టీడీపీ లేకపోతే కేసీఆర్ ఎక్కడ ఉండేవారో?
ఎన్నికల ప్రచారంలో భాగంగా మణికొండలో నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ బీజేపీ, కేసీఆర్ మీద విమర్శలు గుప్పించారు. తన పాలనలో ఘనంగా చెప్పుకునే పనిని కేసీఆర్ ఒక్కటైనా చేశారా? అని ప్రశ్నించారు. తన కృషి వల్లే హైదరాబాద్ దేశంలోనే అత్యుత్తమ నగరంగా ఎదిగిందన్నారు. ప్రపంచమంతా తిరిగి తాను హైదరాబాద్‌కు పెట్టుబడులు తీసుకొచ్చానని, కేసీఆర్ ఎక్కడికైనా వెళ్లి రూపాయి పెట్టుబడి పెట్టాలని ఏ పారిశ్రామికవేత్తనైనా అడిగారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు రెండుసార్లు ప్రధాని పదవిని వదులుకున్నానని చెప్పారు. తాను తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడలేదని, తెలంగాణలో తన హయాంలో భీమ, నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతలను ప్రారంభించానన్నారు. తాను హైదరాబాద్ వస్తే ఇక్కడేం పని అంటున్నారని, టీడీపీ లేకపోతే కేసీఆర్ ఎక్కడ ఉండేవారో చెప్పాలన్నారు. హైదరాబాద్‌ను తాను కట్టించానని ఎక్కడా చెప్పలేదని, కులీకుతుబ్‌షా దాన్ని కట్టారన్నారు. సైబరాబాద్‌ను తానే కట్టానని స్పష్టంచేశారు. శంషాబాద్ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, మైక్రోసాఫ్ట్ కంపెనీని తాను తీసుకొచ్చానన్నారు. తాను చేసిన అభివృద్ధిని, తన విజన్‌ను కాంగ్రెస్ చెడగొట్టకుండా కొనసాగించినందువల్లే అభివృద్ధి సాధ్యమైందన్నారు. విభజన జరిగిన తర్వాత కేసీఆర్ వచ్చి చెడగొట్టారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే తమకు నష్టంలేదని ఆనాడు చెప్పిన కేసీఆర్ ఈ రోజు మాట మారుస్తున్నారన్నారు. కేంద్రంలో మోదీ మాట మార్చారు గనకే ఇక్కడ కేసీఆర్ కూడా ఈ విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీని నమ్మితే ఆయన దేశానికి, రాష్ట్రానికి నమ్మకద్రోహం చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఆయన తీరువల్ల బాగా నష్టపోయామన్నారు. దేశంలో ఏటీఎంలు ఎక్కడా సరిగా పనిచేయడం లేదని, డబ్బుల కోసం ప్రజలు ఇక్కట్లు పడుతున్నారన్నారు. నోట్ల రద్దు రాజకీయ ప్రయోజనాల కోసమే చేశారని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల నకిలీ కరెన్సీ పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయన్నారు. ఆర్థిక వ్యవస్థ పతనమైందని చెప్పారు. మోదీ, అమిత్‌షా జోడీ చాలా భయంకరమైనదని, పద్ధతిలేని రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వారి తప్పులను ఎవరైనా విమర్శిస్తే ఈడీ, ఐటీ లేకపోతే సీబీఐలచే దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఆర్బీఐ లాంటి సంస్థలు కూడా ఇబ్బందుల్లో పడ్డాయన్నారు. 40 ఏళ్లుగా కాంగ్రెస్‌తో తాము పోరాడామని, దేశం కోసం తొలిసారిగా ఆ పార్టీతో కలిశామన్నారు. ప్రధాని మోదీ చెప్పే అచ్చేదిన్ నాలుగున్నరేళ్లలో రాలేదని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని చిత్తుచిత్తుగా ఓడిస్తే తప్పకుండా అచ్చేదిన్ వస్తుందని చంద్రబాబు చెప్పారు.