అక్క చెళ్లెమ్మలూ ఇక దుల్హన్ మర్చిపోండి
posted on Jun 23, 2022 @ 2:01PM
సోదరి పెళ్లికి అన్న ఎంతో కొంత యివ్వడం ఆనవాయితీగా వస్తోంది. అవసరమయితే బంధువులూ ఎంతో కొంత ఆర్ధిక మద్దతు ఇస్తూంటారు. రాష్ట్రంలో పేద వారింట పెళ్లికి ప్రభుత్వాలు ఆర్ధిక మద్దతు ప్రకటిం చడం ఆనవాయితీగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో దుల్హన్ పథకం అని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. పేద ఇంటి అమ్మాయి పెళ్లికి ప్రభుత్వం తరఫున యాభయి వేలు ఇవ్వడం ఆ పథకం లక్ష్యం. ఇది కొంత కాలం బాగానే నడిచింది.
మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆ పథకం మరింత ఆకర్షణీయం చేయడానికి ఈ పథకం ద్వారా వధువుకి లక్షరూపాయలు ఇస్తామని బాగా ప్రచారం చేసేరు. ఇప్పుడు ఆర్ధిక పరిస్థితులు తల్ల కిందులయి అసలు ఆ పథకానికే స్వస్తి పలికారు. ఇక నుంచి ఆ పథకం అమలుకాదట. ఈ సంగతి ప్రభుత్వ తరఫు న్యాయవాది హైకోర్టుకి తెలిపారు. అడ్డగోలు ఆర్థిక విధానాలతో అందినకాడకల్లా అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాళా స్థితికి తెచ్చిన జగన్ సర్కార్ ఇప్పుడు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించుకున్న పథకాలను ఒకటొకటిగా వదులుకుంటోంది.
రాష్ట్రాన్ని నడపడానికి నిధులు లేకపోవడం, అప్పుల వూబిలోకి దిగజారుతూండడంతో ఇక పథకాలను అనుకున్నట్టుగా అమలు అసాధ్యమన్నది అర్ధమయింది. అందుకనే దుల్హన్ పథకం పై ఏపీ ప్రభుత్వం చేతులెత్తేసింది. దుల్హన్ పథకాన్ని నిలిపివేస్తున్నట్లు హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఆర్థిక ఇబ్బందులతో పథకం నిలిపివేశామని తెలిపింది. ముస్లిం యువతుల వివాహానికి అప్పట్లో టీడీపీ ప్రభుత్వం రూ.50 వేలు ఇచ్చేది.
ఆ ఆర్థిక సాయాన్ని రూ.లక్షకు పెంచుతామని గత ఎన్నికల్లో జగన్ హామీ ఇచ్చారు. జగన్ ప్రభు త్వం ఈ హామీ విస్మరించిందని హైకోర్టులో పిటిషన్ దాఖ లైంది. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నేత షిబ్లి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. వైసీపీ ప్రభుత్వం పథకం అమలు చేయడంలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. పథకం అమలుకు డబ్బులు లేవని ప్రభుత్వ లాయర్ కోర్టుకు తెలిపారు. అఫిడవిట్లపై తగిన సమాధానం దాఖలు చేయాలని పిటిషనర్ తరుఫు న్యాయవాదికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.