ప్రత్యేక హోదా ఎవరూ ఇవ్వలేరు

  మేడ్చల్‌లో జరిగిన కాంగ్రెస్‌ బహిరంగ సభలో సోనియా గాంధీ చేసిన ప్రసంగంపై టీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. హరీష్ రావు మాట్లాడుతూ.. సోనియాగాంధీ వ్యాఖ్యల వల్ల తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. తెలంగాణలో సభ పెట్టి ఆంధ్రప్రదేశ్‌కు హామీలు ఇస్తారా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు నష్టమని చెప్పారు. అనేక సంక్షేమ పథకాలతో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని చూసి ఏడుపొస్తోందని అనడం సరికాదన్నారు. తెలంగాణలో తాము అధికారంలో లేనందుకు, రానందుకు సోనియాకు దుఃఖ పడుతున్నట్లు తనకు అనిపిస్తోందని ఎద్దేవాచేశారు.చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టును సోనియా చదివినట్లుగా ఉందన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లు అయినా కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు కనీసం తాగడానికి నీళ్లు ఇవ్వలేకపోయాయని, అలాంటిది ఇంటింటికీ నళ్లా నీళ్లిచ్చి దేశానికే టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణలో ఎంతమంది పొత్తులు పెట్టుకున్నా టీఆర్‌ఎస్‌కు వచ్చే నష్టమేమీ లేదన్నారు.     ఎంపీ వినోద్ మాట్లాడుతూ.. హిందీలో మాట్లాడిన సోనియా ప్రసంగాన్ని తెలుగు అనువాదంలో ఆమె మాట్లాడని మాటలు కూడా చొప్పించారని ఆరోపించారు. సోనియాను భ్రమల్లో పెట్టి తెలంగాణ కాంగ్రెస్ నేతలు అబద్ధాలు చెప్పించారని విమర్శించారు. తెలంగాణ ఎవరో ఇస్తే వచ్చింది కాదన్నారు. కేసీఆర్ అమరణ దీక్ష తర్వాత తెలంగాణ ఇస్తామన్న ప్రకటన అలస్యం కావడం వల్లే ఆత్మహత్యలు జరిగాయని చెప్పారు. డిసెంబర్ 11న సోనియా సహా కూటమి నేతల కళ్లు తెరిపించే ఫలితాలు వస్తాయన్నారు. రాహుల్ గాంధీ ప్రసంగం విన్నాక తలను దేంతో కొట్టుకోవాలో తెలియడంలేదని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా అంటే ఏమిటో కాంగ్రెస్ నిర్వచనం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదాను ఎవరూ ఇవ్వలేరని స్పష్టంచేశారు. ఏపీ ప్రజలను మరోసారి మోసం చేయడానికే కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఇస్తామని అంటోందని వినోద్ విమర్శించారు.

జగన్‌, మోదీ, తెరాసతో నారా లోకేశ్‌

  ఒక రాజకీయ నాయకుడిపై దాడి జరిగితే అందరూ స్పందిస్తారని, జగన్‌పై దాడి ఘటనపై స్పందించిన వారిని చంద్రబాబు తప్పు పట్టడం సరికాదని మంత్రి కేటీఆర్‌ హితవు పలికారు. జగన్‌పై దాడి విషయంలో లోకేశ్‌ సైతం స్పందించారని.. అలాచూస్తే జగన్‌, మోదీ, తెరాసతో నారా లోకేశ్‌ కూడా కలిసిపోయినట్టేనా? అని ప్రశ్నించారు. హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతిచెందితే ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించామని, ఆయన అంత్యక్రియల్ని తమ ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించామన్నారు. దాన్ని కూడా తప్పుపడతారా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు.  కూకట్‌పల్లిలో నిర్వహించిన సీమాంధ్ర సంఘీభావ సభ ‘హమారా హైదరాబాద్’‌ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సీఎం చంద్రబాబు, ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు గొప్ప గొప్ప మాటలు చెబుతున్నారాని, 9 ఏళ్లలో హైదరాబాద్‌ను నిర్మించామంటున్న చంద్రబాబు.. ఐదేళ్లలో అమరావతిని ఎందుకు నిర్మించలేకపోయారని ప్రశ్నించారు. ‘‘తెలంగాణ వస్తే సీమాంధ్రుల్ని తరిమేస్తారంటూ కావాలనే కొందరు అసత్యప్రచారం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తొలిసారి అత్యధిక మెజార్టీ ఇచ్చారు. శాంతిభద్రతల విషయంలో దేశంలోనే హైదరాబాద్‌ నెంబర్‌‌వన్‌. గత 70 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా  హైదరాబాద్‌లో ప్రశాంత వాతావరణం ఉంది’’ అని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్‌ను ఎదుర్కొనే సత్తా లేకే నాలుగు పార్టీలు జట్టుకట్టి వస్తున్నాయని కేటీఆర్‌ విమర్శించారు. డిసెంబర్‌ 11 తర్వాత కాంగ్రెస్ నేత రాహుల్‌ వీణ,చంద్రబాబు ఫిడేల్‌ వాయించుకోవాల్సిందేనని కేటీఆర్‌ ఎద్దేవాచేశారు. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాతే 24 గంటల విద్యుత్‌ అమలవుతోందన్నారు. 

కింగ్ మేకర్ గా అక్బరుద్దీన్

  ఎంఐఎం నేత, చాంద్రాయణగుట్ట తాజా మాజీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఎవరైనా.. మజ్లిస్ పార్టీ ముందు తలవంచాల్సిందే అంటు కార్యకర్తల సమావేశంలో ఉద్రేకంగా ప్రసంగించారు. వైయస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ ఇలా ఎవరైనా సరే మజ్లిస్‌కు గొడుగు పట్టాల్సిందే అని వ్యాఖ్యానించారు. డిసెంబర్ 11 తర్వాత మజ్లిస్ పార్టీ సత్తా ఏంటో ప్రపంచానికి చూపిస్తామని తెలిపారు. తను రాజకీయనేత కాదని చెబుతూనే తను ఒక పొలిటికల్ కింగ్‌ అని చెప్పుకున్నారు. గతంతో పోల్చుకుంటే రాష్ట్రంలో పరిస్థితులు మరింత సున్నితంగా తయారు అయ్యాయనీ, ఈ సందర్భంలో మరింత జాగ్రత్తగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. కాగా, అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. మరోవైపు అక్బర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమి కాదని రాజకీయ నేతలు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, ఎంఐఎం అనధికారికంగా కూటమిగా ఏర్పడ్డాయనే విమర్శలు వస్తున్నాయి. ఎంఐఎం పోటీ చేస్తున్న ఏడు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ బలహీనమైన అభ్యర్ధులను నిలబెట్టింది. అయితే ఈ సీట్లను ఆ పార్టీ గెలుచుకునేందుకు టీఆర్‌ఎస్ సహకరిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. 

రాజీవ్ గాంధీ..ఎన్టీఆర్..రేవంత్ రెడ్డి

  తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం కేసీఆర్‌పై పోరాటం చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పించిందని కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డికి విమర్శించడమే కాదు.. పాలన ఎలా చేయాలో కూడా తెలుసన్నారు. 'రేవంత్‌రెడ్డికి ఏం అనుభవం ఉందని కొందరు అంటున్నారు. పార్టీ పెట్టినప్పుడు ఎన్టీఆర్‌కు, అత్యవసర పరిస్థితుల్లో ప్రధాని పదవి చేపట్టేటప్పుడు రాజీవ్‌గాంధీకి కూడా ఏం అనుభవం ఉంది. అలాంటిది ఎన్టీఆర్‌, రాజీవ్‌గాంధీ ప్రజాసేవలో ప్రజాదరణ పొందారు. విద్యార్థి ఉద్యమాలు, రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన అనుభవం నాకు ఉంది. పాలనాపరమైన అంశాల్లో సుస్పష్టమైన ఆలోచనా విధానం నా వద్ద ఉంది’’ అని రేవంత్‌ అన్నారు. తెరాస అజెండానే ప్రజల అజెండాగా కేసీఆర్‌ భ్రమలు కల్పించారని, అన్ని వర్గాలను మభ్యపెట్టి తన వైపునకు తిప్పుకున్నారని రేవంత్‌ రెడ్డి విమర్శించారు.నీళ్లు, నిధులు, నియామకాలు ప్రజల నినాదం అని, టీఆర్‌ఎస్‌ది కాదన్నారు. రాజకీయ మనుగడ కోసం ఈ నినాదాన్ని విస్తరింపజేసి ప్రజల భావోద్వేగాలను పార్టీకోసం కేసీఆర్‌ వాడుకున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు. అలాగే స్వయం పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, టీఆర్‌ఎస్‌ పాలనలో సామాజిక న్యాయం జరగలేదని, పటేల్‌, పట్వారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడారని, కేసీఆర్‌ మార్క్‌ పాలనను ప్రజలపై రుద్దారని ఆయన అన్నారు. కేసీఆర్‌ డిక్షనరీలో సామాజిక న్యాయం అనే పదమేలేదని, మహిళలకు కనీస మర్యాద, గౌరవం ఇవ్వకపోవడం దారుణం అన్నారు. నక్సలైట్ల అజెండానే మా అజెండా అని కేసీఆర్‌ అన్నారని, కొడుకు మంత్రి, కూతురు ఎంపీ కావాలని ఏ నక్సలైట్‌ అజెండాలో ఉందని రేవంత్‌రెడ్డి అన్నారు.  నా కూతురు నిశ్చితార్థానికి నన్ను రాకుండా అడ్డుకొని తండ్రీకొడుకులు(కేసీఆర్, కేటీఆర్) పైశాచికానందం పొందాలనుకున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రేవంత్‌రెడ్డి తమను పరుష పదజాలంతో దూషిస్తున్నారని కేసీఆర్‌ కుటుంబం అంటోంది. పరుష పదజాలంతో విమర్శించింది కేసీఆరే. సోనియాగాంధీని అమ్మనా? బొమ్మనా? అని కేసీఆర్‌ దూషించడం వ్యక్తిగత విమర్శ కాదా? మా పిల్లలను కూడా దూషిస్తున్నారని కేటీఆర్‌ అన్నారు. కేటీఆర్‌ కుమారుడిని విమర్శించాల్సిన అవసరం మాకు లేదు. పాఠశాలకు వెళ్లే విద్యార్థి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడం సరైందేనా? ప్రభుత్వం తరఫున భద్రాచలం రాములవారి వద్దకు సీఎం మనవడిని పంపించడం దేవుడిని అవమానించడం కాదా? అని ప్రశ్నించారు.

ఢిల్లీలో ఓ మాట.. తెలంగాణలో మరో మాట

  తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి సోనియాగాంధీ రాష్ట్రానికి వచ్చారు. మేడ్చల్ లో జరిగిన సభలో ప్రసంగించారు. టీఆర్ఎస్ పాలనపై విరుచుకుపడ్డారు. కాగా.. సోనియా ప్రసంగంపై ఎంపీ కవిత స్పందించారు.జగిత్యాలలో మీడియాతో మాట్లాడిన నిజామాబాద్ ఎంపీ కవిత.. తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాడేది ఒక్క టీఆర్ఎస్ మాత్రమేనన్నారు.  సోనియా గాంధీ తెలంగాణ హక్కుల గురించి మాట్లాడకపోవడం దారుణమన్నారు. తెలంగాణకు వచ్చి పక్క రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామనడం ఏంటని ప్రశ్నించారు. సోనియా మాటలు చూస్తుంటే చంద్రబాబు మాటలుగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అజెండాను తెలంగాణలో తేవాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సోనియాలా ఢిల్లీలో ఓ మాట.. తెలంగాణలో మరో మాట్లాడమన్నారు. తెలంగాణ వచ్చి.. ఆంధ్రాకు హామీలు ఇవ్వడమంటే ఇక్కడి ప్రజల్ని అవమానించడమే అన్నారు. తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడని వాళ్లకు ఎన్నికల్లో ఓట్లెందుకు వేయాలని ప్రజలు ఆలోచిస్తున్నారని అభిప్రాయపడ్డారు.ఈ నెల 26న జగిత్యాలలో జరిగే సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష నేతలు నేతలు అడ్డుకున్నా జగిత్యాలలో అభివృద్ధి చేశామన్నారు. స్థానిక ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి కేసీఆర్‌పై విమర్శల చేయడం తప్ప ఏమీ రాదని ఎద్దేవాచేశారు.

బీజేపీకి మాజీ మంత్రి రాజీనామా

  తెలంగాణలో ఎన్నికలు సమీపించిన వేళ బీజేపీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి, బీజేపీ అధికార ప్రతినిధి పుష్పలీల ఆ పార్టీకి రాజీనామా సమర్పించారు. పార్టీ అవలంభిస్తున్న విధి విధానాలు నచ్చక రాజీనామా చేసినట్లు ఆమె తెలిపారు. మహిళలు, దళితులను బీజేపీ చులకనగా చూస్తోందని ఆమె ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ చేతిలో బీజేపీ కీలుబొమ్మగా మారిందని విమర్శించారు. ఈ నేపథ్యంలో బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో  నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాగం జనార్దన్ రెడ్డితో కలసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న టీఆర్ఎస్ ను గద్దె దించేందుకు కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలిపారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మహాకూటమి ఘనవిజయం సాధిస్తుందని  ఆమె ధీమా వ్యక్తం చేశారు.

హెలికాప్టర్‌ దిగబోయి పడిపోయిన అమిత్ షా

  మిజోరాంలో ఈ నెల 28న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మిజోరాం ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓ ఘటన చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గురువారం సాయంత్రం పశ్చిమ తాయ్‌పూయ్‌ నియోజకవర్గంలోని త్లబంగ్ గ్రామానికి వెళ్లారు. అక్కడికి చేరుకున్న తర్వాత హెలికాప్టర్ దిగబోయిన ఆయన.. పొరపాటున ఓ మెట్టు వదిలేసి అడుగుపెట్టారు. దీంతో అమాంతం నేలపై బోర్లా పడిపోయారు. అమిత్‌షాతో పాటు హెలికాప్టర్‌లో వెళ్లిన మరో వ్యక్తి ఆయనను వెంటనే పైకి లేపారు. దీన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

టీడీపీ ఎంపీకి షాక్..ఈడీ సోదాలు

  ఎన్‌ఫోర్స్‌మెంట్స్ డైరెక్టరేట్ అధికారులు తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి నివాసాలు, కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. సుజనా చౌదరికి చెందిన సుజనా గ్రూప్స్‌లో ఈడీ అధికారులు గత రాత్రి నుంచే సోదాలు జరుపుతున్నారు. గత అక్టోబర్‌లోనూ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు దాడులు నిర్వహించి హార్డ్‌ డిస్క్‌ లు, ఫైల్స్‌ తో పాటు కీలక డాక్యుమెంట్‌లు స్వాధీనం చేసుకున్నసంగతి తెలిసిందే. డొల్ల కంపెనీల ద్వారా కోట్ల రూపాయలు కొల్లగొట్టారని సుజనాచౌదరిపై ఆరోపణలు ఉన్నాయి. సుజనా చౌదరీ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులను డైరెక్టర్‌లుగా పెట్టి షెల్‌ కంపెనీలు ప్రారంభించినట్లు సుజనా చౌదరిపై ఆరోపణలు వచ్చాయి. గంగా స్టీల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, భాగ్యనగర్‌ ఇన్వెస్ట్‌మెంట్ అండ్‌ ట్రేడింగ్ లిమిటెడ్, తేజస్విని ఇంజినీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఫ్యూచర్‌ టెక్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీలకు పెద్ద ఎత్తున డబ్బును మళ్లించారని ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి కొనుగోళ్లు చేయకుండానే… కేవలం రసీదుల రూపంలో డబ్బులు మళ్లించినట్లు తెలుస్తోంది. బ్యాంకుల నుంచి సుజనా గ్రూప్ సంస్థ మొత్తం రూ. 304 కోట్ల మేరకు రుణాలు పొందినట్లు తెలుస్తుండగా సెంట్రల్ బ్యాంక్ నుంచి రూ. 124 కోట్లు, కార్పొరేషన్ బ్యాంక్ నుంచి రూ. 120 కోట్లు, ఆంద్రాబ్యాంక్ నుంచి రూ. 60 కోట్లు రుణాలను సృజన గ్రూప్స్ పొందినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. సృజన గ్రూప్స్ డైరెక్టర్‌గా ఉన్న శ్రీనివాస్ కళ్యాణ్‌రావ్ పేరుతో ఈ ఋణాలు పొందినట్లు తెలుస్తుండగా సీబీఐ మాజీ డైరెక్టర్ అయిన విజయరామారావు కొడుకు శ్రీనివాస్ కళ్యాణ్ రావుగా గుర్తించారు. బ్యాంకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీనివాస్ కల్యాణ్ రావ్‌పై 2016 లో సీబీఐ కేసునమోదు చేసింది. ప్రస్తుతం మర్షియస్ కమర్షియల్ బ్యాంక్ ఫిర్యాదు మేరకు సోదాలు నిర్వహిస్తుండగా.. ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

ఆనాడు కేటీఆర్..ఈనాడు కేసీఆర్

  పార్టీలో అగ్రనేతలకు ప్రత్యర్థిగా బరిలో నిలిచి పోరాడి గెలవటం అంత సులువేం కాదు. కానీ ఓ మహిళా నాయకురాలు మాత్రం పట్టువిడవకుండా బరిలో నిలుస్తుంది. ఆనాడు కేటీఆర్ పై పోటీ చేసిన ఆ మహిళా నాయకురాలు ఈనాడు కేసీఆర్ పై పోటీకి సిద్ధమైంది. భాజపా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ గత ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గం నుంచి తెరాస అభ్యర్థిగా బరిలో నిలిచిన కేటీఆర్‌ తో పోటీ పడ్డారు. అనూహ్యంగా ప్రస్తుత ఎన్నికల్లో ఆమె ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని గజ్వేల్‌ నియోజకవర్గానికి మారారు. ఇక్కడ తెరాస అభ్యర్థిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో సిరిసిల్లలో పోటీ చేసిన ఆకుల విజయ 14,494 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. అక్కడ కొడుకుపై దక్కని విజయం ఇక్కడ తండ్రిపై వరిస్తుందో లేదో వేచి చూద్దాం..

తెలంగాణకు వస్తే తల్లి తన బిడ్డల దగ్గరకు వచ్చినట్లుంది

  తెలంగాణ ఏర్పడిన నాలుగున్నరేళ్ల తర్వాత తొలిసారి సోనియాగాంధీ రాష్ట్రానికి వచ్చారు. మేడ్చల్ వేదికగా జరిగిన భారీ బహిరంగ సభకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ హాజరయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరుగుతున్నా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మాత్రమే  పాల్గొనడం ద్వారా సోనియా గాంధీ తెలంగాణకు తానిస్తున్న ప్రాధాన్యాన్ని చాటిచెప్పారు. అదే విధంగా తన ప్రసంగంతో కూడా ఆకట్టుకున్నారు. తెలంగాణ వచ్చింది. నేను మీ అందరి మధ్య ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత తల్లి తన బిడ్డల దగ్గరకు వచ్చినప్పుడు కలిగినంత సంతోషాన్ని అనుభవిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలనే నిర్ణయం తీసుకోవడానికి ఎన్ని కష్టాలు ఎదురయ్యాయో నాకు గుర్తుంది. అదంత సులభమైన పని కాదు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రెండింటి బాగోగులూ మేమే చూడాల్సి ఉండేది. అయినప్పటికీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు.. ఉద్యమ స్ఫూర్తిని గమనించి నాటి ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌, రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ పార్టీ కలిసికట్టుగా నిర్ణయం తీసుకుని తెలంగాణ కలను సాకారం చేశాం. రాజకీయంగా తమ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా, తెలంగాణ ప్రజల జీవితాలు బాగుండాలని ఆ రోజు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం తీసుకున్నాం. అదే సమయంలో, ఆంధ్ర ప్రజల జీవితాలు బాగుండాలని తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టిన రోజున ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంటులో నిర్ణయం తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలందరికీ ఈ వేదిక నుంచి వాగ్దానం చేస్తున్నాను. ప్రత్యేక హోదా సహా ఆ రోజు చేసిన వాగ్దానాలన్నిటినీ నెరవేరుస్తాం.  ప్రతి తల్లి కూడా తన బిడ్డలు ఎంతో ఎత్తుకు ఎదగాలని, వారి జీవితాలు బాగుపడాలని కోరుకుంటుంది. నేను కూడా అలాగే కోరుకున్నాను. కానీ, ఈరోజు మీ కష్టాలు చూస్తుంటే మనసుకి బాధగా ఉంది. ఇక్కడ పాలన ఏ రకంగా జరగాలని భావించామో అలా జరగడం లేదు. అభివృద్ధి ఎలా జరగాలనుకున్నామో అలా జరగట్లేదు. మీ కలలు ఈ నాలుగున్నరేళ్లలో ఎంతవరకు సాకారమయ్యాయి? నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంత వరకూ ముందడుగు వేసింది?ఇక్కడ రైతులు ఇప్పటికీ నీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్నారు. నేటికీ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ చట్టాన్ని టీఆర్‌ఎస్‌ సర్కారు తుంగలోకి తొక్కి రైతుల జీవితాలను నాశనం చేసింది. ఉపాధి హామీ పథకాన్ని కూడా సరిగ్గా అమలు చేయకుండా ప్రజలకు దూరం చేసింది. యువత ఉద్యోగం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దళితులు, ఆదివాసీలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి.. యువత, విద్యార్థులు, మహిళల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం ఏమైనా చేసిందా? కేవలం వాళ్లు, వాళ్ల కుటుంబం, బంధుమిత్రులు మాత్రమే బాగుపడే పనులు చేసుకున్నారు. మాటపై నిలబడని, విశ్వసనీయత లేని వాళ్ల మాటలు నమ్మవద్దు. బిడ్డ పుట్టిన తర్వాత తొలి సంవత్సరాల్లో సరైన పోషణ అందకపోతే, భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు పడాల్సివస్తుంది. కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, ప్రజల ఆలనాపాలనా వాళ్ల చేతుల్లోకి వెళ్లింది. వాళ్లు తెలంగాణ బిడ్డ ఆలనాపాలనను గాలికి వదిలేశారు. ఇది ఎన్నికల సమయం. మీరు, మేము అందరం కలిసి ఇబ్బందుల నుంచి విముక్తులం కావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధనకు మీరు ఎలాగైతే పోరాడారో.. అదే స్ఫూర్తితో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి. సభకు వచ్చిన వారితోపాటు తెలంగాణలోని ప్రతి ఒక్కరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీ ఒక్కొక్క ఓటునూ కాంగ్రెస్ కు, ప్రజా కూటమి అభ్యర్థులకు వేయండి. భారీ మెజారిటీతో గెలిపించండి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి చేతులు కలపండి.

జేడీ.. 'జనధ్వని' పార్టీ

  అసలు పేరు వి.వి.లక్ష్మీనారాయణ అయినప్పటికీ తెలుగు ప్రజలకు మాత్రం జేడీ లక్ష్మీనారాయణగానే సుపరిచితుడు. మహారాష్ట్ర క్యాడర్‌ కి చెందిన లక్ష్మీనారాయణ సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా వైసీపీ అధినేత జగన్‌పై నమోదైన అక్రమాస్తుల కేసు, సత్యం కంప్యూటర్స్‌, గాలి జనార్దన్‌రెడ్డి అక్రమాలపై కేసులను దర్యాప్తు చేయటం ద్వారా వెలుగులోకి వచ్చారు. కొద్ది నెలల కిందట స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన లక్ష్మీనారాయణ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ గ్రామీణ సమస్యలపై, ముఖ్యంగా రైతుల స్థితిగతులపై అధ్యయనం చేస్తున్నారు. కళాశాలలను సందర్శించి విద్యార్థులను చైతన్య పరుస్తున్నారు. ఈ నేపథ్యంలో లక్ష్మీనారాయణ రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు వినిపించాయి. అందరి ఊహాగానాలకు తెరదింపుతూ తన రాజకీయ రంగ ప్రవేశంపై ఓ క్లారిటీ ఇచ్చేసారు. లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెట్టనున్నారు. ఇన్నాళ్లు రాజకీయ రంగప్రవేశంపై ఊహాగానాలు వినిపించగా తాజగా పార్టీ పేరుపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ‘జేడీ’గా తెలుగు ప్రజలకు సుపరిచితుడు అయ్యారు కాబట్టి పార్టీ పేరు కూడా జేడీ అని పలికేలా  ‘జన ధ్వని’  అని పెట్టవచ్చని ప్రచారం జరుగుతోంది. వందేమాతరం అనే పేరు సైతం ప్రచారంలో ఉంది. లక్ష్మీనారాయణ సన్నిహిత వర్గాలు మాత్రం ఏ పేరునూ ధ్రువీకరించటం లేదు. అలాగని వీటిని ఖండించటమూ లేదు. జేడీ పేరు పైనే లక్ష్మీనారాయణ ఆసక్తి చూపుతున్నట్లు భావిస్తున్నారు. ఈనెల 26వ తేదీన ఆయన పార్టీ ఏర్పాటు ప్రకటన చేసేందుకు హైదరాబాద్‌లోని పబ్లిక్‌ గార్డెన్స్‌ వేదిక కానున్నట్లు సమాచారం. 

తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టిన సోనియా గాంధీ

  మేడ్చల్‌లో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభా వేదిక వద్దకు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ కాసేపట్లో చేరుకోనున్నారు. ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ముందుగా వారు పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. అనంతరం బహిరంగ సభకు వెళ్తారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత సోనియా గాంధీ మొదటిసారి రావడంతో.. సోనియా గాంధీ ఏం మాట్లాడతారా? అని పార్టీ శ్రేణులతో పాటు, ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు సోనియా గాంధీ సమక్షంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తో పాటు ఎవరైనా టీఆర్ఎస్ కీలక నేతలు కాంగ్రెస్ లో చేరనున్నారా అనే ఆసక్తి నెలకొంది.

దేశాన్ని ప్రేమించేది కాంగ్రెస్‌.. ద్వేషించేది బీజేపీ

  తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధి, దేశ సుస్థిరత కాంగ్రెస్‌తో ముడిపడి ఉందని అన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్‌ తోనే సాధ్యమన్నారు. రాష్ట్రాన్ని బీజేపీ నట్టేట ముంచిందని, తిరుమల వెంకన్న సాక్షిగా ప్రధాని మోదీ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. రాహుల్‌ ప్రధాని అయితే ఏపీ ప్రత్యేక హోదా పైనే ఆయన తొలి సంతకం చేస్తారని రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. దేశాన్ని ప్రేమించేది కాంగ్రెస్‌ అయితే, దేశాన్ని ద్వేషించేది బీజేపీ అని, ఎటువైపు ఉంటారో ప్రజలే తేల్చుకోవాలన్నారు. థర్డ్‌ ఫ్రంట్ అనేది కూలిపోయే టెంట్‌.. దేశంలో అలాంటి ఫ్రంట్‌కు ఎలాంటి అవకాశాలూ లేవన్నారు. ఎన్నికలకు ముందే అది కూలిపోతుందని జోస్యం చెప్పారు.

పట్టపగలే విజయవాడలో దారుణం

  విజయవాడలో ఓ ఫైనాన్స్ వ్యాపారిపై పట్టపగలే హత్యాయత్నానికి ఒడిగట్టారు దుండగులు. దేవరపల్లి గగారిన్‌ అనే ఫైనాన్స్ వ్యాపారికి బీసెంట్‌ రోడ్డులోని మూన్‌మూన్‌ ప్లాజా వద్ద చిలుకూరి దుర్గయ్య వీధిలో కార్యాలయం ఉంది. కార్యాలయంలోకి ప్రవేశించిన దుండగులు ఆయనపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో ఆయనకు 80శాతానికి పైగా గాయాలయ్యాయి. దీంతో ఆయన ఆంధ్రా ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు. గగారిన్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఆయన శరీరానికి మంటలు అలముకోవడం, బయటకు పరుగెత్తుకొచ్చిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆర్థికపరమైన అంశాల్లో విభేదాల వల్లే ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగులు పెట్రోల్‌ క్యాన్‌తో పాటు కత్తిని కూడా తీసుకొచ్చినట్టు పోలీసులు గుర్తించారు. పెట్రోల్‌ పోసిన తర్వాత కత్తిని అక్కడే వదిలి వెళ్లిపోయినట్టు సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు చెబుతున్నారు. మద్దాల సుధాకర్‌, సురేశ్‌ అనే ఇద్దరు వ్యక్తులకు గగారిన్‌తో వ్యక్తిగత విభేదాలు ఉన్నాయన్న అనుమానాల నేపథ్యంలో వారి ఆచూకీ తెలుసుకొనేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

బాబా పిలుపుతోనే ఇక్కడికి వచ్చా: చంద్రబాబు

  ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు అనంతపురం జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి వెళ్లారు. ప్రశాంతినిలయంలో నిర్వహిస్తున్న సత్యసాయిబాబా జయంతి వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. బాబాతో తనకున్న అనుబంధం అపురూమైనదని చెప్పారు. మానవ సేవే మాధవ సేవ అని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి బాబా అని కొనియాడారు. బాబా అందించిన మహా ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి అని, ఇక్కడకు వచ్చే ప్రతి భక్తుడికీ మనశ్శాంతితో పాటు, సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చంద్రబాబు చెప్పారు. బాబా మనందరి మధ్య లేకపోయినా మనందరిలో ఆయన జీవించి ఉన్నారని చంద్రబాబు అన్నారు. ఉన్నత స్థాయికి చేరాలనుకునే ప్రతి వ్యక్తీ బాబా సూక్తులను, మార్గాలను పాటిస్తే తప్పకుండా గమ్యం చేరుకుంటారని చెప్పారు. సత్యసాయి అనుగ్రహంతోనే పుట్టపర్తికి రాగలమని, బాబా పిలుపుతోనే ఇక్కడికి వచ్చానని తెలిపారు. ఇక్కడకు వచ్చిన ప్రతిసారీ మహోన్నతమైన అనుభూతిని పొందుతానని, ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్లాలనిపించదని, తనకు సమయం దొరికినప్పుడల్లా ఇక్కడకు రావాలనిపిస్తుందని చంద్రబాబు చెప్పారు.

చింతమనేనిని అరెస్ట్ చేస్తారా లేదా?

  టీడీపీలో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న దెందులూరు ఎమ్మెల్యే , చీఫ్ విప్ చింతమనేని ప్రభాకర్ ప్రవర్తన టీడీపీకి తలనొప్పిగా మారింది. నిత్యం వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న చింతమనేనిపై కొన్ని నెలల క్రితం దళితుడిపై దాడి కేసులో ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ కింద కేసు నమోదయ్యింది. ఆ కేసులో ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని వామపక్షాలు నిరసన తెలుపుతున్నాయి. కొన్ని రోజులక్రితం ఈ కేస్‌లో చింతమనేనిపై ఇంతవరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఆయన్ని అరెస్ట్‌ చేయాలంటూ కమ్యూనిస్ట్‌ నేతలు డీజీపీని కోరారు. వారం రోజుల్లోగా చింతమనేనిని అరెస్ట్‌ చేయకపోతే విజయవాడలో కమ్యూనిస్ట్‌ పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.  అయినా చింతమనేనిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవటంతో తాజాగా విజయవాడలో  చింతమనేనిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. నాలుగున్నర ఏళ్ళుగా చింతమనేని అరాచకాలను చంద్రబాబు సమర్దిస్తూనే ఉన్నారని నేతలు మండిపడ్డారు. ప్రజాస్వామ్యంపై ముఖ్యమంత్రికి గౌరవం ఉంటే చింతమనేనిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. ఆయనపై కేసు నమోదై మూడు నెలలు కావస్తున్నా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. సీఎం రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడుతారో.. లేక రౌడీయిజానికి సపోర్టు చేస్తారో తేల్చుకోవాలన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. రౌడీషీటర్ చింతమనేనిని చీఫ్ విప్ గా ప్రకటించడం సరికాదన్నారు. చర్యలు తీసుకోకపోతే వ్యవస్థలు భ్రష్టుపడతాయని తెలిపారు. చిత్తశుద్ది ఉంటే చింతమనేనిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా చింతమనేని ఆగడాలకు చంద్రబాబు అడ్డుకట్ట వేస్తారో లేదో...?

ఆటోనే ఎంపీ అభ్యర్థి ఓటమికి కారణం

  రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు హైదరాబాద్‌ వచ్చిన కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి ఓపీ రావత్‌ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు అశోక్‌ లావాస, సునీల్‌ అరోరా, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ కూడా పాల్గొన్నారు.11 పార్టీలను ఈ సమావేశానికి ఆహ్వానించగా తృణమూల్‌ కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌సీపీ మినహా మిగిలిన పార్టీల నాయకులు హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి మర్రి శశిధర్‌రెడ్డి, నిరంజన్, బీజేపీ నుంచి నల్లు ఇంద్రసేనారెడ్డి, కే అంథోనిరెడ్డి, ఎంఐఎం నుంచి ఎమ్మెల్సీ సయ్యద్ అమిన్ జాఫ్రీ, సయ్యద్ ముస్తాక్, టీడీపీ నుంచి రావుల చంద్రశేఖర్‌రెడ్డి, జీ గురుమూర్తి, బీఎస్పీ నుంచి ఎస్ ఎల్లన్న, సిద్దార్థపూలే, సీపీఎం నుంచి నంద్యాల నర్సింహారెడ్డి, జే వెంకటేశ్, ఎన్సీపీ నుంచి ఎస్ రవీందర్, వీ నరేశ్‌గుప్తా హాజరయ్యారు.  సమావేశ అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెరాసకు అనుగుణంగా పత్రికలు, ఛానళ్లలో వచ్చిన వార్తలపై తాము ఫిర్యాదు చేస్తే అవి తప్పుడు వార్తలని ఎన్నికల కమిషన్‌ చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. వీడియో సాక్ష్యాలున్నా పట్టించుకోకుండా, తప్పుడు వార్తలని చెబుతూ కమిషన్‌ పక్షపాతంతో వ్యవహరిస్తోందన్నారు. తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెరాస ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడటం, తెదేపా నాయకులను దుర్భాషలాడటంపై ఫిర్యాదు చేశామని తెలిపారు. మీడియా, పత్రికలను తెరాస అవసరాలకోసం వాడుతున్న తీరును కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత ఛానల్‌ను ఒక్కరోజు చూడాలని కోరామన్నారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణను ఆటంకపరుస్తున్న తీరుపై సీడీలతో సహా ఆధారాలు సమర్పించామని చెప్పారు. టీఆర్‌ఎస్ ఎన్నికల గుర్తు అయిన కారును పోలిన ఆటో, టోపీ, రోడ్డురోలర్, ట్రక్ వంటి గుర్తులను ఈ ఎన్నికల్లో ఎవరికీ కేటాయించవద్దని ఈసీని కోరినట్టు ఎంపీ వినోద్ తెలిపారు. 2014 ఎన్నికల్లో ఒక అభ్యర్థికి కేటాయించిన ఆటో గుర్తు తమ పార్టీకి చెందిన ఎంపీ అభ్యర్థి ఓడిపోవడానికి కారణమైందని వివరించామన్నారు. ప్రస్తుతం జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక అభ్యర్థికి ఆటో గుర్తు కేటాయించారని, దానిని తొలగించాలని కోరినట్టు చెప్పారు. సమాజ్‌వాదీ బ్యాక్‌వర్డ్ పార్టీకి ట్రక్ గుర్తు ఇచ్చారని, దీనిపై పునరాలోచన చేయాలని కోరామన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ రాష్ట్రంలోని చానల్‌లో ప్రకటనలు ఇస్తున్నారని, వాటిపై చర్యలు తీసుకోవాలని.. ఆ ప్రకటనల ప్రభావం ఇక్కడ ప్రజలపై ఉంటుందని తెలిపామని చెప్పారు.

కాంగ్రెస్ లోకి కొండా బాటలో టీఆర్‌ఎస్‌ కీలక నేతలు.!!

  ఎన్నికలు తేదీ దగ్గరపడుతున్న వేళ టీఆర్ఎస్ కు తమ అభ్యర్థులు గెలుస్తారా? లేదా? అన్న భయం కంటే.. తమ పార్టీ ముఖ్య నేతలు ఎవరైనా పార్టీని వీడతారా అన్న భయమే ఎక్కువగా వెంటాడుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ కీలక నేతలు తమ పార్టీలో చేరతారని చెప్పడం. వారు చెప్పినట్టుగానే ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరటానికి సిద్దమైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కొండా బాటలోనే మరికొందరు టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్నీ స్వయంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం విశేషం. తాజాగా గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రెండు రోజుల్లో కాంగ్రెస్‌లోకి భారీగా వలసలు ఉన్నాయని అన్నారు. టీఆర్‌ఎస్‌ కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు కేసీఆర్‌ వర్సెస్‌ తెలంగాణ ప్రజలకని అన్నారు. కేసీఆర్‌ ఇచ్చిన హామీలకు ఈ ఎన్నికలు రెఫరెండమని ఉత్తమ్ అన్నారు. కేసీఆర్‌ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా? అని ప్రశ్నించారు. ముస్లింలు, గిరిజనులు, దళితులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా? అని నిలదీశారు. తెలంగాణలో వచ్చేది కూటమి ప్రభుత్వమేనని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత కేసీఆర్‌ ఫాంహౌస్‌కు, కేటీఆర్‌ అమెరికాకు వెళ్లడం ఖాయమని ఎద్దేవా చేశారు.

3584 - 1760 =1824 ..మహిళలు..?

  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగిసింది. బుజ్జగింపులు, హామీలతో కొన్ని స్థానాలు మినహా మెజార్టీ స్థానాల్లో రెబల్స్‌ కూడా వెనక్కి తగ్గారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాలున్న తెలంగాణ ఎన్నికలో బరిలో పోటీపడేది ఎంతమంది అనేదానిపై ఈసీ స్పష్టత ఇచ్చింది . ముందస్తు ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 3,584 నామినేషన్లు దాఖలు కాగా... మొత్తం 1,760 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో తుది పోరుకు 1,824 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. టీఆర్ఎస్ 119, కాంగ్రెస్ 100, టీడీపీ 13, తెలంగాణ జన సమితి 8, సీపీఐ 3, బీజేపీ 118, ఎంఐఎం 8, బీఎల్‌ఎఫ్‌ 119, మిగతా వారిలో బీఎప్పీ, ఎస్పీ, స్వతంత్ర అభ్యర్థులు రంగంలో ఉన్నారు. మరోవైపు మహిళల గురించి గొప్పలు చెప్పే పార్టీలు మహిళలకు ఎన్ని స్థానాలు కేటయించాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. నామినేషన్ల పర్వం ముగిసిన అనంతరం తుది జాబితా ప్రకారం బరిలో ఉన్న మహిళలు కేవలం 43 మాత్రమే. ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా లేకుండా అందరూ మహిళలకు సీట్లు కేటాయించటంలో విఫలం అయ్యారు.119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న అధికార టీఆర్ఎస్ పార్టీ మహిళలకు కేటాయించిన స్థానాలు నాలుగు మాత్రమే.కాగా మహాకూటమి తరపున 14 మంది (కాంగ్రెస్ 11, టీడీపీ 1, టీజేఎస్ 1, సీపీఐ 1) బరిలో నిలిచారు. భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీల కంటే అధిక సంఖ్యలో 15 సీట్లు కేటాయించింది. సీపీఎం, బీఎల్‌ఎఫ్‌ కూటమి 10 మంది మహిళా అభ్యర్థులను రంగంలోకి దింపింది. పాతబస్తీలో బలమైన పార్టీగా ఉన్న మజ్లిస్‌ పార్టీ మాత్రం ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వలేదు. పట్టుమని 50 మంది మహిళలు కూడా బరిలో లేకపోవటం గమనార్హం.