సత్యసాయి బాబాలో చలనం
posted on Apr 5, 2011 9:07AM
పుట్టపర్తి: సత్యసాయి బాబా కళ్లలో స్వల్ప చలనం కనిపించిందని ఆయన సమీప బంధువులు తెలిపారు. సోమవారం రోజు రాత్రి బాబా బంధువులు ఐసియులోనికి వెళ్లి ఆయనని పలకరించారు. దాంతో బాబాలో స్వల్పంగా చలనం కనిపించినట్లు వారు చెప్పారు. కాళ్లు కూడా కదిపినట్లు వారు తెలిపారు. భక్తులు ఆందోళన చెందవద్దని, ప్రశాంతంగా ఇళ్లకు వెళ్లమని వారు కోరారు. సత్యసాయి బాబా ఆరోగ్యం క్షీణించిందని తెలిసి భక్తులు ఆందోళన చెందుతున్నారు. బాబాని తమకు చూపించాలని వారు డిమండ్ చేస్తున్నారు. ప్రశాంతి నిలయం వద్ద ఉద్రిక్త వాతావరణ నెలకొంది. బాబా చికిత్స పొందుతున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వద్దకు అధిక సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ఇక్కడికి వచ్చిన వాహనాలపై స్థానికులు రాళ్లు రువ్వారు. జిల్లా కలెక్టర్ జనార్ధన రెడ్డి వాహనాన్నికూడా అడ్డుకున్నారు. దాంతో ఆయన వెనుతిరిగి వెళ్లిపోయారు. జాయింట్ కలెక్టర్ అనిత, ఆర్టీఓలను అడ్డుకున్నారు. జర్నలిస్టులను కూడా వెళ్లిపొమ్మని చెప్పారు. దీంతో ముందు జాగ్రత్తగా చుట్టుపక్కల జిల్లాల నుంచి పోలీసు బలగాలను రప్పిస్తున్నారు. తిరుపతి నుంచి ప్రత్యేక బలగాలు తరలి వచ్చాయి.
సత్యసాయి బాబా ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నా.. చికిత్సకు శరీరం సహకరిస్తోందని సిమ్స్ డెరైక్టర్ సఫాయా పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి 11 గంటల తర్వాత నాలుగో మెడికల్ బులెటిన్ విడుదల చేశారు. బాబాకు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందజేస్తున్నామన్నారు. ఇన్‌ఫెక్షన్ అధికం కాకూడదనే ముందు జాగ్రత్తతో ఐసీయూలోకి ఎవరినీ అనుమతించడం లేదన్నారు.