జూన్ లో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు
posted on Apr 4, 2011 @ 12:29PM
హైదరాబాద్: రాష్ట్రంలో జూన్ నెలలో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటాయని, సంక్షోభాలు తలెత్తుతాయని పంచాంగ కర్తలు అంటున్నారు. అయితే ప్రభుత్వానికి ఏ విధమైన ఢోకా ఉండదని భరోసా ఇస్తున్నారు. ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందని చెబుతున్నారు. శ్రీఖరనామ ఉగాది పర్వదినం సందర్భంగా సోమవారం హైదరాబాదులోని రవీంద్ర భారతిలో ప్రభుత్వం తరఫున పంచాంగ పఠనం జరిగింది. ప్రముఖ జ్యోతిష్కుడు సుబ్రహ్మణ్య శర్మ పంచాంగ పఠనం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, శాసనసభ ఉప సభాపతి నాదెండ్ల మనోహర్, పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడుతాయని సుబ్రహ్మణ్మ శర్మ చెప్పారు. ప్రజలకు ప్రభుత్వాలు మంచి పాలన అందిస్తాయని చెప్పారు. పంటలు కూడా బాగానే పండుతాయని ఆయన చెప్పారు. ఆర్థికంగా రాష్ట్రానికి ఇబ్బందులు తప్పవని, అయితే ఆ ఇబ్బందులను ప్రభుత్వం అధిగమిస్తుందని ఆయన అన్నారు. జూన్ 5వ తేదీ నుంచి ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని చెప్పారు. కాగా, తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం ప్రజలకు సంతోషం కలగాలని ఆయన ఆశించారు. ఈ సందర్భంగా ఆయన శ్రీఖర నామ సంవత్సర పంచాంగాన్ని విడుదల చేశారు. అనంతరం ముఖ్యమంత్రి ఉగాది పురస్కార అవార్డులను ప్రదానం చేశారు.