జగన్‌ని మానసికంగా దెబ్బ కొట్టిన గుర్నాథరెడ్డి

జీవితంలో ఎవరిని పొగొట్టుకున్నా.. ఎంతమంది మనల్ని కాదని వెళ్లిపోయినా మనల్ని బాగా అభిమానించే వారిని.. కష్టాలలో మన వెంట నడిచిని వారిని మాత్రం దూరం చేసుకోకూడదు అంటారు మన పెద్దలు. కానీ వైసీపీ అధినేత, గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారు మాత్రం ఈ సూక్తిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇందుకు కారణం లేకపోలేదు.. అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ నేత గుర్నాథరెడ్డి పార్టీని విడిచి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇందులో ఏముంది ఇంతకు ముందు వైసీపీ నుంచి గెలిచిన వారు, గెలవని వారు ఎంతోమంది సైకిలెక్కారు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ వీరిలో గుర్నాథరెడ్డి వ్యవహారం వేరు. తొలి నుంచి వీరి కుటుంబంలో అంతా కాంగ్రెస్‌వాదులే.. గుర్నాథరెడ్డి అన్న నారాయణరెడ్డి నాటి ముఖ్యమంత్రి వైఎస్‌కు వీరాభిమాని. ఆయన అండదండలతో 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. అనారోగ్యంతో అన్నయ్య రాజకీయాలకు దూరం కావడంతో గుర్నాథరెడ్డి 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.   అయితే 2009లో హైలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా 150 మంది ఎమ్మల్యేలు జగన్‌ని సీఎం చేయాల్సిందిగా హైకమాండ్‌ను కోరారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో జగన్మోహన్ రెడ్డి వేరు కుంపటి పెట్టుకున్నారు. నాడు అధికారంలో ఉన్న పార్టీని.. అన్నని కాదని జగన్ వెంట నడిచాడు గుర్నాథరెడ్డి. నా కోసం రాజీనామా చేస్తావా అంటే.. చేస్తానన్న అంటూ అడుగు ముందుకేసి రాజీనామా చేశారు గుర్నాథం. జగన్ మీద నమ్మకంతో ఇంత డేర్ స్టెప్ వేసిన నాయకుడు అప్పట్లో మరొకరు లేరు అంటారు రాజకీయ విశ్లేషకులు. అప్పుడే కాదు అధినేత ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా.. కార్యకర్తలను, నేతలను ముందుండి నడిపించారు.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జగన్ వెన్నంటే ఉన్నారు. అలాంటి వ్యక్తికి రాను రాను పార్టీలో ప్రాధాన్యం తగ్గిపోయింది. అనంతపురం టికెట్‌ను ఆయనను కాదని మైనారిటీ నేత నదీంకు ఇస్తున్నట్లు స్వయంగా జగన్ ప్రకటించారు. ఈ నిర్ణయం పట్ల తీవ్ర మనస్తాపానికి గురైన గుర్నాథరెడ్డి తనకు ఆదరణ లేని పార్టీలో ఉండటం కన్నా వైదొలగడమే మంచిదని భావించారట.   ఇదే సమయంలో జేసీ, పరిటాల కుటుంబాలతో సత్సంబంధాలు ఉండటంతో.. వారి సూచన మేరకు ఆయన టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ పరిణామం జగన్ విశ్వసనీయతపై ప్రభావం చూపిస్తుందంటున్నారు విశ్లేషకులు. తొలి నుంచి వెంట నడిచిన గుర్నాథరెడ్డి లాంటి వాళ్లనే పక్కనబెడితే రేపు మా పరిస్థితి ఏంటనే టెన్షన్ వైసీపీ నేతలను కుదిపేస్తోందట. మరి గుర్నాథాన్ని టీడీపీలోకి వెళ్లకుండా బుజ్జగిస్తారా లేక "వెళితే వెళ్లాడు లే" అన్న ధీమాతో ఉంటారా అన్నది తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఫస్ట్ డే జర్నీలో.. కొంచెం కంగారు.. కొంచెం కష్టాలు

దశాబ్ధాల హైదరాబాదీల కల మంగళవారం సాకారమైంది. ఆ రోజు మధ్యాహ్నం మియాపూర్ వేదికగా హైదరాబాద్ మెట్రోను ప్రధాని నరేంద్రమోడీ జాతికి అంకితం చేశారు. మియాపూర్ నుంచి కూకట్‌పల్లి వరకు.. తిరిగి కూకట్‌పల్లి నుంచి మియాపూర్ వరకు ప్రధాని మెట్రో రైలులో ప్రయాణించారు. ప్రారంభోత్సవం రోజున ప్రజల్ని మెట్రో ప్రయాణానికి అనుమతించకుండా ఆ తర్వాతి రోజు నుంచి వీలు కల్పిస్తామని అధికారులు ముందుగానే తెలిపారు. ఎప్పుడెప్పుడు మెట్రో ఎక్కుదామా అని వేచి చూసిన జనం బుధవారం ఉదయం ఆరు గంటలకు అన్ని మెట్రో స్టేషన్ల వద్దకు భారీగా చేరుకోవడంతో పండుగ వాతావరణం కనిపించింది.   మొదటి సర్వీసు నాగోల్ నుంచి మియాపూర్‌ వరకు నడిచింది. తొలి రోజు ప్రయాణికులకు మధుర స్మృతిగా మిగిలిపోయింది. "మెట్రో జర్నీ సేఫ్ అండ్ స్పీడ్ జర్నీ" అని మెజారిటీ జనాలు అంటున్నారు. సాధారణంగా ఉప్పల్ నుంచి మియాపూర్ వెళ్లాలంటే రెండు, మూడు గంటలు పడుతుందని.. అలాంటిది నిమిషాల్లోనే ఇక్కడికి చేరుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అయితే ఫస్ట్ డేజర్నీలో చిన్న చిన్న షాకుల్ని కూడా టేస్ట్ చేశారు ప్యాసింజర్స్.   కాయిన్ ఉన్నా కానీ ఎంట్రీ అండ్ ఎగ్జీట్ గేట్స్ ఓపెన్ కాకపోవడంతో పలువురు ప్రయాణికులు సిబ్బందితో గొడవపడ్డారు. మరికొందరైతే తాము దిగాల్సిన స్టేషన్‌లో దిగలేక నెక్ట్స్ స్టాప్‌లో దిగాల్సి వచ్చింది. టికెట్ ఒక స్టేషన్‌కి కొనుగోలు చేసి మరో స్టేషన్‌లో దిగడంతో అక్కడ గేట్స్ తెరుచుకోలేదు. తొలి రోజు కావడం.. ప్రయాణికులకు సరైన అవగాహన లేకపోవడంతో అధికారులు కూడా వారిని వదిలేశారు. తొలి రోజు కొద్ది మంది వ్యక్తిగత అవసరాల కోసం మెట్రో జర్నీ చేయగా.. మెజార్టీ ప్రజలు మాత్రం మెట్రో అనుభూతి కోసమే ప్రయాణించారు. వీరిలో ఎక్కువ మంది యువత, విద్యార్థులే ఉన్నారు. బుధవారం అర్థరాత్రి వరకు సుమారు లక్షమంది మెట్రోలో ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

జీఈఎస్‌లో టాలీవుడ్ మెరుపులు

మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో జరగనున్న గ్లోబల్ ఎంట్రపెన్యూర్‌షిప్ సమ్మిట్‌కు ప్రపంచ నలుమూలల నుంచి ప్రతినిథులు తరలివచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆయన పర్సనల్ అడ్వైజర్ ఇవాంకా ట్రంప్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అసాధారణ స్థాయిలో ఏర్పాట్లు చేశాయి. ఈ సారి సమ్మిట్‌లో సగానికి పైగా (52.5శాతం) మహిళా ప్రతినిధులు పాల్గొవడం విశేషం. వీరిలో 175 మంది పారిశ్రామిక వేత్తలు, నూతన ఆవిష్కర్తలు, వివిధ కార్పోరేట్ సంస్థల ప్రతినిధులు, సినీతారలు, క్రీడాకారులు, ప్రభుత్వ ప్రతినిధులు వివిధ అంశాలపై చర్చించనున్నారు.   పెట్టుబడులును ఆకర్షించడం, గ్లోబల్ ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నివ్వడం, యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌లకు చేయూతనివ్వడం ఈ సమ్మిట్ ప్రధాన ఉద్దేశం. ఇంతటి ప్రతిష్టాత్మక సదస్సులో భాగమవ్వాలని ఎవరికి ఉండదు చెప్పండి. కాని అవకాశం కొద్దిమందికే కదా..? అన్నట్లు ఈ సమ్మిట్‌లో మన టాలీవుడ్ కూడా భాగమైంది.   రెండో రోజు ఉదయం సినీ రంగ భవిష్యత్తుపై జరగనున్న చర్చలో టాలీవుడ్ యంగ్‌హీరో రామ్‌చరణ్ తేజ్ ప్రసంగిస్తారు. సినిమాలు చేస్తూనే.. వ్యాపార రంగంలో కూడా చెర్రీ తన టాలెంట్‌ను నిరూపించుకున్న విషయం తెలిసిందే. ఇక విలక్షణ నటుడు మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మీకి కూడా ఈ సదస్సులో పాల్గొనే అవకాశం లభించింది. మహిళల్లో ఔత్సాహికత, మహిళా పారిశ్రామిక వేత్తలు ఎదుర్కొనే సవాళ్లు, వారి జీవితాల్లో సమతుల్యత వంటి అంశాలపై లక్ష్మీ మాట్లాడుతుంది.   ఇక ప్రసంగించే అవకాశం లేనప్పటికీ ఇవాంకాను కలిసే అవకాశం పొందింది అక్కినేని వారి కోడలు సమంత. అగ్రరాజ్యాధినేత గారాలపట్టికి చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సమంత సిద్ధిపేట గొల్లభామ చీరలని సెలక్ట్ చేసిందట.. ఈ చీరను తనే స్వయంగా ఇవాంకకి ప్రజంట్ చేస్తుందట. వీరే కాదు బాలీవుడ్ నుంచి అదితిరావ్ హైదరీ, దీపికా పదుకొనే కూడా పాల్గొంటారని సమాచారం. ఎక్కడైనా.. ఏ కార్యక్రమంలో అయినా సినిమా వాళ్లుంటే ఆ కిక్కే వేరు కదా...?

మెట్రో క్రెడిట్ చంద్రబాబుదా.. వైఎస్‌దా.. కేసీఆర్‌దా

భాగ్యనగర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న హైదరాబాద్ మెట్రో ప్రారంభానికి ఇంకా కొద్ది గంటలు మాత్రమే మిగిలుంది. ఈ నెల 28వ తేదీన భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ హైదరాబాద్ మెట్రోను లాంఛనంగా ప్రారంభించి జాతికి అంకితం ఇవ్వనున్నారు. ఇదే సమయంలో అసలు మెట్రో క్రెడిట్ ఏ ముఖ్యమంత్రి ఖాతాలో వేయాలా అని సోషల్ మీడియా వేదికగా హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఇదంతా తెలియాలంటే గతంలోకి వెళ్లాలి.. ఇరుకు రోడ్లు, అస్తవ్యవస్తమైన రవాణా వ్యవస్థ ఉన్న హైదరాబాద్‌లో ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్లాలంటే ఎన్ని గంటలు పడుతుందో తెలియదు. ఈ సమస్య నుంచి ప్రజలను గట్టెక్కించడానికి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంఎంటీఎస్‌కు శ్రీకారం చుట్టి రైల్వే సహకారంతో అత్యంత వేగంగా పూర్తి చేశారు.   ఫలక్‌నూమా-సికింద్రాబాద్, ఫలక్‌నూమా-లింగంపల్లి, హైదరాబాద్-ఫలక్‌నూమా, హైదరాబాద్-లింగంపల్లి స్టేషన్ల మధ్య 43 కిలోమీటర్ల పరిధీలో దీనిని ఏర్పాటు చేశారు. అతి తక్కువకాలంలో ఎంఎంటీఎస్‌ ప్రజలకు బాగా చేరువైంది. అయితే పెరుగుతున్న నగర జనాభా, అప్పుడప్పుడే పురుడు పోసుకుంటున్న సాఫ్ట్‌వేర్ బూమ్‌తో ఎన్నో ప్రపంచస్థాయి కంపెనీలకు నగరం చిరునామాగా మారింది. ఈ నేపథ్యంలో టెక్కీలు వేగంగా తమ కార్యాలయాలకు ఏ వైపు నుంచి ఏ వైపుకైనా చేరుకోవడానికి వీలుగా కొత్తగా ఏమైనా చేయ్యాలని సీఎం ఆలోచించారు.   ఆ దిశలో కోల్‌కతా, ఢిల్లీ మెట్రోల స్పూర్తితో భాగ్యనగరంలోనూ మెట్రోను తీసుకురావాలని చంద్రబాబు సంకల్పించారు. దీనిలో భాగంగానే హైదరాబాద్ మెట్రో ఆలోచన పుట్టింది.. ఆ వెంటనే కేంద్రప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పంపారు.. దీనికి కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ నుంచి ఆమోదం లభించింది. స్థల సేకరణ, నిధుల కేటాయింపు తదితర అన్ని కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశారు చంద్రబాబు. అయితే 2004లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత వైఎస్ హైదరాబాద్ మెట్రోకి శంకుస్థాప చేసి.. కేంద్రాన్ని ఒప్పించి మరీ ముఖ్యమైన అనుమతులు సంపాదించి పనులను పరుగులు పెట్టించారు. ఆ తర్వాత హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ మరణించడం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో మెట్రో పనులు ఆలస్యమయ్యాయి. ఆయన తర్వాత ముఖ్యమంత్రి అయిన కిరణ్‌కుమార్ రెడ్డి కూడా మెట్రోను అందుబాటులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమించారు.   రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ తెలంగాణ తొలి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక మెట్రో అలైన్‌మెంట్‌ మార్పుపై పెద్ద దుమారం రేగింది. అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడాల పరిరక్షణ కోసం అలైన్‌మెంట్ మార్చి తీరుతామని చంద్రశేఖర్ రావు ప్రకటించడంతో రేగిన వివాదం ఎన్నో మలుపులు తీరిగింది. ప్రభుత్వం మార్పులు సూచించిన మూడు మార్గాల్లో నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ వెంటనే పనులను నిలిపేసి నెలలు గడిచినా సర్కార్ ఈ అంశంపై నిర్మాణ సంస్థకు అధికారిక ఆదేశాలు జారీ చేయలేదు. అందువల్ల ఎల్ అండ్ టీ సంస్థ మెట్రోని తాత్కాలికంగా నిలిపివేయబోతుందంటూ వార్తలు వచ్చాయి.   దీంతో రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి ఎన్ని అడ్డంకులు ఎదురైనా మెట్రోని ఆపే ప్రసక్తే లేదని హామీ ఇచ్చారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎలైన్‌మెంట్ మార్చి తొలి దశను అందుబాటులోకి తీసుకువచ్చారు. మరి ఈ మెట్రో క్రెడిట్‌ను ఏ సీఎం ఖాతాలో వెయ్యాలి.. నిజానికి రాజకీయాల్లో పనులు ఎవరి హయాంలో శంకుస్థాపన జరిగినా అంతిమంగా ఎవరి చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ అవుతాయో ఆ క్రెడిట్ అంతా వారి ఖాతాలోకే వెళ్లపోతుందన్నది బేసిక్ ప్రిన్సిపల్.. దీనిని బట్టి మీరే ఒక అంచనాకి వచ్చేయొచ్చు.

నంది రచ్చ "ఆయన" కోసమేనా..?

2014, 2015, 2016 సంవత్సరాలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. నా అనుకున్న వారికి.. అయినవారికే అవార్డులు కట్టబెట్టారని తెలుగు చిత్ర పరిశ్రమలోని కొందరు ఓపెన్‌గానే విమర్శిస్తున్నారు. హుందాగా, గౌరవప్రదంగా జరగాల్సిన నంది పురస్కారాల ప్రక్రియ రోడ్డుకెక్కడంతో ప్రభుత్వం పరువు మంటగలిసింది. అయినా అవార్డులన్నాకా ఇలాంటి వివాదాలు కామనే అని కొన్ని రోజులకే అంతా గప్‌చుప్ అయిపోతారని అనుకున్నారు. కానీ ఏపీలో ఆథార్ కార్డ్.. ఓటర్ కార్డు లేని వారే నంది పురస్కారాలపై విమర్శలు చేస్తున్నారంటూ మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. దీనికి కౌంటర్‌గా పోసాని కృష్ణమురళి కామెంట్స్ సినీ, రాజకీయ వర్గాలను షేక్ చేశాయి.   దేశంలో ఏ ప్రాంతం వారినైనా విమర్శించాలనుకుంటే.. అక్కడ ఆథార్, ఓటర్ కార్డ్ ఉండాలా అంటూ సెటైర్ వేశాడు. రెండు, మూడు రోజుల్లో ముగిసిపోతుందనుకున్న వివాదం కాస్తా టీవీ సీరియల్‌లా సాగిపోతోంది. అయితే దీని వెనుక ఏదో స్కెచ్ ఉందని అంటున్నారు విశ్లేషకులు. అధికారమే లక్ష్యంగా ప్రజా సంకల్పయాత్ర పేరుతో రాష్ట్రమంతా పాదయాత్ర చేపట్టారు వైసీపీ అధినేత జగన్. మూడువేల కిలోమీటర్లను ఆరు నెలల్లో చుట్టి రావాలన్నది టార్గెట్. మరి తాను ఇంత కష్టపడుతున్నప్పుడు ఇది జనాల్లోకి వెళ్ళాలి కదా..? మాట్లాడుకోవాలి కదా..? ఇందుకోసం ఏం చేయాలి అన్న దానిలో భాగంగా వైసీపీ ఎన్నికల ప్రచార కర్త ప్రశాంత్ కిశోర్ వ్యూహాన్ని సిద్ధం చేశారు.   తన సొంత టీవీ, పత్రికల్లో వార్తలు వస్తే కొందరే చూస్తారు.. కానీ మిగతా వాటిలో కూడా తన యాత్ర గురించి రావాలి కదా..? అందుకే యాత్రకు ముందే మీడియా అధిపతులు, రిపోర్టర్లు, డెస్క్ సభ్యులను కలిసి తన తండ్రి యాత్రను కవర్ చేసినట్లే, తన యాత్రకు కూడా భారీ స్థాయిలో కవరేజ్ అందించాలని జగన్ విజ్ఞప్తి చేశారట. అయితే ఇప్పుడు తన సొంత మీడియాలో తప్పితే... మిగతా టీవీలు, పేపర్లలో జగన్ పాదయాత్ర సింగిల్ కాలమ్‌కి కూడా నోచుకోలేని పరిస్థితి. అంతకు ముందే అసెంబ్లీని బాయ్‌కాట్ చేసిన జగన్... టీడీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నించారు. తద్వారా ప్రతిపక్షం లేని అసెంబ్లీ ఎలా సాగుతుందో జనం చూసి ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తారని వైసీపీ అధినేత ఆశించారు.   కానీ ఏపీ అసెంబ్లీ సమావేశాలు కాదు కదా..? ఆఖరికి ఇవాంక ట్రంప్‌పై వస్తున్న ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ను కూడా పక్కకు నెట్టిన జనం నంది అవార్డులకు సంబంధించిన వార్తలనే ఎక్కువగా బ్రౌజ్ చేశారు. ఇక జగన్ పాదయాత్రను ఎవరు పట్టించుకుంటారు చెప్పండి. ఇప్పటి వరకు 200 కిలోమీటర్లు నడిచిన జగన్‌కి తాను ఆశించిన ఫలితం దక్కుతుందా అన్న మీమాంసలో పడిపోయారట. పైగా ప్రజాస్పందన కూడా అంతంత మాత్రంగానే ఉండేసరికి వైసీపీ శ్రేణుల ముఖాల్లో నెత్తురు చుక్క కనిపించడం లేదు. మీడియా దృష్టిని మళ్లించడం అనే ప్రక్రియలో భాగంగా.. కావాలనే ఎవరో నంది అవార్డుల రచ్చని వెనకుండి నడిస్తున్నారా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. 

లోకేశ్.. ఇలా అయితే ఎలా

తన తర్వాత తన కుమారుడిని ముఖ్యమంత్రిగా చేయాలని ఎంతో కష్టపడుతున్నారు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేశ్‌ని 2019 వరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురాకూడదని భావించారు చంద్రబాబు.  కానీ పార్టీ కార్యకర్తలు, నేతల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా ఎమ్మెల్సీగా ఎన్నిక చేయించి కేబినెట్‌లోకి తీసుకున్నారు. తద్వారా ప్రభుత్వ కార్యకలాపాలు దగ్గరి నుంచి చూసే అవకాశాన్ని కల్పించారు సీఎం. చాలా తక్కువ టైంలో.. అతి చిన్న వయసులో మంత్రి హోదాలోకి వచ్చిన లోకేశ్‌కి అనుభవలేమో.. కొంచెం కంగారు పడుతున్నారో తెలియదు కానీ వేదికల మీద.. ప్రెస్ మీట్లలోనూ కాస్త తడబడుతున్నారు.   మొన్నామధ్య బీఆర్ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా లోకేశ్ శుభాకాంక్షలు చెప్పారు.. అయితే అంబేద్కర్ జయంతిని పొరపాటున వర్థంతిగా పేర్కొనడంతో సోషల్ మీడియా హోరేత్తిపోయింది. ఇలా ఒకటి కాదు ఎన్నో అంశాల్లో లోకేశ్ తడబాట్లు తెలుగుదేశానికి తలనొప్పిగా మారింది. ముఖ్యంగా ప్రత్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని పార్టీ పరువును బజారుకీడుస్తున్నారు. ఈ వివాదాలతో పాఠం నేర్చుకున్న చినబాబు ఇటీవలి కాలంలో కాస్త ఆచితూచి స్పందిస్తున్నారు. తాజాగా 2014, 2015, 2016 సంవత్సరాలకు గానూ నంది అవార్డులు ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మూడు సంవత్సారాలకు కలిపి ఒకేసారి ఇవ్వడం.. ఒక సామాజిక వర్గానికే పెద్దపీట వేయడం.. ఒకే సినిమాకు తొమ్మిది అవార్డులు ఇవ్వడంపై పెద్ద దుమారం రేగింది.   అది కాస్త సద్దుమణుగుతున్న సమయంలో లోకేశ్ ఎంట్రీ ఇవ్వడం అగ్నికి ఆజ్యం పోసింది. ఏపీలో ఓటరు కార్డు.. ఆధార్ కార్డ్ లేని వారే నంది అవార్డులపై రచ్చ చేస్తున్నారంటూ ఆయన చేసిన కామెంట్‌ పలువురు సినీ ప్రముఖులకి ఆగ్రహం తెప్పించింది. ఈ దేశంలో ఎవరిపై విమర్శలు చేయాలన్నా ఆ ప్రాంతంలో ఆథార్ కార్డులు, రేషన్ కార్డులు ఉండాలా..? మరి మీ ఆస్తులన్నీ.. చివరికి సొంతిల్లు కూడా హైదరాబాద్‌లోనే ఉంది కదా..? అంటూ పలువురు సోషల్ మీడియాలో సెటైర్లు పేలుస్తున్నారు.   వీటన్నింటిని గమనిస్తున్న సగటు తెలుగుదేశం కార్యకర్త ముఖం మాడిపోతోంది.. ముఖ్యమంత్రి లాంటి ఉన్నత హోదాలోకి వెళ్లబోయే వ్యక్తికి రాజ్యాంగాలు, చట్టాలు తెలియాల్సిన అవసరం లేదు..? కనీస విషయ పరిజ్ఞానం ఉంటే చాలు అంటున్నారు. మనం ఒక వేలు ఇతరుల పైకి చూపిస్తే.. మిగిలిన నాలుగు వేళ్లు మనవైపే చూస్తాయని గుర్తించాలని.. కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు కాస్త ముందు వెనుక ఆలోచించి మాట్లాడాలని రాజకీయాల్లో ఉన్నవారు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలని వారు అంటున్నారు.  

రాజకీయాల్లోకి శ్రీకృష్ణుడు

భారతీయులను సులభంగా బుట్టలో వేసుకునే మార్గం ఏదన్నా ఉందంటే అది సెంటిమెంటే అంటారు పాశ్చాత్యులు. ఇండియాలో దానికున్న పవర్ దేనికీ లేదని వారి స్ట్రాంగ్ ఫిలింగ్. వారు ఆ మాట ఎందుకన్నారో తెలియదు కానీ అది మాత్రం పచ్చి నిజం. మనదేశంలో అన్ని రకాల పనులు చేసుకునేందుకు ఈ సెంటిమెంట్‌నే ఆయుధంగా వాడుకుంటూ ఉంటారు. ఈ విషయంలో పొలిటిషియన్స్‌ది అందెవేసిన చేయి. వారి అంతిమ లక్ష్యం ఏదైనా ఉందంటే అది అధికారమే.. దాని కోసం వారు ఏం చేయడానికైనా సిద్ధమే.. వివాదాలను వారే రాజేస్తారు.. దానిపై పోరాటాలు చేస్తారు.. వాటిని చల్లారుస్తారు.. జనం దృష్టిలో హీరోలవుతారు.   స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి తమ స్వార్థం కోసం లేనిపోని వివాదాలను సృష్టించి ప్రజల్లో సెంటిమెంట్‌ని రగిల్చి ప్రయోజనం పొందిన వారు ఎందరో. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయి ఘోరంగా దెబ్బతిన్న సమాజ్‌వాదీ పార్టీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందడానికి కొత్త రాగాన్ని అందుకుంది. ఆ పార్టీ మాజీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ రాజకీయాల్లోకి శ్రీకృష్ణుడిని లాగి సరికొత్త వివాదాన్ని దేశ రాజకీయాల్లోకి తెరపైకి తెచ్చారు. శ్రీరాముడు కేవలం ఉత్తర భారతదేశంలో మాత్రమే పూజలు అందుకుంటున్నాడని... అయితే శ్రీకృష్ణుడు మాత్రం మొత్తం భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పూజలు అందుకుంటున్నాడని వ్యాఖ్యానించారు.   ఘజియాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... శ్రీరాముడి కంటే శ్రీకృష్ణుడికే ఎక్కువ మంది శిష్యులు ఉన్నారని.. దక్షిణ భారతదేశం వెళితే.. శ్రీరాముడి కంటే శ్రీకృష్ణుడే ఎక్కువ పూజలు అందుకుంటున్నాడని గ్రహిస్తారన్నారు. ములాయం ఈ మాట అనడానికి వెనుక పెద్ద స్కెచ్చే ఉంది. అయోధ్యలోని రామ మందిర వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టు చేతిలోకి వెళ్లింది. దాని నుంచి జనం దృష్టిని కొద్దిగా మళ్లించేందుకో.. మరేదైనా కారణం చేతనో గానీ.. పర్యాటకం పేరిట సరయు నదిపై 100 మీటర్ల రాముడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని ప్రకటించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. రామ మందిరం ఇష్యూ పక్కకి వెళితే రాజకీయంగా సమస్యలు వస్తాయని భావించిన కమలనాథులు శ్రీరాముడి విగ్రహ నిర్మాణాన్ని భుజానికెత్తుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.   రాముడి వైపు జనం వెళ్లిపోతే తమ పరిస్థితి క్లిష్టంగా మారుతుందని భావించిన ఎస్పీ కురువృద్ధుడు కృష్ణుడిని రాజకీయాల్లోకి తీసుకువచ్చారు.. అయితే తన స్వగ్రామమైన సైఫైలో 50 అడుగుల కృష్ణుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని ఈ నెల ప్రారంభంలో ప్రకటించారు ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్.  తమకు సాలీడ్ ఓటు బ్యాంకుగా ఉన్న యాదవుల్ని పట్టి ఉంచేందుకే అఖిలేశ్ ఈ నిర్ణయం తీసుకున్నాడని లక్నో టాక్. కొడుకు విగ్రహాన్ని ప్రతిష్టాననడం.. తండ్రి శ్రీకృష్ణుడిని పొగడటం చూస్తుంటే రాబోయే లోక్‌సభ ఎన్నికల రాజకీయమంతా రాముడు, కృష్ణుడు చుట్టూనే తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు విశ్లేషకులు.

శశిథరూర్ "చిల్లర" వివాదం

రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు తమ హోదాకు తగ్గట్టు ఎంతో హుందాగా ప్రవర్తించాలి.. సరే హోదా పక్కనబెడితే తమ వయసును గమనించైనా సరే అందుకు తగ్గట్టుగా వ్యవహరించాలి. కానీ కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ఈ సంగతి మరచిపోయినట్లున్నారు. హరియాణాకు చెందిన మానుషి చిల్లర్ 2017వ సంవత్సరానికి గానూ మిస్ వరల్డ్ టైటిల్‌ని గెలుచుకొని భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు. చైనాలోని సాన్యాలో జరిగిన 67వ మిస్ వరల్డ్ పోటీలో 108 దేశాలకు చెందిన అందగత్తెలను పక్కకునెట్టి కిరీటాన్ని దక్కించుకుంది. అంతేకాదు 17 సంవత్సరాల తర్వాత ఈ ఘనతను మనదేశానికి అందించింది.   ఈ పోటీల్లో మానుషి గెలుపొందడంతో సొంత రాష్ట్రం హరియాణాతో పాటు దేశవ్యాప్తంగా ఆమె పేరు మారుమోగిపోతోంది. దీంతో ఛిల్లర్‌ను ఆకాశానికెత్తేసింది నేషనల్, ఇంటర్నేషనల్ మీడియా.. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు సోషల్ మీడియా ద్వారా మానుషికి అభినందనలు తెలిపారు. ఒడిషాకు చెందిన సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఇసుకతో చిల్లర్ రూపాన్ని చిత్రించి ఆమెకు శుభాకాంక్షలు తెలిపాడు. అలా అంతా తమ ఆనందాన్ని వివిధ రూపాల్లో తెలియజేస్తున్న వేళ.. శశిధరూర్ మాత్రం ఈ ఆనందానికి రాజకీయ రంగు పులిమారు. ఆమెపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.   "మన కరెన్సీని రద్దు చేయడం ఎంత పెద్ద తప్పో బీజేపీ ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది. మన "చిల్లర"కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని చిల్లర్ ప్రపంచ సుందరిగా ఎన్నిక కావడంతో రుజువైంది" అంటూ ట్వీట్ చేశారు. నోట్ల రద్దు విషయంలో తొలి నుంచి బీజేపీ వైఖరిని తప్పుబడుతోంది కాంగ్రెస్ . తాజా విజయాన్ని కూడా నోట్లరద్దుకి ముడిపెట్టి అవసరం లేకపోయినా మానుషి చిల్లర్ పేరును ప్రస్తావించారు థరూర్. అంతే ఆ ట్వీట్ చేసిన కాసేపటికే నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో మాటల దాడి ప్రారంభమైంది. 17 ఏళ్ల తర్వాత భారత్‌కు మిస్ వరల్డ్ కిరీటం తీసుకొచ్చిన మానుషి చిల్లార్‌ను చిల్లరగా పోల్చడంపై వారు ఫైరవుతున్నారు.   మానుషి జాట్ వర్గానికి చెందిన యువతి కావడంతో ఆ సామాజిక వర్గం నుంచి నిరసన సెగ మొదలైంది. ఆమెను అవమానించడం అంటే జాట్లను అవమానించడమేనని ఆ వర్గానికి చెందిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు థరూర్ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ కూడా తీవ్ర అభ్యంతరం తెలిపింది. దేశప్రతిష్టను పెంచిన ఆమె ఘనతను తక్కువ చేసి మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పాలంటూ సమన్లు జారీ చేసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలని భావించిన థరూర్‌ వ్యూహం మిస్ ఫైర్ అయి తిరిగి ఆయన్నే ఇబ్బందుల్లోకి నెట్టింది.. ఆయన్ని అనే కంటే కాంగ్రెస్ పార్టీని అనడం మంచిదేమో. ఎందుకంటే ఒక వ్యక్తి చేసిన మంచి కానీ, చెడు కానీ అతను ప్రాతినిథ్యం వహిస్తున్న వ్యవస్థ మొత్తానికి వర్తిస్తుంది. మరి ఈ వివాదం నుంచి ఆయన (సారీ) కాంగ్రెస్ పార్టీ ఎలా బయటపడుతుందో వేచి చూడాలి. 

"నందులు" బాబు కొంపముంచుతాయా..?

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ ముహూర్తాన నంది అవార్డులను ప్రకటించిందో కానీ ఆ నెక్ట్స్ మినిట్ నుంచి రాష్ట్రప్రభుత్వం మీద విమర్శల వాన కురుస్తోంది. అవార్డులు ప్రకటించిన తర్వాతి క్షణం నుంచి ఈ ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, హేతుబద్ధంగా జరగలేదన్న విమర్శలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. ఏపీ ప్రభుత్వంలోని కొందరు పెద్దలు తమకు కావల్సిన వారికి.. అయిన వారికి పురస్కారాల్లో పెద్దపీట వేశారని ఒకవైపు.. ఒకే సామాజిక వర్గానికి గుంపగుత్తగా అవార్డులను కట్టబెట్టారని  ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇక అభిమానులైతే ప్రభుత్వం మీద పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నారు. అవార్డుల ఎంపికలో మెగా కుటుంబానికి తీవ్ర అన్యాయం జరిగిందని.. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వంటి వారిని.. వారు నటించిన సినిమాలను ఏ మాత్రం పట్టించుకోలేదని.. ఏదో కంటితుడుపుగా మెగాస్టార్‌కి రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చారని మెగా అభిమానులు. మహానటుడు ఏఎన్నార్ చివరి సినిమా "మనం"ను ఘోరంగా అవమానించారని అక్కినేని అభిమానులు.. కులం కారణంగా ప్రభాస్‌కు బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వలేదని రెబల్‌స్టార్ ఫ్యాన్స్.. నా రుద్రమదేవి కనీసం జ్యూరీ గుర్తింపుకు కూడా నోచుకోలేదా అంటూ గుణశేఖర్ ఇలా ఒకళ్లా..? ఇద్దరా ..? విమర్శించే వాళ్ల లిస్ట్ పెరుగుతూనే ఉంది తప్ప వీటికి ఎండ్ మాత్రం పడటం లేదు. లెజెండ్ సినిమాకు ఏకంగా తొమ్మిది అవార్డులు రావడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే బాలయ్య ఈ అవార్డుల కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించారు.. అందువల్లే తన సినిమాకే అవార్డులన్ని ఇప్పించుకున్నారని ఫిలింనగర్‌లో హాట్ హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఇక అన్నింటికన్నా మరో ఆసక్తికరమైన కోణం ఎలివేట్ అవుతోంది అదే "కమ్మ" యాంగిల్. ఈసారి అవార్డుల్లో ఆ సామాజిక వర్గానికి చెందిన వారికే అవార్డ్ దక్కడం వివాదానికి దారి తీసింది. బాలయ్య, ఎన్టీఆర్, మహేశ్, బోయపాటి శ్రీను అంతా కమ్మవారే. దీంతో ఇవి కమ్మ అవార్డులు అంటూ పెదవి విరుపులు వినిపిస్తున్నాయి. ఇక ఈ విమర్శలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా జ్యూరీ మెంబర్, డైరెక్టర్ మద్దినేని రమేశ్ ‌బాబు ఉపయోగించిన భాష అభ్యంతరకరంగా ఉంది. వర్మను రాయలేని రీతిలో బండ బూతులు తిడుతూ మద్దినేని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఇలాంటి వారినా చంద్రబాబు జ్యూరీ మెంబర్‌గా నియమించేది అంటూ ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నారు. మెగా ఫ్యామిలీని పట్టించుకోకపోవడంపై మెగా అభిమానులు కారాలు మిరియాలు నూరుతున్నారు.. రాష్ట్రంలోని ఓట్ల శాతంలో వారిదే పైచేయి.. వచ్చే ఏడాది చివర్లో ఎన్నికలు వస్తాయనుకుంటున్న వేళ వారి ఆగ్రహానికి గురికావడం తెలుగుదేశానికి ఏమాత్రం మంచిది కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నంది అవార్డుల్లో చంద్రబాబు జోక్యం చేసుకున్నారో లేదో తెలియదు కానీ ఇప్పుడు అందరికీ ఆయనే టార్గెట్ అయ్యారు. మరి వీటిని ముఖ్యమంత్రి ఎలా సరిదిద్దుతారో వేచి చూడాలి.

కేసీఆర్ సెక్రటేరియట్‌ను అందుకే కూలుస్తున్నాడా..?

తెలంగాణ సెక్రటేరియట్‌ను కూల్చేదాకా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నిద్రపట్టేలా కనిపించడం లేదు. తెలంగాణ తొలి ప్రభుత్వాధినేతగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఉమ్మడి రాష్ట్రానికి చెందిన గుర్తులను ఒక్కొక్కటిగా చేరిపేస్తూ వస్తోన్న ఆయన కన్ను సచివాలయ భవనాలపై పడింది. సెక్రటేరియట్ శిథిలావస్థకు చేరుకుందని.. సిబ్బందికి అనువుగా లేదని దానిని కూల్చేసి అందరికి అందుబాటులో ఉండే మరో ప్రాంతంలో సచివాలయ భవన సముదాయాన్ని నిర్మించాలనుకున్నారు. అయితే కేసీఆర్‌ను ముందు నుంచి గమనిస్తున్నవారు మాత్రం ఆయనకు జాతకాలు, ముహుర్తాలు, వాస్తు శాస్త్రాలపై నమ్మకం ఎక్కువని.. వాస్తు సరిగా లేకపోవడం వల్లనే సచివాలయాన్ని కూలగొడుతున్నారని చర్చించుకున్నారు.   తన వాస్తు పిచ్చిని కవర్ చేసుకోవడానికి "భద్రత లేనందున" అనే ట్యాగ్ లైన్ తగిలించారు. సచివాలయ భవనాలకు అగ్నిప్రమాదాల నుంచి రక్షణ లేదని.. ఒకవేళ జరగరానిది జరిగితే పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తూ ఈ వాదనకు సపోర్ట్‌గా ఫైర్ డిపార్ట్‌మెంట్ చేత సర్టిఫికేషన్ ఇప్పించారు. అయితే భవనాలను కూల్చాలనే కేసీఆర్ పంతం వెనుక మరో బలమైన కారణాన్ని తెరపైకి తెస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసమే సీఎం భవనాలను కూల్చాలని నిర్ణయించారట. అందుకు వారు ఒక వాదన కూడా వినిపిస్తున్నారు. ఈ సచివాలయం నుంచి ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి కొడుకులు ముఖ్యమంత్రలైన చరిత్ర లేదు..   నీలం సంజీవరెడ్డి మొదలుకొని రాజశేఖర్ రెడ్డి దాకా ఈ భవనాల వాస్తు తండ్రులకే అనుకూలించింది తప్ప కొడుకులెవరూ సీఎంలు కాలేదని కేసీఆర్ గమనించారట. పాత తరాన్ని పక్కనబెడితే పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, కాంగ్రెస్ అధినేతగా, ప్రధానిగా అత్యున్నత శిఖరాలను అధిరోహించారు కానీ ఆయన వారసులు ఎంపీ పదవితోనే సరిపెట్టుకున్నారు. చెన్నారెడ్డి సీఎంగా పలు రాష్ట్రాలకు గవర్నర్‌గా పని చేశారు. ఆయన వారసుడు మర్రి శశిథర్ రెడ్డి చెప్పుకొదగ్గ నేత కాలేకపోయారు. జలగం వెంగళరావు సీఎంగా, కేంద్రమంత్రిగా పనిచేయగా.. ఆయన కుమారుడు జలగం వెంకట్రావ్ ఎమ్మెల్యేగానే ఉన్నారు. కోట్ల విజయభాస్కరరెడ్డి తనయుడు కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ఎంపీగా, రైల్వే సహాయమంత్రిగా పనిచేసి ఇప్పుడు రాజకీయాల్లో ఉండాలా..? వద్దా అన్న దశకు చేరుకున్నారు.   ఇక తెలుగు రాజకీయాల్లో సంచలనం సృష్టించి... జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన స్వర్గీయ ఎన్టీఆర్ వారసులు ఎవరూ ఆ స్థాయిని అందుకోలేకపోయారు.. తిరుగులేని నాయకుడిగా ప్రజల్లో స్థానం సంపాదించుకున్న వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్‌కి 150 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉన్నప్పటికీ సీఎం కాలేకపోయారు. వీటన్నింటిని బేరీజు వేసుకున్న గులాబీ బాస్.. సెక్రటేరియట్ భవనాల వాస్తు కొడుకులకు అనుకూలంగా లేదని భావించారు. అందుకే కేటీఆర్‌‌కు బాగా అనుకూలంగా ఉండే వాస్తు ప్రకారం కొత్త భవనాలను నిర్మించాలనుకుంటున్నారట. తన తర్వాత కొడుకు సీఎం కావాలనుకోవడం తప్పుకాదు కానీ.. అందుకోసం వందల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి వాస్తునే సరిచేసి మరీ తనయుణ్ని అందలం ఎక్కించాలనుకోవడం కరెక్ట్ కాదంటున్నారు. చారిత్రక వారసత్వానికి ప్రతీక అయిన సచివాలయ భవనాలను కూలుస్తే చూస్తూ ఊరుకోం అంటున్నాయి ప్రతిపక్షాలు. మరి ఒక నిర్ణయం తీసుకుంటే వెనక్కు తగ్గని వ్యక్తిత్వం కల కేసీఆర్‌ తన పంతాన్ని ఎలా నెగ్గించుకుంటారో వేచి చూద్దాం.

అలర్ట్ ఇండియా.. నార్త్, సౌత్‌లపై ఐఎస్ ఫోకస్

దారుణ మారణకాండతో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ఒక్కో దేశంపై దాడులు చేస్తూ.. తన ప్రాబల్యాన్ని పెంచుకుంటూ పోతోంది. విస్తరణలో భాగంగా ఎప్పటి నుంచో భారత్‌పై దాడులు చేయాలని ఎప్పటి నుంచో కుట్రలు పన్నుతోంది. అయితే మన నిఘా వర్గాలు, భద్రతా దళాలు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎన్నో ప్రయత్నాలు విఫలమయ్యాయి. తాజాగా మరోసారి ఇండియాను టార్గెట్ చేసింది ఐఎస్.  త్వరలో గంగానది వద్ద జరిగే కుంభమేళా, కేరళలోని త్రిసూర్‌పురంలో జరిగే ఉత్సవాల్లో దాడులకు దిగుతామని హెచ్చరించింది. ఈ మేరకు మలయాళంలో పది నిమిషాల ఆడియో క్లిప్‌ను విడుదల చేశారు.   ఆ ఆడియోలో దాడులు ఎలా జరపాలో తమ శ్రేణులకు సూచించారు.. విషం కలిపిన ఆహారాన్ని ప్రజలు తినేట్లు చూడాలని.. పెద్ద పెద్ద ట్రక్కులను ప్రజలపైకి నడిపించాలని.. రైళ్లు పట్టాలు తప్పేలా చేయాలని.. కత్తులతో స్వైర విహారం చేయాలని చెబుతూ ఆడియోను ముగించారు. కుంభమేళాతో పాటు త్రిసూర్‌లో జరిగే వేడుకలకు పెద్ద సంఖ్యలో జనం హాజరవుతూ ఉంటారు. అందువల్ల వీటిపై దాడి చేస్తే భారీ జననష్టం కలుగుతుందని ఉగ్రవాదుల అంచనా. రంగంలోకి దిగిన కేంద్ర నిఘా బృందాలు ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునే పనిలో పడ్డారు. వారి దర్యాప్తులో ఇది టెలిగ్రాం యాప్‌లో ఆప్గనిస్తాన్ నుంచి వచ్చినట్లుగా తేలింది. ఇందులోని గొంతు ఐఎస్ నేత రషీద్ అబ్దుల్లాగా తేలింది.   ఐఎస్ఐఎస్‌ను నిర్వీర్యం చేసేందుకు అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ఇస్లామిక్ స్టేట్ ఆధీనంలోని పలు ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాయి. తమ మనుగడ ప్రశ్నార్థకమవుతోందన్న భావనతో సురక్షిత ప్రాంతాలకు తమ సేనలను తరలించేందుకు ఐఎస్ అదినాయకత్వం కసరత్తులు ప్రారంభించింది. అలాగే తాము ఇంకా అంతం కాలేదనే భావనను ప్రపంచదేశాలకు తెలియజేసే ప్రణాళికలో భాగంగా అమెరికా సహా పలు యూరోపియన్ దేశాల్లో దాడులు చేస్తోంది. అలాంటి చర్యే కొద్ది రోజుల క్రితం జరిగిన లాస్‌వేగాస్ దాడి.   నెవెడా రాష్ట్రంలోని లాస్‌వేగాస్ సిటీని టార్గెట్ చేసిన దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 75 మంది వరకు ప్రాణాలు కోల్పోగా.. 500 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. తొలుత ఇది ఒక ఉన్మాది చర్యగా భావించినప్పటికీ దాడి చేసిన వ్యక్తి తమ వాడేనని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. ఇప్పుడు ఇండియాలో జరిపే దాడుల్లోనూ ఇదే తరహా ఫార్ములాను ఉపయోగిస్తామని ఉగ్రవాదులు పంపిన ఆడియో టేపులో స్పష్టంగా పేర్కొన్నారు. లక్షలాది మంది పాల్గొనే కుంభమేళా వంటి వేడుకల్లో ఇలాంటి దాడులు జరిగితే.. ప్రాణనష్టం ఏ స్థాయిలో ఉంటుందో ఊహాకు కూడా అందదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలి.

జగన్ పాదయాత్రను పూర్తిచేస్తారా..? మధ్యలో ఆపేస్తారా..?

ఆరునూరైనా 2019లో అధికారాన్ని అందుకోవాలి.. ఇప్పటికే వీధి పోరాటాలు, రోడ్ల మీద బైఠాయింపులు అన్నీ అయిపోయాయి. ప్రజలు తన గురించే మాట్లాడుకోవాలి.. తన పేరు జనం నోట్లో నానాలంటే ఏం చేయాలి. వీటన్నింటికి సమాధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత ఎంచుకున్న మార్గం పాదయాత్ర. సీఎం అవ్వడమే లక్ష్యంగా.. రాష్ట్రం మొత్తం చుట్టివచ్చేలా సుమారు ఆరు నెలల పాటు మూడు వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేయాలని జగన్ నిర్ణయించారు. ఆయన నిర్ణయం వెనుక బలమైన కారణాలున్నాయి. రాష్ట్ర చరిత్రలో పాదయాత్రలకు ప్రత్యేక స్థానం ఉంది. చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సాగించిన "ప్రజా ప్రస్థానం" పాదయాత్రతో ప్రజల మన్ననలు పొంది సీఎం అయ్యారు. ఆ తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తన వయసును సైతం లెక్క చేయకుండా రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ఆయనా సీఎం అయ్యారు.   ఇదే సెంటిమెంట్‌ను ఫాలో అయి తాను కూడా ముఖ్యమంత్రిని కావాలని భావించారు జగన్. దీనిలో భాగంగా ఈ నెల 6న ఇడుపులపాయ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అయితే ఆయన ఆరు నెలల కాలంలో అన్ని అవాంతరాలను దాటుకొని.. అనుకొన్న లక్ష్యాన్ని అందుకోగలరా అన్న సందేహన్ని వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.. అందుకు కారణాలు లేకపోలేదు.. యాత్ర ప్రారంభించి నేటికి తొమ్మిదో రోజు.. ఇవాళ్టీకి ఆయన 100 కిలోమీటర్ల మైలు రాయిను అందుకున్నారు. ఇంత నత్తనడకన ఆయన పాదయాత్ర సాగుతోంది.. తొలుత యాత్రను చాలా తేలిగ్గా తీసుకున్నారట జగన్ .. అయితే రంగంలోకి దిగితే కానీ మ్యాటర్ అర్థం కాలేదు..   జీవితంలో ఎప్పుడు ఈ స్థాయిలో శారీరకంగా కష్టపడకపోవడంతో త్వరగా అలసిపోతున్నారు.. మొదటి రోజే నడుం పట్టేయడం.. రెండో రోజు నుంచి ఇన్‌ఫెక్షన్‌లు రావడంతో జగన్‌కు ఇబ్బందులు మొదలయ్యాయట. దీనికి తోడు యాత్ర నిర్వహిస్తోన్న విధానం.. దానికి ప్రజల నుంచి వస్తోన్న స్పందన పార్టీ శ్రేణులను నిరాశకు గురిచేస్తోంది. మరీ ముఖ్యంగా సొంత జిల్లాలోనే ఇలా జరగడం వారిలో సందేహాలను రేకేత్తిస్తోంది. మొదటిరోజు లక్షమంది జనం వస్తారని అంచనా వేయగా.. గట్టిగా 20వేల మందికి మించి రాలేదట. ఆ రోజును పక్కనబెట్టినా ఆ తర్వాతి రోజుల్లో కూడా ప్రజల నుంచి ఆశించిన స్పందన లభించడం లేదు.   మరోవైపు రోజుకు 15 కిలోమీటర్లు నడిస్తేనే.. ఆరు నెలల కాలంలో మూడు వేల కిలోమీటర్లు పూర్తి చేయగలుగుతారు కానీ.. ఆయన 10 కిలోమీటర్లకు మించి నడవలేకపోతున్నారు. ఇలా నడిస్తే మొత్తం లక్ష్యాన్ని పూర్తి చేయడానికి ఎంత లేదన్నా 300 రోజులు కావాలి.. మధ్యలో అనారోగ్య సమస్యలు, వాతావరణం దానికి తోడు కోర్టు వాయిదాలు ఇలా పోతే దాదాపు సంవత్సరానికి పైగానే యాత్రకు సమయం పడుతుంది. వచ్చే ఏడాది చివర్లో ముందుస్తు ఎన్నికలు వస్తాయని భావిస్తున్న సమయంలో జగన్ యాత్రలు చేసుకుంటూ వెళితే పార్టీ బలపడటం సంగతి పక్కనబెడితే బలహీనపడే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో పాదయాత్ర దూరాన్ని కుదించడమో లేదా మధ్యలో ఆపివేయక తప్పకపోవచ్చని వారు అంటున్నారు. మరి జగన్ వెనుకడుగు వేస్తాడా లేక ఎన్ని సమస్యలు ఎదురైనా మడమతిప్పక ముందుకే వెళ్తాడా అన్నది కాలమే నిర్ణయించాలి. 

డొక్కు పడవల్లో సేఫ్‌గా యమలోకానికి..?

గోదావరి తీరాన పాపికొండలు, కృష్ణా-గోదావరి సంగమ స్ధానం, నిత్యమూ పచ్చదనంతో అలరారే కోనసీమ.. అరకు అందచందాలు... ఇలా ఒకటేమిటీ ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకానికి అనువుకానీ ప్రదేశమే లేదంటే అతిశయోక్తి లేదు.. రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో ఆదాయ మార్గాలను కోల్పోయిన నవ్యాంధ్రకు లోటును పూడ్చే ఆదాయవనరుల్లో పర్యాటకం కూడా ఒకటిగా నిలిచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా టూరిజాన్ని ప్రొత్సహించే ఎన్నో ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నారు. వీటిలో ప్రధానమైనది రివర్ టూరిజం.   గోదావరిలో ఉన్న పాపికొండలకు తోడు కృష్ణానదిలోనూ ఈ రివర్‌ టూరిజాన్ని అభివృద్ది చేయాలని సంకల్పించింది ప్రభుత్వం. అందుకు తగ్గట్టే ఆయా ప్రాంతాల్లో ఘాట్లు, రిసార్టుల వంటి సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చి వీటిపై విస్తృత ప్రచారం కల్పించింది. ప్రభుత్వ కృషి ఫలించి ఇప్పుడిప్పుడే పర్యాటకుల తాకిడి పెరుగుతున్న వేళ నిన్న విజయవాడ సమీపాన కృష్ణానదిలో జరిగిన పడవ ప్రయాణం పర్యాటకుల భద్రతను ప్రశ్నిస్తోంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 20 మంది మరణించారు.. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర జలరవాణా వ్యవస్థలోని లోపాలు వెలుగులోకి వస్తున్నాయి.   ప్రస్తుతం మనరాష్ట్రంలో జలరవాణా, జలవిహారానికి ఉపయోగిస్తున్న లాంచీలు, మరపడవలు, నాటు పడవలు, బల్లకట్లు, పుట్టీలు పాతకాలం నాటివి.. దానికి తోడు కాసుల కోసం పరిమితికి మించి రెట్టింపు సంఖ్యలో ప్రయాణికుల్ని వాటిలోకి ఎక్కిస్తున్నారు. ప్రమాద సమయంలో ప్రాణాలు కాపాడుకోవడానికి ఉపయోగించే లైఫ్ జాకెట్లు, లైఫ్ బాయ్స్ వంటి పరికరాలు ఉండటం లేదు. బల్లకట్లు, బోట్లు పాతకాలపు ఇంజిన్లతోనే నడుస్తాయి. బల్లకట్టపైన పరిచే ఇనుపరేకులు కిందకు ఒంగిపోయి ఉంటాయి. ఒడ్డుకు చేరుకునే సమయంలో వాటి ఒరవడిని నియంత్రించేందుకు తగ్గ ఏర్పాట్లు ఉండవు.. దానికి తోడు ఇంజిన్లు పాడై బల్లకట్లు నది మధ్యలోనే నిలిచిపోవడం, నదుల్లో నీటిమట్టం తగ్గినప్పుడు రాళ్లు తగిలి బల్లకట్లు కొన్ని గంటలపాటు నది మధ్యలోనే ఆగిపోయిన ఘటనలు ఎన్నో ఎన్నెన్నో.   ఇందుకు ఒక్కటే పరిష్కారం పాతకాలం నాటి బోట్లు, లాంచీల స్థానంలో విదేశాల్లో వాడుతున్న అధునాతన లాంచీలు తీసుకురావాలి.. జలరవాణాపై ప్రభుత్వ నియంత్రణ పెరగాలి. అనుభవం లేని వారిని పడవ నడిపేందుకు అనుమతించరాదు.. అలా చేస్తే అయినా ఇటువంటి ప్రమాదాలను నివారించినట్లు అవుతుంది.

గెలుపుతో పాటు షాక్ కూడా..?

2014లో అధికారాన్ని అందుకున్నది మొదలు జరిగిన ప్రతి ఉప ఎన్నికలో గెలుపొందుతూ వస్తోన్న మోడీ-అమిత్‌షా ద్వయానికి త్వరలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు పరీక్షగా నిలవనున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికలతో పాటు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం బీజేపీదేనని చాలా సర్వేలు ఇప్పటికే ప్రకటించినప్పటికీ వీరిద్దరూ ఎందుకో టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే గుజరాత్‌లో గెలుపు ఓటముల పైనే మోడీ, అమిత్‌షాల భవిష్యత్ ఆధారపడి ఉంటుందని రాజకీయ పండితుల విశ్లేషణ. ఈ ఎన్నికల్లో ఫలితాలు తారుమారైతే వీరిద్దరికి వ్యతిరేకంగా ధిక్కార స్వరం వినిపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.   ఇప్పటికే యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ వంటి వారు అసంతృప్తి రాగాలు వినిపించడంతో ఈ ఎన్నికలను వీరిద్దరూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అన్ని అస్త్ర, శస్త్రాలను సిద్ధం చేసుకుని.. ఎన్నికలకు రెడీ అవుతున్న వేళ కీలక సర్వే ఒకటి వెలుగులోకి వచ్చింది. పాజిటివ్ టాక్‌ను ఇచ్చిన ఈ సర్వే.. మరోవైపు కాషాయ దళానికి మొట్టికాయలు కూడా వేసింది. బీజేపీ ఆరోసారి కూడా అధికారంలోకి రానుంది ఏబీపీ-సీఎస్‌డిఎస్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అయితే ఓట్ల శాతం బాగా తగ్గుతుందని తెలిపింది.   బీజేపీకి 113 నుంచి 121 సీట్లు, కాంగ్రెస్‌కు 58 నుంచి 64 వరకు సీట్లు లభించే అవకాశాలున్నాయని తెలిపింది. గత ఆగస్టులో ఇదే ఏబీపీ-సీఎస్‌డిఎస్ నిర్వహించిన సర్వేతో పోలిస్తే అక్టోబర్‌ సర్వే అంచనాలు కమలనాధులకు కొంత వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఆగస్టు నాటి సర్వేలో బీజేపీ సీట్లు గతంతో పోలిస్తే కొంత మెరగవ్వొచ్చునని నిర్వాహకులు అభిప్రాయపడగా.. తాజా సర్వేలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అంటున్నారు. అలాగే ఓట్ల శాతం కూడా ఆగస్టులో 59 శాతం ఉంటే అక్టోబర్ నాటికి 47 శాతానికి తగ్గింది. ఇది సీట్ల సంఖ్యపై పెను ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.   దాదాపు 25 ఏళ్లపాటు వెన్నుదన్నుగా నిలిచిన పటేళ్లు బీజేపీపై గుర్రుగా ఉండటానికి తోడు.. చిన్న, సన్నకారు వ్యాపారులంతా జీఎస్టీతో కుదేలయ్యారు. దీంతో రాష్ట్రంలోని మెజారిటీ వ్యాపారస్తులు కమలానికి ఓటు వేయకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే విషయం సర్వేలో స్ఫష్టంగా కనిపించింది. సో.. పరిణామాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని మోడీ- షా కాస్త అప్రమత్తతతో వ్యవహరిస్తే దేశంలో మోడీ హవాకి అడ్డులేదని చెప్పుకుంటూ సార్వత్రిక రణరంగంలోకి కాలర్ ఎగరేసుకుని అడుగుపెట్టవచ్చు.

జాబ్ బోర్ కొట్టిందని.. 100 మందిని చంపిన నర్స్

ఏళ్లుగా ఒకే పని చేస్తే ఎవరికైనా బోర్ కొడుతుంది. ఏం జీవితం రా బాబు.. అని తలబాదుకుంటాం. ఒక్కొసారి ఇది పరిధి దాటిపోయి ఉన్మాదానికి దారి తీస్తుంది. అలా ఒక ఉన్మాదిలా మారిన ఒక నర్స్ కథే ఇది. కుల, మత, వర్ణ బేధాలు లేకుండా అందరికీ సేవ చేసే పవిత్రమైన వృత్తి నర్స్. అలాంటి ఆ వృత్తికే కళంకం తెచ్చింది ఆ నర్స్.. తన అసహనమంతా అమాయకులైన రోగులపై ప్రదర్శించింది. అలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 106 మంది రోగులను చంపేసింది. జర్మనీలోని డెల్మెన్‌హోస్ట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసే నీల్స్ హోగెల్ 2015లో ఓ ఇద్దరు రోగులపై హత్యాయత్నానికి పాల్పడటంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.   అయితే ఈమె మరిన్ని హత్యలకు పాల్పడిందని ఆరోపణలు రావడంతో దర్యాప్తు జరిపిన పోలీసులకు విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. ఆమె మొత్తం 90 మంది రోగులను హతమార్చినట్లు పోలీసులు ప్రకటించారు. దీంతో న్యాయస్థానం ఆమెకు జీవితకాల జైలు శిక్ష విధించింది. అయితే ఈమె పనిచేసిన ఆసుపత్రుల్లో చికిత్స తీసుకొని అనుమానాస్పద స్థితిలో మరణించిన మృతుల కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు.. దీంతో మరోసారి కోర్టు అనుమతి తీసుకొని విచారణ చేపట్టిన పోలీసులు 1999-2005 మధ్యకాలంలో.. నీల్స్ పనిచేసిన రెండు ఆసుపత్రుల్లో వందలాది రికార్డులను పరిశీలించిన పోలీసులు మరో 16 మందిని కూడా చంపినట్లు తేల్చారు.   రోగులను చంపేందుకు ఆమె ఏం చేసేదో తెలుసా..? ఎవరికి అనుమానం రాకుండా వారికి ప్రాణాంతక మందులను ఇంజెక్ట్ చేసేది. 2005లోనే ఓ రోగికి ప్రాణంతక మందులను ఇంజెక్ట్ చేస్తుండగా ఓ నర్సు గుర్తించడంతో మొదటిసారి నీల్స్ అరెస్ట్ అయ్యింది. ఇందుకు న్యాయస్థానం ఏడున్నర సంవత్సరాల జైలు శిక్షను విధించింది. శిక్షా కాలంలో ఆమె ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాలేదు.. జైలు నుంచి విడుదలయ్యాకా కూడా ఆమె రోగుల ప్రాణాలను బలి తీసుకుంటూనే ఉంది. ఇదంతా ఎందుకు చేశావని న్యాయమూర్తి ఆమెను అడగ్గా.. వైద్యం చేయడంలో విసుగు చెందే చంపినట్లు నీల్స్ నేరాన్ని అంగీకరించింది. 

ఇంటింటికి వెళ్తే.. టీడీపీ పరిస్థితి తెలిసింది

అనుభవం, ముందుచూపు తదితర కారణాలు బేరీజు వేసుకున్న ఆశేష జనవాహిని అండదండలతో తెలుగుదేశం పార్టీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో చారిత్రక విజయాన్ని అందుకుంది. సుమారు 10 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దిక్కుమొక్కు లేని రాష్ట్రానికి ఒక దిక్కును వెతికే పనిని ఆయన భుజానికెత్తుకున్నారు. అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్‌లకు తోడు మొత్తం పరిపాలనా యంత్రాంగాన్ని ఆంధ్రకు తరలించారు. ఒడిదుడుకులు ఎదుర్కొంటూ.. రాష్ట్రాన్ని అభివృద్ధిపథాన నిలుపుతున్నారాయన.   ఈ ప్రయాణంలో ఇప్పటికే మూడున్నరేళ్లు గడిచిపోయింది.. మరో ఏడాది గడిస్తే మళ్లీ ఎన్నికల కోలాహలం మొదలవుతుంది. అప్పటికీ ఇప్పటికీ కాలం ఎంతో మారిపోయింది. ప్రధాన ప్రతిపక్షం పావులు కదుపుతూ సమరానికి సన్నద్ధం అవుతోంది. మరి అధికార పార్టీ పరిస్థితి ఏంటీ..? క్యాడర్ ఎలా ఉంది.. నాయకులంతా సమన్వయంతో పనిచేస్తున్నారా..? ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా ఎదుర్కొగల సత్తా పార్టీకి ఉందా..? అనే అంశాలపై దృష్టిపెట్టిన చంద్రబాబు నాయుడు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కార్యకర్తలు, నేతలు అందరి కృషితో ఈ కార్యక్రమం ఊహించిన దానికి మించి విజయవంతమైంది. పార్టీ ఎక్కడ బలంగా ఉంది. ఎక్కడ బలహీనంగా ఉందన్న విషయం స్పస్టంగా తెలిసింది. అంతేకాదు పలు అక్రమాలు కూడా బయటకు వచ్చాయట.   తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే అందరూ రోడ్ల గురించి మాట్లాడతారు. సీసీ రోడ్ల నిర్మాణంలో సర్కార్‌కు మైలేజ్ వచ్చిందనే విషయం సీఎం దాకా వచ్చింది. అయితే పలు ప్రాంతాల్లో రోడ్లు వెయ్యాల్సిన చోట వెయ్యకుండా తమ బంధు, మిత్రులు ఉండే చోట వేశారనే సంగతి బయటకు రావడంతో ఆ ప్రాంత నేతలకు మంత్రులు, ఎమ్మెల్యే చురకలు వేశారు. కార్యకర్తల్లో చాలా మంది ఉత్సాహంగా పనిచేస్తున్నా.. లోకల్ లీడర్ల అవినీతి, అక్రమాల కారణంగా క్యాడర్ అడుగు ముందుకు వేయలేకపోతోందట. ఇప్పటి వరకు ర్యాంకుల కోసం ఆరాటపడిన నేతలకు అసలు తత్త్వం బోధపడేసరికి ప్రజల వద్దకు పరుగులు తీస్తున్నారట. మొత్తానికి ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానిక నాయకులకు జ్ఞానోదయం అయ్యిందని పచ్చ కండువాలు గుసగుసలాడుకుంటున్నాయి.

ప్రపంచంపై మరో నల్లబాంబు

ప్రపంచ వ్యాప్తంగా నల్లకుబేరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన పనామా పేపర్స్ గుర్తుందా.. అది సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్నట్లు నిర్థారణ కావడంతో ఎంతోమంది సామాన్యుల నుంచి దేశాధినేతల వరకు కటకటాల పాలవ్వగా.. కొందరు పదవులను కోల్పోయారు. తాజాగా కొందరు ప్రముఖుల అక్రమ ఆర్థిక లావాదేవీలను బహిర్గతపరుస్తూ ప్యారడైజ్ పేపర్ల పేరుతో మరో జాబితా బయటికి వచ్చింది.   ఇంటర్నేషనల్ కన్సార్టియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ( ఐసీఐజే ) ఇందుకు సంబంధించిన 13.40 లక్షల కీలక రహస్య పత్రాలను వెల్లడించింది. పన్నుల బెడదలేని స్వర్గధామాలుగా పేరుపొందిన దేశాల్లో ప్రముఖులు పెట్టుబడులు పెట్టినట్లు తేలింది. ఈ కీలక పత్రాల్లో మొత్తం 180 దేశాలకు చెందిన వారి వివరాలు ఉన్నాయి. బ్రిటన్ రాణి ప్రైవేట్ ఎస్టేట్ తరపున రహస్యంగా విదేశాల్లో పెట్టుబడులు పెట్టారని.. దీనిలో భాగంగా పది మిలియన్ పౌండ్ల ధనాన్ని విదేశాలకు పంపించారని.. లాంకెస్టర్ రాకుమారి సాయంతో కేమ్యాన్ దీవులు, బెర్ముడాలో పెట్టుబడులు పెట్టారని ఈ పత్రాలు చెబుతున్నాయి.   అలాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అల్లుడికి చెందిన కంపెనీలో అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్ రాస్‌కు పెట్టుబడులు ఉన్నట్లు కూడా ప్యారడైజ్ పేపర్స్ వెల్లడించింది. ప్రఖ్యాత కంపెనీలైన నైక్, ఫేస్‌బుక్ తదితర సంస్థలు కూడా పన్ను ఎగ్గొట్టేందుకు విదేశాల్లో సొమ్ము దాచుకున్నాయని నిర్థారణ అయ్యింది. మరోవైపు ఈ వ్యవహారంలో పలువురు భారతీయుల పేర్లు కూడా వెల్లడయ్యాయి. సంఖ్యాపరంగా భారతదేశం ఈ జాబితాల 19వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఈ జాబితాను బీబీసీ పనోరమా పేరుతో దాదాపు 100 మీడియా సంస్థలు వీటిని విశ్లేషిస్తున్నాయి. 

చంద్రాల సారూ కాస్త మారండి...!

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులు కనుక పని విషయంలో కాస్త నిర్లక్ష్యం చేసినా వారికి క్లాసుల మీద క్లాసులు పీకుతారన్న సంగతి తెలిసిందే. ఒక్క అధికారులే కాదు... మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబుతో క్లాసుల పీకించుకున్న వాళ్లే. అందుకే ఏదన్న సమావేశాలు ఉన్నాయన్న.. టెలీ కాన్ఫరెన్స్ లు అన్నా చంద్రబాబు ఎక్కడ తిడతారో అని.. భయపడిపోతుంటారు. అయితే ఇప్పుడు ఓ విషయంలో కూడా అధికారులు చంద్రబాబు అంటే భయపడిపోతున్నారట. అదే చంద్రబాబు రివ్యూల గురించి. పోలవరం రివ్యూలైతేనేం, CRDA రివ్యూలైతేనేం అరగంటలో అవ్వాల్సిన రివ్యూలకు.. చంద్రబాబు ఆరు గంటలు తీసుకుంటున్నారట. అందుకే చంద్రబాబు రివ్యూలంటేనే అధికారుల దగ్గర నుండి ప్రతిఒక్కరు అంతలా బెంబేలెత్తిపోతున్నారు. బాబు రివ్యూలతో అధికారులలో విసుగెత్తిపోయారు. రివ్యూలలో ఉపన్యాసమే తప్ప సారం లేదంటున్నారు అధికారులు. అధికారులను ముఖ్యమంత్రి కార్యాలయానికి కట్టి పడేయడం వల్ల వారు మరొక పనిమీద దృష్టిపెట్టలేకపోతున్నారట.   రివ్యూలు ఇవ్వడం ఓకే కానీ దానికి ఒక పద్దతి ఉంది అంటున్నారు. గుండు సూది నుండి ప్రొక్లెయిన్ వరకూ అన్నితానే చూసుకుంటే ఇంక అధికారులు ఎందుకు.. వాళ్లు చేయడానికి ఏముంటుంది. అని విషయాలు చూడాలి.. సమీక్షించాలి తప్పులేదు.. ఎక్కడైనా మేనేజ్ మెంట్ డెలిగేషన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క స్థాయిని విభజించుకుంటూ అధికారులను కేటాయించాల్సి ఉంటుంది. అసలే చంద్రబాబు తలపెట్టింది మహాయజ్ఞం. అలాంటి యజ్ఞాన్ని పూర్తి చేయాలంటే బాబు తప్పనిసరిగా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరి పని వారికి అప్పగించి మేజర్  థింగ్స్ ఆయన చూసుకుంటే పనులు కూడా తొందరగా అవుతాయి అంటున్నారు. ప్రాజెక్ట్స్ షెడ్యూల్స్ రీచ్ అయినయా..? లేదా..? జరగాల్సిన పనులు ఎందుకు జరగలేదు.. ఎక్కడ జరగడంలేదు..? అన్న విషయాలను మాత్రం తాను చూసుకుంటూ... మిగిలిన పనులకు ఎక్కడికక్కడ అధికారులను పట్టేస్తే సరిపోతుంది. మరీ అంత మైక్రో డిటైల్స్ కు వెళ్లాల్సిన అవసరం లేదు అంటున్నారు. ఇక ఈ హింస చూసిన చాలా మంది ప్రముఖ కాంట్రాక్టర్లు, హైటెక్ సిటీని నిర్మించిన ఎల్ఎన్టీ లాంటి కాంట్రాక్టర్లే రివ్యూలకు అటెండ్ అవ్వడానకి భయపడుతున్నారు. ఈ రివ్యూలకు భయపడి సీఎం రమేష్ తమ్ముడు హాజరుకాకపోవడం వల్ల.. బాబుతో తిట్లు తినాల్సి వచ్చింది. మరి బాబు ఇలానే ఉంటే అయ్యే పనులు కాదు కదా.. అవ్వాల్సిన పనులు కూడా అవ్వవని అధికారులు మొత్తుకుంటున్నారు. బాబుగారు ఇప్పటికైనా మారకపోతే.. అమరావతి లాంటి రాజధానిని కట్టాలంటే చాలా కష్టమైపోతుంది. ఒక్కసారి ఆలోచించండి...

సీఎం మనసులో సచివాలయం

కేసీఆర్.. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి.. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి కోట్లాది మంది ప్రజల దశాబ్ధాల కలను సాకారం చేసిన పోరాట యోధుడు. ప్రజామోదంతో కొత్త రాష్ట్రానికి తొలి అధినేతగా బాధ్యతలు చేపట్టిన మొదలు వినూత్నమైన సంక్షేమ కార్యక్రమాలతో యావత్ దేశాన్ని ఆకర్షించిన నేత. నూతనత్వాన్ని ఇష్టపడతారో లేక మరేదైనా కారణమో కానీ.. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పాత అనే పదాన్ని ఆయన ఇష్టపడటం లేదు. తెలంగాణ ఉమ్మడి రాష్ట్రానికి చెందిన గుర్తులను ఒక్కొక్కటిగా చేరిపేస్తూ వస్తున్న ఆయన కన్ను సచివాలయం మీద పడింది.   సెక్రటేరియట్‌ శిథిలావస్థకు చేరుకుందని.. సిబ్బందికి అనువుగా లేదని దానిని కూల్చేసి మరో ప్రాంతంలో కొత్త సచివాలయ భవన సముదాయాన్ని నిర్మించాలనుకున్నారు. అయితే కేసీఆర్‌‌ను ముందు నుంచి గమనిస్తున్నవారు మాత్రం ఆయనకు జాతకాలు, ముహుర్తాలు, వాస్తు శాస్త్రాలపై నమ్మకం ఎక్కువని.. వాస్తు సరిగా లేకపోవడం వల్లనే సచివాలయాన్ని కూలగొడుతున్నారని చర్చించుకున్నారు. దీనికి కొద్ది రోజులు ముందే వాస్తు పేరు చెప్పి బేగంపేటలోని సీఎం కార్యాయంల పక్కనే ప్రగతిభవన్ అనే పేరుతో కొత్త అధికారిక నివాసంలో గృహప్రవేశం చేశారు కేసీఆర్..   అయితే సచివాలయాన్ని కూల్చాలన్న సీఎం నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించాయి. ఎందరో ముఖ్యమంత్రులు ఇక్కడి నుంచి రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలించారని.. వారెవరికీ కనిపించని దోషం కేసీఆర్‌కు ఎలా కనిపించిందని మండిపడ్డారు. దీంతో ముఖ్యమంత్రి కాస్త వెనక్కు తగ్గారు. అప్పటి నుంచి ఈ విషయం మరుగునపడిపోయింది. మీడియా, ప్రతిపక్షాలు అందరూ దీనిని మరచిపోయారు.   అయితే ఇన్ని రోజుల తర్వాత స్వయంగా .. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ కొత్త సచివాలయం నిర్మించాల్సిన అవసరాన్ని వివరించారు. దేశంలోనే అత్యంత చెత్త సచివాలయం మనదేనని.. ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ భవనాలు కట్టేశారని పేర్కొన్నారు.. కనీసం ఒక్కటంటే ఒక్క బిల్డింగ్ కూడా నియమనిబంధనల ప్రకారం నిర్మించలేదని అన్నారు. కొత్త సచివాలయం నిర్మించగానే నగరం కాంక్రీట్ జంగిల్‌ అయిపోతుందని సభ్యులు మాట్లాడటం తగదన్నారు. ఆధునికంగా సచివాలయాన్ని నిర్మించాలనుకోవడం తప్పా..? మనకు ఆధునిక సచివాలయం అవసరం లేదా అని ప్రశ్నించారు.. మొత్తానికి ఏదైనా పనిలో వేలు పెడితే దాని అంతు చూడకుండా వదలని కేసీఆర్ మరోసారి తన తత్త్వాన్ని చాటి చెప్పారు.