శివసేన బాటలో అన్నా డిఎంకే.. శుభం కార్డ్ సిద్ధం
posted on Jun 24, 2022 7:30AM
మహారాష్ట్రలో శివసేన నిట్టనిలువునా చీలి పోయింది. ఆ ప్రహసనం అలా సాగుతుండగానే, తమిళ నాడులో అన్నా డిఎంకే’ లో ఫైట్ మొదలైంది. అఫ్కోర్స్ ..ఇది కొత్తగా మొదలైన కొట్లాట కాదు. పార్టీ అధినాయకురాలు, మాజీ ముఖ్యంత్రి జయలలిత చనిపోయిన నాటి నుంచే, పార్టీలో పన్నీరుసెల్వం (ఓపీఎస్), పళనిస్వామి (ఈపీఎస్) వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఆలా సాగుతూనే ఉంది. అధికారంలో ఉన్నంతవరకు ఒకరు ముఖ్యమత్రి, ఇంకొకరు ఉప ముఖ్యంత్రిగ కొనసాగినా, అప్పుడు కూడా రెండు వర్గాలు ఎవరి కుంపటి వారిదే అన్నట్ల్గు సంసారం సాగించారు . అప్పటి నుంచి మధ్య మాటల యుద్ధం అయితే సాగుతూనే వుంది. అదే విధంగా సంవత్సరం క్రితం జరిగిన ఎన్నికల్లో అన్నా డిఎంకే ఓడిపోయింది. అయినా, పార్టీ పై పట్టు కోసం ఉభయ వర్గాల మధ్య ఫైట్ కొనసాగుతూనే వుంది.
ఈ నేపధ్యంలో, ‘ఏక నాయకత్వం’ కోసం ఓపీఎస్,ఈపీఎస్ వర్గాల మధ్య సాగుతున పోరుకు ముగింపు పలికేందుకు ఏర్పాటు చేసిన, ఏఐడీఎంకే సర్వసభ్య మండలి సమావేశంలో ఓపీఎస్ టార్గెట్’గా ఈపీఎస్ వర్గం ఒక విధంగా భౌతిక దాడికి దిగింది. వాటర్ బాటిల్స్ విసిరి .. గో బ్యాక్ నినాదాలతో లోపలకు రాకుండా అడ్డుకుంది. ఈసంధర్భంగా ఈపీఎస్, ఓపీఎస్ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఓపీఎస్ ద్రోహి అంటూ ఈపీఎస్ వర్గం నినాదాలు చేయడంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో.. ఓపీఎస్ తమ వర్గం కార్యకర్తలను వెంట పెట్టుకుని వెనుదిరిగి పోయారు. జులై 11న మళ్లీ సర్వసభ్య సమావేశం జరపాలని అన్నాడీఎంకే నిర్ణయించింది. అదే రోజున కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరపాలని ఫిక్స్ అయినట్లు తెలిసింది. ఈ వివాదం కోర్టు దాకా వెళ్ళింది. కోర్టు తీర్పులు ఎలా ఉన్నా, రెండు వర్గాల మధ్య సాగుతున్న ప్రత్యక్ష పరోక్ష పోరు ఈరోజు కాకపోతే, రేపైనా పార్టీని రెండు ముక్కలు చేస్తుందని, రాజకీయ పరిశీలకులు భావిస్తునన్నారు.
ఒక విధంగా ఒంటరి అయిపోయిన అన్నాడీఎంకే సమన్వయకర్త ఓపీఎస్ తదుపరి నిర్ణయమేంటన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పార్టీలో కీలకమైన జిల్లా కార్యదర్శుల్లో 90 శాతం ఈపీఎస్ వైపు చేరడంతో ఆ బృందం చెప్పింది వినడం మినహా ఓపీఎస్కు మరో గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడింది.అయితే, ఇక్కడితో కథ ముగిసిపోయినట్లు కాదు. ఇంకా వుంది. అంతే కాదు, ఈ పొలిటికల్ డ్రామాలో ఇంకా పాత్ర లున్నాయి.
2016లో అప్పటి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కన్నుమూసిన అనంతరం ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న ఓపీఎస్ కొద్దిరోజులకే కుర్చీ కొల్పోయారు. శశికళ దయతో ముఖ్యమంత్రి పీఠమెక్కిన ఎడప్పాడి పళనిస్వామి. ఆ తరువాత ఢిల్లీ పెద్దల అండతో పార్టీపైనా పట్టు సాధించారు. అయితే, ఇప్పడు పళనిస్వామికి ఢిల్లీ పెద్దల ఆశీస్సులు పెద్దగా లేవంటున్నారు. మరో వంక శశికళ పార్టీని తమ గుప్పిట్లోకి తీసుకునేందుకు, గట్టిగా పావులు కదుపుతున్నారు.
ఈ అన్నిటినీ, మించి బీజేపీ అనూహ్యంగా జనంలోకి దూసుకు పోతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సారధ్యంలో అన్నాడీఎంకేని పక్కన పెట్టే స్థాయిలో బీజేపీ ప్రతిపక్షం పాత్రను పోషిస్తోందని అంటున్నారు. మరోవంక పార్టీ జాతీయ నాయకత్వం దృష్టి పెట్టింది ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా రాష్ట్రంపై దృష్టిని కేంద్రీకరించారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు మురుగన్’ కు యూపీ (?) నుంచి రాజ్య సభకు పంపి కేంద్ర మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. ఈ పరిణామాలను గమనిస్తే, మహా రాష్ట్రలో శివసేన .. తమిళ నాడులో అన్నా డిఎంకే ఒకే బాటలో నడుస్తున్నాయి. బీజేపీ స్క్రిప్ట్ ప్రకారం నడుస్తునం రెండు పార్టీల సినిమాకు .. శుభం కార్డు పడినట్లే అంటున్నారు.