మార్చి 5న చంద్రబాబు ఏం చేయబోతున్నారు...?

వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందడానికి.. జనాన్ని ఆకర్షించడానికి వైసీపీ అధినేత జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. విభజన హామీలు, ప్రత్యేకహోదా సాధన కోసం తన ఎంపీల చేత పార్లమెంట్‌లో ఆందోళన చేయించిన జగన్.. ప్రత్యేకహోదా నినాదంతో సెంటిమెంట్‌ను రగిల్చే ఆలోచన చేస్తున్నారు వైసీపీ అధినేత. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో మొట్టమొదటి అంశంగా ప్రత్యేకహోదాని చేర్చేశారు కూడా. ఈలోపు జనాన్ని అటెన్షన్ చేయడానికి తన కార్యచరణను ప్రకటించారు. మార్చి 1 నుంచి రాష్ట్రంలోని 13 జిల్లాల కలెక్టరేట్‌‌ల ముట్టడి.. 5న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని.. అప్పటికి కేంద్రం దిగి రాకపోతే.. ఏప్రిల్ 6న తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రకటించారు.   ఈ వేడి ఇంకా చల్లారకముందే నిన్న మరో బాంబు పేల్చారు ప్రతిపక్షనేత.. ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతామని.. అందుకు టీడీపీ సహకరిస్తుందా..? టీడీపీ ఆ పనిచేస్తే.. తాము మద్దతు ఇస్తామంటూ సవాల్ విసిరారు. ఒకవైపు బీజేపీతో పొత్తు ఉంచుకోవాలా..? తెంచుకోవాలా..? అన్న దానిపై క్లారిటీ కోసం ఎదురుచూస్తోన్న చంద్రబాబుకు.. ఇప్పుడు బీజేపీతో పాటు జగన్‌ని కూడా ఏకకాలంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన సుధీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఇలాంటి సంక్షోభాలను ఎన్నింటినో చూసి.. తలపండిపోయిన టీడీపీ అధినేతకు ఇదేమంత కష్టమైన పని కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.   ఇందుకోసం మొదటగా మార్చి 5వ తేదీనే తన గేమ్ ప్లాన్‌ను అమలు చేయబోతున్నారట ఏపీ ముఖ్యమంత్రి. మార్చి 5వ తేదీ నుంచి చివరి విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన రానిపక్షంలో.. ఆ రోజే బీజేపీకి తొలి షాక్ ఇవ్వాలనుకుంటున్నారట.. మార్చి 5న టీడీపీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేస్తారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడి ఉంటామని ఇప్పటికే.. అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ వార్తలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మొత్తానికి వైసీపీ కంటే ముందుగానే కేంద్రాన్ని ఒత్తిడిలో పడేసేందుకు చంద్రబాబు తెరవెనుక పావులు కదుపుతున్నారట.

జేఎఫ్‌సీని జనసేనకు వాడుకుంటాడా..?

ప్రభుత్వాలను ప్రశ్నిస్తానని.. అవినీతిని ఎండగడతానని పార్టీ పెట్టిన సినీనటుడు పవన్ కళ్యాణ్. అప్పట్లో ఎన్నికలకు రెడీ అవ్వకపోవడం.. అభిమానులు తప్ప కార్యకర్తలు లేకపోవడంతో.. టీడీపీ-బీజేపీ తరపున ప్రచారం చేసి పెట్టాడు. ఆ తర్వాత రాజకీయాలను పక్కనబెట్టి.. మళ్లీ ముఖానికి రంగేసుకున్నాడు. తీరా మళ్లీ ఎన్నికలు దగ్గరకొచ్చేయడంతో.. షూటింగ్‌లకు పెకప్ చెప్పేసి.. రాజకీయ రణరంగంలోకి దిగాడు. బస్సు యాత్రలు.. ఆ యాత్రలు చేస్తూ.. పొలిటికల్ లీడర్‌గా మారే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. మేధావి వర్గం గానీ.. ప్రజలు కానీ కల్యాణ్ బాబుని.. పొలిటికల్ బాబుగా గుర్తించడానికి ఒప్పుకోవడం లేదు.   పార్టీని నిర్మించుకోవాల్సిన టైంలో సినిమాలు తీస్తూ.. జనసేనని గాలికొదిలేయడంతో పార్టీకి ఒక స్ట్రక్చర్ లేకుండా పోయింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే అటకెక్కింది అనుకున్న ప్రత్యేకహోదా మళ్లీ తెరపైకి రావడంతో పవన్‌కి బాగా కలిసొచ్చింది. విభజన హామీల అమలులో ఎవరి తప్పు ఎంతుందో అందరి లెక్కలు తేలుస్తానంటూ పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగాడు. ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ అంటూ రాజకీయాలను వదిలేసిన వారిని, ఎవరికీ పట్టకుండా పోయిన మేథావుల్ని వెతికి పట్టుకొచ్చి మరీ ఒక చోటు కూర్చొబెట్టాడు జనసేనాని.. నిజంగా ఇది మంచి ప్రయత్నమేనని.. పవన్ ఇప్పుడిప్పుడే రాజకీయవాదిగా మారుతున్నాడంటూ పలువురు ప్రశంసిస్తున్నారు కూడా. ఆ పొగడ్తలతో పాటు మరో రకం పెదవి విరుపులు కూడా వినిపిస్తున్నాయి.   రాజకీయంగా ఎలాంటి నాలెడ్జ్ లేని పవన్ కళ్యాణ్.. జనసేనకు ఒక రూపం ఇవ్వలేక విమర్శలపాలవుతున్న పవన్ కళ్యాణ్‌.. జేఎఫ్‌సీలోని మేధావుల సాన్నిహిత్యంలో రాజకీయ ఓనమాలు దిద్దుకుంటాడా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే జేపీ, ఉండవల్లి, ఎంవీఆర్ శాస్త్రి, ప్రొఫెసర్ నాగేశ్వర్‌ ఇలా ఎవరిని కదిలించినా ఉద్ధండపిండాలే. ఇలాంటి వారి సలహాలు, సూచనలతో కల్యాణ్ రాజకీయంగా రాటుదేలే అవకాశం ఉందని.. దానిని ఆయన ఉపయోగించుకుంటే మంచిదేనంటున్నారు విశ్లేషకులు.

రేవంత్‌ రాజీనామా చేశారా..? ఎవ్వరూ నోరుమెదపరేంటీ..?

టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి నెలలు గడుస్తోంది. విజయవాడలో చంద్రబాబును కలిసి వస్తూ వస్తూ.. టీడీపీ టిక్కెట్‌పై గెలిచిన ఎంఎల్ఏ పదవి నాకొద్దంటూ.. రాజీనామా సమర్పించినట్టు ఆయనే స్వయంగా మీడియా ముందు ప్రకటించారు కూడా.. అంతకు పార్టీలు మారినవారంతా తమ తమ పదవులకు రిజైన్ చేయలేదు.. కానీ రేవంత్ రాజీనామా చేసి కాంగ్రెస్ చేరారని అందరూ ఆయనను అభినందించారు. కానీ.. పరిస్థితులు చూస్తుంటే రేవంత్ కూడా రాజీనామా విషయంలో వ్యూహాత్మకంగా పావులు కదిపారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆయన తన రిజైన్‌ లెటర్‌ను పార్టీ అధినేత చంద్రబాబుకు సమర్పించారు కానీ.. స్పీకర్‌కు పంపలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.   మరి ఇంత జరిగినా ఎవ్వరూ ఎందుకు నోరు మెదపడం లేదంటే ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారికి ముఖ్యం. రేవంత్ అనర్హత గురించి తెలుగుదేశం ప్రశ్నిస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించకుండా పార్టీలో చేర్చుకున్న చంద్రబాబు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇక కేసీఆర్‌ది ఇదే రకమైన పరిస్దితి.. తన అధికారం చెక్కుచెదరకుండా ఉండేందుకు.. ఎవ్వరూ తనకు పోటీకాకుండా సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలను నామ రూపాల్లేకుండా చేయాలని కంకణం కట్టుకున్న గులాబీ బాస్. ఆ వ్యూహాంలో చాలా వరకు విజయం సాధించారు. అలా టీఆర్ఎస్‌లో చేర్చుకున్న వారందరి చేత రాజీనామాలు చేయించలేదు. ఒకవేళ రాజీనామాలు చేయిస్తే.. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు 20 నుంచి 30 ఉపఎన్నికలు ఖాయం. ఈ తలనొప్పంతా ఎందుకని.. రేవంత్‌ విషయంలో ఎక్కడి వారక్కడే గప్‌చుప్ అంటోంది.   ఇక లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ కాంగ్రెస్. కొడంగల్‌లో హస్తం పార్టీ ఉపఎన్నికలకు వెళ్లిందే అనుకున్నాం.. కానీ అక్కడ కేసీఆర్ వదులుతాడా..? సామ, దాన, భేద, దండోపాయాలను ఉపయోగించైనా సరే.. రేవంత్‌ను అడ్డుకుంటాడు.. కాంగ్రెస్ గెలిస్తే మంచిదే. ఒకవేళ అటు ఇటైతే మాత్రం ఎన్నికల వేళ శ్రేణుల మానసిక స్థైర్యం దెబ్బతిన్నట్లే. ఉపఎన్నికల్లోనూ.. ఇటీవల ముగిసిన ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కారు జోరుగా దూసుకెళ్లింది. ఇంకేదైనా బైపోల్ వచ్చినా.. ఇదే రిజల్ట్ ఖాయమని సర్వేలు చెబుతున్న తరుణంలో.. కాంగ్రెస్ హైకమాండ్ సాహసం చేయదని విశ్లేషకులు భావిస్తున్నారు. సో.. రేవంత్‌ను కదిపేవారు కానీ.. ఇదేంటని అడిగేవారు కానీ లేరని పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

పవన్, రజనీ.. ఆయన్ను ఫాలో అవ్వొచ్చు కదా!

’పవన్ కల్యాణ్ ఇక సినిమాలు చేయడు...‘ కోట్లాది మంది అభిమానులను నిరాశకు గురిచేసే మాట.  ’కమలహాసన్ ఇక నటించడు...‘ యావత్ భారతావనే బాధతో నిట్టూర్చే మాట.  ’సూపర్ స్టార్ రజనీకాంత్... ఇక తెరపై కనిపించడు...‘ దేశవ్యాప్త తలైవా ఫ్యాన్సును విషాదంలో ముంచెత్తే మాట.  నిజానికి రాజకీయాల్లోకెళ్తే.. చేసే పనిని వదిలిపెట్టాలా? అలా అయితే... ఎన్టీయార్ ‘నా దేశం’ సినిమా చేసేవారు కాదే. అలా అయితే... ఎన్టీయార్ నుంచి ‘శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మంగారి చరిత్ర’ సినిమా వచ్చేది కాదే. రాజకీయాల్లో ఉన్నప్పుడు సినిమాలు చేయకూడదనేం రూల్ లేదు. అలాంటి రూలే ఉంటే... ముఖ్యమంత్రిగా ఉంటూనే  ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ ఎందుకు చేస్తాడు ఎన్టీయార్? ఓ వైపు ప్రతి పక్షనేతగా ఉంటూ.. మరో వైపు ఏకంగా సామ్రాట్ అశోక, మేజర్ చంద్రకాంత్, శ్రీనాధ కవిసార్వభౌమ చిత్రాల్లో ఎందుకు నటిస్తారు?    ఎన్టీయార్ రాజకీయాల్లో ప్రవేశించిన కొత్తలో.. ప్రచారంలో ఉండగా చేసిన సినిమా ‘నాదేశం’. అప్పటి రాష్ట్ర పరిస్థితులను, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రశ్నిస్తూ చేసిన సినిమా అది. దానికి జనాలు బ్రహ్మరథం పట్టారు. రాజకీయ పరంగా కూడా ఆయనకు ఆ సినిమా ఉపయోగపడింది. ఆ వెంటనే ముఖ్యమంత్రి అయ్యారు. కానీ పవర్ స్టార్ చివరి సినిమా అని చెప్పుకుంటున్న ‘అజ్ఙాతవాసి’... ఆయన ఇమేజ్ ను డామేజ్ చేసింది. రజనీకాంత్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లే ముందు తెరపై కనిపించబోయే సినిమాలు... రోబో2, కాలా.. ఇవి సమకాలీన సమస్యల్ని ఎత్తి చూపే సినిమాలు కావు. మామూలు కమర్షియల్ సినిమాలు. కమల్ విశ్వరూపం 2, భారతీయుడు 2 సినిమాలు చేస్తానంటున్నాడు     అసలు ఈ సూపర్ స్టార్లు ముగ్గురూ ఎన్టీయార్ ని ఎందుకు ఇన్స్పిరేషన్ గా తీసుకోకూడదు? సామాజికాంశాలు మేళవించిన కథలను ఎంచుకొని... జనాల్లో చైతన్య దీపికలను వెలిగిస్తూ... ఓ వైపు నటులుగా.. మరో వైపు నాయకులుగా ఎందుకు ముందుకెళ్ల కూడదు? చేతిలో ఉన్న బలమైన ఆయుధమైన సినిమాను ఉపయోగించుకోవడం చాతకాని వీరు.. రేపు రాజకీయాలేం చేస్తారని చాలామంది అనుకుంటున్నారు.    సూపర్ స్టార్, వపర్ స్టార్ల రాజకీయ జీవితాలకు ఉపయోగపడే సినిమాలను తెరకెక్కించే దర్శకులు కానీ.. రచయితలు కానీ ఇప్పుడు లేరా? అనే అనుమానాలను కూడా జనాల్లో వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీయార్ ‘నా దేశం’ స్థాయి సినిమాను తీసే దర్శక, రచయితలు నేడుంటే... దేశ రాజకీయ చిత్రాన్ని.. వెండితెర సాక్షిగా ఎండగట్టే సినిమాలు వీరిద్దరి నుంచి వస్తే... దేశ రాజకీయాల్లో వేడి మొదలవ్వడం ఖాయం. జనాల్లో కొత్త కదలక రావడం ఖాయం. దక్షిణాది సినిమాల్లో కూడా ఓ కొత్త ట్రెండ్ మొదలవ్వడం ఖాయం.  ఏమంటారు ఫ్రెండ్స్. 

చంద్రబాబు ప్రధాని అవ్వబోతున్నారా?

  2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు వున్నాయా? దేశ రాజకీయాలను శాశించగల వ్యక్తులు చంద్రబాబు ప్రధానమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారా? దీనికి సంబంధించి వ్యూహ రచన ఇప్పటికే ప్రారంభమైందా? తాజాగా జరిగిన పరిణామాలు ఇలాంటి సందేహాలు కలగడానికి కారణమయ్యాయి. రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ మంగళవారం నాడు అమరావతిని సందర్శించారు. అమరావతిలో జరుగుతున్న పరిపాలన కార్యక్రమాలను చూసి ఆయన చంద్రబాబును అభినందించారు. ‘‘చంద్రబాబు లాంటి సమర్థుడైన నాయకుడు ‘‘మరింత పెద్దహోదా’’లో వుంటే అద్భుత ఫలితాలు ఒనగూరుతాయి’’ అని ముకేష్ అంబానీ వ్యాఖ్యానించారు. ముకేష్ అంబానీ భావిస్తున్న ‘‘పెద్ద హోదా’’ ప్రధానమంత్రి పదవేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా దేశ రాజకీయాలను శాశించే శక్తి వున్న వ్యక్తి ముకేష్ అంబానీ... ఆయన నోటి వెంట వచ్చిన ఈ మాట ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాలలో చర్చకు దారి తీసింది.   చంద్రబాబుకు ప్రధానమంత్రి సీటు మీద కూర్చోవాలన్న కోరిక ఎంతమాత్రం లేదు. గతంలో  ఆయనకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. అయితే ఆయన ఎగిరి గంతేసి ప్రధాని కుర్చీ మీద కూర్చోలేదు. ఆ ఆఫర్ని సున్నితంగా తిరస్కరించారు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయడమే తనముందు వున్న ఏకైక లక్ష్యమని అప్పట్లో ఆయన ప్రకటించారు. గత నాలుగేళ్ళుగా నవ్యాంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి పథంలో నడిపించే పనిలో ఆయన తలమునకలుగా వున్నారు. నిధులు లేని రాష్ట్రం ఏ విషయంలోనూ వెనుకబడకుండా వుండేందుకు ఆయన తన శాయశక్తులా కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేతికి చిప్ప ఇచ్చి హైదరాబాద్ నుంచి తరిమేసిన ఆంధ్రులను గౌరవప్రద స్థానంలో నిలబెట్టడానికి తపిస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న ఈ కృషిని గమనించే ముకేష్ అంబానీ చంద్రబాబుకు ‘పెద్ద హోదా’ రావాలని భావించారేమో!   2019 ఎన్నికల తర్వాత చంద్రబాబుకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం మరోసారి లభిస్తే ఆయన ఈసారి దానిని సున్నితంగా తిరస్కరించరనే భావించవచ్చు. నిజంగానే చంద్రబాబు ఉండాల్సిన స్థాయి ప్రధానమంత్రి స్థాయే. దేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశానికి చంద్రబాబు లాంటి ప్రధానమంత్రి అవసరం ఎంతైనా వుంది. ఈ విషయాన్ని గ్రహించే ముకేష్ అంబానీ తన ఆకాంక్షను వ్యక్తం చేసి వుంటారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రెండూ ఆంధ్రప్రదేశ్‌కి ద్రోహం చేసిన నేపథ్యంలో చంద్రబాబు ప్రధానమంత్రి స్థానాన్ని చేపడితే అది ఆంధ్రప్రదేశ్‌కి ఎంతో మేలు చేసే అంశం అవుతుంది. అందుచేత.. ఈసారి చంద్రబాబు దేశానికి ప్రధానమంత్రి అవ్వాలని కోరుకుందాం.

ముద్రగడ పవన్‌ని అంత మాటనేశాడేంటీ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలు ముమ్మరం చేశారు. రాజకీయ నిరుద్యోగులుగా వున్నవారికి ఆయన ఇప్పుడు కల్పవృక్షంలా కనిపిస్తున్నారు. అలాంటి వారందరూ ఇప్పుడు జనసేన నీడన చేరడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఏ పార్టీకి సన్నిహితంగా వుండాలా అని ఎదురుచూస్తున్న ఉండవల్లి, జయప్రకాష్ నారాయణ లాంటి వారు కూడా పవన్ కళ్యాణ్‌కి చేరువవుతున్నారు. వాళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్‌ని కలసి మంతనాలు జరిపారు. ఇద్దరు ప్రముఖులు తమ నాయకుడికి చేరువ కావడం పట్ల పవన్ కళ్యాణ్ అభిమాన జనాలు, జనసేన కార్యకర్తలు హ్యాపీగా ఫీలవుతున్నారు. అయితే ఇలా హ్యాపీగా ఫీలవటం సూది దొరికిందన్న ఆనందంలో గడ్డపలుగు పోయిందనే విషయాన్ని పట్టించుకోనట్టుగా వుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.   ఇద్దరు ప్రముఖులు పవన్ కళ్యాణ్‌కి దగ్గరవుతున్నారు ఓకే.. బాగానే వుంది.. కానీ మరో ప్రముఖుడు పవన్ కళ్యాణ్‌కి దూరమవుతున్నారు.. ఆ విషయాన్ని జనసేన వర్గాలు లైట్‌గా తీసుకుంటున్నాయి. ఎవరు అవునన్నా, కాదన్నా పవన్ కళ్యాణ్ కాపు కులాన్ని తన ప్రధాన బలంగా భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మద్దతుదారుల్లో ఆ సామాజికవర్గానికి చెందిన వారి సంఖ్య చాలా ఎక్కువ. గతంలో ఈ సామాజికవర్గం వారు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ మీద ఆశలు పెట్టుకుని భంగపడ్డారు. ఇప్పుడు పవన్ మీద ఆశలు పెట్టుకున్నారు. గతంలో మాదిరిగా పవన్ కళ్యాణ్ కూడా తమను భంగపడేలా చేస్తాడా అనే అనుమానాలు వీరిని బలంగా పీడిస్తున్నాయి.   అలా అనుమానిస్తూనే, పవన్ వెంట నడుస్తున్నారు. అయితే కాపు సామాజిక వర్గంలో పవన్ కళ్యాణ్ కంటే సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభాన్ని కలుపుకుని వెళ్ళడంలో పవన్ కళ్యాణ్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. దాంతో ముద్రగడ పవన్ కళ్యాణ్‌తో కలసి నడవటానికి విముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన ఇటీవల ఒక బలమైన స్టేట్‌మెంట్ ఇచ్చారు. కాపులకు పవన్ కళ్యాణ్ వల్ల ఒరిగేదేమీ వుండదని, కాపులకు పవన్ కళ్యాణ్ కంటే చంద్రబాబే న్యాయం చేస్తారన్న నమ్మకం వుందని ముద్రగడ ప్రకటించారు. ముద్రగడ చేసిన ఈ ప్రకటన కాపు సామాజిక వర్గం మీద తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. అయితే ఈ విషయం పవన్ కళ్యాణ్‌కి, జనసేన వర్గాలకి ఇంకా అర్థమైనట్టు లేదు.

వీళ్ల ట్వీట్లలో అసలు దోషి ఎవరో..?

గత కొద్దిరోజులుగా దేశ రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాలలో అగ్గిని రాజేసిన అంశం విభజన హామీల అమలు. ఈ సెగ ఎప్పటి నుంచో మనసులో ఉన్నప్పటికీ.. బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్న సాకుతో.. ఏపీ విభజన చట్టంలో హామీల సాధన అంశం తెరపైకి వచ్చి.. ఆంధ్రలో మళ్లీ అలజడి రేపింది. దానికి ముందు నాలుగు రోజుల పాటు ఏపీ ఎంపీలు పార్లమెంట్‌లో చేసిన విన్యాసాలతో జనం ఆగ్రహాం కట్టలు తెంచుకుంది. రాష్ట్రానికి చెందిన పార్టీల ఎంపీలు ఫ్లకార్డులు పట్టుకున్నప్పటికీ.. దానికి బీజం వేసింది మాత్రం తెలుగుదేశం పార్టీ సభ్యులే. వీరిని చూసే మిగిలిన వారు.. తాము వెనుకబడిపోతామని.. క్రెడిట్ టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోతుందని భయపడి ఆందోళన బాట పట్టారు.   రాజ్యసభ వేదికగా అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనతో.. తాము చేయగలిగింది చేశామని టీడీపీ సభ్యులు అనుకుంటున్నారు. వారి భావనలో తప్పు లేదు.. అంతకు మించి వారు చేయలేరు కూడా. ఏం జరిగినా.. జరగకున్నా.. తెలుగుదేశం ఎంపీల పట్ల రాష్ట్రంలో కాస్త పాజిటివ్ టాక్ వచ్చిన మాట వాస్తవం. లోక్‌సభలో పదిహేను నిమిషాల స్పీచ్‌తో.. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ ఓవర్‌నైట్ స్టార్ అయిపోయారు. బెజవాడలో అడుగుపెట్టిన దగ్గర నుంచి గుంటూరు వరకు జయదేవ్‌కి జనం నీరాజనాలు పట్టారు. ఇలాంటి టైంలో టీడీపీ ఎంపీలు వారు చేస్తున్న పోరాటం.. ఆ పోరాటం వల్ల టీడీపీకి జరుగుతున్న నష్టం... తదితరాలపై చాలా ఘాటుగా స్పందించారు రామ్ గోపాల్ వర్మ. టీడీపీ నేత – చిత్తూరు ఎంపీ శివప్రసాద్ విచిత్ర వేషధారణలో పార్లమెంటు ఆవరణలో.. తనదైన శైలిలో విచిత్ర నిరసన వ్యక్తం చేస్తుండగా – ఆయనకు మద్దతుగా పార్టీ ఎంపీలు మురళీమోహన్ – గల్లా జయదేవ్ – రామ్మోహన్ నాయుడులు నిలిచి ఉన్న ఫొటోను తన పోస్ట్ లో పెట్టిన వర్మ… చాలా ఘాటు వ్యాఖ్యలే చేశారు. "ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు తమ విలువైన ఓటుతో ఇలాంటి జోకర్ల లాంటి ఎంపీలనా ఎన్నుకుంది.. ఇలాంటి జోకర్లను చూసి మోడీ కూడా ఏపీని ఓ జోక్‌గానే తీసుకుంటున్నారు. కనీసం వీరు జోకర్లుగా కూడా పనికి రారు. జోకర్లకు తక్కువ.. ఇంకా దేనికో ఎక్కువ" అంటూ ఏకీ పారేశారు.   ఇది జరిగిన కాసేపటికి వర్మ ట్వీట్‌కు రీ ట్వీట్ చేశారు కత్తి మహేశ్. ఆ ఫోటోలో విచిత్ర వేషధారణలో కనిపిస్తున్న చిత్తూరు ఎంపీని టార్గెట్ చేస్తూ.. "మన ఖర్మ కాలి… ఈయన చిత్తూరు ఎంపీ. ఈయన ఓ డాక్టర్. యాక్టర్ కూడానూ. పార్లమెంటులో బీజేపీకి వ్యతిరేకంగా గళం వినిపించాల్సింది పోయి… సభ వెలుపల నాటకాలు – డ్రామాలు చేస్తున్నారు. సిగ్గు సిగ్గు" అంటూ కామెంట్ చేశారు.. ఇక ప్రత్యేకహోదా ఆంధ్రుల జన్మహక్కు అన్నంతగా ప్రచారం చేసి మధ్యలో ఆగిపోయిన సినీనటుడు శివాజీ.. చాలా కాలం తర్వాత ట్విట్టర్‌లో ప్రత్యక్షమయ్యాడు..   "రోడ్లకు లక్ష కోట్లు ఇచ్చామన్నారు. 67 వేల కోట్లకే లెక్క చెప్పారు. మిగితావి ఎవరికిచ్చారు ? మీరిచ్చిన దొంగ లెక్కలు, అంకెలు కూడితే 5 లక్షల కోట్లు . స్టీల్ ప్లాంట్ , దుగరాజపట్నం పోర్టు కలిపితే 12 లక్షల కోట్లు దాటతాయి. అసలు కేంద్ర బడ్జెట్ ఎంతో మీ మట్టి బుర్రలకి తెలుసా ? అబద్ధాలు అంకెల్లో చెబితే నిజాలైపోతాయా ? హరిబాబు ఎప్పుడైనా ఆంధ్ర సమస్యలపై 10 నిమిషాలు పార్లమెంటులో మాట్లాడారా ? 27 పేజీల లేఖలో రైల్వే జోన్ మర్చిపోయావేం ? విశాఖ హరిబాబూ ?" అంటూ బీజేపీని దోషిగా తేల్చేశాడు. వర్మ, కత్తి మహేశ్‌‌లు టీడీపీ ఎంపీలను టార్గెట్ చేయగా.. శివాజీ మాత్రం తప్పు హరిబాబుదే అన్నట్లుగా ట్వీట్ చేశారు. అంత కన్‌ఫ్యూజన్ ఎందుకు తప్పెవరిదో తేల్చేందుకు.. పవన్ జేఏసీ ఉండగా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

తెలుగు హీరోలకి ఏపీ ప్రజలపై బాధ్యత లేదా..?

"దూరపు కొండలు నునుపు" అని మన పెద్దలు వూరికే అనలేదు. కేంద్రప్రభుత్వం జల్లికట్టుపై నిషేధం విధించిన వేళ.. మన పక్క రాష్ట్రం తమిళనాడులో ప్రజలంతా ఆందోళనకు దిగితే.. పెద్ద హీరో, చిన్న హీరో అన్న తేడా లేకుండా కోలీవుడ్ మొత్తం రోడ్ల మీదకు వచ్చింది. చిన్నప్పటి నుంచి మాకు మద్రాస్‌తో అనుబంధం ఎక్కువని.. తెలుగు హీరోలు కూడా తమిళ జనాలకు మద్దతు ప్రకటిస్తూ.. పోటీలు పడి ట్వీట్లు చేశారు. ఇంకొందరైతే మరో అడుగు ముందుకేసి ప్రెస్ మీట్లు పెట్టి మరి సపోర్ట్ చేశారు. భారతీయులుగా ఇరుగు పొరుగుకి మద్దతు తెలపడంలో ఏమాత్రం తప్పులేదు. కానీ ఇంట గెలిచి రచ్చ గెలవాలనే చిన్న సూక్తిని తెలుగు హీరోలు విస్మరించారు.   2018-19 బడ్జెట్‌లో కేంద్రప్రభుత్వం ఏపీకి చేసిన దారుణమైన అన్యాయానికి సీమాంధ్ర రగిలిపోతోంది. ప్రజల ఆవేదనను నాలుగు రోజుల నుంచి ఎంపీలు పార్లమెంట్‌లో వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. మీరేం చేశారని ప్రధాని మోడీని ఉభయసభల్లో కడిగిపారేస్తున్నారు. అయినా కేంద్రప్రభుత్వం చీమకుట్టినట్లు కూడా లేకుండా తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. సహజంగానే యువత సోషల్ మీడియా ద్వారా కేంద్రంపై పోరాటానికి దిగింది. ఇంత జరుగుతున్నా.. తెలుగు హీరోలెవరూ నోరు మెదపకపోవడం ఐదు కోట్ల ఆంధ్రులకు మింగుడు పడటం లేదు.   మీడియా ముందు కొచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు.. కానీ మద్ధతుగా ఒక్క ట్వీట్ చేస్తే చాలు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌, యువ హీరో నిఖిల్ మాత్రమే ఇప్పటి వరకు స్పందించిన వారిలో ఉన్నారు. పవన్‌ రాజకీయపార్టీ అధినేత కాబట్టి ఆయనకు తప్పదు.. ఇక నిఖిల్ చిన్న హీరో.. అతనికి ఉన్న ధైర్యం చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మహేశ్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్‌లకు లేదా..? పైన చెప్పిన వారి మూలాలన్నీ ఆంధ్రప్రదేశ్‌లోనివే. ఒకరకంగా వారంతా ఆంధ్రులే.. తోటి ఆంధ్రులు తలోక రూపాయి వేసి సినిమా చూడబట్టే.. స్టార్ స్టేటస్, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా.. వీరికి గుర్తింపు వచ్చాయన్న విషయాన్ని మన ఘనత వహించిన హీరోలు మరచిపోయినట్లు ఉన్నారు. అయినా ఇది కొద్దిరోజులే కదా.. తర్వాత మరచిపోతారని హీరోలు అనుకుంటే పొరపాటే. ప్రజలు అంత తెలివి తక్కువోళ్లు కాదు. టైమ్ వచ్చినప్పుడు లెక్కలన్నీ బయటికి తీసి బదులు తీర్చుకుంటారు.. తస్మాత్ జాగ్రత్త.!!

ఏపీకి కావల్సింది మస్కా కాదు.. మనీ!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అమాయకులు, చేతగానివాళ్ళు, మస్కాకొడితే పడిపోయేవాళ్ళని అనుకుంటున్నట్టున్నారు. అందుకే పార్లమెంటులో ఆయన చేసిన ప్రసంగంలో ఏపీ ప్రజల్ని మస్కా కొట్టే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ చేతిలో, బీజేపీ చేతిలో... ముఖ్యంగా మోడీ చేతిలో దారుణంగా మోసపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రస్తుతం మస్కాలకు పడిపోయే స్థితిలో లేరు. ఏపీ ప్రజలకు ఇప్పుడు కావల్సింది మస్కా కాదు... మనీ.   రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా ప్రధాని మోడీ పార్లమెంటులో సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. సదరు ప్రసంగంలో ఆయన రాష్ట్రపతికి ధన్యవాదాలు చెప్పే అంశం మీద తక్కువ దృష్టి పెట్టారు.. కాంగ్రెస్ పార్టీని తిట్టి పోయడం మీదే ఎక్కువ దృష్టి పెట్టారు. దేశం ఇప్పుడున్న దుస్థితికి కాంగ్రెస్ పార్టీయే కారణం అన్నట్టు మాట్లాడారు. బీజేపీ పాలన అద్భుతంగా జరిగిందన్నట్టు చెప్పుకొచ్చారు.. పనిలోపనిగా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలని మస్కా కొట్టే ప్రయత్నం చేశారు.   మొన్నటి బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి మొండి చెయ్యి చూపించింది. అడ్డగోలు విభజనతో ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ మీద కొంచెం కూడా కనికరం లేకుండా కేంద్రప్రభుత్వం వ్యవహరించింది. ఈ విషయం మీద ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మోడీ మీద నిరసన గళం వినిపిస్తోంది. ఏపీలో ఇప్పుడు పూర్తి స్థాయి వ్యతిరేకత కనిపిస్తోంది. పార్లమెంటులో కూడా ఏపీ పార్లమెంట్ సభ్యులు పట్టు వదలకుండా తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఇలాంటి సమయంలో పార్లమెంటులో ప్రసంగించిన మోడీ తనదైన శైలిలో తెలివితేటలు చూపించారు. ఆంధ్రప్రదేశ్ విభజనని అడ్డగోలుగా, పార్లమెంటు తలుపులు మూసేసి చేశారని విమర్శించారు. అడ్డగోలు విభజన కారణంగా ఇప్పటికీ సమస్యలు ఏపీని వేధిస్తున్నాయన్నారు. టి.అంజయ్యకి జరిగిన అవమానాన్ని చూసి భరించలేకే ఎన్టీ రామారావు సినిమా కెరీర్‌ని వదలి రాజకీయాల్లోకి వచ్చారని చెప్పుకొచ్చారు.   పార్లమెంటు ప్రసంగంలో మోడీ ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన తీసుకురావడం ఏపీ ప్రజలను మస్కా కొట్టడానికేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయితే మోడీ మస్కాలకు లొంగే స్థితిలో ఏపీ ప్రజలు లేరు. మోడీ దగ్గర ఆస్కార్ అవార్డు లెవల్ హావభావాలు వుంటే వుండొచ్చు. అయితే ఆ నటనా చాతుర్యాన్ని చూసి ఆనందించే పరిస్థితి ఏపీ ప్రజలకు ప్రస్తుతం లేదు. అందువల్ల మోడీడీ... ఏపీ ప్రజలకు కావలసింది మస్కా కాదు.. మనీ.. ముందు ఆ సంగతి చూడండి!  

బాబుకి ఫోన్ చేస్తే తమరి లెవలేం తగ్గదులే!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి తీరాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే మోడీకి మాత్రం అహంకారం అడ్డు వస్తోంది. ప్రస్తుతం తాను వున్న లెవల్‌కి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వయంగా ఫోన్ చేయాల్సిన అవసరం లేదని ఆయన భావిస్తున్నారు. అయితే చంద్రబాబుకి ఫోన్ చేస్తేనే పరిస్థితి చక్కబడే అవకాశం వుంది. ఫోన్ చేయడానికి మాత్రం మోడీకి మనసు రావడం లేదు.   ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక బీజేపీ నాయకుల నోటి పుణ్యం కావచ్చు... కేంద్రం ఏపీకి చూపించిన మొండి చెయ్యి కావచ్చు.. మొత్తం మీద రాష్ట్రంలో బీజేపీ మీద రాజకీయ వర్గాల్లో, జనాల్లో ఆగ్రహం బాగా పెరిగిపోయింది. మోడీ పేరు చెబితేనే ఏపీ జనాలు చిరాకు పడుతున్నారు. మోడీ అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేశారన్న అభిప్రాయం అంతటా వినిపిస్తోంది. తన పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఏపీకి మొండి చెయ్యి చూపిస్తున్నారన్న భావన కూడా బాగా పెరిగిపోయింది. కేంద్ర బడ్జెట్ తర్వాత తన పట్ల ఏపీ ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగిపోయినట్టుకు మోడీ సార్‌కి బాగా అర్థమైనా, పైకి మాత్రం అర్థం కానట్టు వున్నారు.   కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నా, మిత్రపక్షంగా వున్న బీజేపీ నాయకులు ప్రభుత్వం మీద, తన మీద నోరు పారేసుకుంటున్నా చంద్రబాబు  గుట్టుగా వ్యవహరిస్తున్నారు. తెగేదాకా లాగేట్టు కాకుండా... పార్లమెంటులో న్యాయపోరాటం చేయడం ద్వారానే హక్కులను సాధించుకోవాలని భావించారు. చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు చేస్తున్న పోరాటం కేంద్ర ప్రభుత్వంలో కదలిక తెచ్చినట్టు తెలుస్తోంది. ఏపీ ఎంపీలను బుజ్జగించి దారిలో పెట్టాలనే ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబుకు ఫోన్ చేసి రాజీ చేసుకోవడం మాత్రమే మోడీ ముందు వున్న ఏకైక పరిష్కారం. అయితే ఫోన్ చేయడానికి మోడీ బెట్టు చేస్తున్నారు.   అయ్యా మోడీ గారు.. చంద్రబాబుకు ఫోన్ చేసి, ఆంధ్రప్రదేశ్‌కి అవసరమైన సహకారాన్ని అందిస్తానని చెబితే తప్ప తమరి మీద ఏపీ జనంలో వున్న ఆగ్రహం తగ్గే అవకాశం లేదు. అంచేత తమరు ఇంకా ఆలస్యం చేసి మరింత డ్యామేజ్ కావడం మంచిదంటారా? అయినా మీరు ఫోన్ చేయాల్సింది ఎవరో ఆషామాషీ లీడర్‌కి కాదు... గతంలో ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా వద్దని చెప్పిన నిఖార్సయిన నాయకుడికి. అంచేత ఏ రకంగా చూసినా ఆయన స్థాయి మీతో సమానమైనదే. చంద్రబాబుకి ఫోన్ చేస్తే తమరి లెవలేం తగ్గదు. అంచేత ఇప్పటికైనా బెట్టు చేయకుండా చంద్రబాబుకి ఫోన్ చేయండి... ఏపీకి న్యాయం చేయండి.. మీ మర్యాద కాపాడుకోండి.

బాబుగారూ.. మీరు ఊ.. అనండి చాలు!

చంద్రబాబు గారూ.. మీరు ఒక్కసారి ‘‘ఊ’’ అనండి.. మేం మా సత్తా చూపిస్తాం.. వాళ్ళని ఒక్క ఆట ఆడుకుని దుమ్ము దులిపేస్తాం... అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనసులోనే మథనపడిపోతున్నారు. తమ మనసులో వున్న మాటని పార్టీ అధినేత చంద్రబాబుకు చెప్పే సాహసం కూడా వారు చేయలేకపోతున్నారు. ఎందుకంటే... టీడీపీ క్రమశిక్షణ అనే చట్రంలో ఇరుక్కుపోయిన పార్టీ కదా! పార్టీ అధినేత ఆదేశాలకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడ్డానికి అవకాశమే లేదు. ఎవరి నుంచి ఎన్ని అవమానాలు ఎదురైనా భరిస్తూ వుండాల్సిందే. ఇంతకీ తెలుగుదేశం కార్యకర్తలు ఒక్క ఆట ఆడుకుని దుమ్ము దులిపేయాలని అనుకుంటున్నది ఎవర్ని? ఇంకెవర్నండీ బాబు.. ఏపీలో నిక్షేపంగా మిత్రద్రోహానికి పాల్పడుతున్న భారతీయ జనతాపార్టీ నాయకులు, కార్యకర్తలని. అధికారంలో భాగం తీసుకుంటూనే తమమీద నోరు పారేసుకుంటున్న బీజేపీవాళ్ళని.   ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి పక్కలో బల్లెం మాదిరిగా తయారైంది. కేంద్రంలో మోడీ అండ చూసుకుని బీజేపీ నాయకులు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా సోము వీర్రాజు లాంటి వాళ్ళు మాటలతో వీరంగం వేస్తున్నారు. తాజాగా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం అండతోనే ఎమ్మెల్సీగా అవకాశం పొందిన ఆయన కనీస కృతజ్ఞత కూడా లేకుండా తెలుగుదేశం పార్టీ మీద, ఆ పార్టీ నాయకుల మీద కామెంట్లు చేస్తున్నారు. ఆయన మాటలు వింటుంటే బీజేపీ కేంద్ర నాయకత్వం అండ పుష్కలంగా వున్నట్టు కనిపిస్తోంది. అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న సోము వీర్రాజు మీద ఎదురుదాడి చేసే అవకాశం మాత్రం తెలుగుదేశం శ్రేణులకు వుండటం లేదు.   వైసీపీ అధినేత జగన్ ప్రతిపక్షంలో వున్నారు కాబట్టి ఎన్ని వ్యాఖ్యలైనా చేస్తారు.. ఎన్ని ఆరోపణలు అయినా చేస్తారు. వాటిని టీడీపీ నాయకులు సమర్థంగానే ఎదుర్కొంటున్నారు. అయితే బీజేపీ విషయంలోనే టీడీపీ కార్యకర్తలకు చేతులు కట్టేసినట్టుగా పరిస్థితి వుంది. స్వపక్షంలోనే వుంటూ తీవ్ర విమర్శలు చేస్తున్న సోము వీర్రాజు వంటి వారి విషయంలో ఎంతమాత్రం స్పందించడానికి వీల్లేదంటూ చంద్రబాబు చేస్తున్న హెచ్చరికలు టీడీపీ శ్రేణులకు ప్రతిబంధకాలుగా మారాయి. గతంలో ఎన్నో పార్టీల నుంచి వచ్చిన విమర్శలను దీటుగా ఎదుర్కొన్న తెలుగుదేశం కార్యకర్తలు ఇప్పుడు బీజేపీ విషయంలో మాత్రం ఏమీ చేయలేని పరిస్థితిలో వున్నారు.   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడ్డదిడ్డంగా విభజనకు గురి కావడానికి కాంగ్రెస్ పార్టీ ఎంత కారణమో భారతీయ జనతా పార్టీ కూడా అంతే కారణం. ఏపీ ప్రజల దృష్టిలో కాంగ్రెస్ పార్టీ ఎంతో, బీజేపీ కూడా అంతే. అయితే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నందువల్ల ఇప్పుడు అధికారంలో భాగం పంచుకోగలిగారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో తమ స్థాయిని ఎక్కువగా అంచనా వేసుకుంటున్న బీజేపీ నాయకులు 2019లో పూర్తి స్థాయి అధికారం గురించి కలలు కంటూ టీడీపీని టార్గెట్ చేస్తున్నారు. అలాంటి వారిని సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరం వుందని తెలుగుదేశం కార్యకర్తలు అంటున్నారు. చంద్రబాబు తమ ముందరి కళ్ళకు బంధాలు వేస్తూ బీజేపీ మరింత రెచ్చిపోయేలా చేస్తున్నారని భావిస్తున్నారు. అందుకే చంద్రబాబు బీజేపీని ఎదుర్కొనే విషయంలో తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. బాబు ‘‘ఊ’’ అంటే చాలు... బీజేపీ సంగతి తేల్చడానికి సిద్ధంగా వున్నారు.

వెంకయ్య రాజీనామా హెచ్చరిక..?

  కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి మొండిచేయి చూపడంతో.. అన్ని వర్గాల నుంచి నిరసన స్వరం వినిపిస్తోంది. కేంద్రప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి, రాష్ట్రంలో అధికారాన్ని చలాయిస్తున్న తెలుగుదేశం పార్టీపై సహజంగానే ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కలిసి పోటీ చేస్తాయా..? లేక ఎవరి దారి వారు చూసుకుంటారా..? అంటూ ప్రధాన రాజకీయ పక్షాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరిపాకాన పడటంతో.. పొత్తుకు ఎవరు ముందు చెక్ పెడతారనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.    టీడీపీలోనూ.. బీజేపీలోనూ పొత్తు తెంచుకోవాలని అనుకుంటున్న వర్గాలు.. తమ అధిష్టానాల మీద ఈ మేరకు ఒత్తిడి తెస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలో పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా..? అని ఎదురుచూసిన వారికి టీడీపీ అధినేత మాటలు షాక్ ఇచ్చాయి. పొత్తును తెంచుకోవడం.. కేంద్రప్రభుత్వం నుంచి బయటికి రావడం నిమిషంలో పని.. అయితే రాష్ట్రానికి జరిగిన.. జరుగుతున్న అన్యాయాలపై పార్లమెంట్ సాక్షిగా పోరాడాలని.. ప్రజల అసంతృప్తిని కేంద్రానికి అర్థమయ్యేలా చెప్పాలని సీఎం.. పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. గత రెండు, మూడు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే టీడీపీ-బీజేపీ బంధం తెగిపోతుందని అందరూ భావించారు.. కానీ చంద్రబాబు మరోసారి డెడ్‌లైన్ పెట్టడం వెనుక కారణమేమిటీ..? అంటే దానికి వెంకయ్యనాయుడు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.   ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు.. గుంటూరుకు వచ్చిన వెంకయ్యనాయుడుతో కలిసి చంద్రబాబు కొంతసేపు ఏకాంతంగా చర్చలు జరిపారట. రాష్ట్రానికి బడ్జెట్‌లో జరిగిన అన్యాయంతో పాటు... స్నేహాధర్మాన్ని పాటించకుండా బీజేపీ వ్యవహరిస్తోన్న తీరును ముఖ్యమంత్రి, వెంకయ్య దృష్టికి తీసుకెళ్లారు. ఇదంతా విన్న ఉపరాష్ట్రపతి.. బాబుకు ధైర్యం చెప్పి.. అప్పటికప్పుడు బీజేపీ అధిష్టానానికి ఫోన్ చేసి.. ఏపీ పరిస్థితిపైనా... టీడీపీతో వ్యవహరిస్తున్న తీరుపట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దెబ్బతీసే చర్యలను సహించనని.. అలా జరిగితే తన ఉపరాష్ట్రపతి పదవిని సైతం వదులుకునేందుకు వెనుకాడనని హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది.    ఇది జరిగిన కాసేపటికే టీడీపీ పార్లమెంటరీ సమావేశంలో ఉన్న చంద్రబాబుకు, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ఫోన్ చేసి.. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయనీ.. తొందరపాటు నిర్ణయాలేవీ వద్దని.. మరోసారి ప్రధానిని కలవాల్సిందిగా చెప్పినట్లు పొలిటికల్ టాక్. వెంకయ్య రాజీనామా హెచ్చరిక కారణంగానే బీజేపీ అధిష్టానం రాజ్‌నాథ్‌తో రాయబారం నడిపిందని.. చంద్రబాబు కూడా చివరిసారిగా ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామనే నిర్ణయానికి వచ్చారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

చంద్రబాబు డెసిషన్ కోసం పవన్ వెయిటింగా...?

  ఎంతో ఆశతో ఎదురుచూసిన తెలుగు ప్రజల కళ్లల్లో కేంద్రం ఎప్పటిలాగే దుమ్ముకొట్టింది. బడ్జెట్ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసింది. ఇక కేంద్రం చేసిన ఈపనికి రాజకీయ నాయకులు..రాజకీయ విశ్లేషకులతోపాటు తెలుగుప్రజలసైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కాస్త అటుఇటూగా ఉన్న అన్ని వైపులా నుండి తీవ్ర ఒత్తిడి ఉంది. ఇప్పటికీ స్పందించకపోతే రాజకీయంగా ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆయనకు సీనియర్లు, ఎంపీలు తేల్చి చెప్పారు. దీంతో సీఎం మాట్లాడుతూ జరిగిన అన్యాయంపై ఆదివారం జరిగే పార్లమెంటరి సమావేశంలో రాజకీయ నిర్ణయం తీసుకుందామని, అయితే, తొందరపడి ఎవరూ ఏది పడితే అది మాట్లాడొద్దని మంత్రులకు సూచించారు.   ఇదంతా ఒకఎత్తైతే...అసలు కేంద్రం చేసిన ఈ పనికి జనసేన అధినేత పవన్ ఇంత వరకూ స్పందించలేదు.  ప్రశ్నిస్తానన్న 'పవన్‌కళ్యాణ్‌' ఎందుకు ప్రశ్నించడం లేదనే ప్రశ్న ఆయన అభిమానులతో పాటు..అందిరనీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గతంలోనే కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఒకటే హడావుడి చేసిన 'పవన్‌' ఇప్పుడు నోరెత్తకపోవడంపై పలు సందేహాలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆంధ్రాకు ప్రత్యేకహోదా ఇవ్వలేమని...ఆ స్థానంలో ప్రత్యేక నిధులు ఇస్తామని కేంద్రం అప్పుడెప్పుడో ప్రకటన చేసినప్పుడు 'పవన్‌కళ్యాణ్‌' ఆవేశంగా స్పందించారు. పాచిపోయిన లడ్డూలంటూ కౌంటర్లు కూడా విసిరారు. అలాంటిది ఇప్పుడు ఎందుకు స్పందించడంలేదని అంటున్నారు.   అయితే ఇప్పుడు తాజాగా మరో వార్త వినిపిస్తుంది. ఈ విషయంలో చంద్రబాబు స్పందన కోసం ఎదురుచూస్తున్నారని కొందరు చర్చించుకుంటున్నారు. కేంద్రంపై పోరాటం చేయడానికి తన శక్తి సరిపోదని భావిస్తున్న పవన్ కళ్యాణ్… ఈ విషయంలో చంద్రబాబు ముందడుగు వేస్తే తాను ఆయన వెంట ఉండాలనే భావనతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు పార్టీ నేతలతోనే కేంద్రంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్న టీడీపీ అధినేత… బీజేపీ, కేంద్రంతో పోరాడాలనే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇందుకోసం ఆయన మరింత సమయం తీసుకోవాలని చూస్తున్నారు. అందుకే పార్టీ నేతలంతా ఈ విషయంలో ఒత్తిడి తీసుకొస్తున్నా… వారిని సముదాయించేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ సైతం ఈ విషయంలో చంద్రబాబు త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. చంద్రబాబు బీజేపీతో తెగతెంపులు చేసుకుని కేంద్రంపై పోరాడాలని నిర్ణయం తీసుకుంటే… టీడీపీతో కలిసి బీజేపీని టార్గెట్ చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారని పలువురు జనసేన నాయకులు చెబుతున్నారు.   ఇదిలా ఉంటే.. వైసీపీ కేంద్రం చేసిన పనిపై పెద్దగా స్పందించే పరిస్థితి లేదన్నట్టే కనిపిస్తోంది. ఏదో నామ్ కే వాస్త్ జగన్ కేంద్రంపై నాలుగు మాటలు గుప్పించారు తప్పా... ఈ విషయంలో వైసీపీ సైలెంట్ గానే ఉంటుందని అర్దమవుతోంది. ఒకవేళ టీడీపీ కనుక బీజేపీతో విడిపోతే తాము బీజేపీతో కలవొచ్చని జగన్ బాధ. మరి బీజేపీతో కలిస్తే జగన్ ఎంత లాభమో తెలీదు కానీ... వైసీపీతో కనుక బీజేపీ కలిస్తే... ప్రస్తుతం బీజేపీపై ఉన్న కోపానికి తెలుగు ప్రజలు వైసీపీని ఎలా తొక్కాలో అలా తొక్కేస్తారు. అందుకే పవన్ వైసీపీ ఎలాగూ బీజేపీతో కలవాలని చూస్తుంది కాబట్టి.. ఆపార్టీతో పెట్టుకోవడం వేస్ట్ అని.. అందుకే చంద్రబాబు డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్నాడని పలు రాజకీయవర్గాల టాక్. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

జనసేనాని ఎక్కడ... ఏం చేస్తున్నాడు.. ఏం చేయాలనుకుంటున్నాడు..?

2018-19 ఆర్ధిక సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి మొండిచేయే మిగిల్చింది. ఎన్‌డీఏ చివరి బడ్జెట్‌లో కనీసం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అయినా ఏపీకి ఏమైనా సాయం చేస్తారని అందరూ భావించారు. కానీ ప్రజల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లడంతో.. అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అధికార బీజేపీతో పొత్తు పెట్టుకుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ కేంద్రాన్ని పల్లెత్తు మాట అనడం లేదు.. ఆదివారం కోర్ కమిటీ మీటింగ్ పెట్టి బడ్జెట్‌‌పై చంద్రబాబు స్పందిస్తారని వార్తలు వస్తున్నాయి.    తమ ముఖ్యమంత్రిని ఎన్ని అవమానాలకు గురిచేసినా సరే.. ఇన్నాళ్లు ఓపికగా భరిస్తూ వచ్చామని.. ఇక ఉపేక్షించి లాభం లేదనే అభిప్రాయానికి టీడీపీ ఎంపీలు వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చాలా వరకు ఎన్డీఏతో తెగదెంపులు చేసుకునే అవకాశాలే ఉన్నాయని జరుగుతున్న పరిణామాలను బట్టి చెప్పవచ్చు. మరోపక్క ఎన్‌డీఏలో భాగస్వామి కాకపోయినప్పటికీ అన్‌అఫీఫియల్ పార్టనర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వైసీపీ.. కేంద్రం దగ్గర కుస్తీలు పడుతూనే దానిని కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్రంలో నిరసనలకు.. ధర్నాలకు పిలుపునిచ్చింది. ఇక కాంగ్రెస్, వామపక్షాల సంగతి సరేసరి.. పోరాడినా.. పోరాడకపోయినా.. వచ్చేది లేదు.. పోయేది లేదన్నది ఆయా పార్టీల ఆలోచన.. కాకపోతే విమర్శిస్తే మంచిదని ఒక ప్రెస్ మీట్ పెట్టి మోడీని ఏకీపారేశాయి.   ఇక తెలుగువాడికి అన్యాయం జరిగితే సహించేది లేదంటూ పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్‌ ఏమైపోయాడోనని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. మాట్లాడితే నిజాయితీ.. నైతికత వంటి పెద్ద పెద్ద మాటలు చెబుతూ.. నాలుగేళ్ల ప్రస్థానంలో ఆయనలో కనిపించనివే ఇవి. గత ఎన్నికలకు ముందు పవన్ ఏం చెప్పాడు..? ప్రశ్నించడమే పని కదా.. ఈ నాలుగేళ్లలో నాలుగైదు సార్లు జనాల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రశ్నించింది ఏమిటీ..? శూన్యం.. కేంద్రంలో బీజేపీ.. రాష్ట్రంలో టీడీపీ ఇచ్చిన ఎన్నికల హామీల అమలుకు పూచీ తనది అని చెప్పిన పవర్‌స్టార్.. ఇప్పుడు పత్తా లేకుండా పోయాడు.   నిన్న మొన్నటి వరకు మోడీ.. చంద్రబాబు సేవలో తరించిన పవన్ కళ్యాణ్ లిస్ట్‌లోకి తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి చేరారు. ఇద్దరు చంద్రులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ.. వారికి దన్నుగా నిలుస్తున్నారని ఇప్పటికే విమర్శలు మూటకట్టుకున్న పవన్.. బడ్జెట్ లాంటి కీలక అంశంపై పాటిస్తోన్న వ్యూహాత్మక మౌనం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వివాదాలు సాగిపోయి.. అంతా చప్పబడిపోయాకా తీరిగ్గా ఓ ట్వీట్ చేస్తారని గుర్తింపు తెచ్చుకున్న పవన్.. ఇప్పుడు అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నాడంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఈ సంగతి పక్కనబెడితే... వారం, పదిరోజులుగా ఏపీ, తెలంగాణల్లో "చలోరే చలోరే చల్" అంటూ యాత్ర చేసి అలసిపోయిన పవన్‌ కళ్యాణ్.. తర్వాత ఏం చేయబోతున్నాడన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

బడ్జెట్ ఎఫెక్ట్: ఇవి పెరుగుతాయ్.. ఇవి తగ్గుతాయ్

  కొత్తగా ఫోన్లు, టీవీని కొనాలని అనుకుంటున్నారా..? అయితే ఏమాత్రం లేట్ చేయకండి. ఎందుకంటే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి వీటి ధరలు పెరగనున్నాయి. సగటు భారతీయుడు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న 2018-19 వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మొబైల్ ఫోన్లు, టీవీలపై 15శాతంగా ఉన్న కస్టమ్స్ డ్యూటీని 20 శాతానికి పెంచుతున్నట్లు ఆర్ధికమంత్రి వెల్లడించారు. పెంపుదల 5 శాతంగా కనిపిస్తున్నప్పటికీ వీటి ధర చెప్పుకోదగిన స్థాయిలో పెరుగనుంది. అలాగే టీవీ, మొబైల్ ఫోన్ల విడిభాగాల పైనా ఈ ప్రభావం పడనుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడ ఫిట్ చేసే వివిధ విడిభాగాల మీద కూడా కస్టమ్స్ డ్యూటీని ఐదు శాతం పెంచారు.   దేశీయంగా మేక్ ఇన్ ఇండియాను ప్రొత్సహించే ఉద్దేశంతోనే ఈ పెంపుదల చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి వివిధ విదేశీ కంపెనీలు భారత్‌లోనే ప్లాంట్లను నెలకొల్పినప్పటికీ.. మరికొన్ని కంపెనీలు మాత్రం ఇంకా దిగుమతులు చేసుకుంటున్నాయి.. దీనిని నియంత్రించేందుకే కేంద్రం ఇలాంటి చర్యలకు దిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంకా ధరలు పెరిగే వాటిలో వెండి, బంగారం, సన్‌స్కీన్, చెప్పులు, కూరగాయలు, పండ్ల రసాలు, పెర్‌ఫ్యూమ్స్, సోయా ప్రోటీన్ ఇతర ఆహార పదార్ధాలు, రంగురాళ్లు, వజ్రాలు, ఇమిటేషన్ జ్యూవెలరీ, స్మార్ట్ అలారాలు, సిల్క్ ఫాబ్రిక్స్, ఫర్నిచర్, పరుపులు, సిగరెట్లు, కొవ్వొత్తులు, వంటనూనెలు, క్రీడా పరికరాలు.   మరోవైపు పెరిగిపోతోన్న పెట్రోల్, డీజిల్ ధరలతో కుంగిపోతోన్న సామాన్యుడికి ఊరట కలిగించే ప్రకటన చేశారు జైట్లీ. బ్రాండెడ్, అన్‌బ్రాండెడ్ పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. తద్వారా పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు రూ.2 మేర తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై మాత్రం జైట్లీ ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. వీటితో పాటుగా జీడిపప్పు, ముడిపదార్ధాలు, వైద్యపరమైన పరికరాలు, క్యాపిటల్ గూడ్స్ తదితరాల ధరలు తగ్గనున్నాయి.

బడ్జెట్‌లో ఏపీ పరిస్థితి ఏంటీ..?

  రెవెన్యూ లోటు.. రాజధాని నిర్మాణం.. పోలవరం.. జాతీయ స్థాయి సంస్థల నిర్మాణానికి నిధుల లేమి ఇలా మెడ మీద కత్తిలా ఎన్నో సమస్యలు ఎదుర్కోంటోంది ఆంధ్రప్రదేశ్. అన్ని విధాలుగా నష్టపోయిన రాష్ట్రానికి చేయూతను అందిస్తామని చెప్పిన నాటి మాటలు.. నీటి మీద రాతలే అయ్యాయన్నది మెజారిటీ ప్రజల మాట. బడ్జెట్‌ మీద ఎన్నో ఆశలు పెట్టుకోవడం.. ఆ తర్వాత నీరుగారిపోవడం గత నాలుగు సంవత్సరాలుగా ఇదే తంతు. కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పటికి తెలుగుదేశం పట్ల బీజేపీ అనుసరిస్తున్న వైఖరిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాస్త అసంతృప్తితోనే ఉన్నారు.   విభజన సమస్యలు పూర్తిగా పరిష్కారం కాకపోవడం, ప్రత్యేకహోదా, రెవెన్యూ లోటు భర్తీ, హైకోర్టు విభజన, పోలవరం, రాజధాని నిర్మాణానికి నిధులు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు సక్రమంగా రాకపోవడం వంటి సమస్యలు.. ఎక్కడ వేసిన గంగోళి అక్కడే అన్నట్లుగా ఉంది. ఈ క్రమంలో ఎన్డీఏ ప్రభుత్వంలో చివరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ. మరి ఎన్నికల బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి ప్రాధాన్యం దక్కబోతోంది అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్నింటి కన్నా ముఖ్యంగా ప్రత్యేకహోదా కోసం చంద్రబాబుతో పాటు ప్రధాన రాజకీయ పార్టీల అధినేతలు ప్రధానితో పాటు జైట్లీ దృష్టికి ఎన్నో సార్లు తీసుకెళ్లారు. స్పెషల్ స్టేటస్ సాధ్యం కాదని తేల్చిచెప్పినప్పటికీ.. కనీసం స్పెషల్ ప్యాకేజీ ప్రకటించాలని విన్నవించారు. పన్నుల రూపంలో కొద్దిగా ఆదాయం పెరిగినా రెవిన్యూలోటును స్వల్పంగా పూడ్చుకోవచ్చన్నది నిపుణుల భావన.   ఇక 2018 నాటికి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేసి సాగునీరు అందించాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆంధ్రుల జీవనాడిగా పేర్కొనబడుతున్న ఈ ప్రాజెక్ట్‌కు గతేడాది కేవలం 100 కోట్లు మాత్రమే కేటాయించి కేంద్రం చేతులు దులుపుకోగా.. ఈ సారి ఏ మేరకు కనికరిస్తుందోనన్నది చూడాలి. విజయవాడ, విశాఖ నగరాలను మెట్రో నగరాలుగా తీర్చిదిద్దే ప్రణాళికలో భాగంగా రాష్టప్రభుత్వం ఈ రెండు సిటీల్లో మెట్రో రైలును ప్రవేశపెట్టాలనుకుంది. ఆరువేల కోట్ల రూపాయలు కావాల్సిన బెజవాడ మెట్రోకు గత బడ్జెట్‌కు 100 కోట్లు కేటాయించగా.. విశాఖ మెట్రోకు కేవలం లక్ష రూపాయలే కేటాయించారంటే.. ఏపీ పట్ల కేంద్రం ఎంత చిన్నచూపుతో ఉందో అర్థం చేసుకోవచ్చు.   అటు విభజన హామీల్లో భాగంగా రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన విద్యాసంస్థల నిర్మాణానికి కూడా గతేడాది ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించలేదు. ప్రస్తుతానికి అద్దె భవనాల్లో కాలం గడుపుతున్న పాలక మండళ్లు ఈ సారి బడ్జెట్‌పై ఆశగా చూస్తున్నాయి. గత కొద్దిరోజులుగా ఉప్పు-నిప్పులా వ్యవహరిస్తోన్న టీడీపీ-బీజేపీ శ్రేణుల మధ్య.. తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరుగుతుండటంతో అది బడ్జెట్‌పైనా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అభిమానులు.. పవన్ మాట కూడా వినడం లేదా..?

  పురుషులందు పుణ్య పురుషులు వేరన్నట్లు.. అభిమానుల్లో పవన్ అభిమానులు వేరంటూ కొందరు సెటైర్లు వేస్తుంటారు. తమ అభిమాన నటుడిని దేవుడిలా పూజిస్తూ.. ఆయన్ని ఏమైనా అంటే ఊరుకునేది లేదన్నట్లుగా వీరు ప్రవర్తిస్తుంటారు. పద్దతి మార్చుకోవాలని ఎంతమంది.. ఎన్నిసార్లు సూచించినా వీరి వైఖరి మారడం లేదు. తన సినిమాలకు తప్పించి పెద్దగా బయటకి రాని పవన్ "చలోరే చలోరే చల్" యాత్ర పేరిట తెలుగు రాష్ట్రాల్లో ప్రజా సమస్యలు తెలుసుకుందామని బయలుదేరాడు. తెరపై పవర్‌స్టార్‌ను చూస్తేనే పూనకాలతో ఊగిపోయే అభిమానులు.. ఆయన రోడ్ల మీద కనిపిస్తే వదులుతారా..? తెలంగాణలో పర్యటన ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు తన ఫ్యాన్స్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు పవన్   కారు అద్దాలు పగలడమో.. తోపులాటల వల్లనో పలువురు ఫ్యాన్స్ గాయాలపాలవుతున్నారు. ఖమ్మంలో అయితే పవన్ అభిమానుల తాకిడికి ఏకంగా ఓ పోలీస్ అధికారే ఆస్పత్రి పాలయ్యాడు. అలాగే హిందూపురంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో అభిమానుల అత్యుత్సాహం కారణంగా గందరగోళం నెలకొని.. ఆడిటోరియంలోని అద్దాలు.. కిటికీలు పగిలిపోగా.. తోపులాటలో నలుగురు అభిమానులకు గాయాలయ్యాయి. ప్రస్తుతం బెంగళూరులో చికిత్స తీసుకుంటున్న ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.   దీనిపై ఒకదశలో పవన్ సైతం అసహనం వ్యక్తం చేశారు.. నా మీద గౌరవం వుంటే దయచేసి కూర్చోవాలని కోరినప్పటికీ.. వారు వినలేదు. అభిమానుల అత్యుత్సాహం.. వారి స్పీడ్‌ను చూస్తుంటే తనకు చాలా భయంగా ఉందని సాక్షాత్తూ జనసేనాని భయపడ్డాడంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అభిమానులు ఇబ్బందులు పడకూడదనే తాను సినిమా ఫంక్షన్స్ సైతం జరుపుకోనని.. కానీ ప్రజా సమస్యలను గురించి తెలుసుకునేందుకు ప్రజల్లోకి రాక తప్పలేదని.. కోట్లాది ప్రజల సమస్యలను ఇంట్లో కూర్చొని తెలుసుకోలేనని చెప్పారు. తన యాత్రకు వచ్చే అభిమానులు సాధ్యమైనన్ని జాగ్రత్తలు తీసుకోవాలని.. తల్లిదండ్రులు.. భార్యబిడ్డలను గుర్తు చేసుకున్న తర్వాతే.. తన గురించి ఆలోచించాలని సూచించారు. ఎవరికి ఏమైనా ఓ అన్నగా తనకు బాధ కలుగుతుందని తనకు ఎటువంటి వేదనను కలిగించవద్దని వేడుకుంటున్నానని చెప్పారు.   చెప్పి చెప్పి ఆయన గొంతు నొప్పి పుట్టడమే తప్పించి అభిమానులు గాడిలో పడటం కల్లే అంటున్నారు విశ్లేషకులు. పవన్‌ని ఇంకా ఒక సినీనటుడిగానే చూస్తున్న జనం.. ఆయన ఒక రాజకీయ పార్టీకి అధినేత అన్న విషయం మరచిపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. థియేటర్లలో ఏం చేసినా చెల్లిపోతుంది.. కానీ రాజకీయ పార్టీ అధినేతగా అభిమానులు ఏం చేసినా.. వారికి ఏం జరిగినా అందుకు నైతిక బాధ్యత పవన్‌దే. ఈ విషయాన్ని జనసేనాని అభిమానులు గుర్తుపెట్టుకోవాలని.. లేదంటే వారి వల్లే పవన్‌కు ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు విశ్లేషకులు.

విడాకులు తప్పవా..?

  ఇష్టం లేని మొగుడితో ఎన్నాళ్లు కాపురం చేస్తాం చెప్పండి.. అందుకే విడాకులు తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్దలు ఏదో రాజీ కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారు తప్ప ఈ బంధం నిలబడేది కాదని వారికి తెలుసు. ఇదేదో మొగుడు పెళ్లాల విడాకుల మ్యాటర్ కాదు. గత కొద్దిరోజులుగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పరిశీలిస్తే మీకే.. మేం ఏం చెబుతున్నామో అర్థమవుతుంది. ఆంధ్రాలో టీడీపీని వదుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుండటం.. ఇంతకాలం ఎన్నాన్నా.. ఏం చేసినా భరిస్తూ వచ్చిన తెలుగుదేశం అధినేత కూడా ఇక సంసారం కష్టమే అనేలా వ్యాఖ్యలు చేయడంతో.. టీడీపీ-బీజేపీ కోటకి బీటలు వారినట్లేనని ఓ నిర్ణయానికి వచ్చేశారు విశ్లేషకులు.   చంద్రబాబును ఆయన పాలనను విమర్శిస్తూ వస్తోన్న కొందరు ఏపీ బీజేపీ నేతలు.. పోలవరం స్పిల్‌వే టెండర్ల విషయంలో కేంద్రం అడ్డు చెప్పిన తర్వాత తమ స్వరాన్ని మరింత పెంచుతూ పోయారు. కేంద్రం ఇప్పటికే చాలా చేసిందని.. ఇంకేం కావాలంటూ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ఈ సమయంలో ఇరు పార్టీ నేతల మధ్య రగిలిన వేడి టీడీపీ-బీజేపీ స్నేహన్ని బూడిద చేస్తుందని విశ్లేషకులు భావించారు. అయితే ప్రధాని మోడీని చంద్రబాబు కలిస్తే పరిస్థితి చక్కబడుతుందని భావించారు.. కానీ విచిత్రంగా వీరిద్దరి సమావేశం తర్వాత రెండు పార్టీల మధ్య దూరం మరింత పెరుగుతూ వచ్చింది.. విమర్శలు ఎక్కువయ్యాయి. స్వయంగా ముఖ్యమంత్రి కూడా పలు సందర్భాల్లో పొత్తు గురించి మాట్లాడారు. అవసరమైతే తెగదెంపులకు సిద్ధంగా ఉన్నామన్నారు.   పెటాకులకి బాబు కూడా సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు రావడంతో విడిపోవడానికి ఇదే సరైన సమయమని ఏపీ బీజేపీ నేతలు హైకమండ్‌తో అన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే టీడీపీని వదులుకోవడంపై బీజేపీ అధినాయకత్వంలోని పలువురు భిన్న వాదనలు వినిపిస్తున్నారట.   ప్రస్తుతం దేశవ్యాప్తంగా కమలంతో మిత్రపక్షంగా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క తెలుగుదేశం మాత్రమే. రెండున్నర దశాబ్ధాలకు పైగా బీజేపీకి మిత్రపక్షంగా ఉంటూ వస్తోన్న శివసేన.. మోడీ-అమిత్‌షాల వైఖరి నచ్చక ఎన్డీఏలో నుంచి తప్పుకుంది. శివసేన వంటి పార్టీయే అలాంటి నిర్ణయం తీసుకోవడంతో.. బీజేపీతో ఏ రాష్ట్రంలోనూ పొత్తులు పెట్టుకోవడానికి ఆయా ప్రాంతీయ పార్టీలు ముందుకు రాకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మిత్రపక్షంగా ఉన్న టీడీపీని కూడా బలవంతంగా వదిలించుకోవడం.. తప్పుడు సంకేతాలను పంపిస్తుందని కొందరు బీజేపీ పెద్దలు అంటున్నారట. కానీ మోడీ- అమిత్‌షాల వద్ద ఈ విషయాన్ని చర్చించే ధైర్యం చాలక మిన్నకుంటున్నారట. అయినా బాబు ఛరిష్మా గురించి తెలిసిన చాలా మంది స్నేహాన్ని నిలిపేందుకు తెరవెనుక రాయబారాలను నడుపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ ముసుగులో గుద్దులాటకు ముగింపు ఎప్పుడో కాలమే నిర్ణయించాలి.

చంద్రబాబుకి కోపం వచ్చింది... ఇక కష్టమే...

  ప్రస్తుతానికైతే ఏపీలో టీడీపీ-బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్నాయి. కానీ కొద్దిరోజుల నుండి ఈ పార్టీల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి కూడా తెలిసిందే. కేంద్రంలో అధికారంలో ఉన్నాంకదా అనో.. లేక ఇటీవల జరిగిన ఎన్నికల్లో దాదాపు అన్ని చోట్లా బీజేపీనే గెలుస్తుందన్న అహంభావనో తెలియదు కానీ... అక్కడి ప్రభావం ఇక్కడ చూపిస్తున్నారు ఏపీ బీజేపీ నేతలు. ప్రతిపక్షంపై విమర్శలు గుప్పిస్తూనే.. మిత్రపక్షం అని కూడా చూడకుండానే... టీడీపీపై, టీడీపీ నేతలపై పదే పదే విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇక బీజేపీ నేతలు విమర్శలకు టీడీపీ నేతలు కూడా అప్పుడప్పుడు స్పందిస్తున్నా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడంతో కాస్త వెనక్కి తగ్గుతూ వస్తున్నారు. అయినా కానీ బీజేపీ నేతలు మాత్రం నోరు కంట్రోల్ లో పెట్టుకోకుండా ఏదో ఒకటి అంటూనే ఉన్నారు.   మరోవైపు ఏపీ ప్రజలకు ఇప్పటికే ప్రత్యేక హోదా వల్ల...ప్రాజెక్టులను పెండింగ్ లో పెట్టడం వల్ల.. ఇంకా మోడీ ఏపీని చిన్నచూపు చూస్తుండటంవల్ల  బీజేపీపై వ్యతిరేకత ఏర్పడింది. దీంతో చంద్రబాబు కూడా ఎంత అడిగినా నిధుల సాయం చేయకపోవడం వల్ల అసంతృప్తితోనే ఉన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతో ఓపికగా ఉంటున్నా బీజేపీ నేతలు మాత్రం రెచ్చిపోతున్నారు. అప్పటికీ మే నెల వరకూ గడవు తీసుకున్నారు. కానీ రెండు పార్టీల అప్పటివరకూ కూడా కలిసి ఉండే పరిస్థితులు కనిపించడంలేదు.   ఎందుకంటే టీడీపీపై బీజేపీ నేతల విమర్శలకు చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారు. అంతేకాదు ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన.. బీజేపీ నేతలు మా నేతలను ఎంత విమర్శిస్తున్నా... బీజేపీతో మిత్రధర్మం పాటిస్తున్నాం కాబట్టి.. మా నేతలను చాలా వరకూ నియంత్రిస్తున్నా.. వాళ్లు వద్దనుకుంటే మాదారి మేం చూసుకుంటాం అని బహిరంగంగానే చెప్పారు. దీంతో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలకు దారితీశాయి. ఇంతవరకూ ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పుడూ చేయని చంద్రబాబు.. ఇప్పుడు ఇంత ఖరాఖండిగా చెప్పారంటే దీని వెనుక రాజకీయ వ్యూహాం ఏదైనా ఉందా అని అనుకుంటున్నారు. లేక బీజేపీతో విసిగిపోయి ఉంటారు...అందుకే ఇలా మాట్లాడి ఉంటారు అని అనుకునే వాళ్లు కూడా ఉన్నారు.   ఏది ఏమైనా చంద్రబాబు ఇలా మాట్లాడటానికి వెనుక ఆయన మనసులో ఏముందో తెలియదు కానీ... ఆయన ఇలా మాట్లాడటం వల్ల ఏపీలో ఆయన పార్టీకి వచ్చే నష్టం అనేది ఏం లేదు. ఇంకా ఈ విషయంలో ఆలోచించుకోవాలంటే  బీజేపీ, ఆ పార్టీ నేతలు.. కేంద్ర పెద్దలే ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఏపీలో బీజేపీకి ఉన్న స్టామినా అందరికీ తెలిసిందే. ఏదో గత సార్వత్రిక ఎన్నికల్లో అంటే టీడీపీతో పొత్తు పెట్టుకోవడం... ఆ పార్టీలకు పవన్ కళ్యాణ్ మద్దతు తెలపడంవల్ల కనీసం బీజేపీకి ఆ నాలుగు సీట్లైనా వచ్చాయి. ఏదో ఉత్తరాదిని చూసుకొని ఇక్కడ కాలర్ ఎగరేస్తే అది ఆపార్టీకే నష్టం. ఎందుకంటే అక్కడి పరిస్థితి వేరు.. ఇక్కడ పరిస్థితి వేరు.. అక్కడి రాజకీయాలు వేరు.. ఇక్కడి రాజకీయాలు వేరు. అది దృష్టిలో పెట్టుకొని ఇక్కడ బీజేపీ కాస్త కంట్రోల్ లో ఉంటే వారికే బెటర్. అలా కాదని రెచ్చిపోతే వారికే నష్టం.. చంద్రబాబుకు వచ్చే నష్టం ఏం లేదు. మరి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూద్దాం...