టీడీపీ ఎంపీకి షాక్..ఈడీ సోదాలు
posted on Nov 24, 2018 @ 10:45AM
ఎన్‌ఫోర్స్‌మెంట్స్ డైరెక్టరేట్ అధికారులు తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి నివాసాలు, కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. సుజనా చౌదరికి చెందిన సుజనా గ్రూప్స్‌లో ఈడీ అధికారులు గత రాత్రి నుంచే సోదాలు జరుపుతున్నారు. గత అక్టోబర్‌లోనూ ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు నిర్వహించి హార్డ్ డిస్క్ లు, ఫైల్స్ తో పాటు కీలక డాక్యుమెంట్‌లు స్వాధీనం చేసుకున్నసంగతి తెలిసిందే. డొల్ల కంపెనీల ద్వారా కోట్ల రూపాయలు కొల్లగొట్టారని సుజనాచౌదరిపై ఆరోపణలు ఉన్నాయి. సుజనా చౌదరీ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులను డైరెక్టర్‌లుగా పెట్టి షెల్ కంపెనీలు ప్రారంభించినట్లు సుజనా చౌదరిపై ఆరోపణలు వచ్చాయి. గంగా స్టీల్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, భాగ్యనగర్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ట్రేడింగ్ లిమిటెడ్, తేజస్విని ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ టెక్ ఇండస్ట్రీస్ కంపెనీలకు పెద్ద ఎత్తున డబ్బును మళ్లించారని ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి కొనుగోళ్లు చేయకుండానే… కేవలం రసీదుల రూపంలో డబ్బులు మళ్లించినట్లు తెలుస్తోంది.
బ్యాంకుల నుంచి సుజనా గ్రూప్ సంస్థ మొత్తం రూ. 304 కోట్ల మేరకు రుణాలు పొందినట్లు తెలుస్తుండగా సెంట్రల్ బ్యాంక్ నుంచి రూ. 124 కోట్లు, కార్పొరేషన్ బ్యాంక్ నుంచి రూ. 120 కోట్లు, ఆంద్రాబ్యాంక్ నుంచి రూ. 60 కోట్లు రుణాలను సృజన గ్రూప్స్ పొందినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. సృజన గ్రూప్స్ డైరెక్టర్‌గా ఉన్న శ్రీనివాస్ కళ్యాణ్‌రావ్ పేరుతో ఈ ఋణాలు పొందినట్లు తెలుస్తుండగా సీబీఐ మాజీ డైరెక్టర్ అయిన విజయరామారావు కొడుకు శ్రీనివాస్ కళ్యాణ్ రావుగా గుర్తించారు. బ్యాంకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీనివాస్ కల్యాణ్ రావ్‌పై 2016 లో సీబీఐ కేసునమోదు చేసింది. ప్రస్తుతం మర్షియస్ కమర్షియల్ బ్యాంక్ ఫిర్యాదు మేరకు సోదాలు నిర్వహిస్తుండగా.. ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.