ఐటీని తిరుపతికి తీసుకుపోయేవాడిని
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌కు రాజకీయం కావాలి. నన్ను విమర్శిస్తూ రాజకీయాలు చేస్తారు. ఇద్దరం కలిసి పనిచేద్దామంటే కేసీఆర్ ఒప్పుకోలేదు. ప్రధాని నరేంద్రమోదీకి 'బి'టీమే కేసీఆర్ అని విమర్శించారు. దేశంలో రెండే రెండు ఫ్రంట్‌లు ఉన్నాయి. ఒకటి బీజేపీ ఫ్రంట్, మరోటి బీజేపీ వ్యతిరేకి ఫ్రంట్. ఎవరు ఏ ఫ్రంట్‌లో ఉన్నారో తేల్చుకోవాలి అని పిలపునిచ్చారు.
నీళ్లు, పరిశ్రమలు ఏపీకి తీసుకుపోతానని తనపై ఆరోపణలు చేస్తున్నారని, తన ఊరికి తీసుకుపోవాలనుకుంటే.. ఐటీని తిరుపతికి తీసుకుపోయేవాడిని హైదరాబాద్‌లో ఎందుకు పెడతానని ప్రశ్నించారు. హైదరాబాద్ అభివృద్ధికి, ఐటీ అభివృద్ధికి చంద్రబాబే కారణమని టీఆర్‌ఎస్ నేత కేటీఆర్ గతంలో అన్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని తనను విమర్శిస్తారని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని కేసీఆర్ నెరవేర్చలేదని, డబుల్ బెడ్ రూమ్, దళితులకు మూడెకరాల భూమి ఎవరికిచ్చారని నిలదీశారు. మాయమాటలతో కేసీఆర్ పబ్బంగడుపుతున్నారని విమర్శించారు. ఐదేళ్లలో కనీసం లక్ష ఇళ్లు కట్టలేనివారు డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు ఎలా నిర్మించగలరని నిలదీశారు. పనిచేయడం చేతకాదు కానీ, తనపై ఆరోపణలు చేస్తారా అని మండిపడ్డారు. తకు స్వార్థంలేదని, రాజకీయ అవసరాలు లేవని స్పష్టం చేశారు. 13 సీట్లతో తాను సీఎం ఎలా అవుతానని, ఏపీలో చేయాల్సిన పనులు, లక్ష్యాలు తనకున్నాయన్నారు. కేవలం తెలంగాణకు అండగా ఉండేందుకే ఇక్కడకు వచ్చానని చెప్పారు. తెలుగువారున్న ప్రతి చోట టీడీపీ ఉంటుందని, తెలుగువారి కోసం తన గొంతు విన్పిస్తూనే ఉంటానని చంద్రబాబు స్పష్టం చేసారు.