తెలంగాణకు వస్తే తల్లి తన బిడ్డల దగ్గరకు వచ్చినట్లుంది
posted on Nov 24, 2018 9:11AM
తెలంగాణ ఏర్పడిన నాలుగున్నరేళ్ల తర్వాత తొలిసారి సోనియాగాంధీ రాష్ట్రానికి వచ్చారు. మేడ్చల్ వేదికగా జరిగిన భారీ బహిరంగ సభకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ హాజరయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరుగుతున్నా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మాత్రమే పాల్గొనడం ద్వారా సోనియా గాంధీ తెలంగాణకు తానిస్తున్న ప్రాధాన్యాన్ని చాటిచెప్పారు. అదే విధంగా తన ప్రసంగంతో కూడా ఆకట్టుకున్నారు. తెలంగాణ వచ్చింది. నేను మీ అందరి మధ్య ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత తల్లి తన బిడ్డల దగ్గరకు వచ్చినప్పుడు కలిగినంత సంతోషాన్ని అనుభవిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలనే నిర్ణయం తీసుకోవడానికి ఎన్ని కష్టాలు ఎదురయ్యాయో నాకు గుర్తుంది. అదంత సులభమైన పని కాదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటి బాగోగులూ మేమే చూడాల్సి ఉండేది. అయినప్పటికీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు.. ఉద్యమ స్ఫూర్తిని గమనించి నాటి ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్, రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగా నిర్ణయం తీసుకుని తెలంగాణ కలను సాకారం చేశాం. రాజకీయంగా తమ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా, తెలంగాణ ప్రజల జీవితాలు బాగుండాలని ఆ రోజు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం తీసుకున్నాం. అదే సమయంలో, ఆంధ్ర ప్రజల జీవితాలు బాగుండాలని తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టిన రోజున ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంటులో నిర్ణయం తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఈ వేదిక నుంచి వాగ్దానం చేస్తున్నాను. ప్రత్యేక హోదా సహా ఆ రోజు చేసిన వాగ్దానాలన్నిటినీ నెరవేరుస్తాం.
ప్రతి తల్లి కూడా తన బిడ్డలు ఎంతో ఎత్తుకు ఎదగాలని, వారి జీవితాలు బాగుపడాలని కోరుకుంటుంది. నేను కూడా అలాగే కోరుకున్నాను. కానీ, ఈరోజు మీ కష్టాలు చూస్తుంటే మనసుకి బాధగా ఉంది. ఇక్కడ పాలన ఏ రకంగా జరగాలని భావించామో అలా జరగడం లేదు. అభివృద్ధి ఎలా జరగాలనుకున్నామో అలా జరగట్లేదు. మీ కలలు ఈ నాలుగున్నరేళ్లలో ఎంతవరకు సాకారమయ్యాయి? నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంత వరకూ ముందడుగు వేసింది?ఇక్కడ రైతులు ఇప్పటికీ నీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్నారు. నేటికీ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ చట్టాన్ని టీఆర్‌ఎస్ సర్కారు తుంగలోకి తొక్కి రైతుల జీవితాలను నాశనం చేసింది. ఉపాధి హామీ పథకాన్ని కూడా సరిగ్గా అమలు చేయకుండా ప్రజలకు దూరం చేసింది. యువత ఉద్యోగం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
దళితులు, ఆదివాసీలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి.. యువత, విద్యార్థులు, మహిళల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం ఏమైనా చేసిందా? కేవలం వాళ్లు, వాళ్ల కుటుంబం, బంధుమిత్రులు మాత్రమే బాగుపడే పనులు చేసుకున్నారు. మాటపై నిలబడని, విశ్వసనీయత లేని వాళ్ల మాటలు నమ్మవద్దు. బిడ్డ పుట్టిన తర్వాత తొలి సంవత్సరాల్లో సరైన పోషణ అందకపోతే, భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు పడాల్సివస్తుంది. కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, ప్రజల ఆలనాపాలనా వాళ్ల చేతుల్లోకి వెళ్లింది. వాళ్లు తెలంగాణ బిడ్డ ఆలనాపాలనను గాలికి వదిలేశారు. ఇది ఎన్నికల సమయం. మీరు, మేము అందరం కలిసి ఇబ్బందుల నుంచి విముక్తులం కావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధనకు మీరు ఎలాగైతే పోరాడారో.. అదే స్ఫూర్తితో టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి. సభకు వచ్చిన వారితోపాటు తెలంగాణలోని ప్రతి ఒక్కరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీ ఒక్కొక్క ఓటునూ కాంగ్రెస్ కు, ప్రజా కూటమి అభ్యర్థులకు వేయండి. భారీ మెజారిటీతో గెలిపించండి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి చేతులు కలపండి.