తెలంగాణలో టీఆర్‌ఎస్,బీజేపీలకు వైసీపీ మద్దతు
గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నకరికల్లు వద్ద ఐదు దశల్లో చేపట్టనున్న గోదావరి - పెన్నా నదుల అనుసంధానానికి తొలిదశ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. గోదావరి-పెన్నా అనుసంధానం.. నాగార్జునసాగర్ ఆయకట్టు స్థిరీకరణకు ఉపకరిస్తుందని, గుంటూరు జిల్లాలో తాగునీటి అవసరాలు తీరుతాయన్నారు. నదుల అనుసంధానంతో రాష్ట్రంలో కరవు అనేదే ఉండదని చంద్రబాబు వివరించారు. పంచనదుల మహా సంగమమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో 65శాతం పనులు పూర్తయ్యాయని, గ్రావెటీ ద్వారా నీళ్లు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. మరోవైపు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనపై చేస్తున్న విమర్శలపై చంద్రబాబు స్పందించారు.
తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగుజాతిగా కలిసుండాలని తాను అంటుంటే కేసీఆర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చాడో అందరికీ తెలుసునని,ఆయనకు టీడీపీనే రాజకీయ జీవితం ఇచ్చిందన్నారు. గతంలో తన అనుచరుడుగా ఉన్న కేసీఆర్ తనను తిడుతుంటే బాధేసిందని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం రాత్రి, పగలు కృషి చేశానని, మైక్రోసాఫ్ట్, ఔటర్ రింగ్ రోడ్డ, ఎయిర్ పోర్టు, ఇంకా ఎన్నో సంస్థలు నగరంలో ఏర్పాటు కావడానికి టీడీపీ ప్రభుత్వమే కారణమన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్, బీజేపీలకు వైసీపీ పరోక్ష మద్దతు ఇస్తోందని చంద్రబాబు ఆరోపించారు. టీఆర్‌ఎస్ ఓడిపోయి ప్రజాకూటమి గెలిస్తేనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
బీజేపీకి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని కూడా ఈ సందర్బంగా వివరించారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలను మోదీ పూర్తిగా దెబ్బతీశారని, ఆర్బీఐని కూడా వదలిపెట్టలేదని మండిపడ్డారు. దేశాన్ని కాపాడుకునేందుకు అన్ని పార్టీలను కలిపేందుకు ప్రయత్నిస్తున్నామని, తెలుగుజాతి కోసం శత్రవుతో చేతులు కలిపానని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ నమ్మించి మోసం చేసిందని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. దేశంలోని అన్ని పార్టీలను కలుపుకొని పోరాడుతున్నామన్నారు. రాష్ట్రం కోసం పోరాడుతున్న వారిపై కేంద్రం ఐటీ, ఈడీ దాడులు చేస్తోందని ఆయన విమర్శించారు. మోదీ నోట్లు రద్దు చేసి దేశాన్ని భ్రష్టుపట్టించారని, కేంద్రం ప్రభుత్వానికి అసహనం పెరిగిందని చంద్రబాబు విమర్శించారు.