కేసీఆర్ వల్ల ప్రతి కుటుంబంపై 2 లక్షల అప్పుభారం
ప్రజాకూటమి ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, టీఆర్ఎస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సభకు వచ్చిన ప్రజల ఉత్సాహం చూస్తుంటే తెలంగాణలో ప్రజాకూటమి అధికారంలోకి రావడం ఖాయమనిపిస్తోందని రాహుల్ ఆశాభావం వ్యక్తంచేశారు. కేంద్రంలో మోదీ ఒక్కో వ్యవస్థను నాశనం చేస్తూ వస్తున్నారని.. సుప్రీంకోర్టు, సీబీఐ, ఆర్బీఐ, ఈసీ ఇలా అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం ఒకవైపు ఉంది. రైతులు, యువకులు, ప్రజలు మరోవైపు ఉన్నారు. తెలంగాణలో ప్రజా కూటమి గెలిచిన తర్వాత.. దేశంలో మోదీపై పోరాడేందుకు ఇదే కూటమి దిక్సూచిగా నిలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో మోదీకి సంబంధించిన 'బీ టీమ్'తో మనం పోటీ పడుతున్నాం. మొదట మోదీ 'బి-టీమ్' అయిన టీఆర్ఎస్ ను ఓడించాలి. ఆ తర్వాత కేంద్రంలో మోదీ 'ఏ టీమ్'ను ఓడిద్దాం అని పిలుపునిచ్చారు.
ఇటీవల మోదీ తెలంగాణకు వచ్చారు. కాంగ్రెస్‌కు, టీఆర్ఎస్ కు ఎలాంటి తేడా లేదన్నారు. అయితే పార్లమెంట్‌లో బీజేపీ పెట్టిన ప్రతి బిల్లుకు టీఆర్ఎస్ మద్దతిచ్చిందని రాహుల్ ఆరోపించారు. రాష్ట్రపతి ఎన్నికల్లోనూ బీజేపీకి టీఆర్ఎస్ నేతలు మద్దతిచ్చారని గుర్తుచేశారు. అవిశ్వాస తీర్మానంలోనూ బీజేపీకే టీఆర్ఎస్ మద్దతిచ్చిందన్నారు. కాంగ్రెస్ మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ వస్తోంది. బీజేపీ కూటమిలో ఉన్న టీఆర్ఎస్ ను ప్రజాకూటమి ఇప్పుడు ఓడించేందుకు సిద్ధమైంది అన్నారు. రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ, ఏపీకి కేంద్రం విభజన చట్టంలో కొన్ని హామీలు ఇచ్చింది. విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలకిచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. తెలంగాణ, ఏపీకి ఇచ్చిన హామీలను మోదీ సర్కారు ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. టీఆర్ఎస్ మోదీకి మద్దతు ఇస్తున్నప్పటికీ ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదు. విభజన చట్టంలోని ఏ ఒక్కహామీనీ నెరవేర్చని ప్రధానిని కేసీఆర్ ఎందుకు నిలదీయడం లేదు అని ప్రశ్నించారు.
నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఇచ్చాం. అయితే ప్రాజెక్టుల రీడిజైన్ పేరిట కేసీఆర్ ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోంది. రూ.50 వేల కోట్ల వ్యయంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత ప్రాజెక్టును రూపకల్పన చేసింది. అయితే ఆ ప్రాజెక్టుకు పేరు మార్చి అంచనాలు పెంచి.. రూ.90 వేల కోట్లకు చేర్చారు. ప్రాజెక్టు పేర్ల మార్పు కోసమే కేసీఆర్ ప్రభుత్వం రూ.40 వేల కోట్లు ఖర్చు చేసింది. కేసీఆర్ నిర్ణయం వల్ల ప్రతి కుటుంబంపై రూ.2 లక్షల మేర అప్పుభారం పడింది అని విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికి మినహా యువతకు ఉద్యోగాలు రాలేదు. మద్దతు ధర అడిగిన రైతులపై లాఠీఛార్జ్ చేశారు. రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుంది. వారికి రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం. కేసీఆర్ ప్రభుత్వం డ్వాక్రా సంఘాలను నిర్లక్ష్యం చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతి మహిళా సంఘానికి రూ.లక్ష గ్రాంట్‌గా ఇస్తాం అన్నారు. కేసీఆర్ 2 లక్షల మందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తామని 5 వేలు కూడా నిర్మించలేదు అని విమర్శించారు. అంతా ఏకమై టీఆర్ఎస్ ను ఒడిద్దాం అని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.