బ్యాంకులు ఉన్నవే అప్పులు ఇచ్చేందుకు
posted on Nov 26, 2018 @ 10:30AM
టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కంపెనీల్లో ఈడీ అధికారులు సోదాలు జరిపి.. ఆయన బ్యాంకులకు రూ.5700 కోట్ల రుణాన్ని ఎగవేశారని నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై స్పందించిన సుజనా చౌదరి ఈడీ తీరును తప్పు పట్టారు. శుక్రవారం రాత్రి సోదాలు నిర్వహించి శనివారం కల్లా రూ.5700 కోట్ల మోసమని ఈడీ తేల్చేసింది. ఒక్క రోజులో ఇదంతా ఎలా సాధ్యం? అని ప్రశ్నించారు. కనీస విచారణ లేకుండా తీర్పు ఇచ్చినట్లు తాను బ్యాంకుల్ని రూ.5,700 కోట్లకు మోసం చేశానని పత్రికా ప్రకటన విడుదల చేయడం తొందరపాటు చర్య అన్నారు. దీనిపై ఇప్పటికే ఈడీ అధికారులతో మాట్లాడాను. పొరపాటు జరిగిందని వారూ అంగీకరించారు. దీనిని చట్టపరంగా ఎదుర్కొంటానని చెప్పారు.
తమ సంస్థలు అవకతవకలకు పాల్పడలేదని, ఎప్పటికీ తప్పులు చేయవని స్పష్టం చేశారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, తనవి చట్ట పరిధిలో పనిచేసే కార్పొరేట్ సంస్థలని వెల్లడించారు. గత 29 ఏళ్లుగా తమ గ్రూపు సంస్థలు నిర్వహిస్తున్న వ్యాపార లావాదేవీల వివరాలన్నీ వెబ్‌సైట్లో, స్టాక్ ఎక్స్ఛేంజిలో అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రస్తుతం తన పేరిట ఎలాంటి సంస్థలు లేవన్నారు. దేశంలో ఒకప్పుడు సీబీఐ, ఈడీ సంస్థలు బాధ్యతాయుతంగా ఉండేవని, ఇప్పుడు ఈడీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
నేను 2009లో రాజకీయాల్లోకి వచ్చాను. 2010లో రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన వెంటనే 30 సంవత్సరాల క్రితం నేను స్థాపించిన కంపెనీల్లో ప్రత్యక్ష డైరెక్టర్ పదవులన్నిటికీ రాజీనామా చేశాను. ఆ కంపెనీల నుంచి గత ఎనిమిదేళ్లలో రూపాయి కూడా తీసుకోలేదు అని తెలిపారు. 2009కి ముందు నుంచే తాను వ్యాపార రంగంలో ఉన్నప్పటికీ ఎలాంటి ఆరోపణలు లేవని.. రాజకీయాల్లో వచ్చాకే ఇలాంటివి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా క్రియాశీలంగా ఉన్నందుకే తనపై ఈడీని ప్రయోగించారన్నారు.
బెస్ట్ అండ్ క్రామ్టన్ సంస్థ తన స్నేహితుడిదని, ఆ సంస్థ రుణం చెల్లించలేదంటూ తనకు నోటీసు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. ఆ సంస్థకి ఎప్పుడూ కనీసం డైరెక్టర్‌గా కూడా వ్యవహరించలేదు. ఆ లావాదేవీల్లో బాధ్యుడ్ని చేయడం సమంజసం కాదు అన్నారు. గత 27 సంవత్సరాలుగా ఒకే ఇంట్లో ఉంటున్నాను. ఈడీ జప్తు చేసిన ఆరు కార్లు మా అబ్బాయి, అమ్మాయి, మేనల్లుడి పేరున ఉన్నాయి. అందులో ఒకటి ఢిల్లీకి చెందిన పాత కారు. దాని విలువ రూ.3 లక్షలు కూడా ఉండదు అని సుజనా వివరించారు.
బ్యాంకుల ఫిర్యాదు మేరకు సోదాలు చేస్తున్నామని ఈడీ అధికారులు చెప్తున్నారని.. వాస్తవానికి ఏ బ్యాంకూ తనపై ఫిర్యాదు చేయలేదని అన్నారు. బ్యాంకుల నుంచి కంపెనీలు అప్పులు తీసుకోవడం నేరమేమీ కాదు. బ్యాంకులు ఉన్నవే అప్పులు ఇచ్చేందుకు అన్నారు. మా కంపెనీల బకాయిలతో పోలిస్తే గత 30 సంవత్సరాల్లో చెల్లించింది ఎంతో అధికం. అప్పుల కంటే మా ఆస్తుల విలువే ఎక్కువ ఉంటుంది అని తెలిపారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని చెప్పిన ఆయన.. విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇచ్చిందని, పార్లమెంటు సమావేశాల అనంతరం జనవరి 9న హాజరవుతానని చెప్పారు.