రోడ్డుమీద కుప్పలుతెప్పలుగా ఆధార్ కార్డులు

  ఒకే దేశము ఒకే గుర్తింపు అనే లక్ష్యంతో ఆధార్ అనే 12 అంకెల గుర్తింపు కార్డును ప్రవేశపెట్టారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ఇప్పుడు రోడ్డు పాలు అయింది. ఓ ప్రభుత్వ ఉద్యోగి నిర్లక్ష్యం వల్ల కుప్పలు తెప్పలుగా ఆధార్ కార్డులు రోడ్డు మీద కనిపిస్తున్నాయి. కడప జిల్లా ఎర్రగుంట్ల పోస్టాఫీసుకు లబ్ది దారులకు పంపిణీ చేయాల్సిన ఆధార్ కార్డులు వచ్చాయి. అయితే వాటిని పంపిణీ చేయటంలో నిర్లక్ష్యం వహించాడు పోస్ట్ మాన్ హుస్సేన్. భోజనానికి వెళ్లి అక్కడి హోటల్ లో వాటిని మర్చిపోయాడు. ఆ హోటల్ వాళ్లు వాటిని కొన్నాళ్లుగా భద్రపరిచి ఇక చేసేదేమీ లేక రోడ్డుపై పడేశారు. వీటిని గమనించిన కొందరు విషయాన్ని మీడియా దృష్టికి తీసుకెళ్లారు. వాళ్ళు విచారించగా పోస్ట్ మాన్ నిర్లక్ష్యమే దీనికి కారణమని తేల్చేసారు. అయితే హుస్సేన్ మాత్రం ఎప్పటి నుంచో వెతుకుతున్న కనపడట్లేదని, తాను రోజు ఆ హోటల్ లోనే భోజనం చేసేవాన్నని తెలిపారు. కావాలని తప్పు చేయలేదని , ఆ రోజు అక్కడ మర్చిపోవటం వల్లే ఇలా జరిగిందని పేర్కొన్నారు. 

వాళ్ళకేమో నోటీసులు..నాపై మాత్రం వేటా?

  రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్‌పై వేటు పడింది. పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఆయన తప్పిస్తూ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరుపున ఇబ్రహీంపట్నం స్థానం నుంచి బరిలో దిగాలని ఆ పార్టీ నేత క్యామ మల్లేష్ భావించారు. కానీ పొత్తులో భాగంగా పార్టీ ఆ స్థానాన్ని టీడీపీ కి కేటాయించింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన క్యామ మల్లేష్ స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ భక్తచరణ్‌దాస్‌పై అవినీతి ఆరోపణలు చేశారు.టికెట్‌ ఇప్పిస్తామని ఆశావహుల దగ్గర రూ.3 కోట్లు తీసుకున్నారని ఆరోపించారు. అంతేగాకుండా టికెట్ల కేటాయింపులో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని, వచ్చే ఎన్నికల్లో పార్టీ ఓటమే ధ్యేయంగా యాదవ, కురమ సామాజికవర్గాన్ని ఏకం చేస్తామని బహిరంగంగా ప్రకటించారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన పీసీసీ.. మల్లేష్‌పై క్రమశిక్షణాచర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అందులోభాగంగా ఆయనను జిల్లా అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. క్యామ మల్లేష్ చేసిన వ్యాఖ్యలపై అధిష్టానం షోకాజ్‌ నోటీసులు జారీ చేయగా ఆయన ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా వేటుపై స్పందించిన క్యామ మల్లేష్... కుంతియా, ఉత్తమ్‌ను అడ్డగోలుగా దూషించిన కోమటిరెడ్డి బ్రదర్స్‌కు షోకాజ్‌తో సరిపెట్టారని, టికెట్‌ దక్కలేదని జెండా దిమ్మె, సోనియా, రాహుల్‌ ఫ్లెక్సీలను చించేసిన కార్తీక్‌రెడ్డిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని, బీసీని కాబట్టే తనను బలిపశువు చేస్తున్నారని ఆరోపించారు. ఐదేళ్లు అధ్యక్ష పదవికీ, 35 ఏళ్లు పార్టీకి సేవకు చేసినందుకు నాకు ఇచ్చే బహుమానం ఇదా అని క్యామ మల్లేశ్‌ ప్రశ్నించారు. పార్టీకి నష్టం చేకూర్చే వ్యాఖ్యలు ఎక్కడా చేయలేదని, క్రమశిక్షణా ఉల్లంఘించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పొలంలో విమానం.. కేసు నమోదు చేసిన పోలీసులు

  రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మోకిలలో శిక్షణ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఎవరికీ ప్రాణహాని జరగలేదు. ఢిల్లీకి చెందిన భరత్ భూషణ్ నగరంలోని బేగంపేట్ ఎయిర్ పోర్టులో రాజీవ్ గాంధీ ఏవియేషన్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. శిక్షణలో భాగంగా ఈరోజు ఉదయం బేగంపేట ఎయిర్ పోర్టులో విమానంలో బయలు దేరాడు. అయితే మధ్యలో సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానం ప్రమాదానికి గురైంది. చెట్టుకు తగిలి గ్రామంలోని శంకరమ్మ అనే మహిళా రైతు పొలంలో కుప్పకూలింది. పైలట్ భరత్ భూషణ్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. చికిత్స నిమిత్తం అతన్ని శంకర్ పల్లి బీఎన్ఆర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విమానయాన శాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే కుప్పకూలిన విమానం శకలాలను ఫొటోలు తీసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున ఘటనాస్థలికి చేరుకున్నారు. 

హైకోర్టు విభజనకు అడ్డుపడింది చంద్రబాబే

  అంబర్‌పేటలో ‘అడ్వకేట్స్‌ ఫర్‌ టీఆర్‌ఎస్‌’ పేరుతో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. హైకోర్టు విభజన జరగకపోవడానికి చంద్రబాబే కారణమని కేటీఆర్‌ విమర్శించారు. గతంలో హైకోర్టు విభజన విషయంలో కేంద్రం పలుమార్లు మాట ఇచ్చినా.. ఎన్డీయే భాగస్వామిగా ఉండి నాలుగేళ్లుగా అడుగడుగునా ఆయన అడ్డుపడ్డారని అన్నారు. పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు మౌన దీక్షలు చేసినా, వెల్‌లోకి దూసుకెళ్లినా కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా సైందవుడిలా అడ్డుపడింది మాత్రం ముమ్మాటికీ చంద్రబాబేనన్నారు. ఆయనకు ఉన్న అన్ని సంబంధాలను వినియోగించుకొని స్టేలు తెచ్చుకుంటున్నారని ఆరోపించారు. హైకోర్టు విడిపోతే తన అక్రమాలు బయటకు వస్తాయనే భయంతోనే ఆయన హైకోర్టు విభజన అడ్డుకున్నారన్నారు. ఎన్డీయే నుంచి చంద్రబాబు బయటకు వెళ్లాక మళ్లీ హైకోర్టు విభజన అంశంలో కదలిక వచ్చిందని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక జనవరిలో తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటవుతుందన్న నమ్మకం తనకుందన్నారు.

చంద్రబాబుని తరిమికొట్టాల్సిన బాధ్యత మీదే

  కాంగ్రెస్, టీడీపీ మహాకూటమితో దగ్గర అయినప్పటి నుంచి చంద్రబాబుని టార్గెట్ చేస్తూ కేసీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు. జడ్చర్లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ మరోసారి చంద్రబాబు మీద విమర్శల దాడి చేశారు. కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరు వలసలు తగ్గాయి. ఇతర ప్రాంతాలకు వెళ్లిన వాళ్లు కూడా తిరిగి జిల్లాకు వస్తున్నారు. తెలంగాణ కల సాధించుకున్నాం. ఇప్పుడు కోటి ఎకరాల తెలంగాణ పచ్చగా చేయాలన్న కలను సాకారం చేసుకుందాం. రాష్ట్రం రానే రాదని అందరూ హేళన చేశారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏకతాటిపై నిలిచి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. పెండింగ్‌ ప్రాజెక్టుల పనులు పూర్తి చేసుకున్నాం. ప్రాజెక్టుల పనులు చేపట్టి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేశాం’ అన్నారు. చంద్రబాబు ఈ జిల్లాలో కొందరిని పోటీకి పెట్టారు. ఆయన పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి ‘వదల బొమ్మాళి.. వదలా’ అంటూ రాష్ట్రంలోకి మళ్లీ వస్తున్నారు. గతంలో నా వంతు నేను ఒకసారి తరిమి కొట్టా. ఇప్పుడు ఆయన్ను తరిమికొట్టాల్సిన బాధ్యత మీదే. పాలమూరు జిల్లాను తొమ్మిది సంవత్సరాలు చంద్రబాబు దత్తత తీసుకున్నారు. ఆయన ఏం చేశారు?. కానీ, ఇప్పుడు అన్ని పనులు వరుసగా జరుగుతున్నాయి. పాలమూరు ఎత్తిపోతల పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయి. మహాకూటమి పేరుతో మళ్లీ చంద్రబాబు మన ఇంట్లో దూరి ‘మిమ్మల్ని కొట్టి పోతా’ అంటున్నారు. రానీద్దామా?.. కాంగ్రెస్‌ వాళ్లు చంద్రబాబును మోసుకొస్తున్నారు' అని కేసీఆర్ ధ్వజమెత్తారు.

టీఆర్ఎస్ కి తాజా మాజీ ఎమ్మెల్యే రాజీనామా

  టీఆర్ఎస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఒక్కొక్కరు పార్టీ వీడుతుండటం ఆ పార్టీని కలవరపెడుతుంది. ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యి చేరికపై మంతనాలు జరిపారు. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే తాజాగా వికారాబాద్ జిల్లా వికారాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహించిన తాజా మాజీ  ఎమ్మెల్యే సంజీవరావు టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. టీఆర్‌ఎస్‌ అధిష్టానం వికారాబాద్‌ టికెట్‌ను డాక్టర్‌ మెతుకు ఆనంద్‌కు కేటాయించింది.అనారోగ్య కారణాలతో సంజీవరావుకు టికెట్‌ నిరాకరించింది. దీంతో టీఆర్ఎస్‌ పార్టీకి సంజీవరావు గుడ్‌బై  చెప్పారు.ఈ మేరకు రాజీనామా లేఖను టీఆర్ఎస్ కార్యాలయానికి పంపారు. అంతేకాకుండా అభ్యర్థి విషయంలో తనని సంప్రదించలేదని, పార్టీలో తనకు తగిన గుర్తింపు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థికి మద్దతు తెలుపుతానని ప్రకటించారు. వరుస రాజీనామాలతో 100 స్థానాలు గెలుస్తామన్న టీఆర్ఎస్ ధీమా పటా పంచలయ్యింది.

టీఆర్ఎస్ పార్టీని వీడటానికి కారణం అదికాదు

  టీఆర్ఎస్ పార్టీని వీడిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఈరోజు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ కుంతియాతో కలిసి ఆయన రాహుల్‌తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాహుల్ గాంధీని కలిశాక చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అనివార్య పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశానని.. మహేందర్‌రెడ్డితో వివాదాల కారణంగా తాను టీఆర్ఎస్ పార్టీని వీడలేదని స్పష్టం చేశారు. తాను టీఆర్ఎస్ లో చేరినప్పటి నుంచి వ్యక్తిగత విభేదాలు ఉన్నాయని.. అందుకోసమే తాను పార్టీని ఎందుకు వీడతానన్నారు. అలాంటి చిన్న విషయాలు పార్టీని వీడేందుకు కారణం కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ అతి పెద్ద ప్రజాస్వామ్య పార్టీ అని.. ప్రాంతీయ పార్టీలతో సమస్యల పరిష్కారం సాధ్యం కావడం లేదని పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమలు కాలేదని, సిద్ధాంతాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పనిచేస్తోందన్నారు. కాంగ్రెస్‌తోనే తన నియోజకవర్గ సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ సమస్యల గురించి తాను రాహుల్‌తో చర్చించినట్లు తెలిపారు. ఎంఎంటీఎస్‌, వికారాబాద్‌ శాటిలైట్‌ సిటీ తదితర సమస్యల గురించి వివరించినట్లు చెప్పారు. రాహుల్ గాంధీతో మంచి సమావేశం జరిగిందని, కాంగ్రెస్‌ పార్టీలో చేరిన అనంతరం లోక్‌సభ స్పీకర్‌ను కలిసి రాజీనామా సమర్పిస్తానని చెప్పారు. 23న మేడ్చల్‌ సభలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ సమక్షంలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు కుంతియా మీడియాకు తెలిపారు.

శంకరా ఏమి నీ రాజకీయం..?

  తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితా ఆ పార్టీలో కలకలం సృష్టించింది. టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు నేతలు రెబల్స్ గా మారి నామినేషన్ వేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ మంత్రి డాక్టర్‌ పి. శంకర్‌రావు కూడా షాద్ నగర్ టికెట్ ఆశించారు. కానీ కాంగ్రెస్ ఈ స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డికి కేటాయించింది. దీంతో అసహనానికి గురైన శంకర్‌రావు అసంతృప్తి వ్యక్తం చేస్తూ రెబల్ గా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. శంకర్‌రావు గతంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి మంత్రిగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. అయితే 2009లో షాద్‌నగర్‌ స్థానం జనరల్‌ కేటగిరికి మారడంతో ఆయన సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మంత్రిగా కూడా పని చేశారు.కానీ 2014 లో శంకర్‌రావుకు అధిష్టానం టికెట్ నిరాకరించడంతో పోటీకి దూరంగా ఉన్నారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు ,రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో షాద్‌నగర్ లో పోటీ చేస్తానంటూ ముందుకొచ్చారు. పార్టీ టికెట్ ఇవ్వకపోవటంతో రెబల్ అభ్యర్థిగా పోటీ చేయడానికి షాద్‌నగర్‌ ఆర్డీవో, రిటర్నింగ్‌ అధికారి కృష్ణకు నామినేషన్‌ సమర్పించారు. అనంతరం సమాజ్‌వాదీ పార్టీలో చేరి ఆ పార్టీ తరపున నామినేషన్ వేశారు. ఆయన సతీమణి విశ్వశాంతి చేత కూడా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేయించారు. అయితే కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి వెంటనే సమాజ్‌వాదీ పార్టీకి రాజీనామా చేయాలని ఫోన్‌ రావడం.. కాంగ్రెస్ లో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆయన షాద్‌నగర్‌కు తన కూతురుతో కలిసి వచ్చి సమాజ్‌వాదీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే షాద్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి సమాజ్‌వాదీ పార్టీ తరఫున వేసిన నామినేషన్‌ను, తన సతీమణి విశ్వశాంతి స్వతంత్ర అభ్యర్థిగా వేసిన నామినేషన్‌ను ఉపసంహరించుకుంటానని వెల్లడించారు. కాంగ్రెస్, మహాకూటమి తరఫున బరిలోకి దిగే అభ్యర్థుల గెలుపుకు తాను కృషి చేస్తానని శంకర్‌రావు స్పష్టం చేశారు .ఈ పరిణామంతో ఆయనకు టికెట్ కేటాయించిన సమాజ్‌వాది పార్టీ షాకయింది. దీంతో శంకరా ఏమి నీ రాజకీయం అని పలువురు ఆశర్యం వ్యక్తం చేస్తున్నారు.

జగన్, కేసీఆర్‌, పవన్‌.. ముగ్గురి టార్గెట్ ఒక్కటే

  తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రజలు తమ నియోజకవర్గాలకు రానివ్వని పరిస్థితి నెలకొందని.. స్వయంకృతాపరాధమే దీనికి కారణమని చంద్రబాబు అన్నారు. నిత్యం అందుబాటులో ఉంటే ప్రజల నుంచి తిరస్కారం ఉండేది కాదని అన్నారు. సమర్థంగా పని చేసినంత వరకు ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తారని గుర్తు చేశారు. బీజేపీ సీబీఐని కలెక్షన్ బ్యూరోగా మార్చేసిందని మండిపడ్డారు. సీబీఐలో పీఎంవో జోక్యంపై ఆ శాఖ అధికారే వెల్లడించారని చెప్పారు. బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్, జనసేన ఒకే తానులో గుడ్డలని విమర్శించారు. జగన్, కేసీఆర్‌, పవన్‌ అజెండా ఒక్కటేనని అన్నారు. ఆ ముగ్గురూ మోదీని విమర్శించరని, టీడీపీనే టార్గెట్‌ చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీయేతర పార్టీలు ఏకతాటిపైకి రాకూడదనేదే వారి అజెండా అని విమర్శించారు. రాష్ట్రాన్ని వదిలేసి దేశంలో తిరుగుతున్నానన్నది అసత్యమని, ఏపీని అన్నిరంగాలలో నెంబర్ వన్ చేశానని, ఆ తర్వాతే దేశంపై దృష్టి పెట్టానని స్పష్టం చేశారు. తాను ప్రధాని అవుతానని ఎవరూ మాట్లాడవద్దని సూచించారు. తన సామర్ధ్యం మన రాష్ట్రానికే ఉపయోగపడాలని ఆకాంక్షించారు. ప్రపంచంలోనే ఏపీ నెంబర్ వన్ కావాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వంపై 76శాతం సంతృప్తి ప్రజల్లో ఉందని పేర్కొన్నారు. ఆ 76 శాతం మంది ఓట్లేస్తే ప్రత్యర్ధులకు డిపాజిట్లు కూడా రావని చంద్రబాబు అన్నారు.

బాలకృష్ణ ఇంటి వద్ద చెత్త.. కార్మికుల నిరసన

  అనంతపురం జిల్లా హిందూపురంలో నటుడు,ఎమ్మెల్యే  నందమూరి బాలకృష్ణ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పారిశుద్ధ్య కార్మికులు ఆయన ఇంటివద్ద ఆందోళనకు దిగారు. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 279ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే హిందూపురం మున్సిపాలిటిలో విధుల నుంచి తప్పించిన 220 మంది కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. బాలకృష్ణ ఇంటి వద్ద పెద్ద ఎత్తున చెత్త వేసి వారు తమ నిరసన తెలిపారు. అనంతరం ఇంటిలోకి దూసుకెళ్లిన ఆందోళనకారులు తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకొని అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పలువురు కార్మికులు గాయపడ్డారు. కాగా మున్సిపల్‌ కార్మికుల ఆందోళనలో పాల్గొన్న సీఐటీయూ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. జీవో నెంబరు 279 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు గతంలో రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వంతో చర్చల అనంతరం 15 రోజుల తర్వాత సమ్మె విరమించారు. 279 జీవో రద్దుకు ప్రభుత్వం ఒప్పుకుందని కార్మికులకు యూనియన్ లీడర్లు సర్దిచెప్పడంతో సమస్య సద్దుమణిగింది. కానీ ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని, 279 జీవో ప్రకారమే పని చేయాలని మున్సిపల్ కమిషనర్లు స్పష్టం చేయడంతో ఐదు రోజుల క్రితం కార్మికులు మళ్లీ సమ్మెలో దిగారు. ఇందులో భాగంగానే బాలకృష్ణ ఇంటిని చుట్టుముట్టారు.

కాంగ్రెస్ పై కోదండరాం అసంతృప్తి

  మహాకూటమిలో సీట్ల సర్దుబాటు అనే ఘట్టం ముగిసింది కానీ నామినేషన్ల గడువు ముగిసినా ఇంకా కొన్ని స్థానాల్లో సందిగ్దత మాత్రం కొనసాగుతుంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే సుమారు 11 స్థానాల్లో కూటమిలోని పార్టీల మధ్య స్నేహపూర్వక పోటీ తప్పేలా లేదు. అయితే ఈ పరిస్థితికి కారణం కాంగ్రెస్ పార్టీనే అని కోదండరాం కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన ఈ విషయంపై మాట్లాడుతూ.. బీసీల కోసం తాము జనగామ స్థానాన్ని వదులుకున్నామనీ, కానీ కాంగ్రెస్‌ మాత్రం తాము కోరుకున్న మిర్యాలగూడలో బీసీ నేత ఆర్‌.కృష్ణయ్యను రంగంలోకి దించిందని.. కృష్ణయ్య పోటీపై తమకు కనీస సమాచారం కూడా లేదని అన్నారు. కూటమిలో భాగస్వామ్య పక్షాలకు సీట్లు సర్దుబాటు చేయడంలో కాంగ్రెస్‌ జాప్యం చేయడంవల్ల కొంత నష్టం జరిగిందని అభిప్రాయపడ్డారు. ఆఖరి నిమిషం వరకూ స్పష్టత లోపించిన కారణంగానే 14 చోట్ల అభ్యర్థులను నామినేషన్‌ వేయించాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్‌ మాకు 8 సీట్లు ఇస్తామంది. కానీ 6 మాత్రమే ఇచ్చింది. సీట్ల సర్దుబాటు సరిగా జరగలేదు. అందరినీ ఒప్పించే పరిస్థితి ఉంటేనే జనగామ ఇవ్వమని కోరాను. కానీ అది రాద్ధాంతమైంది. బీసీలకు నా వల్ల నష్టం కలగకూడదనే పోటీ నుంచి తప్పుకున్నాను. తప్పనిసరి పరిస్థితుల్లో అయితే ఒకట్రెండు స్థానాల్లో స్నేహపూర్వక పోటీ పెడతామని కాంగ్రెసే ప్రతిపాదించింది. మేం ఒప్పుకోలేదు. మాకు కేటాయించిన 8 సీట్లు ఏవో స్పష్టం చేసి.. ఆ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఆ పార్టీదే. కూటమి అభ్యర్థులు పరస్పరం పోటీ పడడం వల్ల నష్టం తప్ప లాభం ఉండదు. ఒకవేళ కాంగ్రెస్‌ నుంచి స్పష్టత రాకపోతే స్నేహపూర్వక పోటీ తప్పకపోవచ్చు అని తెలిపారు. కూటమి ఉమ్మడి ఎన్నికల ప్రణాళికను త్వరలోనే ప్రజల ముందుకు తీసుకొస్తామని అన్నారు. మేడ్చల్‌లో సోనియాగాంధీ సభలో తాను పాల్గొంటానని కోదండరాం తెలిపారు. దీన్నిబట్టి చూస్తుంటే కోదండరాం ఏదేమైనా కూటమిలో కొనసాగి, టీఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి కోదండరాం ఆశ నెరవేరుతుందో లేదో.

సీఎం రేసులో జైపాల్ రెడ్డి లేరు

  కాంగ్రెస్ ఎన్నో ఏళ్ల చరిత్రతో పాటు ఎందరో నాయకులున్న పార్టీ. మిగతా పార్టీలతో పోల్చుకుంటే ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్లు ఆశించేవారు కాంగ్రెస్ లో ఎక్కువగా ఉంటారు. అంతేకాదు సీఎం పదవి కోసం కూడా కాంగ్రెస్ లో ఆశావహులు ఎక్కువగా ఉంటారు. అంతెందుకు ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది కదా. అధికారంలోకి వస్తే సీఎం ఎవరవుతారు అంటే మినిమమ్ ఐదుగురి పేర్లు వినిపిస్తాయి. వారిలో సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. అయితే ఆయన సీఎం రేసులో లేనని చెప్తున్నారు. శేరిలింగంపల్లి టిక్కెట్ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్‌ నివాసానికి జైపాల్ రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఆయనతో తనకున్న చనువుతోనే వచ్చానని తెలిపారు. భిక్షపతి లాంటి మంచి వ్యక్తిని వదులుకోవద్దని కాంగ్రెస్‌ అధిష్ఠానానికి చెబుతున్నానన్నారు. కిందిస్థాయి నుంచి భిక్షపతి నాయకుడిగా ఎదిగారని కొనియాడారు. అదేవిధంగా తెలంగాణలో మహాకూటమికి బ్రహ్మండమైన మెజారిటీ వస్తుందని జైపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తాను మాత్రం ముఖ్యమంత్రి రేసులో లేనని స్పష్టంచేశారు. గతంలో కేంద్రమంతిగా పనిచేశాననీ, అది తనకు చాలని వ్యాఖ్యానించారు.

రేవంత్ చెప్పింది నిజమే..టీఆర్ఎస్ కి షాక్

  కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొన్ని రోజుల క్రితం టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంటనే అప్రమత్తమైన టీఆర్ఎస్ అధిష్టానం.. పార్టీకి,ప్రచారానికి దూరంగా ఉంటున్న చేవెళ్ల ఎంపీ కొండా విశేశ్వరరెడ్డి,మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ లను ప్రగతిభవన్ కి పిలిచిమరీ హెచ్చరించారు. అంతా రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ ,పార్టీ మారేది లేదని మీడియాకి వివరణ ఇమ్మని ఆదేశించారు. అనంతరం ఆ ఇద్దరు ఎంపీలు అధిష్టానం ఆదేశాల మేరకు మీడియాకి పార్టీ మారటంలేదని స్పష్టం చేశారు. కానీ అనూహ్యంగా కొండా విశేశ్వరరెడ్డి టీఆర్ఎస్ పార్టీ కి షాక్ ఇచ్చారు. తాజాగా ఆయన పార్టీకి రాజీనామా చేశారు.రాజీనామాతోపాటు మూడు పేజీల లేఖను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు పంపారు. లోక్‌సభ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.ఇవాళ ఉదయం 11 గంటలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో ఆయన భేటీ కానున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి కుంతియాతో కలిసి విశ్వేశ్వర్‌రెడ్డి రాహుల్‌గాంధీ నివాసానికి వెళ్లనున్నారు. రాహుల్‌ను కలిసి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను ఆయన వివరించనున్నారు. ఈ నెల 23న మేడ్చల్‌ సభలో రాహుల్‌గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పట్నం మహేందర్‌రెడ్డితో నెలకొన్న విభేదాలే విశ్వేశ్వర్‌రెడ్డి పార్టీ మారటానికి కారణమని తెలుస్తుంది.

కొడుకుపై విజయానికి తండ్రి మద్దతు కోరిన నేత

  కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు కంచుకోట అయిన ఖమ్మం అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకొని,తొలిసారిగా తమ పార్టీ జెండా ఎగురవేయాలని టీఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తుంది. టీడీపీ కూడా కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే లోక్ సభ,అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నప్పటికీ ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ మద్దతు ఉండటంతో టీడీపీ గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తం చేస్తుంది.ఈ రెండు పార్టీల మధ్య ఓ సీనియర్ సీపీఐ నేత నలిగిపోతున్నారు. ఆయనే ఖమ్మం మాజీ ఎమ్మెల్యేగా, ఆ పార్టీ శాసనసభా పక్షనేతగా పనిచేసిన పువ్వాడ నాగేశ్వరరావు. గత ఎన్నికల్లో అయన తనయుడు అజయ్‌ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి అప్పటి టీడీపీ నేత తుమ్మల నాగేశ్వరరావును ఓడించారు. రెండేళ్లు కాంగ్రెస్ లోనే కొనసాగి ఆ తర్వాత తన మిత్రుడు మంత్రి కేటీఆర్‌ ఆహ్వానం మేరకు టీఆర్ఎస్ లో చేరారు. ఆయన ఇప్పుడు కూడా టీఆర్ఎస్ తరుపున ఎన్నికల బరిలో ఉన్నారు. మరోవైపు గతంలో ఖమ్మం ఎంపీ గా పనిచేసిన టీడీపీ నేత నామా నాగేశ్వరరావు ప్రస్తుత ఎన్నికల్లో అజయ్ కి ప్రత్యర్థిగా కూటమి తరుపున పోటీ చేస్తున్నారు. దీంతో పువ్వాడ నాగేశ్వరరావు సందిగ్ధంలో పడ్డారు. టీఆర్ఎస్ తరుపున పోటీ చేస్తున్న కొడుకు తరుపున మొగ్గుచూపుతారా లేక కూటమి ధర్మానికి కట్టుబడి నామా తరపున ప్రచారం చేస్తారా..? అనే చర్చ నియోజకవర్గం వ్యాప్తంగా సాగుతోంది.ఈ నేపథ్యంలోనే నామ నాగేశ్వరరావు పువ్వాడ నాగేశ్వరరావును ఆయన నివాసానికి వెళ్లి కలిసి మద్దతు కోరారు. అయితే తాను సీపీఐ నేతగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తానని, ప్రజాకూటమి ధర్మాన్ని పాటిస్తానని నామాకి  పువ్వాడ నాగేశ్వరరావు హామీ ఇచ్చినట్టు సమాచారం.సీపీఐ నేతగా ఖమ్మంలో చక్రం తిప్పిన పువ్వాడ నాగేశ్వరరావు కూటమికి మద్దతు ఇస్తారో లేక కొడుకు పక్కన నిలుస్తారో వేచి చూడాల్సిందే..

సుహాసిని నామినేషన్...లోకేష్ రియాక్షన్

  కూకట్ పల్లి అభ్యర్థిగా టీడీపీ పార్టీ తరుపున నందమూరి సుహాసిని నామినేషన్ వేశారు.నందమూరి బాలకృష్ణ దగ్గరుండి సుహాసిని చేత నామినేషన్ వేయించారు. సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్.. తమ అక్కకు మద్దతివ్వాలంటూ ట్విట్టర్‌ ద్వారా ఓటర్లను అభ్యర్థించారు. ఎన్టీఆర్, హరికృష్ణ వారసురాలిగా రాజకీయాల్లోకి వస్తున్న సుహాసినికి నందమూరి,నారా కుటంబాలు అండగా నిలుస్తున్నాయి. తాజాగా ఏపీ మంత్రి నారా లోకేశ్ కూడా సుహాసినికి మద్దతు కోరుతూ ట్వీట్ చేశారు. ‘‘పేదల పెన్నిధిగా, బడుగు వర్గాలకు ఆత్మీయునిగా సేవలందించిన ఎన్టీఆర్‌ను తెలంగాణ ప్రజలు గుండెకు హత్తుకున్న తీరు మరువలేనిది. ఈ గడ్డపై పార్టీ పెట్టిన ఎన్టీఆర్, ఈ గడ్డపైనే అమరులయ్యారు. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ సైతం తెలంగాణలోనే ఆఖరిశ్వాస తీసుకున్నారు. ఈరోజు ఎన్టీఆర్, హరికృష్ణల వారసురాలు నందమూరి సుహాసిని, తాతగారి ఆశయాలతో, తండ్రి ఆకాంక్షలతో, మావయ్య చంద్రబాబు గారి ఆశీస్సులతో ప్రజలకు సేవచేసేందుకు ముందుకొచ్చారు. ఆమెను అఖండ మెజారిటీతో గెలిపించి ఎన్టీఆర్, హరికృష్ణలకు అసలైన నివాళి అందించాలని కూకట్‌పల్లి నియోజకవర్గ ప్రజలను కోరుతున్నాను.’’ అంటూ నారా లోకేశ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.  

టీజేఎస్ తొలి విడుత అభ్యర్థులు వీరే..!!

  మహాకూటమిలో కాంగ్రెస్,టీడీపీ,సీపీఐ పార్టీలు తమ పార్టీల తరుపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తూ వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు టీజేఎస్ మాత్రం తమ పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించలేదు. అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు గడువు కూడా ముగియనుండటంతో ఆ పార్టీ తాజాగా తొలి విడుత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. మిగతా స్థానాలను రేపు ప్రకటిస్తామని ఆ పార్టీ తెలిపింది. మహాకూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా కాంగ్రెస్‌ 94, తెదేపా 14, తెజస 8, సీపీఐ 3 స్థానాల్లో బరిలోకి దిగనున్నాయి. టీజేఎస్ తొలి విడుత అభ్యర్థుల జాబితా: 1. మల్కాజ్‌గిరి- కపిలవాయి దిలీప్‌కుమార్‌ 2. దుబ్బాక- రాజ్‌కుమార్‌ 3. సిద్దిపేట- భవానీరెడ్డి 4. మెదక్‌- జనార్దన్‌రెడ్డి

2004లో అభిమానం..2014లో అసహ్యం..

  తెలుగు దేశం పార్టీ,నాయకులపై విమర్శలు చేయటంలో కయ్యానికి కాలు దువ్వుతారు వైసీపీ ఎమ్మెల్యే రోజా.రోజా ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నప్పకిటికీ ఆమె భర్త సెల్వమణి రాజకీయాలపై మాట్లాడిందిగానీ, సభల్లో కనిపించిన దాఖలాలు గానీ ఎక్కడా లేవు. కానీ తాజాగా ఆయన చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నగరిలో వైసీపీ నిర్వహించిన సభలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ.... కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి చంద్రబాబుకు సిగ్గు, శరం లేదంటూ ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఒకప్పటి చంద్రబాబుకి, ఇప్పటి చంద్రబాబుకి చాలా తేడా ఉందని, నమ్మక ద్రోహిగా ఆయనను వర్ణించారు. 2004లో చంద్రబాబును అభిమానించానని, కానీ 2014లో ఆయన అసలు స్వభావం తెలిసి అసహ్యించుకున్నానని ఆయన తెలిపారు. వైఎస్సార్‌సీపీ తరుఫున గెలిచిన ఎమ్మెల్యేలకు టీడీపీ ప్రభుత్వం నరకం చూపిస్తోందని ఆయన పేర్కొన్నారు. నియోజవర్గానికి తాను చేసిన అభివృద్ధి ఏంటో తెలుకునేందుకు మై ఎమ్మెల్యే యాప్‌ను రోజా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ... రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారని,దొంగలు, రౌడీలు, జన్మభూమి కమిటీలో సభ్యులుగా ఉన్నారని ఆరోపించారు. ప్రజలకు సేవచేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని,తమ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదని ఆమె మండిపడ్డారు.

విశాఖలో రూ.60 కోట్లతో ధోనీ క్రికెట్ అకాడమీ

  మహేంద్రసింగ్ ధోనీ విశాఖ సాగర తీరంలో రూ.60 కోట్ల వ్యయంతో క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేయబోతున్నాడు. మొదటినుంచి ధోనీకి విశాఖ అంటే ప్రత్యేక అభిమానం. 2005లో పాకిస్థాన్‌తో రెండో వన్డే ఆడేందుకు విశాఖలో అడుగుపెట్టిన ధోనీ 123 బంతుల్లో ఏకంగా 148 పరుగులు చేసి ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఈ మ్యాచ్ తర్వాత ధోనీ ఇక వెనుదిరిగి చూసుకోలేదు. తనకు అచ్చొచ్చిన విశాఖ అంటే అప్పటి నుంచి ధోనీకి అభిమానం. విశాఖ ఎంతో అందమైన నగరమని, అక్కడ ఉండడమంటే తనకెంతో ఇష్టమని ఓ సందర్భంలో చెప్పాడు. ఇప్పుడు ఏకంగా అకాడమీనే ఏర్పాటు చేసి నగరంతో తన బంధాన్ని మరింత పటిష్టం చేసుకోబోతున్నాడు. తాజాగా ధోనీ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా ధోనీకి చెందిన ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ మిహిర్ దివాకర్.. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి గంటా శ్రీనివాస్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందంలో భాగంగా పూర్తి అంతర్జాతీయ ప్రమాణాలతో రెండు దశల్లో క్రికెట్ అకాడమీతోపాటు ఇంటర్నేషనల్ స్కూల్‌ను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు, ఇతర క్రీడలకూ ఉపయోగపడేలా ఇండోర్, ఔట్ డోర్ స్టేడియాలను నిర్మించనున్నారు.

ఇల్లు లేదు..కారు లేదు..ఆస్తి రూ.300 కోట్లు

  రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో అఫిడవిట్లో పొందుపరిచే అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఒక్కోసారి నిజామా అనేలా నమ్మశక్యం కాకుండా ఉంటాయి. తాజాగా ఓ కాంగ్రెస్ నేత అఫిడవిట్లో పొందుపరిచిన ఆస్తులు,అప్పుల వివరాలు అలానే ఉన్నాయి. మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల నామినేషన్ దాఖలు చేశారు. కోమటిరెడ్డి అఫిడవిట్‌ పత్రాల్లో చూపించిన ఆస్తుల వివరాలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న లెక్కల ప్రకారం కోమటిరెడ్డి, ఆయన భార్య పేరిట ఉన్న ఆస్తుల విలువ మొత్తం కలిపి రూ. 300 కోట్లకు పైమాటే. అయితే ఆయనకి సొంత ఇల్లు గానీ,కారు గానీ లేదట. కోమటి రెడ్డి పేరు మీద సుమారు రూ. 7కోట్ల విలువైన కమర్షియల్ భవనాలు, ఆయన భార్య పేరున సుమారు రూ. 13 కోట్లు విలువ చేసే రెండు భవనాలు ఉన్నట్లు అఫిడవిట్‌లో స్పష్టం చేశారు.కానీ ఆయన పేరు మీద సొంత ఇల్లు గానీ,కారు గానీ లేవని పేర్కొన్నారు. కోమటిరెడ్డి సంవత్సర ఆదాయం రూ.34లక్షలు, ఆయన భార్య లక్ష్మీ సంవత్సర ఆదాయం రూ.1.1కోట్లు, చరాస్తులు...రాజగోపాల్ రెడ్డి పేరిట రూ.5కోట్లు, లక్ష్మీ పేరిట ఉన్న ఆస్తుల విలువ రూ.261కోట్లు, స్థిరాస్తులు...రాజగోపాల్‌రెడ్డి పేరిట రూ. 19.5 కోట్లు, లక్ష్మీ పేరిట రూ. 28 కోట్లు, అప్పులు...రాజగోపాల్ పేరిట రూ. 23 లక్షలు లక్ష్మీ పేరిట రూ. 6.4 లక్షలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. తనపై ఇంతవరకూ ఎలాంటి క్రిమినల్ కేసు లేదని అఫిడవిట్లో స్పష్టం చేశారు.