వచ్చే క్రైం న్యూస్ బ్రేకింగ్ లా మొదలై గంటకు గంటకు మలుపులు తిరిగి పెద్ద దుమారంగా మారింది! చివరకు, పోలీసులు తాము మిస్టరీ ఛేదించామని చెప్పటంతో ప్రస్తుతానికైతే జైలు గొడల మధ్యకి వెళ్లి ఆగింది. శ్రవణ్, రాజీవ్ లు దోషులని పోలీసులు చెబుతున్నారు. అయితే, ఇటు శిరీష ఫ్యామిలీ కాని, అటు ఎస్సై ప్రభాకర్ రెడ్డి కుటుంబం కాని పోలీసుల వర్షన్ ని నమ్మటం లేదు. వాళ్లకే కాదు నిజానికి చాలా మందికి చాలా చాలా అనుమానాలు వున్నాయి…   ఫోటోగ్రాఫర్ అయిన రాజీవ్ , బ్యూటీషన్ శిరీష మధ్య ఎక్స్ ట్రా మ్యారిటల్ ఎఫైర్ వుందనేది పెద్దగా సందేహించాల్సిన అవసరం లేని విషయం. అసలు మొత్తం విషాదానికి వాళ్ల ఆ తొందరపాటే కారణం. భర్త, ఒక కూతురు కూడా వున్న శిరీష … రాజీవ్ ఆకర్షణకు లొంగటంతోనే పద్మవ్యూహంలో చిక్కుకుంది. ఇక అందులోంచి బయటకు రాలేకపోయిన ఆమె రాజీవ్ ప్రియురాలు తేజస్విని ఎంట్రీతో మరింత రొంపిలోకి దిగబడింది. పోలీస్ స్టేషన్ ల దాకా గొడవ వెళ్లినప్పటికీ ఆమె రాజీవ్ తో ఎఫైర్ తెంచుకోలేదు. కానీ, శిరీషతో సంబంధం పెట్టుకున్న రాజీవ్ పెళ్లి మాత్రం తేజిస్వినీని చేసుకోవాలనుకున్నాడు. ఇదే సంక్షోభానికి దారి తీసింది. శిరీష తన భర్తని, రాజీవ్ తన ప్రియురాల్ని మోసం చేస్తూ వచ్చారనే భావించాలి. అదే క్రమంగా సుడిగుండంలా మారుతూ వచ్చింది!   శిరీష, రాజీవ్, తేజస్వినీల ముక్కోణ కథలోకి శ్రవణ్ ప్రవేశించటం మరింత దారుణంగా మార్చింది పరిస్థితిని. పోలీసుల కథనం ప్రకారమైతే అతనే ఎస్సై ప్రభాకర్ రెడ్డిని రంగంలోకి దింపి మొత్తమంతా విషమంగా మార్చేశాడు! ఉద్దేశ్యపూర్వకంగా శిరీషని ట్రాప్ చేశాడని పోలీసులు అంటున్నారు. ఆమెని ఎస్సై వద్దకి దురుద్దేశంతోనే తీసుకెళ్లాడనీ తమ దర్యాప్తులో తేలిందంటున్నారు. అసలు శ్రవణ్ ట్రాక్ రికార్డే బాగాలేదని గట్టిగా చెబుతున్నారు పోలీసులు!   పోలీసుల వర్షన్ కరెక్టా కాదా అనే చర్చలోకి వెళితే చాలా అనుమానాలే వస్తాయి. ప్రధానంగా కుక్కునూరు పల్లె జనం తమ ఎస్సై కోసం రోడ్డు పైకి వచ్చారంటే… ఆయన ఎంతో మంచి పేరే కలిగి వుండాలి. అదీ కాక ఒకవేళ ఆయన శిరీషపై అఘాయిత్యానికి పాల్పడ్డా కూడా… పోలీసు శాఖలో వున్న ఆయన భయపడిపోయి ఆత్మహత్య చేసుకోవటం కాస్త నమ్మదగ్గ విషయంగా లేదు. కేవలం పరువు పోతుందనో, సస్పెండ్ అవుతాననో ఒక పోలీసు ఆత్మహత్య చేసుకుంటాడా? పై అధికారుల వేధింపులు అనే కోణం ఎందుకు పట్టించుకోకూడదు? ఇలాంటి బోలెడు ప్రశ్నలు వున్నాయి! ఎస్పై ప్రభాకర్ రెడ్డి కేవలం శిరీష ఆత్మహత్య చేసుకుందనే రివాల్వర్ తో కాల్చుకుని చనిపోయాడంటే… అంత తేలిగ్గా ఎవరూ నమ్మలేరు. కాని, ప్రస్తుతానికి పోలీసులు చెబుతోంది మాత్రం అదే!   శిరీష, ఎస్పైల ఆత్మహత్యల కేసులో అనుమానాల సంగతి ఎలా వున్నా … ఒక్కటి మాత్రం తప్పక గుర్తించాల్సిన సత్యం. ఒక్కసారి వివాహేతర సంబంధం మొదలు పెట్టడం అంటే… ల్యాండ్ మైన్ పైన కాలుపెట్టడం లాంటిదే! ఇక దానిపై నుంచి పక్కకు జరిగి క్షేమంగా బయటపడటం చాలా కష్టం! దాదాపు అసాధ్యం!

అయోమయ అగ్నిలో బ్రిటన్! గందరగోళపు మంటల్లో లండన్!

      మనుషులకు గుడ్ టైం, బ్యాడ్ టైం వున్నట్టు దేశాలకు, ప్రాంతాలకు, నగరాలకు కూడా వుంటాయా? ఏమో… లండన్ పరిస్థితి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది! లండన్ కి ఇప్పుడు రియల్ బ్యాడ్ టైం నడుస్తోంది. ఒకవైపు ఉగ్రవాదులు జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. మరోవైపు మానవ తప్పిదాలు కూడా ఇంత కాలం మాటు వేసి ఇప్పుడు కాటు వేస్తున్నాయి! లండన్ నడిబొడ్డులో తగలబడిన బహుళ అంతస్థుల భవనం ఆ నగరం తాజా దుస్థితికి నల్లటి మసైపోయిన విషాద చిహ్నం!   మధ్య లండన్ లో వున్న గ్రెన్ ఫెల్ టవర్ 24అంతస్థుల భవనం. పూర్తిగా జనం తలదాచుకునే రెసిడెన్షియల్ కాంప్లెక్స్. 120ఫ్లాట్లలో దాదాపు 500 మందికి పైగా జనం అందులో వుంటున్నారు. కాని, చూస్తుండగానే చిన్న నిప్పు రవ్వ మంటైంది. మంట పెద్ద అగ్ని జ్వాలలుగా మారింది. మొత్తం బిల్డింగ్ నే కరిగించి మింగేసింది. అగ్ని ప్రమాదం మొదలైన నిమిషాల్లోనే ఫైరింజన్లు వచ్చినా ఏం లాభం లేకుండా పోయింది. 200 మంది ఫైర్ ఫైటర్లు ప్రాణాలకు తెగించి బిల్డింగ్ లోకి వెళ్లినా… అనేక మంది మాడి మసైపోయారు. ఎంతో మందో ఇంకా ఖచ్చితంగా తెలియదు!   నా 29ఏళ్ల కెరీర్లో ఇంతటి దారుణమైన కార్చిచ్చుని ఎప్పుడూ చూడలేదు అని లండన్ ఫైర్ కమీషనరే స్వయంగా చెప్పారంటే… జరిగిందేంటో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం… ఓ తల్లి ఏమీ చేయలేక తన చంటి బిడ్డని పై నుంచి కిందకి విసిరేసిందట! ఎవరైనా పట్టుకుంటారన్న ఆశతో! కాని, అలాంటిదేం జరగలేదు. ఇంకో అంతస్థులోని మూసి వున్న కిటీకీల్లోంచి చిన్న పిల్లలు తలుపుల్ని భయంతో బాదుతూ వుండటం కనిపించింది! కాని, అది కొంతసేపే! చూస్తుండగానే ఆ పిల్లల్ని వెనక నుంచి కమ్ముకొచ్చిన నల్లటి పొగలు మింగేశాయి! అగ్ని ఆ అంతస్థు మొత్తాన్నీ బూడిద చేసేసింది! ఇలాంటి హృదాయ విదారక సన్నివేశాలు ఎన్నెన్నో!   24అంతస్థుల ఆకాశహర్మ్యంలోని ఒక ఫ్లాట్ లో పాత ఫ్రిడ్జ్ పేలిపోయి మంటలు చెలరేగటం… అవ్వి కణాల్లో మొత్తం బిల్డింగ్ నే బూదిద చేయటం… ఎవ్వరూ ఊహించని ప్రమాదమేం కాదు. భారీ బంగలాల విషయంలో ప్రమాదం అంటూ జరిగితే ఇలానే వుంటుంది విషాదం. ఎక్కడైనా కూడా! కాని, లండన్ లాంటి ఒక ప్రపంచపు మేటి నగరంలో, బ్రిటన్ లాంటి అభివృద్ధి చెందిన దేశపు రాజధానిలో వందల మంది ప్రాణాలు ఎప్పుడో 1974లో కట్టిన స్కై స్కేపర్లో వుంచి ప్రభుత్వాలు చోద్యం చూస్తాయా? ఇప్పుడు ఇదే అందర్నీ షాక్ కి గురి చేస్తోంది. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు లాంటి బ్రిటన్ లో ప్రజాల సంక్షేమం పరమ దారుణంగా వుందనేది స్పష్టంగా తేలిపోతోంది రోజు రోజుకి! అదే తాజా ఎన్నికల ఫలితాల్లో కూడా కనిపించింది. ఎవ్వరికీ స్పష్టంగా మద్దతు పలకలేదు జనం. ఎవ్వర్నీ నమ్మటం లేదు వారు. దశాబ్దాల కిందట కట్టిన బిల్డింగ్ భద్రతనే చూసుకోని బ్రిటన్ ప్రభుత్వాలు, ఇంక ఉగ్రవాద దాడుల్ని ఏం అరికడతాయి? ఇప్పుడు లండన్ వాసులు, బ్రిటన్ ఓటర్ల మనసుల్లోని సంశయం ఇదే! సహజంగా ఇలాంటి పరిస్థితి ఏ ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల పౌరులకి వుంటుంది. కాని, రాను రాను యూరోపియన్ దేశాల రాజకీయ వ్యవస్థల్లోనూ తేడా కొల్టొచ్చినట్టు కనిపిస్తోంది.   మంటల్లో తగలబడ్డ భవనం లండన్ లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలోనిది. అక్కడ సెలబ్రిటీలు, సంపన్నులు చాలా మంది వుంటారు. వాళ్ల ఊడిగానికి ఎంతో ఆసక్తి చూపే లండన్ పురపాలక సంఘాలు తమను మాత్రం పట్టించుకోవటం లేదని అంటున్నారట స్థానిక సామాన్య జనం. మంటల్లో బూడిదైన గ్రెన్ ఫెల్ టవర్ తక్కువ ఆదాయం వున్న వారు వుండేందుకు ఉద్దేశించిన ప్రభుత్వ సబ్సిడి భవనం లాంటిది. అందుకే, సంవత్సరాల తరబడి ఆ పాత భవనం భద్రతపై జనం ఆందోళన వ్యక్తం చేసినా, కంప్లైంట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదట! చివరకు, పరమ దారుణమైన విషాదం జరిగిపోయింది. అందుకే, లండన్ లోని ఒక స్థానికుడు … సంవత్సరానికి పదివేల పౌండ్ల కంటే తక్కువ సంపాదించేవాడు, ఈ నగరంలో అసలు మనిషిగా బతకనే బతకలేడు అని వాపోయాడట!   కేవలం ఒక్క అగ్ని ప్రమాదం బ్రిటన్ లాంటి అగ్ర దేశం దుస్థితికి అద్దం పడుతుందని మనం చెప్పలేం. కాని, వరుసగా జరుగుతోన్న ఉగ్రవాద దాడులు, ఎన్నికల్లో వస్తోన్న గందరగోళ ఫలితాలు, యూరోపియన్ యూనియన్ నుంచి బయటకి వచ్చేయటం, స్కాట్లాండ్ లో విడిపోతామంటూ ఉద్యమాలు రేగుతుండటం… అన్నీ తెల్లవారి దేశంలో ఏదో నల్లటి కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ముందు ముందు మరింత స్పష్టత రావచ్చు. కాని, ఇప్పటికైతే… తప్పంతా బ్రిటన్ ని ఏలుతూ వచ్చిన పాలకుల వైపే కనిపిస్తోంది. ప్రపంచ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశించిన బ్రిటన్ ప్రధానులు తమ స్వంత దేశంపై తగినంత శ్రద్ధ చూపలేదని అనిపిస్తోంది!

మియాపూర్ భూ కుంభకోణం… టీ సర్కార్‌కి కోర్టు కష్టాలు తప్పవా?

  మియాపూర్ భూ కుంభకోణం పెద్ద మాయాపూర్ భూ కుంభకోణంగా మారిపోయింది! తప్పు కేవలం రిజిస్ట్రేషన్ అధికారులదే అని తెలంగాణ సర్కార్ చెబుతోన్నా వారి వెనుక రాజకీయ నాయకుల హస్తం ఎట్టి పరిస్థితుల్లోనూ వుండదని ఎవ్వరూ అనలేరు. అసలు పొలిటికల్ మాయ తెర వెనుక లేకుంటే ఎకరాల కొద్దీ భూముల్ని, కోట్లు విలువ చేసే ప్రభుత్వ ఆస్తుల్ని అధికారులు ఏ ధైర్యంతో తమకు నచ్చిన వారికి ధారదత్తం చేస్తారు? అయితే, వ్యవహారం చూస్తుంటే ఇప్పుడిక రాజకీయ నాయకుల ప్రమేయం పెద్దగా బయటకు వచ్చేలా కనిపించటం లేదు. స్వయంగా కేసీఆర్ కుంభకోణం ఏం జరగలేదని అభిప్రాయపడ్డారు కాబట్టి అధికారుల మీద విచారణలు, చర్యలతోనే సరిపెట్టేస్తుండవచ్చు!   టీఆర్ఎస్ నేత కేకే కుటుంబంపైనే ఆరోపణలు రావటంతో ఒక దశలో మియాపూర్ భూకుంభకోణం తెలంగాణ గవర్నమెంట్ మెడకు చుట్టుకున్నట్టే అనిపించింది. కాని, మెల్ల మెల్లగా నయీం కేసులో జరిగినట్టే ఇక్కడా జరిగిపోతోంది! రాజకీయ నేతలు సేఫ్ జోన్ లోకి వచ్చేస్తున్నారు. కాని, కొందరు న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం ప్రభుత్వ భూముల్ని రిజిస్టర్ చేయించుకున్న ప్రైవేట్ పార్టీల నుంచి తిరిగి హక్కులన్నీ గవర్నమెంట్ పొందటం అంత ఈజీ కాదట! అక్రమంగా రిజిస్ట్రేషన్ లు చేయించుకున్న వారి డాక్యుమెంట్లు చెల్లవని ఒక నోటిఫికేషన్ ఇవ్వగానే పని పూర్తైపోదంటున్నారు. ప్రభుత్వ భూములన్నీ భద్రంగా సర్కార్ ఆధీనంలోకి రావాలంటే బోలెడంత చట్టపరమైన తతంగం జరగాల్సిందేనట!   రిజిస్ట్రేషన్ శాఖలోని అధికారులు గవర్నమెంట్ భూముల్ని తమ ఇష్టానుసారం ఎవరెవరికో కట్టబెట్టేశారు. ఇప్పుడు వాట్ని తిరిగి పొందాలంటే ముందుగా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ యాక్ట్ లోని సెక్షన్ 22 కింద భూముల్ని నోటిఫై చేయాలి. ఆన్ లైన్లో ఆయా సర్వే నెంబర్లని మళ్లీ రిజిస్ట్రేషన్ అవ్వకుండా బ్లాక్ చేయాలి. అంతే కాక సదరు భూముల్ని నోటిఫై చేసిన ప్రభుత్వం అభ్యంతరాలు వున్న వారు తమకు తెలుపవచ్చని కూడా నోటీస్ ఇవ్వాలి. ఇదంతా పూర్తైన తరువాత భూముల అక్రమ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తూ జీవో జారీ చేయాలి. కాని, ప్రభుత్వం అలా క్యాన్సిల్ చేస్తే రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు కోర్టుకు వెళ్లే అవకాశం ఎప్పుడూ వుంటుంది. మరో వైపు నిజాం, పయిగా వంశస్థులు సర్కార్ భూములు తమవంటూ, వారు కూడా కోర్టుకు వెళ్లే చట్టబద్ధమైన అవకశాలున్నాయి. ఇలా కోర్టులో లిటిగేషన్లు మొదలైతే మియాపూర్ భూముల వ్యవహారం తేలటానికి ఏళ్లు పడుతుంది!   సర్కార్ చెబుతున్నట్టు ఒక్క సెంటు భూమి కూడా కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లనప్పటికీ ముందు ముందు చాలా పెద్ద న్యాయ పోరాటం తప్పదనేది ఇప్పుడు స్పష్టం. అలాగే, రాబోయే ప్రతీ గవర్నమెంటు దీనిపై ఎంతటి చిత్తశుద్ధితో కోర్టులో పోరాడుతుందో ఎవ్వరికీ తెలియదు. ఇక జనం కొంచెం భూమి కూడా అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లకూడదని కోరుకోవటం తప్ప చేయగలిగిందేం లేదు!

గవర్నెమెంట్ స్కూల్, హాస్పిటల్ వద్దు! గవర్నమెంట్ ఉద్యోగమెందుకు ముద్దు?

  ఇండియాలో ఎక్కడికెళ్లినా ఏ మాత్రం మారని ట్రెండ్… గవర్నమెంట్ బడి, గవర్నమెంట్ హాస్పిటల్ అంటే జనంలో వుండే భయం, చిరాకు! కాని, అదే గవర్నమెంట్ ఉద్యోగం అంటే మాత్రం జనం ముఖంలో మెరుపు కనిపించేస్తుంది! అసలు మన దేశంలో గవర్నమెంట్ ఉద్యోగానికి వున్నంత క్రేజ్ బహుశా ఇంక దేనికీ లేదనుకుంటా! అందుక్కారణం కూడా కొంచెం ఆలోచిస్తే తేలిగ్గానే దొరికిపోతుంది మనకి!   తెలంగాణలో కలకలం రేపుతోన్న మియాపూర్ భూ కుంభకోణం అందరికీ తెలిసిందే! ఇందులో పెద్ద పెద్ద రాజకీయ నేతల పేర్లు, వారి కుటుంబీకుల ప్రమేయాలు రోజూ వార్తలో కనిపిస్తున్నాయి. వినిపిస్తున్నాయి. అయితే, బడా నాయకులు మియాపూర్ భూముల కారణంగా ఎంత సంపాదించుకున్నారో ఇంకా స్పష్టంగా తెలియదు. కాని, కేవలం ఒక సబ్ రిజిస్ట్రార్ స్థాయిలో పని చేసిన శ్రీనివాసరావు మాత్రం వినేవారికి మైండ్ బ్లాంక్ అయ్యేలా అవినీతి సొమ్ము పోగేశారట!   కూకట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ గా పని చేసిన ఆయన తన బావమరిదికి చెందిన నార్త్ స్టార్ ప్రాజెక్ట్స్ సంస్థ, మరణించిన తన భార్య పేరు మీదున్న జయశ్రీ ప్రాజెక్ట్స్ తో పాటు, తన కుమారుడి హాసిని ప్రాజెక్ట్స్ సంస్థ పేరు మీద భారీ ఎత్తున లావాదేవీలు నిర్వహించినట్టు గుర్తించారు ఏసీబీ అధికారులు. అంతే కాదు, మొత్తం పది బ్యాంకుల్లో అకౌంట్లు వున్నట్టు కూడా పసిగట్టారు. పదిహేడు క్రెడిట్ కార్డ్ లు కూడా అవినీతి నిరోధక శాఖ స్వాధీనం చేసుకుంది. ఇక ఫైనల్ గా ఇప్పడు సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు మొత్తం అక్రమ సంపాదన 2వందల కోట్ల పైమాటే అంటున్నారు అఫిషియల్స్!   ఒక గవర్నమెంట్ అధికారి వలలో చిక్కితేనే వందల కోట్లు బయటపడుతుంటే ఇక గవర్నమెంట్ నడిపే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వగైరా వగైరా ఎంత వెనకేసుకుంటూ వుంటారంటారు? ఇటు గవర్నెంట్ ఉద్యోగుల్లోనూ, అటు గవర్నమెంట్ పెద్దల్లోనూ, రాజకీయ నాయకుల్లోనూ మంచి వాళ్లు వుండొచ్చు. కాని, వారి కంటే రోజు రోజుకు ఇలాంటి అవినీతి చేపలు, తిమింగలాలు, షార్కుల సంఖ్యే ఎక్కువైపోతుంది. ఒక్కో అవినీతి అధికారే వందల కోట్లు నొక్కేస్తుంటే ఇంకా పై స్థాయిలోని నేతలు, కార్పోరేట్ బాస్ లు ఇంకే రేంజులో దేశాన్ని దోచుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు!   గవర్నమెంట్ నౌకరీలో ఇంత గిట్టుబాటు వుండటంతోనే చాలా మంది పేద, మిడిల్ క్లాస్ ఇండియన్స్ గవర్నమెంట్ జాబ్ కోసం తలకిందుల తపస్సు చేస్తుంటారు. ఉద్యోగం వచ్చాక అందరూ అవినీతిపరులైపోతారని మనం చెప్పలేం. కాని, అత్యధిక శాతం అక్రమ మార్గంలోకే జారిపోతున్నారు. ఇది దేశం సంక్షేమానికి ఎంత మాత్రం మంచిది కాదు. ప్యూన్ నుంచీ ఎమ్మెల్యే, ఎంపీ దాకా ఎవరికి వారు అవినీతి చేస్తూ పోవటం అంటే… ఆత్మహత్య చేసుకోవటం లాంటిదే!

దేశమేదైనా… ఉగ్రవాదుల ఉద్దేశం… హింస మాత్రమే!

  ఉగ్రవాదం… ఇప్పుడు ఇది హింసకు మారు పేరు అయిపోయింది! కొందరు జిహాదన్నా, మరికొందరు ఇస్లామిక్ టెర్రరిజమన్నా, ఇంకొందరు ఐసిస్సన్నా, ఆల్ ఖైదా అనన్నా… మన దేశంలో కాశ్మీరీ వేర్పాటు వాదమన్నా… అంతటా సారాంశం మాత్రం ఒక్కటే… విచ్చలవిడి హింస! మానవ చరిత్రలోనే గతంలో ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ ఇలాంటి అర్థం పర్థం లేని హింస చెలరేగలేదు! ఆత్మహుతి దాడి చేసే ఉగ్రవాది ఏం ఆశిస్తున్నట్టు? తానే చనిపోయాక వచ్చేది ఏంటి? పోయేది ఏంటి? అయినా మూర్ఖంగా వేలాది మంది టెర్రరిస్టులు లక్షలాది మంది అమాయకుల్ని పొట్టనబెట్టుకుంటారు..   కొంత కాలం క్రితం వరకూ భారత్, ఇజ్రాయిల్ లాంటి దేశాలు ఇస్లామిక్ ఉగ్రవాదుల టార్గెట్ గా వుండేవి. ఎందుకంటే, ఇక్కడ మెజార్జీ ప్రజలు ముస్లిమేతరులు కాబట్టి. కాని, రాను రాను ప్రపంచ పటంలో ఏ ఒక్క దేశమూ ఉగ్రవాదానికి అతీతంగా వుండలేకపోతోంది! తాజాగా ఇరాన్ ఏకంగా పార్లమెంట్ నే ఉగ్రవాదుల దెబ్బకి మూసేసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి అనుభవం మనకైతే కొత్త కాదు. మన పార్లమెంట్ పై ఎప్పుడో ఉగ్రవాదులు దాడి చేశారు!   భారత్ మీద ఇస్లామిక్ జిహాదీలకు మతం వేరనే ద్వేషం వుండవచ్చు. కాని, ఇరాన్ అధికారికంగా ముస్లిమ్ దేశం. అయినా దాని మీద కూడా ముస్లిమ్ ఉగ్రవాదులే అయినా ఐఎస్ జిహాదీలు ఎందుకు తెగబడ్డారు? షియా, సున్నీ తేడాల కారణంగా! ఇరాన్ లో వుండేది మెజార్టీ షియాలు! సున్నీలు మాత్రమే భూమిపై వుండాలనే సిద్దాంతంతో నడిచే ఐసిస్ కు సహజంగానే ఇరాన్ శత్రువు! అందుకే, దాడి!   సున్నీలు షియాలపై దాడులు చేయటమే కాదు… షియాలు కూడా సున్నీలపై దాడులు చేస్తున్నారని ఆరోపణలు వున్నాయి. ప్రధానంగా అమెరికా ఇరానే ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని ఆరోపిస్తోంది! కాని,మరోవైపు ఐఎస్ఐఎస్ లాంటివి పుట్టటానికి అమెరికానే కారణం అనేవారు కూడా లేకపోలేదు! అమెరికా, సౌదీ అరేబియా, మరికొన్ని దేశాలు కలిసి లోపాయికారిగా ఉగ్రవాదుల్ని పోషిస్తున్నాయి. ఐసిస్ ఆధీనంలో వున్న ప్రాంతాల్లోని చమురుని దాదాపు అన్ని ప్రధాన దేశాలు అక్రమంగా కొనుగోలు చేశాయని చెబుతారు. ఆ విధంగా ఉగ్రవాదులకి డాలర్లు అప్పజెబుతూ మళ్లీ వారి మీద క్షిపణి దాడులు చేస్తున్నాయి అమెరికా లాంటి దేశాలు! ఉగ్రవాదం ప్రోత్సహిస్తుందన్న ఆరోపణలు ఎదుర్కొంటోన్న సౌదీ అరేబియా ఖతార్ ను ఉగ్రవాద దేశంగా ముద్ర వేసి వెలివేసింది! ఇలాంటి రాజకీయాలే అమాయకుల రక్తం చిందటానికి కారణం అవుతున్నాయి.   ఇంతకాలం తమ వ్యాపార లాభాల కోసం ఏదో ఒక విదంగా ఉగ్రవాదాన్ని రాజేసి వదిలిన దేశాలకు ఇప్పుడు ఉగ్రవాదం సెగ నేరుగా తగులుతోంది. ఇరాన్ నుంచి బ్రిటన్ దాకా అన్ని దేశాలు టెర్రరిస్ట్  సంస్థల పేర్లు తలుచుకుని గడగడ వణుకుతున్నాయి. పాకిస్తాన్ లాంటి ఉగ్రవాదుల కర్మగారం కూడా పదే పదే ఉగ్ర దాడులకి అల్లాడిపోతోంది. పాక్ లో రక్తం మరిగిన ఉగ్రవాదులు అక్కడే దాడులు చేస్తున్నారు! మొత్తం మీద టెర్రరిస్టులు ఎవరి మీద, ఎందుకు, ఎలా చేస్తున్నారో అర్తం కాకుండా యుద్ధం చేస్తున్నారు! ఏ దేశమూ సేఫ్ కాకుండా పోయింది. ఎందుకంటే, ఒక దేశం ఉగ్రవాదులు మరో దేశంపై దాడి చేస్తే ఇంకో దేశం ఉన్మాదులు మరింకో దేశంపై తెగబడుతున్నారు! దీనికి అంతం లేకుండా పోతోంది!   దాడి ముస్లిమ్ దేశమైన ఇరాన్ లో జరిగినా, పాక్ లో జరిగినా, యూదు దేశమైన ఇజ్రాయిల్ లో జరిగినా, మన భారతదేశంలో చోటు చేసుకున్నా… పోయేది అమూల్యమైన మానవ ప్రాణమే! కాబట్టి ప్రపంచ దేశాలు చిత్త శుద్ది వుంటే… ఉగ్రవాదాన్ని వ్యాపారంగా చూడటం మానేసి స్వంత లాభాలు పక్కన పెట్టాలి. ఉగ్రవాదానికి మతం ఎంత వరకూ దోహదపడుతుందో చూసుకుని మతాన్ని సంస్కరించుకోవాలి. అప్పుడే అన్ని దేశాలు ఉగ్ర భూతం నుంచి క్షేమంగా వుంటాయి. లేదంటే, ఉగ్రవాదులు ఏదో ఒక రోజు చేసే అణు దాడిలో ఇప్పుడు చెలగాటం ఆడుతోన్న అన్ని దేశాలు పాపానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది!

ఇస్రో ప్రయోగించిన బాహుబలి… అది తీసుకురానున్న 10 గొప్ప మార్పులు!

  ఇస్రో వరుస విజయాల్లో మరో ఘనవిజయం తాజాగా జరిపిన జీఎస్ఎల్వీ ఎంకే 111 ప్రయోగం! భారతీయ అంతరిక్ష పరిశోధనల చరిత్రలోనే ఇది అత్యంత విశేషం. ఎందుకంటే, జీఎస్ఎల్వీ ఎంకే 111 రాకెట్ బాహుబలి కాబట్టి! భారీగా కనిపిస్తూ 13అంతస్థుల బిల్డింగ్ అంత ఎత్తు వుండే జీఎస్ఎల్వీ ఎంకే 111… 200ఏనుగుల బరువు వుంటుంది! ఇంత భారీ రాకెట్ ప్రయోగించటం ఇండియాకు ఇదే తొలిసారి! కాని, ఎంతో శ్రమ, ఖర్చు చేసి ఇస్రో చేసిన సరికొత్త ప్రయోగం, అందులో విజయం… ప్రాక్టికల్ గా తీసుకొచ్చే లాభాలేంటి? బోలెడు వున్నాయి…   1.     జీఎస్ఎల్వీ ఎంకే 111 రాకెట్ ని నింగిలోకి ప్రయోగించటం భారత్ ఎప్పట్నుంచో ఆశయంగా పెట్టుకున్న అంతరిక్ష స్వావలంబనకి దారి తీస్తుంది. ప్రతీ ప్రయోగానికి పాశ్చాత్య దేశాలపై ఆధారపడే స్థాయి నుంచి ఇండియా ఇప్పుడు ఎంతో ముందుకు వచ్చేసింది. అయితే, పూర్తిగా అంతరిక్ష రంగంలో మన సత్తా పై మనం సగర్వంగా నిలబడేందుకు ఇంకొన్ని అడ్డంకులు వున్నాయి. వాట్ని ఛేదించటమే బాహుబలి రాకెట్ లక్ష్యం!   2.     భూ కక్ష్యలో ఉపగ్రహాల్ని ప్రవేశపెట్టేందుకు భారత్ ఎప్పట్నుంచో పీఎస్ఎల్వీ వాహక నౌకను వాడుతోంది. అంతకంటే అధునాతన టెక్నాలజీయే జీఎస్ఎల్వీ. దీని ద్వారా అంతకంతకూ బరువైన ఉపగ్రహాల్ని ఇస్రో లాంచ్ చేస్తూ వస్తోంది. మొన్నీ మధ్యే 104ఉపగ్రహాలు ఒకేసారి అంతరిక్షంలోకి తీసుకెళ్లింది జీఎస్ఎల్వీ ద్వారానే!   3.    జీఎస్ఎల్వీ రాకెట్ల ప్రధాన విశేషం క్రయోజెనిక్ ఇంజన్. అంతరిక్ష రంగంలో బాగా అబివృద్ధి చెందిన దేశాల వద్ద మాత్రమే ఈ క్రయోజెనిక్ టెక్నాలజీ వుంటూ వచ్చింది. దాన్ని రష్యా సాయంతో సంపాదించిన ఇండియా జీఎస్ఎల్వీ రాకెట్లలో ఉపయోగించింది. ఫలితంగా బరువైన ఉపగ్రహాలు నింగిలోకి వెళ్లగలిగాయి.   4.    రష్యా అందించిన క్రయోజెనిక్ సాంకేతికత కారణంగా జీఎస్ఎల్వీ ప్రయోగాలు చేపట్టిన ఇస్రో పూర్తిగా భారతీయ టెక్నాలజీతో క్రయోజెనిక్ ఇంజన్ తయారీకి పూనుకుంది. దాని పలితమే … CE20 క్రయోజెనిక్ ఇంజన్! ఈ అత్యాధునిక శక్తివంతమైన ఇంజన్నే బహుబలి రాకెట్ లో వాడారు. అందుకే, అత్యంత భారీ రాకెట్ ను ఆకాశంలోకి ఫైర్ చేయగలిగారు!   5.    జీఎస్ఎల్వీ ఎంకే 111 లో CE20 క్రయోజెనిక్ ఇంజన్ వాడటం వల్ల మనం ఇక మీద ఆకాశంలోకి తీసుకెళ్లబోయే ఉపగ్రహాల బరువు గణనీయంగా పెంచుకోవచ్చు. 4వేల కేజీల వరకూ తూగే సాటిలైట్స్ ను జీఎస్ఎల్వీ ఎంకే 111 రాకెట్ ద్వారా కక్ష్యలో ప్రవేశపెట్టవచ్చు. అయితే, ఇస్రో టార్గెట్ నాలుగు వేల కిలోలు మాత్రమే కాదు… 6టన్నుల ఉపగ్రహాల్ని కూడా గగనంలోకి ఎత్తుకుని పోవటమే మన సైంటిస్టుల టార్గెట్. అందుకు తగ్గట్టుగా ముందు ముందు క్రయోజెనిక్ ఇంజన్ల శక్తిని పెంచుతూపోనున్నారు! అంతిమంగా… రాబోయే కొన్ని సంవత్సరాలలోనే 15టన్నుల బరువైన లోడ్ ని కూడా వినువీధిలోకి తీసుకెళ్లగలుగుతారు!   6.    జీఎస్ఎల్వీ ఎంకే 111 రాకెట్ తో ఎంత ఎక్కువ బరువు అంతరిక్షంలోకి పంపగలిగితే అంతగా మానవ సహిత అంతరిక్ష యానాలకి మనం దగ్గరవుతాం. అందుకే, ఇస్రో జీఎస్ఎల్వీ ఎంకే 111 ప్రయోగాన్ని భారతీయ వ్యోమగాముల తొలి అడుగుగా చెబుతోంది. ఇంకా సుదీర్ఘమైన ప్రయోగాల పరంపర జరగాల్సి వున్నప్పటికీ …. జీఎస్ఎల్వీ ఎంకే 111 బహుబలి రాకెట్ విజయవంతం గగనంలోకి మన ఎంట్రీగా చెప్పుకోవచ్చు!   7.    భారీ ఉపగ్రహాల్ని ప్రయోగించటం , వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లటం మాత్రమే కాదు… మరో మేలు కూడా జరగనుంది. ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మాత్రమే ఏకైక అంతరిక్ష కేంద్రం. భూమికి ఆవల గగనంలో ల్యాబోరేటరీ నిర్మించి అక్కడ ప్రయోగాలు చేస్తుంటారు అమెరికన్, ఈయూ శాస్త్రవేత్తలు. మన సునీతా విలియమ్స్ లాంటి వ్యోమగాములు వుండి వచ్చింది ఇంటర్నేషనల్ స్పెస్ స్టేషన్ లోనే!   8.    జీఎస్ఎల్వీ ఎంకే 111 ప్రయోగం విజయవంతం… దీర్ఘ కాలంలో భారత్ కూడా అంతరిక్ష ప్రయోగశాల నిర్మాణానికి పూనుకునే గొప్ప అవకాశం కల్పిస్తుంది. చైనా ఆల్రెడీ అంతరిక్ష ల్యాబోరేటరీలు నిర్మించాలనీ, తరువాత అంతరిక్ష కేంద్రం నిర్మించాలని తహతహలాడుతోంది. మన తాజా బహుబలి విజయం చైనాతో పోటిలో వుండేలా చూడగలదు. సమీప భవిష్యత్తులోనే మన శాస్త్రవేత్తలు, వ్యోమగాములు రోజులు, నెలల తరబడి భూమికి బయట మకాం వేయగలరు. మానవ చరిత్ర మలుపు తిప్పే ప్రయోగాలు చేసి ఫలితాలు సాధించగలరు!   9.    వేల కిలోల బరువును మోసుకుపోగలిగే జీఎస్ఎల్వీ ఎంకే 111 ఇప్పుడు మన గ్యారేజ్ లో రెడీగా పార్క్ చేసి వుంది కాబట్టి… ముందు ముందు చంద్రయానం, మంగళయానం, గురు గ్రహ యానం, శుక్రయానం కూడా చేయవచ్చు. భూమిపైనే కాదు… మొత్తం సౌర కుటుంబంలో మన సత్తా చాటవచ్చు!   10.  జీఎస్ఎల్వీ ఎంకే 111 ప్రయోగానికి అన్నీ వైజ్ఞానిక లాభాలే కాదు… ఆర్దిక లాభసాటి కోణం కూడా ఒకటుంది! రానున్న కాలంలో అంతరిక్ష పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందుతుందని బడా బడా వ్యాపారవేత్తలు భావిస్తున్నారు! ఇప్పుడు వివిధ దేశాలు తిరిగి వస్తున్నట్టు అప్పుడు డబ్బున్న వారు, సరదా వున్న వారు భూమి బయటకి వెళ్లి అంతరిక్ష పర్యటన చేసి వస్తారట. అదే జరిగితే… అలాంటి పర్యాటకుల్ని గగన విహారానికి తీసుకెళ్లే బిజినెస్ ఆఫర్లు కూడా ఇస్రో కూడా దక్కుతాయి. ఇది డాలర్ల పంట పండించే అంశం!

పర్యావరణం పై రణం చేస్తే… పర్యవసానం దారుణం!

  జూన్ 5… ప్రపంచ పర్యావరణ దినోత్సవం! ఇవాళ్ల మిగతా అన్ని స్పెషల్ డేస్ లో చేసినట్టే ప్రపంచ వ్యాప్తంగా జనం హడావిడి చేసేస్తుంటారు! స్పీచ్ లు, పాటలు, ఆటలు, టీవీ కెమెరాల హంగామా, ఆర్బాటం! ఇక సినిమా వాళ్లకంటే మరింత ఎక్కువ కెమెరా సెన్స్ వున్న పొలిటీషన్స్, ప్రకృతి ప్రేమికులు మొక్కలు పట్టుకుని ఇచ్చే ఫోజులైతే  మరీ సుందరంగా వుంటాయి! కాని, రేపట్నుంచీ ఏంటి పరిస్థితి? నిన్నటి దాకా ఏం జరిగిందో అదే! పర్యావరణంపై దారుణమైన రణం! చెట్లను నరుకుతూ…మనిషి కూర్చున్న కొమ్మనే నరుక్కునే పని దిగ్విజయంగా చేసేస్తుంటాడు!   సంవత్సరానికి ఓ సారి పర్యావరణం కోసం ఓ రోజు కేటాయించుకోవటం తప్పు కాదు! కాని, అసలు పర్యావరణం కోసం ఒక దినోత్సవం పెట్టుకోవాల్సిన ప్రమాదం ఎందుకు వచ్చింది? మనిషి స్వార్థం వల్ల! అభివృద్ధి అనే అందమైన క్యాన్ లోంచి మనం ప్రమాదం అనే ఇంధనం తీసి ఒంటి మీద పోసుకుంటున్నాం! ఇక అది ఎప్పుడు భగ్గున అంటుకుంటుందో ఎవరికీ తెలియదు! ఒబామా, ట్రంప్ మొదలు చిన్నా చితకా ఎన్జీవోలు నడిపే ఉద్యమకారుల వరకూ అందరూ పర్యావరణం ఎంతో ముఖ్యమనే అంటారు. కాని, సంవత్సరం తిరిగే సరికల్లా మన సీఎంలు, పీఎంలు నాటిన మొక్కలు మేకల నోట్లలోకి వెళ్లిపోతాయి! భూమీ మీది పచ్చదనం గతం కంటే ఇంకింత కుంచించుకుపోతుంది!   1880 నుంచీ 2013వ సంవత్సరం దాకా మన దేశంలో అడవులు ఎంతగా తగ్గిపోయాయో తెలుసా? 40శాతం! అడవులు వుంటేనే మనిషి బతకగలడని ఇంగితం వున్న ఎవరికైనా ఈ విషాదం ఒళ్లు గగుర్పొడిపిస్తుంది! మళ్లీ 40శాతం అడవులు భారతదేశంలో పెరగాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలి? ఊరికే మీడియా ముందు ఒక అడుగు లోతు గుంటలో మూరెడు మొక్కొక్కటి నాటేస్తే అడవులు తయారైపోతాయా? అంతే కాదు, ప్రస్తుతం భారతదేశంలో అడవుల రూపంలో వున్న భూమి 24శాతం! కనీసం 30-35 శాతం భూమి అడవులతో పచ్చగా వుండకపోతే తీవ్రమైన ప్రమాదం! కాని, వున్న 24శాతం అడవుల్ని కూడా అరగదీసే ఆలోచనలే నడుస్తున్నాయి!   అడవుల్ని రక్షించుకోవాలంటే విచ్చలవిడి అభివృద్ధి కుట్రలు మానాలి. పెరిగిన జనాభకి తగ్గట్టుగా ఉపాధి కోసం అభివృద్ధి అవసరమే కాని అది పర్యావరణాన్ని నాశనం చేసి అస్థిత్వానికే గండం తెచ్చేది కాకూడదు. అడవుల్ని తగ్గకుండా చూసుకుంటే పెరిగేలా చేయటమే అసలైన అభివృద్ధి. రోడ్లు, భవనాలు, బ్రిడ్జ్ లు, నీటి ప్రాజెక్ట్ ల కోసం అడవుల్ని తుడిచి పెట్టేయటం అభివృద్ధి కాదు! అది ఆత్మహత్య! ఈ సత్యం మనం గ్రహించాలి. మనమే కాదు ప్రపంచం మొత్తం పర్యావరణం విషయంలో శ్రీరంగ నీతులే చెబుతోంది! పాటించే దగ్గరికి వచ్చే సరికి మాత్రం అమెరికా మొదలు ఆఫ్రీకా దేశాల దాకా అన్నీ కాలుష్యానికి కాలుదువ్వుతున్నాయి. మనకున్న ఒకే ఒక్క భూమండలాన్ని మాడిపోతోన్న పెనంలా మార్చేస్తున్నాం!   పచ్చదనాన్ని కాపాడే ప్రయత్నాలు నిజంగా చేయదలిస్తే ముందు ఏం చేయాలి? అడ్డగోలు రూల్సు పెట్టి అడవుల చుట్టుపక్కల గ్రామాల నిరుపేదల్ని ఇబ్బంది పెట్టడం కాదు. అడవిలోకి పోయి కట్టెలో, తేనో, ఆకులు, అలములో తెచ్చుకునే పూట గడవని వార్ని మన వాళ్లు జైల్లో కూడా పెడుతుంటారు! కాని, స్మగ్లింగ్ కో్సం వేల చెట్లు తెగ నరికే వార్ని పట్టుకోలేకపోతున్నామని చెబుతూ వదిలేస్తుంటారు! ఫ్యాక్టరీలు లక్షల మైళ్ల అడవుల్ని తుడిచి పెట్టేస్తుంటే మౌనం వహిస్తారు! ఇవన్నీ అసలు సమస్యలు!   పర్యావరణాన్ని మనం సరైన సమయంలో కాపాడుకోకపోతే… తరువాత అది తెచ్చే ప్రళయం నుంచీ మనల్ని కూడా ఎవరూ కాపాడలేరు. ఈ సత్యం గ్రహించి ఒకప్పటిలా మనం ప్రతీ చెట్టునీ, పుట్టనీ దైవంగా భావించి ఆరాధించాలి. పచ్చ నోట్ల కంటే పచ్చదనం ఎంతో ముఖ్యమని అర్థం చేసుకుని తరువాతి తరాలకి భూమిని అత్యంత భద్రంగా అప్పజెప్పాలి!

బిచ్చగాడు సినిమానే తలదన్నే రియల్‌ స్టోరీ... విజయనగరంలో రియల్‌ బిచ్చగాడు

  అనారోగ్యంతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోన్న తల్లిని బతికించుకునేందుకు భిక్షగాడుగా మారతాడు బిలీనియర్‌.... ఇది సూపర్‌ డూపర్‌ హిట్టయిన బిచ్చగాడు సినిమా కథ‌... బిచ్చగాళ్ల అంతరంగాన్ని ఆవిష్కరించిన ఈ సినిమా.... ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటే.... విజయనగరం జిల్లాలో రియల్‌ బిచ్చగాడు తన దాతృత్వంతో.... ప్రజల మనసులను గెలుచుకుంటున్నాడు. సమాజానికి కొంతైనా తిరిగి ఇచ్చేయాలన్న శ్రీమంతుడు మూవీ థియరీని మనసావాచా పాటిస్తున్నాడు విజయనగరంలో ఓ భిక్షగాడు.   విజయనగరం జిల్లా చీపురుపల్లిలో శ్రీఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయం దగ్గర 20ఏళ్లుగా భిక్షాటన చేస్తోన్న చేబోలు కామరాజు... అక్కడే చిన్న గుడారం వేసుకుని బతుకుతున్నాడు. భక్తులు ఇచ్చిన దాంట్లో ఒక్కో రూపాయి దాచుకుని... బ్యాంక్ బాలెన్స్ మెయింటైన్ చేస్తున్న ఈ బిచ్చగాడు... తనకు భిక్షమేసిన భక్తుల మేలు కోసం తిరిగి లక్ష రూపాయలు విరాళమిచ్చి తన పెద్ద మనసు చాటుకున్నాడు. గుడికి వచ్చే భక్తులు... ఎండలో నిలబడుతూ ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన ఆలయ కమిటీ... షెల్టర్లు, షెడ్లు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. ఆ విషయాన్ని తెలుసుకున్న బిచ్చగాడు కామరాజు.... తాను దాచుకున్న డబ్బులో నుంచి లక్షా 20వేల రూపాయలు విరాళమిచ్చాడు. అన్నదే తడువుగా బ్యాంకు నుంచి డబ్బు తీసుకొచ్చి ఆలయ కమిటీకి అందజేశాడు.   తనకెవరూ లేరంటున్న చేబోలు కామరాజు... ఆ దేవుడు ఇచ్చింది.... తిరిగి దేవుడికే ఇచ్చేస్తున్నా అంటున్నాడు. అంతేకాదు షెల్టర్ల నిర్మాణం పూర్తయ్యాక మరో పదివేల ఖర్చుతో భక్తులకు అన్నదానం చేస్తానంటున్నాడు. 20ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నానని, కుటుంబ సభ్యులు ఉన్నా ఎవరూ పట్టించుకోలేదని కన్నీటి పర్యంతమవుతున్నాడు. తనకు భిక్షమేసిన భక్తుల సౌకర్యం కోసం తాను దాచుకున్న డబ్బుంతా విరాళమిచ్చిన చేబోలు కామరాజును స్థానికులు అభినందిస్తున్నారు. అంతేకాదు భిక్షాటన డబ్బుతోనే ఇద్దరు పిల్లల చదువుకు ఆర్ధిక సాయం చేస్తున్నాడని.... మెచ్చుకుంటున్నారు.

కొందరు జడ్జ్‌లు.. కొన్ని కామెంట్లు.. బోలెడు షాకులు

  ప్రజాస్వామ్యంలో ఓటర్లు, ప్రజా ప్రతినిధులు, చట్ట సభలు ఎంత కీలకమో అంతే ముఖ్యం… న్యాయస్థానాలు! కోర్టులు, లాయర్లు, జడ్జీలు లేకుంటే దేశం అస్తవ్యస్తం అవుతుంది అనటంలో సందేహం లేదు. అందుకే, అయిదేళ్లకు ఒకసారి ఎన్నికలతో తారు మారు అయ్యే ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రుల కన్నా ఎక్కువ స్వేచ్ఛా, అధికారం, గౌరవం న్యాయమూర్తులు పొందుతుంటారు. వారి నిర్ణయాన్ని మీడియా కూడా ఇష్టానుసారం విమర్శించదు. తప్పుబట్టదు. అలాంటి వెసులుబాటు కూడా ఒకింత రాజ్యాంగమే కల్పించింది న్యాయ వ్యవస్థకి! కాని, ఒక్కోసారి మన జడ్జ్ లు చేసే కామెంట్స్ వింటే షాకైపోతుంటాం! ఎంతో ముఖ్యమైన స్థానంలో వుండి ఇలా మాట్లాడారేంటి అనిపిస్తుంది!   రాజస్థాన్ హైకోర్ట్ న్యాయమూర్తి మహేష్ చంద్ర  ఈ మధ్యే ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించమని కేంద్రానికి సూచించారు. అదే పెద్ద సంచలనం అయింది. కాని, ఆ క్రమంలో ఆయన మాట్లాడిన ఒక మాట మరింత కలకలం రేపింది! ఆవు కూడా నెమలి లాంటి పవిత్రమైన ప్రాణి అన్నారాయన! ఎందుకంటే… నెమలి తన జీవిత కాలంలో ఎప్పుడూ శృంగారంలో పాల్గొనదు. ఆడ నెమలి మగ నెమలి కన్నీళ్లు తాగేయటం ద్వారా గర్భం ధరిస్తుంది. ఆవు కూడా అటువంటి ఒక పవిత్రమైన జంతువు అన్నారు! అసలు నిజంగా నెమలి శృంగారం జోలికి వెళ్లని ఆజన్మ బ్రహ్మచారా? కాదంటోంది సైన్స్! పురాణాల్లో ఎందుకు అలా చెప్పారో కాని నిజంగా మాత్రం నెమళ్లు శారీరికంగా సంభోగించి మాత్రమే పిల్లల్ని కంటాయి! ఈ విషయం ఒక న్యాయమూర్తి అయిన మహేష్ చంద్రకి తెలియకపోవటమే… నిజంగా ఆశ్చర్యకరమే!   ఒక్కసారి మనం గతంలోకి తొంగి చూస్తే.. 2013లో విరేంద్ర భట్ అనే న్యాయమూర్తి మరింత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 19-24 ఏళ్ల మధ్య వున్న అమ్మాయిలు చాలా సందర్భాల్లో అబ్బాయిలతో ఇష్టపడే శృంగారంలో పాల్గొంటారనీ, తరువాత ఇంటికి తిరిగి వచ్చి పెద్దలకు భయపడి కిడ్నాప్, రేప్ అంటూ కట్టు కథలు అల్లుతారనీ ఆయన అన్నారు! ఈ విషయంలో ఆయన్ని దిల్లీ హై కోర్ట్ చీవాట్లు కూడా పెట్టింది! ఇక వీరేంద్ర భటే మరోసారి … అబ్బాయి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికితే అమ్మాయి పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొనటం తప్పు. అలా చేస్తే అది రేప్ కిందకి రాదు. అన్నీ తెలిసిన మేజర్ అయిన అమ్మాయి పెళ్లి చేసుకోకుండా శృంగారంలో పాల్గొంటే దానికి బాధ్యత కూడా ఆమెదే అంటూ తీర్పునిచ్చారు! పెళ్లికి ముందు శృంగారం ఏ మతం కూడా ఒప్పుకోదని ముక్తయింపు కూడా ఇచ్చారు!   కేరళ కోర్టుకు చెందిన జస్టిస్ బసంత్ మరింత వివాదాస్పద కామెంట్లు చేశారు ఆ మద్య! ఒక రేప్ కేసులో ఇచ్చిన తీర్పు గురించి మాట్లాడుతూ … అమ్మాయిని చైల్డ్ ప్రాస్టిట్యూషన్ కి వాడుకున్నారని ఎన్నో ఆధారాలు వున్నాయి. అంతే తప్ప రేప్ జరగలేదు అన్నారు!   ఇక మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే! భారతీయులు స్టుపిడ్స్, ఇడియట్స్ అనటం మొదలు సుప్రీమ్ కోర్టును కూడా సోషల్ మీడియాలో తిట్టిపోయటం వరకూ ఆయన చేయని గందరగోళం లేదు. మన దేశ రాష్ట్రపతిగా కత్రీనా కైఫ్ ను చేయాలని కూడా ఆయన అభిప్రాయపడ్డారు! ఎందుకంటే, ఎవరు ప్రెసిడెంట్ అయినా జనానికి చేసేది ఏం లేదు కాబట్టి… అందమైన ముఖం వున్న కత్రీనా అయితే మీడియాలో కనిపించినంత సేపూ హాయిగా వుంటుందట! ఆమె రాష్ట్రపతిగా ఎన్నికయ్యాక షీలాకీ జవానీ పాట కూడా పాడాలనీ కోరారు కట్జు! ఆయన రసికత్వాన్ని మనం ఏం అనగలం?   సుప్రీమ్ కోర్టు జడ్జులకు అయిదేళ్ల శిక్ష వేసి … తనకు వారి చేతుల్లో ఆర్నెళ్ల జైలు శిక్ష వేయించుకున్న  కోల్ కతా హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ కర్నన్ కూడా మన దేశ జడ్జ్ ల విచిత్ర వ్యవహార శైలికి నిదర్శనం! ఆయన ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానాన్నే ధిక్కరించారు! ఎందరికో శిక్షలు వేసిన ఆయన తనకు సుప్రీమ్ కోర్టు శిక్ష వేస్తే గౌరవించకుండా, తప్పించుకుని అజ్ఞాతంలో వుండిపోయారు!

సరి రాని, సరి లేని… దాసరి!

శిఖరం   ఎత్తుగా ఉంటుంది  అది అలా ఉంటేనే శిఖరమనిపించుకుంటుంది! సింహం  గర్జిస్తుంది. అది అలా   గర్జిస్తుంది కాబట్టే… సింహం అడవికి రాజయ్యేది! దర్శకరత్న అంటే  కూడా  అంతే ..  అది దాసరి  నారాయణ  రావు గారిని మనకు స్మరింపజేస్తుంది! అలా స్మరింపజేస్తుంది కనుకనే ఆ పదానికి తెలుగు సిని చరిత్రలో  అంత  విలువ! విధి  పరీక్షలు  పెడుతుంది.  అయితే  అవి  తట్టుకొని  నిలబడాలి ,  నిలబడి   విజయం  వైపు  అడుగులు వేయాలి. అలా వేసిన  ఆ మొదటి  అడుగులే..  రేపటి   రోజున    ఒక  ప్రభంజనానికి ,  ఒక  అద్భుతానికి  నాంది  పలుకుతాయి.  సరిగ్గా ..   ఉహ కూడా  తెలియని   వయసులోనే ..  దాసరి  నారాయణరావు  గారికి   ఈ జీవిత సత్యం  చాలా   స్పష్టంగా అవగతమైంది! అందుకే   ఆయన  ఆ  నాటి   నుండే  విధితో  పోరాడటం  మొదలు పెట్టారు… దాసరి  నారాయణ  రావుగారు  పుట్టింది  సంపన్న   కుటుంభం  లో అయినా .. అగ్ని  ప్రమాదం  తో  ఆస్తులన్నీ  పోవడం తో     ఉహ తెలిసే  సరికి ..  చుట్టూ  ఉన్న   కష్టాలే  ఆయనకి  స్నేహితులు  అయ్యాయి.  తండ్రి  ఇక చదివించలేను  అని చేతులు  ఎత్తేయడం  తో .. అంతక  ముందు సంవత్సరం .. ఉత్తమ  విద్యార్ధిగా  అవార్డుని    అందుకున్న   దాసరి  గారు , తరువాతి కాలంలో .. వెండితెర  పై  పసిడి  కాంతులు  వెలిగించిన   దాసరి గారు ..  బాల్యంలో    మాత్రం  ఒక  వడ్రంగి  వద్ద కూలీగా  చేరవలిసి వచ్చింది. విద్యార్థి దాసరి చదువుకి పేదరికం కట్ చెప్పినా.. ఆయన తన  మాస్టారు , తోటి  స్నేహితుల  సహాయంతో బడి అనే షాట్ ని కంటిన్యూ చేశారు! చదువును ఏనాడూ  నిర్లక్ష్యం  చేయలేదు. అయితే అలానే  చదువు దగ్గరే  ఆగిపోలేదు కూడా! నాటకాలు వేస్తూ భవిష్యత్ సినిమా రంగ విజయ యాత్రకి మానసికంగా సంసిద్ధులు అవుతూ వచ్చారు! కొద్దికాలం హైదరాబాద్ లో ఓ ప్రైవేటు ఉద్యోగం చేశారు. కాని, కాలం ఆయన్ని చెన్నై తీరానికి తీసుకెళ్లింది! ఆనాటి మద్రాసులో మాటల రచయితగా జీవితాన్ని ప్రారంభించి కొన్ని సినిమాలకు ఘోస్ట్ రచయితగా, దర్శకుడిగా పని చేశారు. దాసరి లోని ప్రతిభను గుర్తించిన ప్రముఖ నిర్మాత కె. రాఘవ  గారు   1972లో తాతా మనవడు సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం చేశారు.అలా... ఎలాంటి  స్టార్   హీరోలు  లేకుండానే  ఆయన   తీసిన   మొదటి  సినిమా...    ఆ రోజుల్లో సూపర్ హిట్ గా నిలిచింది . ఆ  మరుసటి  ఏడాది .. దాసరి  తెరకెక్కించిన  సంసారం  సాగరం  కూడా    మంచి   విజయం సాధించడం తో ..  దాసరి  గారి పేరు పరిశ్రమలో మారు మొగిపోయింది . పరిశ్రమలోకి  వచ్చి రావడం తోనే.. రెండు  సూపర్  హిట్స్ .... ఎక్కడ  చూసిన   ప్రేక్షకుల  నీరాజనాలు ..  తమ తో సినిమా చేయమని  తన చుట్టూ  తిరిగే  నిర్మాతల  ప్రదక్షణలు .. ఇలా  ఒక్కసారిగా  వచ్చి  పడిన  అవకాశాలతో ..  దాసరి గారు  మాత్రం  ఎక్కడ  రాంగ్  స్టెప్  వేయలేదు.  తనకి   అంది వచ్చిన  అన్ని అవకాశాలని  ఒడిసి  పట్టుకుంటూనే నిర్మాతలు తన పై పెట్టుకున్న  నమ్మకాన్ని  నిలబెట్టుకోగాలిగారు . 1975 లో   దాసరి  గారి  దర్శకత్వంలో  తెరకెక్కిన   స్వర్గం , నరకం  చిత్రం ..  దాసరి నారాయణ  రావు  లోని .. పూర్తి దర్శకుడిని ..  ప్రేక్షకులకి  పరిచయం చేసింది  అని  చెప్పవచ్చు .  అప్పట్లో  సిల్వర్  జూబ్లి   పూర్తి చేసుకున్న  ఆ   చిత్రం ద్వారా  నే ..  కలక్షన్  కింగ్   మోహన్  బాబు    సినీ  పరిశ్రమకి  పరిచయం  అవ్వడం విశేషం . శోభన్ బాబు , శారద  ల  కాంబినేషన్   లో  దాసరి గారు తెరకెక్కించిన  బలిపీఠo... అప్పటి  వరకు స్టార్   హీరోగా   నిలదొక్కుకోవడానికి  ప్రయత్నిస్తున్న ..  శోభన్ బాబుకి ...  సరి కొత్త  క్రేజ్  ని  తీసుకొచ్చింది . అప్పట్లో ఆ సినిమా .. విజయవాడ , గుంటూరు  వంటి  సెంటర్స్  లో 100  రోజుల  పాటు ప్రదర్శించబడి ..  దాసరి  దర్శకత్వ  ప్రతిభకి .. నిదర్శనంగా  నిలిచింది . ఇక ఈ చిత్ర విజయం  తో .. నందమూరి  తారక రామారావు  గారితో .. సినిమా చేసే  అవకశాన్ని దక్కించుకున్న  ఆయన .. 1976 లో  వచ్చిన  మనుషులంతా  ఒక్కటే  చిత్రన్ని   తెరకెక్కించి .. అన్నగారితో .. తన ప్రయాణాన్ని .. ఘనంగా  మొదలు  పెట్టారు . కటకటాల  రుద్రయ్యా , శివ రంజని  వంటి సినిమాలని  తెరకెక్కించిన  దాసరి  1978 లో ..  స్వర్గం నరకం  సినిమాని .. హిందీ  పరిశ్రమలో .. రీమేక్ చేసి .. అక్కడ కూడా  తన సత్తా  ని  నిరూపించుకోవడం  విశేషం . అలా అప్పట్లో ....  ఒక తెలుగు దర్శకుడు .. పరాయి  బాషలో కూడా  తనని  తాను నిరూపించుకోవడం  చాలా  అరుదైన   విషయమే! ఇక గోరింటాకు  చిత్రం .. అప్పటి మహిళా  ప్రేక్షక  లోకాన్ని .. ఎంతగా  అలరించిందో ..  విడమరిచి   చెప్పనవసరం  లేదు కొన్ని  దశాబ్దాల  పాటు తెలుగు సినీ  పరిశ్రమని ..  తన అందం  తో  మంత్ర  ముగ్ధులను చేసిన  సావిత్రి  గారికి ..  అదే చివరి సినిమా కూడా! ప్రతి  కళాకారుడికి .. ఒక దశలో  ఉచ్చ  స్థితి  నడవడం  చాల  సాదారణమైన  విషయమే .అలా  దాసరి  గారికి మరుపురాని .. మరువలేని విజయాలు  దక్కింది  మాత్రం .. 80 వ  దశకంలో  అని  చెప్పవచ్చు .  ఆ  పదేళ్ళలో  ఆయన ..  తెలుగు సినీ  ప్రపంచంలో  ఎవరికీ  అందనంత  ఎత్తుకి  ఎదిగారు.    అయితే  అది ఒక్క దర్శకునిగా  మాత్రమే  కాదు ..  మంచి  వ్యక్తిగా  కూడా! 1980  లో  దాసరి ,  ఎన్టీఆర్  కాంబినేషన్  లో వచ్చిన   సర్దార్  పాపారాయుడు ..  అప్పటి  తెలుగు సినిమా  రికార్డుల  పై గర్జించింది  అని  చెప్పవచ్చు .  అప్పటి వరకు  అన్నగారి లో   .. అలాంటి నటన  చూడని  తెలుగు ప్రేక్షక  లోకం  ఆ సినిమాతో ..  అన్నగారి  ని  ఎంతలా  ఆరాధించారొ ,  ఆ   సినిమాని  తమకి  అందించిన  దాసరి గారిని   కూడా  అంతే  అభిమానించారు. ఇక దాసరి ..  ఏఎన్ఆర్ ల  కాంబినేషన్  లో వచ్చిన చారిత్రాత్మక చిత్రం ..  ప్రేమాభిషేకం! ఇప్పటికీ  ఆ చిత్రంలోని  ప్రతి మాట , ప్రతి పాట అజరామరం! అంతే కాదు… మేఘసందేశం సినిమాతో ..  దాసరి  అంటే  ఒక్క కమర్షియల్  చిత్రాలనే కాదు  అవసరమైతే ..  మనషుల  హృదయాలను  కదిలింప చేసే  కళాఖండాలను  కూడా  తెరకెక్కించగలడు  అని నిరుపిచుకున్నారు .  మరో వైపు… నాగార్జున తో  తెరకెక్కించిన  మజ్ను ,  వెంకటేష్  తో  తెరకేక్కించిన  బ్రహ్మ పుత్రుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల బంపర్ హిట్ దర్శకుడు తరువాతి తరానికి చేరువవ్వటం మనకు సూచిస్తాయి! 80 లలో  గొప్ప దర్శకునిగా  పేరు తెచ్చుకున్న .. ఈ దిగ్దర్శకుడు ...  90  లలో ..  మాత్రం   తనలోని  పూర్తి స్థాయి నటుడిని  బయటకి  తీసే  ప్రయత్నం చేశాడనిపిస్తుంది! అందులో బాగంగానే  అయన నటించి  మెప్పించిన ..  సూరిగాడు , మామగారు  వంటి చిత్రాలు..  ఈ నాటికి ..  ప్రేక్షక  హృదయాలలో  పదిలమైన  స్థానాన్ని ఏర్పరుచు కోగాలిగాయి. ఇక  ఆ తరువాతి కాలంలో ..  అయన  తెరకెక్కించిన  ఒరేయ్  రిక్షా ,  ఒసేయ్  రాములమ్మా , సమ్మక్క , సారక్క  వంటి  పలు విప్లవాత్మక  చిత్రాలను .. ఏ  అవార్డులతో  కొలవగలం  చెప్పండి? దాసరి రాజకీయాలలోనూ  తన ప్రస్థానాన్ని  కొనసాగించారు సినీ ప్రయాణానికి ధీటుగా! 1990 దశకం చివరిలో ఆయన తెలుగు తల్లి పార్టీని ప్రారంభించారు. కాని, అనివార్య కారణాల వల్ల కాంగ్రేస్ పార్టీలో చేరిన ఆయన రాజ్యసభ కు ఎన్నిక అయ్యారు. మన్మోహన్ క్యాబినేట్లో కేంద్రమంత్రిగా కూడా వ్యవహరించారు. 2001 నుండి .. 2003   వరకు ..  సినిమాలను  తీయడం ,  సినిమాలలో  నటించడం  చాలా వరకు  తగ్గించేసిన  దాసరి గారు ఆ తరువాత  5  ఏళ్ళ  పాటు .. పూర్తిగా సినిమాలకి దూరమయ్యారు .  రాత్రికి  రాత్రి తలరాతలు  మారిపోయే .. సినీ పరిశ్రమలో  5ఏళ్లు చాలా  ఎక్కువ . అయితే ఇంత గ్యాప్ తరువాత  కూడా  అయన  మేస్త్రి  సినిమా తో అవార్డ్  విన్నింగ్ ఫర్ఫార్మెన్స్ ప్రదర్శించి మెప్పించారు! 5  దశాబ్దాల   ప్రయాణంలో ...  పోటీ  అనే  మాటే ఎరుగరు అంటే ..  సరిలేని దాసరి మహాప్రస్థానం  ఏ విధంగా  సాగిందో అర్ధం చేసుకోవచ్చు . అయితే ఈ మొత్తం  ప్రయాణంలో  ఆయన ఏనాడైనా  సినిమాలకి   దూరం  అయ్యారు  ఏమో కాని ... సినీ పరిశ్రమకి  మాత్రం  దూరం  కాలేదు.  అందుకే  పరిశ్రమలో  ఎవరికీ , ఎప్పుడు , ఎలాంటి కష్టం  వచ్చినా .. ఆ సమస్య పరిష్కారం  దొరికేది మాత్రం .. దాసరి నారాయణ రావు గారి  దగ్గరే . కాబట్టే, ఆయనకు వచ్చిన పెద్ద పెద్ద హిట్స్ అన్నిటికంటే పెద్ద గౌరవమైన ఇండస్ట్రీ పెద్ద దిక్కు అనే బిరుదు దక్కింది! 1974లో వచ్చిన అయన  మొదటి  సినిమా   తాతా మనవడుకే నంది అవార్డు అందుకున్న దాసరి  గారు ..  ఆ తరువాత స్వర్గం నరకం సినిమాకు ఉత్తమ చిత్రం గా బంగారు నంది బహుమతిని పొందారు. ఇక  1983  లో   ఎంతో  కసితో   తెరకెక్కించిన  మేఘ సందేశం చిత్రానికి గాను  దాసరి  గారు మరో సారి  ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును పొందారు. అయితే  అయన అవార్డుల పరంపర  ఒక్క దర్శకునిగానే  కాక .. నటుడుగా  కూడా   కొనసాగటం  విశేషం . అందులో బాగంగానే   మామగారు చిత్రానికి గాను,  సూరిగాడు  చిత్రానికి  గాను ,  మేస్త్రి  సినిమాకి  గాను ,  ఉత్తమ నటుడు గా నంది అవార్డులు అందుకున్నారు. 2000 వ  సంవత్సరం  లో వచ్చిన  కంటే  కూతుర్నే  కను  చిత్రానికి   గాను  నటుడిగా జాతీయ స్థాయిలో  స్పెషల్  జ్యూరి  అవార్డ్ ని   అందుకోవడం మరో విశేషం . 1986లో ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ ను కూడా పొందారు! దానితో  పాటు  ప్రముఖ సామాజిక సేవా సంస్థల నుండి అనేక అవార్డ్ లను పొందారు. ఫిల్మ్ ఫేర్ అవార్డును 6 సార్లు, మద్రాసు ఫిల్మ్ ఫాన్స్ అవార్డ్ ను 5 సార్లు, సినీ హెరాల్డ్ అవార్డ్ ను 10 సంవత్సరాలు వరసగాను గెల్చుకున్నారు. ఇక వీటితో పాటు ,, ఒక దర్శకునిగా .. అత్యధిక  చిత్రాలను  తెరకెక్కించడం  తో  లిమ్కా వరల్డ్  రికార్డ్  లో  స్థానం సంపాదించిన ఆయన ..  తెలుగు కళామ తల్లికి ..  ముద్దు  బిడ్డ  అనడంలో  ఆశర్యమేముంటుంది! అయితే  ఇన్ని  అవార్డులని  ఇన్ని రివార్డులని  అందుకున్న  దాసరి  గారు   మాత్రం ..  ప్రజలు  కొట్టే  చప్పట్లే   నిజమైన .. అవార్డులు  గా ,  వారి ప్రశంశలే .. నిజమైన  రివార్డులుగా    భావించారు! కనుకే  ఆయన   ఏ  ఒక్క తరానికో పరిమితం  కాని  దర్శకరత్న  గా మెరవగలిగారు!

ఇండియాలోని బ్రిడ్జ్ చూసి… చైనా ఎందుకు చిటపటలాడుతోంది?

  భారతదేశంలో యుద్ధమైనా, క్రికెట్ అయినా మనకు వెంటనే గుర్తొచ్చేది పాక్! కాని, అవసరం వస్తే, అవకాశం దొరికితే మనతో ఓ ఆటాడుకోవాలని చూసే దొంగ దేశం… చైనా. మనకి నిజమైన , సత్తా కలిగిన శత్రువు డ్రాగనే! ఈ విషయం చాలా సందర్భాల్లో ఇండియన్స్ మరిచిపోతుంటారు. విచారకరంగా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ భారత దేశాన్ని ఏలిన వారు కూడా చైనా విషయంలో అజాగ్రత్తగానే వ్యవహరించారు. ఇప్పటి వరకూ ఇండియా ఓడిన ఒకే ఒక్క యుద్ధం చైనాతో చేసిందే. నెహ్రు కాలంలో మనం చైనా చేతిలో ఓడిపోయిన కొంత భూభాగం కూడా ఎర్ర దేశానికి వదులుకోవాల్సి వచ్చింది. అయితే, ఇప్పటికీ చైనా పెట్టే పేచీలు తగ్గటం లేదు. రోజు రోజుకి పెరుగుతున్నాయి.   పాక్ కాశ్మీర్ విషయంలో భారత్ ను బేజారు పరుస్తుంటే… చైనా చీటికీ మాటికి అరుణాచల్ విషయంలో కిరికిరి పెడుతుంటుంది. అక్కడ ఎన్నికలు జరిగి మన ముఖ్యమంత్రి పాలన చేస్తున్నా సరే … ఆ ప్రాంతం తనదేనంటుంది మూర్ఖపు చైనా. తాజాగా అలాంటి వితండ వాదం మరోసారి చేసింది. ఈ మధ్యే ప్రధాని మోదీ అసోమ్ లో బ్రహ్మపుత్ర నదిపై దేశంలోనే అతిపొడవైన వంతెన ప్రారంభించారు. ఈ 9.2కిలో మీటర్ల సుదీర్థ వంతెన అసోమ్ రాష్ట్రాన్ని అరుణాచల్ ప్రదేశ్ తో కలుపుతుంది! కేవలం 9కిలో మీటర్ల వంతెనతో జనాలకి 165కిలో మీటర్ల ప్రయాణం చేసే శ్రమ తప్పింది!   అవసరమైతే అరుణాచల్ పైన దండెత్తాలని కుట్రపూరిత ఆలోచనలు చేస్తోన్న చైనా ఆ ప్రాంతం మిగతా భారతదేశేంతో మమేకం అవటం సహించలేకపోతోంది. అందుకే, వంతెన ద్వారా అసోమ్ తో అరుణాచల్ ను కలపటం డ్రాగన్ కు అసహనం కలిగించింది. చైనా సరిహద్దు వెంట అరుణాచల్ లాంటి రాష్ట్రాల్లో భారత్ చేపట్టే నిర్మాణల విషయంలో సంయమనం పాటించాలని హెచ్చరికలు చేస్తోంది. మన దేశంలో మనం చేపట్టే అభివృద్ధి పనులకి బీజింగ్ పర్మిషన్ దేనికి? చైనా మనతోనే కాక వియత్నాం, జపాన్ లాంటి దేశాలతో కూడా ఇదే విధమైన దాదాగిరి చేస్తుంటుంది!   విదేశాంగ విధానం పై తొలి నుంచీ దృష్టి పెట్టిన మోదీ చైనాను కూడా పాక్ లాగే కట్టడి చేసే ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. ఎందుకంటే, ఇప్పటికే గత పాలకుల అలసత్వం,అలక్ష్యం వల్ల చైనా నిరంతరాయంగా చిరాకు పెడుతూనే వుంది. ఇక మీదట అలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద వుంది.

బీజేపీ జగన్‌ను స్టాండ్ బైలో ఉంచిందా..?

అధికారంలోకి వచ్చిననాటి నుంచి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను ఒకదాని వెంట మరొక దానిలో పాగా వేస్తూ సగం దేశాన్ని గుప్పిట్లో పెట్టుకున్న బీజేపీకి దక్షిణ భారతదేశం కొరకరాని కొయ్యగా తయారైంది. నార్త్‌లో ఉండేవి రెండే పార్టీలు..కానీ సౌత్‌లో ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎక్కువ. వాటి సహకారం లేకుండా అధికారంలోకి రావడమన్న మాట కల్ల. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు జాతీయ పార్టీలకు అనుకూలంగా మారుతున్నాయి. జయ మరణం తర్వాత తమిళనాడులో జరిగిన నాటకీయ పరిణామాలు బీజేపీకి కలిసొచ్చాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో టీడీపీ బలంగా ఉన్నాయి. తెలంగాణతో పోల్చి చూస్తే, ఏపీలో బీజేపీకి అంత సీన్ లేదు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి ఎలాగైనా బలపడాలనీ చూస్తోంది కమలం. అందుకే గత కొద్ది రోజులుగా ఎత్తుల మీద ఎత్తులు వేస్తోంది. జగన్‌కు ఉన్నట్లుండి మోడీ అపాయింట్‌మెంట్ రావడం, అమిత్ షా పర్యటన ఇవన్నీ బీజేపీ మార్క్ వ్యూహాలుగా చెప్పుకోవాలి.    గత ఎన్నికల్లో 10 అసెంబ్లీ స్థానాలతో పాటు 3 ఎంపీ స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 2 ఎంపీ స్థానాలను దక్కించుకుంది. కేంద్ర., రాష్ట్రాలలో బీజేపీ-టీడీపీ ప్రభుత్వాల సంకీర్ణం కొనసాగుతోంది. అయితే గత కొద్ది రోజులుగా టీడీపీ-బీజేపీ మధ్య దూరం పెరుగుతోంది. బాబును వదులుకుంటే అసలుకే మోసం వస్తుందని కమలదళానికీ తెలుసు. అందుకే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని తెలుగుదేశానికి హ్యాండ్ ఇవ్వాలని బీజేపీ అగ్రనేతల ప్లాన్. ఇలాంటి టైంలో బీజేపీకి కలిసివచ్చే అంశం జగన్. ఏపీలో చంద్రబాబుకు, టీడీపీకి సరైన ప్రత్యామ్నాయంగా మారింది వైఎస్సార్‌సీపీ. 2014లో అధికారం చేజారినా 2019లో ఎలాగైనా కొట్టాలనే కసితో జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. కానీ ఆయన్ను కేసుల భయం వెంటాడుతోంది. కాంగ్రెస్‌తో ఉన్న విభేదాల వల్ల జగన్‌ ఆ పార్టీతో జట్టు కట్టే పరిస్థితులు లేకపోవడంతో వైసీపీని తమ గుప్పెట్లో ఉంచుకోవడమే మేలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు.   జగన్‌ మీద ఉన్న కేసులను సాకుగా చూపి అతనిపై బీజేపీ ఒత్తిడి చేయొచ్చని అంచనా వేస్తున్నారు. జగన్‌ తమ దారికి వచ్చినా రాకపోయినా అతనిని స్టాండ్‌బైలో ఉంచుకోవడం మాత్రం బీజేపీకి అనివార్యంగా కనిపిస్తోంది. 2019 నాటికి దేశవ్యాప్తంగా బీజేపీ బలపడినా., బలహీనపడినా ముందస్తు పరిణామాలకు సిద్ధపడి రాజకీయాలు చేయాలని మోదీ-షా ద్వయం భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అవసరమైన మెజార్టీ దక్కకపోతే వైసీపీ వంటి పార్టీలను కలుపుకుపోవాలని భావిస్తోంది. ఇక చంద్రబాబు ఎప్పటికీ బీజేపీ గుప్పెట్లోనే ఉండిపోయేలా చక్రబంధం చేసేశారు.    వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి సంస్థాగతంగా బలపడాలని భావిస్తోన్న బీజేపీ ఏపీలో తమ వాటా పెంచుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం ఎమ్మెల్యే., ఎంపీ స్థానాలను భారీగా డిమాండ్‌ చేయనుంది. పాత మిత్రుడు చంద్రబాబుతో దోస్తీ చేస్తూనే వైసీపీతో స్నేహగీతం పాడాలనే ద్విముఖ వ్యూహాన్ని మోడీ-షా ద్వయం అమలు చేయనుంది. తద్వారా ఆనాటికి ఎవరు అధికారంలోకి వస్తారనుకుంటే వారితో అంటకాగడానికి బీజేపీ సిద్దంగా ఉందన్న మాట. మరోవైపు కావూరి సాంబశివరావు., పురంధేశ్వరి., కన్నా లక్ష్మీనారాయణ వంటి సీనియర్లు ఇప్పటికే బీజేపీలో ఉన్నారు. వీరంతా గతంలో కేంద్ర మంత్రులుగా పనిచేసి టీడీపీలో చేరలేక బీజేపీలో చేరారు. వచ్చే ఎన్నికల నాటికి వారందరికి తగిన రాజకీయ భవిష్యత్తును చూపాల్సిన బాధ్యత బీజేపీపై ఉంది.

పశువుల విషయంలో పంతం నెగ్గించుకుంటున్న కాషాయదళం!

  మోదీ సర్కార్ కు మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ త్రీ ఇయర్స్ లో నమో తరువాత అంతగా చర్చింపబడ్డది మరెవరైనా వున్నారంటే… అది గోమాతే! ఆవు రాజకీయాలు ఇటు అధికార పక్షం వారూ, అటు ప్రతిపక్షం వారూ అందరూ జోరుగా చేసేస్తున్నారు. తాజాగా మోదీ గవర్నమెంట్ మూడేళ్లు పూర్తి చేసుకున్న శుభతరుణంలో పశువుల అమ్మకాలు, కొనుగోళ్లని నియంత్రిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నేరుగా పశు వధ నిషేధం అనకున్నా దీని అంతిమ లక్ష్యం గోవధని అరికట్టడమే!   గోవు హిందువులకి పవిత్రం. ఆ గోమాతను పూజించే హిందువులే ఇంకా భారతదేశంలో ఇప్పటికీ మెజార్టీ ప్రజలుగా వున్నారు. వారికి ఎప్పట్నుంచో బేజీపి ఇస్తూ వస్తోన్న హామీ గోవధ జరగకుండా చూడటం! కాని, గోవు అనగానే ఒంటి కాలు మీద లేచే వర్గం కూడా ఒకటి వుంది మన దేశంలో. ఆవు మాంసం తినే దళితులు, ముస్లిమ్, క్రిస్టియన్ మైనార్టీలు ఎలాగూ వ్యతిరేకిస్తారు… కాని, వారికంటే ఉధృతంగా, ఉక్రోశంగా గోవధని వ్యతిరేకిస్తారు మన దేశంలో సెక్యులర్ రాజకీయ నాయకులు. అలాగే, ఆదర్శవాదులుగా గుర్తింపు పొందిన మేధావులు, ఉద్యమకారులు కూడా ఆవు అనగానే ఆస్త్రశస్త్రాలు తీసి వాదోపవాదాల్లో దిగిపోతారు! ఇదే ఇప్పుడు ఆవు కథకి మూలమై కూర్చుంది! ఎవ్వరూ వెనక్కి తగ్గని పరిస్థితి…   బీజేపీ స్వంత మెజార్టీతో ఒక స్వయం సేవకుడైన మోదీ పీఎం అవ్వటంతోనే సెక్యులర్ రాజకీయ పక్షాలు ప్రతీ చిన్న హిందూ అంశాన్ని బూతద్దంలో చూడటం మొదులు పెట్టాయి. ఆ క్రమంలోనే యూపీలో దాద్రి సంఘటన పెద్ద కలకలం రేపింది. బీఫ్ తిన్నాడని ఒక ముస్లిమ్ ని ఊరి ప్రజలు దాడి చేసి చంపేశారు. దీన్ని శాంతి, భద్రతల సమస్యగానో, అప్పటి ఉత్తర్ ప్రదేశ్ సీఎం అఖిలేష్ వైఫల్యంగానో చూడకుండా అంతా కలిసి మోదీ మీదకి ఎక్కుపెట్టారు. దాద్రి తరువాత జరిగిన బీహార్ ఎన్నికల్లో కాషాయదళం ఓడిపోవటం కూడా బీఫ్ పాలిటిక్స్ పట్ల ప్రతిపక్షాల నమ్మకాన్ని పెంచాయి. కాని, మొన్న జరిగిన యూపీ ఎన్నికల్లో బీజేపి బంపర్ సక్సెస్ అదంతా తప్పని తేల్చేసింది. మీడియా, మేదావులు, పార్టీలు బీఫ్ గురించి ఎంత మాట్లాడినా జనం మోదీ, అమిత్ షాల కాషాయదళాన్నే నెత్తిన పెట్టుకున్నారు! ఆ విజయమే ఇప్పుడు ప్రధాని చేత సైలెంట్ గా పశు వధ నిషేధం నిర్ణయం చేయించింది!   సర్జికల్ స్ట్రైక్స్, డీమానిటైజేషన్ లాంటి పెద్ద పెద్ద నిర్ణయాలే సీక్రెట్ గా చేయగలిగిన మోదీ ఈ గోవధ నిషేధం నిర్ణయం కూడా ఎవ్వరికీ లీకులు ఇవ్వకుండానే చేసేశారు. పర్యావరణ శాఖ చేత గెజిట్ రిలీజ్ చేయించి ఆవుల అక్రమ దందాలన్నిటికి చెక్ పెట్టారు. అమల్లో ఎంత వరకూ గోవుల వధ తగ్గుతుందో ఇప్పుడే చెప్పలేం. కాని, ఈ నిర్ణయం మాత్రం… రాష్ట్రపతి ఎన్నికల హడావిడిలో వున్న ప్రతిపక్షాలకి పెద్ద షాక్! అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా చాలా పార్టీలు నిర్ణయించుకోలేకపోయాయి. మీడియాలో ఎప్పటిలాగే దళితుల పక్షానా, మైనార్టీల పక్షాన నిలిచే వారొచ్చి కొంత వరకూ వాదించినా… పశువుల విక్రయాల నియంత్రణకి పెద్దగా రాజకీయ నిరసన ఎదురు కాలేదు! బహుశా దీనికి మూలం యూపీలో కబేళాల మూసివేతతో యోగి ఆదిత్యనాథ్ చేసిన ప్రయోగమే కారణం అనుకుంటా. రాత్రికి రాత్రి ఆయన కబేళాలు మూసివేయిస్తే మీడియా, పార్టీలు ఎంత అల్లరి చేసినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు మోదీ సర్కార్ కూడా దేశ వ్యాప్తంగా పశువుల అమ్మకాల విషయంలో వెనక్కి తగ్గే సూచనలు కనిపించటం లేదు.   గోవధ నిషేధాన్ని వ్యతిరేకించే వారి వాదనలో నిజానికి న్యాయం వుంది. ప్రజాస్వామ్యంలో ఒకరి ఆహారపు అలవాట్లని ప్రభుత్వం నియంత్రించరాదు. కాని, అదే సమయంలో వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తోన్న మూర్ఖపు పోరు సత్ఫలితాల్ని ఇవ్వలేకపోతోంది. కేవలం ఆరెస్సెస్ , బీజేపిలే కాదు భారతదేశంలో కోట్లాది మంది గోవధని వ్యతిరేకిస్తారు. అందుకే జనం మద్దతు తమకు వుంటుందన్న ధీమాతోనే మోదీ సర్కార్ ముందడుగు వేసింది. ఒక విధంగా రైతులకి ఈ తాజా నిర్ణయం ఇబ్బంది కలిగించినా అత్యధిక జనం మత విశ్వాసాలు గౌరవించబడతాయి. ఈ కోణంలో గోవధ నిధేధాన్ని ఖండించే వారు ఆలోచించలేకపోతున్నారు. గోవధ నిషేధం వల్ల వచ్చే నష్టాల్ని ప్రభుత్వం ఎలా పూడుస్తుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్న డిబేట్ కాకుండా… ఆవుల్ని చంపి తిననివ్వాల్సిందే అనే మంకు పట్టు పడుతున్నారు.   ఇప్పటికైనా గోవధ చుట్టూ చర్చని జరపటం కాకుండా… గోవధ నిషేధం వల్ల వచ్చే కష్ట, నష్టాల్ని అందరూ చర్చిస్తే బావుంటుంది. ఇటు కబేళాలకు అమ్ముకునే రైతుల ఇబ్బంది ఏంటి పరిష్కారం? అటు గో మాంసం తినటం అలవాటుగా వున్న వర్గాల వారికి ఎదురయ్యే ఇబ్బందులకి ఏంటి పరిష్కారం? చర్చించాల్సి వుంది. అలా కాకుండా గో మాంసాన్ని కేవలం సెక్యులర్ రాజకీయాలకు సింబల్ గా వాడుకుంటే… గోమాతని కాషాయ వర్గం కూడా తమ రాజకీయ ప్రయోజనాలకి ఉపయోగించుకుంటుంది!