రాజీవ్ గాంధీ..ఎన్టీఆర్..రేవంత్ రెడ్డి
posted on Nov 24, 2018 @ 12:45PM
తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం కేసీఆర్‌పై పోరాటం చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పించిందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డికి విమర్శించడమే కాదు.. పాలన ఎలా చేయాలో కూడా తెలుసన్నారు. 'రేవంత్‌రెడ్డికి ఏం అనుభవం ఉందని కొందరు అంటున్నారు. పార్టీ పెట్టినప్పుడు ఎన్టీఆర్‌కు, అత్యవసర పరిస్థితుల్లో ప్రధాని పదవి చేపట్టేటప్పుడు రాజీవ్‌గాంధీకి కూడా ఏం అనుభవం ఉంది. అలాంటిది ఎన్టీఆర్, రాజీవ్‌గాంధీ ప్రజాసేవలో ప్రజాదరణ పొందారు. విద్యార్థి ఉద్యమాలు, రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన అనుభవం నాకు ఉంది. పాలనాపరమైన అంశాల్లో సుస్పష్టమైన ఆలోచనా విధానం నా వద్ద ఉంది’’ అని రేవంత్ అన్నారు.
తెరాస అజెండానే ప్రజల అజెండాగా కేసీఆర్ భ్రమలు కల్పించారని, అన్ని వర్గాలను మభ్యపెట్టి తన వైపునకు తిప్పుకున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.నీళ్లు, నిధులు, నియామకాలు ప్రజల నినాదం అని, టీఆర్‌ఎస్‌ది కాదన్నారు. రాజకీయ మనుగడ కోసం ఈ నినాదాన్ని విస్తరింపజేసి ప్రజల భావోద్వేగాలను పార్టీకోసం కేసీఆర్ వాడుకున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు. అలాగే స్వయం పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, టీఆర్‌ఎస్ పాలనలో సామాజిక న్యాయం జరగలేదని, పటేల్, పట్వారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడారని, కేసీఆర్ మార్క్ పాలనను ప్రజలపై రుద్దారని ఆయన అన్నారు. కేసీఆర్ డిక్షనరీలో సామాజిక న్యాయం అనే పదమేలేదని, మహిళలకు కనీస మర్యాద, గౌరవం ఇవ్వకపోవడం దారుణం అన్నారు. నక్సలైట్ల అజెండానే మా అజెండా అని కేసీఆర్ అన్నారని, కొడుకు మంత్రి, కూతురు ఎంపీ కావాలని ఏ నక్సలైట్ అజెండాలో ఉందని రేవంత్‌రెడ్డి అన్నారు.
నా కూతురు నిశ్చితార్థానికి నన్ను రాకుండా అడ్డుకొని తండ్రీకొడుకులు(కేసీఆర్, కేటీఆర్) పైశాచికానందం పొందాలనుకున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రేవంత్‌రెడ్డి తమను పరుష పదజాలంతో దూషిస్తున్నారని కేసీఆర్ కుటుంబం అంటోంది. పరుష పదజాలంతో విమర్శించింది కేసీఆరే. సోనియాగాంధీని అమ్మనా? బొమ్మనా? అని కేసీఆర్ దూషించడం వ్యక్తిగత విమర్శ కాదా? మా పిల్లలను కూడా దూషిస్తున్నారని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ కుమారుడిని విమర్శించాల్సిన అవసరం మాకు లేదు. పాఠశాలకు వెళ్లే విద్యార్థి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడం సరైందేనా? ప్రభుత్వం తరఫున భద్రాచలం రాములవారి వద్దకు సీఎం మనవడిని పంపించడం దేవుడిని అవమానించడం కాదా? అని ప్రశ్నించారు.