హరీష్ రావు, కేటీఆర్‌ చర్చకు సిద్ధమా?

  రాజన్నసిరిసిల్ల జిల్లాలోని చందుర్తిమండలంలో నిర్వహించిన కాంగ్రెస్‌ ప్రజా చైతన్య సభలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పై విమర్శల వర్షం కురిపించారు. టీఆర్ఎస్ అభ్యర్థి చెన్నమనేని రమేష్ బాబు గెలిచినా, ఓడినా ఆయన జర్మనీలోనే ఉంటారని ఎద్దేవా చేశారు. కేవలం సెలవుల్లోనే ఆయన ఇక్కడకు వస్తారన్నారు. నిత్యం ప్రజల్లో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌ను గెలుపించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఇచ్చిన దేవత అని సోనియా గాంధీ అని స్వయంగా కేసీఆరే అన్నారని, తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన 1569 అమరుల కుటుంబాలకు కేసీఆర్‌ ఏం న్యాయం చేశారని రేవంత్‌ ప్రశ్నించారు. సమగ్ర కుటుంబ సర్వేతో ఏం సాధించారని ప్రశ్నించారు. తెలంగాణ అమరవీరుల వివరాల కోసం ఒక్క కాలమ్‌ కూడా అందులో కేటాయించలేదని.. పైగా, కుటుంబంలో కోళ్లు, కుక్కలు ఎన్ని ఉన్నాయన్న వివరాలు అడిగారని మండిపడ్డారు. తెలంగాణ ద్రోహులైన తలసాని, తుమ్మలకు మంత్రి మంత్రి పదవులు.. దానం నాగేందర్‌కు ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చారని దుయ్యబట్టారు. మందుపోసిన సంతోష్‌కు పదవి ఇచ్చారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ఒక్క దొరైనా బలిదానం చేసుకున్నాడా? అని ప్రశ్నించారు. త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణను రాబందుల్లా పీక్కుతింటున్నారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల రీడిజైన్ల పేరిట కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ఆరోపించారు. ప్రపంచ చరిత్రలోనే స్వాతంత్య్రం కోసం పోరాటాలు చేసిన వారెవరూ ఆస్తులు కూడబెట్టుకోలేదని, కేసీఆర్‌ మాత్రం వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. తెలంగాణను ఎవరు అభివృద్ధి చేశారనే అంశంపై అమరవీరుల స్తూపం వద్ద హరీష్ రావు, కేటీఆర్‌ చర్చకు సిద్ధమా? అని సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.2లక్షల కోట్లు ఖర్చు చేశారని, ఆ నిధులు ఎక్కడికి పోయాయన్నారు. తెలంగాణలో లక్ష ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్‌ ఉద్యోగం ఊడగొట్టాలని అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే 58 ఏళ్లు నిండిన భార్యా భర్తలకు ఒక్కొక్కరికి రూ.2వేలు చొప్పున పింఛను ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళల్ని లక్షాధికారులుగా మారుస్తామన్నారు.

సింహం సింగిల్ గా వస్తుంది: కేటీఆర్

  సోమాజిగూడలో తెరాస అభ్యర్థి దానం నాగేందర్‌కు మద్దతుగా కేటీఆర్‌ రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాకూటమి మీద విమర్శలు గుప్పించారు. తెలంగాణలో నాలుగు పార్టీలు ఒక వ్యక్తిని ఓడించేందుకు కలిశాయంటే.. ఎవరు బలవంతులో అర్థం చేసుకోవాలని కోరారు. ప్రజాకూటమి పొరపాటున గెలిస్తే నెలన్నరకో సీఎం మారతాడని ఎద్దేవా చేశారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు డబ్బా ఇళ్లు కట్టిస్తే.. టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టించిందని అన్నారు. కేసీఆర్‌ను ఓడించేందుకు నాలుగు పార్టీలు ఏకమయ్యాయని.. అయితే సింహం ఎప్పుడూ సింగిల్‌గానే వస్తుందని అన్నారు. పేదవారికి సంక్షేమ పథకాలు కొనసాగాలంటే దమ్మున్న నాయకుడు కేసీఆర్‌ తిరిగి అధికారంలోకి రావాలన్నారు. కూటమిలో సీఎంను నిర్ణయించాలంటే ఢిల్లీ నుంచి నిర్ణయించాలని.. అదీ సీల్డ్‌ కవర్‌లోనని విమర్శించారు. తెలంగాణకు సీల్డ్‌ కవర్‌ సీఎం కావాలా?.. లేదా తెలంగాణ మట్టిలో పుట్టిన సింహంలాంటి కేసీఆర్‌ సీఎం కావాలా? ప్రజలే తేల్చుకోవాలని కేటీఆర్‌ కోరారు.

విశ్వేశ్వర్‌రెడ్డికి మతిస్థిమితం లేదు

  టీఆర్ఎస్ నేతలపై ఎంపీ విశ్వేశ్వర్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మహబూబ్‌నగర్‌ ఎంపీ జితేందర్‌ రెడ్డి ఖండించారు. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విశ్వేశ్వర్‌ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ,నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అంతేకాకుండా జితేందర్‌ రెడ్డి , ఎంపీ కేకే టీఆర్ఎస్ పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారని వ్యాఖ్యానించారు. మరికొందరు ఎంపీలు,ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరటానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై జితేందర్‌ రెడ్డి స్పందించారు. మంత్రి మహేందర్‌ రెడ్డితో విభేదాలు ఉండటం వల్లే విశ్వేశ్వర్‌ రెడ్డి టీఆర్ఎస్ ను వీడారని జితేందర్‌ రెడ్డి తెలిపారు. రాజకీయం సరిగా రాదని, తానొక వ్యాపారవేత్తనని ఆయనే తన రాజీనామా లేఖలోనే పేర్కొన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత సీఎం కేసీఆర్‌ను విమర్శించడం, కుటుంబ పాలన చేస్తున్నారని అనడం, తన సొంత నిర్ణయాలను తెరాస ఎంపీలపై రుద్దుతారంటూ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. తనతో పాటు ఎంపీ కేకే అసంతృప్తితో ఉన్నామని చెప్పడంలో వాస్తవం లేదని స్పష్టంచేశారు. విశ్వేశ్వర్ రెడ్డి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పార్టీలో కేసీఆర్ తమకు సముచిత స్థానం ఇచ్చారని తెలిపారు. ఇక, ఏ ఎంపీ కూడా టీఆర్ఎస్‌ను వీడబోరని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించి విశ్వేశ్వర్‌ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. మరి విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన జితేందర్‌ రెడ్డి పార్టీలో చేరతారా లేదో చూద్దాం..!!

తెలంగాణలో టీఆర్‌ఎస్‌,బీజేపీలకు వైసీపీ మద్దతు

  గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నకరికల్లు వద్ద ఐదు దశల్లో చేపట్టనున్న గోదావరి - పెన్నా నదుల అనుసంధానానికి తొలిదశ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. గోదావరి-పెన్నా అనుసంధానం.. నాగార్జునసాగర్‌ ఆయకట్టు స్థిరీకరణకు ఉపకరిస్తుందని, గుంటూరు జిల్లాలో తాగునీటి అవసరాలు తీరుతాయన్నారు. నదుల అనుసంధానంతో రాష్ట్రంలో కరవు అనేదే ఉండదని చంద్రబాబు వివరించారు. పంచనదుల మహా సంగమమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో 65శాతం పనులు పూర్తయ్యాయని, గ్రావెటీ ద్వారా నీళ్లు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. మరోవైపు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనపై చేస్తున్న విమర్శలపై చంద్రబాబు స్పందించారు. తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగుజాతిగా కలిసుండాలని తాను అంటుంటే కేసీఆర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చాడో అందరికీ తెలుసునని,ఆయనకు టీడీపీనే రాజకీయ జీవితం ఇచ్చిందన్నారు. గతంలో తన అనుచరుడుగా ఉన్న కేసీఆర్‌ తనను తిడుతుంటే బాధేసిందని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం రాత్రి, పగలు కృషి చేశానని, మైక్రోసాఫ్ట్, ఔటర్ రింగ్ రోడ్డ, ఎయిర్ పోర్టు, ఇంకా ఎన్నో సంస్థలు నగరంలో ఏర్పాటు కావడానికి టీడీపీ ప్రభుత్వమే కారణమన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌, బీజేపీలకు వైసీపీ పరోక్ష మద్దతు ఇస్తోందని చంద్రబాబు ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ఓడిపోయి ప్రజాకూటమి గెలిస్తేనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.  బీజేపీకి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని కూడా ఈ సందర్బంగా వివరించారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలను మోదీ పూర్తిగా దెబ్బతీశారని, ఆర్బీఐని కూడా వదలిపెట్టలేదని మండిపడ్డారు. దేశాన్ని కాపాడుకునేందుకు అన్ని పార్టీలను కలిపేందుకు ప్రయత్నిస్తున్నామని, తెలుగుజాతి కోసం శత్రవుతో చేతులు కలిపానని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ నమ్మించి మోసం చేసిందని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. దేశంలోని అన్ని పార్టీలను కలుపుకొని పోరాడుతున్నామన్నారు. రాష్ట్రం కోసం పోరాడుతున్న వారిపై కేంద్రం ఐటీ, ఈడీ దాడులు చేస్తోందని ఆయన విమర్శించారు. మోదీ నోట్లు రద్దు చేసి దేశాన్ని భ్రష్టుపట్టించారని, కేంద్రం ప్రభుత్వానికి అసహనం పెరిగిందని చంద్రబాబు విమర్శించారు.

50 వేలు తగ్గితే రాజీనామా

  హుజూర్‌నగర్‌ స్థానానికి టీఆర్‌ఎస్‌ టికెట్‌ను ఆశించి నిరాశ చెందిన అల్లం ప్రభాకర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు చిలకరాజు అజయ్‌కుమార్ తదితరులు పార్టీలో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి  కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. హుజూర్‌నగర్‌ ప్రజలపై తనకు ఎంతో విశ్వాసం ఉందని, 50వేల మెజార్టీతో గెలుపొందుతానన్న నమ్మకం ఉందన్నారు. మెజార్టీ తగ్గితే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని టీఆర్‌ఎస్ నేతలకు సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే హుజూర్‌నగర్‌ నియోజకవర్గ కేంద్రంలోని మట్టపల్లి క్షేత్రం కేంద్రంగా వేయి కోట్లతో టూరిజం ప్రాజెక్ట్‌గా అభివృద్ధి చేస్తానన్నారు. నాగార్జునసాగర్‌ టూరిజం ప్రాజెక్ట్‌ను తలదన్నేలా మట్టపల్లి ప్రాంతాన్ని సుందర రూపంగా తీర్చిదిద్దుతానన్నారు.హుజూర్‌నగర్‌ను ఎంతో అభివృద్ధి చేశానన్నారు. మంత్రి చెంచాలు, అనుచరులు, బంధువర్గం పేరుతో దందా చేయాలని చూస్తే సహించరన్నారు. కలెక్టరేట్‌ భూముల కుంభకోణాల్లో నిందితులు ప్రజల మనసులను గెలవలేరన్నారు. కాంగ్రెస్‌లో చేరిన టీఆర్‌ఎస్‌ నేతలకు ఎంతో ఘనమైన చరిత్ర ఉందన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుండి టీఆర్‌ఎస్‌లో ఉన్న నాయకులు చిలకరాజు అజయ్‌కుమార్‌ లాంటి వ్యక్తులు కాంగ్రెస్‌లో చేరడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

ఎన్నికల తర్వాత టీఆర్ఎస్, మహాకూటమి కలిసిపోతాయి

  బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు గత కొంతకాలంగా ఏదో ఒకటి మాట్లాడుతూ తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ మీద, మహాకూటమి మీద తనదైన శైలిలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కర్ణాటకలో లాగా తెలంగాణలోనూ బీజేపీని అధికారంలోకి రానీయకుండా చేసేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ తప్ప మిగిలిన అన్ని పార్టీలు ఒకే గూటికి చెందినవని, ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే టీఆర్ఎస్, మహాకూటమి కలిసిపోతాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహాకూటమిలోని అన్ని పార్టీలతో కేసీఆర్ గతంలో పొత్తు పెట్టుకున్నారని.. వీరందరితో ఆయనకు సత్సంబంధాలున్నాయని జీవీఎల్ ఎద్దేవా చేశారు. గతంలో కాంగ్రెస్ పరిపాలనలో ఇసుక మాఫీయా, రాజీవ్ గృహకల్పలో అక్రమాలపై కేసీఆర్ అనేక ఆరోపణలు చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటిని కేసీఆర్ మరచిపోయారు. ఎందుకంటే సోనియా, రాహుల్ పట్ల ఆయనకు ఎంతో అభిమానం ఉందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఒంటరిని చేయడానికి కాంగ్రెస్, టీడీపీ ప్రయత్నిస్తున్నాయని.. ఎవరెన్ని రకాలుగా ప్రయత్నించినా బీజేపీని ఏం చేయలేరని స్పష్టం చేశారు. మేడ్చల్ సభ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సోనియా గాంధీ పథకం వేశారని విమర్శించారు. 2013లో నాటి ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ నేతృత్వంలో కమిటీ వేసి ప్రత్యేకహోదాను రద్దు చేశారని జీవీఎల్ తెలిపారు. చట్టంలో లేనప్పటికీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక ప్యాకేజ్‌తో పాటు ఇతర మార్గాల ద్వారా ఏపీని ఆదుకున్నామని జీవీఎల్ స్పష్టం చేశారు.

మార్పు రాకుంటే ఆత్మ బలిదానమే..

  గత రాత్రి గజ్వేల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి గజ్వేల్‌ లో ఎన్నికల అధికారి కార్యాలయం వద్ద దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. తెరాస నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, విచ్చలవిడిగా మద్యాన్ని పారిస్తున్నారని ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. 'కుల, మత, సంఘాల సమావేశాలు నిర్వహిస్తూ డబ్బు ఎర చూపుతున్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇవన్నీ అధికారులకు కనిపించటం లేదా? ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. అప్పటి వరకు నేను పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను' అంటూ దీక్షకు దిగారు. కాగా పోలీసులు అక్కడకు చేరుకుని దీక్ష విరమించాలని కోరగా ఆయన నిరాకరించారు. ఆయన్ను అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించగా తీవ్రంగా ప్రతిఘటించారు. పెనుగులాటలో ప్రతాప్‌రెడ్డి శ్వాస పీల్చుకోవడం కష్టమై ఇబ్బంది పడ్డారు. తాను ఎక్కడికీ రానంటూ భీష్మించారు. పోలీసు జీపు ఎక్కడానికి నిరాకరించడంతో ఆయన కారులోనే గజ్వేల్‌ ఠాణాకు తరలించారు. పోలీసులతో మాట్లాడుతుండగానే ఆయన సొమ్మసిల్లి పడిపోవడంతో ప్రైవేట్‌ ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్‌  యశోదా ఆసుపత్రికి తరలించారు. తాజాగా ఆయన  సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్‌ను కలిశారు. అధికారులు, పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. తన టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని, పక్కనే సివిల్ పోలీసులను పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. పోలీసులే స్వయంగా డబ్బులు, మందు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ ఫాంహౌజ్‌లో డబ్బులున్నాయని, పోలీసులు ఎందుకు తనిఖీలు చేయడంలేదని సీఈవో దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. రాష్ట్రంలో అసలు ఎన్నికల కమిషన్ ఉందా? అని వంటేరు ప్రశ్నించారు. గజ్వేల్‌లో ఒక్క తెరాస నేత వాహనాన్ని అయినా సీజ్‌ చేశారా? అని నిలదీశారు. ఎర్రవల్లిలో 337 ఎకరాలు ఉంటే కేసీఆర్ 57 ఎకరాలు మాత్రమే అధికారికంగా ప్రకటించారన్నారు. పోలీసులు, ఎన్నికల అధికారుల్లో మార్పు రావాలని,లేకుంటే గజ్వేల్ ఆర్వో కార్యాలయం ముందు ఆత్మ బలిదానం చేసుకుంటానని హెచ్చరించారు.

లోక్ సత్తాలో చేరిన జేడీ లక్ష్మీనారాయణ

  ఐపీఎస్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వస్తున్నానంటూ సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ చేసిన ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఆయన ఏ పార్టీలో చేరతారా అని పలు చర్చలు జరిగాయి. సొంతంగా పార్టీ ఏర్పాటు చేస్తారని అప్పట్లో ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. అంతేకాదు ఆయన ఏర్పాటు చేయబోయే పార్టీ పేరు జనధ్వని అని వార్తలు కూడా వినిపించాయి. అయితే తాజా రాజకీయ పరిస్థితులపై మాజీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతో చర్చలు జరిపిన లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెట్టే ఆలోచనను విరమించుకున్నారు. అంతేకాదు జయప్రకాష్ నారాయణ స్థాపించిన లోక్ సత్తా పార్టీలో తాను చేరుతున్నట్లు లక్ష్మీనారాయణ ప్రకటించారు.

టీఆర్ఎస్ కు బిగ్ షాక్.. ఖమ్మం ఎంపీ అభ్యర్థి జంప్

  ఈ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో కూడా తమ సత్తా చాటి జెండా ఎగరేయాలని చూస్తున్న టీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఖమ్మం జిల్లాలో కీలక పాత్ర పోషించిన నేత బుడాన్ బేగ్ షేక్ టీఆర్ఎస్ పార్టీని వీడటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బేగ్.. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా పనిచేస్తున్నారు. అదే విధంగా ఆయన ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా పనిచేయడమే కాకుండా.. 2014 ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ స్థానానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. బేగ్ కి జిల్లా వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో పట్టుంది. అయితే ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వడంలేదంటూ అలకబూనిన బేగ్‌ ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు అనుచరులు, మేధావులతో బేగ్ సమావేశమై తన భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే మహాకూటమి నేతలు బేగ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు టీఆర్ఎస్ కూడా బేగ్ పార్టీని వీడితే తీవ్ర నష్టమని భావించి తుమ్మల నాగేశ్వరరావుని రంగంలోకి దింపింది. తుమ్మల బేగ్ ని ఆపేందుకు తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి తుమ్మల ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి.

ఎన్నికల ప్రచారంలో డిజిటల్ పేమెంట్స్

  ఎన్నికల్లో డిజిటల్ మంత్రా... ఓటు వేయటానికి బ్యాలెట్ పేపర్లు పోయి ఈవీఎం లు వచ్చాయి. ప్రచారానికి సోషల్ మీడియా వాడేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా పెయిడ్‌ కార్యకర్తలకు పేమెంట్ చేయటానికి డిజిటల్ వ్యాలెట్లు, యాప్‌లను వినియోగిస్తున్నారు. గతంలో తమ వెంట తిరిగేవారికి, ఓటర్లను ప్రలోభ పెట్టటానికి నగదు రూపంలో పేమెంట్ చేసేవారు. అయితే, ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ల కాలం కావడంతో డబ్బులు పంపిణీ చేస్తే అలా వీడియో తీసి.. ఇలా సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. దీంతో అభ్యర్థులు డిజిటల్ పేమెంట్స్‌పై దృష్టిపెట్టారు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ అందులో పేటీఎం యాప్ సర్వసాధారణమైపోయింది. అసలే ఉరుకుల పరుగుల జీవితంలో నేతల వెనుక తిరిగే కార్యకర్తలు తక్కువైపోతున్నారు. దీంతో పెయిడ్‌ కార్యకర్తలను ఆశ్రయించాల్సిన పరిస్థితి. విద్యార్థులు, యువత, మహిళా సంఘాల సభ్యులకు,చివరకు అడ్డా కూలీలకు సైతం డబ్బులిచ్చి వెంట తిప్పించుకుంటున్నారు. వీరిలో కూలీలను మినహియిస్తే మిగతా వారికి నేరుగా డబ్బులు ఇవ్వకుండా అర్దరాత్రి దాటిన తర్వాత పేటీఎం ద్వారా పంపిస్తున్నారు. ఉదయమే వచ్చిన వారి పేర్లను నమోదు చేసుకొని, వారి పేటీఎం నంబర్‌ తీసుకొని గుట్టు చప్పుడు కాకుండా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. దీని కోసం కొంత మంది అభ్యర్థులు ప్రత్యేకంగా టీమ్ ఏర్పాటు చేసుకున్నారట. ఈ రకంగా ఈసీకి చిక్కకుండా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కొత్త ఎత్తులు వేస్తున్నారు.భలే ఐడియా..!!

టీఆర్ఎస్ కు నిరసన సెగ.. ఈసారి కేటీఆర్ వంతు

  ప్రచారానికి వెళ్తున్న టీఆర్ఎస్ అభ్యర్థులకు పలు నియోజకవర్గాల్లో నిరసన సెగలు తగులుతున్న విషయం తెలిసిందే. ఇన్నిరోజులు ఏం అభివృద్ధి చేసారని.. ఇప్పుడొచ్చి ఓట్లు అడుగుతున్నారు అంటూ ప్రజలు నిలదీస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ నిరసన సెగ పరోక్షంగా కేటీఆర్ వరకు చేరింది. కేటీఆర్‌ దత్తత డివిజన్‌లో అభివృద్ధి ఏ మాత్రం జరుగలేదని హైదర్‌నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కార్పొరేటర్‌ జానకిరామరాజును స్థానికులు నిలదీశారు. కేటీఆర్‌ స్యయంగా దత్తత తీసుకుంటున్నానని ప్రకటించినా కానీ అభివృద్ధిలో ఆ మేరకు ప్రయోజనాలు తాము పొందలేదని.. రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏనాడు తమ సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి చర్యలు చేపట్టకుండా కాలయాపన చేసి.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వచ్చారంటూ కార్పొరేటర్‌ను స్థానికులు నిలదీశారు. కొంతసేపు వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన కార్పొరేటర్‌ వారు వినకపోవడంతో ప్రచారాన్ని అర్ధాంతరంగా ఆపి వెనుతిరిగి వెళ్లిపోయారు.

బ్యాంకులు ఉన్నవే అప్పులు ఇచ్చేందుకు

  టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కంపెనీల్లో ఈడీ అధికారులు సోదాలు జరిపి.. ఆయన బ్యాంకులకు రూ.5700 కోట్ల రుణాన్ని ఎగవేశారని నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై స్పందించిన సుజనా చౌదరి ఈడీ తీరును తప్పు పట్టారు. శుక్రవారం రాత్రి సోదాలు నిర్వహించి శనివారం కల్లా రూ.5700 కోట్ల మోసమని ఈడీ తేల్చేసింది. ఒక్క రోజులో ఇదంతా ఎలా సాధ్యం? అని ప్రశ్నించారు. కనీస విచారణ లేకుండా తీర్పు ఇచ్చినట్లు తాను బ్యాంకుల్ని రూ.5,700 కోట్లకు మోసం చేశానని పత్రికా ప్రకటన విడుదల చేయడం తొందరపాటు చర్య అన్నారు. దీనిపై ఇప్పటికే ఈడీ అధికారులతో మాట్లాడాను. పొరపాటు జరిగిందని వారూ అంగీకరించారు. దీనిని చట్టపరంగా ఎదుర్కొంటానని చెప్పారు. తమ సంస్థలు అవకతవకలకు పాల్పడలేదని, ఎప్పటికీ తప్పులు చేయవని స్పష్టం చేశారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, తనవి చట్ట పరిధిలో పనిచేసే కార్పొరేట్‌ సంస్థలని వెల్లడించారు. గత 29 ఏళ్లుగా తమ గ్రూపు సంస్థలు నిర్వహిస్తున్న వ్యాపార లావాదేవీల వివరాలన్నీ వెబ్‌సైట్లో, స్టాక్‌ ఎక్స్ఛేంజిలో అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రస్తుతం తన పేరిట ఎలాంటి సంస్థలు లేవన్నారు. దేశంలో ఒకప్పుడు సీబీఐ, ఈడీ సంస్థలు బాధ్యతాయుతంగా ఉండేవని, ఇప్పుడు ఈడీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. నేను 2009లో రాజకీయాల్లోకి వచ్చాను. 2010లో రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన వెంటనే 30 సంవత్సరాల క్రితం నేను స్థాపించిన కంపెనీల్లో ప్రత్యక్ష డైరెక్టర్‌ పదవులన్నిటికీ రాజీనామా చేశాను. ఆ కంపెనీల నుంచి గత ఎనిమిదేళ్లలో రూపాయి కూడా తీసుకోలేదు అని తెలిపారు. 2009కి ముందు నుంచే తాను వ్యాపార రంగంలో ఉన్నప్పటికీ ఎలాంటి ఆరోపణలు లేవని.. రాజకీయాల్లో వచ్చాకే ఇలాంటివి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా క్రియాశీలంగా ఉన్నందుకే తనపై ఈడీని ప్రయోగించారన్నారు. బెస్ట్‌ అండ్‌ క్రామ్టన్‌ సంస్థ తన స్నేహితుడిదని, ఆ సంస్థ రుణం చెల్లించలేదంటూ తనకు నోటీసు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. ఆ సంస్థకి ఎప్పుడూ కనీసం డైరెక్టర్‌గా కూడా వ్యవహరించలేదు. ఆ లావాదేవీల్లో బాధ్యుడ్ని చేయడం సమంజసం కాదు అన్నారు. గత 27 సంవత్సరాలుగా ఒకే ఇంట్లో ఉంటున్నాను. ఈడీ జప్తు చేసిన ఆరు కార్లు మా అబ్బాయి, అమ్మాయి, మేనల్లుడి పేరున ఉన్నాయి. అందులో ఒకటి ఢిల్లీకి చెందిన పాత కారు. దాని విలువ రూ.3 లక్షలు కూడా ఉండదు అని సుజనా వివరించారు. బ్యాంకుల ఫిర్యాదు మేరకు సోదాలు చేస్తున్నామని ఈడీ అధికారులు చెప్తున్నారని.. వాస్తవానికి ఏ బ్యాంకూ తనపై ఫిర్యాదు చేయలేదని అన్నారు. బ్యాంకుల నుంచి కంపెనీలు అప్పులు తీసుకోవడం నేరమేమీ కాదు. బ్యాంకులు ఉన్నవే అప్పులు ఇచ్చేందుకు అన్నారు. మా కంపెనీల బకాయిలతో పోలిస్తే గత 30 సంవత్సరాల్లో చెల్లించింది ఎంతో అధికం. అప్పుల కంటే మా ఆస్తుల విలువే ఎక్కువ ఉంటుంది అని తెలిపారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని చెప్పిన ఆయన.. విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇచ్చిందని, పార్లమెంటు సమావేశాల అనంతరం జనవరి 9న హాజరవుతానని చెప్పారు.

కొత్త మంత్రికి భారీ భద్రత

  ఏపీలో కొన్ని రోజుల క్రితం మంత్రి వర్గ విస్తరణ జరిగిన సంగతి విదితమే. ఖాళీగా ఉన్న రెండు స్థానాల్లో ఒక స్థానాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఇటీవల మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు కుమారుడు కిడారి శ్రావణ్ కుమార్‌కు కేటాయించారు. ఏపీ రాష్ట్ర గిరిజన శాఖ మంత్రిగా శ్రావణ్ కుమార్‌ కొనసాగుతున్నారు. గిరిజన నేత అందులోనూ,తండ్రి కిడారి సర్వేశ్వర రావు హత్య నేపథ్యంలో శ్రావణ్ కుమార్‌కు ప్రభుత్వం భద్రత పెంచింది. శ్రావణ్ కుమార్‌ వెంట ఉండే గన్‌మెన్స్‌తో పాటు పాటు అదనంగా ఆక్టోపస్ కమాండోల భద్రత కల్పించింది. నల్ల దుస్తులు ధరించిన కమాండోలు కిడారి వాహనం వెంట ఉంటారు. దీంతోపాటు శ్రావణ్ కుమార్ వెంట ఎప్పుడూ నలుగురు గన్‌మెన్స్‌ ఉంటారు. ప్రధానంగా సొంత జిల్లా విశాఖ, విశాఖ ఏజెన్సీ పర్యటన సమయంలో మరింత భద్రత పెంచారు. పూర్తి బుల్లెట్ ప్రూఫ్‌ వాహనంతో పాటు మరో రెండు వాహనాల శ్రేణి మధ్య శ్రావణ్ కుమార్‌ పర్యటించే విధంగా ప్రభుత్వం భద్రత పెంచింది. ఆయన భద్రత వ్యవహారాలను పర్యవేక్షించేందుకు సెక్యూరిటీ అధికారిని ఏర్పాటు చేసింది. ఆయన నిత్యం శ్రావణ్ కుమార్‌ వెంట ఉంటారు.

కూకట్‌పల్లికి జూ.ఎన్టీఆర్‌, కల్యాణ్‌రాం

  నందమూరి సుహాసినికి టీడీపీ పార్టీ కూకట్ పల్లి అబ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగి స్థానిక నేతలను బుజ్జగించారు. నందమూరి బాలకృష్ణ దగ్గర ఉండి నామినేషన్ వేయించారు. సుహాసిని గెలుపు కోసం నారా, నందమూరి కుటుంబాలు తమ వంతు కృషి చేస్తున్నాయి. అక్క సుహాసినిని గెలిపించమని కోరుతూ జూ.ఎన్టీఆర్‌, కల్యాణ్‌రాం ట్విట్టర్ వేదికగా ప్రకటన విడుదల చేశారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సుహాసినితో కలిసి జూ.ఎన్టీఆర్‌, కల్యాణ్‌రాం ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. సుహాసినికి మద్దతుగా జూ.ఎన్టీఆర్‌, కల్యాణ్‌రాం ఒక రోజు ప్రచారం చేస్తారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి వెల్లడించారు. వీరు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో పర్యటిస్తారా? లేదా కూకట్‌పల్లికే పరిమితమవుతారా? అన్నది ఇంకా నిర్ణయించలేదన్నారు.  తెదేపా ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ కూడా వచ్చే నెల మొదటి వారంలో ఇక్కడ ప్రచారం చేస్తారని వెల్లడించారు. గతంలో ఎన్నికల సమయంలో ప్రచారంలో పాల్గొని తన వాక్చాతుర్యంతో ప్రజల్లో ఉత్సహాన్ని నింపిన జూ.ఎన్టీఆర్‌ ప్రస్తుతం రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు. అక్క కోసం చాలా కాలం తర్వాత మళ్ళీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. జూ.ఎన్టీఆర్‌ చేసే తనదైన శైలి ప్రసంగం కోసం అభిమానులు, కార్యకర్తలు ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు.

టీఆర్ఎస్ టు కాంగ్రెస్..ఎంపీలు,మంత్రులు,ఎమ్మెల్యేలు క్యూ

  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చెప్పిన జోస్యం నిజమయ్యేలానే కనిపిస్తుంది. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ఎంపీలు పార్టీ మారతారు అన్నాడు. అన్నట్లే చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి  పార్టీ మారారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ లో చేరేందుకు ఇంకా చాలా మంది ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని విశ్వేశ్వర్‌రెడ్డి అంటున్నారు. తాజాగా అయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అంటే కేసీఆర్‌ సొంత వ్యాపార సంస్థ. ఆ పార్టీలో ప్రజాస్వామ్యం లేదు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేదు. జీ హూజూర్‌ అంటూ కాలం వెళ్లదీయాలి. టీఆర్ఎస్ లో ప్రజాప్రతినిధులకు ఆత్మగౌరవం కొరవడటంతో ఆ పార్టీలో ఇమడలేకనే కాంగ్రెస్ లో చేరా అని విశ్వేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. తాను రాజీనామా చేశాక టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారన్నారు. టీఆర్‌ఎస్‌ లోకసభా పక్ష నేత జితేందర్‌రెడ్డితోపాటు ఆ పార్టీ సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావు(కేకే) కూడా కేసీఆర్‌ తీరుపై అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. టీఆర్‌ఎస్‌ అంటే ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ అని జితేందర్‌రెడ్డి ఓ సందర్భంలో తనతో అన్నారని తెలిపారు. తమ మంత్రిత్వ శాఖల్లో జరిగే బదిలీలు, ఇతర పరిణామాలను ఆయా శాఖల మంత్రులు మర్నాడు పత్రికల్లో చదివి తెలుసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. పోలీసు అధికారుల బదిలీల గురించి హోం మంత్రి నాయినికి తెలియదని, బడ్జెట్‌ నోట్‌ చదివే వరకు ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు బడ్జెట్‌లోని కేటాయింపులు తెలియని విచిత్ర పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. విశ్వేశర్ రెడ్డి అన్నట్లు నిజంగానే ఆ పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నారో లేదో?...ఒకవేళ ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరతారో తెలియాలి అంటే కొన్నిరోజులు వేచి ఉండాల్సిందే..!!

రెబల్స్ కి షాక్...కాంగ్రెస్ సంచలన నిర్ణయం

  ఎన్నికల వేళ పలు పార్టీల్లో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే టీఆర్ఎస్.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన నేతలపై వేటు వేసింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా 24 మందిని సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 7న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, టీడీపీ, టీజేఏసీ, సీపీఐ మహాకూటమిగా ఎన్నికల బరికి సిద్ధమయ్యాయి. పొత్తులో భాగంగా కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ ఆశావహులను సీట్లు దక్క లేదు. దీంతో ఆ పార్టీ కి చెందిన 19 మంది రెబల్ అభ్యర్థులుగా పోటీ చేశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా తీసుకుని రెబల్ అభ్యర్థులను 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. వీరితో పాటు పార్టీ క్రమశిక్షణా చర్యల్లో భాగంగా నారాయణపేట నియోజకవర్గానికి చెందిన మరో ఐదుగురిని కూడా 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన రెబల్స్: రవి శ్రీనివాస్‌-సిర్పూర్‌, బోడ జనార్దన్‌-చెన్నూరు. హరినాయక్‌-ఖానాపూర్‌, అనిల్‌జాదవ్‌-బోథ్‌, నారాయణరావు పటేల్‌-ముథోల్‌, అరుణతార-జుక్కల్‌, రత్నాకర్‌-నిజామాబాద్‌ అర్బన్‌, శ్రీగణేష్‌-సికింద్రాబాద్‌, శివకుమార్‌రెడ్డి-నారాయణపేట్‌, ఇబ్రహీం-మహబూబ్‌నగర్, సురేందర్‌రెడ్డి-మహబూబ్‌నగర్‌, బిల్యానాయక్‌-దేవరకొండ, పాల్వాయి స్రవంతి-మునుగోడు, రవికుమార్‌-తుంగతుర్తి, నెహ్రూ నాయక్‌-డోర్నకల్‌, వూకె అబ్బయ్య-ఇల్లందు, బాలాజీనాయక్‌-ఇల్లందు, ఎడవల్లి కృష్ణ-కొత్తగూడెం, రాములు నాయక్‌-వైరా.

మహాకూటమికి బిగ్ షాక్.. ఓటమి తప్పదా?

  తెలంగాణలో టీఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. అయితే కూటమి లక్ష్యం నెరవేరుతుందా? అంటే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ బలానికి టీడీపీ బలం తోడవడంతో కూటమి చేతిలో టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేసారు. దానికి తగ్గట్టే కొన్ని సర్వేలు కూడా కూటమికి అనుకూలంగా వచ్చాయి. అయితే తాజాగా 'టైమ్స్ నౌ సర్వే ' మాత్రం మహాకూటమికి బిగ్ షాక్ ఇచ్చింది. తెలంగాణలో మళ్ళీ టీఆర్ఎస్సే అధికారంలోకి వస్తుందని స్పష్టం చేసింది. 2014లో 63 సీట్లు గెలుచుకున్న టీఆర్ఎస్.. ఈ ఎన్నికల్లో 37.55 శాతం ఓట్లతో 70 సీట్లు సాధించి అధికారం నిలబెట్టుకుంటుందని సర్వే వెల్లడించింది. గత ఎన్నికల్లో 21 సీట్లు సాధించిన కాంగ్రెస్ ఈసారి ఓ పది పెంచుకొని 27.98 శాతం ఓట్లతో 31 సీట్లు సాధించే అవకాశముందని తెలిపింది. ఇక గత ఎన్నికల్లో 15 సీట్లు సాధించిన టీడీపీ, ఇప్పుడు 2 సీట్లకే పరిమితం అవుతుందంటూ బాంబు పేల్చింది. అదేవిధంగా మజ్లిస్ పార్టీకి 8 సీట్లు, బీజేపీకి 3 సీట్లు, ఇతరులకు 5 సీట్లు వస్తాయని పేర్కొంది. తెలంగాణ సీఎంగా కేసీఆర్ కావాలని 45.27 శాతం మంది కోరుకోగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం కావాలని 30.35 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నట్లు వెల్లడించింది. కాంగ్రెస్, టీడీపీల పొత్తును తెలంగాణ ప్రజలు తిరస్కరించినట్లు సర్వే తెలిపింది. తెలంగాణ వ్యతిరేక పార్టీ అయిన టీడీపీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ తెలంగాణ ప్రజల సెంటిమెంట్ ను దెబ్బ తీసిందని 52.44 శాతం మంది అభిప్రాయపడినట్టు వెల్లడించింది. దీన్నిబట్టి రాహుల్ గాంధీ, చంద్రబాబు పొత్తుకు అంత సానుకూలత రాలేదనే అభిప్రాయాన్ని టైమ్స్ నౌ వ్యక్తం చేసింది.

ఖమ్మంలో ఒకే వేదికపై రాహుల్‌ గాంధీ, చంద్రబాబు

  మేడ్చల్ సభ సక్సెస్ తో కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇన్ని రోజులు చేసిన ప్రచారం ఒక ఎత్తైతే మేడ్చల్ సభ ఒక ఎత్తు. ఈ సభతో ఒక్కసారిగా కాంగ్రెస్ తో పాటు, కూటమిలోని మిగతా పార్టీలలో జోష్ వచ్చింది. ఇదే జోష్ తో ప్రచారంలో దూసుకుపోవాలని కూటమి భావిస్తోంది. మేడ్చల్ సభకు సోనియా గాంధీని తీసుకొచ్చి తెలంగాణ సెంటిమెంట్ ను గుర్తుచేసిన కూటమి ఇప్పుడు రాహుల్ గాంధీ, చంద్రబాబులను రంగంలోకి దింపి మరింత జోష్ తో దూసుకుపోవాలని చూస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 28, 29 తేదీల్లో రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, రాహుల్ గాంధీతో పాటు 28 న ఖమ్మంలో జరిగే సభలో వేదికకు పంచుకోనున్నారు. అదేవిధంగా హైదరాబాద్ లో జరిగే రోడ్ షో కూడా పాల్గొననున్నారు. 28న ఉదయం కొడంగల్‌, మధ్యాహ్నం గజ్వేల్‌లో రాహుల్‌ గాంధీ రోడ్‌ షో 28న సాయంత్రం ఖమ్మంలో రాహుల్‌ గాంధీ, చంద్రబాబు బహిరంగ సభ 28న రాత్రి హైదరాబాద్‌లో రాహుల్‌ గాంధీ, చంద్రబాబు రోడ్‌షో 29న ఉదయం తాండూర్‌, మధ్యాహ్నం ఆర్మూరు, సాయంత్రం భూపాలపల్లి సభల్లో రాహుల్‌ గాంధీ.

నిన్న రైలు..నేడు బస్సు..

  తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈ రోజు ఆర్టీసీ బస్సులో రంపచోడవరం చేరుకోనున్నారు. నీటిపారుదల ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు, ఏజెన్సీ గిరిజనుల స్థితిగతులను తెలుసుకునేందుకు రాజమహేంద్రవరం నుంచి బస్సు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఈ మధ్యాహ్నం రాజమహేంద్రవరంలో బయల్దేరిన ఆయన గుడాల, కోరుకొండ, గోకవరం మీదుగా రంపచోడవరానికి చేరుకోనున్నారు. ఈ ప్రయాణంలో పలు గ్రామాల్లో గిరిజనులతో పవన్‌ మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. అనంతరం ఈ సాయంత్రం రంపచోడవరంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ బస్సు ప్రయాణంలో ఆయన వెంట సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో పాటు జనసేన నేత, మాజీ మంత్రి బాలరాజు తదితరులు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్  'జనసేనాని తో రైలు ప్రయాణం'  అంటూ విజయవాడ నుంచి తుని వరకు రైలులో ప్రయాణించి ప్రయాణికులతో మమేకమై సమస్యలపై చర్చిన సంగతి తెలిసిందే.