నితీష్… నీతిమంతుడుగా కనిపించటమే ఆయన ‘వ్యూహం’!

  దశాబ్దాల పాటూ ముఖ్యమంత్రులుగా కొనసాగిన వారు కూడా తమ జీవితంలో ఆరు సార్లు ప్రమాణ స్వీకారం చేయకపోవచ్చు! కానీ, నితీష్ చేశాడు! ఒకే ఒక్క బీహార్ రాష్ట్రానికి ఆయన గత 17ఏళ్లలో ఆరు సార్లు సీఎం అయ్యాడు! తనకు కష్టం వచ్చినా రాజీనామా చేస్తాడు, ఇష్టం లేకపోయినా రాజీనామా చేస్తాడు… అసలు సిసలు భారతీయ లౌకిక రాజకీయ నేత అంటే ఏంటో తేల్చి చూపిస్తాడు! ఇదీ నితీష్ వ్యవహారం!   రెండేళ్ల కింద మహాఘట్భందన్ పేర నితీష్ బీజేపిని అధికారానికి దూరంగా వుంచినప్పుడు దేశంలో ఎవరెవరు సంతోషించారో… గాల్లో తేలిపోయారో… వారంతా ఇప్పుడు లోలోన కాలిపోతున్నారు! కాని, బీహార్ ఎన్నికల ఫలితాల సమయంలో నిలువునా కూలిపోయిన కమలం అభిమానులు ఇప్పుడు ఎగిరి గంతులేస్తున్నారు! కాని, ఆశ్చర్యం ఏంటంటే… అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ నితీష్ కే లాభం! ఆయన సీఎం పదవి పదిలం! బద్ధ శ్రతువులైన బీజేపి, కాంగ్రెస్ లతో సహా ఆర్జేడీ లాంటి ఆజన్మ శత్రువును కూడా ఆయన తన రాజకీయంలో భాగంగా ఇష్టానుసారం వాడుకున్నాడు! అంతే కాదు, మోదీని వ్యతిరేకించే పొలిటీషన్స్ కాకుండా ఇతర మేధావులు, రచయితలు, కవులు, ఆఖరుకు మీడియా, బాలీవుడ్ వారు కూడా నితీష్ లో భవిష్యత్ ప్రధానిని చూశారు! ఇప్పుడు… అందరికీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది! ఇది ఖచ్చితంగా నితీస్ రాజకీయ చాణక్యమే!   అసలు పోయిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ లాలూతో కలవటమే పెద్ద అనుమానాస్పద పరిణామం! ఎందుకంటే, పాట్నా రాజకీయాల్లో బీజేపి, కాంగ్రెస్ పెద్ద ప్రధానం కాదు. ప్రాంతాయ పార్టీలైన లాలూ ఆర్జేడీ, నితీష్ జేడీయూనే కీలకం. ఆ రెండు పార్టీలే బీహార్ ను ఏలుతూ వస్తున్నాయి.   హస్తం, కమలం ఎప్పుడూ భాగస్వామ్య పక్షాలే! అయినా కూడా నితీష్ అన్ని రూల్సు బ్రేక్ చేసి లాలూతో అంటకాగాడు. తాత్కాలికంగా లబ్ధి పొంది సీఎం అయ్యాడు. కాని, మద్యసాన నిషేధం అనే నితీష్, మద్యం వ్యాపారం చేసే వారి అండతోనే పార్టీ నడిపే లాలూ ఇంత కాలం కలిసి వుండటం కూడా ఆశ్చర్యమే! చివరకు, యాదవ యువరాజు తేజస్వీ అవినీతి కారణంతో రోడ్డున పడింది గట్భంధన్! బంధం అవినీతి కత్తి పీట మీద అడ్డంగా తెగిపోయింది! తేజస్వీ, లాలూల అవినీతి, మొండితనం నితీష్ పద్మవ్యూహం నుంచి బయటపడే పుష్కలమైన అవకాశం ఇచ్చింది!   ఇప్పటికిప్పుడు బీహార్లో అసెంబ్లీ ఎన్నికలకి వెళితే బీజేపి ఒంటరిగా అధికారం చేజిక్కించుకునే అవకాశాలు తక్కువే. అందుకే ఆ రిస్క్ తీసుకోకుండా కమలం నితీష్ బాబుతో చేతులు కలిపింది. అలా లాలూని, కాంగ్రెస్ ని ఏక కాలంలో దెబ్బ కొట్టింది. నితీష్ రూపంలో ఎన్డీఏలోకి మరో సీనియర్, సెక్యులర్ నాయకుడ్ని ఆహ్వానించింది. జేడీయు బలంతో రాజ్యసభ మరింత తేలిక కానుంది మోదీకి! ఇలా ఇప్పుడు నితీష్, మోదీ ఇద్దరూ లాభపడ్డారు. తీవ్రంగా నష్ట పోయింది మొండికేసిన లాలూ! ఆయననే నమ్ముకున్న కాంగ్రెస్!   ఇక నితీష్ రాజీనామా మరో ఎఫెక్ట్… 2019లో ఎంతో కొంత పోరాడి ఓడదామని భావించిన ప్రతిపక్షం ఇప్పుడు కుడిదిలో పడిపోయింది! కాంగ్రెస్ నడిపే యూపీఏకి, నిజంగా ఎప్పుడూ లేనే లేని ధర్డ్ ఫ్రంట్ కి, అన్నిటికీ నితీషే ఇంత కాలం ఆశదీపంగా మిణుమిణుమన్నాడు! కాని, ఎన్డీఏలో చేరిన ఆయన మోదీ వ్యతిరేక బ్యాచ్ మొత్తాన్ని చీకట్లో నెట్టాడు. 2019లో వారు ఇప్పుడు చీకట్లోనే తచ్చాడుతూ ఎన్నికలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి!

కార్గిల్ యుద్ధం… కొండలపైన భారత సైన్యం కొండంత సాహసం!

  జూలై 26… పద్దెనిమిది సంవత్సరాల క్రితం వరకూ దీనికి పెద్దగా ప్రాముఖ్యత లేదు! కాని, అప్పట్నుంచీ ఈ తేదీ అంటే దేశభక్తి వున్న భారతీయులందరికీ ఎంతో గర్వకారణం! అదే సమయంలో అమూల్యమైన 5వందల ప్రాణాలు కోల్పోయిన విషాదం కూడా! అటువంటి సగర్వ, విషాదాల సమ్మేళనమే కార్గిల్ దివస్! 1999 జూలై 26న మన అద్భుత సైనిక, వాయుసేన బలగాలు అసాధ్యం సుసాధ్యం చేసి చూపాయి! ఆకాశాన్నంటే కొండలపై నరాలు కొరికేసే చలిలో తమ సత్తాలోని సెగ ఏంటో పాకిస్తాన్ కు, అది ఉసిగొల్పి పంపిన ఉగ్రవాదులకు చవి చూపించాయి…   డెబ్బై ఏళ్ల భారత స్వతంత్ర చరిత్రలో యుద్ధాన్ని ఎదుర్కొన్న కాంగ్రేసేతర ప్రధాని కేవలం వాజ్ పేయ్ మాత్రమే. నెహ్రు కాలంలో, ఇందిర కాలంలో, లాల్ బహుదూర్ శాస్త్రీ కాలంలో మనం యుద్ధాలు చేయాల్సి వచ్చింది. కాని, సంకీర్ణ ప్రభుత్వాల యుగంలో వాజ్ పేయ్ ఒక్కరు మాత్రమే పాక్ పై యుద్ధం ప్రకటించి చేజారిన అత్యంత కీలకమైన భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాల్సి వచ్చింది. అందుకు మన ఇండియన్ ఆర్మీ బుల్లెట్లు ఎదురు వెళ్లి వీరత్వాన్ని నిరూపించుకుంటూ, వీర స్వర్గాన్ని కాంక్షిస్తూ దేశ భద్రత చేపట్టింది. వాజ్ పేయ్ ఆప్యాయంగా ముషర్రఫ్ ని పిలిచి చర్చలు జరిపితే… ఆ ముష్కరుడు వెన్నుపోటుకు వ్యూహం పన్నాడు. తన మిలటరీ సాయంతో జిహాదీల్ని వేల అడుగుల ఎత్తులో వున్న కార్గిల్ ప్రాంతంలోకి ప్రవేశపెట్టాడు. అక్కడ తిష్టవేసిన టెర్రరిస్టులు దేశంపై యుద్దం ప్రకటించారు. అనివార్య పరిస్థితుల్లో ఆనాటి ప్రధాని సైనికులకి పచ్చ జెండా ఊపారు! ఆ తరువాత 60రోజుల్లో మన జవాన్లు పాకిస్తాన్, దాని ఉగ్రవాదుల మదం అణిచి కార్గిల్ తిరిగి స్వాధీనం చేసుకున్నారు…   కార్గిల్ విజయం జూలై 26 , 1999తో సంపూర్ణమైంది. అయితే, ఈ రెండు నెలల సుదీర్ఘ యుద్ధం అనేక విశేషాలకు సాక్షం కూడా అయింది. భారత సైనిక సత్తా ఏంటో పాకిస్తాన్ మరోమారు తెలిసి వచ్చింది. మన వారు 5వందల మంది ప్రాణత్యాగం చేస్తే పాక్ ఖాతాలో మరణాలు దాదాపు 3వేల వరకూ వుంటాయని ఆ దేశ మీడియానే చెప్పింది! అలాగే, వేల అడుగుల ఎత్తులో మన జవాన్ల మాదిరిగా యుద్ధం చేయటం అమెరికా, రష్యా లాంటి దేశాల సైనికులకి కూడా సాధ్యం కాదని స్పష్టమైంది. అందుకే, తరువాతి కాలంలో పర్వత ప్రాంతాల్లో యుద్ధం గురించి మన సైనికాధికారులు అమెరికన్ ఆర్మీకి శిక్షణ ఇచ్చారు. ఇక చరిత్రలో మొదటిసారి పూర్తి స్థాయిలో మన వాయుసేన భూమ్మీది సైన్యానికి మద్దతుగా నిలిచింది కార్గిల్ వార్ లో! కార్గిల్ యుద్ధం ఆ విధంగా మన ఎయిర్ ఫోర్స్ సత్తా కూడా ఋజువు చేసింది. మరో విషయం ఏంటంటే… పదే పదే అణు బాంబు వేస్తామనే పాక్ 60రోజులు యుద్ధం జరుగుతున్నా అంతర్జాతీయ ఒత్తిడితో అలాంటి దుస్సాహసం చేయలేకపోయింది. కాబట్టి న్యూక్లియర్ బెదిరింపులు మాటలు మాట్లాడినంత తేలిక కాదని ప్రూవ్ అయింది!   యుద్ధంలో మనం గెలిచి వుండవచ్చు. పాక్ , దాని ఉగ్రవాదులు ఓడి వుండవచ్చు. కాని, ప్రాణ నష్టం ఇరువైపులా జరిగింది. అది జరగకూడదనే మానవత్వమున్న ఎవరైనా కోరుకుంటారు. అయితే, పాక్, చైనా లాంటి దేశాలున్న భారత్ ఎల్లప్పుడూ యుద్ధం వద్దని చేతులు కట్టుకుంటే ప్రమాదం కొని తెచ్చుకున్నట్టే! అవసరమైతే కార్గిల్ విజయం లాంటి ధీటైన విజయాలు సాధించటానికి, దేశ రక్షణ కోసం ఎంతకైనా తెగించటానికి సర్వ సన్నద్ధంగా వుండాలి. మన కోసం ప్రాణాలు పణంగా పెట్టే ఆర్మీకి మనమూ, పాలకులు, ప్రతిపక్షాలు అందరూ అండగా నిలబడాలి. చైనా కయ్యానికి కాలు దువ్వుతున్న ప్రస్తు తరుణంలో ఇది మరింత ముఖ్యం…

షరీఫ్, ముషారఫ్‌లకు ప్రాణబిక్ష పెట్టిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌

సరిగ్గా 17 ఏళ్ల క్రితం భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరిగిన కార్గిల్ యుద్దం గుర్తుందా..? ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్‌ను వశం చేసుకునేందుకు దాయదీ దేశం వేసిన ఎత్తును చిత్తు చేసింది భారత సైన్యం. చలికాలం సరిహద్దుల్లోని సైనిక పోస్టులను ఇరుదేశాల సైనికులు వదిలేసి వెచ్చని ప్రాంతాలకు వస్తారు. కానీ 1999లో అలా జరగలేదు..పాకిస్తానీ సైనికులు తమ పోస్టులను వదల్లేదు సరికదా..భారత పోస్టుల్లో మకాం వేశారు..వీరికి మద్ధతుగా ఉగ్రవాదులు సరిహద్దుల్లోకి చొరబడ్డారు..చివరకు మే నెలలో విషయం భారత ప్రభుత్వం దృష్టికి వచ్చింది. పోస్టులను ఖాళీ చేయాలని భారత్ అంతర్జాతీయ సమాజం ద్వారా చెప్పిచూసింది. కానీ పాకిస్తాన్ ససేమిరా అనడంతో భారతదేశం తప్పనిసరి పరిస్థితుల్లో యుద్దరంగంలోకి దిగింది.   నెల రోజుల పాటు జరిగిన సమరంలో ఒక్కొ కొండపై ఉన్న ఒక్కొక్క స్థావరం నుంచి ముష్కర మూకను తరిమి తరిమి కొట్టాం. ఈ యుద్ధంలో 537 మంది భారత సైనికులు అమరులవ్వగా..1363 మంది గాయపడ్డారు. పాక్ వైపున 453 మంది చనిపోగా..665 మంది గాయపడ్డారు. కొండపైకి ఎగబాకి యుద్ధం చేయాల్సి రావడంతో మనకు ఎక్కువ నష్టం సంభవించింది. భారత సైన్యం అసమాన ధైర్యసాహసాలకు గుర్తుగా విజయ్ దివస్ పేరుతో ప్రతీ ఏటా జవాన్ల సేవలను స్మరించుకుంటున్నాం.   ఆ సమయంలో సైన్యానికి మద్దతుగా శత్రుమూకల శిబిరాలపై బాంబుల వర్షం కురిపించి..విజయంలో కీలకపాత్ర పోషించింది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్. అయితే ఒకానొక దాడిలో అప్పటి పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్, నాటి ప్రధాని నవాజ్ షరీఫ్ వాయుసేన దాడి నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డారట..1999 జూన్ 24న నియంత్రణ రేఖ అవతల ఉన్న గుల్తేరీ ప్రాంతంలో పాక్ ఆర్మీ బేస్ క్యాంపుపై బాంబుల వర్షం కురిపించేందుకు ఎయిర్‌ఫోర్స్ విమానాలు వెళ్లాయట..ఈ సందర్భంగా పాక్ సైనికులనుద్దేశించి ముషారఫ్, నవాజ్ షరీఫ్ ప్రసంగిస్తున్నారట. లక్ష్యాన్ని గురి చేసి కొట్టేందుకు పైలట్ సిద్ధమవుతుండగా అక్కడ పెద్ద సంఖ్యలో జనం గుమిగూడి ఉండటం చూసి ఎయిర్ మార్షల్‌కు సమాచారం అందించారట..   దీంతో ఆయన విమానాలను దారి మళ్లీంచారట..ఈ విషయాన్ని నాటి ఎయిర్ మార్షల్ ఏకే సింగ్ తెలిపారు. శత్రువునైనా క్షమించగలిగే గొప్ప మనసు మన సైన్యానికి ఉండబట్టే ముషారఫ్, షరీఫ్‌లు ఇప్పటికీ ప్రాణాలతో ఉన్నారు..ఆ సమయంలో విమానాన్ని నడుపుతున్న పైలట్ ఉన్నతాధికారులకు సమాచారం అందించకుండా ఒక్క బటన్ ప్రెస్ చేసి ఉన్నా..ఎయిర్‌మార్షల్ జెట్ ఫైటర్లను దారి మళ్లీంచకపోయినా షరీఫ్, ముషారఫ్‌లు చనిపోయి 18 ఏళ్లు గడిచిపోయేవి.

‌మెరీనా బీచ్‌‌‌తో.. మోడీకి ముప్పేనా..?

దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు ప్రత్యేకం..తమ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా..తాము భారతదేశంలోనే విలక్షణమైన జాతిగా అక్కడి ప్రజలు భావిస్తూ ఉంటారు. అందుకు తగ్గట్టుగానే ఆచార వ్యవహారాలు, వస్త్ర ధారణ, కట్టుబాట్లు అన్ని కూడా తమిళనాడులో విభిన్నంగా కనిపిస్తాయి..అలాగే వారి పోరాట పోటిమ, ఆలోచనా తీరు కూడా వేరుగా ఉంటుంది. ఒక స్ఫష్టమైన లక్ష్యసాధన కోసం పార్టీలు, విధానాలు, వర్గాలు, అంతర్గత వైషమ్యాలన్నింటిని పక్కనబెట్టి నడుం బిగించారంటే ఎంతటి వారైనా దిగి రావాల్సిందే..స్వతంత్ర భారత చరిత్రలో ఈ విషయం ఎన్నోసార్లు రుజువైంది. ద్రావిడ అధిపత్య సాధనకు ఏళ్ళ తరబడి పోరాడారు..రాష్ట్రంలో హిందీ శబ్ధం వినబడకుండా..కనీసం రెండో భాషగా కూడా వాడుకలో లేకుండా తరిమికొట్టారు. ఈ ఐకమత్యమే వారిని విజయ తీరం వైపు చేరేలా చేస్తోంది. ఈ సంఘటిత శక్తే ప్రభుత్వాలను వణికింపజేసింది. తాజాగా ఈ ముప్పు ప్రధాని నరేంద్రమోడీని తాకనుంది.   ప్రధానిగా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మోడీ సరైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంది లేదు. పటేల్ ఉద్యమం, గో రక్షకుల దాడి, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో రైతుల ఆందోళనలను సమర్థవంతంగా అడ్డుకోగలిగింది కేంద్ర ప్రభుత్వం. కానీ తమిళనాట త్వరలో రాబోతున్న ముప్పును ఎదుర్కోవడం మోడీకి అంత సులభం కాదు. కరువు సాయం కోరుతూ గత ఏప్రిల్‌లో దేశరాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద వివిధ రూపాల్లో ఆందోళన చేస్తూ మోడీకి ముచ్చెమటలు పట్టించారు. చీరలు కట్టుకోవడం, పుర్రెలు, ఎముకలతో సుమారు నెల రోజుల పాటు నిరసన వ్యక్తం చేశారు. అయితే స్వయంగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి రంగంలోకి దిగి హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కానీ మూడు నెలలు గడుస్తున్నా వీరిని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు స్పందించడం లేదు.   దీంతో తమిళ యువత రంగంలోకి దిగింది. తమకు ఎంతో కలిసివచ్చి..జల్లికట్టు ఉద్యమంలో విజయాన్ని అందించిన చెన్నై మెరీనా బీచ్‌లో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టుబోతోంది అన్న వార్త ఇప్పుడు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ..ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న రైతులకు మద్ధతుగా మెరీనా బీచ్‌కు తరలిరావాలంటూ ఫేస్‌బుక్చ వాట్సాప్‌లలో మెసేజ్‌లు షేర్ అవుతుండటంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. మెరీనా బీచ్ పరిసరాలకి వస్తున్న ప్రజలు ఆపి, వారిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తీరంలోకి అనుమతిస్తున్నారు.   ఇప్పటికే మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో రైతు వ్యతిరేక ఉద్యమాలు జరిగి నివురుగప్పిన నిప్పులా ఉన్న పరిస్థితుల్లో తమిళనాట మరో రైతు ఉద్యమం జరిగితే అది ప్రధాని నరేంద్రమోడీకి తీవ్ర ఇబ్బందులు కలగజేస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..ఎందుకుంటే మిగిలిన ప్రాంతాల్లో ఉద్యమాలను అణిచినట్లు తమిళనాడులో సాధ్యం కాదు..ఆ విషయం మోడీకి కూడా తెలుసు..ఈ నేపథ్యంలో రైతులను శాంతింప చేయటం అన్ని విధాలా మంచిది. లేదంటే తమిళ రైతుల స్పూర్తిని అందుకుని మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఆందోళనలు జరిగే అవకాశం లేకపోలేదు..

40ఏళ్లలో… 4,700రెట్లు… ఎలా ఎదిగింది?

  రిలయన్స్ … ఈ పేరు ఓ కంపెనీది కాదు! రిలయన్స్ అంటే కోట్లాది భారతీయుల విశ్వాసానికి మారుపేరు! బిజినెస్ లెజెండ్ ధీరుభాయ్ అంబానీ తన సంస్థకి రిలయన్స్ అని ఎందుకు పేరు పెట్టారోగాని… ఇంగ్లీషులో దాన్ని విశ్వాసం అనే ఉద్దేశంతో కూడా వాడతారు! ఇప్పటికి నలభై ఏళ్ల కింద ఆయన ప్రారంభించిన రిలయన్స్ ఇవాళ్ల సాధించిన అత్యుత్తమ విజయం జనం విశ్వాసాన్ని చూరగొనటమే!   తమ సంస్థ నలభయ్యవ సర్వ సభ్య సమావేశంలో ప్రసగించిన ముఖేష్ అంబానీ చెప్పిన విశేషాలు వింటే రిలయన్స్ ఎంత ఉధృతంగా అభివృద్ధి చెందిందో మనకు అర్థమవుతుంది! 1977లో కేవలం వస్త్రాలు అమ్మే బ్రాండ్ గా మొదలైన రిలయన్స్ ఇవాళ్ల జియో వరకూ ఎన్నో ఉత్పత్తుల్ని భారతీయులకి అందజేస్తూ సంచలనం సృష్టించింది. అయితే, ఇది ఏదో కేవలం బిజినెస్ అయితే మనం మాట్లాడుకోవాల్సిన అసవరం లేదు. రిలయన్స్… టాటా లాంటి అతి కొద్ది కంపెనీల సరసన చేరుతుంది. రిలయన్స్ ఎలాగైతే ఎదుగుతూ వచ్చిందో భారతదేశం కూడా అలా ప్రపంచ పటంలో మెరిసిపోతూ వచ్చింది. అందుకే, రిలయన్స్ సంస్థ భారతదేశ అభివృద్ధిలో అంతర్భాగం అనవచ్చు!   ముఖేష్ అంబానీ తమ సంస్థ విజయాలుగా చెప్పిన అబ్బురపరిచే విశేషాలు ఏంటంటే… 1977లో రిలయన్స్ లో వెయ్యి రూపాయలు పెట్టుబడి పెట్టిన వారి షేర్ విలువ, ఇవాళ్ల, పదహారున్నర లక్షలు! అన్ని రెట్లు లాభాలు గడిస్తూ దూసుకొచ్చింది ఆ సంస్థ! ఇక 1977లో రిలయన్స్ ఆదాయం 70కోట్లు! ఇప్పడెంతో తెలుసా? 3.30లక్షల కోట్లు! అంటే… 4,700 రెట్లు ఆదాయం పెరిగిందన్నమాట! ఆదాయం లాగే లాభం కూడా… ఒకప్పుడు 3కోట్లుంటే ఇప్పుడు 30వేల కోట్లట!   రిలయన్స్ సంస్థకున్న ఒకప్పటి ఆస్తుల విలువెంతో తెలుసా? 33కోట్లు! మరిప్పుడు? 7లక్షల కోట్లు! అంటే… 20వేల రెట్లు పెరిగాయన్నమాట! ఇవన్నీ వ్యాపార లావాదేవీలు. సామాన్య జనానికి ఏంటి లాభం అంటారా? రిలయన్స్ అభివృద్ధి భారత్ అబివృద్ధి ఎలా అయిందంటారా? అయితే, రిలయన్స్ లో ఉద్యోగాలు చేస్తూ బతుకు బండి నెడుతోన్న వారి సంఖ్య తెలుసుకోవాల్సిందే! ఒకప్పుడు మూడున్నర వేల మందికి ఉపాధి కల్పించిన రిలయన్స్ ఇవాళ్ల రెండున్నర లక్షల మందికి ప్రత్యక్షంగా జాబ్స్ ప్రొవైడ్ చేస్తోంది! పరోక్షంగా దానిపై ఆధారపడ్డవారు, షేర్ హోల్డర్లు వంటి వారు ఇంకా బోలెడు మంది వుంటారు!   వ్యాపారం చేసే క్రమంలో కార్పోరేట్ బిజినెస్ మెన్ అనేక అక్రమాలు చేస్తూ అడ్డదారులు తొక్కుతారన్నది నిజమే! రిలయన్స్ అధినేతలపై కూడా అలాంటి ఆరోపణలు వున్నాయి. అయినా కూడా 40ఏళ్ల ప్రస్థానంలో రిలయన్స్ దేశ అభివృద్ధికి చేసిన మేలు ఖచ్చితంగా ప్రస్తావించుకోవాల్సిందే! ఎందుకంటే రిలయన్స్ … ధీరుభాయ్ ప్రారంభించిన ఒక ఆర్దిక విప్లవం!

రాష్ట్రపతి భవన్… మీకు తెలియని 10 విశేషాలు!

  ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా… అమెరికన్ ప్రెసిడెంట్ అంత పవర్ ఫుల్ కాదు. అలాగని భారత రాష్ట్రపతి గౌరవానికి కొదవ వుంటుందా అంటే… అస్సలు వుండదు! అసలైన పనంతా చేసేది ప్రధాని అయినా సంతకం చేసి అధికార ముద్ర వేసేది ప్రథమ పౌరుడే! అటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అయిదేళ్లు ఆతిథ్యం ఇస్తుంది… దిల్లీలోని రాష్ట్రపతి భవన్! ఇక ఇప్పుడు పద్నాలుగవ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కోసం ఎదురు చూస్తోన్న ఆ చారిత్రక భవనం విశేషాలు మీకు తెలుసా?   1.     మన రాష్ట్రపతి భవన్ ప్రపంచంలోనే రెండవ అత్యంత పెద్దదైన ప్యాలెస్. మొదటిది ఇటలీలోని రోమ్ లో వున్న క్విరినల్ ప్యాలెస్!   2.    రాష్ట్రపతి భవన్ రూపకర్త బ్రిటీష్ వాడైన సర్ ఎడ్విన్ ల్యూటెయిన్స్. ఆయనతో పాటూ చీఫ్ ఇంజనీర్ హగ్ కీలింగ్, చాలా మంది భారతీయ కాంట్రాక్టర్లు కూడా భవన నిర్మాణంలో పాలుపంచుకున్నారు.   3.    ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నిర్మాణం 1912లో ప్రారంభమై 1929దాకా కొనసాగింది! మొత్తం 29వేల మంది కార్మికులు రూపకల్పనలో పాల్గొన్నారు!   4.    దాదాపు 9లక్షల పౌండ్లు, అంటే పదమూడు మిలియన్ల మేర ఖర్చైన రాష్ట్రపతి భవనం ప్రారంభోత్సవం…. 1931లో జరిగింది!   5.    2లక్షల చదరపు అడుగుల విస్తీర్ణమున్న రాష్ట్రపతి ఆవాసం మొత్తం 340రూములతో ఆశ్చర్యం కలిగిస్తుంటుంది! అందులో 54బెడ్ రూములే వుంటాయి. అవి కాక అతిథుల కోసం ఇంకా అనేక గదులు, సౌకర్యాలు ఇక్కడ వుంటాయి!   6.    700మిలియన్ల …. అంటే 70కోట్ల ఇటుకలు రాష్ట్రపతి భవన్ నిర్మాణానికి ఉపయోగించారట! అయితే, విచిత్రం ఏంటంటే… ఈ మహానిర్మాణానికి ఎక్కడా ఉక్కు వాడలేదు!   7.    1950లలో దీన్ని వైస్రాయ్ హౌజ్ అనేవారు. అప్పట్లో భారత వైస్రాయ్ ఇక్కడ వుండేవాడు. తరువాతి కాలంలో రాష్ట్రపతి మకాంగా మారిన వైస్రాయ్ హౌజ్ లో మొఘల్, బ్రిటీష్ కాలాల నిర్మాణ శైలి మనకు కలగలిపి కనిపిస్తుంది…   8.    1931లో భవనం ప్రారంభమయ్యాక తొలిసారి అందులో వున్న బ్రిటీష్ అధికారి లార్డ్ ఇర్విన్.   9.    రాష్ట్రపతి భవన్ ప్రధాన భవంతికి పశ్చిమాన మొఘల్ గార్డెన్ వుంటుంది. దీన్ని సర్ ల్యూటెయిన్సే రూపొందించాడు. పచ్చటి చెట్లతో, రంగురంగుల గులాబీలతో, ఇంకా ఎన్నో రకాల పూలు, మొక్కలతో మొఘల్ గార్డెన్ రాష్ట్రపతి భవన్ కే తలమానికంగా గుభాళిస్తూ వుంటుంది!   10.  అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య సామాన్య సందర్శకులకి మొఘల్ గార్డెన్ చూసే అవకాశం ఫిబ్రవరీ, మార్చ్ నెలల్లో కల్పిస్తారు!

వీఐపీలకు దాసోహం… సామాన్య ఖైదీలపై దాష్టీకం!

  కొందరు వివాదాల్లో చిక్కుకుంటారు! మరి కొందర్ని వివాదాలే చుట్టుముడతాయి! కాని, దివంగత తమిళనాడు సీఎం జయలలిత నిచ్చెలి శశికళ మాత్రం మూడో టైపు! అసలామె వివాదాల్లో చిక్కడం, వివాదాలామెను చుట్టుముట్టడం… ఏదీ జరగదు! ఆమె నిత్యం వివాదానికి ప్రతిరూపంగా కొనసాగుతుంటారు! ఇది ఇప్పటి స్థితి కాదు. ఎక్కడో తమిళనాడులో మారుమూల పల్లెలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ్ల కర్ణాటకలో కూర్చుని తమిళనాడుని, దిల్లీని ఆమె డిస్టబ్ చేస్తున్నారు. ఇంత చేయాలంటే ఆమె వివాదానికి నిలువెత్తు రూపం కాకుండా సాధ్యమా?   శశికళ చుట్టూ ఎప్పుడెప్పుడు ఎన్ని వివాదాలు ముసురుకున్నాయో ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సింది ఏం లేదు. కాని, మెరీనా బీచ్ లో జయమ్మ సమాధిపై మూడుసార్లు చరిచినట్టు ప్రమాణం చేసిన ఆమె ఇక కొన్నాళ్లు, కొన్నేళ్లు సైలెంట్ అవుతారని అంతా భావించారు. కాని, నిత్యం వివాదంలా చర్చకు దారి తీసే శశికళ ఇప్పుడు జైల్లోంచి కూడా పెద్ద బ్రేకింగ్ న్యూస్ అవుతున్నారు. ఆమెకు వీవీఐపీ ట్రీట్మెంట్ లభిస్తోందని అక్కడి పోలీస్ అధికారిణి రూప వెల్లడించిన విషయం తెల్సిందే! ప్రత్యేక కిచెన్ తో కూడిన రాణిభోగం శశికళతో లభిస్తోందని రూప మీడియాకి కూడా లీక్ ఇచ్చేశారు! ఆ వివాదం ఇంకా సద్దుమణగలేదు!   ఉరుము ఉరిమి మంగళం మీద పడిదంటూ ఓ సామెత చెబుతారు. అలా తయారైంది శశికళతో పాటూ సేమ్ జైల్లో వుంటోన్న కొందరు ఖైదీల పరిస్థితి! దాదాపు 30మందిని కర్ణాటకలోని పరప్పన అగ్రహారం జైలు పోలీసులు చావచితగ్గొట్టారట! ఎందుకూ అంటే… శశికళకి రాచమర్యాదలు చేసి డబ్బులేని సాధారణ ఖైదీలైన తమకు దారుణమైన వసతులు కల్పిస్తున్నారని వారు ఆరోపించారట. అదే విషయం చిన్నమ్మ రాణివాసం బయటపెట్టిన డీఐజీ రూపకి వివరిస్తామని పట్టుబట్టారట! ధర్నా కూడా చేయటంతో రెచ్చిపోయిన జైలు అధికారులు వారందర్నీ ఉతికి ఆరేయించి … మైసూర్, బెల్గాం, బళ్లారి వంటి ఇతర జైళ్లకు తరలించారట. ఇదంతా ఇప్పటి వరకూ సీక్రెట్ గానే జరిగిపోయింది. కాని, శశికళ మేడమ్ కు దాసోహం అంటూ ఇతర ఖైదీలకు నరకం చూపుతున్నారని బీజేపి నేత శోభా మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించటంతో విషయం బయటకొచ్చింది!   శశికళ ఎఫెక్ట్ పన్నీర్ సెల్వం మొదలు పలనీ స్వామీ దాకా చాలా మందికే పడింది! ఇప్పుడు పాపం… ఆమె వుంటోన్న జైల్లోని సామాన్య ఖైదీలకు చిన్నమ్మ ఎఫెక్ట్ పెద్దగానే తగిలింది! అటూ డీఐజీ రూప ఈమె డబ్బులు పడేసి సుఖ, సౌకర్యాలు కొంటోందని చెప్పటంతో ఆమెనూ ట్రాఫిక్ శాఖలో పడేశారు పోలీస్ అధికారులు! మొత్తానికి వాయుగుండం లాంటి వివాదాల సుడిగుండం … శశికళ ఇప్పుడు తమిళనాడు నుంచి కర్ణాటక మీదకి కేంద్రీకృతమైంది! ఈ మొత్తం రాజభోగాల వ్యవహారం కర్ణాటకను ఏలుతున్న కాంగ్రెస్ మెడకూ చుట్టుకునేలా వుంది…

తెలుగు చిత్ర పరిశ్రమకు ఇది తీరని అవమానం

తెలుగు సినిమా తల్లి విలపిస్తున్న సమయం ఇది.  తెలుగు సినిమాను సుసంపన్నం చేసిన మహనీయుల ఆత్మలు రోదిస్తున్న సమయం ఇది. కుటీర పరిశ్రమగా ఉన్న సినీ పరిశ్రమను ఓ మహా పరిశ్రమగా తీర్చిదిద్దడానికి ఎంతమంది మహా కళాకారులు ఎంత కష్టపడ్డారో చెప్పాలంటే... ఓ పెద్ద గ్రంధమే అవుతుంది. వాళ్లు నడిచిన రాళ్ల, ముళ్ల బాటలే... ఈ రోజున ఇప్పడు ఎదుగుతున్న కళాకారుల సుఖమయ ప్రయాణానికి మార్గాలయ్యాయి. ఈ విషయాన్ని మరచిపోయి... నైతిక విలువలకు తిలోదకాలిచ్చి.. మాదక ద్రవ్యాల బారిన పడి, తెలుగు సినిమా ఔన్నత్యాన్ని కాలరాస్తున్నారు ప్రస్తుతం కొందరు వ్యక్తులు.    1932లో ‘భక్తప్రహ్లాద’తో మొదలైన తెలుగు సినిమా...  అక్కినేని, నందమూరి ఆగమనంతో కొత్త రూపు సంతరించుకుంది. క్రమశిక్షణకు మారు పేరుగా నిలిచి 35 ఏళ్ల పాటు తెలుగు సినిమాను వినూత్న శోభను తెచ్చిపెట్టారు ఎన్టీయార్, ఏఎన్నార్. వేలల్లో ఉన్న తెలుగు సినిమా మార్కెట్ ని కోటి రూపాల స్థాయికి పెంచి...  కోట్లాది మందికి ఆసరానిచ్చే గొప్ప పరిశ్రమ స్థాయికి తీసుకెళ్లారు.    వారి తర్వాత తరం వారైన కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చంద్రమోహన్, మురళీమోహన్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ తదితర స్టార్లు కూడా అదే క్రమశిక్షణతో తెలుగు సినిమాను మరింత ఎత్తులో నిలిపారు. నాటి సినీ సాంకేతిక నిపుణులు కూడా తెలుగు సినిమాపై ప్రజల్లో గౌరవాన్ని పెంచాలా చేశారు.    కానీ ఇప్పటి తరంలో కొందరు అందుకు పూర్తి విరుద్దం. చేసే పని గురించి ఆలోచించకుండా...దురలవాట్లు బానిసవడమే కాక... మాదక ద్రవ్యాల బారిన పడి.. తమ జీవితాలని పాడు చేసుకోవడమే  కాక, చిత్ర పరిశ్రమకు కూడా మచ్చను తెచ్చిపెడుతున్నారు. దానికి నేడు జరుగుతున్న ఉదాంతమే నిదర్శనం.    ఒకడు అలవాటు చేసుకోవడం... దాన్ని ఇంకొకడికి నేర్పడం... ‘అలా... తా చెడ్డ కోతి వనం మొత్తం చెరిచింది’ అన్న చందాన.. అందరికీ ఆ గజ్జిని అంటించడం .. ఇది నేటి సినీరంగానికి చెందిన కొందరు వ్యక్తుల పరస్థితి. ఇలాంటి వారికి సినిమాలుండవ్. అందుకే డబ్బు కోసం వీరు ఎంచుకునే మార్గం ‘పబ్ ’. డబ్బు  వరదలై పారే నేటి సినీ పరిశ్రమలో... సరదాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. దానికి ఎక్కువ మంది ఆశ్రయించేది పబ్ లకే. అందుకే.. సినీ రంగానికి చెందిన వారే ‘పబ్’ లు తెరుస్తారు. అక్కడే మాదక ద్రవ్యాలు... తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతుంటాయ్.    మరీ ఇంత దారుణమా?    మాదకద్రవ్యాలను విక్రయించే విదేశీయుడు ‘కెల్విన్’... హైదరాబాద్ పోలీసులకు పట్టుబడటంతో డొంక కదిలింది. వాడిని నాలుగు తగిలించే సరికి... వరుసగా... పూరీ జగన్నాథ్, రవితేజ, నవదీప్, తరుణ్, చార్మీ, ముమైత్ ఖాన్, శ్యామ్ కె.నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, నటుడు నందు, తనిష్, సుబ్బరాజు... ఇలా డ్రగ్స్ కి అలవాటు పడి, తన దగ్గర డ్రగ్స్ కొనుక్కుంటున్న అందరి పేర్లూ చదివాడు. ఇక మీడియా ఊరుకుంటుందా రచ్చ రంబోలా చేసింది.    తెలుగు సినిమాకే మచ్చ తెచ్చిన ఇలాంటి వారిని ఏం చేయాలి? అని పరిశ్రమకు చెందిన వారు అనుకుంటుంటే... ‘సినిమా పరిశ్రమ అంటే..ఇంతేరా...’అంటూ ఎగదాళిగా మాట్టాడుకుంటున్నారు అందరూ.    మొత్తం 12 మంది సినీ ప్రముఖులకు హైదరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 19 నుంచి 27వ తారీకు లోపు తమంట తాము వచ్చి లొంగిపోతే సరి. లేకపోతే... నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సివస్తుందని తెలంగాణ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ వార్నింగ్ కూడా జారీ ఇచ్చేవారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీస్ అయిద ఫ్లోర్ లో వీరందరూ లొంగిపోవాలి.     శుక్రవారం సాయంత్రం లోపు ఓ సినిమా ప్రముఖుణ్ణి అరెస్ట్ చేసే అవకాశం ఉందని టాక్. ఇది నిజంగా చిత్ర పరిశ్రమకే తీరని అవమానం. గతంలో కూడా ఇలాగే కొందరు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు జరిగిన ఈ అల్లరి గతంలో కూడా ఓ సారి జరిగింది. అయితే.. పోలీసులు, నాయకులు గడ్డి తినడంతో ఆ అల్లరి ఎవరూ ఊహించకుండా సద్దుమణిగిపోయింది. కానీ... ప్రస్తుత తెలంగాణ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ మాత్రం ఇలాంటి విషయల్లో మడమ తిప్పని మనిషి. అందుకే ఇప్పుడు ఆటలు సాగడం లేదు. 

మేక వన్నె పులుల్లాంటి… మేకప్ వన్నెల హీరోలు!

  సినిమా స్టార్స్… ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్లు దేవుళ్లు! అంతగా అభిమానిస్తారు ఫ్యాన్స్! అది తెలుగు, హిందీ, తమిళ, మలయాళ రంగం… ఏదైనా… ఎక్కడికక్కడ స్టార్ హీరోలుంటారు. వారంటే పడి చచ్చే అభిమానులూ వుంటారు. అంతేకాదు, తమ హీరోని ప్రేరణగా తీసుకుని హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ మొదలు జనానికి ఉపయోగపడే సామాజిక సేవా కార్యక్రమాల వరకూ అన్నీ చేసేస్తారు. మన దగ్గరైతే పవర్ స్టార్ పేరు మీద పవనిజం అంటూ ఒక ఇజమే పుట్టుకొచ్చింది! అంతలా క్రేజ్ సమాజంలో బహుశా మరెవరికీ వుండదనుకుంటా!   కొన్ని లక్షల మంది, కాదంటే, కొన్ని కోట్ల మంది జనం తమని ఆరాధిస్తుంటే హీరోలు ఎలా వుండాలి? తమని దేవుడనుకుంటున్నారు కాబట్టి దేవుడిలాగే ఏ లోపమూ లేకుండా వుండాలి. అది కుదరకపోతే కనీసం మనుషుల్లా అయినా వుండాలి. మలయాళ సూపర్ స్టార్ దిలీప్ రాక్షసుడిలా మారి గ్లామర్ ఇండస్ట్రీ మరో కోణాన్ని చూపించాడు! తనతో మంచి హిట్ సినిమాలు చేసిన హీరోయిన్ భావనపై కసి, పగ పెంచుకున్నాడు. అందుకు కారణాలు బోలెడు వుండవచ్చు. కాకపోతే, ఇప్పటి వరకూ తెలిసిన విషయాల ప్రకారం దిలీప్ మొదటి భార్య మంజు వారియర్. ఆమెతో విడాకుల టైంలో భావన దిలీప్ ని తప్పు పట్టింది. మంజు వైపున నిలిచింది. అయినా కూడా మల్లూవుడ్లో విపరీతంగా పలుకుబడి వున్న దిలీప్ ఫస్ట్ వైఫ్ కు విడాకులు ఇచ్చి కావ్యా మాధవన్ అనే మరో హీరోయిన్ ని పెళ్లాడాడు!   తనకు నచ్చినట్టు  రెండో వివాహం చేసుకున్న దిలీప్ అక్కడితో తృప్తి పడితే బావుండేది. తనని వ్యతిరేకించిన భావనపై పగ పెంచుకుని ఆమె జీవితాన్నే నాశనం చేయాలని అనుకున్నాడు. ఒకటిన్నర కోట్ల సుపారీకి అగ్రిమెంట్ కుదుర్చుకుని ఆమెని లైంగికంగా వేధించిన విజువల్స్ సంపాదించాలని అనుకున్నాడు! ఒక మహిళ పట్ల, ఒక సెలబ్రిటీ అయిన హీరోయిన్ పట్ల హీరోగారు ఇలా ఆలోచించటం … ఎవరమైనా నమ్మగలమా?   దిలీప్ అనే హీరో విలన్ వేషాలే కాదు… చరిత్రలో చాలా మంది ఆన్ స్క్రీన్ హీరోలు రియల్ లైఫ్లో విలన్లుగానే బిహేవ్ చేస్తుంటారు. అసలు ఒక స్థాయి స్టార్ డమ్ వచ్చాక వారికి పరిశ్రమలో తిరుగుండదు. అందుకే, నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్స్, నటీనటులు అన్నభేదం లేకుండా అందర్నీ వేధిస్తుంటారు. ఏ కారణం లేకున్నా అవమానిస్తుంటారు. ఇక అసిస్టెంట్లుగా పని చేసే చిన్న చిన్న వారిపై ఇండస్ట్రీలోని పెద్దవారి దౌర్జన్యం అంతా ఇంతా కాదు! ఓ టాప్ హీరో తన అసిస్టెంట్ ని అందరి ముందు బూతులు తిట్టి ముఖం పచ్చడయ్యేలా కొట్టినా అడిగే వాడు వుండడు! అందరికీ స్టార్ డమ్ సంపాదించిన వారంటే వణుకే! ఏమన్నా తేడా వస్తే ఇండస్ట్రీలో లేకుండా చేసేస్తారని భయం!   సినీ పరిశ్రమలో అజమాయిషి, అమానుషత్వం ఎంత తవ్వి చూస్తే అంతగా బయటకి వస్తుంది. కాకపోతే, కొందరు సినీ సెలబ్రిటీలకు అహంకారం విపరీతంగా పెరగటానికి ఫీల్డ్ లో వారికి లభించే ఎదురులేని అధికారమే కారణం. అదే దిలీప్ లాంటి హీరోల చేత ఎంతటి నీచమైన పనైనా చేయిస్తుంది. అసలు సినీ పరిశ్రమలో హీరోయిన్స్, ఇతర లేడీ అర్టిస్టుల పరిస్థితి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఇప్పుడు మనకు తెలిసింది కేవలం ఒక్క భావన గురించే! భారతీయ సినిమా రంగంలో ఎందరో భావనలు, ఎందరెందరో దిలీప్ లు!   ఇప్పుడు వార్తల్లోకి వచ్చిన దిలీపే కాదు… ఎప్పట్నుంచో న్యూస్ లో వున్న సల్మాన్ కూడా ఇదే కోవకు చెందుతాడు. తప్ప తాగి అమాయకుల మీదకు కారెక్కించిన ఆన్ స్క్రీన్ హీరో అడవుల్లోకి పోయి జింకల్ని కూడా వదలకుండా వేటాడాడు. ఐశ్వర్య రాయ్ విషయంలో భౌతిక దాడి చేశాడనీ కూడా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఇక సంజయ్ దత్ అయితే ఏకంగా జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చాడు ఆక్రమ ఆయుధాల కేసులో! ఇలాంటి హీరోలు ఇంకా చాలా మంది వున్నారు. అందరూ జైలు దాకా వెళ్లకపోవటంతో మనకు వారి అసలు స్వరూపాలు తెలియవు!   సినిమా హీరోలందరూ దిలీప్, సల్మాన్, సంజయ్ దత్ లాంటి వారు కాకపోవచ్చు. కాని, చాలా మంది హీరోలు మామూలు వారేనని జనం గుర్తించాలి. వారికి కూడా బలహీనతలు, చెడు ఆలోచనలు వుంటాయి. అందుకే, ఫ్యాన్స్ అని చెప్పుకునే వారు నటన వరకే అభిమానించాలి. అలా కాకుండా తమ హీరోల్ని దేవుళ్లని చేసి ఆరాధించటం మూర్ఖత్వం అనిపించుకుంటుంది. మీడియా కూడా అవసరం వున్నా లేకున్నా సినిమా సెలబ్రిటీల్ని హైలైట్ చేయటం తగ్గించుకోవాలి. అప్పుడు ఎంత పెద్ద సినిమా పర్సన్ తప్పు చేసినా వెంటనే చట్ట పరమైన చర్యలు తీసుకోటానికి అడ్డంకులు లేకుండా వుంటుంది! కాని, ఇప్పుడు ఇండియాలో పరిస్థితి అలా లేదు. ఒక్కోసారి పొలిటీషన్స్ కూడా తప్పించుకోలేని నేరాల నుంచి గ్లామర్ వున్న వాళ్లు తేలిగ్గా తప్పించేసుకుంటున్నారు! ఈ పరిస్థితి ఖచ్చితంగా మారాలి…

హిందూ ప్రయాణీకుల్ని కాపాడిన ముస్లిమ్ డ్రైవర్!

సోషల్ మీడియా వచ్చాక మంచి ఎంత జరుగుతోందో… చెడూ అంతే జరుగుతోంది! ఒక విషయం ప్రచారంలోకి వచ్చాక అది నిజమైనా , కాకున్నా ఎవ్వరూ పట్టించుకునే స్థితిలో వుండటం లేదు. తమకు నచ్చితే, తమకు లాభం అనుకుంటే, తమ ఇగో హ్యాపీ అయితే షేర్ చేసేస్తున్నారు! దీని వల్లే చాలా తప్పుడు సమాచారాలు గందరగోళం సృష్టిస్తున్నాయి. తాజాగా అమర్ నాథ్ యాత్రా ప్రయాణీకులపై ఉగ్రవాదుల దాడి కూడా ఇలాగే సోషల్ మీడియా చర్చకి దారి తీసింది. అయితే, తప్పుడు దిశలో సాగిన ఓ ప్రచారం సోషల్ మీడియా విచ్చలవిడి కోణాన్ని మరో సారి ఆవిష్కరించింది…   అమర్ నాథ్ యాత్ర చేస్తోన్న దాదాపు 50 మంది శివ భక్తులు బస్ లో వెళుతుండగా ఉగ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఏడుగురు చనిపోగా చాలా మంది గాయపడ్డారు. కాని, ఒక్క బుల్లెట్ కూడా తగలని డ్రైవర్ ఎంతో సాహసంతో, చాకచక్యంగా బస్ ను ఆపకుండా ముందుకు తోలాడు. అదే ఎంతో మంది ప్రాణాలు కాపాడింది. లేకపోతే మనం ఊహించలేని విషాదం చోటు చేసుకునేది. కాని, అంత మంది ప్రాణాలు కాపాడిన డ్రైవర్ సలీమ్ సోషల్ మీడియాలో మాత్రం కొందరి అనుమానాలకి గురి కావాల్సి వస్తోంది.   ఫేస్బుక్ లో సలీమ్ పై నానా రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. కొందరు ఆయన ముస్లిమ్ అయినా హిందువులందర్నీ కాపాడాడని అంటుంటే.. కొందరు మాత్రం ఒక్క బుల్లెట్ కూడా తాకకుండా ఎలా తప్పించుకున్నాడని అడుగుతున్నారు. అలాగే, ఉగ్రవాదుల దాడికి ముందు డ్రైవర్ టైర్ పంక్చర్ అంటూ రెండు గంటలు బస్ ను ఆపేశాడని కొందరు చెబుతున్నారు. అందువల్లే ఎలాంటి ఎస్కార్ట్ లేకుండా సలీమ్ నడిపిన బస్ ప్రయాణించాల్సి వచ్చిందంటున్నారు. మొత్తంగా వారి ఉద్దేశంలో సలీమ్ ఉగ్రవాదులు దాడి చేసేందుకు అనుకూలంగా వ్వవహరించాడని భావం! దీనికి బలమైన ఆధారాలు ఏవీ లేవు!   ఇక మరికొందరు నెటిజన్స్ బస్ లో డ్రైవర్ తో పాటూ వున్న బస్సు ఓనర్ కొడుకు గురించి ప్రస్తావిస్తున్నారు. అతడు డ్రైవర్ పక్కనే వుండి వాహనాన్ని ఆపనీయలేదనీ… తనకు మూడు బుల్లెట్లు తాకినా డ్రైవర్ సలీమ్ ను నడుపుతూనే వుండమని చెప్పాడని అంటున్నారు. ఈ విషయం సలీమ్ కూడా ఒప్పుకున్నాడు. అతని వల్లే తాను ఆపకుండా ముందుకు పోనిచ్చానని అన్నాడు. కాని, కొందరు సోషల్ మీడియా యూజర్స్ మాత్రం క్రెడిట్ అంతా బస్ ఓనర్ కొడుకు హర్ష్ దేశాయ్ కే దక్కాలంటున్నారు.   సలీమ్ నిజంగా ఉగ్రవాదులతో కుమ్ముక్కై వుంటాడా? ఇది దాదాపు అసాధ్యమైన పిచ్చి ఊహా. అలా జరిగే అవకాశం వుంటే వుండొచ్చేమోగాని… ఇప్పటి వరకూ ఒక చిన్న ఆధారం కూడా ఆ దిశగా దొరకలేదు. అందుకే, గుజరాత్ సీఎం స్వయంగా సలీమ్ ని మెచ్చుకుని అతడికి బ్రేవరీ అవార్డ్ వచ్చేలా చూస్తానని చెప్పారు. అయినా కూడా కేవలం ఆ డ్రైవర్ … ముస్లిమ్ కాబట్టి అతడ్ని అనుమానించటం న్యాయం అనిపించుకోదు. కాబట్టి అనుమానాలు పక్కకు పెట్టి ఎందరో ప్రాణాలు కాపాడిన బస్ డ్రైవర్ ని అభినందించాల్సిందే! ప్రభుత్వం, నిఘా వర్గాలు సలీమ్ నేపథ్యంపై ఆరా తీస్తే అది మరింత మంచిది…

మొక్కల్ని నాటుతున్నాం… వృక్షాల్ని కాపాడుకుంటున్నామా?

  తెలంగాణ ప్రభుత్వం మూడో విడత హరిత హారం సంకల్పించింది. ఒకటి రెండు కాదు ఏకంగా 40కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించింది. అంతే కాదు, అనేక అవార్డులు, రివార్డులు కూడా ఇవ్వనుంది. పచ్చదనాన్ని కాపాడే వారికి పసందైన గుర్తింపు గ్యారెంటీ అంటోంది! విద్యార్థులకైతే మొక్కల్ని కాపాడినందుకు 5మార్కులు కూడా ఇవ్వనున్నారట! అయితే, ఇదంతా మూడో విడతలో భాగం! అంటే… ఇప్పటికే రెండు విడతల హరిత హారం జరిగిపోయిందన్నమాట!   ఏ రాష్ట్రానికైనా, దేశానికైనా, యావత్ ప్రపంచానికి కూడా పచ్చదనానికి మించిన అవసరం అంటూ ఏదీ వుండదు. అటువంటి పచ్చదనం విషయంలో తెలంగాణ ప్రభుత్వం హరిత హారం యజ్ఞం తలపెట్టడం నిజంగా సంతోషించాల్సిందే! అయితే, ఇప్పటికే రెండు విడతలు హరిత హారం జరిగిపోయింది. మూడో విడత మళ్లీ మొదలైంది. కోట్ల మొక్కలు నాటుతున్నామని పాలకులు, అధికారులు చెబుతున్నారు. అసలు చాలా రాష్ట్రాల్లో మొక్కలు నాటడం, పచ్చదనం పెంచటం అనే అంశాలే పట్టించుకోవటం లేదు సీఎంలు, ఎమ్మెల్యేలు, అధికారులు. తెలంగాణలో ఈ విధంగా సంవత్సరానికి ఒకసారి మొక్కల ఉద్యమం నిర్వహించటం ఆనందకరం. కాని, చాలా మంది మనస్సుల్లో మాత్రం ఒకటే మెదులుతోంది. ఈ హరిత హారం ఫలితాలు ఎలా వున్నాయి అని!   మొదటి విడతని కూడా సీఎం కేసీఆర్ ఘనంగా ప్రారంభించారు. మంత్రులు, కలెక్టర్లు పనిముట్లు పట్టుకుని గుంతలు తోడి మొక్కలు నాటారు. హడావిడి అద్బుతంగా జరిగింది. కాని, రాష్ట్రంలో ఈ తతంగం వల్ల పెరిగిన పచ్చదనం ఎంత? సరైన స్పష్టత లేదు! అలాగని, ప్రభుత్వం చేపట్టిన హరిత హారం పూర్తిగా నిరుపయోగం అని కూడా చెప్పలేం. నాటిన మొక్కలు క్రమంగా పెరుగుతూనే వుంటాయి. సరైన ఆలనా,పాలనా వుంటే చూస్తుండగానే వృక్షాలై చల్లటి నీడని, స్వచ్ఛమైన గాలిని ఇస్తాయి. కాని, ప్రతీ సంవత్సరం స్కూళ్లు తెరిచి పిల్లలు బడులకి వెళ్లే సమయంలో జరుగుతోన్న హరిత హారం తరువాత ఎక్కడా ప్రస్తావనకు రావటం లేదు. మరి నాటిన మొక్కలు ఏమవుతున్నాయి? ఇదే పెద్ద ప్రశ్న!   కేసీఆర్ సర్కార్ ఊరికే మొక్కలు నాటడం కాకుండా బహుమతులు, అవార్డులు, రివార్డులు కూడా ప్రకటిస్తోంది హరిత హారం సందర్భరంగా. పచ్చదనం విషయంలో చక్కగా పని చేసిన గ్రామ పంచాయితీలు, ఉత్తమ కాలేజీలు,పాఠశాలలు అంటూ… ఇలా రకరకాల కేటగిరిల్లో పచ్చదనాన్ని సత్కరిస్తోంది. ఈ ప్రయత్నం అభినందనీయమే అయినా ప్రభుత్వం పెట్టుకున్న 33శాతం పచ్చదనం ఆశయం నెరవేరాలంటే మరిన్ని గట్టి ప్రయత్నాలు అవసరం. ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు… ఇలా అన్ని వర్గాల వారు మొక్కలు నాటినా పచ్చదనం అమాంతం పెరిగిపోవటం సాధ్యం కాదు. నిజమైన హరిత హారం అడవుల్ని భద్రంగా కాపాడుకుంటూ అటవి భుమూల శాతం పెరిగేలా చూస్తేనే కుదురుతుంది. తెలంగాణ ప్రభుత్వమే కాదు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, భారత దేశ ప్రభుత్వం కూడా ఈ దిశగా దృష్టి పెట్టాలి. మనం మొక్కలు నాటాల్సిన అవసరం ప్రకృతిలో లేనేలేదు. మనిషి ఖాళీ స్థలం ప్రకృతికి వదిలేస్తే ఒకటి రెండు దశాబ్దాల్లో అడవి దానంతటదే దట్టంగా అలుముకుంటుంది! సమస్యంతా మనిషి అడవుల్లోకి జొరబడి వృక్షాలు, మహా వృక్షాలు నరికి… మళ్లీ మొక్కలు నాటడంలోనే వుంది! ఈ పద్దతి మారకుంటే హరిత హారం అసాధ్యం!   సీఎం కేసీఆర్ ఇప్పుడు మొక్కలు నాటడం పై దృష్టి పెట్టినప్పటికీ సంవత్సరం పొడవునా అడవుల అభివృద్ధిపై , వృక్షాల నరికివేత అరికట్టడంపై దృష్టి పెట్టాలి. అదే నిజంగా పర్యావరణానికి మేలు చేసేది!

మనకి కనిపించని కశ్మీర్ ఇదేనా..?

వర్క్... వర్క్... వర్క్... వీటినుండి బయటపడడానికి నేను నా కుటుంబం, వేరే మిత్రుడి కుటుంబంతో కాశ్మీర్ వెళ్లాం. నేను ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు ఇంట్లో చెబితే, సరే నీ ఇష్టం అన్నారు... కానీ వాళ్లలో ఏదో ఆందోళన. కాశ్మీర్లో ఎప్పుడూ అల్లర్లు జరుగుతూ ఉంటాయి... అవి ఈ మధ్య ఎక్కువయ్యాయి అని... ఈ విషయం వాళ్ళు నేను కాశ్మీర్ వెళ్ళాక చెప్పారు... ఎందుకంటే, ఈ కారణంతో నన్ను ఆపామేమో అన్న ఫీలింగ్ రాకుండా... కానీ నేను అక్కడ పరిస్థితులు టీవీ ల్లో చూపించినట్టుగా ఏం లేవని చెప్పిన తర్వాత కుదుటపడ్డారు. అయినా, ఏదో సందేహం వాళ్ళని ప్రశాంతత లేకుండా చేసింది. రోజు ప్రొద్దున, సాయంత్రం ఫోన్ చేస్తానని చెప్పిన తర్వాత వాళ్ళకి ఇంకొంచెం ప్రశాంతత కలిగింది.    కాశ్మీర్ లో దిగగానే ట్రావెల్ వాళ్ళ కారులో హోటల్ కి వెళ్ళాం. దారి పొడుగునా ఎక్కడ చూసినా మిలిటరీ వాళ్ళు కనిపించారు. మా హోటల్ ముందు కూడా ఒక గ్రూప్ పహారా కాస్తూ ఉంది. ఒకటి మాత్రం వాస్తవం. అయితే, ఇది మా డ్రైవర్ నుండి గ్రహించింది. కాశ్మీర్ లో ఎప్పుడు కూడా టూరిస్ట్ లకి లోకల్ వాళ్ళు ఏ రకమయిన ఇబ్బందులు కలిగించిన సందర్భం లేదు. ఇది చెబుతూనే కాశ్మీర్ లో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పాడు... తాను చిన్నప్పుడు దాదాపు చాల రోజులు బయటకి రాలేదని ఎందుకో మిలిటరీ వాళ్ళని చూస్తేనే తనకి భయం వేసేది అని. ఇక్కడ దాదాపు చాలా మందికి దాదాపు అదే పరిస్థితి అని వివరించాడు. వాస్తవానికి కాశ్మీర్ కి స్వాతంత్య్రం కోసం పోరాడడానికి కారణం కూడా అదే అని చెప్పాడు. నాకు లోపల ఏదో గెలికేస్తూ ఉంది తాను ఆలా చెబుతుంటే, అది నాలో ఉన్న దేశభక్తి తాలూకు భావనలు అయి ఉండొచ్చు.    ఇంతలో, నేను చెప్పులు కొనడానికి ఒక షాప్ కి వెళ్ళాను. అక్కడ ఒక అబ్బాయి ఏవో చెప్పులు చూపిస్తూ ఉన్నాడు. నేను బాటా చెప్పులు కావాలని అడిగాని, దానికి అతడు చెప్పిన సమాధానం నాకు ఇప్పటికీ మదిలో నుండి వెళ్లడం లేదు. "సర్ ఇక్కడ కాశ్మీర్ వస్తువులు మాత్రమే దొరుకుతాయి. ఇండియా వస్తువులు దొరకవు," అని. ఇంతలో వేరే ఎవరో అక్కడికి వచ్చి "మీరు ఇండియా వస్తువుల గురించి ఇక్కడ అడగకూడదు," అని కాస్త గట్టిగానే చెప్పాడు. ఈ ఆలోచనల మధ్య హోటల్ కి చేరాము. నా బాధ ఎవరితో షేర్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నంతలో మా హోటల్ ఓనర్ ని అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడిగాను. దానికి అతను, "ఇదంతా చదువుకోని, నిరుద్యోగులు చేస్తున్న ప్రచారం. ఎవరో అవకాశవాదులు చెప్పిన వాటికీ ప్రభావితమయి ఇండియా మీద చేస్తున్న ఆరోపణలు. కాశ్మీర్ ఎప్పటికీ ఇండియా లో భాగమే." అని చెప్పి నా మనసు కుదుట పడేలా చేసాడు.    తర్వాత ఒక రోజు పహల్గామ్ కారులో వెళ్తున్నాం. కార్ డ్రైవర్ మీకు మా హీరో బురుహాన్ వాని తెలుసా అని అడిగాడు. మాకు తెలుసు అని చెప్పడంతో అతన్ని అనవసరంగా చంపేశారని కొన్ని నెలలు ఇక్కడ అనిష్చితి వచ్చిందని చెప్పాడు. నాకు మళ్ళీ కోపం. ఒక తీవ్రవాది మీద ఇంత ప్రేమ ఏంటి అని? కానీ, ఈ సారి నాకు ఒక విషయం అర్ధం అయింది. వీళ్ళని ఎవరో బాగా ప్రభావితం చేస్తున్నారని. అలా అని మా డ్రైవర్ చెడ్డోడేం కాదు. తన జీతం ఎంతో ఎంత కష్టంగా బ్రతుకీడుస్తున్నాడో వివరించాడు. ఎందుకో కాసేపు జాలి కలిగింది.    ఏం జరుగుతుందో తెలియదు కానీ మేం వెళ్తున్న దారి పొడుగునా ఆర్మీ వాళ్ళు, వాళ్ళ వాహనాలు దర్శనమిచ్చాయి. దానికి మా డ్రైవర్ సమాధానం: ఇది మేము రోజూ చూసేదే సర్ అని. అమాయకంగా అడిగాడో, తెలివిగా అడిగాడో తెలియదు కానీ, మీ ఇంటి ముందు ఇలా ఎవరయినా పోలీస్ వాళ్ళో, జవానులో ఎప్పుడూ తిరుగుతుంటే మీకు ఎలా ఉంటుంది? స్వాతంత్ర్యం అంటే ఇదేనా అని? అతడికి సమాధానం ఇవ్వక పోయిన నాలో నేను అనుకున్నది ఏంటంటే, ఆర్మీ వాళ్లు అన్ని ప్రయాసల కోర్చి ఇక్కడ గస్తీ కాస్తున్నారంటే ఇక్కడి వాళ్ళ రక్షణ, అల్లరి మూకల అల్లరి అరికట్టడం, పాకిస్తాన్ ఉగ్రవాదుల చొరబాట్లు తగ్గించడం కోసమే కదా. "ఇది వీళ్ళు ఎప్పటికి అర్ధం చేసుకుంటారో," అని మనసులోనే అనుకున్నా. మొత్తానికి కాశ్మీర్ అందాలన్నీ చూసి, తిరుగు ప్రయాణం అవుతుండగా నాలో ఏదో వెలితి. ఏదో కోల్పోతున్నాం అనే భావన. వాస్తవానికి, నా జీవితంలో ఎన్నో ప్రదేశాలకి వెళ్లినా ఇలాంటి సందిగ్ధ పరిస్థితి ఎప్పుడూ నెలకొనలేదు. దేవుడా కాశ్మీర్ లో పరిస్థితులు త్వరగా చక్క బడేలా చూడు అని మాత్రం మొక్కుకున్నా, ఎందుకంటే అక్కడి వాళ్ళు మన సహోదరులే కదా!

ఐసీయూకి చేరిన ఐసిస్!

  ఆదివారం ప్రపంచం పెద్దగా పట్టించుకోని ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది! ఇరాక్ సేనలు మోసుల్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నాయి! మోసుల్ ప్రపంచ పటంలో మహానగరమేం కాదు. కాని, అది ఐఎస్ఐఎస్ ఉన్మాదుల రాజధాని! అక్కడ్నుంచే ప్రపంచం మొత్తాన్ని ముస్లిమ్ సామ్రాజ్యంగా మార్చేస్తామని ఐఎస్ అధినేత బాగ్దాదీ ప్రకటించాడు కూడా! అటువంటి అత్యంత ప్రధానమైన నగరం ఇప్పుడు ఐఎస్ కు లేకుండా పోయింది. కేవలం కొన్ని చిన్న చిన్న ఇరాకీ ఊళ్లు, ఎడారి ప్రాంతం మాత్రం మిగిలింది. ఒక విధంగా చూస్తే మోసుల్ ఐఎస్ సంస్థ చేతి నుంచి జారిపోవటంతో దాని పని అయిపోయినట్టే! కాని, ఉగ్రవాదంపై యుద్దంలో ఒక పోరు ముగిసింది. మరెన్నో పోరాటాలు మిగిలే వున్నాయి!   ఒకవైపు ఇరాకీ సైన్యం అమెరికా సాయంతో ఐఎస్ ను ఓడించి మోసుల్ తిరిగి రాబట్టుకుంటే… అదే సమయంలో ప్రపంచ క్రిస్టియన్లంతా ఎంతో గౌరవించే పోప్ ఏమన్నారో తెలుసా? ఆయన ఐఎస్ ను,ఇరాక్ ను ఉద్దేశించి ఏమనకున్నా అమెరికా, రష్యా, ఉత్తర కొరియా, చైనాలు ఒకే గూటి పక్షులని విమర్శించారు! ఆ నాలుగు దేశాలు కావాలనే ప్రపంచంలో ఎక్కడో ఓ చోట యుద్ధం జరిగేలా చేసి .. మళ్లీ పెద్ద మనుషుల రూపంలో వెళ్లి ఆపుతున్నాయని సూటిగా, స్పష్టంగానే చెప్పేశారు! సిరియా లాంటి చిన్న చిన్న దేశాలపై అమెరికా యుద్దం చేసి తన స్వంత లాభం చూసుకుంటోందని పోప్ అన్నారు!   పోప్ మాత్రమే కాదు… ప్రపంచంలోని చాలా మంది అమెరికా లాంటి అగ్రదేశాల కుట్రల్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూనే వున్నారు. ఐసిస్ అసలు పుట్టిందే అమెరికా ఉన్మాదం వల్ల! సిరియా, లిబియా లాంటి దేశాల్లో వున్న నియంతలకి వ్యతిరేకంగా ఉద్యమాలు సృష్టించి, వాటికి మద్దతిచ్చి , ఆ దేశాల్ని ఛిన్నాభిన్నం చేసింది. అక్కడున్న చమురు ఇప్పుడు హాయిగా వాడుకుంటోంది. కాని, అమెరికా సాయంతో ఆయుధాలు పట్టుకుని రెచ్చిపోయిన ఉన్మాదులు తరువాతి కాలంలో మళ్లీ జనంపై పడ్డారు. అమెరికా ఇచ్చిన ఆయుధాలతో ఐఎస్ఐఎస్ ఏర్పాటై, లక్షల మంది జీవితాల్ని సర్వనాశనం చేసిందన్నది బహిరంగ రహస్యం! ఇప్పుడు తనే ప్రపంచం మీదకి వదిలిన ఇస్లామిక్ స్టేట్ ను అమెరికా ఇరాకీ సేనల్ని బలి చేసి అంతం చేసింది! మోసుల్ ఇరాక్ ప్రభుత్వానికి చిక్కటం ఒక విధంగా ఐఎస్ అంతమనే చెప్పాలి!   ఐసిస్ దెబ్బకి మోసుల్ లాంటి పురాతన నగరం దాదాపు 40శాతం ధ్వంసమైపోయిందట. అలాగే అక్కడి గల్లీ గల్లీలో శవాలు రోడ్లపై పడి కనిపిస్తున్నాయట. అవన్నీ జిహాద్ పేరుతో ఉన్మాదం సృష్టించిన ఉగ్రవాదులవే! ఇప్పుడు వారి చెర నుంచి బయటపడ్డా మోసుల్ నగరం కాని, ఇరాక్ కాని కోలుకోవటానికి ఎంత సమయం పడుతుందో ఎవరూ చెప్పలేరు. మరోవైపు అసలు ఐసిస్ మోసుల్ లో వున్న స్థావరం కోల్పోయినంత మాత్రాన అంతమైనట్టు కాదని కూడా కొందరంటున్నారు. అమెరికా, రష్యా, ఇతర అగ్రదేశాలు దొంగచాటుగా ఉగ్రవాదులకి మద్దతిస్తున్నంత కాలం ఏదో ఒక పేరుతో రక్తపాతం జరుగుతూనే వుంటుందని వారంటున్నారు! పోప్ మాటల సాక్షిగా అది కాదనలేని సత్యమే!

ఆంధ్రా ‘కురుక్షేత్రం’లో కులాల పద్మవ్యూహం పన్నుతున్నారా?

  ఏపీలో అధికార టీడీపీ పాలనకి వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయా? అవుననే అనిపిస్తోంది పరిస్థితులు చూస్తోంటే! మరీ ముఖ్యంగా, కులాల కుంపట్లు రాజేయాలని కొందరు తీవ్రంగా ప్రయత్నిస్తోన్నట్టు ఇట్టే తెలిసిపోతోంది. చాలా రోజులుగా కాపుల రిజర్వేషన్ అంశం వివాదంలో వుండగానే కొత్తగా మంద కృష్ణ మాదిగ రంగంలోకి దిగారు. కురుక్షేత్రం అంటూ రణరంగం సృష్టించారు. అసలు వున్నట్టుండీ కృష్ణ మాదిగ ఎక్కడ్నుంచీ వచ్చినట్టు? ఎమ్మార్పీఎస్ హఠాత్ ఉద్యమానికి కారణం ఏంటి?   తెలంగాణ , ఏపీ విడిపోయాక ఆంద్రా ఓట్లర్లు చంద్రబాబు సీనియారిటికీ పట్టం కట్టారు. ఆయనైతేనే అన్ని వర్గాల్ని, అన్ని ప్రాంతాల్ని అభివృద్ధి చేయగలరని, కొత్త రాష్ట్రాన్ని వడివడిగా అడుగులు వేయిస్తారని భావించారు. కాని, మూడేళ్లు పూర్తి అయ్యేలోపే ప్రతిపక్షాలు, వాటికి అనుకూలంగా వున్న శక్తులు అధికారం కోసం తహతహ లాడిపోతున్నాయి. ప్రతిపక్ష నేతైన జగన్ పబ్లిగ్గానే నేనే నెక్ట్స్ సీఎం అంటూ స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. మరో వైపు ఆయనకు పరిస్థితులు అనుకూలించే విధంగా కాపు రిజర్వేషన్లు అంటూ ముద్రగడ లాంటి నేతలు జనాన్ని రోడ్లపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.   కాపుల నిరసనలో భాగంగా ఓ ట్రైన్ కు నిప్పు పెట్టడం ఆ మధ్య తీవ్ర కలకలం రేపింది. చివరకు, అది ప్రభుత్వంపై కోపంతో వున్న జనం చేసిన పనేం కాదని తేలింది. కుట్ర పూరితంగా విధ్వంసానికి దిగారని రిపోర్ట్ వచ్చింది. అంటే కాపు రిజర్వేషన్ అని పైకి చెబుతోన్న లోలోన ప్రభుత్వాన్ని అస్థిర పరచటమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది!   ఇక మొన్నీ మధ్యే ఐవైఆర్ ఉదంతం కూడా పెద్ద వివాదంగా మారింది. నిజానికి ఆయన ప్రభుత్వ వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయటం చంద్రబాబు చర్య తీసుకునేలా చేసింది. ఆయనని తొలగించిన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవిలో మరో బ్రాహ్మణుడ్నే కూర్చోబెట్టారు. ఇందులో ఎలాంటి కుల పరమైన దురుద్దేశమూ ప్రభుత్వానికి లేదు. కాని,చాలా మంది మీడియాలో, సోషల్ మీడియాలో చంద్రబాబుని బ్రాహ్మణ వ్యతిరేకిగా ముద్రవేసే ప్రయత్నం చేశారు! వచ్చే ఎన్నికల్లో బ్రాహ్మణులు టీడీపీ వెంట వుండవద్దని పిలుపులు ఇచ్చేదాకా వ్యవహారం వెళ్లింది!   తాజాగా మంద కృష్ణ మాదిగ కురుక్షేత్రం మీటింగ్ కూడా ఉన్నట్టుండీ హాట్ డిబేట్ గా మారింది. రాష్ట్రం రెండుగా విడిపోయిన తరువాత మంద కృష్ణ తెలంగాణలోనే పెద్దగా యాక్టివ్ గా వుండటం లేదు. ఒకప్పటిలా ఉద్యమాలు చేయటం, సభలు,సమావేశాలు నిర్వహించటం బాగా తగ్గింది. కాని, ఆయన ఉన్నట్టుండీ గుంటూరులో మీటింగ్ అంటు నిర్ణయం తీసుకున్నారు! పర్మిషన్ లేకున్నా నిర్వహించి తీరుతాం అంటూ ప్రభుత్వాన్ని మాదిగల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు! అసలు మంద కృష్ణ , ఎమ్మార్పీఎస్ ల డిమాండ్స్ ఏంటన్నది పక్కన పెడితే హఠాత్తుగా ఉద్యమం రాజుకోవటం కాస్త ఆలోచించాల్సిన అంశం…   నవ్యాంధ్ర తొలి సీఎంగా మూడేళ్లు పూర్తి చేసుకున్న చంద్రబాబు ఇక ఇప్పుడు కులాల వారిగా పైకి లేస్తోన్న నిరసనల్ని, అసంతృప్తుల్ని ఓ కంట కనిపెట్టాలి. లేదంటే, రానున్న ఎన్నికల్లో ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు ఖచ్చితంగా వుంటాయి. ఎందుకంటే, మన దేశంలో ఇప్పటికీ ఓటర్లు అభివృద్ధి నినాదం కంటే కుల పరమైన అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. కాబట్టి అధికారంలోని వారు ఎవరైనా కుల కోణంలో జరిగే కుట్రల్ని ఎప్పటికప్పుడు ఛేదిస్తూ వుండాలి…

మీరాకుమార్ ఏపీకి ఎందుకు రాలేదు..?

     రాష్ట్రపతి ఎన్నికలు దగ్గరకొచ్చేస్తున్నాయి. రామ్ నాథ్ కోవింద్, మీరా కుమార్ పోటీపడుతున్నారు. మరి గెలుపెవరిది? ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, సమీకరణలు తెలిసిన ఎవ్వరైనా ఠక్కున సమాధానం చెప్పగలరు! బీజేపి మద్దతుతో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బరిలో దిగిన రామ్ నాథ్ దే విజయం! ఇది నూరు శాతం తథ్యం. అయినా కూడా ప్రతిపక్ష కాంగ్రెస్ , దానికి తోడైన సెక్యులర్ కమ్యూనిస్టులు మాజీ స్పీకర్ మీరా కుమార్ ని రంగంలోకి దింపారు! ఆమె పోరాడుతోన్న ఎన్నికల యుద్ధం… ఓడిపోవటానికి చేస్తోన్నదే!   బాబు జగ్జీవన్ రామ్ కూతురైన మీరా కుమార్ ను కాంగ్రెస్ తమ అభ్యర్థిగా బరిలోకి దింపి ఏం సాధించదలుచుకుందో ఆ పార్టీకే తెలియాలి. ఓటమి తప్పనిసరే కాదు… ఓట్ల విషయంలో చాలా తేడా వుండేలా కనిపిస్తోంది పరిస్థితి. బీజేపికి లోక్ సభలో 282సీట్ల దాకా వుంటే కాంగ్రెస్ కు కేవలం 44 మాత్రమే వున్నాయి. యూపీ ఎన్నికల తరువాత రాజ్యసభలోనూ కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు, కమ్యూనిస్టుల పరిస్థితి అంతంతమాత్రంగానే వుంది. పైగా నితీష్ లాంటి నేతలు కూడా హస్తం పార్టీకి హ్యాండిచ్చి బీజేపి వైపు చేరిపోయారు ప్రెసిడెంట్ ఎలక్షన్స్ విషయంలో! మొత్తం మీద కాంగ్రెస్ మీరా కుమార్ ను రామ్ నాథ్ కోవింద్ కు వ్యతిరేకంగా ఎన్నికల్లో నిలిపి ఉనికిని చాటుకుందామని భావించింది. కాని, జరగబోయేది చూస్తుంటే… కాంగ్రెస్ బలహీనత, దయనీయత ఈ ఎన్నికల సందర్బంగా మరింత స్పష్టమయ్యేలా వుంది!   తమకు ఎవరు ఓటు వేస్తారు, ఎవరు వేయరు అని ముందే తెలిసిపోయినా… రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ పడే అభ్యర్థులు ప్రతీ రాష్ట్రమూ, కేంద్రపాలిత ప్రాంతమూ తిరిగి అక్కడి ప్రజాప్రతినిధుల్ని మద్దతు కోరటం పరిపాటి. ఆ క్రమంలోనే అన్ని రాష్ట్రాలు చుట్టేస్తున్న మీరా కుమార్ కాలుమోపని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశట! ఎందుకో తెలుసా? అసలు మన ఏపీలో కాంగ్రెస్ కి ఒక్క ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కూడా లేరు! ఇలాంటి దుస్థితి తమిళనాడు మొదలు మణిపూర్, మిజోరాం, నాగాలాండ్ వరకూ ఎక్కడా లేదు! అందుకే, దేశమంతా తిరుగుతోన్న మీరా కుమార్ తెలంగాణకు వచ్చి మరో తెలుగు రాష్ట్రం వైపు చూడకుండానే వెళ్లిపోయారు!   ఏపి నుంచీ ఓట్లు పడినా , పడకున్నా మీరా కుమార్ గెలిచే అవకాశాలు లేవని కాలిక్యులేషన్స్ చెప్పేస్తున్నాయి. కాని, సోనియా, రాహుల్ గాంధీలు ఇప్పుడైనా ఒక్కసారి తమ రాంగ్ స్టెప్స్ ని వెను తిరిగి చూసుకోవాలి. ప్రెసిడెంట్ ఎలక్షన్స్ పక్కన పెడితే అసలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పతనానికి ఏపీ వ్యవహారం చక్కటి ఉదాహరణ! యూపీ పాలన కాలంలో అన్ని రాష్ట్రాలకంటే ఎక్కువ మంది ఎంపీల్ని అందించింది సమైక్యాంధ్రప్రదేశే! అటువంటి ఏపీని జగన్ ఇష్యుతో, ప్రత్యేక తెలంగాణ వివాదంతో చేయి పార్టీ చేజేతులా చేజార్చుకుంది! తెలంగాణ ఇచ్చీ ఒక రాష్ట్రంలో ఓడింది, ఇవ్వక మరో రాష్ట్రంలో తుడిచి పెట్టుకుపోయింది. తాజాగా ఆ పార్టీ నుంచి ఏపీ రాజధాని ప్రాంతం కీలక నేతైన మల్లాది విష్ణు జగన్ పంచన చేరటం… కాంగ్రెస్ కౌంట్ డౌన్ కి మరో నిదర్శనం! ఆ మధ్య వచ్చి బహిరంగ సభ పెట్టి ప్రత్యేక హోదా అన్న రాహుల్ మళ్లీ ఇటువైపు ఎప్పుడు ప్రత్యేక దృష్టి పెడతారో తెలియదు! కాబట్టి… మోదీ చెప్పిన కాంగ్రెస్ ముక్త్ భారత్ లో మొట్ట మొదటి పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశే అయేట్లుగా వుంది!

మమతకు చెలగాటం… బెంగాల్ కు ప్రాణ సంకటం!

  మీరు రోజూ జాతీయ వార్తలు ఫాలో అయ్యేవారైతే మీకు గో సంరక్షకుల దాడిలో మరణించిన వారి గురించి తెలుస్తూనే వుంటుంది! ఇలాంటి దాడుల్లో ముస్లిమ్ లో, దళితులో ఒకరిద్దరు చనిపోతుంటారు విషాదంగా! అది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయమే! తీవ్రంగా పోరాడి అంతం చేయాల్సిన విషయమే! అందుకే, మన దేశంలోని చాలా మంది సెక్యులర్ ఉద్యమకారులు, మేధావులు వగైరా వగైరా వెంటనే రంగంలోకి దిగుతారు. ఈ మధ్యే దేశ వ్యప్తంగా నాట్ ఇన్ మై నేమ్ అంటూ రోడ్ల మీదకి వచ్చారు వందలాది మంది. గో సంరక్షణ పేరుతో హత్యలు చేయోద్దని వారు నినదించారు. చివరకు, మోదీ కూడా గో సంరక్షణ లాగే మనిషి ప్రాణం కూడా అమూల్యమైందని చీవాట్లు పెట్టారు హిందూ సంస్థల కార్యకర్తల్ని! ఇదంతా బాగానే వుంది కాని… గో సంరక్షకుల హత్యల్ని ఖండించిన వారు బెంగాల్ లో జరుగుతోన్న అల్లర్లు, హింస గురించి ఎందుకు మాట్లాడరు?   బెంగాల్ లో మత కలహాలు జరుగుతున్నాయని మీకు తెలుసా? అసలీ విషయాన్ని జాతీయ మీడియా పెద్ద అంశంగా పరిగణించటం లేదు. జాతీయ మీడియానే జనంలోకి తీసుకురాని అంశాన్ని తెలుగు మీడియా వంటి ప్రాంతీయ ఛానల్స్, పేపర్లు మాట్లాడతాయా? మాట్లడవు! కాని, కేవలం ఓ మైనర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ పోస్ట్ కు వ్యతిరేకంగా బెంగాల్ లో అల్లర్లు కొనసాగుతున్నాయి. ఆ టీనేజ్ అబ్బాయిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పటికీ … రాష్ట్ర రాజధాని కోల్ కతాకు అరవై కిలో మీటర్ల దూరం కూడా లేని ఉత్తర 24 పరగణాల జిల్లాలో అరాచకం రాజ్యమేలుతోంది! అతివాద మైనార్టీ మూకలు ప్రభుత్వ , ప్రైవేట్ ఆస్తుల్ని ఇష్టానుసారం తగలబెడుతున్నాయి. బషిహ్రత్ అనే ప్రాంతంలో హిందువులు బిక్కుబిక్కుమనే స్థితి నెలకొంది! ఇంత జరుగుతోన్నాఇంగ్లీష్, హిందీ ఛానల్స్, పేపర్లు చిన్న చిన్న వార్తా కథనాలతో సరిపెడుతున్నాయి తప్ప ఏ మాత్రం హడావిడి చేయటం లేదు…   బెంగాల్ లో జరుగుతోన్న దానికి అక్కడి ముస్లిమ్ లని బాధ్యులని చేయటం ఎంత మాత్రం సరికాదు. మిగతా అన్ని రాష్ట్రల్లోని ముస్లిమ్ లలాగే వారు కూడా చాలా వరకూ పేదవారే. వారు పనిగట్టుకుని హింసాకాండకి దిగుతున్నారనుకోవటం మూర్ఖత్వం. కాని, జరుగుతోన్నది కరుడుగట్టిన రాజకీయ క్రీడ. మోదీ, అమిత్ షాల పేర్లు చెబితే భగ్గున మండిపోతోన్న మమతా బెనర్జీ అంతకంతకూ సెక్యులర్ మూర్తిగా దర్శనమిచ్చే పనిలో పడిపోయారు. ఆ క్రమంలో దేశంలో ఎక్కడా లేని విధంగా హిందు, ముస్లిమ్ గొడవలు చోటు చేసుకుంటున్నాయి బెంగాల్ లో. ఆ మధ్య మాల్డా అనే ప్రాంతంలో తృణమూల్ అండ వున్న అల్లరి మూకలు విధ్వంసం సృష్టించాయి. తరువాత శ్రీరామ నవమి ఉత్సవాలప్పుడు, వసంత నవరాత్రి పూజలప్పుడు మమత సర్కార్ హిందువులపై తీవ్ర అంక్షలు విధించి చెడ్డ పేరు తెచ్చుకుంది. దుర్గా, రామనవమి విజయ యాత్రల కోసం బెంగాల్ హిందువులు కోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకోవాల్సి వస్తోంది. ఇలా పదే పదే బీజేపి, ఆరెస్సెస్ మీద కోపం, చిరాకు వంటివన్నీ బెంగాల్ హిందువుల మీద ప్రదర్శిస్తోంది అక్కడి సీఎం!   తాజా బషిహ్రత్ అల్లర్ల నేపథ్యంలో కూడా మమత బెనర్జీ ప్రవర్తన ఆక్షేపణీయంగా వుంది. రోజుల తరబడి ఆస్తుల నష్టం, శాంతి భద్రతల సమస్య కొనసాగుతుంటే… ఆమె తనతో గవర్నర్ బీజేపి ఏజెంట్ లా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు చేస్తోంది. అది కేవలం రాజకీయ డ్రామా అన్నది అందరికీ తెలిసిందే. గవర్నర్ బీజేపి ఆజ్ఞాలకి అనుగుణంగా వ్యవహరించటం పెద్ద వింతేం కాదు మన దేశంలో. కాంగ్రెస్ వున్నా గవర్నర్లు అలాగే ప్రవర్తిస్తారు. కాని, పదే పదే రాష్ట్రంలో అల్లర్లు చెలరేగి, ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోంటే అది ఖచ్చితంగా ముఖ్యమంత్రి బాధ్యతే. దాన్నుంచి జనం దృష్టిని తప్పించటానికి గవర్నర్ ని అడ్డుపెట్టుకోవటం ముందు ముందు కోలుకోలోని ఎన్నికల ఫలితాల్ని ఇస్తుంది. మమతా బెనర్జీ ఇప్పటికైనా ముస్లిమ్, హిందూ ఓటు బ్యాంకులుగా కాకుండా జనం అందర్నీ ఒక్కటిగా చూసే నిజమైన సెక్యులరిజమ్ అలవాటు చేసుకోవాలి. అదే సమయంలో మీడియా, మేదావులు కూడా బెంగాల్ లో జరుగుతోన్న అసహజ పరిణామాల్ని బయటి ప్రపంచానికి స్పష్టంగా తెలియజెప్పాలి…

నెహ్రు టూ మన్మోహన్… ఇజ్రాయిలంటే ఎందుకు భయపడ్డారు?

  మోదీ పీఎం అయ్యాక చాలా రోజుల వరకూ ఆయన విదేశీ పర్యటనల మీద కామెంట్సు, కాంట్రవర్సీలు నడిచాయి. అసలు ఆయన స్వంత దేశంలో వుండటమే లేదంటూ వెటకారాలు చేసిన వారున్నారు. విమర్శలు చేసిన వారు కూడా వున్నారు. ఎవరి కోణం ఎలా వున్నా మోదీ ఎప్పటిలాగే తనకు నచ్చింది చేస్తూ పోయారు. అయితే, ఇప్పటికి అయిదుసార్లు అమెరికా వెళ్లిన మోదీ గతంలో భారత ప్రధానులు కాలుమోపని దేశాల్ని కూడా వెదికి పర్యటిస్తున్నారు. అందుక్కారణం… అందరికీ తెలిసిందే!   మోదీ విదేశీ పర్యటనలు సరదాలో, కాలక్షేపాలో కాదు. ఆయన అంతర్జాతీయ రంగంలో భారత్ ను అగ్రశక్తిగా నిలిపే వ్యూహంలో వున్నారు. అమెరికా నుంచీ రష్యా దాకా అన్ని దేశాల్ని సాధ్యమైనంత వరకూ మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే, ఏడు ఖండాల్లో ఏ దేశం మనకు ఉపయోగపడుతుందని భావించినా వెంటనే రెక్కలు కట్టుకుని అక్కడ వాలిపోయి ఆర్దిక, ద్వైపాక్షిక, భద్రతా రంగాల్లో అనేక ఒప్పందాలు చేసుకుని వస్తున్నారు. ఈ ప్రయత్నంలో మోదీ ఇజ్రాయిల్ నేలపై కాలు మోపటం… నిజంగా పెద్ద సాహసమే! మిగతా అన్ని దేశాలు తిరగటం ఒక ఎత్తు … మధ్య ప్రాచ్యంలోని అనేక ముస్లిమ్ మెజార్టీ దేశాల నడుమ వున్న ఈ ఏకైక యూదు దేశంలో అడుగు పెట్టడం మరో ఎత్తు!   ఇజ్రాయిల్ అనే దేశం భారత్ కు స్వాతంత్రం వచ్చినప్పుడే, 1947లో, ఆవిర్భవించింది. ప్రపంచ వ్యాప్తంగా వున్న యూదులంతా అక్కడికి వలసొచ్చి ఒక దేశంగా ఏర్పడ్డారు. అయితే, చరిత్రలోకి వెళితే ఒకప్పుడు ఇజ్రాయిల్ ప్రాంతమంతా యూదులదే. తరువాత వార్ని ముస్లిమ్ పాలకులు అక్కడ్నుంచి తరిమేశారు. తిరిగి రెండవ ప్రపంచ యుద్ధ అనంతర పరిణామాల్లో పాలస్తీనా లోంచి ఈనాటి ఇజ్రాయిల్ ఏర్పడింది. అక్కడ భారత్ నుంచి సహా ఎన్నో దేశాల నుంచి వలస వెళ్లిన యూదులు స్థిరపడ్డారు. ఇవాళ్ల ఇజ్రాయిల్ ప్రపంచపు అభివృద్ధి చెందిన అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటి!   1947లో ఇజ్రాయిల్ పార్లమెంట్ మొదటిసారి సమావేశమైనప్పుడు వారు తొలి తీర్మానం చేసింది ఇండియా గురించే! తమ మాతృభూమి అయిన ఇజ్రాయిల్ నుంచి తాము వెళ్లగొట్టబడినప్పుడు గుంపులు గుంపులుగా తాము ఎన్నో దేశాలకు వలస వెళితే… అంతటా ఊచకోతలతోనే స్వాగతం పలికారు. కేవలం ఇండియాలో మాత్రమే 2వేల సంవత్సరాల కిందటే తమకు ఏ హానీ లేకుండా ఆశ్రయం కల్పించారని వారు తీర్మానించారు.అందుకు ధన్యవాదాలు కూడా చెప్పారు! అయితే, నెహ్రు నుంచి మన్మోహన్ వరకూ మన పాలకులు మాత్రం ఇజ్రాయిల్ ను చూసి చూడనట్టే వ్యవహరించారు. చాలా రోజుల పాటూ చాలా దేశాలు ఇజ్రాయిల్ ను అధికారికంగా గుర్తించలేదు. ఇండియా కూడా ఇజ్రాయిల్ స్వతంత్ర దేశం కాదనీ… పాలస్తీనాలో భాగమని చెబుతూ వచ్చింది. అందుకే, ఇన్ని దశాబ్దాల్లో ఏ ఒక్క భారత ప్రధాని ఇజ్రాయిల్ పర్యటించలేదు. ఆ దేశంతో పెద్దగా దౌత్య సంబంధాలు పెట్టుకోలేదు కూడా! ఇదంతా పాలస్తీనాకు మద్దతుగా మన వారు చేసిన చర్యలే. అలాగే ఇండియాలోనూ వున్న కోట్లాది మంది ముస్లిమ్ ల మనోభావాలకు అనుగుణంగా నడిపిస్తూ  వచ్చిన విదేశాంగ విధానం!   ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇజ్రాయిల్ ను అమెరికా అధ్యక్షుడే బోలెడు సార్లు సందర్శిస్తుంటారు. మరి అటువంటప్పుడు భారత్ తో మైత్రి కోరుతున్న ఒక అభివృద్ధి చెందిన దేశాన్ని ఇండియా తిరస్కరించటం ఎందుకు? ఇజ్రాయిల్ తో మైత్రి వల్ల భారత్ కు ఎన్నో లాభలే తప్ప నష్టాలేం లేవు. మరీ ముఖ్యంగా, భారతీయ ముస్లిమ్ లకు వచ్చిన నష్టం ఎంత మాత్రం లేదు. అందుకే, మోదీ ఇజ్రాయిల్ పర్యటిస్తున్న తొలి ప్రధానిగా చరిత్రకెక్కారు. అందుకు తగ్గట్టే ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు కూడా మరే దేశ ప్రధానికి ఇవ్వని గౌరవం, ప్రాముఖ్యత మోదీకి ఇస్తున్నారు.   పోప్, అమెరికా అధ్యక్షుడు తమ దేశానికి వస్తే తప్ప మరెవరి కోసమూ ఇజ్రాయిల్ ప్రధాని ఎయిర్ పోర్ట్ కు వెళ్లరు. కాని, మోదీ కోసం నెతన్యాహు స్వయంగా విమానాశ్రయానికి వస్తున్నారు. వెల్ కమ్ చెబుతున్నారు. అంతే కాదు, పర్యటన పర్యంతం ఇజ్రాయిల్ పీఎం అన్ని పనులు మానుకుని మన ప్రధాని వెంటే వుండనున్నారు. అనుక్షణం ఆయనతో ప్రయాణిస్తూ కొత్త స్నేహానికి బాటలు వేయనున్నారు. ఇదంతా భారత్ లాంటి ఒక అతి పెద్ద ప్రజాస్వామిక దేశం చేత అధికారికంగా గుర్తింపబడాలని ఇజ్రాయిల్ చేస్తోన్న కృషి. కాని, మోదీ ఇజ్రాయిల్ పర్యటన వల్ల మనకూ చాలా లాభాలే వున్నాయి. పాలస్తీనా మొదలు సౌదీ, ఇరాన్ లాంటి ముస్లిమ్ రాజ్యాలా నడుమ ఒంటరిగా సత్తా చాటుతోంది ఇజ్రాయిల్. అందుకు దాని వద్ద ఉన్న టెక్నాలజీనే కారణం. ఇప్పుడు ఆ రాకెట్, మిస్సైల్ టెక్నాలజీని మనతో వీలైనంత పంచుకునే ఛాన్స్ వుంది. పాకిస్తాన్, చైనా లాంటి శత్రువులతో సతమతం అవుతోన్న మనకు అత్యవసరమైంది అదే! ఈ దృష్టితోనే ఎవరు ఏమనుకున్నా అక్కర్లేదంటూ మోదీ ఇజ్రాయిల్ లో కాలుమోపారు! ఇది ఖచ్చితంగా ప్రపంచ చరిత్రలో కొత్త మలుపే!

భారత్ ను ఈశాన్య రాష్ట్రల నుంచి వేరు చేసే కుట్ర చేస్తోన్న చైనా!

  ప్రస్తుతం ఒక వీడియో సోషల్ నెటవర్క్ లలో బాగా వైరల్ అవుతోంది. అందులో మన భారత జవాన్లు చైనీస్ సోల్జర్స్ ని తోసేస్తూ కనిపిస్తున్నారు. తిరిగి వెనక్కి వెళ్లమని విజ్ఞప్తులు చేస్తున్నారు. అయినా మొండిగా చైనీస్ జవాన్లు ముందుకు దూసుకొస్తున్నారు. ఇలాంటివి మన ఇంకో శత్రువు పాకిస్తాన్ విషయంలో ఎప్పుడూ చూడం. పాకీ సైనికులతో నేరుగా కాల్పులే. పక్క దేశం ఈ మధ్య కాలంలో ఎన్నిసార్లు కాల్పుల విరమణకి తెగబడితే మన వారూ అన్ని సార్లు గట్టిగా జవాబిస్తున్నారు. కాని డ్రాగన్ తో ప్రత్యక్ష హింస భారత్ ఉద్దేశం కాదు. చైనాకి కూడా ఇప్పటికిప్పుడు ఇండియాతో కాల్పుల కయ్యం మొదలు పెట్టాలని లేదు. అయినా కూడా రెచ్చిగొట్టి ఆనందిస్తోంది. ఎందుకు?   సాధారణంగా చైనాతో మనకు చిరాకు పుట్టించే సంఘటనలు కొత్తేం కాదు. 1962లో భారత్ డ్రాగన్ చేతిలో ఓటమిపాలైంది. అప్పట్నుంచీ మన సైనికులకి ఆ దేశమంటే పాకిస్తాన్ కన్నా ఎక్కువ కోపం. అయినా కూడా కాలం గడుస్తున్న కొద్దీ వ్యాపార, వాణిజ్యాల పరంగా చైనా, ఇండియా దగ్గరయ్యాయి. ఇప్పుడు మన వల్ల చైనాకి ఎన్నో బిలియన్ డాలర్ల లాభం. అయినా అనుక్షణం పాకిస్తాన్ ను సపోర్ట్ చేసే చైనీస్ ప్రభుత్వాలు తమ బుద్ధి పోనిచ్చుకోవటం లేదు. ఓ సారి అరుణాచల్ ప్రదేశ్ వద్ద మరో సారి మరో చోటా చికాకు పరుస్తూనే వున్నాయి. ఏ భూభాగం చూస్తే అది నాదిననే దురాక్రమణ మనస్తత్వం చైనాకు అన్ని దేశాలతో పరిపాటి. ఇప్పుడు ఆ డ్రాగన్ కన్ను భూటాన్ భూ భాగంపై పడింది. అది భారత్ కి కూడా ముప్పుగా పరిణమించే ప్రమాదం వుండటమే ఇప్పుడు ఇండియన్ ఆర్మీకి చైనా సైనికుల్ని అడ్డుకునేలా చేస్తోంది!   ఇండియా, చైనా, భూటాన్ ఒక చోట కలిసే కీలక ప్రాంతం డోకా లా. ఇది ప్రస్తుతం భూటాన్ ఆధీనంలో వుంది. ఆ దేశంలో భాగమైన డోకా లా వద్ద ఓ రోడ్డు వేయటానికి ప్రయత్నించింది చైనా. దాన్ని భూటాన్ తరుఫున అడ్డుకుంది మన సైన్యం. భూటాన్ కు అవసరమైనప్పుడు సైనిక సహాయం అందించటం రెండు దేశాల మధ్యా ఒప్పందంలో భాగమే. కాకపోతే, చైనా ఎందుకని ఇండియా, భూటాన్ లతో కయ్యం పెట్టుకుని మరీ ఓ రోడ్డు వేయాలని చూస్తోంది? దాని వెనుక పెద్ద కుట్రే వుంది!   డోకా లా అనే ప్రాంతంలో చైనా రోడ్డు వేస్తే భారత్ లోని సిలిగురి కారిడార్ మీద దాడి చేయటం ఆ దేశ సైన్యానికి ఈజీ అయిపోతుంది. సిలిగురి కారిడార్ అంటే బెంగాల్ రాష్ట్రంలోని అత్యంత కీలకమైన ప్రాంతం. ఈ ప్రాంతం వల్లే బెంగాల్, అసోమ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం లాంటి ఈశాన్య రాష్ట్రలతో సంబంధాలు కొనసాగిస్తుంది. అంటే సిలిగురి కారిడార్ ఎప్పుడైనా మూతపడితే… బెంగాల్ తో సహా మిగతా భారతదేశం మొత్తం ఈశాన్య రాష్ట్రలతో సంబంధాలు తెంచుకోవాల్సిందే! మనం నార్త్ ఈస్ట్ స్టేట్స్ లోకి ఇక వెళ్లలేమన్నమాట. ఈ కారణంతోనే డోకా లా దాకా రోడ్డు వేసుకుని ఆర్మీని అక్కడి దాకా తీసుకొచ్చి కూర్చోబెట్టాలని చైనా చూస్తోంది! అవసరమైనప్పుడు నేరుగా సిలిగురి కారిడార్ మీద బాంబు వర్షం కురిపించి ఈశాన్య భారతదేశాన్ని, మిగతా భారతదేశంతో విడదీయాలని దురాలోచన చేస్తోంది.   చైనా కుట్రల్ని ముందే పసిగట్టిన భూటాన్, ఇండియా కలిసి బీజింగ్ ను ఎదుర్కొంటున్నాయి. అయినా కూడా తనకున్న సైనిక బలంతో చైనా ఒక విధంగా విర్రవీగుతుందనే చెప్పొచ్చు. బెదిరించే ధోరణిలో కయ్యానికి కాలుదువ్వుతోంది. మొన్నీ మధ్య చైనా 1962మరిచిపోవద్దని కూడా భారత్ ను హెచ్చరించింది. అందుకు రక్షణ మంత్రి జైట్లీ ఇప్పుడు 1962నాటి ఇండియా లేదని గట్టిగా జవాబిచ్చారు. మరి ఇలా మాటకు మాట, కన్నుకు కన్ను అన్నట్టు సాగుతోన్న ఇండియా, చైనా సంబంధాలు యుద్ధం దాకా వెళతాయా? సమీప భవిష్యత్ లో అలాంటి సూచనలు కనిపించటం లేదు. కాని, ఇండియా అమెరికాకు దగ్గరవ్వటం , పాకిస్తాన్ ను అంతకంతకూ బలంగా ఢీకొడుతుండటం డ్రాగన్ కు నచ్చటం లేదు. అదీ కాక ఇప్పుడు ఆసియాలో చైనాని ధిక్కరించగలిగేది కేవలం ఇండియా మాత్రమే. అందుకే చైనాకు ఇండియా అంటే ఉలుకు ఎక్కువ. భారత్ కూడా అదే రీతిలో ఎప్పటికప్పుడు చైనా కుట్రల్ని తిప్పుకొడుతూ వుండాలి. ఎందుకంటే, పాక్ సంగతి మనం పూర్తిగా తేల్చుకునే దాకా చైనాతో ఎలాంటి యుద్ధాలకు వెళ్లకపోవటమే ఉత్తమం కాబట్టి…

జీఎస్టీ … ఒక దేశం , ఒక పన్ను, అనేక గందరగోళాలు!

  కౌంట్ డౌన్ స్టార్టైపోయింది! దేనికో తెలుసుగా? ఎస్… జీఎస్టీకి ఇంకా కొన్ని గంటలు మాత్రమే గడువుంది. తరువాత యావత్ దేశం కొత్త పన్నుల వ్యవస్థలోకి అడుపెడుతుంది. ఇంతకాలం వున్న సేల్స్ ట్యాక్స్ లు, ఎంట్రీ ట్యాక్స్ లు, సర్ చార్జీలు వగైరా వగైరా ఏవీ వుండవు. మొత్తం 18 ట్యాక్స్ ల బదులు ఒకే ఒక్క జీఎస్టీ అవతరిస్తుంది! ఇంత వరకూ బాగానే వుంది… కాని, జీఎస్టీ వచ్చాక ఏమవుతుంది? ఇదే ఇప్పుడు ఎవర్ని కదిలించినా ఠపీమని ఎదురవుతోన్న ప్రశ్న!   జీఎస్టీ అంటే ఏంటనేది పెద్ద మిస్టరీగా మారిపోయిన నేపథ్యంలో కనీసం బీజేపి మినిస్టర్లన్నా క్లారిటీ ఇస్తారేమో అంటే అది కుదరటం లేదు! యూపీలోని ఓ మంత్రి జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ అని విడమరిచి కూడా చెప్పలేకపోయాడట! విలేఖరి ప్రశ్నిస్తే తెల్ల ముఖం వేశాడట! ఆయనే పరిస్థితే అలా వుంటే మామూలు వారి సంగతి చెప్పాలా? అంతా అయోమయమే! రేపు తెల్లవారితే ఏమవుతుందని అందరూ ఆదుర్దాగా ఎదురుచూస్తున్నారు. మరీ టెన్షన్ పడని వారు సైతం జూన్ 30 అర్ధ రాత్రి తరువాత జూలై ఒకటి వచ్చేస్తుంటే చోటు చేసుకోబోయే మార్పుల గురించి ఆసక్తిగానే వున్నారు!   జీఎస్టీ అంటే … ఇదేదో నోట్ల రద్దు లాంటి షాక్ అనుకోటానికి వీల్లేదు. 1980లలో నుంచీ మన దేశంలో జీఎస్టీ అనే మాట వినబడుతూనే వుంది. 2009 నుంచీ అయితే బలంగా ప్రచారం జరుగుతోంది. అసలు జీఎస్టీని మొదట వార్తల్లోకి తెచ్చింది కాంగ్రెస్సే! కాని, ఇవాళ్ల తాము ప్రచారంలోకి తెచ్చిన జీఎస్టీని తామే విమర్శిస్తున్నారు కాంగ్రెస్ వారు. అర్థ రాత్రి జరగబోయే జీఎస్టీ లాంచింగ్ కార్యక్రమానికి కూడా డుమ్మాకొట్టి నిరసన తెలుపుతున్నారు. కారణం చాలా సింపుల్… క్రిడెట్ బీజేపికి, మోదీకి దక్కటం వారికి ఇబ్బందిగా వుంది!   కాంగ్రెస్ లాగే తృణమూల్ కాంగ్రెస్ లాంటి చాలా పార్టీలు జీఎస్టీ మిడ్ నైట్ హంగామాలో పాల్గొనబోవటం లేదు. అయితే, జీఎస్టీ వల్ల జనం నిజంగా ఇబ్బంది పడతారా? ఇప్పుడు ఇదీ అసలు ప్రశ్న. బీజేపి తాము చేసింది గొప్ప ఆర్దిక సంస్కరణ అని చెప్పుకోవటం ఊహించిందే. అది సబబు కూడా! దశాబ్దాల తరబడి పక్కన పడి వున్న జీఎస్టీ బిల్లును మోదీ, జైట్లీ పట్టుదలతో పట్టాలెక్కించారు. కాంగ్రెస్ ఆ పని చేయలేకపోయింది. కాని, ఇప్పుడు అత్యంత ఇబ్బందికర స్థితిలో వున్న హస్తం పార్టీ జీఎస్టీపై ఏదో చేయాలి కాబట్టి విమర్శలు చేస్తోంది. బీజేపి విజయానికి గుడ్డిగా మద్దతిస్తే తమ వాల్యూ తగ్గుతుందేమోనని సోనియా , రాహుల్ భయం.   1954లో మొట్ట మొదటిసారి ఫ్రాన్స్ తమ దేశంలో జీఎస్టీ ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ 160దేశాలు జీఎస్టీ లాంటి ఏకీకృత పన్ను వ్యవస్థ తమ తమ ఆర్దిక వ్యవస్థల్లో ప్రవేశపెట్టాయి. ఎక్కడా ఊహించలేనంత ఇబ్బందులు, కస్టాలు ఎదురుకాలేదు. కొంత వరకూ గందరగోళం నెలకొన్నా మళ్లీ తమంతట తామే వ్యవస్థలు సర్దుకున్నాయి. కాబట్టి ఎంతో బలంగా వుండే భారత ఆర్దిక వ్యవస్థ జీఎస్టీ వల్ల అమాంతం కుప్పకూలిపోయే ప్రమాదం ఏం లేదు. ఇక సామాన్యులకి కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పటానికి ఎలాంటి ఆధారమూ ఇంత వరకూ లభించలేదు. కొన్ని వస్తువుల ధరలు పెరిగితే మరికొన్ని తగ్గుతాయి కాబట్టి జనాల జీవితాలు అతలాకుతలం అయ్యే ప్రమాదం ఎంత మాత్రం లేదు. కొంత కాలం చిన్న చిన్న ఒడిదుడుకులు వుంటే వుండొచ్చు! కాని, అందుకు తగ్గ దీర్ఘ కాలిక ప్రయోజనాలు జీఎస్టీ వల్ల లభిస్తాయని ప్రపంచ దేశాల చరిత్ర చెబుతోంది!