‘మహా’ పాఠం మరో గుణ పాఠం
posted on Jun 23, 2022 @ 1:13PM
అది ఉద్ధవ్ ఠాక్రేనే కానక్కరలేదు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా కావచ్చును. కాదంటే మరో రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చును, దేశాన్ని పాలిస్తున్న ప్రధాన మంత్రి అయినా కావచ్చును. కళ్ళు మూసుకుని పాలు తాగే పిల్లిలా ప్రవర్తిస్తే, అంతా బాగుందని, అనుకుంటే, ఇదిగో ఇలాగే, ఉంటుంది. ఎప్పుడో అప్పుడు ఉరమని ఉరుములా, ‘మహా’ విపత్తు విరుచుకు పడుతుంది. అలా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా, ఉద్ధవ్ ఠాక్రే’లా లబో దిబో మన్నా ప్రయోజనం ఉండదు. అర్థరాత్రి పెట్టే బేడా సర్దుకుని, పోవడం తప మరో మార్గం ఉండదు. అయితే, పాలకుల తలలో చేరిన అజ్ఞాన, ఆహంకారానికి అన్ని సందర్భాలో పార్టీలో అంతర్గత తిరుగుబాటే సమాధానం కానవసరం లేదు. చివరాఖరికి ప్రజలు ఇచ్చే తీర్పు రూపంలోనూ, ప్రజలు గుణ పాఠం చెపుతారు. నేతలకు కళ్ళు బైర్లు కమ్మే పరిస్థితి ఎదురైనా కావచ్చును.
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ ఓడి పోయిన తర్వాత, ఎంతవరకు నిజమో ఏమో కానీ, మీడియాలో ఒక ప్రచారం జరిగింది. ‘ఓటమి ఓకే .. కానీ, మరీ ఇంత ఘోరంగానా? మనంచేసిన తప్పేంటి .. ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఏమిటి? అంటూ చంద్రబాబు నాయుడు, పార్టీ సమావేశాల్లో విస్మయం వ్యక్త పరిచినట్లు మీడియాలో ప్రచారం జరిగింది. చంద్రబాబు నాయుడు విస్మయం వ్యక్త పరిచింది నిజం అయినా కాకపోయినా, అధికారంలో ఉన్నప్పుడు వాస్తవాలను చూడలేక పోవడం ఎంత ప్రమాదకరమో చెప్పుకునేందుకు ఈ ఉదంతం ఒక గుణపాఠంగా అయితే నిలిచింది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలలో ఈ ప్రమాదం మరి కొంత ఎక్కువగా ఉంటుంది. అధినాయకుడు నందంటే నంది, కాదంటే కాదు..అనే అతి విధేయత జాతీయ పార్టీలలో కంటే ప్రాంతీయ పార్టీలలో కొంచెం చాలా ఎక్కువ ఉంటుంది.
ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో అదే పరిస్థితి చూస్తున్నాం. కొద్ది రోజుల క్రితం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇన్ని మీటలు నొక్కాం... ఇన్ని వందల వేల కోట్లు ప్రజల ఖాతాలలో జమ చేశాము...సో .. 175 కు 175 సీట్లు మనకే వస్తాయి, ఎందుకు రావు? అంటూ పార్టీ సమావేశంలో విశ్వాసం వ్యక్త పరిచారు. అది విశ్వాసం అనాలో అతి విశ్వాసం అనాలో గానీ, రాష్ట్రంలో వాస్తవ పరిస్థితి అలా ఉందా ? అని ఒక్క నిముషం ఆలోచిస్తే, అలంటి పరిస్థతి లేదని చెప్పడం కష్టం కాదు. ప్రభుత్వ పథకాల వలన ప్రయోజనం పొందిన ప్రజలు కూడా ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత చర్యలు పట్ల ఆగ్రహంతో ఉన్నారు. అందుకే, గడప గడపకు కార్యక్రమంలో ప్రజలు ఎక్కడిక్కడ ఎమ్మెలను నిలదీశారు. అయినా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, అబ్బే అదేమి లేదు, అంతా బాగుంది అనే భ్రమల్లోనే ఉన్నారంటే, అది ఆయనలోని అజ్ఞానానికి నిదర్శనమా, అహంకారానికి నిదర్శనమా అనేది ఆయనే తెలుసు కోవలసి ఉంటుంది తప్ప మరొకటి కాదని,వైసీపీ నేతలే అంటున్నారు.
ప్రజలను కొనేయడం అంత పెద్ద విషయమే కాదనే దురహంకారంతోనే ఆయన అంతోటి ధీమా వ్యక్తం చేశారని, అందుకు మూల్యం చెల్లించక తప్పదనే వైసీపీ పెద్దలు ‘దీవెనలు ’ కూడా అందిస్తున్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయం అయితే చెప్పనే అక్కరలేదు. రాష్ట్రంలో ఇక చేసేందుకు ఏమీ లేదనే నిర్ణయానికి ఎలా వచ్చారో ఏమో కానీ, దేశాన్ని ఉద్దరించేందుకు సిద్ద మయ్యారు. జాతీయ రాజకీయాల వెంట పడ్డారు. కానీ రాష్ట్రంలో పరిస్థితి ఏమంటే, రైతులకు ఎప్పుడో ఇవ్వవలసిన రైతు బంధు పైసలకు ఇంతవరకు దిక్కు లేదు. ఎక్కడన్నా, అప్పు పుడితేనే కానీ, రైతుల ఖాతాల్లో పైసలు పడవు. పోయ్యి మీద ఎసరు పెట్టి బియ్యం అప్పుకు పోయినట్లు, తెలగాణ ప్రభుత్వం రైతు బంధు అప్పు కోసం పరుగులు తీస్తోంది.
ఇదొక్కటని కాదు, రాష్ట్రంలో కాదు, ఏ దిక్కు చుసిన అష్టమ దిక్కే కనిపిపిస్తోంది. శాంతి భద్రతలు ఎంత సుందర ముదనష్టంగా ఉన్నాయో, వేరే చెప్పనక్కరలేదు. మరో వంక అప్పులు, అవినీతి సమాంతరంగా ఉర్ద్వ ముఖ ప్రయాణం సాగిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత పెల్లుబుకుతున్న సంకేతాలు స్పష్ట మవుతున్నాయి. అయినా, జగన్ రెడ్డి కి ఏమాత్రం తీసి పోకుండా, వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు మావే అంటున్నారు కేసీఆర్. అవును నిన్న మొన్నటి దాకా , ఉద్ధవ్ ఠాక్రే’ కూడా ఇలాగే, అహంకారం చూపారు. జగన్, కేసీఆర్ అయినా మరొకరు అయినా అందుకు అతీతులు కాదు, కదా...