Read more!

కెవిపి కి మళ్ళీ పూర్వ వైభవం ?

 

 

 

దివంగత వైఎస్ హయాంలో చక్రం తిప్పిన కేవిపి రామచంద్రరావు కు మళ్ళీ పాత రోజులు రానున్నాయా ? దీనికి సమాధానం అవుననే అనిపిస్తోంది. పార్టీలో రాహుల్ గాంధీ బాధ్యతలు మరింతగా పెరగడంతో, కెవిపి రాష్ట్ర రాజకీయాల్లో తిరిగి పూర్వ వైభవం పొందనున్నారని సీనియర్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దిగ్విజయ్ సింగ్ తిరిగి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గా బాధ్యతలు స్వీకరించనున్న తరుణంలో కెవిపి పార్టీలో ముఖ్య పాత్ర పోషించడానికి ఢిల్లీ స్థాయిలో పావులు కదుపుతున్నారు.


వైఎస్ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా కెవిపి ప్రముఖ పాత్ర పోషించిన విషయం తెలిసిందే. పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అయన పునరాగమనానికి అనువుగా ఉన్నాయి. ఒక వేళ రాష్ట్రంలో నాయకత్వ మార్పు అంటూ జరిగితే, సి ఎం పదవి రేసులో ఉన్న మర్రి శశిధర్రెడ్డి, డి శ్రీనివాస్ లు ఆయనతో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.



కెవిపి సన్నిహితుడుగా ముద్ర పడ్డ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్ ఇటీవల సోనియా గాంధీ ని కలిసిన అనంతరం తిరిగి కెవిపి తో చర్చలు జరిపారు. వీరితోపాటు, లగడపాటి రాజ గోపాల్, కోమటిరెడ్డి, తెలంగాణా ప్రాంతానికి చెందిన మంత్రులు కూడా కెవిపి తో చర్చలు జరుపుతుండటం చూస్తుంటే, ఆయనకు పూర్వ వైభవం వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.



రాష్ట్ర రాజకీయాల్లో తన పునరాగమనానికి కావలసిన అన్ని ఏర్పాట్లు కెవిపి ఇప్పటికే చేసుకున్నారని, ఇక చక్రం తిప్పడమే తరువాయి అని వార్తలు వస్తున్నాయి. కెవిపి లాంటి సీనియర్ లు పార్టీలో ముఖ్య పాత్ర పోషిస్తే, పార్టీని వదలి వెళ్లాలనుకునే వాళ్ళకు ఆత్మ విశ్వాసం కలుగుతుందని కొంత మంది నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వై ఎస్ అనుయాయులు పార్టీని వదలి వెళ్ళకుండా చూసి, గోడ దూకుడు కార్యక్రమాలు ఆగాలనుకొంటే కెవిపి రామచంద్ర రావు కు పార్టీలో ముఖ్య పాత్ర ఇవ్వడం అవసరమని కోమటిరెడ్డి వంటి నేతలు దిగ్విజయ్ సింగ్ కు సూచించినట్లు తెలుస్తోంది.