ఒకే కుటుంబ సమరంగా మారిన ఉప ఎన్నికలు
posted on Apr 4, 2011 @ 10:30AM
హైదరాబాద్: దివంగత మహానేత వైఎస్ఆర్ సతీమణి వైఎస్.విజయలక్ష్మిపై తాను పోటీ చేసేందుకుసిద్ధంగా ఉన్నట్టు రాష్ట్ర మంత్రి వైఎస్.వివేకానంద రెడ్డి సతీమణి వైఎస్.సౌభాగ్యమ్మ తన కుటుంబ సభ్యుల వద్ద అన్నట్టు సమాచారం. వచ్చే నెలలో కడప, పులివెందుల ఎంపీ, అసెబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్న విషయం తెల్సిందే. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైఎస్ వివేకానంద రెడ్డి ఉత్సుకత చూపిస్తున్నారు. అయితే, తుది నిర్ణయం మాత్రం కాంగ్రెస్ అధిష్టానం చేతుల్లో ఉంది. కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కడప స్థానం నుంచి వైఎస్.జగన్మోహన్ రెడ్డి, పులివెందుల స్థానం నుంచి వైఎస్.విజయలక్ష్మీలు పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో పులివెందుల స్థానం నుంచి వివేకానంద పోటీ చేయడం ఖాయమనే వార్తలు వస్తున్నాయి. కానీ, కడప పార్లమెంటుకు లేదా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై నిర్ణయం తీసుకునేందుకు అధిష్టానం వివేకాకే వదిలి వేసినట్టు సమాచారం. ఒక సమయంలో వివేకాను పార్లమెంటు అభ్యర్థిగా పోటీకి నిలిపి పులివెందులలో తప్పుకోనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. పులివెందులలో పోటీ తప్పుకోవడం ద్వారా వైయస్ అంటే అధిష్టానానికి అభిమానం ఉందనే సానుభూతిని కడపకు ఉపయోగించుకోవాలని చూసినట్లుగా వార్తలు వచ్చాయి. దీనికి వివేకా సతీమణి సౌభాగ్యమ్మ మాత్రం అంగీకరించలేదని వినికిడి. తన భర్త కడప పార్లమెంట్‌కు పోటీ చేయాలని నిర్ణయిస్తే తాను పులివెందుల అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తానని చెప్పినట్టు సమాచారం. ముఖ్యంగా, వైఎస్.విజయలక్ష్మిపై పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. దీంతో ఉప ఎన్నికల పోరు రాజకీయ పార్టీల కంటే ఒకే కుటుంబం సమరంగా మారింది.