హైదరాబాద్..అమరావతి ఇప్పుడు ఢిల్లీకి రాజమౌళి..?

సన్మానాలు, సత్కరాలు, కోరి వరిస్తున్న అవార్డులు..ఏ చిన్న కార్యక్రమం జరిగినా చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానాలు అబ్బో నిజంగా టైమ్ అంటే ఇదేనేమో అనిపిస్తుంది కదూ.? ప్రజంట్ రాజమౌళి పరిస్థితి అలాగే ఉంది. బాహుబలి విజయంతో రాజమౌళి రేంజ్ ఆకాశాన్ని తాకింది. ఆయన్ను కలిసే ఏ చిన్న అవకాశాన్ని కూడా టాలీవుడ్ ప్రముఖులు మిస్ అవ్వడం లేదు. సినీ పరిశ్రమ పరంగా ఏ కార్యక్రమం జరిగినా ఇప్పుడు ముఖ్యఅతిథి రాజమౌళీనే. ఈ నేపథ్యంలో వచ్చి పోయే వారితో ఆయన నివాసం సందడి సందడిగా ఉంటోంది.   భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారని..ఆయన కృషికి సత్కారంగా పద్మశ్రీ అవార్డునిచ్చి గౌరవించింది భారత ప్రభుత్వం.. తాజాగా మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరిట ఏఎన్నార్ జాతీయ అవార్డు కూడా జక్కన్నను వరించింది. అలా వరుస సత్కారాలతో బిజీగా ఉన్న రాజమౌళికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి పిలుపొచ్చింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచంలోని అత్యున్నత నగరాల్లో ఒకటిగా నిలబెట్టాలని కలలుగంటోన్న నాయుడు గారు తన కార్యంలో రాజమౌళిని భాగం చేయాలనుకున్నారు. బాహుబలిలోని మాహిష్మతి సామ్రాజ్యాన్ని విక్షీంచిన సీఎం అమరావతిలోని భవన నిర్మాణాల్లో అలాంటి సృజనాత్మకతనే కోరుతున్నారు. అందుకే మీ సేవలు కావాలి బ్రదర్ అంటూ కబురుపెట్టారు.. ముఖ్యమంత్రిగారు పిలవడమే ఆలస్యం జక్కన్న అమరావతిలో ల్యాండైపోయారు .. చంద్రబాబును కలిసి అమరావతి నిర్మాణంలో తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని హామీ ఇచ్చారు. పనిలో పనిగా సీఆర్‌డీఏ అధికారులతో కలిసి రాజధాని ప్రాంతాన్ని చుట్టేసి వర్క్ స్టార్ట్ చేసేశారు కూడా.   అలా అమరావతిలో పని ముగించుకొని హైదరాబాద్‌లో దిగారో లేదో నెక్ట్స్ రాజమౌళికి ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. అది కూడా ఏకంగా ప్రధాని నరేంద్రమోడీ నుంచి. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్రం ప్రారంభించిన "స్వచ్ఛ హీ సేవా" కార్యక్రమంలో భాగం కావాలని మోడీ స్వయంగా రాజమౌళికి లేఖ రాశారు. "వినోద రంగంలో ఎంతో గుర్తింపును తెచ్చుకున్న మీ వంటి వారు ముందడుగు వేస్తే ఎంతోమంది మీ వెనుక నడుస్తారు..సమాజ అభివృద్ధికి ఇది ఎంతో కీలకం..నేను మిమ్మల్ని స్వచ్ఛ హీ సేవలో భాగం కావాలని స్వయంగా ఆహ్వానిస్తున్నాను. మీ అనుభవాన్ని ఎప్పుడైనా నాతో పంచుకోవచ్చు..గాంధీ జయంతి నాటికి ఈ కార్యక్రమాన్ని 125 కోట్ల ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. మీ సహకారాన్ని కోరుతున్నాను" అంటూ మోడీ లేఖలో పేర్కొన్నట్లు జక్కన్న తెలిపారు.   సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేయడంలో ఎప్పుడూ ముందుండే రాజమౌళి..ప్రధాని పిలుపునిచ్చిన ఎన్నో కార్యక్రమాలకు బహిరంగ మద్ధతు ప్రకటించారు. స్వచ్ఛభారత్, స్వదేశీ ప్రచారానికి తన వంతు సహాయ సహకారాలుంటాయని చెప్పారు కూడా..గతేడాది దీపావళి సందర్భంగా డియర్ భారత్ వాసి...స్వదేశీ వస్తువులను కొనండి..విదేశీ వస్తువులను బహిష్కరించండి. మనదేశ ఆర్థిక ప్రగతిని పెంచండి..అంటూ మోడీ పోస్ట్ చేసిన సందేశాన్ని రాజమౌళి షేర్ చేశారు. అలా మంచి పనులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు జక్కన్న. అలాంటిది మరి ఏకంగా మోడీ నుంచే కాల్ వస్తే వెళ్లకుండా ఉంటారా...? చెప్పండి..?

జక్కన్న చంద్రన్నతో కలిస్తే..అద్భుతమేగా..?

నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచంలోని గొప్ప నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలని..అలనాటి అమరావతికి ఏ మాత్రం తీసిపోని స్థాయిలో నిర్మించాలన్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు కల. అందుకోసం రాజధానిని ప్రకటించిన నాటి నుంచి ప్రపంచంలోని ప్రసిద్ధ నగరాలను స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. అంతేకాకుండా నగరానికి మంచి వాస్తు బలం ఉండాలనే ఉద్దేశ్యంతో దేశంలోని ప్రముఖ వాస్తు పండితులను పిలిపించి పక్కా ప్రణాళికతో నిర్మాణాలకు ఆమోదం తెలిపారు ముఖ్యమంత్రి.   అలాగే సృజనాత్మకత, చక్కటి అభిరుచి ఉన్న కొందరి సేవలను కూడా అమరావతి నిర్మాణానికి వినియోగించుకోవాలనుకున్న చంద్రబాబు..అందమైన ఆలోచనల్ని వెండితెరపై ఆవిష్కరించగల ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి సలహాలు తీసుకోవాలని నిర్ణయించారు. బాహుబలి విషయంలో జక్కన్న తన కమిట్‌మెంట్ నిరూపించుకున్నాడు. ఆయన ఆహ్వానం మేరకు రాజమౌళి ఇవాళ అమరావతిని సందర్శించారు. ఉదయం సీఎంను కలిసి భేటీ అవ్వగా..రాజధాని నిర్మాణాలు ఎలా ఉండాలన్న విషయంలో చంద్రబాబు తన ఆలోచనలను పంచుకున్నారని..ఆయన దూరదృష్టి తనకు ఎంతో నచ్చిందని తప్పకుండా అమరావతికి నా సేవలు అందజేస్తానని చెప్పారు.   ఇక్కడో విషయం చెప్పాలి..చంద్రబాబు పని రాక్షసుడు..పని యంత్రం..నిద్రాహారాలు లేకపోయినా పని ఉంటే చాలు..ఓ పనిని అందరికంటే బెస్ట్‌గా చేసి రోల్ మోడల్‌గా నిలబడాలనే కసి ఉన్న నాయకుడు..తాను చేపట్టిన పని బెస్ట్..ఇక తిరుగులేదు అని సంతృప్తి పొందేవరకు విడిచిపెట్టడు. అలాంటి వ్యక్తికి అచ్చం అలాంటి పని రాక్షసుడు రాజమౌళి దొరికితే ఇంకేమైనా ఉందా..పర్ఫెక్ట్‌గా పని జరిగే వరకు ఇద్దరు కాంప్రమైజ్ అవ్వరు. సో అమరావతి భవనాలు ముందు తరాల వారికి ఒక నమూనాగా..తెలుగుజాతి కిర్తీకిరిటంలో ఒక కలికితురాయిగా నిలిచిపోతుందనడంలో ఆశ్చర్యం లేదు.

స్టాలిన్ స్కెచ్ వర్కవుట్ అవుతుందా..?

తమిళనాడులో ఏ పార్టీకి కూడా వరుసగా రెండోసారి పాలించే ఛాన్సివ్వరు అక్కడి ప్రజలు. 2011 ఎన్నికల్లో గెలుపొందిన అన్నాడీఎంకేని 2016లో గద్దె దించేస్తారని అంతా భావించారు. సర్వేలు, ఎగ్జిట్‌పోల్స్‌ కూడా అదే విషయాన్ని చెప్పాయ. అయితే అంచనాలను తలక్రిందులు చేస్తూ అమ్మ అధికారంలోకి రావడతో డీఎంకే నేతలు నీరసపడిపోయారు. ముఖ్యంగా కరుణానిధి ముద్దుల కొడుకు స్టాలిన్ ముఖంలో నెత్తురు చుక్క లేదు. అయితే జయలలిత మరణంతో అన్నాడీఎంకేలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో స్టాలిన్‌‌లో మళ్లీ ప్రాణం లేచొచ్చినట్లయ్యింది.   పన్నీర్ సెల్వం-శశికళ, పన్నీర్ సెల్వం-పళనిస్వామి మథ్య తెలెత్తిన విబేధాలను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ఆయన వ్యూహాలు రచిస్తూ వచ్చారు. తాజాగా దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయడంతో మళ్లీ ఆయనలో ఆశలు చిగురించాయి. శశికళ వర్గం ఎమ్మెల్యేలపై వేటు వేసి బలపరీక్షలో నెగ్గాలన్న సీఎం పళనిస్వామి వ్యూహాన్ని తిప్పికొట్టాలని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో డీఎంకే ఎమ్మెల్యేలు 89 మంది చేత మూకుమ్మడి రాజీనామా చేయించాలని స్టాలిన్ పావులు కదుపుతున్నారు. డీఎంకేతో పాటుగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌కు చెందిన ఒకరు, కాంగ్రెస్‌కు చెందిన ఎనిమిదిమందితోనూ రాజీనామా చేయించాలని ఆయన యోచిస్తున్నారు.   తద్వారా రాష్ట్రపతి పాలన దిశగా నడిపించి..మధ్యంతర ఎన్నికలకు వెళ్లవచ్చని ఆయన భావన. అమ్మ మరణం తర్వాత అంతర్గత కుమ్మలాటలతో కొట్టుకుంటున్న అన్నాడీఎంకే ప్రభుత్వం పాలనను గాలికొదిలేసిందని ఆ పార్టీ పట్ల అసంతృప్తి బయలుదేరి ఉన్న దృష్ట్యా మధ్యంతర ఎన్నికలు వస్తే విజయం తమదేనని స్టాలిన్ భావిస్తున్నారు. ఈ ధీమా కారణంగానే ఆయన ఇంతటి సాహసానికి దిగుతున్నట్లు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే స్పీకర్ తీసుకున్న అనర్హత నిర్ణయాన్ని సవాలు చేస్తూ దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. అత్యవసర విచారణ కింద ఆ పిటిషన్‌ను రేపు మద్రాస్ హైకోర్టు విచారించనుంది. దీంతో న్యాయస్థానం తీర్పును ఆధారంగా చేసుకుని స్టాలిన్ ముందుకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

ఏపీకి "లాభం" మిగిల్చిన సదావర్తి

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాల మధ్య తీవ్ర వివాదానికి దారి తీసిన సదావర్తి సత్రానికి చెందిన భూముల రచ్చ ముగిసింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు చెన్నైలో తిరిగి వేలాన్ని నిర్వహించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పేద బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులకు వసతి కల్పించేందుకు, అన్నదానం చేసేందుకు అమరావతిలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు వంశీకులైన లక్ష్మీపతినాయుడు భార్య వెంకటలక్ష్మమ్మ పేరుతో సుమారు 150 ఏళ్ల క్రితం సదావర్తి సత్రాన్ని ఏర్పాటు చేశారు. దీని నిర్వహణ కోసం అచ్చంపేట మండలం కోగంటివారి పాలెంలో 80 ఎకరాలు, తమిళనాడులోని కాంచీపురం జిల్లా తాళంబూర్ గ్రామంలో 471 ఎకరాలు దానంగా ఇచ్చారు.   అయితే సరైన సాక్ష్యాదారాలు, పర్యవేక్షణ లేకపోవడంతో కాంచీపురంలోని భూములన్నీ అన్యాక్రాంతమయ్యాయి. ఈ భూములను చేజిక్కించుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. వచ్చి రావడంతోనే ఈ భూముల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని న్యాయస్థానాల్లో సూట్, రిట్ వేసింది. అనంతరం అన్యాక్రాంతమైన భూములను పరిశీలించేందుకు ఒక అధికారిక బృందాన్ని కాంచీపురం పంపించింది. వీటిలో 83 ఎకరాలు పాక్షికంగా ఆక్రమణకు గురైందని..ఇంకొన్నాళ్లు ఆగితే ఇవి కూడా పూర్తి దురాక్రమణ‌ అయ్యే అవకాశం ఉందని బృందం ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఇక ఉపేక్షిస్తే లాభం లేదని మిగిలి ఉన్న 83 ఎకరాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని ఏపీ దేవాదాయ శాఖ నిర్ణయించింది. దీనిలో భాగంగా చెన్నైలోని రాయపేట పాఠశాలలో రూ.22కోట్లకు భూమలను వేలం వేశారు.   అయితే దీనిపై మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఎంతో విలువైన సదావర్తి భూములను కారుచౌకగా కట్టబెట్టారంటూ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిని విచారించిన న్యాయస్థానం 22 కోట్ల రూపాయలకు అదనంగా మరో 5 కోట్ల రూపాయలు చెల్లించి ఆ భూములను మీరే సొంతం చేసుకోవచ్చంటూ తెలిపింది. ఆ మొత్తాన్ని చెల్లించేందుకు ఆయన ముందుకు రావడంతో డిపాజిట్ చెల్లించాలని ఆదేశించింది. హైకోర్టు సూచన మేరకు ఆర్కే చెల్లించారు..   అయితే దీనిపై మరోకరు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో వేలాన్ని రద్దు చేసి మరోసారి బహిరంగ టెండర్ ఆహ్వానిస్తూ వేలాన్ని నిర్వహించాలని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు నిచ్చింది. దీంతో 18వ తేదీని వేలంపాటకు ముహూర్తంగా నిర్ణయించింది ప్రభుత్వం. చెన్నైలోని టీటీడీ సమాచారం కేంద్రంలో ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ ఆధ్వర్యంలో వేలం పాటను నిర్వహించారు. ఈ వేలంలో 60 కోట్ల 30 లక్షలకు ఈ భూములు అమ్ముడయ్యాయి. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన సత్యనారాయణ రెడ్డి వాటిని సొంతం చేసుకున్నారు. తద్వారా 37.90 కోట్ల లాభం వచ్చినట్లయింది. మొత్తానికి అనూహ్య మలుపులు తిరిగిన ఈ వివాదంలో ప్రభుత్వానికి లాభమే చేకూరిందని విశ్లేషకులు అంటున్నారు.

ఐఎస్ఎస్‌ ఇంకా బతికే ఉంది..!

ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా..సింపిల్‌గా చెప్పాలంటే ఐఎస్ఐఎస్..ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ రాజ్యస్థాపనే లక్ష్యంగా పవిత్ర యుద్ధం పేరుతో హింసకు పాల్పడుతూ మారణహోమం సృష్టిస్తూ..రక్తపుటేరులు పారిస్తోంది ఐసిస్. తన లక్ష్య సాధనలో భాగంగా ఇరాక్, సిరియాలను ఆక్రమించి ప్రపంచ శాంతికి పక్కలో బల్లెంలా మారింది. అతివాద భావ జాలంతో ప్రజాస్వామ్యంపై ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకొని ఇరాక్, సిరియా ప్రజల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేలా తమ వైపు తిప్పుకున్నారు ఐఎస్ ఉగ్రవాదులు.   తమ రాజకీయ స్వప్రయోజనాల కోసం అమెరికా సహా అనేక పశ్చిమ దేశాలు ఈ ఉగ్రవాద సంస్థకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేశాయి. పాముకు పాలు పోసి పెంచినా..అది చివరకు విషాన్నే కక్కుతుంది అన్నట్లు ఈ ఉగ్రభూతం చివరకు ఆయా ప్రభుత్వాల మనుగడనే ప్రశ్నించే స్థాయికి ఎదిగింది. ఆసియా, ఐరోపా, అమెరికా ఖండాల్లోని అనేక దేశాలు దీని ధాటికి వణికిపోతున్నాయి. పరిస్థితి చేయి దాటకుండా..ప్రపంచశాంతిని పరిరక్షించేందుకు అమెరికా సారథ్యంలోని సంకీర్ణసేనలు ఐసిస్‌పై యుద్ధం ప్రకటించాయి. దీనిలో భాగంగా ఇరాక్, సిరియాల్లోని ఇస్లామిక్ స్టేట్ స్థావరాలపై విరుచుకుపడుతున్నాయి. ముఖ్యంగా ఈ సంస్థ ఆర్థిక మూలాలను సమూలంగా నాశనం చేసే ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయి.   ఈ దాడుల క్రమంలో ఇస్లామిక్ స్టేట్ వెనుకంజ వేయాల్సి వచ్చింది. సుమారు ఒకటి, రెండు నెలల పాటు ప్రపంచంలోని ఏ మూల కూడా ఒక్క ఉగ్రదాడి కూడా జరగకపోవడంతో ఐఎస్ఐఎస్ చరిత్ర ఇక ముగిసిందని అంతా భావించారు. కానీ రెండు రోజుల క్రితం ఇరాక్‌లోని ఓ రెస్టారెంట్‌పై విరుచుకుపడిన ఇస్లామిక్ ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 74 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే బ్రిటన్ రాజధాని లండన్‌‌ భూగర్భ రైల్వేస్టేషన్‌లో బాంబు పేలుడుకి పాల్పడింది ఐసిస్. సిరియా, ఇరాక్‌లలో నిత్యం వైమానిక దాడులకు దిగుతూ ఐఎస్ఐఎస్‌ను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోన్న పశ్చిమదేశాల్లో వణుకు పుట్టించడం ద్వారా తామింకా బలంగానే ఉన్నామని చాటడమే లక్ష్యంగా ఐఎస్ ఈ దాడులకు పాల్పడినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.  

అమరావతి మీద వాటర్ బాంబ్

  అందరి కన్నూ అమరావతి మీదే... అందరి కామెంట్లూ అమరావతి మీదే. అమరావతిలో రాజధాని నిర్మిస్తే ఏదో ఘోరం జరిగిపోతుందని బెదిరించేవాళ్ళు ఈమధ్యకాలంలో ఎక్కువైపోయారు. ఇప్పుడు ఈ బెదిరింపుల లిస్టులోకి మరో పెద్దాయన చేరారు. ఆయన ఎవరో కాదు... వాటర్ మాన్ ఆఫ్ ఇండియాగా పేరున్న రాజేంద్రసింగ్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘నదుల అనుసంధానం’ అనే టాపిక్ నడుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని నదులను అనుసంధానించడం వల్ల నీటి సమస్య తీరి, దేశం మొత్తం సస్యశ్యామలంగా మారుతుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నదుల అనుసంధానం విషయంలో  ఇప్పటికే ఒక అడుగు ముందుకు వేశారు. గోదావరి, కృష్ణ నదులను విజయవంతంగా అనుసంధానం చేయడం ద్వారా దేశానికి ఆదర్శంగా నిలిచారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జగ్గీ వాసుదేవ్ కూడా నదుల అనుసంధానం దేశానికి అవసరమని భావిస్తున్నారు. దీనికోసం ఆయన ‘ర్యాలీ ఫర్ రివర్స్’ పేరిట కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.   వాటర్ మాన్ ఆఫ్ ఇండియా నదుల అనుసంధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దానికి సంబంధించిన కామెంట్లు చేస్తూ పనిలోపనిగా అమరావతి మీద కూడా వాటర్ బాంబ్ వేసేశారు. నదుల్లో ఇసుక తవ్వకాలు ఆపడానికి ఎలాంటి చర్యలు తీసుకోరుగానీ, నదులను మాత్రం అనుసంధానం చేస్తామని అంటారని కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల మీద ఆయన విమర్శల బాణాలు సంధించారు.  నదుల అనుసంధానానికి జగ్గీ వాసుదేవ్ చేస్తున్న ఉద్యమం ఒక కుట్ర అని రాజేంద్రసింగ్ అంటున్నారు. దీని వెనుక కార్పొరేట్, రాజకీయ లాబీ వుందని ఆరోపించారు.   రాజేంద్రసింగ్ నదుల అనుసంధానం మీద కామెంట్లతో సరిపెట్టుకోలేదు. ఆయన విమర్శలను అమరావతి మీద కూడా కురిపించారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో రాజధానిని నిర్మిస్తే అది భవిష్యత్తులో వరదల్లో కొట్టుకుపోతుందని సెలవిచ్చారు. నదీ పరివాహక ప్రాంతం కంటే అమరావతి ఏడు మీటర్లు దిగువకు వుందని వివరించారు. అలాగే నది మధ్యలో ముఖ్యమంత్రి నివాసం ఏర్పాటు చేసుకోవడం చట్ట విరుద్ధమని కూడా అన్నారు. నదుల అనుసంధానం మీద, అమరావతి నిర్మాణం మీద రాజేంద్రసింగ్ చేసిన కామెంట్లు కలకలం రేపుతున్నాయి. రాజేంద్రసింగ్ గురించి తెలిసినవాళ్ళు మాత్రం ఇలాంటి కాంట్రవర్సీ కామెంట్లు చేసి వార్తల్లో నిలవడం రాజేంద్రసింగ్‌కి అలవాటేనని అంటున్నారు.

తెలుగు భాషా? తెలంగాణ భాషా?

  ప్రపంచ తెలుగు మహాసభలను డిసెంబర్ 15 నుంచి 19వ  తేదీ వరకు హైదరాబాద్‌లో భారీ స్థాయిలో నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. భవిష్యత్తుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగు మహాసభలు నిర్వహించినా తమ రాష్ట్రం నిర్వహించిన సభల ముందు అవి వెలవెలపోవాలన్నది తెలంగాణ సీఎం కేసీఆర్ అంతరంగం. వచ్చే డిసెంబర్‌లో నిర్వహించే ప్రపంచ తెలుగు మహాసభలకు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానిని ఆహ్వానించాలని, వారు తప్పనిసరిగా వచ్చి సభలను విజయవంతం చేసేలా చేయాలని సీఎం కేసీఆర్‌ కృతనిశ్చయంతో వున్నారు. సీఎం మనోభావాలను అర్థం చేసుకున్న అధికార యంత్రాగం కూడా సభలను భారీ స్థాయిలో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. తమదే అసలైన తెలుగు రాష్ట్రం అని దేశానికి తెలిసేలా చేయాలన్నది కేసీఆర్ ప్రయత్నం. దీనికోసం తెలుగు మహాసభలకు ముందు నుంచే తెలుగుకు మరింత వెలుగు ఇచ్చే చర్యలను ఆయన ప్రతిపాదించారు. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలంగాణలోని అన్ని పాఠశాలల్లో తెలుగును తప్పనిసరిగా బోధించాలని ఆయన ఆదేశించారు. ఈ నిబంధనను అంగీకరించిన విద్యాసంస్థలకే తెలంగాణలో అనుమతి ఇవ్వాలని నిర్దేశించారు. అన్ని నేమ్‌ప్లేట్స్‌నీ (నామ ఫలకాలను) తెలుగులోనే రాయాలని ఆదేశించారు. అంతేకాకుండా సభల నిర్వహణకు ప్రస్తుతానికి యాభై కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల చేశారు. తెలుగు మహాసభల సందర్భంగా హైదరాబాద్‌లో మాత్రమే కాకుండా ప్రపంచంలో ఎక్కడ తెలుగువారు వున్నా అక్కడ సభలు నిర్వహించేలా చేయాలనే ఆలోచన కూడా  సీఎం కేసీఆర్‌కి వుంది. తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ సంస్కృతిని ప్రపంచం మొత్తానికీ మరోసారి చాటిచెప్పే ప్రయత్నం కూడా జరుగుతుంది.   అంతా బాగానే వుంది. ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలు అంటోంది. అయితే తెలంగాణలోని కొంతమంది మేధావులు ఈ సభలను ‘తెలుగు మహాసభలు’ అని కాకుండా ‘తెలంగాణ మహాసభలు’ అని వ్యవహరించాలని అంటున్నారు. తెలంగాణ ప్రాంతంలో మాట్లాడే భాషను ‘తెలుగు భాష’ అని కాకుండా ‘తెలంగాణ భాష’ అని వ్యవహరించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ‘తెలుగు’ పేరుతో నిర్వహించబోతున్న సభలను కూడా వారు వ్యతిరేకిస్తూ ‘తెలంగాణ మహాసభల’ పేరుతో నిర్వహించాలన్న వాదనను తెరమీదకు తెస్తు్న్నారు. ప్రభుత్వా్న్ని వ్యతిరేకించే వర్గాలు కూడా ఈ వాదనకు మద్దతు పలుకుతూ వుండటం విశేషం. మనం మాట్లాడుతున్న భాషను ‘తెలంగాణ భాష’గా వ్యవహరించాలని డిమాండ్ చేయడం మేధావి వర్గానికి నచ్చే విషయమేమోగానీ, సామాన్యుల మెప్పు పొందే విషయం కాదని కొంతమంది భాషాభిమానులు అభిప్రాయపడుతున్నారు. తెలుగు మహాసభలను విజయవంతంగా నిర్వహించడం ద్వారా తెలంగాణ భాష తలెత్తుకునేలా చేయాలే తప్ప, ‘తెలుగు’ అనే పదానికే తిలోదకాలు ఇవ్వడం న్యాయం కాదని అంటున్నారు.

పసిమొగ్గలపై "పశు"క్రీడను ఆపలేమా..?

భారతదేశంలో ఇంటికి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో..విద్యాలయాలకు అంతటి విశిష్టత ఉంది. తమ పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించి, సరైన నడవడికతో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతారనే నమ్మకంతో గురువుల చేతిలో పెడతారు తల్లిదండ్రులు. పూర్వం చిన్నారులను వారి తల్లిదండ్రులు గురుకులాలకు పంపేవారు..ఆ విద్యార్ధులు 12 సంవత్సరాల పాటు గురుసేవ చేసుకుంటూ వేదాలు, రామాయణ, మహాభారతాలు, ఇతర కావ్యాలు అభ్యసించేవారు. మహా పండితులైన వారి పుత్రులైనా, చక్రవర్తుల పిల్లలైనా అక్కడే చదువుకుంటూ అక్కడి పనుల్లో పాలుపంచుకోవాలి. పుష్కరకాలం పాటు తమ కంటి వెలుగులను ఎక్కడో ఉంచి వెళుతున్నారంటే ఆ తల్లిదండ్రులకు ఆ గురుకులంపై ఎంతటి నమ్మకం ఉండాలి. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ..తమ బాధ్యతను నెరవేర్చేవారు నాటి గురువులు.   అయితే నేటి గురుకులాలు అలాంటి నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాయా అంటే కాదనే చెప్పాలి. ప్రేమగా..బాధ్యతతో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన వాళ్లే..చిన్న పిల్లలని కూడా చూడకుండా ఒళ్లు మరచిపోతున్నారు..ప్రేమ, అప్యాయత కురిపించాల్సిన కళ్లు కామంతో చూస్తుంటాయి. తమను తడుముతుంటే నవ్వులు చిందించడం తప్ప ..ఏం జరుగుతుందో..వాళ్లు ఎందుకలా చేశారో కూడా చెప్పలేని..గుర్తించలేని వయసు వారిది..లైంగిక వేధింపులు అనే పదానికి అర్థం కూడా తెలియని వయసులో వారు వేధింపులకు గురికావడం ఏంటీ..? మన సమాజం ఎటు పోతోంది..? ఈ ప్రశ్నకు సమాధానం తెలియక దిక్కోతోచని స్థితిలో ఎంతో మంది తల్లిదండ్రులు ఈ దేశంలో అడుగడుగునా కనిపిస్తారు.   స్కూళ్లు, గేటేడ్ కమ్యూనిటీలు, కేర్ టేకర్ సెంటర్లు, హాస్టల్స్, ప్లేస్కూల్స్ ఇలా పేరేదైనా గురుకులాల్లో చిన్నారులకు రక్షణ లేకుండా పోతోంది. పాఠాలు చెప్పాల్సిన టీచర్లు, సహాయక సిబ్బంది, చివరకు రోజు స్కూలుకు తీసుకువెళ్లే బస్సు డ్రైవర్లు, కండక్టర్లు ఇలా ఎవరో ఒకరు బాల్యాన్ని కబళిస్తున్నారు. దేశ రాజధాని నుంచి మారుమూల పల్లెల వరకు నిత్యం ఏదో ఒక మూల పిల్లలపై లైంగిక దాడి జరుగుతూనే ఉన్నట్లు గణంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే తమ లైంగిక దాడిని పిల్లలు ప్రతిఘటిస్తే..ఏ మాత్రం జాలి లేకుండా వారిని కడతేరుస్తున్నారు కామాంధులు.   కొద్దిరోజుల క్రితం దేశాన్ని కుదిపేసిన ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగింది ఇదే. ఒంటరిగా కనిపించిన చిన్నారిపై లైంగిక దాడికి ప్రయత్నించిన పాఠశాల వ్యాన్ డ్రైవర్ బాలుడు తనను అడ్డుకునే సరికి పట్టరాని ఆవేశంతో చిన్నారి గొంతు కోసి ఆ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చాడు. చాప కింద నీరులా వ్యాపిస్తున్న ఈ సమస్యను అడ్డుకోవడం అంత సులభం కాదు. ఈ విషయంలో అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాల్సింది పాఠశాల యజమాన్యాలే..పిల్లలు చదువులో వెనకబడటం, ఎవరినైనా చూసి భయపడటం, ఒంటిరిగా తమలో తాము కుమిలిపోవడం, ప్రవర్తనలో, మాటల్లో తేడా ఇలాంటివి గమనిస్తే వెంటనే వారిని సైక్రియాట్రిస్తు దగ్గరికి తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించండి. సావదానంగా వారిపై అలా ప్రవర్తించింది ఎవరో కనుక్కొని చట్టానికి అప్పగించండి. దానితో పాటు వర్క్‌షాపులు నిర్వహించి పిల్లలకు స్వీయరక్షణ చిట్కాలు నేర్పడం ద్వారా కొన్ని దారుణాలనైనా ఆపడం సాధ్యమవుతుంది.

మాజీ సీఎం ఫ్యామిలీపై టీడీపీ "కన్ను"

రాష్ట్ర విభజన పేరిట కాంగ్రెస్ అధినాయకత్వం చేసిన ఘోరమైన రాజకీయ తప్పిదం ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీకి పుట్టగతులు లేకుండా చేసింది. అంతేకాకుండా తరాల పాటు కాంగ్రెస్ సేవ చేస్తూ వచ్చిన ఉద్దండుల రాజకీయ భవిష్యత్‌ అంధకారంలో పడింది. అలాంటి వారిలో నల్లారి కుటుంబం ఒకటి. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చే పేరు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి..ఆయన తండ్రి దివంగత మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి భారత మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావుకు అత్యంత సన్నిహితంగా మెలిగారు. తండ్రి మరణం తర్వాత ఆయన వారసుడిగా కిరణ్ ఎంట్రీ ఇచ్చారు. 1989లో జరిగిన ఎన్నికల్లో వాయల్పాడు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మొదటిసారి అసెంబ్లీకి వచ్చారు. ఆ తరువాత 1999, 2004, 2009ల్లో శాసనసభ్యుడిగా గెలిచారు.   స్వర్గీయ వైఎస్‌కు అత్యంత విశ్వాసపాత్రుడిగా పేరు సంపాదించారు..2004లో ప్రభుత్వ చీఫ్ విప్‌గా, 2009లో శాసనసభ స్పీకర్‌గా సేవలందించారు. అయితే వైఎస్ మరణం తర్వాత పార్టీలోనూ..ప్రభుత్వంలోనూ తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ఆ సమయంలో సీనియర్ రాజకీయ వేత్త రోశయ్యను ముఖ్యమంత్రిగా చేసింది కాంగ్రెస్ . అయితే వయసు రీత్యా పెద్దాయన తప్పుకోవడంతో కిరణ్‌ను సీఎం పదవి వరించింది. రాష్ట్ర విభజనను తీవ్రంగా ఎదుర్కొన్న ఆయన..చివరి వరకు ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచేందుకు ప్రయత్నించారు. కానీ పరిస్థితి చేయి దాటి పోవడంతో కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి పదవులకు రాజీనామా చేసి జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. కానీ ఆ ఎన్నికల్లో ఈ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతు కావడంతో కిరణ్ క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు.   అయితే ఆయన మనసు మార్చుకున్నారని..తిరిగి రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరిగింది..మచ్చలేని వ్యక్తిగా..సమర్థుడిగా పేరు తెచ్చుకున్న నల్లారిని పార్టీలోకి తీసుకోవాలని బీజేపీ, వైసీపీ తీవ్రంగా ప్రయత్నించినట్లు వార్తలు వినిపించాయి. కాని నేటి వరకు అవి పుకార్లుగానే ఉండిపోయాయి. 2019 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని పటిష్టం చేసే ప్రణాళికలో ముందుకు సాగుతున్న టీడీపీ అధిష్టానం కన్ను నల్లారి కుటుంబంపై పడింది. చిత్తూరు జిల్లాలో బలమైన రెడ్డి సామాజికవర్గానికి చెందిన నల్లారి కుటుంబం టీడీపీలోకి వస్తే పార్టీ మరింత బలపడుతుందని లోకేష్ భావిస్తున్నారట.   ఇప్పటికే ముఖ్యనేతల ద్వారా లోకేష్ నల్లారి ఫ్యామిలీతో టచ్‌లో ఉన్నారట. ఈ నేపథ్యంలో కిరణ్ సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలోకి వస్తారనే ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది. టీడీపీలో చేరే విషయంపై కిషోర్ తన ముఖ్య అనుచరులతో మంతనాలు సాగించి మరి కొద్దిరోజుల్లోనే తుది నిర్ణయాన్ని వెలువరించే అవకాశాలున్నాయట. ఇదే విషయాన్ని తన అన్న కిరణ్‌‌తో కూడా చర్చించి ఆయన సలహా మేరకు నడుచుకునే ఉద్దేశ్యంలో ఉన్నారట. మరోవైపు తమ్ముడి పరిస్థితి సరే కిరణ్‌కుమార్ రెడ్డి సంగతి ఏంటి అనే డౌట్ రావొచ్చు. ఇక్కడే మాజీ సీఎం వ్యూహాత్మకంగా వ్యవహారిస్తున్నారట..ముందుగా తన తమ్ముడిని అధికార టీడీపీలోకి పంపి..తర్వాత..పరిస్థితులు తనకు అనుకూలంగా ఉన్న తర్వాతే..అంటే 2019 ఎన్నికల నాటికి పచ్చజెండా కప్పుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. 

కత్తి మహేశ్‌ వెనుక ఎవరున్నారు..?

బిగ్‌బాస్ ఫేమ్, ప్రముఖ సినీ క్రిటిక్ మహేశ్ కత్తి, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య చిరు జల్లుగా మారిన వివాదం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. ఒక ఇంటర్వ్యూలో పవన్ పాలిటిక్స్ గురించి మాట్లాడిన మహేశ్..ఎలాంటి అజెండా లేకుండా కేవలం ట్వీట్స్ మాత్రమే చేస్తూ..వచ్చే ఎన్నికల్లో పవన్ ఎలా పోటీ చేస్తారు అన్నాడు..అక్కడితో ఆగకుండా ఆయన రాసిన ఇజం పుస్తకం చదివిన వారికి ఎవరికైనా పవన్ తీరు ఏంటా అనే అనుమానాలు వస్తాయని..ఐదవ తరగతి విద్యార్థికంటే హీనంగా ఆ పుస్తకం రాసి కళ్యాణ్ జనాల్ని తికమక పెట్టారంటూ వ్యాఖ్యానించడంతో పవర్‌స్టార్ అభిమానులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది.   సోషల్ మీడియా వేదికగా కత్తి మహేశ్‌పై విరుచుకుపడుతున్నారు..అంతేనా.. ఒక ఛానెల్‌లో చర్చకు వచ్చిన ఆయనను బయట కనిపిస్తే చంపేస్తామంటూ వార్నింగులు కూడా ఇచ్చారు. కానీ వాటికి అదరకుండా..బెదరకుండా కౌంటర్లు ఇస్తున్నాడు మహేశ్. సరే ఆ సంగతి పక్కనబెడితే నిన్న మొన్నటి వరకు ఎవరికి తెలియని ఓ వ్యక్తి మహేశ్ కత్తి..మరి పవన్ కళ్యాణ్..కోట్లాది మంది అభిమానులు ఆరాధించే నటుడు, ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఏకంగా దేశ ప్రధానికి బాగా కావాల్సిన వ్యక్తి.. మరి అలాంటి వ్యక్తి జోలికి వెళ్లాలంటే మహమహులు సైతం వెనుకంజ వేస్తారు..మరి ఏ ధైర్యంతో..ఎవరి అండ చూసుకుని మహేశ్ కత్తి ఇంత దూకుడుగా వెళుతున్నారని పలువురు చర్చించుకుంటున్నారు.   ఈ నేపథ్యంలో ఒక వార్త తెలుగు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అదేంటంటే వచ్చే ఎన్నికల నాటికి పవన్‌ను రాజకీయంగా దెబ్బ కొట్టడానికి వైసీపీ అధినేత జగనే ఈ డ్రామాను నడిపిస్తున్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి. గత ఎన్నికల్లో జనసేనాని టీడీపీకి సపోర్ట్ చేయడం వైసీపీని కోలుకోలేని దెబ్బ తీసి అధికారానికి దూరం చేసింది. వచ్చే ఎన్నికల్లో ఈ జంట మళ్లీ కలిస్తే తనకు..తన పార్టీకి ప్రమాదమని గ్రహించిన జగన్..పవర్‌స్టార్ ఇమేజ్‌ను డ్యామేజీ చేయాలని డిసైడయ్యారట..దీనిలో భాగంగానే మహేశ్ కత్తి ద్వారా తన ప్లాన్ వర్కవుట్ చేయిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో..2014 ఎన్నికల్లో మీరు వైసీపీ తరపున ప్రచారంలో పాల్గొన్నారు కదా అని చెప్పడంతో "కత్తికి ఫ్యాన్‌"తో గల అనుబంధానికి బలం చేకూరుస్తోంది. అయితే ఇంతవరకు లోటస్‌పాండ్ వర్గాలు కానీ..మహేశ్ కత్తి గానీ ఈ పుకార్లను ఖండించకపోవడం గమనార్హం. మరి ఈ పుకార్లలో వాస్తవమెంతో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

పసివాళ్ళ ఉసురు తీస్తోన్న ఇంటర్నేషనల్ స్కూల్స్

ఇంటర్నేషనల్ స్టాండర్ట్స్‌తో విద్యను అందిస్తామని చెప్పి...విద్యార్ధుల తల్లిదండ్రుల నుంచి లక్షలకు లక్షలు ఫీజులు గుంజే ఇంటర్నేషనల్ స్కూళ్లలో రక్షణ ఉండటం లేదని మరోసారి రుజువైంది. దేశ రాజధాని ఢిల్లీకి కూతవేటు దూరంలో ఉండే గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. నగరంలోని ర్యాన్ ఇంటర్నేషనల్‌ స్కూల్‌‌లో 2వ తరగతి చదువుతున్న చిన్నారిని అత్యంత పాశవికంగా చంపి వేశారు. ఇవాళ ఉదయం టాయ్‌లెట్‌‌కు వెళ్లిన విద్యార్థులకు రక్తపు మడుగులో ఓ చిన్నారి మృతదేహం కనిపించింది. వెంటనే విషయాన్ని స్కూల్ సిబ్బందికి తెలియజేశారు. యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. కత్తితో గొంతు కోసినట్లు నిర్థారించారు..   రోజులాగే తండ్రి ఉదయాన్నే ఆ చిన్నారిని స్కూల్ వద్ద దింపి ఇంటికి చేరుకోగానే ఒక వార్త వారి చెవిన పడింది. దీంతో తల్లిదండ్రులు పరుగు పరుగున స్కూల్ వద్దకు చేరుకుని షాక్‌కు గురయ్యారు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే స్కూలు యాజమాన్యం అసలు విషయం దాచి మీ అబ్బాయి తీవ్ర అస్వస్థతకు గురైయ్యాడని..అతన్ని ఆసుపత్రికి తీసుకెళుతున్నామని సమాచారం అందించడం పలు అనుమానాలకు తావిస్తోంది.   ఏడాది క్రితం ఇదే స్కూలుకు చెందిన వసంత్‌కుంజ్ బ్రాంచ్‌లో దివ్యాంశ్ అనే ఆరేళ్ల చిన్నారి వాటర్ రిజర్వాయర్‌లో పడి మరణించడం సంచలనం కలిగించింది. ఈ ఘటనపై సీరియస్ అయిన ఢిల్లీ ప్రభుత్వం ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌లో విద్యార్థుల భద్రతకు అమలు చేస్తోన్న చర్యలపై నివేదిక ఇవ్వాలంటూ యాజమాన్యాలను ఆదేశించింది. ఇంత జరిగినా సదరు పాఠశాలలు మొద్దునిద్ర వదలడం లేదు. స్కూలు యాజమాన్యాల నిర్లక్ష్యమే తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగులుస్తోంది. మరోవైపు మరణించిన చిన్నారి సోదరి కూడా ఇదే ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో నాలుగో తరగతి చదువుతున్నట్లు సమాచారం. ఇప్పటికైనా ఇటువంటి పేరు గొప్ప ఇంటర్నేషనల్ స్కూల్స్ ఫీజులపైనే కాకుండా విద్యార్థుల రక్షణపైనా దృష్టి పెడితే ఇటువంటి దారుణాలు జరక్కుండా ఉంటాయి.

అవును "నేను" దొంగనే..!

సర్వ దరిద్రాలకు నిలయంగా..ప్రపంచాన్ని వణికించిన మారణహోమాలకు వేదికగా..తీవ్రవాదులకు స్వర్గధామంగా పాకిస్థాన్‌కు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. ఒక దొంగ తాను దొంగని అని ఒప్పుకోని విధంగానే పాకిస్థాన్ కూడా అంతే..లోకం మొత్తం ఆ దేశాన్ని ఓ ఉగ్ర స్థావరంగా చెబుతున్నా..ఛ, ఛ మేమా..? అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ తప్పును కప్పిపుచ్చుకోవటానికి సర్వదా శతధా ప్రయత్నిస్తూనే ఉంటుంది. కానీ కాలం ఎప్పుడూ చూస్తూ ఊరుకోదు కదా..! ఎప్పటికైనా తప్పును ఒప్పుకోక తప్పదు కదా..! ఇప్పుడు పాక్ విషయంలోనూ అలాగే జరిగింది. నిషేధిత ఉగ్రవాద సంస్థలు లష్కర్-ఏ-తోయిబా, జైషే మొహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు తమ భూభాగం నుంచే కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నాయని ఎట్టకేలకు ఆ దేశం ఒప్పుకొంది.   ఇది ఎవరో చెప్పిన మాట కాదు..సాక్షాత్తూ ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి ఖాజ్వా అసీఫ్‌ మీడియా సాక్షిగా చెప్పిన మాట. అంతర్జాతీయంగా ప్రతీ దేశం ఉగ్రవాది అంటే పాక్ పౌరుడే అన్నట్లు చూస్తుండటం..మొదటి నుంచి వెన్ను దన్నుగా నిలిచిన అమెరికా తను చేస్తున్న సాయానికి కత్తెర వేయడం..బెస్ట్ ఫ్రెండ్ చైనా కూడా వెనకడుగు వేస్తూ ఉండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పాకిస్థాన్‌ ఏళ్లుగా కప్పిపుచ్చుకుంటూ వస్తోన్న నిజాన్ని ఒప్పేసుకుంది. మొత్తంగా ఒప్పేసుకుంటే లేనిపోని కష్టాల్లో ఎదుర్కోవాల్సి వస్తుందనుకున్నారో ఏమో కానీ అసీఫ్ తెలివిగా వ్యవహరించారు.  అంతర్జాతీయంగా నిషేధానికి గురైన ఆ సంస్థలు పాక్ నుంచే పనిచేస్తున్నాయని అయితే తమ ప్రభుత్వం కూడా వాటిని నిషేధించిందని..గత మూడేళ్లుగా ఆ ఉగ్రసంస్థలను నిర్వీర్యం చేయడానికి తమ సైనికులు గట్టిగా పోరాడుతూనే ఉన్నారంటూ వ్యాఖ్యానించారు.   తరతరాలుగా సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తోన్న పాకిస్థాన్‌ ప్రపంచాన్ని వణికించిన అనేక దారుణ మారణకాండకు కారణమైంది. ఉన్నత విద్యను అభ్యసించడానికి వేరే దేశానికి వెళ్లినట్లు..ఉగ్రవాదంలో పీహెచ్‌డీ చేయాలంటే పాకిస్థాన్‌ వెళ్లాల్సిందే అన్నంతగా ఆ దేశానికి ముద్రపడిపోయింది. ముష్కర మూకకి శిక్షణా శిబిరాలు నిర్వహించడం ఒక ఎత్తైతే..ఇతర దేశాల్లో విధ్వంసం సృష్టించి వచ్చిన వారికి ఆశ్రయం కల్పించడం మరో ఎత్తు. 1993 ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం పాక్‌లోనే ఉన్నాడని భారత్ ఎన్నో ఏళ్లుగా అనేక ఆధారాలిచ్చినా..కరాచీలోని అడ్రస్‌తో సహా బయటపెట్టినా పాక్ పట్టించుకున్న పాపానపోలేదు. 2001లో అమెరికాలోని ట్వీన్ టవర్స్‌ను కూల్చేసి ప్రపంచాన్ని గడగడలాడించిన అల్‌ఖైదా అధినేత బిన్‌లాడెన్‌‌ను అంతమొందించడానికి భూగోళాన్ని జల్లెడ పట్టింది అమెరికా. చివరకి 2011లో అబోట్టాబాద్‌లో జరిగిన ఆపరేషన్‌లో అగ్రరాజ్య కమెండోలు బిన్‌లాడెన్‌ను కాల్చి చంపాక కానీ అతను పాక్‌లోనే ఉన్నాడని నిజం ప్రపంచానికి తెలిసింది. లాడెన్ ఐదేళ్లపాటు తమ దేశంలోనే జీవించాడంటే తానే నమ్మలేకపోయానని ముషారఫ్ నమ్మబలికినప్పటికీ నాడు ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే లాడెన్ పాక్‌లో ఆశ్రయం పొందాడని అర్ధమవుతోంది.   ఇన్ని చేసినప్పటికీ పాక్ తను చేస్తోన్న పాపాన్ని ఒప్పుకోవడం లేదు. పేదరికం, ఆర్థిక అసమానతలపై కలిసికట్టుగా పోరాడాలని ఉగ్రవాదానికి దేశాన్ని స్థావరంగా మార్చవద్దంటూ భారత్ పలుమార్లు పాక్‌కు సూచించినప్పటికీ అది పెడచెవిన పెడుతూనే వస్తుంది. తాను పెంచి పోషిస్తోన్న ఉగ్రభూతం తమనే సర్వనాశనం చేస్తున్నప్పటికీ పాక్ ప్రభుత్వం కానీ..ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఆర్మీలో కానీ ఎలాంటి మార్పు లేదు. తాజాగా చైనాలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా సభ్యదేశాలు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ముక్త కంఠంతో ఖండించాయి. అందులోనూ ఎప్పుడూ సోపోర్ట్ చేసే చైనా కూడా చేతులేత్తేయడంతో పాక్ తప్పును ఒప్పుకోకతప్పలేదు. అయితే పాక్‌ను నమ్మడానికి లేదు. అది బయటకి చెప్పేది ఒకటి..చేసేది మరోకటి..ఈ విషయం ఎన్నోసార్లు రుజువైంది. ఆ దేశంలో ఉగ్రవాదుల హింస ఎక్కువైతే తప్ప పాకిస్థాన్‌కు బుద్ధిరాదు. అప్పుడు కానీ తత్త్వం బోధ పడదు.

ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యే "అనర్హుడ"వుతాడా..?

నంద్యాల ఉప ఎన్నిక ఫలితం తేలడంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి కాస్త తగ్గింది. అయితే ఆ వేడి ఇప్పుడు తెలంగాణకు షిఫ్ట్ అయ్యింది. వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు పౌరసత్వం చెల్లదంటూ భారత ప్రభుత్వం స్పష్టం చేయడంతో తెలంగాణలో అది హాట్ టాపిక్‌గా మారింది. రమేశ్ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి భారత పౌరసత్వం పొందారని నిర్థారణ అయితే ఎమ్మెల్యేగా అనర్హుడిగా మారడంతో పాటు రూ.50వేల జరిమానా, ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు. సీనియర్ రాజకీయ వేత్త చెన్నమనేని రాజేశ్వరరావు కుమారుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన రమేశ్ బాబు 2009లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.   ఆయన చేతిలో ఓడిపోయిన నాటి కాంగ్రెస్ అభ్యర్థి, నేటి బీజేపీ నేత ఆది శ్రీనివాస్ రమేశ్‌పై పంతం పట్టారో లేక మరేదైనా కారణమో కానీ..న్యాయపోరాటానికి దిగారు. అందుకు కారణం రమేశ్ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి మునుపు జర్మనీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు..ఆ దేశ పౌరసత్వం కూడా ఆయనకు ఉంది. అయితే ఉద్యోగాన్ని వదిలిపెట్టి తండ్రి అడుగుజాడల్లో రాజకీయరంగ ప్రవేశం చేశారు చెన్నమనేని. 2009లో ఎన్నికల్లో పోటి చేయడానికి కొద్దిరోజులు ముందు రమేశ్ భారత పౌరసత్వాన్ని తీసుకున్నారు. దీనిపై తనకు అనుమానాలున్నాయని శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. 1993లో భారత పౌరసత్వాన్ని రద్దు చేసుకుని తిరిగి 2008 మార్చి 31న మన దేశ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు రమేశ్.   కానీ భారత పౌరసత్వం లభించాలంటే దేశంలో వరుసగా 365 రోజులు స్థిర నివాసం ఉండాలని చట్టం చెబుతోంది. రమేశ్ వరుసగా అన్ని రోజులు ఇక్కడ లేరని, అందుకే ఆయన పొందిన పౌరసత్వం చెల్లదంటూ శ్రీనివాస్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిని స్వీకరించిన న్యాయస్థానం విచారణకు ఆదేశించింది. ఆ సమయంలో రమేశ్ కేవలం 96 రోజులు మాత్రమే భారత్‌లో ఉన్నట్లు తేలింది. దీంతో ఆయన తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పౌరసత్వం పొందారని 2013లో హైకోర్టు తీర్పునిచ్చింది. అంతేకాకుండా రమేశ్ ఎన్నిక చెల్లదని..ఓటర్ల జాబితాలోంచి కూడా ఆయన పేరును తొలగించాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ రమేశ్ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో 2010లో రమేశ్ బాబు ఎమ్మెల్యే పదవికి, తెలుగుదేశం పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసి 2010లో జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరపున బరిలో నిలిచారు. ఆ సమయంలో కూడా రమేశ్ ప్రత్యర్థి శ్రీనివాస్ కావడం గమనార్హం. ఆ ఎన్నికల్లోనూ విజయం రమేశ్‌బాబునే వరించింది.   అయితే సుప్రీం స్టేను సవాలు చేస్తూ శ్రీనివాస్ మరోసారి తన వాదనలు వినిపించడంతో పౌరసత్వం వివాదాన్ని తేల్చాలని కేంద్ర హోంశాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో రమేశ్ పౌరసత్వం చెల్లదని హోంశాఖ నివేదిక ఇచ్చింది. తాజా ప్రకటన టీఆర్ఎస్ శ్రేణులను కలవరానికి గురిచేసింది. తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని ఎంతో ఆశపడ్డ ఆ పార్టీ నాయకులు హోంశాఖ నిర్ణయంతో షాక్‌కు గురయ్యారు. ఇదంతా ఒక ఎత్తైతే ప్రస్తుతం అనర్హత భయం వారిని వెంటాడుతోంది. సుప్రీం మార్గదర్శకాల ప్రకారం పదవిలో ఉన్న ప్రజాప్రతినిధులపై నేరం రుజువైతే వారిపై అనర్హత వేటు పడుతుంది. అంటే వారు తమ పదవులను వదులుకోవడంతో పాటు ఐదు సంవత్సరాల వరకు ఎటువంటి ఎన్నికల్లో పోటీ చేయరాదు. అదే నిజమైతే రమేశ్ ఎమ్మెల్యే పదవిని కోల్పోయే పరిస్థితులున్నాయి. దాంతో వేములవాడ అసెంబ్లీ స్థానానికి ఖాళీ ఏర్పడి..అక్కడ ఉప ఎన్నిక అనివార్యమవుతుంది. అయితే ఆందోళన చెందాల్సిన పని లేదని మరోసారి రివ్యూ దరఖాస్తు చేసుకుంటానని రమేశ్ తన అనుచరులతో చెప్పినట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ కేంద్ర హోంశాఖ నివేదికను పరిగణలోనికి తీసుకుని సుప్రీం వెలువరించే తుది తీర్పుపై రమేశ్ భవితవ్యం ఆధారపడి ఉంది.

వైసీపీ నాయకులు తిట్టుకోక ఇంకేం చేస్తారు?

  ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తామనే నీటి బుడగ మూడున్నర  ఏళ్ళ క్రితమే భళ్ళుమని పగిపోయినా వైసీపీ నాయకులు నిన్న మొన్నటి వరకూ తమ ఆశావాదాన్ని వీడలేదు. తమ నాయకుడు జగన్ ఏదో ఒక మాయ చేసి 2019 ఎన్నికలలో పార్టీని అధికారంలోకి తెస్తాడని ఆశపడుతూ వచ్చారు. తమ పార్టీ జనం నోళ్ళలో నానడానికి పీకేలాంటి పరాయి రాష్ట్రం వారి సలహాలు తీసుకుని చేస్తున్న కార్యక్రమాల వల్ల ఓట్ల వర్షం కురుస్తుందని ఆశపడ్డారు. అయితే తమ పార్టీ చేపట్టిన కార్యక్రమాలు, చేసిన వ్యాఖ్యల వల్ల తమకే నష్టం జరిగిందన్న విషయం నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నిక తర్వాత స్పష్టంగా తెలిసిపోయింది. దాంతో వైసీపీ కేడర్‌లో అంతర్మథనం మొదలైంది. ఇంతకాలం వైసీపీని నమ్ముకుని, ఆ పార్టీకి సపోర్ట్‌గా అడ్డమైన పనులన్నీ చేసి పొరపాటు చేశామనే పశ్చాత్తాపం కూడా మొదలైంది. వైసీపీ ఎమ్మెల్యేలుగా వున్నవారే త్వరలో  ఆ పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ కేడర్లో అశాంతి మొదలైంది. ఆ అశాంతి అసహనం రూపంలో బయటపడుతోంది. తాజాగా విజయవాడలో గౌతమ్ రెడ్డి, వంగవీటి రాధా మధ్య జరిగిన రచ్చ కూడా ఈ అసహనంలో భాగంగానే భావించవచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.   విజయవాడ వైసీపీ నాయకుడు గౌతమ్ రెడ్డి వంగవీటి రంగాని విమర్శి్స్తూ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. అయినా చేశారు. ఎప్పుడు ఏ వివాదం దొరుకుతుందా, రచ్చ చేద్దామా అని ఎదురుచూసే వంగవీటి రాధాకి ఈ వ్యాఖ్యలు లడ్డులాగా దొరికాయి. దాంతో ఆయన తన మాతృమూర్తి రత్నకుమారితో కలసి చేయాల్సిన రచ్చ చేశారు. తల్లితో కలసి పోలీస్ స్టేషన్లో నేల మీద బైఠాయించి హంగామా చేశాడు. విజయవాడ వైసీపీలో తలెత్తిన ఈ సంక్షోభాన్ని నివారించడానికి వైసీపీ నాయకుడు జగన్ ఆగమేఘాల మీద గౌతమ్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినా మంటలు చల్లారలేదు.   పైకి చూడ్డానికి ఇదేదో పార్టీలోని ఇద్దరు నాయకుల మధ్య తలెత్తిన టీకప్పులో తుఫానులాంటి వివాదం అని అనిపించినప్పటికీ, ఇది వైసీపీలో పెరిగిపోతున్న అసహనం, నిస్సహాయతలకు నిదర్శనమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో ఎలాగూ వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయని వస్తున్న సంకేతాలతో నిరాశలో కూరుకుపోయిన పార్టీ నాయకులు నిరాశతో చేస్తున్న చర్యలుగానే వీటిని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకూ వైసీపీలో ఇలాంటి అంతర్గత విభేదాలు జగన్‌కి భయపడి బయటకి రాలేదు. ఇప్పుడు విజయవాడతో అది మొదలైందని, ఇది ఏ స్థాయికి చేరుతుందే వేచి చూడాల్సి వుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

అత్యాచారాలు చేసి..అభ్యున్నతి అంటారు

మనలో పాపం చేయనివారు ఎవరో చెప్పండి అన్నట్లు..దేశంలో మచ్చలేని నాయకుడెవరో చెప్పండి అంటే జనాలు నోరెళ్లబెట్టాల్సిందే..నిజానికి వారికున్నన్ని మచ్చలు బహుశా మరెవరికీ ఉండవేమో. ఇక్కడ మచ్చ అంటే నేరం అని అర్థం. ఘనత వహించిన మనదేశ చట్ట సభల్లో ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న నేతల్లో మెజారిటీ నేతలందరూ చిన్నదో పెద్దదో నేరం చేసినవారేనట. "అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫర్మ్స్" అనే స్వచ్ఛంద సంస్థ సర్వేలో ఇండియన్ పార్లమెంట్, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలోని ప్రజా ప్రతినిధుల్లో 51 మంది మహిళలపై నేరాలు చేసినవారేనని తేల్చింది. నామినేషన్ సమయంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన సెల్ఫ్ డిక్లేర్డ్ అఫిడవిట్‌లను పరిశీలించిన ఏడీఆర్ ఈ విషయాన్ని వెల్లడించింది.   774 మంది ఎంపీలు ..4,078 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లను నిశీతంగా పరిశీలించగా..1,581 మంది ఏదో ఒక నేరం చేసి కేసులు ఎదుర్కొన్న వారేనని..వీరిలో 334 మంది మహిళలపై నేరాలు చేశారని వెల్లడించింది. ఈ జాబితాలో బీజేపీ మొదటి స్థానంలో ఉండగా..తర్వాతి స్థానాల్లో శివసేన, తృణమూల్ కాంగ్రెస్ నిలిచాయి. "యత్ర నార్యన్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత:" ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువుంటారు అన్నది దీని అర్థం. పర స్త్రీని మాతృమూర్తిగా గౌరవించే సంస్కృతి మనది..కానీ నేడు మహిళలకు రక్షణ ఎక్కడుంది..? ఏ రాజకీయ పార్టీ మేనిఫెస్టో చూసినా అందులో మొట్టమొదటగా కనిపించేది మహిళా సాధికారత, మహిళా అభ్యున్నతి గురించే.   కానీ రక్షణ కల్పించాల్సిన పాలకుల స్థానంలో భక్షించే కీచకులున్నారని గణాంకాలు తెలియజేస్తున్నాయి. దీనిని బట్టి దేశంలోని మహిళలకు ఆయా పార్టీలు ఇచ్చే గౌరవం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రికార్డుల ప్రకారం దేశంలో ప్రతీ 26 నిమిషాలకు ఒక మహిళ వేధింపులకు గురౌతోంది...ప్రతి 34 నిమిషాలకు ఒక మహిళపై అత్యాచారం జరుగుతోంది..నగరాలు, పట్టణాలు చివరికి గ్రామాల్లో సైతం మహిళలపై దాడులు జరుగుతుండటం దేశంలో నెలకొన్న పరిస్థితి ఎంత విషమంగా ఉందో చెబుతోంది. నేర చరితులు, శిక్ష అనుభవించిన..అనుభవిస్తున్న వారు ప్రజాప్రతినిధులుగా ఉండటానికి ఎంతమాత్రము వీలు లేదంటూ భారత సర్వోన్నత న్యాయస్థానం ఎన్నో సార్లు స్పష్టం చేసింది. నేర చరిత్ర ఉన్న వారు చట్టసభల్లో ఉంటే స్వచ్ఛమైన పాలన ఎలా లభిస్తుంది..?   నేరగాళ్లు, అసాంఘిక శక్తులు ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రజలు అలాంటి వారికి ఓటు వేయకూడదు.. ఓటు హక్కును వినియోగించుకునే సమయంలో ఒకటికి వందసార్లు ఆలోచించి..నీతీ, నిజాయితీ ఉన్న వారిని తమ ప్రతినిధులుగా ఎన్నుకుంటే ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం లభిస్తుంది. అత్యాచారాలను అరికట్టాల్సిన బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న నేతల మాటలు, చేతలు చూస్తే స్త్రీలు కూడా సాటి మనుషులేనని వారికి అన్ని రకాల హక్కులున్నాయని మన నేతలు గుర్తిస్తున్నట్లు కనిపించడం లేదు. ఇలాంటి నేతలు దేశంలో అత్యాచారాలను అరికట్టడానికి చర్యలు తీసుకుంటారని ఎలా నమ్మగలం..? ఇలాంటి అమానవీయ పోకడలను అరికట్టకుండా..తమను తాము మార్చుకోకుండా..ఎంతటి కఠిన చట్టాలు చేసినా ఫలితం శూన్యం.

పాపం "శిల్పాబ్రదర్స్"..రెండింటికి కాకుండా పోయారా..?

రెండింటికి చెడ్డ రెవడి అని మన పెద్దలు ఎందుకు అన్నారో తెలియదు కానీ ఇప్పుడు శిల్పా బ్రదర్స్‌కి ఈ సామెత అతికినట్లు సరిపోతుంది. నంద్యాల ఉపఎన్నికలో ఓటమి పాలుకావడం శిల్పా బ్రదర్స్‌ను తీవ్ర నైరాశ్యంలో ముంచింది. ఎందుకంటే వ్యక్తిగతంగా, రాజకీయంగా శిల్పా కుటుంబానికి ఇది పెద్ద ఎదురుదెబ్బ. ఎవరైనా పవర్‌ ఉన్న చోటుకు వెళ్లాలనుకుంటారు..వచ్చిన పవర్‌ను చేజేతులా వదులుకోరు. కానీ గ్రహచారమో..స్వయంకృతమో శిల్పా బ్రదర్స్‌ మాత్రం రెండోదే చేశారు. 2014లో ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు అన్నదమ్ములు. వారిలో ఒకరికి అసెంబ్లీ టికెట్, మరోకరికి జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించి గౌరవించింది తెలుగుదేశం.   అయితే శిల్పా ..భూమా చేతిలో ఓటమిపాలయ్యారు. అయినప్పటికీ అధికార పార్టీ కావడంతో జిల్లాలో వీరి మాటకు తిరుగులేకుండా పోయింది. ఒకదశలో దివంగత భూమా నాగిరెడ్డి సైతం వీరిని తట్టుకోలేకపోయారట. ఇక చేసేది లేక కుమార్తె అఖిలప్రియతో కలిసి తెలుగుదేశం కండువా కప్పుకున్నారు భూమా. ఎప్పుడైతే భూమా టీడీపీలోకి వచ్చాడో అప్పటి నుంచి శిల్పా బ్రదర్స్‌కి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. ఇరు వర్గాలు ఎక్కడో ఒక చోట కొట్టుకోవడం..అది బెజవాడ వరకు వెళ్లడం..సీఎం జోక్యంతో సద్దుమణగడం..రోజూ ఇదే పంచాయతీ. ఇదే సమయంలో భూమా గుండెపోటుతో మరణించడంతో నంద్యాలలో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ సందర్భంగా టీడీపీ టికెట్ ఆశించారు శిల్పా మోహన్ రెడ్డి అయితే పార్టీ ప్రయోజనాల దృష్ట్యా భూమా కుటుంబానికే టికెట్ కన్ఫర్మ్ చేశారు చంద్రబాబు. దీనిని ఏ మాత్రం జీర్ణించుకోలేని శిల్పా మోహన్ రెడ్డి మరో మాట లేకుండా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.   శిల్పా బ్రదర్స్ ఎప్పుడూ ఒకే పార్టీలో ఉంటారు.. అన్న ఒక పార్టీలో..తమ్ముడు ఒక పార్టీలో ఉండరు.. సోదరుడు లేకపోవడం చక్రపాణిని మనస్తాపానికి గురి చేసింది. దీనికి తోడు జగన్ పార్టీలో మంచి ప్రాధాన్యత ఇస్తానని చెప్పడంతో ప్రచారానికి ముందు చక్రపాణి తెలుగుదేశాన్ని వీడి వైసీపీలో చేరాడు. అది కూడా అలా ఇలా కాదు..లక్షల మంది సమక్షంలో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మరీ. తీరా ఇప్పుడు ఏం జరిగింది..శిల్పా మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయారు.   ఓడిపోయింది ఎన్నికల ఒక్క విషయంలోనే కాదు రాజకీయంగా, ఆర్ధికంగా. శిల్పాబ్రదర్స్ టీడీపీని వీడకుండా ఉండి ఉంటే కర్నూలు జిల్లాను శాసించే స్థాయికి చేరుకునేవారు. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా కష్టపడి గెలిచిన శిల్పాచక్రపాణి రెడ్డిని మండలి ఛైర్మన్‌ని చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. ఇప్పుడు రెండు పోయినట్లయ్యింది..శిల్పా మోహన్‌‌రెడ్డి కూడా కొంచెం ఓర్పు వహించి వంటే 2019లో ఎంపీ అయ్యుండేవారు.    మరోవైపు నంద్యాలలో గెలుపు కోసం తన సహకార సమితిలో రుణాలు తీసుకున్న వారందరికి రుణమాఫీ చేశారని ప్రచారం జరుగుతోంది..అంత చేసినా చివరకు ఏం జరిగింది..కోట్లాది రూపాయల సోమ్ముతో పాటు రాజకీయంగా అప్రతిష్టను మూటకట్టుకుని కలిసొచ్చిన అదృష్టాన్ని స్వయం కృతంతో అన్ని విధాలుగా నష్టపోయారు.

నంద్యాల్లో కాంగ్రెస్‌ "ఓటు" వెనుక రహస్యం..?

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు రాజకీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న నంద్యాల ఉప ఎన్నికలో విజేత ఎవరో మరికొద్ది నిమిషాల్లో తేలిపోనుంది. ఈ నెల 23న ఓటరు తన తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తంగా చేయగా..ఓటరు దేవుడు ఎవరి వైపు మొగ్గుచూపాడో తెలుసుకునేందుకు ఇవాళ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కౌంటింగ్ ప్రారంభమైన తొలి రౌండ్ నుంచే తెలుగుదేశం అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ముందంజలో నిలవగా..వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి అసలు టీడీపీ ఛాయల వద్దకు కూడా రావడం లేదు. 15వ రౌండ్ ముగిసేనాటికి తెలుగుదేశానికి 81613, వైఎస్సార్ కాంగ్రెస్‌కు 55881 ఓట్లు పడటంతో దాదాపుగా భూమా గెలిచినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.   అంత వరకు బాగానే ఉంది కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన అబ్ధుల్ ఖాదిర్‌కు 898 ఓట్లు పోలవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించి ఘోరమైన రాజకీయ తప్పిదం చేసిన కాంగ్రెస్‌ పార్టీకి 2014 సార్వత్రిక ఎన్నికల సీమాంధ్ర ప్రజలు సమాధి కట్టారు. కనీసం ఒక్క లోక్‌సభ కానీ, ఒక్క అసెంబ్లీ స్థానం కానీ హస్తానికి దక్కకుండా చేశారు. ఓటమి ఎరుగని కాంగ్రెస్ దిగ్గజాలు సైతం మట్టికరిచారంటే ప్రజాగ్రహాం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తమ అభీష్టానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిందనే అక్కసుతో ఎన్నో ఏళ్లుగా ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన జనం వైసీపీ, టీడీపీల వైపుకు వెళ్లిపోయారు.   పునర్వైభవం కోసం హస్తం నేతలు ప్రయత్నిస్తున్నా...వారిని పట్టించుకునేవారే కరువయ్యారు. ఏ ఉప ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ పోటీ చేస్తుంది..గెలుస్తామన్న ధీమాతో కాదు..అలా అయినా జనాలకి గుర్తుంటామని. అలా నంద్యాల ఉప ఎన్నికలోనూ హస్తం తన అభ్యర్థిగా అబ్ధుల్ ఖాదిర్‌ను నిలిపింది. ఎలాగూ గెలవం కాదా అని కాంగ్రెస్ నేతలు కూడా ఇక్కడ ప్రచారానికి అంతగా ఆసక్తి చూపలేదు. కానీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి తాము బరిలో ఉన్నాం కాస్త పట్టించుకోండి అంటూ ప్రజలకు గుర్తు చేశారు. తొలి నుంచి నంద్యాల కాంగ్రెస్ పార్టీకి కంచుకోట..మొత్తం 13 సార్లు హస్తం నేతలు ఇక్కడి నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించారు. ముస్లింలు, బలిజ, రెడ్డి, ఎస్సీ, ఎస్టీ తదితర వర్గాలన్నీ కాంగ్రెస్‌కు తోడుగా నిలిచాయి. ఎప్పుడయితే కాంగ్రెస్ రాష్ట్రాన్ని రెండుగా చీల్చిందో అప్పటి నుంచి నంద్యాల ప్రజలు కూడా ఆ పార్టీ పట్ల ద్వేషాన్ని పెంచుకున్నారు.   సరే గతం గత: ప్రస్తుతానికి వద్దాం..898 ఓట్లు ఎలా పడ్డాయో చూస్తే..ఉన్న ఓటర్లంతా రెండు ప్రధాన పార్టీల వైపుకు వెళ్లిపోయారు..ఇక చూస్తే తమకు ఉహ తెలిసినప్పటి నుంచి కాంగ్రెస్‌నే శ్వాసిస్తూ వచ్చిన వయోవృద్ధులు తమ మనసు చంపుకోలేక హస్తం గుర్తుకే ఓటు వేసి ఉండాలి. అంతే తప్ప అక్కడ ఏ అద్భుతం జరగలేదు..ఇక్కడ ఒక్కచోటే కాదు రాష్ట్రంలో ఎక్కడ ఏ ఉప ఎన్నిక జరిగినా కాంగ్రెస్‌కు పోలయ్యే ఒకటి రెండు ఓట్లు కూడా వృద్ధులు వేసినవే అని గుర్తిస్తే మంచిది.

నంద్యాల అటు ఇటైతే పీకే పరిస్థితేంటి..?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో హాట్ న్యూస్ ఏమైనా ఉందా అంటే అది నంద్యాల ఉప ఎన్నిక అనే చెప్పవచ్చు. ప్రజల నాడికి గీటురాయిగా..2019 ఎన్నికలకు సెమీఫైనల్‌గా అభివర్ణిస్తున్న ఈ ఉపఎన్నికలో గెలిచేందుకు టీడీపీ, వైసీపీ సర్వశక్తులు ఒడ్డాయి. 80శాతం పైచీలుకు పైగా జరిగిన పోలింగ్‌తో..ఓటర్లు ఎవరికి విజయాన్ని అందించబోతున్నారో సోమవారం తెలిసిపోనుంది. ఆ సంగతి పక్కనబెడితే నంద్యాల ఫలితం ఇరు పార్టీల్లో తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా అధికారానికి దూరమై..ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చొన్న వైసీపీ ఒకవేళ నంద్యాలలో ఓడితే కనుక ఆ పార్టీలోని మెజారిటీ ఎమ్మెల్యేలు టీడీపీ పంచన చేరి..పార్టీ పూర్తిగా నిర్వీర్యమయ్యే అవకాశాలు ఉండవచ్చంటున్నారు.   జగన్మోహన్ రెడ్డి భవితవ్యంతో పాటు మరో ముఖ్యమైన వ్యక్తి కార్యదక్షతకు, సామర్థ్యంపై వైసీపీ శ్రేణుల్లో తప్పుడు సంకేతం వెళ్లే అవకాశం ఉంది. ఆయన ఎవరో కాదు..రాజకీయ వ్యూహకర్తగా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు, జాతీయ స్థాయిలో పాపులారిటీ ఉన్న ప్రశాంత్ కిశోర్. రాబోయే ఎన్నికల్లో జగన్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రశాంత్ అండ్ టీమ్ ఇప్పటికే రంగంలోకి దిగింది. ఇప్పటికే రాష్ట్రంలోని నియోజకవర్గాల వారీగా సర్వేలు పూర్తీ చేసి ఎక్కడ ఎప్పుడు ఏం చెయ్యాలో..ఏం చేయకూడదో ప్రశాంత్ పలు సూచనలు కూడా చేశారు. ఇంకా అనేక కొత్త వ్యూహాల మీద కసరత్తు కూడా జరుగుతున్న సమయంలో నంద్యాల ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడింది.   ప్రశాంత్‌ రాక పార్టీకి ఎలాంటి ఫలితాలను అందిస్తుందో తెలుసుకోవడానికి రెండేళ్ల వరకు ఆగకుండానే.. ఈ లోగానే..నంద్యాల రూపంలో అవకాశం అందివచ్చింది. జగన్ కూడా ప్రశాంత్ కిశోర్ సత్తాను పరీక్షించాలనే ఉద్దేశ్యంతో నంద్యాల ఉప ఎన్నిక బాధ్యతను అప్పగించారు. అందుకు తగినట్లుగానే తనదైన మార్గాల ద్వారా నంద్యాలలో ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకున్నారు. దానిలో భాగంగానే టీడీపీలో ఉన్న శిల్పామోహన్ రెడ్డిని వైసీపీలోకి చేర్చుకోవడం..ఆయనకు టికెట్ ఇప్పించడం..ఎన్నికల వ్యవహారాలు ఇలా ప్రతీ ఒక్కటి ప్రశాంత్ కనుసన్నల్లోనే జరిగాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికల ప్రచారంలో మాట్లాడాల్సిన స్క్రిప్ట్‌ను కూడా ప్రశాంత్ దగ్గరుండి రాయించారట..   అలా అంతా తానై వ్యవహరించిన చోట ఓడిపోతే మాత్రం ప్రశాంత్‌ సామర్థ్యంపై జగన్‌తో పాటు వైసీపీ జనాలకు నమ్మకం పోయే ప్రమాదం ఉందని కొందరు అంటున్నారు. మాములుగా జగన్ ఎవరు ఏం చెప్పినా పట్టించుకోకుండా..ఎవ్వరి మాటకు పెద్దగా విలువ ఇవ్వరని అంటూ ఉంటారు. కానీ ప్రశాంత్ మాటలను వైసీపీ అధినేత తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు. అప్పుడు ఆ విలువ కూడా ఇవ్వకుండా తనకు నచ్చిన రీతిన జగన్ సాగే అవకాశం ఉందంటున్నారు. మరి ప్రశాంత్ కిశోర్‌ నంద్యాల పరీక్షలో నెగ్గుతారో లేదో వేచి చూడాలి.

నంద్యాలలో టీడీపీ ఓడినా.. గెలిచినా ఏం జరుగుతుంది..?

వచ్చే ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తోన్న నంద్యాల ఉప ఎన్నికకు పోలింగ్ ముగిసింది. 2 లక్షల మంది ఓటర్లు తమ నిర్ణయాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు..దాని ఫలితం ఈ నెల 28న రాబోతోంది. దాని కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్ని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. మామూలుగా అయితే ఇది ఓ ఉపఎన్నిక మాత్రమే. దీనికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ప్రత్యేక పరిస్థితుల్లో జరగడమే ఇంత హైప్‌కు కారణం. సాధారణంగా ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే అతని కుటుంబసభ్యుల్లో ఎవరో ఒకరు ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. సాంప్రదాయాన్ని గౌరవించి అధికారపక్షమో, ప్రతిపక్షమో అక్కడ తమ అభ్యర్థిని పోటికి పెట్టవు. కానీ నంద్యాల వ్యవహారం వేరు..   ఇక్కడ శాసనసభ్యునిగా మరణించిన భూమా నాగిరెడ్డి తొలుత వైసీపీ టికెట్ తరపున గెలిచి తరువాత తన కుమార్తెతో కలిసి తెలుగుదేశం కండువా కప్పుకున్నారు..ఆ తర్వాత తీవ్రమైన గుండెపోటుతో భూమా మరణించిన విషయం తెలిసిందే. అన్ని ఉప ఎన్నికల లాగానే నంద్యాల కూడా ఏకగ్రీవం అవుతుందని అంతా భావించారు. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి అభ్యర్థిని బరిలోకి దించడంతో..ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారి సార్వత్రిక ఎన్నికల నాటి రణరంగాన్ని తలపించింది. గెలుపు కోసం ఇరు పార్టీలు భారీ స్థాయిలో ఖర్చు చేశాయి కూడా..ఇదంతా పక్కనబెడితే ఈ బైపోల్ రిజల్ట్ ఇరు పార్టీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న దానిపై అప్పుడే ఎవరి అంచనాలు వారు వేస్తున్నారు.   అధికార పార్టీ గెలిస్తే ఆ ఫలితం ఖచ్చితంగా వైసీపీని చావు దెబ్బ కొడుతుంది. ఇప్పటికే 21 మంది ఎమ్మెల్యేలను తనవైపుకు లాక్కొంది టీడీపీ. వచ్చే ఎన్నికల్లో విజయం మనదేనని తన పార్టీ నేతలకు చెప్పుకుంటూ వస్తోన్న జగన్మోహన్‌రెడ్డికి వైసీపీ గనుక ఓడిపోతే పెద్ద షాక్ తగిలినట్లే. మరో పది నుంచి పదిహేను మంది ఎమ్మెల్యేలు సైకిల్ గూటికి చేరిపోయే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఒకవేళ టీడీపీ కనుక ఓడిపోతే చంద్రబాబు అండ్ టీమ్‌కి టైమ్ స్టార్టయ్యినట్లేనంటున్నారు..   మొదటిగా పార్టీ గెలుపు బాధ్యతను తన భుజాలపై వేసుకున్న మంత్రి భూమా అఖిలప్రియ..నంద్యాలలో టీడీపీ ఓడిపోతే మంత్రి పదవికి సైతం రాజీనామా చేస్తానని ప్రకటించారు. అదే జరిగితే ఆమె ఆళ్లగడ్డకు మాత్రమే పరిమితం కావాల్సి వస్తోంది..దీంతో దశాబ్దాలుగా నడుస్తోన్న భూమా కుటుంబం ఆధిపత్యానికి చెక్ పడినట్లే. ఆమెతో పాటు ఏవీ సుబ్బారెడ్డి, ఎస్పీవై రెడ్డి, ఫరూక్, ఎస్వీ మోహన్ రెడ్డి అడ్రస్ గల్లంతవుతుంది. ఇక ఉప ఎన్నిక బాధ్యతను తీసుకున్న ఎంపీ టీజీ వెంకటేశ్, మంత్రి కాల్వ శ్రీనివాసులపై కూడా ఓటమి ప్రభావం పడే అవకాశాలు లేకపోలేదు. ఈ పరిణామాలన్నింటిని కూలంకషంగా విశ్లేషిస్తే నంద్యాల ఉప ఎన్నిక ఫలితం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి అత్యంత కీలకమైన అంశంగా చెప్పుకోవచ్చు. మరి విజయం ఎవరిని వరిస్తుందో..ఓటమి ఎవరిని పలకరిస్తుందో ఈ నెల 28న తేలిపోనుంది.