3584 - 1760 =1824 ..మహిళలు..?
posted on Nov 23, 2018 @ 11:38AM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగిసింది. బుజ్జగింపులు, హామీలతో కొన్ని స్థానాలు మినహా మెజార్టీ స్థానాల్లో రెబల్స్ కూడా వెనక్కి తగ్గారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాలున్న తెలంగాణ ఎన్నికలో బరిలో పోటీపడేది ఎంతమంది అనేదానిపై ఈసీ స్పష్టత ఇచ్చింది . ముందస్తు ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 3,584 నామినేషన్లు దాఖలు కాగా... మొత్తం 1,760 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో తుది పోరుకు 1,824 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. టీఆర్ఎస్ 119, కాంగ్రెస్ 100, టీడీపీ 13, తెలంగాణ జన సమితి 8, సీపీఐ 3, బీజేపీ 118, ఎంఐఎం 8, బీఎల్‌ఎఫ్ 119, మిగతా వారిలో బీఎప్పీ, ఎస్పీ, స్వతంత్ర అభ్యర్థులు రంగంలో ఉన్నారు.
మరోవైపు మహిళల గురించి గొప్పలు చెప్పే పార్టీలు మహిళలకు ఎన్ని స్థానాలు కేటయించాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. నామినేషన్ల పర్వం ముగిసిన అనంతరం తుది జాబితా ప్రకారం బరిలో ఉన్న మహిళలు కేవలం 43 మాత్రమే. ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా లేకుండా అందరూ మహిళలకు సీట్లు కేటాయించటంలో విఫలం అయ్యారు.119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న అధికార టీఆర్ఎస్ పార్టీ మహిళలకు కేటాయించిన స్థానాలు నాలుగు మాత్రమే.కాగా మహాకూటమి తరపున 14 మంది (కాంగ్రెస్ 11, టీడీపీ 1, టీజేఎస్ 1, సీపీఐ 1) బరిలో నిలిచారు. భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీల కంటే అధిక సంఖ్యలో 15 సీట్లు కేటాయించింది. సీపీఎం, బీఎల్‌ఎఫ్ కూటమి 10 మంది మహిళా అభ్యర్థులను రంగంలోకి దింపింది. పాతబస్తీలో బలమైన పార్టీగా ఉన్న మజ్లిస్ పార్టీ మాత్రం ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వలేదు. పట్టుమని 50 మంది మహిళలు కూడా బరిలో లేకపోవటం గమనార్హం.