బీజేపీ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్
posted on Oct 24, 2018 @ 2:49PM
అవినీతిపై దర్యాప్తు చేయాల్సిన సీబీఐ అవినీతి మరకతో తన ప్రతిష్ట తానే దిగజార్చుకుంటుంది. సీబీఐలో ఉన్నతాధికారుల లంచాల బాగోతం యావత్ దేశాన్ని షాక్‌కు గురి చేసింది. సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్థానాలను కేంద్రం సెలవులపై పంపి, అలోక్ వర్మ స్థానంలో సీబీఐ డైరెక్టర్ బాధ్యతలను మన్నెం నాగేశ్వరరావుకు అప్పగించడం జరిగింది. అదేవిధంగా సీబీఐ అధికారుల కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం మీద, ప్రధాని మోదీ మీద విపక్షాలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి.
ఇన్నాళ్లు సీబీఐ కేంద్రం చేతిలో పావుగా మారిందనే ఆరోపణలు వినిపించేవి.. ఇప్పుడు ఆ ఆరోపణలు నిజమని తేలిందని.. అదే విధంగా సీబీఐ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల నేతలు మోదీపై విమర్శల దాడి చేస్తున్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సీబీఐని బీబీఐ అంటూ కొత్త పేరు పెట్టారు. తాజాగా ఆమె చేసిన ట్వీట్ సంచనం సృష్టిస్తోంది. ‘సీబీఐ ఇప్పుడు సోకాల్డ్ బీబీఐ(బీజేపీ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్)గా మారిపోయింది. ఇది చాలా దురదృష్టకరం’ అంటూ మమతా బెనర్జీ ట్వీట్ చేసారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా విమర్శలు గుప్పించారు. ‘సీబీఐ డైరెక్టర్ ని సెలవుల మీద ఎందుకు పంపారు? లోక్‌పాల్ చట్టం ద్వారా నియమించిన దర్యాప్తు సంస్థ అధికారిపై మోదీ ప్రభుత్వం ఏ చట్టం ప్రకారం చర్యలకు ఆదేశించింది? మోదీ ప్రభుత్వం ఏ విషయాన్ని దాచడానికి ప్రయత్నిస్తోంది?’ అని ఆయన ట్విటర్ ద్వారా ప్రశ్నించారు. ‘అలోక్ వర్మను పదవి నుంచి తప్పించడానికి రాఫెల్ ఒప్పందానికి మధ్య ఏదైనా సంబంధం ఉందా? ఆయన రాఫెల్ ఒప్పందంపై విచారణ జరిపే యోచనలో ఉన్నారా? మోదీకి ఇబ్బంది కలిగించిన విషయం ఏమిటి?’ అని కేజ్రీవాల్ మరో ట్వీట్‌లో నిలదీశారు.